Tuesday, April 30, 2019

పుస్తకం ఎలా చదవాలి ?


పుస్తకం ఎలా చదవాలి ?




సాహితీమిత్రులారా!


నీషే మతి పోగొట్టుకొన్న ఈ నగరం లో పుస్తకప్రదర్శన నిజంగా ఈ నగరానికి పెట్టని నగ.ఖచ్చితంగా చెప్పాలంటే ఒకలాంటి విషవలయం!చాలా దుకాణాల్లో జర్మన్‌తత్వవేత్త పుస్తకాలు! అనంతంప్రచురణ రంగం బాగా పసిగట్ట గల అంశమే, ఎందుకంటే అది కీర్తిశేషుడైన ఒక రచయిత అస్తిత్వాన్ని అతని పరిమితులను మించి పొడిగిస్తుంది కనుక. మనమనుకొనే తెంపులేని భవిష్యత్తును బ్రతికున్న రచయిత కళ్ళముందుంచుతుంది.
మొత్తానికి, పుస్తకాలు మనకన్నా తక్కువ పరిమితమైనవి.వాటిలో అన్నిటికన్నా చెత్త అనుకొన్నది కూడా రచయితను మించి బ్రతుకుతుంది.ముఖ్యకారణం దాని రచయిత కన్నా అది ఆక్రమించే స్థలం చాలా తక్కువ.పిడికెడు మట్టిగా మారిన రచయిత కన్నా, అరల్లో మట్టిగొట్టుకు పోయి,ఇవి ఎక్కువ కాలం జీవిస్తాయి. మిగిలిన బంధుమిత్రుల జ్ఞాపకాల(అంతగా ఆధారపడలేము) కన్నా ఈ తరహా భవిష్యత్‌చాలా నయం.ఈ తరహా మరణాంతర దృష్టి కవి కలాన్ని కదిపే శక్తి. నలు చదరంగా ఉన్న వీటిని అటూఇటూ తిప్పుతాం మన చేతులతోచిన్నవి ,పెద్దవి , మరీ పెద్దవిఅస్థి శకలాలను కదుపుతున్నాము అనుకోవడం లో తప్పేమి లేదు. ఒకపుస్తకం నవల,తత్వ గ్రంథం,కవితాసంకలనం,ఆత్మకథ,రోమాంచకిఏదైనా సరే చివరికి అది మనిషి ఏకైక జీవితమే;మంచో,చెడో , కానీ ఎప్పుడూ పరిమితమే. తత్వ వివేచన మృత్యుసమక్షంలో మనిషిచేసే పని అని ఎవరన్నారో అది అక్షరాలా నిజం.

రచిస్తూ ఎవడూ యువకుడు కాలేడు. అలాగే,చదవడం వల్ల ఎవడూ యువకుడు కాలేడు.అదిలా ఉండబట్టే మనమందరం మంచి పుస్తకాలు చదవడానికి సహజంగా అంత ప్రాధాన్యతనిస్తాం.సాహిత్యం లోనే కాదు ఎందులోనూ,మంచి అన్నది సొంతంగా నిలబడేది కాదు.చెడు నుండి విడదీస్తూ మనం దాన్ని నిర్వచిస్తాము.ఒక మంచి పుస్తకాన్ని రాయడానికి రచయిత నానా చెత్తంతా చదవాల్సి వుంటుంది.లేని పక్షంలో ఇదమిత్థమని తేల్చుకోలేడు.ఈ రకంగా చెడు సాహిత్యానికి కూడా చివరికి ఒక విధమైన సమర్థన దొరుకుతుంది.

మనమందరం చనిపోతాము కాబట్టి,పుస్తకాలు చదవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, మనమేదైనా ఒక ఉపాయం కనుక్కోవాలిమన సమయం ఆదా చేసుకోవడానికి. లావాటి నవలనొకదాన్ని ముందేసుకొని,హాయిగా పేజీలు తిరగేస్తూ పోవడంలో ఆనందం ఉంది,కాదనను.కానీ,అలా ఎక్కువ కాలం గడపలేము. చివరికి,ఏదో ఒకనాడు చదవడం చదవడంకోసమే కాకుండా ఏదోకొంత నేర్చుకొనడానికి చదువుతాము.కావున క్లుప్తత, సంక్షిప్తత,సమ్మేళనాల అవసరంఅన్ని రకాల మానవ యాతనను దేదీప్యమానంగా ప్రదర్శించడానికి ఇంకోలా చెప్పాలంటే ఒక అడ్డదారి అవసరం ఉంది.అటువంటి అడ్డదారి ఒకటి ఉందా?(ఉంది,దాని గురించి తర్వాత)అన్న మన అనుమాన ఫలంఅక్షర సముద్రాన్ని తరించడానికి ఒక దిక్శూచి అవసరం.

సమీక్షకుల పుణ్యమా అని సాహిత్య విమర్శ దిక్శూచి పాత్ర వహిస్తుంది,అయ్యో ఈ ముల్లు విపరీతంగా ఊగిసలాడుతుందే.ఒకరికేది దక్షిణమో మరొకరికి అది ఉత్తరం!తూర్పు పడమరల విషయంలో ఈ తతంగం మరీ దారుణం.సమీక్షకులతో వచ్చిన చిక్కల్లా (అధమ పక్షం) మూడు రకాలు.

1.వాడు దివాలకోరు కావచ్చు.అతనూ మనలాంటి అజ్ఞానే కావచ్చు.

2.కొన్ని రకాల రచనల పట్ల పక్షపాతం ఉండవచ్చు;లేదా ముద్రాపకుల కోసం పనిచేస్తూ ఉండవచ్చు.

3.అతడు గొప్ప రచయితే ఐతే(బోర్జెస్‌లా)తన సమీక్షనే గొప్ప కళాఖండంలా మలచవచ్చు.ఆ సమీక్షలో పడిపోయి మనం మూలాన్ని వదిలేయవచ్చు.

ఏది ఏమైనా ,ముంచుతుందో ,తేలుస్తుందో తెలియని ఒక దుంగను అంటిపెట్టుకొని,నీవు సముద్రంలో కొట్టుకుపోతూనే ఉంటావు.అన్ని దిక్కులా పుటలు తిరగేస్తున్న సవ్వడి. దీనికి ఒక ప్రత్యామ్నాయం , నీ సొంత అభిరుచిని నీవు పెంపొందించుకోవడం ,నీ దిక్శూచిని నీవు తయారు చేసుకోవడం.బాగా ప్రకాశించే, మిణుకుమిణుకుమనే, కొన్ని తారలతో,నక్షత్ర మండలాలతో పరిచయాన్ని పెంచుకోవడం.కానీ ఇవన్నీ చేయడానికి లెక్కకుమిక్కిలి ఎక్కువ కాలం పట్టవచ్చు.ఈ లోపు తలనెరిసి ముసిలి వాడవైన తర్వాత కూడాఏదో పుస్తకం చేబూని..రోజులు లెక్క బెట్టుకొంటూ ఉండవచ్చు.పోతే, మరో మార్గాంతరం ఇందాక అనుకొన్నట్టుగానే.. ఎవరో ఒకరి మాటను నమ్మడం స్నేహితుడి సలహా,నీవు బాగా ఇష్టపడే పుస్తకంలోనీ ఒక ఉట్టంకింపుఏ రకంగా వ్యవస్థీకృతం కాకున్నా,ఈ తరహా పద్ధతులు మనం బాల్యం నుండి అలవాటు పడినవే. కానీ,దీన్ని నమ్ముకోలేం.కారణం సాహిత్య సముద్ర మట్టం దినదినం పెరిగిపోతూ ఉండటమే.(ఈ పుస్తక ప్రదర్శన దీనికి నిరూపణ;ఇది మరో పెను ఉప్పెన సుమా!) మరి ఎక్కడ కాలు మోపడానికి గట్టినేల?అది నివాస యోగ్యం కాని ద్వీపం అయినా సరే! నాలుగు మాటలు చెప్పదలిచాను.

నా సూచనసాహిత్యంలో ఉత్తమ అభిరుచిని ఏర్పరచుకోవడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గంమీకు తెలియచేసే ముందుగాఈ పరిష్కార మూలం గురించి..

అనగా ఏ గొప్పతనం లేని నా గురించిఅహంకారానికి లోనై కాదు,ఒక భావం విలువ అది జనించే సందర్భానికి సంబంధించి ఉంటుందని నమ్మడం వల్లనేనే ప్రచురణకర్తనైతే ,పుస్తకం అట్టమీద రచయిత వివరాలతో పాటు,ఆ రచన చేసేనాటికి ఖచ్చితంగా అతని వయసు ఎంతో ముద్రిస్తాను. వయసులో తమకన్న అంత చిన్న లేదా అంత పెద్ద రచయిత మాటలను పట్టించుకోవాలా వద్దా అన్న విషయాన్ని పాఠకులే తేల్చుకొంటారు.

నేను చేయబోయే సూచన ఒక వర్గానికి(నేను తరం అన్న పదాన్ని వాడలేను, కారణం అది ఒక బరువునూ,ఐకమత్యాన్ని సూచిస్తుంది) చెందిన మనుషులకు చెందినది.వారికి సాహిత్యం సహస్ర నామాలతో సాక్షాత్కరిస్తుంది.అడవి మనిషి కూడా నాగరిక సమాజం లో వారిని ఎగాదిగా గమనిస్తాడు.వీరు సమూహాల్లో ఇబ్బందిగా కదులుతారు.పార్టీలో గానా బజానాలో వీరు పాలు పంచుకోరు.అక్రమ సంబంధాలకు తాత్విక ప్రాయశ్చిత్తాలను వెదుకుతారు.రాజకీయాల చర్చల్లో ఒక పట్టాన ఒప్పుకోరు.తమ గురించి చెడుప్రచారం చేసే వారిని మించి తమ్ము తాము ఈసడించుకొంటారు.గంజాయి,భంగు కాకున్నా పొగ,తాగుడుతో సరిపెట్టుకొంటారు. అటువంటివారు అప్పుడప్పుడు జైలుగదిలో తమ రక్తంలో తాము ఈదుతున్నట్టు లేదా వేదిక నెక్కి మాటాడుతున్నట్టు కనిపిస్తారు.వారు తిరగబడుతున్నది(సరిగ్గా చెప్పాలంటే నిరసిస్తున్నది)కేవలం అన్యాయానికి ప్రతిగా కాదు,ఏకంగా ప్రపంచమార్గం మీద!తమ ఆలోచనలు,భావాలు నిక్కచ్చి అన్న భ్రమలు వారికి ఏ కోశానా లేవు.క్షమించరాని ఆత్మాశ్రయత్వం మీదే ఆదినుండి వారి పట్టుదల.దాడికి గురి కాకుండా తమ్ము తాము కాపాడుకోవడానికి వారలా చేయడం లేదు.వారి భావాలు, వాటిని పదిలపరిచే స్థానాలు ఎంత తేలికగా దెబ్బ తినగలవో వారికి బాగా తెలుసు.డార్విన్‌సిద్ధాంతానికి వ్యతిరేకంగా దెబ్బతినడమే జీవలక్షణమని వారు భావిస్తారు.ఐతే ఒక విషయం ఆత్మపీడనకు ,దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇటీవలి కాలంలో స్వతంత్ర ధోరణిలో రాసిన ప్రతిరచయితకి దీన్ని అంటగట్టడం ఒక ఆనవాయితి అయిపోయింది.కళలో మూసపోతను(cliche)అరికట్టే సాధనాలు తీవ్రమైన ఆత్మాశ్రయత్వం,దురభిప్రాయం,అమిత ఇష్టాలు అన్న వారి సహజాతానికి లేదా స్వతస్సిద్ధమైన ఎరుకకి సంబంధించినదిది.మూసధోరణికి(cliche)వ్యతిరేకతే కళను జీవితం నుండి వేరు పరుస్తుంది.

నేను చెప్పబోయే దాని నేపథ్యం మీకు కొంతవరకు తేటతెల్లమైందనుకొంటా, సరే చెప్పివేస్తాను.

సాహిత్యంలో ఉత్తమాభిరుచిని పెంపొందించే ఏకైక సాధనం కవిత్వం.కవినన్న పక్షపాతంతో,ఏదో ప్రయోజనాలనాశించి నేనిలా చెబుతున్నానని మీరనుకొంటే అది శుద్ధ తప్పు.అందునా,నాకు ఎటువంటి సంఘాలతో ప్రమేయం లేదు.

కవిత్వం మానవ అభివ్యక్తికి చరమ రూపం.కవిత్వం బహు క్లుప్తమే కాదు, మానవ అనుభవాన్ని వ్యక్తం చేసే సంక్షిప్త మార్గం.భాషాగత కార్యకలాపాలకు సాధ్యమైనంత ఉన్నత ప్రమాణాలను నిర్ణయిస్తుంది..ప్రత్యేకించి వ్రాతలో!

కవిత్వాన్ని పఠించేకొద్దీరాజకీయ,తాత్విక గ్రంథాలు,చరిత్ర,సామాజిక శాస్త్రాలు,నవలలుఎందులో కూడా శబ్దాడంబరాన్ని(verbosity)బొత్తిగా భరించలేరు.ఈ కవిత్వశబ్దాల్లోని(poetic diction)తీక్ష్ణమైన క్లుప్తత,వేగం,ఖచ్చితత్వాలకు లోబడే ఉంటుంది వచనం లో మంచి శైలి కూడా.మరణ శాసనానికి,పరమ సూక్తికి జన్మించిన కవిత భావింపదగిన ఏ విషయానికైనా బహు దగ్గరి దారి;గద్యానికి పద్యం క్రమశిక్షణ గరపుతుంది.ప్రతిపదం విలువ,పాదరసంలా జారిపోయే మానసిక గతులు, దీర్ఘపంక్తులకు మార్గాంతారం,అనవసర వివరాలను,తేలికగా అర్థమయే దాన్ని విసర్జించే ఒడుపు,ముగింపు శిల్పంగద్యానికి తెలిసివచ్చేలా చేసేది పద్యమే.. కవిత్వమే.సాధారణ రచనని,అపూర్వ కళని వేరుచేసే తాత్వికకాంక్షను గద్యంలో రగిలించేది కవిత్వమే.ఈ విషయంలో గద్యం,పద్యం కన్నా చాల మందమతి. దయచేసి,నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు.నేను గద్యాన్ని కొట్టి పారేయడం లేదు. నిజానికి,పద్యం, గద్యం కన్నా బహు ప్రాచీనం.సాహిత్యం కవిత్వంతోనే మొదలయింది. గుహవాసి చిత్రించిన బొమ్మకన్నా,దిమ్మరి పాడిన పాట బాగా పురాతనమైనది.

వెనుకట,ఎప్పుడో నేను పోల్చినట్టు,గద్యం కాల్బలం,పద్యం వాయుసేన.పైవాటి ద్వారా నేను నిరూపించ దలచుకొన్నవి కవిత్వ అధికారశ్రేణి,అనాది మూలాలు అంతకన్నా కావు. ఆచరణీయమైన విషయాలు నాలుగు చెప్పి,అచ్చుపడిన ప్రతిపుస్తకాన్ని చదివే శ్రమకు లోను కాకుండా,మీ దృష్టిని,మెదడుని కాపాడే యత్నం. కవిత్వం ఖచ్చితంగా ఆ ఉద్దేశంతోనే కనిపెట్టబడింది.కారణం అది క్లుప్తతకు పర్యాయపదం!కొన్ని సహస్రాబ్దాల ఈ ప్రక్రియను సూక్ష్మంగా సింహావలోకనం చేసుకోవాలి.నీవనుకొన్న దానికన్నా ఇది సులువే,పద్యం గద్యం కన్న తక్కువ బరువు కాబట్టి.కేవలం సమకాలీన సాహిత్యం మీదే దృష్టి నిలిపావా..ఇక నీ పని నల్లేరుపై బండినడక.ఓ రెండునెలలు శ్రద్ధగా నీ మాతృ భాషలో వచ్చిన కవుల రచనలను సంపాదించు,ముఖ్యంగా ఈ శతాబ్ది ఆదిగా.. ఓ డజను పుస్తకాలు సమకూరుతాయి! ఈ వేసవి ముగిసేసరికల్లా నీ ప్రయత్నానికి మంచి రూపు వస్తుంది.

కవిత్వపఠనం తర్వాత అలమరాలో అలవాటైన గద్యాన్ని తీసి అవతల గిరవాటేస్తావు. అది నీ తప్పు కాదు.నీవింకా వదలకుండా చదువుతున్నావంటే అది ఆ గద్య రచయిత ఘనత.మన అస్తిత్వానికి సంబంధించిన నిజాలను,కవుల్లాగే,అతనూ వెల్లడిస్తున్నాడు. ఇది ఆ గద్య రచన ఏ మాత్రం భారం కాదని నిరూపిస్తుంది.అంతేగాక అతని భాషలో జవజీవాలు పుష్కలంగా ఉన్నాయి.లేదా నీవు పఠన వ్యసనానికి గురయ్యావు.ఇతర వ్యసనాలతో పోలిస్తే ఇదేమంత చెడ్డదేమీ కాదు.

నన్నొక వ్యంగ్య చిత్రాన్ని(caricature) గీయనివ్వు.కారికేచర్లు అవసరమైన దాన్ని బలంగా ఎత్తి చూపుతాయి.నా కారికేచర్‌లో చదువరి రెండుచేతులా పుస్తకాలు.ఎడమ కవిత్వం,కుడి వచనం.దేన్ని ముందు పడవేస్తాడో చూద్దాం.అతని రెండు చేతుల్లో గద్యమే ఉండే అవకాశం లేకపోలేదు.కానీ అది అత్మ తిరస్కారానికి దారి తీస్తుంది.మీరు అడగవచ్చు మంచి,చెడు కవిత్వాలను ఎలా వేరు చేయాలి అని.అతని ఎడమ చేతిలో ఉన్నది చదవ దగ్గదే అనడానికి భరోసా ఏమిటి?అని. ఒకటి ఎడమ చేతిలో ఉన్నది,కుడిచేతిలో ఉన్నదాని కన్నా తేలిక అవడానికి ఎక్కువ అవకాశం.రెండు.కవిత్వం ఇటాలియన్‌కవి మొంటాలే చెప్పినట్టు అర్థ కళ!అందులో బుకాయింపుకు అవకాశాలు బొత్తిగా తక్కువ.మూడవ పంక్తి చదవగానే పాఠకుడికి తన ఎడమచేతిలో ఉన్నది ఏపాటి పుస్తకమో అర్థమై పోతుంది.కవిత్వం త్వరగా గ్రహింపు కొస్తుంది,దానిలోని భాషసౌష్టవం భావాన్ని ఇట్టే అందేలా చేస్తుంది.మూడు కవితా పంక్తులు తేరిపార చూశాక అతను కుడి చేతివైపు దృష్టి సారించవచ్చు.

ముందే చెప్పినట్లు ఇది కారికేచర్‌. మీకు తెలియకుండా మీరు ఇదే భంగిమలో నిలిచి పుస్తకాలు పరిశీలిస్తూ ఉండవచ్చు.వివిధ సాహిత్య ప్రక్రియలకు చెందిన పుస్తకాలను ఎంచుకోండి.కుడి వేపు,ఎడమ వేపు మార్చి మార్చి చూడాల్సిరావడం మతిపోగొట్టే పనే, ఒప్పుకొంటాను.టూరిన్‌వీధుల్లో గుర్రబ్బండ్లు ఇప్పుడు లేవు.ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక బగ్గీ వాడు తన గుర్రాన్ని చర్నాకోలాతో బాదే దృశ్యం నిన్ను ఇబ్బంది పెట్టదు ఒకప్పటిలా. ఈ పుస్తక ప్రదర్శనలో ఉన్న అన్ని పుస్తకాల్లోని అక్షరాలను మించి పెరిగే ఈ గుంపులకు , ఒక వందేళ్ళ తర్వాత ఎవరి పిచ్చి ,అంతగా పట్టక పోవచ్చు.సరే,నేను ఇందాక చెప్పిన చిట్కా ను నీవు అమలులో పెట్టు.

(ట్యూరిన్‌,ఇటలీ లో తొలిపుస్తక ప్రదర్శన(మే,1988) సందర్భంగా బ్రాడ్‌స్కీ చేసిన ప్రసంగం)
------------------------------------------------------
రచన: తమ్మినేని యదుకులభూషణ్, 
ఆంగ్లమూలం జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ,
ఈమాట సౌజన్యంతో

Monday, April 29, 2019

తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం


తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం





సాహితీమిత్రులారా!

భారత చరిత్రలో 19వ శతాబ్దం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ శతాబ్దం. ఈ శతాబ్దిలోనే దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం స్థిరపడింది. 1857-58 కాలంలో వచ్చిన తిరుగుబాట్లు అలజడులు తగ్గి అందులోంచి నిబ్బరంగా ప్రభుత్వం నిలదొక్కుకుంది. వ్యాపారం చేసుకోవడానికొచ్చిన కంపెనీ వారికి అనుకోకుండా ఒళ్ళో పడ్డ ఆస్తిగా కాకుండా, భారతదేశం తమ వల్ల అనాగరికత లోంచి నాగరిక స్థాయి లోకి తీసుకు రాబడ వలసిన భూఖండంగా బ్రిటిష్ వాళ్ళు ఈ శతాబ్ది లోనే గుర్తించారు. బ్రిటన్ పశ్చిమ నాగరికతలో అత్యున్నత స్థాయిలో వుంది. భారతదేశం అణిగిపోయి శిథిలమైన నాగరికతకు చిహ్నంగా చూడబడుతోంది. ఈ రెండింటి మధ్య సంబంధాలు ఈ శతాబ్దిలో అతి ముఖ్యమైన పరిణామాలకి దారి తీశాయి. ఈ పరిణామాలకి అందరూ అంగీకరించే ఒక వ్యాఖ్యానం ఏదీ లేదు. బ్రిటిష్ పరిపాలన వల్ల భారతదేశానికి సంక్రమించిన మేళ్ళు/కీళ్ళు చాలా వున్నాయి. ఇంగ్లీషు విద్య, అచ్చు యంత్రప్రభావం, ‘ఎన్‌లైటెన్మెంట్’ పేరుతో వ్యాప్తిలోకి వచ్చిన సాంస్కృతిక పునరుజ్జీవనం, దానితో పాటు వచ్చిన విక్టోరియన్ నైతిక స్పృహ, క్రైస్తవులు ప్రతిపాదించిన ప్రవర్తన మార్గాలు, ఇంకా అనేక లక్షణాలతో కలగాపులగంగా ఉన్న ఈ మార్పుల్ని ‘వలస కాలపు ఆధునికత’ అని తరచు అంటూ వుంటారు. ఈ భావ పరిణామాల వల్ల భారతీయుల ప్రపంచ దృక్పథంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఇప్పుడు మనం ఆధునిక కాలపు భారతదేశం అనే దాన్ని నిర్మించడానికి కారణాలయ్యాయి.

