Wednesday, August 31, 2016

మధ్యే రీతి ధరం శరమ్


మధ్యే రీతి ధరం శరమ్


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకాన్ని చూచి అర్థం తెలుసుకొన ప్రయత్నించండి.

సమరే హేమరేఖాంకమ్ బాణం ముంచతి రాఘవే
న రావణోపి ముముచే మధ్యే రీతి ధరం శరమ్

యుద్ధంలో రాముడు సువర్ణ రేఖాంకితమైన
బాణాన్ని వదలగా (ప్రయోగించగా)
ఆ రావణుడూ మధ్యలో
ఇత్తడి బాణమును విడిచెను - అని భావం

ఇది సరైనదేనా?  రాముడు బాణం వదలితే రావణుడు బాణం వదిలాడు
ఇదేమి విశేషం ఇది కాదు
బాగా ఆలోచించాలి.
దీనిలోని గమ్మత్తు ఏమిటంటే
మధ్యే రీతి ధరం శరమ్ అంటే రీ కారము మధ్యలోగల శరం అంటే శరీరం -
శరీరం - లో
రీ మధ్యలో ఉంది
అంటే రావణుడు శరీరం వదిలాడు - ఇది సరైన భావం.

దేవవరా తుమ్హీచ గురుదేవ


దేవవరా తుమ్హీచ గురుదేవ


సాహితీమిత్రులారా!

వృషాధిపశతకంలోని
భాషాచిత్ర పద్యం చూడండి.
ఇది మహారాష్ట్రభాషా పదాలతో
ఉత్పలమాల పద్యం కూర్చబడినది.

దేవవరా తుమ్హీచ గురుదేవ మ్హణూనుతరీ తుమ్హీచ గో
సావతురాతుమ్హీచ తుమసాచప్రసాద అమీకృపాకరా
యీవగదా యటంచు నుతించెద నిన్నును నారెభాష దే
వా వినుతార్యలీల బసవా బసవా బసవా వృషాధిపా
                                                                  (వృషాధిప శతకం - 58)

దేవవరాతుమ్హీచ - నీవే దేవోత్తముడవు,
గురుదేవ - గురుదేవుడవని,
మ్హణూనుతరీతుమ్హీచ - నిన్ను చెప్పెదను,
గోసావతురాతుమ్హీచ - నీవు వృభేశ్వరుడవు,
తుమసాచ ప్రసాద - నీయొక్క అనుగ్రహముతో,
అమీకృపాకరా - నన్ను దయజూచువాడవు,
ఈవగదా - నీవేకదా, అటంచు - అంటూ,
నుతియించెద - కీర్తంచెదను, నిన్నును,
ఆరెభాషన్ - మహారాష్ట్రభాషలో, దేవా - ప్రభువా,
వినుత +ఆర్యలీల - పొగడబడిన పూజ్యవిలాసము కలవాడా!

Tuesday, August 30, 2016

కీర్తి హసించు దిక్కులన్


కీర్తి హసించు దిక్కులన్


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.
ఇందులో 8 చోట్ల లింగని అనే పదం వచ్చింది
ఈ పద్యం ఎవరో కవి
తెనాలిరామకృష్ణునిపై చెప్పినది.

లింగనిషిద్ధు కల్వల చెలింగని, మేచక కంధరున్ త్రిశూ
లింగని, సంగతాళి లవలింగని, కర్ధమ దూషితన్ మృణా
లింగని, కృష్ణచేలుని హలింగని, నీలకచన్ విధాతృనా
లింగని, రామలింగకవిలింగని కీర్తి హసించు దిక్కులన్


రామలింగ కవిలింగని కీర్తికి ఏ కొంచెముకూడ మాలిన్యము లేదు - అని చెబుతూ
కవి ఈవిధంగా ఉపమానాలను త్రోసిరాజనుచున్నాడు.
చంద్రునిలో మచ్చ, శివుని కంఠము నలుపు,
లవలీ పుష్పము తెలుపు ఐనా దానిపై
తుమ్మెదలు నలుపు,
తెల్లకలువకు బురద -
బలరామునికి నీలాంబరము,
సరస్వతికి నల్లని కబరి
వీటిని చూచి తెనాలిరామలింగని కీర్తి నవ్వుతున్నది.

హేమాలంకృతవర్జతా


హేమాలంకృతవర్జతా


సాహితీమిత్రులారా!

ఈ ప్రహేలికను చూడండి

సువర్ణాలంకృత నారీహేమాలంకృతవర్జితా
సా నారీ విధవా జాతా గృహే రోదితి తత్పత్పతి:


సువర్ణాలంకృతురాలైనను బంగారు నగలు లేనిది
మరియు ఆ స్త్రీ విధవ కాని ఇంటిలో ఆమె భర్త , ఏడ్చెడివాడు.
ఇందులో సరైన అర్థము ఏమైనా ఉన్నదా లేదుకదా!
దీన్ని ఈ క్రింది విధంగా అర్థంతీసుకోవాలి

సువర్ణాలంకృతా - హేమాలంకృత వర్జితా = బంగారు అలంకారములు
లేకున్నను తన శరీర తళతళాత్కాచే ప్రకాశించుచున్నది,
సా నారీ విధవా జాతా = కాని ఆమె అనేక విటులు కలది.
కావున, గృహే తత్పతి: రోదతి = ఆమె భర్త తన భార్య చెడునడవడి చూచి
బజారులో తలఎత్తికొనలేక ఇంటిలోనే పడి ఏడ్చుచున్నాడు - అని భావం.

Monday, August 29, 2016

గురుమూర్తే రమ్యమూర్తే (గోమూత్రికా బంధం)


గురుమూర్తే రమ్యమూర్తే (గోమూత్రికా బంధం)


సాహితీమిత్రులారా!

చిత్రకవిత్వంలో బంధకవిత్వం ఒక భాగం
దాన్నే ఆకారచిత్రం అని కూడ అంటాము.
ఈ రోజు మనం గోమూత్రికా బంధం గురించి తెలుసుకుందాం

గోమూత్రికా అంటే గోవు మూత్రము పోసేప్పుడు బొట్లు బొట్లుగా
పడటం గమనించిన కవులు దీన్ని ఆవిధంగా కవిత్వం అల్లారని కొందరు.
దీనికి ఆధ్యాత్మికంగా వేరే భావనలున్నాయని కొందరు భావిస్తున్నారు.
దీనికి ఉదాహరణ శ్లోకం చూడండి.

గురుమూర్తే రమ్యమూర్తే వరకీర్తే జయాధికం
చారుస్ఫూర్తే నమ్యపూర్తే దూరజోర్తే మయాధికం
                                                       (చిత్రబంధమాలికా - 29)
ఈ బంధ శ్లోకంలో మొదటి వరుస అంటే
పూర్వార్థం రెండవ వరుస అంటే ఉత్తరార్థం
లోని ప్రతి రెండవ అక్షరం ఒకటిగా ఉండాలి.
దీనిలో చివరి మూడు అక్షరాలుఒకటిగానే ఉన్నాయి.
ఈ క్రింది విధంగా...........

గురుమూర్తేమ్యమూర్తేకీర్తే యాధికం
చారుస్ఫూర్తేమ్యపూర్తే దూజోర్తే యాధికం

క్రింది  చిత్రాన్ని గమనించండి.


సూర్యకాంతమ్మేది? సురలోకవంద్య


సూర్యకాంతమ్మేది? సురలోకవంద్య


సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం చూడండి వీలైతే విప్పండి

సూర్యకాంతమ్మేది? సురలోకవంద్య
సూర్యక్రాంతమెయ్యెది? చక్రధారి
సూక్ష్మమనఁగనేమి? లక్ష్మిమనోహరా
స్థూలమ్మనఁగనేమి? నీలగాత్ర
నక్తంకరుఁడెవండు? ముక్తిలోకప్రదా
నక్తంచరుఁడెవండు? నాగశయన
నంజెయనఁగనేమి? నళినీదళేక్షణా
పుంజయనఁగనేమి? పుణ్యచరిత
యిహమనఁగ నర్థమేమియౌ? విహగవాహ
పరమనఁగ నర్థమేమియౌ?  పరమపురుష
మెప్పుగా నర్థభేదాలు చెప్పవలయు
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!
(శ్రీవేంకటేశ సారస్వత వినోదిని పుట. 80)

చూడండిమరి
ఇందులో ఒకదానికి ఒకదానికి అర్థభేదమేమిటో?
చెప్పమంటున్నాడు కవి.

