Showing posts with label చిక్కుముడి. Show all posts
Showing posts with label చిక్కుముడి. Show all posts

Saturday, March 2, 2019

నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు


నేనొక చిత్రమైన చిక్కుముడి 4: 

ఈ వ్యాస రచయిత నేను కాదు





సాహితీమిత్రులారా!


ఆతపభీతి నీడలు రయంబున మ్రాకుల క్రిందు దూరెనో
ఆ తరులుం దృషాభిహతులై తమ నీడలు తార త్రాగెనో
భాతి ననంగ నీడ లురు పాదపమూలములం దడంగె గ్రీ
ష్మాతప మధ్యవాసరములందు జలింపకయుండు నెండలన్

 -కుమారసంభవము, నన్నెచోడుడు

వేసవి మధ్యాహ్నపు వేళ ఎండకి తట్టుకోలేక, నీడలుకూడా నీడకోసం చెట్ల కింద దాక్కున్నాయో, లేదా చెట్లు దాహంతో తమ నీడలను తామే త్రాగేసాయో అన్నట్టుగా నీడలు మాయమైపోయాయట! కవి ఊహకి మేర ఎక్కడిది!

ఈ మధ్యాహ్నం పూట, నా నీడకూడా నాలోకి పోయి దాగినట్టుంది. నీడ అనేది ఒక ద్రవ్యమా లేక గుణమా? నా ఎడం నేను చెప్పిన వైశేషికుల సత్త్వమీమాంస గురించి ఆలోచిస్తూ నడక మొదలుపెట్టాను. నా నీడకి ఆకారం ఉంది, కదలికా ఉంది. కానీ ఆ రెండూ నిజానికి నావి. అంటే నీడకీ నాకూ ఉన్నది అవినాభావ సంబంధమా? అంటే సమవాయమా? కాదు. నేను లేకుండా నా నీడ లేదు కానీ, నీడ లేకుండా నేనుండగలను. అంచేత అది అవినాభావ సంబంధం కాదు. అసలు నీడ అంటే ఏమిటి? ఒక ప్రదేశమంతటా వెలుగు పరుచుకొని ఉంటే, అందులో కొంత భాగంలో వెలుగు లేకపోవడం. అంటే చీకటి. వెలుగు అనేది పదార్థం. వెలుగు లేకపోవడం చీకటి కాబట్టి, చీకటి అనేది అసలు వేరే పదార్థం అవుతుందా?[1] ఆలోచించే కొద్దీ తల మీదనే కాదు, లోపలకూడా వేడి మొదలయ్యింది. ఈ వైశేషిక సిద్ధాంతంలో ఆత్మసూచనకి ఎక్కడ చోటుందన్న ఎడమ నేను ప్రశ్న గుర్తుకువచ్చి, తల మరింత వేడెక్కింది.

“అసలే ఎండ వేడి. అంతలా ఆలోచిస్తూ నడిస్తే అలసిపోతావు. నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెపుతాను వింటావా?”

గొంతు పరిచయమైనదే కానీ ఎడమవైపు నుంచి కాక కుడివైపు నుంచి వచ్చిందేమిటి? ఎడమ నేను కుడివైపుకి వచ్చిందా!

“చోద్యం కాకపోతే ఎడమ ఎక్కడైనా కుడివైపుకి ఎలా వస్తుంది? నేను నీ వేరే నేనును.”

ఓహో, యిది నా కుడి నేను కాబోలు! నాలో యిన్ని నేనులున్నాయని యింత వరకూ తెలియలేదు.

నేను: ఓహో, నువ్వు నా కుడి నేనా. నువ్వు కూడా భేతాళ ప్రశ్నలు వేయనంటే వింటాను.

కుడి నేను: లేదు లేదు. ప్రశ్నలు వేసి తికమక పెట్టడం ఆ ఎడం నేను పని. నేను మంచి మంచి కథలూ కబుర్లూ మాత్రమే చెప్తాను.

నేను: అలా అయితే సరే, చెప్పు.

కుడి నేను: అనగనగనగా, ఒక అడవిలో ఒక తాబేలూ కుందేలు ఉన్నాయి. ఆ రెండూ ఒకరోజు పరుగుపందెం పెట్టుకున్నాయి.

నేను: ఓయబ్బో, ఇది నా చిన్నప్పటినుంచీ వివి విని అరిగిపోయిన కథ. చెప్తే ఏదైనా కొత్త కథ చెప్పు.

కుడి నేను: అసలు కథ చెప్పనీ. ఇది పాత కథలాగే అనిపించే కొత్త కథ!

నేను: అవునా. సరే చెప్పు.

కుడి నేను: తాబేలు మెల్లగా నడక మొదలుపెట్టింది. కుందేలు ఎప్పటిలాగే సగం దూరం పరుగెత్తిపోయి, తనెలాగూ గెలుస్తానన్న ధైర్యంతో అక్కడున్న చెట్టు నీడన నడుం వాల్చింది. ఒక్క క్షణంలో నిద్రలోకి జారుకుంది.

నేను: అది నిద్రనుంచి లేచేలోపు తాబేలు తన గమ్యం చేరుకొని పోటీ గెలిచింది. అంతేగా!

కుడి నేను: అరే! నన్ను చెప్పనిస్తావా లేదా?

నేను: చెప్పు చెప్పు, కొత్తగా చెప్పకపోతే మాత్రం ఒప్పుకోను.

కుడి నేను: విను మరి. అలా నిద్రపోయిన కుందేలుకి ఒక కల వచ్చింది. ఆ కలలో తానొక తాబేలుతో పరుగు పందెం పెట్టుకుంది.

నేను: ఆ కలలో కుందేలు మళ్లీ చెట్టుకింద పడుకొని, మళ్లీ తానొక తాబేలుతో పరుగు పందెం పెట్టుకున్నట్టు కల కనింది. ఆ కలలో మళ్లీ… యిలా కలలో కల, కలలో కల.. యిదేనా నువ్వు చెప్పే కథ?

కుడి నేను: అబ్బా, నన్నసలు కథ చెప్పమంటావా వద్దా?

నేను: చెప్పు చెప్పు.

కుడి నేను: అయితే మధ్యలో మాట్లాడకుండా విను.

తాబేలుతో పరుగు పందెం పెట్టుకున్నట్టు కల వచ్చింది కదా. కలలో పరుగు పందెం మొదలయ్యింది. కుందేలు పరుగు మొదలుపెట్టబోతోంది. అంతలో ఆ కలలో తాబేలు, కలలో కుందేలుతో యిలా అంది

“ఈ తాబేలు కుందేలు కథ మనం ఎన్నిసార్లు వినలేదూ! ప్రతిసారీ కుందేలు ముందు పరుగెత్తిపోయి, మధ్యలో నిద్రపోవడం. అది నిద్ర లేచే లోపు తాబేలు మెల్లగా గమ్యాన్ని చేరి పందెం గెలవడం, అదే కదా జరిగేది. అంచేత కష్టపడి నువ్వు పరిగెత్తి పోవడం ఎందుకు. నాతో మెల్లిగా నడుస్తూ రా!”

ఆ మాటలు విన్న కుందేలుకి ఉక్రోషం వచ్చింది. “నేనలా నిద్రపోను. ఈసారి గెలిచి తీరుతాను. ఎప్పుడూ తాబేళ్ళే గెలవడానికి ఏమిటట మీ గొప్ప!” అంది.

అప్పుడా తాబేలు, “తాబేలు గొప్పదనం నీకేం తెలుసు. ఈ భూమి మొత్తాన్నీ మోస్తున్నది ఒక తాబేలే, ఆ సంగతి నీకు తెలుసా!” అంది గర్వంగా.

“ఓయబ్బో, ఇది నా చిన్నప్పటినుంచీ వింటున్న కథే! భూమిని ఒక పెద్ద పాము మోస్తున్నదనీ, ఆ పామును ఒక పెద్ద తాబేలు మోస్తున్నాదనీ ఎవడో అన్నాడట. మరి ఆ తాబేలుని ఎవరు మోస్తున్నారని అడిగితే, అంతకన్నా పెద్ద తాబేలు అన్నాడట. మరి ఆ పెద్ద తాబేలుని ఎవరు మోసేది అంటే, మొత్తం చివరకంటా తాబేళ్లే ఉన్నాయని కసురుకున్నాడట ఆ మతిమాలిన మనిషి! ఈ కథ వినే అంత మిడిసిపడుతున్నావా! ” అంది కుందేలు.[2]

దానికా తాబేలు, “ఆ కథ పుట్టించినవాడు నిజంగా మతిలేని వాడే అయ్యుంటాడు. అసలు విషయం తెలీక అలా ఏదో కల్పించాడు. నిజంగానే భూమిని పెద్ద పాము మోస్తున్నది. ఆ పామును పెద్ద తాబేలు మోస్తోంది.” అంది.

“అయితే ఆ తాబేలుని మోస్తున్నదెవరో నువ్వు చెప్పు?” గదమాయించింది కుందేలు.

“తాబేలుని ఒకరు మొయ్యడమేమిటి! దానికదే నిలబడి ఉంది” దబాయించింది తాబేలు.

దానితో కుందేలుకి ఏమనాలో తోచలేదు. కల కదా. వెంటనే తానొక పెద్ద తాబేలు మీద పరిగెడుతున్నట్టు అనిపించింది. తాను ఎంత దూరం పరిగెట్టినా, తన ముందొక తాబేలు కనిపిస్తోంది. ఈ లెక్కన తానెప్పటికీ పరుగు పందెం గెలవలేనేమో అన్న భయం పుట్టింది. ఆ భయంతో కుందేలుకి మెలకువ వచ్చింది.

నేను: ఆ కలలో తాబేలు దబాయింపు చాలా విడ్డూరంగా ఉంది. ఏ సహాయం లేకుండానే తనకు తాను నిలబడుతుందా!

కుడి నేను: భూమిని మోసేంత పెద్ద తాబేలు ఉండగా లేనిది, అది ఏ సహాయం లేకుండా నిలబడడంలో విడ్డూరం ఏముంది! ఇంతకీ అసలు ట్విస్టు విను.

నేను: చెప్పు.

కుడి నేను: మెలకువ వచ్చి లేచిన కుందేలుకి గమ్యం చేరుకున్న తాబేలు కనిపించింది. ఛత్ మళ్లీ తాబేలే గెలిచింది అనుకుంటూ, తాబేలు దగ్గరకి వెళ్లింది. అప్పుడు తాబేలు చిన్నగా నవ్వుతూ, “కుందేలు బావా! ఈసారి నిద్రలో ఏం కలగన్నావు” అని అడిగింది. కుందేలు తనకి వచ్చిన కల గురించి చెప్పింది.

అంతా విన్న తాబేలు యిలా అంది, “నీ కలలో తాబేలుకి కూడా అసలు సంగతి తెలియలేదు. నే చెప్తా విను. భూమిని పాము మోస్తోంది. ఆ పామును తాబేలు మోస్తోంది. అంతవరకూ సరే. ఆ తాబేలుని మళ్లీ ఒక పెద్ద వరాహం, అంటే పంది మోస్తోంది. ఆ పందిని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి” అని, కాస్త ఊపిరితీసుకోడానికి ఆగింది.

“మరి ఆ ఎనిమిది ఏనుగులను ఎవరు మోస్తున్నారు?” అడిగింది కుందేలు.

“వాటిని పర్వతాలు మోస్తున్నాయి”, సమాధానం చెప్పింది తాబేలు. [3]

“మరి ఆ పర్వతాలను ఎవరు మోస్తున్నారు?” అడిగింది కుందేలు. “అదేం ప్రశ్న. పర్వతాలు ఎక్కడుంటాయి? భూమ్మీద. అంటే భూమి ఆ పర్వతాలను మోస్తోంది!” జావాబిచ్చింది తాబేలు.

“ఆఁ!” అని ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టింది కుందేలు. పందెం మొదలుపెట్టిన చోటునే ఈసారి గమ్యంగా చేసుకొని తిరిగి పరుగు పందేనికి సిద్ధపడ్డాయి ఆ తాబేలూ కుందేలూను. అదీ కథ!

నేను: కలలో తాబేలు కన్నా కథలోని తాబేలు మరీ గడుగ్గాయిలా ఉందే!

“కథలు వినడంతోనే కాలక్షేపం చేస్తున్నావా? నిన్న నేనడిగిన ప్రశ్న గురించి ఏమైనా ఆలోచించావా?” ఎడం వైపునుండి వినిపించింది ప్రశ్న. భేతాళుడు ప్రత్యక్షమయ్యాడు!

నేను: వచ్చావా. రా రా. చూడు మనకింకొక తోడు దొరికింది. ఈ కుడి నేను నీలా ప్రశ్నలతో వేధించకుండా చక్కగా కథలూ కబుర్లూ చెబుతోంది.

ఎడమ నేను: అవును. నేనూ వింటున్నాను. ఆ కథలో ఉన్న మెలికని గుర్తుపట్టావా?

నేను: మళ్లీ నీ మెలికల గోల మొదలుపెట్టావా! కథని కథగా కాస్త ఆస్వాదించనీ.

ఎడమ నేను: అలాగే, నేను కాదన్నానా! సాహిత్యం ఆలోచనామృతం అన్నారు. ఈ కథకి అందం అందులోని మెలికే.

ఎడమ నేను చెపుతున్నది నిజమే. తాబేలుని మోసే పెద్ద తాబేలు, దాన్ని మోసే మరొక పెద్ద తాబేలు – ఇలా చెప్పుకుంటూ పోతే, దానికి అంతం ఉండదు. అది సరికాదు. మరి ఎలా? ఆ సమస్యని కథలోని కలలోని తాబేలు ఒకరకంగా పరిష్కరిస్తే, కథలోని తాబేలు మరోలా పరిష్కరించింది. భూమిని మోసేవాటిని తిరిగి భూమి మోయడం అనే మెలిక రెండో పరిష్కారంలో దాగుంది.

ఎడమ నేను: సరిగ్గానే గుర్తించావు.

నేను: ఇంతకీ ఈ కథ ఎక్కడిది?

కుడి నేను: ఎక్కడిదేంటి, నేను అల్లినదే!

నేను: ఓహో, అయితే మీరిద్దరూ కుమ్మక్కయ్యారన్న మాట!

కుడి నేను: కుమ్మక్కవ్వడం ఏమీ లేదు. నేనుకూడా మీతో పాటు వస్తున్నాను. మీ యిద్దరి సంభాషణా వింటూ ఉంటే నాకీ ఆలోచన వచ్చింది. అయినా ఇలాంటి కథలు ఇంతకు ముందే మన సాహిత్యంలో ఉన్నాయి.

నేను: అలాగా, అయితే మరింకెందుకు ఆలస్యం, చెప్పు చెప్పు!

ఎడమ నేను: వాటిని తర్వాత తీరిగ్గా విందువుగాని లే.

నా ఎడం నేనులో భేతాళుడే కాదు నక్షత్రకుడు కూడా ఉన్నాడు!

నేను: సరే, యింతకీ ఏమంటావు?

ఎడమ నేను: కుడి నేను చెప్పిన తాబేలు కథలో నేను నిన్నడిగిన ప్రశ్నకు జవాబుంది అంటాను.

నేను: ఆ కథలో నీ ప్రశ్నకు జవాబుందా?

ఎడమ నేను: ఇంతకీ నేనడిగిన ప్రశ్న గుర్తుందా?

నేను: వైశేషికుల సత్త్వ సిద్ధాంతంలో ఆత్మసూచన గురించే కదా. దానికీ ఈ కథకీ ఏమిటి సంబంధం?

ఎడమ నేను: ఆత్మసూచన తెచ్చిపెట్టే తంటాలలో తప్పొప్పుల తిరకాసు ఒకరకం. దాని గురించి నిన్నా మొన్నా వివరంగా మాట్లాడుకున్నాం కదా. అది తెచ్చే మరొక ఇబ్బంది అనవస్థ.

నేను: అనవస్థ? అంటే?

ఎడమ నేను: అనవస్థ అనేది తర్కశాస్త్రంలో ఒకానొక దోషం. ఏదైనా ప్రతిపాదన మరొక ప్రతిపాదనపై ఆధారపడి, ఆ ప్రతిపాదన ఇంకొక దానిపై, అది మరొక దానిపై, ఇలా అనంతంగా ఆధారపడుతూ పోవడాన్ని అనవస్థా దోషం (Infinite Regress) అంటారు. అలాంటి దోషమున్న ప్రతిపాదన తర్కసమ్మతం కాదన్న మాట.

నేను: ఆఁ! అర్థమయింది. కథలో భూమిని మోసే తాబేలు మరొక తాబేలుపైనా, అది మరొక తాబేలుపైనా యిలా అనంతంగా ఆధారపడాల్సి రావడంలాంటిదన్న మాట!

ఎడమ నేను: అవును. వైశేషికుల పదార్థ నిర్వచనంలో అలాంటి అనవస్థ రాకుండా వారు జాగ్రత్త పడవలసి వచ్చింది.

ఒకసారి వైశేషికుల సిద్ధాంతంలో పదార్థాల గురించి ఎడమ నేను చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాను. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం. ఇందులో ద్రవ్యం ఒక్కటే స్వతంత్రమైనది. గుణ కర్మలు ద్రవ్యం మీద ఆధారపడతాయి. అలాగే ద్రవ్యాలలో సమానంగా ఉండే లక్షణం సామాన్యం. ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యం ఒక విశేషం. పదార్థాల మధ్యన ఉండే అవినాభావ సంబంధం సమవాయం. ఈ నిర్వచనాలలో అనవస్థకి దారి తీసేది ఏమిటుందా అని ఆలోచించసాగాను.

ఎడమ నేను: సామాన్యం అనేది ఒక్క ద్రవ్యాలకే కాదు గుణాలకూ వర్తిస్తుంది.

నేను: అంటే?

ఎడమ నేను: సమాన లక్షణం ద్రవ్యాల మధ్యనే కాదు గుణాల మధ్యకూడా ఉండవచ్చును కదా. ఉదాహరణకి తెల్లగులాబీలోని తెలుపు లాగే, సున్నం రాసిన తెల్లగోడ, పాలు, మల్లెపూలు – ఇలా అనేక ద్రవ్యాలలో తెలుపు రంగు కనిపిస్తుంది కదా. ఒకో ద్రవ్యంలోనూ కనిపించేది ఒకో ప్రత్యేకమైన తెలుపు. ఆ అన్నింటిలో సమానంగా ఉన్న లక్షణం తెలుపుదనం. అది సామాన్యం. అంటే తెల్లని వస్తువులన్నిటిలో సమానంగా ఉండేది తెలుపుదనం అనే సామాన్యం అన్నమాట. అలాగే ఏ గుణమైనా ఒక ప్రత్యేక ద్రవ్యంలో కనిపించినప్పుడు, అది విశేష గుణం. వాటన్నిటిలో సమానంగా ఉన్నది సామాన్య గుణం.

నేను: అర్థమయింది. అలాగే నల్లదనం, చక్కదనం, పొట్టిదనం – ఇవన్నీ గుణాలలోని సామాన్యాలన్న మాట.

ఎడమ నేను: అవును. అలాగే కర్మలకి కూడా సామాన్యాలుంటాయి.

నేను: ఓహో. కూర్చోవడం, పరిగెత్తడం, చదవడం – ఇవన్నీ కర్మలలోని సామాన్యాలన్నమాట.

ఎడమ నేను: అవును.

ఈ నిర్వచనాలలో అనవస్థ ఎక్కడనుండి వస్తుందని ఆలోచించడం మొదలుపెట్టాను.

ఎడమ నేను: సామాన్యాన్ని ఒక పదార్థంగా అసలు వైశేషికులు ఎందుకు గుర్తించారో నీకు అర్థమయిందా?

నేను: ఒక ఆవుని చూసినప్పుడు అది ఏదో పదార్థం అని కాకుండా, ఒక ఆవు అని మనం గుర్తిస్తున్నాము కదా. ‘ఆవుదనం’ అనేది ఒకటి ఉంటేనే ఒక ప్రత్యేకమైన ఆవును ఆవుగా గుర్తించగలం. నువ్వు నిన్న చెప్పినదాని బట్టి నాకర్థమైనది ఇదీ!

ఎడమ నేను: సరిగానే అర్థమయింది. ఇప్పుడొక ప్రశ్న వేస్తాను జాగ్రత్తగా ఆలోచించి జవాబు చెప్పు.

నేను: అలాగే, అడుగు.

ఎడమ నేను: ఆవుదనం అనే సామాన్యాన్ని నువ్వు గుర్తిస్తున్నావా లేదా?

ఎడమ నేను: ఆ గుర్తిస్తున్నాను.

ఎడమ నేను: ఒక ఆవు వేరు, గుర్రం వేరు అని గుర్తించినట్టుగా ఆవుదనం వేరు గుర్రపుదనం వేరు అనికూడా గుర్తిస్తున్నావు కదా?

నేను: అవును.

ఎడమ నేను: మరి…

బల్బు వెలిగింది! ఎడమ నేను చెప్పబోయేది అర్థమయింది.

నేను: ఆఁ, తెలిసింది! ఒక ఆవుని ఆవని గుర్తించడానికి ఆవుదనం ఎలా అవసరమయిందో, ఆవుదనాన్ని ఆవుదనం అని, అది గుర్రపుదనం కాదనీ గుర్తించడానికి ‘ఆవుదనపు’దనం అనేది మరొకటి ఉండాలి కదా?

ఎడమ నేను:భేష్! సరిగ్గా పట్టుకున్నావ్.

నేను: అదే లాజిక్కుతో ‘ఆవుదనపుదనపు’దనం, ‘ఆవుదనపుదనపుదనపు’దనం… ఇలా అనంతమైన సామాన్యాలు ఉండాలన్నమాట! ఇది అనవస్థా దోషం!

ఎడమ నేను: భేష్, భేష్! మరి యీ సమస్యకి ఏమిటి పరిష్కారం?

అవును, ఏమిటి పరిష్కారం? ఒక నాలుగు కాళ్ళ జీవిని ‘ఆవు’గా మనం గుర్తిస్తున్నామంటే, ‘ఆవుదనం’ అనేది ఒకటి ఉండాలని వైశేషికుల ప్రతిపాదన. ఇది సమంజసంగానే ఉంది. అంచేత ‘ఆవుదనం’ అనేది కూడా ఒక పదార్థమేనని, దానికి వారు సామాన్యమని పేరు పెట్టారు. మరి ‘ఆవుదనం’ అనేది ఒక పదార్థమైతే దానిని ‘గుర్రపుదనం’ అనే వేరే పదార్థంతో వేరు చేస్తున్నది ఏమిటి? ‘ఆవుదనం’ అనే పదార్థం ఉందని అనుకున్నా, అది ఒకే ఒక పదార్థం. రెండు ‘ఆవుదనాలు’ ఉండవు. ‘ఆవులు’ అనేకం ఉండవచ్చును కానీ ‘ఆవుదనం’ అనేది ఒకటే. అలాగే గుర్రపుదనమూను. ఉండే పదార్థమే ఒకటైనప్పుడు మళ్లీ దానికి సామాన్యం, విశేషం అనేవి ఉండవు. అలాంటి పదార్థాలను గుర్తించడానికి మరొక సామాన్యం అవసరం లేదు. కాబట్టి ఒక సామాన్యాన్ని గురించడానికి వేరే సామాన్యం అవసరం లేదన్నమాట!

ఎడమ నేను: సరిగ్గానే ఆలోచించావు. వైశేషికుల సత్త్వసిద్ధాంతం నీకు బాగానే అర్థమయినట్టుంది! ఒక పదార్థాన్ని మరొక పదార్థంతో వేరు చేసి చూసేందుకు సామాన్యం అవసరమైనప్పుడు, అదే అవసరం ఒక సామాన్యాన్ని మరొక సామాన్యంతో వేరుగా గుర్తించేందుకు కూడా ఉంటుంది అనడంలో ఆత్మసూచన దాగుంది. అలా జరిగితే అది అనవస్థకి దారి తీస్తుంది. సామాన్యాన్ని స్వతస్సిద్ధంగానే గుర్తించవచ్చు అనేది దానికి పరిష్కారం. భూమిని మోసే తాబేలు తనంత తానుగా నిలబడగలదు, వేరే మరొక తాబేలు అవసరం లేదని అనడం లాంటిదే ఇది!

నేను: అవునవును!

ఎడమ నేను: సామాన్యం అంటే ఏమిటన్నది నిర్ణయించడానికి వైశేషికులు చాలా పకడ్బందీ నియమాలను ఏర్పరిచారు. అందులో అనవస్థాదోషం ఉండకూడదన్నది ఒక నియమం. [4] సత్త్వసిద్ధాంతంలో మరొక చోటకూడా, ఈ అనవస్థాదోషమనే ప్రమాదాన్ని వైశేషికులు ఎదుర్కొన్నారు. నీకీ సిద్ధాంతం బాగానే అర్థమయినట్టుంది కాబట్టి, అదేమిటో గుర్తించడానికి ప్రయత్నించు.

మరోసారి పదార్థాల నిర్వచనాలను గుర్తుకు తెచ్చుకున్నాను. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం. ఇందులో యిక మిగిలింది సమవాయం. సమవాయం అనేది రెండు పదార్థాల మధ్యనుండే అవినాభావ సంబంధం. ఒక తెల్లగులాబీకీ, దానిలోని తెలుపు అనే గుణానికి మధ్యనున్న సంబంధం సమవాయం. అలాగే ఒక ఆవుకీ, ఆవుదనానికీ మధ్యనున్న సంబంధం మరొక సమవాయం. ఇందులో అనవస్థ వచ్చిపడే ప్రమాదం ఎక్కడుంది? ఒక సమవాయానికి మరొక సమవాయం అవసరమా?

ఎడమ నేను: సరైన తోవలోనే వెళుతున్నావ్. సరే, కొంచెం సాయం చేస్తాను. తెల్లగులాబీ అనేది ఒక పదార్థం. దానిలోని తెలుపు అనే గుణం మరొక పదార్థం. అవునా?

నేను: అవును.

ఎడమ నేను: వాటి మధ్య సమవాయం, అంటే అవినాభావ సంబంధం ఉందా?

నేను: తెల్లదనానికీ గులాబీకీ అవినాభావ సంబంధం ఎక్కడుంది? గులాబీ ఎర్రగా కూడా ఉండవచ్చు కదా? అలాగే తెలుపు రంగు మరెన్నో ద్రవ్యాలకీ ఉంటుంది.

ఎడమ నేను: నువ్వంటున్న ‘తెల్లదనం’, ‘గులాబీ’ అనేవి రెండు జాతులు, అంటే సామాన్యాలు. వాటి మధ్య అవినాభావ సంబంధం లేదు నిజమే. నేను చెపుతున్నది ఒక తెల్లగులాబీ అనే ప్రత్యేకమైన ద్రవ్యం గురించి. దాని గుణం తెలుపు. ఆ గుణానికీ ఆ తెల్లగులాబీకి మధ్యనున్న సంబంధం అవినాభావమే కదా.

నేను: అర్థమయింది. ఒక ప్రత్యేకమైన ద్రవ్యాన్ని తీసుకుంటే, దానికీ దాని గుణానికీ ఉన్నది అవినాభావ సంబంధమే.

ఎడమ నేను: దానినే వైశేషికులు సమవాయం అన్నారు. సరే, ఆ సమవాయానికి ఒక పేరు పెడదాం. దాన్ని ‘తె-తెగు’ సమవాయం అందాం, అంటే తెలుపు-తెల్లగులాబీ మధ్యనున్న సంబంధం. వైశేషికుల ప్రకారం ఈ ‘తె-తెగు’ అనే సమవాయం కూడా ఒక పదార్థమే, అవునా?

నేను: అవును.

ఎడమ నేను: మరి…

మళ్లీ బల్బు వెలిగింది!

