Saturday, June 30, 2018

పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం


పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం



సాహితీమిత్రులారా!




రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రంబై, శిరోరత్నమై,
శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణకేయూరమై,
ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర
ప్రవరంబై, పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

జాతీయమహాకవి బమ్మెర పోతనామాత్యుల వారి శ్రీమహాభాగవతంలో అద్భుతావహమైన ఊహశాలితకు, కల్పనానల్పశిల్పానికి ప్రథమోదాహరణీయమని పేరుపొందిన పద్యం ఇది. బలిచక్రవర్తి వద్దకు వటుకరూపంలో వచ్చి మూడడుగుల దానాన్ని పొంది త్రివిక్రముడైన వామనావతీర్ణవిష్ణువు – ఒక్క అడుగుతో అధోలోకాలను క్రమించి, మరొక అడుగుతో ఊర్ధ్వలోకాలను ఆక్రమించి, బ్రహ్మాండాంతం వరకు వర్ధిల్లుతున్న తరుణంలో ఆ మహద్రూపాన్ని వ్యంజింపజేస్తున్న మహనీయదృశ్యం ఇది.

అమోఘమైన ఈ పద్యానికి మూలం సంస్కృత భాగవతంలో లేదు. రుయ్యకుని అలంకారసర్వస్వానికి జయరథుడు కూర్చిన విమర్శినీ వ్యాఖ్యలో సారాలంకార వివరణ వద్ద ఉదాహృతమై ఉన్నది. పోతనగారి బహుగ్రంథశీలితకు, విశాలమైన వైదుష్యానికి, విపులపాండిత్యానికి నిదర్శకమైన మహాద్భుతఘట్టం ఇది.

‘ఉత్తరోత్తర ముత్కర్షః సారః’ అని సూత్రం. పూర్వపూర్వాని కంటె ఉత్తరోత్తరానికి ఉత్కర్ష విధింపబడినట్లయితే అది సారము అనే పేరుగల అలంకారం. కొందరు దీనిని వర్ధమానము అనే పేరుగల అలంకారమని కూడా అంటారు. జయరథుడు వర్ధమానం సారాలంకారంలోనే ఇమిడిపోతుందని అన్నాడు. అలంకార రత్నాకరంలో శోభాకరమిశ్రుడు ఒకే వస్తువు లేదా అనేక వస్తువుల ఉపచయం వల్ల కలిగే చమత్కారం వర్ధమానానికి లక్షణమని నిర్వచించాడు. జయరథుడు దానిని సారానికే అన్వయించి చూపాడు. అందుకు ఈ శ్లోకాన్ని ఉదాహరించాడు:

కిం ఛత్త్రం కిం ను రత్నం తిలక మథ తథా కుణ్డలం కౌస్తుభో వా
చక్రం వా వారిజం వే త్యమరయువతిభి ర్యద్బలిద్వేషిదేహే
ఊర్ధ్వే మౌలౌ లలాటే శ్రవసి హృది కరే నాభిదేశే చ దృష్టం
పాయా త్త ద్వోఽర్కబిమ్బం స చ దనుజరిపు ర్వర్ధమానః క్రమేణ.

బలిద్వేషి అయిన వామనావతార విష్ణువు శరీరం పెరుగుతూ పెరుగుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న అప్సరసలు – అదిగో, సూర్యబింబం ఆయనకు పట్టిన గొడుగై ఉన్నది కదూ! అదిగో అంతలో అది ఆయన శిరసుమీది రత్నమై ఉంది కదూ! నుదుటిమీది తిలకమై ఉంది కదూ! చెవియందలి కుండలమై ఉంది కదూ! వక్షఃస్థలాన్ని అలంకరించిన కౌస్తుభరత్నమై ఉంది కదూ! పాణితలమందలి సుదర్శన చక్రమైంది కదూ! నాభిదేశాన ఉన్న పద్మమై కనబడింది కదూ! అనుకొంటున్నప్పటి ఆ సూర్యబింబమూ, ఆ రాక్షసశత్రువైన శ్రీమహావిష్ణువూ మిమ్మల్ని రక్షిస్తారు గాక! – అని ఆశీస్సు.

త్రివిక్రముడైన విష్ణువు యొక్క ఉత్తరోత్తరవృద్ధిని చెప్పటానికి సూర్యబింబం ఆ మహద్రూపం ముందు ఎంతెంత చిన్నబోతూ వచ్చిందో ప్రతిపాదింపబడింది. ‘అత్ర ఏకస్యైవ హరేః తత్తదవస్థావిశిష్టతయా స్వరూపేణ ఉత్తరోత్తరం ఉత్కర్షః’ అని జయరథుని వ్యాఖ్య.

శ్లోకంలో ఉన్నది విశ్వరూపుడైన త్రివిక్రముని వర్ణనమే. అద్భుతావహమైన ఆ అభివర్ణన తనకెంతో నచ్చినందువల్ల పోతనగారు దానినే తెలుగు చేశారు. అమరయువతులు అనుకొంటున్నట్లుగా చిత్రింపబడిన దృశ్యం ఆంధ్రీకరణలో పురాణవక్త శుకమహర్షి చెప్పినట్లుగానే అయినా, కవిప్రౌఢోక్తిసిద్ధం అయింది.

సూర్యబింబం అమరయువతులకు విష్ణువు నాభిదేశాన్ని అలంకరించిన పద్మం వలె కనుపించటం వరకే శ్లోకంలో ఉన్నది. పోతనగారు చిత్రిస్తున్నది అమరయువతుల అభ్యూహను కాదు. బలిచక్రవర్తి కళ్ళయెదుట జరుగుతున్న సంఘటనను. అందువల్ల త్రివిక్రముడు నభోవీథిని దాటి సత్యపదోన్నతుడైనప్పుడు భూలోకవాసులకు సూర్యబింబం ఆయన కాలి అందెయై కానరావటం, పాదపీఠమై కనబడటం సహజమే. మూలంలోని కల్పన నుంచి 1. లలాటము నందలి తిలకమై ఉండటం, 2. పాణియందలి చక్రమై ఉండటం, 3. నాభియందలి పద్మమై ఉండటం అన్న మూడు అధ్యారోపాలను పోతనగారు విడిచివేశారు.

తెలుగు పద్యంలో, సూర్యబింబం గొడుగై ప్రకాశించింది – అన్నప్పటి అలంకృతిని పరిశీలింపవలసి ఉంటుంది. సూర్యబింబం గొడుగు వలె ప్రకాశించింది – అన్నట్లయితే సూర్యబింబానికీ, ఛత్రానికీ ప్రకాశ వర్తులత్వాది సమానధర్మాలు ఉన్నందువల్ల, వలె అన్న సాదృశ్యవాచకం ఉన్నందువల్ల సౌందర్యాపాదకమైన ఉపమాలంకారం సిద్ధిస్తుంది. ‘గొడుగు వలె’ అనకుండా ‘గొడుగుగా’ అన్న తాద్రూప్యాన్ని; ‘శిరోమణి వలె’ అనకుండా ‘శిరోమణిగా’ అన్న తాద్రూప్యాన్ని; ఆ తర్వాత మకరకుండలంగా, కంఠాభరణంగా, బంగారు భుజకీర్తిగా, కాంతులీనే కంకణంగా, మొలలోని గంటగా, మేలైన కాలి అందెగా, పాదపీఠంగా అని ప్రకృతవస్తువైన సూర్యబింబమునందు అప్రకృతవస్తువులైన ఛత్ర శిరోమణ్యాదులతో తాద్రూప్యాన్ని కల్పించటం వలన ఇక్కడ ఉపమాలంకారం పరిహరింపబడుతున్నది.

‘తాద్రూప్యం’ అన్నంత మాత్రాన ఇక్కడ కల్పనలో సూర్యబింబమునందు గొడుగుయొక్క ధర్మారోపమేమీ జరుగలేదు. గొడుగులో సూర్యబింబము యొక్క ధర్మారోపమూ జరుగలేదు. అందువల్ల ఎటుచూసినా ఇది రూపకాలంకారమూ కాదు. అవయవ నిరూపణను చేయక అవయవిని మాత్రమే రూపించినట్లయితే అది కేవలనిరవయవ రూపకమని లక్షణకారులన్నారు. అది మాలారూపంలో ఉంటే మాలానిరవయవ రూపకం అవుతుంది. అయితే ఇక్కడ సూర్యబింబమునందు కాని, గొడుగులో కాని అవయవనిరూపణం జరుగలేదు. అందువల్ల కూడా రూపకాలంకారసిద్ధి లేదు.

