Showing posts with label తులనాత్మక. Show all posts
Showing posts with label తులనాత్మక. Show all posts

Sunday, February 10, 2019

స్వీడన్‌లో మాతృ భాష వాడకం


స్వీడన్‌లో మాతృ భాష వాడకం






సాహితీమిత్రులారా!

నేను ఈమధ్య స్వీడన్‌ వెళ్ళి అక్కడ కొద్ది వారాలపాటు ఉండడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మాతృభాషని మొహమాటం లేకుండా, చీటికీ మాటికీ ఇంగ్లీషు మాటలు దొర్లించకుండా, అన్ని చోట్లా నిరభ్యంతరంగా మాట్లాడేసుకుంటూ ఉంటే చూడ ముచ్చటేసింది. వీళ్ళల్లా మన దేశంలో, మొహమాటం లేకుండా మనం ఎందుకు మాట్లాడుకోలేక పోతున్నామా అని అక్కడ ఉన్న ఐదు వారాలూ నా మనస్సులో ఒకటే తపన.

స్వీడన్‌ దరిదాపుగా కేలిఫోర్నియా అంత ఉంటుంది వైశాల్యంలో. కానీ, జనాభా పరంగా స్వీడన్‌ చాల చిన్న దేశం. స్టాక్‌హోం కి ఎగువన జనావాసాలు బహు కొద్ది. అంటే దేశం సగానికి పైగా ఖాళీ. జనావాసాలు ఉన్న స్థలాల్లో జనాభా అంతా కూడగట్టి జాగ్రత్తగా లెక్క పెడితే ఎనిమిది మిలియన్లు ఉంటారు మహా ఉంటే. కేలిఫోర్నియా జనాభా 33 మిలియన్లు.

మన ఆంధ్ర ప్రదేష్‌ కూడ వైశాల్యంలో ఉరమరగా స్వీడన్‌ అంత ఉంటుంది. మన తెలుగు దేశంలో తెలుగు మాతృభాషగా చెలామణీ అయేవారి సంఖ్య దరిదాపు ఎనభై మిలియన్లు ఎనిమిది కాదు, ఎనభై! అంటే స్వీడిష్‌ భాష మాట్లాడే వారి కంటె తెలుగు వారు  పదింతలు ఉన్నారు. అయినా మాతృభాష వాడకంలో మన వైఖరికీ వారి వైఖరికీ బోలెడంత తేడా ఉంది.

నిజానికి స్వీడన్‌లో ఏ మూలకి వెళ్ళినా వాళ్ళ వాడుక భాష స్వీడిష్‌ భాషే. రైలు స్టేషన్‌లో ఉన్న ప్రకటనలు బల్లల మీద రాసేవి, నోటితో చెప్పేవి అన్నీ స్వీడిష్‌ భాష లోనే. రైళ్ళ రాకపోకల వేళలు చూపే కరపత్రాలన్నీ స్వీడిష్‌ భాష లోనే. రైలు టికెట్టు మీద రాత అంతా స్వీడిష్‌ భాష లోనే. తుపాకేసి వెతికినా స్వీడిష్‌ పక్కన ఇంగ్లీషు కనిపించదు ఒక్క స్టాక్‌హోమ్‌ వంటి నగరాలలో తప్ప. బజారులో దుకాణాల మీద పేర్లు, బేంకుల మీద పేర్లు, మొదలైనవన్నీ స్వీడిష్‌ భాష లోనే. బజారులో ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ఆ పొట్లం మీద ఆ వస్తువు పేరు, అందులో ఉండే ఘటక ద్రవ్యాల (“ఇన్‌గ్రీడియంట్స్‌”) పేర్లు, ఆ వస్తువుని వాడే విధానం అంతా స్వీడిష్‌ భాష లోనే. నేను ఉన్న విద్యాలయపు అతిథిగృహంలో ఉన్న టెలివిజన్‌ లో వచ్చే వార్తా కార్యక్రమాలన్నీ స్వీడిష్‌ భాష లోనే. “సి. ఎన్‌. ఎన్‌.” లో ఇంగ్లీషు వార్తలు వినడానికి ఒక భారతీయుడి ఇంటికి వెళ్ళి వినవలసి వచ్చింది.

వీళ్ళు ఇలా వాళ్ళ భాషలో మాట్లాడుకుందికి వెసులుబాటుగా వీరికి పదసంపద ఉందా లేక ఇంగ్లీషు మాటలనే స్వీడిష్‌ లిపి లో రాసేసుకుని వాడేసుకుంటున్నారా అని ఒక అనుమానం వచ్చింది. ప్లాట్‌ఫారం, గేటు, టికెట్టు, ఓల్టేజి, కరెంటు, కంప్యూటరు వంటి మాటలని వారు ఏమంటున్నారో అని కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూసేను. వీటన్నిటికి వారికి స్వీడిష్‌ భాషలో వేరే మాటలు ఉన్నాయి. ఈ మాటలు ఎలా పుట్టుకొచ్చాయా  అని మరికొంచెం పరిశోధన చేసేను. ప్లాట్‌ఫారం అన్న మాటకి  సమానార్ధకాలుగా మనకి వేదిక, చపటా, తీనె, ఇలారం అనే మాటలు ఉన్నట్టే స్వీడిష్‌ భాషలో కూడ వారికి సమానార్ధకాలు ఉన్నాయి. వారు నిరభ్యంతరంగా, నిర్భయంగా, మొహమాటం లేకుండా ఆ మాటలలో ఒకదానిని ప్లాట్‌ఫారం కి బదులు వాడుతున్నారు తప్ప ఇంగ్లీషు మాటని వాడడం నాకు కనిపించ లేదు. ఇదే ఆచారాన్ని మన తెలుగుదేశం లో ప్రవేశపెట్టేమనుకొండి. అప్పుడు, మనవాళ్ళు, పుర్రెకో బుద్ధి కనుక, ఒకొక్కరు ఒకొక్క మాట వాడతారు తప్ప ఏకీభావంతో ఒక ఒప్పందానికి రారు. ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి స్వీడిష్‌ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. రైలు స్టేషన్‌ లో ఉండే ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో, ఉపన్యాసం ఇచ్చే  ప్లాట్‌ఫారాన్ని సూచించడానికి ఏ మాట వాడాలో మొదలైన విషయాలు ఈ కమిటీ పర్యవేక్షణలో జరుగుతాయిట. అటుపైన ప్రభుత్వపు అధీనం నుండి విడుదలయే పత్రాలన్నిటిలోనూ ఆ మాటని ఆ అర్ధంతో వాడతారుట.

ఇక ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకున్న మాటల సంగతి చూద్దాం. స్వీడిష్‌ వాళ్ళు మనలా ఇంగ్లీషు మాటలని యథాతథంగా వాడడం తక్కువే. ఒక వేళ వాడినా, వారి వాడకంలో తత్సమాలకంటె తద్భవాలే ఎక్కువ కనిపించాయి. ఒకానొకప్పుడు తెలుగు దేశంలో కూడ ఇటువంటి ఆచారం ఉండేది. ఉదాహరణకి బందరులో వలంద పాలెం (డచ్‌ కోలనీ), పరాసు పేట (ఫ్రెంచి కోలనీ) ఉండేవి. పోర్చుగీసు వాళ్ళని బుడతగీచులు అనే వారు. హాస్పటల్‌ ని ఆసుపత్రి అనే వారు. ఇలా తెలుగులో తద్భవాలని తయారు చేసుకుని వాడే ఆచారం క్రమంగా నశిస్తోంది. నశించడమే కాదు; ఎవ్వరైనా ఈ తద్భవాలని వాడితే వారిని శుద్ధ పల్లెటూరి బైతులులా పరిగణించి వారిని చులకన చేస్తాం.

తత్సమాలకీ, తద్భవాలకి మధ్యే మార్గంలో కొన్నాళ్ళు గడిపేం. కారు, బస్సు, కోర్టు, మొదలైన ప్రథమా విభక్తితో అంతం అయే మాటలకి నెమ్మదిగా స్వస్తి చెప్పి, ఇటీవల హలంతాలైన తత్సమాలని వాడడం రివాజు అయింది కార్‌, బస్‌, కోర్ట్‌. అంటే ఏమిటన్న మాట? క్రమేపీ ఇంగ్లీషు సంప్రదాయాన్ని ఎక్కువెక్కువగా అవలంబిస్తున్నాం. అజంతమైన మన తెలుగు భాషలో హలంతమైన ఇంగ్లీషు మాటలు ఇమడవు. అయినా సరే ఎలాగో ఒకలాగ కష్ట పడి ఇముడ్చుతున్నాం. ఒక్క మాటలే కాదు. ఇంగ్లీషు వ్యాకరణ సూత్రాలని కూడ తెలుగుతో మేళవించి సరికొత్త భాషని పుట్టిస్తున్నామేమో అని ఒక అనుమానం పుట్టుకొస్తోంది.

స్వీడన్‌లో నలుగురు మనుష్యులు కలుసుకున్నప్పుడు వారు మాట్లాడుకునే భాష స్వీడిష్‌. తెలిసిన ముఖాన్ని కాని, తెలియని ముఖాన్ని కాని చూసినప్పుడు వారు ప్రత్యుత్థానం చేసేది స్వీడిష్‌ భాష లో. ఇలా అన్నానని స్వీడన్‌ దేశీయులకి ఇంగ్లీషు రాదనుకునేరు.  స్వీడన్‌ లో ఇంగ్లీషు రాని ఆసామి నాకు, నేనున్న ఐదు వారాలలో, కనపడ లేదు. ఉండడం ఉన్నారుట వయసు మీరిన వారిలోనూ, పల్లెటూళ్ళల్లోను వెతికితే కనిపిస్తారుట. నాకు స్వీడిష్‌ భాష రాదు కనుక నేను బస్సు డ్రైవర్లతోను, చెకౌట్‌ కౌంటర్‌ దగ్గర అమ్మాయిలతోనూ, స్టేషన్లో టికెట్లు అమ్మే గుమస్తాల తోనూ, రైల్లో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తుల తోనూ ఇలా తారసపడ్డ వారందరితోనూ ఇంగ్లీషులోనే మాట్లాడే వాడిని. వాళ్ళు చక్కటి ఇంగ్లీషులో సమాధానం చెప్పేవారు. వాళ్ళకి ఇంగ్లీషు రాకపోవడమనే ప్రశ్నే లేదు.  మన దేశంలో సగటు భారతీయుడు మాట్లాడే ఇంగ్లీషు కంటే  మంచి ఇంగ్లీషు ఫ్రెంచి వాళ్ళు, జెర్మనీ వాళ్ళు మాట్లాడినట్లు యాసతో కాకుండా చక్కటి ఇంగ్లీషు, అమెరికా ఫణితితో మాట్లాడ గలిగే స్థోమత వారిలో కనిపించింది.  (తెలుగు వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడితే తెలుగులా వినిపిస్తుందనిన్నీ, తెలుగు వాళ్ళు రాసిన ఇంగ్లీషు వాక్యాలు చదువుతూ ఉంటే తెలుగు చదువుతూన్నట్టు అనిపిస్తుందనిన్నీ ఒక తెలుగాయన నాతో అన్నాడు.) స్వీడిష్‌ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అచ్చం అమెరికా వాళ్ళ ఇంగ్లీషులా వినిపించింది. కనుక స్వీడన్‌ వాళ్ళు స్వీడిష్‌ మాట్లాడడం ఇంగ్లీషు రాక కాదు; వాళ్ళ మాతృభాష మాట్లాడాలనే కోరిక గట్టిగా ఉండబట్టే.

ఇక్కడ, ఈ సందర్భంలో స్వీడనునీ మెక్సికోనీ పోల్చి చూద్దాం. స్వీడనులో స్వీడిష్‌ భాష ఎంత ప్రాచుర్యంలో ఉందో, మెక్సికోలో స్పేనిష్‌ భాష కూడ అంత ప్రాచుర్యంలోనూ ఉంది. కాని, స్వీడన్‌లో అండరికీ ఇంగ్లీషు బాగా వచ్చు. మెక్సికోలో ఇంగ్లీషు చాల తక్కువ మందికి వచ్చు. ఈ వచ్చిన వాళ్ళలో కూడ ఇంగ్లీషు బాగ వచ్చినవాళ్ళు బహు కొద్ది మంది. వైశాల్యంలోనూ, జనాభా లోనూ, సహజ సంపద, వనరుల లభ్యత లోనూ మెక్సికో స్వీడన్‌ కంటె మెరుగు. కాని కంటికి కనిపించే ఐశ్వర్యం లోనూ , ప్రపంచంలోని అంతర్జాతీయ వేదికల మీద చెలామణీ అయే పరపతి లోనూ స్వీడన్‌దే పై చేయి అని నాకు అనిపించింది. దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించేను. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషుకి మెక్సికోలో ఆలంబన లేక పోవడమూ, ఇంగ్లీషు స్వీడన్‌లో నిలదొక్కుకుని ఉండడమూ కారణాలుగా నాకు స్ఫురించేయి. స్వీడన్‌ దేశీయులు వారి మాతృభాష పై ఎంత అభిమానం ఉన్నా ఇంగ్లీషుని విస్మరించ లేదు. అలాగని ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయి వారి మాతృభాషని చిన్న చూపు చూడనూ లేదు.

ఇక సాహిత్య సారస్వతాల సంగతి చూద్దాం.  తెలుగు సారస్వతంతో పోల్చి చూస్తే స్వీడిష్‌ భాష లోని సాహిత్యం, సారస్వతం పూజ్యం కాక పోవచ్చునేమో గాని, రాసి లోను, వాసి లోను తేడా హస్తిమశకాంతరం అని నా కొద్ది అనుభవం తోటీ చెప్పగలను. అయినా సరే ఈ రంగంలో స్వీడన్‌ దేశీయులకి రెండో, మూడో నోబెల్‌ బహుమానాలు వచ్చేయి. తెలుగు సాహిత్యం లో గాలివాన అనే కథానిక కి అంతర్జాతీయంగా చిన్న గుర్తింపు వచ్చింది అంతే. ప్రతిభ లేక కాదు; ఉన్న ప్రతిభని చాటుకునే ప్రజ్ఞ లేక.

ఇక విద్యా బోధన విషయం చూద్దాం. స్వీడన్‌ లోని విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పాఠ్య గ్రంథాలు ఇంగ్లీషులోనే ఉన్నా బోధన అంతా స్వీడిష్‌ భాష లోనే. అక్కడి ఆచార్య వర్గాలు ప్రచురించే పరిశోధన పత్రాలు చాల మట్టుకు ఇంగ్లీషులోనే ఉన్నా, వాళ్ళ సమావేశలలోనూ, సదస్సులలోనూ వారు మాట్లాడుకునేది వారి మాతృభాష లోనే. వారి కులపతి చేరువలో ఆచార్యులు మాట్లాడే భాష వారి మాతృభాష.

ఏదీ, వి.సి. గారి ఆఫీసుకి వెళ్ళినప్పుడు, తప్పులు తడకలతో అయినా సరే మనం ఇంగ్లీషే మాట్లాడతాం కాని తెలుగు మాట్లాడం. ఒక సారి మా హైస్కూల్లో హెడ్‌ మాస్టారు గారి ఆఫీసు నుండి సెలవు నోటీసు వచ్చింది. అది కూడా మా పెద్ద తెలుగు మేష్టారు పాఠం చెపుతూ ఉండగా వచ్చింది. ఆ నోటీసు ఇంగ్లీషులో ఉంది. మా తెలుగు మేష్టారు ఉభయభాషా ప్రవీణ. కనుక ఆ నోటీసుని చదవకుండా, అందులో ఉన్న సారాంశాన్ని మాకు చెప్పేరు. కుర్ర కుంకలం కదా! మేం మేష్టారిని ఆ నోటీసు చదవమని యాగీ చేసేం. “నెల తక్కువ వెధవల్లారా” అని ఆయన మమ్మల్ని తిట్టి ఊరుకున్నారు. ఇదీ బొడ్డూడని రోజుల దగ్గరనుండీ మన భాష మీద, మన భాషని నేర్పే గురువుల మీద మనకి ఉన్న గౌరవం!

స్వీడన్‌ లో నా ఆఫీసుకి ఎదురుగా ఉన్న రోడ్డు దాటి అవతలకి వెళితే అక్కడ ఎరిక్‌సన్‌ వారి ఆఫీసు ప్రాంగణం ఉంది. ఎరిక్‌సన్‌ చాల పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ. ఆ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. అంటే స్వీడన్‌ దేశీయులు కూడ ఆ కంపెనీ ప్రాంగణంలో ఉన్నంత సేపూ మరొక స్వీడన్‌ దేశీయుడితోనైనా సరే   ఇంగ్లీషే మాట్లాడాలి. నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. అడిగేను. “అయ్యా, రోడ్డు దాటి అవతలికి వెళితే యూనివర్శిటీలో అధికార భాష స్వీడిష్‌. ఇటు వస్తే మీ కంపెనీలో అధికార భాష ఇంగ్లీషు. ఇలాగైతే ఎలా?” ఈ ప్రశ్నకి సమాధానం చాల సులభం. ఎరిక్‌సన్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేసే సంస్థ. వారికి వ్యాపారం లాభదాయకంగా కొనసాగడం ముఖ్యం. ఆ లాభాలకి మూలాధారం అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు. యూనివర్శిటీని నడపడానికి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది. కనుక యూనివర్శిటీలో అధికార భాష ఉండాలని ఆదేశించింది, ప్రోత్సహించింది. యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్ధులకి ఉద్యోగాలు కావాలంటే, వారికి ఇంగ్లీషు బాగా వచ్చి తీరాలి. కనుక ప్రజలు, ప్రభుత్వం ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నారు. మనం మన దేశంలో ఇటు ఇంగ్లీషూ రాక, అటు తెలుగూ రాక రెండింటికి చెడ్డ రేవళ్ళమైతే, స్వీడన్‌ వారు ఇటు ఇంగ్లీషు లోనూ అటు స్వీడిష్‌ లోనూ సామర్య్ధం సంపాదించి నాలాంటి వాళ్ళని ఆశ్చర్య చకితులని చేసేరు.

ఈ కథనం యొక్క నీతి ఏమిటి? ఇంగ్లండులో ఇంగ్లీషు, స్వీడను లో స్వీడిష్‌, జెర్మనీలో జెర్మన్‌, ఫ్రాంసులో ఫ్రెంచి, మెక్సికోలో స్పేనిష్‌, జపానులో జపనీసు, చైనాలో చైనీసు, కొరియాలో కొరియనూ, తమిళనాడులో తమిళం వినిపిస్తున్నాయి కాని తెలుగు దేశంలో తెలుగు వినపడడం లేదు. చెన్నపట్నంలో దుకాణానికి వెళితే వారు నన్ను తమిళంలో పలకరించేరు. నాకు తమిళం రాదని తెలిసిన తర్వాత ఇంగ్లీషులో మాట్లాడేరు. హైదరాబాదులో బట్టల దుకాణానికి వెళితే నన్ను ఇంగ్లీషులో పలకరించేరు. నేను తెలుగులో సమాధానం చెబితే నాకు తిరుగు సమాధానం ఇంగ్లీషులో చెప్పేడు, అక్కడ ఉన్న తెలుగు ఆసామీ. ఒక నాడు రైలులో రిజర్వేషను చేయించుకుందికి సికింద్రాబాదు స్టేషన్‌కి వెళితే ఒక దరఖాస్తు కాగితం నింపమని ఇచ్చేడు అక్కడి గుమస్తా. అంతా హిందీలో ఉంది. నాకు హిందీ రాదు. అందుకని తెలుగులో ఉన్న దరఖాస్తు కాగితం కావాలని అడిగేను. లోపలికి వెళ్ళి వెతికి ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తు కాగితం పట్టుకొచ్చి ఇచ్చేడు. తెలుగులో ఉన్నది కావాలని మళ్లా అడిగేను. తెలుగులో అచ్చేసిన దరఖాస్తులు లేవన్నాడు. పోనీలే అనుకుని ఆ ఇంగ్లీషులో ఉన్న దరఖాస్తునే తెలుగులో నింపి ఇచ్చేను. జూ లోంచి పారిపోయొచ్చిన జంతువుని చూసినట్లు చూసి తెలుగులో నింపిన దరఖాస్తు తీసుకోనన్నాడు. పైపెచ్చు, “అయ్యా, మీరు ఫారిన్‌ నుంచి వచ్చినట్లున్నారు. మీకు ఇంగ్లీషు రాకనా. నన్ను ఇబ్బంది పెడుతున్నారు కానీ” అంటూ నీళ్ళు నమిలేడు. ఇది మన తెలుగు రాష్ట్రానికి రాజధానీ నగరంలో జరిగిన ఉదంతం.

ఎలాగైతేనేం టికెట్టు కొనుక్కుని విశాఖపట్నం వెళ్ళేను. అక్కడ నా మేనగోడలు కొడుకుని కలుసుకున్నాను. వాడు హైస్కూల్లోనో, మొదటి సంవత్సరం కాలేజీలోనో ఉన్నాడు. వాడి చదువు ఎలా సాగుతోందో చూద్దాం అని వాడి పాఠ్య పుస్తకాలు తిరగెయ్యడం మొదలు పెట్టేను. వాడి దగ్గర తుపాకేస్తే తెలుగు పుస్తకం లేదు. తెలుగు కి బదులు సంస్కృతం చదువుతున్నాట్ట. ” ఏదీ నీ సంస్కృతం పుస్తకం చూపించు” అన్నాను. వాడు ఇచ్చిన పుస్తకం చూద్దును కదా! లోపల దేవనాగరి లిపిలో కాని, తెలుగు లిపిలో కాని మచ్చుకి ఒక్క అక్షరం ముక్క కంచు కాగడా వేసి వెతికినా కనిపించ లేదు. అంతా ఇంగ్లీషు లిపే! ఈ కుర్ర కుంకలకి ఇంగ్లీషే సరిగ్గా రాదు. ఆ వచ్చీ రాని ఇంగ్లీషు మాధ్యమంగా సంస్కృతం వెలగబెడుతున్నాడుట. వాడికి పోతన పద్యాలతో పరిచయం లేదు. తిక్కన భారతం గురించి తెలియనే తెలియదుట. లక్ష్మణ కవి సుభాషితాల గురించి విననే లేదుట. పోనీ సంస్కృతం దేవ భాష, అదైనా వస్తే ఏ శాకుంతలమో చదివుంటాడనుకున్నాను. అప్పుడు చెప్పేడు అసలు రహస్యం. సంస్కృతంలో నూటికి తొంభై మార్కులు గ్యారంటీట. అందుకోసం సంస్కృతం చదువుతున్నాడుట.

వాడు పాపం తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. “చదవడం, రాయడం వచ్చా?” అని అడుగుదామనుకుంటూ నాలిక కరుచుకున్నాను. వాడివ్వబోయే సమాధానానికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చేనా? ఎందుకొచ్చిన రభస, బతికుంటే బలుసాకు ఏరుకు తినొచ్చు అని అనుకుంటూ తెలుగు మీద అంత వరకు నేను చేసిన పరిశోధనకి తిలోదకాలిచ్చేసి, తోక ముడిచి తిరుగు ముఖం పట్టేను.
----------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, January 29, 2019

వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం


వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 

4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం






సాహితీమిత్రులారా!

మెలనీ-రెట్ బట్లర్
గాన్ విత్ ద విండ్ రచయిత్రి అత్యంత హృద్యంగా చిత్రించిన అనుబంధం మెలనీ-రెట్ బట్లర్‌లది. పైపైన చూస్తే మెలనీ-రెట్ బట్లర్‌ల స్వభావాలు ఉత్తర, దక్షిణ ధ్రువాలనిపిస్తాయి. వెనకటి వ్యాసంలో చెప్పినట్టు, మెలనీ ప్రశాంతగంభీరంగా ప్రవహించే నది అయితే, రెట్ గల గలా చప్పుడు చేస్తూ ఆర్భాటంగా దూకే జలపాతం. మళ్ళీ పైపైనే చూస్తే రెట్‌ది కళంకిత చరిత్ర అయితే, ఎలా చూసినా మెలనీది నిష్కళంక చరిత్ర. రెట్‌ది స్థిరమైన విలువల మైలురాళ్ళు ఏవీ లేని జీవనగమనం అయితే, ఆయా సందర్భాలలో సడలింపును పాటించినప్పటికీ మెలనీది అలాంటి జీవనగమనం కాగల అవకాశమే లేదు. ఈ తేడాలలోనే ఇద్దరి మధ్యా పోలికలను ప్రస్ఫుటింపజేయడంలో మానవస్వభావవైవిధ్యం పట్ల అపారమైన అవగాహనను, పాత్రనిర్మాణ దక్షతను రచయిత్రి చాటుకుంటుంది. ఈ పోలికలే ఇద్దరి మధ్యా ఒక అపురూపమైన ఆత్మీయబంధాన్ని కల్పిస్తాయి.

ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడంలోనైనా గొప్ప ఇంగితజ్ఞానాన్ని కనబరచడం, తదనుగుణంగా ఎప్పటికప్పుడు తమ వ్యవహార శైలిని సవరించుకోవడం ఇద్దరి మధ్యా ఒక ముఖ్యమైన పోలిక. ఇద్దరి జీవితం నుంచీ ఇందుకు సంబంధించిన ఉదాహరణలను గత వ్యాసాలలో చూడవచ్చు. నవలలోని మిగిలిన ఏ పాత్రలలోనూ లేనంత ఆలోచనావైశాల్యం ఇద్దరి మధ్యా ఇంకొక పోలిక. మళ్ళీ ఇందులో మెలనీదే పైచేయి. రెట్‌ను కూడా తన ప్రభావపరిధిలోకి తెచ్చుకుని, తన ఆధిక్యం ముందు శిరసు వంచేలా చేయగలిగిన భావవైశాల్యం ఆమెది. వ్యక్తులు, పరిస్థితులపై మానవీయతతో స్పందించడంలోనూ, స్వల్ప పరిచయంలోనే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలగడంలోనూ ఇద్దరి మధ్యా అతికినట్టు కుదిరిన మరో రెండు పోలికలు.

బార్బిక్యూ విందులో మెలనీ, రెట్ ఇద్దరూ పాల్గొంటారు కాని, వారిమధ్య పరిచయం, సంభాషణ ఉండవు. ఆ తర్వాత మెలనీని రెట్ చూసేది అట్లాంటాలో సైనికుల సహాయార్థం జరిగిన పార్టీలోనే. అప్పుడు స్కార్లెట్‌తోపాటు మెలనీ కూడా తన పెళ్లి ఉంగరాన్ని విరాళంగా ఇవ్వడాన్ని అతను గమనిస్తాడు. ఆ మరునాడు, రెట్ లాంటి కళంకితునితో నృత్యం చేయడాన్ని ఆంట్ పిటీపాట్ తప్పుపట్టి స్కార్లెట్‌ను మందలించినప్పుడు, మెలనీ జోక్యం చేసుకుని రెట్ చెడ్డవాడంటే తను నమ్మదని, అతను పరిపూర్ణమైన పెద్దమనిషిలా కనిపిస్తున్నాడనీ అంటుంది.

ఈ మాటలు జరుగుతున్న సమయంలోనే రెట్ నుంచి మెలనీకి ఒక కవరు అందుతుంది. దానిని తెరచి చూడగానే మెలనీ కళ్ళు జలజలా వర్షిస్తాయి. అందులో తను విరాళంగా ఇచ్చిన పెళ్లి ఉంగరం, రెట్ రాసిన లేఖ ఉంటాయి. కాన్ఫెడరసీకి మగవాళ్ళ ప్రాణాలు అవసరమైతే కావచ్చు కాని, ఆడవాళ్ళు ప్రాణప్రదంగా భావించే వాటిని కూడా ఇమ్మని అడిగే అవసరం దానికి ఇంకా కలగలేదు. నువ్వు చూపిన సాహసం పట్ల నా గౌరవానికి గుర్తుగా దీనిని స్వీకరించగలవు. నీ త్యాగం వృథా అయిందని అనుకోవద్దు. ఈ ఉంగరం విలువకు పదిరెట్లు చెల్లించి తీసుకున్నాను– అని ఆ లేఖలో ఉంటుంది. అతని అభిమానానికి చలించిన మెలనీ, ‘చూశావా, అతను ఎంత పెద్దమనిషో’నని ఆంట్‌తో అంటుంది. పెళ్లి ఉంగరాన్ని త్యాగం చేయడంతో సహా స్కార్లెట్, మెలనీల వ్యక్తిత్వాల మధ్య తేడాను మెలనీతో తొలి పరిచయంలోనే రెట్ గ్రహిస్తే, అతను పెద్దమనిషన్న సంగతిని మెలనీ గ్రహిస్తుంది. ఎదుటివారిని ఇట్టే అంచనా వేయగల అసాధారణ వివేకంలో ఇద్దరి మధ్యా ఉన్న సామ్యాన్ని ఈ ఉదాహరణల ద్వారా రచయిత్రి ఎంతో నేర్పుతో సూచిస్తుంది. స్కార్లెట్ కూడా రెట్ మనసులో స్థానం సంపాదించుకున్నదే కాని, ప్రస్తుత సందర్భంలో ఒక్క మెలనీ పెళ్లి ఉంగరాన్ని మాత్రమే కొని పంపడం ద్వారా ఇద్దరి మధ్యా వ్యత్యాసాన్ని ఎత్తిచూపడంలో అతను ఏమాత్రం మొహమాటపడడు. స్కార్లెట్ పట్ల అతనిది ఆకర్షణ అయితే, మెలనీ పట్ల అపారమైన గౌరవం.