నేను: మరి తెల్లగులాబీ అనే పదార్థానికీ, ‘తె-తెగు’ అనే పదార్థానికీ మధ్యనున్న సంబంధం ఏమిటి? అదికూడా అవినాభావ సంబంధమే కదా! అంటే వాటి మధ్య మరొక సమవాయ సంబంధం ఉండాలన్నమాట. దాన్ని ‘తెగు-తె-తెగు’ అనుకుంటే, అది కూడా ఒక పదార్థమే. అప్పుడు మళ్లీ తెల్లగులాబికీ దానికీ మధ్య, ‘తెగు-తెగు-తె-తెగు’ అనే మరొక సమవాయ సంబంధం ఉండాలి. ఇలా అనంతమైన సమవాయాలు ఏర్పడతాయి!!

ఎడమ నేను: అదీ లెక్క! ఈ దోషాన్ని ఎత్తిచూపి, సమవాయం అనే ఒక పదార్థం ఉందన్న ప్రతిపాదన తర్క సమ్మతం కాదని అద్వైతులు అభ్యంతరం లేవనెత్తారు. [5] దాన్ని ఎదుర్కోడానికి సామాన్యం విషయంలో ఉపయోగించిన చిట్కానే సమవాయానికి కూడా ఉపయోగించాల్సి వచ్చింది వైశేషికులకు.

నేను: అంటే సమవాయానికి మరొక పదార్థంతో సంబంధం ఉండనక్కర లేదనా?

ఎడమ నేను: అవును. సమవాయ సంబంధం స్వతస్సిద్ధమనీ, దాన్ని గుర్తించడానికి వేరే మరొక సంబంధం అవసరం లేదనీ వారు వాదించారు.[6]

నేను: అయితే వైశేషిక సిద్ధాంతం ప్రకారం సామాన్యం, సమవాయం అనే రెండు పదార్థాలూ స్వతస్సిద్ధాలన్న మాట. అంటే వాటిని గుర్తించడానికి వేరే పదార్థాల అవసరం లేదనే కదా.

ఎడమ నేను: అవును. అనవస్థాదోషం అంటే ఏమిటో, దానికి వైశేషికులు ఎలాంటి పరిష్కారం కనిపెట్టారో బాగా అర్థమయిందా?

నేను: ఆఁ, అర్థమయింది. నువ్వు నన్ను భలే మోసం చేసావ్!

ఎడమ నేను: నేనా! మోసమా!

నేను: అవును. ఆత్మసూచన వల్ల అనవస్థ ఏర్పడుతుందన్నావు. కానీ నిజానికది అనవస్థను తప్పిస్తోంది.

ఎడమ నేను: అదెలా? సామాన్యానికి తిరిగి సామాన్యం, సమవాయ సంబంధానికి తిరిగి మరొక సమవాయ సంబంధం – ఇదొకరకమైన పునరావృతం (Recursion). ఒక విషయాన్ని తిరిగి దానికే వర్తింపజేయడం. అది ఆత్మసూచకమైన ప్రక్రియ. దాని వల్లనే కదూ యిక్కడ అనవస్థా దోషం ఏర్పడుతున్నది?

నేను: అవును. కానీ దానికి పరిష్కారం ఏమిటి చెప్పారు? సామాన్యం, సమవాయం అన్నవి స్వతస్సిద్ధాలని. అంటే అవి తమంత తాముగా గుర్తించబడే పదార్థాలన్నమాట. అంటే అవి ఆత్మసూచకాలే కదా!

ఎడమ నేను: నిజమే, ఈ రకంగా ఆలోచిస్తే, సమస్య సృష్టించిందీ పరిష్కరించిందీ కూడా ఆత్మసూచనే అన్నమాట! ఇప్పటి దాకా నేనలా ఆలోచించనే లేదు సుమీ! నీ బుద్ధి బాగానే పదునెక్కుతోంది! సరే, తమంత తాముగా గుర్తుంచబడుతూ, ఇతర పదార్థాలను గుర్తించేలా చేసే మరికొన్ని పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో చెప్పు చూద్దాం.

“విశ్వభ్రాడ్ భ్రాజో …” పొద్దున్న విన్న ఋగ్వేద మంత్రం గుర్తుకువచ్చింది!

నేను: సూర్యుడు! తాను వెలుగుతూ విశ్వాన్నంతటినీ వెలిగిస్తాడు కదా.

ఎడమ నేను: సరిగ్గానే చెప్పావు. అయినా సూర్యుడి దాకా వెళ్ళడం ఎందుకు? ఒక దీపం కూడా అంతే కదా! దీపం వేరే వస్తువులను మనకి చూపిస్తుంది. దీపాన్ని చూడడానికి వేరే వస్తువు అవసరం లేదు, తనంత తానుగా కనిపించగలదు!

నేను: నిజమే. దీపంనుంచి కావచ్చు, ట్యూబులైటునుంచి కావచ్చు, సూర్యుడినుంచి కావచ్చు – వెలుగు ఎప్పుడూ తనంత తాను కనిపిస్తూ, తక్కిన పదార్థాలను మనకి చూపిస్తుంది!

ఎడమ నేను: దీపం, సూర్యుడు, వెలుగు, ఇవన్నీ భౌతిక పదార్థాలు. తనని తాను సూచించుకొనే అభౌతిక పదార్థం ఏదైనా ఉందేమో చెప్పు చూద్దాం.

నేను: ఇంతకుముందు చెప్పుకున్నాం కదా – సామాన్యం, సమవాయం.

ఎడమ నేను: అవి వైశేషికుల సిద్ధాంతంలో నిర్వచించిన పదార్థాలు. మనకి నిత్యవ్యవహారంలో బాగా తెలుసున్న పదార్థాలు ఏమైనా చెప్పగలవేమో ఆలోచించు.

ఆలోచిస్తూ ఉండగా, కుడి నేను గొంతు సవరించుకోవడం వినిపించింది.

కుడి నేను: వాగర్థావివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే। జగతః పితరౌవన్దే పార్వతీ పరమేశ్వరౌ॥

నేను: హఠాత్తుగా కాళిదాసు కుమారసంభవ శ్లోకం ఎందుకు గుర్తుకువచ్చింది నీకు?

ఎడమ నేను: దాని అర్థం నీకు తెలిస్తే నేనడిగిన ప్రశ్నకి జవాబు తడుతుంది!

నేను: వాక్కు, అర్థంలాగా కలిసిమెలిసి ఉండే, జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీపరమేశ్వరులను, వాగర్థాలను ప్రసాదించమని కోరుతూ, వారికి కాళిదాసు నమస్కరించాడు.

కుడి నేను: అవును. వాగర్థాలను ప్రసాదించమని, వాగర్థాలవంటి పార్వతీపరమేశ్వరులను కోరడం గొప్ప ఔచిత్యం! అర్ధనారీశ్వరులైన పార్వతీపరమేశ్వరులను వాగర్థాలతో పోల్చడం అంతకన్నా గొప్ప ఔచిత్యం!

నేను: అవును, అందుకేగా ఉపమా కాళిదాసస్య అన్నారు! ఇంతకీ తనని తాను సూచించే పదార్థం ఏముంది యిందులో?

ఎడమ నేను: నీ ప్రశ్నలోనే జవాబుంది.

నన్ను తికమక పెట్టడం ఎడమ నేనుకి వెన్నతో పెట్టిన విద్య!

నేను: ఇంక నీ పొడుపుకథలు కట్టిపెట్టి, అదేమిటో నువ్వే చెప్పు. నాకు తెలియడం లేదు.

ఎడమ నేను: వాక్కు.

నేను: వాక్కు తనని తాను సూచిస్తుందా? అదెలా? వాక్కు అర్థాన్ని కదా సూచిస్తుంది. పదం సూచించే దానినే కదా పదార్థం అంటాము?

ఎడమ నేను: సరే, ఈ ప్రశ్నకి జవాబు చెప్పు – ‘పులి’ అంటే ఏమిటి? రెండక్షరాల పదమా, నాలుగు కాళ్ళ జంతువా?

ప్రశ్నకి సమాధానం మరో ప్రశ్నా! పులి అనేది రెండక్షరాల పదం. అది ఒక నాలుగు కాళ్ళ అడవి జంతువుని సూచిస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగా కుడి నేను ఒక బొమ్మని నా ముందుంచింది.



ఇదేదో ఒక పైప్ బొమ్మ. కిందన అర్థం కాని భాషలో ఏదో వాక్యం.

నేను: ఓహో! నువ్వుకూడా పొడుపు కథలు మొదలుపెట్టావా. ఏమిటా బొమ్మ? ఆ బొమ్మలో వాక్యం ఏమిటి?

కుడి నేను: అది రెనె మాగ్రిట్ (René Magritte) అనే బెలిజియన్ సర్రియలిస్ట్ చిత్రకారుడు వేసిన బొమ్మ. ఆ బొమ్మలో ఉన్న ఫ్రెంచి వాక్యానికి అర్థం ‘ఇది పైప్ కాదు’ అని.

నేను: పైప్ కాకపోతే అదేమైనా సిగరెట్టా! పైప్ బొమ్మ వేసి అది పైప్ కాదని ప్రత్యేకంగా ఆ బొమ్మలోనే చెప్పడంలో అర్థముందా? ఏమిటతని ఉద్దేశం? వాస్తవాన్ని కాదనడమేనా అధివాస్తవికత!

కుడి నేను: ఈ ప్రశ్నలకు మగ్రీతే జవాబిచ్చాడు: “ఇలాంటి ఎత్తిపొడుపులకేమి కానీ, అలా అన్నవాళ్లు ఎవరయినా ఆ పైపులో పొగాకు దట్టించగలరేమో చెప్పమనండి చూద్దాం! అది పైప్ కాదు, దాన్ని సూచించే బొమ్మ మాత్రమే, అవునా? కాబట్టి ‘ఇది ఒక పైప్’ అని నేను రాసుంటే అది అబద్ధమయ్యేది కదా!” అది అతని సమాధానం.

నేను: ఓహో, అదా ఆయన లాజిక్కు!

కుడి నేను: అధివాస్తవికత అంటే వాస్తవాన్ని అధిగమించడం, కాదనడం కాదు.

ఎడమ నేను: అది సరే, ఇంతకీ ఈ బొమ్మకీ నా ప్రశ్నకీ ఏమిటి సంబంధం?

నేను: ఆఁ… అర్థమయింది! పదం కూడా బొమ్మలాగే ఒక పదార్థాన్ని సూచిస్తుంది. అది దాని అర్థం. పదమే ఆ పదార్థం కాదు. అంచేత పులి అనేది రెండక్షరాల పదమే. అది ఒక నాలుగు కాళ్ళ అడవి జంతువును సూచిస్తుంది. అది దాని అర్థం. ఒక వాక్యాన్ని అర్థం చేసుకొనేటప్పుడు ఆ వాక్యంలోని పదాల అర్థాలనే మనం తీసుకుంటాం. ఉదాహరణకి ‘మా ఊరికి పక్కనున్న అడవిలో పులి తిరుగుతోంది’ అనే వాక్యంలో పులి అనే పదం అడవిలోని ఒక జంతువును సూచిస్తోంది.

ఎడమ నేను: సరే, అయితే ఈ వాక్యాలు విను – ‘పులి వంటి ఇకారాంత పదాల బహువచనంలో చివరి ఇత్వం ఉత్వంగా మారుతుంది. కాబట్టి పులి బహువచనం పులులు’. ఇక్కడ పులి అనే పదం అడవిలోని జంతువును సూచిస్తుందా?

మళ్లీ పడింది మెలిక! ఈ వాక్యాలలో పులికి ఉన్న అర్థం పులి అనే పదమే, జంతువు కాదు. ఆ పదం తనని తానే సూచిస్తోంది!

ఎడమ నేను: ఏ పదమైనా యిలాగే తనని తాను సూచిస్తూ, మరొక పదార్థాన్నికూడా సూచిస్తుంది. భాషకున్న ఈ శక్తిని మొట్టమొదటి భాషాశాస్త్రకారుడైన పాణిని గుర్తించాడు.దానిని ‘స్వంరూపం శబ్దస్య అశబ్దసంజ్ఞ’ అని సూత్రీకరించాడు.

నేను: అంటే?

ఎడమ నేను: ఈ సూత్రం కచ్చితంగా ఏమిటి చెపుతోందన్న విషయమై విభేదాలున్నాయి. అయితే, ఒక శబ్దం తన రూపాన్నీ, అర్థాన్నీ కూడా సూచిస్తుందన్న విషయంలో సందేహం లేదు .[7] ఇది ప్రత్యేకించి వ్యాకరణానికి సంబంధించిన సూత్రం. సాధారణంగా వ్యాకరణంలో ఒక శబ్దం ఆ శబ్ద రూపాన్ని మాత్రమే సూచిస్తుంది, దాని అర్థాన్ని కాదు.

నేను: అంటే, ‘పులి బహువచనం పులులు’ అన్నప్పుడు పులి అనేది ఆ పదాన్నే సూచిస్తుంది తప్ప, దాని అర్థమైన జంతువును కాదు. అంతేనా?

ఎడమ నేను: అవును. అయితే వ్యాకరణంలో వాడే పారిభాషిక పదాలు మాత్రం ఆ పదాన్ని కాక, వాటి అర్థాన్నే సూచిస్తాయి. ఉదాహరణకి ‘బహువచనం సాధారణంగా లు-కారంతో అంతమవుతుంది’ అన్నప్పుడు బహువచనం అనే పదం తన రూపాన్ని సూచించదు. బహువచనం అనే పదం లు-కారంతో అంతమవ్వదు కదా! ఇక్కడ బహువచనం అంటే, ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యగల నామవాచకం అని అర్థం. ఆ వాక్యంలో ఆ అర్థాన్నే గ్రహించాలి.

నేను: మొత్తానికి ఒక పదం తనని తాను సూచించుకొంటూ, తన అర్థాన్ని కూడా సూచిస్తుందంటావు. ఇందులో పెద్ద విశేషం ఏముంది!

ఎడమ నేను: మనకి బాగా అలవాటైన విషయం కాబట్టి ఇందులో విశేషం కనిపించదు. కానీ యిది చాలా శక్తివంతమైన అంశం. సందర్భాన్ని బట్టి ఒక పదం దేన్ని సూచిస్తుందన్నది మనిషి మెదడుకి సులువుగా అర్థమయ్యే విషయం. అదే ఒక కంప్యూటర్ లాంటి యంత్రానికి సైతం అది చాలా కష్టం! నీకు కంప్యూటర్ ప్రొగ్రామింగ్ భాషలు తెలుసుకదా?

నేను: ఆఁ.

ఎడమ నేను: సాధారణంగా ఏ ప్రొగ్రామింగ్ భాషలోనైనా ఒక పదమో వాక్యమో ప్రింట్ చెయ్యాలంటే ఆ వాక్యాన్ని కొటేషన్సులో పెడతాం, అవునా?

నేను: అవును. ఉదాహరణకి print(“You are my left I”)

ఎడమ నేను: మరి – I said, “You are my left I” – అనే వాక్యాన్ని ప్రింట్ చెయ్యాలనుకో అప్పుడు?

నేను: ఆ వాక్యంలోనే కొటేషన్స్ ఉన్నాయి కాబట్టి, వాటిని ఒక డెలీమీటరుతో (`) సూచించాలి. ఇలా – print(“I said, `“You are my left I`“”)

ఎడమ నేను: అంటే కొటేషన్స్ అనేవి ప్రొగ్రామింగ్ భాషలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని సూచిస్తాయి. కానీ నేనిచ్చిన ఉదాహరణ వాక్యంలో కొటేషన్స్ కొటేషన్స్ గానే కంప్యూటర్ అర్థం చేసుకోవాలి. అలా కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే దాన్ని వేరే గుర్తుతో సూచించాల్సి వచ్చింది, అవునా?

నేను: అవును. అర్థమయింది. సందర్భాన్ని బట్టి కొటేషన్స్ తన భాషలోని అంశాన్ని సూచిస్తాయా, లేదా వాటిని ఉన్నవున్నట్టుగా, ప్రింట్ చేయాల్సిన వాక్యంలో భాగంగా గ్రహించాలా అన్నది కంప్యూటరుకి తెలియడం కష్టం. అంచేత వేరుగా గుర్తించాల్సి వస్తుంది.

ఎడమ నేను: ఇప్పుడర్థమయిందా, సందర్భాన్ని బట్టి, ఒక పదం సూచించే అర్థాన్ని గ్రహించడం ఎంత గొప్ప విషయమో! అది మనిషి మెదడుకున్న శక్తి. ఆ శక్తివల్లనే ఆత్మసూచన మానవభాషలో సర్వత్రా కనిపించే సాధారణ విషయం అయింది.

నేను: అర్థమయింది.

ఎడమ నేను: ఒక శబ్దం, దాని అర్థాన్ని, తన రూపాన్నీ కూడా సూచిస్తుంది అనే ఈ ఆలోచన అనంతర కాలంలో భాషాశాస్త్రాన్నే కాదు, తత్త్వచింతననుకూడా చాలా ప్రభావితం చేసింది. దీని గురించి భర్తృహరి తన వాక్యపదీయంలో మొదటి బ్రహ్మకాండములో, సుమారు ఆరేడు శ్లోకాలలో వివరించాడు.

నేను: ఓహ్! భర్తృహరి గొప్ప భాషాశాస్త్రవేత్త అని చెప్పావు గుర్తుంది!

ఎడమ నేను: అవును, శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప తాత్త్వికుడు, కవి కూడా. భర్తృహరి సుభాషితాల గురించి వినే ఉంటావు.

నేను: అవును విన్నాను.

ఎడమ నేను: అతను శబ్దానికున్న ఆత్మసూచక లక్షణాన్ని చాలా పోలికలతో వివరించాడు వాక్యపదీయంలో. అన్నట్టు, ఇంతకుముందు నువ్వు చెప్పిన ఉదాహరణకూడా వాటిలో ఒకటి తెలుసా!

నేను: నేను చెప్పిన ఉదాహరణా?!

ఎడమ నేను: అవును.

గ్రాహ్యత్వం గ్రాహకత్వం చ ద్వే శక్తీ తేజసో యథా
తథైవ సర్వశబ్దానా మేతే పృథగివ స్థితే – వాక్యపదీయం 1.55

నేను: అనగా?

ఎడమ నేను: ప్రతి శబ్దానికీ వెలుగులాగ (తేజస్) రెండు శక్తులున్నాయని అర్థం. తనను తాను చూపించే శక్తి ఒకటి (గ్రాహ్యత్వం), ఇతర వస్తువులను చూసేట్టు చేసే శక్తి (గ్రాహకత్వం) మరొకటీను. శబ్దానికికూడా అలాంటి శక్తే ఉందని చెప్పాడు భర్తృహరి.

నేను: భలే. నేను సూర్యుడు, దీపం, వెలుగు గురించి చెప్పినదే కదా!

ఎడమ నేను: ఇంతకన్నా గంభీరమైన మరొక ఉదాహరణకూడా యిచ్చాడు.

ఆత్మరూపం యథా జ్ఞానే జ్ఞేయ రూపం చ దృశ్యతే
అర్థ రూపం తథా శబ్దే స్వరూపం చ ప్రకాశతే – వాక్యపదీయం 1.50

నేను: అవునవును, ఇది వినడానికే గంభీరంగా ఉంది!!

ఎడమ నేను: ఇక్కడ చెప్పిన పోలిక జ్ఞానం. జ్ఞానం ఎలా అయితే తనను తాను (ఆత్మరూపం) దర్శింపజేస్తూ, ఇంకొక వస్తువును (జ్ఞేయం) కూడా దర్శింపజేస్తుందో, అలాగే శబ్దం అది చెపుతున్న అర్థ రూపాన్ని, స్వరూపాన్నీ కూడా ప్రకాశింపజేస్తుంది – అని అర్థం.

నేను: ఒక వస్తువును తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం అవసరం. అంత వరకూ అర్థమయింది. జ్ఞానం తనని తాను దర్శింపజేయడం అంటే ఏమిటి?

ఎడమ నేను: ఉదాహరణకు మనం ఒక కుండను చూసినప్పుడు అది కుండ అని మనకు తెలుస్తోంది. అలాగే అది కుండ అని మనకు తెలుసును అనే విషయం కూడా తెలుస్తోంది కదా! అంటే కుండ గురించిన జ్ఞానం మనకి కుండని చూపిస్తోంది. దానితోపాటుగా ఆ జ్ఞానాన్నికూడా తెలియజేస్తోందన్న మాట.

నేను: ఓహో!

ఎడమ నేను: ఇంకా మరిన్ని ఉదాహరణలతో ఈ విషయాన్ని భర్తృహరి వివరిస్తాడు. పాణిని కాలానికి శబ్దానికున్న ఆత్మసూచన శక్తి కేవలం వ్యాకరణానికి సంబంధించిన ఒక సాంకేతిక అంశం. అదే భర్తృహరి కాలానికి వచ్చేసరికి అదొక విశిష్టమైన తాత్త్విక భావనగా పరిణమించింది.

నేను: మొత్తానికి యీ భర్తృహరి చాలా ఘటికుడిలా ఉన్నాడు!

ఎడమ నేను: నిస్సందేహంగా! భాష గురించి చాలా లోతుగా ఆలోచించిన వారిలో భర్తృహరి అగ్రేసరుడు. భారతీయ భాషాశాస్త్రంలో పదానికి ఉన్న ప్రాధాన్యం వాక్యానికి లేదు. పదం కన్నా వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన కొద్దిమంది భాషావేత్తలలో ప్రముఖుడు భర్తృహరి. అంతే కాదు, మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా?

నేను: చెప్పు చెప్పు.

ఎడమ నేను: వేల సంవత్సరాలుగా పాశ్చాత్య తార్కికుల మేధామథనానికి కారణమైన తప్పొప్పుల పేరడాక్సు గురించి భర్తృహరి తన వాక్యపదీయంలో చర్చించాడు. ఈ సంగతి ఆధునిక తర్కవేత్తలను అబ్బురపరిచింది.

నేను: ఏమిటి, తప్పొప్పుల పేరడాక్సు గురించా?!

ఎడమ నేను: అవును. అసలు దీని ప్రస్తావన వచ్చే సందర్భమే చిత్రమైనది! వాక్యపదీయంలో మొత్తం మూడు కాండలున్నాయి – బ్రహ్మకాండము, వాక్యకాండము, పదకాండము. పదకాండంలో ‘సంబంధ సముద్దేశము’ అనే భాగంలో ఈ పేరడాక్సు ప్రస్తావన వస్తుంది.

నేను: ‘సంబంధ సముద్దేశం’ అంటే?

ఎడమ నేను: సముద్దేశం అంటే సిద్ధాంతం, చర్చ అనే అర్థాలున్నాయి. శబ్దార్థాల మధ్యనున్న సంబంధాన్ని చర్చించే భాగం ‘సంబంధ సముద్దేశం’.

వాగర్థావివ సంపృక్తౌ అన్న శ్లోకం గుర్తుకువచ్చింది. అర్ధనారీశ్వర రూపం కళ్ళముందు కదలాడింది.

ఎడమ నేను: అవును శబ్దానికి అర్థానికి విడదీయలేని సంబంధం. అంచేతనే వాటి మధ్యనున్నది సమవాయ సంబంధమని వైశేషికులన్నారు.

నేను: సమవాయ సంబంధం ఇక్కడకూడా వచ్చిందా!

ఎడమ నేను: భర్తృహరి బహుశా అద్వైతి. అందువల్ల వైశేషికులు చెప్పిన సమవాయ సంబంధాన్ని అతడు ఒప్పుకోలేదు. అసలు సమవాయ సంబంధం అనేదే ఉండదని అతని వాదన.

నేను: ఓహో!

ఎడమ నేను: భర్తృహరి తన వాదాన్ని చాలా రకాలుగా సమర్థించుకొన్నాడు. అందులో ఒకటి ఏమిటంటే – సమవాయ సంబంధం అనేది అవాచ్యం, అంటే మాటలలో దానిని నిర్వచించలేము. కాబట్టి అలాంటిదసలు ఉండడానికి వీలు లేదు.

నేను: సమవాయ సంబంధాన్ని మాటలలో చెప్పలేకపోవడమేమిటి!

ఎడమ నేను: అవును, సమవాయ సంబంధాన్ని మాటలలో చెప్పలేమని భర్తృహరి వాదం. దాన్ని ఎలా సమర్థించాడో వింటే నీ మతిపోతుంది!!

నేను: ఇప్పటికే చాలా పోయింది. ఇంకా పోయేందుకు పెద్దగా ఏమీ లేదు కానీ, ఆ సమర్థన ఏమిటో చెప్పు.

ఎడమ నేను: శబ్దార్థాలకి మధ్యన సమవాయమనే సంబంధం ఉన్నదనుకుందాం. అప్పుడు సమవాయం అనే శబ్దానికీ అది సూచించే అర్థానికీ మధ్యకూడా సమవాయ సంబంధం ఉండాలి కదా?

నేను: అవును ఉండాలి.

ఎడమ నేను: సమవాయం అనే శబ్దం సూచించే అర్థం ఏమిటి?

నేను: సమవాయం అనే పదార్థం

ఎడమ నేను: అంటే సమవాయం అనే పదానికి సమవాయం అనే పదార్థంతో సమవాయ సంబంధం ఉన్నదన్నమాట.

నేను: అవును.

ఎడమ నేను: కానీ వైశేషికుల సిద్ధాంతం ప్రకారం సమవాయం అనే పదార్థానికి మరే పదార్థంతోనూ సమవాయ సంబంధం ఉండదు కదా!

నేను: ఓహ్! మళ్లీ యిక్కడ ఆత్మసూచన ప్రత్యక్షమయిందే! అవును సమవాయ పదార్థానికి వేరే పదార్థంతో సమవాయ సంబంధం ఉండదనే కదా వైశేషికుల సిద్ధాంతం.

ఎడమ నేను: అంటే సమవాయం అనే పదార్థానికి సమవాయం అనే పదంతో సంబంధం ఉండకూడదు. అలా ఉండనప్పుడు సమవాయం అనే పదం సమవాయం అనే పదార్థాన్ని ఎలా సూచిస్తుంది? అంచేత ఏ పదమూ సమవాయ పదార్థాన్ని సూచించలేదు. పదమే లేనప్పుడు పదార్థం ఎక్కడనుండి వస్తుంది!

నేను: నిజంగానే యిది తలతిరిగిపోయే వాదమే సుమీ! సమవాయం అనే పదానికీ దాని అర్థానికీ తిరిగి సమవాయ సంబంధం ఉండాలన్న ఆలోచన అసలు ఎలా వచ్చిందో! భర్తృహరి పెద్ద జీనియస్‌లా ఉన్నాడు.

ఎడమ నేను: జీనియస్‌లా ఉండడమేమిటి, జీనియస్సే! అయితే అతని వాదానికి కొందరు ఒక వింత ప్రతివాదం లేవదీసారట. ఆ ప్రతివాదాన్నికూడా వివరించి, తర్వాత దాన్ని ఖండిస్తాడు భర్తృహరి.

నేను: ఏమిటా ప్రతివాదం?

ఎడమ నేను: సమవాయం అవాచ్యం అని కదా భర్తృహరి వాదన. అంటే ఏ పదమూ ఆ పదార్థాన్ని సూచించలేదని.

నేను: అవును.

ఎడమ నేను: మరి అవాచ్యం అనే పదం ఆ సమవాయాన్ని సూచిస్తోంది కదా! కాబట్టి అది వాచ్యమే అన్నది ఆ ప్రతివాదన! [8]

నేను: ఓరి వీరి అసాధ్యంగూలా! ఇదెక్కడి వాదన? ఏదైనా పదార్థం అవాచ్యం అయితే ఆ అవాచ్యం అనే పదం దాన్ని సూచిస్తోంది కాబట్టి అది తిరిగి వాచ్యం అవ్వాలా! మనమింతకు ముందు చూసిన తిరకాసుల్లాగే ఉందిది. దీనికి మరి భర్తృహరి చెప్పిన జవాబు ఏమిటి?

