Showing posts with label తెలుగు జీవిత చరిత్రలు. Show all posts
Showing posts with label తెలుగు జీవిత చరిత్రలు. Show all posts

Monday, December 31, 2018

కె.ఎన్‌. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు”


కె.ఎన్‌. కేసరి “చిన్ననాటి ముచ్చట్లు”




సాహితీమిత్రులారా!

ఈ తరం వాళ్ళకి అంతగా పరిచయం లేని స్వీయచరిత్ర కె.ఎన్‌. కేసరి (18751953) “చిన్ననాటి ముచ్చట్లు”. ఆయన అసలు పేరు కోట నరసింహం. కానీ కేసరిగా ప్రసిధ్ధి చెందారు. ఆయన ముఖ్యంగా వైద్యులు, వ్యాపార దక్షులు, పత్రికా రచయిత, సంపాదకులు. పైగా గొప్ప వితరణశీలి. ఆయన చెన్నపట్నంలో 1899లో “కేసరి కుటీరం”, (ఆయుర్వేద ఔషధాలు తయారు చెసే సంస్థ) ప్రారంభించారు. స్త్రీల వ్యాధులకు పేటెంట్‌ మందులు (లోధ్ర) తయారు చెసి విశేష ధనార్జన చెసారు. అంతటితో ఆగిపోతే మనం ఈనాడు అతన్ని స్మరించుకోం. తన సంపదను మహిళాభ్యుదయం కోసం, దేశహిత కార్యక్రమాల కోసం వినియోగించారు. కాశీనాధుని నాగెశ్వర్రావుగారు “అమృతాంజనం”తో వచ్చిన రాబడితో ఆంధ్రపత్రిక, భారతి ప్రారంభించినట్లే, కేసరి కేసరికుటీరం తరఫున “గృహలక్ష్మి” అనే మాసపత్రిక నిర్వహించారు. గృహలక్ష్మి తరఫున ఆనాటి లబ్దప్రతిష్టులైన స్త్రీమూర్తులను స్వర్ణకంకణంతో సన్మానించారు. ఆ కాలంలోనే సుమారు రెండు లక్షల రూపాయలు తన పేర విద్యాసంస్థలకు ఖర్చు పెట్టారు.

తన చిన్ననాటి విశేషాలను “ముచ్చట్లు” పేరుతో గృహలక్ష్మి, ఆంధ్రజ్యోతి మాసపత్రికల్లో ధారావాహికగా ప్రచురించి 1953లో పుస్తక రూపంలో తెచ్చారు. దాని రెండో ముద్రణ సుమారు అర్ధశతాబ్దం తర్వాత కేసరి కుటీరం శతజయంతి సందర్భంలో విడుదలయ్యింది. తన రచనలో ఆయన 19వ శతాబ్దపు ఉత్తరార్ధం, 20 వ శతాబ్దపు పూర్వార్ధపు నాటి తెలుగు వారి జీవితాన్ని వివరంగా చిత్రించగలిగారు.

కేసరి 1875లో గుండ్లకమ్మ నదీ తీరాన ఉన్న ఇనమనమెళ్ళూరు గ్రామంలో, ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ ఊరు ఒంగోలుకి ఏడు మైళ్ళు. పుట్టిన ఐదవ నెలలోనే తండ్రిని పోగొట్టుకుని, తల్లి శిక్షణలో పెరిగారు. బట్టలు కుట్టి ఆ తల్లి ఈయన్ని పెంచి పెద్ద చేసింది. ఆరవ ఏట అక్షరాభ్యాసం జరిగింది. ఆ కాలంలో పిల్లలు కొయ్య పలక మీద రాయటం ప్రారంభించేవారు. కొయ్య పలక మీద రాసే ముందు నీలిమందు, దోసాకు పసరులు పట్టించి బాగా మెరుగు పెట్టి, ఎండలో పెట్టేవారు. వాటిపై తెల్ల రాళ్ళ బలపాలతో రాసేవారు. నాలుగైదేళ్ళు చదివిన తర్వాత రామాయణ, భారత పఠనాలు ఆరంభించేవాళ్ళు. అక్కడితో బడి చదువు పూర్తయ్యేది.

