Showing posts with label పేరడీ పద్యాలు. Show all posts
Showing posts with label పేరడీ పద్యాలు. Show all posts

Friday, September 9, 2016

సుమతీ! కి పేరడీ కుమతీ!


సుమతీ!  కి  పేరడీ  కుమతీ!


సాహితీమిత్రులారా!




సుమతీ శతకాన్ని కుమతీ శతకంగా పేరడీ
ఇతిశ్రీగారు రాశారు. ఇతిశ్రీ ఎవరోకాదు
ఆచార్య పుల్లెల రామచంద్రుడుగారు.
వారి కొన్ని పేరడీ కుమతీ పద్యాలను చూద్దాం.

అడిగిన ప్రశ్నలు చెప్పని
మిడిమేలపు టీచరులతొ మెలగుకంటెన్
వడిగొని ట్యూషను వెట్టుక
బడి ప్యాసవ వచ్చుగాదె వసుధను కుమతీ!

లంచము పంచక తినకుము
కొంచెంబేనైన చేతగొనకుము సుమ్మీ
లంచంబు పట్టువానికి 
కించిత్తుగ రాల్చకున్న కీడగు కుమతీ!


అధరము తడిసీ తడియక
మధురమ్మగు కాఫిజుర్రి మరి సిగరెట్టున్
ప్రథమముననె ముట్టించెడు
విధమేపో లైఫులోని విజ్ఞత కుమతీ!

బ్లేడును చూడని ముఖమును
బీడీ సిగరెట్ల కంపు వీడని ముఖమున్
కోడిములు చెప్పు ముఖమును
బూడిద కిరవైన పాడు బొందిర కుమతీ!

Wednesday, September 7, 2016

ఈశ్వరునే శరణంబు వేడెదన్ (పేరడీ)


ఈశ్వరునే శరణంబు వేడెదన్ (పేరడీ)


సాహితీమిత్రులారా!


గజేంద్రమోక్షణంలోని
పోతన పద్యం చూడండి.

ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందుఁ బరమేశ్వరుఁడెవ్వఁడు మూలకారణం
బెవ్వఁ డనాదిమధ్యలయుఁడెవ్వఁడు సర్వముఁదానయైన వాఁ
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్
                                            (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8-73)

గజేంద్రుడు ప్రాణంకోసం ఆర్తనాదం చేస్తే
బంకుపల్లి పార్వతీశ్వర శాస్త్రిగారు ఋణం కోసం
ఆర్తనాదం చేశాడు(పేరడీలో)

ఎవ్వనిచే జనించు ధనమెవ్వనిగీమున నుండు పైడియై
ఎవ్వనియందుడిందు కరువేశ్వరుడెవ్వడు మూల బొక్కసం
బెవ్వడనాధ మధ్యలయుడెవ్వడు పైకముతానెయైనవా
డెవ్వడు వాని నర్థధవు నీశ్వరు నేను ఋణంబువేడెదన్
                                              (ఆంధ్రజ్యోతివారపత్రిక 23-4-1982)





Tuesday, September 6, 2016

బ్రహ్మాండాంతసంవర్ధియై (పేరడీ)


బ్రహ్మాండాంతసంవర్ధియై (పేరడీ)


సాహితీమిత్రులారా!


పోతన భాగవతంలో వామనుడు పెరిగిన విధం తెలిపే పద్యం ఇది.

ఇంతితై, వటుఁడింతయై, మఱియుఁదానింతై, నంభోవీధిపై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై
              (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8- 622)

దీనికి  పాయల సత్యనారాయణగారి పేరడీ చూడండి. వామనావస్థలో ఉన్న స్త్రీలు
త్రివిక్రమునిగా పెరిగారని తెలుపుతూ వ్రాసిన పద్యం.(ఆంధ్రజ్యోతి వారపత్రిక 15-1-1988)

ఇంతింతై వధువింతయై, గృహమునందింతై, స్వయంవీధిలో 
నంతై, గ్రామసభా విభాగమున కల్లంతై, స్వతాలూకపై
నంతై, మండలమంతయై, మరియు తానాంధ్ర ప్రదేశమ్ముపై
నంతై, భారతదేశమంతయయి బ్రహ్మాండాంతసంవర్ధియై

రవిబింబంబుపమింపఁబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘట్టమై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దాబ్రహ్మాండమున్ నిండుచోన్
                                                  (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8- 623)
దీనికి పేరడీ

మగరాయుండుపమింప భర్తయయి, క్శేమంబెన్ను నేస్తమై
సగమై పాన్పుకు రాత్రికే హితుడునై సామాన్యమౌ నౌకరై
వగలాడై నిజపాదదాసుడయి, అవ్యాజమ్ముగ బానిసై
పగవాడై నడపీనుగై, మహిళతా బ్రహ్మాండమున్ నిండుచోన్

Friday, August 19, 2016

ఏల తలమీద వెంట్రుకలిన్ని మొలుచు? (పేరడీ పద్యం)


ఏల తలమీద వెంట్రుకలిన్ని మొలుచు? (పేరడీ పద్యం)


సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈపద్యం చూడండి.
ఇది అంతా ప్రశ్నతోటే ఉంది.