ఎడమ నేను: చాలా తేలికగా కనిపించే జవాబే, కానీ అందులోని లోతు చాలామంది తార్కికులను, తత్త్వవేత్తలను అబ్బురపరిచింది.

నేను: తేలికైన జవాబా!

ఎడమ నేను: అవును. అవాచ్యమంటే ఏ పదమూ సూచించలేని భావమని కదా అర్థం. అలా అన్నప్పుడు, ఆ భావాన్ని సూచించలేని పద సముదాయంలో ‘అవాచ్యం’ అనే పదం కూడా వస్తుందా రాదా అన్నది ప్రశ్న. రాదు అని భర్తృహరి సమాధానం. అంటే అవాచ్యం అనే పదం తనని తాను సూచించుకోలేదని! అందువల్ల, అవాచ్యం అంటే ఆ ‘అవాచ్యం’ అనే పదం తప్పించి వేరే ఏ పదమూ సూచించలేని భావం అని తాత్పర్యం. అలాంటప్పుడిక తిరకాసుకి చోటులేదు కదా!

నేను: అంటే రసెల్ సెట్ థియరీలో ఆత్మసూచనని బహిష్కరించినట్టు, భర్తృహరి పదాలకు ఆత్మసూచన ఉండదని సూత్రీకరించాడా?

ఎడమ నేను: ఆ రెంటి మధ్య కొంత తేడా ఉంది. రసెల్ సిద్ధాంతానికి డిడక్టివ్ లాజిక్కు ఆధారం. అందులో కచ్చితమైన కొన్ని మూల సూత్రాలను అనుసరించి మిగతా సిద్ధాంతాన్ని నిర్మిస్తారు. అంచేత, సెట్ నిర్వచనంలో ఆత్మసూచన ఉండలేదన్న సూత్రం ఆ సిద్ధాంతపు మూలసూత్రాలలో ఒకటి. భారతీయ తర్కం ఈ పద్ధతికి కొంత భిన్నంగా ఉంటుంది. భారతీయ పద్ధతిని ఇండక్షన్ అనవచ్చు. అంటే, మనకి నిత్య వ్యవహారంలో కనిపించే కొన్ని సత్యాలను ఉదాహరణలుగా తీసుకొని, వాటి ఆధారంగా హేతువును చూపి, తద్వారా సూత్రాలను, వాటి ద్వారా సిద్ధాంతాన్ని నిర్మించడం ఇందులోని పద్ధతి.

నేను: ఓహో. అంటే – ఉదాహరణ అనగా Example or Evidence, హేతువు అంటే Reason – ఈ రెండూ భారతీయ తర్కంలో ప్రధాన అంశాలన్నమాట.

ఎడమ నేను: అవును. సిద్ధాంతాన్ని సమర్థించడానికి చూపే ఉదాహరణలను తర్కపరిభాషలో దృష్టాంతాలు అంటారు.

నేను: మరి అవాచ్యం అనే పదం తనని తాను సూచించుకోదన్న విషయాన్ని సమర్థించడానికి ఎలాంటి దృష్టాంతాలు చూపించాడు భర్తృహరి?

ఎడమ నేను: రెండు మూడు దృష్టాంతాలు చూపించాడు. అందులో మనకి బాగా తెలుసున్నది, సులువుగా అర్థమయ్యేది, ఏమిటంటే:

సర్వం మిథ్యాబ్రవీమీతి నైతద్వాక్యం వివక్ష్యతే
తస్య మిథ్యాభిధానే హి ప్రక్రాన్తోऽర్థో న గమ్యతే – వాక్యపదీయ 3.3.25

నేను: అంటే?

ఎడమ నేను: ‘సర్వం మిథ్యా బ్రవీమి’ అంటే ‘నేను చెప్పేదంతా అబద్ధమే’ అని. ఎవరైనా యిలా అంటే ‘చెప్పేదంతా’ అన్న దానిలో ఆ వాక్యం మాత్రం సూచించబడదు (ఏతత్ వాక్యం న వివక్ష్యతే). ఒకవేళ ఆ వాక్యం కూడా అసత్యమే అనుకుంటే (తస్య మిథ్యా అభిధానే హి), అప్పుడు చెప్పాలనుకున్న అర్థం అసలు పొసగదు కదా (ప్రక్రాన్తః అర్థః న గమ్యతే)! ఇది యీ శ్లోకానికి అర్థం.

నేను: ఓహ్! ఇదే కదా తప్పొప్పుల తిరకాసు!!

ఎడమ నేను: అవును.

నేను: అంటే, ‘నేను చెప్పేదంతా అబద్ధమే’ అనే వాక్యం అర్థవంతం కావాలంటే, అది తనని తాను సూచించుకోలేదని భర్తృహరి అంటున్నాడన్నమాట. అప్పుడిక తిరకాసుకి చోటు లేదు!

ఎడమ నేను: అవును. ఇందులో ‘వివక్ష్యతే’ అనేది ముఖ్యమైన పదం. భారతీయ భాషాశాస్త్రంలో వివక్షకి చాలా ప్రాముఖ్యం ఉంది. వివక్ష అంటే చెపుతున్న మాట వెనకనున్న ఉద్దేశం. ఇంగ్లీషులో Intent అనవచ్చు. ఒక పదానికి కానీ వాక్యానికి కానీ అర్థాన్ని నిర్ణయించడంలో వివక్షకి ముఖ్యస్థానం ఉంటుంది. ‘నేను చెప్పేదంతా అబద్ధమే’ అనడంలో ఉద్దేశం చెపుతున్న వ్యక్తి తానెప్పుడూ అబద్ధమే చెప్తానని. అంచేత ఆ వాక్యంలోని ‘అంతా’ అనే పదం ఆ వాక్యాన్ని సూచించే అవకాశం లేదని భాషాశాస్త్ర దృష్యా భర్తృహరి తీర్మానం!

నేను: పాశ్చాత్య తార్కికుల దృష్టిలో, ‘నేను చెప్పేదంతా అబద్ధం’ అనే వాక్యం నిజమైతే అది విరోధానికి దారి తీస్తుంది కాబట్టి ఆ వాక్యం అబద్ధమని వారి తీర్మానం. చెప్పేవాడి ఉద్దేశాన్ని అనుసరించి, ఆ వాక్యం నిజం కావాలంటే, ఆ వాక్యం తనని తాను సూచించుకోలేదని మనవాళ్ళ తీర్మానం అన్నమాట! బావుంది.

ఎడమ నేను: అవును. ఈ తేడా చాలామంది పాశ్చాత్య పండితులకు పూర్తిగా మింగుడు పడలేదు. దీని గురించి చాలామంది ఆధునిక తర్కవేత్తలు రకరకాలుగా విశ్లేషించారు. [9]

నేను: అంతా బాగానే ఉంది కానీ నాదొక సందేహం.

ఎడమ నేను: ఏమిటి?

నేను: పదానికి ఆత్మసూచన శక్తి ఉందని పాణిని చెప్పాడు కదా. భర్తృహరికూడా దాన్ని సమర్థించి చాలా ఉదాహరణలతో వివరించాడని యింతకుముందే చెప్పావు. ఇక్కడ మాత్రం అవాచ్యం అనే పదం తనని తాను సూచించదని భర్తృహరి అంటున్నాడు. అంతకుముందు చెప్పినదానికీ దీనికీ ఎలా పొసుగుతుంది?

ఎడమ నేను: చాలా మంచి ప్రశ్న వేసావు! ఈ ప్రశ్నని తనకు తానే వేసుకొని జవాబుకూడా చెప్పాడు భర్తృహరి.

నేను: అవునా!

ఎడమ నేను: ఒక శబ్దానికి తనను తాను సూచించుకోడం, వేరొక వస్తువును సూచించడం అనే రెండు శక్తులుంటాయి కానీ, ఆ రెండు శక్తులూ ఒకేసారి వ్యాపారంగా మారవు. అంటే, ఒక వాక్యంలో, సందర్భాన్ని బట్టి, ఒక శబ్దం తన స్వరూపాన్ని, లేదా ఆ శబ్దార్థాన్ని సూచిస్తుంది. రెంటినీ ఒకేసారి సూచించడం జరగదు. అదీ భర్తృహరి జవాబు.[10]

నేను: మొత్తానికి భాషలో సహజంగా ఉండే ఆత్మసూచనని కాదనకుండానే, దానివల్ల ఏర్పడే పేరడాక్సులని పరిహరించగలిగాడన్న మాట భర్తృహరి.

ప్రాచీన భారతంలో భాషాశాస్త్రం అభివృద్ధి చెందిందని వినడమే తప్ప, భాష గురించి, శబ్దార్థాలను గురించి, వాటికున్న శక్తి గురించి, ఇంత లోతుగా ఆలోచించారని తెలియదు! నిత్యజీవితంలో అలవోకగా మనం ఉపయోగించే భాష వెనక ఎంత తతంగముందో తలచుకుంటే గొప్ప ఆశ్చర్యం కలిగింది!

కుడి నేను: శబ్దం, అర్థం, వాటి మధ్యనున్న సంబంధం గురించి చాలా సేపటినుంచీ తెలుసుకొంటున్నావు కదా, ఆ రెంటి మధ్యనున్న సంబంధానికి మంచి పోలిక ఏదైనా చెప్పు చూద్దాం?

నేను: ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! వాగర్థాలనగానే గుర్తుకు వచ్చేది అర్ధనారీశ్వరులైన శివపార్వతులే.

కుడి నేను: ఎవరో చెప్పిన పోలిక కాదు, వాటి తత్త్వం నీకు బాగా వంటబట్టిందో లేదో తెలియాలంటే, నువ్వు సొంతంగా ఊహించి చెప్పాలి. నీకు తెలిసిన వేరే ఏదైనా పోలిక చెప్పు.

రెండు నిమిషాలు ఆలోచిస్తే ఒక పోలిక తట్టింది.

నేను: శబ్దార్థాలు ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మ-బొరుసుల్లాంటివి.

కుడి నేను: మంచి పోలిక చెప్పావు. బొమ్మ-బొరుసులాగే అవికూడా విడదీయ లేనివి. కానీ…

నేను: ఊఁ, కానీ?

కుడి నేను: బొమ్మ, బొరుసు విడదీయలేనివే కానీ విడివిడిగానే కనిపిస్తాయి. బొమ్మ బొరుసు కాలేదు, బొరుసు బొమ్మ కాలేదు. కానీ శబ్దార్థాలు అలా కాదు కదా. ఆత్మసూచన వల్ల ఆ రెంటి మధ్యనున్న సన్నని గీతకూడా ఒకోసారి చెరిగిపోతుంది. అలాంటి వస్తువు ఏదైనా నీకు తెలుసా?

మరికొంత సేపు ఆలోచించాను. ఏదీ తెలియలేదు.

కుడి నేను: నువ్వు మోబియస్ స్ట్రిప్ (Mobius Strip) గురించి విన్నావా?

మోబియస్ స్ట్రిప్ గురించి తెలుసు. దాని రూపం కళ్ళముందు మెదిలింది. సన్నగా పొడుగ్గా ఉన్న ఒక పేపర్ ముక్కని తీసుకొని, ఒక కొసని మెలితిప్పి, రెండో కొసతో కలిపితే ఏర్పడే లూప్.


నేను: తెలుసు, తెలుసు.

కుడి నేను: దాని ప్రత్యేకత ఏమిటో చెప్పు?

నేను: దానికి రెండు వైపులున్నట్టుగా కనిపిస్తుంది కానీ నిజానికి ఒకటే వైపుంటుంది. అంటే ఆ చుట్టుకి లోపల, పైనా రెండూ ఒకటే.

కుడి నేను: సరిగ్గా చెప్పావు. శబ్దార్థాల మధ్యనున్న సంబంధం కూడా అలాంటిదే! శబ్దార్థాల మధ్యనున్న యిలాంటి సంబంధమే వక్రతకు కారణమై, వాక్యాన్ని కావ్యంగా మారుస్తుంది. [11]

నేను: బావుంది. అంటే, శబ్దార్థాలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే రెండు వేరు పదార్థాలు కాదు, రెండుగా కనిపించే ఒకే పదార్థం అన్నమాట!

కుడి నేను: అవును. మోబియస్ మెలిక లాంటిదే ఆత్మసూచనకూడా. ఆ మెలిక ఒక్క భాషా సాహిత్యాలకే పరిమితం కాదు. కళలన్నింటిలో కనిపిస్తుంది. కళకి ఒకరకమైన జీవచైతన్యాన్నిచ్చి అద్భుతాలు సృజిస్తుంది!

నేను: అది సరే, అర్ధనారీశ్వర రూపంలో పార్వతీపరమేశ్వరులు కలిసి ఉన్నా, రెండు సగాలుగా కనిపిస్తారు కదా? ఎవరి రూపం వారికి ప్రత్యేకంగా ఉంది. మరి కాళిదాసు వాగర్థాలను వారితో పోల్చడంలో పూర్తి ఔచిత్యం ఉందంటావా?

నా ఎడమ నేను ప్రభావం నా మీద బాగానే పడినట్టుంది! బుర్రలో సందేహాలు ఊరుతూనే ఉన్నాయి. కుడి నేను చిరునవ్వు నవ్వుతూ ఒక శ్లోకం చదివింది.

త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృత మభూత్
యదేతత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం
కుచాభ్యామానమ్రం కుటిలశశి చూడాలమకుటమ్

ఇది ఆదిశంకరుల సౌందర్యలహరిలోని శ్లోకం. ఆయనగారు తల్లితో అంటున్న మాటలు. “నువ్వు శివుని శరీరంలో ఎడమ భాగాన్ని ఆక్రమించడంతో తృప్తి పడక, కుడి భాగాన్ని కూడా గ్రహించావేమోనన్న అనుమానం కలుగుతోంది సుమా! ఎందుకంటే నీ రూపమంతా అరుణవర్ణంతో మెరుస్తోంది, ముఖంలో మూడుకన్నులు కనిపిస్తున్నాయి. స్తనభారంతో వంగిన మేనిపై నెలవంక కిరీటం వెలుగుతోంది!”
ఎంత అద్భుతమైన ఊహ! అసలైన శివపార్వతుల కలయిక అంటే యిదన్నమాట!

మెల్లమెల్లగా కుడి నేను చూపించే అద్భుత లోకపు సౌందర్యలహరిలో కొట్టుకుపోవడం మొదలుపెట్టాను.

అధస్సూచికలు
ద్రవ్యగుణకర్మనిష్పత్తి వైధర్మ్యాత్ భా అభావః తమః – అని వైశేషిక సూత్రం. వైశేషిక సిద్ధాంతం ప్రకారం చీకటి అభావమే. అయితే చీకటి అనేది ఒకరకమైన గుణమని కొందరు తాత్త్వికుల వాదన. ఈ విషయమై వాదప్రతివాదాలు జరిగాయి. దీని గురించి కొంత చర్చ యీ పుస్తకంలో చూడవచ్చు: Anantlal Thakur – Origin And Developoment of The Vaisesika System, History of Science, Philosophy and Culture in Indian Civilization Vol II Part 4
మన పురాణ కథల ఆధారంగా పాశ్చాత్యులు పుట్టించిన కథ యిది.
పురాణ కథల్లో భూమిని మోసే పర్వతాలకు కులపర్వతాలని పేరు. భూమిని ఆదిశేషువు, ఆదివరాహం, ఆదికూర్మం, అష్టదిగ్గజాలు మోస్తూ ఉంటాయని కూడా పురాణాలు చెపుతాయి. అయితే అవి ఫలానా క్రమంలో ఒకదాన్ని ఒకటి మోస్తాయన్నది నా కల్పన.
“The following are the impediments to a property’s claim to be a generality, (i) A proper generality cannot belong to only one individual, (ii) If a generality is found in all and only those individuals where another generality is found, then they must not be construed as two distinct generalities, (iii) The same individual or individuals cannot be the substratum of two generalities unless one of them is totally included within the other, (iv) The category generality cannot be said to possess another generality because of the infinite regress to which that would lead, (v) If by our admission of a generality in an entity we run counter to the arguments by which that very entity was posited, we should give up that claim, (vi) Inherence combines a generality with an individual, but inherence itself cannot be combined by a further inherence; hence there is no generality in inherence”, Anantlal Thakur – Origin And Development of The Vaisesika System
దీని గురించి మరింత వివరంగా యిక్కడ చదవవచ్చు: Rajen Lakra, The Doctrine of Samavāya in Nyāya-Vaiśeṣika System, IOSR Journal Of Humanities And Social Science, Volume 22, Issue 11, Ver. 9 (November. 2017)
సరిగ్గా యిలానే, సంబంధాల వల్ల ఏర్పడే అనవస్థాదోషాన్ని ఆధునిక కాలంలో F. H. Bradley అనే బ్రిటిష్ తత్త్వవేత్త చర్చించాడు. దీనిని Bradley’s Regress అంటారు.
Srisa Chandra Vasu, The Ashtadhyayi Of Panini, 1.1.68. దీని గురించి మరింత చర్చ యిక్కడ చదవవచ్చు: Diarmuid ´O S´eaghdha, Object-Language and Metalanguage in Sanskrit Grammatical Texts
అవాచ్యమితి యద్వాచ్యం తదవాచ్యతయా యదా। అవాచ్యమిత్యవసీయేత వాచ్యమేవ తదాభవేత్॥ – వాక్యపదీయం 3.3.20
ఈ విశ్లేషణలు కొన్ని యీ క్రింద రచనలలో చూడవచ్చు:
The Philosophy of the Grammarians, Houben, Jan E. M. 1995.
Claus Oetke – Bhartrhari’s solution to the Liar and some other paradoxes – Journal of Indian Philosophy 23: 381–401,
Claus Oetke – Is the section of verses 1-29 in Vākyapadīya III.3 based on a sound theoretical motivation? – Rev. Guillermo Ockham 14 (1), 2016
Claus Oetke – Inconsistency, Paradox and Linguistic Content. Did Bhartṛhari offer a solution for Truth-Paradoxes? – Rev. Filosofía Univ. Costa Rica, LII (134), 9-39, Septiembre-Diciembre 2013
Ahmed Alwishah, David Sanson: “The Early Arabic Liar: The Liar Paradox in the Islamic World from the Mid-Ninth to the Mid-Thirteenth Centuries CE Vivarium 47 (2009)
Evgeniya A. Desnitskaya – ANTINOMY OF ONE AND MANY IN BHARTRHARI’S VĀKYAPADĪYA – ACTA ORIENTALIA VILNENSIA 7
ఈ వివరణ కనిపించే వాక్యపదీయంలోని శ్లోకాలు: ‘న చ వాచకరూపేణ’ – 3.3.29, ‘వ్యాపారస్యాపరో’ – 3.3.28, ‘భేదేనావగృహీతౌ’ – 1.1.58
ఈ మోబియస్ స్ట్రిప్ పోలిక ఎ.కె.రామానుజన్‌ది. Indian Poetics అనే వ్యాసంలో యిలా అంటారు:
‘The Swiss linguist Ferdinand de Saussure once said that the relationship of significant and signifie, the signifier and the signified, the forms and the meaning of words, are distinct and inseparable like the two sides of a piece of paper, cut one and you cut the other in the same curve. This inseparableness, as Indian thinkers have also pointed out, is not peculiar to poetry. But in poetic utterance, the relationship becomes usable for a further dimension. A Mobius band, made up of two-sided paper, is an object that has only one surface. The flowing of two surfaces into one continuum is made possible by one little twist, the obliquity in the use of language vakrokti, the crooked way of saying it, the bend in language or the oblique is the source of the poetic.’
-Ramanujan, A.K., and Edwin Gerow – ‘Indian Poetics’ – The Literatures of India: An Introduction, edited by Edward C. Dimock et al
--------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, February 3, 2019

నేనొక చిత్రమైన చిక్కుముడి: 3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం


నేనొక చిత్రమైన చిక్కుముడి: 

3. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం





సాహితీమిత్రులారా!

ఇదం శ్రేష్ఠం జ్యోతిషాం జ్యోతిరుత్తమం విశ్వజిద్ ధనజిద్ ఉచ్యతే బృహత్।
విశ్వభ్రాడ్ భ్రాజో మహి సూర్యో దృశ ఉరు పప్రథే సహ ఓజో అచ్యుతమ్ ॥

                                                                                                                -ఋగ్వేదం 10-170-03

పొద్దు పొడిచింది. తూర్పు దిక్కున సూర్యకిరణాలు ప్రసరించాయి. శ్రేష్ఠుడు, జ్యోతులన్నింటిలో గొప్ప జ్యోతి, విశ్వాన్నీ సంపదనూ జయించినవాడు, తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగించే మహిమాన్వితుడూ అయిన సూర్యుని బ్రహ్మాండమైన కాంతి ప్రపంచమంతటా వ్యాపించి, అందరికీ దృష్టిని ప్రసాదించింది.

నేను తిరిగి ప్రయాణం ప్రారంభించాను. ఆత్మసూచన గురించీ, అది సృష్టించే పేరడాక్సుల గురించీ నా ‘ఎడమ నేను’ చెప్పిన విశేషాలను రాత్రి చాలా సేపు ఆలోచించాను. ఒక పదం కాని వాక్యం కాని తన గురించి తాను సూచించుకోగలదా? ఒక ప్రతిపాదన కచ్చితంగా నిజమో అబద్ధమో అయి తీరాలా? ఆ పల్లెటూరి ఆసామి గడ్డం సంగతి ఏమై ఉంటుంది? లాజిక్కుకీ గణితానికీ ఉన్న సంబంధం ఏమిటి? రసెల్ తన ప్రయాసలో విజయాన్ని పొందాడా? మాటలకీ ఆలోచనలకీ మధ్యనున్న సంబంధం ఎలాంటిది? ఆలోచన గురించి నా ఆలోచనలు యిలా సాగిపోయాయి.

తర్కాన్ని గురించి పాశ్చాత్యుల ఆలోచనలు సమంజసంగానే అనిపించాయి నాకు. కానీ ఎందుకో అవి పూర్తి సత్యాన్ని ఆవిష్కరించగలవనే నమ్మకం మాత్రం కలగటం లేదు. ఆ తర్కంలో ఆలోచన ముక్కుసూటిగా ఒక మార్గంలో మునుముందుకి సాగిపోతుంది. అదే ఒక వంపు తిరిగి, తన వైపుకు, తన లోపలకు తిరుగు ప్రయాణం మొదలుపెడితే, మెలిక పడ్డట్టే! అలాంటి మెలికలే తిరకాసులకు కారణమని అనిపించింది.

“ఏదో దీర్ధంగా ఆలోచిస్తున్నావ్?”

సాగిపోతున్న నా ఆలోచనకు అడ్డుకట్టూ వేస్తూ ఎడమ వైపునుంచి ప్రశ్న. ఆ గొంతు ఇప్పటికి బాగానే పరిచయమయింది కాబట్టి యీసారి నేను ఉలికిపడలేదు.

నేను: నిన్న నువ్వు చెప్పిన సంగతుల గురించే.

ఎడమ నేను: ఏంటి?

నేను: లాజిక్కు విషయమై పాశ్చాత్య దృక్పథంలో ఒక సూటిదనం ఉంది. అది నిక్కచ్చిదనాన్నీ, నిర్దిష్టతనీ కోరుకుంటుంది.

ఎడమ నేను: అవును. లాజిక్కు ఎప్పుడైనా నిక్కచ్చిగానే ఉండాలి కదా. లేకపోతే దాని వల్ల ఉపయోగం ఏముంది చెప్పు?

నేను: కానీ ప్రపంచ వ్యవహారంలో అలాంటి కచ్చితత్వం ఉంటుందా? మచ్చుకి, ఆ క్షురకుని ఉదంతమే తీసుకుందాం. తమకి తాము గడ్డం గీసుకోని వాళ్ళకు తను గీస్తాను అనే నియమం అతని ఉద్దేశంలో యితరులకు మాత్రమే వర్తిస్తుంది. అలా అనుకున్నప్పుడు అందులో తిరకాసు ఉండదు కదా!

ఎడమ నేను: అవును. అది చూసే దృక్పథం బట్టి ఉంటుంది. సందర్భాన్ని అనుసరించి, చెప్పిన వారి ఉద్దేశాన్ని ఊహించి, దాని బట్టి వాక్యానికి అర్థం చెప్పుకోవచ్చు అనడం ఒక రకమైన పరిష్కారం. కానీ గణితం, తర్కం లాంటి శాస్త్రాలలో సమయానికి తగు మాటలాడెనే అన్నట్టుగా–ప్రతిపాదనలను కానీ నియమాలను కానీ సందర్భానుసారంగా మార్చుకోవడం అంతగా కుదరని పని. క్షురకుని నియమం ఆ ఊళ్లో అందరికీ వర్తిస్తుందన్నప్పుడు, ప్రత్యేకంగా తనకు వర్తించదని చెపితే తప్ప అతనిక్కూడా స్వయంగా వర్తింపజేయాల్సి వస్తుంది. అలాంటి స్వయంసూచన తిరకాసుకే దారి తీస్తుంది.

నేను: అలా అంటావా. సరే, ఇంతకీ దృక్పథం అంటే గుర్తుకొచ్చింది. ఈ ఆత్మసూచన గురించీ, తిరకాసుల గురించీ మన భారతీయుల దృక్పథం ఏమిటన్నది మాట్లాడుకుందామన్నావు కదా. దాని విషయమై చెప్పు.

ఆత్మసూచన, తిరకాసులు: భారతీయుల చింతన
ఎడమ నేను: ఆఁ, అవును కదా! భారతీయ తత్త్వవేత్తలు కూడా ఈ విషయాల గురించి శాస్త్రీయంగా ఆలోచించారు.

నేను: భారతీయ తత్త్వమంతా చాలా మార్మికతతో నిండిపోయి ఉంటుందనుకున్నాను, అందులో శాస్త్రీయతకూ, తర్కానికీ చోటుందా?

ఎడమ నేను: నీకు ప్రాచీన భారతంలో అభివృద్ధి చెందిన శాస్త్రాల గురించి బొత్తిగా తెలిసినట్టు లేదు.

నేను: నువ్వు కూడా ‘అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష’ అనే వాళ్ళతో గొంతు కలుపుతున్నావా ఏమిటి!

ఎడమ నేను: లేదు. కానీ మన గురించి మనం కాస్తయినా తెలుసుకోడం అవసరం అంటున్నాను. భారతదేశంలో తత్త్వ చింతనతో పెనవేసుకుని జ్ఞానమీమాంస (Epistemology), సత్త్వమీమాంస (Ontology), తర్కం (Logic); ఈ మూడు శాస్త్రాలూ అభివృద్ధి చెందాయి. వాటితో పాటు కలిసిమెలిసి ఎదిగిన మరొక ముఖ్యమైన శాస్త్రం భాషాశాస్త్రం. సరే, నీకు అరిస్టాటిల్, ప్లాటో పేర్లు తెలుసన్నావు కానీ మేధాతిథి గౌతముడు, కణాదుడు, నాగార్జునుడు; వీరి పేర్లు విన్నావా?

తల అడ్డంగా ఊపాను.

నేను: ఎవరు వాళ్లు? తత్త్వవేత్తలా?

ఎడమ నేను: అవును. ‘ఆన్వీక్షికి’ అనే పేర తర్కాన్ని మొట్టమొదట ఒక శాస్త్రంగా, విద్యగా రూపొందించినది మేధాతిథి గౌతముడని అంటారు. మేధాతిథి ప్రస్తావన భాసుని ప్రతిమా నాటకంలో వస్తుంది.

నేను: ఓ! భాసుడు కాళిదాసు కన్నా ముందరివాడు కదా!