కొత్త పిల్లలని బడిలో చేర్చేనాడు పిల్లలందరికీ పప్పు బెల్లాలు పంచేవారు. అయ్యవారికి ఒక వరహా (4 రూపాయలు) మామూలు. అయితే అందరూ ఇవ్వలేకపోయేవాళ్ళు. సంపన్నులు అయ్యవారికి తిండిగింజలు, కూరగాయలు సరఫరా చేసేవాళ్ళు. సహజంగానే అలాంటి పిల్లలని ముద్దుచేసి, పేదపిల్లల మీద బెత్తం ప్రయోగించటం ఆనాటి క్రమశిక్షణ. పాపం కేసరి బాగానే దెబ్బలు తిన్నాడు. ఆరోజుల్లో పేద కుటుంబాల వాళ్ళు పండుగ నాడు, తద్దినం నాడు మాత్రం వరి అన్నం తినేవాళ్ళు. మిగతా రోజుల్లో జొన్నసంకటి, సజ్జసంకటి వగైరా తినేవాళ్ళు.

తన చిన్నతనంలో వైభవంగా జరిగే శ్రీరామనవమి ఉత్సవాలోఒ, శివరాత్రినాడు కోటప్ప తిరునాళ్ళను గురించి వివరంగా తెలియచేశారు. సంక్రాంతి ఆ రోజుల్లో కూడా పెద్ద పండగే. కోడి పందాలు, కోలాటాలు విరివిగా జరిగేవి. పల్లెల్లో జంగం కథ చెప్పేవారు. బాలనాగమ్మ కథ, బొబ్బిలి యుధ్ధం, దేశింగు రాజు కథ, కాంభోజ రాజు కథ బహుళ ప్రచారంలో వుండేవి.

తనని పెంచటానికి తల్లి పడుతున్న అవస్థలు చూడలేక, తన గ్రామంలో వేరే బ్రతుకు తెరువు లేక, ఆయన తన పదకొండవ ఏట కాలినడకన చెన్నపట్నం చేరారు. ఆ రోజుల్లో రైళ్ళు లేవు. ప్రయాణం బండ్ల మీదో, పడవల మీదో! మదరాసు చేరాక ఆయన మరి తిరిగి చూడలేదు. ట్యోఒషన్లు చెప్తూ నెలకి ఐదు రూపాయలు సంపాయించేవారు. తల్లి వంటపనులోఒ, తదితర పనులు చేసి ఇంకొక ఐదు సంపాయించేది. ఆ పది రూపాయల్లో ఇద్దరూ జీవిస్తూ, ఆయన బడిలో చేరి చదువుకున్నారు. ఆచారప్పన్‌ వీధిలో గది అద్దె ముప్పావలా (12 అణాలు).

1889లో టంకశాల వీధిలో హిందూ థియోలాజికల్‌ హైస్కూల్‌ వుండేది. ఆ బడిలో జీతం లేకుండా చదువుకునే వసతి లభించింది. తన తరగతిలోనే ఇంకో కె. నరసింహం ఉండేవారు. అందుకనే ప్రధానోపాధ్యాయుడు శివశంకరపాండ్య ఈయన పేరు “నరకేసరి”గా మార్చారు అర్ధం చెడకుండా. అప్పటినుంచేఎ కోటావారి అబ్బాయి కె. ఎన్‌. కేసరిగా ప్రసిద్ధుడయ్యాడు.

హైస్కూలు విద్య పూర్తయ్యాక ఉద్యోగ ప్రయత్నం చేసారు. అనుకున్న ప్లీడరు గుమాస్తా పని దొరకలేదు. అప్పుడే ప్రారంభమవుతున్న ట్రాం బండి కండక్టరు పని కూడ దొరకలేదు. అంతటితో ఉద్యోగ ప్రయత్నం మానేసి, ఆయుర్వేద వైద్యం నేర్చుకున్నారు. కొంతకాలం పండిత డి. గోపాలాచార్యులుతో కలిసి పని చేసారు. తరువాత ఇద్దరికీ సరిపడక, వేర్వేరు వైద్యశాలలు ప్రారంభించారు. నారాయణ మొదలి వీధిలో “కేసరీ కుటీరం ఆయుర్వేద ఔషధశాల” అని బొగ్గుముక్కతో గోడ మీద రాసి 1899లో ప్రారంభించారు. మిత్రుల సహాయం, వీరి వ్యాపార దక్షత వల్ల వ్యాపారం అభివృద్ధి చెందింది. వ్యాపార విజయానికి కావల్సింది ప్రచారం అన్న విషయం ఆ రోజుల్లోనే ఈయన కనుక్కున్నారు. అప్పుడు మద్రాసులో ఎ. సి. పార్ధసారధినాయుడు గారు నడుపుతున్న పత్రికలో తన వ్యాపార ప్రకటనలు ఇచ్చేవారు.