ఆ విధంగా కాక, ‘సూర్యబింబం గొడుగుగా ప్రకాశించింది’ అన్నప్పుడు ఉపమేయమైన సూర్యబింబానికి ఉపమానమైన గొడుగు ఆరోప్యమాణమైనందున దర్శించేవారి దృష్టిలో సూర్యబింబం గొడుగుగా పరిణామాన్ని చెందినదని అనవచ్చును. ఉపమేయమునందు ఆరోపింపబడిన ఉపమానం ప్రకృతరూపంలో – అంటే, ఉపమేయరూపం గానే పరిణమించినట్లయితే అది పరిణామాలంకారం అవుతుంది. ఒక విధంగా ఇది పైని చెప్పిన రూపకంలో అంతర్భవించేదే. ఉపమానం ఎక్కడ ఉపమేయరూపం గానే ప్రకృతానికి ఉపయోగిస్తుందో, అది పరిణామం అనికూడా అనవచ్చును. సూర్యబింబం గొడుగుగా పరిణమించి ప్రకృతోపయోగాన్ని చెందిందని కదా అంటున్నాము? కాని, ఇక్కడ కవి స్వయంగానే రవిబింబానికి ఛత్రరూపపరిణామాన్ని తిరస్కరించి, రవిబింబం ఛత్రమై ‘ఉపమించటానికి యోగ్యంగా ఉన్నది’ అంటున్నాడు. పోతనగారి ఉద్దేశంలోనే ఇది రూపకమూ కాదు; పరిణామమూ కాదన్నమాట. రవిబింబం ఛత్రము వలె ఉన్నది అనక, ‘రవిబింబం ఛత్రమై ఉపమించటానికి యోగ్యంగా ఉన్నది’ అనటం వల్ల ఇది ఉపమాలంకారమూ కాదు. మూలంలో వలెనే సూర్యబింబము చిన్నది చిన్నది కావటాన్ని చెబుతూ శ్రీమహావిష్ణువుకు ఉత్తరోత్తర వృద్ధిని చెప్పటం జరిగింది. అందువల్ల ఇదీ సారాలంకారమే.

ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాము. వటుఁడు = బ్రహ్మచర్యాశ్రమంలోకి అడుగుపెట్టి, ఒంటిజందెంతో ఉన్న ఆ పొట్టివడుగు; బ్రహ్మాండమున్ = పధ్నాలుగు లోకాలు, తొమ్మిది వర్షాలు, వాటికి ఆవల శుద్ధజలార్ణవం, ఆ సమస్తాన్ని చుట్టుకొని ఉన్న లోకాలోకపర్వతం దాకా అండాకృతిలో ఉన్న మహాప్రదేశాన్ని; తాన్ = విశదమైన ఆకారశోభతో తానై స్వయంగా; నిండుచోన్ = సర్వాంగ సంపూర్ణంగా వ్యాపిస్తున్నప్పుడు –

రవిబింబంబు = సూర్యమండలం; ఛత్రంబు + ఐ = గొడుగై; శిరోరత్నము + ఐ = తలమానికమై; శ్రవణ + అలంకృతి + ఐ = చెవియందు దాల్చిన మకరకుండలమై; గళాభరణము + ఐ = మెడలో అలంకరించికొన్న కౌస్తుభ రత్నమై; సౌవర్ణకేయూరమై – సౌవర్ణ = బంగారుతో చేసిన, కేయూరము + ఐ = బాహుపురి అయి; ఛవిమత్కంకణమై – ఛవిమత్ = నిండైన వెలుగుతో కూడిన, కంకణము + ఐ = చేతికి తొడిగికొన్న అందె అయి; కటిస్థలిన్ + ఉదంచత్ + ఘంట + ఐ = నడుముకు చుట్టికొన్న మొలత్రాటికి వ్రేలుతున్న గంటయై; నూపురప్రవరంబు + ఐ = శ్రేష్ఠమైన అందెయై; పదపీఠము + ఐ = కాలిపీట అయి; ఉపమింపన్ = పోలిక తెచ్చేందుకు; పాత్రము + అగున్ = యోగ్యము అవుతుంది – అని.

అంతే కాదు. సంస్కృతంలో లాగా ‘నుదుటనున్న తిలకము’ అని వ్రాస్తే అది బొట్టు వలె ఉన్నదన్న స్వరూపబోధ కలగటం కష్టం. తిలకము అంటే నిలువుబొట్టు అనే ప్రసిద్ధి. సూర్యబింబం పాణితలమందలి చక్రము వలె కనబడటం సమంజసమే కాని, పైకెత్తి పట్టిన చేతియందు రాణించినట్లు ఆ కల్పన ఆజానులంబిదీర్ఘబాహువైన శ్రీహరి చేతిని కటివరదహస్తుడై క్రిందికి చాచినప్పుడు పొందుపడదు. ఊర్ధ్వబాహుడై ఉన్నట్లయితే శిరస్సు నుంచి పాదాల వరకు చూపుతున్న వస్తువుల క్రమం తప్పుతుంది. సూర్యబింబం నాభియందలి పద్మము వలె కానరావటం కూడా అంత సిద్ధకల్పన కాదు. పైగా, నాభియందలి పద్మము యథావస్థితంగా నాభియందు గాక – నాభినుంచి వెలువడిన తూడుకు అగ్రభాగాన – నాభికి ఏ కొంత దూరంలోనో ఉంటుంది.

అందువల్ల పోతనగారు ఈ మూడు కల్పనలను విడిచివేశారు. అందుకు ప్రత్యామ్నాయంగా 1. కటిస్థలిని ఉదంచద్ఘంటయై, 2. నూపురప్రవరంబై, 3. పదపీఠమై అన్న సరికొత్త కల్పనలను సందర్భానికి తగినట్లు ప్రవేశపెట్టి ఔచిత్యాన్ని పాటించారు. సూర్యబింబం విశ్వరూపుని శిరోదేశం నుంచి పాదసీమకు వచ్చి తన భక్తిని వెల్లడించినట్లయింది. పోతనగారు శ్రీమహాభాగవతంలో మూలాతిరిక్తంగా కనీసం ముప్ఫై – నలభై గ్రంథాల నుంచి డెబ్భై దాకా అనువాదాలను చేశారు. వాటన్నిటిని సేకరించటం సాహిత్యారాధకులకు ఎంతో ఆనందఫలదాయకమైన కృషి.
-----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

Thursday, June 28, 2018

తెలుగు వ్యాసం


తెలుగు వ్యాసం



సాహితీమిత్రులారా!




"తెలుగు వ్యాసం" తన స్వీయచరిత్రను చెబుతున్నట్లు వ్రాసిన రచన
ఇది తిరుమల రామచంద్రగారి రచన ఆస్వాదించండి -

నన్ను తెలుగులో వ్యాసం అంటారు, నా పొరుగున వున్న కన్నడం వారు నన్ను ప్రబంధ, నిబంధ అని అంటారు. ఇటు పక్క పొరుగువారయిన మహారాష్ట్రులు, హిందీవారు నిబంధ, లేఖ అని అంటుంటారు. ఇప్పుడు సంస్కృతం వారు కూడ లేఖ అని అంటున్నారు. ప్రబంధ, నిబంధ అంటే నాకు కంపరం పుడుతుంది; నన్ను ఎవరో ఏదో చట్రంలో బిగించినట్టు అనిపిస్తుంది. పాపం! వాళ్ళ అభిప్రాయమేమో పరిమితమైన దేశకాలాలలో నా స్వరూపం తెలుపడమే. కాని, నాకు మాత్రం ఒక బంధంలాగ అనిపిస్తుంది. ఇక లేఖ అనే మాట వ్రాతకు ఉపయోగపడేదంతా లేఖే కదా! నా ప్రత్యేకత ఏముంది? కనుక వ్యాసం అనేదే నాకు చాల నచ్చింది.

మీరు ఏ సంస్కృత నిఘంటువు నన్నా తిరగవేయండి.వ్యాస అనే పదానికి అర్థాలు ఇలా ఉంటాయి పరాశరపుత్రుడు, వేదాలను వింగడించిన వాడు అయిన వ్యాసభగవత్పాదుడు, విస్తృతి, ఒక విధమైన కొలత, వృత్తక్షేత్ర మధ్యరేఖ, పౌరాణికుడు, వింగడించడం, విడదీయడం, భాగించి కలపడం, వివరించడం. కాని వీటిలో నన్ను తెలిపే అర్థం ఉండదు. కారణమేమిటంటారా? కొంచెం ఓపికతో వినాలి మరి!

నన్ను నేను విశ్లేషించుకుంటూ పోతే వ్య + ఆస అనేది నా పుట్టిన ఇల్లు. తెలుగు వారు నా జన్మ పదాలకు గల అర్థాలను పరిశీలించారు, వ్యాసులవారు చేసిన వేదవిభజన వర్గీకరణాది కార్యాలనూ పరిశీలించారు. నా ప్రధానకార్యం పరిమిత సమయంలో, పరిమిత స్థలంలో ఒక విషయాన్ని వివరించి విశ్లేషించడం గనుక ‘వ్యాసం’ అని నామకరణం చేశారు. నాకు చాలా నచ్చింది యీ పేరు. పొంకంగా, బింకంగా ఉందికదూ!

