Friday, December 31, 2021

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి

తార సితారవింద వరతార శతార శతార తార వి

స్తార పటీర హీర ఘనసార తుషార తుషార చంద్రికా

పూర మరాళ కాశ పరిపూర్ణసుధాకర చారుమల్లికా

హార ఫణీంద్ర శైలరిపువారణ కాంతుల నెంతు కీర్తిచేన్


ఇది చూడటానికి శారదనీరదేందు ఘనసారపటీర....

అనే పద్యంలాంటిది అర్థం కామెంట్స్ లో పెట్టండి


Wednesday, December 29, 2021

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి

జలచరము మిడుతఁమ్రింగెను

జలచరమును మిడుతమ్రింగె జగతీస్థలిలో

వలరాజు రాజుమ్రింగెను

వలరాజును రాజు మ్రింగ వచ్చినఁబడియెన్


ఈ పద్యం అర్థాన్ని వివరించి చెప్పండి కామెంట్స్ లో వ్రాయండి


Monday, December 27, 2021

ఈ దేవుడెవరో చెప్పండి

 ఈ దేవుడెవరో చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలో చివర ప్రార్థన జేసెద నభీష్టసిద్ధికిన్

అని కవి చెబుతున్నాడు. ఇష్టసిద్ధికి ప్రార్థన చేసే

దేవుడెవరో చెప్పగలరు

సురగిరిజాధినాధుప్రియ సూనుని సోదరి మేనమామ  సుం

దరిప్రియపుత్రు సద్గురుని తండ్రి, నిజాంగనతోడి కోడలిం

జెఱఁగొనినట్టివానిరిపు చెట్టకు శత్రుని తాతకూతురిన్

బరిణయమైన వాని సుతుఁ బ్రార్థనఁ జేసెద నిష్టసిద్ధికిన్


ఆదేవత ఎవరో కామెంట్స్ లో పెట్టండి.


Saturday, December 25, 2021

నా మగని పేరేమి?

 నా మగని పేరేమి?




సాహితీమిత్రులారా!



ఒక అమ్మాయిని భర్తపేరు అడగ్గా 

ఈ విధంగా చెప్పి మగనిపేరు మీరే చెప్పమంది

అరవిందానన, నీమనోహరుని పేరారూఢిగాఁ బల్కుమా

మరుఁడున్, దామరసంబు, కాంచనము, భూమ్యాకాశమున్, గేశమున్, 

గరిమన్ మారుతపుత్ర, చంద్రులను, వేడ్కన్ మూఁడు వర్ణం

బులన్,

బరగన్ వ్రాసిన మధ్యవర్ణములు. మత్ప్రాణేశ్వరుండ

య్యెడిన్


దీనిప్రకారం ఆమె భర్తపేరేమో చెప్పండి.


Thursday, December 23, 2021

నాపేరేమిటో చెప్పండి

 నాపేరేమిటో చెప్పండి




సాహితీమిత్రులారా!

నాపేరులో ఐదక్షరాలున్నాయి

అందులో

మొదటి అక్షరానికి అగ్ని అని అర్థం

మధ్యనున్న అక్షరానికి ముల్లు అని అర్థం

చివరనున్న అక్షరానికి కీర్తి అని అర్థం

నాలుగవ అక్షరానికి బంగారని అర్థం

మొదటి రెండక్షరాలకు స్రీ అని అర్థం

రెండవ అక్షరం మొదటక్షరం కలిపిచదివితే కీలు అని అర్థం

నాలుగు రెండు అక్షరాలను కలిపిన సీతాపతి అని అర్థం

ఒకటి మూడు అక్షరాలను కలిపిన సమరమని అర్థం

చివరి రెండక్షరాలు కలిపిన మన్మథుని మామ అని అర్థం

నాలుగు మూడు అక్షరాలను కలిపిన ప్రీతి అని అర్థం

ఇంతకు నా పేరేమో చెప్పగలరా

నాపేరు (సమాధానం) 