స్త్రీవ్యాధులకు వీరు తయారు చేసిన “లోధ్ర” విశేషధనార్జనకు కారణమయ్యింది. కొంత తన ప్రచారానికీ, కొంత స్త్రీజనాభ్యుదయానికి ఉపయోగపడుతుందని “గృహలక్ష్మి” మాసపత్రిక (192760) కేసరి కుటీరం తరఫున వెలువడేది. చాలా కాలం పాటు ఆండ్ర శేషగిరి రావుగారు సంపాదకులు. కేసరి మరణంతో ఈ పత్రిక కొంత కాలం కొనవూపిరితో జీవించి, తెలుగు సాహిత్య పత్రికలన్నిటి లాగే కనుమరుగైంది.

తన కాలం నాటి మద్రాసును ఆయన బాగా వర్ణించారు. తను మద్రాసు చేరిన కాలానికి ఇంకా ఎలక్ట్రిక్‌ దీపాలు రాలేదు. వెల్తురు కోసం రాత్రిపోఒట కిరసనాయలు పోసిన తగరపు బుడ్లు వాడేవారు. తరువాత గ్యాస్‌ లైట్స్‌ వాడకం లోకి వచ్చాయి. 1910 నాటికి విద్యుద్దీపాలు వెలిగాయి. ఆ రోజుల్లో మద్రాసులో గుర్రాలను కట్టే పెట్టె బళ్ళు ఉండేవి. ఇవికాక మూడుచక్రాల వింతబళ్ళు ఉండేవి. వీటిని వెనకనుంచి బోయీలు నెట్టేవారు. తర్వాత కొత్తరకం గుర్రబ్బళ్ళు, బొంబాయి కోచ్‌, పాటన్‌ లాండో, డాక్కార్టు బళ్ళు వచ్చాయి. తర్వాత ట్రాం, మోటరు కారు, సిటీ బస్సూ ఇవన్నీ ప్రయాణ సౌకర్యాలు. కేసరికి గుర్రబ్బళ్ళుండేవి. గుర్రాల పెంపకం, అమ్మకం వ్యాపారం ఉండేది.

1884లోనే మద్రాసు మెరీనా బీచ్‌ పేరు పోందింది కానీ, స్త్రీలెవ్వరూ బీచ్‌కి వచ్చేవారు కాదు. 1886లో హార్బరు నిర్మాణం ప్రారంభమయ్యింది. అప్పుడే నిర్మించిన వివిధ భవంతుల గురించేఎ, సమకాలీన వ్యక్తుల గురించేఎ ఆయన వివరంగా రాశారు. కేసరి మాటల్లోనే చేప్పాలంటే, “ఈ 75 ఏళ్ళలో చేన్నపట్నంలో మారినవి మూడే కొళాయిల్లో అపరిశుభ్రమైన నీరు, కూము నది దుర్గంధం, దేవాలయం కోనేళ్ళలో పాచి. మరొకటి ఉందంటారు ప్రముఖ జర్నలిస్టు బీ.ఎస్‌.ఆర్‌.కృష్ణ “దారిన పోతూ తమలపాకులు వేసుకుంటూ, చేతికంటిన సున్నాన్ని కన్పించిన స్తంభానికో, గోడకో పోఒసే దుర్గుణం!”

1914 సెప్టెంబరులో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభ దశలోనే జర్మన్‌ క్రూసర్‌ ఎమ్‌డెన్‌ మద్రాసుపై ఫిరంగుల వర్షం కురిపించింది. ఆ రాత్రి భయంతో జనం వీధుల్లోకి పరుగెత్తారు. (ధైర్య సాహసాలు, తెగువ ఉన్న స్త్రీలను “ఎమ్‌డెన్‌” అని అనటం తెలుగులో వాడుకలోకి వచ్చింది. “ఇంగ్లండుకు రాజధాని లండన్‌, నీ పైన నా ప్రేమ ఎమ్‌డెన్‌” అన్న ఆరుద్ర సరదా పాట విన్నట్టు గుర్తు.)

