Monday, October 31, 2016

తప్పక చెప్పవలెను


తప్పక చెప్పవలెను



సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం చూచి సమాధానం చెప్పండి-

ఇంటనుండును నెప్పుడును నెవ్వియెవియొ?
వెంటనుండును నెవ్వియో వేఱుగాక ?
తప్పకును జెప్పవలయును తత్క్షణంబ
విమలనుతులార! విజ్ఞానవిబుధులార!

ఈ పద్యంలో రెండు ప్రశ్నలు ఉన్నాయి
1. ఇంటిలో ఎప్పుడూ ఉండేవి ఏవి
2. వెంట ఎప్పుడు విడకుండా ఉండేవి ఏవి
వీటికి సమాధానాలు ఇందులో లేవు. మీరు ఆలోచించి చెప్పాలి
ఇలాంటివాటిని బహిర్లాపిక ప్రహేళికలలో చేర్చవచ్చు.
సమాధానాలు-
1. ఇంటిలో ఎప్పుడూ ఉండేవి ఏవి?
   - కలిమి లేమి(ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయికదా!)
2. వెంట ఎప్పుడు విడకుండా ఉండేవి ఏవి?
   - పాప,పుణ్యాలు(ఇవి ఎప్పుడైనా వదలిపోతాయా?)

శ్రీరంగేరం నిరంతరే స్థితమతినుత


శ్రీరంగేరం నిరంతరే స్థితమతినుత



సాహితీమిత్రులారా!

చిత్రకవిత్వంలో బంధకవిత్వం
లేదా ఆకారచిత్రం ఒక భాగం.
ఇందులో గోమూత్రికా బంధమును,
అష్టదళ పుష్పబంధమును, నాగబంధమును
తెలిసికొని ఉన్నాము.
ఇపుడు పుష్పమాలికాబంధమును గురించి
తెలుసుకుందాము.

ఇందులో అనేకరకములు ఉన్నాయి.
సంస్కృతభాషలో ఎక్కువగా పుష్పమాలికా
బంధాలను స్రగ్ధరావృత్తంలో చేశారు.
తెలుగులో చంపకమాలావృత్తంలో చేశారు.
దీనిలో ఒక్కొక్కపాదానికి 21 అక్షరాలు,
మొత్తం 84 అక్షరాలుంటాయి.
పుష్పమాలలోని ప్రతి పువ్వులో 7 అక్షరాలుంటాయి.
అందులో మనకు 5 అక్షరాలే కనిపిస్తాయి
దానికి కారణం ఒక అక్షరం మూడు పర్యాయాలు వస్తుంది.
ఇలా పువ్వుకు 7 అక్షరాల చొప్పున
84 అక్షరాలకు 12 పువ్వులు ఉంటాయి.
దీనిలో ఆవృత్తమయే అక్షరాలుపోగా మనకు
పుష్పమాలికలో 60 అక్షరాలు కనబడతాయి.

ఈ క్రింది శ్లోకం చూడండి-

శ్రీరంగేరం నిరంతే స్థితమతినుత రస్థేమ భూమక్షర్థిం
శ్రీవామావాసవాస్తూర సమసమసమగ్రాతిభూతిప్రతిష్ఠమ్
వన్దేహందేవదేవం వనజనయన మహాస్రదాస ప్రసన్నం
నోవేధావేదవేదానచ ఖచరదయా భ్యావమేవస్తువస్యమ్
                                                                          (అలంకారశిరోమణే -7-10)


శ్రీరంగంలో స్థిరంగా వెలసినవాడు.
భూమండలాన్ని అధికంగా స్థిరంగా
అభివృద్ధి అయ్యేట్లు చేసినవాడు.
లక్ష్మీదేవి నివాసానికి యోగ్యమైన
వక్షస్థలం కలవాడు, అసమానమైన
పరిపూర్ణమైన ఐశ్వర్యం యశస్సు కలవాడు,
కమలనయనుడు, దాసులయెడ అనుగ్రహం
కలవాడు అయిన శ్రీరంగనాథుని మహిమను
బ్రహ్మకూడా తెలిసికొనలేడు. గగన సంచారులైన
దేవతలు కూడా స్వామివారి మహిమను ఎరుగలేరు.
అలాంటి సర్వాతీత మహిమాన్వితుడైన దేవదేవుడైన
శ్రీరంగనాథునికి నమస్కారం. మమ్ములను రంగవిభుడు
భవబంధాలనుంచి రక్షించుగాక!


ఈ పద్యం మొదటి పాదంలోని శ్రీరంగేరం నిరంతే -
అనే అక్షరాలు ఒక పువ్వుగా ఈ క్రింది విధంగా ఏర్పడతాయి.

దీనిలో రం అనే అక్షరం మూడు పర్యాయాలు వస్తాయి.
అది పువ్వు మధ్యలోని దుద్ధుగా ఏర్పడుతుంది.
ఈ విధంగా పన్నెండు పూలతో మాల ఏర్పడుతుంది
ఆ మాలను ఈ చిత్రంలో చూడండి.


Sunday, October 30, 2016

హేమన్తే హరిణాక్షీ పయసి........


హేమన్తే హరిణాక్షీ పయసి........


సాహితీమిత్రులారా!



ఈ ప్రహేళికను చూడండి-

దాసాయ భవననాథే బదరీ మపనేతు మాదిశతి
హేమన్తే హరిణాక్షీ పయసి కుఠారం వినిక్షితి

భవననాథే -  ఇంటి యజమాని,
బదరీం - గుబురుగా పెరిగిన రేగుచెట్టును,
అపనేతుమ్ - తొలగించుటకు(కొట్టివేయుటకు),
దాసాయ - సేవకునికి,
ఆదిశతి - ఆనతీయగా,
హరిణాక్షీ - లేడికంటి అయిన ఆమె,
హేమంతే - హేమంతఋతువులో,
కుఠారమ్ - గొడ్డలిని,
పయసి - లోతైన బావినీటిలో,
వినిక్షిపతి - పడవేయుచున్నది.

ఇందులో రేగు చెట్టును కొట్టివేయమని
ఇంటియజమాని ఆజ్ఞాపిస్తే
నాయిక గొడ్డలిని నూతిలో
పారవేయడానికి సంబంధం ఏమిటి -
బాగా విచారిస్తే -
హేమంతంలో చలిబాగా విసురుతుంది.
గొడ్డలి నూతిలో వేస్తే దిగి తెచ్చేదెవరు చలికి.
ఇంటియజమాని చేట్టును కొట్టేయమంటేనే  ఆమె
బెదిరి గొడ్డలిని నూతిలో పడేసింది. ఆ రేగుచెట్టు
క్రిందే విటుని పొందువలన కలిగిన నఖక్షతాలను రేగు
కంపవలన కలిగినవని బొంకులాడుచుండెడిది. ఇప్పుడు
ఆ చెట్టు కొట్టేస్తే తన రహస్యం బట్టబయలవుతుంది. అందుకే
తనను తన సంకేత స్థలాన్ని కాపాడుకొనేందుకు  ఆపని చేసిందని
ఇందులోని తాత్పర్యం.

గుర్రానికి నైదురాళ్ళు కోడికివలెనే


గుర్రానికి నైదురాళ్ళు కోడికివలెనే



సాహితీమిత్రులారా!


సమస్య- గుర్రానికి నైదురాళ్ళు కోడికివలెనే

ఈ సమస్యను వెంకగిరి సంస్థానంలో
మోచర్ల వెంకనకు ఇవ్వగా ఆయన పూరించారు.
పూరణ -

మర్రాకు పాన్పుగా గొని
బొర్రన్ బ్రహ్మాండ పంక్తి బూనిన ముద్దుం
గుర్రడ విను - వన్నెలు గుహు
గుర్రానికి నైదు కాళ్ళు కోడికి వలెనే!

దీనిలో కవి ఎంత చమత్కారంగా పూరించాడో చూడండి.

పొట్టలో బ్రహ్మాండాలను దాల్చి,
మర్రియాకుపై పడుకున్న ఓ బాలముకుందా!
విను - గుహు(కుమారస్వామి)గుర్రానికి
(వాహనానికి- నెమలికి) వన్నెలు ఐదు -
 కాళ్ళుమాత్రం కోడికివలెనె(రెండు)

మీరు మీశైలిలో పూరించి పంపండి.

దీపావళి శుభాకాంక్షలు


దీపావళి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు
దీపావళి శుభాకాంక్షలు

Saturday, October 29, 2016

అలా కాకుంటే అవివేకే


అలా కాకుంటే అవివేకే


సాహితీమిత్రులారా!




ఆర్యా శతకంలోని ఈ పద్యం చూడండి-

పడతి కుభయ పక్షములను
పుడమి నేడుగడగ నిలిచి పొలుచునెవడునా
తడె పతియటు గాకున్నను
వెడగుసుమీ జగతియందు వినుమా యార్యా!

ఉభయపక్షములు - ఇహపరాలు, రెండువైపులు.
ఏడుగడ - ఆధారం
పడతికి ఇహపరాలలో రెండువైపులా అనగా
ఇహంలోనూ పరంలోనూ అండగా ఉండేవాడే భర్త
అలాకానివాడు అవివేకి క్రిందనే లెక్క - అని భావం.

