ఒక కందంలో అనేక కందాలు
సాహితీమిత్రులారా!
ఒక కందపద్యంలో ఒక కందపద్యం,
ఒక కందపద్యంలో రెండు కందాలు ఇలా
ఒక కందంలో నాలుగు కందాలు , ఒక కందంలో 8 కందాలు
ఒక కందంలో 16 కందాలు, ఒక కందంలో 116 కందాలు
ఒక కందంలో 256 కందాలు ఉండేలా మన తెలుగు కవులు కందపద్యాన్ని
ఇన్నిరకాలుగా కూర్చారు.
మనం ఇక్కడ మనం 1. చతుర్విధ కందం, 2. అష్టముఖికందం, 3. షోడశముఖి కందం
అనే మూడు రకాల కందాలను గమనిద్దాం-
చతుర్విధ కందం -
నన్నెచోడుని కుమారసంభవములో
12 ఆశ్వాసంలో శివుడు కుమారస్వామికి
జ్ఞానోపదేశం చేసే సందర్భంలో
తెలుగులో మొదటి చతుర్విధకందం
కూర్చబడింది చూడండి-
సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్
(కుమారసంభవము - 12- 217)
సుజ్ఞానము, యోగము, తత్త్వము అనువాని విధులు తెలిసిన
ప్రాజ్ఞులు సంసారబంధములను త్రెంచుచూ, భువిలో అజ్ఞాన
పదమును పొందక స్థిరబుద్ధితో శివుని కొలిచెదరు - అని భావం
ఈ కందపద్యంలో నాలుగు కందపద్యములను
ఇమిడ్చి కూర్చబడింది.
ఈ విధంగా ఒక ఛందస్సులో అనేక ఛందస్సులను ఇమిడ్చి వ్రాయటాన్ని గర్భకవిత్వము(పద్యగూఢము) అంటారు.
ఇందులో మొదటి కందము మనం ముందుగా వ్రాసినదే
సుజ్ఞాన యోగ తత్త్వవి
ధిజ్ఞుల్ భవబంధనముల, ద్రెంచుచు భువిలో
నజ్ఞాన పదము బొందక
ప్రాజ్ఞుల్ శివుఁ గొల్తు రచలభావన దవులన్
మరి రెండవ కందము-
రెండవ పాదంలోని మొదటి రెండు
అక్షరాలను విడచి ప్రారంభించిన
రెండవ కందము వస్తుంది
అది ఇక్కడ చూడండి-
భవబంధనముల ద్రెంచుచు
భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్
శివుఁ గొల్తు రచలభావన
దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవిధిజ్ఞుల్
మూడవ కందము మూడవ పాదం
మొదటినుండి ప్రారంభమవుతుంది.
అది ఇక్కడ చూడవచ్చు-
కొలుతురచలభావమునఁబ్రా
జ్ఞులుశివునిన్ యోగతత్త్వసుజ్ఞాననిధి
జ్ఞులుత్రెంచుచు భవబంధన
ములఁ దవులజ్ఞానపదముఁ బొందక భువిలోన్
నాలుగవ కందము నాలుగవ పాదము రెండు
అక్షరాలను విడచి ప్రారంభించ సరిపోవును.
అది ఇక్కడ చూడండి-
శివుఁ గొల్తు రచలభావన
దవులన్ సుజ్ఞాన యోగ తత్త్వవి ధిజ్ఞుల్
భవబంధనముల ద్రెంచుచు
భువిలో నజ్ఞాన పదము బొందక ప్రాజ్ఞుల్
వీటన్నిలో 1,3 పద్యములకు జ్ఞ - ప్రాస, 2,4 పద్యములకు
వ - ప్రాసగా గూఢపరచబడినది.
అష్టముఖికందం-
ఒక కందపద్యంలో మరో 7 పద్యాలు మొత్తం 8 కందపద్యాలు
ఒకే కందంలో కూర్చారు తూము రామదాసుగారు
తన నిర్వచన మిత్రవిందోద్వాహములో
ఆ పద్యం ఇక్కడ చూద్దాం-
చరణక జునకును భవనది
తరికినిస్తుతమునికవికిని ధనవిభుపతికిన్
క్షరదతనునకునుప్రవిహిత
కరికినుతవాసవికినిగణరాడ్పతికిన్
(నిర్వచన మిత్రవిందోద్వాహము - 1- 36)
ఇందులో ఇదికాక 7 కందపద్యాలున్నాయి.
కనుక్కోవడం ఎలాగంటే
ప్రతిపద్యం మొదటిపాదం మూడవ గణంనుండి ప్రారంభిస్తేసరి.
ఇక చూద్దాం-
రెండవ పద్యం-
భవనది తరికినిస్తుతముని
కవికిని ధనవిభుపతికినని క్షరదతనునకున్
ప్రవిహిత కరికినుతవా
సవికినిగణరాడ్పతికిని చరణక జునకున్
మూడవ పద్యం-
స్తుతముని కవికిని ధనవిభు
పతికినని క్షరదతనునకును ప్రవిహిత కరికిన్
నుతవా సవికినిగణరా
డ్పతికిని చరణక జునకును భవనది తరికిన్
నాలుగవ పద్యం-
ధనవిభు పతికినని క్షరదత
నునకును ప్రవిహిత కరికిన్ నుతవాసవికిన్
గణరాడ్పతికిని చరణక
జునకును భవనది తరికినిస్తుతమునికవికిన్
ఐదవ పద్యం -
క్షరదత నునకును ప్రవిహిత
కరికిని నుతవాసవికిని గణరాడ్పతికిన్
చరణక జునకును భవనది
తరికినిస్తుతమునికవికిని ధనవిభు పతికినన్
ఈ విధంగా చేస్తే 8 పద్యాలు కనిపిస్తాయి.
షోడశముఖి కందం-
"షోడశముఖీ కందం" పేరున
నాదెళ్ళ పురుషోత్తమకవి రచించిన
అద్భుతోత్తర రామాయణంలోనిది
సప్తమాశ్వాసంలోని 149వ పద్యం-
ధరజవు తరుచవు తఱుటను
దఱుగను దఱిగొన దఱికను తఱుగను దరుగన్
ధరజను దరిగొన దరమును
దరమును దఱుమను దఱియను దఱలును ద్వరగన్
దీనిలో ప్రతిగణం ఒక పద్య మొదలౌతుంది.
ఇందులో 16 గణాలున్నాయి. 16 కందపద్యాలు
అవుతున్నాయి. గమనించండి.
1ధరజవు 2తరుచవు 3తఱుటను
4దఱుగను 5దఱిగొన 6దఱికను 7తఱుగను 8దరుగన్
9ధరజను 10దరిగొన 11దరమును
12దరమును 13దఱుమను 14దఱియను 15దఱలును 16ద్వరగన్
ప్రతి గణం రెండవ
అక్షరం ప్రాస అవుతూ ఉంటుంది. కాబట్టి
ర - అనే అక్షరం ప్రాస అవుతున్నది.