జీవితంలో కొంచెం స్థిరపడ్డాక కేసరికి మేనమామ కూతురుతో పెళ్ళయ్యింది. అత్తవారి ఊరు చదలవాడ. మద్రాసులో తన కొత్త కాపురం గురించి, పక్క వాటాలో తమిళ దంపతుల జీవిత విధానం గురించీ ఎంతో వివరంగా ఒక అధ్యాయంలో చెప్పారు. తమిళుల జీవన శైలి, వారి పోదుపరితనం, కష్టపడి పనిచేసే స్వభావం తెలుగు వారు నేర్చుకోవాలని వారి ఆకాంక్ష.

వారి గ్రామం ఇనమనమెళ్ళూరు వెళ్ళాలన్నా, అత్తవారి ఊరు చదలవాడ వెళ్ళాలన్నా రైలు సౌకర్యంలేని రోజుల్లో ప్రయాణం పడవల్లోనే. ఈ తెరచాప పడవలు కొత్తపట్నం రేవు చేరటానికి పది పన్నెండు రోజులు పట్టేది. బకింగ్‌హామ్‌ కెనాల్‌ ద్వారా ప్రయాణం. అనువైన స్థలంలో పడవలు కట్టేసి, భోజనం ఏర్పాట్లు చేసుకునే వారు.

మొదటి భార్య నిస్సంతుగా చనిపోయాక, ఆయన తన నలభై మూడో ఏట, కేరళలో త్రిచూర్‌కి చెందిన ఒక నంబూద్రి యువతి మాధవిని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆయుర్వేద వైద్య నిపుణురాలు. ఈయనకు చేదోడు వాదోడుగా వుండి, వ్యాపారాభివృద్ధికి తోడ్పడింది. కేరళపుత్రులందరూ వాళ్ళ ప్రాంత సౌందర్యాన్ని మైమరచిపోయి పోగుడుకోవటం మనందరికి అనుభవమే. ఈ కేరళ అల్లుడు కూడా కేరళ సౌందర్యాన్ని తనివితీరా వర్ణించాడు. కేరళలోని నంబూద్రీలు, నాయర్లు, మాతృస్వామిక వ్యవస్థ, వారి ఆహారంలో ప్రత్యేకతలు, అక్కడి రమణీయత అంతా చక్కగా రాశారు.

ఆ రోజుల్లో వారికి మద్రాసులో, ట్రిచూరులో బెంగుళూరులో స్థిరాస్థులుండేవి. సంపదతో పాటు వేషభాషల్లో, జీవిత విధానంలో, డాబు, దర్పం చోటు చేసుకున్నాయి. ఇంతలో తనతరం వాళ్ళందరిలాగే కేసరిమీద కూడా మహాత్ముని ప్రభావం పడింది. ఆ ప్రభావం వల్ల వారి వేషభాషల్లో మార్పే కాకుండా, తన సంపదలో కొంత భాగమైనా జనహితానికి ఖర్చు చేయాలనే సత్సంకల్పం కలిగింది. అంతకు ముందు నుంచీ కేసరికి వీరేశలింగం, కేతా రామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ గార్లతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారి పేరున ఇప్పటికీ చెన్నైలో విద్యాసంస్థలు నడుస్తున్నాయి.

తన జీవిత వివరాలేకాక తనకాలం నాటి జానపదకళా రూపాలు, అప్పటికి బాగా ప్రాచుర్యంలో ఉన్న ధార్‌వాడ్‌ నాటక సమాజాలు, తర్వాత బొంబాయి నుంచి దిగిన పార్శీ నాటక ప్రదర్శనలు వివరంగా వర్ణించారు. తొలినాటి తెలుగు నాటకకర్తలు, మహానటులు, ధర్మవరం, కోలాచలం , కందాళై శ్రీనివాసన్‌ తదితరుల ప్రస్తావన కూడా వీరి జీవిత చరిత్రలో ఉంది.

ఈ “ముచ్చట్లు” తర్వాతి తరం పాఠకులను విశేషంగా ఆకర్షించింది. ఇది కేవలం ఒక గొప్ప వ్యక్తి స్వీయచరిత్ర మాత్రమే కాదు. సుమారు నూరేళ్ళ క్రితం దక్షిణ భారత దేశంలో సామాజిక పరిస్థితులను గురించి స్పష్టంగా తెలియజేసే గ్రంథం. ఐతే “ముచ్చట్లు” సాంఘిక చరిత్ర పాఠ్య పుస్తకం కూడా. ఒక మిత్రుడన్నట్లు ఈ పుస్తకం ఎన్నో కాపీలు ముద్రించి తెలుగు తెలిసిన వారందరికీ పంచాలి. ఇంత జనాదరణ ఉన్న పుస్తకం ఏభై ఏళ్ళలో రెండే ముద్రణలు పోందటం (రెండు వేల కాపీలు) పుస్తకప్రచురణలో మన వెనుకబాటుతనం తెలియజేస్తోంది.
----------------------------------------------------------
రచన: శొంఠి రామారావు, శొంఠి సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో

Saturday, December 29, 2018

ఆచంట జానకిరామ్”సాగుతున్న యాత్ర”


ఆచంట జానకిరామ్”సాగుతున్న యాత్ర”





సాహితీమిత్రులారా!