జవాబు - రమణరాజు

ఎలాగంటారా

మొదటి అక్షరానికి అగ్ని అని అర్థం

ర - అగ్ని

మధ్యనున్న అక్షరానికి ముల్లు అని అర్థం

ణ - ముల్లు

చివరనున్న అక్షరానికి కీర్తి అని అర్థం

జు - కీర్తి

నాలుగవ అక్షరానికి బంగారని అర్థం

రా - బంగారు

మొదటి రెండక్షరాలకు స్రీ అని అర్థం

రమ - స్త్రీ

రెండవ అక్షరం మొదటక్షరం కలిపిచదివితే కీలు అని అర్థం

మర - కీలు

నాలుగు రెండు అక్షరాలను కలిపిన సీతాపతి అని అర్థం

రామ - సీతాపతి

ఒకటి మూడు అక్షరాలను కలిపిన సమరమని అర్థం

రణ -  యుద్ధం, సమరం

చివరి రెండక్షరాలు కలిపిన మన్మథుని మామ అని అర్థం

రాజు - చంద్రుడు, మన్మథుని మేనమామ

నాలుగు మూడు అక్షరాలను కలిపిన ప్రీతి అని అర్థం

రాణ - రమణ యొక్క రూపాంతరం - ప్రీతి

ఇది నాపేరు రమణరాజు


Tuesday, December 21, 2021

నా మగని పేరేమి?

నా మగని పేరేమి?




సాహితీమిత్రులారా!

ఈ పద్యం అర్థాన్ని మీరే చెప్పండి

ఒక వనిత తన మగని పేరు కనుక్కోవడానికి

కొన్ని పదాలు చెప్పి వాటిని మూడక్షరాలుగల

పదాలుగా మార్చితే దానిలోని మధ్య అక్షరాలను

తీసుకుంటే తన మగని పేరని అది చెప్పమని అడిగింది

ఈ పద్యం గమనించి చెప్పగలరు-


సిరియు, వృక్షంబు, ధనపతి పరిమళంబు

ననలుఁ, డసురయు, నుపవనం బసియు, నావ,

నందు మూఁడేసి వర్ణంబు లమరశబ్ద

మధ్య మాక్షర పంక్తి, నా మగని పేరు


మరి ఆమె మగని పేరేమో చెప్పగలరు

కామెంట్స్ లో వ్రాయండి.


Sunday, December 19, 2021

దీనికి అర్థం మీరే చెప్పండి!

 దీనికి అర్థం మీరే చెప్పండి!



సాహితీమిత్రులారా!



ఈ పద్యం అర్థాన్ని మీరేచెప్పండి-

అన్నపై శయనించి యన్నను పై నుంచి

                  యన్నను మునిమాపు హతముఁజేసి

అన్న సుతురక్షించి యన్న సుతుశిక్షించి

                  యన్నసుతునకు తనయనుజనిచ్చి

మామకు మామయై మామనుబంధించి

                   మామ సుతుధరకుమామఁజేసి

కొడుకుకు బావయై కూతుఁరు పెనిమిటై

                   కొడుకు నాలములోనఁ గూలనేసి

మించు శ్రీవారి కరుణచే మీకు నొసఁగు 

బహుతరంబుగ నాయురైశ్వర్యములను

వస్తువాహన సంపన్న వైభవముల

సకల సామ్రాజ్య విభవంబు సంతసంబు


ఈ పద్యం అర్థాన్ని కామెంట్స్ లో ఉంచగలరు

Tuesday, December 14, 2021

ఈ పద్యం అర్థమేమి చెప్పగలరు

 ఈ పద్యం అర్థమేమి చెప్పగలరు




సాహితీమిత్రులారా!



ఈ పద్యం అర్థమేమో తెలుపగలరు.


