Showing posts with label చ్యుతాక్షర. Show all posts
Showing posts with label చ్యుతాక్షర. Show all posts

Sunday, July 17, 2016

చెలులం జర్చింపగా పాడియే?


చెలులం జర్చింపగా పాడియే?


సాహితీమిత్రులారా!


చమత్కారమంజరిలో
నాయకుని దగ్గర ఉన్న యువతులను వర్ణించు
సందర్భములోనిది ఈ పద్యం.
దీనిలోని ప్రత్యేకతను గమనించండి.

బిగువుం జన్నులు గాంచి మాను నల జంబీరంబు బీరంబు! క్రొం
జిగి మోముం గని సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు! విం
తగు భ్రూరేఖలు గాంచి భీతినిడు కోదండంబు దండంబు!
జ్జగతీనాథుని మ్రోలనున్న చెలులం జర్చింపగా పాడియే?
                                                                    (చమత్కారమంజరి - 2-43)

దీనిలో జంబీరము - బీరము
           రాజీవము - జీవము
           కోదండము - దండము
పదాలను గమనించిన మొదటి పదాలలోని మొదటి అక్షరం లోపించి
రెండవపదం వస్తూన్నది. దీన్నే చ్యుతాక్షర చిత్రం అంటాము.

ఆ యువతుల బిగువు చన్నులను చూచి
జంబీరము(గజనిమ్మ) బీరములాడుట మానినదట.
క్రొత్తకాంతితో వెలిగే మోమును చూచి
రాజీవము(పద్మము) జీవములేనిదయిందట.
భ్రూరేఖలు చూచి కోదండము (ధనుస్సు) దండము(నమస్కారము) పెట్టినదట.
రాజు దగ్గరున్నవారిని గురించి చర్చించడం ధర్మమే? (ధర్మంకాదని) - అని భావం.

Thursday, June 30, 2016

లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:


లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:


సాహితీమిత్రులారా!

చిత్రమీమాంసలోని ఈ శ్లోకం చూడండి.
ఇది చ్యుతాక్షర చిత్రానికి ఉదాహరణగా ఇవ్వబడినది.

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:

ఇందులో సీతా రావణ సంవాదం ఉంది.

రావణుడు -  భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
                   స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
                   ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
(అరటిస్తంభాల వంటి ఊరువులు గల
ఓ సీతా! ఇపుడు దేవతల ముఖాలు వాడిపోతాయి.
లక్ష్మణసహితుడైన ఆ రాముడు యుద్ధంలో నా ఎదుట నిలబడలేడు.
ఇప్పుడీ వానరసేన గొప్ప ఆపద పొందగలదు.)
సీత - లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:
     (ఓ నీచుడా దీనినే ఏడవ అక్షరం తొలగించి మళ్ళీ చదువు)
మూడు పాదాలలోని ఏడవ అక్షరాలు తీసివేయగా

మొదటి పాదం (భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా)లో -
                       దశవదనగ్లాని:(రావణుని లేదా పది ముఖాల గ్లాని
                        (శ్రమముచేత కలిగిన దౌర్బల్యము))
రెండవ పాదం (స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:)లో -
                     రామ: స్థాతా యుధి(రాముడు యుద్ధంలో నిలబడతాడు)
మూడవ పాదం(ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:)లో
                      - ఉచ్చై: పదమ్ (ఉన్నతస్థితిని)
                      అనే అర్థాలున్న పదాలు ఏర్పడ్డాయి.
దీనిలో రావణుడు అనుకున్న వాటికి విరుద్ధంగా వచ్చాయి.