తెలుగులో స్వీయ జీవిత చరిత్రల్ని గ్రంధస్థం చేయటం కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది. “తెలుగు భాషలో స్వీయచరిత్ర వ్రాయబూనుట కిదియే ప్రథమ ప్రయత్నం,” అని వారే రాసేరు. ఇందులో ఆయన మొదటి వాడైనా, రెండో వాడైనా వారి జీవిత చరిత్ర ఒక విధంగా ఆంధ్రదేశపు సాంఘిక చరిత్ర అనటం మాత్రం నిర్వివాదాంశం. వీరేశలింగం గారి శిష్యుడు రాయసం వెంకటశివుడు తన ఆత్మకథ 1933 లో ప్రచురించేరు. అలాగే చిలకమర్తి వారు. ప్రస్తుతం లభ్యం కాని వల్లూరి సూర్యనారాయణ (18661933) గారి స్వీయచరిత్ర సూర్యనారాయణీయం. వీరు హేతువాది అని, అదే దృక్పథంతో మన పురాణగాథలని విమర్శించేరని తెలుస్తోంది. ఇంకొక విలక్షణ స్వీయకథనం “నా ఎఱుక”, “హరికథా పితామహుడగు ఆదిభట్ల దాసు సాహిత్యం,సంగీతం సరితూచిన త్రాసు,” అని శ్రీశ్రీ కీర్తించిన ఆదిభట్ల నారాయణదాసు గారిది.

ఎంత సామాజిక స్పృహ లేని రచయితైనా ఎంతో కొంత తన సమకాలిక జీవితం చిత్రించకుండా ఉండలేడు. అయితే జీవిత చరిత్ర ఒక్కొక్కరూ ఒక్కోలా రాస్తారు. ఉయ్యాల రోజుల్నుంచీ ముసలితనం వరకూ కొందరు సృజిస్తే, తమ కాలం నాటి సామాజిక నేపధ్యం, జీవితంలోని మధురక్షణాలు ఎంపిక చేసి జ్ఞాపకాల రూపంలో అందించటం మరో పద్ధతి.

వీరేశలింగం లాంటి సాంఘిక విప్లవకారుల, టంగుటూరి ప్రకాశం లాంటి రాజకీయ నాయకుల రచనలకు భిన్నంగా వారి వారి అనుభవాల్ని పంచుకున్నవి బుచ్చిబాబు “అంతరంగ కథనం”, ఆచంట జానకిరామ్‌ “సాగుతున్న యాత్ర”, సంజీవ దేవ్‌ స్వీయ కథనత్రయం “తెగిన జ్ఞాపకాలు”. శ్రీశ్రీ కూడా తన జ్ఞాపకాలు “అనంతం” లో గ్రంధస్థం చేసినా, అవి వేర్వేరు సమయాల్లో రాయటం వల్ల దాంట్లో పొందిక ( coherence) లేదు.

* * *
జీవిత కథా సాహిత్యంలో ఆనాటి నుండీ ఈనాటి వరకూ మేము ఎన్నిక చేసేది ఆచంట జానకిరామ్‌ జ్ఞాపకాలు. తన మొదటి జ్ఞాపకం అతని మాతృమూర్తి మరణం గురించి “నాకు నాలుగేళ్లప్పుడు మా అమ్మను గోదావరి తల్లికి వప్పచెప్పి ఆ రాత్రి రాత్రే నదిని దాటి విజ్ఞేశ్వరం వస్తున్నాము రహదారి పడవలో. మాఘమాసం పౌర్ణమి వెన్నెలైనా, ఆకాశమంతా ఎందుచేతనో ఒక వింత వూదా రంగుతో నిండి ఉంది. నక్షత్రాలు మెరిసిపోతున్నయి. గాలి లేదు. సర్వమూ నిశ్శబ్దము. అప్పుడు లక్ష కెరటాల మీద తేలిపోతున్న చంద్రబింబంకేసి చూస్తూ వున్న నా కళ్ళ ఎదుట ఆ కెరటాల మీద మా అమ్మ కనిపించింది. తెల్లని జరీచీరె, బంగారపు వడ్డాణ్ణము, చేతులకి వంకీలు, మెళ్లో కంటె, కాసుల పేరు, చెవులకు బావిలీలు, ముక్కున అడ్డబాస, చెంపలకు చేర్చిదువ్విన నల్లని తలకట్టు, పెద్ద అరకాసంత కుంకుమ బొట్టు.”

