Wednesday, June 16, 2021

శ్రీనాథుని సంవాద చాటువు

 శ్రీనాథుని సంవాద చాటువు
సాహితీమిత్రులారా!శ్రీనాథుని సంవాద చాటువు -
"అరవిందానన! యెందు బోయెదవు? " 
"మత్ప్రాణేశు ప్రాసాద మం
దిర దేశంబున కో లతాంగి! " 
"బహుళాంధీభూత మార్గంబునన్
దిరుగ న్నీకిటు లొంటి గాదె? " 

"శుకవాణీ! మాట లింకేటికిన్,
మరు డాకర్ణ ధనుర్గుణాకలితుడై 

మా వెంటరా నొంటియే? "

ఒక పడుచుపిల్ల మరో పడుచుపిల్లకు 
మధ్యజరిగిన సంవాదపద్యమిది-


 ఒక పడుచు మరొక పడుచు పిల్లను- 
అరవిందానన! యెందు బోయెదవు?
ఎక్కడికి పోతున్నావు ? 

మరో పడుచుపిల్ల 
మత్ప్రాణేశు ప్రాసాద మం
దిర దేశంబున కో లతాంగి!
నా ప్రియతముని సౌధ ప్రాంతాలకు పోతున్నాను 


పడుచుపిల్ల -
బహుళాంధీభూత మార్గంబునన్
దిరుగ న్నీకిటు లొంటి గాదె?
 ఇంత చీకటిలో ఒంటరిగా పోతున్నావు, నీకు భయంలేదా?
 . 
మరో పడుచుపిల్ల-
శుకవాణీ! మాట లింకేటికిన్,
మరు డాకర్ణ ధనుర్గుణాకలితుడై 
మా వెంటరా నొంటియే? 
 ఒంటరిగానా? ఏంమాటలవి? ఆకర్ణాంతం సంధించిన 
వింటితో మన్మథుడు నా వెన్వెంటే నడచివస్తుండగా 
నేను ఒంటరి నెలా అవుతాను ?. 

అంటే మన్మథ తాపానికి తాళలేకనే నా ప్రియుని 
కలియడానికి వెళ్తున్పాను అని నర్మ గర్భంగా 
చెబుతున్నదీ పడుచుపిల్ల

Monday, June 14, 2021

రెండర్థాలనిచ్చే పద్యం

 రెండర్థాలనిచ్చే పద్యం
సాహితీమిత్రులారా!ఒక పద్యాన్ని రెండు అర్థాలు వచ్చేలా రాయడం
అనేకార్థక చిత్రంలో చెప్పవచ్చు.
ఇక్కడ హంసవిశతిలోని ఒక పద్యం
ఇందులో పైకి సాధారణంగా కనిపించినా
ఆంతరంలో దూషణ కలిగిన పద్యం
చూడండి-

తారాధిప! రజనీచర!
కైరవభేదనసమర్థ! గౌరీశ శిరో
భార! కమలాభిశంసన
కారణ! వారాశిభంగ కార్యభ్యదయా!

                                     (హంసవింశతి - 5- 284)

ఇందులో
చంద్రునికి సంబంధంచిన
సామాన్యార్థము కలది.
రెండవది చంద్రదూషణ అనే
రెండువిధములైన అర్థాలున్నాయి.

సామాన్యార్థము-


తారాధిప - నక్షత్రములకు అధిపతీ
రజనీచరా - రాత్రియందు తిరిగేవాడా
కైరవభేదనసమర్థ -తెల్లకలువలను
                                  వికసింపచేయువాడా
గౌరీశ శిరోభార - శివుని శిరోభూషణమైనవాడా
కమలాభిశంసన కారణ - కమలములయొక్క
                                          వికాసభావమునకు కాణమైనవాడా
వారాశిభంగకార్యభ్యుదయా - చంద్రోదయమువేళ సముద్రము
                                                  అలలతో ఉప్పొంగును కావున
                                                   పుత్రోత్సాహముతో అలలు రేగునట్లు
                                                    చేయువాడు అని అర్థం.

