Monday, July 31, 2017

చతుర్థ పాద గోపనము


చతుర్థ పాద గోపనము
సాహితీమిత్రులారా!


రావూరి దొరస్వామి గారి పద్యం ఇది

ఈ పద్యంలోని నాలుగవ పాదము
మొదటి మూడు పాదములలో
గుప్తము చేయబడి ఉంది అది గమనించడమే
ఇందులోని చిత్రం దీన్ని చతుర్థపాద గూఢమంటారు.


విశ్వపాలక భాసిల్లు వితమయంబు
పిసగనమి మహిమను బెనుపు సరి మాద్రి
యెనయ జలజాక్ష గురుపాద గనయము నను

దీనిలోని నాలుగవ పాదం చూడాలంటే
మొదటి పాదం మొదటి అక్షరం మొదలు
రెండు అక్షరములను వదలుతూ మూడవ అక్షరం
తీసుకుంటే నాలుగవపాదం వస్తుంది.

విశ్వపాక భాసిల్లు విమయంబు
పిసనమి హిమను బెనుపు సరి మాద్రి
యెయ జజాక్ష గురుపా గనము నను

నాలుగవ పాదం-
విలసితంబుగ మనువు మానలఁగు దయను 

పూర్తి పద్యం-

విశ్వపాలక భాసిల్లు విత్తమయంబు
పిసగనమి మహిమను బెనుపు సరి మాద్రి
యెనయ జలజాక్ష గురుపాద గనయము నను
విలసితంబుగ మనువు మానలఁగు దయను 


Sunday, July 30, 2017

ద్విపదలో శ్లోకం


ద్విపదలో శ్లోకం
సాహితీమిత్రులారా!గర్భకవిత్వం అంటే ఒక పద్యం లేక శ్లోకం
ఛందస్సులోనే మరో పద్యం లేక శ్లోకం
ఛందస్సును ఇముడ్చుట.
ఇక్కడ ద్విపద ఛందస్సులో శ్లోకం ఇమిడ్చిన
దాన్ని గమనించగలం-
కంకంటి నారసింహకవి కృత
విష్ణుమాయా విలాసంలోని
5వ ఆశ్వాసంలోనిది ఈ పద్యం-

బాలగోపాల రూపాయ నవీన
నీల నీరద భాసినేతే నమోస్తు
జాన గమ్యాయ కృష్ణాయ నిత్యాయ
తేనమోస్తు తమోహ్యతే నిరీహాయ

దీనిలోని శ్లోకం-

బాలగోపాల రూపాయ 
నీల నీరద భాసినే
జాన గమ్యాయ కృష్ణాయ 
తేనమోస్తు తమోహ్యతే 


శరబంధము


శరబంధము
సాహితీమిత్రులారా!


వేదాంత దేశికుల పాదుకా సహస్రంలోని
చిత్రపద్ధతిలోని శ్లోకాలలోనిది ఈ శ్లోకం-
ఇది శరబంధములో కూర్చబడినది.
చూడండి-

సరాఘవా శ్రుతౌదృష్టాపాదుకా సనృపాసనా
సరాఘవాగతౌ శ్లిష్టా స్వాదుర్మే సదుపాసనా 
                                                       (పాదుకాసహస్రము - 923)

శ్రుతిగోచరమై, శ్రీరామసహితయై రాజసింహాసనమందు
అధిష్ఠించేది. భగవంతుని చరణ సంగతయై గమనమందు
వేగం కలది. సత్పురుషులకు ధ్యానరూపయైన పాదుకాదేవి
నాకు ఇష్టమైనది - అని భావం.

ఈ శ్లోకంలోని ఉత్తరార్థంనందలి మొదటి పదంలో
నాలుగక్షరా లున్నాయి. అందులో రెండవ అక్షరం
ర-ను ల-గా ఉచ్ఛరించ వచ్చును. రలయో రభేదః
అనే శబ్దశాస్త్రవాక్యప్రకారం. అది సలాఘవా - అవుతుంది.
ఈ బంధాన్ని శ్లోకాన్ని చూస్తూ చదవండి సులువుగా అర్థమౌతుంది.
చూడండి బంధాన్ని-Saturday, July 29, 2017

వరమే తనయుసురుఁదీసె పౌలస్యునకున్


వరమే తనయుసురుఁదీసె పౌలస్యునకున్
సాహితీమిత్రులారా!


సమస్య-
వరమే తనయుసురుఁదీసె పౌలస్యునకున్

విద్వాన్ వి.యమ్. భాస్కరరాజు గారి పూరణ-

తరమెరుగక దశకంఠుడు
ధరణిజఁగొని తప్పుచేయ దశరథసుతుడే
వరదైత్యుని చంపెను - కా
వరమే తనయుసురుఁదీసె పౌలస్యునకున్

దీనిలో వరంకాదు కావరం అని పూరించడంతో

వ్యతిరేకార్థముపోయి సంగతమైనది.

మురజ బంధము


మురజ బంధము
సాహితీమిత్రులారా!


మురజబంధములో అనేక రకాలున్నాయి.
మురజ బంధానికి మర్దల బంధం అనికూడ అంటారు.
ఇక్కడ శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల 
సంపాదకత్వంలో వెలువడిన ఆయలూరి కందాళయార్య
విరచిత అలంకారశిరోభూషణే నందలి
శబ్దాలంకార ప్రకరణంలోనిది.

