Thursday, June 30, 2016

లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:


లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:


సాహితీమిత్రులారా!

చిత్రమీమాంసలోని ఈ శ్లోకం చూడండి.
ఇది చ్యుతాక్షర చిత్రానికి ఉదాహరణగా ఇవ్వబడినది.

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:

ఇందులో సీతా రావణ సంవాదం ఉంది.

రావణుడు -  భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
                   స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
                   ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
(అరటిస్తంభాల వంటి ఊరువులు గల
ఓ సీతా! ఇపుడు దేవతల ముఖాలు వాడిపోతాయి.
లక్ష్మణసహితుడైన ఆ రాముడు యుద్ధంలో నా ఎదుట నిలబడలేడు.
ఇప్పుడీ వానరసేన గొప్ప ఆపద పొందగలదు.)
సీత - లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
     (ఓ నీచుడా దీనినే ఏడవ అక్షరం తొలగించి మళ్ళీ చదువు)
మూడు పాదాలలోని ఏడవ అక్షరాలు తీసివేయగా

మొదటి పాదం (భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా)లో -
                       దశవదనగ్లాని:(రావణుని లేదా పది ముఖాల గ్లాని
                        (శ్రమముచేత కలిగిన దౌర్బల్యము))
రెండవ పాదం (స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:)లో -
                     రామ: స్థాతా యుధి(రాముడు యుద్ధంలో నిలబడతాడు)
మూడవ పాదం(ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:)లో
                      - ఉచ్చై: పదమ్ (ఉన్నతస్థితిని)
                      అనే అర్థాలున్న పదాలు ఏర్పడ్డాయి.
దీనిలో రావణుడు అనుకున్న వాటికి విరుద్ధంగా వచ్చాయి.

అంతా సురాఘటేశులె (పేరడీ పద్యం)


 అంతా సురాఘటేశులె (పేరడీ పద్యం)


సాహితీమిత్రులారా!


ఈ పద్యం అడిదము సూరకవిని
శ్లాఘిస్తూ కొట్ర బాలకవి చెప్పినది.

అంతా కవులముగామా,
అంతింతో పద్దెమైన నల్లఁగలేమా!
దంతివి నీతో సమమా!
కాంతా సుమ బాణ సూరకవి నెఱజాణా!

దీనికి శ్రీ శ్రీ చెప్పిన పేరడీ పద్యం.

అంతా సురా ఘటేశులె,
అంతింతో ఆచమాన మడిగేవారే
పంతానికి మాత్రం శివ
చింతా దీక్షితుల మండ్రు, సిరిసిరిమువ్వా!

Wednesday, June 29, 2016

అభిమానము అంటే ప్రేమ కాదా?


అభిమానము అంటే ప్రేమ కాదా?


సాహితీమిత్రులారా!

ఒకపదానికి ఉన్న సామాన్య అర్థానికి మరొక అర్థానికి ఎంత తేడా ఉందో.
ఈ పదాల అర్థాలు చూడండి.
వీటిని చిత్రకవిత్వంలో గూఢచిత్రం విభాగంలోను,
ప్రహేళికల విభాగంలోను ఉపయోగిస్తారు.
అలాంటి వాటిని కొన్నిటిని ఇక్కడ చూద్దాం.

అరిష్టము - మామూలు అర్థం- కీడు
                  ప్రత్యేకార్థం - అదృష్టం, మజ్జిగ
అభిమానము - మామూలు అర్థం - ప్రేమ
                       ప్రత్యేకార్థం - చంపుట, దొంగతనం
భార్గవి - మామూలు అర్థం - లక్ష్మిదేవి
              ప్రత్యేకార్థం - గఱిక
మందారం - మామూలు అర్థం - మందారము
                  ప్రత్యేకార్థం - జిల్లేడు
బడబ - మామూలు అర్థం - బ్రాహ్మణస్త్రీ
             ప్రత్యేకార్థం - తార్పడుకత్తె
ద్విజ - మామూలు అర్థం - బ్రాహ్మణుడు
           ప్రత్యేకార్థము - పక్షి, దంతము
శిశ్విదానుడు - మామూలు అర్థము - సదాచారుడు
                        ప్రత్యేకార్థము - దురాచారుడు
ఇబ్బంది - మామూలు అర్థము - అసౌకర్యము
                ప్రత్యేకార్థము - అడవిపందికి ఊరపందికి పుట్టిన పంది.
శల్యము - మామూలు అర్థము - ఎముకల గూడు
                ప్రత్యకార్థము - ముండ్ల పంది
ఆశీస్సు - సామాన్యార్థము - మేలుకోరుట
                ప్రత్యేకార్థము - పాముకోర

అనుకరణ పద్యం


అనుకరణ పద్యం


సాహితీమిత్రులారా!

ఈ పద్యం శ్రీకృష్ణదేవరాయలను
పొగుడుతూ చెప్పిన పద్యం

నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తియొప్పెఁగరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై
                           (చాటుపద్యమణిమంజరి)


మరొక అనుకరణ పద్యం
దీన్ని శేషభట్టరు సింగరాచార్యులు రచించారు.
వీరిని గురించి బిరుదురాజు రామరాజుగారు
"మరుగున పడిన మాణిక్యాలు" నందు వివరించారు.

నరసింగ మాధవేంద్రుని
స్థిరతర సత్కీర్తి చెలఁగదిశలన్ మిగులన్
కరిభిద్వర భిద్గిరి గిరిభిత్,
కరిభిద్వర శైల తుల్యకాంతి స్పురణన్
                             (మరుగున పడిన మాణిక్యాలు)

22-06-2016న ఒక అనుకరణ పద్యం చూశాము
అది ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం
వరబారు వేంకనార్యుని
ధరనిండిన కీర్తి వెలసె ధరజిత్పుర జి
ద్ధర ధర జిత్పుర త్పుర జి
ద్ధర జిత్పుర జిత్తురంగ ధావళ్యంబై
                                  (చాటుపద్యరత్నాకరం)

Tuesday, June 28, 2016

పంచబాణస్య పంచమ: పంచమధ్వని:


పంచబాణస్య పంచమ: పంచమధ్వని:


సాహితీమిత్రులారా!

వృత్త్యనుప్రాసంలోని 1.కర్ణాటీ, 2. కౌంతలీ, 3. కౌంకీ, 4. కౌంకణీ-లు
తెలుసుకున్నాము.
ఇపుడు 5."బాణాసిక "
తెలుసుకుందాము.
ప - వర్గానుప్రసగల దానిని బాణాసిక అంటారు.
 ప - వర్గములో "ప,ఫ,బ,భ,మ" - అనే వర్ణాలుంటాయి.
ఇవి అనేకమార్లు ఆవృత్తమైన
అది బాణాసికావృత్త్యనుప్రాసము అనబడుతుంది.

ప్రియా ప్రగల్భా తాంబూలం పరిస్రుత్ఫుల్ల ముత్పలమ్
వృషత్కా: పంచబాణస్య పంచమ: పంచమధ్వని:
                                             (సరస్వతీకంఠాభరణము -2-182)

(ప్రాగల్భ్యము(స్త్రీల యొక్క అయత్నజమైన శృంగార చేష్టవిశేషము)గల
ప్రియురాలును, తాంబూలమును, మద్యమును, వికసించిన ఉత్పలమును
పంచమస్వరమును పంచబాణుడైన మన్మథుని బాణాలు.)

ఇందులో ప-వర్గములోని అన్ని వర్ణాలు అనేకమార్లు ఆవృత్తములైనవి.
తాంబూలం - లోని పూర్ణబిందువులు రెండును మకార ఉచ్ఛారణముగలవి
కావున ఈ శ్లోకం
బాణాసికావృత్త్యనుప్రాసమునకు
ఉదాహరణ అగుచున్నది.

నలుగురు మహాకవులు కలిసి చెప్పిన శ్లోకం


నలుగురు మహాకవులు కలిసి చెప్పిన శ్లోకం


సాహితీమిత్రులారా!

ఒక్కొక్క మహాకవి తీరు ఒక్కోవిధంగా ఉంటుంది.
అలాంటిది ఒక శ్లోకాన్ని నలుగురు మహాకవులు చెబితే
ఎలావుంటుందో? అని ఒకరోజు భోజమహారాజుకు అనిపించిందట.
నిజమేకదా!
వెంటనే కాళిదాసు , భవభూతి, దండి మహాకవులను పిలిపించి
సాయంకాలంపూట ఓ చక్కని ఉద్యానవనం మందిరంలో సమావేశం
ఏర్పాటు చేశారు.
అందరూ కూర్చున్న తరువాత
మహాకవులారా! ఆ అస్తమిస్తున్న సూర్యుడు కనిపిస్తున్నాడు కదా!
ఎంతో వింతగా కనిపిస్తున్నాడు.
మనం అందరం కలిసి ఒక శ్లోకం రాద్దాం.
మొదట నేను ఒక పాదం చెబుతాను
తరువాత ఒక్కొక్కరు ఒక్కొకపాదం చెప్పండి
అని భోజుడు
ఈ పాదం చెప్పాడు.

 పరిపతతి పయోనిధౌ పతంగః
(సూర్యుడు పడమర సముద్రంలో పడిపోతున్నాడు)
అని భోజుడు చెప్పగా
సరసిరుహా ముదరేషు మత్తభృంగః
(రోజు రోజంతా వికసించిన పద్మాలలోని మకరందాన్ని మకరందాలను తాగి తాగి ఉన్న తుమ్మెద, అదే పద్మంలో నిద్రకోసం పడకేసుకుంటోంది.)
అని దండి చెప్పాడు.
ఉపవనతరుకోటరే విహంగః
(దగ్గరగా ఉన్న ఉద్యానవనాలన్నింటిలోని
చెట్టు తొర్రల్లోకీ,
అంటే తమ తమ ఇళ్ళల్లోకి
పక్షులు చేరుతున్నాయి)
అని భవభూతి చెప్పాడు.
కాళిదాసు చివరి పాదం ఇలా పూరించాడు--
యువతి జనేషు శనై శ్శనై రనంగః
(యౌవనంలో ఉన్న స్త్రీలలోకి మెల్లమెల్లగా
మన్మథుడు ప్రవేశిస్తున్నాడు.)

