Monday, January 31, 2022

మనసిజుమామ మామ........

 మనసిజుమామ మామ........




సాహితీమిత్రులారా!



ఈ ఆశీర్వాద పద్యం గమనించండి-

మనసిజుమామ మామ యభిమానమడంచినవాని మామ నం

దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం

పిన జగజెట్టిఁ పట్టిఁ బొడిజేసిన శూరునితండ్రిఁ గన్నుగన్

గొనిన సురాధినాథుని తనూభవువాయువు మీకు నయ్యెడున్

మనసిజుడు - మన్మథుడు, మన్మథుని మామ - చందమామ, అతని మామ - దక్షుడు, అతని అభిమానం అడచినవాడు- ఈశ్వరుడు, ఈశ్వరుని మామ - హిమవంతుడు, అతని నందనుడు - మైనాకుడు, అతని విరోధి - ఇంద్రుడు, ఇంద్రుని నందనుడు - అర్జునుడు, అతని నందనుడు - అభిమన్యుడు, అతని భార్య - ఉత్తర, ఆమె మేనమామ - కీచకుడు, అతని చంపినవాడు - భీముడు, భీముని కుమారుడు - ఘటోత్కచుడు, అతని చంపినవాడు - కర్ణుడు, అతని తండ్రి - సూర్యుడు, సూర్యుని కన్నుగా కలవాడు - విష్ణువు, అతని తనూభవుడు - బ్రహ్మ, ఆ బ్రహ్మాయువు మీకు అగుగాక - అని సారాంశం.

Saturday, January 29, 2022

నల్లనిదేంది బేరి?

 నల్లనిదేంది బేరి?




సాహితీమిత్రులారా!


రాచనగరులో ఒకచోట ఒక వ్యాపారి కస్తూరి రాసులు పోసి అమ్ముతున్నాడు

అతని దగ్గరికి వెళ్ళి ఒక గొర్రెలకాపరి మాట్లాడాడు అది ఈ పద్యంలో


నల్లనిదేంది బేరి - మృగనాభి గొల్లడ దాన్ని తిందురా

అల్లటుగాదు, స్త్రీలు చనులందునఁ బూతురు, పూసినంతనే

జల్లున చేపువచ్చి తెగజారున కాదు సుగంధ మబ్బు, మా

పిల్లకుకాస్తపెట్టు - మన బేరియుఁ గస్తురిమూ సెఁగ్రక్కునన్


గొర్రెల కాపరి -  నల్లనిదేంది బేరి? 

వ్యాపారి -- మృగనాభి గొల్లడ 

గొర్రెల కాపరి - దాన్ని తిందురా?

వ్యాపారి - అల్లటుగాదు, స్త్రీలు చనులందునఁ బూతురు, 

గొర్రెల కాపరి - పూసినంతనే జల్లున చేపువచ్చి తెగజారున 

వ్యాపారి - కాదు సుగంధ మబ్బు, 

గొర్రెల కాపరి - మా పిల్లకుకాస్తపెట్టు - 

మన బేరియుఁ గస్తురిమూ సెఁగ్రక్కునన్


Thursday, January 27, 2022

పద్యాలతో సంభాషణ

 పద్యాలతో సంభాషణ




సాహితీమిత్రులారా!



ఒక వ్యక్తి వక్కలు ఆకులు వేసుకుంటూ

సున్నం తెమ్మని ఒకావిడను అడిగాడు-


పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి

లన్న పెండ్లము అత్తను గన్న తల్లి

పేర్మిమీఱిన ముద్దుల పెద్దబిడ్డ

సున్న మించుక తేఁగదే సుందరాంగి!

(పర్వతశ్రేష్ఠుడు - హిమవంతుడు, అతని పుత్రిక - పార్వతి, ఆమెపతి - ఈశ్వరుడు, అతని విరోధి - మన్మథుడు, వాని అన్న - బ్రహ్మ, అతని పెండ్లాము - సరస్వతి, ఆమె అత్త - లక్ష్మిదేవి, ఆమె తల్లి - గంగ, గంగపెద్దబిడ్డ - పెద్దమ్మ)

ఓసి పెద్దమ్మా సున్నం తేవే అని పద్య సారాంశం


దానికి ఆ జాణ సున్నం తెచ్చి ఇదిగో తీసుకో అంటూ

ఈ పద్యం చెప్పింది-

శతపత్రంబుల మిత్రుని

సుతుఁజంపిన వాని బావ సూనుని మామన్

సతతముఁ దాల్చెడు నాతని

సుతువాహన వైరివైరి సున్నం బిదిగో!