నిజానికి నా పుట్టుక మానవుడు మాటాడనేర్చినప్పుటి నుంచే. ఆవేశోద్వేగాలను, ఆశ్చర్యానందాలను వ్యక్తీకరించడానికి మానవుడు తనకు తెలియకుండానే ఛందస్సును వినియోగించాడు గాని, కన్నదాన్ని విన్నదాన్ని ఆనుపూర్విగా వివరించడానికి, సామాన్యాభిప్రాయ కథనానికి వచనాన్నే ఆశ్రయించాడు. ఆ విధంగా నేను యజుర్వేదంలోనే ఆవిర్భవించాను.యజుర్వేదం తొలిమంత్రం నేనే.

ఈ వేదాలకు వ్యాఖ్యానరూపాలైన బ్రాహ్మణాలు, చింతనపరాయణాలయిన ఆరణ్యకాలు, ఉపనిషత్తులు నన్ను మన్నన చేశాయి. తైత్తిరీయం వంటి ఉపనిషత్తు లయితే నన్ను సంపుటాలు సంపుటాలుగా గుది గుచ్చాయని నా భావన. సంపుటాలంటే నా ఉద్దేశం సంకలనాలు. తైత్తిరీయం వివిధ విషయాలున్న వ్యాసాల సంకలనమనే నా నమ్మకం.

జ్ఞానం విస్తృతమవుతున్న కొద్దీ నా ప్రయోజనం కూడ ఎక్కువయింది. పండితులు వివిధ విషయాలను చర్చించి కొన్ని నిర్ణయాలను చేసేవారు. ఆ చర్చలను శాస్త్రార్థాలు, వాక్యార్థాలు అనే వారు. ఆ నిర్ణయాలను వ్రాసిన వాటిని క్రోపత్రాలు అని వ్యవహరించేవారు. క్రోడమంటే ఒడి, మధ్యప్రదేశం అని ఒక అర్థం. ఒక శాస్త్రవిషయంలో విడిపోయినట్టు గ్రంథకర్త గాని, ఇతరులుగాని భావించే అంశాన్ని ఆనుపూర్వితో వ్రాసి అక్కడ చేర్చేవారు. దీనికి క్రోడపత్రమని పేరు. ఈ క్రోడపత్రాలు మూలవిషయాల కంటె మిన్నగా వుంటూ, మూలవిషయాలను ఉద్దీప్తంచేస్తాయి. వీటిలోని విషయ నివేదన ప్రతిపాదన, వివరణ, ప్రతిపక్షమతఖండన, స్వమతస్థాపన,ఉపసంహారం ఈ పద్ధతిలో నా రూపం రాటు తేలింది.

నేను ఎన్నో శతాబ్దాలపాటు తత్వచర్చలను, శాస్త్రవిషయాలను అంటిపెట్టుకునే వున్నాను. కాలప్రవాహంలో ఇతర సంస్కృతుల సంబంధం కలగడంతో నాలోను మార్పు తప్పదు కదా! పాశ్చాత్యులతో సంబంధం కలగడంతో వారి essay అనే సాహిత్యప్రక్రియతో నాకు సంపర్కం కలిగింది. పాశ్చాత్యులకు కూడ ఇది కొత్తేనట. మొదట ఇది పరాసుల సొమ్ము. తర్వాత ఆంగ్లేయులదయిందట. Essay అంటే ప్రయత్నించు, పరీక్షించు, చేసి చూడు అని అర్థాలు. క్రోడపత్రాలలో ఉన్న నన్ను పోలిన ఈ రచన వారికి కొత్త గనుక ఆ పేరే దానికి పెట్టారు. అది మన దేశానికి వచ్చింది. అది వివిధ విషయాలను తెలుపుతూ నన్ను ఆకర్షించింది. నేను దానిలోని మంచిని గ్రహించాను. కేవలం తత్వశాస్త్రవిషయాలలోనే సంచరిస్తున్న నేను essay లాగ భౌతిక విషయారామంలో విహరించసాగాను.

నన్ను ఆ విధంగా కొత్త ఆరామాలకు తోడ్కొనిపోయిన మొదటి విద్వాంసుడు సామినేని ముద్దుకృష్ణమనాయనింవారు. ఈయన నాకు ప్రమేయం అని నామకరణం చేశారు. తెలుసుకోవలసిన విషయాల సంగ్రహం అని దీని అర్థం. ఆయన నన్ను లౌకికంగా చాలా చోట్లకు తిప్పారు.

కొంతకాలం గడిచింది. మహావిద్వాంసులు, భారతదేశంలో తొలితరం మహామహోపాధ్యాయులు, శబ్దార్థ సర్వస్వమనే సంస్కృతవిజ్ఞాన సర్వస్వ సంకలనానికి తొలిసారిగా ఉద్యమించిన వారు, పత్రికా సంపాదకులు అయిన పరవస్తు వెంకట రంగనాథాచార్యులయ్యవార్లంగారు నన్ను ఆదరించి సంగ్రహం అనే పేరు పెట్టి ముచ్చటగా పిలిచారు. అంతగా ముచ్చట పడుతున్నప్పుడు కాదనడం ఎందుకని ఊరుకున్నాను.

ఆ కాలంలోనే వీరేశలింగంగారనే గొప్ప సంఘ సంస్కర్త, వీరాగ్రేసరుడు అయిన విద్వాంసుడు ఉన్నాడు. ఆయన తన భావ ప్రచారం కోసం నన్ను ఎడాపెడా వాడాడు. సంఘం, సాహిత్యం, న్యాయస్థానం, బ్రాహ్మమందిరం ఒక్కటేమిటీ పలుచోట్ల నన్ను ఆయన తిప్పి కొత్త ప్రపంచాన్నే చూపాడు. ఆయన నన్ను ఉపన్యాసమనీ, వ్యాసమనీ పిలవడం ప్రారంభించారు. చివరకు నాకు “వ్యాస”మనే పేరే రూఢమైంది.

నేను అప్పటినుండి చాలా రంగాలకు పాకాను. ఒక మహాసామ్రాజ్యాన్నే శాసించడానికి ప్రయత్నించానన్నా అతిశయోక్తి కాదు. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభానికి నా సామ్రాజ్యం సువిశాలమయింది. పత్రికలు నన్ను బాగా ఆదరించాయి. ప్రజలకు ఏ సంగతి వివరించాలన్నా నా ఆవశ్యకత వారికి తెలియవచ్చింది. కాని, కథలకు, కవితలకు, నవలలకు ఇవన్నీ నాతోపాటు వ్యాప్తిలోనికి వచ్చినట్టివే ఉన్నంత జనాదరం నాకు ఉండేది కాదు. నిజానికి నా అవసరమే ఎక్కువ. ఏ సంగతి వివరించాలన్నా నేను తప్పనిసరి. కాని మోజు మాత్రం వాటిపైనే. వాటికే సన్మానాలు, సత్కారాలునూ.

ఇట్లు

తెలుగు వ్యాసం

(వక్కణం తిరుమల రామచంద్ర)

1997

(అప్పాజోస్యులవిష్ణుభొట్ల ఫౌండేషన్‌; USA వారి సౌజన్యంతో

వారి 1998 వార్షిక సంచిక నుంచి సంక్షిప్తం)
-----------------------------------------------------
ఈమాట సౌజన్యంతో

Tuesday, June 26, 2018

చిత్రకవిత్వ పరిచయము


చిత్రకవిత్వ పరిచయము



సాహితీమిత్రులారా!




డా. ఏల్చూరి మురళీధరరావుగారి  ఒక వ్యాసం నుండి -
చిత్రకవిత్వ పరిచయాన్ని గురించిన ఈ చిన్నపాటి వివరణను
చూడండి-

చిత్రకవిత్వం ప్రధానంగా శబ్దచిత్రం, అర్థచిత్రం అని రెండు విధాలు. ఈ రెండింటి సమావేశం వల్ల ఉభయచిత్రం ఏర్పడుతుంది. కేవలం శబ్దవిషయకమైన గుణాలంకారచమత్కృతివిశేషాన్ని కలిగి, వ్యంగ్యప్రాధాన్యం లేకపోవటం శబ్దచిత్రమని, అర్థాన్ని పురస్కరించుకొన్న గుణాలంకారచమత్కారవిశేషవత్త్వం అర్థచిత్రమని, శబ్దార్థాలు రెండింటికి తుల్యప్రాధాన్యం ఉన్న వ్యంగ్యవైభవం తోడి గుణాలంకారచమత్కృతి ఉభయచిత్రమని అప్పయ దీక్షితులవారి చిత్రమీమాంసకు సుధా టీకను వ్రాసిన ధరానందుడు నిర్వచించాడు. అనుప్రాసము, లాటానుప్రాసము, ఛేకానుప్రాసము మొదలైన శబ్దాలంకారాలకు శబ్దచిత్రాలని సామాన్యవ్యవహారం. పువ్వులతో దండను కూర్చినప్పుడు, ముత్యాలతో హారాన్ని రూపొందించినప్పుడు రకరకాల పువ్వులలోని వర్ణసమ్మేళనను చూసి, ముత్యాల వరుసలోని ఆకర్షణీయమైన క్రమప్రథను తిలకించి ముగ్ధులయ్యే రసజ్ఞుల లాగానే శబ్దచిత్రాలలో స్వసమానవర్ణసన్నివేశం వల్ల – అంటే ఒకే అక్షరాన్ని, ఒకే అక్షరసంహతిని చిత్రచిత్రప్రకారాలుగా ప్రయోగించటం వల్ల పాఠకుల మనస్సులో ఒక విచ్ఛిత్తివిశేషం ఉదయిస్తుందని, ఆ విచ్ఛిత్తి (శరీరానికి సౌందర్యలేపనం వంటి అంగరాగం) విశేషాన్ని భావించే భావుకులకు రసభావసంపత్తి కంటె ఆ శబ్దచిత్రసామగ్రిపైనే అభిమానం ఏర్పడుతుందని విద్యాధరుని ఏకావళికి తరళ వ్యాఖ్యను వ్రాసిన మల్లినాథ సూరి అన్నాడు.