మనతామనతా నల్ప ధనతామిన తానయ
ఘనతావన తానజ్ఞ జనతావన తానయ
(ఓ ప్రభూ ఘనులు, జ్ఞానులు అయిన నత
భక్తులను రక్షించువాడా అనల్పమైన ధనాన్ని
విస్తరించు - అని భావం.)

ఈ బంధంలోని అక్షరవిన్యాస క్రమం ఇలా ఉంది-
పాదంలోని అక్షరక్రమసంఖ్య -
                                             1   2   3   4   5   6   7   8
1వ పాదం-          A   B  C   D  B  C  B  E

2వ పాదం-          F   B   C   G  B  C  B  H

3వ పాదం-          I    B   C   J   B  C  B  K

4వ పాదం-           L  B   C   M  B  C  B  N

దీనిలో మద్దె బిగింపు(నిలువు) 2,5,7 వరుసలలోనివి,
3,6 వరుసలలోని అక్షరాలు ఆవృత్తమైనాయని
గమనించగలరు.


Friday, July 28, 2017

భుజగ నేత్రమయిన భూరుహమేది?


భుజగ నేత్రమయిన భూరుహమేది?
సాహితీమిత్రులారా!శ్రీవేంకటేశ్వర సారస్వత వినోదిని లోని
పొడుపు పద్యం చూడండి-
సమాధానాలు చెప్పగలరేమో-

అరువది యేండ్లలో నణఁగిన యేఁడేది?
            సంఖ్య మూడునకున్న సంజ్ఞయేది?
పైఁడి కనులు కల్గు పక్షినేమందురు?
           భుజగ నేత్రమయిన భూరుహమెది?
శివనామ పూర్వక ప్రవిమల సుమమేది?
           ముందు వజ్రకలుగు మూలికేది?
యెఱ్ఱని కనులతో నెసఁగు పక్షియేది?
           భద్రపూర్వకమైన ప్రసవమేది?
పొన్నగంటి పేరై యొప్పుచున్నదేది?
చిత్రమౌ నేత్రములు గల్గు జీవియేది?
చెప్పవలె "అక్షి" కడపటం జేర్చి చేర్చి
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!


సమాధానాలు-

ప్రతి సమాధానంలో అక్షి అని చివర రావాలి

1. 60 సంవత్సరాలలో ఒకటి - రక్తాక్షి
2. మూడు సంఖ్య సంజ్ఞ - శంకరాక్షి
3. పైడికనులుగల పక్షి - కనకాక్షి
4. నాగసుగంధ చెట్టు - సర్పాక్షి
5. శివుని పేరు ముందున్నపూవు - రుద్రాక్షి (సందెమల్లె)
6. వజ్రం పేరు ముందుగల మూలిక - వజ్రాక్షి(నల్లేరు)
7. ఎర్రని కన్నులుగల పక్షి - తామ్రాక్షి(కోకిల)
8. భద్ర అని పేరుకు ముందుగల పూవు - భద్రాక్షి(తెల్లని పూల మొక్క)
9. పొన్నగంటి పేరై ఉన్నది - మత్స్యాక్షి (పొన్నగంటి మొక్క)
10. చిత్రమైన కన్నులుగల జీవి - చిత్రాక్షి (పావురము)

ఈ రెంటికి సమాధానమొకటే


ఈ రెంటికి సమాధానమొకటే
సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం చూడండి-
సంస్కృతంలోని ప్రశ్నకు
తెలుగులోని ప్రశ్నకు
ఒకే సమాధానము చెప్పాలి
ఆలోచించండి-

కస్మై దత్తే హరి ర్మోక్షం
కి మాంధ్రాణా మతి ప్రియం
ఆంధ్రగీర్వాణ భాషాభ్యా
మేకమేవోత్తరం వద

దీనిలోని
సంస్కృత ప్రశ్న-
మహావిష్ణువు ఎవనికి మోక్షమిస్తాడు?

తెలుగు ప్రశ్న-
ఆంధ్రులకు అతిప్రియమైనదేది?


సమాధానం- చింతకాయ

1. చింతయతీ తి చింతకః తస్మై చింతకాయ
   అంటే ధ్యానించువానికి
   మోక్షమిస్తాడు విష్ణువు.

Thursday, July 27, 2017

సినిమాల్లో సర్వలఘువు


సినిమాల్లో సర్వలఘువు
సాహితీమిత్రులారా!


1991లో వచ్చిన చైతన్య చిత్రంలోని 
ఈ పాటలోని సర్వలఘు చిత్రాన్ని
గమనించండి-
వేటూరి సుందరరామమూర్తి సాహిత్యంWednesday, July 26, 2017

మీకుంటే, మాకుంటే, ఆకుంటే


మీకుంటే, మాకుంటే, ఆకుంటే
సాహితీమిత్రులారా!


దత్తపది-
మీకుంటే, 
మాకుంటే, 
ఆకుంటే,
ఈకుంటే - అనే పదాలనుపయోగించి పూరించాలి.

పూర్వకవిపూరణ-

మీకుంటే చాలునొకో
మా కుంటే గాదె విద్య మాన్యత గాంచున్
ఆ కుంటే గల దిచ్చట
ఈ కుంటే లేకయున్న  నీప్సితమవుగా!