శృంగారవనములోఁ జెలులతోఁగ్రీడించు 

                తొయ్యలిఁగాంచెను ధూర్తుఁడొకఁడు

తొడకేలఁ జఱచుచుఁ గడనుండి తనుఁజూడ

                మొలనూలు సవరించె ముద్దుగుమ్మ

లిటుఁడొక్కజాజి, చెంగటఁజేరి పరికింప

                 రేలచెంతకుఁజేరె నీలవేణి

కంఠమాలను సంజ్ఞగా జారుడంటిన

                 కొమ్మ యెఱ్ఱనిపూవు గుత్తువిడిచె

వెలఁదలీలలుఁ గనివాఁడు విన్నఁబోవ

సుదతి కర్ణాగ్రముననున్న సొమ్ముఁజూపె

స్థలముఁ గుమును నామంబు నెలవునెఱిఁగి

హితవు గలిగించెనప్పుడయ్యతివకతఁడు


అర్థాన్ని కామెంట్స్ నందు ఉంచగలరు.

Sunday, December 12, 2021

కామాక్షి - నవగ్రహాలు

 కామాక్షి - నవగ్రహాలు




సాహితీమిత్రులారా!



మూకపంచశతిని మూకకవి 500 శ్లోకాలతో కూర్చారు.

ఇందులో పాదారవిందశతకంలోని ఈ శ్లోకం గమనించండి-


ద ధానో భాస్వత్తా మమృతనిలయో లోహిత వపు

ర్వి నమ్రాణాం సౌమ్యో గురరపి కవిత్వం చ కలయన్

గతౌమందో గంగాధర మహిషి! కామాక్షి! భజతాం

తమః కేతురాత్మతస్తవ చరణ పద్మో విజయతే

                                                                        (మూకపంచశతి - పాదారవింద శతకం - 59)

ప్రకాశించు స్వభావం గని(సూర్యుడై), అమృతమునకు నిలయమై(చంద్రుడై),

ఎర్రనిమూర్తిగలదై(కుజుడై), వినతులయెడ సౌమ్యమై(బుధుడై), గురుమూర్తియై

(బృహస్పతియై), కవిత్వము నలవరించుచు(శుక్రుడై), మందగతి నొంది(శనియై),

తమస్సుపాలిటికి అగ్ని లేక కాంతియై (రాహువు కేతువై) నీ చరణ కమలము 

సర్వాతిశయియై ఒప్పుచున్నది - అని భావం


దీనిలో సూర్యాది నవగ్రహ రూపముగా పరదేవతాచరణములు రూపొందింపబడినవి.

Friday, December 10, 2021

అంకెలతో ఉత్తరం

అంకెలతో ఉత్తరం




సాహితీమిత్రులారా!


అంకెలతో ఉత్తరం గమనించండి-


అధిపతి సంధివిగ్రహ రహస్యపులేఖలు వ్రాయుమన్నచో

నిధిరస పావకాష్ట శరనేత్రనగాంబుధి చంద్రసంఖ్యలన్

బుధనుత నిల్పియందులకుఁ బూర్వము తొమ్మిదినెత్తి వ్రాయుఁడీ

బధిరులు మూగలంధులును బాలురు వృద్ధులు మెచ్చునట్లుగాన్


ఇందులోని విషయమేమిటో గమనించి 

కామెంట్స్ లో వ్రాయగలరు.

Wednesday, December 8, 2021

ఈ వేల్పుు ఎవరు?

 ఈ వేల్పుు ఎవరు?




సాహితీమిత్రులారా!



ఈ పద్యంలోని వేల్పుు ఎవరో చెప్పండి

అమరులు మేఘముల్ కుసుమ మాస్యము, హేమము, భాస్కరుండు, మా

సము, నురగంబు శంకరుని, చాపము, పంకము, పాండవా గ్రజుం

డ మృతకరుండ నందగిన త్య్రక్షర సంజ్ఞల మధ్య వర్ణముల్

క్రమమున నాహ్వయంబొనరఁ గల్గిన వేలుపు మిమ్ము బ్రోవుతన్


ఈ పద్యంలోని మూడక్షర సంజ్ఞలు గుర్తించి వాటి మధ్య అక్షరాలద్వారా

అందులోని వేల్పెవరో గమనించగలరు. కామెంట్స్ లో ఉంచండి.