నిందార్థం-
తారాధిప - గురుపత్నియైన తారను కూడినవాడా
రజనీచరా - నిశాచరుడా, రాక్షసుడా
కైరవభేదనసమర్థ -
కైరవ - జూదగాండ్రకు,
భేదన - పొరుపులు పుట్టించుటలో,
సమర్థ - సమర్థుడా
గౌరీశ శిరోభార - ఈశ్వరునికి శిరోభారమైనవాడా
కమలాభిశంసన కారణ-
కమలా - తోబుట్టువైన లక్ష్మీదేవికి,
అభిశంసనకారణ - గురుతల్పాగమనాది మహాపాపము చేసిన
                                 నీవు సోదరుడవైతివన్న అపవాదమునకు
                                 కారణమైనవాడా
వారాశిభంగకార్యభ్యుదయా - జనకస్థానమైన సముద్రమునకు
                                                   భంగకరమైన పుట్టుక గలవాడా

ఈ విధంగా రెండు అర్థాలను కలిగినది ఈ పద్యం


Saturday, June 12, 2021

ఇవి తెలుగు పదాలేనా?

 ఇవి తెలుగు పదాలేనా?
సాహితీమిత్రులారా!ఈ శ్లోకం అపభ్రంశ శ్లోకం

కవిత్వంలోని సాంప్రదాయాలు,
కవిసమయాలను గుర్తించి రచనలు చేయాలి
అలా చేయకపోతే ఏలా ఉంటుందో!
ఈ కవి చమత్కరిస్తూ చెప్పిన
శ్లోకం ఇది 

చూడండి-


అస్థివత్ బకవచ్చైవ
చల్లవత్ తెల్లకుక్కవత్
రాజతే భోజ తే కీర్తి
పునస్సన్యాసిదంతవత్


(ఓ భోజమహారాజా!  నీ కీర్తి ఎముకలలా, కొంగలా,
మజ్జిగలా, తెల్లకుక్కలా, మళ్ళీ మాట్లాడితే సన్యాసి
పండ్లలా రాజిల్లుతున్నది - అని భావం.)

దీనిలోని ఉపమానాలన్నీ  హీనోపమానాలే.
ఇటువంటివి వాడకూడదు.
స్త్రీ ముఖం గుండ్రంగా ఉంటే చంద్రబింబంతో పాల్చాలికాని
బండి చక్రంతో పోల్చకూడదుకదా!
అనటానికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్పుకోవచ్చు.

ఆ విషయాలను పక్కనపెడితే
ఇందులోని పదాలు చాలావరకు
మన తెలుగు పదాల్లా ఉన్నాయి.
కావున ఇది భాషాచిత్రంగా చెప్పవచ్చు.


Thursday, June 10, 2021

కన్యాశుల్కం లోని మణిప్రవాళ భాష

కన్యాశుల్కం లోని మణిప్రవాళ భాష
సాహితీమిత్రులారా !అనేక భాషల మిశ్రమంతో వ్రాసిన అంశాన్ని
మణిప్రవాళ శైలిలో ఉంది  అంటాము.
ఇది మన గురజాడవారి కన్యాశుల్కంలోని
కొన్ని విషయాలను చూచి గమనిద్దాం.


కన్యాశుల్కము ప్రథమాంకంలో
గిరీశం - యీ వ్యవహార మొహటి ఫైసలైంది.
            ఈ రాత్రికి మధురవాణికి సార్టింగ్
            విజిట్ యివ్వంది పోకూడదు.
      నీ సైటు నాడిలైటు
      నిన్ను మిన్న
       కానకున్న
       క్వైటు రెచడ్ ఫ్లైటు
       మూనులేని నైటు


బంట్రోతు -
ఫుల్లుమూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా!  టా!


పంచమాంకంలో
పూజారి - మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను
           రాణా, డైమండ్ రాణీ
       రాణా, యిస్పేటు రాణి రాణికళావ
       ఱ్ఱాణా, ఆఠీన్రాణీ
       రాణియనన్మధురవాణె, రాజులరాణి


దీనిలో ఎక్కువభాగం ఇంగ్లీషు పదాలను
తక్కువగా తెలుగు పదాలను వాడాడు.

Tuesday, June 8, 2021

రెండిటికి ఒకే సమాధానం

 రెండిటికి ఒకే సమాధానం
సాహితీమిత్రులారా!ఈ శ్లోకం చూడండి.
ఇందులోని రెండు ప్రశ్నలకు రెండు భాషలలో
ఒకే పదంగా సమాధానం చెప్పాలి.
చూడండి.