1957 లో కాబోలు వీరి జ్ఞాపకాలు ధారావాహికగా ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చాయి. అవన్నీ సంగ్రహపరచి “నా స్మృతి పథంలో”(1957), “సాగుతున్న యాత్ర” (1963) ప్రచురితం అయ్యాయి. ఆ జ్ఞాపకాలు ఆంధ్రప్రభలో ధారావాహికగా వస్తున్న రోజుల్లోనే అవి పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి. “స్మృతి పథాల జానకిరామ్‌” గా తన్ని అందరూ గుర్తిస్తున్నారని వారే తెలియజేశారు.

జానకిరామ్‌ తన రచనల కన్నా ప్రసిద్ధుడు. గొప్ప సౌజన్యమూర్తి, స్నేహశీలి, సౌమ్యుడు, భావుకుడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషల్లో పండితుడు. ఈ భాషల్లోనే మంచి కవిత్వాన్ని చదివి ఆస్వాదించిన రసికుడు. తను ఆస్వాదించిన దాన్ని పది మందికి పంచి ఇవ్వగల్గిన ప్రతిభావంతుడు. అందుకే వారి రచన సాహిత్య ప్రియులందరినీ బాగా ఆకట్టుకుంది.

జానకిరామ్‌ గత శతాబ్దం మొదట్లో జన్మించారు. తండ్రి ఆచంట లక్ష్మీపతి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, సంఘ సంస్కర్త. వారి పెంపకంలో జానకిరామ్‌కి ఉత్తమ సంస్కారం అబ్బటంలో ఆశ్చర్యం లేదు. రాజకీయ, సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కుటుంబం అవటం వల్ల ఆ ప్రభావాలన్నీ ఇతని మీద ఉన్నాయి. చిన్నప్పట్నించీ సమకాలిక మహావ్యక్తుల పరిచయ భాగ్యం లభించింది. వీరేశలింగం, గురజాడ, ఉన్నవ లాంటి సంస్కర్తలు, రచయితలు తన తండ్రితో ఇష్టాగోష్టి జరుపుతున్నప్పుడు వినే అదృష్టం కలిగింది.

ఆయన బాల్యం అంతా మద్రాసులో గడిచింది, అడయార్‌ లో. మొదటి యుద్ధం రోజుల్లో కొంత కాలం మదనపల్లిలో విద్యాభ్యాసం. ఆ రోజుల్లోనే అక్కడ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ గా ఉన్న జేంసు కజిన్సు శిష్యరికం. కజిన్సు జానకిరామ్‌కి చిత్ర కళలో అభిరుచి కల్పించారు. వారి సాంగత్యంలో తనెన్నో విషయాలు నేర్చుకున్నానని జానకిరామ్‌ తెలియజేశారు. తనకి దువ్వూరి రామిరెడ్డి, అడవి బాపిరాజు గార్లను పరిచయం చేసింది కూడా కజిన్సే. ఆ రోజుల్లోనే హోమ్‌ రూల్‌ నాయకులు అనీ బిసెంట్‌ అరండేల్‌ ల ప్రభావం పడింది. మదనపల్లి లో ఉండగానే అక్కడికి వచ్చిన రవీంద్రుడ్ని దగ్గరగా చూసే భాగ్యం కలిగింది. అడయార్‌ లో బి. ఎస్సీ. అయ్యాక వారు కొంత కాలం విజయనగరంలోనూ, బెంగుళూరు ఇండియన్‌ ఇంస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ లో రసాయన శాస్త్ర పరిశోధనలు చేశారు. బెంగుళూరు లో ఉన్న రోజుల్లో హరిన్‌ చట్టోపాధ్యాయ, ఆయన భార్య కమలాదేవి దంపతులతో స్నేహం కలిసింది. హరిన్‌ తో స్నేహం జీవితాంతం కొనసాగింది. ఇద్దరూ కలిసి కృష్ణశాస్త్రి పద్యాలు ఇంగ్లీషులోకి అనువదించేవారట.