Monday, December 6, 2021

దీనికి అర్థం మీరే చెప్పండి

 దీనికి అర్థం మీరే చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యం అర్ఖాన్ని కామెంట్స్ లో పెట్టండి


తొమ్మండ్రు మొగుల, నెత్తుక పోయె, కోడలు

                       చెల్లెలు సన్యాసిఁ జేసికొనియె

నత్త భూవరుల, నెయ్యముమీరఁ జెందెను

                       కూతురు పదకొండ్రఁ గూడుకొనియె

మరదలొక్కతె మారుమునువుఁ గట్టుకపోయె

                       యిల్లాలు పొరుగిండ్ల కేగుచుండె

వదినగారును పల్కు వానితో వర్తించె

                       మేనత్త భానుని మీఁదవలచె

వావులిట్టట్టుఁ జేసిన వన్నెకాడ 

తగదు రావయ్య నీజాణ తనముమాని

సరస దరహాస ద్వారకా పురనివాస

మదనగోపాల రాధికా హృదయలోల


దీనిలోనూ శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణునికి చెందిన బంధువుల గురించి తెలిసిన అర్థం 

సుగమమౌతుంది. అర్థాన్ని కామెంట్స్ లో పెట్టగలరు.

Saturday, December 4, 2021

ప్రశ్నోత్తరాలు ఇందే - 2

ప్రశ్నోత్తరాలు ఇందే - 2




సాహితీమిత్రులారా!



ఈ క్రింది పద్యాలు కలిపి చదివినచో ప్రశ్నలును, 

విడదీసి చదివినచో జవాబులును వచ్చును

గమనించండి-

పుడమిఁ బగఱేనిఁ జెండాడి పొలుపుఁగాంత్రు

కనక నేమియుండును బండికంటికొనను

జనములేమి కోరంగను జాలకుంద్రు

యరయనుత్తరములు నిందె యమరియుండు


దానమే దానియందును దలఁచిచూడ

జారుఁడేకాంత కాంతాప్తిఁ గోరుచుండుఁ

గాఁత యేరాఁడ్రతోఁ గడుఁగయ్యమాడు

నరయనుత్తరములు నిందె యరసియుండు


 

Thursday, December 2, 2021

నేఁడు నన్నేలి సిగ్గుఁ గాపాడుకొనుము

 నేఁడు నన్నేలి సిగ్గుఁ గాపాడుకొనుము




సాహితీమిత్రులారా!



ఈ శతకపద్యాన్ని చూడండి

మదనగోపాల శతక కవి

రెండు పాదాల మకుటంతో 

శతకాన్ని సీసపద్యాలతో కూర్చారు.


హరినీ వనాకారి యాలి పరాచారి 

                    కూతురు వ్యభిచారి కొడుకు జారి

యమ్మ నిర్దయకారి యబ్బ సంకిలికారి

                    యత్త పరాచారి యక్కమారి

మరదలు శుభచారి మనుమఁడు జడదారి

                    మరిది క్షీణకారి మామ క్షారి

వదినె నిర్దయకారి వాజి పక్ష్యాకారి

                    భటుఁడు మర్కటకారి పడకహారి

చూడు నీమర్మ మెల్లనే నాఁడుదాన

నేఁడు నన్నేలి, సిగ్గుఁగాపాడుకొనుము

సరసదరహాస ద్వారకా పురనివాస

మదనగోపాల రాధికాహృదయలోల


ఈ పద్యం విష్ణువు లేక కృష్ణుని బంధవర్గం తెలిసివుంటే

పూర్తిగా అర్థమౌతుంది. 

గమనించగలరు

భార్య - లక్ష్మిదేవి, కూతురు - గంగ, కొడుకు - మన్మథుడు

కూతురు - గంగ, తల్లి - దేవకీదేవి, తండ్రి - వసుదేవుడు,

అత్త - భూదేవి, అక్క - మాయాదేవి, మరదలు - ఊర్మిల,

మనుమడు - నారదుడు, మరిది - చంద్రుడు, 

మామ - సముద్రుడు, వదినె - జ్యేష్ఠాదేవి, వాహనము- గరుత్మంతుడు,

భటుడు - హనుమంతుడు, పాన్పు - శేషుడు - 

వీటిని బట్టి పద్యం సులువుగా అర్థమౌతుంది గమనించండి.