ఈ చిన్న వ్యాసంలో అవన్నీ చర్చించడానికి వీలు లేదు కానీ, బ్రిటిష్ వాళ్ళతో పరిచయం కారణంగా తెలుగు దేశంలో వచ్చిన రెండు మార్పులను మాత్రం వివరంగా చర్చిస్తాను. అందులో ఒకటి అచ్చు యంత్రప్రభావం. రెండవది ఇంగ్లీషు విద్యా విధానం. ఈ రెంటి ప్రభావం ఫలితంగా భారతీయులు తమ గ్రంథాలని చదివే, పరిష్కరించే, అర్థం చేసుకునే పద్ధతుల్లో వచ్చిన మార్పుల్ని ప్రముఖంగా ప్రస్తావిస్తాను. యూరోపులో అచ్చు యంత్రం అమలు లోకి తెచ్చిన వాడు గూటెన్‌బెర్గ్ (Johannes Gutenberg). ఆ అచ్చు యంత్రం ఫలితంగా వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల్ని గూటెన్‌బెర్గ్ విప్లవం అంటారు. అయితే ఆ విప్లవం తాలూకు ఫలితాలు భారతదేశంలో ఎలా ప్రవర్తిల్లాయి అన్నది ఈ వ్యాసానికి మించిన పెద్ద విషయం. ఆ పని పరుచూరి శ్రీనివాస్, పప్పు నాగరాజు – ఈ ఇద్దరూ వేరేగా చేస్తున్నారు.

అంచేత ఈ చిన్న వ్యాసంలో నా పరిధిని చిన్నది చేసుకుని ‘సుమతి శతకం’ ఈ కాలంలో, అంటే 19-20 శతాబ్దాలలో, ఎన్ని మార్పులు పొందిందో పరిశీలించడం ద్వారా కొన్ని ప్రతిపాదనలు చేస్తాను. బ్రిటిష్ వాళ్ళు ప్రవేశ పెట్టిన స్కూళ్ళలో ఈ పుస్తకం వాడడం మూలంగా గ్రంథ సంస్కృతిని గురించి భారతీయుల ఆలోచనా ప్రపంచంలో పెద్ద మార్పు (epistemic shift) వొచ్చిందని సూచిస్తాను. బ్రిటిష్ వాళ్ళతో సంపర్కం కారణంగా భారతదేశంలో వచ్చిన ఆధునికతని ‘వలస కాలపు ఆధునికత’ అని ఎందుకు అనాలంటే భారతదేశంలో అంతకు ముందే వేరే రూపంలో ఇంకొక ఆధునికత ఉన్నది అని గుర్తుచేసి దాని నుంచి ఈ కొత్త ఆధునికతని విడదీయటం కోసం [చూ: Afterword to Girls for Sale, 2007].

ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం లోంచి పరిపాలన లోకి వచ్చిన తరువాత తీసుకున్న బాధ్యతలలో ఒకటి తమ పాలనలో వున్న ప్రజలకి ‘నీతి’ (morals) బోధించడం. అందుకోసం ఒక మెట్టు అందరూ చదువుకోడానికి వీలుగా వుండే బడులను (Public schools) ఏర్పాటు చేయడం. ఇలాంటి స్కూళ్ళను ఏర్పాటు చేయడం వల్ల కంపెనీ ప్రభుత్వానికి కొన్ని కొత్త బాధ్యతలు, దానితో పాటు కొన్ని కొత్త అధికారాలు సంక్రమించాయి. పిల్లల చేత చదివించడం కొత్త బాధ్యత ఐతే, వాళ్ళు ఏం చదవాలో నిర్ణయించడం వాళ్ళకు కొత్తగా వచ్చిన అధికారం. ఆనాటికే కంపెనీ ప్రభుత్వం ఆదరం వల్ల ఇంగ్లీషు నేర్చుకున్న ఫలితంగా లాభసాటి అయిన ఉద్యోగాలు పొంది సుఖంగా బతుకుతున్న పెద్ద మనుషులు బ్రిటిష్ సంస్కృతి భారతీయ సంస్కృతి కన్నా గొప్పది అని మనసారా నమ్మడం ప్రారంభించారు. ఆ నమ్మకంలో భాగంగా భారతదేశంలో మనుషులకి నీతి లేదు అనే బ్రిటిష్ ప్రభువుల నమ్మకం వాళ్ళలో స్థిరంగా యేర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీలో వున్న సాదర్ అదాలత్ కోర్టులో అనువాదకుడిగా చేరిన వెన్నెలకంటి సుబ్బారావు (1784-1839) అనే తెలుగు నియోగి బ్రాహ్మణుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంలో భారతీయులు పొందగలిగిన అత్యున్నతమైన ఉద్యోగంలో వుండిన ఆయన, తెలుగు పిల్లలకి నీతి గట్టిగా బోధించాలని భావించాడు. మద్రాసు స్కూల్ బుక్ సొసైటీలో సభ్యుడిగా నియమించబడిన ఆయన, స్కూళ్ళలో జరిగే బోధన గురించి 1820లో ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించాడు. పిల్లలకి నీతి బోధించవలసిన అవసరాన్ని గురించి చెప్తూ, ఆయన వివిధ గ్రంథాలనుంచి నీతిబోధకమైన భాగాలను ప్రాంతీయ భాషల్లో రాసి పిల్లలకి బోధించాలి [Subbarao, 1976] అని ప్రత్యేకంగా సిఫారుసు చేశాడు.

నీతి అనే మాటలో అర్థ విపరిణామం
సుబ్బారావు సిఫారసుతో ఈస్ట్ ఇండియా కంపెనీ వుద్యోగంలో వున్న తెలుగు పండితులందరూ తెలుగు పుస్తకాలలో స్కూళ్ళలో పాఠం చెప్పడానికి అనువుగా వుండే నీతి భాగాల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇంగ్లీషులో moral అనే మాటకి వాళ్ళకి తెలుగులో సమానార్థకంగా తట్టిన మాట నీతి. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో వున్న తెలుగు పండితులు సంస్కృతంలోను తెలుగు ప్రాచీన కావ్యాలలోను గట్టి ప్రవేశం వున్న వాళ్ళు. Moralకి సమానార్థకమైన మాట నీతి కాబట్టి సంస్కృతంలో నీతిబోధకమైన పంచతంత్ర కథలు morals బోధించడానికి పనికొస్తాయి అనే అభిప్రాయానికి వచ్చారు. 1834లో రావిపాటి గురుమూర్తి శాస్త్రి అనే కంపెనీ ఉద్యోగి పంచతంత్ర కథల్ని తెలుగులో రాశాడు. వాటినే 1853లో చిన్నయసూరి తాను లాక్షణికమైనది అనుకునే భాషలో తిరిగి రాశాడు.

[పంచతంత్ర కథలు స్కూళ్ళలో పాఠం చెప్పబడే స్థితికి ఎలా వచ్చాయో స్పష్టంగా బోధ పడటం లేదు. చిన్నయసూరి మద్రాసు యూనివర్సిటీలో తెలుగు హెడ్ మాస్టర్‌గా పని చేసేవాడు. తాను లాక్షణికమైనది అనుకునే భాషలో రాసిన పంచతంత్రానికి ఇంగ్లీషులో ‘నీతిచంద్రిక or Moral stories’ అనే పేరు పెట్టి మద్రాసు యూనివర్సిటీకి, College of Fort St. Georgeకి కార్యదర్శిగా వుండే A.J. Arbuthnot Esq. గారికి సవినయంగా అంకితమిచ్చాడు (respectfully dedicated as a mark of respect), కొత్తపల్లి వీరభద్రరావు, 1986; పే. 239-40.]

పంచతంత్రం సంస్కృతంలో అందరికీ తెలిసిన గొప్ప కథల పుస్తకం. విష్ణుశర్మ అనే పండితుడు మూర్ఖులైన రాజుగారి ముగ్గురి పిల్లల్ని ఆరు నెలల్లో రాజనీతి కుశలులుగా చేస్తానని ప్రతిజ్ఞ చేసి అందుకోసం ఈ పుస్తకం రాశాడు. అంటే దానర్థం ఈ పుస్తకం రాసింది మోరల్స్ అనే నీతిని బోధించడానికి కాదు. రాజనీతి అనే నీతిని బోధించడానికి. నీతి అనే పదాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేయడంలో వచ్చే సాంస్కృతిక సమస్యలు అప్పట్లో వాళ్లకి స్పష్టపడలేదనే అనుకోవలిసి వస్తోంది. నీతి అనే సంస్కృత పదానికి యూరోపియన్ భాషల్లో సమానార్థకం లేదని పంచతంత్రాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసిన రైడర్ (Arthur W Ryder) గుర్తించాడు. అతని మాటల్లో ‘నీతి’ అంటే జీవితాన్ని వివేకంగా నడుపుకునే పద్ధతి అని అర్థం. “ఇంగ్లీషులో కానీ, ఫ్రెంచ్‌లో కానీ, లాటిన్‌లో కానీ, గ్రీక్‌లో కానీ ఈ మాటకి సమానార్థకమైన మాట లేనందుకు మనం కొద్దిగా సిగ్గుపడాలి. నీతి అనే ఒక్క మాట కోసం ఈ భాషల్లో చాలా మాటల్ని వాడవలసి ఉంది. కాని ఒకసారి ఆ అర్థం బోధపడితే ఆ మాట స్పష్టం గాను, ముఖ్యం గాను, తృప్తికరం గాను ఉంటుంది.” అని రైడర్ తన అనువాదానికి ముందుమాటలో [Ryder, 1962] రాశాడు. పంచతంత్ర కథల్లో నీతి – లౌకిక ప్రయోజనాల కోసం అవలంబించవలసిన వ్యూహాలు, మార్గాలు, పద్ధతులు వాటికి సంబంధించినది. బ్రిటిష్ పరిపాలకులూ, క్రైస్తవ మిషనరీలూ పిల్లలకి బోధించ దలచుకున్న నీతికీ, ఈ నీతికీ సంబంధం లేదు. అయినా పంచతంత్ర కథలు పిల్లలకి నీతి కథలుగా బోధించడానికి పండితులేమీ సందేహించలేదు.

తెలుగులో మొదటి నీతి పుస్తకం
1846లో పూదూరి సీతారామశాస్త్రి పెద బాలశిక్ష రాశాడు. మళ్ళా మళ్ళా అచ్చయిన ఈ పుస్తకంలో రచయితే కూర్చిన నీతి వాక్యాలు ప్రముఖంగా కనిపిస్తాయి. నీతి అనే అర్థానికి morals అనే కొత్త అర్థం పూర్తిగా స్థిరపడింది. కాని ఈ వాక్యాలు జాగ్రత్తగా చూస్తే సుమతి శతకంలో వున్న పద్యాలకి ఇవి వాక్యరూపాలు అని బోధ పడుతుంది. సుమతి శతకం 1870లో మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు ప్రచురించారు. (ఈ సంస్థే తరువాత వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్‌గా రూపాంతరం చెందింది.) ఈ ప్రచురణ బహుళ ప్రచారం పొంది చాలా మంది ప్రచురణకర్తల చేత కొన్ని స్వల్పమైన మార్పులు, చేర్పులతో లెక్కలేనన్ని సార్లు తారీకులు లేకుండా ముద్రించబడింది. ఇదే అందరికీ తెలిసిన సుమతి శతకం.

[1966లో ప్రచురించిన సుమతి శతకానికి పీఠిక రాస్తూ నిడదవోలు వెంకటరావు సుమతి శతకం మొట్ట మొదటి సారిగా ఆదిసరస్వతి ముద్రణాలయం వారు 1868 ఏప్రిల్ 20వ తారీకున ప్రచురించారు అని రాశాడు. తెలుగులో ఏ పుస్తకానికైనా ఇంత నిక్కచ్చిగా అది ప్రచురించబడిన సంవత్సరం, నెల, తేదీతో సహా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రచురించబడిన ఇంత విలువైన సమాచారం వెంకటరావుకి ఎలా దొరికిందో ఆయన వివరించలేదు. కానీ ఈ సమాచారాన్ని ఇంకొక ఆలోచన లేకుండా మచ్చా హరిదాసు (తథ్యము సుమతి: పరిశోధన వ్యాసాలు, 1984, పే. 67), ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం, 2002, సంపుటం 1, పే 224) తిరిగి చెప్పారు. కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు. ఇలాటి ముద్రణ తాము చూసినట్లు ఏ పరిశోధకుడు నాతో చెప్పలేదు. అందుచేత 1870 సంవత్సరపు ప్రచురణనే సుమతి శతకానికి మొదటి ముద్రణగా నేను భావిస్తున్నాను.]

క్రమక్రమంగా ఈ సుమతి శతకం లోంచి కొన్ని పద్యాలు చిన్న తరగతులకి ఉపయోగపడే పాఠ్యపుస్తకాల్లో చేర్చబడ్డాయి. ఉదాహరణకి 1930లో ప్రచురింపబడి Director of Public Instruction వారిచే మూడవ తరగతి పాఠ్య పుస్తకముగా ఆమోదించబడిన ‘ఆనంద వాచకము’లో నీతి పద్యములు అనే పేరుతో సుమతి శతకం నుంచి 10 పద్యాలు ఉన్నాయి. కొంత మంది సుమతి శతక ప్రచురణ కర్తలు కొద్దిగా జాగ్రత్తపడి “బాలురకు గాని బాలికలకు గాని బోధింపదగిన పద్యములు ముందు వ్రాయబడినవి. తరువాత బాఠశాలలయందు బోధింపగూడని పద్యములు వ్రాయబడినవి.” [Sumati Satakamu, 1922] అన్న సూచనతో ప్రచురించారు.

జీవితంలో పైకి వచ్చే మార్గాలు
ఒక్క మాటలో చెప్పాలంటే సుమతి శతకంలో వున్న నీతి లౌకిక జీవితంలో పైకి రావడానికి పెద్దకులాల మగవాళ్లకి పనికొచ్చే నీతి. ఈ పుస్తకం, సంస్కృతంలో వుండే పంచతంత్రం, హితోపదేశం, నీతిసారం, మొదలైన ప్రసిద్ధ గ్రంథాల తరగతికి చెందినది. అయితే తెలుగులో వుండబట్టి ఆ గౌరవం దీనికి లేదు. పేరు తెలియని కవి గ్రామాలలో వుండే పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని చిన్న మాటలతో తేలికగా గుర్తు పెట్టుకోవడానికి అయిన పద్ధతిలో నిరాడంబరంగా రాసిన పుస్తకమిది.


వావిళ్ళ సుమతి శతకం, 1870.
13వ శతాబ్ది నుంచి తెలుగులో నీతి గ్రంథాలు రాయడం ఆరంభమయింది. పై కులాల్లో పుట్టిన మగవాళ్ళు ఒక చిన్న రాజులాగా అధికారం చెలాయించే స్థితికి రావడానికి ఏ ఏ పద్ధతులు అనుసరించాలో సాధికారంగా చెప్పడానికి ఈ పుస్తకాలు పనికొచ్చాయి. ఈ పుస్తకాల్లో రాజులెలా ప్రవర్తించాలి, మంత్రులు ఎలా పని చేయాలి, సైన్యాలని, గూఢచారులని ఎలా వుపయోగించుకోవాలి – ఇలాంటి సంగతులు చెప్పి ఉన్నాయి. సుమతి శతకం వాటి కన్నా కొంత భిన్నమైనది. సుమతి శతకంలో అక్కడక్కడా రాజుని గురించిన ప్రస్తావన ఉన్నా నిజానికి ప్రధాన ప్రస్తావన గ్రామాల్లో వుండే భూస్వామిని గురించే. బ్రాహ్మణ పురుషులు, వాళ్ల భార్యలు, వేశ్యలు కూడా ఇందులో తారస పడతారు. సుమతి శతకం రాజాస్థానం లోంచి వచ్చిన పుస్తకం కాదు. రాజాస్థానాలలో మెలిగే వాళ్ళకోసం రాసినదీ కాదు.

ఇందాకా చెప్పిందే మళ్లీ చెప్పాలంటే సుమతి శతకం గ్రామాలలో వుండే పై కులాల మగవాళ్ళు లోకంలో ఎలా పైకి రావాలో చెప్పే పుస్తకం. డబ్బు, కామసౌఖ్యము, ఎలా అనుభవించాలో ఏ ముసుగులు లేకుండా చెప్తుందీ పుస్తకం. ముఖ్యంగా కామసుఖాన్ని గురించి మరీ మరీ గొప్పగా చెప్తుంది. అది అనుభవించలేని వాళ్ళని తక్కువగా చూస్తుంది కూడా. సుమతి శతకం దృష్టిలో ఆడవాళ్ళు రెండే తరగతులు. మగనాళ్ళు, వెలయాళ్ళు. వెలయాలు ఏ మగాణ్ణీ ప్రేమించదు. ఆవిడకు కావలిసింది కేవలం డబ్బే. అందం కానీ, కామసుఖం ఇవ్వటంలో నేర్పరితనం కానీ ఆవిడ పట్టించుకోదు. ఆ మాటకొస్తే భార్యలు కూడా డబ్బు సంపాదన లేని మొగుణ్ణి గౌరవించరు. ఆడదాన్ని చచ్చినా నమ్మకూడదు అంటుంది సుమతి శతకం (… మగువకు మదినీయ వలదు మహిలో సుమతీ). ఆడవాళ్లకి ఏ రహస్యాలూ చెప్పకూడదు. మొగుడు జాగ్రత్తగా కనిపెట్టకపోతే ఆడది తప్పనిసరిగా వ్యభిచారి అవుతుంది (… పడుపుగ నంగడికి తానె పంపుట సుమతీ). ఒక పక్క ఆడవాళ్ళను గురించి ఇలాటి మాటలు చెప్తూనే ఆడవాళ్ళని గౌరవంగా చూడాలని, వాళ్ళే సంపదకు మూలమని, ఆడది ఏడ్చే యింట్లో లక్ష్మీదేవి కాపురం చేయదని కూడా చెప్తుంది (… కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ). పునిస్త్రీ లైన వాళ్ళ గురించి మంచి మాటలు చెప్పినా విధవ మాత్రం గౌరవార్హ కాదు. ఇంటి యజమానురాలు ఎప్పుడూ భార్యే అయి ఉండాలి కానీ, విధవ యాజమాన్యం చేస్తే యిల్లు పాడై పోతుంది.

సుమతి శతకంలో సమాజం కులస్పర్ధలతో, పరస్పర అపనమ్మకాలతో అయినా సరే క్లిష్టమైన సంబంధ బాంధవ్యాలతో ఒకరి మీద ఒకరు ఆధార పడటంతో ఉన్న సమాజం. ఇందులో పెద్ద పెద్ద మాటలతో రాజుని గురించి భూపాలుడు అని, మండలపతి అని ప్రస్తావన కనిపిస్తుంది. చదువుకున్న కులాల నుంచి ఆ రాజుకి మంత్రులుగా రాయసకాళ్ళుగా పని చేసే వాళ్ళు ఉండేవారు. సుమతి శతకంలో చాలా పద్యాలు వీళ్ళని గురించి రాసినవే. సమర్ధమైన మంత్రి లేకపోతే రాజు తొండం లేని ఏనుగు లాగా ఉంటాట్ట.

మండలపతి సముఖమ్మున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
కొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచును సుమతీ

చదవడం రాయడం వచ్చిన రాజు దగ్గరికి ఏ మంత్రులూ వెళ్ళకూడదు. పైగా, కరణాలకి కూడా ఒక బోధ చేస్తుంది ఈ పుస్తకం: ఒక కరణం ఇంకొక కరణాన్ని నమ్మకూడదు. కరణాలు బలవంతులుగా వుండాలి. వాళ్లు అతి సాధువుగా ప్రవర్తించకూడదు. ప్రతి కులాన్ని గురించీ సుమతి శతకంలో ఏదో ఒక ప్రస్తావన కనిపస్తుంది. మంచి గుణాలు పుట్టుక తోటే వస్తాయి. ప్రతి కులానికి ఏదో ఒక లోపం ఉంటుంది. క్షత్రియులని సంతోష పరచడం కష్టం. వెలమ వాళ్ళు నమ్మదగ్గ వారు కారు. కోమట్లు అబద్ధాలకోర్లు. వైదికుడికి లోకజ్ఞానం తక్కువ. కంసాలిని ఎప్పుడూ నమ్మకూడదు. ఆఖరికి కరణాలు కూడా బోలెడు మోసాలు చేస్తారు.

సుమతి శతకం సాహిత్యానికి పెద్ద పీట వేస్తుంది, అదీ లౌకిక సాహిత్యానికి. మంచి కవిత్వం రాయగలగటం గొప్ప విషయం. మూర్ఖుడికి సాహిత్యం బోధించడం చెవిటి వాడి ముందు శంఖం ఊదడం లాంటిది. సుమతి శతకం తక్కువ కులాల వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తక్కువ చూపు చూస్తుంది. దుర్జాతి, నీచుడు, అవివేకి, పామరుడు, మూర్ఖుడు ఇలాటి మాటలన్నీ తక్కువ కులాల వాళ్ళను ఉద్దేశించినవే. వాళ్ళను నమ్మకూడదు. వాళ్ళతో స్నేహం చేయడం మూర్ఖత్వం. తక్కువ కులం వాడు చదువుకుంటే వాడు మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తాడు. ముఖ్యంగా తక్కువ కులాల వాళ్ళు డబ్బు కూడ పెట్టకూడదు. ఒకవేళ వాళ్ళు అలా కూడబెడితే ఆ డబ్బుని లాక్కుంటారు, లేదా దొంగలైనా దోచుకుంటారు.