1. సూర్యకాంతము - ఎండకు కరిగే శిల
2. సూర్యక్రాంతము - ప్రొద్దుతిరుగుడుపువ్వు
3. సూక్ష్మము - సన్నము
4. స్థూలము- లావు
5. నక్తంచరుఁడు - రాత్రి సంచరించేవాడు- రాక్షసుడు
6. నక్తంకరుఁడు - రాత్రిని కలిగించువాఁడు - చంద్రుఁడు
7. నంజె - నీటిచేఁబండుభూమి
8. పుంజె - వానకు ఫలించు భూమి
9. ఇహము - ఈలోకము
10. పరము - పరలోకము

Sunday, August 28, 2016

పరమపురుషా నా దైవమా!


పరమపురుషా నా దైవమా!


సాహితీమిత్రులారా!


ఈ పద్యం వృషాధిపశతకం లోనిది ఇది
తమిళ తెలుగు భాషలతో బసవేశ్వరుని స్తుతించినది ఈ పద్యం
దీన్ని భాషాచిత్రంగా చెప్పవచ్చు.
తమిళ-తెలుగు పదాలతో చంపకమాల పద్యం కూర్చటం
దీనిలోని ప్రత్యేకత.

పరమనె యన్నెయాండవనె పన్నగతానె యనాథనాథనే
పెరియవనే పుళిందవనె పేరుయానె పిరానె యప్పనే
తరిమురియయ్యనే యనుచు ద్రావిడభాష నుతింతు మన్మనో
వర కరణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
                                                                        (వృషాధిప శతకము - 56)

పరమనె = పరమపురుషా, అన్నెయాండవనె = నా దైవమా,
పన్నగ తానె = నాగ(భూషణ)ధరా,
అనాథనాథనే = దిక్కులేని వారికి దిక్కైన వాడా,
పెరియవనే = పెద్దయ్యా,
పుళిందవనె = పవిత్రము చేయువాడా,
పేరుడయానె = ప్రఖ్యాతుడా,
పిరానె = దేవా, అప్పనే = తండ్రీ,
తరిమురియయ్యనే = ప్రియమైన తండ్రీ,
అనుచు, ద్రావిడభాష నుతింతు = తమిళంభాషలో  పొగడెదను,
మనమనోవర = నా మనోనాథుడా!,
కరుణావిధేయ = కరుణకు స్థానమైనవాడా!

కంఠముగాని కంఠమేది?


కంఠముగాని కంఠమేది?


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యం చూడండి.

వనముగానటువంటి వనమేదియగుచుండు?
శత్రువుగానట్టి శత్రువెవఁడు?
కరముగానటువంటి కరమేదియగుచుండు?
కారముగానట్టి కారమేది?
కలముగానటువంటి కలమేదియగుచుండు?
దేహమ్ముగానట్టి దేహమేది?
నరుఁడుగానటువంటి నరుఁడెవ్వఁడగుచుండు?
మానమ్ముగానట్టి మానమేది?
ధర్మమచ్చముగాగానట్టి ధర్మమేది?
కంఠమచ్చముగానట్టి కంఠమేది?
మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!

                                    (శ్రీవేంకటేశ సారస్వత వినోదిని పుట. 114)

పద్యం చూచూరుకదా విడుపుకు ఆలోచన మొదలు పెట్టండి.

1. వనముగాని వనము - ఉపవనము(తోఁట)
2. శత్రువుగాని శత్రువు - అజాతశత్రువు(ధర్మరాజు)
3. కరముగానికరము - కనికరము (దయ)
4. కారముగానికారము - ధిక్కారము (తిరస్కారము)
5. కలముగానికలము - కలకలము (పెద్దధ్వని)
6. దేహముగానిదేహము - సందేహము (సంశయము)
7. నరుఁడుగానినరుఁడు - ఔశీనరుఁడు (శిబిచక్రవర్తి)
8. మానముగానిమానము - సమానము(తుల్యము)
9. ధర్మముగానిధర్మము - కాలధర్మము (మరణము)
10. కంఠముగానికంఠము - క్షీరకంఠము (శిశువు)

Saturday, August 27, 2016

నల్లముత్యములు ఎవరైనా చూచారా?


నల్లముత్యములు ఎవరైనా చూచారా?


సాహితీమిత్రులారా!

ఔరంగజేబు ఒకరోజు సభలోనివారితో
విచారగ్రస్తుడై విషయాన్ని తెలిపాడు.
తన కుమార్తె జేబున్నీసా నిరంతర సాహిత్య పఠనం కలిగి ఉంది
ఆమెను ఎలాగైనా దాన్నుండి మాన్పించాలి- అని తెలిపాడు.
దానికి కొందరు "మహారాజా! చింతించవద్దు ఆమెకు క్లిష్టమైన
సమస్యను ఒకదాన్ని ఇచ్చి పూరించమనండి
అది ఆమె పూరిస్తే ఆమెను నిరోధించవద్దు.
ఒకవేళ పూరించనిచో సాహిత్యసేవ మానివేయవలెనని చెప్పండి"- అని చెప్పారు.
దానికి ఔరంగజేబు సమ్మతించి ఆమెను పిలిపించి
 అదేవిధంగా ప్రశించాడు.
ఆ ప్రశ్న-

దురేఅబలక్ కసే కమ్ దీద్ మౌజూద్
(నల్లని ముత్యములు ఎవడైనా ఎక్కడైనా చూచి ఉండెనా)

దానికి తండ్రి ఎత్తుగడ అగ్థమైన
జేబున్నీసా సమాధానం -
వజుజ్ అశకే బతానే సుర్మా అలూద్
(కజ్జం కలుషితములైన యువతి కన్నీటి
బిందువులు తప్ప ఇతరము చూడలేదు)

దీనికి ఔరంగజేబు ఇంకేమీ చెప్పలేక పోయాడు. 

శుండాలాస్యషడాస్యసేవ్యచరణ



శుండాలాస్యషడాస్యసేవ్యచరణ

సాహితీమిత్రులారా!



ఈ పద్యం చూడండి ఎంతటి క్లిష్టమైనదో
ఇలాంటివి గూఢచిత్రాలలో చేరుతాయి.

శుండాలేడ్ద్విడనీలకాండవినుతో వీట్కాండకాండో వృషే
ట్కాండ: కాండజకాండకాండధరజిద్భేట్ఖండచూడామణి:
శుండాలాస్యషడాస్యసేవ్యచరణ స్సౌఖ్యం శివ స్సాదరం
దద్యాదద్యసకాండకాండదగళత్విట్కుండలీట్కుండలీ
                                              (చాటుధారాసమత్కారసార పుట.58)

గజాసురునకు శత్రువైనవాడు,
తెలిగుర్రముగల ఇంద్రునిచే స్తుతించబడినవాడు,
విహంగరాజవాహనుడైన విష్ణువును బాణముగా గలవాడు,
వృషభరాజవాహనమైనవాడు,
పద్మాలను బాణములుగా ధరించు
మన్మథుని జయించినవాడు,
నక్షత్రపతియైన చంద్రునియొక్క రేఖయే
శిరోభూషణముగా గలవాడు,
వినాయక కుమారస్వాములచే సేవింపదగిన
పాదములు గలవాడు,
నీటితోకూడిన మేఘమువంటి
కంఠకాంతిగలవాడు,
సర్పరాజైన వాసుకియే
కుండలముగాగల శివుడు
ఆదరముతో ఈ కలికాలమున
సుఖమును ఒసగుగాత - అని భావం.

Friday, August 26, 2016

కాలేకిలాలౌకికైక


కాలేకిలాలౌకికైక


సాహితీమిత్రులారా!