అర్థాన్ని ఆశ్రయించుకొన్న చమత్కృతులు అర్థచిత్రాలు. యమకాలంకారంలో అర్థమే ప్రధానం కాబట్టి అది అర్థచిత్రమని కొందరు, అర్థం శబ్దచమత్కారంలో అణిగిపోతున్నది కాబట్టి శబ్దచిత్రమని కొందరు లక్షణకారులు ఊహించారు. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం, వ్యాఘాతం, అతద్గుణం మొదలైన అలంకారాలను చిత్రార్థవంతంగా ప్రయోగించటమే అర్థచిత్రం. శబ్దానికి, అర్థానికి తుల్యప్రయోజనం ఉన్న శ్లేష, వక్రోక్తి, విరోధాభాసం, సమాసోక్తి, అపహ్నవం వంటివి ఉభయచిత్రాలు.


Monday, June 25, 2018

కుఱుచ నిడుద కందములు


కుఱుచ నిడుద కందములు 



సాహితీమిత్రులారా!



ఏ కంద పద్యములోనైనను సరి పాదములలో చివర గురువు తప్పక ఉండాలి. రెండు నలజ గణములు జ-గణములైనప్పుడు నాలుగు లఘువులు అవసరముగా నుండి తీరాలి. అనగా ఒక కంద పద్యములో కనీసము రెండు గురువులు, నాలుగు లఘువులు తప్పని సరిగా నుండవలయును. కందపద్యములో మొత్తము 64 మాత్రలు. నాలుగు లఘువులు తప్ప మిగిలిన అక్షరము లన్నియు గురువులైనప్పుడు మనకు కంద పద్యములో 34 అక్షరములు (30 గురువులు + 4 లఘువులు) ఉంటాయి. దీనిని కుఱుచ కందము అంటారు. రెండు గురువులు తప్ప మిగిలినవన్ని లఘువులైనప్పుడు మనకు కంద పద్యములో 62 అక్షరములు (2 గురువులు + 60 లఘువులు) ఉంటాయి. దీనిని నిడుద కందము అంటారు. క్రింద వీటికి నా ఉదాహరణములు –

కుఱుచ కందము లేక గగ కందము లేక
 “సర్వ” గురు కందము (14 గగములు) –

రామా మేఘశ్యామా
రామా ప్రేమాభిరామ – రాజాద్యక్షా
రామా సుగ్రీవాప్తా
రామా సీతాసమేత – రాజీవాక్షా



నిడుద కందము లేక నల కందము లేక
“సర్వ” లఘు కందము(14 నలములు) –

బరువయె ఫలములఁ దరువులు,
సిరులయె వనలతల విరులు – చెరువుల జలముల్
బరుగిడె సెలలయి ధరపయి,
స్వరముల నెలవయెను బ్రకృతి – సరసఋతువునన్

---------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

Sunday, June 24, 2018

బహువిధ కందములు


బహువిధ కందములు



సాహితీమిత్రులారా!


ద్వివిధ కందములో పూర్వార్ధమును, ఉత్తరార్ధమును తారుమారు చేసినను పద్యము అర్థవంతముగా నుండవలయును. అదే విధముగా చతుర్విధ కందములో ఒక కంద పద్యములో నాలుగు విధములైన కందపు అమరికలు మనకు అర్థవంతముగా కనబడవలయును. నల చతుష్కందములో సరి పాదములలోని రెండవ గణము నలముగా నుండవలయును. అట్టి నలముతో మఱొక కంద పద్యము ప్రారంభము కావలయును. జ-గణ చతుష్కందములో బేసి పాదములలో రెండవ గణము, సరి పాదములలో మూడవ గణము జ-గణముగా నుండవలయును. సరి పాదములలోని రెండవ గణముతో నూతన కంద పద్యములను మొదలు పెట్టాలి. వీటికి క్రింద నా ఉదాహరణములు –

ద్వివిధ కందము
                                     మొదటి కందము
రాకేందుముఖీ వడి నీ
రాకకొఱకు వేచియుంటి – రంజిల రజనిన్
రాకేందుబింబ మతిగా
రాకొమరిత జూడు వెల్గె – రత్నాంబరమై

రెండవ కందము – పై కందపు పాదములు3,4,1,2 వరుసలో.


చతుర్విధ కందము-
చతుర్విధ కందమును మొట్ట మొదట నన్నెచోడుడు కుమారసంభవములో నుపయోగించెను. తఱువాత కావ్యాలంకార చూడామణిలో కూడ ఇట్టి పద్యము గలదు. అవి –

నన్నెచోడుని కుమారసంభవమునుండి (12.217)

చతుర్విధ కందము
                                       మొదటి కందము 
సుజ్ఞానయోగతత్త్వ వి-
ధిజ్ఞులు భవ బంధనములఁ ద్రెంచుచు భువిలో
నజ్ఞానపదముఁ బొందక
ప్రాజ్ఞులు శివుఁ గొల్తు రచల భావనఁ దవులన్

రెండవ కందము –
భవ బంధనములఁ ద్రెంచుచు
భువిలో నజ్ఞానపదముఁ బొందక ప్రాజ్ఞుల్
శివుఁ గొల్తు రచల భావనఁ
దవులన్ సుజ్ఞానయోగతత్త్వ విధిజ్ఞుల్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణినుండి(6.48)

చతుర్విధ కందము – మొదటి కందము –
చాళుక్య విశ్వవిభునకు
వాలున్ బుధనుతియు సుగుణ – వర్గము నిధులున్
జాలుటయు నీతినిరతియు
మేలున్ మధురతయు నీగి – మీఱినవిధమున్

రెండవ కందము –
బుధనుతియు సుగుణ వర్గము
నిధులున్ జాలుటయు నీతి-నిరతియు మేలున్
మధురతయు నీగి మీఱిన
విధమున్ చాళుక్య విశ్వ-విభునకు వాలున్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

నేను వ్రాసిన చతుర్విధ కంద మొకటి –

మొదటి కందము –
మిలమిల వెలుగులఁ గందము
గలిగెన్ బలు పలుకు విరుల – గమగమ లలరెన్
దెలుఁగున సొబగుల హారము
జెలగెన్ బలు ఛవుల హృదియుఁ – జిమ్మెను గళలన్

రెండవ కందము –
పలు పలుకు విరుల గమగమ
లలరెన్ దెలుఁగున సొబగుల – హారము జెలగెన్
బలు ఛవుల హృదియుఁ జిమ్మెను
గళలన్ మిలమిల వెలుగులఁ – గందము గలిగెన్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

నల చతుష్కందము – మొదటి కందము –
భూమీశ దనుజ హారీ
శ్యామా నవమదనరూప – యవనిజభువనా
శ్రీమంత పరమ పురుషా
రామా పవనసుతపాల – రక్షితహవనా

రెండవ కందము –
నవమదనరూప యవనిజ
భువనా శ్రీమంత పరమ – పురుషా రామా
పవనసుతపాల రక్షిత
హవనా భూమీశ దనుజ – హారీ శ్యామా

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

జ-గణ చతుష్కందము –
మొదటి కందము –
రావమ్మ నాదు సాలకు
దేవీ నిను గొల్తునమ్మ – దినమున్ మనమున్
భావింతు భక్తి మలహరి
నీవే నను గనుము రాగ-నిలయా జననీ

రెండవ కందము –
నిను గొల్తునమ్మ దినమున్
మనమున్ భావింతు భక్తి – మలహరి నీవే
నను గనుము రాగనిలయా
జననీ రావమ్మ నాదు – సాలకు దేవీ

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

Saturday, June 23, 2018

చక చక చీలును రెండై


చక చక  చీలును రెండై




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం
విప్పండి-

ఒకటై చేతికి వచ్చును
ఒకటా ముప్పదియురెంటి నొప్పుగతాకున్
చక చక చీలును, రెండై
ప్రకటంనుగనేల కూలు ప్రాజ్ఞులు చెప్పన్


ఒకటై వస్తుంది తగిన విధంగా ముప్పది రెంటిని
తగినవిధంగా తాకుతుంది వెంట వెంటనే రెండుగా
చీలి పడిపోతుంది అదేమిటో చెప్పమంటున్నాడు కవి.


సమాధానం - పలుదోము పుల్ల
                       (పండ్లను తోమే పుల్ల)

Friday, June 22, 2018

కూటము - కూటమి అర్థభేదమేమి?