తొలి పరిచయంలోనే ఒకరిపై ఒకరికి కలిగిన గౌరవభావం రెట్, మెలనీలలో చివరివరకూ అలాగే ఉండిపోయి, పరస్పరాభిమానంగా వికసిస్తుంది. భర్త ఆష్‌లీ సమాచారం కోసం మెలనీ టెలిగ్రాఫ్ ఆఫీసుకు వెళ్ళి అలసటతో స్పృహ తప్పి పడిపోయినప్పుడు, అటువైపు వచ్చిన రెట్ ఆమెను చూసి, గర్భవతి అని గ్రహించి ఇంటికి తీసుకువెళ్లి దింపుతాడు. భర్త సమాచారం కోసం ఇలా కష్టపడవద్దని మందలించి ఆ బాధ్యతను తను తీసుకుంటాడు. ‘నీ గురించి జనం అంత దారుణంగా ఎలా మాట్లాడతా’రంటూ అప్పుడు మెలనీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత, ‘అతని గురించి ఎవరేం చెప్పినా సరే నా ఇంటి తలుపులు అతనికి జీవితాంతమూ తెరచుకునే ఉంటా’యని ఆంట్ పిటీపాట్, స్కార్లెట్‌ల ముందు మెలనీ ప్రకటిస్తుంది. ఆమాటల్లో, పైకి కనిపించే ఆమె స్వభావానికి భిన్నమైన అనుశాసనము, నిష్కర్ష ధ్వనిస్తాయి.

నాటి దక్షిణాది సాంప్రదాయిక సమాజంలో మగవాళ్ళకు, అందులోనూ అవివాహిత పురుషులకు గర్భవతి ఎదురుపడకూడదు. ఆ ప్రస్తావన, అందుకు సంబంధించిన చర్చ మగవారి నోట వినిపించకూడదు. అలాంటి సంకోచాలేవీ లేని రెట్, మెలనీ గర్భవతి అన్న సంగతిని తన ముందు ప్రస్తావించినప్పుడు స్కార్లెట్ సైతం విస్తుపోయి పెద్ద తప్పు జరిగిపోయినట్టు బాధపడుతుంది. యుద్ధం అట్లాంటాలోకి అడుగుపెట్టిన ఉద్రిక్తఘట్టంలో రోజుల బాలెంతగా ఉన్న మెలనీతో కలసి స్కార్లెట్ టారాకు బయలుదేరినప్పుడు, మెలనీని రెట్ ఎత్తుకుని తీసుకెళ్ళి బండిలోకి చేర్చుతాడు. అప్పుడు కూడా స్కార్లెట్ సిగ్గుతో చితికిపోతుంది. కానీ విశేషమేమిటంటే, రెట్‌కే కాదు, మెలనీకి కూడా అది తప్పుగా కనిపించదు. సమయానుకూలంగా స్పందించగల వివేకంలో ఇద్దరికీ గల సామ్యాన్ని వెల్లడించే సందర్భాలలో ఇదొకటి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు సాధారణంగా పారుష్యం, అధిక్షేపం, వ్యంగ్యం ధ్వనించే రెట్ గొంతు మెలనీ దగ్గరికి వచ్చేసరి మారిపోతుంది. ఆ గొంతులో గొప్ప గౌరవం, మర్యాద, మన్నన ఉట్టిపడతాయి. టారాకు బయలుదేరిన స్కార్లెట్, మెలనీలతోపాటు బండిలో కొంత దూరం వెళ్ళిన రెట్, ఆ తర్వాత వారిని విడిచిపెట్టి తను సైన్యంలో చేరడానికి నిర్ణయించుకున్నప్పుడు; అతనికీ స్కార్లెట్‌కు మధ్య ఏకాంత సంభాషణ జరుగుతుంది. శత్రువునుంచి ప్రమాదం అన్నివైపులా పొంచి ఉన్న అలాంటి భయోద్విగ్న క్షణాలలో స్కార్లెట్ పట్ల మోహాన్ని పట్టలేక రెట్ ఆమెను ఆలింగనం చేసుకుని చుంబించబోతే స్కార్లెట్ అతని చెంప ఛళ్ళుమనిపించి, ఇంకెప్పుడూ నీ మొహం చూడనంటుంది. నవ్వుకుంటూ అతను అక్కడినుంచి బండి దగ్గరకు వచ్చి, మెలనీని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళతో ఉన్న డార్కీ బాలిక ప్రిస్సీకి(Prissy) చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో అతని మాటతీరు మారిపోతుంది.

సాంప్రదాయిక సమాజంలోని మంచినంతటినీ పుణికిపుచ్చుకున్న మెలనీని, ఆమె ప్రాతినిధ్యం వహించే విలువలను సంరక్షించే బాధ్యతను రెట్ తీసుకున్నాడా అన్నట్టుగా వారిరువురి అనుబంధ చిత్రణ ఉంటుంది. యుద్ధానంతర పునర్నిర్మాణ ఘట్టంలో మెలనీ ప్రభావము, ప్రాధాన్యము ఒక్కసారిగా పెరగడం, ఆమెపై మొదటినుంచీ అతనికున్న అంచనాకు తిరుగులేని నిరూపణ అవుతుంది. తను విపరీతమైన మమకారం పెంచుకున్న కూతురు బానీని సాంప్రదాయిక విలువలతో పెంచాలనుకున్న రెట్‌కు మెలనీ ఒక్కతే అందుకు పెద్ద ఆశాకిరణంలా కనిపిస్తుంది. ఈ విషయంలో మనకు సాయపడగలిగింది మెలనీ ఒక్కతే. ఆమెను దూరంగా ఉంచడానికీ, అవమానించడానికీ నువ్వు చేయవలసిందంతా చేశావు. ఆమె పేదరికాన్నీ నాసిరకం దుస్తులనూ ఎత్తిచూపుతూ నా దగ్గర ఎద్దేవా చేయద్దు. అట్లాంటాలో నిక్కమైన, నికార్సైన ప్రతిదానికీ ఆత్మా, కేంద్రస్థానమూ తనే-నని స్కార్లెట్‌తో అంటాడు.

అట్లాంటాలో ఒక మిల్లు, స్టోరు నడుపడంలో శ్రమిస్తూ స్కార్లెట్ ఆరోగ్యం పాడుచేసుకుంటోందన్న కారణంతో ఆష్‌లీకి తెలియకుండా తనే అతనికి డబ్బిచ్చి మిల్లు కొనిపించడంలోనూ మెలనీ పట్ల, ఆమె కుటుంబం పట్ల రెట్ సంరక్షకస్పృహతోనే వ్యవహరించినట్టు కనిపిస్తుంది. ఆ సందర్భంలో మెలనీకి, అతనికి జరిగిన సంభాషణ ఆమె వ్యక్తిత్వానికే కాదు, రెట్ వ్యక్తిత్వంపట్ల ఆమె అవగాహనకూ అద్దం పడుతుంది. తను డబ్బు ఇచ్చిన సంగతి ఆష్‌లీకి తెలియకూడదని రెట్ అన్నప్పుడు, భర్తను తను మోసగించలేనని, అతని వద్ద తనకు రహస్యాలు ఉండవని మెలనీ అంటుంది. అప్పుడు స్కార్లెట్ కోసం ఈమాత్రం చేయలేవా అన్నప్పుడు మెత్తబడుతుంది. మిల్లు యజమానిగా ఆష్‌లీ బాగా డబ్బు సంపాదించవచ్చనీ నీ కొడుకు మంచి యూనివర్సిటీలో చదివి వృద్ధిలోకి వస్తాడనీ అన్నప్పుడు, తల్లి మనసుకు హత్తుకునేలా ఉన్న ఆ మాటల వెనుక గడుసుదనాన్ని చటుక్కున అర్థంచేసుకున్న మెలనీ చిరునవ్వు నవ్వి, ‘పుస్తకం చదివినట్టు నిన్ను చదవగలను.’ అని రెట్‌తో అంటుంది. నీ మంచితనం కొద్దీ నాకు సహాయం చేయాలనుకుంటున్నావు కానీ, నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ప్రపంచంలో ఏ ఆడదైనా కోరుకునేవన్నీ నాకు ఉన్నాయి– అంటుంది. ఆ మాటకు రెట్ సమస్థాయిలో స్పందిస్తూ, ‘అవి నీకు ఎప్పుడూ ఉండేలా చూడడమే నేను కూడా కోరుకునేది.’ అంటాడు.

రెట్‌పై మెలనీ ప్రభావాన్ని పతాకస్థాయిలో ప్రదర్శించిన సందర్భం, బానీ దుర్మరణం. తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురి మరణాన్ని రెట్ తట్టుకోలేకపోతాడు. పిచ్చిపట్టినట్టు అయిపోతాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి కూడా వీలు లేకుండా మూడు రోజులపాటు గదిలో తన దగ్గరే ఉంచుకుని తలుపులు బిగించుకుంటాడు. ఆ సమయంలో అతన్ని సమీపించడానికి కూడా ఎవరికీ ధైర్యం చాలదు. పరిచారిక మామీ ద్వారా ఈ విషయం తెలుసుకున్న మెలనీ రెట్ ఇంటికి వెళ్ళి గది తలుపులు తీయించి అంత్యక్రియలకు ఒప్పించడమే కాదు; అతని చేత అన్నం తినిపిస్తుంది.

మెలనీ రెండోసారి గర్భవతై, కడుపు పోయి మృత్యుముఖంలో ఉండి స్కార్లెట్‌ను చూడాలనుకున్నప్పుడు రెట్ ఆమెను తీసుకుని మెలనీ ఇంటికి బయలుదేరతాడు. స్కార్లెట్‌కు ఆమె గర్భవతి అన్న సంగతి కూడా అప్పటికి తెలియదు. ‘నీకు తెలుసా? తను కచ్చితంగా నీకు చెప్పి ఉండదు,’ అని రెట్‌తో అంటుంది. ‘ఆమె చెప్పక్కర్లేదు. నేను గ్రహించగలను. గత రెండు మాసాలుగా ఆమె చాలా సంతోషంగా ఉంది. అందుకు మరో కారణం ఏదీ లేదన్న సంగతి నాకు తెలుసు.’ అని రెట్ అంటాడు. ‘కడుపు పోయినంత మాత్రాన చనిపోతారా, నేను చనిపోయానా!’ అని స్కార్లెట్ సందేహం వ్యక్తం చేసినప్పుడు, ‘నీకున్న దారుఢ్యం ఆమెకు లేదు. ఆమె కసలు ఎలాంటి దారుఢ్యమూ లేదు. ఒక్క హృదయం తప్ప ఆమెకు ఇంకేమీలే’దని రెట్ అంటాడు.

మెలనీ మృత్యుముఖంలో ఉన్న ఆ క్షణాలలో అతని మాట తీరే కాదు, మనిషి తీరే మారిపోతుంది. స్కార్లెట్‌ను మెలనీ ఇంటిదగ్గర దింపి తన ఇంటికి తిరిగి వచ్చేసిన రెట్, డైనింగ్ హాలులో ఒంటరిగా కూర్చుండిపోతాడు. కాసేపటి తర్వాత ఇంటికి తిరిగివచ్చిన స్కార్లెట్ వైపు బరువు, అలసట నిండిన కళ్ళతో తదేకంగా చూస్తాడు. ఆ కళ్ళలో ఎప్పుడూ ఉండే వెలుగు లేదు. ఆ ముఖంలో ఎలాంటి భావమూ లేదు. ఎప్పటిలా వెక్కిరింపుగా పెదవి విరవడమూ లేదు. ఆమెవైపు చూసి, వచ్చి కూర్చోమని చెప్పి, ‘ఆమె చనిపోయిందా?’ అని అడుగుతాడు. అతని తీరు స్కార్లెట్‌కు కొత్తగా అనిపించి భయంగొలుపుతుంది. అతని చూపుల్లో ప్రశాంతత, ఒకవిధమైన కారుణ్యమూ తొంగిచూస్తాయి. అతని ప్రశ్నకు ఆమె తల ఊపుతుంది. ‘భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి ప్రసాదించుగాక!’ అని భారంగా అన్న అతను, ‘నాకు తెలిసి సంపూర్ణ కారుణ్యం మూర్తీభవించిన ఏకైక వ్యక్తి ఆమె.’ అంటాడు. ఆ మాటతో మెలనీ తనపట్ల చూపించిన ప్రేమాదరాలు గుర్తొచ్చి స్కార్లెట్‌లో దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ‘నువ్వు నాతో ఎందుకు రాలేదు? నేను తట్టుకోలేకపోయాను. నువ్వు నాతో ఉంటే బాగుండేదనిపించింది,’ అంటుంది. ‘నేను అసలే తట్టుకోలేకపోయేవాడి’నంటాడు రెట్. కాసేపు మౌనంగా ఉండిపోయి, ఆ తర్వాత, అతి ప్రయత్నంమీద, ‘ఆమె ఒక మహోన్నత మహిళ!’ అంటాడు. తనలో బాల్యంలోనే అంతరించిందనుకున్న తీవ్రభావోద్వేగం ఒక్కసారిగా ఎగతన్నుకు వచ్చిన ఆ క్షణాలలో ఇదే మాట అతని నోట మరోసారి వెలువడుతుంది.

విశేషమేమిటంటే, మెలనీ-రెట్‌ల మధ్య రచయిత్రి చిత్రించిన అనుబంధం కేవలం వ్యక్తిగతం కాదు; అంతకు మించిన సామాజిక వైశాల్యం దానికి ఉంది. రెట్ పాత్రను ముందునుంచీ మలచిన తీరుతోను, నాటి సాంప్రదాయిక ప్లాంటర్‌ల సమాజంలో అతని స్థానం గురించి మధ్య మధ్య చేస్తూవచ్చిన వ్యాఖ్యలతోనూ కలుపుకుని ఈ ఇద్దరి అనుబంధాన్ని పరిశీలించినప్పుడు దానికిగల సామాజిక పార్శ్వం అర్థమవుతుంది. రెట్ జూదరి, వ్యభిచారి, తప్పుడు పద్ధతుల్లో డబ్బు గడించినవాడు. ప్లాంటర్‌ల సమాజం పెద్దమనిషిగా గుర్తించగల లక్షణం అతనిలో ఒక్కటి కూడా లేదు. కన్నతండ్రితోపాటు ప్లాంట‌ర్‌ల సమాజం మొత్తం అతన్ని వెలివేసింది. తన స్వస్థలమైన చాల్స్‌టన్‌లో తనను ఆహ్వానించే కొంప ఒక్కటీ లేదని అతనే చెప్పుకుంటాడు. అట్లాంటాలోనూ దాదాపు అదే పరిస్థితి. జూదరిగా అతన్ని ఈసడించుకోవడంలోనూ ప్లాంటర్‌ల సమాజంలోని వైరుధ్యాన్ని, డాంబికత్వాన్ని రచయిత్రి అడుగడుగునా ఎత్తిచూపుతుంది. జూదంలో డబ్బు, ఇళ్ళు, భూమి, బానిసలను కోల్పోయిన అన్నో తమ్ముడో తండ్రో లేదా బంధువో లేని కుటుంబం జార్జియా రాష్ట్రం మొత్తంలోనే లేదని, అయినప్పటికీ సమాజం అలాంటి వ్యక్తిని పెద్దమనిషిగానే గుర్తిస్తుందని, అదే రెట్ లాంటి వృత్తిజూదరినైతే అస్పృశ్యుడిగా పరిగణించి వెలివేస్తుందనీ ఒకచోట అంటుంది. యుద్ధరూపంలో వచ్చిపడిన విపత్తు, కాన్ఫెడరేట్ ప్రభుత్వానికి రెట్ అందించిన సేవలూ అడ్డురాకపోతే అట్లాంటాలో కూడా ఒక్కరూ అతన్ని దగ్గరికి రానిచ్చేవారు కారని అంటుంది. అతన్ని ద్వేషిస్తూనే అతని నుంచి సహాయాలు పొందడానికి వెనుకాడని ప్లాంటర్‌ల సమాజంలోని అల్పత్వాన్ని, తన పాపపరిహారంగానే అతను తమకు సాయపడుతున్నట్టు సర్దిచెప్పుకునే ఆత్మవంచననూ పలు సందర్భాలలో కళ్ళకు కట్టిస్తుంది.

మేరీ వెదర్ కూతురు మే బెల్ (May Belle) పెళ్లి ముచ్చట అలాంటి సందర్భాలలో ఒకటి. యుద్ధసమయం కనుక పెళ్లి కూతురు ధరించే తెలుపు శాటిన్ వస్త్రం దొరకని పరిస్థితి వస్తుంది. కాన్ఫెడరసీలో ఉన్న శాటిన్ వస్త్రం మొత్తాన్ని యుద్ధపతాకాల తయారీకి ఖర్చుపెట్టేశారు. ప్లాంట‌ర్‌ల పోరాటం కోసం తలపిన్నులను, బటన్‌లను, అందమైన షూలను త్యాగం చేయడాన్ని గర్వంగా భావిస్తాను కానీ శాటిన్ వస్త్రాన్ని మాత్రం త్యాగం చేయలేనని పెళ్లికూతురు భీష్మిస్తుంది. కాన్ఫెడరేట్ పెళ్లికూతురు ధరించాల్సింది చేనేత వస్త్రమే కానీ శాటిన్ వస్త్రం కాదని, దేశభక్తిని రంగరిస్తూ తల్లి మేరీ వెదర్ ఎంత నచ్చజెప్పినా వినదు.

మెలనీ ద్వారా ఈ విషయం రెట్‌కు తెలుస్తుంది. అతను గజాల కొద్దీ శాటిన్ వస్త్రాన్ని, అందమైన అల్లిక పని కలిగిన మేలి ముసుగును తెప్పించి పెళ్లి కానుకగా ఇస్తాడు. మే బెల్ ఎంత సంతోషిస్తుందంటే దాదాపు అతన్ని ముద్దు పెట్టుకోబోతుంది. వాటి ధర చెల్లిస్తామని మాటవరసకు కూడా అనలేని పరిస్థితి వారిది. యుద్ధసమయంలో అంత ఖరీదైన కానుకను స్వీకరించడం తగదని మేరీ వెదర్‌కు తెలిసినా అడ్డుచెప్పలేకపోతుంది. అంతవరకూ తను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన రెట్‌ను పెళ్లి విందుకు ఆహ్వానించడం ఆమెకు తప్పనిసరి అవుతుంది. అతన్ని విందుకు ఆహ్వానించడమే అతనిచ్చిన కానుకల కంటే పెద్ద కానుక అని ఆమె అనుకుంటుంది.

అప్పటికే జూదరిగా, వ్యభిచారిగా ముద్రవేయించుకున్న రెట్, కాన్ఫెడరేట్ యుద్ధ ప్రయత్నాలను విమర్శించినవాడిగా, యుద్ధానికి దూరంగా ఉన్నవాడిగా, శత్రువుతో వ్యాపార లావాదేవీలు జరిపేవాడిగా దేశద్రోహి అన్న కొత్త ముద్ర కూడా తెచ్చుకుంటాడు. అయినా కాన్ఫెడరేట్ సైనికుల సహాయం కోసం అతని నుంచి పెద్ద మొత్తాలలో విరాళాలు తీసుకోడానికి ఆ ముద్ర అడ్డు రాదు. దిగ్బంధాన్ని అమలు చేస్తున్న యాంకీ నౌకాదళం కన్నుకప్పి అతను తెప్పించిన సరకుల్ని రెండు చేతులతో అందుకోడానికీ అడ్డు రాదు. కాన్ఫెడరసీ భవిష్యత్తు, యుద్ధరంగంలో పోరాడుతున్న సైనికుల మీద ఎంత ఆధారపడి ఉందో, ఇలా సరకు తెప్పించగల రెట్ ప్రావీణ్యం మీదా అంతే ఆధారపడి ఉందన్న గ్రహింపు కలగడానికి ఎంతో సమయం పట్టదు. యుద్ధసమయంలోనే కాదు, యుద్ధానంతరం కూడా రెట్ నుంచి కాన్ఫెడరేట్‌కు బహుముఖ సాయాలు అందుతూనే ఉంటాయి. అలాగే వ్యక్తుల స్థాయిలో కూడా. కానీ అవేవీ రెట్ మీద ఉన్న రకరకాల ముద్రలను చెరపలేకపోతాయి. అతనికి ఆమోదయోగ్యతను తేలేకపోతాయి.

ఈ నేపథ్యం నుంచి మెలనీ-రెట్‌ల మధ్య చిత్రించిన అనుబంధాన్ని గమనించినప్పుడు, వ్యక్తిగతాన్ని మించి అది సంతరించుకున్న సామాజిక స్వభావం ఎలాంటిదో అర్థమవుతుంది. రెట్‌కీ, అతన్ని వెలివేసిన ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజానికీ మధ్య మెలనీ ఒక పెద్ద అతుకుగాను, వారధిగానూ మారుతుంది. నిర్ణయాత్మకమైన ఈ యుద్ధ ఘట్టంలో తనూ కాన్ఫెడరేట్ గుండెతో స్పందిస్తున్నదే. దాని విలువలు, విశ్వాసాలు, భావజాలంలో పాలు నీళ్లలా కలసిపోయినదే. పైగా అందులోనూ ఎందరిలోనో లేని నిబద్ధత, శీలసమగ్రత, స్వచ్ఛత ఆమెలో ఉన్నాయి. ఆపైన సాటి వ్యక్తులు ఎందరిలోనో కనిపించని గొప్ప ఇంగితజ్ఞానము, మానవస్వభావవైవిధ్యం పట్ల అపారమైన అవగాహన, అనుకంప ఆమెలో ఎలా ఉన్నాయో ఇప్పటికే పలు ఉదాహరణలతో చెప్పుకున్నాం. ఇంకొకటి చెప్పుకుంటే, తను ఆశ్రయమిచ్చి ఆదరించిన ఆర్చీ(Archie) అనే బండివాడు ఒక సందర్భంలో స్కార్లెట్‌ను తప్పుపట్టినప్పుడు అతనిపై మెలనీ ఆగ్రహిస్తూ అంటుంది: నువ్వు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే ఇంట్లోంచి పంపేస్తాను. అందులో ఆమె తప్పులేదు. తను చేయాలనుకున్నది ఆమె చేసింది. వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు చేశారు. ఎవరైనాసరే తాము చేసి తీరాలనుకున్నది చేయవలసిందే. మనందరం ఒకేలా ఆలోచించం, ఒకేలా వ్యవహరించం. మనల్ని బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తనపై తీర్పు చెప్పడం తప్పు.

మానవస్వభావవైవిధ్యం పట్ల ఇలాంటి గుర్తింపు, గౌరవమూ; అందుకు కారణమైన విజ్ఞతావివేకాలే ఆమెకు ఔన్నత్యాన్ని కల్పించి అట్లాంటాలోని స్వీయసమాజం మొత్తానికే ఆమెను ఎలా నాయకురాలిగా ప్రతిష్టించాయో చెప్పుకున్నాం. అంతేకాదు, ఆయా వ్యక్తులకు, పరిస్థితులకు అనుగుణంగా కట్టుబాట్లను, విశ్వాసాలను సడలించుకుంటూ స్పందించగల గొప్ప ఆలోచనాస్వాతంత్ర్యాన్ని పై లక్షణాలు ఆమెకు అలవరచాయి. ఆపైన కట్టుబాట్లు, విశ్వాసాల కంటే ఎత్తుపీట మీద మానవీయత, కారుణ్యం వంటి సహజాతాలను ప్రతిష్టించే వెసులుబాటునూ ఆమెకు కల్పించాయి. తనదైన సాంప్రదాయిక సమాజంలో తను విడదీయలేని భాగంగా ఉంటూనే, ఆ సమాజం తాలూకు ఇతరేతర కొలమానాలకు అదనంగా; లేదా వాటిని ఒక్కోసారి అప్రధానం చేస్తూ మానవత్వం, కారుణ్యం వంటి కొత్త కొలమానాలను నిశ్శబ్దంగా, నిరార్భాటంగా స్థాపించడంలో మెలనీ వైశిష్ట్యం కనిపిస్తుంది. ముందే చెప్పినట్టు, ఈ కొత్త కొలమానాల స్థాపనలో ఆమె ధర్మశాస్త్రకర్తలలో మాత్రమే కనిపించే నిష్కర్షను, నిస్సంకోచాన్నీ ప్రదర్శిస్తుంది. రెట్ ఉత్తముడని, పెద్దమనిషి అని తొలి పరిచయం నుంచీ నొక్కిచెప్పడంలో, అతని గురించి ఎవరేమనుకున్నాసరే, నా ఇంటి తలుపులు అతనికి, అతని జీవితాంతమూ తెరిచే ఉంటాయని శాసించడంలో ఇది కనిపిస్తుంది.

రెట్ బట్లర్ ప్లాంటర్‌ల తరగతికి చెందిన జనం మధ్య ఉంటూనే, వారికి దూరంగానూ ఉంటూ వారి స్థితిగతులపై వ్యాఖ్యాత పాత్ర నిర్వహించినట్టే; మెలనీ సాంప్రదాయిక సమాజంలోను, దాని భావజాలంలోను, ఒదిగి ఉంటూనే దానిని అధిగమిస్తూ లోపలినుంచి దానిని సంస్కరించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వేయిపడగలకు, గాన్ విత్ ద విండ్‌కు గల ఇతివృత్త సామ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుంటే, రెండూ పతనోన్ముఖమైన సాంప్రదాయిక సమాజాన్ని, ఆ పతనం నుంచి తమను తాము కాపాడుకోవడం గురించిన పెనుగులాటనే చిత్రించాయి. ధర్మారావు, ఆష్‌లీ సహా రెండు నవలలోనూ ఉన్న ఆయా పాత్రల మధ్య మనం ఇంతవరకూ పరిశీలించిన పోలికలు, తేడాలను అలా ఉంచితే; వేయిపడగల సమాజానికి నాలుగువర్ణాల వ్యవస్థ ఆధారభూమిక అయినట్టుగా గాన్ విత్ ద విండ్ సమాజానికి బానిసల వ్యవస్థ ఆధారభూమిక అయింది. ఈ పోలికల్లోనే రెండింటి మధ్యా ఉన్న అతి కీలకమైన తేడాలలో ఒకటి ఏమిటంటే, వ్యవస్థలో భాగమవుతూనే ఆ వ్యవస్థను అధిగమిస్తూ, దానికి కొత్త కొలమానాలను ఇచ్చి కొత్త ప్రమాణాలను నిర్దేశించిన మెలనీ లాంటి పాత్ర వేయిపడగలులో లేకపోవడం. మెలనీలానే ధర్మారావు కూడా మానవీయ స్పందనలు, కారుణ్యం ఉన్నవాడే. కానీ ఇద్దరిలో తేడా ఎక్కడుందంటే; మానవీయత, భూతదయ ముఖ్యమే కానీ తాను విశ్వసించే చాతుర్వర్ణ్య వ్యవస్థను పరిరక్షించడం ధర్మారావుకు అంతకంటే ముఖ్యం. అదే మెలనీ విషయానికి వస్తే, వ్యవస్థ తాలూకు కట్టుబాట్లను, విశ్వాసాలను, విలువలను పాటించడం ముఖ్యమే కాని; వాటికీ మానవీయతకు, భూతదయకు మధ్య విరోధం ఏర్పడితే మాత్రం ఆమె మొగ్గు రెండో వైపే.

మరో విధంగా చెప్పుకోవాలంటే, వేయిపడగలులోలా సాంప్రదాయిక వ్యవస్థాపరిరక్షణ గురించిన ఆరాటాన్నే ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని గాన్ విత్ ద విండ్‌ను రచించి ఉంటే, అది ఆష్‌లీ నాయకుడిగా ముమ్మూర్తులా మరో వేయిపడగలు అయ్యేది. కానీ మెలనీ పాత్ర (తమ తమ రీతుల్లో స్కార్లెట్, రెట్ బట్లర్‌లు కూడా) ఆ పరిణామాన్ని నివారించి రెండింటి మధ్యా పెద్ద అంతరాన్ని కల్పించింది. మెలనీ పాత్ర ముఖంగా మానవీయతా కోణాన్ని నొక్కి చెప్పడంలో రకరకాల హెచ్చుతగ్గులు, చీలికలు, వివక్షలు, ముద్రలు, ఆధిపత్య ధోరణులతో కూడిన సాంప్రదాయిక వ్యవస్థ స్థానంలో కలుపుగోలు(inclusive) స్వభావం కలిగిన ఉదార వ్యవస్థను లక్షించడం కనిపిస్తుంది.

ఎక్కడైనా సరే, సాంప్రదాయిక వ్యవస్థకు నిచ్చెనమెట్ల స్వభావం ఉంటుంది. ఆధిపత్య స్థానంలో ఉన్నవారు ఆర్థికంగా, సామాజికంగా తమకు కింది స్థానంలో ఉన్నవారిపై, లేదా భిన్న భావజాలాలు, సంస్కృతులు, విశ్వాసాలు, ఆహారపు అలవాట్లు ఉన్నవారిపై, శత్రువులపై రకరకాల ముద్రలు వేయడం, కించపరచడం, తీర్పు చెప్పడం ఉంటుంది. వ్యక్తులలోను, వ్యవస్థలలోను, సంస్కృతీ సాహిత్యాలలోను, అలవాట్లలోను ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించే బదులు, వాటి ప్రాతిపదికపై ఎక్కడికక్కడ మనుషులను విడగొట్టి చూడడం ఉంటుంది. వేయిపడగలలోని ధర్మారావు వ్యక్తిగత స్థాయిలో ఉదారుడిగా, మానవతావాదిగా కనిపించవచ్చు. కానీ నిచ్చెనమెట్ల స్వభావం కలిగిన చాతుర్వర్ణ్య వ్యవస్థను మనసావాచా విశ్వసించేవాడిగా మనుషుల్ని విడగొట్టి చూడడం, వైవిధ్యాన్ని గుర్తించకపోవడం, తన సంప్రదాయ సంస్కృతీసాహిత్యాల పట్ల విపరీతమైన ఆత్మోత్కర్షను, ఇతరులకు చెందిన వాటిపట్ల అంతే తృణీకారాన్ని చాటుకోవడం, తీర్పు చెప్పడం అతని ద్వితీయ ప్రకృతిగా నవల అంతటా వ్యక్తమవుతుంది. అన్నింటా ఈ విభజనదృష్టే వేయిపడగల ఇతివృత్త నిర్మాణం మొత్తానికి పునాది అవుతుంది. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలను గత వ్యాసాలలో చూడవచ్చు.