పూర్తి శ్లోకం ఇది -
పరిపతతి పయోనిధౌ పతంగః
సరసిరుహా ముదరేషు మత్తభృంగః
ఉపవనతరుకోటరే విహంగః
యువతి జనేషు శనై శ్శనై రనంగః


ఈ శ్లోకం నలుగురు చెప్పినా 
అంత్యాను ప్రాస ఎలా వాడారో చూడండి.
తంగః
మత్తభృంగః
విహంగః
నంగః

Monday, June 27, 2016

అన్నిటికి నుత్తరం బొక్క అక్షరంబు


అన్నిటికి నుత్తరం బొక్క అక్షరంబు


సాహితీమిత్రులారా!

ఈ క్రింది పద్యం చూచి జవాబుకై ఆలోచించిచూడండి.

సుదతిరో! ఘనమైన సురభికి పేరేది?
     శివభూషణములందు శ్రేష్ఠమేది?
చెరువు లోపల నీరు చేలకిచ్చుట కేది?
     పైరు గోసిన వెన్క పండు నేది?
బలు ఫిరంగుల ధ్వనుల్ బల్కుట నది యేది?
     చెలగి బంట్రోతులు సేయుటేది?
ఎనిమిది గడియల నేర్పడునది యేది?
     ప్రభువులు కోపంబు సేయుటేది?
అన్నిటికి జూడ నొక్కక్క యక్షరంబు
సున్న దీర్ఘంబు లేర్పడ జెప్పవలయు
చిత్త భవభంగ శివలింగ చిన్మయాంగ
వృషతురంగ శుభాంగ గౌరీశలింగ
ఈ పద్యంలో 8 ప్రశ్నలు ఉన్నాయి.
సమాధానాలన్నీ సున్న, దీర్ఘస్వరములతో కూడి
ఒకే అక్షరంగా ఉండాలి.
షరతులు తెలిశాయికదా!
ఆలోచించండి.

1. ఓ సుదతీ గొప్ప కామధేనువు పేరేమి?
    - గాం(గోవు)
2. శివుని అలంకారములలో శ్రేష్ఠమైనది ఏది?
   - పాం(పాము)
3. చెరువు నీటిలో చేలకు ఇచ్చునది ఏది ?
   - తూం(తూము)
4. జొన్న మొదలైన పైరు కోసిన తర్వాత పండునది ఏది?
   - నాం(జొన్నమొదలగు వాని పిలక)
5. అనేక ఫిరంగులు పేల్చిన శబ్దం ఎట్లుండును?
   - ధాం(ధామ్మని శబ్దం వినపడును)
6. బంట్రోతులు ఏమి చేయుదురు?
  - సాం (మంచి-తనం, మాట, లేక సలాం)
7. ఎనిమిది గడియలకు ఏది ఏర్పడును?
   - ఝాం(జాము)
8. ప్రభువులు దేనిపై కోపగింతురు?  -

 ఏడింటికి సమాధానాలు ఉంచాము
 8వదాని జవాబు మీరే ఊహించండి.

అనుకరణ పద్యం


అనుకరణ పద్యం


సాహితీమిత్రులారా!

అల్లసాని పెద్దనను కృతి చేయమని చెప్పగా
 ఊరకే  కృతులు ఎలారాస్తారు అని
క్రింది పద్యం చెప్పాడు.

నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే

ఈ పద్యానికి అనుకరణ పద్యం ఒక కవి ఈవిధంగా చెప్పాడు.
పై పద్యం చంపకమాల అయితే ఇది సీసపద్యంలో ఉన్నది.

ఆంధ్ర ప్రబంధ సిద్ధాంత సంసిద్ధికి
       వలయు సాధనము లవశ్యములుగ
సంస్కృతాంధ్రోభయసత్కావ్య పఠనంబు
       వ్యాకరణజ్ఞతా వ్యాపకత్వ
మఖిల పురాణాగమాఖ్యాన కత్వంబు
       నై ఘంటికముల ఛందముల తెలివి
గ్రంథ సంప్రతు లవకాశమా యోగ్యంబు
       మేథా వివేక సమృద్ధిబుద్ధి
సుగుణ లేఖక పాఠక సుఖనివాస
రాజపాలన మృష్టాన్న భోజనములు
దైవతానుగ్రహముగల్గి తనరు నట్టి
విబుధుఁ డొనరించు కృతిని నిర్విఘ్నముగను

Sunday, June 26, 2016

నవయౌవనే సహృదయై సర్వత్ర తద్విభ్రమా:


నవయౌవనే సహృదయై సర్వత్ర తద్విభ్రమా:


సాహితీమిత్రులారా!


పంచేంద్రియాలకు, మనస్సనే ఆరో ఇంద్రియానికి విషయభూతమైన పదార్థాలన్నీ
ఒక్క లలనామణిలోనే లోకోత్తరమైన రీతిలో పొదగబడి ఉన్నాయి
- అనే ఈ శ్లోకం చూడండి.
ద్రష్టవ్యేషు కిమ్ముత్తమం?  మృగదృశ ప్రేమప్రసన్నం ముఖం;
ఘ్రాతవ్యేష్వపి కి? తదాస్యపవన: శ్రావ్యేషు కిం? తద్వచ:
కిం స్వాద్యేషు? తదోష్టవల్ల వరస:; స్పృశ్యేషు కిం? తద్వపు;
ద్ధ్యేయం కిం? నవయౌవనే సహృదయై: సర్వత్ర తద్విభ్రమా:
                                           (భర్తృహరి సుభాషితములు -2-7)

ఈ శ్లోకం ప్రశ్నోత్తరరూపంలో ఉంది.

1. రసికులైనవారు ప్రాయంలో చూడదగింది ఏది ?
 - ముద్దుగుమ్మ మచ్చటైన ముఖం
    (ఇది నేత్రేంద్రియాన్ని తృప్తి పరుస్తుంది.)

2. వాసన చూడదగినదానిలో ఉత్తమమైనది ఏది?
   - ఆ జవరాలి కమ్మని తావి (ఇది మగద్దరాలి ముఖారవిందాన్ని
      తాకుతూ వచ్చేగాలి మోసుకొచ్చే గంధం-
      ఇది నాసికేంద్ియ రూపమైన తృప్తేినిస్తుంది.)

3. వినదగిన వాటిలో శ్రేష్ఠమైనది ఏది?
   - నునులేత తరుణీమణి యొక్క భాషణ 
     (దీనివల్ల శ్రోత్రేంద్రియ విషయ
     సౌఖ్యతృప్తిని సూచిస్తుంది.)

4. పానము చేయదగిన వాటిలో ఉత్తమమైనది ఏది?
   - స్త్రీ యొక్క అధరామృతం
      (ఇది జిహ్వేంద్రియ తృప్తి సూచకం)

5. తాకదగిన వాటిలో మేలైనది ఏది?
   - లలన యొక్క నును మెత్తని మేను 
      (పుష్పంలా సుకుమారమైన శరీరంగల స్త్రీ సంభోగం.
       ఇది పంచేంద్రియాలకు సుఖాన్నివ్వగలది.)

6. అంతరేంద్రియమైన మనస్సుకు సౌఖ్యం కలిగించేది ఏది?
    - స్త్రీని గూర్చిన తలపే

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.


ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్

సాహితీమిత్రులారా!"ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్"- అనే
ఈ సమస్యకు పలు పూరణలు చూడండి.


చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.
                                     (చిలకమర్తివారి "ప్రసన్నయాదవం")ఆచంట సత్యవతమ్మగారి పద్యం

చదువుల్ సాములు శాస్త్రచర్చ, ధరణీ రాజ్ఞీత్వశిల్పంబులున్
కదనంబందున రక్తి, గాన కవితా విజ్ఞాన సారథ్యముల్
సుధలం జిమ్మెడి పాకశాస్త్ర విదితం బాబాల లాలిత్వమున్
ముదితల్ నేర్వగరాని విద్యగలదా ముద్దార నేర్పించినన్
                                                 (గృహలక్ష్మి- 1931 అక్టోబరు)

చిల్కపాటి సీతాంబ పద్యం

అదనంబౌనలు రేట్లు నారులకు ధీయంయండ్రందు నందమ్ము మిం
చెదరన్ కుత్సిత పుందలంపుననొ, సౌశీల్యంబు భగ్నంబగున్
జదురెక్కంగుల కాంతలన్న వెఱనో, శాసించిరిల్ దిద్దనే
ముదితల్ నేరఁగ రాని విద్యగలదే ముద్దార నేర్పించినన్
                                      (గృహలక్ష్మి- 1931 అక్టోబరు)

Saturday, June 25, 2016

నారీలలామ నీ పేరేమి చెపుమన్న?


నారీలలామ నీ పేరేమి చెపుమన్న?


సాహితీమిత్రులారా!

ఈ పద్యాన్ని గమనించి భావం తెలపండి.

నారీలలామ! నీ పేరేమి చెపుమన్న?
        దమిమీర నెడమ నేత్రమును జూపె,
మత్తేభయాన! నీ మగని పేరేమన్న?
       దన చేతి జీర్ణ వస్త్రమును జూపె
కుటిల కుంతల! నీదు కులము నామం బన్న?
         బంజరంబున ను్న పక్షి జూపె
వెలది! నీకేమైన బిడ్డలా చెపుమన్న?
      కరమొప్ప మింటి చుక్కలను జూపె
ప్రభువు మీకెవ్వరన్న "గోప" కుని జూపె?
ధవుని వ్యాపారమేమన్న? "దండ" మిడియె
చతురమతులార! ఈ ప్రోడజాణతనము
దెలిసికొనరయ్య బుద్ధి కౌశలము మెరయ.