( శతపత్రముల మిత్రుడు - సూర్యుడు, అతని సుతుడు - కర్ణుడు, వానిని చంపినవాడు - అర్జునుడు, అతని బావ - కృష్ణుడు, అతనిసూనుడు - మన్మథుడు, వానిమామ - చంద్రుడు, అతనిని తాల్చిన వాడు - శివుడు, అతని కొడుకు - వినాయకుడు, అతని వాహనం - ఎలుక, దానివైరి - కుక్క)

ఓరి కుక్కా ఇదిగో సున్నం - అని సారాంశం


ఈ సంభాషణ ఎంత చతురంగా గూఢంగా ఉందికదా!


Tuesday, January 25, 2022

దీని భావం చెప్పండి

 దీని భావం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ మణిప్రవాళ పద్య భావం చెప్పండి-

ఓసి ఓసి వినవే మమజాతం

కాశి దేశ జలగాహనపూతమ్

నీకు పుణ్యముగదే మృగనేత్రి

కోక నుత్సృజ మదీయ సుఖార్థమ్

Sunday, January 23, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యం ఆరవీటి వంశానికి చెందిన పెవేంకట రాయలవారిని 

పొగడినది - దీనికి అర్థం చెప్పండి


హరిరాజ హరిరాజ హరిరాజులకు సాటి

                 పటు బలా జ్ఞానూన భాషణముల

హరిహయ హరిహయ హరిహయులకు సాటి

                 వితత కృపా రూప విభవములను

హరిసుత హరిసుత హరిసుతులకు నెన

                 వినుత జ నౌదార్య విక్రమముల

హరిపౌత్ర హరిపౌత్ర హరిపౌత్రులకుఁ బ్రతి

                 సద్ధర్మ విజ్ఞాన సాహసముల,

ననుచు నెవ్వని వినుతింతు రఖిలవిబుధు

లరిమహీధరశతకోటి ఆరెవీటి

వంశ కలశాబ్దరాకామృతాంసుఁడతఁడు

పరంగు పెదవేంకట క్షమాపాల మౌళి!

Wednesday, January 19, 2022

శ్రీనాథుని ప్రేమలేఖ

 శ్రీనాథుని ప్రేమలేఖ




సాహితీమిత్రులారా!



శ్రీనాథుని వీథిలోని పద్యమిది ఆస్వాదించండి-

శ్రీమ దసత్య మధ్యకును, చిన్ని వయారికి, ముద్దులాడికిన్,

సామజయానకున్, మిగుల చక్కని ఇంతికి మేలుకావలెన్

మేమిట క్షేమ మీవరకు, మీ శుభవార్తలు వ్రాసిపంపుమీ

నామది నీదు మోహము క్షణంబును తీరదు స్నేహబాంధవీ!


శ్రీమ దసత్య మధ్యకు(నడుము)ను, 

చిన్ని వయారికి, ముద్దులాడికిన్,

సామజ(ఏనుగు నడక) యానకున్, 

మిగుల చక్కని ఇంతికి మేలుకావలెన్

మేమిట క్షేమ మీవరకు, 

మీ శుభవార్తలు వ్రాసిపంపుమీ

నామది నీదు మోహము క్షణంబును తీరదు 

స్నేహబాంధవీ!

ఇది నేటి మాటలకంటే ముద్దుగా చక్కగా ఉన్నాయికదా


Monday, January 17, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి

శరశరకాండకాండహరిచందనచందనచందననాగనాగసుం

దరదరచంద్రచంద్రశ్రితనారదనారదతారతారభూ

ధరధరరాజరాజహయదానవదానవకాశకాశస

త్పురపురమారమారహరభూధరభూధరకాలకాలహా


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో పెట్టగలరు

Saturday, January 15, 2022

చమత్కార సంవాదం

చమత్కార సంవాదం




సాహితీమిత్రులారా!



పూర్వకవి కృత చమత్కార లక్ష్మీనారాయణ సంవాదము


క్వోయం ద్వారి? హరి, ప్రయాహ్యుపవనం శాఖామృగ సాత్యత్రకిం? 

కృష్ణోహం దయితే, భిభేమి సుతరాం కృష్ణదహం వానరాత్?

రాధేహం మధుసూదనో, వ్రజలతాంతామేవ పుష్పాన్వితా?,

ఇత్థం నిర్వచనీకృతో దయితయాక్రీణో హరిః పాతువః


ఇది సంవాదరూపంలో వ్రాయగా

లక్ష్మి - క్వోయం ద్వారి?(ఎవరక్కడ ద్వారాన)

నారాయణుడు - హరి (కోతిని)(హరి అంటే కోతికూడ)

లక్ష్మి - ప్రయాహ్యుపవనం శాఖామృగసాత్యత్రకిం?