రాణస్యకియ ద్వక్త్రం నూపుర: కుత్ర వర్తతే
ఆంధ్రగీర్వాణభాషాభ్యా మేకమేవోత్తరం వద

1. రావణస్యకియ ద్వక్త్రం?
   (రావణునికి ముఖాలెన్ని?)
    - పది (తెలుగు సంఖ్యావాచకము)

2. నూపుర: కుత్ర వర్తతే?
   (అందె ఎక్కడుంటుంది?)
   - పది(పదమునందు)
     (పద్ అనే సంస్కృత పదానికి
      సప్తమీవిభక్తిలో ఏకవచనం - పది)


Sunday, June 6, 2021

అధర మధరమంటే ఆశకాదా విటానామ్

 అధర మధరమంటే ఆశకాదా విటానామ్
సాహితీమిత్రులారా!సంస్కృత తెలుగు భాషల మిశ్రమంతో చెప్పిన
మణిప్రవాళ పద్యాలు చూడండి-

అమర మమర మంటే ఆశకాదా కవీనాం
అశన మశనమంటే ఆశకాదా ద్విజానామ్
అమృత మమృతమంటే ఆశకాదా సురాణాం
అధర మధరమంటే ఆశకాదా విటానామ్


అమరమంటే కవులకు,
అశన(భోజన)మంటే బ్రాహ్మణులకు,
అమృతమంటే దేవతలకు,
అధరం అంటే విటులకు ఆశకాదా - అని భావం.

ముయ్యవే తలుపు సమ్యగి దానీం
తియ్యవే కుచత టో పరి వస్త్రమ్
ఇయ్యవే మధురబింబమివౌష్ఠం
చెయ్యవే రతిసుఖం మమ బాలే


క్రిందిపదాలకు అర్థాలు చూస్తే
వివరణ అవసరంలేదు చూడండి-

సమ్యక్ - బాగుగా, ఇదానీం - ఇప్పుడు,
కుచతటోపరి - స్తనాలపై భాగాన,
మధురబింబం - తియ్యని దొండపండు,
ఓష్ఠం - పెదవి, మమ - నాకు,
బాలే - బాలికా.


Friday, June 4, 2021

సంస్కృతంలో తెలుగు పదాలు

 సంస్కృతంలో తెలుగు పదాలు
సాహితీమిత్రులారా!ఈ శ్లోకం చూడండి చమత్కారం గమనించండి.

అంబలిద్వేషిణం వందే చింతకాయశుభప్రదమ్ 
                               (ఊరుపిండీ కృతాసురం)   - పాఠాంతరం
కూరగాయకృతత్రాసం పాలనేతిగవాంప్రియమ్

ఈ శ్లోకంలో 
అంబలిచింతకాయ - కూరగాయ - పాలనేతి - ఊరుపిండీ -అనే పదాలు
చూడగానే మన తెలుగు పదాలనిపిస్తాయి.
కాని కాదు
అందుకే దీన్ని ఆంధ్రభాషాభాసం అనే భాషాచిత్రంగా చెబుతారు.
మరి దీని అర్థం చూద్దాం-

బలిద్వేషిణం - బలిని ద్వేషించిన, అం - విష్ణువును,
వందే - నమస్కరిస్తాను,
చింతకాయ - తనను ధ్యానించువారికి, శుభప్రదమ్ - శుభములు ఇచ్చువాడు,
(ఊరు - తొడలపై, పిండీకృత - నాశనం చేయబడిన, అసురం - మధుకైటభ -
హిరణ్యకశ్యప మొదలైన రాక్షసులు కలవాడు)
కు - ఉరగాయ - చెడ్డ సర్పమునకు (కాళీయునికి),
కృతత్రాస - భయము కలిగించిన, గవాం పాలనే - గోరక్షణలో,
అతిప్రియం - ఎక్కువ మక్కువ ఉన్నవాడు.

మరి ఇవి తెలుగుపదాలు కాదని తెలిసిందికదా!

Wednesday, June 2, 2021

సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం

 సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం
సాహితీమిత్రులారా!ఈ శ్లోకంలోని రెండు ప్రశ్నలను గమనించి
సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం చెప్పండి

ప్రభాతే కీదృశం వ్యోమ?  ప్రమాణే కీదృశం వచ:?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యా మేక మేవోత్తరం వద


ప్రశ్నలు -
1. ప్రభాతే కీదృశం వ్యోమ?
    ( ప్రాత కాలంలో ఆకాశం ఎలా ఉంటుంది?)
      - నీతోడు (నీత + ఉడు - తొలగిన నక్షత్రాలు కలది
                      ఇది సంస్కృతపదం)

2.  ప్రమాణే కీదృశం వచ:?

      (ప్రమాణం చేయటానికి ఎటువంటి మాట వాడుతారు?)