ఓ నిపుణమతులారా! ఒక ప్రౌఢయగు నాయిక యొక్క ఈ నేర్పరితనమును,
మీ బుద్ధిసూక్ష్మతను ఉపయోగించి,తెలిసికొని, ప్రత్యుత్తరమీయండి.

ఇందులో నారీలలామ, మత్తేభయాన, వెలది, కుటిలకుంతల -
అనేవన్నీ స్త్రీ సంబోధనా పదాలు.
ఇందులో ఆ వనిత నోటితో సమాధానం చెప్పకుండా
సంజ్ఞలతో చమత్కార చేష్టలతో సమాధానమిచ్చింది.

1. ఓ స్త్రీరత్నమా నీపేరు ఏదో చెప్పు?
   - తన ఎడమ కంటిని చూపింది - అంటే ఎడమ కంటిని
     వామ + అక్షి = వామాక్షి అని సంస్కృతంలో.
      కావున ఆమెపేరు వామాక్షి
2. ఓ మదగజగమనా నీ భర్త పేరేమి? -
   -చేతిలోని చిరిగిన వస్త్రం చూపింది.
    అంటే సంస్కృతంలో కుచేలము అంటే
    ఆయన పేరు కుచేలుడు.
3. ఓ వనితా నీకు పిల్లలెందరు?
   - ఆమె చేయెత్తి ఆకాశం చూపింది. -
     అంటే ఆకాశంలోని నక్షత్రాలు.
     మనకు నక్షత్రాలు 27
     (అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి..... మొ.)
     అనగా 27 మంది పిల్లలు.
4. ఓ ఉంగరాల జుత్తుగలదానా నీకులమేది?
   -పంజరంలోని పక్షిని చూపింది - అంటే పక్షిని
    సంస్కృతంలో ద్విజము అంటారు. కావున
    వారు ద్విజులు అంటే బ్రాహ్మణులు
5. మీకు ప్రభువు ఎవరు?
   - గోపకుని చూపింది - అంటే గోపాలుడు - కృష్ణుడు
6. నీభర్త ఉద్యోగమేమి?
   - దండం పెట్టింది. అనగా నమస్కారం చేస్తూ,
     "సీతారామాభ్యాం నమ:" (భిక్షను గ్రహించడం) లేక
     తపస్సు, పూజ చేసుకొని దండం పెట్టడం ఆయన వ్యాపారం.

దీనిలో నోటితో కాకుండా చేతితో సంజ్ఞల
రూపంలో సమాధానం గోప్యం(గూఢం) చేయబడింది
కావున ఇది "కరసంజ్ఞా గోపన చిత్రం."

కపోలతటిపైఁ బాలిండ్లపై.....(అనుకరణ పద్యం)


కపోలతటిపైఁ బాలిండ్లపై.....(అనుకరణ పద్యం)


సాహితీమిత్రులారా!

ఇది పోతన భాగవతం(8-592)లోని పద్యం
ఇది వామన చరిత్రలో బలిచక్రవర్తి తన
గురువైన శుక్రాచార్యునితో అన్న పద్యం.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, సంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁ బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు రకంబు గ్రిం దగుట మీదై నా కరంబుంట మేల్
గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే

దీనికి అనుకరణ పద్యం
రాయకవి(అయ్యలరాజు) త్రిపురాంతకుని
"రఘువీరా! జానకీనాయకా!" శతకం(69)లోనిది
చూడండి.
పరనారీకుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగంబుపైఁ
గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ
బరువుల్ వాఱెడు నాతలంపులు మిమున్ భావింపఁగాఁ జేసి స
ర్వరసాధీశ్వర నన్నుఁబ్రోవు రఘువీరా! జానకీనాయకా!

Friday, June 24, 2016

కిం దుష్కరసాధనం ప్రఙ్ఞా


కిం దుష్కరసాధనం ప్రఙ్ఞా


సాహితీమిత్రులారా!

ఈ క్రింది శ్లోకం చూసి అందలి ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి.

కిం క్రూరం స్త్రీహృదయం
కం గృహిణ: ప్రియహితాయ దారగుణా:
క: కామస్సంకల్ప:
కిం దుష్కరసాధనం ప్రఙ్ఞా
                             (దండి - దశకుమారచరిత్ర)

ఇందలి ప్రశ్నలు సమాధానాలు
1. కిం క్రూరం (క్రూరమైనదేది)?
                          - స్త్రీల మనస్సు(స్త్రీ హృదయం)
2. కిం గృహిణ: ప్రియహితాయ (గృహస్థునకు ఇష్టమైనదేది)?
                           - భార్యగుణము(దారగుణా:)
3. క: కామ (కామము ఏది)?
                            - సంకల్పమే(సంకల్ప:)
4. కిం దుష్కరసాధనం (కష్టమైన పనులను సాధించునది ఏది)?
                            - బుద్ధి (ప్రఙ్ఞా)

పెత్తండ్రిభార్య యనుంగు కొమరిత


పెత్తండ్రిభార్య యనుంగు కొమరిత


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి భావం గ్రహించగలరేమో చూడండి.

ధరయుషాభర్తతండ్రి పెత్తండ్రిభార్య
యనుగు కొమరిత మగని ప్రోయాలు సుతుని
సంకటము మాన్పి రక్షించు చక్రహస్తు
డిచ్చు సిరులను యీసభ యోలికకును

ఈ పద్యం ఠంయాల లక్ష్మీనరసిహాచార్య కృత హేమాంగీ విలాసము అనే
యక్షగానంలోనిది.
దీని రచనకు ప్రేరకులైన మండవవారి వంశాభి వర్ణన
తరువాత మంగళాచరణ
పూర్వక పద్యంగా కూర్చబడినది.

బాణాసురుని కమార్తె - ఉష
ఉష భర్త - అనిరుద్ధుడు
అనిరుద్ధుని తండ్రి - ప్రద్యుమ్నుడు
ప్రద్యుమ్నుని పెత్తండ్రి - బలరాముడు
బలరాముని భార్య - రేవతి
రేవతి కుమార్తె - శశిరేఖ
శశిరేఖ భర్త - అభిమన్యుడు
అభిమన్యుని భార్య - ఉత్తర
ఉత్తర కుమారుడు - పరీక్షిత్తు
పరీక్షిత్తు ప్రాణరక్షకుడు - శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు ఈ సభాపతి అయిన
మండ్వ నరసింహారావుదొరవారిని
అనంత ఐశ్వర్యము ప్రాపితులుగా
చేయుగాత!

ఇది గూఢచిత్రము.

Thursday, June 23, 2016

త్వం హాలాహల భృత్కరోషి......


త్వం హాలాహల భృత్కరోషి......


సాహితీమిత్రులారా!


ఆనందవర్ధన కృత వకృోక్తి పంచాశిక అనే కృతిలోనిది ఈ శ్లోకం.
(ఈ కృతిలో మొత్తం 50 శ్లోకాలున్నాయట.)

త్వం హాలాహల భృత్కరోషి మనసో మూర్ఛాం మమాలింగత:
హాలాం నైవ బిభర్మి నైవ చ హలం ముగ్ధేకథం హాలిక:
సత్యం హాలిక తైవ తేసముచితాసక్తస్య గోవాహనే
వక్రోక్త్యేతి జితో హిమాద్రిసుతయా స్మేరో హర: పాతు వ:


పార్వతి - నీవు హాలాహల భరుడవు కౌగిలింపబడి 
              నా మనస్సునకు మూర్ఛ గావించుచుంటివి.
 శివుడు - ఓసి ముగ్ధా నేను హాలను(సురను) హలము(నాగలి) 
               భరించువాడను కాదు హాలికుడనుకొంటివా?
పార్వతి - సత్యమే ఎద్దునెక్కు నీకు హాలికత్వము తగును.
- అని పార్వతి వక్రోక్తిచే జయింపబడి నవ్వు
   శివుడు మిమ్ము రక్షించుగాత!

ఇది సంవాదచిత్రం

మధుర్మధూని గాంధర్వమందిరం


మధుర్మధూని గాంధర్వమందిరం


సాహితీమిత్రులారా!

వృత్త్యనుప్రాసలో 1. కార్ణాటీ, 2. కౌంతలీ, 3. కౌంకీ - ను
గురించి తెలుసుకున్నాము.
ఇప్పుడు నాలుగవది కౌంకణీ గురించి తెలుసుకుందాము.
'త' - వర్గక్షరాలు పెక్కమార్లు ఆవృత్తమైన అది
కౌంకణీ వృత్త్యనుప్రాసము అనబడుచున్నది.

మధుర్మధూని గాంధర్వమందిరం మదిరేక్షణా
ఇందు రైందీవరం దామ కామ మానందయన్తి న:

వసంత ఋతువు, మధువులు, సంగీతమందిరము, మదిరేక్షణ,
చంద్రుడు, నల్లకలువల హారము మాకు పూర్తిగా ఆనందము
కలుగజేయును - అని భావం

ఈ శ్లోకంలో "త" - వర్గాక్షరాలైన "ద,ధ,న" వర్ణములు
పున: పున: ప్రయుక్తములైనవి.
'త' వర్ణము ఒక్కచోటమాత్రమే వచ్చింది.
శ్లోకంలోని పూర్ణబిందువులన్నీ  త - వర్గాక్షరమునకు ముందే
ఉండటం వల్ల "న" కార ఉచ్ఛారణమునే కలిగి ఉండును.
"మదిరేక్షణ" అనే పదానికి ముంగన్న బిందువుమాత్రం
మకార ఉచ్ఛారణ కలిగి ఉన్నది.
దీనిలో తవర్గక్షరముల  అనేకముగ ఆవృత్తము
అగుట వలన ఇది కౌంకణీ వృత్త్యనుప్రాసమగుచున్నది.