          (కొమ్మల్లో తిరిగే కోతికి ఇక్కడేంపని. ఉద్యానవనానికి వెళ్ళు)       

నారాయణుడు - కృష్ణోహం దయితే

              (ఓ ప్రియురాలా నేను కృష్ణుణ్ణి)

లక్ష్మి - భిభేమి సుతరాం కృష్ణదహం వానరాత్,

         (నల్లకోతయితే నాకు ఇంకా ఎక్కువ భయం)

నారాయణుడు - రాధేహం మధుసూదనో

                    (రాధా నేను మధుసూదనుడను)

లక్ష్మి - వ్రజలతాంతామేవ పుష్పాన్వితాం,

(తుమ్మెద(మధుసూదన)వైతే పూల దగ్గరకు వెళ్ళు)

ఇత్థం నిర్వచనీకృతో దయితయాక్రీణో హరిః పాతువః

(ఇలా ప్రియురాలికి సమాధానం చెప్పలేక సిగ్గుపడిన హరి మిమ్మును కాపాడుగాక)

                                                                                                                -వైద్యంవారి సహకారంతో

Thursday, January 13, 2022

మాధవ మాధవ మాధవులకు సాటి

 మాధవ మాధవ మాధవులకు సాటి




సాహితీమిత్రులారా!



సంస్కృతంలో కొక్కొకుడు రతిశాస్త్రం అనేపేరున కామశాస్త్రం రచించాడు

దాన్ని కూచిరాజు ఎర్రన కొక్కోకం పేరున అనువదించాడు అందులో 

కృతిపతి కుంటముక్కల మల్లనమంత్రి అన్న గంగయామాత్యునిపై 

గూర్చిన పద్యం ఇది గమనించండి-


మాధవ మాధవ మాధవులకు సాటి

                       సౌందర్య విక్రమ సంపదలను

గోపాల గోపాల గోపాలు రకు జోడు

                      భోగసాహస కళా భోగములను

గాంగేయ గాంగేయ గాంగేయులకు బ్రతి

                       వర్ణ ప్రతాప పావన నిరూఢి

కుంభజ కుంభజ కుంభజులకు నీడు 

                        రణ తపస్సామర్ధ్య రాజసముల

నితర జనముల సరిపోల్చ నెట్లు వచ్చు

భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవముల

కుటిలరిపుమంత్రి హృద్వేది కుంటముక్ల

గంగయామాత్యునకు దాన కర్ణునకును


ఇందులో మొదటిపాదంలో 

1. మాధవ (వసంత ఋతువు) సొందర్యలోనూ

2. మాధవ (విష్ణుమూర్తి) విక్రమంలోనూ

3. మాధవ (ఇంద్రుని) సంపదలోనూ

రెండవపాదంలో-

1. గోపాల(కృష్ణుడు) భోగసాహసం అంటే పడగలమీద సాహసం(బహుశా)

    కాళీయవర్ధనం

గంగనమంత్రి పరంగా బోగము, సాహసము

2.గోపాల(గొల్లవారు) కళ(పశువుల పోషించడం 64 కళల్లో ఒకటి) గంగయమంత్రి పరంగా ముఖంలో కళ

3. గోపాల (రాజు) భోగంలోనూ

మూడవ పాదంలో -

1. గాంగేయ (బంగారు) వర్ణం రంగులో

2. గాంగేయ(భీష్ముడు) ప్రతాపంలో

3. గాంగేయుడు((కుమారస్వామి) పావనత్వంలో - కుమారస్వామి పరంగా పవన భక్షణలో, గంగయమంత్రి పరంగా బ్రాహ్మణత్వంలో

నాలుగవపాదంలో -

1. కుంభజ(ద్రోణుడు)రణంలోనూ

2. కుంభజ (వసిష్ఠుడు) తపస్సులోనూ

3. కుంభజ (అగస్త్యుడు) సామర్ధ్యములోనూ (అగస్తుడు సముద్రాన్ని తాగేశాడు. వింధ్యపర్వతాన్ని శాసించాడు)వీళ్ళెవరూ నీకు సాటిరారు

అని చివరగా ముగించాడు.


Tuesday, January 11, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!