ఇలాంటిదే మరోపూరణ-
ఇది చాల కాలంనాటిది-

ఆకుంటే వృక్షంబగు
ఈకుంటే లోభియౌను హీనాత్ముండౌ
మీకుంటే మా కిమ్మా
మాకుంటే మేమురాము, మల్కిభరామా!

Friday, July 21, 2017

రవి, కవి, పవి, చవి


రవి, కవి, పవి, చవి
సాహితీమిత్రులారా!దత్తపది - 
రవి, 
కవి, 
పవి, 
చవి - అనే పదాలను ఉపయేగించి
రామాయణార్థంలో పూరించాలు.


సింహాద్రి శ్రీరంగముగారి పూరణ-

రవికులజుడు, రాముడు, లో
క విరోధి సుబాహు కూల్చిఖలు మారీచున్
పవి సదృశ శరవరంబున
జవి జూడగకొట్టె తనదు శక్తిన్ యుక్తిన్


నవరత్న కలిత సీసము


నవరత్న కలిత సీసము
సాహితీమిత్రులారా!


విష్ణుమాయా విలాసంలోని
ఈ పద్యంలో
మాయాముని తన ఆశ్రమంలోని సంపదను
బ్రహ్మకు చెబుతూ నవరత్నాల వాకిలిని
గురించి చెప్పిన సందర్భములోనిది చూడండి-

పద్మరాగచ్ఛవిపత్రంపుజొంపలు
         కేకిపంఛచ్ఛదాకీర్ణ లేఖ
అమృతాంశుశోభాదళాంచిత భిత్తులు
         గారుడమణిపత్ర తోరణములు
జాతిపచ్చలవన్నెచదురగు కప్పులు
         మేల్మి వన్నియలాకు మేలు కట్లు
వజ్రాభపత్రకవాటంపు తడికెలు
         పవనంపు వన్నె కంబములు దనర
మరియునరవిరి తెరగంటు విరుల సరుల
పాలవెల్లువ మధురసపాన మత్త
సంభ్రమభ్రమరారావసంకులంబు
గలుగు మొగసాల యల్లన గడచిచనగ
(విష్ణుమాయా విలాసము - 3- 109)

పద్మరాగమణుల కాంతిగల ఆకులగుత్తులు
నెమలిఈకల నీల వర్ణముగల చిత్తరువులు
చంద్రుని వెన్నెల శోభగల గోమేధికము(పసుపు)
వర్ణముగల గోడలు. గరుడ పచ్చని గారుడమణి
(మరకతము) గరిమగల గడప ముందు వాకిలిలో
నిడుపైన కంబములకు కట్టిన ఆకుల సరములు.
లేతపచ్చని రంగుగల మాణిక్యవర్ణముగల
(అశోక వృక్ష పత్రములు) ఇంటిలోని పైకప్పులు.
నేర్పరితనముగల వైఢూర్యవర్ణముగల (పిల్లికన్నురంగు)
కప్పుల గోడలంటునట్లు చిత్రమైన సన్నని సన్నని
వస్త్రముల సముదాయపు మేలికట్లు. తెల్లని రంగుకల
సూర్యకిరణముల వంటి వజ్రాలవర్ణముతో తలుపులుగా
నున్న ఆకుల తడికలు. గోధుమకాంతిగల పగడపు
వర్ణముగల స్థంభములు. సగము విచ్చిన దేవతా
పుష్పములు ముత్యాల(వెండివంటి) కూర్పులలో
తేనెత్రాగి మదమెక్కి, వేగిరపాటుతో తిరుగు
తుమ్మెదల ఝంకారములతో సందడిగల వాకిలిని
దాటి... - అని భావం.
ఇందులో పద్మరాగమణి, నీలమణి, గోమేధికము,
గారుడమణి, మాణిక్యము, వైఢూర్యము, వజ్రము,
పగడము, ముత్యము అనే నవరత్నముల పేర్లు
ఇందు కూర్చబడినది.

Wednesday, July 19, 2017

చాలును నీదు వర్షమిక శాంతినొసంగుము


చాలును నీదు వర్షమిక శాంతినొసంగుము
సాహితీమిత్రులారా!


సమస్య-
చాలును నీదు వర్షమిక శాంతినొసంగుము వానదేవుఁడా

వేదగిరి వేంకట నరసింహరాయశర్మగారి పూరణ-

చేలు మునింగె నీట నిక సేద్యము మాకు మిగిల్చె దుఃఖ మున్
గాలికి చెట్లు కూలినవి గందరగోళముఁబట్టి రందరున్
జాలిఁగలట్టివాఁడ వని సాగిలి మ్రొక్కి నమస్కరించెదన్
చాలును నీదు వర్షమిక శాంతినొసంగుము వానదేవుఁడా!

పంచవిధ సరసిజ వృత్తము


పంచవిధ సరసిజ వృత్తము
సాహితీమిత్రులారా!


ఎఱగుడిపాటి వేంకటకవి కృత
విష్ణుమాయా విలాసములోని
ప్రథమాశ్వాసము 231వ పద్యం.
ఇందులో రెండు కందపద్యములు,
నీలోత్పలమాల, మణిగణనికరము
అనే నాలుగు పద్యాలను గర్భితంగా
కూర్చబడింది.