ఇందులోని శబ్దచిత్రం-
పడతి - అనే పదంలో మొదటి చివరి అక్షరాలను కలిపిన పతి అవుతుంది.
దీన్నే కవిగారు ముందు వెనుక అంటే పతి అయినవాడు ఇదేవిధంగా
ముందు వెనుక రక్షణగా ఉండేవాడే పతి లేనివాడు అవివేకి అని చెబుతున్నాడు.

అయ్యనుజూచి యామె విరహాతురయయ్యె


అయ్యనుజూచి యామె విరహాతురయయ్యె


సాహితీమిత్రులారా!

సమస్య -
అయ్యనుజూచి యామె విరహాతురయయ్యెను సాజమేకదా!

ఈ సమస్య 21-01-1977న మచిలీపట్టణం అష్టావధానంలో
సి.వి.సుబ్బన్నగారికి ఇవ్వగా ఆయన ఈ విధంగా పూరించారు.

నెయ్యపుఁదొయ్యలిన్ వదలి నీరధియానమొనర్చఁబోయి రాఁ
డయ్యెఁబ్రియుండు వచ్చుటది యప్పుడొయిప్పుడొయంచుజూడఁగా
నయ్యుపలాలితోక్తులు ద్విజాగ్రణియొక్కఁడు తెల్పె దూతయౌ
నయ్యనుజూచి యామె విరహాతురయయ్యెను సాజమేకదా!

అయ్య - తండ్రి, పూజ్యుడు.
అటువంటివానిని చూచినంతనే
విహాతుర కావడం సాజమా కాదుకదా!

దీన్ని "దూతయౌనయ్యను జూచి" అనడంతో
మొత్తం అర్థం రమణీయంగా మారింది.

ప్రియుడు సముద్రప్రయాణం చేసి ఎన్నాళ్ళకూ రాలేదు.
అతని కొరకు ఆ నెయ్యపుటాలు నిరీక్షించుచున్నది.
అతడు తన కుశలవార్త ఒక బ్రాహ్మణోత్తమునితో చెప్పిపంపినాడు.
దూతయై వచ్చిన అయ్య(పూజ్యుడు) వినిపించిన బజ్జగింపుమాటలు
ఆమెకు ప్రాణం పోసినవి. అయ్యను చూచినంతనే పతిని గురించిన
తియ్యని తలపులు ఆమెలో వలపురేపినవి.
అందుచేత విరహాతుర అయ్యింది.

ఈ సమస్యను మీరు మీదైన శైలిలో పూరించి పంపండి.

Friday, October 28, 2016

రవిజా శశికుందాలా


రవిజా శశికుందాలా

సాహితీమిత్రులారా!



ఈ ప్రహేళికను చూడండి-

రవిజా శశికుందాలా తాపహారీ జగత్ప్రియా
వర్ధతే వనసంగేన న తాపీ యమునా చ న

రవిజా - సూర్యునివలన పుట్టినది,
శశికుందాలా- చంద్రునివలె, మొల్లవలె తెల్లగా ఉండునది,
తాపహారీ - తాపాన్ని పోగొట్టేది, జగత్ప్రియా - లోకప్రియమైనది,
వర్ధతే వనసంగేన -  వనసాంగత్యమున పెంపొందునది - న తాపీ
యమునా చ న - ఇది తపతి కాదు యమున కాదు - అది ఏమిటి

దీన్ని బాగా ఆలోచిస్తే
దీని సమాధానం - మజ్జిగ

కవ్వంతో చిలుకబడినది తెల్లగా ఉన్నది. వేసవి తాపాన్ని పోగొట్టునది.
సర్వజనులకు సంతోషాన్ని కలిగించేది మజ్జిగే కదా!
చిలుకునపుడు నీరు (వన)కలిపి, చల్లటంతో పెరుగుతుంది.
రవిజా అంటే సూర్యపుత్రికలు తపతి యమునలు కాదు అంటున్నారు.
(రవి అంటే కవ్వం(మహారాష్ట్రభాషలో), వనం అంటే నీరు)

తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో


తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో

సాహితీమిత్రులారా!



సమస్య - 
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో 

పండ్రంగి రామారావుగారి(1915 నాటి) పూరణ-

మనమున వరుసల నరయక
యినజుడు పోరియు పిదపను నెరుగన్ వరుసల్
జనని వచింపంగ యముని
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో

కర్ణుడు(ఇనజుడు)-  
యమ - తనయుని (ధర్మరాజుని) తన తమ్ముడని 
తెలుసుకొన్నాడని చమత్కారంగా పూరించాడు కవిగారు.


మీ పూరణ పంపండి.




Thursday, October 27, 2016

తాజెడిమసియగు తామసి


తాజెడిమసియగు తామసి

సాహితీమిత్రులారా!

కపిలవాయి లింగమూర్తిగారి
ఆర్యా శతకంలోని పద్యం చూడండి

తాజెడిమసియగు తామసి
యేజగమున నున్నగాని ఇది నిక్కము సు
మ్మీ జనుడు దీనినెరిగిన
వేజన్మములైన జెడడు వినుమా యార్యా!

తామసగుణం కలవాడు తాను చెడిపోతాడు మసి అయిపోతాడు.
ఇది కనుక్కున్నవాడు ఎన్ని జన్మలెత్తినా చెడడు అంటున్నారు లింగమూర్తిగారు.

ఇందులో మరో చమత్కారం చూపించాడు కవిగారు. అదేమంటే
తామసిలోని - 'తా' జెడి - త అనే అక్షరం చెడిపోతే మసిమిగులపుతుంది
 - అని శబ్దచిత్రాన్ని చూపించాడు.

కస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్


కస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్



సాహితీమిత్రులారా!



వెంకటగిరి సంస్థానంలో మోచర్ల వెంకనకవి 
అనేక సమస్యలను పూరించాడు.
వాటిలోని ఒక సమస్య ఇది.

ఇంకంగస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్

పూరణ -
పంకేజానన నేటిరేయి వినుమీ పంతంబుతో రాహువే
శంకాతంకము లేక షోడశకళా సంపూర్ణు నేణాంకునిన్
బొంకం బార్చెదనంచు పల్కెను తగన్ బొంచుండి నే వింటిన్ నీ
వింకంగస్తురి బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్

ఓ సుందరీ! రాహువు పంతంతో ఈ రాత్రి చంద్రుని మీద దాడి చేస్తాడట.
నేను పొంచి విన్నాను. చంద్రునిలో మచ్చ ఉంది. నీ ముఖం చంద్రబింబం వంటిదైనా
మచ్చలేదు. నల్ల కస్తురి బొట్టు పెట్టుకుంటే వాడు నిన్ను చంద్రుడనుకోవచ్చు కాబట్టి
నీవు ఈ రోజు కస్తూరి బొట్టు పెట్టుకోవద్దు - అని చమత్కారంగా పూరించారు.

దీన్నే 1923లో సరస్వతి అనే పత్రికలో వేటూరి ప్రభాకరశాస్త్రివారు 
కస్తూరి బదులు కుంకుమ అని మార్చి సమస్యను ఇవ్వగా 
చాలా పూరణలు వచ్చాయట. 
వాటిలో మారేపల్లి  రామచంద్రశాస్త్రి వారి పూరణ ఉత్తమంగా ఉందని 
వేటూరివారు మెచ్చుకున్నారట ఆ పూరణ-

బింకంబుల్ పలుమారు పల్కె సభల పేరందు బల్ కోర్కెన్ ని
శ్శంకన్ తానటు చేయజాల కిటు దేశద్రోహియై ఖైదునన్
జంక నీ పతి పేరు మాపుకొనియెన్ చావన్న వే రున్నదే
ఇంకం గుంకుమ బొట్టు పెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్

ఓ తన్వీ! నీ భర్త పేరు పొందే కోరికతో బింకంగా సభల్లో మాట్లాడాడు.
సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్ళవలసి వచ్చినపుడు భయపడి 
ముందుకు రాలేదు. పేరు మాసిపోయింది. చావంటే వేరే 
ఇంకేమిటీ నీ భర్త చచ్చినవాడి కింద లెక్క కావున 
నీవు నొసట కుంకుమ పెట్టుకోవద్దు - అనే భావంతో పూరించాడు.

ఆనాటికి అది సరైన పూరణ.
ఆసక్తిగలవారు నేడు దీనికి నవ్యమైన పూరణ చేసి పంపగలరు.

Wednesday, October 26, 2016

ఊర్వశి రమ్ము నీ కిదె బహూకృతి కొమ్ము


ఊర్వశి రమ్ము నీ కిదె బహూకృతి కొమ్ము



సాహితీమిత్రులారా!


సమస్య-
ఊర్వశి! రమ్ము నీ కిదె బహూకృతి కొమ్ము కపాలకుండలా!

కరుణశ్రీగారి పూరణ -

రావణాసురుడు శివపూజ చేస్తూ
తన తలలనే అర్పిస్తూ అంటున్నట్లుగా పూరించారు.

