Sunday, December 31, 2017

దాగి ఉన్న పదాలేవి


దాగి ఉన్న పదాలేవి




సాహితీమిత్రులారా!


శ్రీవేంకటేశ్వర సారస్వత వినోదినిలోనిదీ
పొడుపు పద్యం -

ఉద్యాన వనములో నుండెడు నీరేది?
                         శ్రీశైలమున నుండు చెలువ యెవతె?
కమలాకరములోఁగల్గు హస్తమ్మేది?
                          సోమవారములేన భామయెవతె?
కాశీపురములోనఁగల్గు పట్టణమేది?
                          మదరాసులోనుండు మంచి యేది?
రామేశ్వరములోని రమ్య బాణమ్మేది?
                         కల్పవృక్షమ్ములో మృగంబదేది?
విజయనగరమందునఁగల్గు వెలఁది యెవతి?
హైదరాబాదునందతివ్యయమదేది?
గర్భిత పదంబులేవి చెప్పఁగావలెమరి
దేవ! శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

పై పొడుపు పద్యంలోని ప్రశ్నలకు సమాధానాలు-

1. ఉద్యాన వనములో నుండెడు నీరేది?
   - వనము(జలము)

2. శ్రీశైలమున నుండు చెలువ యెవతె?
   - శ్రీ(పార్వతి)

3. కమలాకరములోఁగల్గు హస్తమ్మేది?
   - కరము(చేయి)

4. సోమవారములేన భామయెవతె?
   - రమ(లక్ష్మి) 

5. కాశీపురములోనఁగల్గు పట్టణమేది?
   -పురము(పట్టణము)

6. మదరాసులోనుండు మంచి యేది?
   -సు(మంచి)

7. రామేశ్వరములోని రమ్య బాణమ్మేది?
   - శరము (బాణము)

8. కల్పవృక్షమ్ములో మృగంబదేది?
   - వృకము(తోడేలు)

9. విజయనగరమందునఁగల్గు వెలఁది యెవతి?
   - విజయ(స్రీ పేరు)

10. హైదరాబాదునందతివ్యయమదేది?
     - దుబారా(అతివ్యయము)

(ఈ సమాధానాల్నీ ఇచ్చిన ప్రశ్నలోనే ఉన్నాయి
  వాటినే కనిపెట్టమన్నది)

Saturday, December 30, 2017

జలధిశ్రుతినిధిశశి


జలధిశ్రుతినిధిశశి




సాహితీమిత్రులారా!


మన కవులు వారు వ్రాసిన కృతి
ఏ సంవత్సరంలో వ్రాయబడిందో
వారు వారి కృతిలోనే గూఢంగా
చెప్పిన తీరు ఇక్కడ చూద్దాం-

జలధి శ్రుతినిధి శశి సం
ఖ్యలఁగ్రీస్తుశకాంచిత గతియగు తారణయం
దలి కార్తికాదిలో రా
జిలు తదియన్ దీని నేరచించితి గృష్ణా

రాప్తాడి ఓబిరెడ్డిగారు 
తన నిరోష్ఠ్యకృష్ణశతకంలో
98వ పద్యంగా దీన్ని కూర్చారు.
దీనిలో క్రీస్తుశకం సంవత్సరం గూఢపరచడం జరిగింది
దాని ఎలా గుర్తించాలో చూడండి-
ఈ పద్యం మొదట్లో జలధిశ్రుతినిధిశశి
అని వాడారు దీని అర్థం గ్రహిస్తే సంవత్సరం దొరికినట్లే
ఇక్కడ దీనిలో నాలు పదాలున్నాయి అవి
జలధి, శ్రుతి, నిధి, శశి - వీటికి ఇలా అర్థం తీసుకోవాలి
జలధి - సముద్రం - సముద్రాలు నాలుగు
శ్రుతి - వేదాలు - వేదాలు నాలుగు
నిధి - నిధులు - నవనిధులు
శశి - చంద్రుడు - ఒకటి
వీటిని చివరనుండి తీసుకుంటే

శశి(1), నిధి(9), శ్రుతి (4), జలధి(4)
అంటే - 1944లో వ్రాశారు అని చెప్పుకున్నాడు
కవిగారు.

Friday, December 29, 2017

గతప్రత్యాగత చిత్రం


గతప్రత్యాగత చిత్రం




సాహితీమిత్రులారా!

అనులోమవిలోమ అన్నా గతప్రత్యాగత అన్నా
రెండు ఒకటే. అనుకూలంగాను, ప్రతికూలంగాను
అంటే మామూలుగా చదివితే అది గత లేదా
అనులోమ అని చివరినుండి ముందుకు చదివితే
అది ప్రత్యాగత లేక విలోమ అని అంటారు.
ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం మొదటినుండి
చదివేవిధంగా ఉంటే అది అనులోమ లేక గత
ఉత్తరమని, దీని విరుద్ధంగా చివరనుండి మొదటికి
చదివిన దాన్ని ప్రత్యాగత లేక విలోమ ఉత్తరమని
అంటారు.

విదగ్దముఖమండనములోని ఈ ఉదాహరణ చూడండి-

వద వల్లభ సర్వత్ర 
సాధు ర్భవతి కీ దృశః
గోవిన్దే నానసి క్షిప్తే
నందవేశ్మని కా భవత్

సమాధానం - క్షీరనదీ

1. వల్లభ సర్వత్ర సాధు ర్భవతి కీ దృశః?
   ప్రియా సజ్జనులు సర్వత్రా ఎట్లుందురు?
    - క్షీరనదీ దీన్ని త్రిప్పి చదివిన సమాధానం వస్తుంది
    అంటే దీనరక్షీ అంటే దీనులను రక్షించేవారుగా ఉంటారు

2. గోవిన్దే నానసి క్షిప్తే నందవేశ్మని కాభవత్?
   నందుని ఇంట్లో కృష్ణుడు బండిని విరిచినపుడు ఏంజరిగింది?
   - క్షీరనదీ దీనిన్న అనులోమంగా ఉంచి చదివితే
     నందుని ఇంట్లో పాలయేరు ప్రవహించింది.


Thursday, December 28, 2017

విలోమానులోమ చిత్ర ప్రశ్నోత్తరం


విలోమానులోమ చిత్ర ప్రశ్నోత్తరం




సాహితీమిత్రులారా!


ఒక జంట ప్రశ్నలలో ఒక దానికి సమాధానంగా ఇచ్చినది
విలోమంగా చదివితే అది రెండవ ప్రశ్నకు సమాధానమైన
విలోమానులోమ చిత్ర ప్రశ్నోత్తరం అవుతున్నది.

కస్మై యచ్ఛతి సజ్జనో బహుధనం? సృష్టం జగత్కేన వా?
శంభో ర్భాతి చ కో గలే? యువతిభి ర్వేణ్యాం చ కా ధార్యతే?
గౌరీశః క మతాడయత్ చరణతః? కా రక్షితా రాక్షసైః?
ఆరోహా దపరోహతః కలయతా మేకం ద్వయో రుత్కరమ్


1. కస్మై యచ్ఛతి సజ్జనో బహుధనం?
   సజ్జనుడెవరికి ఎక్కువగా ధనదానము చేయును?
   - సాధవే (మంచివానికొరకు)

2. సృష్టం జగత్కేన వా?
   లోకము ఎవనిచే సృష్టించబడెను?
   - వేధసా (బ్రహ్మదేవుని చేత)

3. శంభో ర్భాతి చ కో గలే ?
   శివుని కంఠమున ప్రకాశించేదేది?
   - కాలిమా (నల్లని మచ్చ)

4. యువతిభి ర్వేణ్యాం చ కా ధార్యతే?
   యువతులు కొప్పులో దేన్ని ధరిస్తారు?
   - మాలికా (పూలమాల)

5. గౌరీశః క మతాడయత్ చరణతః ?
   శివుడు ఎవరిని కాలితో తన్నెను?
   - కాలమ్ (యముని)

6. కా రక్షితా రాక్షసైః?
   రాక్షసులచే రక్షింపబడినదేది?
   - లంకా (లంకా నగరం)

మొదటి రెండు ప్రశ్నలకు సమాధానాలు గమనించిన
మొదటిదానికి - సాధవే
రెండవదానికి - వేధసా
మొదటిదానికి విలోమమేకదా
ఇలాగే అన్నిటిని గమనించగలరు.

Tuesday, December 26, 2017

భేద్యభేదక చిత్రం


భేద్యభేదక చిత్రం




సాహితీమిత్రులారా!

ఏ ప్రశ్నలో భేద్యము(విశేష్యము లేక నామవాచకము)
తో పాటు, భేదకము(విశేషణము) కూడ విధించబడునో
అనగా విశేష్య, విశేషణ రూప - ప్రశ్నలున్నచోటప్రశ్నను
భేద్య భేదకము అన్నారు.

అగస్త్యేన పయోరాశేః కియత్ కిం పీత ముజ్ఝితమ్?
త్వయావైరికులం వీర! సమరే కీ దృశం కృతమ్?

సమాధానం - సకలంకం (సకలం- కమ్, సకలంకమ్)

1. అగస్త్యేన పయోరాశేః కియత్ కిం పీత ముజ్ఝితమ్
   అగస్త్య మహాముని సముద్రము నందున్న దేనిని
   ఎంత పరిమాణం త్రాగి, మరల విడిచాడు
   - సకలం - కమ్ (సముద్రమునందున్న సమస్త నీటిని)
   
2. త్వయావైరికులం వీర సమరే కీ దృశం కృతమ్
   వీరుడా యుద్ధంలో నీ శత్రువంశమునేమి చేసితివి
   - సకలంకం (కలంకంతో కూడినదయ్యెను)
    ఓడిపోయిన శత్రుబలం పరాజయంతో 
    సకలంకం(మచ్చతో కూడినది) అయ్యెను.

Monday, December 25, 2017

ఏకావృత చిత్రమ్


ఏకావృత చిత్రమ్




సాహితీమిత్రులారా!



అంతర్లాపికల్లో ప్రత్యుత్తర పదానికి అర్థం
చెప్పే సమయంలో ఆ సమాధానపదం
ఒకసారి ఆవృత్తము(మరల చెప్పుట) చేసినచో
అది ఏకావృత్త చిత్రం అవుతుంది

అంటే మొదట కొన్ని ప్రశ్నలకు సమాధానంగా
ఉన్న ఉత్తరపదాన్ని కొన్ని పదాలుగా విభజించి
చెప్పుకొని ప్రత్యుత్తరపదమును మరల ఒకసారి
ఆవర్తనం చేసి, మరోవిధంగా పదవిభాగం చేసి
మిగిలిన ప్రశ్నలకు క్రమంగా సామాధానాన్ని
సంపాదించి, చూసినచో అది ఏకావృత చిత్రం.
దీనిలో పదవిభాగం రెండు మార్లు జరిగినా ఆవృత్తి
ఒకసారే జరగడం వలన దీనికి ఆ పేరు వచ్చింది.

కాం రాజా పాతి? కా హన్తి రూపం? కీదృ క్చ పక్కణః?
బలౌఘః కీదృశో రాజ్ఞాం? "కుంజరాశ్వకులాకులః"

సమాధానం-
కుంజరాశ్వకులా కులః
(కుమ్, జరా - శ్వకుల - అకులః
కులజర - అశ్వ-కుల-ఆకులః)

1. కాం రాజా పాతి?
    రాజు దేనిని రక్షించును?
   - కుమ్ (భూమిని)

2. కా హన్తి రూపం?
   రూపము(అందాన్ని)ను నాశనం చేసేది ఏది?
   - జరా (ముసలితనం)

3. కీదృక్చ పక్కణః?
   ఆటవికుల పల్లె(పక్కణః) ఎలాఉంటుంది?
   - శ్వకుల - ఆకులః(కుక్కల గుంపుచే వ్యాప్తమై ఉండును)

4. బలౌఘః కీదృశో రాజ్ఞాం?
    రాజు బలసమూహం ఎలాంటిది?
   - కుంజరాశ్వకులాకులః
    (ఏనుగుల గుఱ్ఱముల సమూహముచే వ్యాప్తమై ఉండును)


Sunday, December 24, 2017

వారిలో మనవాడు లేడు. భయమేల?


వారిలో మనవాడు లేడు. భయమేల?




సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం (బహిర్లాపిక)చూడండి-
ఏం చెబుతుందో!

కుఠారమాలికాం దృష్ట్వా
కంపంతి తరవో వనే
తత్ర వృద్ధతరుః ప్రాహ
మామకో నాస్తి కిం భయమ్

గొడ్డళ్లను గుదిగ్రుచ్చి, భుజంపై వేసుకొని,
ఆ అడవికి వస్తున్నవాణ్ణి చూసి
అడవిలో చెట్లన్నీ భయంతో వణికిపోతున్నాయట
అప్పుడు ఒక ముసలి చెట్టు ఓయీ వానిలో మనవాడు
లేడు భయపడడమెందుకు-అని చెప్పిందట

అంటే ఏమిటి మనవాడు లేడనడంలో
ఆంతర్యమేమి - అంటే?
గొడ్డళ్లే భుజానేసుకొస్తున్నాడు
వాటికి మనవాడు(కర్ర)లేదుకదా
కర్రవుంటేనే గొడ్డలి నరకగలదు
కావున భయపడాల్సిన పనిలేదని చెప్పింది
ఆ చెట్టు. నిజమేకదా!

Saturday, December 23, 2017

వర్ణోత్తర చిత్రం


వర్ణోత్తర చిత్రం




సాహితీమిత్రులారా!


ఒక ప్రశ్నకు ఒకే వర్ణం సమాధానమైన దాన్ని
వర్ణోత్తర చిత్రం అంటారు.
కవీంద్ర కర్ణాభరణంలోని ఈ శ్లోకం చూడండి-

కా కామధుక్? ప్రియా కా వా విష్ణోః? విశ్వం బిభర్తి కా?
విఘ్నానా మధిపః కశ్చ ప్రణామా త్సర్వకామదః?

దీనిలోని ప్రశ్నలకు సమాధానాలు - గౌరీభూః
                                                             (గౌః + ఈ  - భూః)

1. కా కామధూక్ ?
   కోర్కెలను తీర్చేది ఏది?
   - గౌః(ఆవు /కామధేనువు)

2. ప్రియా కా వా విష్ణోః?
   విష్ణువుకు ప్రియురాలెవరు?
   - ఈ (లక్ష్మి)

3. విశ్వం బిభర్తి కా?
   ప్రపంచాన్ని మోయునదేది?
   - భూః (భూమి)

4. విఘ్నానా మధిపః కశ్చ ప్రణామా త్సర్వకామదః?
   నమస్కరించినంతనే అన్ని కోర్కెల తీర్చే 
   విఘ్నాధిపతి ఎవరు?
   - గౌరీభూః (గౌరీదేవి కన్నకొడుకు గణపతి)

దీనిలో మొదట ఒక్కొక వర్ణమే సమాధానమైంది
కావున దీన్ని వర్ణోత్తర చిత్రమంటారు.

Friday, December 22, 2017

వ్యస్త సమస్తోత్తరం


వ్యస్త సమస్తోత్తరం




సాహితీమిత్రులారా!


హిందీకవి బిఖారీదాసు చెప్పిన
ఈ పద్యం చూడండి-

కౌన దుఖద, కోహంస సో, కో పంకజ-ఆగార
తరున జనన కోమన-హరనకో, కరి చిత్ర బిచార
కౌన ధరేహై ధరనికో, కోగయంద-అసవార
కౌన భవానీ కో జనకహై "పరబతసరదార"

ఇందులోని ప్రశ్నలన్నిటికి పరబతసరదార అనేది సమాధానం
దీనిలో మొత్తం పదాన్ని తీసుకుంటే సమస్తం
అలాకాకుండా పర,బత,సర,దార ఇలా రెండురెండు లేదా
మూడు అక్షరాలను సమాధానంగా తీసుకుంటే దాన్ని వ్యస్తం అంటారు.
ఇందులో రెండు రెండు అక్షరాలుగాను,
పూర్తి పదమంతా కలిపి సమాధానంగా తీసుకుంటే
దాన్ని వ్యస్త సమస్తోత్తరం అంటారు.

ఇంక పద్యంలోని ప్రశ్నలు సమాధానాలు చూద్దాం

1. కౌన దుఖద?
   దుఃఖము నిచ్చేవాడెవడు?
  - పర (శత్రువు)

2. కోహంస సో?
   హంసతో సమానమైనదేది ?
   - బత(బాతు)

3. కో పంకజ-ఆగార?
   పద్మాకరం ఏది?
   - సర(సరస్సు)

4. తరున జనన కోమన-హరనకో?
   యువకుల మనస్సును ఆకర్షించునదేది?
   - దార(నారి లేక స్త్రీ)

5. కౌన ధరేహై ధరినికో?
   భూమిని ధరించునదేది?
   - పరబత(ధరాధరం, కొండ)

6. కరి చిత్ర బిచార?
   ఏనుగునెక్కి తిరిగేవాడెవడు?
   - సరదార(నాయకుడు)

7. కౌన భవానీ కో జనకహై?
   పార్వతి తండ్రి ఎవరు?
   - పరబత - సరదార
     (పర్వతరాజు, హిమవంతుడు)

Thursday, December 21, 2017

తండ్రీపుత్రులచేత సంతువడసెన్


తండ్రీపుత్రులచేత సంతువడసెన్ 



సాహితీమిత్రులారా!


సమస్య:
తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!



డాక్టర్ గరికిపాటి నరసింహారావుగారి పూరణ:-

గుండ్రాతింబలె చూచుచుందురుగదా! గొడ్రాలినీ లోకమం
దాండ్రుంగూడ దయావిహీనమతులై; యాసాధ్వినే గొడ్డుమో
తండ్రీ పుత్రులచేత, సంతువడసెన్ తానెంత ధన్యాత్మ యో!
గాండ్రింపుల్ మఱి చెల్లబోవుగద! మొగ్గల్ సిగ్గులా యింటి లో!


చింతా రామకృష్ణరావుగారి పూరణ:-

పండ్రెండేండ్ల వివాహజీవనమునన్ ప్రాప్తింపమిన్ సంత తిన్
తండ్రీ ఈశ్వర! తత్ సుపుత్ర వరదాతా!విఘ్నరాజా! కృపన్
గుండ్రాయట్టులనున్నమాకు నిడుడీ కూర్మిన్నన్న వారీయ నా
తండ్రీపుత్రులచేత సంతువడసెన్ తానెంత ధన్యాత్మయో!


(ఆంధ్రమృతం బ్లాగునుండి......)

Wednesday, December 20, 2017

గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్


గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్




సాహితీమిత్రులారా!


సమస్య-
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్


పూర్వకవి పూరణ-

దుర్భర వేదన సలుపగ
యర్భకుఁ డుదయించు ననుచు నతిమోదముతో
నిర్భరత నుండెఁ బ్రాక్సతి
గర్భములోనుండి వెడలెఁ గమలాప్తుఁ డొగిన్

గర్భములోనుండి సూర్యుడు రావడం అసంగతం
దాన్ని కవిగారు తూర్పు అనే కన్యగర్భంలోనుండి
అనడంతో సంగతమైంది

Tuesday, December 19, 2017

సదాశివ శతకం - చిత్ర, గర్భ శతకం


సదాశివ శతకం - చిత్ర, గర్భ శతకం




సాహితీమిత్రులారా!

అనంతరాజు సుబ్బరావు (1825-1884)
రచించిన శ్రీసదాశివేశ్వర శతకంలో
100 పద్యాలు ఉన్నాయి. అన్నీ సీసపద్యాలే
ఇందులో 99 పద్యాలు ఏదోఒక వృత్తమును
సీసపద్యంలో ఇమిడ్చి వ్రాయడం జరిగింది.
మొత్తం 62 రకముల వృత్తములు ఇమిడ్చాడు
ఈ కవిపుంగవులు.
వీరి ఈ శతకం నుండి ఒక పద్యం ఇక్కడ చూద్దాం-

మత్తకోకిల గర్భిత సీసము-
ఈ సీసంలో మత్తకోకిల వృత్తము ఇమిడి ఉన్నది

మేలువాటిల లోకపాలన మీవుసేోయుచు నెట్లొకో తయోయుతుఁడవగుచు 
కేల శూలముఁబూని కేవలకిన్క జీవులద్రుంచుటల్ దేవతెలియనగునె
కాకూటములీలఁగా  నిజకంఠమందునఁదాల్పవే, కీర్తి వినుతికెక్క 
జాలవింతలు నీదుచర్యలు చంద్రమౌళి, శుభాకరా నిన్ను వశమె పొగడ
ప్రమథగణసేవ్య, యాశ్రితపారిజాత దక్షిణామూర్తి, విద్యావిచక్షణాఢ్య

ఇందలి మత్తకోకిల -

మేలువాటిల లోకపాలన మీవుసేోయుచు నెట్లొకో ? 
కేల శూలముఁబూని కేవలకిన్క జీవులద్రుంచుటల్ 
కాకూటములీలఁగా  నిజకంఠమందునఁదాల్పవే?  
జాలవింతలు నీదుచర్యలు చంద్రమౌళి, శుభాకరా !

ఈ విధంగా శతకంమంతా వ్రాసిన ఈ కవి
శతకం అంటే తక్కువదనే భావనను తుడిచి
వేశారంటారు

Monday, December 18, 2017

ప్రశ్న ఒకదాన్లో - సమాధానం మరోదాన్లో


ప్రశ్న ఒకదాన్లో - సమాధానం మరోదాన్లో




సాహితీమిత్రులారా!



ప్రశ్నోత్తర చిత్రం చూద్దామిక్కడ-
ఇందులో ప్రశ్నలు సంస్కృతంలో ఉండగా
సమాధానాలు తెలుగులో ఉన్నాయి
చూడండి-

ఆదిశూన్యే తు కేదారం మధ్యశూన్యే శివాలయమ్అంత్యశూన్యే పయోధారాత్రయః కాంచనవల్లరీ


సమాధానం ఒక మూడక్షరాల పదం.
ఆ పదంలో  మొదటి అక్షరం తొలగిస్తే
కేదారం అంటే వరిమడి.
మధ్యాక్షరం తీసివేస్తే - శివాలయమ్
అంటే దేవాలయం
చివరి వర్ణాన్ని తొలగిస్తే  పయోధారా
అంటే పాలధార
అని వస్తుంది ఆ పదమేదో చెప్పాలి.

సమాధానం - గుమ్మడి

ఈ పదంలో మొదటి అక్షరం - గు
తీసివేస్తే  మిగిలేపదం - మడి
అంటే వరి పండేపొలం(కేదారం)

మధ్య అక్షరం తీసివేస్తే - గుడి

చివరి అక్షరం తీసివేస్తే - గుమ్మ

మూడక్షరాల పదం ఒక కూరగాయను
ఒక తీగ చెట్టును తెలుపుతుంది
కావున సమాధానం సరైనదేకదా!

Sunday, December 17, 2017

ఓటు దండకము


ఓటు దండకము 




సాహితీమిత్రులారా!



మనం దండకాలు కొన్నిటిని చూచి ఉన్నాము
కాని ఇక్కడ ఓటు దండకము చూద్దాం
దీన్ని 1934వ సంవత్సరంలో గోల్కొండ పత్రికలో
ప్రచురించారు చూడండి-

ఓటరు దండకము

నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడునీడ; నిజముగ సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా గతివి పతివి నిజముగ ఓటర్!

లావొక్కింతయులేదు;ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్దప్పెను మూర్చవచ్చె; తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
ఓటే తప్ప ఇతః పరం బెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే వోటర కావవే వరద సం రక్షించు భద్రాత్మకా-


మహా భాగ్యనగరాన మా పూర్వపుణ్యాన మే మెన్నియో యేండ్లు చూడంగ చూడంగ మా బాల్యమున్ యౌవనత్వంబు
మా ప్రాయముల్ మనో దార్ఢ్యముల్ క్రుంగుచున్ పొయి వృధ్ధాప్యమున్ పొంది వెండ్రుకల్ తెల్లనై ముప్పయారేండ్లు అటు గడ్చి ఇటు గడ్చి
ఈనాటికిన్వచ్చె యీ కొత్త ఖానూను మా గోర్కెలీడేర మా జన్మముల్ ధన్యతన్ బొందె నో బల్దియా శాసనంబో ఇదే నీకు వేవేల దణ్ణాలు
కైకొమ్ము తల్లీ వినో వొటరా--
మూడేండ్ల(ఐదేండ్ల) కోసారి నీ పాదపద్మంబులం గొల్చి నిన్ను నే దలచెదన్ నే పిలిచెదన్ నీ కటాక్షంబునన్ జూడవే దాతవై బ్రోవవే దగ్గిరన్
నిల్వవే స్వామి నిన్నెంచ నే నెంతవాడన్ దయా దృష్టి వీక్షింపవే నా ఓటు నాకిచ్చి నన్నెట్టులైనన్ సఫాయీకమేటీకి మెంబర్నుగా
జేసినన్ జాలు నా వంశమున్ దేశమున్ ధన్యతం బొందు ఆ మీద నా పూర్వపుణ్యంబు నా చాకచక్యంబు నా భావి భాగ్యంబు నా తంత్ర
నాదంబు సవ్యంబుగా నున్నచో ఆ నిచ్చెనంబట్టి ఎంతైన పైబైకి ఎగబ్రాకగావచ్చు ఎన్ని హాట్ హోములైనన్ భుజింపంగ ఆటంకముల్లేవు
రాజ మాన్యుండగావచ్చు పేదసాదల్ భయంబంద అటు తిర్గి ఇటు తిర్గి ఎంతెంత పేరైన నే పొందగావచ్చు కొద్ది యుద్యోగులన్ శక్తి
యున్నంత ఏడ్పించగావచ్చు వీలుగా నున్నచో కొద్ది మేల్జేసి షాభాషు షాభాషు అనిపించుకోవచ్చు ఏవైన లాభాలు సాధించుకోవచ్చు
కాబట్టి యెట్లైన నీ ఓటుతో గూడ బంధుమిత్రాది వర్గంబు ఓట్లన్ని నాకు నిప్పింపుమా నన్ను రక్షింపుమా లేమి పోగొట్టుమా దీనునిన్
బ్రోవగా దిక్కు నీవే గదా నీవేకులంబందు జన్మంబుగానీ నీ స్పర్స నీ చూపు నీ తీరు మొదలైన నీదే సమస్తంబు అస్పృస్యమౌ గాని
సాక్షాత్ పరబ్రహ్మ రూపంబుగా నుండు నీ ఓటు మాత్రంబె నిత్య సంపూతమై నెగడు లోకంబులన్ సంసారమున్ బాసి సౌఖ్యంబులన్ రోసి
నిద్రహారంబులన్ నీతి నియమంబులన్ నిత్యకృత్యంబులన్ మాని సర్వంబు వర్జించి యోగీశ్వరుంబోలి నీ దీక్షతో నుండి నీ ఓటు
వాంచించెదన్ నిన్ను యాచించెదన్ ఓటే సమస్తంబు ఓటే ప్రశస్తంబు ఓటే మహా ముక్తి ఓటే పర బ్రహ్మ తధ్ధారివైనట్టి ఓటర్ మహాదేవ
నమస్తే ! నమస్తే! నమః.


 ఆధారం - గోలకొండ పత్రిక 24-5-1934

Saturday, December 16, 2017

నిషిద్ధాక్షరి


నిషిద్ధాక్షరి



సాహితీమిత్రులారా!


నిషిద్ధాక్షరి అంటే నిషేధమని చెప్పిన అక్షరాలను
విడిచి వేరు అక్షరాలతో పద్యం పూర్తిచేయాలి
దానికి ఉదాహరణ ఇక్కడ గమనిద్దాం-

మత్తేభంలో సరస్వతీదేవిని వర్ణిస్తూ
1వ పాదంలో య, ర, ల, వ, శ, ష, స, హ, 
2వ పాదంలో ప, ఫ, బ, భ, మ, 
3వ పాదంలో త, థ, ద, ధ, న, 
4వ పాదంలో క, ఖ, గ, ఘ, జ్ఞ. 
అక్షరాలు నిషేధిస్తూ చెప్పమని ఒక అవధానంలో
పిసుపాటి చిదంబరశాస్త్రిగారిని పృచ్ఛకుడు అడిగారు
ఇది 1944వ సంవత్సరంలో జరిగిన అవధానం.

పిసుపాటి వారి పూరణ-

'గణుతింతున్‌ మనమంది నుక్తిజననిన్‌ కాంతా మణిన్‌ జండధా
రణ హృత్సారస చంచరీక నవతారస్వైరసంచార, చ
ర్వణ బీయూష కరాభ్యుపేయ రుచపారం పర్య సంశోభ, గా
రణ భూతన్‌ వివిధ శ్రుతి స్మృతి విహారద్యోత మానస్థితిన్‌'  

పృచ్ఛకుడు కోరిన విధంగానే వుందికదా ఇది నిషిద్ధాక్షరి అంటే

Friday, December 15, 2017

కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్


కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్




సాహితీమిత్రులారా!


సమస్య-
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్

గృహలక్ష్మి మాసపత్రికలో వచ్చిన కొన్ని పూరణలు- 

మానవతీలలామ పతిమన్ననలందక సౌధసీమలం
దానువసించుచున్, బహువిధమ్ముల సౌఖ్యము లొందుచు న్న గా
నీ, నిఖిలమ్ము భారమగు నిక్కము ప్రేముడిజూపునాథుతో
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
                                                                                            - సామవేదం సీతారామమ్మ


దీనజనావనంబె నిజదీక్షగఁగైకొని మానసంబునన్
మానితకీర్తి సంపదల మక్కువసేయక కార్యశీలుడై
పూనిక నెల్లదేశములు పొందుగఁగ్రుమ్మరు కర్మయోగికిన్
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
                                                                                                   - కనుపర్తి వరలక్షుమ్మ 

పూని, సమస్త భూతహితమున్మది గోరుచు, స్వార్థలాభమున్
మానుచు, సత్యధర్మముల మానసమందున నిల్పి, ద్వేష మున్ 
గానక, కర్మనిష్ఠను జగద్ధితకార్యము జేయువారికిన్
కానలుకావు శైలములుకావు పయోధులుకావు భారముల్
                                                                                              - దేశిరాజు భారతీదేవి

(1931 జులై, గృహలక్ష్మి మాసపత్రిక నుండి)

Thursday, December 14, 2017

నాకు భూమిని దానం చేయవయ్యా


నాకు భూమిని దానం చేయవయ్యా




సాహితీమిత్రులారా!


ఒకానొక కవి సమాసాలపేర్లతో తన స్థితిని
వర్ణించి చెప్పి రాజు మన్ననలతో 
భూమిని పొందాట 
సమాసాలతో కూర్చిన ఆ శ్లోకం చూడండి-

ద్వన్ద్వో ద్విగురపి చాహం
మద్గేహే నిత్య మవ్యయీ భావః
తత్పురుషః కర్మధారయ 
యేనాహం స్వామ్ బహువ్రీహిః



ద్వన్ద్వో ద్విగురపి చాహం
మద్గేహే నిత్య మవ్యయీ భావః
తత్పురుషః కర్మధారయ 
యేనాహం స్వామ్ బహువ్రీహిః

మేము భార్యాభర్తలము(ద్వన్ద్వః)
పైగా మాకు రెండు గోవులున్నాయి(ద్విగుః)
మాయింట్లో వ్యమనేది లేదు. వ్యయించటానికేమైనా
వుంటేకదా(అవ్యయీభావః) కనుక అయ్యా(తత్ పురుష)
నేను బహుధాన్యం కలవాణ్ణి (బహువ్రీహిః) అయ్యే పని
చెయ్యి (కర్మధారయ)
నాకు భూమిని అనుహ్రహించవయ్యా మహారాజా - అని భావం







Wednesday, December 13, 2017

రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె


రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె 



సాహితీమిత్రులారా!



సమస్య-
రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై


కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పూరణ-

చేవనొసంగ జాతికి, జీవమొసంగగ బండరాతికిన్,
సేవనొసంగ కోతికిని, శిక్షనొసంగగ చుప్పనాతికిన్,
దేవమునీంద్ర శాపమును దీరిచి ముక్తిపదం బొసంగగా
రావణ కుంభకర్ణులకు; రాముడు పుట్టె గుణాభిరాముడై

కవిగారు చాలచక్కగా అసంగతాన్ని సంగతంగా మార్చారు
పదాల విరుపుతో. కాకున్న రావణ కుంభకర్ణులకు
రాముడు పుట్టునా గుణాభిరాముడై


Tuesday, December 12, 2017

అటువంటి కృష్ణుడు మమ్ము కాపాడుగాక!


అటువంటి కృష్ణుడు మమ్ము కాపాడుగాక!




సాహితీమిత్రులారా!


లీలాశుకుని శ్రీకృష్ణలీలామృతములోని
ఈ సంవాద చిత్రశ్లోకం చూడండి-

కృష్ణే నామ్బ గతేన రన్తు మధునా మృద్భక్షితా స్వేచ్ఛయా
తథ్యం కృష్ణ క ఏవ మాహ ముసలీ మిథ్యామ్బ ప శ్యాననమ్
వ్యాదేహీతి విదారితే శిశుముఖే దృష్ట్వా సమస్తం జగ
న్మాతా యస్య జగామ విస్మయపదం పాయా త్స వః కేశవః



బలరాముడు -, కృష్ణే నామ్బ గతేన రన్తు మధునా మృద్భక్షితా స్వేచ్ఛయా
                            అమ్మా మన కృష్ణుడు ఆడుకొనడానికి పోయి,
                           ఇష్టమువచ్చినట్లు మన్నుతిన్నాడు

యశోద - కృష్ణ తథ్యం ? 
                ఏమిరా కృష్ణా(మన్నుతిన్నది) నిజమేనా ?

కృష్ణుడు - క ఏవ మాహ  ?
                  లేదమ్మా ఎవరు చెప్పింది?

యశోద- ముసలీ 
               బలరాముడు
కృష్ణుడు - మిథ్యామ్బ  ప శ్యాననమ్
                   అది కల్లమాట
                   కాదేని నానోరు చూడుము
                    (నోరు తెరచాడు)
యశోద నోటిలో ఎల్లలోకములు చూచి ఆశ్చర్యపడునది
అటువంటి కృష్ణుడు మమ్ములను కాపాడుగాక!


Monday, December 11, 2017

రామకృష్ణ విలోమ కావ్యమ్


రామకృష్ణ విలోమ కావ్యమ్




సాహితీమిత్రులారా!



మనం అనులోమవిలో పద్యాలను శ్లోకాలను
చూశాం కాని ఒక కావ్యాన్నే ఇక్కడ చూస్తున్నాము
ఇందులో మొదటినుండి చదివిన రామునికథ
చివర నుండి చదివిన కృష్ణునికథ వచ్చేలా
ఈ కావ్యం కూర్చబడింది దీన్ని 
రామకృష్ణవిలోమ కావ్యం
అంటారు దీన్ని దైవజ్ఞపండిత సూర్య కవి రచించారు
దీనిలోని శ్లోకాలన్నీ ముందు నుండి చదివినా చివర నుండి
చదివినా ఒకలాగే ఉంటాలి గమనించండి-
ఇందులో మొత్తం 36 శ్లోకాలున్నాయి.
ఇక్కడ కేవలం శ్లోకాలే ఇవ్వబడినవి భావం ఇవ్వడంలేదు
ఇందులోని రచనా విశేషాన్ని మాత్రమే ఇప్పుడు చూడగలరు
                                         
                                           ****

తం భూసుతాముక్తిముదారహాసం 
వందే యతో భవ్యభవం దయాశ్రీః |
శ్రీయాదవం భవ్యభతోయదేవం
సంహారదాముక్తిముతాసుభూతమ్ || 1 ||

చిరం  విరంచిర్న చిరం విరంచిః
సాకారతా సత్యసతారకా సా |
సాకారతా సత్యసతారకా సా
చిరం విరంచిర్న చిరం విరంచిః || 2 ||

తామసీత్యసతి సత్యసీమతా
మాయయాక్షమసమక్షయాయమా |
మాయయాక్షమసమక్షయాయమా |
తామసీత్యసతి సత్యసీమతా || 3 ||

కా తాపఘ్నీ తారకాద్యా విపాపా
త్రేధా విద్యా నోష్ణకృత్యం నివాసే |
సేవా నిత్యం కృష్ణనోద్యా విధాత్రే
పాపావిద్యాకారతాఘ్నీ పతాకా || 4 ||

శ్రీరామతో మధ్యమతోది యేన
ధీరో೭నిశం వశ్యవతీవరాద్వా |
ద్వారావతీవశ్యవశం నిరోధీ
నయేదితో మధ్యమతో೭మరా శ్రీః || 5 ||

కౌశికే త్రితపసి క్షరవ్రతీ
యో೭దదాద్೭ద్వితనయస్వమాతురమ్ |
రంతుమాస్వయన తద్విదాదయో೭
తీవ్రరక్షసి పతత్రికేశికౌ || 6 ||

లంబాధరోరు త్రయలంబనాసే
త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా |
జ్ఞాతాగమా రక్ష హి యాహి యా త్వం
సేనా బలం యత్ర రురోధ బాలమ్ || 7 ||

లంకాయనా నిత్యగమా ధవాశా
సాకం తయానున్నయమానుకారా | 
రాకానుమా యన్నను యాతకంసా
శావాధమాగత్య నినాయ కాలమ్ || 8 ||

గాధిజాధ్వరవైరా యే
తే೭తీతా రక్షసా మతాః |
తామసాక్షరతాతీతే
యే రావైరధ్వజాధిగాః || 9 ||

తావదేవ దయా దేవే 
యాగే యావదవాసనా |
నాసవాదవయా గేయా
వేదే యాదవదేవతా || 10 || 

సభాస్వయే భగ్నమనేన చాపం
కీనాశతానద్ధరుషా శిలాశైః |
శైలాశిషారుద్ధనతాశనాకీ
పంచాననే మగ్నభయే స్వభాసః || 11 ||

న వేద యామక్షరభామసీతాం
కా తారకా విష్ణుజితేऽవివాదే |
దేవావితే జిష్ణువికారతా కా
తాం సీమభారక్షమయాదవేన || 12 ||

తీవ్రగోరన్వయత్రార్యా
వైదేహీమనసో మతః |
తమసో న మహీదేవై-
ర్యాత్రాయన్వరగోవ్రతీ || 13 ||

వేద యా పద్మసదనం
సాధారావతతార మా |
మారతా తవ రాధా సా
నంద సద్మప యాదవే || 14 ||

శైవతో హననే೭రోధీ 
యో దేవేషు నృపోత్సవః |
వత్సపో నృషు వేదే యో
ధీరో೭నేన హతో೭వశైః || 15 ||

నాగోపగో೭సి క్షర మే పినాకేऽ
నాయో೭జనే ధర్మధనేన దానమ్ |
నందాననే ధర్మధనే జయో నా
కేనాపి మే రక్షసి గోపగో నః || 16 ||

తతాన దామ ప్రమదా పదాయ
నేమే రుచామస్వనసుందరాక్షీ |
క్షీరాదసుం న స్వమచారు మేనే
యదాప దామ ప్రమదా నతాతః || 17 ||

తామితో మత్తసూత్రామా
శాపాదేష విగానతామ్ |
తాం నగావిషదే೭పాశా
మాత్రాసూత్తమతో మితా || 18 ||

నాసావద్యాపత్రపాజ్ఞావినోదీ
ధీరో೭నుత్యా సస్మితో೭ద్యావిగీత్యా |
త్యాగీ విద్యాతో೭స్మి సత్త్యానురోధీ 
దీనో೭విజ్ఞా పాత్రపద్యావసానా || 19 ||

సంభావితం భిక్షురగాదగారం
యాతాధిరాప స్వనఘాజవంశః |
శవం జఘాన స్వపరాధితాయా
రంగాదగారక్షుభితం విభాసమ్ || 20 ||

తయాతితారస్వనయాగతం మా
లోకాపవాదద్వితయం పినాకే |
కేనాపి యం తద్విదవాప కాలో
మాతంగయానస్వరతాతియాతః || 21 ||

శవే೭విదా చిత్రకురంగమాలా
పంచావటీనర్మ న రోచతే వా |
వాతే೭చరో నర్మనటీవ చాపం
లామాగరం కుత్రచిదావివేశ || 22 ||

నేహ వా క్షిపసి పక్షికంధరా
మాలినీ స్వమతమత్త దూయతే |
తే యదూత్తమతమ స్వనీలిమా-
రాధకం క్షిపసి పక్షివాహనే || 23 ||

వనాంతయానస్వణువేదనాసు
యోషామృతే೭రణ్యగతావిరోధీ |
ధీరో೭వితాగణ్యరతే మృషా యో
సునాదవేణుస్వనయాతనాం వః || 24 ||

కిం ను తోయరసా పంపా
న సేవా నియతేన వై |
వైనతేయనివాసేన
పాపం సారయతో ను కిమ్ || 25 ||

స నతాతపహా తేన
స్వం శేనావిహితాగసమ్ |
సంగతాహివినాశే స్వం
నతేహాప తతాన సః || 26 ||

కపితాలవిభాగేన
యోషాదో೭నునయేన సః |
స నయే నను దోషాయో
నగే భావిలతాపికః || 27 || 

తే సభా ప్రకపివర్ణమాలికా
నాల్పకప్రసరమభ్రకల్పితా |
తాల్పికభ్రమరసప్రకల్పనా 
కాలిమార్ణవ పిక ప్రభాసతే || 28 ||

రావణే೭క్షిపతనత్రపానతే
నాల్పకభ్రమణమక్రమాతురమ్ |
రంతుమాక్రమణమభ్రకల్పనా
తేన పాత్రనతపక్షిణే వరా || 29 ||

దైవే యోగే సేవాదానం
శంకా నాయే లంకాయానే |
నేయాకాలం యేనాకాశం
నందావాసే గేయో వేదైః || 30 ||

శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశం
యానే నద్యాముగ్రముద్యాననేయా |
యానే నద్యాముగ్రముద్యాననేయా
శంకావజ్ఞానుత్వనుజ్ఞావకాశమ్ || 31 ||

వా దిదేశ ద్విసీతాయాం
యం పాథోయనసేతవే |
వేతసేన యథోపాయం
యాంతాసీద్೭విశదే దివా || 32 ||

వాయుజో೭నుమతో నేమే
సంగ్రామే೭రవితో೭హ్ని వః |
వహ్నితో విరమే గ్రాసం
మేనే೭తో೭మనుజో యువా || 33 ||

క్షతాయ మా యత్ర రఘోరితాయు-
రంకానుగానన్యవయో೭యనాని |
నినాయ యో వన్యనగానుకారం
యుతారిఘోరత్రయమాయతాక్షః || 34 ||

తారకే రిపురాప శ్రీ-
రుచా దాససుతాన్వితః |
తన్వితాసు సదాచారు
శ్రీపరా పురి కే రతా || 35 ||

లంకా రంకాగారాధ్యాసం
యోనే మేయా కారావ్యాసే |
సేవ్యా రాకా యామే నేయా
సంధ్యారాగాకారం కాలమ్ || 36 ||

ఇతి 
శ్రీదైవజ్ఞపండిత సూర్యకవి విరచితం 
విలోమాక్షర రామకృష్ణకావ్యం 
సమాప్తమ్

Sunday, December 10, 2017

వృద్ధస్య భార్యా కరదీపి కేవ


వృద్ధస్య భార్యా కరదీపి కేవ




సాహితీమిత్రులారా!




సమస్య - 
వృద్ధస్య భార్యా కరదీపి కేవ
(వృద్ధునికి భార్య చేత పట్టుకొనిన దీపము వంటిది)

పూర్వకవి పూరణ - 

కరేగృహీతాపి పురస్థితాపి 
స్నేహేన సమ్యక్పరివర్ధితాపి
పరోపకారాయ భవత్యజస్రం
వృద్ధస్య భార్యా కరదీపి కేవ

(చేత పట్టుకొనబడినది, ఎదురుగా ఉండేది,
నూనెతో నిండినది అయిన కరదీపిక
ఎల్లపుడూ పరులకొరకు ఉపయోగపడుతుంది
అంటే చేత పట్టుకొన్నవాడికి ఉపయోగపడదని
అలాగే వృద్ధుని భార్య ఎల్లపుడు పరులకే
ఉపయోగపడును - అని భావం)

Saturday, December 9, 2017

పడతి కుభయ పక్షముల


పడతి కుభయ పక్షముల




సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్య శతకము(చిత్రపది)లోని
పద్యమిది-

పడతి కుభయ పక్షములను
పుడమి నేడుగడగ నిలిచి పొలుచునెవడునా
తడె పతియటు గాకున్నను 
వెడగుసుమీ జగతియందు వినుమా యార్యా!

ఉభయపక్షములు - ఇహపరములు, రెండువైపులు.
ఏడుగడ - ఆధారం
పడతి అనే పేరులోని రెండువైపులా అంటే
మొదటి చివరి అక్షరాలను కలుపగా
పతి అవుతుంది. అదే విధంగా ఆమెకు
ఉభయపక్షాలు అంటే ఇహపరాలు రెంటికి
రక్షణగా నిలిచినవాడే భర్త. అలా కాకుంటే
వాడు అవివేకి క్రిందికే లెక్క - అని భావం

Friday, December 8, 2017

షడ్జామడ్జకరాడ్జవీడ్జ - ఈ శ్లోకం చదవండి


షడ్జామడ్జకరాడ్జవీడ్జ - ఈ శ్లోకం చదవండి



సాహితీమిత్రులారా!

కొన్ని అక్షరాలు పెదాలు తగులుతూ పలుకుతాము
కొన్ని దంతాలను తగులుతూ పలుకుతాము
కొన్ని కంఠం నుండి వెలువడతాయి
మరి ఈ శ్లోకం నాలుక దంతాలకు అంగిటికి తగలకుండా
పలుకగలరేమో చూడండి-

షడ్జామడ్జకరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చదుడ్జాఖిరే
డ్జిడ్జేట్కిట్కిధరేధరేఖణఖణాఖడ్జూరవిడ్జడ్భ్రమా
లుడ్భ్రంలుడ్భ్రమలుడ్భ్రలుడ్భ్రయపదాడ్గ్రడ్గ్రడ్గ్రషడ్గ్రస్తధా
పాదౌటేటిపటేటిటేటిపటుసత్ప్రఖ్యాతిసత్రాదయః

ఈ శ్లోకాన్ని మా తాతగారైన శ్రీసరస్వతి వెంకమరాజు గారినుండి
మొదటగా విన్నాను తరువాత ఈ శ్లోకం మరుగున పడిపోయింది
ఈ మధ్య అంటే చిత్రకవిత్వ పరిశోధన మొదలు పెట్టాక
నానార్ధగాంభీర్య చమత్కార చంద్రికలో చూచి ఒక మహానిధి
దొరికినంతగా సంబరపడ్డాను కానీ దీని అర్థం దొరకలేదు
మహామహులట్లాంటివారు దీని అర్థానికై ఎదురు చూస్తున్నారని
నాకు ఈ మధ్యే వెల్లడైంది. కాని దీని ప్రత్యేకత నాలుక దంతాలు
తగలకుండా పలకటం సాధ్యపడదు ఇది పలకటం యూట్యూబులో
రెండు వీడియోల్లో వీలౌతుంది 1. రాళ్లబండి కవితాప్రసాదు గారు
చెప్పినది. 2. గరికపాటి నరసింహారావుగారు చెప్పినది. ఇక్కడ మీకు
గరికపాటివారి వీడియోను ఉంచుతున్నాను వినండి పలకగలరేమో
ప్రయత్నించండి-


Thursday, December 7, 2017

అథ శబ్దాను శాసనమ్


అథ శబ్దాను శాసనమ్



సాహితీమిత్రులారా!



సమస్య-
అథ శబ్దాను శాసనమ్

(ఇది పాణినీట సూత్రాలలో ఒకటి దీన్ని సమస్యగా ఇవ్వగా
  ఒక కవి ఈ విధంగా పూరించాడట)
పూర్వకవి పూరణ-

గుర్వన్తికే హ్రియా పూర్వమ్
సంజ్ఞయార్థావ బోధనమ్
కరోతి పత్యుర్యుపతి
రథ శబ్దానుశాసనమ్

పెద్దలముందు సిగ్గుచేత భర్తకు ఆమె సంజ్ఞలతోనే
అభిప్రాయాలు తెలిపింది. వారు చాటుకాగానే
ఇంక మాటలతో అతన్ని శాసిస్తున్నది - అని భావం


Wednesday, December 6, 2017

ఆకొనినపుడాహారము


ఆకొనినపుడాహారము



సాహితీమిత్రులారా!


కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్య శతకము(చిత్రపది)లోనిది
ఈ పద్యం-

ఆకొనినపుడాహారము
లోకమ్మున హారమగును ఋషియైన సుమీ
ఆకలి లోభం బట్టిది 
యాకౌశికుడెరుగు దాని నవనిని యార్యా!

ఆకొను - ఆకలిగొను, -ను తీసుకొను
హారంలో - అనే అక్షరాన్ని తీసివేస్తే
అపుడు హారం మిగులుతుంది. హారం అంటే
హరించేది అంటే దోచుకోదగిన వస్తువు అని
అవుతుంది. మహాభారతం కూడ తిండికొరకు
దోచుకున్న వస్తువు దొంగతనం కాదనే చెబుతుంది.
విశ్వామిత్రుడొక యుగసంధిలో ఒక హరిజనవాడలో
కుక్కమాంసాన్ని దొంగిలించాడు కనుక ఆకలిబాధ
ఎలాంటిదో ఆతనికి తెలుసు - అని భావం.


Tuesday, December 5, 2017

దయలేని హృదయం


దయలేని హృదయం




సాహితీమిత్రులారా!



కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్య శతకం(చిత్రపది)లోనిది
ఈ పద్యం చూడండి-

దయలేని హృదయమనగ హృ
దయమే అది జగతియందు దానికి నహి ని
శ్చయముగ నాస్తిత్వంబే
మెయినయినను జగతియందు వినుమా యార్యా!

దయలేని హృదయము - దయ అనే పదంలేని హృదయం
హృదయం అనే పదంలో దయ అనే రెండక్షరాలు ఉన్నాయి
కనుక దయ లేని హృదయం, హృదయం కాదు. అటువంటి
హృదయానికి లౌకికపరంగా కూడ అస్థిత్వం(ఉనికి) ఉండదు.
దయతొలగిస్తే అది హృ ము అని మిగులుతుంది దీనికి ఏఅర్థం
ఉండదు.

Monday, December 4, 2017

బంధకవిత్వం అంటే ! ?


 బంధకవిత్వం అంటే ! ?


సాహితీమిత్రులారా!



బంధకవిత్వం అంటే ఏమిటో?
పరిశోధనాపండితులు, 
నిరంతర సాహితీ సేవకులు అయిన
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారి మాటల్లో చదవండి.........

                ఆత్మ అక్షరం, శరీరం ఒక చిత్తరువు/బొమ్మ. ఇలాంటి
అక్షర  చిత్రబంధాలను   భగవానుడు     విశ్వ మహా చిత్రకావ్యంలో
అసంఖ్యాకంగా రచించాడు.  
                విశ్వమంతటా వ్యాపించినవాడు విష్ణువు(సర్వంవ్యాప్నోతీతి
విష్ణుః). అందునే  'సహస్రనామం'లో  విశ్వం - విష్ణుః  అనే    నామాలు
మొట్టమొదట  చోటు  చేసుకున్నాయి. అంతటా   వ్యాపించిన  వానికి
ప్రత్యేకించి ఒక ఆకారం లేదన్నమాట. నిరాకారమైన. దైవాన్నికూడ భక్తితో
సుందరాకారంగా "బంధించడం" భారతీయులకు బాగాతెలుసు. 
               ఖేదాలన్నిటికీ కారణం  భవ"బంధాలే".అయితే సాహిత్యంలో
మాత్రం విద్వాంసులకు అద్భుతరసాన్ని ఆవిష్కరించి మోదాన్ని కూర్చేది
"చిత్రబంధాలే".  "చిత్రబంధ కవిత్వం" అంటే ఏమిటో తెలుసుకుందాం--
              పూర్వాలంకారికులు చిత్రబంధాలను గురించి తమ సంస్కృత
గ్రంథాలలో చాలామంది చెప్పినారు.వాటిలోకొందరుచెప్పినకొన్నివాక్యాలు
ఆచార్య రుయ్యకః - ' వర్ణానాం ఖడ్గాద్యాకృతి హేతుత్వే  చిత్రమ్
                                               (అలంకార సర్వస్వం -10)
ఆచార్యజయదేవః-'కావ్యవిత్ ప్రవరైచ్చిత్రం ఖడ్గబంధాదిలక్ష్యతే'
                          (చంద్రాలోకః -5-9)
ఆచార్యవిద్యానాదః-'వర్ణానామథ పద్మాద్యాకృతి హేతుత్వముచ్యతే చిత్రమ్'
                                                                           (ఏకావలీ)
ఆచార్యవిశ్వనాథః-'పద్మాద్యాకార హేతుత్వే వర్ణానాం చిత్రముచ్యతే'
                                                           (సాహిత్యదర్పణం 10-13)‌
శ్లో॥అనేకధా వృత్తవర్ణ విన్యాసైః శిల్పకల్పనా,
      తత్త త్ప్రసిద్ధ వస్తూనాం బంధ ఇత్యభి ధీయతే.
                                           -(అగ్నిపురాణ - 334,35,36)
శ్లో॥భంగ్యంతర కృత తత్క్రమ- వర్ణ నిమిత్తాని వస్తు రూపాణి,
      సాంకాని విచిత్రాణిచ - రచ్యంతే యత్ర తచ్చిత్రమ్.
                                                  రుద్రట - 5- 1
శ్లో॥ చిత్రంతు నియమన్యాసో వర్ణానా మీప్సిత క్రమం,
       స్వరవర్ణ గతి స్థాన బంధ హారాది బంధనాత్.
                                          --రసార్ణవాలంకార 3 - 52
యస్మిన్ కస్మిన్ చిత్రే బంధితం కవిత్వం(సప్తమీతత్పురుషకర్మధారయం)
బంధేన యుక్తం కవిత్వం అని చెప్తే మధ్యమ పదలోప కర్మధారయం.
సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు- యం. కృష్ణమాచారియర్ గారు---
   Bandha  is  the name given to verses in which
the letters arranged in the form of sword,car,
Serpent etc.అని చెప్పినారు  (History if classical 
sanskrit literature - P.375).
   తెలుగు - ఇంగ్లీషు బ్రౌణ్యనిఘంటంవులో--
బంధకవనము,బంధకవిత్వము=A Poem  composed  in
   fantastic form ; either in shape of a sworal(ఖడ్గ
బంధం),or  a serpent(నాగబంధం).
బంధం:a kind of poetical composition.కావ్యరచనావిశేషం.
  చిత్ర బంధాల గురించి పరిశోధించిన మహాపండిత పరిశోధకులు 
వి.బాల సుబ్రమణియన్ గారు 'చిత్రబంధ' శబ్దిలను 
ఇలా వివరించినారు----
   ' chitra bandha means a verse inscribed a
picture  according to specific  rules.
     'బంధం' అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి.వాటిలో పది ఆర్థాలు
ఇలా ఉన్నాయి.వాటి అర్థాన్ని బంధకవిత్వంతో సమన్వయించి చూద్దాం-
 1బంధం=కట్టు, నిబంధనం        
*పద్యాన్ని ఆకారంగా నిబంధించడం.
 2బంధం=దారం, తాడు , సూత్రం    
*పద్యసూత్రంతో ఒక ఆకారాన్ని                                                                         నిబంధించడం.
 3బంధం= సంకెల గొలుసుకట్టు.    ---
 4బంధం=నిర్మాణం. 
*చిత్తరువుకు అనుగుణంగా పద్యాన్ని
                 నిర్మాణం  చేయడం.               
 5బంధం=సంబంధం. 
*చిత్తరువుకు,పద్యానికి సంబంధం ఏర్పరచడం.
6బంధం=కూర్పు. 
*ఒకటిగా కూర్చుట.(ఉదా:అంజలిబంధం)చిత్రాన్ని-
                   బంధాన్ని ఒకటిగ కూర్చడం.
7బంధం=ఒద్దిక,ఐకమత్యం,.ఆనురూప్యం.
*పద్దెం+చిత్తరువు ఒద్దికగా/  ఐకమత్యంగా/
                      ఆనురూప్యంగఉండడం.
అక్షరాలు+ఆకారాలు ఐకమత్యంగ ఉండడం.    
 8బంధం=సంయోగ విశేషం,
*రతి/కళా శాస్త్ర సంబంధంగ84 బంధాలు
           చెప్పినారు,ఉదా:నాగపాశబంధం.
              పాములవలె పెనవేసుకోవడం.
           వాటిలాగే ఒక ఆకారంతో ఒక పద్యం 
           పెనవేసుకొని అద్భుత
           రసాన్ని ఆవిష్కరించడం.
9బంధం=చిత్రాలంకార విశేషం.
*కావ్యకన్యకు ఒక చిత్రమైన అలంకార
              విశేషం.చిత్తరువుతో కూడిన అలంకార విశేషం.
10బంధం=దేహం.
*శరీరం(ఆత్మ)అనేఆకారంలోఆత్మను(అక్షరంపద్యం)
                         నిలపడం.
        పూర్వోక్త విషయాలన్నిటినీ పరిశీలిస్తే తెలిసిన సారాంశం-----
పద్మం,ఖడ్గం మొదలయిన ఆకారాల రెఖాచిత్రాలు నిర్మించి అందులో
పద్యాల అక్షరాలను నియమంగా కూర్చడం బంధకవిత్వం/చిత్రబంధం.
బొమ్మ  పోకడనుబట్టి  అంటే  బొమ్మ యొక్క  రేఖాచిత్రంలోని
కూడలి/సంగమ స్థానాలలో ఆవృత్తిఅయ్యే అక్షరాలను(repeted
letters)ఎంపిక చెసుకొని పద్యరచన సాగుతుంది.అలా రచించిన
పద్యాలను "బంధకవిత్వం' అంటారు. "బంధకవిత్వం"అనే పద బంధంలో
'కవిత్వం' శబ్దం గౌణం ఇక్కడ కవిత్వం అంటే  పద్యం  అని. భావించడం సబబు.
కవి అంటే పద్యం చెప్పేవాడు అనే భావన ఉండేది .‌బంధంగా
పద్యం ఉంటుంది కనుక దానిని బంధకవిత్వం అన్నారు.                          
  It  is  a  happy marriage of a  picture and  poetry.

చిత్రానికీ పద్యానికీ ఉన్న ముడి. బంధం.అది ఆనంద వివాహ బంధం.