పరాయి పాలన కారణంగా తమ సాంప్రదాయిక వ్యవస్థ, విలువలు, వైభవాలూ అంతరించిపోతున్నందువల్ల రచయితలో కలిగిన తీవ్రదుఃఖవిషాదాలనే ఆత్మాశ్రయరీతిలో ఏకోన్ముఖంగా అక్షరబద్ధం చేసిన రచనగా వేయిపడగలను పరిశీలించే ఒక కోణం లేకపోలేదు. అదే సమయంలో సర్వత్రా సాంప్రదాయిక సమాజాలలో ఉండే పైన చెప్పిన లక్షణాలే వేయిపడగలలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, నవల మొత్తంలో ధర్మారావు చేసింది, ప్రతి విషయంలోనూ ‘మనమూ-వాళ్ళూ’ అన్న తేడా తీసుకొచ్చి తీర్పరి పాత్రను నిర్వహించడమే. మనుషులు, దేశాలు, సంస్కృతులు, సాహిత్యాలు, భాషల మధ్య హెచ్చుతగ్గుల తేడాలను తీసుకురావడమే కాదు, వాటిని ఇలా సిద్ధాంతీకరిస్తాడు: ఆవు చురుకైన జంతువు. బర్రె మందమైన జంతువు. ప్రకృతిలోని యా మాంద్యము దాని రక్తమందున్నది. ద్రవ్యమును బట్టియే గుణము వచ్చినది. వాని రెండింటికీ నవినాభావ సంబంధమున్నది. బ్రాహ్మణుని చూడగానే బ్రాహ్మణుడని తెలియుచున్నది. తుని వైపు క్షత్రియులను చూడుము. వెంటనే క్షత్రియుడని తెలియును… క్రైస్తవుడు క్రైస్తవునివలె కనిపించుచున్నాడు. అది భేదమే. అది వర్ణమే… అందరమొక్కటి యను సిద్ధాంతము పశువులన్నియు నొక్కటియే యను సిద్ధాంతము వంటిది… అట్లే భిన్న వర్ణములందు భేదములున్నవి.

ఇంకా ఆసక్తికరం ఏమిటంటే, సాంప్రదాయిక సమాజాలు ఈ వివక్షకు, విభజనదృష్టికి అనువైన వ్యక్తీకరణను, పదజాలాన్ని, ముద్రలనూ కూడా తమ భాషలలో అభివృద్ధి చేసుకుంటాయి. అవి అలా నిత్యవ్యవహారంలో భాగం కావడంవల్ల ఆ భాషీయులకు తెలియకుండానే వారి చైతన్యంలో ఇంకి సంభాషణల్లో యథేచ్ఛగా దొర్లుతాయి. ‘మాలకూడు’, ‘మాలదానిని’ పెళ్లి చేసుకోవడం గురించి అరుంధతి, ధర్మారావుల మధ్య జరిగిన సంభాషణను కిందటి వ్యాసంలో ఉదహరించుకున్నాం.

కులీనత గురించిన పట్టింపు, తరగతులుగా మనుషుల విభజన; రెట్ బట్లర్ వంటి భిన్న భావజాలాలు కలిగినవారిపై, శత్రువుపై రకరకాల ముద్రలు వేయడంతో సహా ఒక సాంప్రదాయిక సమాజంగా గాన్ విత్ ద విండ్ చిత్రించిన సమాజంలోనూ ఇవే లక్షణాలున్నాయి. తేడా ఎక్కడుందంటే, వేయిపడగలు ఈ లక్షణాల దగ్గరే ఆగిపోగా, గాన్ విత్ ద విండ్ వీటిని దాటి వెళ్ళి విభజన దృష్టి స్థానంలో కలుపుగోలు దృష్టిని స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. మెలనీ ముఖంగా జరిగింది అదే. రెట్ బట్లర్‌ను సమర్థించడంలో, వ్యతిరేకులపై ముద్రలు వేసి శీలహననానికి పాల్పడే సాంప్రదాయిక సమాజం తాలూకు ఆధిపత్య ధోరణిని ఆమె నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. డా. మీడ్, మిసెస్ మేరీ వెదర్ చెబుతున్న అన్ని దుర్లక్షణాలు అతనిలో ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను. అతను అన్నార్తుల నోటి దగ్గర ముద్ద లాక్కునే మనిషి కాదు. (కాన్ఫెడరేట్‌పై) మనలో ఉన్నంత విధేయతా, దేశభక్తీ అతనికీ ఉన్నాయి– అని ఆంట్ పిటీపాట్‌తో అంటుంది. ఆవేశకావేషాలు నిండిన నాటి యుద్ధ వాతావరణంలో, యుద్ధాన్ని విమర్శిస్తూ దానికి దూరంగా ఉన్న వ్యక్తిని వెనకేసుకురావడంలోనే కాక, తన ఇంటి తలుపులు అతనికి ఎప్పుడూ తెరచుకునే ఉంటాయని ప్రకటించడంలోనూ అసామాన్యమైన తెగింపును, ధిక్కారాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె నైతిక స్థైర్యం నుంచి, శీలస్వచ్ఛతనుంచి పుట్టిన లక్షణాలవి. ఆ క్రమంలో ఆమె, విభజన స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజపు భాషనూ, వ్యక్తీకరణనూ కూడా పరోక్షంగా తోసిపుచ్చుతుంది. శత్రువుతో సహా ఎవరి పట్లా అవహేళన, నింద, న్యూనత ధ్వనించే మాటలను మెలనీ నోట రచయిత్రి ఎక్కడా పలికించకపోవడం, భాష విషయంలో ఆమె కనబరచిన ప్రత్యేక స్పృహను పట్టి చూపుతుంది. ఇంకా చెప్పాలంటే భాషను ప్రజాస్వామికం చేసే ప్రయత్నానికి అది దగ్గరగా ఉంటుంది. ‘మనందరం ఒకేలా ఆలోచించం, ఒకేలా వ్యవహరించం. మనల్ని బట్టి అవతలి వాళ్ళ ప్రవర్తనపై తీర్పు చెప్పడం తప్పు.’ అని మెలనీ అనడంలోనూ వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించే ప్రజాస్వామిక స్పృహే కనిపిస్తుంది.

ధర్మారావు వైఖరి ఇందుకు పూర్తి భిన్నం. అతను అధికసంఖ్యాకుల అభిప్రాయం చెల్లుబాటయ్యే ప్రజాస్వామిక వ్యవస్థనే నిరాకరిస్తాడు. ఆ నిరాకరణను సిద్ధాంతీకరించబోతాడు. కాబోయే తన రెండవ అత్తగారు అనసూయకీ (చిన్న అరుంధతి తల్లి), రెండవ మామగారు పశుపతికీ అతనికీ జరిగిన కింది సంభాషణలో అది కనిపిస్తుంది:

అనసూయ:
బాల వితంతువుల సంగతి విచారించకపోయినచో బాల్యమృతులను గూర్చి విచారించరాదా?

ధర్మారావు:
(వ్యంగ్యముగా) చచ్చినవారి సంగతి మాకెందుకు? వారి సంగతి మ్యునిసిపల్ వారికి. మాది మ్యారేజి బ్యూరో, మాకు మిగిలినవి పెండ్లిండ్లు, ప్రేమ. ఇక దేని గురించి మాటాడమందువు? కొన్ని సంగతులు మాటాడినచో రాచరికము వారూరకుండరు. విద్యావిషయము మాకు తెలియదు. వేదాంతము మొదలైన వగమ్యములు. పదార్థవిజ్ఞానశాస్త్రాదు లగాధములు. మిగిలినవి పెండ్లి, ప్రేమ. మా పరిశోధన, శాస్త్రచర్చ, ప్రయోజకత్వము వీని మీద. మా పక్షము గెలుచుననుటకు మా సంఖ్య యెక్కువ. మా వాదన నిజము కనుకనే గెలుచుచున్నది.

అనసూయ:
అందుకు కాదు. మీకు దంభమెక్కువ గనుక గెలుచుచున్నది. యాథార్థ్య మతీతజ్ఞానవిషయము కానీ, యెక్కువమంది చెప్పునది కాదు. గొర్రెల మంద యుండును. ఏనుగులు రెండో, మూడో. గౌరవ మేనుగులకే. ఏనుగు గొప్ప యేమనినచో యేమని చెప్పగలము? అది మనసునకే తెలియును.

ధర్మారావు:
ధర్మము కూడా నట్టిదే. అదియు మనసునకే తెలియును, మన మేనుగుల కిచ్చినంత గౌరవము పాశ్చాత్యు లీయరు. మన ధర్మశాస్త్రముల గతియు నంతే.

పశుపతి:
ఆ శాస్త్రముల గూర్చి మన దేశీయులకే చాలామందికి నమ్మకము లేదు. అవి వ్రాసినవారు మనవంటివారే.

ధర్మారావు:
మన దేశీయులకే నమ్మకము లేదనగా; మన దేశీయులనగా, మన దేశమునందు పుట్టినవారని యర్థము. మనదేశమనగా నాల్గు హద్దులు గల ప్రదేశమని కాదర్థము. ఇచ్చటి మతము, సంఘము, ఆచారములు సర్వమునని యర్థము. ఈ భూఖండమునందు పుట్టినంతలో నొరిగినదిలేదు. మన మతసంఘాచారములయందు పుట్టవలయును. వాడూ మనదేశస్థుడు. ఇంక అవి వ్రాసినవారు మనవంటివారే నంటివి. ఆ మాటలు చాలా తప్పు. వారు మనవంటివారు కాదు. ఒక్కటి చూడు. రాజును నా వంటివాడే యని వీథిలో నిలుచుండి యనుము. ఏమగును? ఊరికి జానెడు బెత్తెడులో నుందువు. ధర్మశాస్త్రకర్తలు మనవంటివారే. వారురి తీయించరుకదా!

అధికసంఖ్యాకుల అనుశాసనం చెల్లే ప్రజాస్వామ్యంపై అవహేళన, వ్యంగ్యం, అక్కసు రంగరించి చేసిన పై వ్యాఖ్యలను అనేక కోణాలనుంచి అర్థంచేసుకోడానికి అవకాశముంది. ఆ అవహేళన వెనుక గొర్రెలమంద పోలికతో అధికసంఖ్యాకులను అజ్ఞానులుగా, అన్ని రకాలుగా అనర్హులుగా జమకట్టి చిన్నబుచ్చే ధోరణి ఉంది. అల్పసంఖ్యాకులైన తాము ఏనుగులమని, జ్ఞానంపై తమదే గుత్తాధిపత్యమనీ చాటుకోవడం ఉంది. అదే సమయంలో ఆ అక్కసులో స్వీయఅస్తిత్వ భయం నుంచి పుట్టే అశక్త క్రోధం కూడా పచ్చిగా బయటపడిపోతోంది. ఆ అస్తిత్వ భయానికి రెండు ముఖాలున్నాయి. మొదటిది, తాము శతాబ్దాలుగా అభివృద్ధి చేస్తూవచ్చిన సాంప్రదాయిక జ్ఞానం మొత్తం అధికసంఖ్యాక ప్రాబల్యం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరస్కృతికి, నిరాదరణకు గురవుతుందన్న భయం. వ్యవస్థలో సమూలమైన మార్పు వచ్చినప్పుడు అలాంటి భయాలు సహజంగా ఉంటాయి కనుక వాటిని కొంత సానుకూల దృష్టితో అర్థంచేసుకునే అవకాశం లేకపోలేదు. అయితే, ఆ అస్తిత్వ భయం తాలూకు రెండవ ముఖాన్ని గమనిస్తే, అందులో సొంత మనుగడకు సంబంధించిన భయం కూడా కనిపిస్తుంది. శతాబ్దాలుగా, బహుశా సహస్రాబ్దాలుగా అన్ని రంగాలలోనూ ఈ దేశ బౌద్ధిక జీవితాన్ని శాసిస్తున్నది, ప్రభావితం చేస్తున్నది తామే కనుక; తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జ్ఞానానికి ప్రజాస్వామ్యంలో ముప్పు వాటిల్లడమంటే నేరుగా తమ మనుగడకు ముప్పు వాటిల్లడమే.

బాల వితంతువుల గురించి మీకెందుకు, ముందుగా బాల్య మరణాలను పట్టించుకొండని అనసూయ అనడంలో వితంతు వివాహాలను నిషేధించే సాంప్రదాయిక అనుశాసనంలో ప్రజాస్వామ్యం జోక్యం చేసుకుని, వాటిని సమర్థిస్తోందన్న అసహనము, అందువల్ల కలిగిన అశక్త క్రోధంతో బాల వితంతువులకు, బాల్య మరణాలకు లేని పోటీని తీసుకురావడమూ కనిపిస్తుంది. పెండ్లిండ్లు, ప్రేమల గురించిన చర్చలకు; విద్య, వేదాంతం, పదార్థవిజ్ఞానశాస్త్రాలకు మధ్య లేని పోటీని తీసుకురావడంలో ధర్మారావులోనూ వ్యక్తమవుతున్నది అలాంటి అసహనమే. జ్ఞానసంబంధ విషయాలలో కూడా ఆధిక్యత-న్యూనత; లేదా మనమూ-వాళ్ళూ అన్న తేడాను తీసుకొచ్చే మనస్తత్వమే ఇక్కడా. ఆపైన అధికసంఖ్యాకుల అభిమతానుసారంగా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థ అన్ని రకాల శాస్త్రాల అభివృద్ధికీ అడ్డుగోడ అవుతుందని, ఆ రెండింటికీ మధ్య ఏదో విరోధం ఉందన్న అపోహ దీని వెనుక ఉంది. నిజానికి తనతో ఏకీభవించని జ్ఞానాన్ని నిషేధించే లక్షణం సాంప్రదాయికతకే ఉంది కానీ ప్రజాస్వామికతకు లేదు. ఉంటే అది ప్రజాస్వామ్యమే కాదు. జ్ఞానాన్ని నిషేధించకపోగా దానిని ప్రజాస్వామ్యీకరిస్తూ విస్తృత ప్రజానీకానికి దానిపై హక్కు కల్పించడంలోనే ప్రజాస్వామ్యపు మౌలికత ఇమిడి ఉంది. ధర్మశాస్త్రాల గతిని తలచుకుని ధర్మారావు బెంగపడడంలోనూ ప్రజాస్వామ్యం పట్ల అతని అనవగాహన వ్యక్తమవుతుంది. ప్రజాస్వామ్యం తనదైన తాత్వికతకు అనుగుణంగా ధర్మశాస్త్రాలను తిరగరాస్తూ కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తుందన్న స్పృహ అతనిలో లేదు. భారత ప్రజాస్వామిక రాజ్యాంగరూపంలో అవతరించినది కొత్త ధర్మశాస్త్రమే.

వితంతు పునర్వివాహాలకు చట్టబద్ధత కల్పించడం, బాల్య వివాహాలను నిషేధించడం వగైరాల రూపంలో వ్యక్తిగత ధర్మశాస్త్రాలను దాటి వెళ్ళడంలో ఈ దేశ మెజారిటీ మతస్తులు ఇతరులకు గొప్ప ఒరవడి అయిన సంగతిని స్మరించుకుంటూనే వితంతు పునర్వివాహాలను నిరాకరించడంలో, బాల్య వివాహాలను సమర్థించడంలో వేయిపడగల రచయితకు, నేడు ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న ఇస్లామిక్ సంప్రదాయవాదులకు మధ్య ఉన్న పోలికను గమనించడానికి ఇతరేతర అభిమానాలు అడ్డు రాకూడదు. దేశీయులనగా ఎవరో వేయిపడగల రచయిత ఇచ్చిన నిర్వచనమూ ప్రస్తుత సందర్భంలో ఆసక్తికరమే. దేశమంటే నాలుగు హద్దులు కలిగిన ప్రదేశం కాదని, ఇక్కడ పుట్టిన ప్రతివాడూ ఈ దేశస్థుడు కాడని, ఇక్కడి మత, సంఘ, ఆచారాలలో పుట్టినవాడే ఈ దేశస్థుడనీ ధర్మారావు అంటున్నాడు. ఈ విధంగా మత, సంఘ, ఆచార ప్రాతిపదికపై ఈ దేశస్థులను విభజిస్తున్నాడు. ఈరోజున రాజకీయ ప్రాబల్యాన్ని తెచ్చుకున్న హిందుత్వ భావజాలం ఈ నిర్వచనం పునాది మీదనే అభివృద్ధిచెందిన సంగతి తెలిసినదే. వందేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే, గాంధీ నాయకత్వంలోని స్వాతంత్రోద్యమం తాలూకు భావజాలంతోను, తదనంతర పరిణామాలతోనూ సాంప్రదాయిక సమాజం జరుపుతూవచ్చిన పోరాటం రాను రాను అసమయుద్ధంగా పరిణమించింది. దాంతో అది కలిగించిన తీవ్ర నైరాశ్య, అకర్మణ్యతల పార్స్వాన్నే ధర్మారావు ముఖంగా వేయిపడగలు చిత్రించింది. అయితే, విభజన స్వభావం కలిగిన తనదైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నమూనాను అమలుచేయడంలో శతాబ్దాల అనుభవం కలిగిన సాంప్రదాయిక సమాజం అంత తేలికగా ఓటమిని అంగీకరించి కత్తి దించే ప్రశ్న లేదు. తన వందల ఏళ్ల అస్తిత్వంలో ఎదుర్కొన్న అనేకానేక పతనోత్థానాలలో ఇప్పుడు జరుగుతున్నది ఒకటి మాత్రమే. గత నూరేళ్ళ కాలంలో తన పునరుత్థానానికి, పునర్వైభవానికి అది ఎంతో పకడ్బందీగా పూర్వరంగాన్ని నిర్మించుకుంటూనే వచ్చింది. అదిప్పుడు ఫలవంతమైంది. వేయిపడగల దృష్ట్యా చెప్పుకుంటే, అందులో చిత్రించిన సాంప్రదాయిక సమాజము, దాని భావజాలము, దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మారావులూ వెనకటి ఆభాస నైరాశ్యం నుంచి, అకర్మణ్యత నుంచి బయటపడి పూర్తి క్రియాశీలతను తెచ్చుకున్నారు. దాని పర్యవసానంగా, విభజన స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజానికీ, కలుపుగోలు స్వభావం కలిగిన ప్రజాస్వామ్య తాత్వికతకూ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా జరుగుతున్న ముమ్మర పోరాటాన్నే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక యవనిక మీద ఈరోజున మనం దర్శిస్తున్నాం. భావజాలంతో సహా తనదైన మొత్తం అజెండాను ఏకపక్షంగా జనం మీద విధించే ప్రక్రియలో విమర్శను, ప్రతిపక్షాన్ని సహించకపోవడం అనేది ఆధిపత్య స్వభావం కలిగిన సాంప్రదాయిక సమాజాల మౌలిక నిర్మాణంలోనే భాగమవుతుంది. రెట్ బట్లర్ రూపంలో ఒక బలమైన ప్రతిపక్షం కాని, మెలనీలా అంతర్గత సంస్కరణకు ప్రయత్నించిన ప్రభావోపేత వ్యక్తిత్వం కలిగిన పాత్రకాని, స్కార్లెట్‌లా జీవితేచ్చకు ప్రతీక అయిన పాత్ర కానీ వేయిపడగలులో లోపించడానికి కారణం అదే.

తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజన పూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం. దేశభక్తి, జాతీయత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ప్రస్తుత సందర్భంలో గాన్ విత్ ద విండ్‌లో దేశభక్తి గురించిన ప్రస్తావనలు ప్రత్యేకించి ఆసక్తిని కలిగిస్తాయి. దేశభక్తి అంటే తాము పుట్టి పెరిగిన, తమ మనుగడకు దోహదమైన నేలను ప్రేమించడమే నన్న సరళమైన నిర్వచనం ఆష్‌లీ, స్కార్లెట్‌ల మాటల్లో వ్యక్తమవుతుంది. వేయిపడగల సాంప్రదాయిక సమాజం ఇచ్చే నిర్వచనం ఇందుకు భిన్నంగా సంక్లిష్టంగా ఉంటుంది. దాని ప్రకారం, ఈ దేశంలో పుట్టిన ప్రతివాడూ ఈ దేశీయుడు కాదు. ఈ దేశ మత సంఘ ఆచారాలలో పుట్టినవాడు మాత్రమే ఈ దేశీయుడు. దేశీయతను ఇలా విభజించడమంటే దేశభక్తినీ విభజించడమే. పుట్టి పెరిగిన, మనుగడకు దోహదమైన నేలను ప్రేమించడమే దేశభక్తి అన్న సరళ నిర్వచనానికి బదులు, దేశానికి ఒక దేవతారూపాన్ని కల్పించి దానికి మతస్పర్శను ఆపాదించడంసహా మామూలు బుద్ధికి అందనంత ఎత్తుకు తీసుకువెళ్లి సంక్లిష్టం చేయడం మన సాంప్రదాయిక భావజాలంలో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, సరళమైన ప్రతిదానినీ సంక్లిష్టం చేసే స్వభావం మన సాంప్రదాయిక భావజాలానికి ఉంది. నేడు మన దేశంలో ఇతరుల దేశభక్తిని, జాతీయతాదృష్టిని ప్రశ్నించి ముద్రలు వేస్తున్న తీరును దృష్టిలో ఉంచుకున్నప్పుడు, ‘(కాన్ఫెడరేట్‌పై) మనలో ఉన్నంత విధేయత, దేశభక్తీ అతనికీ ఉన్నాయి.’ అని రెట్ బట్లర్ గురించి మెలనీ అంటూ ముద్రలు వేసే సాంప్రదాయిక ధోరణిని వ్యతిరేకించడం ఆశ్చర్యం గొలిపే యాదృచ్చికతతో ప్రాసంగికతను స్థాపించుకుంటోంది. అంతర్యుద్ధానుభవం అమెరికాలోని దక్షిణాది ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజాన్ని కలుపుగోలు స్వభావం కలిగిన ప్రజాస్వామికత వైపు అనివార్యంగా నడిపించిందనుకుంటే; అలాంటి యుద్ధానుభవం లేని భారతదేశ సాంప్రదాయిక సమాజం, పడిపోయిన ప్రతిసారీ తిరిగి జవసత్వాలను పుంజుకుని పైకి లేస్తూ తన అస్తిత్వాన్ని ఎప్పటికప్పుడు పొడిగించుకోగలుగుతోందా అన్నది ఆసక్తి గొలిపే ఒక అకడమిక్ ప్రశ్న.

(అయిపోయింది)
----------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం, 
ఈమాట సౌజన్యంతో

Monday, January 28, 2019

వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ!


వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 

3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ!






సాహితీమిత్రులారా!

గొప్ప ఉరవడితో శబ్దిస్తూ ఎత్తైన కొండలు గుట్టల మీంచి దూకడమే లక్ష్యంగా చిత్రగతులు పోయే జలపాతం; పైకి కనబడని లోతులతో, అవతలి ఒడ్డు కనిపించని మహావైశాల్యంతో ప్రశాంతగంభీరంగా ప్రవహించే జీవనది; ప్రకృతిలో దేని అందం, దేని ఆకర్షణ, దేని విలువ దానివే. ఒకటి చూపుల్ని అమితంగా మంత్రించి అద్భుతత్వంలో ముంచి తేల్చితే, ఒకటి అలసిపోయిన ఆత్మకు హాయి గొలుపుతుంది. మాటవరసకు గాన్ విత్ ద విండ్ లోని స్కార్లెట్, రెట్ బట్లర్ జీవితాలకు జలపాతంతో సామ్యాన్ని ఊహించుకుంటే, మెలనీ హామిల్టన్, అసలు ప్రవహిస్తున్నట్టే తోచని జీవనది! నదితో మెలనీ పోలిక ఎంత గొప్పగా అతుకుతుందంటే, సన్నని పాయగా పుట్టి క్రమంగా వైశాల్యాన్ని, లోతును సంతరించుకునే నదిలానే — నవల ప్రారంభంలో ఏమాత్రం నదురుగా కనిపించని అర్భకురాలు, అనామకురాలిగా పరిచయమైన మెలనీ, నవల అంతానికి చేరుకుంటున్న కొద్దీ యుద్ధంతో మానసికంగా, భౌతికంగా కుంగిపోయిన ప్లాంటర్ల సమాజం మొత్తాన్ని తన చలవదనపు ఒడ్డుమీదికి లాక్కుని అక్కున చేర్చుకునే ఒక మహానదిగా విస్తరిస్తుంది.

ఊఁహూఁ. మెలనీ వ్యక్తిత్వపు ఔజ్వల్యం ముందు ఈ నాలుగు వాక్యాలు మిణుగురుల పాటి కూడా చేస్తాయనిపించడం లేదు. ఇది వృధాప్రయాస అనిపిస్తోంది. పోనీ, ప్రపంచసాహిత్యం మొత్తం ఇంతవరకు సృష్టించిన అత్యుదాత్త వ్యక్తిత్వాలను ఒక్క చేతి వేళ్లమీద లెక్కించవలసివస్తే, వాటిలో మెలనీ తప్పనిసరిగా ఉంటుందని చెబితే ఎలా ఉంటుంది!? …ఏమో!

రచయిత్రి మెలనీ పాత్రను మలచిన తీరులో, సహజత్వంలో, ఇట్టే ఒదిగిపోయే ఒక ప్రణాళిక కనిపిస్తుంది. పైకి చెప్పని ఒక స్పష్టమైన తాత్వికత కనిపిస్తుంది. దూరమైన రెట్‌ను తిరిగి గెలుచుకుంటానన్న ఆత్మవిశ్వాసాన్ని, రేపటి మీద ఆశను ప్రకటించుకుంటూ స్కార్లెట్ టారాకు ప్రయాణమైందని చెప్పి నవల ముగించడం ద్వారా రచయిత్రి మొత్తం కథకు నాయిక ఆమే నని చెప్పదలచుకుందా అనిపిస్తుంది. కానీ మెలనీ పాత్రచిత్రణ దృష్ట్యా చూసినప్పుడు అంతిమంగా ఆమెనే నాయికగా స్థాపించదలచుకుందా అన్న అభిప్రాయం కలుగుతుంది. నవల ముగింపునకు వస్తున్న దశలో రెండోసారి ప్రసవం కష్టమై మెలనీ కన్నుమూసినట్టు రచయిత్రి చెబుతూనే, ఆమె ప్రభావాన్ని, ఆమె ప్రాతినిధ్యం వహించిన విలువలనూ నవల పుటలను దాటిస్తూ అనంతకాలంలోకి ప్రవహింపజేసి చిరంజీవుల్ని చేసింది.

రెట్ బట్లర్ లానే మెలనీ పరిచయానికి కూడా బార్బిక్యూ విందే ప్రధానవేదిక అవుతుంది. ఆ సందర్భంలో మెలనీ, ఆష్‌లీల పెళ్లి చర్చకు వస్తుంది. తను ఆష్‌లీ భుజాలవరకూ కూడా రాదు. అర్భకత్వం కొట్టొచ్చినట్టు కనిపించే శరీరాకృతి. అమ్మ ధరించే భారీ హూప్ స్కర్టు (Hoop Skirt: నడుము నుంచి గంట ఆకారంలో ఉండే స్కర్టు) చిన్నపిల్ల ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆపైన సిగ్గరి. కళ్ళు మాత్రం పెద్దవి. వాటిలో బెదురు తొంగిచూస్తూ ఉంటుంది. ముఖం పిరికితనాన్ని వ్యక్తం చేస్తూ ముద్దుగొలుపుతూనే, సీదా సాదాగా ఉంటుంది. వయసొచ్చిన ఆడపిల్ల ముఖాన్ని ఆకర్షణీయం చేసే నయగారాలు ఏవీ అందులో కనిపించవు. రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, భూదేవంత నిరాడంబరంగానూ, తాజా ఆహారమంత శ్రేష్ఠంగానూ, ఊట జలాలంత నిర్మలంగానూ కనిపిస్తుంది. అయితే, కవళికలు ఎంత సీదా సాదాగా, శరీరాకృతి ఎంత చిన్నగా ఉన్నా ఆమె కదలికలలో మాత్రం ఎదుటివారిని విచిత్రంగా తాకే ఒక హుందాతనం తొణికిసలాడుతూ పదిహేడేళ్ళ వయసును మించిన పెద్దరికాన్ని తోపింపజేస్తూ ఉంటుంది.

తన ఈడు ఆడపిల్లలు చాలామందిలా ఏమాత్రం నదరుగా కనిపించని మెలనీ, ఆష్‌లీని పెళ్లాడబోతున్నట్టు తెలిసిన తర్వాతే అందరి కళ్ళల్లో పడుతుంది. మిసెస్ టార్లెటన్ అంటుంది: “ఏమిటా అమ్మాయి పేరు? మెలనీయా? ముద్దుగా కనిపించే ఓ అర్భకం పిల్ల. తన పేరూ, మొహమూ నాకు ఎప్పుడూ గుర్తుండవు…మనిషిని చూడు. కడ్డీలా సన్నగా, గాలేస్తే ఎగిరిపోయేంత సున్నితం. బొత్తిగా ఎలాంటి హుషారూ లేదు. సొంత అభిప్రాయం సున్నా. ‘నో మేడమ్, యెస్ మేడమ్’ అంటూ ఎవరేం చెప్పినా తలూపడమే.”