Wednesday, June 22, 2016

ఎదిరి పూర్వరూప పదమునందె


ఎదిరి పూర్వరూప పదమునందె


సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి ఇందులోని చిత్రాన్ని గమనించండి.

జలజ - కనక - కటక - నళిన - భద్రేభ - ముల్
సఖియ కంఠ-కాంతి-జఘన-చరణ-
గమనములకు సాటిగానక తన వృత్తి
ఎదిరి పూర్వరూప పదమునందె

నాయిక కంఠ, కాంతి, జఘన, చరణ, గమనములతో
జలజ, కనక,కటక, నళిన, భద్రేభ - ములు
పోటీ పడినవట అవి ఎంత ప్రయత్నించినా!
వాటికి సాటిరాలేక తలక్రిందులుగా పోరాడి కూడ
పూర్వరూపంలోనే ఉన్నాయట.
 కారణం ఏమిటంటే ఆ పదాలన్నీ
అనులోమంగాను ప్రతిలోమంగాను ఒకటే
ఇది ఆమె సౌందర్య పరాకాష్ఠ తెలపటమే.

జలజ, కనక,కటక, నళిన, భద్రేభ - అనే పదాలు
అనులోమంగాను ప్రతిలోమంగాను ఉండటం వల్ల
ఇది గతిచిత్రం.

అనుకరణ పద్యం


అనుకరణ పద్యం


సాహితీమిత్రులారా!


కృష్ణదేవరాయలను కీర్తించిన
ఈ క్రింది పద్యం చాలా ప్రసిద్ధమైనది
చూడండి.

నరసింహ కృష్ణరాయని
కరమరుదగు కీర్తియొప్పెఁగరిభిద్గిరిభి
త్కరి కరిభిద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై
                           (చాటుపద్యమణిమంజరి)

ఈ పద్యానికి అనుకరిస్తూ చెప్పిన పద్యం చూడండి.

వరబారు వేంకనార్యుని
ధరనిండిన కీర్తి వెలసె ధరజిత్పుర జి
ద్ధర ధర జిత్పుర త్పుర జి
ద్ధర జిత్పుర జిత్తురంగ ధావళ్యంబై
                                  (చాటుపద్యరత్నాకరం)

Tuesday, June 21, 2016

బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! (పేరడీ పద్యం)


బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! (పేరడీ పద్యం)


సాహితీమిత్రులారా!

శ్రీనాథకవిసార్వభౌముడు
ఒకసారి ఒక సుందరాంగిని
చూచి చెప్పిన పద్యం ఇది
చూడండి.

చక్కని నీ ముఖ చంద్రబింబమునుకు 
                      కళ్యాణమస్తు! బంగారు బొమ్మ!
నిద్దంపు నీ చెక్కుటద్దంపు రేకకు 
                     నైశ్వర్యమస్తు! నెయ్యంపు దీవి!
మీటిన పగులు నీ మెరుగు పాలిండ్లకు 
                      సౌభాగ్యమస్తు! భద్రే భయాన!
వలపులు గులుకు నీ వాలు గన్నులకు 
                      న త్యధిక భోగోస్తు! పద్మాయతాక్షి!
మథురిమము లొల్కు నీ ముద్దు మాటలకును
వైభవోన్నతిరస్తు! లావణ్యసీమ!
వన్నె చిన్నెలు గల్గునీ మన్ననలకు
శాశ్వత స్థిరస్తు! యోషాలలామ!


ఈ పద్యానికి వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం (214)లో
వ్యంగ్యానుకరణ  కనిపిస్తుంది.
ఇక్కడ వితంతువులను
మంచన దీవించినట్లు చెప్పబడింది
చూడండి.

చెలఁగి చెలఁగి పొత్తి చీరలు గట్టెడు
         మాచకమ్మకు దీర్ఘమాయురస్తు!
సారె సారెకు దేవసదనంబునకు నేఁగు
         చెడిపెకు సంకల్ప సిద్ధిరస్తు!
నిత్యంబు వ్యభిచార నిష్ఠతో నుండెడు
        విధవకుఁ బుత్రాభివృద్ధిరస్తు!
దళముగాఁ దులసి పేరులు ధరియించినయట్టి
          విశ్వస్త కారోగ్య విభవమస్తు!
మిండ ముండకు సంపత్సమృద్ధిరస్తు!
పఱచు తెంపికి నిత్య సౌభాగ్యమస్తు!
వదరుఁ గల్కికి నీప్సితావాప్తిరస్తు!
బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! 

Monday, June 20, 2016

కుంభకూటాట్ట కుట్టాక ....


కుంభకూటాట్ట కుట్టాక ....


సాహితీమిత్రులారా!


శబ్దాలంకారంలో వృత్త్యనుప్రాసములోని 1. కర్ణాటీ, 2. కౌంతలీ తెలుసుకున్నాము.
ఇపుడు మూడవది కౌంకీ గురించి తెలుసుకుందాం.

'' - వర్గాక్షరాలైన , , డ, , లు అనుప్రయుక్తములైన
అది కౌంకీ వృత్త్యనుప్రాసమని చెప్పబడుచున్నది.

కుంభకూటాట్ట కుట్టాక కుటిలోత్కట పాణిరుట్
హరి: కరటిపేటేన న ద్రష్టుమపి చేష్ట్యతే
                                    (సరస్వతీకంఠాభరణము - 2- 180)

(కుంభస్థలములన్న హర్మ్యాగ్రములను
పడగొట్టుటలో ప్రావీణ్యము గల దారుణమైన
పంజా గల సింహమును ఏనుగులు
చూచుడకు కూడ ప్రయత్నించుటలేదు.)

ఈ శ్లోకంలో , - అనే ''-వర్గాక్షరములు  అనేకమార్లు ఆవృత్తమైనవి
కావున
ఇది కౌంకీ అను వృత్త్యనుప్రాసకు చెందినది.

అనుకరణ పద్యం


అనుకరణ పద్యం


సాహితీమిత్రులారా!

పోతన భాగవతం(8-103) పద్యం చూడండి.

అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడయుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడు గిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

అనుకరణ పద్యం ఇది ఠంయాల లక్ష్మీనరసింహాచార్యుల
 నిర్వచనశుభాంగీ కళ్యాణంలోని పద్యం(3-136) చూడండి.

వెడవెడ విడివడి యడుగులు
కడువడి తడబడగ నగచి కడుయెడనడరన్
బడుగు నడుమడరి వడవడ
వడకగ చెలియడవి జడుపు బడక బడియెన్

Sunday, June 19, 2016

చెప్పలేకున్న నగుదు నే చిన్ననగవు


చెప్పలేకున్న నగుదు నే చిన్ననగవు


సాహితీమిత్రులారా!

ఈ క్రింది పొడుపు పద్యానికి సమాధానం ఆలోచించండి.

శ్రీమంతుడును భార్య చెలగుచు నొక్కటి
           కీలంబు శాఖయు గ్రాలు నొకటి
రదనంబు కాకంబు రహిమీద నొక్కటి
          యవనిక యును చాప నెనయ నొకటి
పత్రంబు గ్రావంబు పరగంగ నొక్కటి
          నేత్రంబు శిశువును నెనయ నొకటి
వెన్నుండు మరికాంత వివరింప నొక్కటి
          వస్త్రంబు మగజాతి వరుస నొకటి
అన్నిటికి జూడ నాల్గేసి అక్షరములు
ఏకపదముగ జెప్పుడీ యిలను బుధులు
చెప్పగలిగిన నేనిత్తు చిన్ని మాడ
చెప్పలేకున్న నగుదు నే చిన్ననగవు

ఈ పద్యంలోని ప్రశ్నలు 8
వాటికి అన్నిటికి నాలుగక్షరాల సమాధానం చెప్పాలి.

సమాధానాలకై ఆలోచిద్దాం.

1. ధనవంతుడు, భార్య - ఒకేపదంలో ఇమిడి
   ఉండేపదం సమాధానమౌతుంది
   ధనికురాలు (ధని - ధనం గలవాడు, ఆలు - భార్య)
2. మేకు(కీలము), శాఖ(కొమ్మ) రెండు కలిసినపదం సమాధానం-
   చీలమండ(చీల - మేకు, మండ - కొమ్మ(శాఖ))
3. పన్ను(రదనం), కాకి రెండు కలిసినపదం సమాధానం -
   పలుగాకి(పలు - కాకి) (పలు - పన్ను(దంతము), కాకి - పక్షి)
4. తెర(యవనిక), చాప రెండు కలిసినపదం సమాధానం -
   తెరచాప (తేర- యవనిక(అడ్డువల), చాప - తుంగ,
    తాటి ఆకులతో నేసినచాప)
5. పత్రము, పాషాణము(గ్రావంబు) రెండు కలిసినపదం సమాధానం-
    ఆకురాయి
6. కన్ను(నేత్రం), చిన్నబిడ్డ(శిశువు) రెండు పదాలు కలిసినపదం సమాధానం-
    కనుపాప

7. విష్ణువు(వెన్నుడు), కాంత రెండు కలసినపదం సమాధానం -
    విష్ణుకాంత(ఒక పువ్వి)
8. బట్ట (వస్త్రం), మగజాతి రెండు కలిసినపదం సమాధానం -
    చీరపోతు(తెల్లపేను)

కవయామి - వయామి - యామి


కవయామి - వయామి - యామి


సాహితీమిత్రులారా!