ఆ రోజుల్లో కృష్ణశాస్త్రి “కృష్ణపక్షం” పద్యాలు, నండూరి వారి ఎంకిపాటల తో తెలుగు సాహితీ ప్రపంచం మారు మ్రోగి పోతోంది. అదే సమయంలో వెంకట పార్వతీశ్వర కవుల “ఏకాంత సేవ” వెలువడింది. “ఏకాంతసేవ” కావ్యం జానకిరామ్‌ని ఎక్కువగా ప్రభావితం చేసింది. “ఎన్నోవేల పుస్తకాలు చదివాను ఇంగ్లీషు తెలుగు భాషల్లో. అవన్నీ ఒకెత్తూ, ఏకాంతసేవ కావ్యం ఒక ఎత్తు,” అని వారు తెలియచేశారు.

బెంగుళూరు రిసర్చి జీవితం తర్వాత ఇన్స్యూరెన్సు కంపెనీ కార్యదర్శిగా బెజవాడ కేంద్రంగా పెట్టుకుని తిరిగారు. ఆ రోజుల్లోనే ఆయనకి ఆంధ్రప్రదేశ్‌ లోని కవి పండితులందరితో పరిచయం, స్నేహం పెరిగాయి.ఉద్దండులైన కవులు, గాయకులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, అన్నిరంగాల్లోని నిష్ణాతులతో మైత్రి ఏర్పడ్డమే కాక వారి ప్రేమానురాగాలు పొందారు. ఆ రోజుల్లోనే బసవరాజు అప్పారావు తో పరిచయం. కవి స్వంత గొంతుకలో “వంటిగా ఉయ్యాలలూగితివా నా ముద్దు కృష్ణా” అనే పాట “లేపనైనా లేపలేదే” అనే గీతాలు విన్నారు. ఆ తర్వాత ఈ పాటలు టంగుటూరి సూర్యకుమారి ఆలాపించారు. అలాగే కృష్ణశాస్త్రి, వేదుల, అబ్బూరి, చలం ల తో ప్రగాఢ మైత్రి ఏర్పడింది. విశ్వనాథం, దుర్గాబాయి, కమలా దేవి లాంటి మిత్రులే కాకుండా, తన కుటుంబంలో పిన్ని రుక్మిణమ్మ, మేనబావలు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా జానకిరాం మాత్రం ఉద్యమానికి ప్రేక్షకుడిగా, మిత్రుడిగా ఉండిపోయారు. 1935 భారతదేశం లో రేడియో ప్రసారాలు ప్రారంభమైన కొత్తలోనే వీరు రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరారు. రేడియోలో పని చేసే రోజుల్లో వీరికి బుచ్చిబాబుతో పరిచయం, స్నేహం పెరిగాయి. బుచ్చిబాబు తన నవలకు మొదట పెట్టిన పేరు “ఏకాంతం”. దానికి “చివరకు మిగిలేది” అనే భావయుక్తమైన పేరు పెట్టటమే కాకుండా మంచి ముఖచిత్రం కూడా సూచించారు. ఆ ముఖచిత్రమే “పల్లవి” వాళ్లు వేసిన బుచ్చిబాబు కథల సంపుటాలకు ముఖచిత్రంగా ఉంది.

జీవితంలో అర శతాబ్దం గడిచేక వారు ఈ జ్ఞాపకాల పరంపరను నెమరువేసుకున్నారు. దానికి ముఖ్య ప్రేరణ నార్ల వారు. నేపధ్యంలో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. తన అనుభవాల పరంపర కొంపెల్ల జనార్దన రావుకు అంకితం చేశారు. ఆచంట జానకిరామ్‌ జ్ఞాపకాలు మూడు దశాబ్దాల సాంస్కృతిక చరిత్ర. ఈ విలక్షణమైన రచనల ప్రత్యేకత ఏమిటంటే తను నేపధ్యంలో ఉండి, తను పరిచయం చేస్తున్న మిత్రులను, ఘటనలను, highlight చెయ్యడం. చలం గారి మాటల్లో చెప్పాలంటే “దాంట్లో charm ఏమిటంటే అతని అనుభవాన్ని ఎంతో భద్రంగా ఇన్నేళ్లు, after events కి influence కాకుండా, isolate చేసి, sterilize చేసి produce చెయ్యటం.” ఒక్క మాటలో చెప్పాలంటే, పాత జ్ఞాపకాలన్నింటినీ deep freeze లో భద్రం చేసి, ఒక్క సారి defrost చేసి తాజాగా మనకందించడం. ఒక వ్యక్తి తన జీవితకాలంలో అంత మంది సమకాలికులైన ప్రతిభామూర్తులను కలుసుకోగల్గడం, వారి ప్రేమానురాగాలను పొందగల్గడం గొప్ప విషయం.