కూటము - కూటమి అర్థభేదమేమి?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం చూడండి
సమాధానాలు చెప్పండి-


కూటమనఁగనేమి? కూటమియననేమి?
         వేఱర్థములవేవి వేంకటేశ?
ఆరోహణంబేది? అవరోహణంబేది?
         వేఱర్థములవేవి వేంకటేశ?
అవ్యాప్తియేది? అతివ్యాప్తియయ్యదియేది?
         వేఱర్థములవేవి వేంకటేశ?
ఆధారమెయ్యెది? అధేయమెయ్యెది?
         వేఱర్థములవేవి వేంకటేశ?ఆదిభౌతికమెయ్యెది అంబుజాక్ష?
ఆధిదైవికమెయ్యెది అబ్జనాభ?
మెచ్చుగా నర్థభేదాలు చెప్పవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

చదివారు కదా సమాధానాలు
చెప్పగలరేమో చూడండి

సమాధానాలు -

1. కూటము - హాలు       
 2. కూటమి - రతి
3. ఆరోహణము - ఎక్కుట    
4. అవరోహణము - దిగుట
5. అవ్యాప్తి - చెప్పినమాట అన్నిచోటులా వర్తించకుండుట
6. అతివ్యాప్తి - చెప్పినమాట అదనముగ వర్తించుట
7. ఆధారము - పాత్ర        
8. ఆధేయము - పాత్రలోని వస్తువు
9. ఆధిభౌతికము - పంచభూతములచే అనగా అతివృష్టి 
                                  మొదలైన వాటితో కలిగే దుఃఖము
10. ఆధిదైవికము - రోగాలచే కలిగే దుఃఖము


Wednesday, June 20, 2018

ఉదాహరణములు – 2


ఉదాహరణములు – 2



సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.............

పంచమీ విభక్తి
– పంచమీ విభక్తి ప్రత్యయములు వలన, కంటె, పట్టి, నుండి, కోలె, పై, మీఁద, పోలె. వలన అను పదము వలను నుండి కలిగినది అని భావన. వలను అనగా దిక్కు, వైపు అని అర్థము. వలపట అనగా కుడి దిక్కు. కంటె అనునది కు + అంటె. పట్టి పట్టు అను పదమునకు అన్వయించును. ఇవి కాక చిన్నయ సూరి చెప్పని మఱొక ప్రత్యయము ఉండి. ఈ ఉండి ద్రుతముతో చేరి నుండిగా మారినది. వలనకు బదులు కతమున, కృతమున అని కూడ కవులు వాడిరి. సమయమును సూచించుటకు కోలె ప్రత్యయమును కూడ ఉపయోగిస్తారు. వలనకు బదులు వల్ల, కంటెకు బదులు కన్న కూడ ఉపయోగిస్తారు. క్రింద కొన్ని ప్రయోగములు-

విష జలంబువలన, – విషధర దానవు
వలన, ఱాలవాన-వలన, వహ్ని
వలన, నున్న వాని-వలనను రక్షించి
కుసుమశరునిబారి – గూల్ప దగునె – పోతన భాగవతము – 10.1039

ఇతర దైవములవల్ల – నిలను సౌఖ్యమా, రామ
మతభేదము లేక సదా – మదిని మరులు గొన్న తన
మనసు దెలిసి బ్రోచినను – మఱచి నను నీవె రామ
తనవాడన దరుణమిదె – త్యాగరాజ సన్నుత – త్యాగరాజ కృతి.

నుత జల పూరితంబు లగు – నూతులు నూఱిటికంటె సూనృత-
వ్రత యొక బావి మేలు మఱి – బావులు నూఱిటికంటె నొక్క స-
త్క్రతు వది మేలు తత్క్రతు శ-తంబునకంటె సుతుండు మేలు త-
త్సుత శతకంబుకంటె నొక – సూనృత వాక్యము మేలు సూడగన్ – నన్నయ భారతము, ఆదిపర్వము, 4.92

ఎన్నగాను రామభజనకన్న మిక్కి లున్నదా
అను. సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనసా
కన్న విన్నవారి వేడుకొన్న నేమి ఫలము మనసా
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామరామరామ యనుచు రమణి యొకతె పల్కగా
ప్రేమ మీఱ భద్రాద్రి ధాముడైన రామవిభుడు
కామితార్థము ఫలము లిచ్చి కైవల్య మొసగలేదా
శాప కారణము నహల్య చాపఱాతి చంద మాయె
పాప మెల్ల బాసె రామపదము సోకి నంతనె
రూపవతులలో నధిక రూపురేఖలను గలిగియు
తాప మెల్ల తీరి రామ తత్త్వ మెల్ల తెలుపలేదా – రామదాస కృతి.

ఆకాశంబునుండి శంభుని శిరం-బందుండి శీతాద్రి సు-
శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూ-లోకంబునందుండి య-
స్తోకాంబోధి బయోధినుండి పవనాం-ధోలోకముం జేరె గం-
గా కూలంకష పెక్కు భంగులు వివే-కభ్రష్ట సంపాతముల్ – ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి నీతిశతకము 9

నాఁటంగోలె రాహువునకుఁ జంద్రాదిత్యులతోడి విరోధంబు శాశ్వతంబయి ప్రవర్తిల్లుచుండె, – నన్నయ భారతము – ఆది, 2.20

అందు గిరీశుకంటె సుభటాగ్రణి, అర్కజుకంటె దాని, శ్రీ
నందనుకంటె రూపి, సురనాథునికంటె విలాసు, డాపగా
నందనుకంటె శౌచి, నలినప్రియుకంటె ప్రతాపి, దండ భి-
న్నందనుకంటె సూనృతు డనందగు భంగి ధరాతలంబునన్ – కృష్ణా జిల్లా గన్నవరము తాలూకా ఎనమలకుదురు గ్రామములో కేశవస్వామి దేవాలయమునందలి ఱాతి స్తంభముపై శాసనము, శక సంవత్సరము 1054.

ఉదాహరణములలో పంచమీ విభక్తి
పంచమీ విభక్తి ప్రత్యయములలో వలన మాత్రమే ఉదాహరణకావ్యములలో వాడబడినది. దివాకర్ల వేంకటావధాని వ్రాసిన శ్రీవిశాలాంధ్రోదాహరణమునుండి పంచమీ విభక్తి పద్యములు-

సమర హితోత్తమప్రతిభ – సర్వ మహత్తర కీర్తి వైభవం-
బమరఁగ భోజనాంబర గృ-హాదిక మందొక లోటు లేక యు-
త్తమ గుణ సంపదం గనిన – తమ్ము నవాత్త లసన్మహాంధ్ర రా-
ష్ట్రమువలనం దెలుంగు ప్రజ – సర్వ సమృద్ధి నెసంగు గావుతన్

కళిక- తురగవల్గనరగడ- త్రి/త్రి/త్రి/త్రి – త్రి/త్రి/త్రి/త్రి (ప్రాస, అంత్యప్రాస)

మఱియు రాజరాజ నృపతి – మన్నించిన ధరణివలన
వరకవి నన్నయ జనించి – వర్ధిల్లిన యవనివలన
గణపతిదేవు పరాక్రమ – ఘనత కన్న ధాత్రివలన
అనఘుడు తిక్కన జనుల – నదలిచిన ధరిత్రివలన
పరుల నోర్చి రెడ్డి విభులు – పాలించిన జగతివలన
అరులు బెగడ శ్రీనాథుం – డలరారిన వసుధవలన
రాయల భుజ పీఠంబున – రాణించిన జాణవలన
మాయని కవిత కవీంద్రుల – మది నిల్పిన గాణవలన

ఉత్కళిక- త్రి/త్రి/త్రి/త్రి

వేదార్థమ్ముల నెఱుగక
వాదమ్ము లొనర్చు చురక
నిజ సంస్కృతికిని వెలియై
గజిబిజి కనిశము గుఱియై
కలగు తెలుగువారి బ్రోవ
గల వేదార్థంపు త్రోవ
వెలయించిన భూమివలన
విలసిల్లిన జగమ్మువలన

కళికయైన తురగవల్గన రగడలో సూర్యగణములు చాల చోటులలో తప్పినవి. కాని పాదమునకు 24 మాత్రలు తప్పలేదు, ఉదా. మన్నించిన, వరకవిన(న్నయ వలన), వర్ధిల్లిన, గణపతిదేవు పరాక్రమ, ఇత్యాదులు. అదేవిధముగా ఉత్కళికలో నిజసంస్కృతికిని వెలియై, గుఱియై, వేదార్థంపు, ఇత్యాదులు. రగడలను ఇలా వ్రాయరాదు.