ఈ పద్యానికి అర్థం చెప్పండి

తవతవతాహితాహియహితారకమాలకమాలచంచరీ

జవజవజాలజాలనహిజాలకవాలకలీలచుంబినీ

కవకవకావకావశుకకాహితకాహితలోకసుందరీ

నవనవనావనావ నవనాహితనాహిత పూర్వశేఖరా


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో ఉంచగలరు

Monday, January 10, 2022

తమిళంలోని ఏకాక్షరి పద్యం

 తమిళంలోని ఏకాక్షరి పద్యం





సాహితీమిత్రులారా!

మనం తెలుగు, సంస్కృతం, హిందీ, కన్నడ భాషల్లో ఏకాక్షర పద్యాలు చూశాం.

ఇప్పుడు ఇక్కడ తమిళంలోని ఏకాక్షర పద్యం గమనించండి-

ఇందులో క - అనే వ్యంజనంతో కూర్చబడినది. ఇది చిత్తరక్కవికల్ అనే పుస్తకంలోనిది-

காக்கைக்கா காகூகை கூகைக்கா காகாக்கை

కా   క్  కై క క్  కా   కా   కూ కై     కూ    కై  క్ కా   కా   కా  క్  కై

கோக்குக்கூ காக்கைக்குக் கொக்கொக்க - கைக்கைக்குக்

కో      క్ కు క్ కూ కా  క్     కే  క్  కు క్  కొ   క్     కొ  క్ క  -    కై   క్   కై   క్ కు క్

காக்கைக்குக் கைக்கைக்கா கா.

కా   క్     కై  క్ కు క్    కై క్   కై    క్  కా  కా

(కాకి - గుడ్లగూబ. కాకి పగటిపూట కాకిని (గుడ్లగూబ) ఓడించగలదు. 

కాకి రాత్రి కాకిని ఓడించగలదు. యోగ్యుడైన రాజుకి కూడా (చేతిలో పట్టి ఉండవచ్చు).


Sunday, January 9, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

ఈ పద్యానికి  అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి

జగతి న్నీదు మహాఘనప్రబల రాజత్కీర్తి శాసించె నె

న్నగ నాగారినగారినానగభిన్నాగారినాగంబుఁ, బు

న్నగనాగారినగారినాగగనభిన్నాగారి నాగంబులన్

దగవైరేభసృణీ! ఘృణీ గుణమణీ! దానప్రధానాగ్రణీ!


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో ఉంచండి


Thursday, January 6, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



14వ శతాబ్దంలో కొండవీటిని పాలించిన కుమారగిరిరెడ్డి కి మంత్రి 

అయిన కాటయ వేమనపై చెప్పిన పద్యం ఇది ఈ పద్యానికి అర్థం చెప్పండి-

మానుషదానమానబలమానిత ధర్మరమా! మనోజ్ఞరే

ఖానుతభూతి విత్తములఁ, గాటయవేమన పోలు; వాసవిన్

వానివిరోధి వానివిభు వానివిపక్షుని వాని యగ్రజున్

వానిమఱంది వానిసుతు వానియమిత్రుని వానిమిత్రునిన్


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో వ్రాయగలరని మనవి.

Tuesday, January 4, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి




సాహితీమిత్రులారా!



ఈ పద్యానికి అర్థం చెప్పండి-

కూరిమి రామకృష్ణనృపకుంజర నీదు యశంబు పైకొనన్

వారిజగర్భు నారి, పురభంజను నారి, కుముద్వితీద్విష

న్నారి, మఘారి, మిత్రగృహనారియు, నిల్వఁగ లేక భీతిమైఁ

జేరె జనాళి భోగినుం శ్రీపతిపాద మపారదూరమున్

ఈ పద్యం అర్థాన్ని కామెంట్స్ లో పెట్టండి.

Sunday, January 2, 2022

పతులేవురు సింగభూప పాంచాలికిలన్

 పతులేవురు సింగభూప పాంచాలికిలన్




సాహితీమిత్రులారా!



సింగభూపాలుని వద్దకు దర్శనానికి వచ్చిన ఒక కవిని-

ద్రౌపదికి పాండవులైదుగురూ భర్తలేకదా వారిలో ఒకరు 

భర్త అయినపుడు మిగిలినవారు ఆమెకు ఏమౌతారో 

ఆశువుగా కందపద్యంలో చెప్పమన్నారట దానికి ఆ కవి

వెంటనే చెప్పిన పద్యం ఇది-

పతి మఱఁదియు సహదేవుఁడు

పతి బావయు ధర్మజుండు, బావలు మఱఁదుల్

పతులు నర నకుల భీములు,

పతు లేవురు సింగభూప పాంచాలి కిలన్

దాని ఆనందించిన సింగభాపాలుడు కవిని సత్కరించి 

తృప్తిని పొందాడట.