డబ్బెందుకురా అంటే తను సుఖపడ్డం కోసం, లేదా దానంగా ఇవ్వడం కోసం. లేక పోతే ఆ డబ్బు నేల పాలై పోతుంది, అడవిలో తేనెపట్టులో తేనె లాగా. సుమతి శతకంలో చాలా వరకు నీతులన్నీ పాపపుణ్యాలతో సంబంధం లేనివి. అయినా అక్కడక్కడా కొన్ని నీతులు అని మనం అనుకునేవి ఉన్నాయి. పరభార్యా సంగమం దోషం. పరద్రవ్యాపహరణం దోషం. తన కోపం కన్నా పెద్ద శత్రువు లేదు, ఇలాంటివి. ఒక రకంగా చెప్పాలంటే ధర్మార్థకామమోక్షాలు సమపాళ్ళలో వుండే సాంప్రదాయిక సమాజం ఇందులో కనిపిస్తుంది.

ప్రతి వ్యక్తి తన పాపపుణ్యాలని అనుభవిస్తాడు. తాను పూర్వ జన్మలో దానాలిస్తే తానీ జన్మలో ధనికుడవుతాడు. పూర్వ జన్మలో దానాలివ్వకపోతే ఈ జన్మలో ఎంత కష్టపడ్డా డబ్బున్నవాడు అవ్వడు. ఫలితార్థంగా చెప్పాలంటే కాలక్రమాన అన్నీ చెడిపోతాయి. బంధుత్వం శత్రుత్వంగా మారుతుంది. ధనవంతుడు పేదవాడవుతాడు. అధిక ధరలు పడిపోతాయి. అన్ని సుఖాలు దుఖంలోనే పర్యవసిస్తాయి.

పాఠకులు
అయితే ఇలాంటి శతకానికి పాఠకులు ఎవరై ఉంటారు? పదిహేడవ శతాబ్దం నాటికి తెలుగుదేశంలో బ్రాహ్మణుల్లో కొందరు పూజలు చేయించడం, మంత్రాలు చదవడం లాంటి పనులు మానేసి, లౌకిక వృత్తుల్లో ప్రవేశించారు. పౌరోహిత్యం చేసేవాళ్ళు వైదికులు, లౌక్యం నడిపే వాళ్ళు నియోగులు అయ్యారు. ఈ నియోగులే కరణాలు. కరణాలు అందరూ చదువుకున్న వాళ్ళు. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే చదవడం రాయడం బాగా వచ్చిన వాళ్ళు. ఇందులో కొందరు పండితులు, మంచి కవిత్వం రాసేవారు కూడా. వాళ్ళు రాయబారులుగా, వ్యవహారజ్ఞులుగా పేరు తెచ్చుకున్నవాళ్ళు, రాయసకాళ్ళుగా రకరకాల భాషల్లో, లిపుల్లో ప్రావీణ్యం వున్నవాళ్ళు. వీళ్ళు పెద్ద పెద్ద రాజాస్థానాల్లో వున్నవాళ్ళు కాకపోయినా అలా వున్నట్లు ఊహించుకునేవాళ్ళు. ఈ కాలంలో చాలా తెలుగు కావ్యాలు నియోగులు రాసినవి కనిపిస్తున్నాయి. ఈ నియోగులు తామే స్వయంగా తమ కావ్యాలకి ప్రతులు రాసి ఏ కృతిభర్త పోషణ అక్కర లేకుండా సొంతంగా కీర్తిని తెచ్చుకున్నారు. నిజానికి వీళ్ళు చిన్నపాటి కరణాలే అయినా మంత్రి, అమాత్యుడు లాంటి గౌరవమైన పేర్లు పెట్టుకునేవారు. సుమతి శతకం ఈ వర్గం నుంచి వచ్చిన పుస్తకం అయ్యుండాలి. కరణాలు లౌక్యులు, రాజనీతిజ్ఞులు అయినా కూడా వాళ్ళు బాహాటంగా పేరు కోసం ప్రయత్నించలేదు. ఎప్పుడూ అణకువగా తెర వెనకనుండే కార్య నిర్వహణం చేసే తమ గుణానికి అనుగుణంగా ఈ సుమతి శతక కర్త తన పేరు రాసుకోలేదు.

పైకి గొప్పగా పేరు చెప్పుకోకపోయినా కరణాలకి తమ గురించి తమకున్న అభిప్రాయం చాలా గట్టిది. కరణాలు అఘటన, ఘటన సమర్ధులు, రాతకోతల వల్ల తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగల వాళ్లు. చదవడం రాయడం, లెక్కలు కట్టటం ఎక్కువ మందికి రాని కాలంలో, రాతకోతలకున్న బలం చేతులో పెట్టుకున్నవాళ్లు వీళ్లే (తమిళనాడులో గణక పిళ్ళైలు, ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రాంతాల్లో కాయస్థులు, మున్షీలు, ఒరిస్సాలో కరణాలు, మహారాష్ట్రలో కుల్కర్ణీలు, ఇలా).

మంత్రి, ప్రెగ్గడ, ప్రధాని — ఇలా ఎన్ని పెద్ద పేర్లున్నా, సుమతి శతకంలో కరణాల గురించిన చాలా పద్యాలున్నాయి. అయితే సుమతి శతకంలో కరణాలు గ్రామాల్లో రెవెన్యూ లెక్కలు రాసే వాళ్ళ స్థాయిలోనే కనిపిస్తారు. ఇంతకు ముందు గ్రామాల్లో పన్నులు వసూలు చేసి, లెక్కలు రాసే వుద్యోగం కంసాలులు చేసేవారని, 1145లో రామప్రధాని అనే ఆయన కంసాలులని ఆరువేల గ్రామాలలో ఆ ఉద్యోగంలో నుంచి తొలగించి నియోగుల్ని ప్రవేశపెట్టాడని ఒక కథ ఉంది. ఈ కథ ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో కూడా కనిపిస్తుంది (సం. 1, పే. 227-28).

సుమతి శతకంలో కంసాలుల గురించి విరుద్ధంగా రాసిన పద్యాల ఆధారంగా కరణాలకి, కంసాలులకి మధ్య వైరుధ్యం వుండేదని ఆరుద్ర నమ్మాడు. (1924లో శతక కవుల చరిత్ర రాసిన వంగూరి సుబ్బారావు కూడా సుమతి శతక కర్త కరణం అయ్యుంటాడని (మంత్రి కులం) ఊహించాడు కానీ కచ్చితంగా గ్రామాల్లో లెక్కలు రాసే ఉద్యోగి అని నిర్ధారణగా చెప్పలేదు.) ఆరుద్ర చెప్పిన కథలో సత్యాసత్యాలు ఎలా వున్నా ఆరువేల వారు అనే పేరున్న కరణాలు ఇప్పటికీ తెలుగుదేశంలో వున్నారు. ఈ పేరు ఎలా వచ్చిందో చెప్పలేం కాని, మొన్నమొన్నటి వరకు చాలా గ్రామాల్లో ఆరువేల వారే కరణాలుగా వుండేవారు. 18వ శతాబ్దిలో ఉత్తర రామాయణం రాసిన కంకంటి పాపరాజు ఈ కులం వాడే. ఆరువేల నియోగులని శ్లాఘిస్తూ [Paparaju, 1970] కంకంటి పాపరాజు ఈ పద్యం రాశాడు.

అఖిల రాజాధిరాజాస్థానజనహృద్య
       విద్యావిహారులార్వేలవారు
కల్పకబలికర్ణకలశార్ణవో దీర్ణ
       వితరణోదారు లార్వేలవారు
సజ్జన స్తవనీయ సతత నిర్వ్యాజహా
       రిపరోపకారు లార్వేలవారు
ఘనదుర్ఘటస్వామికార్య నిర్వహణ
       ప్రవీణతాధారు లార్వేలవారు

విమతగర్వాపహారు లార్వేలవార
లట్టి యార్వేలవారిలో నలఘుకీర్తి
వెలయు శ్రీవత్సగోత్రారవిందహేళి
మహితగుణశాలి వల్లభామాత్యమౌళి

కానీ సుమతి శతకాన్ని జాగ్రత్తగా చదివి చూస్తే ఈ శతకకర్త గ్రామ కరణంగా తోచడు. ఈ శతకంలో అన్ని కులాలతో పాటు కరణాలలో కూడా లోపాలు చూపించాడు. ఇందులో కంసాలుల గురించి చెప్పిన నిందలు తెలుగు లోకంలో అప్పట్లో చాలా మందిలో కరణాల పట్ల ఉన్న అభిప్రాయాలకి పద్యరూపాలే కానీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు కావు. పైగా ప్రత్యేకించి బ్రాహ్మలకి కంసాలులకి వైరుధ్యాన్ని సూచించేవి కావు. మొత్తం మీద చెప్పగలిగిందల్లా ఏమిటంటే పై కులాలలో పుట్టి లేఖకులుగా పనిచేసే వాళ్ళ వర్గం నుంచి ఈ పుస్తకం వచ్చుంటుంది. ఈ వర్గాన్ని మనం కరణాలు అని సామూహికంగా పేర్కోవచ్చు. ఈ వ్యాసంలో తరవాత సుమతి శతకం ఇంకో రూపంలో ఇంకొక సమూహంలో ప్రచారం పొందిన సంగతి చర్చిస్తాను. అంతకన్నా ముందు శతకం అంటే ఏమిటో చూద్దాం.
శతక ప్రక్రియ
శతకంలో 108 పద్యాలుంటాయని మొదటి పద్యం శ్రీ తో మొదలవుతుందని అది శతకానికి శుభసూచకమని మనకు చాలామంది చెప్పారు. శతకంలో పద్యాలు ఒక దానికి ఒకటి సంబంధించని ఏ కథాక్రమం లేని విడివిడి పద్యాలు. అయితే అవన్నీ ఏదో ఒకే ఛందస్సులో రాయబడి ఉంటాయి. వాటి చివర మకుటం అనే పేరుతో ఏదో ఒక మాటో ఒక సమాసమో వుంటుంది. అది తరచు సంబోధనాత్మకంగా వుంటుంది. ఈ మకుటం ఒక దేవుడినో, ఒక వ్యక్తినో లేదా ఒక వస్తువునో పిలిచి పద్యం వినిపిస్తున్నట్లుగా వుంటుంది. ఒకే మకుటం వుండడం అనే లక్షణం వల్ల మాత్రమే ఈ పద్యాలన్నీ ఒకే శతకానికి చెందినవి అని చెప్పగలం. ఆ మకుటం వల్లనే శతకానికి ఒక పేరు కూడా వస్తుంది. సుమతి అనే మకుటం వుండటం వల్ల ఇది సుమతి శతకం అయింది. శతకాలు చాలా వరకు ఒకే కర్త రచించినవి అయినప్పటికి కూడా ఇవి ఎవరూ మొదటి నుంచి చివరి దాకా ప్రతి పద్యమూ చదవరు. ఎప్పుడు ఏ పద్యం కావాలంటే ఆ పద్యాన్ని, ఎన్ని పద్యాలు కావాలంటే అన్ని పద్యాలని చదువుకోవడానికి వీలు కలిగిస్తుంది శతకం. అందుకే బహుళ వ్యాప్తిలో వున్న శతకాలు తరచు ముక్కలు ముక్కలుగా కనిపిస్తాయి — ఎవరికిష్టమైన పద్యాలు వాళ్ళు వేరేగా రాసుకున్నారు కాబట్టి.

ఆధునిక విమర్శకులు, శతకాలని ఆ శతకాలలో వుండే పద్యాల ప్రధాన భావాన్ని పట్టి, భక్తి శతకాలనీ, నీతి శతకాలనీ, శృంగార శతకాలని విభజించడం రివాజు. శతకంలో వుండే పద్యాలు గుర్తు పెట్టుకోవడం తేలిక కాబట్టి వాటిని ఒక చోటి నుంచి ఒక చోటికి మౌఖికంగా పట్టుకుపోవచ్చు. శతకంలో ఒక పద్యం చాలా ప్రాంతాల్లో వినిపించింది అంటే ఆ పద్యం చాలా మంది పాఠకులు ఇష్టపడి గుర్తు పెట్టుకున్నారని అర్థం. అంతే కానీ ఆ శతకమంతా అన్ని చోట్లకీ వెళ్ళిందని అర్థం కాదు. అంటే శతకంలో కొన్ని పద్యాలకి ఎక్కువ ప్రచారం వచ్చి మిగతా పద్యాలు మూలపడి ఉండవచ్చు. పైగా పద్యం మౌఖికంగా ప్రచారమైతే పాఠకులు తమ ఆనుకూల్యాన్ని బట్టి అందులో మాటలు మార్చి వేర్వేరు పాఠాలు తయారు చేయొచ్చు. ఇందులో ఏ పాఠం మూలపాఠం, ఏది మార్పు చెందిన పాఠం అని చర్చించడం వల్ల పెద్ద ప్రయోజనం వుండదు. పైగా శతకంలో పద్యాలను మౌఖికంగా పట్టుకుని వెళ్ళేవాళ్ళు శతకకర్తని గురించి కొన్ని కథలు, శతక రచనా సందర్భాన్ని గురించిన కొన్ని విశేషాలు కూడా చెప్పొచ్చును. ఇలాంటి కథలు కొన్నింటిని గురించి ఈ వ్యాసంలో తర్వాత చెప్తాను. ఇక సుమతి శతకం దగ్గరికి వస్తే ఇది ఎక్కడా మొత్తమంతా లభించదు. దొరికిన్న లిఖిత ప్రతులన్నీ ముక్కలు ముక్కలుగా ఉన్నవే. నిజానికి మొత్తం శతకంలో ఎన్ని పద్యాలున్నాయో ఎవ్వరూ నిక్కచ్చిగా చెప్పలేరు.

సుమతి శతకము – సి.పి. బ్రౌన్
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (C. P. Brown) అనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి (1798-1884) తెలుగు సాహిత్యంలో అపారమైన ఆసక్తి చూపి, తెలుగు సాహిత్యం మీద తన చెరగని ముద్ర వేసి, తెలుగు సాహిత్యపరులందరికీ కీర్తనీయుడయ్యాడు. కలకత్తాలో క్రైస్తవ మత ప్రచారం చేసే ఫాదరీల సంతతి అయిన ఈయన పదిహేడేళ్ళ చొప్పున రెండు దఫాలుగా మొత్తం 34 సంవత్సరాల పాటు తెలుగు దేశంలో వుండి ఈస్ట్ ఇండియా కంపెనీలో రకరకాల ఉద్యోగాలు చేశాడు. తెలుగు నేర్చుకోవడంలో చాలా పరిశ్రమ చేసిన ఈయన తెలుగు సాహిత్యాన్ని ‘ఉద్ధరించడానికి’ తన కాలంలో ఎక్కువ భాగం, తన జీతంలో ఎక్కువ భాగం ఖర్చు పెట్టాడు.

బ్రౌన్ అభిప్రాయంలో గ్రంథం ప్రతిదీ ఒక వ్యక్తి చేత రచించబడి ఉంటుంది. కాలక్రమాన స్ఖాలిత్యాలకి లోనై లేఖక ప్రమాదాలు ఇతర ప్రక్షిప్తాలు చేరి చెడిపోతుంది. అలాంటి గ్రంథాన్ని చాలా ప్రతులు దగ్గర పెట్టుకుని, తప్పులు దిద్ది, ప్రక్షిప్తాలు పరిహరించి దానిని పూర్వ స్థితికి తీసుకురావడం పరిష్కర్తలు చేయవలసిన పని. ఇది యూరోపులో గ్రంథాన్ని గురించి ఉన్న నిశ్చితమైన అభిప్రాయం. ఇలాంటి గ్రంథం సక్రమంగా పరిష్కరించి అచ్చు వేసి జనంలోకి తీసుకు వెళ్ళాలి. తెలుగు సాహిత్యంలో చాలా గ్రంథాలకి ఈ విధంగా పరిష్కరణ చేసి ముద్రించడం బ్రౌన్ చేసిన ముఖ్యమైన పనుల్లో ఒకటి.

దాదాపు వెయ్యి సంవత్సరాల నిరంతర రచనల వల్ల, విస్తృతపఠనం వల్ల దేశమంతా విశాలంగా వ్యాపించిన తెలుగు సాహిత్యం ఎక్కడ చూసినా బ్రౌన్ దొరకి శుద్ధంగా కనిపించలేదు. దానితో పాటు తాళపత్ర ప్రతులు ఆయనకి తేలికగా దొరకలేదు కూడా. అవి సంపాదిద్దామని జనాన్ని అడిగితే వాళ్ళు ఈ తెల్లదొరకి అవి ఇవ్వలేదు. తన మధ్యవర్తుల ద్వారా చాలా శ్రమపడి ఆ గ్రంథాలను ఆయన సేకరించవలసి వచ్చింది. బ్రౌన్ తెలుగు ప్రజలతో కలిసిమెలిసి తిరిగి రాతప్రతులని వాళ్ళు ఇళ్ళల్లో భద్రపరిచే తీరు, అవి చదివే తీరు, అందులో తేడాలు, అన్నీ గ్రహించి వుంటే తెలుగు గ్రంథ ప్రపంచాన్ని గురించి ఆయనకు కొంత వరకైనా అవగాహన వచ్చేది. కానీ ఆ ఆలోచన ఆయనకి కలగలేదు. తెలుగు దేశంలో గ్రంథసంస్కృతి యూరోపు దేశాల గ్రంథసంస్కృతికన్నా భిన్నమైనదేమో అన్న సందేహం కించిత్తయినా కలగలేదు కూడా. తను అనుకున్నట్లుగా ప్రతి గ్రంథమూ సులభంగా దొరకక పోయేసరికి, దొరికినవి కూడా శిథిలావస్థలో దొరికేసరికి తెలుగు సాహిత్యం క్షీణదశలో వుందని ఆయన గట్టిగా విశ్వసించాడు. తనకు ఉన్నపాటి అల్పమైన భాషా పరిజ్ఞానంతో పాటు పాశ్చాత్య సంస్కృతి యొక్క గొప్పతనం మీద అపారమైన విశ్వాసం తోడవగా ఈ సాహిత్యాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత తన మీద ఉందని నమ్మకంగా నిశ్చయించుకున్నాడు బ్రౌన్.

బ్రౌన్‌కి సుమతి శతకం మీద ఆసక్తి కలగడానికి కారణం అందులో వుండే నీతి తనకి పరిశీలన యోగ్యంగా వుండడం కాదు. భాష సులభంగా వుండబట్టి తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశ్యం. అందుచేత తన దగ్గర పనిచేసే పండితుణ్ణి పురమాయించి సుమతి శతకానికి శుద్ధప్రతిని, ప్రతిపదార్థాన్ని రాయించుకున్నాడు. ఆ పద్యాలు చదువుతూ తనకి అర్థమైన పద్యాలని ఇంగ్లీషు వచనం లోకి అనువాదం చేసి పెట్టుకున్నాడు. ఇదంతా ఆయన తెలుగు నేర్చుకోవడంలో ఒక భాగం. క్రమంగా 1832 నాటికి ఒక పది సుమతి శతక లిఖిత గ్రంథాలను సంపాదించాడు బ్రౌన్. యూరోపులో గ్రీక్, లాటిన్, లిఖిత ప్రతులను పోగు చేసి వాటిని తైపారు వేసి దుష్ట పాఠాలను లేఖిక దోషాలను తొలగించి శుద్ధప్రతిని తయారు చేసే మార్గంలోనే సుమతి శతక లిఖిత ప్రతులను కూడా అన్నిటినీ కలిపేసి ఒక 150 పద్యాల గ్రంథాన్ని తయారు చేసి అందులో 85 పద్యాలకి తన ఇంగ్లీషు వచన అనువదాలతో సహా 1842లో అచ్చు వేయించాడు. కానీ ఈ పుస్తకం ఎవరికీ దొరకటం లేదు. అసలు ఈ పుస్తకాన్ని అచ్చు వేయించాడని చెప్పడానికి ఆధారం ఈ పుస్తకానికి చేసిన ప్రకటన. ఆ ప్రకటనని మచ్చా హరిదాసు తన వ్యాసంలో ఉదహరించాడు. దరిమిలా 1973లో ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బ్రౌన్ తయారు చేయించిన రాతప్రతి ఆధారంగా ముద్రించారు. దీన్ని ‘బ్రౌన్ సుమతి శతకం’ అన్న పేరుతో ఈ వ్యాసంలో వ్యవహరిస్తాను. ఇక మనకి ప్రచారంగా తెలిసిన సుమతి శతకాన్ని ‘వావిళ్ళ సుమతి శతకం’ అంటాను.

బ్రౌన్ సుమతి శతకాన్ని గురించీ దానికి ఆధారమైన తాళపత్ర ప్రతులను గురించీ మనకి కొంతైనా తెలుసు కాని, వావిళ్ళ సుమతి శతకానికి ఆధారాలేమిటో మనకేమీ తెలియదు. 1870లో ఆదిసరస్వతి ముద్రణాలయం ప్రచురించిన సుమతి శతకానికి తాళపత్ర ప్రతులేవయినా ఆధారం అయివుంటే వాటిని గురించి ఆదిసరస్వతి ప్రతి కాని, దాని రూపాలయిన వావిళ్ళ ప్రతులు కాని మనకేమి చెప్పలేదు. ఆదిసరస్వతి ప్రతిలోను దాని తరువాతి వావిళ్ళ ప్రతిలోను మనకు కనిపించే ముఖ్యమైన విశేషాలు రెండు. ఒకటి, ఇందులో పద్యాలు అకారాది క్రమంలో అమర్చబడి ఉన్నాయి. రెండు, వీటిలోని భాష అరసున్నలతో, బండి ర (ఱ)లతో కూడిన లాక్షణిక భాష. సుమతి శతకపు తాళప్రతులు వేటిలోను పద్యాలు అకారాది క్రమంలో వుండటం కానీ, భాష లాక్షణికంగా వుండటం కానీ నేనెరిగినంత వరకు కనిపించదు. ఆదిసరస్వతిని అనుసరించిన వావిళ్ళ సుమతి శతకాన్నే తరువాతి ముద్రాపకులందరూ మక్కీకి మక్కీ అనుసరించారు. చాలాసార్లు చాలామంది ప్రచురించిన వావిళ్ళ సుమతి శతకంలో చేరిన మార్పులు ప్రధానంగా రెండు. ఒకటి, కొన్ని కొత్త పద్యాలు చేరడం. అందులోను ముఖ్యంగా శ్రీరాముని దయచేతను అనే పద్యం మొదటిదిగా చేరటం. రెండవది, శ్రీకరమగు భీమన అని శతక కర్తృత్వాన్ని భీమనకి ఆపాదిస్తూ చివరి పద్యంగా చేరటం. కొన్నింటికి ప్రతిపదార్థ తాత్పర్యాలు కూడా చేరడం.