ఎడమ నేను: అవును. అంతేకాదు నాలుగు విద్యలలో ఆన్వీక్షికిని ఒక విద్యగా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. ఆన్వీక్షికికే హేతువిద్య, హేతుశాస్త్రం, తర్కవిద్య, వాదవిద్య అనే పేర్లు కూడా ఉన్నాయి. చరకసంహిత, పాణిని అష్టాధ్యాయి లాంటి గ్రంధాలలో ఆన్వీక్షికి ప్రతిపాదించిన హేతువాద పద్ధతుల ఉపయోగాన్ని గమనించవచ్చు.[1] ఆ పద్ధతులు మన దర్శనాలలో కూడా కనిపిస్తాయి

నేను: దర్శనాలంటే?

ఎడమ నేను: భారతదేశంలో రకరకాల తత్త్వ సిద్ధాంతాలు దర్శనాలుగా అభివృద్ధి చెందాయి. ఒక్కో దర్శనం మన గురించీ, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ ఒకొక్క విలక్షణమైన దృక్పథాన్ని ప్రతిపాదించింది, సిద్ధాంతం చేసింది.

నేను: ఓహో!

ఎడమ నేను: ఇందులో వేదోపనిషత్తులను ప్రమాణంగా తీసుకున్న దర్శనాలు కొన్ని, వీటిని ఆస్తిక దర్శనాలంటారు. వేదాన్ని ప్రమాణంగా తీసుకోని దర్శనాలు మరికొన్ని, వీటిని నాస్తిక దర్శనాలంటారు. సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరూ ముఖ్యమైన ఆస్తిక దర్శనాలు. చార్వాకం లేదా లోకాయతం, బౌద్ధం, జైనం మొదలైనవి నాస్తిక దర్శనాలు.

నేను: బౌద్ధం, జైనం మతాలు కదా, అవి దర్శనాలా?

ఎడమ నేను: ఆ రెండూ ప్రత్యేకమైన మతాలుగా కూడా అభివృద్ధి చెందాయి. వాటి వెనకనున్న తాత్త్విక సిద్ధాంతాలు దర్శనాలుగా రూపొందాయి. సాంఖ్య దర్శనాన్ని కపిలుడు స్థాపించాడు. యోగాన్ని పతంజలి, న్యాయాన్ని అక్షపాద గౌతముడు, వైశేషికాన్ని కణాదుడు, పూర్వమీమాంసను జైమిని, ఉత్తరమీమాంసను బాదరాయణుడు స్థాపించారు. లోకాయతాన్ని బృహస్పతి, బౌద్ధాన్ని బుద్ధుడు స్థాపించారు. జైన మతానికి మొదలు ఋషభనాథుడని అంటారు. కాని దాన్ని దర్శనంగా తీర్చిదిద్ది ప్రచారం చేసినది మహావీరుడు.

నేను: ఓహో! ఇందాక మేధాతిథి గౌతముడన్నావు. ఇప్పుడు అక్షపాద గౌతముడా!

ఎడమ నేను: అవును. కచ్చితంగా చెప్పలేం కానీ ఈ యిద్దరూ ఒకరే కావచ్చు.[2] వీళ్ళ పేర్లన్నీ చిత్రంగానే ఉంటాయి! కపిలుడంటే గోరోజనం రంగులో ఉండేవాడని అర్థం. అక్షపాదుడు అంటే కాళ్లలో కన్నులున్నవాడు. కణాదుడు అంటే కణాలను తినేవాడు. పతంజలి అంటే అంజలిలో పడ్డవాడు, లేదా అంజలిస్తూ పడ్డవాడు!

నేను: భలే!

ఎడమ నేను: గౌతముడు అనే పేరు చాలా చోట్ల వస్తుంది. అహల్య భర్త గౌతముడు, మేధాతిథి గౌతముడు, అక్షపాద గౌతముడు, గౌతమ బుద్ధుడు, మహావీరుని ముఖ్యశిష్యుడు మళ్లీ గౌతమ స్వామి, ఇలా. పేర్ల సంగతి అలా ఉంచితే, యీ దర్శనాలన్నీ తత్త్వ విచారణలో తర్కాన్ని అంతో ఇంతో వాడినవే.

నేను: మరి నాగార్జునుడి సంగతి ఏమిటి?

ఎడమ నేను: నాగార్జునుడు బౌద్ధ దర్శనకారులలో ముఖ్యుడు, గొప్ప తార్కికుడు కూడా. దర్శనాలలో చార్వాకం, బౌద్ధం తర్కానికి ప్రముఖ స్థానాన్ని కల్పించి, అందులో చాలా కృషి చేసాయి. భారతీయ తర్కాన్ని ఒక పూర్తి శాస్త్ర స్థాయికి అభివృద్ధి చేసినది మాత్రం న్యాయ దర్శనం అని చెప్పాలి. ఈ దర్శనాన్ని అనుసరించేవారిని నైయాయికులంటారు. న్యాయ దర్శనాన్ని న్యాయశాస్త్రమనీ, తర్కశాస్త్రమనీ కూడా కొందరు వ్యవహరిస్తారు. వైశేషికులు, జైనులు కూడా తర్కానికి తమ దర్శనాలలో ప్రముఖ స్థానాన్ని యిచ్చారు.

నేను: అదేమిటి! తర్కానికి న్యాయాన్యాయాలతో పనిలేదన్నావు నిన్న. ఇప్పుడేమో న్యాయ దర్శనమే తర్కశాస్త్రం అంటున్నావు!

ఎడమ నేను: బాగా గుర్తుపెట్టుకున్నావే! ఈ ప్రశ్న నువ్వు వేస్తావా లేదా అని అనుకున్నాను. ఈ కాలంలో మనకి ‘న్యాయం’ అనే పదానికి Morals/Ethics అనే అర్థాలు వాడుకలోకి వచ్చేసాయి. నిన్న నేనన్న మాట ఆ అర్థంలోనే. ప్రాచీనకాలంలో దానికా అర్థం లేదు. Morals/Ethics అనే పదాలకు కచ్చితమైన పదాలు సంస్కృతంలో లేవనే చెప్పవచ్చు. అన్నిటికన్నా దగ్గరగా వచ్చేది ‘నీతి’.

నేను: ఊఁ, మరి న్యాయమంటే?

ఎడమ నేను: న్యాయం అంటే ప్రతిపాదితమైన ఒక విషయాన్ని సిద్ధింపజేయడానికి ఉపయోగించే విద్య అని అర్థం.[3] అంటే ప్రతిపాదనలను సిద్ధాంతంగా నిరూపించే శాస్త్రం. అందుకే అది తర్కానికీ హేతువుకూ చాలా సన్నిహితం. ఇది ప్రధానంగా హేతుబద్ధమైన వాద పద్ధతిని నిర్వచిస్తుంది. ఈ పద్ధతిని అనుసరించే పూర్వం వాద ప్రతివాదాలన్నీ జరిగేవి.

నేను: ఓహో! అయితే గ్రీకు తత్త్వవేత్తల్లాగానే యీ నైయాయికులు కూడా తర్కానికి చాలా గొప్ప స్థానాన్ని యిచ్చారన్నమాట.

ఎడమ నేను: ముఖ్యస్థానమే యిచ్చారు. కానీ పాశ్చాత్య తత్త్వవేత్తలు కొందరు భావించినట్టు, తర్కమే పరమార్థం అని భావించలేదు. అక్కడే పాశ్చాత్య భారతీయ చింతనలలో ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది., మనవాళ్లు తర్కాన్ని ప్రధానంగా వాదానికి ఉపయోగపడే శాస్త్రంగానే వినియోగించారు తప్ప, తర్కమే పరమ సత్యమనే భావన కనిపించదు. న్యాయ వైశేషికులు కూడా తర్కాన్ని తమ తత్త్వచింతనకు ఆలంబనగా, ఉపకరణంగా వినియోగించారు తప్పించి, అదే పరమ సత్యమని భావించలేదు.

నేను: ఓహో!

ఎడమ నేను: తర్కం,హేతువు కూడా మానవ బుద్ధినుంచి పుట్టేవేననీ, మానవ బుద్ధి పరిమితమైనదనీ భావించడం వల్ల కాబోలు, తర్కాన్నీ హేతువునూ అధిగమించిన పరమ సత్యం కోసం భారతీయ తత్త్వవేత్తలు తమ అన్వేషణ సాగించారు. అంత మాత్రాన భారతీయులు తర్కానికి తక్కువ స్థానం యిచ్చారని అనుకోవడం పెద్ద తప్పే అవుతుంది. తత్త్వసిద్ధాంతాల ప్రతిపాదనలో, తప్పొప్పుల విచారణలో, వాద ప్రతివాదాలలో తర్కానికి తిరుగులేని ప్రాధాన్యం ఉంది. మనకు లభిస్తున్న తత్త్వ వాఙ్మయమంతటా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

నేను: ప్రాచీనకాలంలో జ్యోతిషం, గణితం, వైద్యం కూడా శాస్త్రాలుగా అభివృద్ధి చెందాయి కదా భారతదేశంలో?

ఎడమ నేను: అవును. అవికూడా ప్రాచీన భారతంలో అభివృద్ధి చెందిన శాస్త్రాలే. అయితే వాటిలో తత్త్వచింతన తక్కువ. అవి వేదాలలో ఉన్న యజ్ఞయాగాదులను సరిగా ఆచరించడానికి ఏర్పడ్డ శాస్త్రాలు. వేదాన్ని అర్థం చేసుకోడానికి పుట్టిన మరొక శాస్త్రం భాషాశాస్త్రం. అయితే అనంతరం అది తాత్త్విక భూమికతో స్వతంత్రమైన గొప్ప శాస్త్రంగా ఎదిగింది.

నేను: అలాగా.

ఎడమ నేను: ఒకరకంగా, తత్త్వ విచారంలో పాశ్చాత్యులు తర్కానికీ ఆలోచనకూ యిచ్చిన స్థానాన్ని భారతీయులు వాక్కుకు, శబ్దానికి యిచ్చారని చెప్పవచ్చు. ఆరు వేదాంగాలలో నాలుగు అంగాలయిన శిక్ష, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం–భాషకు సంబంధించినవే కావడం ఇందువల్లనే. అరిస్టాటిల్ ఆలోచనే దేవుడని అన్నట్టుగా, భారతీయులు వాక్కును పరబ్రహ్మగా భావించారు. వేదంలో కూడా దీనికి మూలాలు కనిపిస్తాయి.

నేను: వేదాలలో అగ్ని, సూర్యుడు, వరుణుడు మొదలైన ప్రకృతి శక్తులే కదా ప్రధాన దేవతలు?

ఎడమ నేను: అవును, ఆ వేదాలలోనే అభౌతికమైన వాక్కును కూడా ఒక దేవతగా భావించడం, మన ప్రాచీనులు వాక్కుకిచ్చిన అత్యున్నత స్థానాన్ని ప్రతిఫలిస్తుంది.[4] యాస్కుని నిరుక్తం, పాణిని అష్టాధ్యాయి, దానికి పతంజలి మహాభాష్యం, భర్తృహరి వాక్యపదీయం, వీటికి అనేకులు రచించిన వ్యాఖ్యానాలు; యిలా ప్రాచీన భారతంలో భాషాశాస్త్రం సర్వోత్కృష్టమైన అభ్యున్నతిని సాధించింది. వ్యాకరణం శబ్దబ్రహ్మాన్ని చేరుకొనే ఒక స్వతంత్ర తాత్విక దర్శనంగా కూడా పరిగణించబడింది.

నేను: ఓహో! మొత్తానికి భారతీయ తత్త్వచింతన గురించి కనీసం కొన్ని పేర్లయినా ఇవాళ తెలుసుకోగలిగాను. ఇంతకీ అసలు తిరకాసుల సంగతి ఏమయింది? ముఖ్యంగా ఆత్మసూచనకి సంబంధించిన తప్పొప్పుల తిరకాసుల్లాంటివి మరి మన శాస్త్రాలలో కాని, దర్శనాలలో కాని ఎక్కడయినా కనిపిస్తాయా?
బౌద్ధుల తర్కం
ఎడమ నేను: అక్కడికే వస్తున్నా. ఇప్పటి వరకూ మనకు లభిస్తున్న ఆధారాలను బట్టి, ఆత్మసూచన ద్వారా ఏర్పడే తిరకాసు ప్రస్తావన మొట్టమొదటగా బౌద్ధుల దీఘనక సుత్త అనే గ్రంథంలో కనిపిస్తుంది.

నేను: దీఘనక సుత్త?

ఎడమ నేను: అది పాళీ భాష. సంస్కృతంలో దీర్ఘనఖ సూత్రం అని. బౌద్ధ వాఙ్మయంలో వినయ పిటక, సుత్త పిటక, అభిదమ్మ పిటక అనే మూడు అతి ముఖ్యమైన గ్రంథాలున్నాయి. వాటిని తిపిటకాలంటారు. అందులో సుత్తపిటకలో వచ్చే ఒకానొక సూత్రం దీర్ఘనఖ సూత్రం. దీర్ఘనఖుడనే పరివ్రాజకునికి బుద్ధుడు చేసే బోధ ఇందులో ప్రధాన విషయం.

నేను: ఓహో. దీర్ఘనఖుడంటే పొడవాటి గోళ్ళున్నవాడనే కదా. ఈ పేరు కూడా విచిత్రంగా ఉంది!

ఎడమ నేను: అవును! ఒకరోజు దీర్ఘనఖుడు బుద్ధుని దగ్గరకి వచ్చి అతనితో యిలా అంటాడు, ‘అహం హి భో గోతమ ఏవమ్ వది, ఏవమ్ దిట్టిః సబ్బమ్ మే న ఖమతి.’

నేను: ఇది కూడా పాళీ భాషేనా? సంస్కృతంలా ఉంది కానీ అర్థం కావడం లేదు.

ఎడమ నేను: అవును యిది పాళీ భాషే. ప్రాకృత సంస్కృత భాషల మిశ్రమం పాళీ. ఆ వాక్యానికి అర్థం ‘ఓ గౌతమా! ఏ దృక్పథమూ నాకు సరిపడదు. అదే నా దృక్పథం.’

నేను: ఓహో.

ఎడమ నేను: అప్పుడు గౌతముడు ఒక చిరునవ్వు నవ్వి యిలా ప్రశ్నిస్తాడు, ‘యపి ఖో తే ఏష అగ్గివెస్సన దిట్టిః సబ్బమ్ మే న ఖమతి’తి, ఏషాపి తే దిట్టిః న ఖమతి?’ అంటే, ‘ఓ అగ్గివెస్సన! సరే. మరి, ‘ఏ దృక్పథమూ నాకు సరిపడదు’ అనే యీ నీ దృక్పథం నీకు సరిపడుతుందా?’ అని.

నేను: ఈ అగ్గివెస్సన ఎవరు?

ఎడమ నేను: దీర్ఘనఖునికే అగ్గివెస్సన అనే పేరు కూడా ఉంది, అంటే అగ్నివైశ్యాయనుడు. ఇంతకీ ఇందులో తొంగిచూస్తున్న తిరకాసును గుర్తించావా?

నేను: ఓ! తప్పొప్పుల తిరకాసులాంటిదే కదా. ‘ఏ దృక్పథమూ నాకు సరిపడదు’ అనేది కూడా ఒక దృక్పథమే. మరి, అది చెప్పిన అగ్గివెస్సనునికి ఆ దృక్పథం సరిపడుతుందా సరిపడదా? ఒకవేళ సరిపడితే, అది కూడా ఒక దృక్పథమే కాబట్టి సరిపడకూడదు. ఒకవేళ సరిపడకపోతే, అది అతని దృక్పథం ఎలా అవుతుంది? ఈ తిరకాసు కూడా ఆత్మసూచన చలవే కదా!

ఎడమ నేను: సరిగ్గా కనిపెట్టావు. అయితే యిక్కడ బుద్ధుని ఉద్దేశం దీర్ఘనఖునితో తార్కిక వాదన చేయడం కాదు. ఏదైనా ఒక దృక్పథాన్ని బలంగా నమ్మితే, అది మన దృష్ణిని ఎలా సంకుచితం చేస్తుందో చెప్పడానికి అతనా ప్రశ్న వేసాడు. అదే విషయాన్ని విపులంగా ఆ సూత్రంలో దీర్ఘనఖునికి బోధిస్తాడు బుద్ధుడు.

నేను: అటు పడమట దేశాలవారికీ యిటు భారతీయులకూ ఒకే రకమైన తిరకాసు గురించిన ఆలోచన రావడం అబ్బురపరిచే విషయమే![5] ఇక్కడ బుద్ధునిది తర్కదృష్టి కాదన్నావు సరే. మరి శాస్త్రీయంగా ఈ తిరకాసు గురించి ఆలోచించిన వాళ్ళెవరయినా ఉన్నారా?

ఎడమ నేను: ఉన్నారు. దిఙ్నాగుడనే అతని పేరు విన్నావా?

నేను: దిఙ్నాగుడా?

ఎడమ నేను: బౌద్ధ తత్త్వవేత్తలలో దిఙ్నాగుడు ఒక గొప్ప తార్కికుడు. భారతీయ తర్కశాస్త్రానికి పునాదులు వేసిన వాళ్లలో ముఖ్యుడు. తర్వాతి కాలంలో ధర్మకృతివంటి బౌద్ధ తత్త్వవేత్తలే కాకుండా నైయాయికులు కూడా ఇతని తర్కం చేత చాలా ప్రభావితులయ్యారు.

నేను: ఓహో! ఇతను తప్పొప్పుల తిరకాసు గురించి చెప్పాడా?

ఎడమ నేను: అవును. ప్రమాణ సముచ్చయ, హేతుచక్ర, ఆలంబన పరీక్ష, న్యాయముఖ, మొదలైన అనేక గ్రంథాలను దిఙ్నాగుడు రచించాడు. న్యాయముఖలో తప్పొప్పుల తిరకాసు గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.

నేను: న్యాయముఖ అంటే?

ఎడమ నేను: న్యాయముఖ అంటే న్యాయశాస్త్ర పరిచయ గ్రంథం. ఒక సిద్ధాంతం గురించి వాదప్రతివాదాలు జరిగేటప్పుడు అవతలివారి వాదంలో దోషాన్ని ఎత్తిచూపితే వారి వాదం తప్పని తర్కబద్ధంగా నిరూపించవచ్చు. అలాంటి రకరకాల దోషాలను తర్కశాస్త్రం వివరిస్తుంది. వాటిలో స్వవచన విరోధం (self contradiction) అనే దోషాన్ని తొలిసారి పేర్కొన్నది దిఙ్నాగుడు.

నేను: అంటే తన వేలితో తన కన్నే పొడుచుకోడం అన్నమాట!

ఎడమ నేను: అవును. అలాంటి స్వవచన విరోధానికి దిఙ్నాగుడొక ఉదాహరణ వాక్యం చెపుతాడు. ‘సర్వముక్తమ్ మృషా’, అంటే ‘చెప్పబడిన అన్ని మాటలూ అబద్ధమే’ అని.[6]

నేను: ఇది ‘నే చెప్పే మాటలన్నీ అబద్ధాలే’ అన్న వాక్యంలాంటిదే కదా?

ఎడమ నేను: అవును. ఇందులో ఉన్న తిరకాసు గమనించావా?

నేను: ఆ వాక్యం నిజమయితే, ‘అన్ని మాటల’లో ఆ చెపుతున్న మాట కూడా ఉండాలి. అప్పుడా ఆత్మసూచన వల్ల అది కూడా అబద్ధమే అవ్వాలి.

ఎడమ నేను: కానీ ఆ వాక్యం అబద్ధమైతే?

నేను: అబద్ధమైతే అందులో తిరకాసేం లేదు. కొన్ని మాటలు మాత్రమే అబద్ధం కావచ్చును. అంచేత ఇది అరతిరకాసన్న మాట!

ఎడమ నేను: సరిగ్గానే పోల్చుకున్నావు. ‘సర్వముక్తమ్ మృషా’ అన్న వాక్యం స్వవచన విరోధం. కాబట్టి అది నిజం కావడానికి వీల్లేదు, అబద్ధమే అవ్వాలి. అయితే దిఙ్నాగుడు దానిని అబద్ధం అని కాకుండా దోషం అన్నాడు. వాదంలో ఎవరైనా అలాంటి స్వవచన విరోధానికి పాల్పడితే, దాన్ని ప్రతివాదులు ఎత్తి చూపి వారి వాదాన్ని ఖండించవచ్చు.

నేను: అంటే తర్కసమ్మతం కాని వాదనకు యిదొక ఉదాహరణ అన్న మాట.

ఎడమ నేను: అవును. దిఙ్నాగుడి తర్వాత స్వవచనవిరోధానికి ఉదాహరణలుగా యింకొన్ని ఆత్మసూచక వాక్యాలు తర్కశాస్త్రంలో కనిపిస్తాయి. అందులో ప్రసిద్ధమైనది ‘నేను గొడ్రాలి కొడుకును’ అనేది. న్యాయశాస్త్రంలో, ఒక సిద్ధాంతాన్ని నిరూపించేందుకు హేతువు చాలా ముఖ్యం. ప్రతిపాదించిన హేతువులో లోపం ఉంటే దానిని హేత్వాభాస అంటారు, అంటే హేతువుగా అనిపిస్తుంది కానీ నిజానికి హేతువు కాదని అర్థం. అలాంటి హేత్వాభాసలలో విరోధం ఒకటని న్యాయశాస్త్రం పేర్కొంది. చేసిన సిద్ధాంతానికి వ్యతిరేకమైన హేతువును చెప్పినప్పుడు దానిని విరోధం అంటారు. ఇది కూడా ఒకరమైన స్వవచనవిరోధమే.

నేను: ఓహో! ప్రాచీనకాలంలో హేతువాదానికున్న ప్రాముఖ్యం నాకిప్పుడు కొద్ది కొద్దిగా బోధపడుతోంది.

ఎడమ నేను: హేతువుకూ తర్కానికీ శాస్త్ర చర్చలో చాలా గొప్ప స్థానమే ఉంది. అయితే ఆ హేతు తర్కాలను పరమ సత్యాలని అంగీకరించకుండా వాటిని కూడా ప్రశ్నించి, వాటి పరిమితుల గురించి తార్కికంగానే ఆలోచించే విస్తృతమైన విచారధార కూడా భారతదేశంలో కనిపిస్తుంది.

నేను: ఏమిటీ! తర్కానికున్న పరిమితుల గురించి తార్కికంగా ఆలోచించడమా?!

ఎడమ నేను: అవును. దీనికొక మంచి ఉదాహరణ ‘చతుష్కోటి‘. బౌద్ధుల తర్కంలో చాలా విచిత్రంగానూ, పెద్ద తిరకాసుగానూ కనిపించే అంశమిది. దీని గురించి ఆధునిక కాలంలో కూడా చాలామంది మేధావులు తర్జనభర్జనలు పడ్డారు.

నేను: చతుష్కోటి అంటే నాలుగు కోట్లు అనా?

ఎడమ నేను: కాదు. ఇక్కడ కోటి అంటే కోణం లేదా అంచు అని అర్థం ఉంది. చతుష్కోటి అంటే నాలుగంచులు లేదా నాలుగు కోణాలు. ఒక ప్రతిపాదనకు సంబంధించిన సత్యాసత్యాల నిర్ణయంలో నాలుగు రకాల కోణాలను చర్చించడం చతుష్కోటి.

నేను: ఏమిటా నాలుగు కోణాలు?

ఎడమ నేను: చేసిన ప్రతిపాదన 1. సత్యమా? 2. అసత్యమా? 3. సత్యమూ అసత్యమూ రెండూనా? 4. సత్యమూ అసత్యమూ రెండూ కాదా? అనేవి ఆ నాలుగు కోణాలు.

నా కళ్ళముందు నాలుగు చుక్కలు మెరిసాయి! నిజంగా యిది పెద్ద తిరకాసులాగానే ఉందే అనుకున్నాను. ఒక ప్రతిపాదన అయితే సత్యం కావాలి లేదా అసత్యం అవ్వాలి కదా! అరిస్టాటిల్ సూత్రం గుర్తుకొచ్చింది. అతను మూడో దారి లేదన్నాడు. ఇక్కడ చూస్తే మూడు కాదు నాలుగు మార్గాలున్నట్టున్నాయి!

ఎడమ నేను: అవును. అటు పడమటన అరిస్టాటిల్ ‘మూడో దారి లేదు’ అని సూత్రీకరిస్తే, ఇంచుమించు అదే కాలానికి, లేదా అంతకు కాస్త ముందరో, యిటు మనవాళ్ళు మూడు కాదు నాలుగు మార్గాలను చూపించారన్నమాట!

వినడానికి అద్బుతంగా ఉన్నా అదెలాగో నాకు బోధపడలేదు. ఒక ప్రతిపాదన నిజమో కాదో అన్నది కదా తర్కంలో ముఖ్యమైన విషయం. నిజం కాకపోతే అబద్ధం కావాలి. రెండూ కాలేదు అనుకున్నా అలాంటి ప్రతిపాదనను చర్చించడం అనవసరం. నిజమూ అబద్ధమూ కూడా అవుతుందా అని చర్చ ఏమిటి?

ఎడమ నేను: నీ గందరగోళం పోవాలంటే, చతుష్కోటిని బౌద్ధులు ఎందుకు ఎలా తమ వాదనలో ఉపయోగించారో తెలుసుకోవాలి.

నేను: చెప్పుమరి!

ఎడమ నేను: ఇంతకు ముందు చెప్పుకున్న సుత్తపిటకంలోనే సంయుత్త నికాయ అనే భాగంలో అభ్యాకత సంయుత్త సుత్తం అని ఉంది. చతుష్కోటి ప్రస్తావన బహుశా మొదటిసారి అందులోనే కనిపిస్తుంది. బుద్ధుడిని ఒక రాజు, ‘చనిపోయిన తర్వాత కూడా తథాగతుడు ఉంటాడా?’ అని అడుగుతాడు. దానికి బుద్ధుడు, ‘ఉంటాడని చెప్పలేము’ అంటాడు. ‘అయితే ఉండడా?’ అని అడుగుతాడు రాజు. దానికి బుద్ధుడు, ‘ఉండడనీ చెప్పలేము’, ‘ఉంటాడూ ఉండడూ కూడా అనీ చెప్పలేము’, ‘ఉండడమో, ఉండకపోవడమో చెప్పలేమనీ చెప్పలేము’ అని అంటాడు.

నేను: ఇదేదో వితండవాదంలా ఉంది! అయితే ఉండాలి, లేకపోతే ఉండకుండా పోవాలి. పోనీ ఉండడమో ఉండకపోవడమో చెప్పలేమనైనా చెప్పాలి. అంతే కాని ‘ఉంటాడు, ఉండడు కూడా అని చెప్పలేం’, ‘ఉండడమో, ఉండకపోవడమో చెప్పలేమనీ చెప్పలేం’ ఏమిటి? వాటికసలు అర్థముందా?

నా గొంతులో అసహనాన్ని నా ఎడమ నేను పసిగట్టినట్టుంది. నింపాదిగా సముదాయిస్తున్నట్టుగా చెప్పడం మొదలుపెట్టింది.

ఎడమ నేను: సరే. ఇప్పుడు నేను కొన్ని ప్రతిపాదనలు చేస్తాను, దానికి నువ్వేమంటావో చెప్పు.

నేను: అలాగే, ఏమిటవి?

ఎడమ నేను: ఒక ఊసరవెల్లి, తానున్న చోటును బట్టి రంగులు మారుస్తుంది. మారుస్తుందా?

నేను: అవును మారుస్తుంది. నిజమే!

ఎడమ నేను: సరే. ఒక బల్లి, తానున్న చోటును బట్టి రంగులు మారుస్తుందా మార్చదా?

నేను: మార్చదు. అదెప్పుడూ ఒకే రంగులో ఉంటుంది.

ఎడమ నేను: ఇప్పుడిది చూడు. ఒక ఏడు, తానున్న చోటును బట్టి రంగులు మారుస్తుంది. దీనికేమంటావు? మారుస్తుందా, మార్చదా?

నేను: నువ్వంటున్నది, ఏడా? ఏరా?

ఎడమ నేను: ఏరు కాదు, ఏడు. ఏడు అనే అంకె.