బార్బిక్యూ విందులో స్కార్లెట్, మెలనీ ఒకరికొకరు ఎదురుపడిన సందర్భాన్ని చిత్రించిన తీరు ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో వారిద్దరి సంబంధం ఎలా ఉండబోతోందో అది సూచనగా చెప్పి రచయిత్రి పాత్ర చిత్రణ దక్షతను ఆశ్చర్యస్ఫోరకంగా వెల్లడిస్తుంది. స్కార్లెట్‌ను మెలనీ ఎంతో ఇష్టంగా చూసి చిరునవ్వు నవ్వుతుంది. తను ధరించిన ఆకుపచ్చ దుస్తులు ఎంతో బాగున్నాయంటుంది. కానీ ఆష్‌లీని ఒంటరిగా కలసి మాట్లాడాలన్న తహతహలో ఉన్న స్కార్లెట్ మర్యాదకైనా మెలనీ మాటకు స్పందించదు. ఒకవైపు మెలనీ అర్భక ఆకారం పట్ల తృణీకారభావం, ఇంకోవైపు మగవాళ్ళను వెంట తిప్పుకోగల తన అందచందాల గురించిన స్వాతిశయం; వీటికి తోడు, తను కోరుకున్న ఆష్‌లీని పెళ్లాడబోతున్నట్టు తెలిసి మెలనీపై కలిగిన అసూయ. ఇలా స్కార్లెట్‌పై మెలనీ అభిమానం, మెలనీపై స్కార్లెట్ వైముఖ్యం, వారిద్దరి మధ్యా ఆష్‌లీ అడ్డుగా- అనే ఈ త్రికోణ సంబంధం విందు ఘట్టంలో బీజరూపంలో వ్యక్తమై క్రమంగా కొమ్మలు, రెమ్మలతో విస్తరించి దాదాపు నవల అంతా పరచుకుంటుంది. చివరికొచ్చేసరికి ఈ త్రికోణసంబంధంలో సంభవించిన అద్భుతరూపపరివర్తన మెలనీని, ఆమె వ్యక్తిత్వాన్ని సహస్రాధిక ప్రమాణంలో పెంచడంతో స్కార్లెట్ ఆమె ముందు మరుగజ్జు అవుతుంది.

నిజానికి స్కార్లెట్ ఒక్కతే కాదు, మెలనీ ఉజ్వల వ్యక్తిత్వం ముందు ఆమె భర్త ఆష్‌లీ కూడా వెలవెల బోతాడు. మెలనీ కార్యక్షేత్రం అతన్ని దాటి చాలా ముందుకు విస్తరిస్తుంది. అయితే ఆ సంగతిని రచయిత్రి ఎక్కడా ప్రత్యక్షంగా చెప్పదు. మెలనీ ముఖతః కూడా ఆ స్పృహ ఎక్కడా వ్యక్తం కాదు. వారిద్దరి దాంపత్య చిత్రణ, భారతీయ సంప్రదాయం ఆదర్శవంతంగా భావించే భార్యాభర్తల సంబంధాన్ని ముమ్మూర్తులా పోలి ఉంటుంది. అది ఎక్కువతక్కువలకు, వ్యక్తిత్వ తారతమ్యాలకు, స్పర్థలకు చోటివ్వని పరిపూర్ణ అన్యోన్య దాంపత్యం. మెలనీ వ్యక్తిత్వం ఎంత వైశాల్యాన్ని సంతరించుకున్నా అది భర్త భావజాలంలో భాగమవుతూ అతని నీడలో తను ఒదిగి ఉంటూనే. వారిద్దరి మధ్య ప్రత్యక్ష సంభాషణ జరిగిన ఘట్టాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. దాంపత్యం మేరకే చూసినప్పుడు వేయిపడగలలోని అరుంధతీ ధర్మారావుల దాంపత్యానికి మెలనీ ఆష్‌లీల దాంపత్యం ఏవిధంగానూ భిన్నమైనదీ కాదు, న్యూనమైనదీ కాదు. భర్తను కూడా దాటి మెలనీ ముందుకు వెళ్ళిన క్రమాన్ని రచయిత్రి వాచ్యంగా చెప్పకపోయినా ఇతర పాత్రలతో, ముఖ్యంగా స్కార్లెట్, రెట్ బట్లర్‌లతో మెలనీ సంబంధ చిత్రణ ద్వారా అది ఉన్మీలనమవుతుంది.

మెలనీ-స్కార్లెట్
బార్బిక్యూ విందులో మెలనీ, స్కార్లెట్ కలసుకున్న పై ఘట్టం జరిగే సమయానికి మెలనీ అన్న చాల్స్ హామిల్టన్‌తో స్కార్లెట్ వివాహం ఊహలోనే లేదు. ఆష్‌లీ తనను నిరాకరించడంతో కలిగిన క్షణికావేశంలో చాల్స్‌ను స్కార్లెట్ పెళ్లి చేసుకుని మెలనీకి వదిన అవుతుంది. ఈ కొత్త బంధుత్వం స్కార్లెట్ పట్ల మెలనీ అభిమానాన్ని మరింత పెంచింది కానీ మెలనీపై స్కార్లెట్ వైముఖ్యంలో మార్పులేదు. యుద్ధం ఇద్దరినీ ఒక గూటికి చేర్చుతుంది. ఆష్‌లీ, చాల్స్‌, యుద్ధానికి వెళ్ళడం, చాల్స్ మరణం; అట్లాంటాలో ఆంట్ పిటీపాట్‌తో కలసి ఒకరికొకరు తోడుగా గడిపే అనివార్యతను కల్పిస్తాయి. అప్పటికే స్కార్లెట్‌పై మెలనీకి ఉన్న ఇష్టం ఈ సహజీవనంలో ప్రేమగా వికసిస్తూ ఆమె చుట్టూ అమాయకంగా అల్లుకుపోతుంది. మెలనీపై స్కార్లెట్ అయిష్టత అలాగే ఉన్నా గతిలేని పరిస్థితిలో ఆమె ప్రేమలత అల్లుకోడానికి తనో పందిరి కావలసివస్తుంది. ఈ క్రమంలోనే మెలనీ వ్యక్తిత్వంలోని సొబగులు ఆమెకు మధ్య మధ్య మెరుఫుల్లా తాకి విస్మయం కలిగిస్తాయి. అంతలోనే ఆమెపట్ల తన వైముఖ్యం, అసూయ, ద్వేషం; తనలోని స్వార్థమనే చీకట్లు ఆ మెరుపుల్ని కప్పివేస్తుంటాయి. మెలనీని స్కార్లెట్ అర్థంచేసుకునే ఈ క్రమం ఎంత మందగతిలో సాగుతుందంటే, మెలనీ చల్లని తోడు తనకు ఎంత అవసరమో ఆమె పూర్తిగా గ్రహించేలోపలే మెలనీ ఈ లోకం నుంచే నిష్క్రమిస్తుంది.

మెలనీది తన ఆంట్ పిటీపాట్ పోలిక అని, ఆమెలానే అస్తమానూ సిగ్గుతో ముడుచుకుపోతుందనీ అనుకుంటూనే తనలో ఒకవిధమైన ఇంగితజ్ఞానం ఉన్నట్టు స్కార్లెట్ గమనిస్తుంది. మెలనీ గురించి ఆమెకు ఇది తొలి ఎరుక. అత్త ముఖంలో లానే మెలనీ ముఖంలోనూ నైర్మల్యం, సత్యం, దయ, ప్రేమ నిండిన పసిదనపు ఛాయలు తొంగిచూస్తూ ఉంటాయి. ఎదుటివారిలో మంచినే తప్ప చెడును చూడలేని ఆ పసిస్వభావం మెలనీ ముఖంలో నిత్యసంతోషాన్ని తెచ్చిపెడుతుంది. తన ప్రవర్తన అవతలివారిలో సంతోషాన్ని, సంతృప్తిని నింపాలనీ ఆమె కోరుకుంటుంది. అందుకే చిన్నా పెద్దా అంతస్తుల తేడా లేకుండా అందరికీ తలలో నాలుక అవుతుంది. తన రూపంతోనూ, ఆభిజాత్యంతోనూ మగవారిని వెంట తిప్పుకునే స్కార్లెట్‌కు పూర్తి భిన్నమైన, స్త్రీపురుష వయోభేదాలకు అతీతమైన ఆకర్షణ మెలనీది. అట్లాంటాలో ఆమెకు ఉన్నంతమంది ఆడ, మగ స్నేహితులు ఇంకెవరికీ లేరు. అలాగని మెలనీ ప్రవర్తన అపూర్వమూ కాదు, అసాధారణమూ కాదు; దక్షిణాది ప్లాంటర్‌ల సమాజంలోని ఆడపిల్లలకు చిన్నప్పటినుంచీ అలవరిచే ప్రవర్తనే అది. ఈ సంతోషపూరితమైన స్త్రీ వ్యవహారసరళే దక్షిణాది సమాజాన్ని ఆహ్లాదభరితం చేసేదని రచయిత్రి అంటుంది. మెలనీ వ్యక్తిత్వపు విశిష్టత ఎక్కడ ఉందంటే, మిగతా ఆడపిల్లలకు భిన్నంగా యుద్ధం అనే మహా విపత్తును కూడా ఎదురొడ్డి ఈ వ్యవహారసరళిని కాపాడుకోవడంలో!

యుద్ధకాలంలోనూ ఆ తర్వాతా మెలనీతో గడిపినన్ని రోజుల్లో ఆమె గురించి స్కార్లెట్‌కు ఇంచుమించు రోజుకో ఆశ్చర్యం, రోజుకో కొత్త ఎరుక! ఇద్దరూ క్షతగాత్రులైన సైనికులకు ఆసుపత్రి సేవలు అందించే కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అయితే, స్కార్లెట్ అయిష్టంగా, మెలనీ ఇష్టంగా! పిరికిగొడ్డు అనుకునే మెలనీ ఆసుపత్రి వాతావరణాన్ని, అక్కడి దుర్గంధాన్ని భరించడం అలా ఉంచి; శస్త్రచికిత్సలకు సైతం సాయపడడం చూసి స్కార్లెట్ విస్తుపోతుంది. మృత్యుముఖంలో ఉన్న, కాలో చెయ్యో కోల్పోయిన సైనికులకు మృదుత్వము, సానుభూతి, ఆహ్లాదమూ నిండిన తన ప్రవర్తనతో మెలనీ కారుణ్యదేవతలా కనిపిస్తుంది.

స్కార్లెట్, మెలనీల వ్యక్తిత్వాల మధ్య తేడాను చూపించే మరో సందర్భం, సైనికుల సహాయార్థం జరిగిన కార్యక్రమం. పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా చాల్స్‌ను స్కార్లెట్ ఏనాడూ ప్రేమించలేదు, గౌరవించలేదు. పైగా ఇంత చిన్నవయసులోనే వైధవ్యం తెచ్చిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశాడన్న అక్కసు అతని మీద ఉంది. సైనికుల సహాయార్థం విరాళం అడిగినప్పుడు తన పెళ్లి ఉంగరాన్ని ఇచ్చేస్తుంది. ఆ క్షణంలో ఆ ఉంగరాన్ని వదిలించుకోవడమే ఆమెకు ప్రధానంగా కనిపిస్తుంది తప్ప, సైనికుల కోసం ఇవ్వడం కాదు. ఎదుటివారిలో మంచినే తప్ప చెడును ఊహించుకోవడమే తెలియని మెలనీ ఆ చర్యను గొప్ప త్యాగంగా అర్థంచేసుకుని గర్వంతో పులకించిపోతుంది. తను ఎంతో ప్రేమించే భర్త ఆష్‌లీ తన వేలికి తొడిగిన పెళ్లి ఉంగరాన్ని విరాళంగా ఇచ్చేస్తుంది. ఇద్దరూ చేసింది ఒకటే అయినా ఆంతర్యంలో రెంటి మధ్యా హస్తిమశకాంతరం.

ఆ కార్యక్రమంతోనే ముడిపడిన మరో అంశంలో మెలనీ వ్యక్తిత్వంలోని ఇంకొక ఆశ్చర్యకరమైన పార్శ్వం స్కార్లెట్ దృష్టికి వస్తుంది. తను వితంతువు, పైగా సంతాప దినాలు ఇంకా పూర్తి కాలేదు. విందువినోదాలలో పాల్గొనడం అలా ఉంచి, అసలు తను పదిమందిలోకి రానే కూడదు. కానీ యుద్ధసమయం కనుక ఒక మేరకు మినహాయింపు లభిస్తుంది. తాము కోరుకున్న యువతితో నృత్యం చేసే అవకాశాన్ని కార్యక్రమ నిర్వాహకులు వేలం వేసినప్పుడు స్కార్లెట్‌ను రెట్ బట్లర్ హెచ్చుమొత్తానికి పాడుకుంటాడు. మిగతా అమ్మలక్కలతోపాటు స్కార్లెట్ కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. రెట్ పట్ల తనలో ఎంత అయిష్టత ఉన్నా తనకు ఎక్కువ ధర పలికినందుకు గర్విస్తూ, నృత్యించే ఆ అవకాశాన్ని స్కార్లెట్ వినియోగించుకుంటుంది. ఇంటికొచ్చాక ఆ చర్యను పిటీపాట్ తీవ్రంగా తప్పు పడుతుంది. అసలు నృత్యం చేయడమే తప్పైతే, రెట్ బట్లర్ లాంటి తప్పుడు మనిషితో చేయడం ఇంకా తప్పంటుంది.

దుఃఖంతో కుంగిపోయిన స్కార్లెట్‌కు ఆ సమయంలో మెలనీ నుంచి సమర్థన, ఓదార్పు లభిస్తాయి. సైనికుల కోసం, ఆసుపత్రి కోసం నువ్వు చేసిన పని తప్పు కాకపోగా ఎంతైనా అభినందనీయమని మెలనీ అంటుంది. అసలే తను భర్త మరణించిన దుఃఖంలో ఉందని, నాలుగు గోడల మధ్య మగ్గిపోవడం తనను ఇంకా బాధిస్తుందనీ ఆంట్‌తో అంటుంది. యుద్ధ సమయం అన్ని సమయాల వంటిది కాదని, ఇంటికీ ఊరికీ అయినవారికీ దూరంగా బయట, ఆసుపత్రిలో ఒంటరిగా గడిపే సైనికులను తలచుకున్నప్పుడు మనం ఇంటికే పరిమితమవడం స్వార్థమవుతుందని, మనందరం అప్పుడప్పుడు పార్టీలకు వెళ్లవలసిందేనంటుంది.

పైన చెప్పుకున్నట్టు, దక్షిణాది ప్లాంటర్‌ల సాంప్రదాయిక సమాజంలోని అమ్మాయిలకు ఒక పరిపూర్ణమైన నమూనాగా భావించదగిన మెలనీకి ఆ సమాజం తాలూకు కట్టుబాట్లపై ఎంత పట్టింపు ఉంటుందో ఊహించుకోగలం. ఇందుకు భిన్నంగా కేవలం తన ఇష్టాయిష్టాలకు, సరదాలకు, స్వార్థాలకూ అనుగుణంగా జీవించడమే లక్ష్యంగా కట్టుబాట్లను తోసిరాజనే స్వభావం స్కార్లెట్‌ది. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే, కట్టుబాట్లను పక్కకు నెట్టేసి ముందుకు వెళ్లడంలోనే స్కార్లెట్‌లో అసాధారణమైన తెగింపు కనిపిస్తుంది తప్ప, వాటిని నిరాకరించడంలో కాదు. వాచా వాటిని కాదనడం దగ్గరికి వచ్చేసరికి ఆమెలో ఊగిసలాట, అధైర్యం అనేక సందర్భాలలో వ్యక్తమవుతాయి. పార్టీలో రెట్ బట్లర్‌తో ఆమె సంభాషణ అలాంటి ఒక సందర్భం. ‘అమ్మలక్కల మాటలను నువ్వు పట్టించుకుంటావా?’ అని అతను అడిగినప్పుడు, ‘అంత గుచ్చి గుచ్చి అడిగితే పట్టించుకోననే చెబుతానని, అయితే ఆడపిల్ల అన్నాక పట్టించుకోవాలేమోననీ’ ఆమె సందిగ్ధంగా సమాధానం చెబుతుంది.

విశేషమేమిటంటే, అనామకంగా, అర్భకంగా, వ్యక్తిత్వరహితంగా కనిపించే మెలనీలో ఆ ఊగిసలాట, అధైర్యం మచ్చుకైనా కనిపించవు. సమయానుసారంగా కట్టుబాట్లను సడలించే ధైర్యమే కాదు; ఆ సంగతిని నిర్ద్వంద్వంగా, యుక్తియుక్తంగా, సహేతుకంగా ప్రకటించగల వివేకమూ ఆమెలో ఉంది. ‘యుద్ధ సమయం అన్ని సమయాలలాంటిది కా’దనడంలో అది కనిపిస్తుంది. ఎందులోనూ ఊగిసలాట లేకపోవడం అనే ఈ లక్షణం ఆమెలో ఇంకా అనేక సందర్భాలలో వ్యక్తమవుతుంది. యుద్ధ ప్రయోజకత్వం విషయానికే వస్తే, భర్త ఆష్‌లీ ఒక దశలో సందిగ్ధానికి లోనవుతాడు. గెలిచినా, ఓడినా ఫలితం ఒకలానే ఉంటుందనుకుంటాడు. కానీ మెలనీలో ఎలాంటి సందిగ్ధత, ఫలితం గురించిన ఎలాంటి విచికిత్స లేదు. యుద్ధమంటూ వచ్చాక అందులో పాల్గొని వీరమరణం చెందడమే అత్యున్నతమంటుంది. ‘ఆష్‌లీ యూనియన్ పట్ల విధేయతను చాటుకుని జైలునుంచి విడుదలై పారిపోయి రావచ్చుకదా!’ అని స్కార్లెట్ అన్నప్పుడు, మెలనీ ఆ మాటకు తీవ్రంగా స్పందిస్తుంది. ఆమె కోపం ప్రదర్శించిన చాలా అరుదైన సందర్భాలలో ఇది ఒకటి. ‘ఆయన అలాంటి పని చేస్తాడని ఎలా అనుకుంటున్నావు? సొంత కాన్ఫెడరసీని అలా వంచిస్తాడా? అంతకన్నా రాక్ ఐలండ్‌లో తను మరణించడానికైనా సిద్ధపడతాడు. జైల్లోనే తను మరణిస్తే నేను ఎంతో గర్విస్తాను. పారిపోయి వస్తే ఆయన మొహం కూడా చూడను,’ అంటుంది. భర్త క్షేమంగా తిరిగిరావాలని అహర్నిశలూ పరితపించే మెలనీ నోట ఈ పరుషవాక్యాలు స్వభావవిరుద్ధంగా తోచి ఒకవైపు ఆశ్చర్యం కలిగిస్తాయి. మరోవైపు, కొన్ని సాంప్రదాయిక విలువల పట్ల పట్టువిడుపులు లేని ఆమె వైఖరిని వెల్లడిస్తాయి. అదే సమయంలో, ఎక్కడ గీత గీయాలో ఎక్కడ గీత చెరిపేయాలో తూచినట్టు నిర్ధారించగలిగిన ఆమెలోని అసాధారణ వివేకాన్నీ పట్టి చూపుతాయి. ఇంకా విశేషమేమిటంటే, ఈ సందిగ్ధతారాహిత్యంలో చివరికి రెట్ బట్లర్ కూడా ఆమెకు సాటి రాకపోవడం. తన సిద్ధాంతాలనూ, సూత్రీకరణలనూ సవరించుకున్న సందర్భాలు అతనికీ ఉన్నాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూనే ఒక దశలో తను కూడా అందులో పాల్గొనడం ఒక ఉదాహరణ. ఈ కోణంలో చూసినప్పుడు నవల మొత్తంలో మెలనీయే నాయికామణిగా భాసిస్తుంది.

ఒకవైపు మెలనీ స్వభావంలోని ఈ ఆశ్చర్యకరమైన పార్శ్వాన్ని గమనిస్తూనే మరోవైపు స్కార్లెట్ ఆమె స్పర్శను, ఓదార్పును చీదరించుకుంటుంది. ‘నన్ను నేను సమర్థించుకోగల’ననుకుంటూ ఆమె సమర్థింపును ఈసడించుకుంటుంది. తనలో కరడుగట్టిన అహం, ఆభిజాత్యం, ద్వేషం మెలనీ ఔన్నత్యం ముందు తలవంచే క్రమానికి ఇది ఇంకా ప్రారంభం మాత్రమే.

మెలనీ స్వభావం స్కార్లెట్‌ను మరింత ఆశ్చర్యంలో ఆలోచనలో ముంచెత్తే మరో కీలక సందర్భం, యుద్ధం నేరుగా అట్లాంటాలోకే అడుగుపెట్టడం. మెలనీ ప్రసవించే సమయం తోసుకువస్తుంటూంది. తను అసలే అరిపేద, ఆపైన ఆమె కటిస్థలం ఎంత ఇరుకంటే, డాక్టర్ మీడ్ ఉద్దేశంలో ఆమె సంతానం కనడానికే యోగ్యురాలు కాదు. భయస్తురాలైన అత్త పిటీపాట్ మెలనీని, స్కార్లెట్‌ను తీసుకుని తన కజిన్ ఉండే మెకాన్‌కు (Macon) వెళ్లిపోవాలనుకుంటుంది. తను ససేమిరా మెకాన్‌కు రానని, తన పుట్టిల్లు టారాకు వెళ్లిపోతాననీ స్కార్లెట్ పట్టుబడుతుంది. అప్పుడు, ‘నన్ను ఒంటరిని చేసి వెళ్లవద్దు, నువ్వు నాకు సోదరి కన్నా ఎక్కువ, అదీగాక నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఆష్‌లీకి మాట ఇచ్చావ’ని మెలనీ తనను కాళ్లా వేళ్లా పడినప్పుడు స్కార్లెట్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉండిపోతుంది. ఆమె మీద తన అయిష్టాన్ని ఏనాడూ దాచలేదు; ఆష్‌లీ రాకకోసం, అతని క్షేమసమాచారం కోసం తన కంటే ఎక్కువ ఆత్రంగా ఎదురుచూస్తూ ఇన్ని మాసాల్లో ఆమె ముందు తను వందలసార్లు బయటపడిపోయింది, అయినా తనను ప్రేమించే ఇంత మూర్ఖురాలేమిటని అనుకుంటుంది. తన ప్రేమాస్పదులలో మంచిని తప్ప మరేమీ చూడలేని ఆమె స్వభావానికి విస్తుపోతుంది.

పిటీపాట్ మెకాన్‌కు వెళ్లిపోతుంది. స్కార్లెట్, మెలనీలు అట్లాంటాలో ఉండిపోతారు. యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతూ పట్టణం మొత్తాన్ని ఉద్రిక్తత అంచుల మీద నిలబెడుతుంది. ఎంత అత్యవసరానికైనా వీథిలోకి వెళ్లలేని పరిస్థితి. ఇంకోవైపు నెలలు నిండి ఏ క్షణంలోనైనా మెలనీ ప్రసవించే అవకాశం. స్కార్లెట్‌లో స్వార్థ, పరార్థాల మధ్య సంఘర్షణ పతాకస్థాయిని అందుకుంటుంది. మెలనీని తన చావుకు తనను విడిచిపెట్టి, తను టారాకు వెళ్లిపోవాలని ఆమె అనుకోని క్షణం లేదు. వీథుల్లో ఏప్రిల్ వర్షంలా కురిసే తూటాల మధ్య డాక్టర్ కోసం తను వెళ్ళేది లేదని అనుకుంటుంది. తనతో ఏ విధమైన సారూప్యమూ లేని, తను అమితంగా ద్వేషించే మెలనీ కోసం తను అట్లాంటాలో ఉండిపోవడం ఆమెకు వింతగా అనిపిస్తుంది. మెలనీ త్వరగా ప్రసవించాలనే కాదు, చివరికి ఆమె చావును కూడా కోరుకుంటుంది. ఆష్‌లీకి తను ఇచ్చిన మాట అడ్డుపడకపోతే ఆమె స్వార్థమే గెలిచి ఉండేది. నిజానికి ఆ మాటకు కట్టుబడడంలో ఉన్నదీ స్వార్థమే.

ఈ ఘట్టంలోనే మెలనీ, స్కార్లెట్‌ల మధ్య జరిగిన ఒక సంభాషణలో మెలనీ వ్యక్తిత్వపు మరో విశిష్ట కోణం మెరపులా తాకుతుంది. ‘నువ్వు ప్రసవించడానికి ఎంత సమయం పట్టిం’దని మెలనీ అడుగుతుంది. ‘నేను పెరట్లోకి వెళ్ళాను. తిరిగి ఇంట్లోకి వెళ్ళేంత వ్యవధి కూడా లేకుండా ప్రసవించాను. ఇలాంటి ప్రసవాన్ని అప్రతిష్టగా భావిస్తారని అమ్మ చెప్పింది. ఒక డార్కీ ఇలాగే ప్రసవించిందట.’ అని స్కార్లెట్ అంటుంది. అప్పుడు, ‘నేను కూడా అలాంటి డార్కీనైతే బాగుండుననిపిస్తోం’దని మెలనీ అంటుంది.

మెలనీ ప్రసవించాక ఆమెను తీసుకుని బట్లర్ సమకూర్చిన చిన్న బండిలో స్కార్లెట్ సాహసోపేత ప్రయాణం సాగించి టారాకు చేరుకుంటుంది. మెలనీ అసలే దుర్బలురాలు, దానికితోడు బాలెంత. పుష్టికరమైన ఆహారం లేదు. పూర్తిగా మంచానికే పరిమితమవుతుంది. తనకు పాలు పడకపోవడంతో డిల్సీ (Dilcey) అనే నల్లజాతి స్త్రీ ఆ పసిబిడ్డకు స్తన్యమిస్తుంది. రోగగ్రస్తులకు ఆకలి ఉండదని, తనకిచ్చే పాలు కూడా డిల్సీకే ఇవ్వమని మెలనీ అన్నప్పుడు ఆ నిస్వార్థత స్కార్లెట్‌కు కోపం తెప్పిస్తుంది. అంతకన్నా ఆమెకు ఆశ్చర్యం గొలిపింది, మంచానికే అతుక్కుపోయిన అంత నిస్సత్తువ స్థితిలో కూడా ఇంట్లోని పనివాళ్లతోపాటు తన కొడుకు వేడ్ (Wade), చివరికి తండ్రి జెరాల్డ్ కూడా మెలనీనే పట్టుకుని వేళ్లాడడం!

అసలే తిండికి కటకట పడుతున్న పరిస్థితిలో తండ్రి, చెల్లెళ్ళు, పనివాళ్ళ పోషణభారంతోపాటు మెలనీ భారం కూడా తనకెందుకున్న స్కార్లెట్ ఆమెను, పసికందును అత్త దగ్గరకు మెకాన్‌కు పంపేయాలని కూడా ఒక దశలో అనుకుంటుంది. మెలనీ లాంటి దుర్బలులను తను ఎప్పటికీ ప్రేమించలేనని అనుకుంటుంది తప్ప; మెలనీ ఉనికే తనకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుందన్న సంగతిని అప్పటికీ గ్రహించలేని కరడుగట్టిన అజ్ఞానం తనది. ఆ అజ్ఞానాన్ని సమూలంగా పెకిలించగల ఘట్టం త్వరలోనే వస్తుంది కాని, అది స్కార్లెట్‌పై శాశ్వతప్రభావం చూపలేకపోతుంది.

ఒక యాంకీ సైనికుడు దొంగతనానికి ఇంట్లోకి జొరబడతాడు. స్కార్లెట్ అతన్ని చూసి భయంతో బిక్కచచ్చిపోతుంది. ఇంట్లో తను, అస్వస్థులైన ఇద్దరు చెల్లెళ్ళు, బాలెంత అయిన మెలనీ తప్ప మగవాళ్ళు ఎవరూ లేరు. సైనికుల అత్యాచారాల గురించి తను విన్నవన్నీ ఆ క్షణంలో ఆమెకు గుర్తుకొస్తాయి. అతని కంటపడకుండా తను పారిపోలేని పరిస్థితి. అతను డైనింగ్ హాలు దాటి వంటింటి వైపు వెళ్ళడం చూసి ఆమెలోని భయం కాస్తా కసిగా, క్రోధంగా మారిపోయి గొప్ప తెగింపును తీసుకొస్తుంది. కారణం, నిర్మానుష్యాలైన చుట్టుపక్కల ఇళ్ళలోంచి తాము వెతికి తెచ్చిపెట్టుకున్న యాపిల్ పళ్ళు, కూరగాయలు వంటింట్లో ఉన్నాయి. ఇద్దరికి సరిపోయే ఆహారం అవి. కానీ ఇంట్లో ఉన్న తొమ్మిది మంది పంచుకోవాలి. అవి ఆ దొంగ పాలు కావడాన్ని ఆమె సహించలేకపోతుంది. ఆపైన తల్లి ఎలెన్ తన కుట్టుపని సామగ్రిని ఉంచుకునే బంగారు పెట్టెను అతని చేతిలో చూసి మరింత ఆగ్రహంతో ఊగిపోతుంది. చప్పుడు చేయకుండా ఒక సొరుగు లాగి భర్త చాల్స్‌కు చెందిన ఒక బరువైన పిస్టల్ తీస్తుంది. ఆమెను చూసి ఆ సైనికుడు తన పిస్టల్ గురిపెట్టేలోపలే తను అతన్ని కాల్చివేస్తుంది.

తను ఒక మనిషిని చంపింది! ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోవడం, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడం స్కార్లెట్‌కు వెంటనే సాధ్యం కాలేదు. తను పేల్చిన పిస్టల్ చాల్స్‌దే కానీ దానినతను ఎప్పుడూ వాడలేదు, తను వాడింది. అంటే ఈ ఏడాది కాలంలో యుద్ధం, అది తెచ్చిపెట్టిన జీవనకల్లోలం స్త్రీ-పురుష వివక్షను ఎలా చెరిపివేసిందో ఈ చిన్న సూచన ద్వారా రచయిత్రి స్ఫురింపజేస్తుంది. తీరా, రక్తపు మడుగులో పడున్న ఆ సైనికుని మృతదేహాన్ని సమీపించి అక్కడ ఉన్నతల్లి తాలూకు పెట్టెను, అందులోని వస్తువులను చేతిలోకి తీసుకున్నాక స్కార్లెట్‌లో అపరాధభావన తొలగిపోయి సంతృప్తి, గర్వం అంకురిస్తాయి. కళ్ళెత్తి చూసేసరికి ఇంకో ఆశ్చర్యం! మెట్ల మీద మెలనీ! చింకిపాతతో ఉంది. బలహీనమైన ఆమె చేతిలో చాల్స్‌కు చెందిన ఓ బరువైన కరవాలం. నిశ్శబ్దంగా ఆమె కళ్ళు స్కార్లెట్ కళ్లను కలసుకున్నాయి. ఎప్పుడూ మార్దవంగా కనిపించే ఆమె ముఖంలో పట్టలేని గర్వం తెచ్చిపెట్టిన ఒక ఔజ్వల్యం; విపరీతమైన ఆనందం ఉట్టిపడే ఆమె చిరునవ్వులో ఒక ఆమోదముద్ర. స్కార్లెట్ హృదయంలో ఆ క్షణంలో చెలరేగే తీవ్ర కల్లోలంతో ఆ చిరునవ్వు తులతూగింది.

ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైన స్కార్లెట్, ‘తను అచ్చం నా ప్రతిరూపంలా ఉంది, నా హృదయసంచలనాన్ని తను అర్థం చేసుకుంది’ అనుకుంటుంది. అంతేకాదు, ‘నేను చేసిన పనే తనూ చేసి ఉండే’దనుకుంటుంది. ఆ ఊహ కలిగించిన పులకింతతో కళ్ళెత్తి, గాలిలో తేలిపోతున్నట్టున్న ఆ దుర్బలమూర్తిని చూసింది. అయిష్టమూ తృణీకారమూ తప్ప తనలో ఏనాడూ ఎలాంటి ఆదరభావమూ కలిగించని మనిషి తను. అలాంటి ఆష్‌లీ అర్ధాంగిపై ఆమెలోని ద్వేషంతో సంఘర్షిస్తూ ఆ క్షణంలో ఒక ప్రశంసాభావన, సహవాసస్ఫూర్తీ ఉబికి వచ్చాయి. మృదువుగా ధ్వనించే ఆ కంఠధ్వని మాటున ఎలాంటీ అల్పభావోద్వేగస్పర్శ లేని ఒక మెరుపు లాంటి స్పష్టత, పావురం కళ్ళలాంటి ఆ కళ్ళలో దుర్భేద్యమైన ఉక్కు తాలూకు మెరుపులీనే పదునైన సన్నని అంచులూ కనిపించాయి. ప్రశాంతంగా పారే ఆమె రక్తంలో సాహసం ఎగరేసిన జెండా రెపరెపలూ మోగించిన భేరీధ్వానాలూ ఉన్నట్టనిపించింది.

అంతలోనే వాస్తవికతలోకి వచ్చి స్కార్లెట్ అప్రతిభురాలై ఉండిపోయిన స్థితిలో మెలనీ వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంటుంది. పిస్టల్ పేలిన ధ్వనికి స్కార్లెట్ చెల్లెళ్ళు, కొడుకు భయంతో కేకలు పెడుతున్నప్పుడు మెలనీ వారి దగ్గరికి వెళ్ళి, చాల్స్ పిస్టల్ తుడుస్తుండగా అది పొరపాటున పేలిందని సముదాయిస్తుంది. ‘ఎంత తేలిగ్గా అబద్ధమాడింది! నాకైతే ఆ ఆలోచన వెంటనే వచ్చేది కా’దని స్కార్లెట్ అనుకుంటుంది. పనివాళ్లు వచ్చే లోపలే శవాన్ని ఇక్కడి నుంచి తప్పించాలని తొందరపెట్టిన మెలనీ అందుకు సాయపడడానికి ముందుకొస్తుంది. నేనే ఆ పని చేస్తానని స్కార్లెట్ అన్నప్పుడు, శవం పడున్న ప్రదేశాన్ని శుభ్రం చేసే బాధ్యత మెలనీ తీసుకుంటుంది. అతని భుజం సంచీలో ఏమైనా తినే పదార్థాలు ఉండచ్చని వెతుకుదామని సలహా ఇచ్చింది. అందులో చిన్న కాఫీ పొట్లంతో పాటు అతను దొంగిలించిన రకరకాల వస్తువులు; అతని జేబులో పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతాయి.

పైకి కనిపించే తన ఆకృతికి, స్వభావానికి భిన్నంగా; ఒక మనిషిని చంపడంతో సహా యుక్తాయుక్త మీమాంసను అధిగమించి తక్షణమే క్రియాశీల కావడంలో స్కార్లెట్‌లో లేని వేగం మెలనీలో ఉంది. అంతకంటే ఆశ్చర్యకరంగా ఆ వేగంలోనూ సమయస్ఫూర్తితోపాటు ఎక్కడా తడబాటుకు, ఊగిసలాటకు తావివ్వని అసాధారణమైన స్పష్టత ఉంది. అప్పుడున్న ఆ క్లిష్టపరిస్థితులలో మెలనీతో బలమైన సహవాసిత్వాన్ని అల్లుకోవడం ఎంత అవసరమో స్కార్లెట్ గ్రహించడానికి ఇంతకు మించిన అనుభవం మరొకటి ఉండదు.

ఆ తర్వాత ఒక అగ్నిప్రమాదం నుంచి మెలనీ తనను కాపాడిన మరో గొప్ప అనుభవం స్కార్లెట్‌కు ఎదురవుతుంది. ఆ సమయంలో తన ఆడబడుచుపై ఆమెలో మున్నెన్నడూ లేనంత గౌరవభావము, మరింత సన్నిహిత సహవాసిత్వ భావన, అంకురిస్తాయి. ఈ విషయం తనతో చెప్పాలని కూడా అనుకున్న స్కార్లెట్, ప్రతి అవసరానికీ నేనున్నానని తను ముందుకు వస్తూనే ఉందని అనుకుంటుంది. అయితే, మళ్ళీ అదీ క్షణికమే అవుతుంది. మెలనీపట్ల అయిష్టమూ చిన్నచూపే కాక; వాటిని మించిన ద్రోహబుద్ధి ఆమెలో ఆ తర్వాతా పడగవిప్పుతూనే వచ్చింది. ఆష్‌లీ టారాకు తిరిగి వచ్చిన తర్వాత అతనితో జరిగిన తన దీర్ఘసంభాషణలో, ఇద్దరం ఏ మెక్సికోకో పారిపోదామని స్కార్లెట్ ప్రతిపాదన చేసినప్పుడు, మెలనీకి నేను ద్రోహం చేస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావని ఆష్‌లీ ప్రశ్నిస్తాడు.

మెలనీ సాంప్రదాయికమైన కట్టుబాట్లను, అంతస్తుల తేడాలను తోసిరాజన్న సందర్భాలు ఉన్నట్టే, వాటిపై తన పట్టింపును చాటుకున్న సందర్భాలూ ఉన్నాయి. ఈ వైరుధ్యాన్ని కాస్త లోతుగా చూసి అర్థం చేసుకుంటే వాస్తవంగా మెలనీ పట్టింపు వీటి వేటి మీదా కాక, మనిషి గురించి, మానవత్వం గురించి అన్న అభిప్రాయం కలుగుతుంది. ఉదాహరణకు, తమలానే సంపన్న ప్లాంటర్ తరగతికి చెందిన కేథలీన్ కాల్వర్ట్ (Cathleen Calvert) అనే అమ్మాయి తమ అంతస్తుకు తగని హిల్టన్ (Hilton) అనే ఓవర్సీర్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్టు స్కార్లెట్, మెలనీలకు చెప్పినప్పుడు, అందులో ధ్వనించిన విషాదం మెలనీని చలింపజేస్తుంది. దాంతో కాల్వర్ట్‌ల వంశమే అంతరించే ప్రమాదాన్ని ఊహించుకుని, అంతకన్నా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే ఉత్తమమని స్కార్లెట్‌తో అంటుంది. అంతేకాదు, పనివాడు పోర్క్‌ను పంపించి కేథలీన్‌ను మన ఇంటికి రప్పించుకుందామని, తను మనతోనే ఉంటుందనీ స్కార్లెట్‌తో అంటుంది. ఇంట్లో అయినవారికే కడుపునిండా తిండిపెట్టలేకపోతున్న దుర్దశలో మెలనీ సలహాకు స్కార్లెట్ విస్తుపోతుంది. ‘నువ్వే నెలల తరబడిగా నా దాతృత్వం కింద గడుపుతున్న సంగతి నీకు ఎప్పుడూ తట్టలేదు. యుద్ధం ఎలాంటి మార్పూ తేని మనుషుల్లో నువ్వొకదానివి. అసలేమీ జరగనట్టు, జీవితం ఇంతకుముందు ఉన్నట్టే ఉన్నట్టు అనుకుంటున్నా’వని మనసులో అనుకుంటుంది. ప్రతి సందర్భంలోనూ తనకు అక్కరకు వస్తూ, చివరికి తన ప్రాణాలను కూడా కాపాడిన మెలనీ తన ‘దాతృత్వంలో జీవిస్తోం’దనుకోవడం స్కార్లెట్‌లో ఇప్పటికీ చావని అహానికి, మెలనీపై చిన్నచూపుకీ సూచన.

కేథలీన్ విషయంలో అంతస్తుకు ప్రాధాన్యమిచ్చిన మెలనీయే విల్ బెంటీన్ అనే బీదరైతు విషయానికి వచ్చేసరికి అంతస్తుల తేడాలను తోసిపుచ్చే వైఖరి తీసుకుంటుంది. ఆమెలోని నిర్ద్వంద్వతను, స్కార్లెట్ లోని ద్వైధీభావాన్నీ ఆశ్చర్యకరంగా పట్టి చూపే మరో సందర్భం ఇది. విల్ బెంటీన్ వ్యక్తిత్వానికి ముగ్ధురాలైన స్కార్లెట్ తన చిన్న చెల్లెలు కరీన్‌ను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా, ఓహారాలకు తూగడని సంశయించినప్పుడు- ‘అతనికున్నలాంటి దయార్ద్ర హృదయమూ పరోపకారచింతనా ఉన్నవారు ఎవరైనా ఉత్తమజన్ములే’ నంటూ మెలనీ ఆ వివాహం ఆలోచనను సమర్థిస్తుంది. ఇలాంటి అనేక ఘట్టాలలో మెలనీలో తన ఆకృతికీ, స్వభావానికీ పూర్తి భిన్నంగా తోచే, కేవలం ధర్మశాస్త్రకర్తలలో మాత్రమే కనిపించే, ఒక నిష్కర్ష, ఒక అనుశాసనత్వం ధ్వనిస్తాయి. ఆమెలోని నైతిక దారుఢ్యం నుంచి, అన్ని రకాల సంకోచాలనూ చెరిపివేయగల ఎల్లలెరుగని ప్రేమైక శీలం నుంచి, అచంచలమైన మానవీయ చింతననుంచీ సంక్రమించే లక్షణాలు అవి. ఆ ప్రేమైకాశీలత, ఆ మానవీయ చింతనల ముందు కట్టుబాట్లు, అంతస్తుల తేడాలు సహా కాలం గిరిగీసేవి అన్నీ పక్కకు తొలగిపోతాయి. లేదా వాటికి అనుగుణంగా సర్దుకుంటాయి, రూపాంతరం చెందుతాయి. ఎలాంటి సంక్షోభాలనైనా అధిగమించి బతికి బట్టకట్టే కొన్ని విలువలు ఎప్పటికీ మనిషి వెన్నంటి ఉంటూనే ఉంటాయి. అంతిమంగా మెలనీ ప్రాతినిధ్యం వహించేది ఆ విలువలకు. వాటి గురించిన స్పృహ, ప్లాంటర్ల తరగతికి చెందిన ఎందరిలోనో లేని గొప్ప ఆశాభావాన్ని ఆమెలో నింపుతుంది. కేథలీన్‌ను కలసుకున్న సందర్భంలో జరిగిన సంభాషణ ఇందుకు ఒక ఉదాహరణ. ‘స్కార్లెట్, (యుద్ధంలో) మరణించిన మన మగవాళ్ళ స్థానాలను భర్తీ చేసేలా, వాళ్ళ లాంటి ధైర్యవంతుల్నిగా మన పిల్లల్ని పెంచుదా’మని మెలనీ అంటుంది. ఇందులో ఆమె ఉగ్గడించినది ధైర్యమనే చిరంతన విలువను! దానికి కేథలీన్ స్పందిస్తూ, ‘అలాంటి పురుషులు మళ్ళీ పుట్టరు, వాళ్ళ స్థానాలను ఎవరూ భర్తీ చేయలేరు,’ అంటుంది. ప్రేమైకశీలమూ మానవీయచింతనా అనే లోతుల్లోంచి ఉబికివచ్చే ఆశాభావం నిండిన మెలనీ వ్యక్తిత్వానికి, మిగతావారి వ్యక్తిత్వానికి ఉన్న తేడాకు ఇది మచ్చుతునక. ఈ తేడాలోనే ఉంది మెలనీ ముఖంగా నవల ధ్వనించే మొత్తం సందేశమంతా.

భారతీయ సాంప్రదాయిక గృహిణి విషయంలో నొక్కి చెప్పే ‘పాతివ్రత్య’చాయలు మెలనీలోనూ ప్రస్ఫుటంగా కనిపించడం రెండు సాంప్రదాయిక సమాజాల మధ్య భౌగోళికదూరాన్ని చెరిపివేస్తూ సామ్యాన్ని వెల్లడించే ఇంకొక విశేషం. యుద్ధం ముగిశాక, ప్రాణాలతో బయటపడిన దక్షిణాది సైనికులు తిండి కోసం, నిలువ నీడకోసం అల్లాడుతూ గుంపు గుంపులుగా నడిచివస్తూ ఉంటారు. అలా టారా నీడలోనూ కాసేపు సేదదీరుతూ ఉంటారు. అతిథిని ఆదరించి అన్నం పెట్టే వెనకటి పరిస్థితి ఇప్పుడు లేదు. అయినా ఉన్నదాన్నే వారితో పంచుకుంటూ వచ్చినా ఇక మీదట అది సాధ్యం కాదనుకున్న స్కార్లెట్ ఆతిథ్యం తగ్గించమని పనివాడు పోర్క్‌ను ఆదేశిస్తుంది. దాంతో మెలనీ తన వాటా ఆహారంలో కొంతే తీసుకుని మిగతాది అతిథులకు పెట్టే ఏర్పాటు చేస్తుంది. ఇది తెలిసిన స్కార్లెట్, ప్రసవించిన తర్వాత ఇంతవరకు నువ్వు బలం పుంజుకోలేదు, ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుందని మందలిస్తుంది. అప్పుడు మెలనీ కళ్ళల్లో ఎన్నడూ కనిపించనంత ఉద్వేగం కనిపిస్తుంది. ఇలా అంటుంది: ఓహ్! స్కార్లెట్, నా మీద కోప్పడకు. నన్నిలా చేయనివ్వు. ఇది నన్నెంత ఆదుకుంటుందో నీకు తెలియదు. ఒక పేదమనిషితో నా వాటా అన్నం పంచుకున్నప్పుడల్లా నేను ఒకటే అనుకుంటూ ఉంటాను; ఉత్తరాదిన ఎక్కడో ఏ రోడ్డు మీదో ఇలాగే నడిచివెళ్లే నా ఆష్‌లీకి ఏ చల్లని తల్లో తన అన్నం లోంచి నాలుగు ముద్దలు పెడుతుంది. తను నా దగ్గరికి రావడానికి అది ఓపిక నిస్తుంది.

భర్త క్షేమం కోసం భారతీయ గృహిణులు చేసే ఉపవాసాలు, వ్రతాలతో ఇక్కడ పోలిక సరే; ఆశ్చర్యం గొలిపే ఒక తేడా కూడా ఉంది. ఉపవాసాలు, వ్రతాల వెనుక వ్యక్తమయ్యే ఒక యాంత్రిక విశ్వాసానికి భిన్నంగా తనిక్కడ ఒక అన్నార్తుడికి అన్నం పెడితే, దయగల ఏ తల్లో తన భర్తకూ ఇలాగే అన్నం పెడుతుందన్న ఒక సరళమైన తర్కము, లౌకికంగా మన బుద్ధికి అందే ఒక హేతుబద్ధత మెలనీ మాటల్లో ఉన్నాయి. అంతేకాదు, దయ, సానుభూతి వంటి సహజాతాలు దేశ కాలాలను, ప్రాంతాలను, శత్రుత్వాలనూ కూడా దాటి తమ ఉనికిని చాటుకుంటాయన్న గొప్ప భరోసా, దృష్టివైశాల్యం ఆ మాటల్లో వ్యక్తమవుతాయి.

మెలనీలోని ఈ సరళ తార్కికత, హేతుబద్ధత మరింత ఆశ్చర్యకరంగా వ్యక్తమైన మరో సందర్భం అట్లాంటాలోని ప్లాంటర్‌ల సమాజానికి ఆమెను నాయకురాలిగా ప్రతిష్టిస్తుంది. అమరవీరుల సమాధులున్న ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దడానికి, యుద్ధంవల్ల వితంతువులు, అనాథలుగా మారినవారికి కుట్టుపని నేర్పించి ఉపాధి కల్పించడానికీ రెండు సంఘాలు ఏర్పడి అప్పటికే పనిచేస్తూ ఉంటాయి. యుద్ధంలో మరణించిన యాంకీ, కాన్ఫెడరేట్ సైనికుల సమాధులు పక్కపక్కనే కలసిపోయి ఉండడం, వాటి చుట్టూ కలుపు మొక్కలు పెరిగిపోవడంతో శత్రుసైనికుల సమాధుల దగ్గర కూడా శుభ్రం చేయాలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. కుట్టు పని సంఘం శుభ్రం చేయాలని భావిస్తే, రెండో సంఘం దానిని వ్యతిరేకిస్తుంది. వివాదం ముదిరి ఘర్షణకు దారితీస్తుంది. యాంకీల సమాధుల్నే తవ్వేసి వాళ్ళ మృతదేహాలను చెత్తకుప్ప మీద పారేస్తానని మిసెస్ మీడ్ అంటుంది. ఇలా ఆగ్రహావేశాలు మిన్నంటిన ఆ దశలో మెలనీ వాళ్ళ మధ్యకు వెళ్ళి గొంతు విప్పుతుంది. ఆమె మృదువైన కంఠధ్వనికి, అందులోని గాద్గద్యానికి చలించిన రెండు పక్షాలూ వెంటనే మౌనంగా వహిస్తాయి. ఒక్కసారిగా చల్లబడిన ఆ నిశ్శబ్ద వాతావరణంలో మెలనీ గొంతు ఇలా వినిపిస్తుంది: నేను ఒక మాట చెప్పదలచుకున్నాను. నేను చాలా రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. మనం సమాధుల దగ్గర కలుపు తీయడమే కాదు, వాటి దగ్గర పువ్వులు కూడా ఉంచాల్సిందే. మీరు ఏమనుకున్నా సరే, నా ప్రియమైన చార్లీ సమాధి దగ్గర పువ్వులు ఉంచిన ప్రతిసారీ పక్కనే ఉన్న ఒక అజ్ఞాత యాంకీ సమాధి దగ్గర కూడా పువ్వులు ఉంచి వస్తూ ఉంటాను. అది- అది దిక్కూ దివాణంగా లేనిదిగా కనిపిస్తుంది!

వ్యతిరేకులు ఆమె మాటలకు అడ్డుతగలబోతారు. అప్పుడు మెలనీ ప్రాధేయపూర్వకంగా వాళ్ళతో అంటుంది: దయచేసి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఈ విషయం మీద మాట్లాడే హక్కు నాకు లేదని తెలుసు. ఒక్క చార్లీ తప్ప నా ప్రియతములు ఎవరూ యుద్ధంలో చనిపోలేదు. అయితే, తనను ఎక్కడ సమాధి చేశారో, భగవంతుడి దయవల్ల నాకు తెలుసు. కానీ, తమ కొడుకుల్ని, భర్తలను, సోదరులను ఎక్కడ సమాధి చేశారో కూడా తెలియని అభాగ్యులు ఈ రోజున మనలో ఎంతమంది ఉన్నారో గమనించారా…

దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోతుంది. అంతటా నీరవనిశ్శబ్దం అలముకుంటుంది. యుద్ధంలో తమ ప్రియతములను కోల్పోయిన అక్కడున్న ఎందరో మహిళల గుండెల్ని మెలనీ మాటల్లోని నిష్టురసత్యం శూలంలా గుచ్చుకుని నిరుత్తరలను చేస్తుంది. దాంతో మరింత స్థైర్యాన్ని పుంజుకున్న మెలనీ అంటుంది: యాంకీల సమాధులు మన దగ్గర ఉన్నట్టే, మన వాళ్ళ సమాధులు యాంకీల దేశంలో ఎక్కడో ఉంటాయి. ఏ యాంకీ మహిళైనా మన వారి సమాధుల్ని తవ్వి పారేస్తానంటే మన కెలా అనిపిస్తుంది — అదే, ఒక ఉత్తమురాలైన యాంకీ మహిళ అక్కడా ఉండే ఉంటుందని తెలిస్తే మనకెంత బాగుంటుంది– యోగ్యులైన యాంకీ మహిళలు కచ్చితంగా ఉంటారు. ఎవరేమనుకున్నా సరే, వాళ్ళందరూ అయోగ్యులు కావడానికి వీల్లేదు. తమకు ఎంత శత్రువులైనాసరే, మన వాళ్ళ సమాధుల దగ్గర వాళ్ళు కలుపు తొలగించి పువ్వులు కూడా ఉంచితే అదెంత హృదయంగమంగా ఉంటుంది! చార్లీ ఉత్తరాదినే చనిపోయి ఉంటే ఏ పుణ్యాత్మురాలైనా అలా చేస్తుందన్న ఊహ నాకు ఎంతో ఓదార్పునిస్తుంది. నా గురించి మీరు ఏమనుకున్నా లెక్క చేయను… రెండు సంఘాలనుంచీ తప్పుకుంటాను. నాకు కనిపించిన ప్రతి యాంకీ సమాధి దగ్గరా కలుపు తొలగిస్తాను. అంతేకాదు, వాటి దగ్గర పువ్వులు కూడా ఉంచుతాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను!

ఈ చివరి మాటలతో, కళ్ళు జలజలా వర్షిస్తుండగా ఆపుకోలేని ఉద్వేగంతో తడబడుతూ మెలనీ బయటకు వెళ్లబోతుంది. ఓ గంట తర్వాత, గ్రాండ్‌పా మేరీవేదర్ అంకుల్ హెన్రీ హామిల్టన్‌కు చెప్పిన ప్రకారం, మెలనీ ఈ మాటలన్న తర్వాత అక్కడున్న అందరూ భోరున విలపిస్తూ మెలనీని వాటేసుకుంటారు. వాతావరణం ఒక్కసారిగా ప్రేమోద్వేగపూరితంగా మారిపోతుంది. రెండు సంఘాలకూ మెలనీని కార్యదర్శిని చేస్తారు.

ఇక్కడ యాంకీ సైనికుల సమాధుల దగ్గర కూడా శుభ్రం చేసి పువ్వులు ఉంచితే అక్కడి దయగల తల్లులు తమ వాళ్ళ సమాధులనూ అలాగే గౌరవిస్తారన్న- అదే సరళమైన తర్కం, అదే హేతుబద్ధత మెలనీ మాటల్లో! ఎల్లలెరుగని మంచితనం, మానవత్వాల పట్ల అదే ధీమా. మళ్ళీ అది స్వార్థాన్ని పూర్తిగా చంపుకుని పరార్థం కోసం పాకులాడాలని చెప్పే విపరీత ఆదర్శవాదం కాదు; స్వార్థంతో కూడిన పరార్థచింతన. యుక్తియుక్తంగా మనల్ని ఒప్పించగలిగిన ఆచరణయోగ్యమైన పరార్థదృష్టి. మెలనీ ప్రేమాస్పద వ్యక్తిత్వాన్ని మరింత ఉజ్వలింపజేస్తూ ఆకర్షణ గొలిపేది ఆమెలోని ఈ అసాధారణ వివేకమే. వీటికి అదనంగా, ఆరు నూరైనా సరే, తను నమ్మింది ఆచరించే ఆమెలోని సాహసాన్నీ ధిక్కారాన్నీ అంతిమంగా అందరినీ తన వెంట నడిపించుకోగలిగిన నాయకత్వ లక్షణాన్నీ కూడా వెల్లడించే సందర్భం ఇది. అయితే అట్లాంటా లోని ప్లాంటర్‌ల సమాజానికి తను నాయకురాలు అవుతున్న సంగతి అప్పటి కామెకు తెలియనే తెలియదు.

ఇక్కడినుంచి ఓసారి వెనకకు, అంటే మెలనీ, స్కార్లెట్‌లు టారాలో కలసి గడిపిన రోజులకు వెడదాం. ఎప్పటిలానే మెలనీని అర్థంచేసుకోడానికి స్కార్లెట్‌కు ఒక జీవితకాలం పట్టేలానే ఉంది. ఆమె తండ్రి జెరాల్డ్ చనిపోతాడు. తల్లి ఎలెనును అమితంగా అభిమానించే గ్రాండ్‌మా ఫాన్‌టెయ్‌న్ (Fontaine) జెరాల్డ్ అంత్యక్రియలకు వస్తుంది. ఆమె ఈ ఒక్క సందర్భంలోనే కనిపించి మాయమయ్యే చిన్న పాత్ర. కానీ దక్షిణాది ప్లాంటర్‌ల సమాజం తీరుతెన్నులను లోతుగా ఎరిగి వ్యాఖ్యానించగలిగిన ఒక ప్రతినిధిపాత్ర. రెట్ బట్లర్ లోని కరకుదనం, మెలనీలోని వివేకం, స్కార్లెట్ లోని సాహసంతో పాటు, రేపటి పట్ల ఆ ముగ్గురిలోనూ ఉన్న ఆశాభావం ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది.

ఆమెకూ స్కార్లెట్‌కూ మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. నవలలోని దీర్ఘసంభాషణలలో అదొకటి. వివిధ సందర్భాలలో జరిగిన ఈ దీర్ఘసంభాషణలు అంతర్యుద్ధ నేపథ్యంలో ప్లాంటర్‌ల సమాజ స్థితిగతుల సమీక్షలుగానూ భవిష్యనిర్దేశాలుగానూ కనిపించి కీలకమైన ప్రబోధాత్మక పాత్ర నిర్వహిస్తాయి. ఈ దీర్ఘసంభాషణలు అన్నింటిలో స్కార్లెట్ భాగస్వామి కావడం కూడా గమనించవలసిన అంశం. విచిత్రంగా, ఇలాంటి అంతర్యుద్ధమే ప్రధాన వస్తువుగా ఉన్న మహాభారత ఇతిహాసంతోనూ ఇక్కడ పోలిక కుదురుతోంది. అందులో కూడా వివిధ ఘట్టాలలో ప్రబోధాత్మకాలైన దీర్ఘ సంభాషణలు ఉంటాయి. యుద్ధ సమయంలో భగవద్గీత రూపంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన దీర్ఘసంభాషణ ఇలాంటిదే.

కరీన్‌ను తను ఇష్టపడినా, సుఎలెన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు అంత్యక్రియల ప్రసంగంలో విల్ బెంటీన్ ప్రకటిస్తాడు. డబ్బుమీద ఆశతో యూనియన్‌కు విధేయతను చాటే పత్రంపై సంతకం చేయమని తండ్రిపై ఒత్తిడి తెచ్చి పరోక్షంగా అతని ఆకస్మిక మరణానికి బాధ్యురాలిగా నింద మోయవలసివచ్చిన సుఎలెన్‌పై సానుభూతే అతని ఈ నిర్ణయానికి కారణం. ఫాన్‌టెయిన్, స్కార్లెట్‌ల సంభాషణలో ఈ పెళ్లి ప్రస్తావన వస్తుంది. ‘నీ చెల్లెలు తన తరగతికి చెందని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?’ అని ఫాన్‌టెయిన్ అడుగుతుంది. ‘తరగతా?’ అంటూ విస్తుపోయిన స్కార్లెట్, ‘ఇప్పుడు తరగతి ఎవరిక్కావాలి? అమ్మాయిని పోషించగలిగిన మొగుడు దొరికితే గొప్ప’ అంటుంది. ‘అయితే విల్ నీ కుటుంబంలో ఒకడు కావడం నీకు సమ్మతమేనా?’ అని ఫాన్‌టెయిన్ గుచ్చి అడుగుతుంది. తను ఈ పెళ్లిని ఖండించబోతోందనుకున్న స్కార్లెట్ ఆమె మీద విరుచుకుపడడానికి సిద్ధమవుతూ, ‘సమ్మతమే’నని నొక్కి చెబుతుంది.

కానీ, ఫాన్‌టెయిన్ స్పందన ఆమె ఊహను తలకిందులు చేసి ఆశ్చర్యపరుస్తుంది. చిరునవ్వుతోనే ఈ పెళ్ళికి తన ఆమోదాన్ని సూచించిన ఫాన్‌టెయిన్, ‘ఇంతవరకూ నీ మీద నాకు ఎప్పుడూ ఇష్టం కలగలేదు. చిన్నప్పటినుంచీ నువ్వు కొరకరాని కొయ్యవే (మూలంలో వాడిన మాట, hickory nut). నేను మినహా ఆడవాళ్ళు ఎవరూ అలా ఉండడం నాకు నచ్చదు. కానీ నువ్వు సమస్యలను ఎదుర్కొనే తీరును నేను ఇష్టపడతాను. నీకు ఎంత నచ్చనివైనా నీ చేతుల్లో లేని వాటి గురించి నువ్వు అదే పనిగా గింజుకోవు,’ అని స్కార్లెట్‌తో అంటుంది.