షష్ఠీ విభక్తి
విభక్తులలో చాల తికమకలు పెట్టించునది షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి ప్రత్యయములు యొక్క, కి(న్), కు(న్), లో(న్), లోపల(న్). ఈ విభక్తి మూడు విధములు – (1) శేష షష్ఠి (యొక్క), (2) నిర్ధారణ షష్ఠి (లో), (3) సంప్రదానార్థ షష్ఠి (కి, కు), సంస్కృతములో షష్ఠీ విభక్తి శేష షష్ఠి మాత్రమే. ఇది ఆంగ్లములోని genetive case. ఇది సంబంధార్థమును తెలుపుతుంది, యొక్క ప్రత్యయము ఒక్క నుండి వచ్చినది అంటారు. యడాగమము వలన ఒక్క యొక్కగా మారినదని భావన. కాని ఇక్కడ వచ్చిన చిక్కు ఏమనగా- యొక్కను తెలుగులో సామాన్యముగా వాడరు. సీత పుస్తకము అని చెప్పుతారు. సీతయొక్క పుస్తకము అని విగ్రహ వాక్యములో మాత్రమే చెప్పుతారు. యొక్క కనబడని ప్రత్యయము. పాల్కుఱికి పండితారాధ్య చరిత్రలో ఒక పద్యములో యొక్క వాడబడినదని అంటారు. ఇక కి-, కు-, ప్రత్యయములు శేష షష్ఠీ రూపములో చాల అరుదుగా ఉపయోగించబడినవి. లవకుశులు రామునికి పుత్రులు అను వాక్యములో కి- శేష షష్ఠిగా వాడబడినది. దీనికి క్రింద ఉదాహరణ-

శ్రీ నరసింహుని లక్ష్మీ
మానవతికి వెంగళాఖ్య – మంత్రీశ్వరుఁడున్
గోనప్పయు ననదగు వి-
ద్యానిధు లిఱువురును బుత్రు-లై మని రవనిన్ – తెనాలి రామకృష్ణుడు, పాండురంగ మాహాత్మ్యము, 1.44

లో-ప్రత్యయమును నిర్ధారణ షష్ఠి అంటారు. ఈ అర్థములో మాత్రమే ఇది షష్ఠి, లేనియెడల సప్తమి అని చెప్పవచ్చును. జాతి, గుణ, క్రియా, సంజ్ఞలను బట్టి ఒక వర్గమునుండి మఱొకదానిని వేఱు చేయుట నిర్ధారణ. జంతువులలో సింహము శౌర్యవంతమైనది, స్త్రీలలో సీత అతి పతివ్రత, ఇత్యాదులు.

సప్తసంతానములలోఁ బ్ర-శస్తి గాంచి
ఖిలము గాకుండునది ధాత్రిఁ – గృతియ కానఁ
గృతి రచింపుము మాకు శి-రీష కుసుమ
పేశల సుధామయోక్తులఁ – బెద్దనార్య – అల్లసాని పెద్దన మనుచరిత్రము – 1.14

షష్ఠీవిభక్తి ప్రత్యయములలో ఎక్కువగా వాడబడునది కి-, కు-లు సంప్రదానార్థములో (dative) మాత్రమే. తెలుగు కావ్యముల ప్రత్యేకతలలో షష్ఠ్యంతములు ప్రసిద్ధమైనది. ప్రార్థన, సుకవి ప్రశస్తి, కుకవి నింద, కృతిభర్త, కృతికర్త వంశములు, కావ్యకారణము, ఇవి చెప్పిన పిదప కథకు ముందు షష్ఠీ విభక్తితో అంతమగు పద్యములను నన్నయ తఱువాతి కవు లెందఱో వ్రాసినారు. ఈ పద్ధతిని ఆరంభించిన మహాకవి ప్రబంధకవితాపితామహుడు నన్నెచోడుడు. తెలుగు సాహిత్యములో (బహుశా) ప్రథమ షష్ఠ్యంతము –

వినుత బ్రహ్మర్షికి, న-
త్యనుపమసంయమికి, సజ్జ-నాభరణునకున్
మనుజాకార మహేశున,
కనుపమచరితునకు, మల్లి-కార్జున మునికిన్ – నన్నెచోడుని కుమారసంభవము – 1.66

పారావార గభీరికిన్, ద్యుతిలస-త్పద్మారికిన్, నిత్య వి-
స్ఫారోదార విహారికిన్, సుజన ర-క్షా దక్ష దక్షారికిన్,
సారాచార విచారికిన్, మద రిపు-క్ష్మాపాల సంహారికిన్,
వీరా సాటి నృపాలకుల్, దశరథో-ర్వీనాథ జంభారికిన్ – మొల్ల రామాయణము – బాల 98

శాస్త్రీయసంగీతకార్యక్రమములలో సామాన్యముగా చివరి పాట-

నీ నామ రూపములకు నిత్య జయమంగళం
పవమానసుతుడు బట్టు పాదారవిందములకు
నవముక్తాహారములు నటియించు యురమునకు
నళినారి గేరు చిఱునవ్వుగల మోమునకు
పంకజాక్షి నెలకొన్న యంగ యురమునకు
ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండు
రాజీవనయన త్యాగరాజ వినుతమైన
నీ నామ రూపములకు నిత్య జయమంగళం – త్యాగరాజ కృతి.

వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి – స్వాతిముత్యము చిత్రము, సి. నారాయణ రెడ్డి

వ్యాలేభచర్మధారికి
మూలస్థానంబు నాది-మూర్తికి శ్రీకా-
పాలికి మృడునకు హరునకు
నీలగ్రీవునకు నీశు-నికి నుమపతికిన్ – గుంటూరు జిల్లా నాదెళ్ల గ్రామమునందు మూలస్థానేశ్వరాలయపు ఱాతి స్తంభము, క్రీ.శ. 1138.

ఉదాహరణములలో షష్ఠీ విభక్తి
ఉదాహరణ కావ్యములలో కి-, కు- లను మాత్రమే కవులు ఉపయోగించారు. చెలమచెర్ల రంగాచార్యులు రచించిన శ్రీమద్రామానుజోదాహరణమునుండి షష్ఠీ విభక్తి పద్యములను క్రింద ఇస్తున్నాను-

వెన్నెల బాట ప్రాబలుకు – వేలుపురాణికిఁ గ్రొత్త కప్రపుం-
దిన్నెల నేల కఱ్ఱిమదిఁ – దేర్చిన వెన్నుని పాటిబోఁటికిన్
గ్రొన్నన సెజ్జ చిల్క నుడి – కూరిమి చానకు వేని డెంద మా
వన్నియకాడు మా యుడయ-వర్లకు నిచ్చలు గేలు మోడ్చెదన్

కళిక- హరిగతిరగడ- చ/చ/చ/చ – చ/చ/చ/చ (ప్రాస, అంత్యప్రాస)

మఱియును యామునఋషి యాదేశము – మౌళి వహించిన మంగళ మతికిన్
గుఱుతుగ శ్రీరంగమ్మున బీఠము – గోరఁగ నెక్కిన దేశిక పతికిన్
ఆగమవాక్య పరాక్రమ లీలను – యజ్ఞ సుమూర్తిని గెల్చిన గుణికిన్
భాగవతాకాశ మ్మది వెల్గఁగ – భాసిలు జ్ఞాన నభోమణికిన్
గోవిందాఖ్యుని వైష్ణవ ముద్రల్ – గూడఁగ జేసిన గురుతర యతికిన్
పావన వాచా లహరుల ద్రావిడ – వసుమతిఁ బూత మొనర్చిన కృతికిన్
బంధుర మాయావాది తమమ్ములఁ – బాఱఁగ ద్రోలిన భాసుర రవికిన్
బంధన హేతు వివాది కువాది – ప్రచయాచల గణ ఖండన పవికిన్

(నాలుగవ పాదములో ద్వితీయార్ధములో గణము తప్పినట్లున్నది.)

ఉత్కళిక- చ/చ/చ/చ

తొలి ముగు రాళ్వారులు మడి జేయన్
కులశేఖరు లటఁ గాల్వలు దీయన్
అల శఠగోపులు విత్తులు వేయన్
లలి పెరియాళ్వార్ నీరము వోయన్
అలరుల నాండాళ్ ముడువగ మాలిక
అలరెడి వైష్ణవ వనమున కేలిక
వీనుల దనిసెడి కోయిల ఱేనికి
దీనుల బ్రోచెడి దివ్యజ్ఞానికి

సప్తమీ విభక్తి
అందు, న అనునవి సప్తమీ విభక్తి ప్రత్యయములు. ఎక్కడ అను ప్రశ్నకు సమాధానము నిచ్చు ప్రత్యయము లన్నియు నా ఉద్దేశములో సప్తమీ విభక్తి ప్రత్యయములే. క్రింద కొన్ని ఉదాహరణములు-

అరుదగు తత్పయోద సమ౦యంబున నొక్కట విస్తరిల్లె నం-
బరమున నంబుద ధ్వనియుఁ, – బల్వల భూముల భూరిదర్దురో-
త్కర రవముల్, మహీరుహశి-ఖండములందు శిఖండి తాండవాం-
తర మద మంజుల స్వన ము-దారతరంబగుచున్ వనంబునన్ – నన్నయ భారతము, అరణ్యపర్వము, 4.137