నా ఎడమ నేనుకు ఏదో అయినట్టుందే! ఏడు అనే అంకె రంగులు మార్చడమేమిటి? అదే అన్నాను.

ఎడమ నేను: నాకేమీ కాలేదు కానీ నువ్వు నాకు సమాధానం చెప్పు. ఏడు అనే అంకె తానున్న చోటును బట్టి రంగులు మారుస్తుందా అని నేనడిగితే దానికి నీ సమాధానం ఏమిటి? మారుస్తుంది అనా మార్చదు అనా?

నేను: మారుస్తుంది అని కాదు, మార్చదు అని కూడా కాదు.

ఎడమ నేను: పోనీ మారుస్తుంది మార్చదూ కూడానా? లేదా మారుస్తుందో మార్చదో చెప్పలేమనా?

నేను: నీకసలు బుర్ర పూర్తిగా చెడినట్టుంది. ఏడు అనేది అంకె అయినప్పుడు అసలు దానికి రంగే ఉండదు. మరి అలాంటప్పుడు అది మారడం, లేదా మార్చడం అనే ప్రసక్తి ఎలా వస్తుంది. అర్థం లేని ప్రశ్నలనెందుకు అడుగుతున్నావ్?

ఎడమ నేను: బుద్ధుడిని రాజడిగిన ప్రశ్న విషయమై బుద్ధునిదీ సరిగ్గా యిదే అభిప్రాయం. ‘చనిపోవడం’, ‘ఉండడం’ లాంటి క్రియలు తథాగతునికి అసలు వర్తించవని బుద్ధుని ఉద్దేశం. దాన్ని స్పష్టంగా చెప్పడానికే ఆ నాలుగుకోణాల్లో ఏదీ కాదని అనడం. అయితే ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని బుద్ధుడక్కడ వివరించలేదు.

బుద్ధుని ఉద్దేశాన్నీ, దాన్ని చెప్పడానికి బుద్ధుడు ఉపయోగించిన పద్ధతిని అర్థం చేసుకోడానికి నాకు కొంత సమయం పట్టింది. దాని గురించి ఆలోచిస్తూ ఉండగానే ఎడమ నేను మళ్లీ అందుకుంది.

ఎడమ నేను: మజ్ఝిమ నికాయ అనే మరొక భాగంలో అగ్గివచ్చగొత్త సుత్తంలో ఇలాంటిదే మళ్లీ కనిపిస్తుంది, ఇందులో బుద్ధుని ఆలోచన మరికొంత స్పష్టంగా తెలుస్తుంది.

నేను: ఓహో!

ఎడమ నేను: వచ్చగొత్త అనే పరివ్రాజకుడు బుద్ధుని దగ్గరకి వచ్చి, ‘విముక్తుడైన భిక్షుకుడు, అంటే తథాగతుడు తిరిగి ఎక్కడ ఉదయిస్తాడు, పుడతాడు?’ అని అడుగుతాడు. దానికి బుద్దుడు ‘తిరిగి ఉదయించడం అన్నది అతనికి వర్తించదు’ అని బదులిస్తాడు. ‘అంటే అతడు తిరిగి ఉదయించడా?’ అని అడుగుతాడు వచ్చ. ‘ఉదయించడు అని కూడా చెప్పలేం’ అంటాడు బుద్ధుడు. ‘అంటే ఉదయిస్తాడు, ఉదయించడూ కూడానా?’ అని తిరిగి అడుగుతాడు వచ్చ. దానికి బుద్ధుడు, ‘ఉదయిస్తాడు, ఉదయించడూ అని కూడా చెప్పలేం’ అంటాడు. ‘అలా అయితే, ఉదయించడమూ ఉదయించకపోవడమూ ఉండదా?’ అని ఆ పరివ్రాజకుడు మళ్లీ అడుగుతాడు. దానికి బుద్ధుడు ‘అలా అని కూడా చెప్పలేం’ అని బదులిస్తాడు. బుద్ధుని సమాధానాలకు ఆ పరివ్రాజకునికి తల తిరిగిపోతుంది!

నేను: తిరగదూ మరి! నాకు నీ వివరణ విన్నాక కూడా యింకా పూర్తిగా అర్థమయినట్టు లేదు. పాపం యీ మారయినా బుద్ధుడు కాస్త తన ఉద్దేశాన్ని వివరించాడా?

ఎడమ నేను: వివరించాడు. ‘నీ కళ్ళముందు మండుతూ ఆరిపోయిన అగ్ని గురించి, ఆ అగ్ని ఎటువైపు వెళ్లిపోయింది? తూర్పుకా, పడమరకా, ఉత్తరానికా, దక్షిణానికా? అని అడిగితే నువ్వు ఏమని సమాధానం చెపుతావు?’ అని అడుగుతాడు బుద్ధుడు. ‘ఎటో వైపుకు వెళ్లడం అనేది ఇక్కడ వర్తించదు. కర్రలు కాలిపోయి, మరింక కాల్చేందుకు ఇంధనం లేక అది సమసిపోయింది అనే చెప్పగలం’ అని బదులిస్తాడు వచ్చ. ‘అలాగే నువ్వు అడిగిన ప్రశ్నలో కూడా తథాగతునికి ఉదయించడం అనే మాట అసలు వర్తించదు’ అని వివరిస్తాడు బుద్ధుడు.

నేను: ఓహో! అంటే, ఒక ప్రతిపాదనలో చెపుతున్న విషయం, చెప్పే విషయికి అసలు వర్తించదనీ, కాబట్టి ఆ ప్రతిపాదన సత్యాసత్యాల గురించి ఏమీ చెప్పడానికే వీలు లేదనీ కొట్టిపారెయ్యడానికి బుద్ధుడు ఈ మార్గాన్ని వినియోగించాడన్న మాట.

ఎడమ నేను: అవును.

నేను: అయితే ఒక ప్రతిపాదన సత్యాసత్యాలను ఆ నాలుగు కోణాలనుండి చూడాల్సిన అవసరం ఏముంది? చతుష్కోటిలో మొదటి రెండు కోణాలు బాగానే ఉన్నాయి కానీ మూడు నాలుగు కోణాలు అసంబద్ధంగా లేవా?

ఎడమ నేను: దీని గురించి నేనింతకు ముందు చెప్పినట్టు ఆధునికులు రకరకాలగా సమన్వయించాలని ప్రయత్నించారు. అవన్నీ చాలా వరకూ పాశ్చాత్యుల తర్కసిద్ధాంతాల ఆధారంగా చేసిన సమన్వయాలే.[7] కొందరు దీనిని భారతీయ తత్త్వంలోని మార్మికతగా కొట్టిపారేసారు. అయితే తర్కంలో యీ చతుష్కోటి ప్రచురంగానే ఉపయోగించబడింది. ఆచార్య నాగార్జునుడు తన మాధ్యమక సిద్ధాంతంలో దీనిని శాస్త్రబద్ధం చేసాడు. తన తర్కంలో చాలా విరివిగా వాడుకున్నాడు కూడా.

నేను: ఒక ప్రతిపాదన అసంగతమని కొట్టుపారేయడానికి చతుష్కోటిని వాడుకున్నారని అన్నావు. దాని కోసం ఆ నాలుగు కోణాలనూ చర్చించాల్సిన అవసరం ఉందా? ఒక ప్రతిపాదనకు నాలుగు కోణాలు ఉండవచ్చునన్న ఆలోచన అసలు బౌద్ధులకు ఎక్కడనుండి వచ్చింది? ఎందుకు వచ్చింది?

ఎడమ నేను: మంచి ప్రశ్న వేసావు. దీనికి స్పష్టమైన సమాధానం నాకు తెలిసి లేదు. ఎవరూ ఆ ప్రశ్న గురించి ఆలోచించినట్టు నాకు తెలియదు. నువ్వు మళ్లీ నన్ను ఎత్తిపొడవనంటే ఒకమాట చెప్తాను.

నేను: ఎత్తిపొడవడమా? నేనా? నిన్నా!

ఎడమ నేను: అదే, ‘అన్నీ వేదాలలోనే ఉన్నాయిష’ అని నేను కూడా అంటున్నానా అని ఎత్తిపొడిచావుగా!

నేను: దానికి నేనప్పుడే నాలిక కరుచుకున్నాను కానీ నువ్విప్పుడు ఏమిటంటున్నావో చెప్పు.

ఎడమ నేను: నా ఉద్దేశంలో యీ చతుష్కోటికి మూలాలు వేదాలలోనూ, ఉపనిషత్తులలోనూ ఉన్నాయి.

నేను: అవునా!

ఎడమ నేను: ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం గురించి నువ్వు వినే ఉంటావు.

నేను: కొద్దిగా విన్నాను. అది సృష్టిని గురించిన సూక్తం కదా?

ఎడమ నేను: అవును ‘న అసదాసీత్ నో సదాసీత్ తదానీమ్’ అంటూ సృష్టి పూర్వం ఏముందో వివరిస్తూ మొదలవుతుందది.

నేను: అంటే?

ఎడమ నేను: అప్పుడు అసత్తు లేదు, సత్తు కూడా లేదు.

నేను: ఓహో! మళ్లీ యిదేదో పేరడాక్సులా ఉందే!

ఎడమ నేను: అవును. ఈ సూక్తంలో ఇలాంటి పేరడాక్సులు యింకా ఉన్నాయి. ఇవన్నీ స్వవచన విరోధాలుగా అనిపిస్తాయి. ‘అప్పుడు మృత్యువూ లేదు అమృతమూ లేదు’; ‘గాలిలేకుండా ఊపిరితీస్తూ ఒక్కటే ఉంది’; ‘పెనుచీకటిలో చీకటి దాగి ఉంది’; ‘ఈ సృష్టికి ఆది ఏమిటి? సృష్టికర్తకే తెలుసు, లేదా తెలీదు’.

నేను: ఓహో! అమృతం అంటేనే మృత్యువు లేనిదని కదా. మృత్యువూ లేదు, అమృతమూ లేదు అంటే సత్యమూ కాదు, అసత్యమూ కాదు అన్నట్టుంది!

ఎడమ నేను: అవును, అది చతుష్కోటిలోని ఒక కోణం కదా! వేదాలలో ఇలాంటి పేరడాక్సులు ఇంకా చాలా ఉన్నాయి. సరే యివన్నీ కవితాత్మకమైనవి, మార్మికమైనవి అనుకున్నా, తత్త్వ విచారణ చేసే ఉపనిషత్తులలో కూడా ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు ఈశావాస్యోపనిషత్తులో తత్ గురించి ఇలాంటి శ్లోకాలుంటాయి.

నేను: తత్ అంటే?

ఎడమ నేను: తత్ అంటే ‘అది’ అని అర్థం. బ్రహ్మమును లేదా ఆత్మని సూచించేందుకు యీ పదాన్ని వాడతారు.

నేను: ఓహో!

ఎడమ నేను: తత్ గురించిన యీ శ్లోకం విను:

తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః

నేను: దీని అర్థం తెలియకుండానే యిందులో బోలెడన్ని తిరకాసులున్నాయనిపిస్తోంది! ఏమిటి దీనర్థం?

ఎడమ నేను: అది కదులుతుంది, కదలదు. అది దూరంగా ఉంటుంది, దగ్గరగానూ ఉంటుంది. అది అన్నిటి లోపల ఉంది, అన్నిటి బయటా కూడా ఉంది. పరస్పర వ్యతిరేకాలైన స్వభావాలు ఒకే చోట, ఒకే సమయంలో ఉన్నట్టుగా ఈ శ్లోకం వివరిస్తోంది. ‘అది కదులుతుంది, కదలదు కూడా’ అన్నది చతుష్కోటిలోని మూడవ కోణమే కదా. పరమాత్మను, బ్రహ్మాన్నీ వర్ణించడంలో ఇలాంటి పేరడాక్సులు ఉపనిషత్తులలో ఇంకా కనిపిస్తాయి.

నేను: ఇందులో తర్కం కన్నా మార్మికతే కనిపిస్తోంది నాకు.

ఎడమ నేను: మనిషి తర్కానికి తోచే రెండు మార్గాలనూ–వీటినే ద్వంద్వాలంటారు–అధిగమించిన తత్త్వం పరమాత్మదని చెప్పడానికి యిలాంటి పేరడాక్సికల్ వాక్యాలను ఉపనిషత్తులు ప్రయోగించాయి. అయితే బౌద్ధం వేద ప్రామాణ్యాన్ని అంగీకరించలేదు. ఉపనిషత్తులలో చెప్పిన తత్త్వాన్ని కూడా కాదని వచ్చిన దర్శనమది. బుద్ధుడు బ్రహ్మాన్ని కానీ ఆత్మను కానీ అంగీకరించలేదు. కాబట్టి ఆత్మ గురించి ఉపనిషత్తులు చెప్పిన ఆ విరోధ భావాలను కూడా బౌద్ధులు తమ సిద్ధాంతంలో త్రోసిపుచ్చవలసి వచ్చింది. అందుకే ఆ తార్కిక విరోధాలకు చతుష్కోటిలో చోటుదక్కిందన్నది నా ఊహ.

నేను: అంటే సత్యం ద్వంద్వాతీతమని కూడా చెప్పలేమనా బౌద్ధుల వాదం?

ఎడమ నేను: అలాంటిదే. ఆత్మ కదులుతుంది, కదలదు కూడా అంటే, ముందు ఆత్మ అనేది ఉందని ఒప్పుకున్నట్టే కదా. అసలు ఉందో లేదో తెలియని దాని గురించి ఎలాంటి ప్రతిపాదన కూడా–అది ఎంత పేరడాక్సికల్ అయినా–చేయలేమనేది బౌద్ధుల సిద్ధాంతం.

నేను: ఓహో.

ఎడమ నేను: జాగ్రత్తగా చూస్తే, ఈ చతుష్కోటి తర్కాన్ని బౌద్ధులు చాలా వరకూ రకరకాల ప్రతిపాదనలను ఖండించడానికే వాడుకున్నారు. అంటే, ఆ ప్రతిపాదనలు తర్కరహితమే కాదు, అసలా తర్కమే అసంబద్ధమని తార్కికంగా నిరూపించడానికి చతుష్కోటిని నిర్మించారని అనుకోవచ్చు. తార్కికంగా తర్కాన్ని తోసిరాజన్న తర్కం అన్న మాట! నువ్విందాక తెలియకుండానే అన్నా, యిది నిజానికి వితండమే.

నేను: అంటే ఇదంతా అర్థం లేని వాదమనా నీ ఉద్దేశం!

ఎడమ నేను: కాదు, కాదు. వితండమంటే అర్థంలేని వాదమని వాడుకలోకి వచ్చినా, అది నిజానికి ఒక శాస్త్రీయమైన అంశం. మన న్యాయశాస్త్రంలో వాద ప్రతివాదుల ప్రసంగాన్ని కథ అంటారు. అది మూడు రకాలు. ఒకటి వాదం, రెండు జల్పం, మూడు వితండం. వాద ప్రతివాదులు ఒక విషయాన్ని గురించి ప్రమాణాల ద్వారా, తర్కం ద్వారా విచారణ చేసి, సత్యాన్ని సిద్ధాంతంగా స్థాపించడాన్ని వాదం అంటారు. ఇందులో సత్యాన్ని తర్కం ద్వారా ఆవిష్కరించడమే వాది ప్రతివాదుల ప్రధాన ధ్యేయం.

వాది చెప్పిన విషయానికి వేరే అర్థం తీసి, దాన్ని ఖండించి, ప్రతివాది తన సిద్ధాంతాన్ని స్థాపించడం జల్పం. ఇక్కడ వాది సిద్ధాంతాన్ని తోసిపుచ్చి, ప్రతివాది తన సిద్ధాంతాన్ని స్థాపించడం ప్రధానం.

తన సిద్ధాంతాన్ని స్థాపించడం కాకుండా, వాది సిద్ధాంతాన్ని ఖండించడం మాత్రమే ప్రతివాది చేస్తే, దాన్ని వితండం అంటారు.

నేను: అంటే, ఎదుటివారి సిద్ధాంతంలో తప్పులు పట్టడమే వితండంలో ప్రధాన అంశమన్న మాట!

ఎడమ నేను: అవును. ఇందులో సత్యం ఏమిటన్నది తెలియకపోవచ్చు కానీ సత్యం కానిదేమిటన్నది తెలుస్తుంది. న్యాయశాస్త్రంలో దీనికి కాస్త తక్కువస్థానం ఉన్నా, అది పూర్తిగా శాస్త్రబద్ధమైనదే! దాని విలువ దానికుంది. బౌద్ధులు, ముఖ్యంగా మాధ్యమక సిద్ధాంతులు ఈ పద్దతిని విరివిగా వాడుకున్నారు. నాగార్జునుడు దీనికి తన వాదంలో ప్రధాన స్థానమిచ్చాడు.

నేను: అయితే చతుష్కోటిని బౌద్ధులు ప్రధానంగా ఎదటివారి ప్రతిపాదనలలోని తార్కిక విరోధాలను ఎత్తిచూపి వాటిని తప్పని నిరూపించడానికి ఉపయోగించారన్న మాట.

ఎడమ నేను: అసలు అలాంటి ప్రతిపాదనలు అసంబద్ధమనీ, అక్కడ తర్కం చెల్లదనీ, వాటిని పూర్తిగా కొట్టిపారెయ్యడమే వారి ఉద్దేశం. అయితే, నాగార్జునుడు తన మూలమాధ్యమక కారికలో ఒకే ఒక్క చోట చతుష్కోటిని ఒక ప్రతిపాదనను ఖండించడానికి కాక, తన ప్రతిపాదనలో ఒక భాగంగా ఉపయోగించాడు.

సర్వమ్ తథ్యమ్ న వా తథ్యమ్
తథ్యమ్ చ అతథ్యమేవచ
నైవాతథ్యమ్ నైవ తథ్యమ్
ఏతద్ బుద్ధానుశాసనమ్

అంతా తథ్యం. అంతా అతథ్యం. అంతా తథ్యమూ అతథ్యమూ కూడా. అతథ్యమూ, తథ్యమూ కూడా కాదు. ఇది బుద్ధుని బోధ. ఇది సత్యాన్ని గురించి నాగార్జునుని ప్రతిపాదన. ఇందులో చతుష్కోటిలోని నాలుగు కోణాలూ ఉన్నాయి. ‘సత్యం’ అనే విషయాన్ని గురించి ఎలాంటి తార్కిక ప్రతిపాదనా చేయలేమని, అలాంటి సత్యాన్నీ, దాని గురించి చర్చించే తర్కాన్నీ పూర్తిగా తిరస్కరించడమే నాగార్జునుడి ధ్యేయం.[8]

నేను: అయితే ఆత్మసూచన వల్ల ఏర్పడే తిరకాసులు బౌద్ధులకు సవాలు విసరకపోగా తమ తర్కంలో ఒక సాధనంగా ఉపయోగపడ్డాయన్నమాట!

ఎడమ నేను: అవును, అలాగే అనుకోవచ్చు.

అబ్బో, మాటల్లో పడి చాలా దూరమే వచ్చేసాం! సూర్యుడు క్రమంగా నడినెత్తికి ఎక్కుతున్నాడు. నా నడకనాపి, కాసిన్ని నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నాను. ఆ దాహం అయితే తీరింది కానీ భారతీయ చింతన గురించి తెలుసుకోవాలన్న పిపాస పూర్తిగా తీరలేదు. మళ్ళా నడక మొదలుపెట్టాను.
వైశేషికుల సత్త్వమీమాంస
నేను: ఆత్మసూచన తమకొక సవాలుగా నిలిచిన సిద్ధాంతాలేమైనా ఉన్నాయా మరి?

ఎడమ నేను: పెద్ద సవాలని కాదు కానీ, ఆత్మసూచన వల్ల తమ సిద్ధాంతంలో ఏర్పడే ఒకటిరెండు చిక్కులను ఎదుర్కొని వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం వైశేషికులకు వచ్చింది. అది సత్త్వమీమాంసకు సంబంధించినది.

నేను: సత్త్వమీమాంస అంటే?

ఎడమ నేను: సత్త్వమంటే ఉండడం, ఇంగ్లీషులో being. ప్రపంచంలో వాస్తవంగా ఉన్న పదార్థాలు ఏమిటి? అవి ఎన్ని రకాలు? వాటి మధ్యనున్న సంబంధాలేమిటి? మొదలైన విషయాలను విచారించే శాస్త్రం సత్త్వమీమాంస (Ontology). ఈ శాస్త్రాన్ని వైశేషికులు చాలా అభివృద్ధి చేసారు. వైశేషిక దర్శనంలో ప్రధాన విషయం సత్త్వమీమాంసే.[9]

నేను: ఓహో. ఇంతకు ముందు జ్ఞానమీమాంస అన్న పేరు కూడా చెప్పావు, అదేమిటి?

ఎడమ నేను: జ్ఞానమీమాంస అంటే జ్ఞానం గురించిన విచారణ. జ్ఞానం అంటే ఏమిటి? అది మనిషికి ఎలా కలుగుతుంది? మొదలైన విషయాలను విచారించే శాస్త్రం. ఇది న్యాయ దర్శనంలో ప్రధానంగా కనిపిస్తుంది. సత్త్వమీమాంస, జ్ఞానమీమాంస పరస్పరం ఆధారపడిన శాస్త్రాలు. అందుకే న్యాయ-వైశేషిక దర్శనాలకు చాలా దగ్గర సంబంధం. జ్ఞానమీమాంస గురించి మరోసారి వివరంగా ముచ్చటించుకుందాం లే!

నేను: సరే. అయితే వైశేషికుల సత్త్వమీమాంస గురించి చెప్పు.

ఎడమ నేను: వైశేషికులు ప్రపంచంలో మొత్తం ఆరున్నొక్క పదార్థాలు ఉన్నాయన్నారు. ద్రవ్యం, గుణం, కర్మ, సామాన్యం, విశేషం, సమవాయం అనేవి ఆరు. తర్వాత కాలంలో చేరిన మరొక్క పదార్థం అభావం! ద్రవ్యం అంటే స్థూలంగా వస్తువు అనుకోవచ్చును. భౌతిక జగత్తు, కాలం, మనసు, జీవాత్మ; ఇవి ద్రవ్యాలు.

నేను: ఏమిటీ, కాలం కూడా ఒక పదార్థమా?!

ఎడమ నేను: అవును. కాలం మనకు జ్ఞానానికి అందే విషయమే కదా. జ్ఞానానికి అందే విషయమేదయినా సత్యమైన పదార్థమే అన్నది వైశేషికుల అభిమతం. ద్రవ్యాలకుండే లక్షణాలు గుణాలు. ద్రవ్యంలో కలిగే మార్పు కర్మ. ఇవన్నీ మన జ్ఞానానికి అందే విషయాలే కాబట్టి వాటిని పదార్థాల క్రిందే జమ కట్టారు వైశేషికులు.

నేను: I think therefore I am అన్న దెకార్తె మాట గుర్తుకొస్తోంది. మొత్తానికి మన జ్ఞానానికి అందే విషయాలన్నింటినీ వైశేషికులు చక్కగా కేటగరైజ్ చేసారన్నమాట!

ఎడమ నేను: అవును. అలాగే కొన్ని ద్రవ్యాలలో సమానంగా ఉండే లక్షణాన్ని సామాన్యం అన్నారు. మచ్చుకి, ఆవులన్నింటిలో ఉండే సామాన్యం ఆవుదనం. ఆవుదనం సామాన్యం అయితే, ఒక్కొక్క ఆవు విశేషం. ఒకే సామాన్యం గల విశేష వస్తువులన్నమాట. ఇవన్నీ మన బుద్ధికి అందే విషయాలే. అయితే వీటన్నింటికీ ప్రత్యేకమైన ఉనికి ఉందన్నది వైశేషికుల సిద్ధాంతం.

నేను: ఓహో, ఆవు వేరు, ఆవుదనం వేరునా!

ఎడమ నేను: అంతే కదా. ఒక ఆవుని చూసినప్పుడు అది ఆవనీ, ఒక గుర్రాన్ని చూసినప్పుడది గుర్రమనీ మనం గుర్తించడానికి కారణం వాటిల్లో ఉండే ఆవుదనం, గుర్రపుదనమూనూ. అలాంటి సామాన్యం ఒకటి లేకపోతే వీటినిలా విడిగా గుర్తించడం అసాధ్యమని వారి వాదన. దీనినే జాతి అని కూడా అంటారు.

నేను: బావుంది.

ఎడమ నేను: ఇంక ఆరవదయిన సమవాయం అనే పదార్థం విలక్షణమైనది. ఇది రెండు పదార్థాల మధ్య ఉండే అవినాభావ సంబంధం.

నేను: అంటే రిలేషనన్న మాట! మామూలు సంబంధానికీ, అవినాభావ సంబంధానికీ ఏమిటి తేడా?

ఎడమ నేను: అవినాభావ సంబంధం అంటే విడదీయలేని, నిత్యమైన సంబంధం. ఉదాహరణకు ఒక తెల్లగులాబీని తీసుకుంటే అందులోని తెల్లదనం అనే గుణానికీ, గులాబీకీ మధ్యనున్న సంబంధం సమవాయం. తెల్లగులాబీని చూసినప్పుడు మనకు తెలుపు రంగు, గులాబీ పువ్వు రెండూ కనిస్తాయి, కానీ వేటికవి విడిగా కనిపించవు. ఆ రెండు పదార్థాలతో బాటుగా వాటి మధ్యనున్న సంబంధం కూడా మనకు తెలుస్తుంది. అంచేత అది అవినాభావం, అంటే ఒక తెల్లగులాబీలోని తెలుపును, గులాబీని విడదీయలేము.

నేను: అర్థమయింది. గులాబీ అనేది భౌతిక వస్తువు కాబట్టి అది ద్రవ్యం. తెలుపు రంగు దాని గుణం. అంటే ద్రవ్యానికీ దాని గుణానికీ మధ్యనుండే సంబంధం సమవాయం అన్నమాట. అంతేనా?

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు.

నేను: ఆ సంబంధాన్ని పదార్థమని ఎందుకన్నారు?

ఎడమ నేను: అలాంటి సంబంధం ఒకటి ఉండి ఉండకపోతే, మన జ్ఞానానికి ఒక గులాబీ తెల్లగులాబీ అని ఎలా గోచరిస్తుంది? తెలుపు రంగు, గులాబీ మాత్రమే ఉన్న పదార్థాలయితే, అవి రెండూ వేరువేరుగా కనిపించాలి. ఒకటిగా మన జ్ఞానానికి తెలుస్తోందంటే ఆ రెంటినీ కలుపుతున్న ఆ సంబంధంకూడా కచ్చితంగా ఉండి ఉండాలి అని వారి వాదన.

నేను: ఓహో!

ఎడమ నేను: అలాగే, నడుస్తున్న మనిషిని తీసుకుంటే, ఆ మనిషికీ అతని నడకకీ మధ్యనున్న సంబంధం కూడా సమవాయమే. అది ద్రవ్యానికీ, దానిలోని కర్మకీ మధ్యనున్న సంబంధమన్నమాట. అది కూడా సమవాయమే.

నేను: అలాగే ఆవుకీ ఆవుదనానికీ, అంటే ఒక విశేషానికీ దాని సామాన్యానికి మధ్యనున్న సంబంధం కూడా సమవాయమేనా?

ఎడమ నేను: నీ బుద్ధి పదునెక్కిందే! అవును. అంతే కాదు ఒక కుండకీ అందులోని మట్టికీ ఉన్న సంబంధం కూడా సమవాయమే.

నేను: ఓహో! అంటే రెండు ద్రవ్యాల మధ్యకూడా అవినాభావ సంబంధముంటే అది సమవాయం అన్నమాట.

ఎడమ నేను: అవును. సమవాయానికి కూడా మిగతా వాటిలా ఉనికి ఉందని, అది కూడా ఒక పదార్థమేనని వైశేషికుల సిద్ధాంతం. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్న నిర్వచనాలలో ఆత్మసూచన ఎక్కడయినా వచ్చే అవకాశం నీకు కనిపిస్తోందా?