‘అయితే ఈ పెళ్లిని నువ్వు ఆమోదిస్తున్నావన్నమాట,’ అని తను గుచ్చి అన్నప్పుడు ఫాన్‌టెయిన్ చెప్పిన సమాధానం స్కార్లెట్‌ను మరోసారి చిత్తు చేస్తుంది. ‘ఈ పెళ్లిని నువ్వు ఎంత ఆమోదించవో నేనూ అంతే ఆమోదించను. కానీ నేను ఆచరణవాదిని, నువ్వూ అంతే,’ నన్న ఫాన్‌టెయిన్ పడిపోయిన ప్రతిసారీ తిరిగి పైకి లేచిన ప్లాంటర్‌ల సమాజపు గతాన్ని స్పృశిస్తూ దానిలోని జీవశక్తి ఎలాంటిదో చెబుతుంది. అంతకంటే ముఖ్యంగా ఈ అంతర్యుద్ధ పతనాన్ని తట్టుకుని తిరిగి ఈ సమాజం సంతరించుకోగల పూర్వవైభవం పట్ల చెక్కుచెదరని ఆశాభావాన్ని ప్రకటిస్తుంది. మన చేతుల్లో లేని అసంతుష్టికర పరిణామాలు సంభవించినప్పుడు దాని గురించి ఊరికే గింజుకోవడంలో తనకు ఎలాంటి అర్థమూ కనిపించదంటుంది. తిరిగి పుంజుకునే అదను కోసం నిరీక్షిస్తూ, ఇలాంటి అనేక ఉత్పాతాలను చిరునవ్వుతో ఎదుర్కొన్నామని, ఆ విధంగా ఎలాగైనా బతికి బట్టకట్టే కళలో సిద్ధహస్తులమయ్యామని, అదే మన అస్తిత్వ రహస్యమనీ అంటుంది. ‘మనం ప్రతిసారీ తప్పుడు గుర్రాల మీదే పందెం కాశాం. హ్యూగనాట్‌లతో కలసి ఫ్రాన్స్ నుంచి; కెవాలియర్‌లతో కలసి ఇంగ్లండ్ నుంచి; బోనీ ప్రిన్స్ చార్లీతో కలసి స్కాట్లండ్ నుంచి; నల్లజాతివారితో కలసి హేటీ (Haiti) నుంచి మనం పారిపోయి ఇక్కడికి వచ్చాం. అయినా కొన్నేళ్లలోనే తిరిగి పైకి ఎగబాకగలిగాం,’ అంటుంది. పతనం నుంచి పైకి లేచే ఈ ప్రక్రియలో మనకంటే తక్కువ తరగతి జనాల బుజాలపై కూడా చేతులు వేసి నడిచామనీ, వాళ్ళు మనకు ఎంతవరకు పనికొస్తారో అంతవరకూ వాడుకున్నానమనీ, తిరిగి వెనకటి బలాన్ని పుంజుకున్నాక వారిని తన్ని తరిమేశామనీ అంటుంది. అదేపనిగా గతవైభవాన్ని తలచుకుంటూ మనకు మనం అణగారిపోవాల్సిందే తప్ప, మనల్ని అణగదొక్కే శక్తి ఈ మొత్తం ప్రపంచానికే లేదని తీర్మానిస్తుంది.

[Huguenots: క్రైస్తవమతంలోని సంస్కరణ సంప్రదాయానికి చెందిన ఫ్రెంచ్ ప్రొటెస్టెంట్‌లను సూచించే ఈ మాట 16వ శతాబ్దిలో పుట్టి 19వ శతాబ్ది ప్రారంభంవరకు వ్యాప్తిలో ఉంది; Cavaliers: 1640 లలో ఇంగ్లీష్ అంతర్యుద్ధంలో రాజుకు మద్దతు తెలిపినవారు; Bonnie Prince Charlie: [1720-88] ఇంగ్లండ్, స్కాట్లండ్, ఐర్లండ్‌ల రాజు జేమ్స్ II కొడుకు ప్రిన్స్ చాల్స్ ఎడ్వర్డ్ స్టువర్ట్ ఈ పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. స్కాట్లండ్‌లో స్టువర్ట్‌లకు ప్రజల మద్దతు ఉండేది. బ్రిటన్ సింహాసనంపై తన హక్కును స్థాపించుకునేందుకు ఇతను 1745లో రాజు జార్జి IIతో యుద్ధం చేసి ఓడిపోయి అయిదు మాసాలపాటు స్కాట్లండ్‌లో అజ్ఞాతంగా గడిపి ఆ తర్వాత ఫ్రాన్స్‌కు పారిపోయాడు.]

‘తక్కువ తరగతి జనాన్ని అవసరానికి వాడుకుని ఆ తర్వాత తన్ని తరిమేస్తా’మనడంలోని విపరీత, వికృత మనస్తత్వాన్ని హర్షించలేకపోయినా ఫాన్‌టెయిన్ అన్న మిగతా మాటలు ఈ నవలలోని ఆష్‌లీకే కాక వేయిపడగలు లోని ధర్మారావుకూ వర్తిస్తాయి. ఇద్దరూ గతవైభవ స్మరణలోనే మునిగి వర్తమానంలో అకర్మణ్యతలోకి జారిపోయినవారే. (అలౌకిక జగత్తుకు చెందిన ఒక అజెండా ధర్మారావుకు ఉన్నప్పటికీ, లౌకిక జగత్తుకు వస్తే, నవలలో చిత్రితమైన మేరకు అతనిలో అకర్మణ్యతే కనిపిస్తుంది.) తమకంటే తక్కువ తరగతికి చెందిన జనాలతో కలసి నడవడంలో ఇబ్బంది పడినవారే.

అదలా ఉంచితే, ఈ సంభాషణ సందర్భంలోనే మెలనీ గురించి ఫాన్‌టెయిన్ అన్న మాటలు స్కార్లెట్‌కు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆష్‌లీని ఒక అప్రయోజకుడిగా తీసిపారేస్తూ, విల్క్స్ కుటుంబం ఈ గడ్డుకాలాన్ని దాటడమంటూ జరిగితే ఆ ఘనత మెలనీదే కానీ ఆష్‌లీది కాదని ఆమె అంటుంది. ఆ మాటకు విస్తుపోయిన స్కార్లెట్, తను మెలనీతో చాలాకాలంగా కలిసుంటున్నానని, ఆమె గురించి తనకు బాగా తెలుసని, తనో రోగిష్టిదని, బాతును కూడా అదిలించే ధైర్యం తనకు లేదనీ అంటుంది. నిజానికి ఇక్కడ ఆశ్చర్యం గొలిపేది, మెలనీతో అన్ని అనుభవాల తర్వాత కూడా ఆమె ఎలాంటిదో తెలుసుకోలేకపోయిన స్కార్లెట్ లోని అజ్ఞానం. అప్పుడు ఫాన్‌టెయిన్ అంటుంది: ఆమె బాతును కూడా అదిలించలేకపోవచ్చు, తన ప్రాణప్రదుడైన ఆష్‌లీకి గాని, తన కొడుక్కి గాని, తను విశ్వసించే ఉత్తమ జీవనసరళికి గానీ ముప్పు ఏర్పడితే ఈ ప్రపంచాన్నీ ఈ యాంకీ ప్రభుత్వాన్నే కాదు, దేనినైనా అదిలించగలదు. ఆమెది నీ లాంటి, నా లాంటి పంథా కాదు; మీ అమ్మ పంథా. మీ అమ్మ జీవించి ఉంటే ఆమెలానే వ్యవహరించి ఉండేది. మెలనీని చూస్తుంటే చిన్నప్పటి మీ అమ్మే నాకు గుర్తొస్తోంది… తను అర్భకురాలే కావచ్చు, కానీ విల్క్స్ కుటుంబాన్ని ఉద్ధరించగలిగింది తనే.

సుఎలెన్, విల్ బెంటీన్‌ల పెళ్లై, కరీన్ చాల్స్‌టన్‌లోని కాన్వెంట్‌కు వెళ్ళిన తర్వాత ఆష్‌లీ, మెలనీ అట్లాంటా చేరతారు. యుద్ధంలో పాక్షికంగా ధ్వంసమైన ఒక రెండంతస్తుల భవనంలోని చిన్న భాగంలో కాపురం పెడతారు. అంత అందవికారమైన కొంప ఎక్కడా ఉండదని స్కార్లెట్ అనుకుంటుంది. దానికితోడు చవకబారు ఫర్నిచర్. కానీ మెలనీకి ఆ ఇల్లు ట్వెల్వ్ ఓక్స్ లోని తమ ఒకప్పటి భవంతి కన్నా అందంగా కనిపిస్తుంది. కారణం, చాలాకాలం తర్వాత తను, తన భర్త తమదైన ఒక కప్పు కింద ఉన్నారు. అవివాహిత అయిన ఆష్‌లీ చెల్లెలు పాతికేళ్ళ ఇండియా కూడా మెకాన్ నుంచి వచ్చి అన్నా వదినెల పంచన చేరింది. రోజులు మారాయి, చేతిలో చిల్లిగవ్వ ఆడని పరిస్థితి. కానీ కూటికి కరువైన పెళ్లికాని ఆడబంధువులను దగ్గరికి తీసి ఆదరించే దక్షిణాది సాంప్రదాయిక జీవనశైలిలో ఎలాంటి మార్పూ లేదు.

మెలనీలో వెల్లివిరుస్తున్న ఆ సంతోషమూ సంతృప్తీ స్కార్లెట్‌కు మరో ఆశ్చర్యం. తను ముందే బలహీనురాలు. ప్రసవం ఉన్న ఆ కాస్త ఓపికనూ హరించింది. ఆపైన తిండికి కటకట, టారాలో అందరితో కలసి తనూ కాయకష్టం చేయవలసి వచ్చింది. దాంతో కొంచెమైనా ఆరోగ్యాన్ని పుంజుకునే అవకాశం ఆమెకు కలగలేదు. చిక్కి శల్యమైంది. ఆమె చిన్న ముఖంలో కళ్ల కింద ఉన్న నల్లని మచ్చలు ఆ కళ్ళను మరీ పెద్దవిగా చూపిస్తున్నాయని స్కార్లెట్ అనుకుంటుంది. కానీ, వాటిలోని అభివ్యక్తి మారలేదు, ఏ చీకూచింతా లేని తన కౌమార వయసులో ఆ అభివ్యక్తి ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది. యుద్ధమూ అది తెచ్చిపెట్టిన అంతులేని వ్యథా ఆ కళ్ళల్లో ఉట్టిపడే ప్రశాంతమాధుర్యం ముందు ఓడిపోయాయి. తన చుట్టూ రేగిన ఎలాంటి కల్లోలాలైనా సరే చెదరగొట్టలేని స్వభావసిద్ధ నైర్మల్యం కలిగిన నిత్యసంతోషి అయిన ఒక ఇల్లాలి కళ్ళు అవి.

తను ఆ కళ్లను అలా ఎలా ఉంచుకోగలిగిందోనని స్కార్లెట్ అనుకుంటుంది. అసూయతో ఆమెనే చూస్తూ ఉండిపోతుంది. తన కళ్ళు ఒక్కోసారి ఆకలిగొన్న పిల్లి కళ్ళలా ఉంటాయని తనకు తెలుసు. మెలనీ కళ్ళ గురించి ఓసారి రెట్ అన్న మాటలు ఆమెకు గుర్తొస్తాయి. ఈ తుంటరి ప్రపంచంలో రెండు సత్కార్యాలను తలపించే కళ్ళు అవి (Like two good deeds in a naughty world)!

ఇక్కడ మెలనీని వేయిపడగలులోని అరుంధతితో పోల్చాలనిపిస్తుంది. అలాగే, ధర్మారావుతో కూడా. భర్త తోడిదే లోకంగా జీవించడంలో మెలనీ, అరుంధతీ సమానమే. మెలనీలానే అరుంధతి జబ్బుపడి చిక్కిశల్యమవుతుంది. మెలనీలానే కన్నుమూస్తుంది. జబ్బుపడినప్పటి ఆమె స్థితిని రచయిత ఇలా వర్ణిస్తాడు: ఖద్దరు చీరెలు బరువై మోయలేక అరుంధతి స్వదేశీ మిల్లు సన్న చీరెలు తాల్చుచుండెను. ఆమె స్నానము చేసిన యొడలి మీద చీర యత్తుకుని, పరిశుష్కితములైన యామె యంగములు బొమికల ప్రోవు వలె కనిపించెను. ఆమె యొడలు పలుచనై తాటియాకు వలె నుండెను.

భర్తపట్ల ఆమెది ఎంతటి పేదరికాన్ని, కష్టాన్ని, శారీరక అనారోగ్యాన్ని అయినా జయించి నిశ్చలంగా వెలిగిన అంకితభావం. అరుంధతీ, ధర్మారావుల దైహిక, మానసిక తాదాత్మ్యాన్ని రచయిత అత్యంత హృద్యంగా చిత్రిస్తాడు. మెలనీ, ఆష్‌లీల దాంపత్య చిత్రణలో అది కనిపించదు. నవల పొడవునా అది గుప్తంగానే ఉంటుంది. అసలు వారిద్దరి మధ్యా ఎక్కడా సంభాషణే కనిపించదు. మళ్ళీ అరుంధతీ, మెలనీల వ్యక్తిత్వాల మధ్య ఎంతో అంతరమూ కనిపిస్తుంది. ఒక మహాయుద్ధం తెచ్చిపెట్టిన జీవన కల్లోలాన్ని ప్రత్యక్షంగా చవి చూసిన అనుభవం మెలనీకి ఉండడం, అరుంధతికి లేకపోవడం అన్నది ఆ అంతరానికి ఒక కారణమైనా, దేశీయ నేపథ్యాలకు చెందిన కారణాలూ ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటగా చెప్పాలంటే, అరుంధతి పూర్తిగా భర్త చాటు ఇల్లాలు. భర్త సాహచర్యంలోనే ఆమె ప్రపంచజ్ఞానంలో కొంచెమైనా ఓనమాలు దిద్దుకుంటుంది. లోకాన్ని, వ్యక్తులను భర్త కళ్ళతోనే చూస్తుంది. భర్త ఇష్టాయిష్టాలనే తన ఇష్టాయిష్టాలుగా చేసుకుంటుంది. భర్తకు విడిగా ఆమెకు తనదైన కార్యక్షేత్రం ఏదీ లేదు. భర్తపట్ల మెలనీ అంకితభావం పూర్తిగా అలాంటిదే అయినా భర్తకు విడిగా ఆమెకు సొంత కార్యక్షేత్రం ఉంది. యుద్ధం ఆ కార్యక్షేత్రాన్ని మరింత ప్రస్ఫుటం చేసి ఆమె హృదయ, భావ వైశాల్యాలను అనూహ్య ప్రమాణానికి పెంచి, అట్లాంటాలోని దక్షిణాది సమాజం మొత్తానికే తనను నాయకురాలిగా ప్రతిష్టించిన మాట నిజమే. కాని, యుద్ధం లేకపోయినా ఆమెకు తనదైన కార్యక్షేత్రం ఉండి ఉండేదనడంలో సందేహం లేదు. స్కార్లెట్ తల్లి ఎలెన్‌తో ఆమెను పోల్చడమే ఇందుకు నిదర్శనం. ఎలెన్‌కు యుద్ధాన్ని దగ్గరగా చూసిన అనుభవం లేదు. కానీ పిల్లల పెంపకం, గృహనిర్వహణలలో భర్తకు విడిగా ఆమె దక్షతకు అద్దంపట్టే తనదైన కార్యక్షేత్రం ఉంది. అరుంధతి విషయంలో అలాంటిది కనిపించదు.

దాంపత్యానుభవంలో అరుంధతి పరిపూర్ణ స్త్రీయే కానీ, లౌకికమైన పరిణతులలో ఆమె బాల్యావస్థను దాటలేదు. సాంప్రదాయిక బ్రాహ్మణ కుటుంబాలలో బాల్యం నుంచీ అలవరిచే కులభేదాలు, హెచ్చు తగ్గుల తేడాలు, వాటికి సంబంధించిన పరిభాష వయసు పెరిగిన తర్వాత కూడా అరుంధతిలో అలాగే ఉండిపోతాయి. వాటిని సొంత బుద్ధితో వివేచించుకోగలిగిన లోకానుభవం, అధ్యయనం, అందుకు అవసరమైన తర్కం, హేతుబద్ధత అరుంధతిలోనే కాదు; అలాంటి సాంప్రదాయిక కుటుంబానికి చెందిన గృహిణులలో అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువ. తమకంటే తక్కువ కులస్తులని భావించేవారిపై, పనివారిపై ప్రేమాదరాలు కనబరచడంలో వారిని కుటుంబ సభ్యులుగా పరిగణించడం వేరు; కులభేదాలను, హెచ్చు తగ్గులను సూత్రరీత్యా విశ్వసించడం వేరు. రెండింటినీ కలగాపులగం చేయకూడదు.

ధర్మారావు తండ్రి రామేశ్వరశాస్త్రి రంగాజమ్మ అనే క్షత్రియ స్త్రీని పెళ్లిచేసుకోవడం, భోగకాంతను (గిరిక తల్లి) చేరదీయడం అత్తవారింటికి వచ్చిన కొత్తలో అరుంధతికి వింతగా తోస్తాయి. వాటి గురించి అడిగినప్పుడు హఠాత్తుగా కోపం ముంచుకొచ్చి ధర్మారావు ఆ ప్రశ్ననే నిషేధిస్తాడు. అది భర్తకు ఇష్టం లేని ప్రస్తావన అనుకున్న అరుంధతి అంతటితో ఊరుకుంటుంది. భర్త చాటు ఇల్లాలుగా ఆమెకు భర్త ఇష్టాయిష్టాలే తప్ప మామగారి సంబంధాలతో సహా ఏవీ ముఖ్యం కాదని ఇందులోని ధ్వని. మంగమ్మ గురించిన సందర్భంలో ధర్మారావు అన్న మాటలు, ఒక సాంప్రదాయిక భారతీయ గృహిణికి, భర్తకు ఉండే సంబంధం ఎలాంటిదో స్పష్టంగా చెబుతాయి. భర్తనుంచి అందే జ్ఞానాన్ని మాత్రమే భార్య ప్రతిఫలించాలి. స్వయంప్రకాశమూ స్వతంత్ర బౌద్ధికవికాసమూ ఆమె పత్నీత్వాన్ని పలుచన చేస్తాయి. ధర్మారావు అంటాడు: భర్త, స్త్రీకిని ప్రపంచమునకును మధ్య తెర వంటివాడు. తెర తీసివేసినచో, లోకజ్ఞత దొడ్డి పెట్టిన వేల్పు గిడ్డి, సర్వము పిదుకును.

అరుంధతి జబ్బుపడినప్పుడు భర్తకూ, తనకూ జరిగిన కింది సంభాషణలో సాంప్రదాయిక కుటుంబాలలో కులభేదాలను చాటే పరిభాష కనిపిస్తుంది. భర్త నిషేధించినది తన తండ్రికి గల ఇతరేతర సంబంధాలను ప్రశ్నించడాన్నే తప్ప, ఈ పరిభాషను కాదు.

అరుంధతి:
నేడు జబ్బు చేసినదని మాలకూడు తినమందురా?

ధర్మారావు:
వారు మనకన్నా చెడిపోలేదు.

అరుంధతి:M/h5> చెడిపోకపోనిచో ఈసారి మాలదానినే పెండ్లి చేసికొనుడు.
ధర్మారావు:
చెంపపైని కొట్టరా? తీరికగా కూర్చుండి దుష్టపు మాటలు మాట్లాడెదవేల?

పతితగా ముద్రపడి పశ్చాత్తాపంతో ఆధ్యాత్మికం వైపు మళ్లిన మంగమ్మ తన ఇంట్లో సత్సంగం జరుపుతోందని కుమారస్వామి ధర్మారావుతో అన్నప్పుడు ‘గూడెములో క్రతువు జరిపినట్లు’ అని ధర్మారావు అంటాడు. గూడెం పట్ల, గూడెంలో ఉండే జనాలపట్ల ఈ మాటల్లో వ్యక్తమవుతున్న అవహేళన, ఇతరత్రా అతని స్వభావచిత్రణకు పూర్తి భిన్నంగా ఉండి ఆశ్చర్యచకితం చేస్తుంది. తనూ, గణాచారి కలసి వెడుతుండగా ఒక పంచముడు ఎదురైన సందర్భంలో అతను అన్న మాటల్లోనూ ఇలాంటి అవహేళనే ధ్వనిస్తుంది: ఒక్క పది యేండ్లాగుము. అప్పుడు గణాచారియే ఉండడు. అప్పుడు మనందరమును కలసి దేవాలయములోనికే పోదము. స్వామి కప్పుడు గణాచారి ప్రసక్తి యుండదు...

ఇంకోవైపు పాత ఆచారాలు, కట్టుబాట్లపై ధర్మారావుకు ఉన్నంత విధేయత మెలనీకీ ఉంది. నిత్యపరిణామశీలి అయిన ఈ ప్రపంచానికి అనుగుణంగా తాను మారడానికి తిరస్కరించడంలోనూ ఆమె మరో ధర్మారావే. కానీ తేడా ఎక్కడుందంటే, తమకంటే తక్కువ తరగతి జనాలపట్ల అరుంధతీ ధర్మారావులలో వ్యక్తమైన వివక్ష కానీ అవహేళన కానీ మెలనీలో లేవు. నవల పొడవునా ఆమె స్వభావచిత్రణను గమనిస్తే, ఆమెలో అలాంటివి అసలు ఊహకే అందవు. యుద్ధసమయంలో తను కూడా యాంకీలను శత్రుపూరిత దృష్టితోనే చూస్తుంది. అది యుద్ధం వరకే. ఆ తర్వాత యాంకీలలో ఉండగల మానవీయ స్పందనల పట్ల సైతం గొప్ప విశ్వాసాన్ని, గౌరవాన్ని ఎలా చాటుకుందో పైన చెప్పుకున్నాం. మళ్ళీ పేదరికాన్ని ఎలాంటి ఫిర్యాదూ లేకుండా వరించడంలోనూ ఒకింత హెచ్చుతగ్గుల తేడాతో–మెలనీ, అరుంధతి, ధర్మారావుల మధ్య పోలిక ఉంది. అయితే దుర్భరమైన లేమిలోనూ గొప్ప ఆత్మగౌరవాన్ని, సాహసాన్ని, ఔదార్యాన్ని, దయనూ మరింతగా చాటుకునే అవకాశాన్ని యుద్ధ నేపథ్యం మెలనీకి కల్పించింది. అలాంటి యుద్ధ నేపథ్యం లేదు కనుక అరుంధతీ ధర్మారావులలో ఈ లక్షణాలు అదే స్థాయిలో ప్రస్ఫుటించే అవకాశం సహజంగానే ఉండదు. ఆ మేరకు వారిద్దరికీ సందేహలాభాన్ని ఆపాదించినా, అంతస్తులకు, సామాజిక ప్రతిపత్తిలోని హెచ్చు తగ్గులకు, కుల భేదాలకు అతీతంగా మనిషిని మనిషిగా గౌరవించే భావవైశాల్యంలో మెలనీకీ, అరుంధతీ ధర్మారావులకూ మధ్యనున్న పైన చెప్పిన అంతరం స్పష్టమే.

మళ్ళీ మెలనీ-స్కార్లెట్‌ల విషయానికి వస్తే, మెలనీపై స్కార్లెట్ ద్వేషానికి, ఆమెపై మెలనీ ప్రేమకు, మధ్య జరిగిన అంతులేని పెనుగులాటలో చివరికి మెలనీ ప్రేమే జయిస్తుంది. అట్లాంటాలో స్కార్లెట్, ఆష్‌లీల మధ్య జరిగిన ఒక ఘటన ఆ పెనుగులాటను పతాకస్థాయికి తీసుకెళ్లి స్కార్లెట్ లోని కరడుగట్టిన ద్వేషాన్ని సైతం కరిగిస్తుంది. మొదటిసారి మెలనీపై ఆమెలో అస్పష్టతకు తావులేని సానుకూలభావన తొంగిచూస్తుంది. ఒక భావోద్వేగ పూరిత ఏకాంతంలో స్కార్లెట్‌ను ఆష్‌లీ దగ్గరకు తీసుకున్న దృశ్యాన్ని ఆష్‌లీ చెల్లెలు ఇండియా చూసి ఊరూవాడా ఏకం చేస్తుంది. అపరాధభావనతో కుంగిపోయిన స్కార్లెట్, మెలనీకి తన మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది. అంతేకాదు, చిన్నప్పుడు తప్పు చేసినప్పుడు తల్లి ఎలెన్‌కు తను వివరణ ఇచ్చుకున్నట్టే మెలనీకి వివరణ ఇచ్చుకుని హృదయ భారాన్ని దింపుకోవాలను కుంటుంది. ఆ విధంగా తల్లిపై తనకున్న భయభక్తులే మెలనీపై ఏర్పడడం ఆమెకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సందర్భంలో మెలనీ స్పందన, ఆమె ఉదాత్త వ్యక్తిత్వానికి స్కార్లెట్ బేషరతుగా దాసోహమయ్యే ప్రక్రియను సంపూర్ణం చేస్తుంది. స్కార్లెట్ నుంచి ఎలాంటి వివరణను వినడానికీ మెలనీ తిరస్కరిస్తుంది. ఏవో ఉబుసుపోక వదంతులకు అంత ప్రాధాన్యం ఇవ్వడం, యుద్ధకాలంలో ఎదురైన విపత్కర పరిస్థితులను వీరోచితంగా ఎదుర్కోవడంలో మనం చాటుకున్న అద్భుత సాహచర్యాన్ని, అప్పటి అపురూపమైన అనుభవాలను అవమానించడమేనని స్పష్టం చేస్తుంది.

అయితే తన పట్ల స్కార్లెట్‌లో ఈ పరివర్తన వచ్చిన సమయానికి మెలనీ ఈ లోకంనుంచే నిష్క్రమించబోతోంది. రెండోసారి గర్భవతి అయిన మెలనీ మృత్యువుకు చేరువవుతున్నదన్న వార్త స్కార్లెట్‌కు పిడుగుపాటు అవుతుంది. ఒకప్పుడు మెలనీ చావును కోరుకున్న తను, ఇప్పుడు మెలనీ ఎట్టి పరిస్థితిలోనూ కన్నుమూయ కూడదనుకుంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా మెలనీ అవసరం తనకు ఇప్పుడు ఉందనుకుంటుంది. ఇంతకాలం తనపై తనే ఆధారపడిందన్న ఆహాన్ని పటాపంచలు చేస్తూ వాస్తవానికి ప్రతి ఘట్టంలోనూ తనే మెలనీపైనే ఆధారపడిందన్న గ్రహింపు ఆమె అంతరాంతరాలలోంచి తన్నుకువస్తుంది. తన చేతిలోని కత్తీ డాలూ, తనకు ఓదార్పూ బలమూ అన్నీ మెలనీయేనన్న ఎరుక తనను కమ్ముకున్న స్థితిలో ఆమె మృత్యుముఖంలో ఉందన్న వార్త ఒక్కసారిగా స్కార్లెట్‌ను భయభ్రాంతం చేస్తుంది. మెలనీయే తన ఏకైక నేస్తం అనుకున్న స్కార్లెట్, అమ్మ తర్వాత తనను నిజంగా ప్రేమించింది తనే అనుకుంటుంది. అంతేకాదు, తను అచ్చం అమ్మేనని, ఆమెలో అమ్మను చూశారు కనుకనే అందరూ ఆమె స్కర్ట్ పట్టుకుని వేళ్లాడారని అనుకుంటుంది.

(ఆఖరి భాగం)
----------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం, 
ఈమాట సౌజన్యంతో

Sunday, January 27, 2019

వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్!


వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 

2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్!





సాహితీమిత్రులారా!

ఒక రచన, దాని రూపం, ఇతివృత్తం, భాష, శైలి, శిల్పం, పాత్రలు, అది ప్రకటించే దృక్పథం ఎలా ఉండాలన్నది పూర్తిగా రచయిత స్వాతంత్ర్యానికి సంబంధించినది. ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆర్. ఎస్. సుదర్శనంగారు తన సాహిత్యంలో దృక్పథాలు అనే వ్యాససంపుటిలో అభిప్రాయపడినట్టు వేయిపడగలను ఆత్మాశ్రయ స్వభావంగల నవలగా గుర్తిస్తే, ఆ రచనకు చెందిన మొత్తం ప్రణాళిక అంతా ఆ అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, వేయిపడగలు, గాన్ విత్ ద విండ్‌ల మధ్య పోలికలను, తేడాలను చర్చిస్తున్నప్పుడు ఒక ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తుంది. అది- వేయిపడగలులో రెట్ బట్లర్, మెలనీ లాంటి పాత్రలు ఎందుకు లేవని!

వేయిపడగలలోని ధర్మారావు పాత్రను పోలిన ఆష్‌లీ భావజాలాన్ని తోసిపుచ్చగల బలమైన ప్రతివిమర్శను రెట్ బట్లర్ రూపంలో గాన్ విత్ ద విండ్ రచయిత్రి సృష్టించిందని; స్కార్లెట్, భార్య మెలనీ సైతం ఆష్‌లీని దాటి ముందుకు వెళ్ళడం ద్వారా అతని భావజాలానికీ జీవన సరళికీ ఒక మేరకు ప్రతివిమర్శను కల్పించారనీ గత వ్యాసంలో చెప్పుకున్నాం. తేడా ఏమిటంటే, స్కార్లెట్, మెలనీలది ఆష్‌లీ పట్ల సానుకూలత కలిగిన అప్రకటిత విమర్శ అయితే, రెట్ బట్లర్‌ది ప్రతికూల విమర్శ. పైన చెప్పిన రచయిత స్వాతంత్ర్యం నుంచి కాస్త బయటికి వచ్చి పరిశీలించినప్పుడు, ఇలా ప్రతివిమర్శను సృష్టించడం వల్ల వేయిపడగల ఇతివృత్తానికి లేని ఒక పరిపూర్ణత గాన్ విత్ ద విండ్ ఇతివృత్తానికి సిద్ధించిందనీ, ఆ విధంగా వేయిపడగల రచయిత కంటే గాన్ విత్ ద విండ్ రచయిత్రి ఎక్కువ పరిణతినీ జీవితం పట్ల ఎక్కువ దృష్టివైశాల్యాన్నీ ప్రకటించిందన్న భావన కలుగుతుంది.