దానాంభః పటలంబునం బృథు పయో – ధారావలిం దాల్చి, గ-
ర్జా నిర్ఘోషము బృంహితచ్ఛలన బ్ర-చ్ఛాదించి, ప్రావృట్పయో-
దానీకంబు శరద్భయంబున నిఘూ-ఢాకారతన్ డిగ్గె నా-
గా నొప్పారె మదోత్కట ద్విరద సం-ఘంబుల్ వనాంతంబునన్ – ఎఱ్ఱన భారతము, అరణ్యపర్వము, 4.144

సకలార్థ సంవేది – యొక యింటిలోపలఁ
జెలితోడ ముచ్చటల్ – సెప్పుచుండు
విపుల యశోనిధి – వేఱొక యింటిలో
సరసిజాసనుఁ గూడి – సరస మాడుఁ
బుండరీక దళాక్షుఁ – డొండొక యింటిలోఁ
దరుణికి హారవ-ల్లరులు గ్రుచ్చుఁ
గరుణ పయోనిధి – మఱియొక యింటిలోఁ
జెలి గూడి విడియము – సేయుచుండు

వికచ కమల నయనుఁ – డొక యింటిలో నవ్వు
బ్రవిమలాత్ముఁ డొకటఁ – బాడుచుండు
యోగిజన విధేయు – డొక యింట సుఖ ఘోష్టి
సలుపు ననఘుఁ డొకటఁ – జెలగుచుండు – పోతన భాగవతము, దశమ ఉత్తర, 621

(పై పద్యములో లో-ప్రత్యయము సప్తమీ విభక్తి అని నా భావన.)

ఏ తావునరా నిలుకడ నీకు
ఎంచి చూడ నగపడవు
అను. సీతా గౌరీ వాగీశ్వరి యను
స్త్రీ రూపము లందా గోవిందా
భూకమలార్కానిల నభమందా
లోకకోటులందా
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత
శివ మాధవ బ్రహ్మాదులయందా – త్యాగరాజ కృతి.

కొమ్మల గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసు రనినా
అలలు కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా – మల్లీశ్వరి చిత్రము, దేవులపల్లి కృష్ణశాస్త్రి

శ్రీపరమేష్ఠి పాదసర-సీరుహయుగ్మమునందు సంభవం-
బై పరగెన్ జతుర్థకుల-మందులఁ బుట్టిరి భూరికీర్తులు-
ద్దీపిత ధర్మచిత్తు లిన-తేజు లనేకులు సద్గుణ…
దీ పుడమిం బ్రసిద్ధముగ నెఱ్ఱమ నాయకుఁ డున్నతస్థితిన్ – గుంటూరు జిల్లా అమరేశ్వరాలయము, క్రీ.శ. 1200

ఉదాహరణములలో సప్తమీ విభక్తి
– లాక్షణికుడైన కాకునూరి అప్పకవి వ్రాసిన అప్పకవీయములోని శ్రీకృష్ణోదాహరణమునుండి సప్తమీ విభక్తి పద్యములు-

పృథులావంతి వర స్వయంవరమున – న్విందాను విందాదులన్
బ్రథన క్షోణిని గెల్చి సద్గుణ సుభ-ద్రన్ భద్ర దోకొంచు వ-
చ్చి ధరాధీశు ననుజ్ఞచే ననలసా-క్షీకంబు గృహ్యోక్త స-
ద్విధి బెండ్లాడిన కృష్ణునందు నిలిచెన్ – ధీర ప్రతాపోన్నతుల్

కళిక- హంసగతిరగడ- పం/పం – త్రి/త్రి (ప్రాస, అంత్యప్రాస)

మఱియు నుగ్రసే నా-మాత్యునందు
నెఱి మీఱ లయకాల – నిత్యునందు
విదురార్చిత పదార-విందునందు
విదళిత ఘోరారి – బృందునందు
నా భీరు వస్త్రాప-హారునందు
బలి పట్టణ ద్వార-పాలునందు
జలగాది దశ తనూ-చ్ఛాదునందు


మొదటి పాదములోని రెండవ మాత్రాగణము ఎదురు నడకతో ఉండే య-గణమును (IUU) లాక్షణికుడైన అప్పకవి ఉపయోగించుట ఆశ్చర్యకరమే!

ఉత్కళిక- పం/త్రి

సజ్జరాగంబు
రజ్జునాగంబు
కంధియోగంబు
మంథరాగంబు
రాపుతో నూచి
వీపుతో మోచి
వెలయు హరియందు
జలజాక్షునందు

సంబోధనా ప్రథమా విభక్తి
బహుశా సంబోధనా ప్రథమా విభక్తి చాల తేలికైనది అని చెప్పవచ్చును. మనిషిని, దేవతను, చరాచరములను ఉద్దేశించి సంబోధన చేయుటయే ఈ విభక్తియొక్క ముఖ్యమైన పని. కొన్ని చోటులలో ఓ అను పదము కూడ నామమునకు ముందు ఉండును. ఉదాహరణకావ్యములలో ఓ పదము ఉండరాదు. కొన్ని నిదర్శనములు –

పున్నాగ, కానవే – పున్నాగ వందితుఁ,
దిలకంబ, కానవే – తిలకనిటలు,
ఘనసార, కానవే – ఘనసార శోభితు,
బంధూక, కానవే – బంధు మిత్రు,
మన్మథ, కానవే – మన్మథాకారుని,
వంశంబ, కానవే – వంశధరుని,
జందన, కానవే – చందనశీతలుఁ,
గుందంబ, కానవే – కుందరదను,

నింద్రభూజమ, కానవే – యింద్ర విభునిఁ,
గువలవృక్షమ, కానవే – కువలయేశుఁ,
బ్రియకపాదప, కానవే – ప్రియవిహారు,
ననుచు గృష్ణుని వెదకి ర-య్యబ్జముఖులు – పోతన భాగవతము, దశమస్కంధము పూర్వ, 1009

సరసిజ దళ నేత్రా, – చారు సౌవర్ణా గాత్రా,
గరుడ జవన పత్త్రా, – కాలభిత్కంక పత్త్రా,
చరణ వినత మిత్త్రా, – శాత్రవ ధ్వాంత మిత్త్రా,
కరధృత ఘనగోత్రా, – కంజ విద్వేషి గాత్రా – కంకంటి పాపరాజు శ్రీమదుత్తర రామాయణము, 8.345

విన్నపాలు వినవలె – వింత వింతలు
పన్నగపు దోమతెర – పైకెత్త వేలయ్యా
తెల్లవాఱె జామెక్కె – దేవతలు, మునులు
అల్లనల్ల నంత నింత – నదివో వారె
చల్లని తమ్మిరేకుల – సారశ్యపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి – మేలుకొన వేలయ్యా – అన్నమాచార్యుల కృతి.

సర్వ మంగళ నామా సీతారామా రామా
సర్వ వినుతా శాంతిదాతా రామా రామా
మనసులోని మాయా బాపి రామా రామా
మనుపుమా నీ మోము జూపి రామా రామా – భక్తపోతన చిత్రము, సముద్రాల సీనియర్.

వసంతతిలకము- శ్రీరామ రామ నృప-శేఖర విష్ణుమూర్తీ
వీరాగ్రగణ్య భుజ-విక్రమ పార్థివేంద్రా
మారారి యంఘ్రియుగ – మానస రాజహంసా
కారుణ్యదాన సహ-కార మహీజరాజా – గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా తిమ్మాపురము గ్రామమున నున్న ఱాతిస్తంభముపైన చెక్కబడిన శాసనమ, సుమారు క్రీ.శ. 1160 నాటిది.

ఉదాహరణములలో సంబోధనా ప్రథమా విభక్తి
తిమ్మావజ్ఝల కోదండరామయ్య వ్రాసిన అన్నమాచార్యోదాహరణమునుండి సంబోధన పద్యములు. వీరు మదురై-కామరాజ విశ్వవిద్యాలయములో తెలుగు శాఖలో ఆచార్యులుగా నున్న నా సహోద్యోగి.

ఆగమ వేద శాస్త్ర కల-శాంబుధి తీర్ణమతి ప్రభావ, పం-
చాగమ చక్రవర్తి, కృతి – సంగ్రథనాధ్వర దీక్షితేంద్ర, ప్ర-
జ్ఞాగురు, సత్కృతి ప్రభవ – కారణ, గానకళావిలాస, యం-
ధ్రాగమ సార్వభౌమ, యమ-రాధిప గాయకతుల్య వైభవా

కళిక- ద్విరదగతి రగడ- పం/పం – పం/పం (ప్రాస, అంత్యప్రాస)

మఱియు వదినెలచేత – మాట వడ్డ కవీంద్ర
సరసు లొజ్జలయొద్ద – జదువనట్టి సుధీంద్ర
యక్కమ్మసతి బెండ్లి-యాడి కూడిన ప్రోఢ
చక్క సంగీతవి-జ్ఞాన మరసిన వాఁడ
భగవదుద్బోధ స-ద్భావ పుష్కల గీత
సుగమ నిగమ విచార – శుద్ధ చిత్తోపేత
పదకవిత్వ పయోధి-పార మీదిన శూర
పదపదంబున రసము – పరిఢవిల్లెడు వీర

ఉత్కళిక- పం/పం

చందమామయు జోల
యందమగు సువ్వాల
సొంపు గులికెడు లాలి
యింపు ధవళము లోలి
నర్ధచంద్రిక పదము
లర్థి దుమ్మెదపదము
లను రచించిన కీర్తి
నెనసినట్టి సుకీర్తి

సార్వవిభక్తికము
ఉదాహరణ కావ్యములలో ఎనిమిది విభక్తులలో వృత్తములు, రగడలలో కళికోత్కళికలను చెప్పిన పిదప అన్ని విభక్తులతో ఒక పద్యమును వ్రాయుట నియమము. దీనిని సార్వవిభక్తికము అంటారు. నేను ఆరంభములో తెలిపిన ముకుందమాలలోని కృష్ణో రక్షతు… బహుశా క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దపు పూర్వభాగము నందలిది. కన్నడములో దొఱకిన మొదటి పుస్తకమైన కవిరాజమార్గములోగల సార్వవిభక్తిక పద్యమును ఇంతకు ముందే తెలిపినాను. క్రింద సార్వవిభక్తికమునకు కొన్ని ఉదాహరణములు చదవండి. ఇందులోని పంక్తులను విభక్తులకు తగినట్లు విఱిచినాను. పద్య పాదపు అంతమును ఈ ‘/’ గుర్తుతో తెలిపినాను.