ఇవాళ ప్రశ్నలేం సంధించలేదే అనుకుంటూన్నాను. అంతలోనే యిది! ఆలోచించడం మొదలుపెట్టాను. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. లాభం లేదు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని సేద దీరితే తప్ప ఆలోచనా, నడకా ముందుకు సాగేట్టు లేదు. నా అవస్థ తెలుసుకున్న నా ఎడమ నేను, సరే కాసేపు విశ్రాంతి తీసుకో మళ్లీ కలుద్దామని చెప్పి మాయమయ్యింది!
(సశేషం)
----------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, January 30, 2019

నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన


నేనొక చిత్రమైన చిక్కుముడి: 

2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన




సాహితీమిత్రులారా!
అవునంటావా? కాదంటావా?
ప్రయాణం మొదలైతే పెట్టేను కానీ ఒక పక్క బెరుగ్గానే ఉంది. బిక్కు బిక్కుమంటూ అడుగులు వేస్తున్నాను. అంతలో హఠాత్తుగా నా ఎడమ చెవి వైపు, ‘హలో’ అని వినిపించింది. బయటనుండి ఎవరైనా నా ఎడమ చెవిలో ఊదారో, లేకపోతే నా లోపలినుంచి ఎడమ చెవి ద్వారా ఆ మాట బయటకి వచ్చిందో నాకు తెలియలేదు. ఏదైతేనేం హఠాత్తుగా మాటలు వినపడేసరికి ఉలిక్కిపడ్డాను. ఇటూ అటూ ఎవరూ లేరు. అసలే భయంతో ఉన్నానేమో, యీ వింతకి మరింత భయం వేసింది.

“ఎందుకలా ఉలికిపడతావ్!” మళ్లీ అదే గొంతు.

“ఎవరు నువ్వు?” కొద్దిగా ధైర్యం చేసి నా గొంతు పెగిల్చాను.

“నువ్వే నేను.” జవాబు వచ్చింది. ఆ గొంతు నెమ్మదిగానే ఉన్నా, అంటున్న ఆ మాటలకి భయం రెట్టింపయింది. ఇదేదో దెయ్యమో పిశాచమో లాగుంది. ప్రయాణం మొదలుపెడుతూ ఏ వినాయకుడినో తలుచుకోకుండా బేతాళుడిని తలచుకున్నాను. కొంపదీసి ఆ బేతాళుడు కాదు కదా!

“కొంపతియ్యకుండానే నేను బేతాళుడిని కాను లేవోయ్. నువ్వేమైనా విక్రమాదిత్యుడివా ఏంటి, బేతాళుడు నీతో మాట్లాడ్డానికి.”

నేను మనసులో అనుకున్నవి కూడా యితడికి తెలిసిపోతున్నాయి! నా భయం చూసి యితగాడికి నవ్వులాటగా ఉన్నట్టుంది.

“నువ్వెవరో నిజం చెప్పు. నువ్వు నేనేమిటి!” యీసారి కొంచెం గట్టిగానే అడిగాను.

“నీతో నువ్వు, నీలోకి నువ్వు ప్రయాణం మొదలుపెడితే మరి నీకు తోడెవరు వస్తారు, నువ్వు కాక!”

కొద్ది కొద్దిగా ఆ మాటలు అర్థమవుతున్నాయి. గొంతు కూడా పోల్చుకోగలిగాను. అవును, అది నా గొంతుకే. కాకపోతే ఒకవైపుగానే వినిపిస్తూ కాస్త వింతగా ఉంది. భయం తగ్గింది. అడుగులు నింపాదిగా ముందుకు పడ్డాయి.

“బేతాళుడిని కాకపోయినా నేనుకూడా నీకు అలసట తెలియకుండా కథలూ కబుర్లూ చెపుతానులే!” ఈసారి ఆ మాటలకు భయం పూర్తిగాపోయి హుషారొచ్చింది.

“ఇక ఆలస్యం దేనికి మొదలుపెట్టు మరి!”

ఎడమ నేను కథ చెప్పడం మొదలుపెట్టింది: అనగనగా ఒక రాజ్యంలో ఒక తత్త్వవేత్త ఉండేవాడు. ఊరికే తన మానాన తాను ఉండకుండా ప్రజలందరికీ తన తత్త్వాలను బోధించడం మొదలుపెట్టాడు. ఆ బోధలకు చిర్రెత్తుకొచ్చిన రాజు అతనికి మరణశిక్ష విధించాడు. అయితే ఆ తత్త్వవేత్త చాలా మేధావి అనీ, అతనికి మరణశిక్ష తగదనీ కొందరు సన్నిహితులు రాజుకు హితవు చెప్పారు. అప్పుడా రాజుకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. తత్త్వవేత్త మేధని పరీక్షించాలనుకుంటాడు. శిక్ష వేసే రోజున తత్త్వవేత్తని సభకి రప్పించి అతనితో, ‘నీకిప్పుడు ఉరిశిక్ష కానీ, శిరచ్ఛేదం కానీ విధించబడుతుంది. ఆ రెండిటిలో ఏమిటన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ నీకే యిస్తున్నాను. నువ్విప్పుడు ఒక వాక్యం చెప్పాలి. అది నిజం అయితే నీకు ఉరి, అబద్ధమైతే శిరచ్ఛేదం,’ అన్నాడు రాజు. తత్త్వవేత్త తడుముకోకుండా, ‘మీరు నాకిప్పుడు శిరచ్ఛేదం విధిస్తారు,’ అన్నాడు. అప్పుడు రాజు అతడికి ఏ శిక్ష విధించాడు?

బేతాళుడిలాగానే కథ చివర ప్రశ్న కూడా వేసిందే! ఇంకా నయం, తల వేయిచెక్కలవ్వడం వంటి ప్రమాదకరమైన నియమాలేం పెట్టలేదు! కొద్దిగా ఆలోచించగానే విషయం అర్థమయింది.

నేను: రాజు ఏ శిక్షా విధించలేడు.

ఎడమ నేను: ఎందుకు?

నేను: తత్త్వవేత్తకి ఉరిశిక్ష వెయ్యాలంటే, ఆ తత్త్వవేత్త చెప్పిన వాక్యం నిజం కావాలి. అంటే అతనికి శిరచ్చేదం విధించాలి. పోనీ శిరచ్ఛేదం విధించాలంటే, అతను చెప్పిన వాక్యం అబద్ధం కావాలి. అలాంటప్పుడు శిరచ్ఛేదం విధించే అవకాశం లేదు! అంచేత ఇప్పుడు అతనికి శిక్ష విధించాలంటే రాజు తన మాటను తప్పాలి! కాబట్టి ఏ శిక్షా విధించలేడు.

ఎడమ నేను: శభాష్! నా, అదే… మన పరువు నిలబెట్టావ్!

నేను: ఇది కచ్చితంగా తత్త్వవేత్తలు తమ గురించి తాము సృష్టించుకున్న వట్టి కట్టుకథే అయ్యుండాలి. ఏ దేశంలో ఏ రాజూ యిలా తాను విధించిన శిక్షని రద్దు చేసిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా కనిపించవు మరి!

ఎడమ నేను: అవును. తత్త్వవేత్త చెప్పిన వాక్యంలో ఉన్న మెలిక ఈ కథలోని అసలు విషయం.[1] నువ్వు ఇంతకుముందు ప్రస్తావింవావే, ‘ఈ వాక్యం అబద్ధం’ అనే వాక్యం. దాని కోవకు చెందిన తిరకాసే (Paradox)యిది కూడాను.[2] అయితే, ఆ మెలికను తనకు వేయబోయే శిక్ష గురించి చెప్పే వాక్యంతోనే తయారుచేయడం ఇందులోని విశేషం. రాజు వేయాల్సిన శిక్ష వాక్యం తాలూకు తప్పొప్పులపై ఆధారపడుతుంది. ఆ వాక్యం తప్పా ఒప్పా అన్నది తిరిగి వేసే శిక్ష మీద ఆధారపడుతుంది! ఈ మెలికలో కూడా ఒక రకమైన ఆత్మసూచన (Self-Reference) దాగి ఉంది.

నేను: ఓహో, భలేగా ఉంది. ఈ ఆత్మసూచన నిజంగా పెద్ద తిరకాసు వ్యవహారంలాగే ఉన్నదే!

ఎడమ నేను: ఇలాంటి తిరకాసులన్నింటికీ కలిపి ఇంగ్లీషులో ఒక పేరుంది తెలుసా?

నేను: ఏవిఁటి

ఎడమ నేను: దానిని Liar’s Paradox అంటారు.

నేను: ఓహో. అయితే తెలుగులో దీనిని ‘తప్పొప్పుల తిరకాసు’ అందాం!

ఎడమ నేను: బావుంది, అలాగే అందాం! మనకి దొరుకుతున్న చరిత్ర బట్టి, ఆత్మసూచన ద్వారా ఏర్పడే తిరకాసులన్నింటిలోనూ పాతది యీ తప్పొప్పుల తిరకాసే. ఈ పేరడాక్సు అనేక కాలాలలో, అనేక రూపాలలో కనిపిస్తుంది.[3] అన్నింటిలోకి మొట్టమొదట కనిపించే రూపం ఏమిటో తెలుసా?

నేను: ఏమో నాకేం తెలుస్తుంది, నువ్వే చెప్పు.

ఎడమ నేను: “క్రీటనులందరూ వట్టి అబద్ధాలకోరులు, ఎప్పుడూ అబద్ధమే చెప్తారు” అని ఒక క్రీటన్ అంటే ఆ వాక్యం నిజమా అబద్ధమా?[4]

ఆ వాక్యం గురించి ఆలోచిస్తూ ఉండగానే ఎడమ నేను మళ్లీ అందుకుంది.

ఎడమ నేను: ఇలాటివే మరికొన్ని అవతారాలు చూడు:

ఒక మనిషి తాను అబద్ధం చెపుతున్నానని అన్నాడు, అది నిజమా అబద్ధమా?[5]

‘ఈ వాక్యం నిజం కాదు.’ అనే వాక్యం నిజమా అబద్ధమా?[6]

‘ఈ వాక్యం వట్టి అబద్ధం’ అనే వాక్యం నిజమా అబద్ధమా?[7]

నేను: ఆగాగు. అలా నువ్వు గుక్కతిప్పుకోకుండా చెప్పుకుపోతుంటే ఎలా. నన్ను కాస్త ఆలోచించుకోనీ. ‘ఈ వాక్యం నిజం కాదు.’ అనే వాక్యం నిజమా అబద్ధమా? నిజం అనుకుందాం. అప్పుడు దాని ప్రకారం నిజం కాదన్నమాట! పోనీ నిజం కాదు, అనుకుందాం. ‘నిజం కాదు’ అన్నది నిజం కాకపోతే, అది నిజమే అవ్వాలి! అవును ఈ వాక్యాలన్నీ ఒకలాగే ఉన్నాయి కదా. మరి యిన్ని రకాలెందుకు?

ఎడమ నేను: అవును, ఈ వాక్యాలన్నీ సుమారు ఒకలాంటివే. చాలా చిన్న చిన్న తేడాలు మాత్రం ఉన్నాయి. వాటి గురించి నువ్వు తాపీగా ఆలోచించుకో. ఈ తప్పొప్పుల తిరకాసు వెనకనున్న అసలు మెలిక అర్థం అయ్యింది కదా?

నేను: ఓ అర్థమయింది. అసలు మెలిక వాక్యం తప్పొప్పుల నిర్ణయంలో ఉంటుంది. వాక్యం అబద్ధం అని మొదలుపెడితే అది నిజం అవుతుంది, నిజం అని మొదలుపెడితే అది అబద్ధం అవుతుంది. ఈ తిరకాసుకు కారణం ఆ వాక్యం తన గురించి తాను చెప్పుకోడమే కదా!

ఎడమ నేను: అవును. దీనికి దగ్గర చుట్టమే ఇంకొక పేరడాక్సు ఉంది.

“ఈ ప్రశ్నకు సరైన సమాధానం ‘కాదు’ అనా?” అని నేను అడిగితే, నీ సమాధానం ఏమిటి? అవునంటావా? కాదంటావా?

నేను ఆలోచనలో పడ్డాను. ‘ఈ ప్రశ్న’ అనేది ఆ వాక్యంలో ఉన్న ప్రశ్ననే సూచిస్తోంది. దానికి సమాధానం ‘అవును’ అంటే ఆ వాక్యం ప్రకారం ‘కాదు’ అవ్వాలి. ‘కాదు’ అంటే ఆ ప్రశ్నకు సమాధానం కాదే కాబట్టి, ఆ వాక్యానికి సమాధానం ‘అవును’ అవ్వాలి. అవునంటే కాదనిలే, కాదంటె అవుననిలే – ఏ.ఎమ్. రాజా గొంతు వినిపించింది!

నేను చెప్పకపోయినా నాకు సమాధానం తెలిసిపోయిందని ఎడమ నేనుకు ఎలాగో తెలిసిపోతుంది కదా! అంచేత కబుర్లు కొనసాగించింది.

ఎడమ నేను: సరిగ్గానే ఆలోచించావు. ఇందులో కూడా ఉన్నది అదే తిరకాసు. వాక్యం తప్పా-ఒప్పా అన్న ప్రశ్న బదులు, సమాధానం అవునా-కాదా అన్నదిక్కడ ప్రశ్న. సరే, తమ గురించి తాము చెప్పుకోలిగే శక్తి వాక్యాలకే కాదు, పదాలకు కూడా ఉంది తెలుసా!

నేను: పదాలు కూడా తమ గురించి తాము చెప్పుకోగలవా? అదెలా!

ఎడమ నేను: చెపుతానుండు, కంగారు పడకు. అలాంటి పదాల ద్వారా కూడా తిరకాసులను సృష్టించవచ్చును. తర్కశాస్త్రంలో చాలా ప్రసిద్ధమైన ఒక ఉదాహరణ చెప్తాను విను.[8] ఇది కాస్త ఎక్కువగా బుర్రపెట్టి ఆలోచించాల్సిన విషయం. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినాలి మరి.

నేను బుద్ధిగా తలూపాను.

ఎడమ నేను: నీకు విశేషణాలు, అదే adjectives, అంటే ఏమిటో తెలుసు కదా?

నేను: ఓ ఎందుకు తెలీదు! ఒక వస్తువులో ఉన్న విశేషాన్ని చెప్పే పదం విశేషణం. భాషలో చాలా విశేషణ పదాలుంటాయి కదా. పెద్ద, చిన్న, పొడుగు, పొట్టి, వేడి, చల్లన, చక్కని. అలాగే రంగులను సూచించే పదాలను కూడా విశేషణాలుగా వాడొచ్చు – తెలుపు లేదా తెల్లని, నలుపు లేదా నల్లని, ఎరుపు లేదా ఎర్రని, యిలా. భాషని సూచించే పదాలు కూడా విశేషణాలుగా ఉపయోగపడతాయి. మచ్చుకు – ఇంగ్లీషు సినిమా, తెలుగు పత్రిక, హిందీ పాట మొదలైన మాటలలో భాషని సూచించే పదాలు విశేషణాలు. అలాగే సంఖ్యా వాచకాలూను. ఒక చెట్టు, రెండు పుస్తకాలు, బహుళ జాతులు – వీటిలోని ఒక, రెండు, బహుళ, యివి విశేషణాలు.

నా భాషా జ్ఞానాన్ని గడగడా ఏకరువుపెట్టాను.

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు. అంతే కాదు. విశేషణం అంటే ఎప్పుడూ ఒక పదమే ఉండాలని లేదు. ఒకటి కన్నా ఎక్కువ పదాల కూర్పు కూడా విశేషణాలయ్యే సందర్భాలుంటాయి. ఉదాహరణకు – ‘మూడక్షరాల పదం’ అన్న కూర్పులో ‘మూడక్షరాల’ అనేది ‘పదా’నికి విశేషణం. అలాగే ‘బహుళ పద వాక్యం’ అన్నప్పుడు ‘బహుళ పద’ అనేది ‘వాక్యా’నికి విశేషణం. అర్థమయిందా?

నేను: అర్థమయింది.

ఎడమ నేను: పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టుగా, విశేషణాలలో విశేషమైన విశేషణాలు కొన్ని ఉన్నాయి!

ఊపిరిపీల్చుకోడానికా అన్నట్టు ఒక్క క్షణం ఆగింది. నాలో ఉత్సుకత పెరిగింది.

ఎడమ నేను: ఈ విశేషణ పదాలను జాగ్రత్తగా చూడు – చిన్న, ఒక, ఏక, తెలుగు, ఐదక్షరాల. వీటిలో ఉన్న ప్రత్యేకత గుర్తించగలవా?

కొద్దిగా ఆలోచించాను. ‘ఐదక్షరాల’ది ఏమిటి అవ్వగలదు? ఆఁ తట్టింది.

నేను: ఇవన్నీ ఒక పదానికి విశేషణంగా వాడవచ్చు. ‘చిన్న పదం’, ‘ఒక పదం’, ‘తెలుగు పదం’, ‘ఐదక్షరాల పదం’, యిలా.

ఎడమ నేను: సరిగ్గానే చెప్పావు. అంత కన్నా మరో గొప్ప ప్రత్యేకత కూడా ఉంది. మరోసారి ఆలోచించు తెలుస్తుందేమో.

ఇంకేం విశేషం ఉంది చెప్మా? కొద్దిగా ఆలోచించాను. ఊఁహూఁ తెలియడం లేదు.

ఎడమ నేను: ‘చిన్న’ అనే పదం చిన్న పదమా పెద్ద పదమా?

నేను: చిన్న పదం.

ఎడమ నేను: అలాగే ‘ఐదక్షరాల’ అనే పదంలో ఎన్ని అక్షరాలున్నాయి?

నేను: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు!

ఎడమ నేను: ఇప్పుడర్థమయిందా వీటిలోని ప్రత్యేకత?

నేను: ఓహ్! అర్థమయింది. ‘ఒక’ అనే పదం తీసుకుంటే అది ఒక పదమే! ‘తెలుగు’ అనేది తెలుగు పదమే. ‘ఐదక్షరాల’ అనేది అక్షరాలా ఐదక్షరాల పదమే!

ఎడమ నేను: అంటే ఇవి తమ గురించి తాము చెప్పుకుంటున్నాయి, తమని తామే సూచించుకుంటున్నాయన్న మాట.

నేను: అవునవును! పదాలు తమ గురించి తామే చెప్పుకోవడం అంటే ఇదేనన్నమాట!

ఎడమ నేను: అవును. ఇది కూడా ఒకరకమైన ఆత్మసూచనే. తమలోని విశేషాన్ని తామే సూచించే యిలాంటి విశేషణాలను స్వవిశేష విశేషణాలు అందాం. ‘స్వవిశేష’ అంటే తనలోని విశేషాన్ని తనే సూచించే విశేషణం.

నేను: స్వవిశేష విశేషణం! బావుంది!

ఎడమ నేను: తమని తాము సూచించుకొనే విశేషణాలు ఉన్నప్పుడు, తమని తాము సూచించుకోని విశేషణాలు కూడా ఉంటాయి కదా? అలాంటి వాటిని కొన్ని చెప్పు చూద్దాం.

దీనికి పెద్దగా ఆలోచించనక్కరలేకపోయింది.

నేను: పెద్ద, అనేక, ఆంగ్ల, ఏకాక్షర. ఇవి కూడా ఒక పదానికి, లేదా పదాల కూర్పుకి విశేషణంగా వాడదగిన పదాలే. ‘పెద్ద పదం’, ‘అనేక పదాలు’, ‘ఆంగ్ల పదం’, ‘ఏకాక్షర పదం’, యిలా. అయితే ఆ విశేషణ పదాలకు అవి సూచించే లక్షణం లేదు. ‘పెద్ద’ అనే పదం పెద్దది కాదు కదా. ‘ఆంగ్ల’ అనేది ఆంగ్ల పదం కాదు తెలుగు పదం. ‘ఏకాక్షర’ అనేది నాలుగక్షరాల పదం.

ఎడమ నేను: బావుంది, దారిలో పడ్డావు! ఇలాంటి విశేషణాలను పరవిశేష విశేషణాలు అందాం. ‘పరవిశేష’ అంటే, తమలో ఉన్న విశేషం కాకుండా వేరే పదాలలోని విశేషాన్ని సూచించే లక్షణం అన్న మాట. ఏ విశేషణమైనా ‘స్వవిశేషం’ అయినా కావాలి, లేదా ‘పరవిశేషం’ అయినా కావాలి. అంతేకదా?

నేను: అంతే అంతే!

ఎడమ నేను: సరే, యీ స్వవిశేష, పరవిశేష విశేషణాల గురించి నీకు పూర్తిగా అర్థమయినదో లేదో చూద్దాం. అజంత, హలంత, నిర్యోష్ఠ్య – ఈ పదాలలో ఏవి స్వవిశేష విశేషణాలో, ఏవి పరవిశేష విశేషణాలో చెప్పు.

నేను: అజంత అంటే అచ్చుతో అంతమయ్యే పదాలు, హలంత అంటే హల్లుతో అంతమయ్యే పదాలే కదా. మరి నిర్యోష్ఠ్య అంటే?

ఎడమ నేను: పెదవుల కదలికతో పలికే వర్ణాలను ఓష్ఠ్యాలు అంటారు. ప, ఫ, బ, భ, మ అనే హల్లులు ఓష్ఠ్యాలు. అలాగే అచ్చుల్లో ఉ, ఊ, ఒ, ఓ – పలికేటప్పుడు పెదవులు గుండ్రంగా చుట్టాలి. అంచేత అవికూడా ఓష్ఠ్యాలే. ఓష్ఠ్యాలు లేని పదాలను నిర్యోష్ఠ్యాలు అంటారు.

అర్థమయింది. ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తే ఎడమ నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం దొరికిపోయింది. మీరు కూడా ఆలోచించండి.

ఎడమ నేను: సరే, ఈ మెట్టుకూడా ఎక్కేసావు. ఇప్పుడొకసారి గట్టిగా ఊపిరి పీల్చుకో. అసలైన చిక్కుముడి ఇప్పుడు రాబోతోంది!

నేను ఊపిరి పీల్చుకొని సిద్ధమయ్యాను.

ఎడమ నేను: ‘స్వవిశేష విశేషణం’, ‘పరవిశేష విశేషణం’ అనే పదబంధాలలో ‘స్వవిశేష’, ‘పరవిశేష’ అనే పదాలు కూడా విశేషణాలే అన్న సంగతి గమనించావా?

నేను: ఊఁ, అవును. అవి ఒక విశేషణ పదంలోని విశేషాన్ని సూచించే పదాలు.

ఎడమ నేను: ఏ విశేషణమైనా అయితే స్వవిశేషమో లేదా పరవిశేషమో అవ్వాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అంచేత, ‘స్వవిశేష’, ‘పరవిశేష’ అనే పదాలు కూడా స్వవిశేషమైనా, పరవిశేషమైనా అవ్వాలి. అవునా?

నేను: ఊఁ, అవును.

ఎడమ నేను: అయితే మరి, ‘పరవిశేష’ అనేది ఎలాంటి విశేషణం? స్వవిశేష విశేషణమా లేక పరవిశేష విశేషణమా?

నేను ఆలోచనతో బుర్ర గోక్కోవడం చూసి ఎడమ నేను కాస్త బుజ్జగింపుగా అంది:

ఎడమ నేను: మరొక్కసారి వాటి నిర్వచనాన్ని నెమరు వేసుకుందాం. తనలోని విశేషాన్ని తానే సూచించుకొనే లక్షణమున్న విశేషణం ‘స్వవిశేష విశేషణం’. తనలోని విశేషాన్ని తాను సూచించుకోనిది ‘పరవిశేష విశేషణం’. ఇప్పుడు ‘పరవిశేషం’ అనే విశేషణం స్వవిశేషమా పరవిశేషమా? అంటే అది తన గురించి తాను చెప్పుకుంటుందా చెప్పుకోదా?

నా ఆలోచన కొనసాగించాను…

నేను: ‘పరవిశేష’ అనేది ‘స్వవిశేష విశేషణం’ అనుకుందాం. అంటే, తాను స్వవిశేష విశేషణం అయ్యి కూడా ‘పరవిశేష’ అనే లక్షణాన్ని సూచిస్తోంది. ‘పెద్ద’ అనే పదం చిన్నదయి కూడా పెద్ద అనే లక్షణాన్ని సూచిస్తున్నట్టు. అప్పుడది తన గురించి తాను చెప్పుకోవడం లేదు. అలా అయితే అది ‘పరవిశేష విశేషణం’ కావాలి!

ఎడమ నేను: అవును. పోనీ పరవిశేష అన్నది పరవిశేష విశేషణం కావచ్చును కదా?

నేను: అలా అయితే, ‘చిన్న’ అనేది చిన్నపదమే అయినట్టు, తనలోని విశేషాన్ని గురించి తానే చెప్పుకున్నట్టు అవుతుంది. అలాంటప్పుడు అది ‘స్వవిశేష విశేషణం’ కావాలి, ‘పరవిశేష విశేషణం’ కాలేదు!

ఎడమ నేను: అద్గదీ సంగతి. ఇందులో తిరకాసు అర్థమయిందా? ‘పరవిశేష’ అనేది పరవిశేష విశేషణమా, స్వవిశేష విశేషణమా అని తేల్చి చెప్పడం వీలు కాని పని. పరవిశేషం అనుకుంటే స్వవిశేషం కావాలి, స్వవిశేషం అనుకుంటే అది పరవిశేషం కావాలి. ఒకే పదం రెండూ కాలేదు కదా!

అవును, ఇది ఒక పెద్ద చిక్కుముడే! ఈ చిక్కుముడిని అర్థం చేసుకోవడం కొద్దిగా బుద్ధికి పరిశ్రమే అయింది. దీని గురించి ఒకటికి రెండు మార్లు ఆలోచిస్తూ నడక సాగించాను. మెల్లిమెల్లిగా అర్థమయినట్టే అనిపించింది. కాకపోతే యీ తిరకాసులన్నీ–అవి ఆత్మసూచకాలైన వాక్యాల ద్వారా కావచ్చు, పదాల వల్ల కావచ్చు–వట్టి మాటల గారడీలుగా అనిపించాయి. ఎడమ నేనుతో అదే అన్నా. పైగా జయభేరిలో రేలంగి అన్నట్టు, ‘మాటలతో ఇరకాటం కాదు సజావైన సవాలు వెయ్’ అని కూడా అన్నాను. ఎడమ నేను గొంతులోంచి చిన్న నవ్వు వినిపించింది.

ఎడమ నేను: అలా అంటావా. నీకలా అనిపించడంలో ఆశ్చర్యమేమీ లేదులే. మహామహా తర్కశాస్త్రవేత్తలే దీని గురించి తర్జనభర్జనలు పడ్డారు. కానీ వీటిలోని తిరకాసుకు అసలు కారణం కేవలం మాటలు మాత్రం కాదు. ఆ మాటల వెనకనున్న అర్థాలు, ఆ అర్థాల వెనకనున్న తార్కిక ఆలోచన. ఆ ఆలోచనలోని ఆత్మసూచనే, అంటే తనను తానే సూచించుకొనే లక్షణమే అసలు మెలిక!

నా అపనమ్మకం ఎడమ నేనుకు అర్థమైపోయింది.

ఎడమ నేను: సరే, ఇది నీకు స్పష్టం కావాలంటే మరో చిట్టి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను.

కథ అనే సరికి కొత్త ఉత్సాహం వచ్చింది. చెప్పు చెప్పు అన్నట్టు తల ఊపాను.

ఎడమ నేను: అనగనగా ఒక పల్లెటూళ్లో ఒకే ఒక క్షురకుడు, అనగా బార్బర్ ఉన్నాడు. అతనికి ఒక నియమం ఉంది. ఆ ఊళ్లో తమకి తాము గడ్డం గీసుకోని వారికే అతను గడ్డం గీస్తాడు. తనకు తాను గడ్డం గీసుకొనే ఏ వ్యక్తికీ అతను గడ్డం గీయడు. చాలా సజావైన నియమం లాగానే ఉంది కదూ!