శ్రీలక్ష్మీ శా! శ్రీకర చేలా! సితకరజితముఖ చిరతర కరుణా!
ఫాలాక్షాప్తా! పాండవపాలా పతగవరగమన భవభయహరణా
సాలంకారా! సద్గుణజాలా! సతతశుభవిభవ సరసిజచరణా!
శైలోద్ధారా! సత్యవిశాలా! శతమఖసతపదసరసవితరణా!

గర్భిత మొదటి కందము-
శ్రీలక్ష్మీ శా! శ్రీకర 
చేలా! సితకరజితముఖ చిరతర కరుణా!
ఫాలాక్షాప్తా! పాండవ
పాలా పతగవరగమన భవభయహరణా

గర్భిత రెండవ కందము-
సాలంకారా! సద్గుణ
జాలా! సతతశుభవిభవ సరసిజచరణా!
శైలోద్ధారా! సత్యవి
శాలా! శతమఖసతపదసరసవితరణా!

గర్భిత నీలోత్పల మాల వృత్తము-
శ్రీలక్ష్మీ శా! శ్రీకర చేలా! 
ఫాలాక్షాప్తా! పాండవపాలా 
సాలంకారా! సద్గుణజాలా! 
శైలోద్ధారా! సత్యవిశాలా! 

గర్భిత మణిగణనికరము-
సితకరజితముఖ చిరతర కరుణా! 
పతగవరగమన భవభయహరణా
సతతశుభవిభవ సరసిజచరణా!
శతమఖసతపదసరసవితరణా!
Tuesday, July 18, 2017

భానుడొసంగు శీతలము భక్తజనాళికి


భానుడొసంగు శీతలము భక్తజనాళికి
సాహితీమిత్రులారా!


సమస్య-
భానుడొసంగు శీతలము భక్తజనాళికి గ్రీష్మమందునన్

వేదగిరి వేంకట నరసింహరాయశర్మగారి పూరణ-

మానవకోటి చీకటుల మాయమొనర్చి వెలుంగెవండిడున్?
స్నాన మొనర్చ యేమగును చయ్యన పుష్కరిణీజలంబు లన్?
ధీనిధులార దాహమునుఁదీర్పగ లగ్గగు కాలమెద్దియో?
భానుడొసంగు, శీతలము భక్తజనాళికి, గ్రీష్మమందునన్

ఈ సమస్యము కవిగారు క్రమాలంకారములో పూరించారు.
మొదటి పాదంలోని ప్రశ్నకు - భానుడొసంగు - అని
రెండవపాదంలోని ప్రశ్నకు - శీతలము భక్తజనాళికి - అని
మూడవపాదంలోని ప్రశ్నకు - గ్రీష్మమందునన్ - అని
పూర్తి చేశారు.

Monday, July 17, 2017

భోగి మట్టిన వానిఁ భోగిఁ జుట్టినవాని


భోగి మట్టిన వానిఁ భోగిఁ జుట్టినవాని
సాహితీమిత్రులారా!


కావ్యాలంకార సంగ్రహము లోని
ఈ పద్యం చూడండి-
ఇది నాయక వంశ వర్ణనలోనిది-

భోగి మట్టినవానిఁ భోగిఁ జుట్టినవాని
        భోగిఁ బట్టినవానిఁ బోలనేర్చుఁ
దమ్మిఁ దాల్చినవానిఁ దమ్మి దొల్చినవానిఁ
        దమ్మి మొలిచినవానిఁ దారసించు
మృగము నుంచినవాని మృగముఁద్రుంచినవాని
        మృగముఁ బొంచినవాని మీఱఁజాలుఁ
గొండ నెక్కినవానిఁ గొండ జెక్కినవానిఁ
        గొండగ్రుక్కినవానిఁ గొదవసేయు
భరణభూతిజవప్రభాబాహుశక్తి
మతికళాశౌర్యసత్యశుంభత్ప్రభావ
భోగగాంభీర్యగుణములఁ బుడమి నేనృ
పాలకులు సాటి యాతిమ్మపార్థివునకు
(కావ్యాలంకారసంగ్రహము - 1 - 64)

ఇందులో సీసపద్యంలోని ప్రతిదానికి సమాధానం
గీతపద్యంలో క్రమాలంకారం కూర్చారు.
దీన్ని గూఢచిత్రంగాను
ప్రహేలికగాను తీసుకొన వచ్చును.

భోగి మట్టినవాడు - విష్ణువు
భోగి చుట్టినవాడు - శివుడు
భోగి బట్టినవాడు - గరుత్మంతుడు

తమ్మిదాల్చినవాడు - సూర్యుడు
తమ్మిదొల్చినవాడు - అభిమన్యుడు
తమ్మిమొల్చినవాడు - బ్రహ్మ

మృగమును ఉంచినవాడు - చంద్రుడు
మృగమును త్రుంచినవాడు - రుద్రుడు
మృగము బొంచినవాడు - రాఘవుడు

కొండ నొక్కినవాడు - అగస్త్యుడు
కొండ చెక్కినవాడు - ఇంద్రుడు
కొండ గ్రుక్కినవాడు - సముద్రుడు

ఈ భూప్రపంచంలో తిమ్మరాజును
విష్ణువు - భరణ శక్తి, శివుని భూతి
గరుత్మంతుని జవములతో పోల్చవచ్చు
సూర్యుని కాంతితోను అభిమన్యునిబాహుశక్తితోను,
బ్రహ్మదేవుని బుద్ధి(మతి)తోను, చంద్రుని కళాశక్తితోను,
రుద్రుని శౌర్యముతోను, రాఘవుని సత్యసంధతతోను,
అగస్త్యుని శుంభత్ప్రభావంతోను, ఇంద్రుని ఐశ్వర్యంతోను,
సముద్రుని గాంభీర్యంతోను పోల్చవచ్చుగాని ఏ ఇతరరాజుతోను
పోల్చలేము - అని భావం