భోజరాజు గొప్ప కవితాప్రియుడు.
తన రాజ్యంలో ప్రతిఒక్కరు కవిత్వం అల్లగలిగి ఉండాలి.
కవితాశక్తి లేనివారిని దేశంనుండి తరిమివేయండని భటులకు ఆజ్ఞాపించాడు.
వారు వెదికి వెదికి ఒక సాలెవానిని పట్టుకొని రాజు ఎదుట పెట్టారు.
"కవిత్వం చెప్పగలవా?" అని భోజుడు ప్రశ్నించాడు.
ఆ సాలెవాడు భోజునివంక చూచాడు.
(భోజుని ముఖం చూడగానే ప్రతి వ్యక్తికి కవిత్వం హృదయం నుండి
తన్నుకొని వస్తుందంటారు అదే విధంగా)
వెంటనే
ఆ సాలెవాడు
ఈ క్రింది విధంగా సమాధానం చెప్పాడు -


కావ్యం కరోమి నహి చాతురం కరోమి
యత్నాత్ కరోమి యది చాతురం కరోమి
భూపాలమౌళి మణిరంజిత పాదపీఠ
హో సాహసాంక కవయామి - వయామి - యామి


కావ్యం వ్రాయగలను,
కాని అందంగా రచింపలేను.
ప్రయత్నిస్తే వ్రాయగలను.
రాజులు మణి కిరీట కాంతులతో ప్రకాశించు
పాదపీఠముగల చక్రవర్తీ!
కవయామి(కవనమల్లగలను) -
వయామి(నేతనేయగలను) -
యామి(వెళ్ళుచున్నాను) -
అని భావం.

ఇది శబ్దాలంకార చిత్రంలో గోపుచ్ఛాకృతి చిత్రం.

Saturday, June 18, 2016

చకోరాక్షి చంచరీకా శ్చకాసతి


చకోరాక్షి చంచరీకా శ్చకాసతి


సాహితీమిత్రులారా!

వృత్యనుప్రాసంలో 1వది కార్ణాటీ, 2వది కౌంతలీ.
ఇప్పుడు మనం కౌంతలీ గురించి తెలుసుకుందాము.
"చ" - వర్గము అనుప్రాసగా గలది కౌంతలీ.
"చ" వర్గమునందలి చ, ఛ, జ, ఝ, ఞ అనే అక్షరాలు పున: పునరావృతమైన
(ఆవృత్తం చెందిన) దాన్ని కౌంతలీ వృత్త్యనుప్రాసమంటారు.

జ్వలజ్జటిల దీప్తార్చి రఞ్జనోస్సయ చారవ:
చంపకేషు సకోరాక్షి చఞ్చరీకా శ్చకాసతి
                                          (సరస్వతీకంఠాభరణము - 2-179)

(ఓ చకోరాక్షీ సంపెంగలయందు జ్వలించుచున్న జడలు కలిగిన
ప్రకాశమానమైన అగ్నులవలె అత్యంత రంజన మనోహరములయిన
తుమ్మెదలు విలసిల్లుచున్నవి.)

దీనిలో "చ", "జ", "ఞ" అనే అక్షరములు ఎక్కువమార్లు ఆవృత్తమైనవి.
ఇవి అన్నీ "చ" - వర్గమునకు సంబంధించినవి.
కావున ఇది కౌంతలీ వృత్త్యనుప్రాసము అగుచున్నది.

అనుకరణ పద్యాలు


అనుకరణ పద్యాలు


సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల పేర్లు అనేక
విధాలుగా చెప్పడం జరుగుతోంది. ఈ పేర్లలో కవయిత్రి మొల్ల పేరుకూడా
వినబడుతూవుంది.
కవయిత్రిమొల్ల మొదటిసారి రాయలవారిని దర్శించుకున్న
సమయంలో ఆమె ప్రభువులను
ప్రస్తుతిస్తూ ఇలా చెప్పారు.

అతఁడు గోపాలకుండితఁడు భూపాలకుం డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు పాండవపక్షుఁడితఁడు పండిత రక్షుఁ డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు యాదవ పోషి యితఁడు యాచకపోషి యెలమి నాతనికన్ననితఁడు ఘనుఁడు
అతఁడు కంసధ్వంసి యితఁడు కష్టధ్వంసి యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
పల్లె కాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీల కాతండు పద్మినీ స్త్రీలకితఁడు
సురల కాతండు తలప భూసురులకితఁడు
కృష్ణుఁడాతండు శ్రీ మహాకృష్ణుఁడితఁడు

అని కృష్ణుని, శ్రీకృష్ణదేవరాయలను పోల్చి,
కృష్ణునికన్న రాయలే గొప్ప అని చమత్కరించి చెప్పినది.
ఈ పద్యాన్ని విన్న తెనాలిరామకృష్ణుడు తన సహజ
వికట స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఇలా చెప్పాడు.

అతఁడంబకు మగఁడు ఈతఁడమ్మకుమగఁ డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు శూలముద్రిప్పు నితఁడు వాలముద్రిప్పు డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడమ్ముననేయు నితఁడు కొమ్మునఁడాయు డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతని కంటనుజిచ్చు నితని కంటను బొచ్చు డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు

దాతయాతండు గోనెల మోతయితఁడు
దక్షుఁడాతండు ప్రజల సంరక్షుడితఁడు
దేవుఁడాతండు కుడితికి దేవుఁడితఁడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు.

అని ఈశ్వరుని, నందీశ్వరుని పోల్చి,
ఈశునికన్న నందీశుడే గొప్పని
వికటంగా
అనుసరిస్తూ పద్యం.

కవయిత్రిమొల్ల పద్యానికి అనుసరిస్తూ ఒక కవి
సాహిణిమారనపై చెప్పిన పద్యం ఇది.

జడలలో మిన్నేఱుఁజంద్ర రేఖయుఁగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
వరవజ్ర కవచంబు వజ్రాయుధముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
కోల్పోవు తనయుండు క్రోఁతి టెక్కెముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
చెఱకు సింగిణి విల్లు సెలగోలయును గల్గు నాతఁడీతండు నేమౌదురొక్కొ
శంభుఁడాతండు శాశ్వతారంభుఁ డితఁడు
ఇంద్రుఁడాతండు భోగ దేవేంద్రుఁడితఁడు
పార్థుఁడాతండు సమర సమర్థుఁడితఁడు
మారుఁడాతండు సాహిణి మారుఁడితఁడు

మొదటి పాదంలో శివునితోను,
రెండవ పాదంలో ఇంద్రునితోను,
మూడవ పాదంలో పార్థునితోను,
నాలుగవ పాదంలో మన్మథునితోను
సాహిణిమారుని పోల్చాడు  ఈ కవి.


Friday, June 17, 2016

జనకుని తండ్రి కూతు వర సుతు మామన్


జనకుని తండ్రి కూతు వర సుతు మామన్


సాహితీమిత్రులారా!

ఈ పద్యభావం తెలిగలదేమో చూడండి.

సురవర గురునకు సతిసుత
వర జనకుని తండ్రి కూతు వర సుతు మామన్
శిరమందుఁ గొన్న వరసుతు
నిరతము సేవింతు నియమ నిష్కల్మష మతిన్
                                      (వికట కవిత్వచింతామణి - పుట.14)

ఈ పద్యం భావం తెలియాలంటే కొంచం లోతుగా ఆలోచించాలి.
ఎలాగంటే  పోటీపరీక్షలకు తార్కిక (Verbal Reasoning) ప్రశ్నలలో
ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి.
ముందు వాటిలో ఒకదాన్ని చూద్దాం.

Pointing towards a person  in the photograph, Anjali said, 
"He is the only son of the father of my sister's brother." 
How is that person related to Anjali?

The relations may be analysed as follows:

Sister's brother - Brother;
Brother's father - Father;
Father's son      - Brother
So, the person in the photograph is Anjali's brother.

ఈ చెప్పిన ప్రశ్నవివరణవలెనే మనం ఇక్కడ సమాధానం రాబట్టాలి.
ఇందులో సురవరుగురుడు - బృహస్పతి,
బృహస్పతి భార్య - తార,
తార కుమారుడు - బుధుడు,
బుధుని తండ్రి - చంద్రుడు,
చంద్రుని తండ్రి - సముద్రుడు,
సముద్రుని వరసుత - లక్ష్మిదేవి,
లక్ష్మిదేవి సుతుడు - మన్మథుడు
మన్మథుడు మామ - చంద్రుడు
చంద్రుని శిరమున గొన్నవాడు - శివుడు,
శివుని వరసుతుడు - వినాయకుడు
వినాయకుని నియమముతో, కల్మషములేని మనసుతో 
నిరంతరము సేవిస్తాను. ఇది భావం.

సవ్రీడాత్త పరాభవో వన మృగ:


సవ్రీడాత్త పరాభవో వన మృగ:


సాహితీమిత్రులారా!

ఇది హనుమన్నాటకములో అంగద రాయబారములో
రావణ - అంగదులకు జరిగిన సంభాషణ శ్లోకం.

కస్తం వానర ?

రామరాజభవనే లోఖార్థ సంవాహక:

యాత: కుత్ర పురాగత స్సహనుమాన్ నిర్దగ్ధ లంకాపుర:?

బద్ధో రాక్షససూను నేతి కపిభి సంతర్జిత స్తాడిత:
సవ్రీడాత్త పరాభవో వన మృగ: కుత్తేతి నజ్జాయతే!

రావణుడు- వానరా నీవెవ్వడవు?
అంగదుడు - రామరాజు భవనంలో లేఖలందించువాడను.
రావణుడు - ఇదివరకు హనుమ అనువాడు వచ్చి లంకాపట్టణాన్ని 
                   కాల్చినవాడు ఇప్పుడెక్కడున్నాడు?
అంగదుడు - "రాక్షస బాలునిచేత కట్టబడిన బలహీనుడవు" - అని 
                    కొట్టి భయపెట్టగా ఆ కోతి సిగ్గుతో, అవమానంతో 
                    ఎక్కడకు పోయిందో ఏమో! తెలియదు!