ఇందులో తిరకాసేమైనా ఉందేమోనని ఒక్క క్షణం ఆలోచించాను. ఏం కనిపించలేదు. అవునన్నట్టు తలూపాను.

ఎడమ నేను: అయితే దీనికి సమాధానం చెప్పు చూద్దాం. ఆ క్షురకుడు తన గడ్డం తాను గీసుకుంటాడా లేదా?

నేను: ఇదేం ప్రశ్న! తన గడ్డం తాను గీసుకోకుండా ఉంటాడా?!

ఎడమ నేను: అక్కడే ఉంది మరి తిరకాసు! నువ్వన్నట్టు తన గడ్డం తాను గీసుకుంటాడనుకుందాం. అప్పుడతను ‘ఆ ఊళ్ళో తమకి తాము గడ్డం గీసుకునే వ్యక్తుల’ గుంపులో చేరతాడు. కానీ అతని నియమం ప్రకారం ఆ గుంపులో ఏ వ్యక్తికీ అతను గడ్డం గీయకూడదు కదా. అంచేత తనకి తాను గడ్డం గీసుకోకూడదు!

ఓహో, అదా సంగతి! వచ్చిందిరా మెలిక అనుకున్నా.

ఎడమ నేను: పోనీ తనకు తాను గడ్డం గీసుకోడు అనుకుందాం. అప్పుడతను ‘ఆ ఊళ్ళో తమకి తాము గడ్డం గీసుకోని వ్యక్తుల’ గుంపులోకి చేరతాడు. అతని నియమం ప్రకారం ఆ గుంపులో ప్రతి వ్యక్తికీ అతను గడ్డం గీస్తాడు కాబట్టి, తనకి తాను గడ్డం గీసుకోవాలి!

నేను: పాపం ఆ క్షురకుడు తాను పెట్టుకున్న నియమంలో తానే చిక్కుకుని చివరకు గడ్డం గీసుకున్నాడో లేదో మరి!

ఎడమ నేను: నీ హాస్యం బాగానే ఉంది కానీ, ఈ కథలోని తిరకాసు కేవలం భాషకి సంబంధించినది కాదని ఒప్పుకుంటావా?

ఆ మెలిక గురించి ఆలోచిస్తూనే మెల్లిగా తలూపాను.

ఎడమ నేను: ఒక తార్కిక నియమం లేదా నిర్వచనం వల్ల ఏర్పడ్డ తిరకాసిది. ఇందులో మెలిక ఏమిటో జాగ్రత్తగా ఆలోచించు. ఒక వ్యక్తి (క్షురకుడు) ఒక నిర్వచనం ద్వారా మొత్తం ఊళ్లో ఉన్న వ్యక్తులను రెండు వేర్వేరు గుంపులుగా భాగించాడు. క్షురకుడు కూడా ఆ ఊరిలో మనిషే కాబట్టి ఆ రెండు గుంపుల్లో ఏదో ఒక దానిలో (ఒక దానిలో మాత్రమే) ఉండాలి. అయితే తాను చేసిన నిర్వచనాన్ని తనకే వర్తించుకోవలసి వచ్చినప్పుడు తిరకాసు ఏర్పడింది. ఆ రెండు గుంపులలో ఏ గుంపులో ఉంటాడు అనేది ఇదమిత్థమని నిర్ణయించడానికి వీల్లేకుండా పోయింది. ఇందులో కూడా అంతర్గతంగా ఉన్నది ఆత్మసూచన వల్ల ఏర్పడే తిరకాసే!

నిజమే. ఇందులో ఉన్న తిరకాసు వట్టి మాటల వల్ల ఏర్పడ్డది కాదు. రెండు గుంపులను నిర్వచించడంలో కూడా నిజానికి ఏ తిరకాసూ లేదు. ఆ నిర్వచనం ద్వారా క్షురకుడు పెట్టుకున్న నియమం, ఆ నియమాన్ని తనకు అన్వయించుకోవలసి రావడం దగ్గరుంది అసలు మెలిక. అర్థమయింది. అదే అన్నాను ఎడమ నేనుతో.

నేను: బావుంది తిరకాసు. మొత్తానికి నువ్వు భేతాళుడికి ఏమాత్రం తీసిపోకుండా మంచి చిక్కుప్రశ్నలనే సంధిస్తున్నావ్!

ఎడమ నేను: ప్రతి మనిషిలోనూ ఒక భేతాళుడు ఉంటూనే ఉంటాడు. అప్పుడప్పుడూ యిలా బయటపడుతూంటాడు. ఇంతకీ ఈ కథ ఎక్కడనుండి పుట్టిందో తెలీదు కానీ బెర్‌ట్రండ్ రసెల్ (Bertrand Russell) అనే పెద్దాయన ద్వారా వ్యాప్తిలోకి వచ్చింది.[9] ఇలాంటి తిరకాసునే రసెల్ గణిత పరిభాషలో తయారుచేసి అప్పటి సెట్ థియరీలో (సమితుల సిద్ధాంతం) ఉన్న పెద్ద లోపాన్ని బయటపెట్టాడు. అతని పేరు మీద అది రసెల్ పేరడాక్సుగా ప్రసిద్ధి చెందింది.[10]

నేను: అవును రసెల్ గురించి నేనూ విన్నాను. అతను బహుముఖ ప్రతిభాశాలి కదా. తర్కం ఆధారంగా అటు తత్త్వశాస్త్రాన్నీ, ఇటి గణితశాస్త్రాన్నీ నిర్మించడానికి ఆయన చేసిన కృషి అసామాన్యం అని కూడా చదివాను.

ఎడమ నేను: అవును. ఆధునిక కాలంలో పాశ్చాత్య గణిత శాస్త్రానికి గట్టి పునాది వేసినవాళ్ళలో రసెల్‌ది తిరుగులేని స్థానం.

నేను: ఇలా కాలికేస్తే మెడకీ, మెడకేస్తే కాలికీ అన్నట్టున్న యీ పేరడాక్సులని తీరికూర్చుని ఎవరు ఎందుకు సృష్టించారు? దీనికీ గణితశాస్త్రానికీ అసలు ఏమిటి సంబంధం?

ఎడమ నేను: మనిషన్న వాడికి ఎవడికైనా ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచనను ఒక పద్ధతిగా పేర్చి దానికొక శాస్త్రీయ రూపాన్ని యిచ్చేదే తర్కం. దాని మీద ఆధారపడి వృద్ధి చెందినదే గణితం. అలాంటి తార్కికమైన ఆలోచనకు సవాలు విసిరేవే పేరడాక్సులు. ఇవి ప్రాచీన కాలం నుంచీ మనిషి మేధను సవాలు చేస్తూనే ఉన్నాయి. ఆత్మసూచన అనే లక్షణం, తర్కశాస్త్రంలో జవాబులు లేని ప్రశ్నలెన్నిటినో మేధావుల ముందుంచింది.

నేను: ఓహో! అంటే రసెల్ కన్నా ముందే యీ ఆత్మసూచన గురించీ, అది సృష్టించే తిరకాసుల గురించీ అంతకు ముందున్న తర్కశాస్త్రవేత్తలు ఆలోచించారా?

ఎడమ నేను: నిస్సందేహంగా. పాశ్చాత్య చరిత్రలో తర్కశాస్త్రానికి చాలా గొప్ప ప్రాధాన్యం ఉంది. అసలు మనం చెప్పుకున్న ఉదాహరణలన్నీ తిరకాసులని భావించడానికి మూలకారణం పాశ్చాత్య తర్క సిద్ధాంతాలే. దాని వెనకనున్న వారి తాత్విక దృక్పథమే.

నేను: అవన్నీ తిరకాసులేగా. దాని వెనక పెద్ద సిద్ధాంతమూ దృక్పథమూ ఏముంది?

ఎడమ నేను: అది తెలియాలంటే పాశ్చాత్య తత్త్వ, తర్క శాస్త్రాల మూలాల గురించి కొద్దిగా తెలుసుకోవాలి…

నేను: ఎందుకు మరి తాత్సారం, తెలుసుకోడానికి నేను సిద్ధంగా ఉన్నా. చెప్పుమరి.

ఎడమ నేను గొంతు సవరించింది.
పాశ్చాత్యుల దృక్పథం
ఎడమ నేను: సరే. జాగ్రత్తగా విను. పాశ్చాత్యదేశాలలో చాలా కాలం వరకూ, తత్త్వశాస్త్రం (Philosophy), తర్కం (Logic), గణితం (Mathematics) – ఈ మూడూ ఒకదానితో ఒకటి పెనవేసుకొని వృద్ధి చెందాయి. మనకి కనిపించే ఈ భౌతిక ప్రపంచం, అభౌతికమైన ఒక హేతువు, తర్కం ఆధారంగా ఏర్పడిందనీ, నడుస్తోందనీ, ఆ తర్కమే పరమసత్యమనీ, దానిని మానవ మేధ ద్వారా అర్థం చేసుకోవచ్చుననే భావన పాశ్చాత్య తత్త్వ చింతనలో ఒక ప్రధాన స్రవంతిగా సాగింది. ఈ సిద్ధాంతంలో సత్యం అనేది సార్వజనికం (Non-subjective), వ్యక్తిని బట్టి మారదు. అది పూర్తిగా వస్తుగతం (Objective). ఈ సిద్ధాంతానికి ఆద్యుడు పైథాగరస్ (Pythagoras) అని చెప్పవచ్చును.

నేను: ఓహ్ పైథాగరస్! నేను స్కూల్లో పైథాగరస్ థియరమ్ చదువుకున్నాను. అతనేనా ఇతను?

ఎడమ నేను: అవును అతనే. పైథాగరస్ క్రీ.పూ. 500 కాలానికి చెందిన గ్రీకు తత్త్వవేత్త. పడమట దేశాలలో చాలా కాలం వరకూ రకరకాల శాస్త్రాల అభివృద్ధికి కేంద్రం గ్రీకుదేశమే. ప్రపంచాన్ని నడిపించేది గణిత సూత్రాలే అన్నది పైథాగరస్ సిద్ధాంతం. సంఖ్యలే ప్రపంచానికి మూల స్తంభాలనీ, వాటి మధ్యనున్న క్రమబద్ధమైన సూత్రాలే దాన్ని నడిపిస్తున్నాయనీ అతను సూత్రీకరించాడు. దానిని నిరూపించడానికి బలంగా కృషి చేశాడు. సంగీతం వెనకనున్న గణిత సూత్రాలను మొట్టమొదటగా కనుగొన్నది అతడే. సంఖ్యాశాస్త్రం (Number System), జ్యామితి (Geometry) మొదలైన గణిత శాస్త్ర అంశాలలో ఎన్నో సూత్రాలను పైథాగరస్ నిరూపించాడు. గ్రహగమనం వెనక కూడా నిర్దిష్టమైన గణిత సూత్రాలున్నాయని అతను ఊహించాడు.

నేను: ఓహో. పైథాగరస్ అంటే ఒక గణితశాస్త్రవేత్త అనే అనుకున్నాను. తత్త్వవేత్త కూడా అన్నమాట.

ఎడమ నేను: అవును. పైథాగరస్ ప్రభావం ఆ తర్వాతి గ్రీకు తత్త్వవేత్తలు చాలామందిపై పడింది. వారిలో ప్లేటో, అతని శిష్యుడు అరిస్టాటిల్ ముఖ్యులు.

నేను: ఆఁ! సోక్రటీస్ శిష్యుడు ప్లేటో, అతని శిష్యుడు అరిస్టాటిల్, అతని శిష్యుడు అలెక్జాండర్, వీళ్ళది గొప్ప గురుశిష్య పరంపర అని చదివాను.

ఎడమ నేను: అవును. వీళ్ళలో అరిస్టాటిల్ పాశ్చాత్య తర్కశాస్త్రానికే ఆద్యుడని చెప్పవచ్చు. అతను వేసిన పునాదుల మీదనే తర్కశాస్త్రం చాలా వరకూ నిర్మించబడింది. హేతుబద్ధమైన ఆలోచనకు అరిస్టాటిల్ చాలా గొప్ప స్థానం ఇచ్చాడు. ఆయన దేవునికి యిచ్చిన నిర్వచనం ఏమిటో తెలుసా?’

నేను: దేవుడికి నిర్వచనమా!

ఎడమ నేను: అవును. ‘ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన’[11]

నేను: ఓహ్! ఈ ఆలోచన చాలా చిత్రంగా ఉందే!

ఎడమ నేను: చిత్రమే మరి! ఒకరకంగా తర్కం అంటే ఆలోచన గురించిన ఆలోచనే కదా. అంటే అరిస్టాటిల్ దృష్టిలో దైవం తర్కస్వరూపం అన్న మాట!

నేను: ఓహో!

ఎడమ నేను: తర్కానికి సంబంధించి అరిస్టాటిల్ చేసిన రచనలన్నింటినీ కలిపి అతని శిష్యులు ఆర్గనాన్ (Organon) అన్న పేరుతో సంకలనం చేశారు. ఆర్గానన్ అంటే సాధనం.

నేను: ఇంగ్లీషులో ఆర్గన్ అనే పదానికీ దీనికీ సంబంధం ఉందా?

ఎడమ నేను: అవును, దాని మూలం ఈ పదమే. ఒక పని చేయడానికి ఇంద్రియం సాధనం కాబట్టి దానికా పేరు వచ్చింది. అందుకే సంస్కృతంలో కూడా ఇంద్రియాలను కరణాలు అంటారు. కరణం అన్నా పని చేసే సాధనం అనే అర్థం. ఆలోచనను అర్థం చేసుకొనే సాధనం తర్కం. అందుకే అరిస్టాటిల్ తర్క సంకలనానికి ఆ పేరు సరిగ్గా సరిపోయింది.

నేను: బావుంది.

ఎడమ నేను: తర్కశాస్త్రంలో, అనగా లాజిక్కులో ప్రధానమైన అంశం ఏమిటి?

చెపుతూ చెపుతూ మధ్యలో నాకీ పరీక్షలెందుకు? కొద్దిగా ఆలోచించి జవాబిచ్చాను.

నేను: మనకి కచ్చితంగా తెలిసున్న విషయాల ఆధారంగా కొన్ని ప్రతిపాదనలు చేయడం. ఆ ప్రతిపాదనల సత్యాసత్యాలను తర్క సూత్రాలను అనుసరించి నిరూపించడం.

ఎడమ నేను: సరిగానే చెప్పవు. తర్కశాస్త్రంలో, ముఖ్యంగా పాశ్చాత్య తర్కంలో యిదే ప్రధానమైన అంశం. ప్రతిపాదనల తప్పొప్పుల నిర్ణయాన్ని గురించి విచారించి, మొట్టమొదటిసారిగా కొన్ని నిర్దిష్టమైన తార్కిక సూత్రాలను తయారు చేసింది అరిస్టాటిలే. ప్రతిపాదనల తప్పొప్పుల గురించి అరిస్టాటిల్ కన్నా ముందు అతని గురువు ప్లేటో, ప్లేటో గురువు సోక్రటీసు కూడా ఆలోచించారు. వాటిని వివరంగా సూత్రబద్ధం చేసినది మాత్రం అరిస్టాటిల్.

నేను: ప్రతిపాదనల తప్పొప్పుల గురించి సూత్రాలేముంటాయి. అయితే ఒప్పు, లేకపోతే తప్పు అంతే కదా!

ఎడమ నేను: నీకిది చాలా తేలికయిన విషయంలా అనిపించవచ్చు కానీ, సరిగ్గా నువ్వు ఇప్పుడన్నదే అరిస్టాటిల్ సూత్రాలలో ఒక ముఖ్యమైన సూత్రం. దాన్ని ‘మూడో దారి అసాధ్యం’ అంటారు.[12] అంటే ఒక విషయాన్ని ప్రతిపాదించే ఏ వాక్యమైనా సరే నిజమైనా అవ్వాలి లేదా అబద్ధమైనా అవ్వాలి, మరొక మూడో దారి అన్నది అసాధ్యం. ఉదాహరణకు ‘ఇండియా మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ’ అనే వాక్యం ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నది కదా. అది నిజమైనా కావాలి, అబద్ధమైనా కావాలి. అది నిజం అని మనకు తెలుసు. అలాగే ‘రెండు రెళ్ళు ఆరు’ అనే వాక్యం కూడా ఒక ప్రతిపాదనే. అది అబద్ధం అని కూడా మనకు తెలుసు.

నేను: ఓహో, ఇంత చిన్న విషయానిక్కూడా ఒక సూత్రం ఉండాలా!

ఎడమ నేను: మరి. సరే అయితే యీ ప్రతిపాదన నిజమో అబద్ధమో చెప్పు: వచ్చే ప్రపంచ కప్పు ఇండియా గెలుస్తుంది.

నేను: అదెలా చెప్పగలం. నిజమైనా కావచ్చు అబద్ధమైనా కావచ్చు.

ఎడమ నేను: యిప్పుడే కదా ఒప్పుకున్నావు ఒక ప్రతిపాదన నిజమైనా కావాలి అబద్ధమైనా కావాలి, మూడో మార్గం లేదని. పైగా అదొక పెద్ద విషయమా అని కూడా అడిగావు! మరి నేను చెప్పిన ప్రతిపాదన ఒప్పయినా, తప్పయినా కూడా కావచ్చు అంటున్నావ్?

మళ్లీ బుర్ర గోక్కోవడం నా వంతయింది.

ఎడమ నేను: కొన్ని ప్రతిపాదనలు నిజమో అబద్ధమో ఆ ప్రతిపాదన చేస్తున్న సమయంలో తెలియకపోవచ్చును. వచ్చే ప్రపంచ కప్పు గురించిన ప్రతిపాదన అలాంటిది. అది నిజమో అబద్ధమో మనకిప్పుడు తెలియదు. కానీ ఆ వాక్యం నిజమో, అబద్దమో అయి తీరాలని మాత్రం తెలుసు కదా!

నేను: ఆఁ, అవును. ఆ ప్రతిపాదన సత్యాసత్యాలను ప్రస్తుతానికి నిర్ణయించలేం కానీ, నిర్ణయించగలిగినప్పుడు అది కచ్చితంగా నిజమో అబద్ధమో అవుతుంది. అర్థమయింది.

ఎడమ నేను: అరిస్టాటిల్‌దే మరొక సూత్రం: ‘ఒకేసారి ఒక ప్రతిపాదన, దాని వ్యతిరేక ప్రతిపాదన, రెండూ నిజం కాలేవు’.[13] అంటే ఒకేసారి ఒక ప్రతిపాదన నిజమూ అబద్ధమూ కూడా కావడం అసాధ్యం. ఉదాహరణకు, ‘తెల్లనివన్నీ పాలు’ అనే ప్రతిపాదన అబద్ధం అయితే, ‘తెల్లనివన్నీ పాలు కావు’ అనేది నిజం అవుతుంది. అలాగే ‘ప్రతి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీలు అవుతుంది’ అనే ప్రతిపాదన నిజమైతే దాని వ్యతిరేక ప్రతిపాదన ‘ప్రతి త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎప్పుడూ 180 డిగ్రీలు కావు’ అనేది అబద్ధమే అవుతుంది.

నేను: ఈ సూత్రానికీ ముందు నువ్వు చెప్పిన సూత్రానికీ పెద్దగా తేడా ఏముంది?

ఎడమ నేను: పెద్దగా లేదు కానీ కొద్దిగా ఉంది. జాగ్రత్తగా ఆలోచించు. అదలా ఉంచితే, యింతకు ముందు చెప్పుకున్న తిరకాసులన్నింటి వెనుకా యీ సూత్రాలే పనిచేస్తున్నాయన్న విషయం గమనించావా? ఒక ప్రతిపాదన తప్పొప్పులను కచ్చితంగా నిర్ణయించగలగాలి అనే నిశ్చయాత్మకత యీ రెండు సూత్రాల వెనుకా ఉంది. అలా నిర్ణయించలేని ప్రతిపాదనలు విరోధాలుగా, పేరడాక్సులుగా పరిగణించబడ్డాయి.

నేను: ఓహో. అంటే ఒకేసారి నిజమూ అబద్ధమూ కూడా అయ్యే ప్రతిపాదనలు పేరడాక్సులన్న మాట.

ఎడమ నేను: అవును. తప్పొప్పుల తిరకాసులో జరిగేది అదే కదా. అయితే, కొన్ని ప్రతిపాదనలు పైకి తిరకాసుగా కనిపించినా అందులో నిజానికి విరోధం ఉండదు. తిరకాసు కాని తిరకాసు. అలాంటిదొకటి ఇప్పటికే నేను నీకు చెప్పాను! ఏమిటో కనుక్కో చూద్దాం.

మళ్లీ నాకు పరీక్ష! ఎడమ నేనులో యింతటి పరీక్షాధికారి ఒకడున్నాడని యింత కాలం నాకు తెలియనే లేదు! మళ్లీ బు. గో. మొదలుపెట్టాను.

ఎడమ నేను: సరే నేనే చెప్తాను. తప్పొప్పుల తిరకాసు అతిప్రాచీన రూపాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకో.

నేను: గుర్తుకొచ్చింది. ‘క్రీటనులందరూ వట్టి అబద్ధాలకోరులు, ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అని ఒక క్రీటన్ అంటే ఆ వాక్యం నిజమా అబద్ధమా?

ఎడమ నేను: ఇందులో ఉన్న తిరకాసేమిటో చెప్పు?

నేను: ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అన్న వాక్యం నిజం అనుకుందాం. ఆ వాక్యాన్ని చెప్పింది కూడా క్రీటనే కాబట్టి, అది కూడా అబద్ధమే కావాలి. ఇది విరోధానికి దారి తీస్తోంది. అదే కదా తిరకాసు?

ఎడమ నేను: సరే, మరి ఆ వాక్యం అబద్ధమైతే?

నేను: అంటే, క్రీటనులు అబద్ధం చెప్పరన్నమాట. మరి అప్పుడు ఆ క్రీటను చెపుతున్నది నిజం కావాలి కదా?

ఎడమ నేను: అక్కడే ఉంది లాజిక్కులోని అసలు ట్రిక్కు. ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అనే వాక్యానికి వ్యతిరేక వాక్యం ఏమిటి? జాగ్రత్తగా ఆలోచించు.

నేను: ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్పరు’

ఎడమ నేను: అంటే?

నేను: అంటే ఎప్పుడో ఒకప్పుడు నిజం కూడా చెప్తారు అని.

ఎడమ నేను: అంతే కదా. అంటే ఎప్పుడూ నిజం చెప్తారు అని కాదు కదా?

నేను: కాదు.

మెల్లిగా ట్యూబులైటు వెలుగుతోంది.

ఎడమ నేను: ఎప్పుడో ఒకప్పుడు నిజం చెప్తారు. ఎల్లప్పుడూ నిజం చెప్పాలని లేదు. అంచేత ఆ క్రీటన్ చెప్పిన ‘క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారు’ అన్న వాక్యం నిజం అవ్వాలని లేదు.

నేను: అవును అబద్ధం అనుకుంటే ఏ చిక్కూ లేదు. నిజం అనుకుంటేనే యిబ్బంది.

ఎడమ నేను: అంచేత ఆ వాక్యం కచ్చితంగా అబద్ధమేనని నిర్ణయించవచ్చు. కాబట్టి యిక్కడున్నది నిజమైన విరోధం కాదు, విరోధాభాస మాత్రమే! ఇది పూర్తి తిరకాసు కాదన్నమాట, అరతిరకాసు మాత్రమే!

నేను: అరతిరకాసు, బావుంది!

ఎడమ నేను: ఇలా, ఒక ప్రతిపాదనను నిజమనుకొని, దాని ద్వారా విరోధం ఏర్పడుతుందని నిరూపించి, అందువల్ల ఆ ప్రతిపాదన తప్పే అయ్యుండాలని నిర్ధారణ చేయడం తర్కశాస్త్రంలో ఒక ప్రసిద్ధమైన వాద పద్ధతి. దీనిని గణితశాస్త్రంలో కూడా చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఇంగ్లీషులో దీనిని Proof By Contradiction అంటారు.[14] భారతీయ న్యాయశాస్త్రంలో దీనిని ‘ప్రమాణ బాధిత అర్థప్రసంగం’ అని పేర్కొన్నారు.

నేను: ఓహో. అర్థమయింది. అయితే ఈ పద్ధతి విరోధాభాసల విషయంలోనే సాధ్యమవుతుంది. నిజమైన విరోధం ఉన్నప్పుడు మాత్రం సాధ్యం కాదు కదా? ‘ఈ వాక్యం నిజం కాదు’ అనే ప్రతిపాదన తీసుకుంటే అందులో సిసలైన విరోధం ఉంది. అది నిజమని తీసుకుంటే అబద్ధమని నిరూపించవచ్చు. కానీ అబద్ధమని తీసుకుంటే తిరిగి నిజమని నిరూపించవచ్చు. అంచేత అది అసలుసిసలైన పూర్తి తిరకాసు!

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు. ఇప్పటికి నీకు బాగా అర్థమైనట్టుంది! అరిస్టాటిల్ విస్తృతంగా ప్రచారం చేసిన యీ తార్కిక ఆలోచనా విధానం ఆధునిక కాలం వరకూ చాలా ప్రభావాన్ని చూపించింది, ఇంకా చూపిస్తోంది కూడా! ఈ ఆలోచనా ధోరణిలో, తర్కానికి లొంగని తిరకాసులను అసంగతాలుగా అసంబద్ధాలుగా పాశ్చాత్య తార్కికులు త్రోసిపుచ్చారు. వట్టి మాటల గారడీలని కొట్టిపారేశారు కూడా. ఎదుటివాళ్ళ వాదన తర్కసమ్మతం కాదని నిరూపించడానికి మాత్రం ఈ వాదపద్ధతి బాగా ఉపయోగపడింది.

నేను ఓహో అంటూ అప్పటిదాకా ఎడమ నేను చెప్పిన పాశ్చాత్య తర్కాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక వాక్యం నిజమో అబద్ధమో కావాలన్నది మామూలు బుద్ధికి సరైనదనే అనిపిస్తుంది. దానినే అరిస్టాటిల్ సూత్రబద్ధం చేశాడు. ఒక వాక్యం నిజమైతే దానికి సరైన వ్యతిరేక వాక్యం అబద్ధం కావాలన్న అంశాన్ని కూడా సూత్రీకరించాడు. తార్కికులందరూ ఈ సూత్రాలపైనే తర్కశాస్త్రాన్ని నిర్మించారు. తనను తాను సూచించుకొనే లక్షణమున్న కొన్ని వాక్యాలు–అటు నిజమూ, యిటు అబద్ధమూ కూడా కాకుండా పోయేవి ఎదురైనప్పుడు వాటిని తర్కసమ్మతం కాని తిరకాసులుగా కొట్టిపారేశారు. ఇంత వరకూ అర్థమయింది. అయితే మరి రసెల్ అనే ఆ పెద్దాయన, పైగా గణితవేత్త, తీరి కూర్చుని అలాంటి ఒక పేరడాక్సుని సృష్టించడం ఎందుకు? అదే ప్రశ్న అడిగాను.

ఎడమ నేను: మంచి ప్రశ్న వేశావు. పాత కాలపు మేధావులు అసంగతాలుగా కొట్టిపారేసినా, ఆధునికకాలంలో తర్కశాస్త్రాన్ని ఆధారం చేసుకొని గణితశాస్త్రాన్ని పటిష్ఠంగా నిర్మించాలన్న ప్రయత్నాలు మొదలైనప్పుడు, ఈ పేరడాక్సులు ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా తయారయ్యాయి. వాటికి ఏదో ఒక సమాధానం చెపితే తప్ప, తర్కమూ దానిపై ఆధారపడే గణితమూ స్థిరంగా నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పందొమ్మిది యిరవై శతాబ్దాల సంధి కాలంలో తర్క గణితశాస్త్రాలను సవాలు చేసే తిరకాసులు ఒక్కసారిగా వెల్లువెత్తాయి.[15] అప్పటి సిద్ధాంతాలలోని లోపాలను, వాటికున్న పరిమితులను అన్వేషించే క్రమంలో తర్కవేత్తలే యిలాంటి తిరకాసులను సృష్టించారు.