తెలుగులో పద్యాలు అకారాది క్రమంలో వుండటం చాలా కొత్త విషయం. బ్రౌన్‌ సుమతి శతక పద్యాలు అకారాది క్రమంలో లేవు. పంతొమ్మిదొవ శతాబ్ది వరకు నిఘంటువులు కూడా అకారాది క్రమంలో వుండేవి కావు. శివుణ్ణి ప్రార్థిస్తూ రాసిన అక్షరాంకగద్య మాత్రం అకారాది క్రమంలో కనిపిస్తుంది. అకారాది క్రమం జైన ప్రభావం వల్ల వచ్చిందని సుమతి శతకాన్ని సుమతి అనే జైన భిక్షువు రాశాడని ఒక ఆసక్తికరమైన, ఏ రకమైన రుజువులు లేని సూచన ఒకటి వుంది. [Venkata Rao, 1966, p. 64] ఈ సూచన మనం పరిశీలనకు ఉపయోగించుకోగలిగిన స్థితిలో లేదు. సుమతి శతకానికి బ్రౌన్ వాడిన ఏ తాళపత్ర ప్రతిలోను పద్యాలు అకారాది క్రమంలో లేవు. సలక్షణ భాషలో కూడా లేవు.

సుమతి శతకం అనే పేరు, సుమతి అనే మకుటం మాత్రమే ఈ పద్యాలన్నీ– ముక్కలుగా వేరు వేరు ప్రతుల్లో కనిపిస్తున్నా– ఒకే గ్రంథానికి చెందినవని వాటి పాఠకులు భావించారని అనుకోడానికి ఆస్కారముంది. కాని వావిళ్ళ సుమతి శతకంతో మాత్రమే, శ్రీకారంతో మొదలు, కవి పేరుతో ఆఖరు, మంగళకర సంఖ్య అయిన 108 పద్యాల సంఖ్య, వీటితో దీనికి పరిపూర్ణమైన శతక స్వరూపం యేర్పడింది. అడయారు థియసాఫికల్ సొసైటీ లైబ్రరీలో వున్న సుమతి శతకపు తాళపత్ర ప్రతుల స్కాన్ చేసిన ప్రతిరూపాలు ముక్కలుముక్కలుగా ఇంటర్నెట్లో దొరుకుతాయి. వీటిలో ఒక ముక్కలో శ్రీరాముని దయచేతను అన్న పద్యం కనిపిస్తుంది. అయితే అందులో కూడా అది మొదటి పద్యం కాదు. ఈ పద్యం హరిదాసుకి కాని, ఆరుద్రకి కాని వారు చూసిన తాళపత్ర ప్రతిలో కనిపించలేదు. అడయారు లోని తాళపత్ర ప్రతి రెండు కారణాల వల్ల ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. ఒకటి అందులో శ్రీరాముని దయచేతను అన్న పద్యం ఉండటం. రెండు అందులోని పద్యాలు అరసున్నలు, బండి రలు లేకపోయినా వావిళ్ళ ప్రతి లోని పద్యాలకు దగ్గరగా వుండటం. దురదృష్టవశాత్తు అడయారు ప్రతి ప్రతిరూపాలు స్పష్టంగా లేవు. అంచేత వాటి గురించి ఇంతకన్నా నిక్కచ్చిగా నిర్ణయాలు చేయడం నాకు వీలు పడటం లేదు.

మౌఖిక ప్రచార లక్షణాలు
వావిళ్ళ సుమతి శతకంలో ఉన్న పద్యాలన్నీ మౌఖిక ప్రచార లక్షణాలు కనిపించేవే. కాగా బ్రౌన్ సుమతి శతకంలో చాలా పద్యాలు లిఖిత సంప్రదాయంలో ఉన్న పద్యాల్లా వుంటాయి. ఇరవయ్యో శతాబ్దపు పూర్వ సాహిత్యం చాలా మట్టుకు ఒక రకంగా మౌఖిక స్వభావం ఉన్నదే. ఎందుకంటే పద్యాలన్నీ పైకి చదివేవారు కాబట్టి. కానీ ఇక్కడ నేను చేసే విభాగం వేరు. ఒకటి: ఒకరి నుంచి మరొకరికి మౌఖికం గానే ప్రచారమయ్యే పుస్తకాలు. రెండు: లిఖిత రూపంలో ప్రచారమయ్యే పుస్తకాలు. అంటే పుస్తక ప్రచారం రెండు రకాలుగా జరిగిందన్న మాట. ఒకటి మౌఖికం గాను, రెండు లిఖిత మార్గం లోను. మౌఖిక ప్రచారంలో ఉన్న పద్యాలు చాలా ఎక్కువ మందికి అందాయి. లిఖిత ప్రచారంలో వున్నవి కొంత తక్కువ మందికి అందాయి. అయితే ఈ రెండు రకాల ప్రచారం కూడా చదవడం, రాయడం తెలిసిన కులాల వారి లోనే జరిగింది.

బ్రౌన్ సుమతి శతకం ప్రచారమైన జనాభా బహుశ కరణాల జనాభా అయి ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సరే రాసి పెట్టుకోవడం పెద్ద అలవాటు. వావిళ్ళ సుమతి శతకం ప్రచారమైన జనాభా జ్ఞాపకం పెట్టుకోవడం మీద నోటితో తిరిగి చదవడం మీద ఆధారపడ్డది. సుమతి శతకం పద్యాలు, ఈ రెండు రకాలవి కూడా, సంభాషణలో బాగా పనికొచ్చేవి. చెట్టు కింద కూర్చుని సాయంకాలాలు కాలక్షేపం చేసే సందర్భాలలో ఈ పద్యాలు శాస్త్రం చెప్పినట్లు ఉదాహరించేవారు. ఒకరి నోటి నుంచి మరొకరు ఈ పద్యాలు వినడం, ఆ పద్యం అంతకుముందు వినని కొత్త పద్యమైతే, దానిని వెంటనే కంఠస్తం చేయడం, ఈ సమావేశాల్లో తరచూ జరిగేవి. నిజానికి ఇలాంటి సమాజాల్లో నోటి మాటగా చెప్పిన పద్యానికి ఎక్కడో రాత పుస్తకంలో ఉన్న పద్యం కన్నా ఎక్కువ ప్రామాణికత, సాధికారత ఉండేది.

ఇలాంటి మౌఖిక ప్రచారం వల్ల పద్య నిర్మాణం ఒక పద్ధతిలో మారుతుంది. వావిళ్ళ సుమతి శతకంలో వున్న పద్యాలన్నిటికీ మౌఖిక నిర్మాణ స్వభావం ఉందని కొంచం సేపట్లో చూపిస్తాను. ఈ పద్యాలు విని నేర్చుకున్న వాళ్ళల్లో ఎవరో ఒకరు కరణమో కరణాల కుటుంబపు మనిషో అయ్యుంటే ఆయన తాను విన్నది విన్నట్టుగా రాసి పెట్టుకుని ఉంటాడు. అయినా ఆ పద్యం యధాపూర్వంగా మౌఖికంగా ప్రచారమవుతూ ఉంటుంది. బ్రౌన్ సుమతి శతకంలో కొన్ని పద్యాలు మౌఖిక ప్రచార లక్షణాలు వున్నవిగా కనిపించడానికి ఇదే కారణం. అయినా బ్రౌన్ సుమతి శతకాన్ని దామాషా మీద లిఖిత సంప్రదాయపు శతకమని వావిళ్ళ సుమతి శతకాన్ని మౌఖిక సుమతి శతకమని విడదీసి చూపిస్తాను.
కందం ఛందస్సు
ఈ రెండు రకాల సుమతి శతకపు పద్యాల నిర్మాణం వివరంగా చర్చించడానికి ముందు కంద పద్యపు ఛందస్సుని గురించి చెప్పడం అవసరం.ఈ వ్యాసం చదివే తెలుగు వాళ్లకి చాలా మందికి తెలిసే వుంటుంది కానీ స్పష్టత కోసం కంద పద్యపు ఛందస్సు స్థూలంగా చెప్తాను. కందంలో చతుర్మాత్రా గణాలే వుంటాయి. నాలుగు పాదాలుంటాయి. రెండో అక్షరం ప్రాస. మొదటి పాదంలోనూ మూడో పాదంలోనూ మూడేసి గణాలుంటాయి. రెండో పాదంలోనూ నాలుగవ పాదంలోనూ అయిదేసి గణాలుంటాయి. రెండవ పాదంలోనూ, నాలుగవ పాదంలోనూ నాలుగవ గణం మొదటి అక్షరంతో యతి చెల్లుతుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలు అక్కర్లేదు. ఉదాహరణకి ఈ కింది పద్యం చూడండి.

అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్
పొల్లిన దంచిన బియ్యము
తెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ

వావిళ్ళ సుమతి శతకంలో మౌఖిక లక్షణాలు
పై పద్యం ఏ పాదానికి ఆ పాదం విడిపోతుంది. అంటే మొదటి పాదం లోని వాక్యం ఆ పాదం చివరితో అయిపోకుండా రెండవ పాదంలోకి ప్రవహించి నడిచే పరిస్థితి ఉండదు. అంతేకాక యతి స్థానం దగ్గర కొత్త మాట మొదలవుతుంది. పద మధ్యస్థంగా యతి పడటం, ప్రాస స్థానం దగ్గర కొత్త మాట ఆరంభం కావడం ఇలాంటి క్లిష్టమైన నిర్మాణాలు వావిళ్ళ సుమతి శతకంలో దొరకవు. అంతే కాకుండా వావిళ్ళ సుమతి శతకంలో యతి కోసం, ప్రాస కోసం వేసుకున్న పూరక పదాలు బోలెడు కనిపిస్తాయి. ఉదాహరణకి ఇందులో ఉన్న 108 పద్యాల్లో 71 పద్యాల్లో పూరక పదాలున్నాయి. అందులో 52 యతి కోసం వచ్చినవి, 19 ప్రాస కోసం వాడినవి.

ఫూరక పదాలు ఎలా వుంటాయో చెప్పడానికి ఒక జాబితా యిస్తున్నాను: ఇలలో, భువిలో, మహిలో, మెదిని, వసుధను, ఎరుగుము, తెలియుర, నయమిది, మరి, నిక్కము, తథ్యము, సిద్ధము, సహజము, గదరా, …ఇత్యాది.

మామూలుగా ఈ కాలపు పండితులు ఈ పూరక పదాల్ని వ్యర్థపదాలంటారు. కానీ మౌఖిక ప్రచారంలో వున్న పద్యానికి ఇవి చాలా విలువైనవి. ఒకటి ఇవి ఎలా వుంటాయో ముందో ఊహించడం చాలా తేలిక. అంచేత పద్యం జ్ఞాపకం పెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. పద్యం తాలూకు అర్థపు బరువును పెంచకుండా నిర్మాణ సౌష్టవాన్ని, శబ్దసుభగత్వాన్ని ఈ పదాలు నిలబెడతాయి.

వావిళ్ళ సుమతి శతకంలో చాలా పద్యాలు నిర్మాణంలో కూడా ఒక రకమైన పునరుక్త వాక్యాలను అనుసరిస్తాయి. అందుచేత వాటిని జ్ఞాపకం పెట్టుకోవడం తేలికవుతుంది. ఉదాహరణకి:

నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ

ఈ పద్యంలో చివరి ముక్క నయమిది అనే పూరక పదంతో ప్రారంభం కావడం గమనించండి. అంటే కవికి ‘నా’తో మొదలయ్యే సార్థకమైన మాట వెతకవలసిన అవసరం తప్పిందన్న మాట.

లిఖిత సంప్రదాయంలో కంద పద్యం
వావిళ్ళ సుమతి శతకంలో పద్యాలకి పోటీగా లిఖిత సంప్రదాయంలో కంద పద్యం ఎలా వుంటుందో చూపిస్తాను. ఇందులో పూరక పదాలుండవు. యతి ప్రాసలుండే మాటలు వేరేగా విడిపోయి కనిపించవు. శబ్దప్రౌఢత, క్లిష్ట నిర్మాణం ఇందులో పద్యానికి అందం తెచ్చే గుణాలు. లిఖిత సాహిత్యంలో కవి మాటని జాగ్రత్తగా చెక్కుతాడు. పద్యం అంతా బిగువుగా మాటలు దట్టించి పెడతాడు. మౌఖిక కవికి ఛందస్సు, ఛందస్సులో ఇమిడే వాక్యనిర్మాణం ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. కవిలో ఊహ, ఛందస్సు, భాష ఒకే నిర్మాణ వ్యవస్థలో ఒదిగి ఉంటాయి. లిఖిత సంప్రదాయంలో కవికి ఛందస్సు పద్యాన్ని నియమిస్తుంది కానీ అతని వాక్యనిర్మాణాన్ని నియమించదు. అంచేత అతని వాక్యనిర్మాణం ఛందస్సుకి అతీతంగా ప్రవహిస్తుంది. ఉదాహరణకి తిక్కన కందపద్యాన్ని చూపిస్తాను.

త్రిభువనసుకదృఢపంజర
విభావమహితునకు త్రివిష్టపనిర్మో
కభుజంగపతికి సకలజగద
భిన్నరూపునకు భావనాతీతునకున్ [తిక్కన, శ్రీమదాంధ్రమహాభారతము, 4.1.33]

వావిళ్ళ సుమతి శతకంలో కానీ, బ్రౌన్ సుమతి శతకంలో కానీ ఇంత క్లిష్టమైన లిఖిత స్వభావం ఉన్న పద్యాలు లేవు. ఉదాహరణ కోసం మాత్రమే తిక్కన పద్యం చూపించాను. తిక్కన పద్యం కన్నా తక్కువ క్లిష్టత ఉండి అయినా లిఖిత సంప్రదాయానికే చెందిన పద్యాలు బ్రౌన్ సుమతి శతకంలో చాలా వున్నాయి.ఉదాహరణకి:

త్రాసును వేశ్యయునొక సమ
మౌ సందేహింపవలవదవనీస్థలిలో
వీసంబధికంబెచ్చట
నో సరిగాకందు మొగ్గుచుండును సుమతీ

ఈ పద్యపు వాక్యనిర్మాణం ఛందః పంజరాన్ని పైకి కనిపించకుండా చేస్తుంది. ఉదాహరణకి ఛందస్సు విడిపోయే వాక్యభాగాలు ఒకచోట, అర్థం విడిపోయే వాక్యాలు మరొక చోట రాస్తే —

ఇవి ఛందో విభాగాలు:

1. త్రాసును వేశ్యయునొక సమ
2. మౌ సందేహింపవలవ
3. దవనీస్థలిలో
4. వీసంబధికంబెచ్చట
5. నో సరిగాకందు మొగ్గు
6. చుండును సుమతీ

ఇవి ఆర్థిక విభాగాలు:

1. త్రాసును వేశ్యయునొక సమమౌ
2. సందేహింపవలవద్
3. అవనీస్థలిలో
4. వీసంబధికంబెచ్చటనో
5. సరిగాక
6. అందు మొగ్గు చుండును
7. సుమతీ

ఛందస్సు ప్రకారం ఆరు ముక్కలైన పద్యం అర్థం ప్రకారం ఏడు ముక్కలయ్యింది. అంతే కాదు. ఆ ముక్కలు ఈ ముక్కలు ఒకలాంటివి కావు. కావాలంటే చూడండి. వాక్ సంప్రదాయంలో సుమతి శతకం పద్యం చదివే పద్ధతి ప్రకారం ఛందస్సులో ఆరు ముక్కలు దేనికి దానికి విడిపోవాలి. త్రాసును వేశ్యయునొక సమ… అక్కడితో ఆగిపోవాలి. తరవాత ముక్క మౌ సందేహింప వలవ.’ ఇక్కడ ‘సమమౌ’ అని కలిపి చదవకపోతే అర్థ స్ఫూర్తి ఉండదు. ‘సమ’ దగ్గర ఆపితే అర్థం చెడిపోతుంది. అలాగే సందేహింపవలవ’ దగ్గర ఆపితే ‘దవనీస్థలిలో’ ఎబ్బెట్టుగా వినిపిస్తుంది. సంధి చేసి సందేహింపవలవదవనీస్థలిలో అని చదివితే వాక్ సంప్రదాయంలో కంద పద్యం చదివే తీరు దెబ్బ తింటుంది. నాలుగవ ముక్క, ఐదవ ముక్క చదవడంలో కూడా ఇలాంటి ఇబ్బందే వుంది. ‘వీసంబధికంబెచ్చటనో’ అన్న దగ్గర ఆపాలి. ఎచ్చట అన్న దగ్గర ఆపితే అర్థం దెబ్బ తింటుంది. అంటే ఈ పద్యం వాక్ సంప్రదాయంలో కంద పద్యం చదివే తీరులో చదవడం వీలు లేదన్న మాట. ఈ పద్యం వాగ్వ్యవహారంలో మనకు కనిపించదు. అందుకనే ఇది వావిళ్ళ సుమతి శతకంలో చేరలేదు.

బ్రౌన్ సుమతి శతకంలో కనిపించే ఒక పద్యం వావిళ్ళ సుమతి శతకంలో చేరేటప్పటికి ఎలా మారిందో ఈ కింది పద్యాల వల్ల చూడొచ్చు.

దానంబివ్వని కుడువని
వాని ధనము రాజచోరవహ్నుల జేరున్
గానల నీగలు గూర్చిన
తేనియ తెరవరుల జేరు తీరున సుమతీ

ఈ పద్యంలో రాజచోరవహ్నులు కొంత క్లిష్టమైన సమాసం. పైగా అందులో వ సమాస మధ్యస్థంగా వున్న యతి స్థానం. ఆ యతి స్థానం దగ్గర చరణం విరగడానికి సమాసం ఒప్పుకోదు. పైగా పద్యమంతా ఒకే వాక్యం. ఇలా ఏక వాక్యంగా వున్న పద్యాలు వావిళ్ళ సుమతి శతకంలో మనకి కనిపించవు. ఈ పద్యం వావిళ్ళ సుమతి శతకంలో చేరేటప్పటికి వాగ్వ్యవహార బలం వల్ల ఎలాంటి మార్పులు పొందిందో చూడండి.

తాను భుజింపని యర్థము
మానవపతి జేరు గొంత మరి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ

ఈ మార్పుల వల్ల రాజచోరవహ్నులు అన్న సమాసం ఎగిరిపోయింది. మానవపతి జేరు కొంత మరి భూగతమౌ పాదంలో మరి అనే పూరక పదంవల్ల యతి స్థానం గుర్తు పెట్టుకోవడానికి వీలయ్యింది. బ్రౌన్ సుమతి శతకంలో తేనియ తెరవరుల జేరు అనే పద్య భాగాన్ని తేనియ యొరు జేరునట్లు అని వావిళ్ళ సుమతి శతకంలో పాఠం సరళీకృతం చేస్తుంది. అయితే ఈ రెండు పద్యాలు ఒకటి ఇంకొకటిగా మారడానికి ఏర్పడిన మట్లన్నీ సుష్టుగా నిరూపించడానికి తగినంత సమాచారం మనకు దొరకదు. ఈ మార్పులు మరింత స్పష్టంగా చూడడానికి బ్రౌన్ సుమతి శతకం నుంచి, వావిళ్ళ సుమతి శతకం నుంచి మరో రెండు పద్యాలు ఉదహరిస్తాను.

బ్రౌన్ సుమతి శతకం:

మంత్రి గల వాని రాజ్యము
తంత్రంబుల జెడక శాశ్వతంబై నిలుచున్
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు కీలూడినట్లు జరుగును సుమతీ

వావిళ్ళ సుమతి శతకం:

మంత్రి గల వాని రాజ్యము
తంత్రము చెడకుండ నిలుచు తరచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు కీలూడినట్లు జరుగదు సుమతీ

బ్రౌన్ నుంచి వావిళ్ళకి ఈ పద్యం మారడంలో మూడు మార్పులు జరిగాయి. మొదటిది శైలీ గతమయినది. శాశ్వతంబై అన్న బ్రౌన్ పద్యంలోని మాట రెండవ పాదంలోని రెండు భాగాలనీ ఆక్రమించుకుని యతి స్థానంలో త అనే అక్షరాన్ని పదమధ్యస్థంగా వాడుతుంది. వాగ్వ్యవహారంలో ఈ పద్యం చదివితే ‘శాశ్వ’ దగ్గర ఆపి ‘తంబై నిలుచున్’ అనేది వేరే చదవాలి. ఈ సమస్యని వావిళ్ళ సుమతి శతకం చక్కగా రెండు ముక్కలు చేసి తరచుగ ధరలో అనే పూరక పదంతో నింపుతుంది. ఇలా పూరక పదాలతో పద్యం నింపితే అది చేపలబుట్ట అల్లినట్లు ఉందని లిఖిత సంప్రదాయపు కవులు వేళాకోళం చేస్తారు. మొల్ల గురించి తరచు చెప్పే చాటుకథ గుర్తున్న వాళ్ళకి ఈ సంగతి మళ్ళీ చెప్పక్కర్లేదు. పోతే ఈ పాదంలో రెండవ మార్పు వాక్య నిర్మాణ గతమైనది. ‘తంత్రంబుల చెడక’ అనే బ్రౌన్ సుమతి శతకంలో మాట తంత్రము చెడకుండ’ అని వావిళ్ళ సుమతి శతకంలో మారుతుంది. ‘అక’ అనే వ్యతిరేక క్త్వార్థక రూపం పాత తెలుగులో ఉంది. ఈనాటి తెలుగులో అది ‘అకుండ’ గా మారిపోయింది. ‘అక’ రూపం అనివార్య ఫలితార్థం వచ్చినప్పుడు మాత్రమే వాడతాం. ఉదాహరణకి:

– వానలు లేక పంటలు పోయాయి.
– తిండి లేక ప్రజలు బాధ పడుతున్నారు.
– నిద్ర చాలక కళ్ళు బరువెక్కాయి

ఈ వాక్యాల్లో మొదటి భాగం కారణం, రెండవ భాగం ఫలితం. ఈ రెండిటికీ మధ్య ఒక అనివార్యత ఉంది. వానలు లేకపోవడానికి, పంటలు పోవడానికి మధ్య నివారించడానికి వీలులేని తనం ఉంది. అప్పుడే అక అనే రూపం తెలుగులో వాడతాం. మిగతా సందర్భాల్లో అకుండ రూపం వాడతాం. ఉదాహరణకి:

– అతను నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడు.
– ఈ వ్యాసం చదవకుండా మాట్లాడకండి.
– ఈ పందిరి పడిపోకుండా నిలుస్తుందా!

