సన్యాస శతకం
సాహితీమిత్రులారా!
"సన్యాసమే మేలురా" అనే మకుటంతో
వ్రాయబడిన శతకం ఈ సన్యాసశతకం.
అయితే ఈ శతకానికి ఒక ప్రత్యేకతవుంది.
అదేమిటంటే ఒకే కవి దీన్ని వ్రాయలేదు.
నల్గొండజిల్లా మిర్యాలగూడకు చెందిన
ముడుంబ కృష్ణమాచార్యులు, సూలూరు
శివసుబ్రహ్మణ్యం, కాటేపల్లి లక్ష్మినరసింహమూర్తి
అనే మిత్రులు వరుసగా పాదైక రచనా నియమంతో
ఒకే రాత్రిలో కూర్చారు. ముగ్గురు ఒకచోట కూర్చొని
తలా ఒక పాదం చొప్పున మూడు పాదాలు చెప్పాక
నాలుగవ పాదం పద్యం మొదలు పెట్టిన కవి పూర్తిచేస్తాడు.
ఈ క్రమంలో రెండవ పద్యాన్ని ఇంకొకరు, మూడవ
పద్యాన్ని మరొకరు మొదలుపెడతారు. పద్య ప్రారంభించిన
వాడు తను చెప్పదలచుకొన్నది మిగతా ఇద్దరికి వివరిస్తాడు.
వాళ్ళు ఆ విషయాన్నే అతని శైలిలో తమవంతుపాదాలను
పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత వుంది అదేమంటే
ఆ కవులకు ఇదే తొలిరచన.
ఈ శతకంలో నవనాగరికత వ్యామోహం వల్ల సమాజం
ఎదుర్కొంటున్న దుష్పరిణామాలను వివరించి, తమ
ఆవేదనను ఈ కవులు సన్యాసమే మేలురా
అనే మకుటంతో వెల్లడి చేశారు.
ఇందులో మద్యపానం చేసి వాహనాలు నడిపేవారిని(32),
మామూళ్లని డబ్బులు దోచుకునేవారిని(22),
మన్మథవికారంతో వేశ్యవాటికలకు పోయేవారిని(61)....
చూసి ఈ కవులు సన్యాసమే మేలని తీర్మానించారు.
బీపీ పెంచుకొని, రోషావేశులై ఇతరులను తూలనాడేవారిని
గురించి ఈ సన్సాస కవులు ఇలా పేర్కొన్నారు(74)లో.
రుధిరా పీడన పీడితుల్, తమ మనోరుద్రాంగణంబందు దా
మధిరావేశమునం జరించుచున్ నైజాపత్యముం దూలగా,
నధమోత్కంపము మీర, జిత్తములు నిత్యంబుం గృషింపగ, దో
ష ధురాబాధితముం బొనర్తు రకటా సన్యాసమే మేలురా
జంటకవులెలా చెబుతారో కవిత్వాన్ని ఇప్పుడెవురూ చూడలేదు.
కానీ ఇలాంటి పద్ధతిలో కవిత్వం చెప్పడం కొంతవకు కాదు
పూర్తిగా ప్రత్యేకం మరియు ప్రశంసనీయం.
ఈ శతకం 1992లో ప్రకటించబడింది.
(విషయ సమాచార సేకరణ -
కె.వి.రమణాచారి, పద్యకవిత్వం - వస్తువైవిధ్యం)