Saturday, July 15, 2017

రావణ కుంభకర్ణులకు రాముఁడు బుట్టె


రావణ కుంభకర్ణులకు రాముఁడు బుట్టె

సాహితీమిత్రులారా!సమస్య-
రావణ కుంభకర్ణులకు రాముఁడు బుట్టె జగద్దితంబుగన్


వేదగిరి వేంకట నరసింహరాయశర్మగారి పూరణ-

ఠావులుఁదప్పె యుద్ధమున డస్సిరి, "కల్గెను ఘోరశాప ముల్
రావణ కుంభకర్ణులకు", రాముఁడు బుట్టె జగద్ధితంబుగన్
కోవిదులారఁజెప్పెద! నకుంఠిత బాహుబలుండు చక్రియే
దేవతలున్ మునీంద్రులు నుతింపగ ధర్మము నుద్ధరింపగా


ఆది - సోమ - మంగళ - బుధ


ఆది - సోమ -  మంగళ - బుధ
సాహితీమిత్రులారా!
దత్తపది-
ఆది,
సోమ,
మంగళ,
బుధ - అనే పదాలు భాగవతార్థంలో
పూరించాలి.


సింహాద్రి శ్రీరంగముగారి పూరణ -

ఆదిలక్ష్మితో సరసంబులాడుశౌరి
సోమసుందరు డాగజేశుని మహార్తి
చెవులు సోకంగ మంగళ శ్రీనిగూర్ప
బుధ తతులు మెచ్చ రక్షింప బోయెవనికిWednesday, July 12, 2017

పంచాక్షర బంధము


పంచాక్షర బంధము
సాహితీమిత్రులారా!

5 గళ్ళలో అక్షరాలను నిబంధించడం వల్ల
దీనికి పంచాక్షర బంధము అంటారు.
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల 
సంపాదకత్వంలో వెలువడిన
తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక విరచిత
చిత్రబంధ మాలికాలోని శ్లోకం-


విధీంద్ర వినుతం విశ్వభావిరాకా విధుచ్ఛవి
గౌరీ విభ్రమ విఖ్యాతం శాంకరీం వస్తు సంస్తుమః

బంధము -

తం  శాం  ద్ర    క   తం
మః  ఖ్యా  ధీం ను  రీం
మ   భ్ర      వి    శ్వ  భా
స్తు    గౌ     ధు   రా   వ
రీ     సం   చ్ఛ  స్తు   కా

ఈ శ్లోకం వి - తో ప్రారంభమై  ప్రతి మూడవ
అక్షరం వి- గా మూడవ పాదం వరకు ఉంది
శ్లోకాన్ని చదువుతూ బంధాన్ని గమనించండి

విషయం పూర్తిగా అర్థమౌతుంది.


Tuesday, July 11, 2017

రామస్య భగినీ సీతా


రామస్య భగినీ సీతా
సాహితీమిత్రులారా!


పదములు ఎక్కడెక్క ఉండాలో
అక్కడ లేకపోతే
దాన్ని స్థాన చ్యుతక చిత్రమంటారు.
ఉదాహరణకు ఈ శ్లోకం చూడండి-

రామస్య భగినీ సీతా
తస్య పత్నీ సపత్నజా
పార్వతీపతి గోవిన్దః
కా లస్య కుటిలా గతిః

రామస్య - స్థితికర్త అయిన విష్ణుదేవునికి,
పార్వతీ - గౌరీదేవి
భగినీ - సోదరి
తస్య - ఆ రామునికి
సపత్న - జా -
(శత్రువలగు రావణ, కుంభకర్ణులను చంపుటకు)
శత్రుత్వముతో పుట్టిన,
సీతీ - సీతాదేవి,
పత్నీ - భార్య,
ఈ - పతి - గోవిందః
లక్ణీదేవియొక్క భర్త అయిన విష్ణువు
ఆలస్య - కుటిలా - గతిః - కా
స్వభావముచేత - వంకరైన - నడక - ఏది - అని ప్రశ్న
దీనికి కాలస్య - కుటిలా - గతిః - అనేది సమాధానము.
ఏవిధంగా నంటే-
కాలస్య - సమయము, యముడు, శని మొదలైన వారి
గతిః - నడక
కుటిలా - వంకర(కపటము) మాయతో కూడినది - అని భావము.


మణిగణనికర గర్భ కందము


మణిగణనికర గర్భ కందము
సాహితీమిత్రులారా!


ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని
ఈ కందపద్యంలో  మణిగణనికరవృత్తము ఇమిడి ఉంది
చూడండి-

ధరణి ధర భరణ తతకర
సరసా శరవర విదళన చణనిశిత శరా
పురహర నుతనిజభుజబల
రి మాఖరకరనిభ గరుడగిరిపతీ

ఇందలి మణిగణనికరము-

ధరణి ధర భరణ తతకర సరసా 
శరవర విదళన చణనిశిత శరా
పురహర నుతనిజభుజబల రి మా
ఖరకరనిభ గరుడగిరిపతీ

Monday, July 10, 2017

నవరస నవరత్న కలిత సీసము


నవరస నవరత్న కలిత సీసము
సాహితీమిత్రులారా!