ఈ వాక్యాల్లో ‘అకుండా’ తో అంతమయే వ్యతిరేక క్త్వార్థక రూపానికి తరవాత వచ్చే వాక్య భాగానికి మధ్య సంబంధం కేవలం ఆనంతర్యార్థకమైనదే. అంటే మొదటి పని ముందు జరిగేది రెండవ పని తరవాత జరిగేది అని చెప్పడం మాత్రమే. ఈ రెండిటి మధ్య అనివార్యత ఏమీ లేదు. ఈ రకమైన మార్పు వల్ల మనకు ఒక సంగతి బోధ పడుతుంది. వాగ్వ్యవహారంలో వున్న పద్యం వాక్యనిర్మాణాన్ని కూడా ఆధునికం చేస్తుంది.

ఇక పోతే మూడవ మార్పు చివరి పాదంలో కనబడుతుంది. ‘జరుగును’ అన్న బ్రౌన్ పాఠంలో పదం కంటే వావిళ్ళ సుమతి శతకంలోని ‘జరుగదు’ అనే వ్యతిరేకార్థ పదం వాగ్వ్యవహారానికి అనుకూలంగా వుంటుంది.

లిఖిత కంద పద్యానికి వాగ్వ్యవహారంలో వున్న కంద పద్యానికి ఇంకొక రకమైన మార్పు కూడా కనిపిస్తుంది.ఈ మార్పు వల్ల పద్యం అర్థమే మారిపోతుంది. బ్రౌన్ సుమతి శతకంలో ఈ పద్యం చూడండి.

కారణము లేక నవ్వును
ప్రేరణమును లేని ప్రేమ ప్రియరతికేళుల్
పూరణము లేని బూరెలు
వీరణమును లేని పెండ్లి వృథరా సుమతీ

ఈ పద్యంలో ప్రేరణము అంటే provocation అని. అంటే ఏ రకం గాను కలయికకు సిద్ధంగా లేని స్త్రీతో సంభోగం అనే అర్థం. ఇది ఆ పద్యంలో చెప్పిన మూడు విషయాలతో కలిపి ఇది కూడా వృథా అని అర్థం. ఇది వ్యవహారంలో మనసుకెక్కడం కష్టం. ఇది వావిళ్ళ సుమతి శతకంలో రెండవ పాదం ఎలా మారిందో చూదండి.

పేరణమును లేని లేమ పృథ్వీస్థలిలో

పేరణము అంటే రవిక. ఆడవాళ్ళు రవికలు తొడుక్కోవడం దాదాపుగా పదిహేడవ శతాబ్దంలోనే వచ్చినట్లుంది. కుట్టిన వస్త్రాలు తొడుక్కోవడం ఇస్లాం ప్రభావం వల్ల మనకు వచ్చిన ఆచారం. మొన్నటి వరకు దర్జీలు ముస్లిములే వుండేవారు. ఈ ఆధునిక ఆచారం మొదట్లో పై తరగతుల్లోనే ప్రవేశించింది. ఇప్పటికీ కింది తరగతుల వారు, పాతకాలపు పై తరగతుల పెద్దవాళ్లు రవికలు తొడుక్కోక పోవడం ఈ మధ్య కాలం వరకు తరచు కనిపించేది. ఈ సందర్భంలో రవిక లేని స్త్రీ కోరుకోదగినది కాదు అనే ఊహ ఈ పద్యంలో ప్రవేశించింది.
సుమతి శతకం ఎంత మందికి తెలుసు?
అర్థశాస్త్రంలో డబ్బు విలువ లెక్క కట్టడానికి Quantity theory of money అని ఒక సిద్ధాంతముంది. సరిగ్గా ఎంత డబ్బు వాడుకలో వుంది అని తెలుసుకోవాలంటే ఒక కాలంలో వున్న డబ్బు విలువ మదింపు వేస్తే చాలదని, అది ఒక చేతి నుంచి మరో చేతికి మారే వేగం కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఫిషర్ అనే ఆయన పేరుతో వున్న ఒక సూత్రం ప్రతిపాదిస్తుంది.

M*V = P*T అనేది సూత్రం. ఇందులో

M అంటే దేశంలో వున్న డబ్బు; V అంటే ఆ డబ్బు చలామణి అయ్యే వేగం; P అంటే దామాషా మీద ధరల స్థితి; T అంటే ఆర్ధిక వ్యవస్థలో బేరసారాల మొత్తం.

ఎవరి దగ్గరన్నా ఒక కోటి రూపాయలున్నాయనుకోండి. అవి ఇంట్లో ఇనప్పెట్టెలో ఒక ఏడాది పాటు దాచి ఉంటే ఆ యేడాది పాటు వాటి ఆర్ధిక విలువ సున్న. ఎవరి దగ్గరన్నా ఒక రూపాయి ఉందనుకొండి. ఆ రూపాయి ఏడాదిలో కోటి చేతులు మారిందనుకొండి. ఆ ఏడాదిలో ఆ రూపాయి ఆర్థిక విలువ కోటి రూపాయిలతో సమానం. ఈ సూత్రాన్ని సమాజం మీద సాహిత్యం యొక్క ప్రభావాన్ని మదింపు వేయడానికి కూడా వర్తింప చేయచ్చు. ఒక ప్రౌఢ కవి రాసిన కావ్యం చాలా కొద్ది మంది పండితులు మాత్రమే చదివారనుకొండి. ఒక మామూలు కవి రాసిన శతకం లాంటి పద్యాలు కొన్ని లక్షల మంది చదివారనుకొండి. ఈ మామూలు కవి రాసిన పద్యాలకి ఆ ప్రౌఢ కవి రాసిన కావ్యం కన్నా సమాజం మీద ఎక్కువ ప్రభావం వుందని మనం తేలిగ్గా చెప్పొచ్చు. సమాజం మీద సాహిత్య ప్రభావం లెక్క వేసేటప్పుడు వావిళ్ళ సుమతి శతకం కోటి చేతులు మారిన ఒక్క రూపాయి లాంటిది. ఒక ప్రౌఢ కవి రాసిన క్లిష్టమైన పద్యం ఇనప్పెట్టెలో దాచిన కోటి రూపాయిల లాటిది.

ఈ కాలంలో పుస్తకం యొక్క ప్రభావం అమ్ముడు పోయిన పుస్తకాల ప్రతులను బట్టి నిర్ణయించే పద్ధతి ఒకటి ఉంది. ఈ పద్ధతి మౌఖిక సాహిత్య సంప్రదాయానికి నప్పదు. వావిళ్ళ సుమతి శతకం యొక్క ప్రచార బాహుళ్యం అందులో వున్న అభిప్రాయాలకి ఆ సమాజంలో వున్న ఒప్పుదలని బట్టి మాత్రమే చెప్పగలం. ఇందులో కొన్ని పద్యాలు ఈ సుమతి శతకం ప్రచారంలో వున్న సమాజంలో చెప్పుకునే సామెతలకి పద్య రూపాలుగానో వాళ్ళలో జీర్ణించుకుపోయిన కొన్ని విశ్వాసాల ప్రతిబింబాలగానో తరచు కనిపిస్తాయి. కొన్ని పద్యాలు మాత్రం కవి తన అనుభవం మీద చెప్పిన మంచి మాటల్లా కనిపిస్తాయి. ఈ పద్యాలలో వినిపించే సాధికారమైన గొంతుక, క్లుప్తంగా చేయబడిన సూత్రీకరణ, అన్నింటికన్నా వెంటనే అర్థమయిపోయే భాష, తరుచు చాలా సందర్భాలలో ఉటంకించడానికి వీలైన పద్యరూపం — ఇవన్నీ వావిళ్ళ సుమతి శతకానికి ఒక శాస్త్రానికున్న గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.

సుమతి శతకం పరిష్కృత ప్రతి, దాని కర్తృత్వం
బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలంలో మన విద్యావంతులకు అలవాటైపోయిన ఒక భావం ప్రతి పుస్తకానికి చారిత్రకంగా గుర్తించదగిన ఒక కర్త ఉండాలి అనేది. కర్త పేరు తెలియక పోతే, ఆ కర్త ఏ కాలం వారో, ఏ ప్రదేశం వారో తెలియక పోతే వాళ్ళ తల్లిదండ్రులు, కులం, తెలియకపోతే మన విద్యావంతులకు ఏమీ తోచదు. అలాంటి కర్తని వెతికి పట్టుకునే దాకా వాళ్ళు విశ్రమించరు. ఇది మన అనుభవంలో మన జీవిత కాలాల్లో రచింపబడిన పుస్తకాల విషయాల్లో నిజమే అనిపిస్తుంది కూడా.

రచయిత > గ్రంథం > పాఠకులు — ఈ వరస మన మనస్సుల్లో జీర్ణించుకుపోయి, సార్వకాలిక సత్యంలా భాసిస్తుంది. కాని బ్రిటిష్ పరిపాలనకు పూర్వ భారతదేశంలో గ్రంథ కర్తృత్వం, గ్రంథ ఆవిర్భావం, గ్రంథ ప్రచారం, ఇవే వరసలోనే వుండేవా, అనే ప్రశ్న ఇంతవరకు ఎవ్వరూ వేసుకోలేదు. మౌఖికంగా పుస్తకాలు ప్రచారమయ్యే భారతదేశంలో పైన చెప్పిన కర్త > గ్రంథం > పాఠకులు అనే క్రమం ఇంకొక రకంగా కూడా వుండేదని అక్కడ కర్త గ్రంథాన్ని చేయడు, గ్రంథమే కర్తని తయారు చేస్తుందని చెప్పడానికి కావలసినంత జాగా వుంది. [ఈ విషయమై ఈ చిన్న వ్యాసంలో వివరంగా సిద్ధాంతం చేయడానికి అవకాశం లేదు. దీనిని గురించి వేరే వ్యాసం రాస్తున్నాను. అంచేత ఇక్కడ ఎక్కువ రాయను.] ప్రతి గ్రంథానికి మూల రచయిత ఒకరున్నారని ఆ గ్రంథానికి లేఖకుల, పాఠకుల చేతిలో వచ్చిన లోపాలన్నీ సవరిస్తే పరిశుద్ధమైన మూలప్రతి ఒకటుందని అనే నమ్మకం వల్ల మన సుమతి శతకానికి కూడా ఒక మూలప్రతి తయారు చేయడానికి ప్రయత్నం చేశాం.

పుస్తకాలకి పరిశుద్ధ ప్రతులు చేయడం మనకి సి. పి. బ్రౌన్ నేర్పాడు. ఆయన పెట్టిన వరవడినే వావిళ్ళ వాళ్ళు అనుసరించారు. దొరికిన లిఖిత ప్రతులన్నీ కలిపేసేసి అవన్నీ ఒక చోట పెట్టి అందులో లోప భూయిష్టంగా కనిపించే మాటల్నీ చరణాలనీ తీసేసి లేఖక ప్రమాదాలనీ వ్యాకరణ దోషాలనీ తొలగించి తయారు చేసేది శుద్ధప్రతి. ఈ రకమైన శుద్ధప్రతి సుమతి శతకానికి కూడా తయారు చేయొచ్చని 1988లో ఆరుద్ర కూడా అన్నాడు: “లేఖకులు చేర్చిన అధిక పాఠాలేవో గుర్తుపట్టాలంటే వివిధ తాళపత్ర ప్రతులను తులనాత్మకంగా పరిశీలించి సుమతి శతకానికి సంశోధిత ప్రతిని తయారుచేయాలి. ఇది కర్తృత్వ సమస్యను కూడా తేల్చడానికి పనికి రావచ్చును.”

ఇరవయ్యొవ శతాబ్దపు తొలి రోజులనుంచీ కూడా సుమతి శతకం ఎవరు రాశారు అనే వివాదం పండితుల్లో వుంది. కొందరి అభిప్రాయంలో బద్దెన సుమతి శతక కర్త. మరి కొందరు బద్దెన కాదు భీమన రాశాడన్నారు. కొన్ని సుమతి శతకపు లిఖిత ప్రతుల్లో కనిపించే ఈ కింది పద్యం భీమన రాశాడనే వాళ్ళకి ఆధారం. దానితో పాటు పద్ధెనిమిదవ శతాబ్దపు కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సార సంగ్రహంలో భీమననే సుమతి శతక కర్తగా గుర్తించాడు. ఇంతకీ ఆ రాతప్రతుల్లో కనిపించే పద్యం ఇది.

శ్రీకరముగ భీమనమును
లోకమునకు బొగడగా విలోకించి మదిన్
బ్రాకటముగ సుమతికి మతి
చేకూడగ సుమతినీతి చెప్పదొడంగెన్

ఈ రాతప్రతిలో భీమన రాసిన పుస్తకం పేరు సుమతి శతకం కాదు సుమతి నీతి. అంటే బద్దెనీతి అనే పేరును తలిపించే పేరు. ఇదే పద్యం వావిళ్ళ సుమతి శతకం చాలా ప్రతుల్లో కూడా చివర కనిపిస్తుంది.

[ఈ పద్యం మద్రాసులోని ఓరియంట్ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీలో 1810వ నంబరు రాతప్రతిలో వుందని మచ్చా హరిదాసు (1984) గుర్తించాడు. అయితే ఈ పుస్తకాలు తిరుపతికి చేరాయని నేను వింటున్నాను.]

ఇక పోతే మానవల్లి రామకృష్ణ కవి, వంగూరి సుబ్బారావు, నిడదవోలు వెంకటరావు సుమతి శతకానికి బద్దెనే కర్తని వాదించారు. బద్దెన రాసిన నీతిశాస్త్ర ముక్తావళిలో (దీనికే బద్దెనీతి అని పేరు) కనిపించే ఈ పద్యం వీరికి ఆధారం.

శ్రీవిభుడ గర్వితారి
క్షమావరదళనోపలబ్ధజయలక్ష్మీసం
భావితుడ సుమతిశతకము
గావించిన ప్రోడ గావ్యకమలాసనుడన్

భీమనా? బద్దెనా?
బద్దెన గురించి మనకు ఎక్కువ తెలియదు. ఆయన 11-12 శతాబ్దాలలో ఏదో ఒక చిన్న దేశానికి ఒక చిన్న రాజు అని మానవల్లి రామకృష్ణ కవి, వేదం వెంకటరాయ శాస్త్రి అంటున్నారు. బద్దెన పేరుతో వున్న పుస్తకం నీతిశాస్త్ర ముక్తావళి. దీనినే బద్దెనీతి అంటారని ఇంతకు ముందే చెప్పాను. ఈ పుస్తకంలో 162 పద్యాలున్నాయి. రాజులు మంత్రులు అనుసరించదగిన నీతిని గురించి కామందకంలో చెప్పిన లాటి నీతులు ఇందులో కనిపిస్తాయి. ఈ బద్దెన ఎవరో కానీ పద్యం చక్కగా రాయగలడు. రాజ్య పరిపాలనలో గట్టి అనుభవం ఉన్నవాడిలా కనిపిస్తాడు. ఈ పుస్తకం అలాంటి వ్యవహారాల పట్ల ఆసక్తి ఉన్న జనాభాలో ప్రచారం పొంది ఉండొచ్చు. ఏది ఏమైనా పధ్నాల్గవ శతాబ్దిలో మడికి సింగన తాను సంకలనం చేసిన సకల నీతి సమ్మతములో బద్దెన పుస్తకంలో నుంచి 38 పద్యాలు చేర్చుకున్నాడు. ఈ పుస్తకానికి సింగన కాలం నాటికే బద్దెనీతి అనే పేరు ప్రచారంలో వుంది. [వికిపీడియా వ్యాసకర్త కూడా సుమతి శతకకర్త బద్దెన అని గట్టిగా చెప్తున్నాడు]

భీమన గురించి మనకు అసలేమి తెలియదు. కానీ ఆయన గురించి కథలు చాలా ఉన్నాయి. ఆయన వేములవాడ అనే ఊళ్ళో పుట్టాడు. అతని తల్లి ఒక బాల్య వితంతువు. ఆవిడ తన భర్త పోయిన తరువాత భీమనను కన్నది. వితంతువైన ఈవిడ భర్తలున్న ఇతర బ్రాహ్మణ స్త్రీలతో పాటు భీమేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళి వాళ్ళందరూ పుత్ర సంతానం కోసం మొక్కుకుంటూ వుంటే తనక్కూడా పుత్రుడు కావాలని అమాయకంగా మొక్కుకుంది. భీమేశ్వర ప్రసాదం వల్ల ఆవిడకు భీమన పుట్టాడు. ఈ కొడుకు ఎవరికో పుట్టాడని ఆ తల్లి శీలాన్ని శంకించినవాళ్ళు భీమనని ఊళ్ళో అమర్యాదగా చూసేవాళ్ళు. భీమనకి చిరాకు పుట్టి తల్లి దగ్గర కెళ్ళి నా తండ్రెవరో చెప్పమని గట్టిగా అడిగాడు. ఆవిడ భీమేశ్వర స్వామి దేవాలయాన్ని చూపించి అందులో దేవుడే నీ తండ్రి అని చెప్పింది. భీమన తిన్నగా ఆ దేవాలయానికి పరిగిత్తి చేతిలో ఒక బండరాయి తీసుకుని శివలింగానికి ఎదురుగా నిలబడి, “ఓ భీమేశ్వరా, నీవు నా తండ్రివి అవునో కాదో చెప్పు. చెప్పక పోతే ఈ రాతితో నీ తల పగలకొడతాను,” అని గట్టిగా అరిచాడు. అంతకన్నా పెద్ద రాయిలా వున్న భీమేశ్వరుడు గట్టిగా నోరు తెరిచి, “నాయనా! నువ్వు నా కొడుకువే, ఇకనుంచి ఎవరైనా నిన్ను నీతి లేని తల్లికి పుట్టాడని నిందిస్తే నువ్వు వాళ్ళని శపించు. ఈ క్షణం నుంచి నీ మాటకి వెంటనే ఫలితం వస్తుంది. నువ్వు శాపానుగ్రహ సమర్థువుడవౌతావు,” అని చెప్తాడు.

ఆ తరవాత నుంచి భీమనన్న ప్రతి మాట నిజమవడం మొదలయింది. ఒకసారి బ్రాహ్మలంతా ఒక సంతర్పణ చేసుకుంటూ భీమనని పంక్తిలో కూర్చోనివ్వలేదు. వెంటనే భీమన

అన్నం అంతా సున్నమవాలి
అప్పాలన్నీ కప్పలవాలి
అయ్యలందరూ కొయ్యలవాలి

అని శపించాడు. మరు క్షణంలో అన్నం అంతా సున్నం అయ్యింది. విస్తళ్ళలో కప్పలెగరడం మొదలు పెట్టాయి. భోజనం చేస్తున్న బ్రాహ్మలందరూ కొయ్యబొమ్మల్లా తయారయ్యారు. ఆ చుట్టూ వున్న ఇతర బ్రాహ్మలు ఈ కుర్రవాడు పెట్టిన శాపం వల్లే జరిగిందని గ్రహించి అతని కాళ్ళమీద పడి అనుగ్రహించమని వేడుకున్నారు. అతను వెంటనే

సున్నం అంతా అన్నమవాలి
కప్పలన్నీ అప్పాలవాలి
కొయ్యలన్నీ అయ్యలవాలి

అని తన శాపానికి విరుగుడు చెప్పాడు. [చాగంటి శేషయ్య, 1959-1971, Vol. 1, 208-265]

భీమనని గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో వున్నాయి. పదిహేనవ శతాబ్దపు శ్రీనాథుడు [శ్రీనాథుడు, 1969] భీమన పేరు తెలుగు కవుల వరసలో మొదటి పేరుగా చెప్పాడు. పదహారవ శతాబ్దపు పింగళి సూరన [సూరన, 1968] భీమన రాఘవపాండవీయం అనే ద్వ్యర్థి కావ్యం రాశాడనే ప్రఖ్యాతి ఉందని చెప్పాడు. పదిహేడవ శతాబ్దపు అప్పకవి నన్నయని గురించి చెప్పిన కథలో నన్నయకీ భీమనకీ ఉన్న వైరాన్ని గురించి ప్రస్తావించాడు. అయితే వీళ్ళెవ్వరూ భీమన గురించి చారిత్రకంగా నిర్ధారించుకోవడానికి కావలసిన సమాచారం ఇవ్వలేదు. వాళ్ళ కాలం నాటికి ప్రచారంలో వున్న కథల ఆధారంగానే వాళ్ళు భీమనను గురించి చెప్పారనుకోవాలి. దీన్ని గురించి మనకు తెలిసే విషయం ఏమిటంటే పదిహేనవ శతాబ్ది నాటికే భీమన కథల్లో వుండే కవి అయిపోయాడు. అంచేత నిజంగా భీమన అనే కవి ఉన్నాడో లేదో మనకు తెలియదు. అయితే ఈ భీమన బద్దెనల కర్తృత్వంలో వున్న వైరుధ్యాన్ని మనం ఎలా బోధ పరుచుకోవాలి?