అయితే, రెండు రచనల మధ్య అతి కీలకమైన తేడాను తెచ్చే యుద్ధం (లేదా అంతర్యుద్ధం) ఉన్న సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. యుద్ధనేపథ్యం గాన్ విత్ ద విండ్‌లో పైన చెప్పుకున్న పరిపూర్ణతకు, పరిణతికి, దృష్టివైశాల్యానికీ కారణమనుకుంటే; అలాంటి యుద్ధనేపథ్యం లేని వేయిపడగలులో, దాని రచయితలో అవి లోపించడం ఒకవిధంగా సహజమే. అప్పుడు పరిపూర్ణత, పరిణతి, దృష్టివైశాల్యం అనే లక్షణాలు, ఈ రెండు రచనా ప్రణాళికలకు, వ్యక్తిగతంగా ఈ ఇద్దరు రచయితలకూ సంబంధించినవి కాక, వాటిలోని వస్తువుకు సంబంధించినవి అవుతాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీనిని ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే; గాన్ విత్ ద విండ్‌కు ఉన్నట్టు వేయిపడగలకు కూడా ఒక యుద్ధ, లేదా అంతర్యుద్ధ నేపథ్యం ఉండి ఉంటే; దానికి కూడా పైన పేర్కొన్న పరిపూర్ణత, పరిణతి, దృష్టివైశాల్యం సిద్ధించి ఉండేవా?! ప్రస్తుతానికి వీటిని ప్రశ్నలుగానే ఉంచితే —

యుద్ధం ఉండడం, లేకపోవడం అనేది; ఈ రెండు రచనల మధ్య పోలికలు, తేడాల చర్చను, ‘ఒక రచనను ఉన్నది ఉన్నట్టుగా పరిశీలించడం’ అనే హద్దును దాటించి బయటికి విస్తరింపజేస్తోంది. ఇక్కడ జరుపుతున్న ఈ పరిశీలన మొత్తానికి ఇలాంటి విస్తరణ స్వభావం ఉంది. వేయిపడగలకు ఆత్మాశ్రయ లక్షణం ఉండడం, గాన్ విత్ ద విండ్‌కు లేకపోవడం; కిందటి వ్యాసంలో చెప్పుకున్నట్టు వేయిపడగల రచయిత తనే డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం, గాన్ విత్ ద విండ్ రచయిత్రి తమను డ్రైవ్ చేసుకునే స్వేచ్ఛను ఇతివృత్తానికీ, పాత్రలకే విడిచిపెట్టడం – అనేవి ఎందుకు జరిగాయని ప్రశ్నించుకుని ఆ లోతుల్లోకి వెళ్లినప్పుడు కూడా చర్చ బయటికి విస్తరిస్తుంది.

ఆష్‌లీ – రెట్ బట్లర్
ముందుగా ఆష్‌లీ భావజాలంపై బట్లర్ విమర్శ ఎలాంటిదో చూద్దాం.

గాన్ విత్ ద విండ్‌లో బహుశా అందరికంటే ఎక్కువ ఆకర్షణ గొలిపే పాత్ర రెట్ బట్లర్. అతని మాట, నడక, మిగిలిన పాత్రలకు భిన్నంగా, విలక్షణంగా ఉండి అతని వ్యతిరేకుల దృష్టిని కూడా బలంగా ఆకర్షిస్తాయి. ఆష్‌లీ లానే అతను కూడా దక్షిణాది ప్లాంటర్‌ల తరగతికి చెందినవాడే. ఆ తరగతికి చెందిన జనం మధ్య ఉంటూనే వారికి దూరంగానూ ఉండగలగడం అతని ప్రత్యేకత. అంటే, ప్రవాహంలో భాగమవుతూనే, మళ్ళీ దానినుంచి వేరుపడి ఒడ్డు నుంచి దానిని చూడగలగడం అన్నమాట. ఆవిధంగా బట్లర్ పతనమవుతున్న ప్లాంటర్‌ల తాలూకు కులీనసమాజం తీరుతెన్నులపై నవల పొడవునా వ్యాఖ్యాతపాత్రను నిర్వహిస్తాడు. తను కూడా భాగమైన ఆ సమాజం పట్ల అతనిలోనూ అంతర్గతంగా మమకారం ఉంటుంది. అయితే, ఆ మమకారమే తనకు కాలం చెల్లిన సంగతిని గుర్తించలేకపోతున్న ఆ సమాజంపట్ల కసిగా, కార్పణ్యంగా, క్రోధంగా వ్యక్తమవుతుంది. అది అతని మాటతీరును కూడా ప్రభావితం చేసి అందులో వ్యంగ్యాన్ని, వక్రతను, కాఠిన్యాన్ని, అధిక్షేపణను గాఢంగా నింపుతుంది. సందర్భం నుంచి తప్పించి చూస్తే అతని మాటలు వివాదాస్పదాలుగా కనిపించే మాట నిజమే. అదే సమయంలో వాటిలో ఉటంకింపునకు అర్హమైన ఒక లక్షణం అలవోకగా దొర్లిపోతూ ఉంటుంది. ఉదాహరణకు, కాన్ఫెడరేట్ సైనికుల సహాయార్థం జరిగిన పార్టీలో స్కార్లెట్‌తో అతని సంభాషణ ఇలా ఉంటుంది:

స్కార్లెట్:
ఓహ్, ఉత్తమగుణాలే మూర్ఖమైనవన్నట్టు ధ్వనించే నీచమైన ధోరణి నీది.

రెట్:
కానీ ఉత్తమగుణాలు మూర్ఖమైనవే(But virtues are stupid). జనం ఏదైనా అంటే నువ్వు లెక్కచేస్తావా?

స్కార్లెట్:
చేయను-కానీ…సరే, దాని గురించి మనం మాట్లాడుకోవద్దు….

రెట్:
నా ప్రశ్నల్ని దాటేయద్దు. అమ్మలక్కలు అనే మాటల్ని నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా?

స్కార్లెట్:
ఓహ్, మరీ అంత గుచ్చి గుచ్చి అడిగితే- లేదు! కానీ ఆడపిల్ల అన్నాక పట్టించుకోవలసిందే. ఇవాళ మాత్రం నేను పట్టించుకోను.

రెట్:
అద్గదీ! నీ గురించి ఆలోచించే బాధ్యతను ఇంకొకళ్ళకి విడిచిపెట్టకుండా నీ అంతట నువ్వే ఆలోచించుకోవడం ప్రారంభించావన్నమాట. జ్ఞానానికి అదే ప్రారంభం(That is the beginning of wisdom).

స్కార్లెట్:
ఓహ్, కానీ—

రెట్:
నా గురించి చెప్పుకుంటున్నంతగా నీ గురించి కూడా చెప్పుకుంటుంటే అది పట్టించుకోనవసరం లేని ఎంత అల్పవిషయమో నువ్వే గ్రహిస్తావు. చార్ల్‌స్టన్‌లో నన్ను ఆహ్వానించే ఇల్లు ఒక్కటీ లేదంటే నువ్వే ఆలోచించు. మన న్యాయమైన, పవిత్రమైన యుద్ధానికి నేను చేసిన సాయం కూడా ఆ నిషేధాన్ని తొలగించలేదు.

స్కార్లెట్:
ఎంత ఘోరం!

రెట్:
ఓహ్, ఎంతమాత్రం కాదు. నీ పరువు కోల్పోయేవరకూ అదెంత బరువో, నిజంగా స్వేచ్ఛ అంటే ఏమిటో నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు (Until you’ve lost your reputation, you never realize what a burden it was and what freedom really is)
….

స్కార్లెట్:
డబ్బు ప్రతీదీ కొనలేదు.

రెట్:
అని నీకెవరో చెప్పారు. ఆ చిలకపలుకులు సొంతంగా నీ బుద్ధికి తట్టినవి కావు. డబ్బుతో ఏది కొనలేవు?

దాదాపు నవల చివరిలో తన గతం గురించి స్కార్లెట్‌కు చెబుతాడు. అతని స్వస్థలం న్యూ ఆర్లిన్స్ (New Orleans) లోని చాల్స్‌టన్(Charleston)నగరం. ప్లాంటర్‌ల తరగతికి చెందిన అందరిలానే అతని తండ్రి వంశగౌరవానికి, పరువుప్రతిష్టలకు, విధినిషేధాలకు, కట్టుబాట్లకు విపరీత ప్రాధాన్యమిస్తాడు. ఆ వైపరీత్యం వికటించి, తండ్రికి పూర్తిగా భిన్నమైన స్వభావం వైపు, ప్రాధాన్యాల వైపు బట్లర్‌ను మళ్లించింది. బాల్యం నుంచీ ఇద్దరి మధ్యా ఏర్పడిన ఘర్షణ తండ్రిలా పెద్దమనిషి అనిపించుకునే శిక్షణకు బట్లర్‌ను దూరం చేసి, గురి చూసి పిస్టల్ పేల్చగల నేర్పరిగా, జూదగాడిగా మార్చింది. తండ్రి ఇంటినుంచి వెళ్లగొట్టడంతో అతను ప్లాంటర్‌ల సమాజం నుంచి బయటపడి విశాలప్రపంచంలోకి అడుగుపెడతాడు. జూదంలోనే పైకి వస్తాడు. ఆ క్రమంలో ప్లాంటర్‌ల కులీన సమాజం ఆమోదించని అనేకానేక అడ్డదారుల్లో సంపద గడిస్తాడు. తనది తాత పోలిక అంటాడు. ప్లాంటర్‌ల సమాజానికి చెందిన తొలి తరం వ్యక్తులు అతనిలా విశాలప్రపంచాన్ని చూసినవారే. అతనిలానే విలువలను పక్కన పెట్టి సంపద గడించడం ఒక్కటే లక్ష్యంగా విపరీతమైన తెగింపు, సాహసం, కార్యదీక్ష కనబరచినవారే. తండ్రి తరానికి వచ్చేటప్పటికి వాటి స్థానంలో కులీనత, విధినిషేధాలు, కట్టుబాట్లు సర్వస్వమయ్యే పరిస్థితి వచ్చి, అవి కల్పించిన గూడులో ముడుచుకుపోవడం మొదలైంది. కాలజ్ఞానం, లోకజ్ఞత కొరవడిన ఫలితం, మనవల తరానికి వచ్చేసరికి ఆ సమాజాన్ని పతనావస్థకు తీసుకొచ్చింది. అందరి మీదా పడినట్టే యుద్ధం ప్రభావం బట్లర్ తండ్రిమీద, కుటుంబసభ్యుల మీద కూడా పడుతుంది. ప్లాంటేషన్ నివాసం కాలి బూడిదవుతుంది. పంట పొలాలు చిత్తడి నేలలవుతాయి. టౌన్ ఇల్లు పన్నుల కింద పోతుంది. తల్లి, తండ్రి, చెల్లెలు రెండు గదుల్లో, ఆకలి కడుపులతో జీవించే పరిస్థితి వస్తుంది. ఆ దశలో కూడా తండ్రి కొడుకు నుంచి ఆర్థికసాయాన్ని నిరాకరిస్తాడు. అలా భార్యను, కూతురునీ కూడా మాడ్చి చివరికి తండ్రి మరణించినప్పుడు, అందుకు తను ఏమాత్రం విచారించడం లేదని స్కార్లెట్‌తో బట్లర్ అంటాడు. అది మరీ దారుణం అని ఆమె అన్నప్పుడు ‘లేని విచారాన్ని నటించడం అంతకన్నా దారుణం’ అంటాడు.

ప్లాంటర్‌ల సమాజం నుంచి బయపడి విశాలప్రపంచంలోకి అడుగుపెట్టే క్రమంలో ఆ సమాజం తాలూకు విలువలను, భ్రమలనే కాదు, దానిని ఆవరించి ఉన్న డాంబికత్వాన్ని బట్లర్ బద్దలు కొడతాడు. వాస్తవికతను నగ్నంగా దర్శించి ముఖాముఖి ఎదుర్కొంటాడు. అది అతని మాటకు కటుత్వాన్ని, నిక్కచ్చితనాన్ని అలవరిచింది. బార్బిక్యూ విందులో ప్లాంటర్ తరగతికి చెందిన యువకులు, పెద్దలూ యుద్ధం గురించి ఎంతో తమకంగా చర్చించుకుంటూ, ‘నెలరోజుల్లో యాంకీలను మట్టి కరిపించగల’ తమ ప్రతాపం గురించి ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు వారి ఉత్సాహంపై నీళ్ళు చల్లుతూ అతను మాట్లాడిన మాటలు, అతనిలోని వాస్తవికతాదృష్టి నైశిత్యాన్ని పట్టి చూపుతాయి.

దక్షిణాదిన ఒక్క తుపాకుల ఫ్యాక్టరీ కూడా లేని సంగతి కానీ, అతి తక్కువ సంఖ్యలో ఇనప కర్మాగారాలు, ఊలు మిల్లులు, పత్తి కర్మాగారాలు, తోలు పరిశ్రమలు ఉన్న సంగతి కానీ మీకేమైనా తెలుసా? అని అడుగుతాడు. మనకు ఒక్క యుద్ధనౌక కూడా లేకపోవడాన్నీ యాంకీల నౌకాబలం వారం రోజుల్లో మన రేవుల్ని దిగ్బంధం చేయగలవన్న వాస్తవాన్నీ గుర్తించారా? అలాంటప్పుడు మన కాటన్‌ను విదేశాలకు ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తాడు. మీతో ఉన్న సమస్యల్లా లోకం చుట్టిన అనుభవం లేకపోవడమేనంటాడు. మీరు చూసిందల్లా, యూరప్, న్యూయార్క్, ఫిలడెల్ఫియాలనేననీ, అక్కడ కూడా మీరు దర్శించినది హోటల్స్, మ్యూజియమ్స్, బాల్‌రూమ్స్, కసీనోలను మాత్రమేననీ ఎద్దేవా చేస్తాడు. నా విషయానికి వస్తే, చాల్స్‌టన్‌లో పుట్టినా గత కొన్ని సంవత్సరాలపాటు ఉత్తరాదిన ఉన్నాననీ, మీరు చూడనివి ఎన్నో నేను చూశాననీ, పట్టెడు అన్నం కోసం, పిడికెడు డాలర్లకోసం యాంకీల తరపున యుద్ధం చేయడానికి వేలాదిమంది వలసదారులు సిద్ధంగా ఉన్నారనీ, మనకు లేని కర్మాగారాలు, బొగ్గు గనులు, నౌకా స్థావరాలు ఉన్న యాంకీలు నెల రోజుల్లో మనల్ని మట్టి కరిపిస్తారనీ అంటాడు. యుద్ధం సహా ఆయా ఆదర్శాల పొరలను ఒక్కొక్కటే విప్పి వాటి వెనుక ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపిస్తాడు. మరో సందర్భంలో యుద్ధం గురించి ఇలా అంటాడు:

అన్ని యుద్ధాలూ పవిత్రమైనవే. ఎవరికి? పోరాడేవారికి. యుద్ధాలను ప్రారంభించినవారు అవి పవిత్రమైనవని చెప్పకపోతే ఎవరు యుద్ధం చేస్తారు? యుద్ధం చేసే మూర్ఖులకు యుద్ధం గురించి వక్తలు ఎంత గొప్పగానైనా చెప్పనివ్వండి, యుద్ధాలకు ఎంత గొప్ప కారణాలనైనా ఆపాదించనివ్వండి- యుద్ధాలకు అసలు కారణం ఒకే ఒకటి, అది డబ్బు. అన్ని యుద్ధాలూ డబ్బు కోసం జరిగేవే. కొద్దిమందే ఆ నిజాన్ని గ్రహిస్తారు.

యుద్ధం ప్రారంభమై, తను ఇంతకుముందు చెప్పినట్టే యాంకీ సేనలు దక్షిణాది రేవులను దిగ్బంధం చేసినప్పుడు, గుప్తమార్గాలలో సరకు రప్పించి నిత్యావసరాలకోసం అల్లాడుతున్న దక్షిణాది జనానికి అమ్మి సొమ్ము చేసుకోడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. అంతేకాదు, ముందుచూపుతో భారీ ఎత్తున పత్తి కొనుగోలు చేసి దానిని వేరే చోట భద్రత కలిగిన గిడ్డంగులకు తరలించి, దొరకని పరిస్థితిలో దానిని అనూహ్యమైన ధరకు అమ్మి యుద్ధకాలంలో మరిన్ని కోట్లకు పడగెత్తుతాడు. స్కార్లెట్‌తో మాట్లాడుతూ యుద్ధానికీ ధనార్జనకూ ఉన్న ముడిని ఇలా సూత్రీకరిస్తాడు:

బాగా డబ్బు చేసుకునే సమయాలు రెండే. ఒకటి దేశాన్ని పునర్నిర్మించేటప్పుడు; రెండవది, దేశం విధ్వంసానికి లోనవుతున్నప్పుడు! పునర్నిర్మాణంలో డబ్బు మెల్లగా వస్తుంది, విధ్వంసంలో త్వరగా వస్తుంది.

ప్రపంచానుభవం అతని మాటలకు కటుత్వాన్ని, వ్యవహారశైలికి వాస్తవికతను మప్పడమే కాదు; జ్ఞానాన్ని పెంచి ఆలోచనలకు స్పష్టతనిస్తుంది. అలాగని అతను మానవీయ విలువలు, కోమలమైన స్పందనలూ లేనివాడు కాదు. మంచి-చెడులు కలగలసిన ఒక విలక్షణ మిశ్రమ స్వభావం అతనిది. అతనిలో ఆకర్షణ గొలిపేది అదే. మనిషి సహజప్రవృత్తి కూడా అదే. విలువల నుంచి జీవించడం కాక, జీవించడం నుంచి విలువలను సంతరించుకోవడం అతని జీవన గమనంలో కనిపిస్తుంది. జీవితేచ్ఛలో అతను ముమ్మూర్తులా స్కార్లెట్‌ను పోలినవాడే. తనలో ఉన్నట్టు జీవితాన్ని గెలుచుకోడానికి అవసరమైన తెగింపు ఆమెలోనూ ఉంది. ఆమెపట్ల అతని ప్రథమాకర్షణకు అదే మూలం. బార్బిక్యూ విందులో ఆష్‌లీ చెంప ఛెళ్లుమనిపించినప్పుడే ఆమె వ్యక్తిత్వం అతనిని ఆకర్షించింది. అంతేకాదు, స్కార్లెట్, ఆష్‌లీ వ్యక్తిత్వాల మధ్య ఉన్న అంతరమూ అర్థమయింది. ఆమె పట్ల అనురక్తికీ, ఆష్‌లీ పట్ల తిరస్కారానికీ అదే నాంది అయింది.

మళ్ళీ ఇద్దరిలోనూ వ్యత్యాసమూ ఉంది. జీవించడం అనే సహజాతం స్కార్లెట్‌లో అప్పుడే తవ్వి తీసిన ముడి బంగారమైతే, బట్లర్‌లో అది శుద్ధి చేసి మంచి పనితనంతో ఆకర్షణీయమైన నగగా మలచిన బంగారం. ఒక్కమాటలో చెప్పాలంటే, స్కార్లెట్‌లోని జీవితేచ్ఛ అనే సహజాతానికి తెలివి, లోకానుభవం, జ్ఞానం, వివేకం జోడిస్తే రెట్ బట్లర్ అవుతాడు. ఆవిధంగా స్కార్లెట్‌కు బట్లర్ ప్రవర్ధితరూపం.

ప్లాంటర్‌ల తరగతికి చెందిన ఇతర స్త్రీ, పురుషులు ఎందరిలోనో లేని ప్రగాఢ జీవితేచ్ఛను స్కార్లెట్‌లో చూసిన బట్లర్, దానికి అన్ని విధాలా దోహదం చేసే బాధ్యతను తీసుకుంటాడు. సాంప్రదాయికమైన కట్టుబాట్లను, నిషేధాలను తోసిరాజని తనకు ఇష్టమైన పద్ధతిలో జీవించేందుకు ప్రోత్సహిస్తాడు. నిత్యావసరాలకు కూడా కటకటలాడే యుద్ధం వంటి క్లిష్ట ఘట్టంలో కూడా తన సరదాలు తీర్చుకోడానికి వస్తురూపంలో సాయపడతాడు. యుద్ధమధ్యంలో ఆమె అట్లాంటా నుంచి టారాకు సాహసోపేతంగా ప్రయాణం కట్టినప్పుడు బండిని తనే ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత పునర్నిర్మాణఘట్టంలో ఆమెకు ఆర్థిక సాయం చేస్తాడు. గతించిపోతున్న వ్యవస్థ, దాని తాలూకు విలువల గురించి ఆమెలో మిగిలి ఉన్న భ్రమలను, అపోహలను వదలగొట్టే ప్రయత్నంలో గురువు పాత్ర నిర్వహిస్తాడు.

వితంతువును బతికి ఉండగానే సమాధి చేసే దక్షిణాది ఆచారం కన్నా, హిందువులు పాటించే సతిలోనే కాస్తయినా కనికరం ఉందని ఒకచోట అంటాడు. మధ్యయుగాలనాటి భూస్వామ్యానికి కాలం చెల్లినట్టుగా నీ దక్షిణాది జీవన విధానానికి కాలం చెల్లిందనీ, ఇంత కాలం కొనసాగడమే ఆశ్చర్యమనీ, అది పోవలసిందేననీ పోతోందనీ అంటాడు. స్కార్లెట్ తననుంచి సాయాలు పొందుతూనే, తనను తూలనాడుతూ ఆష్‌లీపై ప్రేమను ప్రకటించుకుంటున్నప్పుడు కూడా, ఆమెకు చేయి అందిస్తూ వచ్చిన బలమైన, స్థిరమైన వ్యక్తిత్వం అతనిది.

‘జీవించడం’ ఒక్కటే లక్ష్యంగా ముందుకు సాగడంలో స్కార్లెట్‌కు, అతనికి ఉన్న తేడా ఎలాంటిదంటే, ఆ ప్రయాణంలో ఎప్పుడు ఎక్కడ ఆగాలో కూడా అతనికి తెలుసు. ఆ వివేకం స్కార్లెట్‌కు లేదు. అంతవరకు యుద్ధాన్ని వ్యతిరేకించిన బట్లర్ ఒక దశలో యుద్ధంలో పాల్గొంటాడు. అందులో బందీగా చిక్కి తన పలుకుబడిని ఉపయోగించుకుని విడుదలవుతాడు. ‘తప్పా ఒప్పా అన్నది కేవలం అకడమిక్ ప్రశ్న. పలుకుబడిలోనే ఉంది అంతా‘ అని స్కార్లెట్‌తో అంటాడు. బందీగా చిక్కిన కాన్ఫెడరేట్ సైనికులు విధేయత ప్రకటిస్తే వారిని సరిహద్దుల్లో ఇండియన్‌లతో పోరాటానికి రిక్రూట్ చేసుకుంటామని, ఆ తర్వాత విడుదల చేస్తామని యూనియన్ ప్రతిపాదన చేసిందనీ ఆష్‌లీ అందుకు నిరాకరించాడనీ బట్లర్ చెప్పినప్పుడు, ఆష్‌లీ ఆ పనిచేసి బయటపడితే బాగుండేదనుకున్న స్కార్లెట్, ‘నువ్వైతే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పారిపోయిరావా?‘ అని అడుగుతుంది. ‘అఫ్ కోర్స్!‘ అని అతను సమాధానం చెబుతాడు. ‘మరి ఆష్‌లీ ఆ పని ఎందుకు చేయలేదు?‘ అని అడిగినప్పుడు, ‘అతను పెద్దమనిషి‘ అంటాడు. ఆ మాటలో అతను దట్టించిన తృణీకారాన్ని గమనించి స్కార్లెట్ విస్తుపోతుంది.

ఆష్‌లీ – బట్లర్‌ల దృక్పథాల మధ్య అంతరాన్ని వెల్లడించే ఇలాంటి సందర్భాలు, వ్యాఖ్యలు నవల పొడవునా కనిపిస్తాయి. స్కార్లెట్‌తో మాట్లాడేటప్పుడు ఆష్‌లీని విమర్శించడానికి, చులకన చేయడానికి దొరికే ప్రతి అవకాశాన్ని బట్లర్ వినియోగించుకుంటాడు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు, నవల మధ్యలో వచ్చే ఆష్‌లీ – స్కార్లెట్‌ల దీర్ఘసంభాషణ ఎలా కీలకమో; బట్లర్ – స్కార్లెట్ మధ్య రెండు సందర్భాలలో జరిగిన దీర్ఘసంభాషణ కూడా అలాగే కీలకం. మొదటిది, బట్లర్ గతంతోనూ, ఆష్‌లీతోనూ ముడిపడినది. రెండవది, కూతురు బానీతో (Bonnie) ముడిపడి, బట్లర్‌లో వచ్చిన పరివర్తన గురించి చెప్పేది.

ఆష్‌లీతో ముడిపడిన సంభాషణలో అతని పట్ల బట్లర్ వ్యతిరేకత, విమర్శ పతాకస్థాయిని అందుకుని ఇద్దరి ప్రాపంచికదృక్పథాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్పష్టంగా స్థాపిస్తాయి. ఆష్‌లీని అడుగడుగునా సమర్థించే స్కార్లెట్, నువ్వతనిని ఎందుకు ద్వేషిస్తావని అడుగుతుంది. ద్వేషించడం కాదు, అతని మీద జాలిపడతానంటూ, అది ‘చావవలసినవాడు చావకపోవడం వల్ల‘ కలిగే జాలి అంటాడు. తన ప్రపంచం గతించిన ఈ సమయంలో తనేం చేయాలో తెలియని, తెలుసుకోని అతన్ని ఏవగించుకుంటానంటాడు. ఇలాంటివారివి పరిష్కారం లేని సమస్యలు కనుక చావే వారికి పరిష్కారమని, ఆ చావుకు వారి కుటుంబాలు కొన్ని తరాలపాటు గర్విస్తాయనీ అంటాడు. ‘అతని ఇల్లు పోయింది, ప్లాంటేషన్ పన్నుల కింద పోయింది, ఇప్పుడు తన చేతులతోనూ, తెలివితోనూ అతను ఏమైనా చేయగలడా?’ అని ప్రశ్నిస్తాడు. అకర్మణ్యతకు ప్రతిరూపమైన ఆష్‌లీ పట్ల బట్లర్ నిరసన తీవ్రత ఇంకా ఎంతటిదంటే, స్కార్లెట్ తన నుంచి పొందిన ఆర్థికసాయంతో ఆష్‌లీని ఆదుకోవడాన్ని తప్పుపట్టి, నా సాయాన్ని నువ్విలా దుర్వినియోగంచేస్తే నేను సాయపడకపోగా ఏ బ్యాంకు నుంచీ నీకు అప్పు పుట్టకుండా చేస్తానని బెదిరిస్తాడు.

ఒకపక్క ఆష్‌లీపై తన బద్ధ వ్యతిరేకతను చాటుకుంటూ, తన దృష్టిలో ఎంతైనా అపాత్రుడైన అతనికి స్కార్లెట్ సాయపడడాన్ని గర్హిస్తూనే, ఇంకో పక్క అదే స్కార్లెట్‌పై, ఇంకా అలాంటి వారిపై బట్లర్ అపారగౌరవాన్ని, అభిమానాన్ని ప్రకటించుకుంటాడు. ఇది అతని వ్యక్తిత్వపు లోతును, ప్రాపంచిక దృక్పథాన్ని వెల్లడిస్తుంది. నువ్వు మంచిమనిషి వనుకుంటున్నాననీ, అంత డబ్బూ పలుకుబడీ ఉన్న నువ్వు, చితికిపోయిన తననూ ఆష్‌లీనీ ఎలా ఆడిపోసుకుంటున్నావనీ స్కార్లెట్ అన్నప్పుడు, బట్లర్ అంటాడు:

నిన్ను అతని తరగతిలోకి చేర్చుకోకు. నువ్వు చితికిపోలేదు. నిన్ను చితికిపోయేలా చేయగల శక్తి దేనికీ లేదు. చితికిపోయింది అతను. తను బతికి ఉన్నంత కాలం ఒక శక్తిమంతుడు ఎవరైనా అతని వెనక ఉండి నడిపిస్తూ, సంరక్షిస్తూ ఉండకపోతే అతను ఉన్న చోటే ఉంటాడు. ఇలాంటి మనిషికోసం నా డబ్బు ఖర్చుపెట్టడానికి ఎంతమాత్రం ఇష్టపడను.

తమ కాళ్ళ మీద తాము నిలబడే వ్యక్తులకు సాయపడడంలో మజా ఉంది. ఆ ఇల్లాలు మేరీవెదర్‌కు (Mrs. Merriweather) నోటు కూడా లేకుండా వెయ్యి డాలర్లు అప్పు ఇచ్చాను. ఒక బుట్టతో కేకుల అమ్మకం ప్రారంభించింది. ఇప్పుడామెను చూడు, అరడజను మంది పనివాళ్లతో బేకరీ నడుపుతోంది. ఆ ముసలాయన సంతోషంగా డెలివరీ వేగన్ నడుపుకుంటున్నాడు. పనీ పాటా లేకుండా గడిపే ఆ కుర్రాళ్ళు క్రియోల్ (Creole), రెనే(Rene) ఇప్పుడు ఎంతో ఇష్టంగా ఒళ్ళొంచి పనిచేస్తున్నారు. పాపం ఆ టామీ వెల్‌బర్న్(Tommy Wellburn) సగం మనిషి శరీరంతో ఇద్దరు మనుషులు చేసేపని చేస్తున్నాడు.

సాయం పొందే అర్హత ఉన్నది ఇలాంటి వాళ్ళకు. కానీ, ఆష్‌లీ విల్క్స్? ఓహ్! తలకిందులైన నేటి మన ప్రపంచంలో ఈ బాపతు జనం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు, వీరికి ఏ విలువా లేదు.