కావ్యాలంకార సంగ్రహంలోని
ఈ పద్యం చూడండి-
నవరసములు నవరత్నముల రంగులతో
రత్నముల ఆకారం దాల్చి నరసభూపాలుని
భవనంలో ఉన్నవనే తాత్పర్యం గల సీసపద్యం ఇది-

మరకతానీక దంభమున శృంగారంబు
        హాస్యంబు ముక్తాఫలౌఘరుచులఁ
గరుణ విద్రుమవర్ణగౌరవచ్ఛలమున
        రౌద్రంబు కురువిందరత్నకలన
వీరంబు గోమేధికారోపితస్ఫూర్తి
        భయము వైదూర్యశోభామిషమున
బీభత్స మింద్రనీలాభాగుణంబున
        శాంతి నిర్మలహిరకాంతిగతుల
నద్భుతము పుష్యరాగరాగాపదేశ
విలసతంబున పాకారవృత్తిఁగాంచి
నవరసంబులు వొల్పు నీభవనవీథిఁ
బ్రబల; సుబలనృసింహ! యోబయనృసింహ
                                           (కావ్యాలంకా సంగ్రహము - 3- 154)


శృంగారము - మరకతము - నల్లకలువరంగుకలది
హాస్యము - ముత్యము - తెల్లనిది
కరుణ - పవడము - గాఢమైన ఎరుపురంగు కలది
రౌద్రము - కురువింద రత్నము - లేతఎరురంగుకలది
వీరము - గోమేధికము - గౌరవర్ణము కలది
భయము - వైఢూర్యము - ధూమ్రవర్ణము కలది
బీభత్సము - నీలము - నల్లనిది
శాంతము - హీరము - స్పటికవర్ణము కలది
అద్భుతము - పుష్యరాగము - పసుపుపచ్చనిది

ఈ విధంగా నవరసాలను నవరత్నాలను కలిపారు


Sunday, July 9, 2017

భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె


భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె
సాహితీమిత్రులారా!కావ్యాలంకార సంగ్రహ కృతి భర్త అయిన
నరసభూపాలుడు రామరాజభూషణుని
ఈ విధంగా అడిగాడట. కృతిని కూర్చమని-

బాణు వేగంబును, భవభూతి సుకుమార
        తయు, మాఘు శైత్యంబు, దండిసమత,
యల మయూరుసువర్ణకలన, చోరునియర్థ
        సంగ్రహమ్ము, మురారిశయ్యనేర్పు,
సోముప్రసాదంబు, సోమయాజుల నియ
        మంబు, భాస్కరుని సన్మార్గ ఘటన,
శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి,
        యమరేశ్వరుని సహస్రముఖదృష్టి,
నీక కల దటుగాన ననేక వదన
సదన సంచార ఖేదంబు సడలుపఱిచి
భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె
మూర్తి కవిచంద్ర విఖ్యాత కీర్తిసాంద్ర
                                             (కావ్యాలంకార సంగ్రహం - 1-15)

ఇందులోని పదాలు- అర్థాలు

బాణ - బాణకవి - బాణము
భవభూతి - ఒక కవి, ఈశ్వరైశ్వర్యము
సుకుమారత- గోము, సుకుమారస్వామి
మాఘ - మాఘకవి, మాఘమాసము
మయూర- మయూరకవి, నెమలి
వర్ణము - అక్షరము, శుక్లపీతాదులు
చోరుడు - ఒకకవి, తస్కరుడు
అర్థము- అభిధేయము, ధనము
మురారి - ఒక కవి, విష్ణువు
శయ్య - శబ్దవిన్యాస విశేషము, పఱపు
మురారి శయ్య - అదిశేషుడు
సోముడు - నాచనసోముడు, చంద్రుడు
ప్రసాదము - ఓజస్సు మొదలైన గుణములలో ఒకటి,
                       ప్రసన్న భావము
సోమయాజి - తిక్కనసోమయాజికవి, దీక్షితుడు
నియమము - పదనియమము, వ్రతము
భాస్కరుడు - ఒకకవి, సూర్యుడు
సన్మార్గము - సజ్జన మార్గము, ఆకాశము
శ్రీనాథుడు - ఒక కవి, విష్ణువు
పదము - శబ్దము, చరణము
ధార - కవిత్వధార, జలధార
అమరేశ్వరుడు - ఒక కవి, ఇంద్రుడు
సహస్రముఖదృష్టి - అనేకవిధ దృగ్వ్యాప్తి,
                                    వేయి కన్నులు కలిగి ఉండటం
దండి - ఒక కవి, దండమును ధరించిన యోగి
సమత - ఒక గుణము, సర్వసామ్యము

ఇందులో కవి పరంగా అన్యవిధంగా రెండు అర్థాలుగా చెప్పవచ్చు
కావున ఇది అనేకార్థక చిత్రంలోనికి వస్తుంది.

Saturday, July 8, 2017

భైరవకవి నాగబంధ - ద్వినాగబంధములు


భైరవకవి నాగబంధ - ద్వినాగబంధములు
సాహితీమిత్రులారా!