        - నీతోడు (ఇది తెలుగుమాట)

రెండు భాషల్లోను
ఒకే పదం నీతోడు అని ఉపయోగించి
సమాధానం చెప్పడం ఎంత చిత్రం
ఇది భాషాచిత్రం నకు చెందినది


Monday, May 31, 2021

అనేకార్థక కావ్యాలు - ద్వ్యర్థి కావ్యాలు

 అనేకార్థక కావ్యాలు - ద్వ్యర్థి కావ్యాలు

సాహితీమిత్రులారా!సంస్కృతంలో భట్టీకావ్యం అని ఒక వ్యాకరణ గ్రంథం ఉంది.
దానికే రావణవధ అనే పేరూ ఉంది. అంటే రావణవధ అనే కావ్యం
ఒక వైపు వ్యాకరణం తెలిపేదిగా మరో వైపు ఈ కావ్యాన్ని రచించాడు.
అలాగే ప్రాకృతంలో హేమచంద్రాచార్యుడు "కుమారపాలచరితం" అనే
కావ్యాన్ని రచించాడు ఇందులో కుమారపాలుని కథ
చేబుతూనే వ్యాకరణం చెప్పడం జరిగింది.
అందువల్ల ఇలాంటివాటిని ద్వ్యాశ్రయకావ్యాలు అంటారు.
వీటినే మనం తెలుగులో ద్వ్యర్థి కావ్యాలు అంటాము.
వీటికి రాఘవపాండవీయం,
హరిశ్చంద్రనలోపాఖ్యానం లాంటివి చెప్పవచ్చు.

ఇపుడు ప్రాకృతభాషలోని కుమారపాలచరితం
నుండి ఒక గాథ చూద్దాం.

దీనిలోని ఐదవసర్గలో వర్షాహేమంతశిశిర
ఋతువులను వర్ణించాడు ఆసందర్భంలో
కవి యుష్మచ్చబ్ద(మధ్యమపురుష) -
ఏకవచన బహువచనరూపాలను ఉపయోగించి
ఈ గాథను రాశాడు.

తం తుం తువం తుహ తుమం అణేహ నవాఇం నీవకుసుమాఇం,
భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝాసణందేహ


ఓ సఖులారా! నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ(తం తుం తువం
తుహ తుమం - ఈ ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమ ఏకవచనరూపాలు)
క్రొత్త నీపపుష్పాలు తీసుకొనిరండి.
సఖులారా మీరూ, మీరూ, మీరూ, మీరూ, మీరూ
(భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝ - అనే
ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమా బహువచనాలు) అసనపుష్పాలను
తీసుకొనిరండి - అని భావం

(నీపపుష్పము - కడిమి(కదంబ)చెట్టుపూలు,
అనసపుష్పాలు - వాడని పుష్పములు)

Saturday, May 29, 2021

సంభాషణలో గూఢం

 సంభాషణలో గూఢం
సాహితీమిత్రులారా!సరసం అంటేనే భార్యా భర్తల మధ్యగాని,
ప్రేయసీ ప్రియుల మధ్యగాని జరిగేది.
అవి ఎంత గూఢంగా ఉంటాయో ఇక్కడ చూడండి-

ఇక్కడ భార్యాభర్తల సుభాషణ చూద్దాం-
భోజనసమయంలో

భర్త (భార్యను) - పశువ (అన్నాడు)

భార్య(భర్తను) - కోతి    (అన్నది)

ఇందులో ఏముంది సహజమేకదా!
అదీ నిజమే


కాని ఒక అవధాని ఈ సుభాషణను ఇలా వివరించారు


భర్త (భార్యను) - ళ్లెం శుద్ధంచేసి డ్డించవే (అన్నాడు)


భార్య(భర్తను) - కోరినంత తినండి (అన్నది)


దీనిలోని గూఢత తెలిసిందికదా!

Thursday, May 27, 2021

హంసవింశతిలోని గూఢచిత్రం

 హంసవింశతిలోని గూఢచిత్రం

సాహితీమిత్రులారా!హంసవింశతి కర్త అయ్యలరాజు నారాయణామాత్యకవి
తనగురించి
ఏవిధంగా చెప్పుకొన్నాడో చూడండి.


ఎవనికీరితి కుభృద్ధవ కుభృద్ధర బుధ
       కరిసైంధవ సమిద్ధహరిణరుచిర
మెవనిమేధంబురుడ్భవ కభుగ్ధవ విధూ
       ద్భవ మరుద్ధవగురుప్రతివిఘాతి
యెవనియీ వహిమరుగ్భవ సరిద్ధవ లస
        ద్భువనభృత్త్రిపురభిద్భూరిమహిమ
యెవనిరూ పమృతభుగ్ధవసుతోడ్వీడ్రతీ
       డుడ్వీడ్భృదాప్తపుత్రోల్లసనము
మంత్రిమాత్రుండె యతడు దుర్మంత్రిమంత్ర
తంత్రసంత్రాసకరణస్వత్రంతుఁడయల
రాజవంశసుధావార్ధిరాజ సూర
సూర్యనారాయణామాత్యవర్యుఁడలరు.