శర్వ గిరీశ సాంబశివ శంకర రుద్ర భవా హరా దయా
ధూర్వహ ధూర్జటీ తలలు తొమ్మిది కోసితి పూజ చేసితిన్
శర్వ యి దొక్కటే మిగిలె స్వాములకున్ దయ రాదటంచు ని
ట్టూర్వ, శిరమ్ము నీ కిదె బహూకృతి గొమ్ము కపాలకుండలా!

"ఊర్వశి! రమ్ము" అనేదాన్ని
"నిట్టూర్వ - శిరమ్ము" - అని మార్చడంతో
అద్భుతమై విచిత్రార్థం వచ్చి
రమణీయపూరణ లభించింది.

ఆసక్తిగలవారు మరోరకంగా పూరించి పంపగలరు.

కఱవం గరవం కొమ్ములు


కఱవం గరవం కొమ్ములు

సాహితీమిత్రులారా!



ఆర్యా శతకంలోని ఈ పద్యం చూడండి-

కఱవం గరవం కొమ్ములు
దిరిగిన గురువగునుగాని, తేరకు గురువై
తిరిగినయంతం గురువా
పిరువీకై లఘువుగాక వినుమా యార్యా!

కఱచుట - నేర్చుట,
కఱవంగరవన్ - నేర్వగా నేర్వగా అంటే చదువగా చదువగా
కొమ్ములు దిరిగి - విద్యలో ఆరితేరు
నేర్వగా నేర్వగా ఆరితేరి గురువవుతాడు కాని
మిగిలినవారు గురువులు ఎలా అవుతారు?
లఘువులుగాక అంటే ఇక్కడ గురువు అనే మాటకు
మూడు లఘువులే
అలాంటి గురువు లఘువేకదా అని అర్థం.
అలాగే గరవ - అనే పదానికి కొమ్ములు వచ్చిన
అంటే గ - ర - వ -లకు కొమ్ములు ఇవ్వగా
గు-రు-వు  అనే పేరు అవుతుంది.
ఇందులోని శబ్దచమత్కారం అర్ధం తీసుకుంటే తెలుస్తుంది.
అందుకే కవిగారు ఈ శతకానికి ఆర్యా శతకంతో పాటు
చిత్రపది అనే పేరుకూడ పెట్టారు.

Tuesday, October 25, 2016

కాంతకు వారకాంతకు...


కాంతకు వారకాంతకు...


సాహితీమిత్రులారా!


ఆర్య శతకం(చిత్రపది) అనే పేరుతో
కపిలవాయి లింగమూర్తిగారు
ఒక శతకం రచించారు
అందులోని చమత్కార పద్యం చూడండి-

కాంతకును వారకాంతకు
సంతతమును గలదు వార జనుడిది యెరుగున్
చింతవలన దిహపరములు
వింతగ తన చెంతనుండు వినుమా యార్యా!

కాంత - ఇల్లాలు,
వారకాంత - వేశ్య,
వార - భేదం,
కాంత, వారకాంత అన్నపుడు
వారిద్దరిలో వార అంటే భేదం
స్పష్టంగా కనిపిస్తున్నది కనుక
ఎవరైనా వారకాంతలజోలికి పోరాదు.
అప్పుడే
వారికి ఇహపరాలు రెండు దక్కుతాయి.

ఇందులో వారకాంత, వార అనే రెండుచోట్లను
వార అనే వర్ణసముదాయం అర్థభేదంతో వాబడింది
కావున ఇది యమకాలంకారమౌతుంది.
మరియు శబ్దములచేత చిత్రం
కల్పింపబడిందికావున
ఇది శబ్దచిత్రం అవుతుంది.

వెడవెడ చిడిముడి తడఁబడ


వెడవెడ చిడిముడి తడఁబడ



సాహితీమిత్రులారా!


భాగవతంలో సర్వలఘువులతో
కూర్చిన కందాలు రెండు అవి
ఒకటి గజేంద్రమోక్షణంలోను
రెండవది వామనుడు
బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళుసమయంలో
వామనచరిత్రలో అవి రెండు ఇక్కడ -

అడిగెద నని కడువడిఁజను
నడిగినఁ దను మగుడ నుడుగఁడని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడు గిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
                          (8-103)
గజేంద్రుని రక్షించేందు వెళ్ళే సమయంలో
 లక్ష్మీదేవి కొంగు పట్టుకొని వేగంగా
ఆర్తరక్షకు వెళుతున్న విష్ణువును
 అనుసరిస్తూ లక్ష్మీదేవి మనోభావన ఈ పద్యం.

భర్త ఎక్కడికి వెళుతున్నడో ఎందుకు వెళుతున్నాడో
అడగాలని ముందుకు వెళుతుంది అడిగితే
మారుమాటాడకుండా వెనుకకు పొమ్మంటాడని
నడక మానేది. చీకాకుతో తొట్రుపాటుతో మళ్ళీ మెల్లగా
ముందుకు అడుగులు పెట్టేది. మళ్ళీ ఆగేది.
అడుగులు కదలించక లేక తడబడుతూ నడిచేది - అని భావం.

మరో పద్యం -

వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడుగిడఁగ నడరి యిల దిగఁబడఁగా 
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడఁగ వడుగు సేరెన్ రాజున్
                                           (8-541)
వామనుడు మెల్లమెల్లగా అడుగులు పెట్టి నడిచాడు.
అక్కడక్కడా భూమి క్రుంగి పోతుంటే సరిగా అడుగులు పెట్టలేక కష్టడినాడు.
నడునడు కొద్దికొద్దిగా మాట్లాడుతూ తడబడుతూ కలవరపడుతూ
బలిచక్రవర్తిని సమీపించాడు - అని బావం.

ఈ రెంటిలోను మొదటి దానిలో పూర్తిగా సర్వలఘువులున్నాయి.
కాని రెండవదానిలో 'సేరెన్ రాజున్' అనే దానితో మూడు గురువులు చేరాయి.

Monday, October 24, 2016

చావటానికి గాలి పీల్చుటెందుకు?


చావటానికి గాలి పీల్చుటెందుకు?


సాహితీమిత్రులారా!


నాగరాజ కృత భావశతకములోని 
ప్రహేళిక గమనించండి-

కాచిత్ సరోజనయనా రమణే స్వకీయే
దూరం గతే సతి మనోభవ బాణఖిన్నా
త్యుక్తుం శరీర మచిరాత్ - మలయాద్రివాయుం
సౌరభ్యశాలిన మబో పిబతిస్మ చిత్రమ్

ఒకానొక పద్మాక్షి, తన ప్రియుడు 
దూరదేశం వెళ్ళగా
మన్మథబాణ పీడితురాలై  బాధపడుతూ 
ప్రాణాలు వదలాలని వెంటనే
మలయపర్వతం నుండి చందనగంధంతో 
వీస్తున్న గాలిని పీల్చడం మొదలు పెట్టిందట
- ఏంటీ చిత్రం.
చావాలనుకుంటే గాలిని బంధించి చావాలికదా!
కాని పీల్చడమేమిటని ప్రశ్న-

మలయపర్వతం నుంచి మంచిగంధం చెట్లనుండి 
వచ్చే గాలిని పీల్చటంవల్ల విరహిణులను 
బాధలు పెరుగుతాయి కాబట్టి గాలిపీల్చకుండా మానాలి కదా!

అలా చేయడం అంటే -

చందనచర్చిత మలయమారుతం 
పరిమళం  వెదజల్లుతుంది.
 గాలిమేపరులైన విషసర్పాలు ఆ గాలిని పీల్చి 
వదలటంవలన ఆ గాలి విషపూరితం అవుతుందికదా!
ఆ గాలిన ఈవిడ పీల్చితే తనకు మరణం వస్తుందని 
ఈ విరహిణి అలా చేసిందని సమాధానం.

మునికిన్ కోపమె భూషణంబగు


మునికిన్ కోపమె భూషణంబగు



సాహితీమిత్రులారా!


సమస్య-
మునికిన్ కోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్

మునికి శాంతంకదా ఉండాల్సింది కోపమెలా
ఆభరణమౌతుంది అది ప్రజాసంతోషంతో

కరుణశ్రీ గారి పూరణ -
మునికిన్ శాంతము భూషణంబగు, సుధాపూరంబు వర్షించు సో
మునికిన్ కౌముది భూషణంబగు, జగమ్మున్ కాచి రక్షించు రా
మునికిన్ ధర్మమె భూషణంబగు, దురాత్ముండౌ బకుం గూల్చు భీ
మునికిన్ కోపమె భూషణంబగు ప్రజామోదంబు సంధిల్లగన్


మీరు మరోవిధంగా పూరించి పంపండి.

Sunday, October 23, 2016

న సముద్రో న చంద్రమా:


న సముద్రో న చంద్రమా:



సాహితీమిత్రులారా!


ఈ ప్రహేళికను చూడండి-


ఏక చక్షు ర్నకాకోయం
బిల మిచ్చే న్న పన్నగ:
క్షీయతే వర్ధతే చైవ
న సముద్రో న చంద్రమా:

ఒక కన్నుందేది అనే ప్రశ్నకు వెంటనే కాకి
అనే సమాధానం వస్తుంది. కాని కాదు.
బిలాన్ని కోరేది ఏది అనే ప్రశ్నకు సమాధానం
పాము అని చెబుతారు కాని కాదు.
సరే తరుగుతుంది పెరుగుతుంది ఏదది అంటే
మనకు సముద్రం లేదా చంద్రుడు అంటాం కదా అవీకాదు.
బాగా ఆలోచిస్తే తెలుస్తుంది.

అది దారంతో ఉన్న సూది

దీనికి ఒక కన్నే కదా!
దీనిలోని దారానికి రంధ్రం కావాలికదా!
దీనిలోని దారం తరుగతూ పెరుగుతూ ఉంటుంది కదా!
ఇపుడు సమాధానం -  దారముతో కూడిన సూది.

భామయు భామయున్ గలియ బాలుడు పుట్టె


భామయు భామయున్ గలియ బాలుడు పుట్టె


సాహితీమిత్రులారా!


సమస్య-
భామయు భామయున్ గలియ బాలుడు పుట్టె సత్యభామకున్

కరుణశ్రీ గారి పూరణ-

శ్రీమతి లేఖ బంపినది, చేయడు కార్యము మామ, తానట
గ్రామణియైన యల్లు డొక రాతిరి కూతురి చెల్మి కత్తెయై
మామ గృహంబు జేరి తన మానినిగూడెను, ఆ యసత్యపుం
భామయు భామయున్ గలియ బాలుడు పుట్టెను సత్యభామకున్

అసత్యపుం భామ అనటంతో
అసత్యమైన భామ అంటే భామకాదని
పుం - భామ అంటే పురుషుడైన భామ అని అర్థం.


ఆసక్తిగలవారును సరిక్రొత్తగా పూరించి పంపగలరు.

Saturday, October 22, 2016

లంగా ఎత్తి కురంగ నేత్ర కనియెన్


లంగా ఎత్తి కురంగ నేత్ర కనియెన్



సాహితీమిత్రులారా!

ఈ సమస్యను చూడండి.
పూరించే ప్రయత్నం చేయండి.

సమస్య-
లంగా ఎత్తి కురంగ నేత్ర కనియెన్ లాంగూల శృంగారమున్

 ఈ సమస్యను కరుణశ్రీ వారి పూరణలో చూడండి-

రామాయణంలో తార - వాలితో అంటున్న సందర్భం-

సింగం బాతడు హస్తి నీవు, వలదా శ్రీరాముతో పోరగా
భంగంబందెదవంచు మొత్తుకొని నా పల్కుల్ చెవింబెట్టకీ
భంగిం గూలితి వంచు తార రఘు రాడ్బాణంబుచే వాలి కూ
లంగా ఎత్తి కురంగ నేత్ర కనియెన్ లాంగూల శృంగారమున్

మీరు మరోవిధంగా పూరించి పంపగలరు.

నల్వుగ నల్వ సృజించె నెచ్చెలిన్


నల్వుగ నల్వ సృజించె నెచ్చెలిన్



సాహితీమిత్రులారా!

శ్రీపాద కృష్ణమూర్తిగారి నైషధీయచరిత్రలో
దమయంతిని వర్ణించిన ఈ చిత్రం చూడండి-

కరములఁబెందొడల్, మొన''గా నునుబిక్కలు, 'ధు' ద్వితీయమై
నెఱులు, వికంఠ్యమై పెదవి, వీగి 'ధు' 'వంద' '' పైఁగ వాక్కు, బొ
ట్టిరవుగ 'మా' కు మాఱ సుతలెన్నఁబిఱుందును, నాది వోవఁగం
ధరము, మరల్పునన్ నగవు, నల్వుగ నల్వ సృజించె నెచ్చెలిన్
                                                                          (నైషధీయచరిత్ర - శృంగారతరంగిణి-2-67)
కరములు - ఏనుగు తొండములు,
పెందొడల్ - పెద్దవైన తొడలు(ఊరువులు),
కరములు - పదానికి మొదట మ చేర్చిన మరకములు
మరకములు - పిక్కలు(జంఘలు),
మకరములు - పదానికి రెండవ అక్షరం ధు చేర్చిన మధుకరమలు అవుతుంది.
మధుకరములు అంటే తుమ్మెదలు, నెఱులు (వెంట్రుకలు)
వికంఠ్యము అంటే కంఠ్యాక్షరమైన క -ను తీసివేసిన - మధుర,
పెదవి(అధరము), మధురలో ధు తీసివేసిన - మర అవుతుంది.
అంద - అనే పదం ర తరువాత చేర్చిన మరంద అగును,
మరందముతో వాక్కు(మాట), బొట్టు - సున్న,
మాకు - మ వర్ణమున కై, మాఱ సుతలు - చివరి వర్ణములు,
ర,ద -లు మారగా, మందరము అవుతుంది- పర్వతము,
దానితో పిఱుందులు, ఆది వోవ - మొదటి అక్షరం పోగా,
మందరలో మం - పోగా దర అవుతుంది, దర - శంఖము,
దానితే కంఠము, మరల్పునన్ - మరలించుటచేత
దర - రద గా మారును - రద మంటే గజదంతము,
దానితో నవ్వులను - చేశాడు బ్రహ్మదేవుడు - అని పద్యార్థము.

ఇందులో కొన్నిట అక్షరములను చేర్చటం,
కొన్నిట తీసివేయటం జరుగుతున్నది.
అందువల్ల ఇది దత్తచ్యుతాక్షర చిత్రమగుచున్నది.


Friday, October 21, 2016

సీమాసీ మానభూమి:


సీమాసీ మానభూమి:


సాహితీమిత్రులారా!

ఇక్కడ అవ్యపేత చతుష్పాద
ఆదిమధ్యాంత యమకం గురించి చూద్దాం.
శ్లోకం లేక పద్యంలోని నాలుగు పాదాలలో
మొదట్లో, మధ్యలో, చివర్లో మూడు చోట్ల
వ్యవధానంలేకుండా అర్థభేదంతో మళ్ళీమళ్ళీ
వచ్చే వర్ణసముదాయాన్ని
అవ్యపేత చతుష్పాద ఆదిమధ్యాంత యమకం అంటారు.
ఉదాహరణ -
సీమాసీ మానభూమి: ఫణిబలవలనోద్భావిరాజీ విరాజీ
హారీ హారీతవద్భి: పరిసరసరణావ స్తమాలై స్తమాలై:
దేవాదేవా ప్తరక్ష: కృతభవ భవతోగ్రేన దీనో నదీనో
ముక్తాముక్తాచ్ఛరత్న: సితరుచిరుచిరోల్లాసముద్ర: సముద్ర:
                                                                      (సరస్వతీకంఠాభరణమ్ - 2-98)
హద్దులయందు నిలిచేవాడు, గౌరవస్థానమైనవాడు,
పాముల సమూహాలు ప్రాకటం చేత ఏర్పడిన
చాలుచేత విరాజిల్లువాడు, హరీతములనే పక్షులచేత
పరిసరమార్గములందు విసరబడిన మాలా సన్నివివేశములు
గలిగిన తమాలవృక్షములచేత మనోహరమైనవాడు,
దేవతలకు రాక్షసులకు రక్షణను గలిగించినవాడు,
ముత్యాలుగాక మిగిలిన స్వచ్ఛ రత్నములను గలిగినవాడు,
చంద్రుని కాంతిచేత ఉల్లాసముద్ర కలవాడు అయిన సముద్రుడు
నదీపతి నీ యెదుట దీనుడుకాడు. -  అని భావం.

సీమాసీ మానభూమి: ఫణిబలవలనోద్భావిరాజీ విరాజీ
హారీ హారీతవద్భి: పరిసరసరణావ స్తమాలై స్తమాలై:
దేవాదేవా ప్తరక్ష: కృతభవ భవతోగ్రేన దీనో నదీనో
ముక్తాముక్తాచ్ఛరత్న: సితరుచిరుచిరోల్లాసముద్ర: సముద్ర:

ఈ శ్లోకంలో
1వ పాదంలో మొదట సీమా, మధ్యలో బల, చివరలో విరాజీ
2వ పాదంలో మొదట హారీ, మధ్యలో సర, చివరలో స్తమాలై
3వ పాదంలో మొదట దేవా, మధ్యలో భవ, చివరలో నదీనో
4వ పాదం మొదట ముక్తా, మధ్యలో రుచి, చివరలో సముద్ర:
అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి. మొదట, మధ్యన రెండ
అక్షరముల గుచ్ఛము రాగా చివరలో మూడక్షరముల గుచ్ఛము
ఆవృత్తమైనది. అలాగే చిత్రకావ్యాలలో - కును, - కును
భేదములేదు అన్నవిషయం గమనించాలి మొదటి పాదం మధ్యలో
బల అన్నది ఆవృత్తిలో వల అని ఆవృత్తమైనది ఇది ఇందులో సరైనదే.

దానిని గని దాగని దని దాగ దనిరిగా


దానిని గని దాగని దని దాగ దనిరిగా



సాహితీమిత్రులారా!

సమస్య-
దానిని గని దాగని దని దాగ దనిరిగా

పాలపర్తి శ్యమలానంద ప్రసాద్ గారి
పూరణ చూడండి

తా నేమోకాకి గూళుల
మానుగ పెంపొందు యిపుడు మధుర స్వరముల్
పూని వెలార్చెడు నల్లని
దానిని గని దాగని దని దాగ దనిరిగా


నల్లని కాకి గూటిలో గుడ్లు పెట్టడం కోకిలకు అలవాటు.
కాకి పొదిగి పిల్లను పెంచడం దానికి రివాజు. అలానే జరిగిందట.
చివరికి మధురమైన స్వరంతో పాడటం మొదలెడితే కనుక్కోలేరా?
నల్లని దానిని గని దాగనిది అని దాగదు అనిరిగా - అనేది భావం.

దీన్ని మీరు పూరించ ప్రయత్నించండి పూరించి పంపండి.

Thursday, October 20, 2016

తం తుం తువం తుహ తుమం


తం తుం తువం తుహ తుమం


సాహితీమిత్రులారా!



సంస్కృతంలో భట్టీకావ్యం అని ఒక వ్యాకరణ గ్రంథం ఉంది.
దానికే రావణవధ అనే పేరూ ఉంది. అంటే రావణవధ అనే కావ్యం
ఒక వైపు వ్యాకరణం తెలిపేదిగా మరో వైపు ఈ కావ్యాన్ని రచించాడు.
అలాగే ప్రాకృతంలో హేమచంద్రాచార్యుడు "కుమారపాలచరితం" అనే
కావ్యాన్ని రచించాడు ఇందులో కుమారపాలుని కథ
చేబుతూనే వ్యాకరణం చెప్పడం జరిగింది.
అందువల్ల ఇలాంటివాటిని ద్వ్యాశ్రయకావ్యాలు అంటారు.
వీటినే మనం తెలుగులో ద్వ్యర్థి కావ్యాలు అంటాము.
వీటికి రాఘవపాండవీయం,
హరిశ్చంద్రనలోపాఖ్యానం లాంటివి చెప్పవచ్చు.

ఇపుడు ప్రాకృతభాషలోని కుమారపాలచరితం
నుండి ఒక గాథ చూద్దాం.

దీనిలోని ఐదవసర్గలో వర్షాహేమంతశిశిర
ఋతువులను వర్ణించాడు ఆసందర్భంలో
కవి యుష్మచ్చబ్ద(మధ్యమపురుష) -
ఏకవచన బహువచనరూపాలను ఉపయోగించి
ఈ గాథను రాశాడు.

తం తుం తువం తుహ తుమం అణేహ నవాఇం నీవకుసుమాఇం,
భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝాసణందేహ

ఓ సఖులారా! నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ(తం తుం తువం
తుహ తుమం - ఈ ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమ ఏకవచనరూపాలు)
క్రొత్త నీపపుష్పాలు తీసుకొనిరండి.
సఖులారా మీరూ, మీరూ, మీరూ, మీరూ, మీరూ
(భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝ - అనే
ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమా బహువచనాలు) అసనపుష్పాలను
తీసుకొనిరండి - అని భావం

(నీపపుష్పము - కడిమి(కదంబ)చెట్టుపూలు,
అనసపుష్పాలు - వాడని పుష్పములు)

రవి కాననిచో కవిగాంచునే గదా!


రవి కాననిచో కవిగాంచునే గదా!



సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలకు ఇచ్చిన సమస్య
రవి కాననిచో కవిగాంచునే గదా

భట్టుమూర్తి పూరణ-

ఆ రవి వీరభద్రు చరణాహతిడుల్లిన బోసి నోటికిన్
నేరడు రామలింగకవి నేరిచెబో మన ముక్కు తిమ్మన
క్రూరపదాహతిన్ దెగిన కొక్కెర పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియించె నౌర! రవి కాననిచో కవి గాంచునే గదా!



దక్షయజ్ఞంలో పూష- అనే సూర్యుని వీరభద్రుడు 
దంతాలుడేట్లు కొట్టాడు. అదే విధంగా రామలింగకవికి 
తిమ్మనగారు దంతమూడేవిధంగా క్రూరమైన తనపాదంతో తన్నాడు 
దానితో తెనాలి రామలింగకవికి దుప్పికొమ్ము పన్నైనదని, 
రవి చూడకపోయినా కవి చూడగలడని పూరణలోని భావం.

ఇదే సమస్యకు మన
కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పూరణ-
దీనిలో మరో చమత్కారం చోటు చేసికొంది గమనించండి.

పట్టణ మేగె నొక్క కవి పండుగకున్ కవి భార్య స్నానమై
కట్టెను పట్టుచీర - రవికన్ ధరియించుచునుండ తల్పులన్
నెట్టె కవీంద్రు డా రవికనే కవి కన్ను గప్పె కాంత ఔ
నట్టుల మోమునందు రవికా ననిచో కవి కాంచునే గదా!

ఇందులో కవి చమత్కారం చూడండి
రవికాననిచో - అనే దాన్ని విరిచి ప్రయోగించాడు
రవిక + ఆననిచో అని చమత్కారంగా విరిచాడు.

మీరు కూడ సరిక్రొత్త ప్రయోగంతో
సమస్యను పూరించి పంపించగలరు.

Wednesday, October 19, 2016

శరధి శ్శరధిర్ యస్య


శరధి శ్శరధిర్ యస్య 


సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర శ్లోకం చూడండి.

శరధి శ్శరధిర్ యస్య సరథ: కురర శ్శర:
బభూవ నశ్శం భవతాం కుర్యాత్ భరతలక్ష్మణ:

యస్య - ఏ శివునకు, శరధి: - సముద్రం,
శధి: - అమ్ముల పొది, బభూవ - ఆయెనో,
కు: - భూమి, రథ - రథమైందో, స: - విష్ణువు,
శర: - బాణమాయెనో, భ-రత - తారకాప్రియుడైన చంద్రుడు,
లక్ష్మణ: - లాంఛనముగల, స: - అట్టి,
అర:  - శివుడు, భవతాం - మీకు,
శం - శుభమును, కుర్యాత్ - చేయుగాక!
(శర అనే పదానికి బాణం, నీరు, రెల్లుగడ్డి అనే అర్థాలు ఉన్నాయి)

దీనిలో సశ్మం భరతలక్ష్మణ అనేవి
అపశబ్దాలుగా కనిపిస్తాయి
కాబట్టి ఇది అపశబ్దాభాసం
కూడా అవుతుంది.

స్తనములు లేని పురుషుడు


స్తనములు లేని పురుషుడు



సాహితీమిత్రులారా!


సమస్య-
స్తనములు లేని పురుషుడు సంస్తవనీయుడు కాడు ధాత్రిలో


ఇవ్వబడిన  పూరణ -
ఉత్పల సత్యనారాయణార్యులవారిది-

తెనుగున పద్యమున్ జదువు తీరున నించుకయేని రాగ ముం
డిన నది లెస్స కావ్యము పఠించిన యప్డు మనోజ్ఞభావనా
వినుతరసంబు తా ననుభవించుట లెస్స తదీయ వాక్సతీ
స్తనములు లేని పురుషుడు సంస్తవనీయుడు గాడు ధాత్రిలో.

దీనిలో కవిగారికి
సంగీత మపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం
ఏక మాపాత మధురం అన్యదాలోచ నామృతం - అనే
శ్లోక భావం మనసులో పెట్టుకొని పూరించినట్లు కనబడుతున్నది.

దీనికి కవివరులు విభిన్నంగాను సరికొత్తగాను పూరించి పంపగలరు.

Tuesday, October 18, 2016

రాజన్ కమలపత్రాక్ష!


రాజన్ కమలపత్రాక్ష!


సాహితీమిత్రులారా!


ఈ ప్రహేళికను చూడండి-

రాజన్! కమలపత్రాక్ష! త త్తే భవతు చాక్షయమ్
ఆసాదయతి యద్రూపం కరేణు: కరణై ర్వినా

నలినదలాక్ష! ఓ నరపతీ!
కరేణువు - (ఆడయేనుగు) కరచరణాది
అవయవములులేని ఏ రూపమును పొందించునో అట్టి అక్షయ
రూపమును పొందుము - అని సామాన్యార్థము.

దీనిలో కరణై: వినా కరేణు: - అనే చోట వ్యాకరణ నియమం ఉంది.
కరణై: వినా కరేణు: అంటే అర్థ కకారము అర్థరేఫము అర్థణకారము అంటే
ఆ పదంలోని హల్లులను తొలగించిన-
క్,అ,ర్,ఏ,ణ్,ఉ: - లనుండి క్,ర్,ణ్ -లను తీసివేసిన,
అ,ఏ,ఉ: -లు మిగులును.
అప్పుడు అ +ఏ = ఐ, ఆయ్(వృద్ధిసంధి ప్రకారం) అవుతుంది.
ఆయ్ + ఉ: = ఆయు:(ఏచోయవాయావ అనే సూత్ర ప్రకారం) అవుతుంది.
ఆయు: అంటే ఆయుస్సు - అనే రూపం ఏర్పడుతుంది.
ఆవిధంగా ఓ రాజా! నీకు ఆయుస్సు సమృద్ధిగా సంభవించుగాక
దీర్ఘయుష్మాన్ భవ! - అని దీవించినట్లవుతుంది.

అన్నను భర్తగా గొనిన అన్నలమిన్న



అన్నను భర్తగా గొనిన అన్నలమిన్న



సాహితీమిత్రులారా!

క్రింది సమస్యను చూచి పూరించ ప్రయత్నించండి
అన్నను భర్తగా గొనిన అన్నుల మిన్న అదృష్ట రాశియౌ

దీన్ని వసంతరావు వెంకటరావు గారు పూరించిన విధానం-

కన్నియ యోర్తు కూర్మి చెలికత్తె కనుంగొని పల్కె నిట్లు సం
పన్నుని పెండ్లి యాడ తలపం దగునే చెలి పెండ్లియాడు ప్రే
మ న్నిన్ను చూచునట్టి బుధమాన్యుడు నాదు సహోదరుండు మా
అన్నను భర్తగా గొనిన అన్నుల మిన్న అదృష్ట రాశియౌ

(ఒక కన్య తన స్నేహితురాలితో కేవలం డబ్బుగలవాడినే పెళ్ళి చేసుకోవాలని అనుకోకు
ధనం కన్న ప్రేమ ముఖ్యం మా అన్న ప్రేమతో నిన్ను చూసుకుంటాడు అతన్ని భర్తగా
పొందితే ఏ క్నయ అయినా అదృష్టవంతురాలు అవుతుంది - అని అన్నది)

Monday, October 17, 2016

హనుమంతుడు రాముని చంపాడా?


హనుమంతుడు రాముని చంపాడా?



సాహితీమిత్రులారా!




ఈ ప్రహేళిక చూడండి.
రామాయణంతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తున్నది.

హతో హనూమతా రామ: సీతా హర్ష ముపాగతా
రుదన్తి రాక్షసా స్సర్వే హాహా రామో హతోహత:

హనుమంతునిచే శ్రీరాముడు చంపబడగా, సీతాదేవి సంతసించింది.
అయ్యో రాముడు చంపబడ్డాడా అని రాక్షసులందరు ఏడుస్తున్నారు-
ఏమిటీ విపరీతం. విచారిస్తే నిజం నిగ్గుతేలుతుంది ఏం విచారించాలి
పదాలను విచారించాలి రహస్యం బట్టబయలు
ఇందులోని రహస్యాలు-
1. హనూమతారామ: - అనే దీన్ని
    హనూమతారామ: - హనూమతా+ ఆరామ:
    అని విడదీయాలి అపుడు
    హనుమంతుని చేత (హనూమతా), ఉద్యానవనము
    (లంకలోనిది) (ఆరామ:) దగ్ధమైనది, నాశనం చేయబడింది(హతో)
2. హా రామ: - హారామ: - హా  + ఆరామ: -
    అని విడదీసిన
    అయ్యో ఆ రామ:(ఉద్యానవనం)
    నాశనమైపోయిందికదా!
   - అని రాక్షసులు విచారించారు.
                                     ఇదీ అసలు విషయం

గౌరి భర్తముఖం చూడదు



గౌరి భర్తముఖం చూడదు



సాహితీమిత్రులారా!


కావ్యకంఠ గణపతిమునికి
నవద్వీప పండిత పరిషత్తులో
ఇచ్చిన సమస్య ఇది

వత్సర స్యైకదా గౌరీ పతి వక్త్రం నపశ్యతి
(సంత్సరాని కొకసారి గౌరి భర్త ముఖం చూడదు)

ఇది పతివ్రతా ధర్మానికి విరుద్ధం కదా
దాన్ని వారు ఇలా పూరించారు చూడండి-

భాద్రశుక్ల చతుర్థ్యాంతు చంద్రదర్శన శంకయా
వత్సర స్యైకదా గౌరీ పతి వక్త్రం నపశ్యతి


వినాయకచవితినాడు చంద్రదర్శనం దోషం కదా!
మరి చంద్రుడేమో శివుని తలపై ఉంటాడు
అందువలన గౌరీదేవి సంవత్సరానికొకసారి
శివుని ముఖం చూడదు - అని భావం.

ఎంత కమనీయమైన ఊహతో పూరించాడో కదా!

Sunday, October 16, 2016

కలువలరాజు బావ సతి గన్నకుమారుని.....


కలువలరాజు బావ సతి గన్నకుమారుని.....



సాహితీమిత్రులారా!



కొన్ని పద్యాలు శ్లోకాలు విన్నపుడు అంతగా అర్థంకాకపోయినా
తెలుసుకుంటే చాల ఆశ్చర్యజనకంగా ఉంటాయి.
వాటిలోని అర్థం గూఢంగా ఉండటం వల్ల వాటిని
గూఢచిత్రం అంటాము. అలాంటి ఒక పద్యం చూడండి-

కలువలరాజు బావ లతి గన్నకుమారుని యన్న మన్మనిన్
దొలచిన వాని కార్యములు తూకొనచేసిన వాని తండ్రినిన్
జిలికిన వాని వైరి పతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్
వలచిన వాహనంబు వలె వచ్చెడినింటికి జూడవే చెలీ!

కలువలరాజు - చంద్రుడు,
ఆయన బావ - విష్ణువు,
ఆయన సతి - లక్ష్మిదేవి,
ఆమె కన్నకుమారుడు - మన్మథుడు,
అతని అన్న - బ్రహ్మ,
ఆయన మనుమడు - రావణాసురుడు,
అతని చంపినవాడు - రాముడు,
రాముని పనులు తూకొని తేసినవాడు - హనుమంతుడు,
హనుమంతిని తండ్రి - వాయుదేవుడు,
వాయువును చిలికినవాడు - శేషుడు,
శేషుని వైరి - గరుత్మంతుడు,
ఆయన ప్రభువు - కృష్ణుడు,
ఆయన చెల్లెలు - సుభద్ర,
ఆమెకు బావ - భీముడు,
అతని అన్న - ధర్మరాజు,
ఆయన తండ్రి - యమధర్మరాజు,
ఆయనకు ఇష్టమైన వాహనం - దున్నపోతు.
ఓ చెలీ దున్నపోతు వలె ఇంటికి వస్తున్నాడు చూడు అని
ఒకావిడ ఎవరినో పరిహసిస్తూ చెప్పిన మాటలు ఈ పద్యం.

చంద్రశేఖరోప్యర్క శేఖర:


చంద్రశేఖరోప్యర్క శేఖర:


సాహితీమిత్రులారా!



ఈ సమస్యను చూడండి.
చంద్రశేఖరోప్యర్క శేఖర:
చంద్రశేఖరుడైనను  సూర్యశేఖరుడు - అనే
ఈ సమస్య సంస్కృతభాషలోని
ఈ సమస్య పూరణ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు

నిరజనాటవీ మధ్య దుస్థితే
భిన్నభిత్తికే కంటకాంచితే
శూన్య దేవతామందిరే భవత్
చంద్రశేఖరోప్యర్క శేఖర:

మనుషులులేని అడవిలో దేవాలయం శిథిలమైంది.
గోడలు పడిపోయాయి. ముళ్ళు, జిల్లేళ్ళు మొలిచాయి.
శివలింగం పక్కన జిల్లేడు చెట్టు మొలిచి లింగంపైన ఆక్రమించుకొంది.
దానితో చంద్రశేఖరుడు కూడా అర్కశేఖరుడైనాడు.

ఇక్కడ శర్మగారు అర్క శబ్దానికి సూర్యుడు
అనికాక జిల్లేడు అనే అర్థం తీసుకొని చమత్కరించాడు

Saturday, October 15, 2016

చెంత చేరగదవే మోమెత్తి మాటాడవే!


చెంత చేరగదవే మోమెత్తి మాటాడవే!


సాహితీమిత్రులారా!



గడియారం వేంకటశేషశాస్త్రి గారు,
దుర్భాక రాజశేఖర శతావధానిగారు
 అవధానాలు చేసే కాలంలో ఒక అవధానంలో
వీరికి ఇచ్చిన సమస్య ఇది.

సమస్య-
ముది పూబోడిరొ చెంత చేరగదవే మోమెత్తి మాటాడవే
ఓ ముసలమ్మా శృంగార క్రీడకు రమ్మనే భావం వచ్చేలా
ఉన్న దాన్ని అందంగా మలచిన తీరు చూడండి.

అదయుండై చెలరేగి మన్మథుడు పుష్పాస్త్రమ్ములన్ జిమ్మెడున్
గదియున్ వచ్చి సమీర భూతము కడున్ గారింప జొచ్చెన్ ముదా
స్పదుడే చంద్రుడు శత్రుడయ్యెగరమున్ బాధాకరం బయ్యె గౌ
ముది, పూబోడిరొ! చెంత జేరగదవే మోమెత్తి మాటాడవే!

ముది - ముసలి అనే అర్థం తొలగే విధంగా
ముది - కి ముందు 'కౌ' చేర్చడం వల్ల
కౌముది అయి వెన్నెల అనే అర్థంగా మారింది.

మదనుడు పూలబాణావను విడుస్తున్నాడు.
మలయమారుతం హింసిస్తున్నది.
చంద్రుడు శత్రుత్వం వహించాడు.
కౌముది(వెన్నెల) బాధకరంగా ఉంది.
ఓపూవు వంటి శరీరంకలదానా!
చెంతచేరు - మాట్లాడు - అని ప్రియుడు
- ప్రియురాలిని బ్రతిమలాడే దృశ్యంగా మారింది పూరణ.

ఆసక్తి కలవారు మీరును
దీనికి పూరణ వ్రాసి పంపగలరు

దీని భావమేమి తిరుమలేశ?


దీని భావమేమి తిరుమలేశ?


సాహితీమిత్రులారా!


ఇది ప్రహేళికలలోని ఒక రకానికి చెందినది.
ఈ పద్యం చూడండి.

వంగతోటనుండు వరిమళ్ళలోనుండు
జొన్నచేలనుండు చోద్యముగను
తలుపుమూలనుండు తలమీఁదనుండును
దీని భావమేమి తిరుమలేశ?

ఈ పద్యం కడు చిత్రమైనది గమనింపుము.
వంగతోటలో నుండేదీ, వరిమళ్ళలోనుండేదీ,
జొన్నచేలలోనుండేదీ, తలుపుమూల నుండేదీ
ఏదో అది దీని సమాధానం.

ఏమిటది ?
             ఏమిటదీ?
                      ఏమిటదీ ?
                                  - అని ఏంత ఆలోచించినా తెలియనిది.
ఏమీలేదు మనభ్రమతప్ప మరేంలేదు.
ఇక్కడ విరామం లేకుండా చెప్పడంలో ప్రశ్న పుడుతోంది.
ఇప్పుడు చూడండి.

వంగ తోటనుండును, 
వరి మళ్ళలోనుండును
జొన్న చేలనుండును 
(చోద్యముగను)
తలుపు మూలనుండును, 
తల మీఁదనుండును
ఏముంది మరి ఎక్కడున్నవి
అక్కడే ఉన్నాయి.

Friday, October 14, 2016

తోచు నడంగు వెండియును దోచు నడంగు మెరింగు చాడ్పునన్


తోచు నడంగు వెండియును దోచు నడంగు మెరింగు చాడ్పునన్



సాహితీమిత్రులారా!


ఈ సమస్యను పూరించండి-
తోచు నడంగు వెండియును దోచు నడంగు మెరింగు చాడ్పునన్

దీనికి రెండు పూరణలు
పూర్వం కొందరు పూరించినవి చూడండి
మీకు నచ్చినవిధంగా ఉత్పలమాలలో పూరించండి.

ఇది రామాయణ పరంగా చేసిన పూరణ- 
సీతకోసం మాయలేడి వెంట
రాముడు పడినప్పుడు, అది రాముని
కంటిముందు కనిపిస్తూ,
మాయమవుతూ, మెరుపులాగా
మెరుస్తూ మరుగవుతూ
ఉన్న ఘట్టం తీసుకొని చేసిన పూరణ -

1. చూచితి భూతలేంద్ర యొక చోద్య మృగం బని సీప పల్కగా
    లేచి శరాసనాంబకము లీలగ జేకొని వ్తేయబోవ మా
    రీచు డరణ్యవాటిని జరించెడు మాయలు రాము కంటికిన్
    తోచు నడంగు... వెండియును తోచునడంగు మెరుంగుచాడ్పుననా

ఇది భారతపరంగా చేసిన పూరణ-
అర్జునుడు గెలిచిన రుద్రుని
జటాజూటంలోని చంద్రుడు చూపిన
విలాసాన్ని కవి ఇలా వర్ణించి
పూరించాడు ఆ పూరణ-

పాచిక లాడి సోలి పిదపన్ గురు రాజును గెల్చి మిక్కిలిన్
యాచక కోట్ల కిచ్చి బహు యాగములన్ నెరవేర్చినట్టి యా
కీచకవైరి సోదరుడు గెల్చిన రుద్రుజడన్ శశాంకుడున్
దోచు నడంగు వెండి యును దోచు నడంగు మెరుంగు చాడ్పునన్

భీకరమగు తమము చంద్రబిబము గప్పెన్


భీకరమగు తమము చంద్రబిబము గప్పెన్


సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర పద్యం చూడండి-

ఆకాంతామణి యుపరతి
కాకాశం బొణికె తార లట్లట్లాడెన్
జోకైన గిరులు కదలెను
భీకరమగు తమము చంద్రబింబము గప్పెన్
(నానార్థగాంభీర్యచమత్కారిక పుట. 14)

ఇందులో ఆ కాంతామణి ఉపరతికి
ఆకాశం వణికి తారలు అట్లట్లాడినవట.
ఇంకా నాజూకైన గిరులు కదిలినాయట.
ఏకంగా చంద్రబిబానికి భయంకరమైన
చీకటి కప్పేసిందట- ఏమిటిది................

మనం క్రితంలో ఇలాంటిదే
ఒక శ్లోకం చూశాం అలాంటిదే ఇదీనూ.
మొన్నెప్పుడో చూచింది
ఇంకా ఏమి గుర్తు........ అంటారా

సరే

ఉపరతి సమయంలో కదలికల వల్ల
ఆకాశం అంటే ఇక్కడ శూన్యం అని కాదు
ఉండీలేని నడుము కదిలిందట.
మరి తారకలంటే చేతివ్రేళ్ళకుండే
గోళ్ళు అట్లట్లాడినవట.
గిరులెక్కడైనా జైకనవి ఉంటాయా అంటే
మనకవిత్వంలో ఉంటాయి అవే కుచములు,
చంద్రబింబానికి  భీకరమైన తమము గప్పడం
అంటే చంద్రబింబంలాటి ముఖం దానికి కొప్పుఊడి
ముఖమంతా నల్లని కురులు చీకట్లలా కమ్ముకున్నాయట - ఇది భావం

మొన్నమనం చూచిన శ్లోకం-

వియతి విలోలతి జలదస్ స్ఖలతి విధు శ్చలతి కూజతి కపోత:
నిష్పతతి తారకాతతి రాందోలతి వీచి రమరవాహిన్యా:

దీని అర్థం మొన్నటి తారీఖున చూడగలరు.

Thursday, October 13, 2016

స్తనవతీ నవతీర్థ తను స్తను:


స్తనవతీ నవతీర్థ తను స్తను:



సాహితీమిత్రులారా!


యమకాలంకారమున అవ్యపేత
యమకమునందు వివిధములైన
వాటిని తెలుసుకొనుచున్నాముకదా
ఇపుడు మధ్యాంతయమకం తెలుసుకుందాం.

అవ్యపేత చతుష్పాదయమకమునందు
పాదమధ్యమునందు, పాదాంతమునందు
రెండు చోట్ల యమకము వచ్చుటను
మధ్యాంత యమకం అనేపేరుతో పిలుస్తున్నాము.
దానికి ఉదాహరణ-

ఉదయితే దయితే జఘనం ఘనం
స్తనవతీ నవతీర్థ తను స్తను:
సుమనసా మనసా సదృశౌ దృశౌ
ద్యుకురు మే కురు మేభిముఖం ముఖమ్
                                                (సరస్వతీకంఠాభరణమ్ - 4-97)

ఓ ప్రియురాలా అభ్యుదయసంపన్నమయిన
నీ జఘనము ఘనము, నీ తనువు స్తనవతీ
నవతీర్థముల చేత పలుచబడినది.
నీ చూపులు పువ్వుతోను మనస్సుతోను సాటియైనవి.
స్వర్లోక భూలోక సౌంద్యావధీ నీముఖమును నాకు
అభిముఖము గావింపుము - అని భావం.

దయితే దయితేఘనం ఘనం
స్తనవతీ నవతీర్థ తను స్తను:
సుమనసా మనసాదృశౌ దృశౌ
ద్యుకురు మే కురు మేభిముఖం ముఖమ్

ఇందులో ప్రతిపాదంలో మూడు వర్ణములు మధ్యలోను,
రెండు వర్ణములు చివరలోను ఆవృత్తమైనవి.
మొదటిపాదం మొదట దయితే, చివర ఘనం,
రెండవపాదం మొదట నవతీ. చివర తను:,
మూడవ పాదం మొదట మనసా, చివర దృశౌ,
నాలుగవపాదం మొదట కురుమే, చివర ముఖం
అనే వర్ణసముదాయాలు ఆవృత్తమైనవి
వర్ణములలోనే ఏకత్వం కాని అర్థంలో ఏకత్వం లేదు.
కావున ఇది అవ్యపేత చతుష్పాదయమకంలో మధ్యాంత
యమకమునకు ఉదాహరణగా సరిపోవుచున్నది.

పతిని పరిత్యజించి ఒక భామ పతివ్రత యయ్యె నిమ్ముగన్


పతిని పరిత్యజించి ఒక భామ పతివ్రత యయ్యె నిమ్ముగన్




సాహితీమిత్రులారా!

సమస్యా పూరణ ఒక అద్భుతమైన సమయస్ఫూర్తి దాయకమైన
ప్రక్రియ మరియు మేధోసంపత్తికి నిదర్శనం.
ఇది చిత్రకవిత్వంలో ఒకభాగం.

సమస్య -
పతిని త్యజించి యొక భామ పతివ్రత యయ్యె నిమ్ముగన్


పూరణ-

మతి విభవంబు లుట్టిపడ మాకు సమస్య నొసంగినారు భా
రతి ధరిత్రిలోన నలరాజు మతిందలపోసి యెవ్వ రే
గతి వచియించినన్  వినక కమ్ర గుణాఢ్య తనంత పూర్వదిక్
పతిని త్యజించి యొక భామ పతివ్రత యయ్యె నిమ్ముగన్

పూరించినవారు -

ఈ సమస్య విజయవాడ రేడియో కేంద్రంలో
విజయవాడ వాస్తవ్యులు శ్రీకావూరి పూర్ణచంద్రరావుగారు
ఆహూతుల సమక్షంలో చేసిన ఆవధానంలో పూరించారు.
దమయంతి నలుని తన భర్తగా భావించి ఇంద్రుని వదలిన
ఘట్టాన్ని తీసుకొని పూరించాడు.

ఆసక్తి గలవారు మరొక రకంగా పూరించండి.

Wednesday, October 12, 2016

సీతను పెండ్లాడి శివుడు శిశువున్ గనియెన్


సీతను పెండ్లాడి శివుడు శిశువున్ గనియెన్



సాహితీమిత్రులారా!





సమస్యాపూరణ బహుచమత్కారంగా చేయువారు
మన కవులు అనేకురు అలాంటివారిలో
"గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ"
నేటి తెలంగాణరాష్ట్రంలోని మెదక్ జిల్లా
దుబ్బాక మండలంలోని పోతారెడ్డి పేట వాస్తవ్యులు.

సమస్య - సీతను పెండ్లాడి శివుడు శిశువున్ గనియెన్

పూరణ -

చైతన్యానంద సుధా
ప్రోతస్విని జాలువారు  చొప్పున సుమన
ప్రీతిగ హిమవ త్సుత నత
సీ తను పెండ్లాడి శివుడు శిశువున్ గనియెన్


ఈ పూరణలో శివుడు పెండ్లాడినది సీతను కాదు
హిమవత్సుత అంటే పార్వతి
ఆమె ఎలాంటిదంటే అతసీ తనున్ -
అతసీ అంటే అవిసె పుష్పము వంటి
సుకుమారమైన తనువుగల పార్వతిని
పెండ్లాడి శివుడు శిశువును కనియెను.
ఎంత చమత్కారంగా పూరించాడు.

ఆసక్తిగల కవులు మరొక రకంగా పూరించగలరు

వియతి విలోలతి జలదస్ స్ఖలతి


వియతి విలోలతి జలదస్ స్ఖలతి



సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం  గమనించండి-

వియతి విలోలతి జలదస్ స్ఖలతి విధు శ్చలతి కూజతి కపోత:
నిష్పతతి తారకాతతి రాందోలతి వీచి రమరవాహిన్యా:


వియతి - ఆకసము, విలోలతి- అసియాడుచుండగా,
జలద: - మేఘము, స్ఖలతి - జారిపడుచున్నది,
విధు: చలతి - చంద్రుడు కదలుచున్నాడు,
కపోత: కూజతి - పావురము కూయుచున్నది,
తారకాతతి: నిష్పతతి - నక్షత్రపుంజము రాలుచున్నది,
అమరవాహిన్యా: వీచి: ఆందోలతి - చదలేటి(ఆకాశగంగ)
కెరటాలు ఊగుచున్నవి.

ఆకాశం కంపించేప్పుడు మేఘాలు జారిపడుచున్నవి.
చంద్రబింబం కదలుతూంది. పావురము కూయుచున్నది.
నక్షత్ర పుంజము రాలి పడుతూంది.
ఆకాశగంగా తరంగావళి ఊగులాడుచున్నవి

ఇవేమిటి సరైనవేనా వీటి అర్థమేమై ఉండును అని
బాగా ఆలోచించిస్తే
ఈ విధంగా అర్థమవుతుంది.

ఆకాశం అంటే ఇక్కడ నడుము
మేఘం అంటే ఇక్కడ కొప్పు
చందమామ కదలడమంటే ముఖం కదలటం
పావురము కూయడం అంటే రతి కూజితము
నక్షత్రపుంజము రాలిపడటమంటే చెమట
(ముత్యాలు పెరిగి)బిందువులు పట్టి రాలడం,
ఆకాశగంగాతరంగములు ఊగడం అంటే వళులు ఊగడం
ఇవన్నీ నాయిక ఉపరతిని సూచించేవి అని అర్థం.

Tuesday, October 11, 2016

సమం సమంతా దపగోపురం పురం


సమం సమంతా దపగోపురం పురం


సాహితీమిత్రులారా!


యమకాలంకారంలో ఆద్యంత
యమకం గురించి ఇక్కడ చూద్దాం-
శ్లోకంలోని పాదం మొదటిలోను, చివరలలోను
వర్ణసముదాయము ఆవృత్తమైన అది
ఆద్యంత యమకము.
కాని ఇందులో వ్యవధానంలేకుండా ఉన్న
అవ్యపేత ఆద్యంతయమకమౌతుంది.
వ్యవధానంతో ఆవృత్తి జరిగిన వ్యపేత
ఆద్యంతయమకంగా చెప్పబడుతున్నది.

ఈ ఉదాహరణ గమనించండి-

ద్రుతం ద్రుతం వహ్నిసమాగతం గతం
మహీ మహీనద్యుతిరోచితం చితమ్
సమం సమంతా దపగోపురం పురం
పరై: పరై రప్యనిరాకృతం కృతమ్
                                                          (భట్టికావ్యం)

అగ్నితోడి సంబంధము వల్ల కరగింపబడినది.
వేగంగా భూమియందు వ్యాపించినది.
అంతటను సమముగా నిబిడముగా అధికమైన
కాంతి శోభతో స్థాపంపబడినది. శత్రువులచేత
పురద్వారములు తెరువబడినవి. శ్రేష్ఠులచేత
సైతము నిరాకారముగా చేయబడలేదు - అని భావం.


ద్రుతం ద్రుతం వహ్నిసమాగతం గతం
మహీ మహీనద్యుతిరోచితం చితమ్
సమం సమంతా దపగోపురం పురం
పరై: పరై రప్యనిరాకృతం కృతమ్

ఈ శ్లోకం
మొదటి పాదం మొదటిలో ద్రుతం, చివరలో గతం,
రెండవపాదం మొదటిలో మహీ, చివరలో చితం,
మూడవపాదం మొదటిలో సమం, చివరలో పురం,
నాలుగవపాదం మొదటిలో పరై , చివరలో కృతం  -
అని వర్ణసమూహాలు ఆవృత్తమైనవి.
అదీ వ్యవధానంలేకుండా కావున
ఇది అవ్యపేతయమకమున
ఆద్యంత యమకమునకు ఉదాహరణ
అని చెప్పవచ్చును.

సా మమారిధమనీ నిధానినీ


సా మమారిధమనీ నిధానినీ



సాహితీమిత్రులారా!


సంగీతంలో స,రి,గ,మ,ప,ద,ని -
అని 7 స్వరాక్షరాలున్నాయి కదా!
సంగీతంలో వాటికి రాగానుకూలంగా
ఈ అక్షరాలను దీర్ఘాలుగా, హ్రస్వాలుగా
కూడా వాడుతారు సంగీతం తెలిసిన వారికి
దానిలోని ఆనందం అర్థమౌతుంది.
కాని ఈ అక్షరాలను ఉపయోగించి
సరస్వతీ కంఠాభరణంలో ఒక శ్లోకం ఉంది



సా మమారిధమనీ నిధానినీ
సామధామ ధనిధామ సాధినీ
మానినీ సగరిమా పపాపపా
సాపగా సమసమాగమాసమా
                                        (సరస్వతీకంఠాభరణమ్- 4-265)

నదీతుల్యమైన క్షణిక సమాగమాగమము కలదియు,
సాటిలేనిదియు, నవనిధులను కలుగజేయునదియు,
కాంతికి నెలవైనదియు, ధనికులకు
తేజస్సును సంతరించునదియు, అర్చనయోగ్యయు,
గౌరవవంతురాలును, పాపరహితులను పాలించునదియు
నైన లక్ష్మిదేవి నాకు అరిధమని(శత్రుసంహారిణి)యగుగాక!
- అని భావం.


(సా = స + అ;  విష్ణువుతో కూడినది  - లక్ష్మిదేవి)


అలాగే ఈ స్వరాలను ఉపయోగించి పద్యం
వ్రాశాడొకకవి చూడండి ఆ పద్యం -

మా పని మీ పని గాదా
పాపమ మా పాపగారి పని నీ పనిగా
నీ పని దాపని పనిగద
పాపని పని మాని దాని పని గానిమ్మా

పైశ్లోకమునందు పద్యమునందు
సప్తస్వాలను మాత్రమే
ఉపయోగించి వ్రాయటం విశేషం..