ఒక హల్లును ఉపయోగించి కూర్చిన శ్లోకాలను ఏకాక్షరి అని,
రెండు హల్లులు ఉపయోగించి కూర్చిన దాన్ని ద్వ్యక్షరి అంటారు.
ఇపుడు రెండు హల్లుల శ్లోకాన్ని చూద్దాం.
దీనిలో "-" అనే రెండు హల్లులను ఉపయోగించారు
గమనించండి.
ఇందులో హల్లులు రెండే
వాటికి అచ్చులు ఏవైనా ఉండవచ్చు.

కాలేకిలాలౌకికైక
కోలకాలాలకేలల
కలికాకోలకల్లోలా
కులలోకాలిలాలికా

దీని అర్థం-
అలౌకిక = లోకవిలక్షణమైన, ఏక = ముఖ్యమైన,
కోల = ఆదివరాహస్వామియొక్క, కాలాలకే = భార్యవైన,
ఓ లక్ష్మీ,(కాల = నల్లని, అలకే = ముంగురుగలదానా!)
కలి = కలికాలమనే, కాకోల = విషముయొక్క,
కల్లోల = అభివృద్ధిచే, ఆకుల = బాధపడుచున్న,
లోక + అలి = ప్రజాసమూహమును, లాలికా = రక్షించుచున్న,
(త్వమ్) నీవు, కాలేకిల = అపాయసమయమున మాత్రము,
లల = సాక్షాత్కరించి ప్రకాశింపుము.

రేయిఁబుష్పించె నలిప్రియమ్ము


రేయిఁబుష్పించె నలిప్రియమ్ము


సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యాన్ని
పొడిచి విడుపు చెప్పండి

అంగనా ప్రియము సీతాంగనకిడె నీడ
     నవలీల నెగిరె గృహప్రియమ్ము
దాడిమ ప్రియమది దండిమాటలు నేర్చె
      స్లర్ణముంగూడెఁ గుజప్రియమ్ము
జ్యోత్స్నాప్రియము చంద్రుఁజూచి నోర్విచ్చెను
      రాజాజ్ఞ నడపె ఖరప్రియమ్ము
విప్ర ప్రియమ్ము పవిత్ర దండమునిచ్చె
      రేయిఁబుష్పించె నలిప్రియమ్ము
సుప్రసన్నతంబూచె విటప్రియమ్ము
గృహియలందెను మేన హరిప్రియమ్ము
ప్రియములివి యెవ్వియో వివరింపవలయు
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!
(శ్రీ వేంకటేశ సారస్వత వినోదిని - పుట. 200)

ఇందులోని విడుపు ప్రియములైనవేవో చెప్పడమే
ఆలోచించండి.

1. అంగనాప్రియము - స్త్రీ ప్రియమగు అశోక వృక్షము
2. గృహప్రియము - గృహమునకు ప్రియమైనది పిచ్చుక
3. కుజప్రియము - అంగాకునికి ప్రియమైనది పగడము
4. దాడిమ ప్రియము - దానిమ్మలపై వర్తించునది చిలుక
5. జ్యోత్స్నాప్రియము - వెన్నెను గ్రోలు చకోరపక్షి
6. ఖర ప్రియము - చిదిపిరాలుదిను పావురము
7. విప్ర ప్రియము - విప్రునికి ఇష్టమైనది మోదుగుచెట్టు
8. అలిప్రియము - భ్రమర ప్రియమైనది ఎర్రకలువ
9. విటప్రియము - విటులకు ప్రియమైనది మల్లెచెట్టు
10. హరిప్రియము - ఇంద్రునికి ఇష్టమైనది గంధము

Thursday, August 25, 2016

యదువంశ నాయకుండు


యదువంశ నాయకుండు


సాహితీమిత్రులారా!

ఓగిరాల జగన్నాథకవి రచిత
సుమనోమనోభిరంజనములో
శ్రీకృష్ణుని గురించి చెప్పిన  పద్యం చూడండి.

శ్రీరుక్మిణీ మనస్సారసమిత్రుండు
      మిత్రుండు మన్మథశాత్రవునకు
నసమాన సౌందర్య హసితేక్షుధర్ముండు
       ధర్ముండు ఖలకంసధరణిపతికిఁ
జరణకంజాతదాససనత్కుమారుండు
       మారుండు దానవవారమునకుఁ
బరిధానభా పరిభావిత చంద్రుండు
       చంద్రుండువృజినాంబుజాతములకు
నిజపదసరోజభజమాన రజత ధరణి
ధరశరణ, పద్మభవ, పురందర ముఖాభి
లామరవ్రాత మానస కామిత ఫల
దాయకుండొప్పు యదువంశ నాయకుండు
                                    (సుమనోమనోభిరంజనము 1-73)


యదువంశ నాయకుడైన శ్రీకృష్ణుడు ఎలా ప్రకాశిస్తున్నాడంటే ఈ విధంగా-
రుక్మిణీదేవి మనస్సనే పద్మానికి సూర్యు(మిత్రు)నిలా
మన్మథుని శత్రువైన ఈశ్వరునికి చెలికాడు(మిత్రుని)గా
అసమాన సౌందర్యంచే మన్మథు(ఇక్షుధర్ము)నిలా
దుష్టుడైన కంసభూపాలునికి యము(ధర్ము)నిలా
పాదపద్మా(చరణ కంజాతము)లకు సనత్కుమారుడు దాసుడుగా
రాక్షససమూహా(వారమునకు)నికి  సంహారు(మారుండు)నిగా
పట్టు వస్త్రముయొక్క కాంతి(భా)చేత తిరస్కరింపబడిన(పరిభావిత)
చంద్రుడుగలవాడుగా
(చంద్రుని కాంతిని మించిన పట్టువస్త్రము కలవాడని)
పాపాలనే పద్మాలకు(అంబుజాతముకు) చంద్రునిగా
(పద్మాలకు చంద్రడు విరోధి కావున పాపాలనే పద్మాలకు విరోధి)
తన పాదపద్మాలను సేవించే శివుడు(రజత ధరణి శరణుడు),
 బ్రహ్మ(పద్మభవుడు), ఇంద్రుడు(పురందరుడు) మొదలుగాగల
దేవతాసమూహములకు మనస్సులోని కోరికలను(కామితఫల)
ఇచ్చువాడుగా ఒప్పుచున్నాడు.


ఇందులో విడిసినపదం మరలా గ్రహించడం వల్ల ముక్తపదగ్రస్త అలంకారము గాను
విభిన్న అర్థముకలిగి, ఒకే విధమైన రూపముగల వర్ణసమూహము ఆవృత్తికావడం వల్ల యమకాలంకారము అగుచున్నది.

(మిత్రుడు - సూర్యుడు, చెలికాడు,
 ధర్మము - విల్లును ధరించినవాడు - ధర్ముడు
 ధర్ముడు - (చెరకు విల్లు ధరించినవాడు) మన్మథుడు, యముడు
 సనత్కుమారుడు, మారుడు - సంహారుడు)

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు


శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు 
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు



కనికరమూనక కపట మిడితి


కనికరమూనక కపట మిడితి

సాహితీమిత్రులారా!


యడవల్లి వేంకట కృష్ణశాస్త్రిగారి -
హరిశ్చంద్రోదయము నందలి
సంభాషణ చిత్రము చూడండి.

విష్ణుమూర్తికి స్త్రీరూపమున ఉన్న చంద్రునికి
మధ్య సంభాషణ
సీసపద్యంలో.
విష్ణువు - జాబిల్లినని పల్కి జాగుసేయగనీకు
                       నో భిల్ల కన్యకా యుచిత మగునె
స్త్రీ -       ఉచితమా ఇటు వల్క నుధధి కన్యావర
                      నిజము దెల్పిన నెనరు లేదె
వి-       నెనరుంచుట గాదె గన వచ్చినను నెద
                      కనికరమూనక కపట మిడితి
స్త్రీ -      కపట నటుండవె గావె నీవెప్పుడు
                      విపరీతములు బల్క వినుట లేదె
వి.-      వినక నిట వచ్చినాడనె వెలది మిన్న
స్త్రీ. -     మిన్న తనముకు నీ కన్న నెన్న గలరె
వి.-      గలిగి యుండిన నీవిట్లు పలుకుదువటె
స్త్రీ.-      బలికితినె సుంత విపరీత భావమిచట.
                                      (4 ఆశ్వాసము పుట. 70)

అని వాదోపవాదము గావించిరి.
 చివరకు విష్ణువు మాయచే భిల్లాంగనను వశపరచుకొనెను
వారిరువురి ప్రేమ ఫలితంగా చంద్రునకు బాలుడుదయించెను.
ఆ బాలుని సంతానములేక తపమాచరించు త్రిశంకునకు ఇచ్చివేసిరి.
చంద్రునకు శాపవిమోచనమైనది.
విష్ణువును వెదకుచూ లక్ష్మిరాగా విష్ణువు వెళ్ళెను.


కుచఫలమది చిల్క గుమినిజేర్చు



కుచఫలమది చిల్క గుమినిజేర్చు


సాహితీమిత్రులారా!


ఈ పొడుపుపద్యం పొడవండి.

శ్రీ ఫలముండును శివమందిరమునందు
           సంద్రమందు దొరుకు బిందుఫలము
గ్రాహి ఫలములోవఁ గవులు గంతులువేయు
           త్రయినేత్రమగును శిర: ఫలమ్ము
గుచ్ఛఫలము నుర్గునిచ్చు కాయల నిచ్చు
           కాకఫలము చేఁదు కాయల నిడు
జంతుఫలము హోమ సమిధల నొనఁగూర్చుఁ
           గుచఫలమది చిల్క గుమినిజేర్చు
యవఫలము పండియెండు నీ భువనమందు
గూఢ ఫలమిఁక ముండ్లతోఁగూడి యుండు
ఫలములకు నర్థములు చెప్పవలయుదేవ
దేవ శ్రీవేంకటేశ పద్మావతీశ
                                (శ్రీవేంకటేశ సారస్వత వినోదిని పుట. 199)


మిత్రులారా!  ఇందులోని ఫలములకు అర్థం చెప్పడమే
ఇందులోని విడుపు
ఆలోచించండి.

1. శ్రీ ఫలము - శ్రీఫలములను ఇచ్చేది మారేడుచెట్టు
2. బిందుఫలము - నీటిబిందువు వంటి ముత్యము
3. గ్రాహిఫలము - అజీర్ణ ఫలములనిచ్చేది వెలగచెట్టు
4. శిర: ఫలము - తలవంటి కాయలను ఇచ్చేది కొబ్బరిచెట్టు
5. గుచ్ఛఫలము - గుత్తులుగా కాయలు కాసేది
                            (నురుగు కాయలనిచ్చేది)  కుంకుడుచెట్టు
6. కాకఫలము - కాకప్రియ ఫలములనిచ్చేది వేపచెట్టు
7. జంతుఫలము - క్రిమి గర్భఫలములనిచ్చేది అత్తిచెట్టు
8. కుచఫలము - కుచరూప ఫలములను ఇచ్చేది దానిమ్మచెట్టు
9. యవఫలము - బార్లివంటి ధాన్యమునిచ్చేది వెదురుగుమి
10. గూఢఫలము - ముండ్ల మరుగున పండ్లుబండేది రేగుచెట్టు

Wednesday, August 24, 2016

నాకుమారుడవె యౌట


నాకుమారుడవె యౌట


సాహితీమిత్రులారా!


చేమకూర వేంకటకవి సారంగధర చరిత్రలో
చిత్రాంగి తన మేడకు వచ్చిన సారంగధరునికి
కామవశంతో అధికంగా ఉపచారములు చేయగా
సారంగధరుని ప్రశ్న - చిత్రాంగి సమాధానము
ఈ పద్యంలోనే ఎంత చమత్కారంగా సంభాషణ చిత్రంగా
చెప్పాడో చూడండి.

జనవరసూను డందులకు చాలప్రియంబు తొలంక, అన్నెలం
తను గని "నీ, కుమారుడ" గదా యిటు తక్కిన వారికింబలెన్
జననిరొ! నాకు నింత యుపచారము సేయగ నేటికమ్మ నే
డనుపుడు "నాకు, మారుడవె యౌటను" చేయుదు నంచు పల్కుచున్

సారంగధరుడు - అమ్మా! నీ కుమారుడను కదా!  
                         నాకింత ఉపచారాలెందుకమ్మా!
చిత్రాంగి -           నాకు మారుడవు 
                        (నాకు మన్మథుడవగుటచే చేయుచున్నాను)

నీకుమారుడ - నాకు మారుడ - దీనిలో నీ, నా-ల తేడాలే కాక
కుమారుడ,  కు - మారుడ అనే
ఒక చిన్న విరుపుతో ఎంత చమత్కారమో కదా!

లతాతన్విగళము ధర వర్ణింపన్


లతాతన్విగళము ధర వర్ణింపన్


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.

నెఱికురు లగుఁ గంధరములు
ధరములకన్నన్ గుచములు తగ సుందరముల్
దరములసిరి బిత్తరములు
దరమె లతాతన్విగళము ధర వర్ణింపన్
                                  (హంసవింశతి 3-73)
ఆ స్త్రీ
నెఱికురులు - కంధరములు = మేఘములు,
కుచములు -
ధరములకన్నన్ = పర్వతములకంటె, సుందరములు,
గళము = కంఠము - దరముల = శంఖములయొక్క,
సిరి = శోభావైభవలక్ష్మియొక్క, బిత్తరములు = శృంగారచేష్టలు.

అలాంటి కచ - కుచములను వర్ణింప తరమా? - అని భావం.

ఇందులో కంధరము లో కం - తొలగించిన ధరములు అగును
సుందరము లో సుం - తొలగించిన దరము అగును
కావున ఇది చ్యుతాక్ష చిత్రము అనవచ్చును.

Tuesday, August 23, 2016

కుచంబులాన తమకించుట బాల్యముగాదె


కుచంబులాన తమకించుట బాల్యముగాదె


సాహితీమిత్రులారా!


సారంగధర చరిత్రలో చేమకూర వేంకటకవి
సంభాషణచిత్రం చూడండి.
చిత్రాంగి తన ఇంటికి వచ్చిన సారంగధరునికి
మేనకావిశ్వామిత్రుల చిత్రపటం చూపిస్తూ
ఈ విధంగా చెప్పింది.
దానికి సారంగధరుడు ఇచ్చిన సమాధానం
రెండు ఈ పద్యంలోనే ఉన్నాయి గమనించండి.

"అల్లన గాధిరాజసుతు డర్మిలి మేనక ముద్దొనర్చ రా
గిల్లి కుచంబులాన తమకించుట కంటివె? రాకుమార!"  "ఔ
నల్ల నగాధిరాజసుతు డర్మిలి మేనక ముద్దొనర్ప రా
గిల్లి కుచంబులాన తమకించుట బాల్యముగాదె మానినీ!"


చిత్రాంగి-    "అల్లన గాధిరాజసుతు డర్మిలి మేనక ముద్దొనర్చ రా
                   గిల్లి కుచంబులాన తమకించుట కంటివె? రాకుమార!"
                   (విశ్వామిత్రుడు మేనకాకుచ గ్రహణముచేయు
                     ఈ సన్నివేశము చూచితివా!)

సారంగధరుడు-   "ఔనల్ల నగాధిరాజసుతు డర్మిలి మేనక ముద్దొనర్ప రా
                             గిల్లి కుచంబులాన తమకించుట బాల్యముగాదె మానినీ!"
                             (మైనాకుడు మేనకాదేవి కుమారుడు ముద్దుపెట్టుకొన బోవుచుండగా
                               ఆకలిగొన్న బాలుడు పాలు త్రాగటానికి కుచగ్రహణముచేయుట బాల్యచేష్టకదా!)

ఈ పద్యంలో కవి చమత్కారం
అల్లన గాధిరాజసుతు అనే దాన్ని
మొదటిలో - చేర్చి
ఔనల్ల నగాధిరాజసుతు - గా పదాన్ని విరిచి
గాధిరాజసుతుడు - విశ్వామిత్రుడు
విశ్వామిత్రునికి మేనక ప్రియురాలు
నగాధిరాజసుతుడు - మైనాకుడు
మైనాకునికి మేనక తల్లి -
ఎంత చమత్కారం కలిగించాడు  కవి.

హరి కమ లాబ్జ చక్ర నివహంబు


హరి కమ లాబ్జ చక్ర నివహంబు


సాహితీమిత్రులారా!

అయ్యలరాజు నారాయణామాత్యకవి 
రచిత హంసవింశతిలోని
ఈ పద్యం చూడండి.

తరుణులకౌను లాకృతులు తళ్కు మొగంబులు చన్గవల్ సువా
క్సరణులు పాణులున్ మెడలు సారనితంబమహోన్నత తత్వముల్
దరళవిలోసనంబులు పదంబులు నెన్నొసలున్ ముణుంగులున్ 
హరి కమ లాబ్జ చక్ర నివహంబునయంబు రయంబున న్నగున్
                                                                                 (హంసవింశతి 5-276)


ఈ పద్యం మొదటి మూడు పాదాలలో
ఉపమేయాలను చివరిపాదంలో
ఉపమానాలను  చెప్పినాడుకవి.
ఉపమానాలను చూడండి-
హరి (నానార్థాలు)- 1. సింహము 2. చిలుక 3. జింక
కమలాబ్జ - కమలా + అబ్జ, కమల + అబ్జ - అని విరిచి అర్థం తీసుకోవాలి.
కమలా - లక్ష్మిదేవి, కమల - పద్మము
అబ్జ (నానార్థాలు) - 1.చంద్రుడు 2.శంఖము
చక్ర (నానార్థాలు) - 1. భూచక్రము 2. చక్రవాకపక్షి 3. పాముచుట్ట

1. ఈ తరుణుల నడుములు(కౌనులు) సింహము(హరి)ని
    ఆకృతులు లక్ష్మిదేవిని(కమలను), మొగములు చంద్రుని(అబ్జ)ని
     చన్గవలు చక్రవాకపక్షులను పరిహాసము చేయును.
2. ఈ కాంతల మాటలు(వాక్సరణులు) చిల్కలను(హరిని),
    చేతులు(పాణులు) కమలములను,
    మెడలు  శంఖము(అబ్జ)లను, నితంబములు(పిఱుదులు)
     గుండ్రనిభూభాగము(చక్ర)లను గేలిచేయును.
3. ఆ తరళ చంచలములైన కన్నులు జింక(హరి)లను,
     పాదములు కమలములను, నెన్నొసలు చంద్రుని(అబ్జ)ని,
      జడచుట్టలు (ముణుంగులు) పాముచుట్టల(చక్రనివహంబు)ను
     గేలిచేయును.
     క్లిష్టమైన దీన్ని గూఢచిత్రంగా చెప్పవచ్చు.

Monday, August 22, 2016

కంధర కమలారి కార్ముక కంజాత


కంధర కమలారి కార్ముక కంజాత


సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి ప్రతి పాదము
ఒక ప్రత్యేకతతో కనిపిస్తుంది.
గమనించండి.

కంధర మలారి కార్ముక కంజాత
         కాంచన కంబుల గర్వమణఁచి
ద్మరాగ టీర ద్మారి న్నగ 
       ద్మ ల్లవముల బాగునొంచి
జ్ర ల్లీద్వయ సుమతీధర వా
       ణారి వారణ సుధాళిఁగేరి
దళికా కాహళ చ్ఛప లకంఠ
       నక ర్పూరసంఘముల మీఱి
(కచ ముఖ భ్రూ నయన నాసికా గ -ళోష్ఠ
పరిమళ కపోల రోమాళి పద కర - రద
బాహు కుచ మధ్య గతి నితంబాంక జంఘ
పద ర వాంగ స్మితము లొప్పు భామినులకు)
                                                    (హంసవింశతి  5-275)
ఈ పద్యంలో సీసపద్యంలోని నాలుగు పాదాలలో ప్రతిపాదము
మొదట ఏ అక్షరంతో ప్రారంభమవుచున్నదో
పాదమంతా(దాదాపుగా)పాదములోని ప్రతిపదం
ఆ అక్షరంతోనే ప్రారంభమైనది.
దీన్ని ఆదివర్ణావృత్తిపాదము అంటారు.
ఇది శబ్దచిత్రంలోనిది.
ఇదేకాక ఈ పద్యంలో సీసపద్యంలో 24 ఉపమానాలుంటే
గీత పద్యంలో 24 ఉపమేయాలున్నాయి.
దీన్ని గురించి మరోచోట వివరంగా తెలుసుకుందాము.

మృదు పుష్పమిడు నీడ మిక్కుటముగ


మృదు పుష్పమిడు నీడ మిక్కుటముగ


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యాన్ని పొడచండి.

రక్త పుష్పమ్ముపై వ్రాలు కోకిల జాతి
           మేఘ పుష్పమురాలు మింటనుండి
చామర పుష్పమ్ము తేమనేలలఁదోఁచు
          గూఢ పుష్పముదాఁచుఁగుసుమములను
జలపుష్పమండజ జాతిలోఁ జేరును
          గుడ పుష్పమిడు మధు కుసుమములను
గగన పుష్పంబగు మృగతృష్ణలో నీరు
         మృదు పుష్పమిడు నీడ మిక్కుటముగ
గుహ్యపుష్పము పూఁతలేకుండఁ గాచు
సూచి పుష్పమ్ములో ఫణి గోచరించుఁ
బుష్పముల కర్థములు చెప్పబూనవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!
                                (శ్రీ వేంకటేశ సారస్వత వినోదిని - పు.193)

ఈ పద్యంలోని పుష్పాలకు అర్థాలు చెప్పడమే విడుపు.
ఆలోచించండి.

1. రక్తపుష్పము - ఎఱ్ఱని చిగుళ్ళ మామిడి చెట్టు
2. మేఘపుష్పము - మేఘమునుండి రాలు తుంపర
3. చామర పుష్పము - వింజామర వంటి ఱెల్లు
4. గూఢ పుష్పము - ఆకుల మరుగున పూలుండు పొగడచెట్టు
5. జలపుష్పము - నీటిలో పుష్పమువలె తోచు మత్స్యము(చేప)
6. గుడ పుష్పము - తీయని పూలుబూయు ఇప్పచెట్టు
7. గగన పుష్పము - హుళక్కి (ఏమీ లేదని అర్థము)
8. మృదుపుష్పము - మెత్తని పూలు బూయు దిరిసెన చెట్టు(శిరీష చెట్టు)
9. గుహ్యపుష్పము - పూలుకనబడక కాయు పనసచెట్టు
10. సూచీ పుష్పము - సూదులవంటి కొనలుగల మొగలి చెట్టు.

Sunday, August 21, 2016

మహిళా పున్నాగంబులు


మహిళా పున్నాగంబులు


సాహితీమిత్రులారా!

ఈ ద్విపాదిని చూడండి. ఏకపాది అంటే పద్యంలోని
అన్నిపాదములు ఒకేవిధంగా ఉండటం.
అలాకాక పద్యంలోని రెండుపాదాలు
ఒకలాగే ఉంటే ద్విపాది అవుతుంది.


మహిళా పున్నాగంబులు
రహి కుసుమ కదంబలీల గ్రాలగ నచ్చో
మహిళా పున్నాగంబులు
రహి కుసుమ కదంబ లీలలం గ్రాలెగడున్
                (నానార్థగాంభీర్యచమత్కారిక పుట. 36)

మహిళా - ప్రేంకనపు తీగె ఉన్న పున్నాగములు,
పొన్నచెట్లును, పుష్పసమూహముల యొక్క విలాసాలచే ఒప్పుచుండగా,
మహిళా, నాయికయున్నూ - పురుషశ్రేష్ఠుడైన నాయకుడును,
కుసుమకదంబలీల - మన్మథలీలను అనగా
సురతం మిక్కిలిగా ప్రకాశించెను - అని భావం.

కాపిదీప్రప్రదీపికా


కాపిదీప్రప్రదీపికా


సాహితీమిత్రులారా!

పద్యంలోని పాదము సగము విలోమముగా రాసిన
ఆ పాదము పైనుండి క్రిందికి చదివినా
క్రిందినుండి పైకి చదివినా ఒకేలా ఉంటుంది.
దీన్ని అర్థపాదానులోమ ప్రతిలోమము లేదా పాదభ్రమకము అంటాము.
పాదభ్రమకాలు కొన్ని చూచి ఉన్నాము ఇప్పుడు మరొకటి చూడండి.

కాళీనానననాళీకా
రాధితాహిహితాధిరా
మాయాసామమసాయామా
కాపిదీప్రప్రదీపికా

కాళీ + పార్వతి యొక్క, ఇన - భర్తయిన శంకరుని,
ఆనననాళీక = వదనారవిందముచే, ఆరాధితా = స్తుతింపబడినది.
హిత = భక్తుల యొక్క, అది = మనోవ్యధను, రా = తొలగించునట్టి,
యామా = ఏ లక్ష్మిదావి, సా = (భక్తులయందు) దయయొక్క,
ఆయామా = దీర్ఘతకలదై ఒప్పుచున్నదో, సా = అట్టి లక్ష్మిదేవి,
 మమ = నాకు, కాపి = అనిర్వచనీయమైన,
దీప్రప్రదీపుకా = ఎప్పుడు ప్రకాశించు దీపిక అగుగాక!


Saturday, August 20, 2016

కేశవుడని పేరు ఎవరికి?


కేశవుడని పేరు ఎవరికి?


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి.
ఇది హరివంశములోనిది.

క ఇతి బ్రహ్మణో నామ
ఈ శోహం సర్వదేహినాం
ఆవాం తవాంగే సంభూతౌ
తస్మాత్ కేశవనామవాన్

: అంటే బ్రహ్మ,
బ్రహ్మ, సర్వప్రాణులకు ఈశ్వరుడనైన నేను
నీ శరీరమున పుట్టితిమి.
కావున నీవు కేశవుడను పేరుగాంచితివి అని
శివుడు విష్ణువును స్తుతించును.
(క: + ఈశవ = కేశవ)

సిద్ధిర్భవతు మే సదా! (పేరడీ)


సిద్ధిర్భవతు మే సదా! (పేరడీ)


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి. ఇది సరస్వతీదేవి ప్రార్థనలోనిది.

సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి
సిద్ధిర్భవతు మే సదా!

దీనికి జరుక్ శాస్త్రి పేరడీ చూడండి.

చోటాహజ్రీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
కాఫీ పానం కరిష్యామి
సిద్ధిర్భవతు మే సదా! 

Friday, August 19, 2016

ఏల తలమీద వెంట్రుకలిన్ని మొలుచు? (పేరడీ పద్యం)


ఏల తలమీద వెంట్రుకలిన్ని మొలుచు? (పేరడీ పద్యం)


సాహితీమిత్రులారా!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఈపద్యం చూడండి.
ఇది అంతా ప్రశ్నతోటే ఉంది.

సౌరభములేల చిమ్ము బుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు జందమామ?
ఏల సలిలంబు పాఱు? గాడ్పేల విసురు?
ఏల నాహృదయంబు ప్రేమించు నిన్ను?

దీనికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు -
సందియం(పేరడి) చూడండి.

జఠర రసమేల స్రవియించు జఠరగ్రంధి?
అడవిలో యేల నివసించు నడవిపంది?
ఏల పిచ్చికుక్క కరచు? కాకేల యరచు?
ఏల తలమీద వెట్రుకలిన్ని మొలుచు?
         (ఆంధ్రజ్యోతి వారపత్రిక 8-4-1983)

అతడేమి సరసుడా? భోజుడయా!


అతడేమి సరసుడా?  భోజుడయా!


సాహితీమిత్రులారా!

అడిదము సూరకవి తండ్రి బాలభాస్కరుడు 
శుద్ధాంధ్ర రామాయణ కర్త వారి స్వగ్రామము రేగ.
తండ్రి తరువాత సూరన ఆ ఊరువిడచి
విజయనగరం దగ్గర చీపురుపల్లి చేరాడు.
మరొక కవితో మాట్లాడేప్పుడు ఇద్దరి సంభాషణ ద్వారా
ఆ విశేషాలు తెలుస్తున్నాయి.


ఊ రెయ్యది? చీపురుపలి
పేరో? సూరకవి, యింటి పే? రడిదమువార్
మీరాజు? విజయరామ మ
హారాజ తడేమి సరసుడా? భోజుడయా!


కవి - ఊ రెయ్యది?
సూరన- చీపురుపలి
కవి- పేరో ?
సూరన - సూరకవి
కవి - ఇంటి పేర్?
సూరన - అడిదము వార్
కవి - మీరాజు?
సూరన- విజయరామ మహారాజ్
కవి - అతడేమి సరసుడా?
సూరన - భోజుడయా!

Thursday, August 18, 2016

సలలితముగ దీని నెరుగు సరసుడు కలడే?


సలలితముగ దీని నెరుగు సరసుడు కలడే?


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి

శిల వృక్షలతల బుట్టిన
చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్
తలవాకిట రమియింతురు
సలలితముగ దీని నెరుగు సరసుడు కలడే?

శిల వృక్ష లతలకు పుట్టిన ముగ్గురు చెలువలను
తలవాకిటిలో రమిస్తారట - దీని అర్థం తెలిసిన
సరసుడు ఉన్నాడా? -  అంటున్నాడు కవి.

శిల,వృక్ష,లత లకు చెలువలు పుట్టడమేమిటి?
తలవాకిట రమించడమేమిటి?
దీన్ని బాగా ఆలోచిస్తే..............

శిలనుంచి పుట్టింది - సున్నం,
వృక్షంనుంచి పుట్టింది - పోక(వక్క),
లతనుండి పుట్టింది - ఆకు(తమలపాకు)
ఈ మూడిటిని తలవాకిట అంటే నోట్లో వేసి కలిపిన(రమించిన)
రాగరసం ఉదయిస్తుంది.

ఇలాంటిదే మనం మొన్న ఒక పద్యం తెలుసుకొని ఉన్నాము
ఇపుడు మరొకసారి దాన్నికూడ చూద్దాం.

వండిగ నెండిన దొక్కటి
వండక మరి పచ్చిదొకటి వడి కాలినదిన్
తిండికి రుచియై యుండును
మండలమున జనులకెల్ల మహిలో వినుమా!

వండగనెండినదొక్కటి - వక్కలు
వండక మరి పచ్చిదొకటి - ఆకులు
వడి కావినదిన్ - బాగా కాలినది - సున్నం
తిండికి రుచియై యుండును - తాంబూలము


  (వక్కలు, ఆకులు, సున్నము కలిసినది)

మహిళా మధ్యమున బోలు మానవనాథా!


మహిళా మధ్యమున బోలు మానవనాథా!


సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి.

అహహా! దాని పిరుందులు
రహి నెన్నగ దానిబోలు రభసంబెసగున్
మహిళా మధ్యం బెన్నగ
మహి ళా మధ్యమున బోలు మానవనాథా!
              (నానార్థగాంభీర్యచమత్కారిక - పుట. 36)

ఓ రాజా! హాశ్చర్యం ఆ స్త్రీ పిరుదులు సొగసుచేత
ఎన్నగా - ద - అనే అక్షరమును పోలును.
( హాశ్చర్యం ఆ స్త్రీ యొక్క పిరుదులు లెస్సగా
ఏనుగును పోలును అనగా
ఏనుగు కుంభస్థలం వలె ఉన్నవని)
ఆ స్త్రీ నడుము ఎన్నగా భూమియందు - ళా - అనే అక్షరం
యొక్క మధ్య ప్రదేశం వలె ఉన్నదని తాత్పర్యం.

Wednesday, August 17, 2016

శంకరుడు పడితే పార్వతికి సంతోషమా?


శంకరుడు పడితే పార్వతికి సంతోషమా?


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి.

శంకరం పతితం దృష్ట్వా పార్వతీ హర్ష నిర్భరా
రుదంతి పన్నగా స్సర్వే హా హా శంకర శంకర:
                                      (సుభాషితరత్నభాండారమ్ -4-12)
పడిపోయిన శంకరుని చూచి పార్వతి సంతసించును.
పాములన్నీ అయ్యో! శంకరా! అని విలపించును.
ఇదేమిటి? ఎంత విచిత్రంగావుంది.
ఇది ఇలా ఎందుకుందో ఆలోచించండి.
పార్వతి ఎక్కడైనా శంకరుడు పడితే ఆనందిస్తుందా?
బాగా ఆలోచిస్తే ఈ పదాలకు మరేదైనా అర్థం ఉందేమో? గమనించాలి.

ఇక్కడ శంకర అంటే చందనవృక్షము అనికూడ అర్థం ఉంది.
కాబట్టి పడింది శివుడుకాదు చందనవృక్షము
సంతోషపడింది పార్వతి అనే భిల్లయువతి అని తీసుకుంటే
పాములు చందనవృక్షం ఆశ్రయించి ఉండేవి
చెట్టుపడిపోగా అవి శంకరా! అయ్యో! మాకు నివాసం పోయిందే
అని రోదించాయి.
ఇది అసలైన అర్థం.

కన్యకు నారు కుచంబులు


కన్యకు నారు కుచంబులు


సాహితీమిత్రులారా!


ఈ పద్యం చూడండి.
కన్యకు ఆరు కుచాలేమిటి?

కన్యకు నారు కుచంబులు
కన్యకు మరి నేడుకండ్లు గణుతింపంగా
గన్యకు నాలుగుబొమలును 
కన్యకు బండ్రెండునడుము గలదా చెలికిన్
               (నానార్థగాంభీర్యచమత్కారిక - పుట.15)

ఈ పద్యంలో చాల వింతగా చెప్పడం జరిగింది.
కన్యకు ఎక్కడైనా 6 కుచాలు,7 కండ్లు, 4 బొమలు, ఉంటాయా?
అలాగే నడుము 12 అంటే అదేమైనా నడుముకొలతా? కాదు కదా!
మరేమై ఉంటుంది. బాగా ఆలోచిస్తే................
కన్యకు అంటే ఇక్కడ పడుచు అనికాదు.
కన్య అంటే కన్యా రాశికి అని అర్థం తీసుకుంటే
కన్యనుండి ఆరవరాశి కుంభం
అంటే ఆపడుచు కుచాలు కుంభాలవలె ఉన్నవి అని.
కన్యారాశికి 7వరాశి మీనరాశి
అంటే ఆపడుచు కండ్లు చేపల్లా ఉన్నాయి అని.
కన్యకు 4వరాశి ధనూరాశి
అంటే ఆపడుచు బొమలు విల్లులా ఉన్నాయని.
కన్యకు 12వరాశి సింహరాశి
అంటే ఆపడుచు నడుము సింహంనడుములా ఉందని.
మొత్తమీద
ఆపడుచు కుచాలు కుంభాలవలెను, కండ్లు చేపల్లాను,
బొమలు విల్లలాను, నడుము సన్నగా సింహంలాను
ఉన్నాయని పద్యభావం.
అంత అందంగా ఉందా పడుచు.

Tuesday, August 16, 2016

రామా! నుత తనుమారా!


రామా! నుత తనుమారా!


సాహితీమిత్రులారా!

పద్యంలోని పాదం మొదటినుండి చదివినా చివరనుండి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని పాదభ్రమక పద్యంు అంటారు.
ఇలాంటివి గతంలో కొన్ని తెలుసుకొని ఉన్నాము.
ఇప్పుడు మరొక పాదభ్రమకం చూద్దాం.

రామా! నుత తనుమారా!
ధీమదవనధీ! వర వర! ధీనవదమధీ!
తామసజయ! యజసమతా!
నామగతాఘ! నయతత! యనఘతాగమనా!
                (హంసవింశతి - 4-241)
రామా = ఓరామా!, తను నుత మారా = పొగడ్తకెక్కిన
శరీరసౌందర్యములో మన్మథుని వంటివాడా!,
ధీమత్ = బుద్ధిమంతులను (సాధువులను),
అవనధీ = రక్షించుటయందు బుద్ధిగలవాడా,
వరరవ = కమ్మని కంఠస్వరముగలవాడా,
ధీ = బుద్ధకి, నవ = నూతన నూతనమునగా అలవడెడి,
దమ = ఇంద్రియ నిగ్రహము, శాంతి, ధీ = నికడగా గలవాడా,
తామసజయ = తమోగుణ ప్రధానులైన రాక్షసులు మొదలైన
దుష్టులను జయించినవాడా, అజసమతా = సాక్షాత్పరబ్రహ్మసామ్యము గలవాడా,
నామ = రామ అను నిజనామము పలుకుటచేతనే, గత = పోయిన,
అఘ = (ఆ పలికినవారి)పాపములుగలవాడా
నయతత = నీతిచే నిండినవాడా,
అనఘతా గమనా = పాపరహితుడను ప్రసిద్ధిని పొందినవాడా! రామా!

శిరహీనుని శివుడు మ్రింగె చిత్రముగాదే!


శిరహీనుని శివుడు మ్రింగె చిత్రముగాదే!



సాహితీమిత్రులారా!


ఈ గూఢచిత్ర పద్యం చూడండి.

సురలను సురలే మ్రింగిరి
పరగంగా బ్రహ్మవచ్చి భానుని మ్రింగెన్
అరయగ నప్పురి చెంతను
శిరహీనుని శివుడుమ్రింగె చిత్రముగాదే!
                                    (నానార్థగాంభీర్యచమత్కారిక పుట.14)


దీనిలో దేవతలను దేవలు మ్రిండమేమిటి?
బ్రహ్మ వచ్చి సూర్యుని మ్తింగడమేమిటి?
శిరహీనుని శివుడు మ్రింగడమేమిటి? - చిత్రమేకదా

బాగా ఆలోచిస్తే ఇందులోని పదాలకు
మరో అర్థం ఉండి ఉండాలి లేకుంటే ఇది ఎలా?

సురలను సురలే మ్రింగిరి -
అంటే
చేపలను(సురలను) చేపలే మ్రింగాయి.
(అనిమిషులు - చేపలు, సురలు)
బ్రహ్మవచ్చి భానుని మ్రింగెన్ -
మేక(అజము-బ్రహ్మ)వచ్చి జిల్లేడు చెట్టును(భానుని- అర్కం) తినింది.
శిరహీనుని శివుడు మ్రింగె -
పీత(శిరహీనుడు- ఎండ్రకాయ)ను నక్క(శివుడు) తిన్నది 

దీన్ని గూఢచిత్రంగాను, పొడుపు పద్యంగాను తీసుకోవచ్చును.

Monday, August 15, 2016

భారతస్వాతంత్ర్యదినోత్సశుభాకాంక్షలు


భారతస్వాతంత్ర్యదినోత్సశుభాకాంక్షలు



సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు భారతప్రజలందరికి
70వ భారతస్వాతంత్ర్యదినోత్సశుభాకాంక్షలు


అయోముఖీ దీర్ఘకాయా


అయోముఖీ దీర్ఘకాయా


సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలిక చూచి సమాధానం
చెప్పగలరేమో ఆలోచించి చూడండి

అయోముఖీ దీర్ఘకాయా బహుపాదా జనాశనా
అస్పృష్ట్వా భూతలం యాతి యక్షిణీ దేవతా చ న

ఇనుపముఖము, దీర్ఘాకృతి,
అనేకపాదాలు కలది,
మనుష్యాదులను తినునది,
భూమిని స్పృశించకనే వెళుతుంది.
ఇది యక్షిణి కాదు దేవతా కాదు
ఏమిటిది?

సమాధానం - పొగబండి(ధూమశకటం)

ఇది ఇనుముతో చేయబడింది.
చాలా చక్రాలు ఉంటాయి.
పట్టాలపై వెళుతుంది భూమినితాకదు.
యక్షిణికాదు దేవతాకాదు.
ఇవన్నీ రైలుబండికి సరిపోతాయి.
కావున
సమాధానం - పొగబండి (ధూమశకటం, రైలు)

కల్పితలింగజంగమ (అనుకరణ పద్యం)


కల్పితలింగజంగమ (అనుకరణ పద్యం)


సాహితీమిత్రులారా!

క్రీ.శ. 1218 -1285 మధ్యకాలంలోని
యథావాక్కుల అన్నమయ్య
"సర్వేశ్వరా" శతకంలోని
ఈ పద్యం చూడండి.

శ్రీకంఠాయ నమోనమో, నతసురజ్యేష్ఠాయ రుద్రాయ లిం
గాకారాయ నమోనమో, విగతసంసారాయ, శాంతాయ, చం
ద్రాకల్పాయ నమోనమో, దురితసంహారాయ తేయంచు ని
న్నాకాంక్షం బ్రణుతించు మానవుఁడు నీవైయుండు సర్వేశ్వరా!



దీనికి అనుకరణ పద్యం
పాల్కురికి సోమనాథుని
వృషాధిప శతకము(52) చూడండి.

కల్పితలింగజంగమాయ సుఖస్ఫురణాయ నమోనమో యసం
కల్పవికల్పమార్గకథకప్రథితాయ నమోనమో గుణా
కల్పవరాయతే యనుచు గౌరవలీల నుతింతు నిన్ను
స్వల్పతరప్రభావ బసవా! బసవా! బసవా! వృషాధిపా!

ఈవిషయం శతకవాఙ్మయసర్వస్వము పుట.34లో ఇవ్వబడినది.

Sunday, August 14, 2016

వండగ నెండిన దొక్కటి

వండగ నెండిన దొక్కటి


సాహితీమిత్రులారా!


పొడుపు పద్యాలలో ఇదొకటి చూడండి.

వండిగ నెండిన దొక్కటి
వండక మరి పచ్చిదొకటి వడి కాలినదిన్
తిండికి రుచియై యుండును
మండలమున జనులకెల్ల మహిలో వినుమా!

వండగనెండినదొక్కటి - వక్కలు
వండక మరి పచ్చిదొకటి - ఆకులు
వడి కావినదిన్ - బాగా కాలినది - సున్నం
తిండికి రుచియై యుండును - తాంబూలము
  (వక్కలు, ఆకులు, సున్నము కలిసినది)

నడి మక్కరముల్ గణుతింప పేరగున్!


నడి మక్కరముల్ గణుతింప పేరగున్!


సాహితీమిత్రులారా!


ఒక స్త్రీని తన భర్తపేరు అడగగా ఆమె తన భర్తపేరును
ఎంత తెలివిగా ఈ పద్యంలో  గూఢ పరచి చెప్పిందో
చూడండి.

సరసిజనేత్ర! నీ విభుని చక్కని పేరు వచింపుమన్న ఆ 
పరమ పతివ్రతామణి భావమునం ఘనమైన సిగ్గునన్
కరియును-రక్కసుండు-హరికార్ముకమున్-శర-మద్దమున్-శుకం
బరయగ వీనిలోని నడి మక్కరముల్ గణుతింప పేరగున్!

అని చెప్పిన
అందులోనుండి ఆమె భర్తపేరును బహిర్గతం చేయాలిమరి.
కరియును-రక్కసుండు-హరికార్ముకమున్-శర-మద్దమున్-శుకం -
ఇందులోని నడిమి అక్షరాలు అంటే
ప్రతి దానికి 3 లేక 5 అక్షరాల పదమై ఉండాలికదా!

కరి                                                        -  ద్వి
రక్కసుడు                                             - అఘుడు
హరికార్ముకము                                    - పినాకం
శర                                                       -  సాకం
అద్దము                                                - ముకురం
శుకం                                                      - చిలు

వీటిలోని నడిమి(మధ్య)అక్షరాలను తీసుకుంటే
రఘునాయకులు అవుతుంది.
అది ఆమె భర్తపేరు.

Saturday, August 13, 2016

నర నారీ సముత్పన్నా


నర నారీ సముత్పన్నా


సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలికను చూడండి.


నర నారీ సముత్పన్నా సా స్త్రీ దేహవివర్జితా
అముఖీ కురుతే శబ్దం జాతమాత్ర వివశ్యతి

స్త్రీ పురుషుల వలన పుట్టును -
అది దేహము లేని  స్త్రీ అగును-
నోరు లేకున్ను ధ్వని చేయును -
పుట్టిన వెంటనే నశించును.
ఏమిటది?
ఆలోచించి చెప్పండి.

సమాధానం - చిటిక (ఛోటికా)

ఇందులో బొటనవ్రేలు, నడిమివ్రేలుల
ఘర్షణవలన చిటిక పుడుతుందికదా!
బొటనవ్రేలును సంస్కృతంలో పుంలింగంగా,
మధ్యవ్రేలును స్త్రీలింగంగా చెబుతారు
కావున ఇది సరైన సమాధానమే.

నాదాని పాపం నాకేన


నాదాని పాపం నాకేన


సాహితీమిత్రులారా!

ఆంధ్రభాషాబాసం పేరుతో అంబలిద్వేషణం అని
ఒక దాన్నిగురించి తెలుసుకొని ఉన్నాము.
ఇప్పుడు మరొకటి తెలుగు పదాలుగా అనిపించినా
అవి తెలుగు పదాలు కాకపోవడం.
సూక్ష్మంగా చూస్తే వాటి అర్థం వేరుగా ఉంటుంది.
ఈ శ్లోకం చూడండి.

నాదాని పాపం నాకేన యేమేనా మనవిందతే
తేషా మితి రమానాథో బభాషే మధురాం గిరమ్

నాకేన = ఓ దేవేంద్రా!, యే = ఏ మనుష్యులు,
మే నామ = నా పేరును, న విందతే = ఎరుగరో,
తేషాం పాపమ్ = వారి పాపమును, నాదాని = తొలగింపను,
ఇతి = అని, రమానాథ: =రమాపతి,
మధురాంగిరమ్ బభాషే = తీయని మాట పలికెను.

ఇందులో నాదాని నాకేన యేమేన మన -
ఇవి తెలుగుపదాలుగా కనబడతాయి.
కావున ఇది (ఆంధ్ర)ఆభాసాచిత్రం

Friday, August 12, 2016

లోలే! బ్రూహి కపాలికామిని?


లోలే! బ్రూహి కపాలికామిని?


సాహితీమిత్రులారా!

చిలకపాటి వేంకటరామానుజశర్మ రచిత
రససంజీవనము - అను నాటకములోని నాందీ శ్లోకము.
ఇందులో లక్ష్మీ - పార్వతుల సంవాదము కలదు తిలకింపుడు.

లోలే! బ్రూహి కపాలికామిని? పితా క స్తే? పతి: పాథసాం
క: ప్రత్యేతి జలా దపత్యజననం? ప్రత్యేతి య: ప్రస్తరాత్!
ఇత్థం పర్వతసింధురాజతనయో రాకర్ణ్య వాక్చాతురీం
సస్మేరస్య హరే ర్హరస్య చ ముదో విఘ్నంతు విఘ్నంతు న:

పార్వతి - లోలే!
            - ఓ చంచలురాలా! (ఒక చోటైనై స్థిరంగా ఉండనిదానా!)
లక్ష్మి - కపాలికామిని బ్రూహి?
         - కపాలము చేత బట్టుకొని తిరుగువాని
            కామించినదానా !
            నన్నెందుకు పిలిచావు?
పార్వతి - పితా కస్తే?
            - నీకు తండ్రి ఎవ్వరు?
లక్ష్మి - పాథసాంపతి:
         - సముద్రరాజు
పార్వతి - క: ప్రత్యేతి జలా దపత్యజననం?
           - జలానికి పిల్లలు పడతారా ఎవరూ నమ్మరు?
లక్ష్మి - ప్రత్యేతి య: ప్రస్తరాత్!
         - చట్రాతివలన పిల్లలు పుట్టం విశ్వసనీయమేనా!

ఈ విథంగా గౌరీ శ్రీదేవుల వాక్చాతుర్యం విని
చిరునవ్వు నవ్వుతున్న హరిహరుల
మందస్మితములు(సంతోషములు)
మన విఘ్నాలను పోగొట్టునుగాక!