Thursday, June 16, 2016

నలుగురు నిను బలుమారున్ గెలిచిరి


నలుగురు నిను బలుమారున్ గెలిచిరి


సాహితీమిత్రులారా!

ఈ పద్యం అర్థాన్ని గమనించండి

నలుగురు నిను బలుమారున్
గెలిచిరి సుగుణోక్తి కాంతికీర్త్యాకృతులన్
నలుగురు నిను బలుమారుల్
భళి భళి యన కచ్చిరంగ! భాగ్యతరంగా!
                                (చాటుపద్యరత్నాకరము -3-188)

సౌభాగ్యతరంగా  కచ్చిరంగా
(సుగుణ + ఉక్తి = సుగుణోక్తి, కీర్తి + ఆకృతులన్ = కీర్త్యాకృతులన్)
సుగుణ- మంచిగుణాలలో, ఉక్తి - మంచిమాటలలో,
కాంతి - చక్కదనంలో, కీర్తి - యశస్సులో, ఆకృతులన్ - ఆకారంలో,
నలున్ - నలచక్రవర్తిని, గురున్ -  బృహస్పతిని, ఇను - సూర్యుని,
బలు - బలరాముని, మారు(ల)న్ - మన్మథునిగెలిచి(తి)రి- గెవిచినావు,
(అని) నలుగురు- అనేకులు , నిను - నిన్ను, పలుమారుల్ - అనేకసార్లు,
భళి భళి - భళి భళి అను ధ్వనులతో నుతించిరి.

సౌభాగ్యతరంగా! కచ్చిరంగా! 
మంచిగుణాలలో నలచక్రవర్తిని, మంచిమాటలలో బృహస్పతిని
చక్కదనములో సూర్యుని, కీర్తిలో బలరాముని
ఆకారంలో మన్మథుని, గెలిచావనిఅనేకులు నిన్ను 
అనేకమార్లు భళి! భళి! అని ధ్వనులతో పొగిడారు 
- అని భావము.

ఒకటె రెండేసి ప్రశ్నల కుత్తరంబు


ఒకటె రెండేసి ప్రశ్నల కుత్తరంబు


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యంలోని రెండేసి ప్రశ్నలకు ఒక సమాధానం
సరిపోయేవిధంగా సమాధానం చెప్పగలరేమో? చూడండి.

ఇంటికి వింటికి బ్రాణ మేది చెపుమ?
కంట మింటను మనమేమి కాంచగలము?
నవ్వు, పువ్వు దేనినుండి పొలుపు గాంచు?
ఒకటే రెండేసి ప్రశ్నల కుత్తరంబు.

పై పద్యంలో ప్రతి పాదంలో 2 ప్రశ్నలు ఉన్నాయి.
ప్రతి రెండు ప్రశ్నలకు సమాధానం ఒకటిగానే ఉండాలి.
అవి ఆలోచించి చూడగా......
ఇంటికి ప్రాణం ఏది? - ఇల్లాలు ( స్త్రీ )
వింటికి ప్రాణం ఏది? - అల్లెత్రాడు
ఈ రెంటిని నానార్థాలుగల పదం - నారి

కంట (కంటిలో), మింటిలో(ఆకాశంలో) మనం ఏంచూస్తాము
మనకంటిలో చూసేది ఏది? - కంటిపాప
ఆకాశంలో మనం చూసేది ఏది? - నక్షత్రాలు
కంటిపాపను, నక్షత్రాలను నానార్థాలుగా గల పదం - తార

నవ్వుగాని దేన్ని చూసి సంతోషపడతాము - వలపు(ప్రేమ),
పువ్వు దేనితో కలిసి అందంగా ఉండగలవు - వాసన
వలపు, వాసన రెండింటికి కలిపి నానార్థంగా ఉన్న పదం ఏది - వలపు


 పువ్వుగాని దేనితో? కూడి అందంగా ఉండగలవు - వలపు

Wednesday, June 15, 2016

కాంతే కుటిల మాలోక్య


కాంతే కుటిల మాలోక్య


సాహితీమిత్రులారా!

అర్థాన్ని కోరకుండా, శబ్దం మాత్రమే ప్రధానంగా కోరేవాటిని శబ్దాలంకారాలు అంటారు.
వాటిలో అనుప్రాసాలంకారం ఒకటి. వీనిలో అనేకరకాలున్నాయి.
వాటిలో వృత్యనుప్రాసము ఒకటి.
వృత్యనుప్రాసమంటే ఒకే హల్లు అనేకమార్లు ఆవృత్తం కావడం
(అంటే తరిగి తిరిగి రావడం)
"సముద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ దోరనుక్షణ భప్రమదసిదుర్నిదీక్ష" -
ఇందులో "క్ష" అనేది అనేకమార్లు వచ్చింది.
ఆ జెఱ్ఱిఱ్ఱితొఱ్ఱలో బిఱ్ఱబిగిసి ఉన్నది -
ఇందులో "ఱ్ఱ" అనేకమార్లు ఆవృత్తమైనది.
కావున ఇది వృత్యనుప్రాసం అంటున్నాము.

కాని దీని పూర్తిగా సంక్షిప్తంగా చెప్పుకొంటున్నాము.
వృత్యనుప్రాసను
సరస్వతీకంఠాభరణంలో 12 విధాలని చెప్పి ఉన్నాడు.
వాటిలో ఇప్పుడు మొదటిదాన్ని గురించి తెలుసుకుందాము.
దాని పేరు కర్ణాటీ.
కర్ణాటీ అంటే "క" వర్ణము అనుప్రాసగాగలది.
అంటే "క" వర్ణము తిరిగి తిరిగి ఆవృత్తమైన అది కర్ణాటీ వృత్యనుప్రాసము.
ఉదాహరణకు క్రింది శ్లోకం చూద్దాం.

కాంతే కుటిల మాలోక్య ర్ణకండూయనేన కిమ్
కామం థయ ల్యాణి కింకర: రవాణి కిమ్
(సరస్వతీకంఠాభరణము-2-178)

(కాంతా! కుటిలముగా చూచి చెవి గోకుకొనుటచేత ఏమిటి లాభము?
కల్యాణీ!  నీ కోరికను చెప్పు. కింకరడనైన నేను ఏమిచేయాలి)

దీనిలో "" వర్ణము అనేక మార్లు ఆవృత్తమైనది.
దీనిలో హల్లుకే ప్రాధాన్యము
కాని అది ఏస్వరంతో కలిసి అయినా ఉండవచ్చు.
దీనిలో పద్యమంతటా "" వర్ణం వ్యాపించి ఉన్నందున
ఇది కర్ణాటీ వృత్యనుప్రాసము.

అన్నిటికి నొక్కయుత్తరం బమరవలయు


అన్నిటికి నొక్కయుత్తరం బమరవలయు


సాహితీమిత్రులారా!

ఈపద్యంలోని ప్రశ్నకు చెప్పగలరేమో చూడండి.

వాయుదేవుని వహియించు వాహనమేది?
వానచినుకుల గ్రోలెడి పక్షి యేది?
చంపక పరీమళంబు సహింపదేది?
తలను ముత్యాలుగల మృగతిలకమేది?
అన్నిటికి నొక యుత్తరం బమరవలయు

ప్రశ్నలను వివరంగా గమనిస్తే.......
1. వాయుదేవు(గాలి)ని మోసెడి వాహనమేది?  - లేడి
2. వానచినుకుతో బ్రతికే పక్షి ఏది? - చాతకపక్షి
3. సంపెంగ వాసన సరిపడనిది ఏది? - తుమ్మెద
4. తలలో ముత్యాలుగల శ్రేష్ఠమృగము ఏది? - ఏనుగు

పై ప్రశ్నల సమాధానాలు - లేడి,  చాతకపక్షి,  తుమ్మెద,  ఏనుగు
ఈ పదాలన్నిటిని నానార్థంగా గల పదం బాగా ఆలోచిస్తే తెలుస్తుంది.
అది ... అది.. ఆ.. సారంగము
సారంగానికి పర్యాయపదాలు -
తుమ్మెద, ఏనుగు, వానకోయిల(చాతకపక్షి), ఇఱ్ఱి, చిరుతపులి,
ఓదెకొంగ, నెమలి, గొడుగు, మబ్బు, వెండ్రుగ, నగ, పువ్వు, బంగారు,
కప్పురము, విల్లు, తామర, చిత్రవర్ణము, రాత్రి, నేల, శంఖము, చందనము,
వెలుఁగు, ఒక స్త్రీరాగము.

నిఘంటువులో ఇన్ని అర్థాలున్నాయి మరి.
ఇవి తెలిస్తే పొడుపు పద్యం సమాధానం సులభంకదా!

Tuesday, June 14, 2016

ఆననాధరగళ మూర్తులతివ కజుఁడు


ఆననాధరగళ మూర్తులతివ కజుఁడు


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.

ఆననాధరగళ మూర్తు లతివ కజుఁడు
చంద్రకురువిందశంఖ చంచలలఁజేసి,
చెలఁగి, తచ్చిహ్న కాఠిన్య సితచలతలు
సొరిదిఁ కచకుచహాసదృష్టులుగఁ జేసె
(చాటుపద్యమణిమంజరి-1భా. పుట.108)

ఈ పద్యం తెనాలి రామకృష్ణునిదిగా ప్రసిద్ధమయినది.
పద్యంలోని క్రిందిపదాల వరుస చూడండి.
ఆనన-చంద్ర-చిహ్న - కచ
అధర- కురువింద- కాఠన్య- కుచ
గళ- శంఖ- సిత- హాస
మూర్తి-చంచల- చలత-దృష్టులు
ఈ వరుసక్రమంలో పదాలను గుర్తుంచుకొని వివరణలో గమనించండి.