భైరవకవి కృత శ్రీరంగమహాత్మ్యములోని
ఈ నాగబంధము చూడండి-
దీనిలో రెండు విధాలైన బంధచిత్రాలను
కూర్చవచ్చు .

నాగబంధ పద్యం-

వరగుణరత్న విశ్రుతసువర్ణవతంస సబాలసత్వర
స్ఫురిత మరాళశ్రీగురవచోవశచిత్తదవిలాసవాసవా
వరజసమాంగవైరికరివారిదరానిలధీరమాంచితో
త్తరసశుభానురక్తతతతత్పరచాగయమంత్రిశేఖరా

చంపకమాలలో పాదానికి 21 అక్షరాల చొప్పున
4 పాదాలకు 84 అక్షరాలుంటాయి అయితే దీనిలో
20 అక్షరాలు రెండుమార్లు ఆవృత్తమౌతాయి -
అందు వల్ల 64 అక్షరాలే బంధంలో ఉంటాయి.దీన్నే ద్వినాగ బంధంగా కూడ గీయవచ్చని
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులుగారు గీచి
చూపించారు ఆ బంధచిత్రం ఇక్కడ చూడండి-
మూటి కొక్కమాట ముద్దుకృష్ణ


మూటి కొక్కమాట ముద్దుకృష్ణసాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం చూడండి
సమాధానం చెప్పగలరేమొ?

మామిడేఁల బూసె మండు వేసంగిని
బాలుఁడేలఁబోయె బసుల వెంట
నొకఁడు వచ్చి యొకని మరుగేలఎ జొచ్చును
మూటి కొక్కమాట ముద్దుకృష్ణ


సమాధానము - కాయనే

వేసవికాలంలో కాయనే మండువేసంగిలో మామిడి పూస్తుంది
బాలుడు పశువులను కాయనే వాటివెంట పోతాడు
ఒకడు వచ్చిన ఒకడు కాయనే మరుగు చొచ్చును
వీటి అన్నిటిలో వచ్చే సమాధానం కాయనే కదా

Friday, July 7, 2017

వావిలిలోఁద్రోయఁగ్రోతివలెనే యుండెన్


వావిలిలోఁద్రోయఁగ్రోతివలెనే యుండెన్

సాహితీమిత్రులారా!సమస్య-
వావిలిలోఁద్రోయఁగ్రోతివలెనే యుండెన్
వావిలి చెట్లలో త్రోయగా గ్రోతివలే కనబడుచుండెను అనేది సమస్య

పూర్వకవి పూరణ-

ఓ విద్వన్మణినను సు
గ్రీవుని యన్నకును బేరెఱిగింపుము రూ
పేవితమనియెదు మధ్యము
వావిలిలోఁద్రోయఁగ్రోతివలెనే యుండెన్


ఇది శబ్దచిత్ర సమస్య-
ఇందులో
వావిలి అనే పదంనుండి మధ్యలోని "వి" అనే దాన్ని
తొలగించిన వాలి అవుతుంది. అదే కదా సుగ్రీవుని అన్నపేరు.


Thursday, July 6, 2017

ఆది కటే సబకో సాలై


ఆది కటే సబకో సాలై
సాహితీమిత్రులారా!
అమీర్ ఖుస్రూ చెప్పిన
ఈ బహిర్లాపిక ప్రహేలిక చూడండి-

ఆది కటే తే సబకో సాలై
మధ్యకటేతే సబకో శాలై
అన్త కటేతే సబకో మిఠా
సో ఖుసరోగై ఆంఖేఁదీఠా

దీని సమాధానం ఇందులో లేదు
బయటినుంటి తీసుకోవాలి కావున
దీన్ని బహిర్లపిక అంటారు.
దీని సమాధానం - కాజల
ఈ కాజల అనే పదంలో మొదటి అక్షరం తీసివేస్తే - జల
జల - నీరు ఇది అందరిని రక్షిస్తుంది
మధ్య అక్షరాన్ని తీసివేస్తే - కాల
కాల - యముడు, మరణము, సమయము చెబుతుంది
ఇక చివరి అక్షరం తీసివేస్తే - కాజ
ప్రయోజన, వ్యవసాయ, వివాహ మొదలైన వాటిని తెలుపుతుంది.
కావున సమాధానము కాజల సరైనదే.
ఇందులో కాజల అనే పదాన్ని మార్చి చూచిన ఇలాంటి
అర్థాలు రావు కావున దీన్ని శాబ్దిక ప్రహేలిక అని అంటారు.


గోమూత్రికా బంధము


గోమూత్రికా బంధము
సాహితీమిత్రులారా!

నన్నెచోడుని తరువాత చిత్రకవిత్వం కూర్చిన కవి
శ్రీరంగమాహాత్మ్యం కూర్చినవారు భైరవకవి.
గోమూత్రికాబంధము పంచమాశ్వాసంలో కూర్చారు.
ఆ పద్యం చూడండి-

హరిపదసరసిజమధుకర  
మురభిదసితమూర్తి రామభోగయ రామా
కరిరద సురకుజ విధుకర 
శరదుద సితకీర్తి ధామ చాగయ రామా

దీన్ని గోమూత్రికాబంధంలో వ్రాయగా ఏర్పడు చిత్రం-
ఇక్కడ చూడండి-


Wednesday, July 5, 2017

సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!


సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!సాహితీమిత్రులారా!సమస్య-
సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!