                                                   (హంసవింశతి పీఠిక-15)

1వపాదము-
ఎవనికీర్తి - కుభృత్ + భవ - హిమవంతునివలెను,
కు - భృత్శేషునివలెను, (మరియు)కైలాసమువలెను, హర - ఈశ్వరునివలెను,
బుధకరి -సైంధవ - ఐరావతము, ఉచ్చైశ్శ్రవములవలెను,
సమిద్ధహరిణ రుచిరము - ప్రకాశమైన ధావళ్యముతో ఒప్పినదో!

2వపాదము -
ఎవనిమేధ - అంబురుద్భవ - బ్రహ్మను,
కభుక్ + ధవ - వాతాశనపతి  అయిన ఆదిశేషుని,
విధు  + ఉద్భవ - బుధునిని, మరుద్ధవ గురు - దేవేంద్రునిగురువగు
బృహస్పతిని - ప్రతిఘటించునదో!

3వపాదము-
ఎవనిత్యాగము - అహిమరుగ్భవ - కర్ణుడు,
సరిత్  + ధవ - సముద్రుడు, అసద్భువన భృత్ - మేఘుడు,
త్రిపురభిత్ - ఈశ్వరుడు, వీరిత్యాగముకంటె గొప్పదియో!

4వపాదము -
ఎవనిరూపు - అమృతభుగ్ధవసుత - జయంతునివలెను,
ఉడ్వీట్ -  చంద్రునివలెను, రతీట్ - మన్మథునివలెను,
ఉడ్వీద్భృదాప్తపుత్ర - నలకూబరునివలెను - ప్రకాశించునదియో!

కీర్తిలోనూ, మేధలోనూ, త్యాగములోనూ, రూపంలోనూ
అటువంటివాడైన మంత్రి మాత్రమేకాదు
చెడు ఆలోచనలకు స్వంతముగా మంత్రము తంత్రములచే రక్షించగల
అయలరాజవంశమునకు చంద్రుని వంటివాడై అలరారెడువాడు
ఈ నారాయణామాత్యకవి
- అని చెప్పుకున్నాడు.

ఎంతటి వాడో ఈ పద్యాన్ని బట్టి తెలుస్తున్నది.

Tuesday, May 25, 2021

దాగున్న నాలుగోపాదం

 దాగున్న నాలుగోపాదం
సాహితీమిత్రులారా!శ్లోకంలోని మూడు పాదాలను మాత్రమే కవి చెబుతాడు.
నాలుగవపాదం ఆ మూడు పాదాలలోనే గూఢంగా ఉంటుంది కనుక్కోవాలి.
దీన్ని గూఢచతుర్థి అంటారు.
ఈ శ్లోకం చూడండి.

పాతాతురాణాం బోధైక్య
మయో ధుర్యాప్తి సూ స్సతామ్
దలితై నస్సముదయ:


ఇది శ్లోకంలోని మూడు పాదాలు. నాలుగవపాదం గూఢంగా ఉంది 

దాన్ని కనుక్కోవాలి. అదెలా అంటే చూడండి.

పాతాతురాణాం బోధైక్య
యో ధుర్యాప్తి సూ స్సతామ్
లితై స్సముదయ:
రంగుల్లోను పెద్దగా ఉన్న అక్షరాలను
వరుసగా వ్రాసిన 4వ పాదమవుతుంది.
అది
పాతు వో మధుసూదన:

ఆతురాణామ్ - ఆపన్నులను, పాతు - రక్షించువాడు,
బోధైక్యవయ - నిత్యమైన జ్ఞానములకంటె వేరుకాని వాడు,
(అద్యైతమతంలో జ్ఞానానికి బ్రహ్మకు భేదంలేదు.)
సతాం ధురి ఆప్తిసూ: - జగత్తుకంటె అధిక సత్తావంతుడు
అంటే పారమార్థిక సత్తాశాలియైనవాడు,
దలిత ఏన స్పదయ - పాపసంతానమును విదిలించెడి,
మధుసూదన: - నారాయణుడు, వ: పాతు - మిమ్ము రక్షించుగాత!

పై రంగు గల అక్షరాలలో వబయోరభేద: -  అను
నియమంప్రకారం బో - అనేది వో అవుతుంది.