ఆష్‌లీ గురించి బట్లర్ అన్న పై మాటలు వేయిపడగలులోని ధర్మారావుకూ అతికినట్టు సరిపోతాయి. అతని ఆస్తీ తండ్రి హయాంలోనే హరించుకుపోయింది. ఉద్యోగానికి అర్హమైన ఇంగ్లీష్ చదువు చదివాడు కాని, గట్టిగా ఉద్యోగం కోసం ప్రయత్నించడు. వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోడు. సుబ్బన్నపేటను విడిచి బయటకు వెళ్లడానికే ఇష్టపడడు. ‘తను బతికి ఉన్నంత కాలం ఒక శక్తిమంతుడు ఎవరైనా అతని వెనక ఉండి నడిపిస్తూ, సంరక్షిస్తూ ఉండకపోతే అతను ఉన్నచోటే ఉంటాడు’ అని ఆష్‌లీ గురించి అన్నమాటలు ధర్మారావుకూ ఎంత తూచినట్టు అన్వయిస్తాయంటే, చదువుకోడానికి డబ్బు, కుటుంబం గడవడానికి సంభారాలు సమకూర్చే జమీందారీ అనే శక్తిమంతమైన వ్యవస్థ అతని వెనుక ఉంటుంది. అయినా సరే, అతను ఉన్నచోటే ఉండిపోవడం పై వాక్యానికి చిన్న అపవాదం.

పైన ఉదహరించిన మాటలకు కొనసాగింపుగా బట్లర్ అన్న కింది మాటలు సంభాషణను హఠాత్తుగా మరింత ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టి, బట్లర్ ముఖంగా ప్రపంచపరిణామస్వభావాన్ని గొప్ప తాత్విక స్ఫురణతో బోధిస్తాయి. అందులో ఉండే ప్రాకృతిక న్యాయాన్ని ఉద్ఘాటిస్తాయి. ఉత్థాన పతనాలతో కూడిన ప్రపంచచరిత్రను మన కళ్ళముందు నిలుపుతూనే, పడిపోయిన ప్రతిసారీ కొత్త జవసత్వాలలో తిరిగి పైకి లేచేందుకు తోడ్పడే మనిషిలోని అంతులేని జీవనేచ్ఛను, అందుకు అవసరమైన పూనికను ఆకాశమంత ఎత్తులో ప్రదర్శిస్తాయి. కొత్త ప్రపంచం పాత ప్రపంచంలా ఉండదు, నిజమే. పాత ప్రపంచానికి చెందిన వ్యవస్థలూ విలువలూ కొన్ని అంతరించే మాట కూడా నిజమే. కానీ అదే సమయంలో ఆ శూన్యాన్ని పూరించే కొత్త వ్యవస్థలూ విలువలూ పాదుకుంటాయి. మనిషి మనుగడలో కాలపరీక్షలో నెగ్గి పరిణామ ప్రచండత్వాన్ని తట్టుకుని నిలబడగల విలువలూ కొన్ని ఉంటాయి. అవి పాత కొత్తల తేడా లేకుండా మనిషి వెన్నంటి వస్తూనే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, కాలం అనే గానుగలో ఆడే మనిషి జీవితం నుంచి నిరంతరం విలువల కొత్తమిశ్రమం రూపొందుతూనే ఉంటుంది. ఈ అవగాహన కలిగినప్పుడు మార్పుతో సమాధానపడడం, దానిని జీర్ణించుకోవడం, జీవితానికి అనుకూలంగా అన్వయించుకోవడం తప్ప దానితో విరోధించడం, పరాజితులుగా మిగిలి జీవనక్షేత్రంనుంచే తప్పుకోవడం అనేది ఉండదు.

బట్లర్ అంటాడు:

ప్రపంచం ఇలా తలకిందులైన ప్రతిసారీ మొదట నశించిపోయేది అతని (ఆష్‌లీ) బాపతు జనాలే. ఎందుకు నశించరు? వారికి బతికి బట్టకట్టే అర్హత ఎందుకు లేదంటే, వాళ్ళు పోరాడరు. ఎలా పోరాడాలో కూడా వాళ్ళకు తెలియదు. ప్రపంచం తలకిందులవడం ఇదే మొదటిసారీ కాదు, ఇదే చివరిసారీ కాబోదు. గతంలోనూ జరిగింది, రేపు మళ్ళీ జరుగుతుంది. జరిగిన ప్రతిసారీ ప్రతి ఒకరూ సర్వస్వం కోల్పోయి ప్రతి ఒకరూ సమానులవుతారు. ఆ శూన్యస్థితినుంచే అంతటినీ తిరిగి ప్రారంభిస్తారు. తెలివి, చేతుల్లో శక్తి తప్ప ఏమీలేని స్థితి అది. కానీ ఆష్‌లీ లాంటివారికి ఆ తెలివీ ఉండదు, ఆ శక్తీ ఉండదు; ఉన్నా వాటిని ఉపయోగించగల స్థైర్యం ఉండదు. కనుక అణగారిపోతారు, అణగారిపోవలసిందే. అది ప్రాకృతిక న్యాయం. వారు లేనప్పుడు ప్రపంచం మరింత మెరుగ్గా ఉంటుంది. మహాకల్లోలాన్ని అజేయంగా దాటగల గట్టిపిండాలు కొందరు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ప్రపంచం తిరగబడకముందు తాము ఉన్న స్థితిని అనతికాలంలోనే వాళ్ళు తిరిగి అందుకుంటారు.

ప్రపంచం తిరగబడిన ప్రతిసారీ ప్రతి ఒకరూ సమానులవడం, కల్లోలాన్ని అజేయంగా దాటగల కొందరు గట్టిపిండాలు తిరిగి తమ వెనకటి జీవితాన్ని గెలుచుకుంటారనడం ఇక్కడ ప్రత్యేకించి గమనించవలసిన సూత్రీకరణలు. ఆష్‌లీ, బట్లర్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెల్లడించే ఈ సూత్రీకరణలు వేయిపడగల లోని ధర్మారావుకూ యథాతథంగా వర్తిస్తాయి. లౌకికానికి పరిమితమై చెబితే, ఆష్‌లీకి ఉన్నట్టే ధర్మారావుకు కూడా గతం మీద, గతించిపోతున్న వ్యవస్థ మీద, దానికి సంబంధించిన అన్నింటి మీదా కాల్పనిక వ్యామోహము, ఆరాధన, తపనా ఉంటాయి. అతను కూడా ఆష్‌లీలానే నిష్క్రియాపరుడిగా, నిర్వేదిగా మిగిలిపోతాడు. మార్పు రూపంలో వచ్చిపడిన విపత్తును తట్టుకుని జీవితాన్ని గెలుచుకుని తాము కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకునే పోరాటపటిమే కాదు సరికదా, మార్పు అనే ప్రాకృతిక న్యాయం పట్ల పైన బట్లర్‌లో వ్యక్తమైన అవగాహన ఈ ఇద్దరిలోనూ కనిపించదు.

ప్రపంచం తలకిందులైన ప్రతిసారీ ప్రతి ఒకరూ సమానులవుతారనడం కూడా ప్రాకృతిక న్యాయంగా పరిగణించదగిన సూత్రీకరణే. చారిత్రక దృక్కోణం నుంచి చూస్తే యుద్ధాలు, పెద్ద ఎత్తున ప్రకృతి ఉత్పాతాలు సంభవించి సామాజిక వ్యవస్థలు తలకిందులైన ప్రతిసారీ అందరూ సమానులవడం, అంతకు ముందు అన్నివిధాలుగా శిష్టులనిపించుకున్నవారు సామాన్యత్వంలోకి జారిపోవడం, అంతవరకు సామాన్యులుగా ఉన్నవారు కొత్త శిష్టవర్గంగా అవతరించడం ఎప్పుడూ జరుగుతూనే వచ్చింది. మన మహాభారతం మొత్తాన్నే ఈ కోణం నుంచి వ్యాఖ్యానించడానికి కావలసినంత అవకాశముంది. అదలా ఉంచితే, ఆష్‌లీ, ధర్మారావుల మధ్య ఇక్కడ అచ్చుగుద్దినట్టు కనిపించే మరో పోలిక ఏమిటంటే, ఇద్దరికీ ‘అందరినీ సమానుల్ని’ చేసే పరిణామస్వభావం పట్ల సానుకూల అవగాహన లేదు, సామాన్యవర్గాల పట్ల సానుభూతి, గుర్తింపు లేవు. అంతవరకూ తన ప్లాంటేషన్ తరగతికి చెందిన జనం మధ్య, అది కూడా తను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కొద్దిమంది మిత్రులతో తనదైన భావనాత్మక ప్రపంచంలో జీవించిన ఆష్‌లీ, యుద్ధం వల్ల తనతో ఎలాంటి సారూప్యత లేని మనుషుల మధ్య గడపవలసి వచ్చినందుకు బాధపడతాడు. ధర్మారావులోనూ అడుగడుగునా శిష్టత-సామాన్యతల వివేచన వ్యక్తమవుతూనే ఉంటుంది. మారిన పరిస్థితులలో ఏదో విధంగా నిలదొక్కుకుని జీవించే వ్యక్తుల గురించిన సానుకూల చింతన కానీ చర్చ కానీ వేయిపడగలులో ఎక్కడా కనిపించదు. డబ్బు వ్యామోహంతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత పశ్చాత్తాపంతో ఆధ్యాత్మికతలోకి మళ్లిన మంగమ్మ అనే గృహిణికి ఆ మార్గంలో ముందుకు వెళ్లడానికి ధర్మారావు దోహదపడతాడు కానీ, అది రహస్యంగా జరుగుతుంది. పదిమందిలో ఆమెతో మాట్లాడడానికీ, చివరికి ఆమెను కన్నెత్తి చూడడానికి కూడా అతనికి తన శిష్టత్వం అడ్డువస్తుంది.

కొందరు గట్టిపిండాలు కల్లోలాన్ని దాటి నిలదొక్కుకుని తిరిగి తమ వెనకటి స్థితిని అందుకుంటారన్న బట్లర్ సూత్రీకరణ మరింత ముఖ్యమైన సూత్రీకరణ. తమ వెనకటి స్థితిని అన్నప్పుడు అందులో వారి భౌతిక జీవనస్థితి మాత్రమే కాక; అప్పటివారు నమ్మిన విలువలు, ఆదర్శాలు, అందమైన కాల్పనిక ఊహాప్రపంచం సహా భావనాత్మక జీవనం కూడా భాగమై ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు కాలపరీక్షకు నిలిచిన ఏ మానవీయ విలువ కూడా శాశ్వతంగా అంతరించిపోవడం ఉండదు. కాకపోతే కొత్త విలువలు వాటికి జతపడి, పాత-కొత్తల మధ్య ఒక సమాధానం, సమన్వయం రూపొందుతాయి. మారిన పరిస్థితుల ముందు జడీభూతునిగా మారి అకర్మణ్యతలోకి జారిపోవడం తప్ప తమ పాతజీవితంలోని మన్నికైన పార్శ్వాలను తిరిగి గెలుచుకోవాలన్న పూనిక ఆష్‌లీలో లేదు, అలాగే వేయిపడగలులో చిత్రితమైన లౌకిక జీవితం మేరకు ధర్మారావులోనూ లేదు. పై రెండు సూత్రీకరణల ద్వారా బట్లర్ వీరిద్దరిలో లేనిది ఎత్తిచూపుతూ అలాంటివారికి గురుత్వం వహిస్తున్నాడు.

మళ్ళీ ఇక్కడ కూడా మహాభారతంతో చిత్రమైన పోలిక. ఎలాగంటే, యుద్ధసమయంలో అకర్మణ్యత ఆవహించిన అర్జునుడికి కర్మను బోధించడం ద్వారా కృష్ణుడు చేసిన గీతోపదేశానికి; పైన చెప్పిన బట్లర్ ఉపదేశం భిన్నమైనదీ కాదు, తక్కువైనదీ కాదు. యుద్ధం చేయడం కృష్ణుడు బోధించిన ‘నరు’ని (అర్జునుని) స్వధర్మమైతే, ప్రపంచం తలకిందులైనప్పుడు లేచి నిలబడి నిలదొక్కుకుని తిరిగి జీవితాన్ని గెలుచుకోవడం కోసం యుద్ధం చేయడం బట్లర్ బోధించిన నరుని స్వధర్మం. యుద్ధానికి ప్రేరణ కలిగించడంలో అర్జునునికి కృష్ణుడు గురువు, యుద్ధంలో సారథి అయినట్టే, జీవించడం కోసం యుద్ధం చేయడంలో స్కార్లెట్‌కు బట్లర్ ప్రత్యక్షంగానే గురువు, సారథి అవుతాడు.

బట్లర్ అన్న ఈ కింది మాటలు కూడా కృష్ణునితో అతని పోలికను మరింత ముందుకు తీసుకెడుతున్నాయి:

నాగరికత విధ్వంసంలో మేము ఒక అవకాశాన్ని చూశాం. కొంత నిజాయితీతో, కొంత వంచనతో ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. ఇప్పటికీ వినియోగించుకుంటున్నాం. ఈ ప్రపంచంలోని ఆష్‌లీ లాంటివాళ్లకూ అవే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాళ్ళు వాటిని అందుకోరు. అందుకునే తెలివి వారికి లేదు. ఆ తెలివి ఉన్నవాళ్లకే జీవించే అర్హత ఉంది.

మహాభారతయుద్ధంలో కృష్ణుడు నిర్వహించిన పాత్రలోనూ వంచన ఉన్న సంగతి తెలిసినదే. అదలా ఉంచితే, స్కార్లెట్‌లో ఆష్‌లీ వ్యక్తిత్వంపట్ల ప్రశంసాభావన, బట్లర్ పట్ల ఈసడింపు ఇప్పటికి కొంత కదలబారి ఉండవచ్చు కానీ, పూర్తిగా తొలగలేదు. కార్పెట్ బ్యాగర్స్ (Carpetbaggers: అంతర్యుద్ధం తర్వాత దక్షిణాదిన ఉన్న అస్థిర పరిస్థితులను అవకాశంగా తీసుకుని సొమ్ము చేసుకోడానికి ఉత్తరాది నుంచి వచ్చిన ‘చిల్లర జనాన్ని’ సూచించే నిందార్థకం), స్కాలీవాగ్స్ (Scallywags: అంతర్యుద్ధం తర్వాత పునర్నిర్మాణ ఘట్టంలో ఉత్తరాది రిపబ్లికన్‌లతో కుమ్మక్కయిన దక్షిణాది తెల్లవారిని సూచించే నిందార్థకం), యాంకీల (Yankee: ఉత్తరాది జనాన్ని ఉద్దేశించి దక్షిణాదివారు ఉపయోగించే పదం. Dixie అని ఉత్తరాదివారు దక్షిణాదిని అంటారు.) సహవాసంలో డబ్బు సంపాదించిన నీలా ఆష్‌లీ చేతులను మురికి చేసుకోలేదనీ అతను నీతిమంతుడనీ మర్యాదస్తుడనీ బట్లర్‌తో అంటుంది.

అప్పుడు బట్లర్ గురిచూసి విసిరిన ఒక వ్యాఖ్య ఆమె అంత గొప్పగా భావించే ఆష్‌లీ వ్యక్తిత్వంలోని ఒక వెలితిని ఎత్తి చూపి ఆమెను దాదాపు నిరుత్తరను చేస్తుంది. ‘ఒక ఆడదాని సాయమూ డబ్బూ తీసుకోనంత నీతిమంతుడూ మర్యాదస్తుడూ మాత్రం కాడని‘ బట్లర్ అంటాడు. విచిత్రంగా ఇక్కడా ఆష్‌లీతో ధర్మారావుకు పోలిక. తండ్రి రామేశ్వరశాస్త్రి భోగపత్ని రంగాజమ్మ ధర్మారావు శోభనానికి, అతనికి తెలియకుండా సెట్టి చేత వందరూపాయలు ఇప్పిస్తుంది. రాణి అతని చదువుకయ్యే ఖర్చు భరిస్తుంది.

బట్లర్ బోధతో ఆలోచనలో పడిన స్కార్లెట్‌కు, తనను పరాజితుడిగా ప్రకటించుకుంటూ ఆష్‌లీ టారాలో ఉన్నప్పుడు తనతో అన్న మాటలు చటుక్కున గుర్తొస్తాయి. బట్లర్‌తో అన్నప్పుడు ఆ మాటలు అతనికి ఆసక్తిని కలిగిస్తాయి. ‘(ఇలాంటివారు) తమను మోహపెట్టే గతాన్ని ఎక్కడ కోల్పోయారో అక్కడే జీవితాంతం పరిభ్రమిస్తూ ఉంటారు. కేవలం (గతవైభవ స్మరణ కలిగించే) గర్వభావనలోనూ, అసమర్థ మౌనంలోనూ మగ్గిపోతూ ఉంటారు. అయితే, అతనికి (ఆష్‌లీకి) అర్థమైంది, తను పరాజితుడినన్న సంగతి తెలిసింది‘ అంటాడు. ఇందులోని మొదటి రెండు వాక్యాలూ ధర్మారావుకూ యథాతథంగా వర్తిస్తాయి. అతను కూడా తనను మోహపెట్టే గతాన్ని కోల్పోయిన చోటే జీవితాంతం పరిభ్రమిస్తూ ఉండిపోయాడు. అది సుబ్బన్నపేటే కావచ్చు, లేదా నవలలో అది ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థ, భావజాలమూ కావచ్చు. (గతవైభవ స్మరణ కలిగించే) గర్వభావనలోనూ, అసమర్థ మౌనంలోనూ, లేదా నిర్లిప్తతలోనూ మగ్గిపోవడమూ సమానమే. అయితే, ఆష్‌లీకి కలిగినట్టు తను పరాజితుడినన్న గ్రహింపు ధర్మారావుకు కలిగిందా అంటే కలిగిందని చెప్పలేం. కారణం, మొదటే చెప్పినట్టు ఆష్‌లీకి ఉన్నట్టు అతనికి యుద్ధాన్ని చూసిన అనుభవం లేకపోవడం.

‘పడవ మునిగిపోతున్నప్పుడు పరువు, మర్యాద, సత్యనిష్ఠ, శీలసంపద, దయాగుణం ముఖ్యం కావ‘ని ఈ సంభాషణాక్రమంలో ఉద్ఘాటించిన ఇదే బట్లర్, యుద్ధానంతర పరిస్థితులలో ఇందుకు భిన్నమైన ఆలోచనాసరళి వైపు మళ్లడం విశేషం. అంతవరకూ తను ఏ దక్షిణాది ప్లాంటర్‌ల సమాజం తాలూకు విలువలను, ఆదర్శాలను, కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడో ఇప్పుడు వాటిలో అతనికి మంచి కనిపిస్తుంది. డబ్బే సర్వస్వం కాదన్న గ్రహింపూ కలుగుతుంది. స్కార్లెట్‌లో ఆ గ్రహింపు కలగకపోవడాన్ని తప్పుపడతాడు కూడా. ఈ మేరకు స్కార్లెట్‌తో అతని దీర్ఘసంభాషణ కూడా నవలలో కీలకమైనది.

అతనిలో ఈమార్పుకు ప్రధాన కారణం కూతురు బానీ. డబ్బు సంపాదనలో అంతవరకూ ఊపిరి సలపని జీవితం గడిపిన అతనికి ఇక స్థిమితపడి జీవితానికి కొత్త ధ్యేయాన్ని కల్పించుకునే వయసు వచ్చిందనిపిస్తుంది. తనకిప్పుడు నలభై అయిదేళ్లని స్కార్లెట్‌తో అంటూ, ఆ వయసు వచ్చాక నీకూ ఆ గ్రహింపు కలగవచ్చునంటాడు. అతనికి కూతురుపై ఎంత మమకారమంటే, డబ్బుతో సహా అతని అన్ని యావలూ ఆ మమకారం ముందు మబ్బు తునకల్లా మాయమైపోతాయి. కూతురితో అతని బంధం తల్లీ-కూతుళ్లను మించి, తండ్రీ-కూతుళ్ల బంధం. పసివయసు నుంచీ కూతురు అతని దగ్గరే పడుకుంటుంది. కూతురును అన్నివిధాలా విశిష్టంగా తీర్చిదిద్దాలని అతను కలలుకంటాడు. చిన్నవయసులోనే గుర్రపుస్వారీ కూడా నేర్పడానికి పూనుకుంటాడు. బానీ చిన్న రాకుమారి అవుతుందని, ప్రపంచమంతా తనను నెత్తిన పెట్టుకుంటుందని, ఆమె వెళ్లలేని చోటు ఏదీ ఉండదని, ఈ చిల్లర జనాల మధ్య తను పెరగదని స్కార్లెట్‌తో అంటాడు. రేపు తను పెళ్లాడబోయేది కూడా ఈ చెత్తజనాల నుంచి కాదని, తనలో బట్లర్ రక్తం ప్రవహిస్తోందనీ అంటాడు. ‘నీకు ఈ జనాలంటే ఇష్టమే కదా’ అని స్కార్లెట్ అన్నప్పుడు, ‘నీకూ ఇష్టమే, కానీ బానీకి కాదం’టాడు. తన తప్పూ ఉందని, దేనినీ లక్ష్యపెట్టలేదని, ఏదీ ముఖ్యంగా తోచలేదని, ఇప్పుడు బానీయే తన సర్వస్వంగా మారిందని, ఇంతకాలం ఎంత మూర్ఖంగా వ్యవహరించానా అని అనిపిస్తోందనీ అంటాడు.

యుద్ధానంతరం అట్లాంటా సమాజంలో వచ్చిన పరివర్తన, కూతురిపై వల్లమాలిన ఆపేక్ష అతని ఆలోచనల్లో ఈ మార్పు తీసుకొస్తాయి. అంతవరకూ ఉన్న సాంప్రదాయిక సమాజం, దానిని అంటిపెట్టుకుని ఉన్న మానవ సంబంధాలు యుద్ధానంతరం క్షీణిస్తాయి. బలమైన సాంప్రదాయిక నేపథ్యం, లోతైన వ్యక్తిత్వమూ లేని జనం నడమంత్రపుసిరితో పైపైకి వచ్చారు. ఆ జనం, వారి జీవనసరళుల వెల్లువలో పాత సమాజం కొట్టుకుపోయి అక్కడక్కడ పైకి తేలిన తిప్పలా మిగిలింది. తాము కూడా తమదైన పాతసమాజానికి దూరమై కొత్తనీటిలో కొట్టుకుపోతున్న సంగతిని స్కార్లెట్, బట్లర్‌లు గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే, ఐశ్వర్యపు తళుకు బెళుకుల మధ్య విందు వినోదాలతో కాలాన్ని దొర్లించే ఈ జీవనవిధానమే బాగుందని స్కార్లెట్ అనుకుంటుంది కానీ బట్లర్ అనుకోలేకపోతాడు. చాల్స్‌టన్, అట్లాంటాలలోని తమదైన సాంప్రదాయిక సమాజానికి వెలిగా తాము జీవించవలసిరావడం అతనిని బాధిస్తుంది. కూతురి విషయంలో జాగ్రత్తపడాలనుకుంటాడు. ప్రపంచమంతా ఆమెను కోరుకుంటుందని, ఆమె వెళ్లలేని చోటు ఏదీ ఉండదనీ అతను అనడంలో వ్యక్తమవుతున్నది; సాంప్రదాయిక సమాజానికీ, దానితో అల్లుకున్న మానవసంబంధాలకూ తమలా కూతురు వెలి కాకూడదన్న తపనే. ‘చాల్స్‌టన్‌లో తనను దగ్గరకు తీసేవాళ్ళు ఎవరూ లేరు, త్వరగా మేలుకోకపోతే అట్లాంటాలో కూడా అదే జరుగుతుంది.’ అంటాడు.

‘నువ్వు దీనిని ఇంత తీవ్రంగా తీసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. అంత డబ్బు ఉండి కూడా…‘ అని స్కార్లెట్ అన్నప్పుడు, ‘దిక్కుమాలిన డబ్బు! నేను బానీకి ఏది కావాలని కోరుకుంటున్నానో దానిని నీ డబ్బు కొనలేదు. బానీ రిపబ్లికన్ ప్రారంభోత్సవ నృత్యంలో నాట్యకత్తె కావడంకన్నా పికార్డ్ (Picard) ఇంట్లో ఎండు రొట్టె తినడానికి వెళ్ళినా, మిసెస్ ఎల్సింగ్ పూరిగుడిసెకు వెళ్ళినా నాకు సంతోషమే. నీ పిల్లలకు నువ్వు సమాజంలో తగిన స్థానం ఎప్పుడో కల్పించి ఉండాల్సింది. ఆ పని చేయలేదు. నీకున్న స్థానాన్ని నిలబెట్టుకోడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు ఇంత ఆలస్యంగా నీ నడక మార్చుకుంటావనీ ఆశించడమూ వ్యర్థమే. ఎంతసేపూ నీకు డబ్బు యావే,’ అంటాడు.

తన కలల రాశిగా తన జీవితానికి ఏకైక ఆశాకిరణంగా కనిపించిన కూతురు చివరికి దక్కలేదు. గుర్రపు స్వారీ శిక్షణలో దుర్మరణం పాలైంది. అది అతనికి ఊహించని తీవ్ర ఆఘాతం!

అంతవరకూ ఆష్‌లీని ఆడిపోసుకుంటూ వచ్చిన అతను, ఇప్పుడు అచ్చంగా ఆష్‌లీలానే మాట్లాడడాన్ని ఎత్తిచూపి దెప్పడానికి ఒక అవకాశాన్ని మాత్రమే అతని మాటల్లో స్కార్లెట్ చూడగలిగింది. అది ఆమె ఆలోచనాస్థాయి. స్థూలంగా, అవునని ఒప్పుకునే నిజాయితీ బట్లర్‌లో ఉంది. అయితే, ఈ దశలో కూడా ఆష్‌లీ పట్ల అతని వైఖరి మారిందా అంటే మారలేదు. కాకపోతే అతనిపై విమర్శలో కటుత్వం తగ్గి ఉండచ్చు. ‘అతనిని ఉన్నవాడిని ఉన్నట్టు, తిన్నగా చూడు. తనకు చెందని ప్రపంచంలో ఇరుక్కుపోయి, గతించిపోయిన తన ప్రపంచం తాలూకు నియమనిబంధనల ప్రకారం ఉన్నంతలో ఉత్తమంగా జీవించడానికి ప్రయత్నిస్తున్న పెద్దమనిషి మాత్రమే‘ నంటాడు.

తన ప్రారంభ జీవితంలో జీవించడానికి ఏ విలువలైతే అడ్డుపడుతున్నాయని భావించి తను నిరాకరించాడో, అనంతర దశలో ఆ విలువలలోని కొన్నింటి వైపైనా అతను ఇలా మళ్లడాన్ని చూపించి స్కార్లెట్లానే ఎవరైనా దెప్పడానికి ప్రయత్నించినా, అతనికి అపరాధభావనను, పశ్చాత్తాపాన్నీ ఆపాదించినా తొందరపాటు అవుతుంది. అతను ఆష్‌లీలా ఒడ్డున ఉండిపోలేదు. మార్పు అనే ప్రవాహంలో కలసిపోయి ప్రవహించాడు. ఆ ప్రవాహంలో తనకు దొరికిన రాళ్ళను, రత్నాలనూ స్వయంగా పరీక్షించి వాటి విలువల నిగ్గు తేల్చుకున్నాడు. తన కళ్ళతో ప్రపంచాన్ని చూశాడు. తన బుద్ధితో అర్థంచేసుకున్నాడు. స్వీయానుభవాల నిచ్చెన మీద ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకి వెళ్ళిన క్రమంలో, మొదటి మెట్టు మీద తను దేనినైతే నిరాకరించాడో చివరిమెట్టు మీద అదే ప్రత్యక్షమై ఉండచ్చు. అంతమాత్రాన మెట్లు ఎక్కడంలో తను పడిన ప్రయాస వ్యర్థమన్న భావన అతనికి లేదు. అతనిలో అపరాధభావన లేదు, పశ్చాత్తాపం లేదు. ఉండవలసిన అవసరంలేదు. చివరి మెట్టు మీద తనకు ప్రత్యక్షమైన దానిని సహజంగాను, వయసు తీసుకొచ్చే మార్పుగానూ తీసుకున్నాడు. కాలంలో ఘనీభవించిపోయిన ప్లాంటర్‌ల ఇరుకు ప్రపంచం నుంచి విశాలప్రపంచంలోకి అడుగుపెట్టడం ద్వారా, యుద్ధం కల్పించిన అవకాశాలను అందుకోవడం ద్వారా తాను కోల్పోయిన గతం తాలూకు మంచిని తన కూతురికి అందించాలనుకున్నాడు. గతాన్ని, దానికి సంబంధించిన విలువలనూ కేవలం గుడ్డిగా ఆరాధిస్తూ, జీవించడమే మానేసి, అకర్మణ్యతలోకి జారిపోయి, పరాజితులుగా ఒడ్డున ఉండిపోయిన వారికి భిన్నంగా అతను తన జీవితాన్నే ప్రయోగశాలగా మార్చుకుని దానినుంచి సొంత ముద్ర కలిగిన విలువలను రాబట్టుకున్నాడు. విలువలనుంచి జీవించడం కాక, జీవించడం నుంచి విలువలను పిండుకున్నాడు. ఈ విలువలకు ఉన్న విలువ యాంత్రికంగా వల్లించే విలువలకు ఉండదు. అదీగాక, అతను రాబట్టుకున్న ఆ విలువలు పూర్తిగా గతానికి చెందిన విలువల వంటివి కావు. పాత జీవితానికి, కొత్త జీవితానికి మధ్య రాపిడి నుంచి, రెండు జీవితాల వారసత్వాన్ని సంతరించుకుంటూ పుట్టిన సంకీర్ణ విలువలు!

నిజానికి బట్లర్ మళ్ళింది ఆష్‌లీ భావజాలం వైపు కాదు, ఆష్‌లీ కంటే నిండైన, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగి, అతనిలో భాగమవుతూనే అతనిని దాటి ప్రవహించిన మెలనీ వైపు! ఒక కోణం నుంచి చూస్తే నవల మొత్తంలో కీలకమనిపించే పాత్రలు బట్లర్, మెలనీలే. ఇద్దరూ పాత, కొత్తల మేలు కలయికలు, పరస్పర పూరకాలు. మొత్తం పాత్రలన్నింటిలో బట్లర్ నుంచి సంపూర్ణ గౌరవాన్నీ అభిమానాన్నీ ఆర్ద్రతనూ అందుకున్నది మెలనీ ఒక్కతే.
(3వ భాగం)
---------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం, 
ఈమాట సౌజన్యంతో