బ్రహ్మదేవుడు వనితయొక్క
ముఖాన్ని(ఆననమును) చంద్రునితోను,
పెదవిని(అధరమును) పద్మరాగ(కురువింద)మణులతోను,
కంఠము(గళము)ను శంఖముతోను,
ఆకారమును(మూర్తిని) మెరుపు(చంచల)తోను,
క్రమంగా ఉంపమింప సృష్టించినాడు.
కానీ,
క్రమంగా వాటిలోని దోషాలను తర్వాత గమనించి,
మరల విజృంభించి(చెలగి)
ముఖము చంద్రునితో చేశాడుకదా చంద్రునిలోని మచ్చ(నలుపు)ను
తొలగించటానికి  ఆమె వెంట్రుకల(కచ)తోను,
పద్మరాగంలోని కఠినత్వాన్ని స్తనాలలోను,
శంఖంలోని తెల్లదనాన్ని(సిత) ఆమె నవ్వు(హాసం)లోను,
మెరుపులోని చంచలత్వాన్ని ఆమె చూపులలోను,
క్రమంగా రూపొందిచి తప్పు చేసినాడనే
అపవాదు నుండి  తప్పించుకున్నాడు బ్రహ్మ.

ప్రమథ నాయకుడరయ శిరస్థదారు


ప్రమథ నాయకుడరయ శిరస్థదారు


సాహితీమిత్రులారా!

ఈ పద్యం భావమేమో చూడండి.

కమల గర్భుండరయగా ముఖస్థదారు,
రమకు నాయకుండరయ ఉరస్థదారు,
ప్రమథ నాయకడరయ శిరస్థదారు,
దీని భావమేమి .........

పారసీ భాషలో దార్ శబ్దానికి కలవాడు,
ఉంచుకొనువాడు - అనే అర్థాలున్నాయి.
అదే సంస్కృతంలో ధార శబ్దానికి భార్య అని అర్థం.
ఈ రెండు భాషా శబ్దాలతో కవి
త్రిమూర్తులను అన్యాపదేశంగా, చమత్కారంగా, అపహాస్యం చేస్తున్నాడు.

కమలగర్భుడు బ్రహ్మ.
బ్రహ్మ నోటిలో సరస్వతి ఉంటుందికదా!
అందుకే ముఖస్థదారు అంటున్నాడు.
రమకు నాయకుడు విష్ణువు.
విష్ణువు ఉరములో లక్ష్మీదేవి ఉంటుంది.
కావున ఉరస్థదారు అన్నాడు.
ప్రమథ గణాలకు నాయకుడు శివుడు.
శివుడు గంగను శిరస్సుపై ఉంచుకున్నాడు.
కావున ఆయన శిరస్థదారు.

ఇదే పొడుపు పద్యాన్ని వేమన పద్యాలలో

పడతి మోసెనొకడు, పడతి మేసెనొకడు
పడతి నెదను బెట్టి బ్రతికె నొకడు
పడతికొరకు నిట్లు పలుపాట్లు పడిరయా
విశ్వదాభిరామ! వినురవేమ!

దీనికి విరుగుడులాంటి పద్యం

స్త్రీ నెత్తిన రుద్రునకు
స్త్రీ నోటను బ్రహ్మకెపుడు సిరిగల్కంగా
స్త్రీ నెదిరి రొమ్మున హరికి
స్త్రీ నెడపగ గురుడవీవు దేవర వేమా!

Monday, June 13, 2016

కావ్యం శుక ఏవ న మధ్యమ:


కావ్యం శుక ఏవ న మధ్యమ:


సాహితీమిత్రులారా!

ఇద్దరు కవిమిత్రులు ఇలా మాట్లాడు కొనుచున్నారు.

మొదటివాడు - "అలం కరోతి య కావ్యం శుక ఏవ న మధ్యమ:"
రెండవవాడు - "అలం కరోతి య కావ్య శుక ఏవ నమధ్యమ:"

ఇంతకు వీరు మాట్లాడు కొన్నది ఏమంటే-
మొదటివాడు- ఎవడు కావ్యాన్ని లేక శ్లోకాన్ని చక్కగా అలంకారయుక్తంగా
                      తీర్చి దిద్దుతాడో,  వాడు 'న' నకారం మధ్యలో లేనందున
                      శుకము (చిలుక లేక శుకమహర్షివంటివాడు) అగుచున్నాడు.

రెండవవాడు - అవును! నీవు చెప్పినట్లుకాక, ఎవడు కావ్యాన్ని లేక శ్లోకాన్ని
                     అలం - అలంకారాలు చాలులే, అన్నట్లుగా అలంకారాలను లేకుండా
                     రచిస్తాడో, ఆ కవి "నమధ్యమ" ('న' కార: మధ్యే యస్యస: ) 'న' కారం 
                     మధ్యలో  కలవాడు అనగా శుక శబ్దానికి మధ్యలో 'న' కారము ఉంచితే -
                     అది "శు(న)క"- అవుతుంది. నీచజంతువవు అగు కుక్క అవుతాడు.
                     కానీ శుక తుల్యుడు కాలేడు.

అక్షరద్వయమున నొక్కయుత్తరంబె యొసగవలయుఅక్షరద్వయమున నొక్కయుత్తరంబె యొసగవలయు


సాహితీమిత్రులారా!


పొడుపు పద్యాలలో మరో రకం చూడండి.


ఏకచక్రము బండి నెక్కు రేడెవ్వడు?
ఒడలెల్ల గనులైన యొడయ డెవడు?
మఱ్ఱియాకున బండు కుఱ్ఱవా డెవ్వడు?
శివుని యౌదల జేర్చి చెలగు నెవడు?
సమతమై సర్వభూతముల నేలునెవడు?
వాయుభక్షణచేసి బ్రతుకు నేది?
అఖిల జీవంబుల కాధారమగు నేది?
కొమరారు మారుని గుఱ్ఱమేది?
కంధి దాటి లంకగాల్చిన మృగమేది?
క్షితిని జల్లబడగ జేయునేది?
అరయ నన్నిటికిని నక్షర ద్వయమున
నొక్కయుత్తరంబె నొసగ వలయు

ఈ సీసపద్యంలో 10 ప్రశ్నలు ఉన్నాయి. అన్నిటికి రెండక్షరాల సమాధానం ఒక పదమే చెప్పాలి ఆలోచించండి.

1. ఒకే చక్రంగల రథంపై ఏక్కి తిరుగువాడు - సూర్యుడు
2. దేహంనిండా కన్నులు కలవాడు - ఇంద్రుడు
3. మఱ్ఱిఆకుపై పరుండు బాలుడు - విష్ణువు
4. శివుని శిరస్సుపై వెలుగువాడు - చంద్రుడు
5. అన్ని ప్రాణులను సమానంగా పాలించువాడు - యముడు
6. గాలిమేసి బ్రతికేది - పాము
7. అన్ని జీవులకు ఆధారమైనది - వాయువు
8. మన్మథుని గుఱ్ఱం - చిలుక
9. సముద్రందాటి లంకను కాల్చినది - కోతి(హనుమంతుడు)
10. భూమిని చల్లబడునట్లు చేయునది - వాన

వీటి అన్నిటికి రెండక్షరాల పదం కావాలి.
అది :- హరి
హరి పర్యాయపదాలు-
1. సూర్యుడు,2. ఇంద్రుడు, 3. విష్ణువు, 4. చంద్రుడు,
5. యముడు, 6. పాము, 7. వాయువు, 8. చిలుక,
9. కోతి, 10. వాన, 11. సింహం, 12. కిరణము,
13. గుఱ్ఱము, 14. కప్ప 15. కపిలము(బంగారుఛాయ గలది)
ఇలా చాలా అర్థాలున్నాయి నిఘంటువుల్లో.
కావున సరైన సమాధానం - హరి.

అనుకరణ పద్యం


అనుకరణ పద్యం


సాహితీమిత్రులారా!

ఈ పద్యం పరికించండి.

మూఢుండెరుగునె సత్కవి 
గూఢోక్తుల సారమెల్ల, కోవిదుని వలెన్!
గాఢాలింగన సౌఖ్యము
ప్రౌఢాంగన యెరుగుగాక, బాలేమెరుగున్?


ఈ పద్యానికి అనుకరణ పద్యంగా ఈ పద్యం చూడండి.

కవితా కన్యకగుణములు
కవికన్న రసజ్ఞు డెరుగు కవియే మెరుగున్?
భువిలో కన్యక గుణములు,
ధవుడెరుగునుగాక, కన్నతండ్రేమెరుగున్?

Sunday, June 12, 2016

ఐదు వక్త్రము లొప్పిన యనఘు డెవడు?


ఐదు వక్త్రము లొప్పిన యనఘు డెవడు?


సాహితీమిత్రులారా!

గతంలో కొన్ని పొడుపు పద్యాలను చూశాము.
పొడుపు పద్యాలు ఎన్ని చూచినా -
వింత వింతగా ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి.
అందులోను అనేక రకాలున్నాయి.
ఇప్పుడో రకం చూద్దామా

రెండు ముఖములు గలుగు ఘనుండెవండు?
మూడు మోములుగల జగత్పూజ్యు డెవడు?
నాల్గు మోములుగల లోకనాథుడెవడు?
ఐదు వక్త్రము లొప్పిన యనఘుడెవడు?
ఆరు నిటలంబు లలరు సుధీరుడెవడు?
పది లలాటంబుల చెలగు ప్రభుడెవండు?
నూరు ఫాలంబులను గ్రాలు వీరుడెవడు?
వేయి వదనంబుల వెలుగు విబుధుడెవడు?