డా.ఏల్చూరి మురళీధరరావుగారి పూరణ-
అతివ మోము సొగసుఁ బ్రతిభటింపఁగఁ గోరి 
కమల చంద్రములకుఁ గలహ మొదవె;
నడుము కతన, నామె నడక కతము గాఁగ 
సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!Tuesday, July 4, 2017

కంది - పెసర - సెనగ - మినుము


కంది - పెసర - సెనగ - మినుము
సాహితీమిత్రులారా!దత్తపది -
కంది - పెసర - సెనగ - మినుము
పదాలతో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
వర్ణించాలి.

డా. ఏల్చూరి మురళీధరరావుగారి పూరణ-


కనుఁబాటొంది నభశ్చరావళులు మ్రొక్కం దివ్యగంధర్వగా
యనగీతీనటనంబు లొప్పె; సరవిన్ యాదోధినాథుండు చే
తనసమ్మోహనరీతి మ్రోసె; నగకోదండుండు కాత్యాయనిన్
మనువాడెన్ దివిజర్షు లెల్ల
మినుమున్వాఁకన్ దరింపన్ సవిన్.

Sunday, July 2, 2017

ఉత్పలమాలలో తేటగీతి


ఉత్పలమాలలో తేటగీతి
సాహితీమిత్రులారా!
గర్భచిత్రంలోని ఈ చిత్రం చూడండి-

ఉత్పలమాలలో తేటగీతి ఇమిడ్చివ్రాయబడిన
ఉత్పలమాల పద్యం

పావనమైన యాదినమె భారతదేశము దివ్యమంద యాం
ధ్రావని పేరిటన్ దెనుగు రాష్ట్రము దాన మదించె కృష్ణరాట్
శైవలినీ తటుల్ పృధు యశస్ధలి యయ్యెదగృధ్రవాడ మా
రావు నివాసమౌ నదియె ప్రౌఢ కవీంద్రుల కాకరంబగున్

ఈ పద్యం అడ్సుమిల్లి నారాయణరావుగారి
నారాయణీయము పుట.103 లోనిది
ఈ పద్యంలో ప్రతిపాదంలోని
మొదటి 6 అక్షరాలూ చివరి అక్షరము
తొలగించిన మిగిలినది తేటగీతి అగును.
ఇక్కడ చూడండి-

పావనమైన యాదినమె భారతదేశము దివ్యమంద యాం
ధ్రావని పేరిటన్ దెనుగు రాష్ట్రము దాన మదించె కృష్ణరాట్
శైవలినీ తటుల్ పృధు యశస్ధలి యయ్యెదగృధ్రవాడ మా
రావు నివాసమౌ నదియె ప్రౌఢ కవీంద్రుల కాకరంబగున్

తేటగీతి-
దినమె భారతదేశము దివ్యమంద 
దెనుగు రాష్ట్రము దాన మదించె కృష్ణ
పృధు యశస్ధలి యయ్యెదగృధ్రవాడ 
నదియె ప్రౌఢ కవీంద్రుల కాకరంబ


నక్షత్ర బంధము


నక్షత్ర బంధము
సాహితీమిత్రులారా!


విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్ర రత్నాకరము
ఉత్తరభాగంలోని ఈ నక్షత్ర బంధము
చూడండి-

ఫలవ వృషగిరి విహరణా
గిలివీడి నుతించితి నిటు గృపగొను శ్రీశే
షల షదురుమణి స్యందన 
విలసనుత సురరిపు వితతి బిద శేషయుతా

(శ్రీశేష - శ్రీయుక్తుడైన సశేషుడుకలవాడా
లషదురు - వెలుగుచున్న,
వి - అధికమైన, లస - భక్తిరసముతో,
నుత, శేషయుతా - బలరాముతో గూడినవాడా)

ఈ బంధము 5 రేఖలతో నక్షత్రము పూర్తగును
1,2,3,4,5 అని అంకెలు వేయబడినవి.
1తో మొదలిడి చదివిన 5తో పూర్తగును.
Saturday, July 1, 2017

మత్స్యబంధము


మత్స్యబంధము
సాహితీమిత్రులారా!

ఠంయాల లక్ష్మీనృసింహాచార్యుల
కుబ్జాకృష్ణవిలాసము(అచ్చతెనుగు కావ్యము)లోని
ఈ మత్స్యబంధము చూడండి-

భద్రికావృత్తము-
రార కన్నయ హుటాహుటీ
కోరి జేరితిని మేరగా
గార వించి కొలఁద్రోలఁగా
మేర యౌర యెద నెంతురా
(కుబ్జాకృష్ణవిలాసము -3-123)

దీన్ని చేప కన్ను నుండి మొదలు పెట్టి
రెక్కలను కలుపుకొని తోక చుట్టి మరల
మరొకవైపు రెక్కలను చుట్టి కలుపుకొనిపోయిన
కన్నుతో పద్యాంతమగును.

పద్యాన్ని చూస్తూ బందాన్ని చదవండి-


నెవ్వడొ చెప్పుడు సరసులార


నెవ్వడొ చెప్పుడు సరసులార
సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం చూడండి
విప్పగలరేమో?

ఏడ్వకేడ్చు నవ్వకేనవ్వుచుండును
బాధ లేక బాధ పడుచునుండు
నిద్రరాకయున్న నిద్రించు - చావకే
చచ్చు నెవ్వడొ చెప్పుడు సరసులార

సమాధానము - నటుడు