నేను: ఓహో! అంటే రసెల్ పేరడాక్సుని కూడా రసెల్ అందుకే తయారుచేశాడన్న మాట.

ఎడమ నేను: అవును. గణితశాస్త్రంలో ఒక ముఖ్యమైన అంశం సమితులు, అంటే Sets. ఆ సమితుల గురించి అప్పటి సిద్ధాంతాలలో ఉన్న పరిమితులను విశ్లేషించే సందర్భంలో, క్రీ.శ. 1901లో రసెల్ దానిని కనుగొన్నాడు. ఈ వెల్లువెత్తిన తిరకాసులన్నింటి వెనకా దాగిన మూలసూత్రం ఒకటే: ఆత్మసూచన! అపుడున్న గణిత సిద్ధాంతాలను ఆధారంగా, వాటికి అణుగుణంగానే ఆ పేరడాక్సులను తయారు చేయగలగడం, అసలు తలనొప్పికి కారణం. ఇలాంటి అసంగతమైన విరోధాలకు తావిచ్చేలా సూత్రాలూ, వాటిపై ఆధారపడిన సిద్ధాంతాలూ ఉన్నాయంటే వాటిలో ఏదో లోపం ఉన్నట్టే కదా. అలాంటి దోషపూరితమైన, లేదా అసంపూర్ణమైన సిద్ధాంతాలను ఆధారం చేసుకుని ఒక పటిష్ఠమైన శాస్త్రాన్ని నిర్మించడం ఎలా? ఇదీ ఆనాటి శాస్త్రవేత్తలకు ఆత్మసూచన విసిరిన సవాలు.

నేను: చాలా పెద్ద సవాలే విసిరిందన్న మాట!

ఎడమ నేను: అవును. దీనిని మొట్టమొదటగా ఢీకొట్టి ఎదుర్కొన్నది కూడా రసెల్ అనే చెప్పవచ్చు.

నేను: ఓహో! అతనెలా ఢీకొన్నాడు?

ఎడమ నేను: ఆ పేరడాక్సులన్నింటి వెనక ఉన్నది, ఏదో ఒక రకమైన ఆత్మసూచనే అని గుర్తించాడు. కాబట్టి అసలు ఆ ఆత్మసూచన అనేదాన్ని శాస్త్రంలో నిషేధించాలని అతను ప్రతిపాదించాడు. ఆత్మసూచనను ఒక విషవలయంగా (vicious circle) పేర్కొన్నాడు![16] అంచేత ఏ ప్రతిపాదన అయినా, తన గురించి తాను ఎలాంటి ప్రతిపాదనా చేయకూడదని అతను నియమం చేశాడు.

నేను: అంటే తప్పొప్పుల తికమకలో వచ్చే వాక్యాలు–‘ఈ వాక్యం అబద్ధం’ మొదలైనవి–శాస్త్రబద్ధమైన ప్రతిపాదనలు కావన్నమాట!

ఎడమ నేను: అవును. రసెల్ నియమం ప్రకారం కావు.

నేను: ఈ, ఇది, నేను, నా, మొదలైన సర్వనామాలు ఉపయోగించకుండా ఒక వాక్యం తన గురించి తాను చెప్పుకోగలదా?

ఎడమ నేను: ఆలోచించు. అలాంటి వాక్యాల గురించి యింతకుముందే మనం మాట్లాడుకున్నాం.

నేను: క్రీటనులందరూ ఎప్పుడూ అబద్ధమే చెప్తారని ఒక క్రీటన్ చెప్పడం.

ఎడమ నేను: అవును. అయితే అందులో నేరుగా క్రీటన్ క్రీటనుల గురించి చెప్పినట్టు ఉంది. అలా నేరుగా సూచనలేని వాక్యాలు కూడా తయారు చేయవచ్చు.

నేను:అదెలా?

ఎక్కడో దూరం నుంచి ఒక గొంతు బుసబుసగా వినిపించింది: ‘చివర క్రియాపదంతో అంతమయ్యేదే సరైన తెలుగు వాక్యం.’

నేను: ఓహ్, మనతో పాటు ఎవరో కూడా వస్తున్నారే!

ఎడమ నేను: అవునవును. ఇంతకీ ఆ వాక్యం సంగతేమిటి?

నేను: ఆ వాక్యంలో సర్వనామాలేం లేవు. తానొక తెలుగు వాక్యమై ఉండి, తెలుగు వాక్యాన్ని నిర్వచిస్తోంది. పైగా, క్రియాపదంతో అంతమయ్యేదే సరైన తెలుగు వాక్యం అన్నది ఆ నిర్వచనం. ఆ వాక్యం మాత్రం క్రియతో అంతం కావడం లేదు! అంటే అది చెపుతున్న విషయం తప్పా ఒప్పా?

ఎడమ నేను: సరిగ్గా గుర్తుపట్టావు. అది తన గురించి తాను ప్రతిపాదించుకొనే వాక్యమే. ఒక ప్రతిపాదన నేరుగా తన గురించి తాను చెప్పకపోయినా, ఒక సమూహం గురించి చెపుతూ ఆ సమూహంలో తానొక భాగమైతే అది కూడా ఆత్మసూచన కిందకే వస్తుంది, కానీ ఇందులో తిరకాసుందేమో ఆలోచించు?

నేను: ఆ వాక్యం ఒప్పనుకుంటేనే ఇబ్బంది. తప్పయితే ఏ యిబ్బందీ లేదు. అంటే ఇది అరతిరకాసన్న మాట!

ఎడమ నేను: అవును.

నేను: మరి యిలాంటి వాక్యాలు రసెల్ ప్రకారం శాస్త్ర సమ్మతమైన ప్రతిపాదనలేనా?

ఎడమ నేను: లేదు. ఆత్మసూచన అంటూ ఉన్నది కాబట్టి, రసెల్ నియమం ప్రకారం అది కూడా శాస్త్రసమ్మతమైన ప్రతిపాదన కాదు!

నేను: అంటే తిరకాసేమీ లేకపోయినా ఆత్మసూచన ఉన్న ప్రతిపాదన శాస్త్రసమ్మతం కాదన్నమాట.

ఎడమ నేను: అవును. అలాగే ఏదైనా ఒక నిర్దిష్ట భావాన్ని నిర్వచించేటప్పుడు ఆ నిర్వచనంలో ఆ చెపుతున్న భావం ఒక భాగం కాకూడదు. అంటే ఉదాహరణకు ‘స్వవిశేష విశేషణం’, ‘పరవిశేష విశేషణం’ అనే నిర్వచనాన్ని ఆ పదాలకు తిరిగి అన్వయించడానికి వీలులేదు. ఈ రకంగా అసలు ఆత్మసూచన అనే లక్షణాన్నే తర్క గణితశాస్త్రాలనుండి బహిష్కరించి ఊపిరి పీల్చుకున్నాడు రసెల్.

నేనుకూడా కాస్త ఊపిరి పీల్చుకున్నాను.

నేను: మొత్తానికి ఆత్మసూచనకి జీవిత బహిష్కరణ శిక్ష వేయడంతో తర్క గణిత శాస్త్రాలు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయన్న మాట!

ఎడమ నేను: అబ్బే, ఇల్లలగ్గానే పండగా! ఆత్మసూచనను బొత్తిగా కాదంటే అసలు గణితశాస్త్రంలో కొన్ని నిర్వచనాలే అసాధ్యాలైపోతాయి! ‘సమితి’ (Set) అనే ఒక భావాన్ని (concept) తీసుకుంటే, రసెల్ నియమం ప్రకారం ఏదైనా ఒక సమితిని నిర్వచించేటప్పుడు, ఆ నిర్వచనంలో సమితి అనేది భాగం కాకూడదు. అంటే సమితుల సమూహాన్ని మరొక సమితిగా నిర్వచించడం కుదరదు. కానీ గణితశాస్త్రంలో చాలా సమితులను అలా నిర్వచించాల్సిన అవసరం వస్తుంది. అలాంటి నిర్వచనాలు ఎలా సాధ్యం?

నేను: మళ్లీ యిదొక చిక్కా! ఆమాత్రం రసెల్ ఆలోచించలేదా?

ఎడమ నేను: అది ఆషామాషీగా ఆలోచిస్తే తేలే విషయం కాదు మరి! అయినా రసెల్ దానికొక మందు కనిపెట్టాడు.

నేను: ఈ రసెల్ ఎవడో అసాధ్యుడిలా ఉన్నాడే!

ఎడమ నేను: అవును. అలాగే అనుకోవచ్చు. ఇంతకీ అతను చూపిన తరుణోపాయం ఏమిటంటే, ప్రతి భావానికీ ఒక తరగతిని అంటగట్ట వచ్చును. అంటే ఉదాహరణకు సంఖ్యలన్నీ ఒకటవ తరగతికి చెందిన భావాలు అనుకుందాం. అప్పుడు సంఖ్యల సమితి అనేది దానిపై తరగతికి, అంటే రెండో తరగతికి చెందిన భావం అవుతుంది. సంఖ్యా సమితుల సమితి అనేది దానికన్నా పై తరగతికి, అంటే మూడో తరగతికి చెందిన భావం అవుతుంది. ఇలా భావాలను తరగతుల దొంతరగా (hierarchy) నిర్వచించాలి. అప్పుడు ఆత్మసూచన నిషేధ నియమం ఒకే తరగతికి, లేదా అంతకన్నా పై తరగతికి చెందిన భావాల విషయంలోనే వర్తిస్తుంది. అంటే ఒక భావాన్ని నిర్వచించేటప్పుడు, అదే తరగతిలో ఉన్న భావాలను కానీ, అంత కన్నా పై తరగతిలో ఉన్న భావాలను కానీ ఉపయోగించకూడదు. తన కన్నా కింద తరగతిలో ఉన్న భావాలను తన నిర్వచనంలో ఉపయోగించవచ్చును. ఇలాంటి తరగతులతో కూడిన సిద్ధాంతానికి తరగతి సిద్ధాంతం (Type theory) అని పేరు.

నేను: ఆగాగు. నన్ను కొంచెం ఆలోచించుకోనీ.

ఎడమ నేను: సరే నీకు అర్థమవ్వడానికి ఒక ఉదాహరణ యిస్తాను. ఇటుకలతో ఒక గోడ కడుతున్నాం అనుకో. ఒక దానిపై ఒకటిగా, ఇటుకల వరసలని ఒక దొంతరగా పేరుస్తాం కదా.

నేను: అవును.

ఎడమ నేను: అందులో అన్నిటికన్నా కిందనున్న ఇటుకల వరస పైన మరొక ఇటుకల వరస పేరుస్తాం. ఇప్పుడు ఆ కింద వరసలో ఇటుకలని ఆధారం చేసుకొని పై వరసలో ఇటుకలు ఉన్నాయా, పై వరసలో ఇటుకలను ఆధారం చేసుకొని కింద వరసలో ఇటుకలున్నాయా?

నేను: కింద వరసమీద ఆధారపడి పై వరసలో ఇటుకలున్నాయి.

ఎడమ నేను: అలానే ఆ రెండో వరసమీద మరొక వరస వేస్తే, ఆ మూడో వరస ఇటుకలు, కింద రెండు వరసలమీదా ఆధారపడి ఉంటాయి అంతేనా?

నేను: అవును. అలాగే ఒక వరసలో ఇటుకలు తమపై తాము ఆధారపడవు.

ఎడమ నేను: కరెక్ట్. గణితశాస్త్రంలో ప్రతిపాదనలు కానీ నిర్వచనాలు కానీ సరిగ్గా అలా ఒక దొంతరలో ఉండాలన్నది రసెల్ నియమం. ఇలా ఎలాగో అలా మొత్తానికి రసెల్ ఆత్మసూచన వల్ల ఏర్పడే తిరకాసులను ఎదుర్కొని విజయవంతంగా ఒక పటిష్ఠమైన, అంటే దోషరహితమైన, సంపూర్ణమైన గణిత సిద్ధాంతాన్ని తయారు చేశాడు. చేశానని అనుకున్నాడు.

నేను: మళ్లీ ఆ ‘అనుకున్నాడు’ ఏమిటి? నిజంగా తయారు చేయలేదా?

ఎడమ నేను: దాని గురించి తర్వాత చెప్పుకుందాం కానీ ముందిది ఆలోచించు. తనను తాను (పూర్తి వాక్యాన్ని) సూచించే సర్వనామాలు ఉపయోగించకుండా, అలాగే తానుండే ఒక సమూహాన్ని నేరుగా సూచించకుండాను, తన గురించి తాను ప్రతిపాదించే వాక్యం ఏదైనా తయారు చేయగలవా?

మళ్లీ ఇంకొక భేతాళ ప్రశ్న! ఈసారి నానుండి అంత వేగిరం సమాధానం రాదని ఎడమ నేనుకి తెలిసిపోయింది.

ఎడమ నేను: దీని గురించి తీరికగా ఆలోచించు, తొందరేమీ లేదు.

నేను: అలాగే. అయితే ఆత్మసూచన విసిరిన సవాళ్ళ గురించి ఆలోచించినది ఒక్క రసెలేనా, ఇంకెవరైనా కూడా ఉన్నారా?

ఎడమ నేను: ఇంకా ఉన్నారు. అయితే అతని తర్వాత వచ్చిన శాస్త్రజ్ఞులు చాలా వరకూ అదే రసెల్ చూపిన దారిలోనే వెళ్ళారు. టార్‌స్కీ (Alfred Tarski) అనే పోలిష్ శాస్త్రవేత్త 1930లో భాషకి కూడా అలాంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు.

నేను: అంటే?

ఎడమ నేను: మనం చేసే ప్రతిపాదనలు ఒక భాష ద్వారానే కదా చేస్తాం?

నేను: అవును.

ఎడమ నేను: అయితే ఆ ప్రతిపాదనలు భౌతిక జగత్తులోని అంశాల గురించి కావచ్చు, లేదా భాషకి సంబంధించినవే కావచ్చు.

నేను: అంటే?

ఎడమ నేను: మచ్చుకి, ‘పాలు తెల్లగా ఉంటాయి’ అనేది ఒక తెలుగు వాక్యం. అందులో ‘పాలు’, ‘తెలుపు’ అనేవి భాషలోని అంశాలు కావు. భౌతిక జగత్తులో ఉన్న వస్తువులు, వాటికున్న గుణాలూను. వాటి గురించిన ప్రతిపాదన ఒక తెలుగు వాక్యంలో చేశాం. అవునా?

నేను: అవును.

ఎడమ నేను: అలాగే కొన్నిసార్లు మనం చేసే ప్రతిపాదనలు ఆ భాషకి సంబంధించినవే కూడా అవుతాయి. మచ్చుకి ‘తెలుగులో ఏబైయ్యారు అక్షరాలున్నాయి’ అనే వాక్యం.

నేను: అవునవును! ‘చివర క్రియాపదంతో అంతమయ్యేదే సరైన తెలుగు వాక్యం’ అన్నది కూడా అలాంటిదే కదా!

ఎడమ నేను: సరిగ్గా చెప్పావు. ఇవి ఒక భాష గురించి అదే భాషలో చేస్తున్న ప్రతిపాదనలు. టార్‌స్కీ సిద్ధాంతం ప్రకారం, అలాంటి వాక్యాలను వేరే తరగతికి చెందిన భాషగా గుర్తించాలి. దీనిని అతను మెటా-లేంగ్వేజ్ అంటాడు. భౌతిక వస్తువుల గురించి చెప్పే భాష ఒకటో తరగతికి చెందినదైతే, భాషను గురించి చెప్పే భాష రెండో తరగతికి చెందుతుంది. ఈ రకంగా అతను భాషల దొంతరను నిర్వచించాడు. అలా భాషలను దొంతరగా రూపొందిస్తే అప్పుడు అందులో ఆత్మసూచన ఉండదనీ, తద్వారా వచ్చే తిరకాసులను అధిగమించ వచ్చుననీ సిద్ధాంతం చేశాడు.

నేను: కానీ వ్యాకరణం అంతా ఒక భాష గురించి, అదే భాషలో చేసిన ప్రతిపాదనలే కదా! ఇందులో దొంతర ఎక్కడుంది?

ఎడమ నేను: నిజమే. టార్‌స్కీ చేసిన సిద్ధాంతం శాస్త్రీయ భాషలకు (Formal Languages)[17] వర్తిస్తుంది తప్ప, సహజ భాషలకు (Natural languages) వర్తించదు. సహజ భాషలలో ఆత్మసూచన అనివార్యం, దాని ద్వారా ఏర్పడే తిరకాసులను తప్పించుకోనూ లేము!

నేను: హమ్మయ్య! అయితే మామూలుగా మనం మాట్లాడుకొనే భాషల్లో యథేచ్ఛగా తిరకాసులను సృష్టిస్తూనే ఉండొచ్చన్న మాట!

ఎడమ నేను: ఆహా, భేషుగ్గా! ఆత్మసూచన గురించీ దానివల్ల ఏర్పడే పేరడాక్సుల గురించీ తత్త్వవేత్తలు, తర్కశాస్త్రజ్ఞులూ ఇప్పటికీ ఆలోచనలు సాగిస్తూనే ఉన్నారు. కొంతకాలం కిందట జోర్గెన్‌సెన్ (Jorgen Jorgensen) అనే తత్త్వశాస్త్రవేత్త అసలు ఆత్మసూచన అన్నదే బూటకమని, దానివల్ల ఏర్పడ్డవని చెపుతున్న పేరడాక్సులన్నింటినీ చాలా తేలికగా పరిష్కరించవచ్చుననీ ఒక ఆసక్తికరమైన వాదన చేశాడు.[18]

నేను: ఇంత కథా చెప్పి ఆఖరికి అసలు ఆత్మసూచనే బూటకమనడం అన్యాయం!

ఎడమ నేను: తర్కానికి సత్యాసత్యాలతోనే తప్ప న్యాయాన్యాయాలతో పెద్దగా సంబంధం లేదు!

నేను: ఇంతకీ ఏమిటిట జోర్గెన్‌సెన్ వాదన?

ఎడమ నేను: భాషలో ఎప్పుడూ ఒక పదం కానీ వాక్యం కానీ వేరొక విషయానికి చిహ్నం, అంటే గుర్తు. అలా సూచించబడే విషయం వేరే ఒకటి అప్పటికే ఉండాలి. అందువల్ల ఏ పదమూ వాక్యమూ తనకి తానే గుర్తు కాలేదు. అలా జరిగితే అసలది ఏ అంశాన్నీ సూచించకుండా పోతుంది కదా. అంటే తమని తాము సూచించుకొనే వాక్యాలంటూ ఉండేందుకు వీలులేదు. ఒకవేళ ఉన్నా అవి అర్థరహితమైన వాక్యాలు. ఇక వాటి తప్పొప్పుల ప్రసక్తే లేదు! అంచేత వాటిలో తిరకాసు అంటూ ఏం లేదు. ఇదీ ప్రధానంగా అతని వాదం.

నేను: ఊఁ. ఇది కొంత అతివాదంగా అనిపించినా ఆలోచించదగ్గ వాదమే అనిపిస్తోంది.

ఎడమ నేను: సరే అలాగే ఆలోచించు. మాటల్లో పడి చాలా దూరమే వచ్చేశాం. ఇప్పటికి, ఇవీ స్థూలంగా ఆత్మసూచన సృష్టించే తిరకాసులూ, వాటి గురించి పాశ్చాత్యుల దృక్పథమూను.

నేను: బావుంది. అవునూ మరి దీని గురించి పాశ్చాత్య మేధావులేనా ఆలోచించినది, మన భారతీయులెవరూ ఆలోచించలేదా? వాళ్ళకీ తిరకాసుల గురించి తెలియలేదా?

ఎడమ నేను: ఎందుకు లేదు. ఒకరకంగా పాశ్చాత్య దృక్పథం గురించిన కథ ఎక్కడ ఆగిందో భారతీయ చింతన గురించిన కథ అక్కడ మొదలవుతుంది!

నేను: అవునా! మరెందుకింక ఆలస్యం, చెప్పు చెప్పు.

ఎడమ నేను: మరీ అంత తొందరైతే ఎలా! ప్రయాణంలో కాస్త విశ్రాంతి విరామం ఉండొద్దూ. అంచేత మళ్లీ కలుద్దాం.

అలా అంటూ ఎడమ నేను నాలోకి జారుకుంది, నా ఉత్సాహమ్మీద నీళ్ళు జల్లి. అయినా యిదీ ఒకందుకు మంచిదే. ఇప్పటి దాకా విన్న విషయాలన్నీ నెమరేసుకోడానికి నాకూ కొంత సమయం కావాలి. మీకు మాత్రం వద్దూ. అంచేత మనం కూడా మళ్లీ కలుద్దాం!

అధస్సూచికలు
ఇలాంటి కథ అనేక రూపాలలో కనిపిస్తుంది. ఈ కథను Anton Dumitriu (1905-1992) అనే రొమానియన్ తత్త్వవేత్త పేర్కొన్నాడు. ఇలాంటి మరిన్ని తిరకాసు కథలను Florin Vasiliu రచించిన Paradoxism’s Main Roots అనే పుస్తకంలో చూడవచ్చు.

Paradoxని ఇంతకు ముందు కొందరు ‘విరోధాభాస’గా అనువదించారు. విరోధాభాసలో విరోధ ఆభస మాత్రమే – అంటే ఉన్నట్టు కనిపించినా నిజానికి విరోధం లేనిది. కానీ చాలా పేరడాక్సుల్లో నిజంగానే విరోధం ఉంటుంది. ఇంతకుముందు కనకప్రసాద్ గారు తన వ్యాసాల్లో పేరడాక్సుని తిరకాసు అన్నారు. నాకది నచ్చి దానినే ఉపయోగిస్తున్నాను.

Insolubilia అన్న పేరుతో మధ్యయుగాలలో Liar’s Paradox అనేక రూపాలలో కనిపిస్తుంది, Albertus of Saxonia అనే జర్మన్ తత్త్వవేత్త తన Perutilis logica అనే పుస్తకంలో ఈ Liar’s Paradoxకి మొత్తం19 రూపాలను చూపించాడు. అందులో కొన్ని రూపాలను Paradoxism’s Main Roots పుస్తకంలో చూడవచ్చు.

క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన Epimenides of Knossos అనే క్రీటన్ తత్త్వవేత్త ఈ వాక్యం చెప్పినట్టుగా కనిపిస్తుంది. అతని పేర యీ తిరకాసును Epimenides paradox అంటారు. అయితే Epimenides దీనిని పేరడాక్సుగా పేర్కొనలేదు. తర్వాతి తత్త్వవేత్తలు అందులోని తిరకాసుని గుర్తించి దానికా పేరు పెట్టారు.

క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన Eubulides of Miletus అనే గ్రీకు తత్త్వవేత్త ఈ పేరడాక్సుని పేర్కొన్నట్టుగా చరిత్రకారులు చెపుతున్నారు.

ఈ రూపం మరింత బలవత్తరమైన తిరకాసు! ‘ఈ వాక్యం అబద్ధం’ అనే వాక్యం నిజమా అబద్ధమా అని తేల్చలేం. అయితే ఆ వాక్యం నిజమూ అబద్ధమూ కాకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ‘ఈ వాక్యం నిజం కాదు’ అనే వాక్యం నిజమూ అబద్ధమూ కాకుండా పోయినా అది నిజమవ్వాల్సిన అవసరం వస్తుంది. కానీ నిజం అయితే నిజం కాకుండాపోవాలి!!

ఈ రూపం కూడా బలవత్తరమైన రూపమే. ఈ వాక్యం నిజమైతే వట్టి అబద్ధమే కావాలి, కానీ అలా జరగలేదు. పోనీ అబద్ధమే అనుకుంటే అప్పుడది నిజమై కూర్చుంటుంది. పోనీ నిజమూ అబద్ధమూ అవుతుందని అనడానికీ లేదు. ‘వట్టి అబద్ధం’ అంటే అబద్ధమే తప్ప నిజం అవ్వడానికి వీలులేదు కదా!

దీనిని Grelling–Nelson paradox అంటారు.

ఇది Barber’s Paradoxగా తర్కశాస్త్రంలో చాలా ప్రసిద్ధి చెందింది.

క్రీ.శ. 1901లో రసెల్ కనుగొన్న పేరడాక్సు, Russell’s paradoxగా ప్రసిద్ధి చెందింది. ఇది అర్థం కావాలంటే గణితంలో సమితుల గురించి తెలియాలి. సమితి అంటే కొన్ని వస్తువుల సమూహం. కొన్ని సమితుల సమూహాన్ని కూడా మరొక సమితిగా నిర్వచించవచ్చు. అలాంటి ఒక సమితుల సమితిలో తిరిగి అదే సమితి ఉండగలదా లేదా? ఉండవచ్చు లేకపోవచ్చు. ఇది ఒకరకమైన ఆత్మసూచన. ఇప్పుడు, తనలో తానే సమితిగా లేని సమితులన్నింటినీ కలిపి ఒక సమితిగా నిర్వచించామనుకోండి. అలాంటి సమితిలో తాను ఉంటుందా ఉండదా అన్నది ప్రశ్న. ఇది ఒక బ్రహ్మాండమైన తిరకాసు. ఉంటుందని అనుకుంటే ఉండదని తేలుతుంది, ఉండదని అనుకుంటే ఉంటుందని తేలుతుంది!

అరిస్టాటిల్ ముఖ్యరచన Metaphysics 12.9 (1074b34)లో యిది వస్తుంది. గ్రీకులో దీని రూపం: ‘hê noêsis noêseôs noêsis’. దాన్ని నండూరి రామమోహనరావు తన విశ్వదర్శనంలో యిలా తెలుగులోకి అనువదించారు.

దీన్ని ఇంగ్లీషులో Law of excluded middle అంటారు.

దీన్ని ఇంగ్లీషులో Law of noncontradiction అంటారు.

ఈ వాద పద్ధతిని పూర్వం లాటిన్ భాషలో Reductio ad absurdum అనేవారు. భారతీయ న్యాయశాస్త్రంలో దీనిని ‘ప్రమాణ బాధిత అర్థప్రసంగం’ అని పేర్కొన్నారు.

అలా వెల్లువెత్తిన తిరకాసుల్లో కొన్ని ముఖ్యమైనవి – Burali-Forti paradox (1897), Cantor’s paradox (1899), Russell’s paradox (1901), Richard paradox (1905), Berry’s paradox (1908), Grelling–Nelson paradox (1908)

An analysis of the paradoxes to be avoided shows that they all result from a kind of vicious circle. The vicious circles in question arise from supposing that a collection of objects may contain members which can only be defined by means of the collection as a whole.- Whitehead, Alfred North, and Bertrand Russell. PRINCIPIA MATHEMATICA. Volume I, Chapter II, Section I: The Vicious Circle Principle.

Formal Languages ప్రధానంగా గణితంలోనూ కంప్యూటర్ శాస్త్రంలోనూ వస్తాయి. ఈ భాషలలో కొన్ని మౌలికమైన సింబల్స్ ఉంటాయి. వాటిని కొన్ని నిర్దిష్టమైన సూత్రాల ద్వారా కలిపి పదాలను సృష్టిస్తారు. అలాంటి పదాలను మళ్లీ కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను అనుసరించి వాక్యాలుగా నిర్మిస్తారు. కంప్యూటర్ భాషలన్నీ అలా తయారుచేసిన ఫార్మల్ భాషలే.

Jorgen Jorgensen – SOME REFLECTIONS ON REFLEXIVITY Mind, Volume LXII, Issue 247
-------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో