Showing posts with label పంచపాషాణాలలోని ఒక పద్యం. Show all posts
Showing posts with label పంచపాషాణాలలోని ఒక పద్యం. Show all posts

Saturday, January 21, 2023

పంచపాషాణ పద్యాలలో మరొకటి

 పంచపాషాణ పద్యాలలో మరొకటి




సాహితీమిత్రులారా!



పంచ పాషాణా లలో ఇది మరొక పద్యం 

భండనభీమ నిన్నెదిరి పారక నిల్చిన శాత్రవుల్ బృహ 

న్మండలపుండరీక హరి,నాకనివాసులు పారియున్ బృహ 

న్మండల పుండరీక హరినాక నివాసులు చచ్చియున్ బృహ 

న్మండల పుండరీక హరినాక నివాసులు చిత్ర మెన్నగన్

అర్థము:--భండనభీమ =యుద్ధమునందు శత్రువులకు భయము గలిగించు వాడా!, 

నిన్ను,ఎదిరి =ఎదిరించి 

పారక=వెన్నిచ్చి పరుగెత్తక, నిల్చిన శాత్రవుల్ =పగవారు 

బృహ=గొప్పవైన, మండల =గుండ్రములైన,

పుండరీక=వెల్లగొడుగుల తోడ, హరి=గుఱ్ఱము మీద, 

నాక=సుఖముగా, ని-మిగుల వా=తిరుగుటకు 

ఆస=స్థానమైన,పారియున్ =పారిపోయియు, 

బృహత్ = గొప్ప, మండల=ఒక రకమైన పాములకు,

పుండరీక=పులులకు, నాక =అడవి నేలలందు, 

ని=పోయిన, వాసులు =కట్టుబట్టలు గలవారై యుందురు.

చచ్చియున్=చనిపోతే,బృహ=విశాలమైన, మండల=ఎర్రనైన, 

పుండరీక=కమలముల వంటి. హరి=సూర్యుని యందు 

నాక=వైకుంఠ మందును నివాసులు=ఉండువారు.

ఓ! భండనభీమా!యుద్ధములో నిన్నెదిరించి పరిగెత్తి పోక నిలిచి పోరాడి తాళలేక గుర్రాలమీద పరిగెత్తి పోయి  పుట్టగొడుగులు, పాములు,పులులు గల అడవిలో కట్టు బట్టలతో తిరుగుచుందురు.యుద్ధములో చనిపోయిన వారు సూర్యమండలము లేక వైకుంఠమునందు చేరుదురు.ఎలా చనిపోయినా వీరమరణం పొంది స్వర్గలోకాన్ని చేరుతారు.అని భావము    

( బృహన్మండల పుండరీక-దగ్గరే నానార్ధకమైన శ్లేష!1అడవులపాలవుతారు 2 పారిపోక యెదిరిస్తే వీరమరణంపొంది సూర్యమండలాన్ని అధిగమించి నాకలోక సుఖాలననుభవిస్తారని భావం! ఇదోగమ్మత్తు!)  

Thursday, November 10, 2022

పంచపాషాణాలలోని ఒక పద్యం

 పంచపాషాణాలలోని ఒక పద్యం




సాహితీమిత్రులారా!



తెలుగులో పంచపాషాణాలు అని 5 పద్యాలున్నాయి.

వాటిలోని ఒక పద్యం ఇది గమనించండి-


అబ్జముఖీ మనోజ నరసాధిప నందన నీ యశం

బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ వితీర్ణిమం 

బబ్జ కరాబ్జ జాబ్జ నయనాబ్జ విలాసము నీ పరాక్రమం 

బబ్జ కరాబ్జ  జాబ్జ నయనాబ్జ విలాసము చిత్రమిద్ధరన్ 

ఈ పద్యములో ఒక్కొక్క పాదములో ఒకే పదములున్నా కూడా 

వేర్వేరు అర్థములు వచ్చేట్టు రచించాడు కవి.

తా:--పద్మముఖులగు సుందరీ మణులకు మన్మథుడా,నరసరాజకుమారా!కృష్ణ రాయా!

1. నీ కీర్తి అబ్జ+కర+అబ్జ జాబ్జ నయనా=అబ్జ విలాసము=అమృతము,బ్రహ్మ ,సరస్వతి,శంఖము, వీటి యొక్క విలాసము వంటి కాంతి కలది.

2.నీ దాతృత్వము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ+వి+ల+అసము =పాలసముద్రమును, కర్ణుడిని, నిధులను పొందిన కుబేరుని, చంద్రుని విశేషముగా గ్రహించుటకు స్థాన మైనది.

3.నీ పరాక్రమము అబ్జకర+అబ్జజ+అబ్జనయన+అబ్జ విలాసము --  శివుడు,కుమారస్వామి,కమలాక్షుడైన 

శ్రీపతి,అర్జునుడు,  వీరి యొక్క విలాసము వంటి కాంతి కలది గా ఈ ధరణి లో చిత్రంగా ప్రకాశిస్తున్నాయి.

తా:- నీ కీర్తి అమృతము, కమలమునందు పుట్టిన బ్రహ్మ, కమలముల వంటి కన్నులుగల సరస్వతి ,శంఖము, వీటి  అన్నింటి యొక్కవిలాసము వంటి కాంతి కలది. నీ దానగుణము పాలసముద్రమును, కర్ణుడినీ, నిధులుగల కుబేరుని, చంద్రుని, విశేషముగా గ్రహించుటకు స్థానమైనది.నీ పరాక్రమము శివుడు,కుమారస్వామి,శ్రీపతి,అర్జునుడు వీరి యొక్క విలాసము వంటి కాంతి కలదిగా ఈ ధరణిలో చిత్రముగా  ప్రకాశిస్తున్నాయి.