Tuesday, February 28, 2017

వీటికి సమాధానాలేవి?


వీటికి సమాధానాలేవి?



సాహితీమిత్రులారా!


ఈ పద్యాన్ని చూడండి
సమాధానాలు చెప్పలరేమో ఆలోచించండి .


అర్థి నెవ్వడు పోషించు ననవతరము?
సోముదల దాల్చు సద్గుణస్తోముడెవరు?
రాముగర్వంబడంచిన రాజెవండు?
ఉన్నయవియాదులనె వాని యుత్తరములు

ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే
ఇందులోని ప్రతి ప్రశ్నకు మొదటే
సమాధానం ఉంది.
ప్రశ్నలు-
1. యాచకుని ఎవరు పోషిస్తారు
2. చంద్రుని శిరస్సుపై దాల్చునదెవ్వరు
3. రాముని గర్వమణచినదెవరు
   (పరశురాముని)

1. యాచకుని ఎవరు పోషిస్తారు?
     - అర్థి
       (అర్థము లేక ధనముగలవాడు)

2. చంద్రుని శిరస్సుపై దాల్చునదెవ్వరు?
   - సోముడు 
    (స + ఉమ = సోమ -- పార్వతితో కూడినవాడు)

3. రాముని గర్వమణచినదెవరు?
   (పరశురాముని)
- రాముడు(దశరథరాముడు)


ఇందులోని ప్రతి ప్రశ్నకు మొదటే 
సమాధానం ఉంది.-
అర్థి నెవ్వడు పోషించు ననవతరము?
సోముదల దాల్చు సద్గుణస్తోముడెవరు?
రాముగర్వంబడంచిన రాజెవండు?

Monday, February 27, 2017

నొకరి కొకరు ఘనులు గారె!


నొకరి కొకరు ఘనులు గారె!




సాహితీమిత్రులారా!



ఈ ప్రహేలికా పద్యం చూడండి

అతడు నందికేశ్వరావతార, మతడు
పుత్రకుండు భోగి భూషణునకు
శౌరి మూడవ యవతార మాతండు, పా
క్షాత్తు నొకరి కొకరు ఘనులు గారె!

అతడు నందికేశ్వరుని అవతారము
అతడు భోగి భూషణునకు కొడుకు,
విష్ణువు యొక్క మూడవ అవతారము అతడు
ఒకరి కొకరు గొప్పవారు అని కదా దాని భావం
నిజమే కాని
ఇందులోని విషయం ఏమిటి అని ఆలోచిస్తేగాని
అర్థంకాదు

అదేమిటంటారా
నందికేశ్వరుని అవతారం అంటే - ఎద్దు అనికదా
భోగి భూషణుని కొడుకు అంటే - భైరవుడు(కుక్క)కదా
(భోగి భూషణుడు పాములను ఆభరణాలుగా గలవాడు - శివుడు)
విష్ణువు మూడవ అవతారం వరాహావతారం అంటే పందికదా
వీరు ఒకరికొకరు గొప్పవారేకదా
ఇది వ్యంగ్యమైన ప్రహేళిక అంటే
హాస్యంతో గంభీరంగా వెక్కరించుట.

పదునేడవ రాజు ధరాతలమ్మునన్


పదునేడవ రాజు ధరాతలమ్మునన్




సాహితీమిత్రులారా!


తెలుగుభాషమీది సాహిత్యంమీది
అభిమానంకలిగిన ఎందరినో కవులను
పండితులను ఆదరించడం వల్ల
మాలిక్ ఇబ్రహీం అనే
గోలుకొండ కుతుబ్ షాహీ
మల్కిభరాముడుగా
పిలువబడుతున్నాడు

ఆ మల్కిభరాముని మీద
వ్రాయబడిన పద్యం ఇది
ఇందులో సంఖ్యా(శబ్ద)చిత్రం కలదు
చూడండి-

ఏడు కులాద్రు, లెక్కివెసనేడు పయోధులు దాటి లీలమై
ఏడవు దీవులం దిరిగి యోడుగడన్విహరించి కీర్తి యీ
రేడు జగమ్ముల న్వెయనే చిన మల్కిభరాము చంద్రుడే
ఏడవ చక్రవర్తి పదునేడవ రాజు ధరాతలమ్మునన్


మల్కిభరాముని కీర్తి కలపర్వతాలను ఏడింటిని ఎక్కి,
ఏడు సముద్రాలను దాటి, సప్తద్వీపపాలలో సంచరించి
 సమస్తంగా విహారం చేసి పదునాల్గులోకాలలో వృద్ధి పొందగా,
భూమి మీద అతడు ఏడవ చక్రవర్తి, పదిహేడవ మహారాజు అని
చెప్పవచ్చును - అని భావం.
ఇంతవరకు షట్చక్రవర్తులు,
షోడశమహారాజులు ప్రసిద్ధిగా ఉన్నారు
ఇప్పుడీయన వారిసరసన చెప్పదగిన
కీర్తి కలవాడు అని తాత్పర్యము.

కులపర్వతాలు - (7)
మహేంద్రం, మలయం, సహ్యం, మాల్యవంతం,
ఋక్షం, వింధ్య, పారియాత్రం - ఈ ఏడు కులపర్వతాలు

సముద్రాలు - (7)
1. లవణసముద్రం, 2. ఇక్షుసముద్రం, 3. సురాసముద్రం,
4. సర్పిసముద్రం, 5. దధిసముద్రం, 6. క్షీరసముద్రం
7. జలసముద్రం.

ద్వీపము (7)
జంబూ, ప్లక్ష, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపాలు

లోకాలు - 14
ఊర్ధ్వలోకాలు - 7
భూలోక, భువర్లోక, సువర్లోక,
మహాలోక, జనలోక, తపోలోక,
సత్యలోకాలు
అధోలోకాలు - 7
అతల, వితల, సుతల, తలాతల,
మహాతల, రసాతల, పాతాళలోకాలు

చక్రవర్తులు - 6
1. హరిశ్చంద్రుడు, 2. నలుడు, 3. పురుకుత్సుడు,
4. పురూరవుడు, 5. సగరుడు, 6. కార్తవీర్యార్జునుడు

మహారాజులు - 16
1.గయుడు, 2. అంబరీషుడు, 3. శశిబిందువు,
4. అంగుడు, 5. పృథువు, 6. మరుతి,
8. సహోత్రుడు, 8. పరశురాముడు, 9. శ్రీరాముడు,
10. భరతుడు, 11. దిలీపుడు, 12. నృగుడు,
13. రంతిదేవుడు, 14. యయాతి, 15. మాంధాత,
16. భగీరథుడు


Sunday, February 26, 2017

అణోరణీయా న్మహతో మహీయాన్


అణోరణీయా న్మహతో మహీయాన్




సాహితీమిత్రులారా!


ఈ అర్థచిత్ర శ్లోకం చూడండి-

ఇందులో రెండు వైదిక మంత్రవాక్యములతో
కూర్చి చెప్పడం విశేషం

అణోరణీయా న్మహతో మహీయాన్
మధ్యోనితంబశ్చ యదంగనాయాః
తదంగహారిద్రవిలేపనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రమ్

దీనిలోని మొదటి పాదంలోని మంత్రం
పరమాత్మనుగూర్చి చెబుతుంది
చివరి పాదం యజ్ఞోపవీతం గొప్పతనాన్ని
తెలుపుతుంది.
పరస్పరం సంబంధంలేని వాటిని
ఏకవాక్యంగా మలిచాడు ఈ కవి
దీని అర్థం-

ఏ స్త్రీ యొక్క నడుము అణువు కన్నా చిన్నదో
నితంబము(పిరుదుల భాగం) మహత్తు కంటే
పెద్దదో, అటువంటి తరుణి శరీరపు పసుపురంగు
పూయబడటంచేత యజ్ఞోపవీతం చాలాపవిత్రమై పోయింది -
అని భావం

జడనింత వదులుగా అల్లినావేమి?


జడనింత వదులుగా అల్లినావేమి?




సాహితీమిత్రులారా!


17వ శతాబ్దిలోని విజయరాఘవుని
ఆస్థానములోని కవయిత్రి
రంగాజమ్మకు ఆమె చెలికత్తెకు
జరిగిన సంభాషణ చిత్రమిది
చూడండి-

"రాజనిభాననా! సరసురాలవు జబ్బుగ అల్లినా వదే
మేజడ?" " యింతకంటెవలెనే?"  "వలనొప్పబిగించి యల్లవే?"
"ఓ జవరాల! వేరెపనియున్నది" "దోసముదోసమే మహా
రాజగునట్టి యవ్విజయరాఘవుమై చిగురాకె కోమలీ"


సఖి- రాజనిభాననా! సరసురాలవు జబ్బుగ అల్లినా వదే మేజడ?
         చంద్రముఖీ సహృదయవు -  జడనింత వదులుగా అల్లినావేమి?

రంగాజమ్మ - యింతకంటెవలెనే?
                        ఇంతకంటే నేర్పుగా సమర్థంగా ఉండాలా?

సఖి -  వలనొప్పబిగించి యల్లవే?
             ఔనే జవరాల ఇంతకంటే నేర్పుగా
             కామోచితమగునట్లుగా
             బిగించి అఅల్లరాదా


రంగాజమ్మ- ఓ జవరాల! వేరెపనియున్నది
                        వేరే పనికూడ ఉన్నదే

సఖి -     దోసముదోసమే  
               మహా రాజగునట్టి యవ్విజయరాఘవుమై చిగురాకె కోమలీ
               తప్పు తప్పే
               విజయరాఘవుని శరీరంపై (మెత్తని) చివురాకువుగదా!



Saturday, February 25, 2017

సంఖ్యా(శబ్ద)చిత్రం -2


సంఖ్యా(శబ్ద)చిత్రం - 2




సాహితీమిత్రులారా!


సంఖ్యారూపంలోని పదాలు ఒక పద్యంలో
వరుసగా ఉపయోగించి పద్యం కూర్చడం
సంఖ్యా(శబ్ద)చిత్రంగా చెప్పబడుతుంది.
వ్యాసమహాభారతంలోని
ఈ శ్లోకంలో చూడండి అన్నీ సంఖ్యా శబ్దాలే
ఉన్నాయి. ఒకటి నుండి ఏడు వరకు
సంఖ్యలను ఉపయోగించారు
ఇందులో


ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం చతుర్భి ర్వశే కురు,
ఞ్చ జిత్వా విదిత్వా షట్ సప్త హిత్వా సుఖీభవ
 
                                                             (సంస్కృత మహాభారతము - 5-33-43)

తిక్కన ఆంధ్రీకరణ-

ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తి జేర్చి
మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిగి యేడు
విడిచి వర్తించువాడు వివేకధనుడు


కొటికెలపూడి వీరరాఘవకవిగారి ఆంధ్రీకరణ-

బుద్ధి యొక్కటి చేత బుడమి ధర్మాధర్మ
           ములు రెండు నిశ్చయస్ఫూర్తి దెలిసి
తన మిత్ర శాత్ర వోదాసీనులను మువ్వు
           రం దుపాయములు నాల్గందగించి
వారి నందర నాత్మవశుల గావించిన
           యట్లనె యైదింద్రియములు గెల్చి
ప్రఖ్యాతి సంధి విగ్రహములు మొదలుగా
           గల్గిన షడ్గుణంబుల నెఱింగి
వేట జూదంబు వెలదుల కూటమి మధు
పానము నయుక్త దానంబు పరుషదండ
పరుష వచనము లనెడి సప్త వ్యసనము
వెడలి సమధిక సుఖమొందు మీ వధీశ
                                 
                                                       (ఉద్యోగపర్వము 3వ ఆశ్వాసం)


సంధ్యావందన మాచరతి విబుధాః


సంధ్యావందన మాచరతి విబుధాః




సాహితీమిత్రులారా!


సమస్య-
సంధ్యావందన మాచరంతి విబుధాః నారీ భగాంతర్జలైః
(పండితులు(స్త్రీ)ల యోని జలంతో సంధ్యావందనం చేస్తారు)
ఇది చాల చిత్రమైన సమస్య
ఇందులోని అర్థం పైకి సరైనదిగాలేదు

పూరణ-
కిం కుర్వంత్యుషసి ద్విజాః? 
గుణవతః కే మానినీయాః ప్ర భో?
కావా సాహసీ? 
నిశాసు సతతం ద్యౌః కీదృశీ వర్తతే?
కుత్రాస్తే మధు నారికేళ ఫలకే? 
కైః స్యాత్పిపాసాశమః?
సంధ్యావందన మాచరంతి విబుధాః నారీ భగాంతర్జలైః

ఇందులో సమస్యను క్రమాలంకారంతో పూరింపబడినది.
ఇందులో 6 ప్రశ్నలు కూర్చి సమస్యలోని 6 పదాలను
సమాధానాలుగా మార్చాడు కవి.


1. కిం కుర్వంత్యుషసి ద్విజాః?
      బ్రాహ్మణులు ప్రాతః కాలంలో ఏం చేస్తారు?
    - సంధ్యవందన మాచరంతి

2.   గుణవతః కే మానినీయాః ప్ర భో?
      గుణవంతుడైన రాజుచేత గౌరవింపదగినవారెవరు?
   - విబుధాః (పండితులు)

3.  కావా సాహసీ?
     సాహసం కలవారెవరు?
   - నారీ(స్త్రీ)

4.  నిశాసు సతతం ద్యౌః కీదృశీ వర్తతే?
      రాత్రులందు ఆకాశం ఎట్లా ఉంటుంది?
   - భగా (నక్షత్రాలతో కూడి ఉంటుంది)

5.  కుత్రాస్తే మధు నారికేళ ఫలకే?
       కొబ్బరికాయలో తీపి ఎక్కడుంటుంది?
      - అంతః(లోపల)

6.    కైః స్యాత్పిపాసాశమః?
       దాహము వేటితో తీరుతుంది?
      - జలైః (నీళ్ళతో)

ఈ విధమైన వాటిని ప్రశ్నోత్తచిత్రమనికూడ అంటారు.
ఇందులోనే ప్రశ్నలు ఉన్నాయి ఉత్తరాలు ఉన్నాయి
కావున ఇది ప్రశ్నోత్తర చిత్రం అవుతుంది.


Friday, February 24, 2017

అర్థహరణ కౌశలం


అర్థహరణ కౌశలం



సాహితీమిత్రులారా!



సుశ్లోక రాఘవమ్ లోని ఈ శ్లోకం చూడండి-
దీనికి రెండు అర్థాలున్నాయి గమనించండి-

అర్థాహరణ కోశల్యం కిం స్తుమః శాస్త్రవాదినమ్
అవ్యయేభ్యోపి యైరర్థా నిష్కాశ్యంతే హ్యనేకశః

మొదటి అర్థం -
శాస్త్రవాదుల యొక్క అర్థాహరణ
కౌశలాన్ని ఏమని పొగడగలం
వారు అవ్యయాల నుంచి కూడ
అనేకార్థాలను రాబట్టగలరు.
అర్థాహరణకౌశలమంటే
శబ్దాలకు అర్థాలను రాబట్టటం.
భాషలో అవ్యయాలు ఒక భాగం
అవ్యయానామనేకార్థత్వమని
వాటికి అనేకార్థాలుంటాయి.
అందువలన శాస్త్రవాదులు
అవ్యయాల నుండి అర్థాలను రాబట్టుతారు
కనుక అర్థాహరణ కౌశలం వారికి ఉందని
అర్థం.

రెండవ అర్థం -
అర్థం అంటే డబ్బు
అవ్యయేభ్యః - అంటే
ఖర్చు పెట్టనివారు.
పిసినిగొట్టు వారి నుండి కూడ
శాస్త్ర పండితులు తమ వాక్చాతుర్యంతో
డబ్బును బాగా లాగగల సమర్థులని భావం.


మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు


మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు



సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు
ఈ పర్వదిన సందర్భముగా
చంద్రశేఖర స్తోత్రాన్ని విని తరించండి





Thursday, February 23, 2017

రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్


రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్




సాహితీమిత్రులారా!



జైనమతానికి చెందిన మహావీరాచార్యుడు
సంస్కృతంలో గణితసారసంగ్రహమనే పుస్తకాన్ని
వ్రాయగా దాన్ని12వ శతాబ్దికి చెందిన
పావులూరి మల్లన తెలుగులో అనువదించాడు

ఇంగులో మన వారు వినియోగించిన సంఖ్యలు
సంకేతరూపంలో ఉంటాయి అందువల్ల దానిలోని
ఒక శ్లోకం చూద్దాం-
దీన్ని సంకేత సంఖ్యా గూఢ చిత్రంగా
చెప్పుకొనవచ్చు-
ఇక్కడ మనం గమనించే సమస్యం ఏమిటంటే-
చదరంగంలో మొత్తం 64 గడులుంటాయికదా
అవి 8 గడులు అడ్డంగాను,
8 గడులు నిలువుగాను ఉంటాయి
మొత్తం 64 గడులు

ఈ చదరంగం 64 గళ్ళకు
1 నుండి 64 వరకు ప్రతిగడిని
రెట్టిస్తూ పోతే మొత్తం ఎంత వస్తుందనేది
ప్రశ్న  దాని సమాధానం రెండూ పద్యంలో
చెప్పబడినవి చూడండి-

శరశశిషట్కచంద్రశరసాయకరంధ్రవియన్నగాగ్ని భూ
ధరగగనాబ్దివేదగిరితర్కపయోనిధి పద్మజాస్యకుం
జరతుహినాంశుసంఖ్యకు నిజంబగు తచ్చతురంగగేహవి
స్తరమగు రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

ఇందులో మనం కొన్ని పదాలకు
వాటి సంకేతాలను గమనించాలి-
గగనం, ఆకాశం, వియత్, రంధ్ర - వీటి సంకేతం - 0(సున్న)
వేద, అబ్ది, పద్మజాస్య - వీటికి సంకేతం - 4
శశి, చంద్ర, తుహినాంశు పదాలకు సంకేతం - 1
అగ్ని కి సంకేతము - 3
బాణ, శర, సాయక పదాలకు సంకేతం - 5
షట్క, తర్క, దర్శన లకు సంకేతం - 6
భూధర, గిరి, నగ - లకు సంకేతం -7
కుంజర, గజ, దిక్ పదాలకు సంకేతం - 8
శ్లోకంలోని పదాలకు సంకేతాలను తీసుకుంటే
ఇలా ఏర్పడుతుంది.

  5    1     6           1       5        5         0        0      7         3
శరశశిషట్కచంద్రశరసాయరంధ్రవియన్నగాగ్ని 
      7         0    4       4    7      6        4                    4 
భూధర గగనాబ్దివేదగిరితర్కపయోనిధి పద్మజాస్య
      8                1
కుంజర తుహినాంశు 
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగగేహవి
స్తరమగు రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్


అయితే ఏర్పడిన సంఖ్యను
ఎడమనుండి కాక
కుడినుండి తీసుకోవాలి.

అంటే ఒకటినుండి 64 వరకు రెట్టిస్తూ పోతే
వచ్చే మొత్తం లబ్దపు సంఖ్యం ఇది-

18446744073709551615

రమ్యా వసన్తే కామపి శ్రియమ్


రమ్యా వసన్తే కామపి శ్రియమ్




సాహితీమిత్రులారా!


క్రియాగూఢచిత్రమునకు
మరో ఉదాహరణ గమనింపుడు-

పుంస్కోకిలకులస్యైతే నితాన్త మధు రారవైః
సహకారద్రుమా రమ్యా వసన్తే కామపి శ్రియమ్

దీన్ని చూడగానే అనిపించే సాధారణార్థం-
వసన్తే - వసంతకాలంలో
పుంస్కోకిలకులస్య - మగకోకిలల గుంపు యొక్క
నితాన్త + మధు + ఆరవైః = మిక్కిలి కమ్మని ధ్వనులతో,
రమ్యాః - అందములైన, శ్రియామ్ - శోభను
ఇక్కడ శ్లోకంలోని ప్రతిపదం చెప్పబడింది
కాని వాక్యం పూర్తి కాలేదు.
అంటే క్రియ కనిపించలేదు. కాని నిజానికి
ఇందులోనే క్రియదాగి ఉంది. దాన్ని వెదకి పట్టుకోవాలి.
ఇందులోని పదాలను బాగా గమనింస్తే
నితాన్త మధురారవైః - అనే చోట పదవిభాగం
ఇలా మార్చుకోవాలి -
నితాన్తం + అధుః + ఆరవైః - అని

ధా - ధాతువు యొక్క భూతకాల
బహువచన రూపం అధుః.
అదుః - అంటే ధరించినవి అని అర్థం.
అంటే తీయ మామిడి చెట్లు కోకిల ధ్వనులతో
మిక్కిలి శోభను ధరించినవి - అనే అర్థం సరిపోతుంది.
కావున ఇందులో క్రియా పదం గోపనం చేయబడిందికావున
ఇది క్రియాగోపనచిత్రం.

Wednesday, February 22, 2017

గౌరీవదనసంకాశం


గౌరీవదనసంకాశం




సాహితీమిత్రులారా!


గూఢచిత్రంలోని వివిధరకాలలో
కర్తను గుప్తం చేయడం ఒకటి దీనికి
కర్తృగుప్త చిత్రం అంటారు
దీనికి ఉదాహరణ ఈ శ్లోకం చూడండి-

గౌరీవదనసంకాశం శ్రద్ధయా శశినం దధౌ
ఇహైవ గోపితః కర్తా వర్షేణాపి న లభ్యతే

ఈ శ్లోకానికి తెలిసే సాధారణ అర్థం-
పార్వతి ముఖంతో సమానంగా ఉన్నదని శ్రద్ధతో
చంద్రుణ్ణి ధరించాడు. ఈ శ్లోకంలోనే దాగిఉన్న
కర్తృవాచక పదం సంవత్సరం ప్రయత్నించినా
దొరకదు.

చంద్రుణ్ని ధరించిన కర్త ఎవరో
స్పష్టంగా కనిపించటం లేదు.
అందువల్ల సంవత్సరం వెదకినా
దొరకదని కవి సపష్టం చేస్తున్నాడు

దీనిలో బాగా ఆలోచించగా ఇహైవ- అనేపదం.
దీన్ని ఇహ-ఏవ(ఇక్కడనే) అని కాకుండా
ఇహా- ఏవ - అని విడదీయాలి
ఇ - అంటే మన్మథుడు
ఇంహన్తి ఇతి ఇహా అంటే
మన్మథుని చంపినవాడు, శంకరుడని అర్థం
గోపితః కర్తా ఇహైవ - దాగిఉన్న కర్త
ఇహా ఏవ - శంకరుడని సమన్వయంగా
తీసుకోవాలి.
కావున ఇది కర్తృగూఢచిత్రానికి
ఉదాహరణగా చెప్పవచ్చు.


సంఖ్యా(శబ్ద)చిత్రం


సంఖ్యా(శబ్ద)చిత్రం



సాహితీమిత్రులారా!


ఒక పద్యంలో సంఖ్యలు వరుసగా ఉపయోగిస్తే దాన్ని
సంఖ్యా(శబ్ద)చిత్రంగా చెప్పవచ్చు. ఈ పద్యం చూడండి-
అనంతామాత్యుని భోజరాజీయం(7-245)లోనిది

చర్చింప రెండవ చంద్రుడు మూడవ
                         యశ్విని నాలవ యగ్నిదేవు
డైదవ లోకపాలాఖ్యు డారవ పాండు
                           సంతానమేడవ చక్రవర్తి
యెనిమిదవనయగు సన్మునీశుడా తొమ్మిదవ
                            యగు భోగిపతి పదియవ విరించి
పదునొకండువ చక్రపాణి పండ్రెండవ 
                             శూలి పద్మూడవ సూర్యుడనగ
దనరు గాంతిరూపమున బ్రతాపమున స
త్యమున ధర్మచరిత నాజ్ఞ శుచిని
భూరిసత్త్వమున బ్రబుద్ధత గలిమిని
భూతి దేజమునను భోజవిభుడు
                                    (భోజరాజీయము - 7-245)

భోజుడు ఎలాంటివాడో అనంతామాత్యుడు
ఈ పద్యంలో వివరించాడు

రెండవ చంద్రుడు,
మూడవ అశ్విని,
నాలుగవ అగ్నిదేవుడు,
ఐదవ లోకపాలకాఖ్యుడు,
ఆరవ పాండు సంతానము,
ఏడవ చక్రవర్తి,
ఎనిమిదవ సన్మునీశ్వరుడు,
తొమ్మిదవ భోగపతి,
పదియవ విరించి,
పదునొకొండవ చక్రపాణి,
పండ్రెండవ శూలి,
పదమూడవ సూర్యుడు

ఇవి ఏ విధంగా అంటే
కాంతిలో చంద్రుడు అయితే
భోజుడు రెండవ చంద్రుడు,
రూపంలో అశ్వనీదేవతలు(ఇద్దరు) అసమానులు
భోజుడు మూడవ అశ్విని,
ప్రతాపంలో అగ్ని(ముగ్గురు) భోజుడు నాలుగవ అగ్ని,
సత్యంలో  లోకపాలకులు(నలుగురు)
భోజుడు ఐదవ లోకపాలకుడు,
ధర్మచరిత్రలో పాండవులు(ఐదుగురు)
భోజుడు ఆరవ పాండు సంతానము,
ఆజ్ఞలో చక్రవర్తులు ఆరుగురు భోజుడు ఏడవ చక్రవర్తి,
శుచిలో సప్తర్షులు భోజుడు ఎనిమిదవ మహర్షి,
భూరి(గొప్పదైన బలంలో) సత్వంలో శేషుడు
మొదలైన ఎనిమిదిమంది నాగరాజుల
తర్వాత భోజుడు తొమ్మిదవ భోగిపతి,
వికాసంలో నవబ్పహ్మవతర్వాత పదియవ బ్రహ్మ భోజుడు,
సంపదలో పదనొకొండవ విష్ణువు భోజుడు,
ఐశ్వర్యంలో పండ్రెండవ శివుడు,
తేజంలో పదమూడవ సూర్యుడు
అంతటి గొప్పవాడని అనంతామాత్యుడు భోజుని వర్ణించాడు.


అశ్వనిదేవతలు - ఇద్దరు , ఒకరు నాసత్యుడు,
                                  మరొకరు దస్రుడు
త్రేతాగ్ని - పావకుడు, పవమానుడు, శుచి

లోకపాలకులు - ఇద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు

షట్చక్రవర్తులు - హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు,
                              పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు

సప్తర్షులు - వసిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు,
                    భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు

నవబ్రహ్మలు - మరీచి, అత్రి, భృగుడు, పులస్త్యుడు, పులహుడు,
                           క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, వామదేవుడు

దశావతారాలు - మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన,
                            పరశురామ, శ్రీరామ, బలరామ, బౌద్ధ, కల్కి

ఏకాదశరుద్రులు - అజైకపాదుడు, అహిర్భుధ్న్యుడు, త్వష్ట, రుద్రుడు,
                                 హరుడు, త్య్రంబకుడు,వృషాకపి, శంభుడు, కపర్ది,
                                  మృగవ్యాధుడు, శర్వుడు

ద్వాదశాదిత్యులు-
                                 ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు,
                                 త్వష్ట, పూష, అర్యముడు,
                                  భగుడు, వివస్వంతుడు, విష్ణువు,
                                  అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు

జక్కన విక్రమార్కచరిత్రలోని
సంఖ్యా(శబ్ద)చిత్రం చూడండి-

కాశీలో మరణించినా గొప్ప కీర్తి
కారణమే అని చెప్పే పద్యం ఇది

రూపమొక్కటి రెండు రూపులై చెలువొందు
           మూఁడు మొనల పోటుముట్టుఁబట్టు
బాహు చతుష్కంబుఁ బంచాస్యములుఁబూను
           షణ్ముఖుపైఁ బ్రేమ సలుపుచుండు
సప్తాశ్వ చంద్రు లీక్షణములుగా నొప్పు
           నెనిమిది మూర్తుల వినుతి కెక్కు
నవనిధీశసఖుం డనఁగఁ గీర్తిని వహించుఁ
           బది కొంగులైన యంబరము గట్టుఁ
బదు నొకండు విధములఁ బ్రణుతి కెక్కు
వెలయఁ బండ్రెండు గనుపుల విల్లు పట్టుఁ
గర్మపాశలవిత్ర విఖ్యాతి మెఱయుఁ
గాశిలో మేనుఁ దొఱఁగిన ఘనయశుండు
                                                                (విక్రమార్కచరిత్రము -2-192)

ఈ పద్యంలో ఒకటి నుండి పండ్రెండు వరకు
సంఖ్యలను వరుసగా కూర్చడం జరిగింది.
కావున ఇది సంఖ్యా(శబ్ద)చిత్రముగా పేర్కొనవచ్చు.

మరణించిన జీవుడు మరణానికి ముందు ఒక్కడే.
తర్వాత  అర్థనారీశ్వర స్వరూపముగా రెండుగా అవుతాడు.
మూడు మొనలుగల (త్రిశూలం) ఆయుధం చేపట్టిన వాడవుతాడు
(పొడవటానికి ఉపయోగపడే సాధనం - పోటుముట్టులాగా).
నాలుగు చేతులు ఐదు మఖాలు కలవాడవుతాడు.
శివుడు పంచముఖలింగేశ్వరుడు గదా
ఆరు ముఖాలు గల కుమారస్వామిని లాలిస్తూ ఉంటాడు.
ఏడు గుర్రాలు రథముగా గల సూర్యుడు
చంద్రుడు నేత్రాలుగా కలవాడవుతాడు.
పంచభూతాలు- సూర్యుడు - చంద్రుడు- యజమానుడు
కలిసి అష్టమూర్తిగా ప్రసిద్ధుడవుతాడు.
నవనిధులకు అధిపతి అయిన కుబేరుని
స్నేహితునిగా కీర్తిని పొందుతాడు.
ఎనిమిది దిక్కులు - నేల - ఆకాశం
ఇవి పది కొంగులు వస్త్రాలుగా గల దిగంబరుడవితాడు.
ఏకాదశ రుద్రులుగా(పదనొకండు విధముల)కీర్తిని పొందుతాడు.
పండ్రెండు గుపులుగల పుండ్రేక్షువు వుల్లుగా ధరిస్తాడు.
పెద్ద చెఱకుగడ. ఇది అమ్మవారి విల్లు. కర్మలనే త్రాడును
త్రెంచటంలో కొడవలిగా(లవిత్ర) కీర్తి పొందుతాడు.


ఈ విధంగా పండ్రెండు వరకు
సంఖ్యలను పద్యంలో ఉపయోగించాడు


జక్కనమహాకవి.

ఇందులో ఒకటి నుండి పది వరకుగల
సంఖ్యలను పద్యంలో ఉపయోగించాడు


జనలోకైక మహారథుండు ద్విజరక్షాదక్షుఁడాజింద్రిలో
చనుఁడుద్యచ్చతురంగ సైన్యుఁడును భాస్వద్రూపపంచాస్త్రుఁడ
న్యనృపక్రౌంచషడాననుండు ఘనసప్తాశ్వాన్వయుండష్టమం
త్రి నవద్రవ్యనిధీశుఁడై దశరథాధీశుండు పెంపొందగన్ 


లోకైక = (లోక+ ఏక) = 1
ద్వి = 2, త్రి= 3, 
చతురంగ - (చతుః - అంగ) పదంలో - 4
పంచాస్త్ర లో - 5, షడాననలో - 6 , సప్తాశ్వలో - 7,
అష్టమంత్రిలో - 8, నవద్రవ్య లో 9, 
దశరథలో 10 ఈ విధంగా 
కవి సంఖ్యలను పద్యంలో 
ఉపయోగించాడు

Tuesday, February 21, 2017

ద-ప మధ్య ఉన్నది ఏది?


ద-ప మధ్య ఉన్నది ఏది?




సాహితీమిత్రులారా!



ఒక కవి ఒక రాజు దగ్గరకు వెళ్ళి
ఆ రాజును సంబోధిస్తూ ఈ శ్లోకం చెప్పాడు-

య దస్తి ద-ప యోర్మధ్యే త దస్తి తవ మందిరే
తన్నాస్తి మద్గృహే రాజన్ తదర్థ మహ మాగతః


ఓ రాజా ద-ప మధ్య ఉన్నదేదో అది నీ యింట ఉన్నది.
అది మా గృహంలో లేదు దానికోసం వచ్చాను మీవద్దకు-
అని భావం.

ఇంతకు ఏది ఆయన దగ్గరుంది
ఈయన దగ్గరలేనిది ఏదే ప్రక్కనున్నవారికి
అర్థం కాలేదు. ఇంతకు ఏమిటది-

తథదధన - పఫబభమ
అనే అక్షారాలు తీసుకుంటే
అందులో ద - ప లమధ్య
ఏముందో తెలుస్తుంది.
తథద ధన  పఫబభమ
వీటి మధ్య ధన అనేది ఉంది కదా!
అదేనండీ ధనం దానికోసం వచ్చాడు ఆయన.



అనఘులు హరిహరు లనయము దయచే


అనఘులు హరిహరు లనయము దయచే




సాహితీమిత్రులారా!


సమస్యల్లో చాలరకాలున్నాయి
వాటిలో ఛందోగోపనము- ఇది ఒక ఛందస్సులో
కనబడునుకాని అది వేరోక ఛందములోను ఉంటుంది
అలాంటి సమస్య ఇక్కడ ఒకటి -

సమస్య-
అనఘులు హరిహరు లనయము దయచే
 కొని మనుపఁ జెలువు గులుకును జగతిన్

కోటి శ్రీరాయరఘునాథ 
తొండమాన్ మహీపాలుడు పూరణ-

వనజాస్య వింటివా తెలి
యను నాయనఘులు హరిహరు లనయము దయచే
మనుపఁ జెలువు గులుకును జగ
తిని నా చెలువకును సాటి తెఱవలు గలరే

ఈ సమస్యలో రెండు మణిగణనికర పాదములు
ఈయబడినట్లు కనిపించును కాని ఇది కందపద్యమే
అనఘులు హరిహరు లనయము దయచే
కొని మనుపఁ జెలువు గులుకును జగతిన్ - ఇందులో
కొని అనే రెండక్షరములు తీసివేసినగాని
కందపద్యంలో సరిపోదు.

దీన్నే వృత్తగోపనసమస్య అని కూడ అంటారు.



Monday, February 20, 2017

వితత కైలాస వివేశపాండుర లసద్గోత్ర


వితత కైలాస వివేశపాండుర లసద్గోత్ర




సాహితీమిత్రులారా!



కిష్టిపాటి వేంకటసుబ్బకవిగారి
కేదారోపాఖ్యానములోని
మత్తేభకందగర్భసీసము గమనింపుడు-

ఇది పుణ్యవతీ, భాగ్యవతులు అనువారు
శివుని స్తుతి చేయు పద్యము-

వితత కైలాస నివేశపాండుర లస
           ద్గోత్రామరేడ్వందిరా పరాకు
నిహత పంచాంబక నీలకంధర లస
           ద్వ్యాపార మేధామతే పరాకు
వితత పద్మోదర విశ్వరక్షణ మహా
           నందీశ సద్వాహనా పరాకు
సుమతి హృత్బద్మ విశుద్ధ భాస్కరలుధా
           మాధుర్య వాక్ప్రౌఢిమా పరాకు
వరదశర హిమగిరి హరశర భవశర
జాత భవ హయతనయ శశధరకీర్తి
కరి నిశాటేంద్ర మదగిరి సురభశర మ
హాత్మ శరధి సుశరధిక హర పరాకు
                                                        (కేదారోపాఖ్యానము - 1- 128)

ఈ సీసపద్యంలోని నాలుగుపాదాలలో
మత్తేభాన్ని ఇమిడ్చాడు. అలాగే
ఎత్తుగీతి గీతపద్యంలో కందపద్యాన్ని
ఇమిడ్చాడు కవిగారు
సీసపద్యపాదములలో చివరున్న
పరాకు- అనే మూడు అక్షరాలను
తొలగించిన మత్తేభవిక్రీడిత మౌతుంది


వితత కైలాస నివేశపాండుర లస
           ద్గోత్రామరేడ్వందిరా పరాకు
నిహత పంచాంబక నీలకంధర లస
           ద్వ్యాపార మేధామతే పరాకు
వితత పద్మోదర విశ్వరక్షణ మహా
           నందీశ సద్వాహనా పరాకు
సుమతి హృత్బద్మ విశుద్ధ భాస్కరలుధా
           మాధుర్య వాక్ప్రౌఢిమా పరాకు

గర్భిత మత్తేభము -
వితత కైలాస నివేశపాండుర లస ద్గోత్రామరేడ్వందిరా 
నిహత పంచాంబక నీలకంధర లసద్వ్యాపార మేధామతే 
వితత పద్మోదర విశ్వరక్షణ మహానందీశ సద్వాహనా 
సుమతి హృత్బద్మ విశుద్ధ భాస్కరలుధామాధుర్య వాక్ప్రౌఢి మా 

ఎత్తుగీతిలో రెండవపాదం చివర దీర్ఘంగాను
నాల్గవపాదం చివర ఉన్న పరాకు- అనే పదాన్ని
తొలగించి చివరి అక్షరాన్ని దీర్ఘంగా
మార్చిన కందపద్యమౌతుంది.

వరదశర హిమగిరి హరశర భవశర
జాత భవ హయతనయ శశధరకీర్తి
కరి నిశాటేంద్ర మదగిరి సురభశర మ
హాత్మ శరధి సుశరధిక హర పరాకు

గర్భిత కందపద్యము-
వరదశర హిమగిరి హర
శర భవ,శరజాత, భవ హయతనయ శశధరకీర్తీ
కరి నిశాటేంద్ర మదగిరి 
సురభశర మహాత్మ! శరధి సుశరధిక హరా !



కల సారస్యము నీకగాక తెలియంగారాదు


కల సారస్యము నీకగాక తెలియంగారాదు




సాహితీమిత్రులారా!


సమస్య -
కల సారస్యము నీకగాక తెలియంగారాదు బింబాధరీ

పూర్వకవి పూరణ -

కలగంటిన్ వినుమిప్పుడీ కలచమత్కారంబు నీ వంచు న
వ్వొలయం బల్కెడు వారకాంతగని, "ఓహో! ఈ...కలా? ఈ...కలా?
లలనా! నాకిది చెప్పశక్యమగునా లక్షించి చూడంగ ఈ
కల సారస్యము నీకగాక తెలియంగారాదు బింబాధరీ!"


ఇందులో కవిగారు కల-ను ఈకల - ఈ..కల
విడదీసి చమత్కారంగా పూరించాడు



Sunday, February 19, 2017

దారములేని హారము


దారములేని హారము 



సాహితీమిత్రులారా!


సమస్య-
దారములేని హారము నుదారత నీకెవరిచ్చిరమ్మరో


పూర్వకవి పూరణ-

సారసనేత్ర యొక్కతె నిశాసమయంబున మంచిముత్య
ముల్
కూరిచి తా ధరించి తను కూడెడి నాథు కవుంగిలింప - చే
కూరెను ముద్ర లవ్విగని కోమలు లుట్లని రెల్ల నెచ్చలుల్
దారములేని హారము నుదారత నీకెవరిచ్చిరమ్మరో

ఒక సుకుమారి ముత్యముల హారమును
ధరించి భర్తను బిగిగా కౌగిలించుకొన్నది.
మెత్తని శరీరంపై హారముద్రలు ఎఱ్ఱగా
కన్పిస్తున్నవి. ఆమెను పరిహాసమాడుతూ
ఆమె స్నేహితురాండ్రు ప్రశ్నించు సన్నివిసేశము
కల్పించిరి కవిగారు ఇందులో.

గర్భకవిత్వం అంటే ?


గర్భకవిత్వం అంటే ?




సాహితీమిత్రులారాా!

చిత్రకవిత్వం అనేక విధలైన
కవిత్వపు రీతుల సమాకలనం.
అందులోని విభాగమే గర్భకవిత్వం.
దీనికే పద్యగోపన చిత్రమని అంటారు.
ఇది ఛందోప్రధానమైన విభాగం
ఒక ఛందస్సులో అనేక ఛందస్సులను
ఇమడ్చడం అనే ప్రక్రియనే గర్భకవిత్వం
అంటున్నారు.
మన తెలుగులో మొదట నన్నెచోడుడు
తన కుమార సంభవంలో ఈ ప్రక్రియను
ప్రారంభించాడు.
ఇందులో చతుర్విధకందము అనే పేరున
ఒక కందపద్యంలో మరో మూడు కందపద్యాలను
ఇమిడ్చి చూపాడు.
చతుర్విధకందం -

 శివుడు కుమారస్వామికి
జ్ఞానోపదేశం చేసే సందర్భంలో
తెలుగులో మొదటి చతుర్విధకందం
కూర్చబడింది చూడండి-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్
                                                                   (కుమారసంభవము - 12- 217)

సుజ్ఞానము, యోగము, తత్త్వము అనువాని విధులు తెలిసిన
ప్రాజ్ఞులు సంసారబంధములను త్రెంచుచూ, భువిలో అజ్ఞాన
పదమును పొందక స్థిరబుద్ధితో శివుని కొలిచెదరు - అని భావం

ఈ కందపద్యంలో నాలుగు కందపద్యములను
ఇమిడ్చి కూర్చబడింది.
ఈ విధంగా ఒక ఛందస్సులో అనేక ఛందస్సులను ఇమిడ్చి వ్రాయటాన్ని గర్భకవిత్వము(పద్యగూఢము) అంటారు.
ఇందులో మొదటి కందము మనం ముందుగా వ్రాసినదే

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్


మరి రెండవ కందము-
రెండవ పాదంలోని మొదటి రెండు
అక్షరాలను విడచి ప్రారంభించిన
రెండవ కందము వస్తుంది
అది ఇక్కడ చూడండి-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్

రెండవ కందము-
భవబంధనముల ద్రెంచుచు 
భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్ 
శివుఁ గొల్తు రచలభావన 
దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవిధిజ్ఞుల్

మూడవ కందము మూడవ పాదం
మొదటినుండి ప్రారంభమవుతుంది.
అది ఇక్కడ చూడవచ్చు-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్

మూడవ కందము-
కొలుతురచలభావమునఁబ్రా
జ్ఞులుశివునిన్ యోగతత్త్వసుజ్ఞాననిధి
జ్ఞులుత్రెంచుచు భవబంధన
ములఁ దవులజ్ఞానపదముఁ బొందక భువిలోన్


నాలుగవ కందము నాలుగవ పాదము రెండు
అక్షరాలను విడచి ప్రారంభించ సరిపోవును.
అది ఇక్కడ చూడండి-

సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్


నాలుగవ కందము -

శివుఁ గొల్తు రచలభావన 
దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవి  ధిజ్ఞుల్ 
భవబంధనముల ద్రెంచుచు 
భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్

వీటన్నిలో 1,3 పద్యములకు జ్ఞ - ప్రాస, 2,4 పద్యములకు
వ - ప్రాసగా గూఢపరచబడినది.


మహాసేనోదయములోని
చతుర్విధ కందముము- (2-251)

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలో ఇమిడిన కందపద్యాలు
మొదటిది-

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యంలోని రంగుల ఆధారంగా 
మొదటి గర్భిత కందం గమనించవచ్చు
ఈ విధంగా అమర్చిన పూర్తి కందమవుతుంది


భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా

ఇది పూర్తి కందము

భవహరణ మధురభాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా
నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా

రెండవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ మొదటి కందంలో పూర్వార్థము,  ఉత్తరార్థముములలో 
ఉత్తరార్థము పూర్వార్థంగా పూర్వార్థము ఉత్తార్థంగా మార్చిన 
రెండవ గర్భిత కందమగును.

శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా
నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణమధురభాషణనివహా

మూడవ కందము -


నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

ఈ పద్యాన్ని ఈ విధంగా రంగులలో చూపినట్లు 
తీసుకుంటే మూడవ పద్యం వస్తుంది

నీలాభ్రదేహ సజ్జన
పాలా భవహరణ మధుర భాషణనివహా
శైలధరశత్రు నిచయవి
ఫాలా నవకమలనేత్ర పాలితసవనా

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జన పాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవి ఫాలా

ఇది మూడవ గర్భితకందము -

నవకమలనేత్ర పాలిత
సవనా నీలాభ్రదేహ సజ్జనపాలా
భవహరణ మధుర భాషణ
నివహా శైలధరశత్రు నిచయవిఫాలా

Saturday, February 18, 2017

సీతకు తమ్ములు శంభుడన్నయున్


సీతకు తమ్ములు శంభుడన్నయున్




సాహితీమిత్రులారా!



సమస్య -
చెలువుగరామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభు డన్నయున్

పూర్వకవిపూరణ-

అలరు గణింప పంక్తిరథు నాత్మజు లెవ్వరు? మైథిలుండు నే
లలనకు తండ్రి? మన్మథుని లావు శరంబునెవ్వి? కాళికా
చెలువుని నామమెద్ది? మఱి సీరియు శౌరికి నేమి కావలెన్?
చెలువుగరామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభు డన్నయున్

ఈ సమస్యను ఐదు ప్రశ్న సమాధానంగా మార్చి పూరించాడు
దీన్ని అంతర్లాపి ప్రహేళికా అని కూడ అంటారు.
అలాగే క్రమాలంకారంగా పూరించడమైనది అని
యథాసంఖ్యాలంకారంలో పూరించబడినదని చెప్పవచ్చు.
ప్రశ్నలు-సమాధానాలు

అలరు గణింప పంక్తిరథు నాత్మజు లెవ్వరు?
-రామలక్ష్మణులు 
మైథిలుండు నే లలనకు తండ్రి?
-సీతకు 
మన్మథుని లావు శరంబునెవ్వి? 
- తమ్ములు
కాళికా చెలువుని నామమెద్ది? 
- శంభు
సీరియు శౌరికి నేమి కావలెన్?
-   అన్న


మైథిలుడు(జనకమహారాజు)
తమ్ములు(పద్మాలు)
సీరి(బలరాముడు)

ఒక సీసపద్యంలో ద్విపద, మత్తకోకిల, కందములు


ఒక సీసపద్యంలో ద్విపద, మత్తకోకిల, కందములు




సాహితీమిత్రులారా!


ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని
ఈ సీసపద్యం(821)లో నాలుగు ద్విపదలు,
ఒక మత్తకోకిల, ఒక కందం ఎలా ఉన్నాయో చూద్దాం-
దీన్ని కూర్చినది గణపవరపు వేంకటకవిగారు
ఈయన చరిత్ర చిత్రకవిత్వంలో చెప్పాలంటే ఎంతో ఉంది
ఒకమారు ఆయన్నుగురించి తెలుసుకుందాం
ఇప్పుడు ఈ పద్యం చూద్దాం-

సారసోద్భవ శర్వ సన్నుత సారవా
          రణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి దా
          రుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీ
          రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భారపా
          ర సులక్షణాపటు రమ్యకృతిస
సవితృబింబ వసతి సౌర సమాదక
విజయ భూతరాజ విదితధీర
వేదవేద్యయ భవ వేదాంత తత్వజ్ఞ
యసురనాశ! వేంకటాచలేశ!

దీనిలో సీసపద్యంలోని నాలుగు పాదాలు నాలుగు ద్విపదలే
ఎలాగంటే సీసపద్యానికి
ప్రతి పాదానికి 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలుంటాయి
దీనిలో సగం ద్విపద పాదానికి
అంటే 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం
ఇవి సీసంపద్యంలోని ద్విపదపాదాలు-

గర్భిత ద్విపద-
సారసోద్భవ శర్వ సన్నుత సార
వా రణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి 
దా రుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార 
నీ రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భార
పార సులక్షణాపటు రమ్యకృతిస


ఈ సీస పద్యంలోని చివరి 6 అక్షరాలు
తొలగిస్తే మత్తకోకిల అవుతుంది.

సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీ రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణాపటు రమ్యకృతిస

ఇది గర్భితమత్తకోకిల-

సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణా
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణా
హారమానసయుక్త హారివిహార నీ రజ వీక్షణా 
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణా

కందము సీసపద్యంలోను
ఆటవెలదిలోను గూఢపరచబడినది
మత్తకోకిలకు పోను మిగిలిన అక్షరాలు
ఆటవెదిలోని మొదటి రెండు పాదాలలోని
అక్షరాలు కందంగా రూపొందుతాయి.
ఇందులో రెండవపాదం చివర దీర్ఘం ఉండాలి కావున
తి - అనేది తీ - గా తీసుకోవాలి.

సారసోద్భవ శర్వ సన్నుత సారవారణ రక్షణావసు రమ్య నేత్ర
ధారుణీ తనయాది ధర్మవిధారి దారుణ శిక్షణాతత రూపసార
హారమానసయుక్త హారివిహార నీ రజ వీక్షణా నిధిరాజదాన
పారికాంక్షిక సత్కృపారస భారపార సులక్షణాపటు రమ్యకృతిస
సవితృబింబ వసతి సౌర సమాదక
విజయ భూతరాజ విదితధీ
వేదవేద్యయ భవ వేదాంత తత్వజ్ఞ
యసురనాశ వేంకటాచలేశ


గర్భిత కందము-

వసు రమ్య నేత్ర తత రూ
పసార నిధిరాజదాన పటు రమ్యకృతి
సవితృ బింబ వసతి సౌ
ర సమాదక విజయ భూతరాజ విదితధీ

Friday, February 17, 2017

అగస్త్యేన పయోరాశేః


అగస్త్యేన పయోరాశేః




సాహితీమిత్రులారా!



విదగ్ధముఖమండనమ్ లోని
ప్రశ్నోత్తర చిత్రం చూడండి-

అగస్త్యేన పయోరాశేః కియత్ కిం పీత ముజ్ఝితమ్?
త్వయావైరికులం వీర సమరే కీ దృశం కృతమ్?


ఇందులో రెండు ప్రశ్నలున్నాయి.
రెంటికి సమాధానం ఒకటే ఉండాలి

ప్రశ్నలు-
1. అగస్త్యేన పయోరాశేః కియత్ కిం పీత ముజ్ఝితమ్?
   (అగస్త్య మహాముని సముద్రంలోని దేన్ని ఎంత
    పరిమాణంలో త్రాగి, మరల విడిచాడు?)

2. త్వయావైరికులం వీర సమరే కీ దృశం కృతమ్?
   (వీరుడా యుద్ధంలో నీ శత్రువంశంను ఏమి చేసితివి?)

రెండింటికి సమాధానం - సకలంకమ్

1. అగస్త్యేన పయోరాశేః కియత్ కిం పీత ముజ్ఝితమ్?
   (అగస్త్య మహాముని సముద్రంలోని దేన్ని ఎంత
    పరిమాణంలో త్రాగి, మరల విడిచాడు?)

   - సకలం - కమ్
(                            సకలం - మొత్తం, కమ్ - నీటిని)
                             (సముద్రంలోని నీటినంతటిని త్రాగి
                               మూత్ర రూపంలో విడిచాడని పురాణం)


2. త్వయావైరికులం వీర సమరే కీ దృశం కృతమ్?
   (వీరుడా యుద్ధంలో నీ శత్రువంశంను ఏమి చేసితివి?)

      - స - కలంకమ్ 
                                (స - కూడుకొన్న, కలంకమ్ - మచ్చ)
                                 (శూరునికి ఓడిన శత్రుబలము, పరాజయముతో
                                   సకలంకం(మచ్చతోకూడినది) అయ్యెను)


వీరభావ భాసినత్త్వ విద్భుజారి


వీరభావ భాసినత్త్వ విద్భుజారి




సాహితీమిత్రులారా
తెనాలి రామభద్రకవి విరచిత
ఇందుమతీ పరిణయము నందలి
చతుర్దళ పద్మ బంధము చూడండి-

ఇందులో నాలుగు దళాలు ఉన్నాయి
కావున దీనికి చతుర్దళ పద్మబంధము
అన్నారు. కాని కవి చంపకబంధమని
చెప్పుకున్నాడు. ఇది ఆశ్వాసాంత పద్యం

ఉత్సాహ-
వీరభావ భాసినత్త్వ విద్భుజారి వారహా
హారవారి జారికీర్తి హారితా సుధీరసా
సారధీ సుతాఢ్య సూన చంపమాన దారకా
కారదాన మానితాధిక ప్రభావ భారవీ
(ఇందుమతీ పరిణయము - 4 - 256)



ఇందులో ప్రతి పాదం మొదటి 5 అక్షరాలు
చివరి అక్షరాలు గమనించండి.
మొదటి పాదం ప్రారంభంలోని 5 అక్షరాలు తిరిగి
నాలుగవ పాదం చివర విలోమంగా ఉన్నాయి.
అలాగే మొదటిపాదం చివరనున్న 5 అక్షరాలు
రెండవపాదం ప్రారంభంలోను,
రెండవ పాదం చివరి 5 అక్షరాలు
మూడవ పాదం మొదటిలోను,
మూడవపాదం చివరనున్న 5 అక్షరాలు
నాలుగపాదం మొదటిలోను విలోమంగా ఉన్నాయి.
అంటే ప్రతిపాదంలోను 5-5-10 అక్షరాలు
రెండుమార్లు వచ్చాయి. బంధంలో చదివేప్పుడు కూడ
అనులోమంగా విలోమంగా దళాలలో చదువవలసి ఉన్నది.
మిగిలిన అక్షరాలు మధ్యభాగంలో వ్రాయబడి ఉన్నాయి గమనింపగలరు.

ఉత్సాహ-
వీరభావ భాసినత్త్వ విద్భుజారి వారహా
హారవారి జారికీర్తి హారితా సుధీరసా
సారధీ సుతాఢ్య సూన చంపమాన దారకా
కారదాన మానితాధిక ప్రభావ భారవీ
(ఇందుమతీ పరిణయము - 4 - 256)


వీరభావ భాసినత్త్వ విద్భుజారి వారహా
హారవారి జారికీర్తి హారితా సుధీరసా
సారధీ సుతాఢ్య సూన చంపమాన దారకా
కారదాన మానితాధిక ప్రభావ భారవీ

ఇందులో ప్రతి పాదం మొదటి 5 అక్షరాలు
చివరి అక్షరాలు గమనించండి.
మొదటి పాదం ప్రారంభంలోని 5 అక్షరాలు తిరిగి
నాలుగవ పాదం చివర విలోమంగా ఉన్నాయి.
అలాగే మొదటిపాదం చివరనున్న 5 అక్షరాలు
రెండవపాదం ప్రారంభంలోను,
రెండవ పాదం చివరి 5 అక్షరాలు
మూడవ పాదం మొదటిలోను,
మూడవపాదం చివరనున్న 5 అక్షరాలు
నాలుగపాదం మొదటిలోను విలోమంగా ఉన్నాయి.
అంటే ప్రతిపాదంలోను 5 + 5 = 10 అక్షరాలు
రెండుమార్లు వచ్చాయి. బంధంలో చదివేప్పుడు కూడ
అనులోమంగా విలోమంగా దళాలలో చదువవలసి ఉన్నది.
మిగిలిన అక్షరాలు మధ్యభాగంలో వ్రాయబడి ఉన్నాయి గమనింపగలరు.




Thursday, February 16, 2017

కేషాం పంకజశోభా?


కేషాం పంకజశోభా?




సాహితీమిత్రులారా!




కవీంద్ర కర్ణాభరణంలోని
ప్రశ్నోత్తర చిత్రం చూడండి-
ఇందులో అన్నీ ప్రశ్నలే ఉంటాయి
సమాధానం మనమే చెప్పాలి
అందువలన వీటిని బహిర్లాపిక ప్రహేలికలు
అనికూడ అనవచ్చు.

కేషాం పంకజశోభా? ధూర్తజనః కీదృశం వధూమిచ్ఛేత్?
వక్తు మహోత్తర మేకం కమలభవ స్యాయురేవ వర మవధిః

ఇందులో రెండు ప్రశ్నలున్నాయి
1.కేషాం పంకజశోభా ?
2. ధూర్తజనః కీదృశం వధూమిచ్ఛేత్ ?

అనేవి వీటికి సమాధానం చెప్పడానికి కవి
బ్రహ్మ ఆయుష్షంత అవకాశం ఇచ్చాడు.
అయితే రెండుప్రశ్నలకు సమాధానం
ఒకటిగానే ఉండాలి - అది షరతు.

రెండింటికి సమాధానం - సరసామ్

1. కేషాం పంకజశోభా ?
   వేటికి తామరపువ్వులు శోభను తెస్తాయి?

   - సరసామ్ (పెద్దచెరువు లేక కొలనుకు)

2. ధూర్తజనః కీదృశం వధూమిచ్ఛేత్?
   ధూర్తుడు ఎలాంటి స్త్రీని కోరుకుంటాడు?

- సరసామ్
   (శృంగారరస విశిష్టయైన స్త్రీని) కోరుకుంటాడు.



పంచాంగము చూచి పక్కున నవ్వెన్


పంచాంగము చూచి పక్కున నవ్వెన్ 




సాహితీమిత్రులారా!



సమస్య -
పంచాంగము చూచి లంజ పక్కున నవ్వెన్


పూర్వకవి పూరణలు-

పంచమి నాఁడొక విప్రుడు
కంచముఁ దాకుదువఁ బెట్టి కామాతురుఁడై
మంచముపై రతిసేయఁగ 
పంచాంగము చూచి లంజ పక్కున నవ్వెన్

మరోపూరణ-

పంచమినాఁడొక విప్రుఁడు
అంచితముగ చెట్టు నెక్కి యాకులు కోయన్
కించిత్తు పంచదొలఁగిన
పంచాంగము చూచి లంజ పక్కున నవ్వెన్

రెండు పూరణలు ఒక సందర్భాన్ని ఆధారం చేసుకొని
పూరించడం జరిగింది. పంచాంగము అంటే తిథివార
నక్షత్రాలను చూచేది కాదని పురుషాంగంగా  అర్థాన్ని
మార్చడం వలన  సందర్భోచితమైనది పూరణ.



మీరునూ మరో విధంగా పూరించి పంపగలరు

Wednesday, February 15, 2017

ప్రతిభాయాః పరంతత్త్వం


ప్రతిభాయాః పరంతత్త్వం




సాహితీమిత్రులారా!



వేదాంతదేశికులవారి
శ్రీరంగనాయక పాదుకా సహస్రంలోని
6 వ శ్లోకం చూడండి-
ఇది క్రియాగూఢచిత్రానికి సంబంధించిన శ్లోకం

ప్రతిభాయాః పరంతత్త్వం
బిభ్రతీ పద్మలోచనమ్
పశ్చిమాయామవస్థాయాం
పాదుకే ముహ్యతో మమ

హేపాదుకే - ఓ పాదుకా దేవీ
పశ్చిమాయాం - చివరిదైన
అవస్థాయాం - దశయందు
ముహ్యతః - మూఢుడనైన
మమ - నాకు
పరం తత్త్వం - ఉత్కృష్టవస్తువైన
పద్మలోచనమ్ - పుండరీకాక్షుణ్ని
బిభ్రతీ - భరించేనీవు
ప్రతిభాయాః - ప్రత్యక్షమగుము

చరమదశలో శ్రీరంగనాథుని దర్శనము
కలిగించమని పాదుకాదేవిని కవి ప్రార్థించే శ్లోకం ఇది -

ఓ పాదుకా దేవీ పరతత్త్వమైన పుండరీకాక్షుణ్ని వహించే నీవు.
అజ్ఞానినైన నాకు అంత్యకాలంలో ప్రత్యక్షంకావాలి - అని భావం

ఇందులో క్రియాపదం ప్రతిభాయాః అనేది
ప్రతి - పూర్వకమైన
భా - దీప్తౌ - అనే ధాతువు యొక్క
ఆశీర్లిజ్ మధ్యమపురుషైక వచనాంతం
కాని కొందరు ఆకారాంతస్త్రీలింగమైన ప్రతిభా శబ్దం
యొక్క షష్ఠీ విభక్తి ఏకవచనాంతరూపంగా
భ్రమించి వంచితులౌతారు
కావున దీన్ని క్రియావంచనం లేక
క్రియాగూఢచిత్రంగా పిలుస్తారు.