ఇందులో అన్నీ ప్రశ్నలే తప్ప ఎలాంటి షరతులు లేవు కావున ఆలోచించగా ఆన్సరు వచ్చు.

సమాధానాలు-
1. 2 నోళ్ళుగల గొప్పవాడు ఎవరు? - అగ్ని
2. 3 ముఖాలున్న లోకపూజ్యుడు ఎవరు? - దత్తాత్రేయుడు
3. 4 నోళ్ళున్న జగన్నాథుడు ఎవరు? - బ్రహ్మ(చతుర్ముఖుడు)
4. 5 మోములున్న పుణ్యమూర్తి ఎవరు? - శివుడు (పంచముఖుడు)
5. ఆరు నోరులుగల వీరుడు ఎవరు? - కుమారస్వామి(షణ్ముఖుడు)
6. పది ఫాలములున్న ప్రభువు ఎవరు? - రావణుడు(దశముఖుడు)
7. నూరు నుదురులున్న వీరుడు ఎవరు? - శతముఖ రావణుడు
8. వేయి నోళ్ళతో వెలుగొందువాడు ఎవరు? - ఆదిశేషుడు

నిస్తాలవ్యం


నిస్తాలవ్యం


సాహితీమిత్రులారా!

అక్షరముల ఉత్పత్తి స్థానమును బట్టి
కంఠము, తాలువు, మూర్దము, దంతము, ఓష్ఠము అని ఐదు
విధములని తెలుసుకొని ఉన్నాము.
వీటిలో కేవలము కంఠస్థానమున పుట్టెడి అక్షరములతో
పద్యం కూర్చిన అది కంఠ్యము అని,
ఒకవేళ కంఠస్థానమున ఉత్పత్తి అయ్యే అక్షరములను వదలి
మిగిలిన వాటితో పద్యం కూర్చిన కంఠ్యములు లేనిది
నిష్కంఠ్యము అని పిలువబడుచున్నది.
అలాగే తాలువులతో కూర్చిన తాల్యము అని,
తాలువులతో కాక మిగిలిన వాటితో కూర్చిన నిస్తాలవ్యమని అందురు.
మరి, తాలువు = దవుడ, దవుడ నుండి పుట్టేవాటిని తాలువులు అంటారు.
తాలువులయందు పుట్టు అక్షరములు - ఇ-వర్ణము(స్వరము),
చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము ఇవి తాలవ్యములు.
ఇవి లేకుండా పద్యం లేక శ్లోకం కూర్చిన అది నిస్తాలవ్యము.

ఉదాహరణ గమనిద్దాం-
స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బుర:
మేఘనాదో2థ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ
                                      (సరస్వతీకంఠాభరణము -2-268)

(ప్రకాశించుచున్న కర్ణభూషణరత్న సమూహమనెడి
హరివిల్లుచేత పొడలుగలిగినవాడై సంగ్రామమునందు మేఘనాధుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము వలె ప్రకాశించెను.)
(ప్రావృట్టు = వర్షర్తువు)

ఈ శ్లోకంలో పై చెప్పిన అక్షరాలు ఉన్నాయేమో? గమనించండి.
ఉంటే భోజమహారాజును నిలదీద్దాం.
ఆ అక్షరాలు మరొక్కసారి చూస్తారా- ఇవే
ఇ-వర్ణము(స్వరము), చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము. 

Saturday, June 11, 2016

లచ్చి శంకరుండు లలిమీర గలిసినలచ్చి శంకరుండు లలిమీర గలిసిన


సాహితీమిత్రులారా!

ఇదేమిటి లచ్చి శంకరుండు లలిమీర గలిసిన -
ఇదేట్లా సాధ్యం.
ముందు ఈ పద్యం చూడండి.

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు
లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు

ఇది పైకి అశ్లీలగా, భ్రాంతి కలిగించి, మెదడుకు పదును పెడుతున్నది.
నిదానంగా ఆలోచిస్తే విషయం అర్థమౌతుంది.

లక్ష్మి కి పర్యాయపదాలు చూస్తే - కమల, లచ్చి, రమా, ఇందిర .... ఉన్నాయి.
అలాగే
శంకరునికి పర్యాయపదాలు - భవుడు, ఈశ్వర,ఈశ,....

పై పద్యంలో మొదటి రెండు పాదాలు తీసుకుంటే

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు

లక్ష్మి పర్యాయపదం కమల,
శంకర పర్యాయపదం భవుడు,

లక్ష్మి కి శంకరుడు కలిసిన భువనకారకుడు పుట్టాలికదా

పర్యాయపదాలను తీసుకుంటే
కమల(లక్ష్మి) - భవుడు(శంకరుడు) ఈ రెండిటిని కలిపిన కమలభవుడు
అంటే భువనకారకుడు(బ్రహ్మ)కదా!

అలాదే చివరి రెండు పాదములు తీసుకొన్న
లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు

లక్ష్మి ని శంకరుడు కలిసిన విష్ణువు పుట్టాలి
పర్యాయపదాలను తీసుకుంటే
రమా(లక్ష్మి) - ఈశ(శంకరుడు) - రమేశ
అంటే  విష్ణువేకదా!
మరి ఇందులో అశ్లీలలేదుకదా!
ఇది గూఢచిత్రము

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!

సుమతీ శతకంలోని ఈ పద్యం చూడండి

అప్పిచువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్ 
జొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

దీనికి శ్రీశ్రీ పేరడీ పద్యం చూడండి.

ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర చొరకుము మువ్వా!


పోతన భాగవతంలోని(8-90)పద్యం -

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛె వచ్చెఁ; దనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్,
నీవే తప్ప నిత:పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్,
రావే యీశ్వర! కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా!

 ఈ పద్యానికి, కామ పరవశుడైన ఒక కవి చెప్పిన పేరడీ పద్యం

పూ విల్కాని సరోజ బాణముల నంభోజారిమై ఛాయలన్
భావంబెంతయు డస్సె మేను బడలెన్ దాపంబు రెట్టించె నే
నీ వాడన్ మధురాధరం బొసగవే! నిక్కంబు నన్నేలవే!
రావే మానిని! కావవే తరుణి!  సంరక్షించు చంద్రాననా!

Friday, June 10, 2016

ద్వ్యక్షరి


ద్వ్యక్షరి

సాహితీమిత్రులారా!
పద్యంలో లేక శ్లోకంలో ఒక వ్యంజనం(హల్లు) మాత్రమే ఉపయోగించి కూర్చిన దాన్ని ఏకాక్షరి అని మనం ఇంతకు ముందు చూచాం. అదే రెండు వ్యంజనాలతో కూర్చిన దాన్ని ద్వ్యక్షరి అంటారు.
తెలుగులో నందితిమ్మన పారిజాతాపహరణం(5-98)లోని పద్యం ఇది. ఇందులో "న, మ" - అనే రెండు వ్యంజనాలను ఉపయోగించి కూర్చడం జరిగింది.

మనమున ననుమానము నూ
నను నీనామ మనుమను మననమును నేను
మ్మున మాన నన్ను మన్నన
మనుమను నానా మునీన మానా నూనా

నానా = సకల, మునీన = మునిశ్రేష్ఠుల యొక్క, మాన = ప్రమాణములకు, అనూనా = అధికుడా, మనమునన్ = మనస్సునందు, అనుమానమున్ = సందేహమును, ఊనను = పెట్టుకొనను, నీనామమను = నీ పేరను, మను = మంత్రం యొక్క, మననమును = ధ్యానమును, నేమమ్మునన్ = నియమముతో, మానన్ = వదలను, నన్నున్ = అటువంటి ఏకాంత భక్తుడనగునన్ను, మన్నన్ = ప్రీతితో, మనుము+ అను = జీవించుము అని చెప్పు.

హాలాహలో నైవ విషం


హాలాహలో నైవ విషం


సాహితీమిత్రులారా!

ఒకరితో ఒకరు మాట్లాడటమే సంవాదం కాదు.
మనలో మనమే ప్రశ్నించుకొని సమాధానాలు
చెప్పుకుంటూంటాము అవి కూడా సంవాదాలే.
ఒకడు తనలో తాను ప్రశ్నించుకొని,
ప్రతి వచనం చెప్పుకుంటాడు.
దానికి ఉదాహరణ ఈ శ్లోకం చూడండి.

హాలాహలో నైవ విషం విషం రమా
జనా: పరం వ్యత్యయ మత్ర మన్వతే
నిపీయ జాగర్తి సుఖేన తం శివ:
స్పృశన్నిమాం ముహ్యతి నిద్రయా హరి:

పూర్వం దేవదానవులు పాసముద్రాన్ని తరచినపుడు పుట్టిన
ఈ హాలాహలం అనే విషం సంగతి తెలియక ప్రజలు దాన్ని
ఘోరకాకోల విషం అన్నారు.
వాస్తవానికి అది పూర్తిగా అబద్ధం.
అసలైన విషం ఏందంటే - అది లక్ష్మి(సంపద)
ఎందుచేతంటారా?
ఆలోచించిచూస్తే నిజంగా
దాన్ని మస్తుగా(పూర్తిగా) తాగిన శివుడు,
ఏ ఇబ్బంది,
చావు లేకుండా హాయిగా, సుఖంగా మేల్కనే ఉన్నాడు.
కాని,
సముద్రంలో పుట్టిన అసలు విషం అయిన
లక్ష్మిని(సంపదను) తాకినంత మాత్రాన్నే
తన్మయత్వం చెందిన విష్ణువు మాత్రం మూర్చితుడైనట్లు
నిద్రాముద్రుడై ఉన్నాడుసుమా!
కనుక అసలు విషమంటే లక్ష్మి(సంపద)యే అని భావం.
మధ్యలో వచ్చిన సంపదతో అతడు మతమత్తచిత్తుడై,
కళ్ళుమూసుకుపోయినాడని గూఢార్థం.