ఒకే పేరుతో వున్న పుస్తకానికి ఇద్దరు కర్తలు ఉండే వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఒక పద్ధతి: పేరు ఒకటే అయినా అవి రెండు పుస్తకాలుగా చూడడం. సుమతి శతకం వాగ్వ్యవహారంలో ప్రచారం అయిన పాఠం ఒకటి, లిఖిత పూర్వకంగా ప్రచారమైన పాఠమొకటి రెండు పాఠాలు ఉన్నాయని, సౌలభ్యం కోసం ఒకదానికి వావిళ్ళ సుమతి శతకమని, రెండవ దానికి బ్రౌన్ సుమతి శతకమని పేరు పెట్టి వాటిని పరిశీలించానని మీరు గమనించారు. లౌకికంగా పైకి రావడానికి సాధికారమైన గ్రంథంగా సుమతి శతకం వుండాలని పూనుకున్న కరణాలు తమ పాఠానికి బద్దెన పేరు పెట్టుకున్నారు. వివేకవంతుడైన రాజ్య పరిపాలకుడుగా బద్దెనకు ఉన్న ప్రఖ్యాతి అతను కర్త అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక పోతే వాగ్వ్యవహారంలో కరణాలకన్నా ఎక్కువ మందిలో పేరు తెచ్చుకున్న సుమతి శతకానికి శాస్త్ర స్థాయి రావాలంటే భీమన్న పేరు పనికొస్తుంది. ఉదాహరణకి అప్పటికి శాస్త్రాలుగా పేరు పొందిన పుస్తకాలన్నీ చారిత్రకంగా ఫలానా అని చెప్పడానికి వీలులేని ఒక గొప్ప వ్యక్తి పేరుతో వున్నవే. మనువు, కౌటిల్యుడు, భరతుడు, వాత్సాయనుడు, వీళ్ళందరు ఋషులనే పేరే కాని వాళ్ళ చారిత్రక వ్యక్తిత్వాలని గురించి మనకేమి తెలియదు. ఆలా తెలియక పోవడం వల్లనే ఆ శాస్త్రాలకి అంత ప్రామాణికత వచ్చింది. భీమన పేరు అలాటిది. శాపానుగ్రహ సమర్థుడైన భీమన వశ్యవాక్కు కాబట్టి అతని పేరు ఈ సుమతి శతకానికి శాస్త్ర స్థాయిని సంపాదించి పెడుతుంది. అతనెప్పుడు పుట్టాడో, ఎన్నాళ్ళు బతికాడో, ఎక్కడ ఉన్నాడో చారిత్రకంగా తెలియక పోవడం, అతనికి అతి మానవమైన శక్తులు ఉండడం ఈ శతకానికి శాస్త్ర స్థాయి రావడానికి అవసరం.

భీమన పేరుతో శాస్త్ర స్థాయికి వచ్చిన పుస్తకం సుమతి శతకం ఒక్కటే కాదు. కవిజనాశ్రయమనే ఛందో గ్రంథానికి కూడా భీమన ఛందమనే మొన్నటివరకు పేరు. అది మల్లియ రేచన అనే వైశ్యుడైన జైన కవి రాశాడని, దాన్ని భీమనకి బ్రాహ్మలు అంట కట్టారని వీరేశలింగం, ఆరుద్ర కష్టపడి వాదించారు. ఆ పేరు వెనకాల కుల మత సందర్భాలు పట్టుకు రావడం కన్నా ఆ పుస్తకానికి శాస్త్ర స్థాయిని సంపాదించడానికి భీమన పేరు అవసరమైందని ప్రతిపాదించడమే ఎక్కువ తర్క సహజమైన ఊహ.

ఏది ఎలా వున్నా సుమతి శతకాన్ని తమ శతకంగా చేసుకుని బద్దెన పేరు పెట్టుకున్న నియోగులు, ఆ పుస్తకానికి పరిమితమైన తమ సమాజాన్ని దాటి ఎక్కువ మందిలో ప్రచారం రావడం అభ్యంతరకరంగా భావించలేదు. వాళ్ళు చదువుకున్న పుస్తకానికి బద్దెన కర్త అని వాళ్ళు పేరు పెట్టుకున్నా వాగ్వ్యవహారంలో ఉన్న సుమతి శతకానికి భీమన కర్త కావడం నిరాఘాటంగా కొనసాగింది. బద్దెన కర్త అని చెప్పే సుమతి శతక పద్యం బిగువైన లిఖిత శైలిలో వుండడం, సుమతి శతకానికి భీమన కర్త అని చెప్పే పద్యం వాక్ శైలిలో ఉండడం ఈ సందర్భంలో గమనించదగిన అంశం.

ముగింపు
సుమతి శతకం లౌకికార్థంలో నీతిని చెప్పే దశ నుంచి ఆధునికార్థంలో సుగుణాలను చెప్పే దశకి ఎంత దూరం ప్రయాణం చేసిందో మనం చూశాం. ఇప్పుడు తెలుగులో నీతి అనే మాటకి ఒకటే అర్థం. పూర్వం నీతి అనే మాటకి వేరే అర్థం ఒకటి ఉందని మనం దాదాపుగా మర్చిపోయాం. వలసవాద కాలపు భావాల ప్రభావం మనమీద ఎంత గాఢంగా వుందో చెప్పడానికి ఇదొక ముఖ్యమైన గుర్తు.

సుమతి శతకాన్ని ఉదాహరణగా తీసుకుని పుస్తక పాఠాల గురించి, పుస్తకాల కర్తృత్వాల గురించి, వాటిమీద వలసకాలపు భావాల ప్రభావం ఎంత గాఢంగా వుందో చర్చించాను. పుస్తకాల కర్తలని గురించిన కథలు కట్టుకథలుగా కొట్టి పారేయకూడదని, అవి మన పుస్తక సంస్కృతిని బోధ పరుచుకోవడానికి ప్రధానమైన ఉపకరణాలని గమనించమని నా కోరిక.

(ఈ వ్యాసం ఆంగ్ల మూలం నుంచి అనువదించబడి, ఆపైన కొన్ని మార్పులు చేర్పులు చేయబడింది. మూల వ్యాసం: Multiple lives of a text: The Sumati Satakamu in colonial Andhra in “Ritual, Caste, and Religion in Colonial South India”; M. Bergunder, H. Frese, and U. Schröder (Eds); Halle: 2010.

ఈ ప్రయత్నంలో ఎంతగానో సహకరించిన పరుచూరి శ్రీనివాస్‌కు నా కృతజ్ఞతలు.)

గ్రంథసూచి
Anantamatyudu, Bhojarājīyamu, Madras: Vavilla Ramaswamy Sastrulu & Sons, 1962.
Appakavi, Kakunuri, Appakavīyamu. Ed. Gidugu Ramamurti, and Utpala Venkata Narasimhacharyulu, and Ravuri Dorasami Sarma, Madras: Vavilla Ramaswamy Sastrulu & Sons, 1962.
Aqil, Raziuddin and Partha Chatterjee. History in the Vernacular. Ranikhet: PermanentBlack. 2008.
Arudra. Samagra Andhra Sahityam. (Revised Edition, four volumes). Hyderabad: Telugu Akadami, 2002.
Baddena. Nitisastramuktavali. Ramakrishna Kavi, Manavalli. Ed. Tanuku. Narendranatha Sahitya Mandali. 1962.
Bhimakavi, Vemulavada. Kavijanāśrayamu. Ed. Jayanti Ramayya, Kakinada: Andhrasahityaparishattu. (1917) Third edition, 1959.
Brown, C.P. Editor and Translator. Sumati Satakam, Ed. C.R. Sarma. Hyderabad: Andhra Pradesh Sahitya Akademi. 1973.
Brown, C.P. Āndhragīrvanacchandamu: The Prosody of the Telugu and Sanskrit Languages Explained. Madras: The College Press, 1827.
Bangorey. Ed, Literary Autobiography of C.P. Brown. Tirupati: Sri Venkateswara University, 1978.
Haridasu, Macca. Tathaymu Suamti : Parisodhana Vyasalu. Karimnagar: Indu Pracuranalu, 1984.
Narayana Rao, Velcheru and David Shulman. A Poem at the Right Moment: Remembered Verses from Premodern South India. Berkeley: University of California Press, 1998.
Olivelle, Parick. Tr. Pancatantra. New York: Oxford University Press, 1997.
Paparaju, Kankanti. Uttara Ramayanamu. Madras: C.V.Krishna Book Depot, 1970.
Ryder, Arthur W. Tr. The Panchatantra, Chicago: University of Chicago Press,(1956) 1962.
Schmitthenner, Peter. Telugu Resurgence: C.P. Brown and Cultural Consolidation in Nineteenth-century South India, Delhi: Manohar, 2001.
Seshayya, Caganti. Āndhra Kavitaraṅgiṇi, (14 volumes.) Kapilesvarapuramu: Hindu Dharmasastragranthanilayamu, 1959-1971.
Srinathudu. Kaśīkhaṇḍamu, Madras: Vavilla Ramaswami Sastrulu & sons, 1969.
Sumati Śatakamu.
Sumatī Śatakamu. Cennapaṭṭaṇamu: Adisarasvati nilaya mudraksharasala, 1870.
Sumatī Śatakamu. Ed. Scholars. Kakinada: Karra Accayya, 1913.
Sumati Śatakamu. Ed. With a commentary by Gundu Raghava Diskshitulu. Bezawada:Marutiram and Companay. 1922.
Sumati Śatakamu, Madras: Vavilla Ramaswami Sastrulu & Sons, 1962.
Surana, Pingali. Rāghavapāṇḍavīyamu, Madras: Vavilla Ramaswamy Sastrulu & Sons, 1968.
Venkata Rao,Nidadavolu. Satakasamputamu, Part I. Hyderabad, Andhra Pradesh Sahitya Akadami. 1966.
Venkatarayakavi, Polipeddi “Venugopala Satakamu,” in K. Gopalakrishna Rao, Adhiksepa Śatakamulu, Hyderabad: Andhra Pradesh Sahitya Akadami. 1982. Pp. 76-123.
Virabhadra Rao, Kottapalli. Telugu Sahityamupai Inglishu Prabahvamu. (2nd revised edition) Secunderabad: Published by author, 1986.
Viresalingam, Kandukuri. Andhra Kavula Caritramu. Hyderabad: Visalandra Publishing House, 2005.
------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, April 28, 2019

ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి


ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి



సాహితీమిత్రులారా!

ఈ వ్యాసంలో వేరువేరు చిత్రకారులు స్త్రీని వెలయాలిగా, ప్రేయసిగా, భార్యగా, పనికత్తెగా, స్వత్రంత్రవ్యక్తిగా, భయగ్రస్తగా, రోగిగా, మనసు క్రుంగిన వ్యక్తిగా, భ్రష్టురాలిగా, పరిశుద్ధగా, అసాంప్రదాయక బొహీమియన్‌గా — ఇంకా రకరకాలుగా, చిత్రించిన చిత్రాలని గురించి ముచ్చటించాను. ఈ ముచ్చట పైన చెప్పిన వరుస క్రమంలో చెయ్యలేదు సరిగదా కాలక్రమానుసారంగా కూడా చెయ్యలేదు. కొన్ని దిగంబర స్త్రీ చిత్రాలు విధిగా పరిశీలించడం అవసరమయ్యింది. అలాగే కొన్ని ప్రసిద్ధ చిత్రాలలో స్త్రీ ని హింసాత్మకంగా చిత్రించడం అవసరమా? అనే వాదన కూడా చేశాను.

మరొక్క విషయం. ఇందులో నా అభిప్రాయాలకి ఆధారం: చిత్రకళపై గత పాతిక సంవత్సరాలలో నేను చదివిన విమర్శ వ్యాసాలు, పుస్తకాలలో విషయాలు, నా మనసులో జ్ఞాపకాలుగా మిగిలినవి. మరి కొన్ని అభిప్రాయాలు, విమర్శలు చదివిన తరువాత, పేరు మోసిన చిత్రాలని మ్యూజియములలో స్వయంగా చూసిన తరువాత, కొద్దిమంది చిత్రకళాధ్యాపకుల, విమర్శకుల ఉపన్యాసాలు విన్న తరువాత ఏర్పడినవి. ఆఖరిగా ఈ బొమ్మ నచ్చింది, ఆ బొమ్మ నచ్చలేదు అని చెప్పడం ఎవరికైనా తేలికే. ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు అని ఎవరైనా నిలదీస్తే వచ్చే సమాధానం నిష్పాక్షికంగా ఉండదు. నా విషయంలోనూ అంతే. నా వ్యాఖ్యానాల విషయంలోనూ అంతే. ముఖ్యంగా కొన్ని చిత్రాలు — యూరోపియన్‌ పద్ధతిలో స్త్రీరూప ఆకృతికి నైరూప్యతని మిళితం చేసి గీసిన చిత్రాలు — వీటిపై నా అభిప్రాయాలు కొన్ని ఇప్పుడు వివాదగ్రస్తంగా కనిపించవచ్చు. వివాదగ్రస్తమైన పాక్షికాభిప్రాయాలకి పూర్తి బాధ్యత నాదే. – వేవేరా.]

అన్‌టైటిల్డ్ – ఎస్.వి.రామారావు (2012)
చిత్రకళ చరిత్రలో వేర్వేరు చిత్రకారులు వేసిన స్త్రీ చిత్రాల గురించి, తోడుగా సాంఘికంగా స్త్రీకిచ్చిన స్థానం గురించి చర్చించడం ఏ కాలంలో నైనా ఆకర్షణీయమయిన విషయం. ప్రస్తుతం కాలంలో ఈ చర్చ సందర్భోచితం, ముఖ్యం కూడాను. కారణం: ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో సామాజిక సమానతపై, హక్కులపై, లైంగిక స్వాతంత్ర్యంపై, స్త్రీవాద సాహిత్యం ముమ్మరంగా వచ్చింది. ఇంకా వస్తూనే వున్నది. అయితే, దృశ్యపరంగా స్తీలపై సమాజానికున్న అవగాహన, సాహిత్యం ద్వారా గ్రహించలేం. ఎంత జాగ్రత్తగా పరిశోధించి రాసినా, ఒక వ్యక్తిగా, లేదా సాధారణ సామూహిక చిహ్నంగా, స్త్రీ పై సమాజానికున్న ధోరణి అసంపూర్తిగానే బోధపడుతుంది. వరుసగా స్త్రీరూప చిత్రాలు పరిశీలిస్తే వివిధ దృష్టికోణాలు, వైఖరులను చిత్రకళ ప్రదర్శించినట్టుగా సాహిత్యం ప్రదర్శించలేదు. అందుచేత, ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తిని విశదీకరించిన విధానం విచారించడం వలన మన దృక్పథంలో మార్పు రావచ్చు. మాటవరసకి మార్పు రాదనుకుందాం; కనీస పక్షంగా, ఇంతకు ముందు మనకు స్థిరపడ్డ అభిప్రాయలతో పోల్చి చూడటానికి కావలసిన ‘కొత్త’ విషయాలు తెలుస్తాయి.

ఈ సందర్భంలో విచారించవలసిన మరొక విషయం: పరిశీలించవలసిన చిత్రాలు, ప్రతిమలూ కోకొల్లలు. అందుకని, ఆధునిక చిత్రకళలో బొమ్మలనే ప్రస్తావించు దామనుకుంటున్నాను. ఆధునిక అనగానే, సాధారణంగా కొత్తదనం, వైరుధ్యం, ప్రదర్శించిన చిత్రకళే అన్న అభిప్రాయం విమర్శకులలో పాతుకొని పోయి ఉన్నది. ఈ వైఖరి అవ్యక్తమైనదని నిరాఘాటంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఏ కాలంలో వచ్చిన కొత్త బొమ్మలు ఆ కాలానికి ‘ఆధునిక’ చిత్రాలే! అంతే కాదు. ఒక ప్రత్యేక చిత్రకళా పద్ధతి అప్పటి సమాజానికి నూతన విషయాలు చూపగలిగితే, అప్పటి సమాజం ఆ కొత్తదనాన్ని ఆస్వాదించి ఆమోదించ గలిగితే, ఆ చిత్రకళ ఆధునికమని ఒప్పుకోవచ్చు.

మడొనా అండ్ ఛైల్డ్ – ఎప్‌స్టీన్(1950-52)
ఏది ఏమయినా, వివాదాలలోకి పోకుండా, గత రెండు శతాబ్దాలలో ప్రసిద్ధ చిత్రకారులు వేసిన స్త్రీ చిత్రాలని ఎంచుకొని, వాటిని గురించి చర్చిస్తాను. ఇక్కడ ప్రసిద్ధ చిత్రకారులు అని ఎందుకన్నానంటే, 1. వీళ్ళు వేసిన చిత్రాలు చూడటానికి తేలికగా లభిస్తాయి, 2. ఈ చిత్రాల చిత్రణ వెనుక ఉన్న కథ, వాటికి అనువైన మద్దతు, మ్యూజియములు, చిత్రకళా విమర్శకులు, చిత్రకళా పోషకులు మనకు తెలియపరచబట్టి. అందుచేత, ఆ చిత్రాలు మాత్రమే గొప్పవీ, విశ్లేషించదగినవీ అన్న అభిప్రాయాన్ని నేను సమర్థించటం లేదు. చిత్రకారులు మగవారు కావచ్చు; ఆడవారు కావచ్చు. ఈ లింగభేదం అప్రస్తుతం కాదు కాని, ప్రధానం కూడా కాదు. ముఖ్యంగా చూడవలసిన విషయం: ఫలానా చిత్రం స్త్రీ పరంగా ఏ విధమైన ప్రతిపాదన(లు) చేసింది? స్త్రీ పరంగా ఏ విధమైన వివరణ(లు) చేసింది? ఈ రెండూ ఈ వ్యాసానికి ముఖ్య అంశాలు.

లింగభేద సమస్య, సమస్య కాదనడానికి ఉదాహరణగా పికాసో (Pablo Picasso, 1881-1973) గీసిన Girl Before A Mirror (1932) చిత్రం చూద్దాం. ఈ చిత్రం పురుషులే చూడదగిన చిత్రం కాదు. గొప్ప చిత్రకారులు స్త్రీ అంతర్గత వ్యక్తిత్వాన్ని చిత్రంలో చిక్కబట్టి చూపగలరు. ఈ చిత్రాన్ని గురించి మరొకచోట చర్చించుతాను. ఇందుకు ప్రతిగా కొందరు పురుష చిత్రకారులు ఎంత ప్రయత్నించినా స్త్రీ అంతర్గత వ్యక్తిత్వాన్ని బొమ్మలో చూపలేరు. అల్లాగే, మరికొందరు స్త్రీ చిత్రకారులు పురుషుని అంతర్గత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని బొమ్మలో ఇమడ్చలేరు. ఇటువంటి చిత్రాలు ఉన్నాయి; అవి చిత్రాలుగా గమనించదగ్గవి కావు, అని నా అభిప్రాయం.

వీనస్ ఆఫ్ విలెన్‌డార్ఫ్
ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆధునిక చిత్రాలు చారిత్రిక ప్రతీకల నుండి వేరుచేసి బోధ పరచుకొనేవి కావు. మానవుని ఊహ, భావన, కల్పన, ఎన్నో కల్పాల గుర్తులని, జ్ఞాపకాలనీ ప్రతిబింబించుతుంది. అందుకనే కాబోలు, ఇప్పటికీ వీనస్ (Venus of Willendorf c. 15,000-10,000 B.C) శిల్పంలో స్త్రీ మూర్తిత్వాన్ని, కాదు! స్త్రీత్వాన్ని మనిషి చూడగలుగుతున్నాడు.

భౌతిక మానవవిజ్ఞాన శాస్త్రం (physical anthropology) లైంగిక పరంగా సృష్టిలో స్త్రీ పురుషుల రెండు ఆకారాల (dimorphism) మధ్య విభేదాలను స్పష్టపరుస్తుంది. అందుకనే కాబోలు, ఏ మ్యూజియంలోనైనా చూడండి: ముఖ్యంగా పాలరాతి శిలాప్రతిమలు చూడండి. పురుషులు దృఢంగా బలిసిన కండరాలతోను, కొట్టవచ్చే గడ్డం తోను (ఒక్కొక్క సారి వెండ్రుకల్తో నిండిన గడ్డం), స్త్రీ ప్రతిమలు — ముఖ్యంగా వారి ముఖకవళికలలో — ఎంతో సౌమ్యత, మెత్తదనం, చక్కని పొడుగాటి ముక్కు, వగైరాతో ఒకే రకంగా కనిపిస్తారు. అన్ని స్త్రీ ప్రతిమల్లోనూ ముఖాకారం కోడిగుడ్డులా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఏ విధమయిన భేదమూ, ఏ శిలా ప్రతిమ లోనైనా సరే, ఎంత వెతికినా కూడా కనిపించదు. ఇంకా విపులంగా చెప్పాలంటే, ప్రతి కోడిపెట్టకీ అన్ని కోడిగుడ్లూ ఒకేలా కనపడినట్లు! మనిషిని చూసి అదేరకంగా చిత్రాలు గీసేవారి (portrait painters) చిత్రాలలో, శిలాప్రతిమలు తయారు చేసేవారి ప్రతిమలలో కూడా, స్త్రీ మూర్తిమత్వ విశిష్టత పూర్తిగా లోపిస్తుంది. అందరినీ ఒకే రకంగా చిత్రించడం చేత, వ్యక్తిత్వం మరుగున పడిపోతుందని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం కాదు. చూడండి: మోనా లీసా చిత్రంలో, ఆ పెదాలపై చిరునవ్వు మీద వందలకొద్దీ పేజీల విమర్శనా సాహిత్యం దొరుకుతుంది. అంటే అసలు అర్థం: బొమ్మలో స్త్రీమూర్తిమత్వ విశిష్టత లోపించబట్టే విమర్శకులు పురాణాలు రాశారని అనవచ్చు.

ఇది పూర్వకథ.

పంతొమ్మిదవ శతాబ్దం, ఇరవయ్యవ శతాబ్దాల చిత్రకళ చరిత్రలో మార్పులు చోటు చేసుకున్నాయి. స్త్రీ మూర్తి చిత్రవర్ణన పరిధి పెరిగింది. స్త్రీ కున్న ప్రత్యేక లక్షణాలని నిరూపణ చెయ్యటానికి ఆస్కారం లభించింది. కేవలం భౌతిక లక్షణాలే కాకుండా ఇతర వ్యక్తిగత లక్షణాలని చిత్రించే సభ్యత, స్వాతంత్ర్యం చిత్రకారులకి కలిగింది. ఇందుకు కారణం చిత్రకారుడు భౌతిక మానవవిజ్ఞాన శాస్త్రం సృష్టించిన లైంగికభేదాలకి కట్టుబడి ఉండనవసరం లేకపోవడం. అంతే కాకుండా, సాహిత్యంలో పంతొమ్మిదవ శతాబ్దంలో వచ్చిన రొమాంటిసిజమ్, సింబాలిజమ్ వంటి విప్లవాలు వ్యక్తి అంతర్గత జీవితాన్ని మరింత శ్రద్ధగా పరిశీలించటానికి వెసులుబాటు కల్పించాయి.

బాత్‌షెబా – రెంబ్రాంట్ (1654)
ఇరవయ్యో శతాబ్దంలో చిత్రకారుడు స్త్రీ భౌతిక లక్షణాలని అణగదొక్కటం (suppression), ఒక్కొక్కసారి విస్తరించి చిత్రించటం (exaggeration), వక్రీకరించి, కొన్నిచోట్ల వికృతీకరించి (distortion) చిత్రించే ‘అధికారం’ చేజిక్కించుకొన్నాడు. స్త్రీ మానసిక తత్వాన్ని, మానసిక నైజాన్ని వివరించే చిత్రణ మొదలయ్యింది. అంతే కాదు. 1839లో ఫొటొగ్రఫీ బాగా పుంజుకున్నది. ఈ ప్రక్రియ, చిత్రకళకి అవసానదశ వచ్చిందనే భయాన్ని కలిగించింది. ఈ ఫొటోగ్రఫీ తెచ్చిపెట్టిన భయంతో, పాతకాలపు దృశ్యమాన స్వరూప చిత్రణ నుంచి విడిపడి చిత్రకళ ఒక విపరీత స్వేచ్చని కౌగలించుకుంది. చిత్రకారుడు, కంటికీ కేమెరా భూతద్దానికీ చిక్కని మానసిక నైజాలని కుంచె ద్వారా వివరించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ సందర్భంలో చిత్రకారుడు స్త్రీ ముఖచిత్రణలో వైపరీత్య పూరణకి పూనుకున్నాడు. అంతర్గత జీవన చిత్రణలో వికృతీకరణావశ్యకత అనివార్యమయ్యింది.

చిత్రకళలో ఆధునికత మిణుకు మిణుకుగా పదిహేడవ శతాబ్దంలోనే పొడచూపింది. రెంబ్రాంట్ (Rembrandt Van Rijn, 1606-69) నిజంగా ఆధునికుడు కాదు. అయినా, అతను వేసిన స్త్రీ చిత్రాలలో ఆధునికత చూచాయగా కనిపిస్తుంది. ఉదాహరణకి అతను చిత్రించిన Bathsheba (1654) చిత్రం చూడండి. సాధారణ స్త్రీ రూపం పైకి కనిపిస్తుంది. వైవాహిక పరంగా తప్పని పాతివ్రత్యం, అందుకు ప్రత్యామ్నాయంగా ఒక శక్తివంతమైన పరపురుషుని ఆకర్షణల మధ్య తీవ్రంగా ఆలోచన చేసే అసాధారణ వ్యక్తిత్వం ఈ చిత్రంలో సూచనగా కనిపిస్తుంది. బాత్‌షెబా ముఖంలో ముందేమి జరగబోతున్నదో తెలిసిన ఆందోళన కనిపిస్తున్నది. స్త్రీ మానసిక స్థితి, బైబిల్ కథనం వాక్యాల మధ్యలో ఇమిడి వున్న భావన,రెండూ చదివిన చిత్రకారుడు రెంబ్రాంట్ అన్న విషయం స్ఫురణకి రాక మానదు.

న్యూడ్ – కోల్‌విట్జ్ (1910)
కాథే కోల్‌విట్జ్ (Kathe Kollwitz, 1865-1945) 1905లో చేసిన Nude లితోగ్రాఫ్ చూడండి. ఈమె, రెంబ్రాంట్ సంప్రదాయంలో చిత్రకళోపాసన చేసిన చిత్రకారిణి. ఈమె సామ్యవాది. ఈ చిత్రంలో స్త్రీ వివస్త్ర. ఈ చిత్రం, ఆర్థిక రిక్తత, సాంఘిక అన్యాయం, వ్యక్తపరిచే చిత్రం. వయసొచ్చిన స్త్రీ భౌతిక దేహాన్ని ధైర్యంగా చిత్రించింది. కాథే కోల్‌విట్జ్ అప్పటి కాలానికి విప్లవాత్మక చిత్రకారిణే అని ఒప్పుకోక తప్పదు. ఈమె చిత్రాలలో స్త్రీలు దయనీయమైన స్థితిలో వుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం ఈమె మీద చూపిన ప్రభావం ఈ చిత్రాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉమన్ విత్ డెడ్ ఛైల్డ్ (Woman with dead child, 1903) ఇందుకు ఒక మంచి ఉదాహరణ. కాథేకి పూర్తిగా విరుద్ధంగా విల్లెమ్ డె కూనింగ్ (Willem de Kooning), గత శతాబ్ద మధ్య భాగంలో తను వరుసగా చిత్రించిన స్త్రీ చిత్రాలలో స్త్రీ వ్యధ పూర్తిగా మరిచిపోయి, స్త్రీ పైన ద్వేషం, కోపం, చిత్రించాడు. కూనింగ్ గురించి, అతని చిత్రాల గురించి తరువాత పరిశీలిస్తాను.

మాహా వెస్తీదా – గోయా (1803)
ఫ్రాంచిస్కో గోయా (Francisco Goya, 1746-1828) దృశ్యమాన పరంగా ఆధునికతకి దగ్గిరవాడేనని చెప్పవచ్చు. స్త్రీ రూపాన్ని ప్రౌఢమైన పురుషోచిత సంప్రదాయంతో దృక్పథంతో మెచ్చుకొనేవాడు. అతని మాహా చిత్రాలలో స్త్రీలు (Nude Maja, 1800; Clothed Maja, 1803) నిజంగా దృఢమైన, స్వతంత్ర వ్యక్తులు, లౌక్యం తెలిసి తెలివిగా మసలుకొనేవాళ్ళు. అయితే మనే (Edouard Manet) కూడా ఈ పద్ధతే అవలంబించాడు. అంటే అతని వేసిన ఆడవారి బొమ్మలు స్వతంత్ర వ్యక్తులుగా, లౌకికులుగా, దృఢంగా ఉన్నప్పటికీ, వారిలో వగలాడితనం లోపిస్తుంది. ఉదాహరణకి Olympia (1863) చిత్రం చూడండి.

మాహా దెస్నూదా – గోయా (1800)
స్త్రీలు పురుషులకి ఎల్లప్పుడూ మార్మిక వ్యక్తులుగానే గోచరించేవాళ్ళు. అయితే, ఆధునిక స్త్రీ, పురుషులకే కాకుండా సాధారణ స్త్రీలకి కూడా సమస్యగానే అగుపించేది. అంత ఎందుకు? స్త్రీ, స్త్రీగా తనకే ఒక సమస్య, అన్నా చిక్కు లేదు. మనం ఇప్పుడు తెలుసుకున్నాం: స్త్రీ చరాస్తి కాదని, పనికత్తె మాత్రమే కాదని, జీవితాంతం పిల్లలని కనే యంత్రం కాదని, ఒకే పురుషుడికి అంకితమయిన మనిషి కాదని, తలకొవ్వి తీరికగా కూచునే జీవి కాదనీ — అయినా ఇప్పటికీ కూడా, బయటి ప్రపంచంలో అన్ని విషయాలలోనూ సమాకలిత సభ్యురాలిగా స్త్రీ గుర్తించబడలేదు.

ఒలింపియా – మనే (1863)
నిజం చెప్పాలంటే, పంతొమ్మిదవ శతాబ్దంలో చిత్రకారుడు సహజంగా స్త్రీ ప్రతిమని చిత్రించాలనుకుంటే, అప్పట్లో చిత్రకళలో ఉన్న పాత సాంప్రదాయాలు — అందం, సుకుమారత — వంటివి కనిపించేట్టు చిత్రించాలి. ఇటువంటి సాధారణ లక్షణాలకి ఉద్వాసన చెప్పవలసిన అవసరం ఉన్నదని నమ్మి, ఆ పని చేసిన వాడు డేగా. చాలామంది ధనికవర్గం స్త్రీలకి అప్పట్లో ఇది బాధ కలిగించింది. డేగా శిష్యురాలు, స్నేహితురాలు అయిన మేరీ కసాట్ (Mary Cassatt, 1845-1926) చిత్రించిన స్త్రీ చిత్రాలు సహజంగా, ఆహార్య రహితంగా (ఉదా. La Toilette) ఉంటాయి.

ల ట్వాఁలెట్ – మేరీ కసాట్(1894)
సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థ, గందరగోళం, సమస్యని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. ఈ అభిప్రాయాలు వేద సూత్రాల లాగా, అంతిమ సత్యాల లాగా వల్లించటం పరిపాటి అయ్యింది. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.

ఎడ్గార్ డేగా (Edgar Degas) స్త్రీలు ప్రదర్శనార్థం కోసం కానప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో అల్లాగే తన చిత్రాలలో స్త్రీలని చిత్రించాడు. కొన్ని పాత సాంప్రదాయాలని ప్రతిఘటించి, ముఖ్యంగా, స్త్రీలు సృష్టిలో కేవలం అందమైన ప్రాణులు మాత్రమే కాదని చూపడానికి ప్రయత్నించాడు.

ఆఫ్టర్ ది బాత్ – ఉమన్ డ్రైయింగ్
హర్‌సెల్ఫ్ – డేగా (1898)
వీపు గోక్కుంటూనో, కాలి చీలమండ మర్దన చేసుకుంటూనో, ఇలా సహజ ప్రక్రియలలో స్త్రీలను చిత్రించటం ఏ స్త్రీ సహించదు. డేగా సరిగ్గా అటువంటి సహజమైన పనులు చేసే బాలే (ballet girls) నృత్యకన్యల బొమ్మలు వేశాడు. ఒకసారి, ఎవరో అడిగారట, “డేగా! నువ్వుఎప్పుడూ కురూపులు, అనాకారులుగా కనిపించే స్త్రీ చిత్రాలని ఎందుకు వేశావు?” అని. అందుకు డేగా సమాధానం: “సాధారణంగా స్త్రీలు అనాకారులే కాబట్టి!”

ఎడ్వర్డ్ ముంక్ (Edvard Munch, 1863-1944) అనే ఆధునిక చిత్రకారుడు మనస్సంబంధితలైంగిక వికాసానికి అన్వయించుకోటానికా అన్నట్టు కనిపించే సూత్రం తన The Dance of Life చిత్రం ద్వారా తెలియపరిచాడు. ఈ బొమ్మలో స్త్రీ మానసిక పరిణామం మూడు దశలుగా చూపిస్తూ ఒక వ్యూహాత్మక కథనం (ప్రణాళిక?) చిత్రించాడు.

ది డాన్స్ ఆఫ్ లైఫ్ – ముంక్ (1899)
మొదటి దశ: స్వప్న మయమైన ఊహా ప్రపంచంలో నుంచి స్త్రీగా పెరిగే బాలిక – మొగ్గనుండి పువ్వుగా వికసించే వ్యక్తి – తరువాత భౌతిక వాంఛతో పురుషునితో కలయిక — పురుషుడు ప్రేమికుడు, మోసపోయినవాడు కూడా — ఆఖరిగా స్త్రీ తిరస్కృతగా తయారయిన వితంతువు. ఈ బొమ్మని చాలా మంది చిత్రకళా విమర్శకులు, బైబిల్‌లో ఉన్న విశ్వసృష్టి పురాణకథకి వైపరీత్య వ్యాఖ్యానం అని రాశారు. కాని, ఆ వ్యాఖ్యానం బహుశా సరైనది కాదు. ఈ బొమ్మలో స్త్రీ తన వ్యక్తిగత మూలాన్నీ, దేశీయ హేతువులనీ అధిగమించినదని వ్యాఖ్యానించవచ్చు. ఏది ఏమయినా, బొమ్మ మధ్యలో శవాకారంలా చిత్రించబడ్డ పురుషుడి గురించి ఏ విధమైన వ్యాఖ్యానం చెయ్యచ్చు? స్త్రీ లైంగికత్వ ధ్వంసకారిణా? కాదు. ఈ చిత్రం స్త్రీ పురుష సంబంధాలలో జటిలమైన సత్యాలని చిత్రించిన చిత్రం.


ఉమన్ విత్ ఎ కాఫీ పాట్ – సెజాఁ (1895)
పాల్ సెజాఁ (Paul Cezanne, 1839-1906) తన Woman with coffee pot చిత్రంలో స్త్రీ లోని సహజ మానవతని నిర్జీవం చేస్తే, ఆన్రీ మటీస్‌కి (Henri Matisse, 1869-1954) స్త్రీ ఒక అలంకరణ వస్తువే! వీరిద్దరూ క్యూబిజమ్ (Cubism) ప్రారంభానికి నాంది పలికిన వాళ్ళు. ప్రొటొ క్యూబిస్టులని చెప్పవచ్చు. కాని, గీతలు, సమచతురాలు మాత్రమే ఉపయోగించి, క్యూబిస్టుల క్రూరమయిన ‘భాష’లో ఒదిగి ఉండే స్త్రీ చిత్రాలని గీసినవాడు పికాసో. 1937లో గీసిన Weeping Womanలో స్త్రీ అంతర్లీన జీవనం విజయవంతంగా గుర్తించగలిగాడు. గుర్తించటమే కాదు; ‘అనుభవించి’ చిత్రంలో స్త్రీ కన్నుల నుండి తడి కన్నీటి బిందువులు సృష్టించాడు.

వీపింగ్ ఉమన్ – పికాసో (1937)
ఇంతవరకూ స్త్రీ చిత్రణలో పురుషుడు వద్దనుకున్నా కనిపిస్తాడు. అంటే, స్త్రీ స్వాతంత్ర్యం అనేది ఏదన్నా ఉంటే అది మరుగున పడి ఉండిపోయింది. ఇప్పుడు, ఏకాంతత, వంటరితనం ఎలా చిత్రించారో చూద్దాం. ఈ ఏకాంతత — స్త్రీ తనకు తానుగా కోరుకున్న ఏకాంతత, వంటరితనం కావచ్చు. సామాజిక బంధాలు తెగిపోవటం, చుట్టూ చిన్న పిల్లలు లేకపోవడం కారణం కావచ్చు. ఇది చిత్రకళలో మరొక ఆధునిక ప్రస్తావన. అంతర్లీన జీవనం సాధారణంగా సాహిత్య ప్రక్రియ. స్త్రీ ఊహలు, అనుభూతులు, అనుభవాలూ, రాయటంలో ఉన్న సులువు వేరు. చిత్రీకరించటంలో ఉన్న కష్టాలు వేరు. ఒక కళోపాసనకు కావలసిన వ్యూహరచన, భౌతిక సదుపాయాలు — చిత్రకళ, శిల్పకళ, ప్రింట్ తయారీ — సాధారణంగా వసతి గృహాలలో ఏర్పాటు సాధ్యంకాదు. దానికి తోడుగా, పక్షపాతం (prejudice) మరొక అవరోధం. చిత్రకళకి సంబంధించిన సాహిత్యం లోను, చిత్రకళాభ్యాసం లోను కూడా, స్త్రీలు పాక్షికతని ఎదుర్కోవాలి. ఈ పాక్షికతని కవయిత్రుల కన్నా, నవలా రచయిత్రుల కన్నా ఎక్కువగా అనుభవించవలసిన వాళ్ళు చిత్రకారిణులు. అయినప్పటికీ కొద్దిమంది చిత్రకారులు, స్త్రీ యొక్క వంటరితనాన్ని వస్తువుగా స్వీకరించి చిత్రాలు గీశారు.

హోటల్ రూమ్ – హాపర్ (1931)
అమెరికన్‌ చిత్రకారులలో ఎడ్వర్డ్ హాపర్ (Edward Hopper, 1882-1967) స్త్రీ ఏకాంతతని చిత్రీకరించిన ‘కవి’ అంటారు. హాపర్ 1931లో వేసిన Hotel Room చిత్రం చూడండి. ఈ చిత్రంలో స్త్రీ ఒక చవకబారు హోటల్‌ గదిలో ఒంటరిగా కూర్చుంటుంది. నిజంగా ఒంటరిది కాదు. తన భర్తతో కలిసే వచ్చింది. కానీ అతను లేడు. భర్త లగేజీ, విడిచిన తన చెప్పులు, తన చేతిలో ఒక తెరిచిన పుస్తకం; చదవటానికి కుతూహలం మాత్రం లేదు — మానసికంగా విడవబడి, ఒంటరితనం నెత్తిన రుద్దబడిన స్త్రీ.

ఉమన్ బైటింగ్ హర్ నెయిల్స్  సోయర్ (1972)
అలాగే రాఫెల్ సోయర్ (Raphael Soyer, 1899-1987) వేసిన చిత్రం — Woman Biting her Nails (1972) — పిరికిగా, ఉదాసీనంగా, విచారమగ్నంగా గోళ్ళు కొరుక్కుంటున్న స్త్రీ. ఈ చిత్రాలు స్త్రీ వంటరితనానికి, తన పరిసర సమాజంపై అనాసక్తతకి ప్రామాణిక ఉదాహరణ అని చెప్పవచ్చు. కాని, ఈ చిత్రాలు ఏవీ ప్రజాభిమానం పొందలేదు. ఎందుకని? స్త్రీ చిత్రం అనగానే అందమైన బొమ్మలా కృతకంగా కూర్చున్న స్త్రీ చిత్రాలే ‘గొప్ప’ చిత్రాలు అనే అపోహే కారణం. ఆ చిత్రాలే ప్రజాభిమానం పొందాయి.
ఐరనింగ్ ఉమన్ – పికాసో (1904)
స్త్రీ పరంగా సాధారణ వృత్తులు అందరికీ తెలిసినవే. ఇవి చిత్రకారులు ఎలా చూపించారో చూద్దాం. ఇంటిపనులు అన్నీ కష్టపడి చేసే పనులు — వంట చేయటం, ధాన్యం నూర్పిడి, బట్టలు ఉతకటం, ఇస్త్రీ చెయ్యటం వగైరా. విసిగి వేసారి డస్సిపోయే పనులు, ఇవన్నీ! > జాఁ ఫ్రాన్స్‌వాఁ మియే (Jean Francois Millet, 1814-75) వేసిన ఉమన్ విత్ ఎ రేక్ (Woman with a rake), ది గ్లీనర్స్ (The gleaners), ది స్టబుల్ బర్నర్ (The Stubble burner), బ్రేకింగ్ ఫ్లాక్స్ (Breaking Flax), ఇలా ఎన్నో చిత్రాలలో రోజువారీ శ్రమను చిత్రించాడు. ఈ చిత్రాలన్నీ కూడా 1850-60 ప్రాంతాలలో Labors of the field అనే పరంపరలో వేసినవి. ఒనోరే డమియే (Honore Daumier, 1808-79) వేసిన ది లాండ్రెస్ (The Laundress, 1863), డెగా వేసిన టు లాండ్రెసెస్ (Two Laundresses, 1884), పికాసో వేసిన Ironing woman (1904) చూడండి. వీటన్నిటిలో అలసి డస్సిపోయి, నిరాశ, నిసృహలతో ఉన్న స్త్రీ మూర్తులు కనిపిస్తారు.

ప్రాస్టిట్యూట్ బిఫోర్ ఎ మిర్రర్  – జార్జ్ రూఆఁ (1927)
పోతే, ‘చెడ్డ స్త్రీలు’ అనబడే వారి చిత్రాలు చూడండి. చిత్రకళ చరిత్రలో ఎంపిక చేయబడ్డ స్త్రీ ప్రతికృతులు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలలో స్త్రీకి భౌతికంగా ఏ విధమైన అనాకృతీ ఉండడానికి వీలు లేదు. నైతికంగా వీళ్ళు మచ్చలేని వాళ్ళు. దురదృష్టవశాత్తు — పావనమైన ఋషుల వంటి స్త్రీల బొమ్మలు, తల్లులుగా, అణుకువతో మెలిగే భార్యలుగా స్త్రీల బొమ్మలు, మంచితనం, ప్రేమ వొలకపోస్తున్న దేవతల ప్రతిమలు — ఇటువంటి చిత్రాలనే చాలా మ్యూజియములు ప్రదర్శించటానికి సాహసిస్తాయి. ఇవే కాకుండా వివస్త్రగా స్త్రీ చిత్రాలు కూడా పదిలపరచటం సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి ప్రతిగా మరొక సాంప్రదాయం కూడా ఉన్నది. పిల్లలని కనడానికి, తమ లైంగికావసరాలకీ కూడా అతీతంగా ఎదిగి, పురుషులకి ఆసక్తి రేపే స్త్రీ చిత్రాలు — వివస్త్ర లైన వెలయాలుల చిత్రాలు ప్రదర్శించే సాంప్రదాయం. జార్జ్ రూఆఁ (Georges Rouault, 1871-1958) వేసిన Prostitute (1924-27) అనే చిత్రం, ఆన్రి లోట్రెక్ (Henri Lautrec, 1864-1901) వేసిన Woman standing before a mirror (1897) అనే చిత్రం వీటికి ఉదాహరణ. స్త్రీ మానవతని దిగంబరీకరించడం తప్ప, ఈ రెంటిలోనూ చెప్పుకోదగ్గ గుణాలు ఏవీ లేవు.

ఉమన్ స్టాండింగ్ బిఫోర్ ఎ మిర్రర్  – ఆన్రి లోట్రెక్(1897)
పాపానికంకితమైన జీవితాల మూలంగా, చివరలో మానవత్వం ఎటువంటి దుర్దశకి వస్తుందో, ఈ చిత్రాలలో మోటుతనం, స్థౌల్యం సంజ్ఞా రూపకంగా తెలియపరుస్తున్నాయి. ఇటువంటి చిత్రాలు చిత్రించిన చిత్రకారులు, ‘భ్రష్టలు’గా మారిన స్త్రీలని చిత్రించారు కాని, ఏ వొక్క చిత్రకారుడూ, భ్రష్టులైన పోషకుల చిత్రాలు వెయ్యలేదు. బహుశా పురుష దురహంకారం దీనికి కారణమా? కాకపోతే, చిత్రకారులు భ్రష్టలైన స్త్రీలనే ఎందుకు చిత్రించారు? పురుషభ్రష్టతని ఎందుకు చిత్రీకరించలేదు? ఇందుకు మతం కారణం కావచ్చునేమో! మన ప్రాచీన జ్ఞాపకాలు మనని తేలికగా వదలవు. భ్రష్టలైన స్త్రీలని గర్హించటం, అసహ్యించుకోవటం, మన మత సంబంధ జ్ఞాపకాలకి తార్కాణం అని అనటం తప్పు కాదేమో!

టు ఉమెన్ – కూనింగ్(1952)
ఇంతకు ముందు కూనింగ్ గురించి ప్రస్తావించాము. కూనింగ్ వేసిన Women Series బొమ్మలు స్త్రీ జాతి మీద ద్వేషానికి అంతిమ ప్రతీకలు అనవచ్చు. 1948లో మొదలు పెట్టి 1960ల చివరి భాగం వరకూ — ఈ మధ్య కాలంలో కూనింగ్ ఒక డజను పైచిలుకు స్త్రీ చిత్రాలు గీశాడు. వాటిలో Woman I నుంచి – Woman VI అన్న మకుటాలతో వేసిన ఆరు చిత్రాలు చాలా ప్రసిద్ధి కెక్కిన చిత్రాలు. ఆ తరువాత కూడా స్త్రీ చిత్రాలు వేశాడు కానీ, వాటి గురించి వచ్చిన ప్రస్తావన బహు కొద్దిమాత్రమే. ఈ ఆరు చిత్రాలలో స్త్రీని చిత్రించిన విధానం చాలా భయానకంగా ఉంటుంది. ఇవి పెద్దపెద్ద కేన్వాసులు. క్యూబిజం ధోరణి, పికాసో, రూబెన్స్‌లు అనుసరించిన పద్దతి ఈ చిత్రాలలో కనిపిస్తుంది. తీవ్రమైన నైరూప్య పద్ధతిని, యూరోపియన్‌ ఆకృతి చిత్రీకరణతో కలిపితే వచ్చే చిత్ర కళకి ఈ చిత్రాలు ఉదాహరణలు.

ఉమన్ I – కూనింగ్(1948)
ఉదాహరణకి Woman I బొమ్మలో తీవ్రమైన హింస జొప్పించటంతో ఈ చిత్రంలో వ్యంగ్యం ఉన్నదన్నది కొందరి విమర్శకుల అభిప్రాయం. కాని, అనావశ్యకమైన హింస చిత్రంలో ఎక్కువయి, వ్యంగం ఉన్నదన్న అపోహ అడుగున పడుతుంది. ఈ చిత్రంలో ఉన్నది ఒక వృద్ధ స్త్రీ. ఎక్కువ బరువుగా ఉండే వృద్ధ స్త్రీ. మరీ పెద్దవైన కళ్ళు, కట్టుడుపళ్ళు చూపిస్తూ వికారం కలిగించే నవ్వు, సన్నని చిన్న కాలిమండశీల, లావైన కాలు, చవకరకం చెప్పు వేసుకొని, ఎంత నికృష్టంగా ఉండాలో అంతకన్నా ఎక్కువ నికృష్టంగా స్త్రీ ఆకారాన్ని చూపించే చిత్రం ఇది.

ఉమన్ V – కూనింగ్(1952)
మిగిలిన స్త్రీ చిత్రాలొక్కొక్కటీ, గీసిన కాలక్రమంలో చూస్తూ పోతే, తరువాత అన్నీ కలిపీ ఒక్కసారిగా చూస్తే, పోనుపోను చిత్రం ముఖంలో రాక్షసి నవ్వు, భీకరత్వం పెరిగి కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. మానవత్వం కృశించి పోతుంది. ఈయన పంతొమ్మిదివందల అరవైలలో వేసిన స్త్రీచిత్రాలని అశ్లీల చిత్రాలని అనడం అతిశయోక్తి కాదు. స్త్రీ ఆకారాన్ని ఇంత హింసాత్మకంగా చిత్రించిన చిత్రకారుడు బహుశా ఇంకెవరూ లేరేమో! పేరు మోసిన ఏ విమర్శకుడూ ఈ చిత్రాలపై ఎక్కడా వ్యతిరేకంగా రాయకపోవడం ఆశ్చర్యం.

న్యూడ్ సీటెడ్ ఆన్ ఎ బెడ్ – వాలదాఁ (1922)
విల్లెమ్‌ ద కూనింగ్, మానవ సాంస్కృతిక పతనానికి, విధ్వంసానికి స్త్రీ కారణమని అనుకున్నాడా? సాంస్కృతిక పతనమే నిజమయితే, ఈ పతనానికి పురుషుడికి కూడా సమాన బాధ్యత లేదా? నిజం చెప్పాలంటే, ఎక్కువ బాధ్యత పురుషుడిదే కాదా? కూనింగ్ ప్రదర్శనలపై రాసిన విమర్శకులు ఈ విషయాలు అడగటం మరిచిపోయారా? చెదురు మదురుగా ఎవరో స్త్రీవాదులు ఈ విషయాలు రాసి ఉండవచ్చు కాని, ప్రసిద్ధికెక్కిన పత్రికలలో ఎక్కడా నాకు కనపడలేదు. కూనింగ్ నైరూప్య చిత్రకళాకారుడిగా చాలా గొప్పవాడు. కాని, స్త్రీమూర్తి చిత్రణలో మాత్రం కాదని నా అభిప్రాయం.

న్యూడ్ రిక్లైనింగ్ ఆన్ సోఫా – వాలదాఁ (1928)
పంతొమ్మిదవ శతాబ్దం, ఇరవయ్యవ శతాబ్దం మొదటి భాగంలో సాంప్రదాయానికి విరుద్ధంగా, బొహీమియన్‌ జీవితానికి చిహ్నంగా స్త్రీ రూపొందింది. స్వేచ్చ, పేదరికం, వలపు, దురవస్థ — వీటి కలయికతో కనపడే స్త్రీ నమూనా అగ్రగామి అయ్యింది. ఈ లక్షణాల కలయిక ఉన్న స్త్రీ ఇప్పటికీ ఒప్పుకోదగినదే! బొహీమియన్‌ స్త్రీ ఎప్పుడూ సజీవే! అమిదియో మొదిల్యియాని (Amedeo Modigliani, 1884-1920) బొహీమియనిజం దృష్టిలో వేసిన బొమ్మలు — అన్నీ వివస్త్ర లైన స్త్రీల బొమ్మలే! ఈ బొమ్మల చిత్రణకి అతగాడు చిల్లిగవ్వ కూడా ఖర్చు పెట్టలేదట! ఎందుకంటే, అతను గీసిన బొమ్మలన్ని, అతని స్నేహితురాళ్ళవి, అతని ఉంపుడు కత్తెలవీనూ! అతని స్త్రీ చిత్రాలన్నీ కామోద్రిక్తలు, భోగాసక్తులూనూ!

పింక్ ట్యునిక్ – లెంపికా (1927)
సుజాఁ వాలదాఁ (Suzanne Valadon, 1867-1938) స్త్రీ చిత్రకారిణి. ఆవిడ వేసిన దిగంబర స్త్రీల బొమ్మలలో అమాయకత్వం కనిపిస్తుంది. స్త్రీ తన లైంగికత్వాన్ని అమ్మకానికి పెట్టిందా అన్నట్టు మాత్రం ఆవిడ ఎక్కడా చిత్రించలేదు. ఉదాహరణకి, Nude seated on a bed (1922), Nude reclining on a couch (1928) అన్న ఈ రెండు చిత్రాలూ చూడండి. టమారా (Tamara de Lempicka, 1898-1980) గీసిన Pink Tunicలో (1927) అత్యంత దృఢమైన వ్యక్తి కనపడుతుంది. ఇది రాతిపై చెక్కిన శిల్పంలా ఉన్నది అన్న ఊహ రాక మానదు.

సెల్ఫ్ పోర్ట్రెయిట్ – బెకర్ (1906) 
స్త్రీ చిత్రకారులే స్త్రీ చిత్రాలని ప్రమాణసిద్ధంగా యదార్థంగా చిత్రించగలరా? అని ప్రశ్నిస్తే, నిక్కచ్చిగా సమాధానం చెప్పటం కష్టం. కాని, పురుషులకీ స్త్రీలకీ లైంగికానుభవం, ఒకే రకంగా ఉండదు. 1973లో లూసీ లిపర్డ్ (Lucy Lippard) చిత్రకళా ప్రదర్శన కేటలాగ్ Women Choose Womenలో ఈ విధంగా రాసింది: “The overwhelming fact remains that a woman’s experience in the society is simply not like that of a man… and if this factor does not show up in women’s art, only repression can be to blame.” ఇది కొంచెం అతిశయోక్తిగా కనిపిస్తుంది కాని, పచ్చి అబద్ధం మాత్రం కాదు. పాలా బెకర్ (Paula Modersohn-Becker, 1876-1907) వేసిన Self Portrait (1906) చిత్రం చూడండి. కచ్చితంగా స్త్రీ దృక్పథం, స్వీయ ప్రకటన — రెండూ కనిపిస్తాయి. ఈ చిత్రం వేసిన ఒక సంవత్సరం తరువాత, చిత్రకారిణి ప్రసూతిలో మరణించింది.

ది బాత్ – మేరీ కసాట్ (1893)
చిత్రకళలో ప్రేమ, వలపు, వివాహం లాంటి సాంఘిక విషయాలు భాగాలే. చిత్రకళలో ‘ప్రేమ’ అనేది వివిధ రకాలుగా కనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం స్త్రీపురుషుల కౌగిలికే పరిమితం కాదు. తల్లి – పిల్లల మధ్య అనురాగం, అభిమానం, ఇవన్నీ ప్రేమకి ఉదాహరణలే. అగూస్ట్ రొదాఁ (Auguste Rodin, 1840-1917) శిల్పం The Kissలో, మేరీ కసాట్ చిత్రం The bathలో, జేకబ్ ఎప్‌స్టీన్ (Jacob Epstien, 1880-1959) గీసిన Madonna and Childలో రకరకాల ప్రేమానుభూతులు చూడవచ్చు.

రొదాఁ విషయం వచ్చింది కాబట్టి అతను వేసిన దిగంబర స్త్రీ నీటిరంగుల చిత్రాల ప్రసక్తి చెప్పి తీరాలి. రొదాఁ కొన్ని వందల బొమ్మలు వేశాడు. దిగంబర స్త్రీని చూస్తూ కాగితానికేసి చూడకండా పెన్సిల్‌తో స్కెచ్ గీసి, ఆ తరువాత కాగితంపై నీటిరంగులు పులిమేవాడని అంటారు.

ది కిస్ – రొదాఁ (1889)
అందంగా అచ్చు వేసిన ఒక వంద బొమ్మలు కూర్చిన Auguste Rodin, Erotic Water Colors, 1995 అనే పుస్తకం చూస్తే బహుశా ఇది నిజమే సుమా అని మీకు కూడా అనిపించక మానదు. స్త్రీ చిత్రాలలో స్త్రీని దిగంబరంగా చిత్రించటం బహుశా పురుష ప్రకృతి కావచ్చు. సంప్రదాయకులైన మన భారతీయ చిత్రకారులు కూడా దిగంబర స్త్రీ చిత్రాలు వేశారు. దామెర్ల రామారావు కూడా దిగంబర స్త్రీ చిత్రం, అమాయిక (నిరంబర) గీశాడు. చిత్రకారులందరికీ ఈ ప్రక్రియ ఒక రిచువల్‌ కావచ్చు. స్త్రీ ఆకృతి సర్వసాధారణంగా వ్యక్తిగత లైంగిక అనుభూతులను విశదీకరిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంతకుముందు ఉదహరించిన మొదిల్యియాని చిత్రం, రిక్లైనింగ్ న్యూడ్ (Reclining nude) చూడండి. స్త్రీ సుఖాన్నిచ్చే విలాసవస్తువు గానే చూపబడింది. ఎర్రటి పెదవులు, ఒక చేయి తల క్రింద పెట్టుకొని, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రించటం, లైంగిక తృప్తికి ఉదాహరణ.

ది బర్త్‌డే – షగాల్ (1915)
పాశ్చాత్య సంస్కృతిలో వివాహం ఒకరకమైన ద్వేషభావంతో కూడిన హాస్యంగా చిత్రీకరించటం కద్దు. స్త్రీ – పురుషుడు కొద్దికాలం కలిసిమెలిసి వున్న తరువాత, వివాహానంతరం ఊహించిన ఇంద్రజాలం శాశ్వతంగా ఉండదు. ఆ అనుభూతి మిధ్య అని తేలిపోతుంది. మార్క్ షగాల్ (Marc Chagall, 1887-1985) తన Birthday చిత్రంలో ఒకరికొకరు బహుమతులిచ్చుకునే ఆచారంగా మాత్రమే వివాహం మిగిలిపోతుందని హాస్యంగా ఈ భ్రమనే సూచిస్తాడు.

ది టెంపెస్ట్ – కొకోష్కా (1914)
ఓస్కార్ కొకోష్కా (Oskar Kokoschka, 1886-1980) గీసిన The Tempest (Bride of the wind) చిత్రంలో ‘ప్రేమ’ గురించి ఎలా చిత్రించాడో గమనించండి. ఈ చిత్రంలో ఉన్నది ఓస్కార్ అతను ఉన్మాదంగా ప్రేమించిన ఆల్మా మాలెర్. ఆమె కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రిస్తున్నది. అతని ముఖంలో ఆందోళన, అతని శరీరం బక్కచిక్కినట్టుగా వున్నది. వారిద్దరి ముఖ కవళికలో ఎంత భేదం ఉన్నదో గమనించమని తప్ప నేనింకేమీ చెప్పను.

కార్ల్ హాఫర్ (Karl Hofer), జాన్ కోఖ్ (John Koch), రాజర్ ఫ్రెనే (Roger de la Fresnaye) — వీళ్ళ చిత్రాలలో వివాహం గురించి, వివాహానంతర ప్రేమ ఈ భ్రమే అన్న అర్థం వచ్చేట్టు రకరకాలుగా చిత్రించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాశ్చాత్య ఆధునిక చిత్రకళలో romanceని అనూహ్యమైన కాల్పనికాంశంగా చూడలేదు.

ఎర్లీ అవర్ – హాఫర్ (1935)
కానీ ఇందుకు విరుద్ధంగా హాఫర్ చిత్రించిన Early hour (1935) చూడండి. కిటికీనుంచి సూర్యోదయం గదిని ఎర్రగా మార్చింది. ఇంకా నిద్రపోతున్న తన స్త్రీని గురించి అతను ఆలొచిస్తుండాలి. ఇద్దరి ముఖాల్లోనూ ప్రశాంతత కనపడుతున్నాది. కాళ్ళ దగ్గరే పడుకున్న పెంపుడు కుక్కలో కూడా అదే నిశ్చింత. ఏ తెల్లవారుజామునో నిద్రలేచి ఇంకా నిద్రిస్తున్న తన ప్రియుడినో, ప్రియురాలినో గమనించినప్పుడు కలిగే ఊహలు ఆ బంధం ఎలాంటిదో సూచిస్తాయని మీకు తెలుసు.

గర్ల్ బిఫోర్ ఎ మిర్రర్ – పికాసో (1932)
వ్యాధిగ్రస్తత (morbidity) ఇతివృత్తంగా గీసిన స్త్రీ చిత్రం చూద్దాం. పికాసో గీసిన Girl Before a Mirror గురించి ప్రస్తావించాం. ఒక బాలిక స్త్రీగా పరిణతి చెందబోయే సమయంలో, ఆ బాలిక మనోభావాలని, భయాలనీ, చూపిస్తున్న చిత్రం, ఎడమవైపున. కుడిపక్కన ఒక రకమైన యెక్స్‌-రే ప్రతిబింబం! కుడిపక్క ప్రతిబింబంలో వెన్నెముక, తదితర గర్భావయవాలు — సంతానోత్పత్తి అవయవాలు. ఎడమ బొమ్మలో అమాయకత జొప్పించే కళ్ళు; ముఖం చుట్టూ ప్రకాశవంతంగా వెలుగు. ప్రతిబింబంలో నల్లని, పీక్కోనిపోయిన ముఖాకృతి. ఎడమబొమ్మలో ముఖవర్చస్సు, కుడి ప్రతిబింబంలో ముఖవర్చస్సు పోల్చి చూస్తే, భయం కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది. బొమ్మ నిలువుగా రెండు భాగాలుగా చీల్చబడింది. బాలిక కుడిచెయ్యి ప్రతిబింబాన్ని అందుకుంటూ, మానసికంగా ఇద్దరూ ఒకరినొకరు అనునయిస్తూ దరికి చేరుకుంటున్నారా అనిపిస్తుంది. బొమ్మ అంతా మొత్తంగా చూస్తే బాల్యదశ అపరిపక్వతనుంచి యవ్వనంలోకి వస్తున్న అమ్మాయి భయాలని సహానుభూతితో చిత్రకారుడు గీశాడా అని తడుతుంది. అదీ, ఈ చిత్రంలోని గొప్పతనం. ఈ చిత్రాన్ని ముంక్ వేసిన ప్యూబర్టీ (Puberty, 1895) తోను, జెరాల్డ్ బ్రాక్‌హర్స్ట్ (Gerald Leslie Brockhurst) గీసిన ఎడొలెసెన్స్ (Adolescence, 1932) లితోగ్రాఫ్ తోను పోల్చిచూడండి. మూడింటిలోనూ విషయం ఒకటే; దృశ్యమాన వివరణలో భేదం!
అన్‌టైటిల్డ్ 2 – ఎస్.వి.రామారావు (2012)
పద్మశ్రీ యస్. వి. రామారావు ఇంగ్లండ్ లో ఉండగా, చాలా స్త్రీ చిత్రాలు, రంగుల్లోనూ, చార్ కోల్ మాధ్యమం గానూ life-size portraits వేశాడు. దిగంబర స్త్రీ చిత్రాలు వేసినట్టు లేదు. ఒకవేళ అభ్యాసం కోసం వేసినా అవి ఎక్కడా ప్రదర్శించలేదు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా తనదైన శైలిలో figurative చిత్రాలు గీస్తున్నాడు. ఈ మధ్యకాలంలో వేసిన దృశ్యమాన చిత్రాలలో రెండు చిత్రాలు ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రచురిస్తున్నాము. ఈ ఏప్రిల్ నెలలో ఢిల్లీ నగరంలో రామారావు ప్రత్యేక ప్రదర్శనలో ఈ బొమ్మలు కూడా ఉంటాయి. తానుగా ఈ బొమ్మలకి ప్రత్యేకంగా మకుటాలు ఏవీ ఇంతవరకూ ఇవ్వలేదు. స్త్రీ మానసిక ప్రవృత్తి చిత్రరూపంగా ప్రదర్శించటానికి స్త్రీని భయంకరంగా, జుగుప్స కలిగించేట్టుగా చిత్రించనక్కరలేదని చెప్పటానికి ఉదాహరణగా ఈ రెండు కొత్త చిత్రాలు చాలు ననుకుంటాను.

అన్‌టైటిల్డ్ 3 – ఎస్.వి.రామారావు (2012)
వేరువేరు స్త్రీ చిత్రాలు పరిశీలించిన తరువాత, ఈ చిత్రాల వెనుక ఒక ప్రత్యేకమయిన ఊహ, సిద్ధాంతం, ఏదయినా ఉన్నదా? ఒకరకంగా ఉన్నదనే అనవచ్చు. ఒకే ఒక్క ప్రాథమిక భావన, వేరు వేరు దృశ్యమాన ఆకృతులుగా మార్పు చెందుతున్నది. సాంఘిక ఆర్థిక సాంకేతిక మార్పులు ఇందుకు కారణం. సాంకేతికత, పద్ధతి పక్కన పెట్టి చూస్తే, అన్ని కళలలోనూ లైంగికత చాలా ముఖ్యమైనది; చిత్రకళ అందుకు వ్యతిరేకం కాదు. చిత్రకారుడు లైంగిక ప్రభావాలకు, సామ్యతలకి, వ్యతిరేకతలకీ అతీతుడు కాదు. ఒక విషయం మాత్రం నిజం. మనం పరిశీలించిన చిత్రాలు, పరిశీలించని కొన్ని వందల చిత్రాలు, పురుషుడి దృష్టిలో స్త్రీ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ప్రవర్తిస్తే తనకి నచ్చుతుంది — ఎలా ఉంటే తనకి నచ్చదు — ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో అన్న అభిలాష స్ఫుటంగా కనిపిస్తుంది. స్త్రీలు వేసిన స్త్రీ చిత్రాలు చాలా వస్తున్నాయి; ఇక ముందు ఇంకా చాలా చాలా వస్తాయి. అప్పుడు స్త్రీ గురించి వివరంగా అందరికీ తెలియవచ్చు. స్త్రీ చిత్రాలు సెంటిమెంటల్‌గా, అలంకరణగా, అమాయకంగా ఉండక పోవచ్చు. కాని, స్త్రీ చిత్రాలు భౌతికంగా క్రూరంగా, దారుణంగా మాత్రం ఉండవు.

ఉపయుక్త గ్రంథావళి
The Grass Roots of Art by Herbert Read (1947).
A Concise History of Modern Painting by Herbert Read (1959). (These two are good introductory books which have been used as text books for Art Appreciation Courses in a number of UK and US Universities over a long period of time.)
Ways of Seeing by John Berger, BBC & Penguin Books, 1972. A good discussion on the images of women in general.
Women and Art by Elsa Honig Fine (1978). (This is a very nice book on art from a woman’s point of view.)
Erotic water Colors by Auguste Rodin (1995). (This has over 100 Rodin’s nudes in water color and a lot of them as the book claims were drawn by Rodin as he watched and the nudes were allowed to do whatever they wanted to do undisturbed. That means, they did not pose for the drawings. Rodin later splashed water colors on the drawings.)
Gramercy Great Masters, Gramercy Books (1993). (A series of books on several Western painters. A reasonably good introduction is given for each painter. The color reproduction in all the books are very poor and woeful.)
Brushes with History Writing on Art from The Nation 1865 – 2001, Edited by Peter Meyer (2001). ( A compilation of hundreds of art reviews appeared in The Nation. From some reviews one can learn how not to write an art review.)
--------------------------------------------------------
రచన: వేలూరి వేంకటేశ్వర రావు, 
ఈమాట సౌజన్యంతో