సౌరభములేల చిమ్ము బుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు జందమామ?
ఏల సలిలంబు పాఱు? గాడ్పేల విసురు?
ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను?

దీనికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు -
సందియం(పేరడి) చూడండి.

జఠర రసమేల స్రవియించు జఠరగ్రంధి?
అడవిలో యేల నివసించు నడవిపంది?
ఏల పిచ్చికుక్క కరచు? కాకేల యరచు?
ఏల తలమీద వెట్రుకలిన్ని మొలుచు?
         (ఆంధ్రజ్యోతి వారపత్రిక 8-4-1983)

Friday, July 15, 2016

ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ (పేరడీ)


ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ (పేరడీ)


సాహితీమిత్రులారా!

అల్లసాని పెద్దన - మనుచరిత్రలో
ప్రవరాఖ్యుడు వరూధినితో పలికిన పద్యం-

ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే
కివ్వనభూమి భూసురుఁడ నేఁ బ్రవరాఖ్యుడఁ ద్రోవ తప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబుఁజేర నిం
కెవ్విధిఁ గాతుఁ దెల్పఁగదవే! తెరు వెద్ది శుభంబు నీ కగున్ !
                                                               (మనుచరిత్ర 2-39)

దీనికి ఓ అజ్ఞాతకవి పేరడీ-

ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! వొంటి చెరించెడు రోడ్డుపైన నే
నత్తిలి కాపురస్థుడను నామలకుండను త్రోవదప్పితిన్
నెచ్చెలి నన్ను జూచి కరుణించి తదీయ గృహంబు జేర్చి నీ
వెచ్చని కౌగిలిన్ వలపు హెచ్చగ పచ్చడి చేయునన్నికన్
                                             (మునిమాణిక్యం - మన హాస్యంలోనుండి)

పలనాటి సీమలో నీళ్ళు దొరకని సమయంలో
శ్రీనాథుడు చెప్పిన చాటువు-

సిరి గలవానికి జెల్లును
దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్
దిరిపెమున కిద్దరాండ్రా!
పరమేశా! గంగ విడుము పార్వతి చాలున్

దీనికి ఓ అజ్ఞాతకవి పేరడీ -

సిరి గలవానికి జెల్లును
విరివిగ ధనమిచ్చి వివిధ విద్యలు బడయన్
తరమా సామాన్యునకది 
పరమేశా! దీని దిద్ద పరుగున రావే!

Saturday, June 11, 2016

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!

సుమతీ శతకంలోని ఈ పద్యం చూడండి

అప్పిచువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్ 
జొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

దీనికి శ్రీశ్రీ పేరడీ పద్యం చూడండి.

ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర చొరకుము మువ్వా!


పోతన భాగవతంలోని(8-90)పద్యం -

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛె వచ్చెఁ; దనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్,
నీవే తప్ప నిత:పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్,
రావే యీశ్వర! కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా!

 ఈ పద్యానికి, కామ పరవశుడైన ఒక కవి చెప్పిన పేరడీ పద్యం

పూ విల్కాని సరోజ బాణముల నంభోజారిమై ఛాయలన్
భావంబెంతయు డస్సె మేను బడలెన్ దాపంబు రెట్టించె నే
నీ వాడన్ మధురాధరం బొసగవే! నిక్కంబు నన్నేలవే!
రావే మానిని! కావవే తరుణి!  సంరక్షించు చంద్రాననా!

Wednesday, June 8, 2016

పేరడీ పద్యాలు



పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!

ఇది సుమతీ శతకంలోని పద్యం చూడండి.

ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ!

దీనికి శ్రీశ్రీ రాసిన పేరడీ చూడండి

కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకుచెవాకుల్
డాయకుమీ అరవ ఫిలిం
చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వా!

Sunday, May 15, 2016

పేరడీ పద్యం


పేరడీ పద్యం


సాహితీమిత్రులారా!

పెద్దనగారి మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు సిద్ధుని ప్రశ్నించిన పద్యం ఇది.