తన అరవై ఏళ్ల జీవితానుభవాన్ని మనతో పంచుకుంటూ జానకిరాం అంటారు కదా, “జీవితం ఒక రన్నింగ్‌ రేస్‌. అందరికీ మొదటి, రెండు, స్థానాలు రావు కదా. అందుచేత ఫలమెలా పరిణమించినా మనం పట్టించుకోకూడదు. ఏది చేసినా బాగా మనస్సు పెట్టి చెయ్యాలి. మనిషికీ మనిషికీ మరి కాస్త అన్యోన్యత ఉండాలి…’దొంగలున్నారు జాగ్రత్త ‘ అని హెచ్చరిక వినగానే మనం జేబులు గట్టిగా పట్టుకుని ఈ పక్క, ఆ పక్క ఉన్న ప్రయాణీకుల వైపు సందేహిస్తూ చూడడం మానుకోవాలి.”

అతని అలవాట్లు చాలా మట్టుకు పాశ్చాత్య పద్ధతి లోనివే. తనే చెప్పుకున్నట్లు అతని ధ్యేయం తన చుట్టూ ఉన్న వారిని సంతోష పెట్ట్టటం. ఒక సారి బొంబాయి లో అతనికి ఆపరేషను జరిగింది ఆపరేషనైన నాల్గవ రోజు తనకి ‘మెట్రో’ సినిమాలో “Tarzan of the Apes” సినిమాకి నాలుగు టిక్కట్లు కావాలని వాళ్లక్కగారికి పురమాయించారు. నాలుగు టిక్కట్లెందుకంటే తనకు సేవ చేసిన నర్సులకివ్వటానికి. వాళ్లు ఆ సినిమా చూసి వచ్చి చూపించిన సంతోషం చూసి, “మనుషుల్ని సంతోషపెట్టటం ఎంత సులువో” అనుకున్నారట.

జానకిరామ్‌ది ప్రధానంగా సౌందర్య దృష్టి. గాంధీ గారు రవీంద్రనాథ్‌ టాగూరును కల్సుకున్నప్పుడు ఆ సమావేశాన్ని సత్యం సౌందర్యం కలుసుకోవడం అన్నారు. బహుశా టాగూరు సౌందర్య దృష్టే వారి అభిమాని జానకిరామ్‌ది కూడా. బుచ్చిబాబేమో వీర్ని, “సౌందర్యం కోసం సౌకర్యం త్యాగం చెయ్యగల సాధకుల ఆప్తుడు, కళాజీవి”, అని అభివర్ణించారు. తన ఇంటికి తిరిగి వచ్చి దోసెడు పారిజాతాలు గుమ్మం దగ్గర ఉండటం చూసి,జానకిరామ్‌ వచ్చి వెళ్లారని తెలిసింది అన్నారో మహిళా జర్నలిస్టు. అంటే ఆయన వ్యక్తిత్వమే పారిజాత పరిమళం అయ్యిందనేగా?

జానకిరామ్‌ రచించిన గొప్ప పుస్తకాలు ఈ తరం పాఠకులకు అందుబాటులో లేవు. సాహితీప్రియులెవరైనా జానకిరామ్‌ రచనలు అందంగా ముద్రించి ఈ తరం వారికి అందేట్లు చూడాలి. ఎందుకంటే ఈ రచనలు చదవటం ఒక మధురానుభవం. పరిపూర్ణ జీవితం గడిపి జానకిరామ్‌ తొంభై పైబడిన తర్వాత కీర్తిశేషులయ్యారు. ఆయనే రాసినట్లు “అపరిమితానందానుభూతి ఎంత ఉత్కృష్టమైనదైనా అది అనిత్యమేగా!”
----------------------------------------------------------
రచన: శొంఠి రామారావు, శొంఠి సావిత్రి, 
ఈమాట సౌజన్యంతో