ఏయే దేశమువన్ జరించితిరి మీరేయే గిరుల్ చూచినా
రేయే తీర్థములందుఁగ్రుంకిడితి రేయే ద్వీపముల్ మెట్టినా
రేయే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి రేయే తోయముల్ డాసినా
రాయా చోటులఁ గల్గువింతలు మహాత్మా నా కెఱింగింపరే  (1-68)

ఈ పద్యానికి అనుకృతి లేదా
పేరడీ దుర్మార్గ చరిత్రలోనిది.......

ఏ యే వేశ్యగణంబు నారసితి? రే యే శిష్టులం దిట్టినా?
రే యే కొంపలయందు జొచ్చితిరి? మీ రే చెఱ్వులం బూడ్చినా?
రే యే దారుల కంప గొట్టితిరి? మీ రే తోటలం బీకినా?
రా యా దుష్ట విదుష్ట చేష్టలను భ్రష్టా! నాకు చెప్పంగదే!

పై పద్యానికి ఈ పద్యాన్ని
ఎంత హాస్యభరితంగా
కవి మార్చాడో!
 చూడండి.

Wednesday, May 4, 2016

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు

సాహితీమిత్రులరా!

పేరడీ పద్యాలు మరికొన్ని చూడండి.

నాయని సుబ్బారావుగారు రాసిన చంద్రాస్తమయమును ఉద్దేశించిన పద్యం

ఎవ్వడా క్రూరకర్మకు డెవడు? నీల
జలద నిర్ముక్త శైశిర శర్వరీ ప్ర
శాంత మలవాటుపడిన నిశాంతమందు
అకట! నట్టింటి దీపమ్ము నార్పినాడు?


జరుక్ శాస్త్రి పేరడీ

ఎవ్వడా చచ్చునాగమ్మ యెవడు?
నేను ప్రేయసీ విరహాన నిర్మించుకొన్న
రమణి మంజుల ప్రణయ చిత్రమ్ముపైన
నిండు నీల్కాలు బుడ్డి తన్నేసినాడు?


సుమతీ శతక పద్యం

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!

పై పద్యానికి పేరడీ

అక్కరకు రాని బస్సును
చక్కగ సినిమాకు రాక సణిగెడు భార్యన్
ఉక్కగ నుండు కొంపను
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!

Wednesday, April 20, 2016

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!

ఇది శ్రీనాథుని భీమఖండము ద్వితీయ ఆశ్వాసంలోనిది.
వ్యాసుడు కాశీనుండి బహిష్కరింపబడి ద్రాక్షారామానికి వచ్చే మార్గమధ్యంలో
అగస్త్యుడు వ్యాసుని కాశీని ఎందుకు వదలివచ్చావు? ఎవరేమైనా అన్నారా?
అని అడిగే పద్యం ఇది.

లోలార్కునకు నీకు లోలోననేమేనిఁ

     బోటు పుట్టదుగదా! మాటమాట

వెనకయ్య శ్రీడుంఠివిఘ్నేశ్వరస్వామి 

     ధిక్కరింపఁడుగదా! తెగువనిన్ను

నాఁకొన్న నిన్ను మధ్యాహ్నకాలంబున 

     నరయకుండదుగదా!యన్నపూర్ణ

నెపమేమియును లేక నీయెడాటమ్మునఁ 

     బాడిదప్పడుగదా! భైరవుండు

ఎట్టు పాసితి మిన్నేటి యిసుకతిప్ప

లెట్టు పాసితి వాస్థలంబేనుకోసు

లెట్టు పాసితి వవిముక్త హట్టభూమి

యెట్టు పాసితి విశ్వేశునిందుధరుని


పై పద్యానికి పేరడీగా ఇలపావులూరి సుబ్బారావుగారు 
నవ్వులు-నవ్వులు (పుట.46)లో వ్రాసిన పద్యం.

పంచాయతీబోర్డుప్రెసిడెంటుతో నీకు 

      పోటుపుట్టదుగదా!మాటమాట

మండలాద్యక్షుని మనసు నొచ్చెడునట్టు 

      నడుచుకోలేదుగా! నయమువీడి 

పరిషత్తు సభ్యుని భజన చేయకనీవు 

      బడి పెట్టలేదుగా! ప్రతిదినంబు

విద్యాకమిటిమాట వినకుండ నేవేని 

      పనులొనర్పవుకదా! ఘనతకొరకు

బదలి నీకెందుకీరీతి వచ్చె చెపుమ

అనుచు బ్రశ్నించు మిత్రుని కనియెనొజ్జ

ప్రథమ మహిళను తల్లిగా పలుకరింప

ఆగ్రహించుచు నన్ను నీయడవికంపె