నీవే చిన్మయమూర్తివి తలపఁగ
నిన్నుం గొలువ శుభము సేకూరును
నీచేత దమోవరణము విరియును
నీకై నుతి వాఙ్మణు లొనగూర్చుట
నీవలన గృతార్థత్వము నొందుట
నీకును సరిగా రే వేలుపులును
నీయందు దలంపులు నిలుపందగు
నీరేజాక్షా, రక్ష నమస్తే – రాధామాధవము – తృతీయాశ్వాసము, చింతలపూడి (రాధామాధవకవి) ఎల్లనార్యుడు

(ఇది గణస్వరూపములో మధురగతిరగడను పోలియున్నది, కాని యతి, ప్రాసాంత్యప్రాసలు లేవు.)

నీవే దైవత చక్రవర్తివి
సభన్నిన్నే బ్రశంసింతు
నీ/చే విశ్వంబలరారు
నీకొఱకు నేజేతు న్నమస్కారముల్ /
నీవల్లం భవంబుల్ దొలంగు
నెవరు న్నీకు న్సముల్గారయా /
యావిర్భావమునందు లోకములు నీయందే కదా
యో హరీ – వాసవదత్తా పరిణయము – వక్కలంక వీరభద్రకవి

మధు నిశాచర వైరి నీవై – మాహురిని నిద్రించు వాఁడవు
నిన్ను గానఁగ జాల రెవ్వరు – నిఖిలమును నీవెంచఁ గందువు
నీదుచే లోకంబు లెల్లను – నిల్చె శ్రీలును హెచ్చి యిపుడు
వేదములు నీకై నుతల్ పది – వేల భంగుల నిచ్చు నెప్పుడు
భుక్తి ముక్తులు గాంతు రెంతయుఁ – బొల్పుతో నీవలన దాసులు
భక్తి యుక్తులు నీకె గల్గఁగఁ – బ్రబలుదురు వైకుంఠ వాసులు
తొడరి సద్గుణ తతులు నీయం-దున వసించె ప్రభావ నీరధి
చెడని భక్తి యొసంగి నను ర-క్షింపవే కరుణా పయోనిధి
నీ మహా మహిమంబు పొగడఁగ – నేరు నే నజ్ఞాన హృదయుఁడ
స్వామి దత్తాత్రేయలోక ని-వాస లస దసమాన సదయుఁడు – మల్లారెడ్డి షట్చక్రవర్తి చరిత్ర మల్లారెడ్డి, దత్తాత్రేయ స్తుతి

(ఇది వృషభగతి రగడలో నున్నది. మొదటి రెండు పాదములకు ప్రాస లేదు.)

కరుణాసింధువు నీవు
నిన్ గొలుతు
నా -కష్టాలు నీ దృష్టిచే / మఱుఁగౌ
నీకయి జేతు పూజలు చిర-మ్మౌ భక్తి పుష్పించఁగా /
ధరపై నీవలనన్ గలుంగు శుభముల్ –
ధ్యానమ్ము నీకే గదా /
స్మరణల్ నాహృదియందు నీవె
పర-మాత్మా యేసునాథా ప్రభూ – జెజ్జాల కృష్ణ మోహన రావు

నీవీశుండవు
నిన్ను గొల్తు
వరముల్ నీచేతఁ గైకొందు
నేఁ / గైవారం బొనరింతు నీకొఱకు
సంకల్పింప నీడేఱె మ/త్సేవల్ నీవలనన్
మహాయశము నిల్చెన్ నీకు
నీయందు ల/క్ష్మీవాల్లభ్యమ్ము గంటి
భక్తవరదా శ్రీవేంకటేశ్వరా – శ్రీవేంకటేశ్వరోదాహరణము, తాళ్లపాక పెద తిరుమలయ్య

(చతుర్థీ విభక్తి వృత్తములో, కళికోత్కళికలలో కై ప్రత్యయమును ఉపయోగించిన కవి సార్వవిభక్తిక పద్యములో కొఱకు ప్రత్యయమును వాడుట గమనార్హము.)

కులరత్నంబవు నీవు
నిన్నెనయు శ్రీ -కొల్వొప్పు
నీచేత కీ/ర్తులు
నీకై హరి యిచ్చు
నీవలన మీ-ఱు న్వన్నెయు న్వాసి
నీ/కలరున్ సొమ్ములు
విద్య హృద్య మగు నీ-యం దార్జనం బౌర
చం/చల దృక్పంచశరాంక
తిర్మలయశే-షా
పోషితార్యోత్తమా – శేషార్యోదాహరణము – బాలకవి అనంతయ

నీవున్నాఁడవు
నిన్ను నమ్మితి నెదన్ –
నీచే ముదంబుందు
నీ/కై వే మ్రొక్కులు
గొందు నీవలన నే -గాంక్షల్ సదా
నీకు మా / సేవల్
నీ పదయుగ్మ మందెసగు నా – చిత్తంబు
పాలింపు మో / కైవల్యప్రభ
వేంకటాద్రి నిలయా –
కళ్యాణ కాంతాప్రియా – గాజుల వీరయ్య శ్రీవేంకటాద్రినిలయోదాహరణము

తల్లీ భారతీ
నిన్నె నమ్మితిని
నీ – తత్త్వంబు నీచే త్వదీ/యోల్లేఖంబు నవించు
నీకయి మనో-వ్యూహాత్మలన్ జేర్చి
నీ/వల్లన్ విద్దెల నంది
నీకెపుడు సే-వన్ జేయ
నీయందు భ/క్త్యుల్లంబు ననుగ్రహింపుము
మదీ-యోద్గాతవై మాతరో – సామగానప్రియోదాహరణము, బుర్రా కమలాదేవి

అంకితాంకము
ఉదాహరణములలో చివరి పద్యమును కవి పేరు, కృతి పేరు, అంకితము నిచ్చిన వారి పేరు ఉండునట్లు వ్రాయవలయును. దీనిని అంకితాంకము అని పిలుస్తారు. మొదటి రెండు ఉదాహరణకావ్యములలో, అనగా బసవ, త్రిపురాంతకోదాహరణములలో ఇట్టి పద్యము లేదు. ఇట్టి పద్యము శ్రీవేంకటేశ్వరోదాహరణములో మొదట తోచినది. ఆ పద్యము-

ఆ రవి తారకంబుగ ను-దాహరణంబు రచించె భక్తి వి-
స్తారతఁ దాళ్ళపాకపుర – శాసనుఁ డన్నయ తిమ్మనార్యుఁ డిం-
పారఁగ జక్రనందక గ-దాంబుజధారికి శ్రీవధూ మనో-
హారికి వేంకటాచల వి-హారికి శౌరికి నంకితంబుగాన్ – తాళ్ళపాక పెదతిరుమలయ్య శ్రీ వేంకటేశోదాహరణము

చెలఁగు నుదాహరణంబిది
నలసన్నిభ బాలకవి య-నంతయ నీకై
వెలయించె దీని గైకొను
మలఘు సమున్మేష తిరుమ-లార్యుని శేషా – బాలకవి అనంతయ శేషార్యోదాహరణము

పాల్కుఱికి సోమనాథుని బసవోదాహరణములో అంకితాంకము లేకున్నను, అతడు వ్రాసిన సంస్కృత బసవోదాహరణములో ఇట్టి పద్యము గలదు! అది-

ఆర్యా- శ్రీ బసవ రాజగుణమణి
ఖచితం జయతాత్ సువర్ణ మేతత్
సోమ సుకవినా రచితం
హృదయాభరణం సదాముదాహరణం – పాల్కుఱికి సోమన బసవోదాహరణం

ఉదాహరణములకు స్వరకల్పన
సంగీతము, సాహిత్యము ఈ రెండు సరస్వతీదేవికి ప్రియమైనవి అని చెప్పుతారు. కాని నిజ జీవితములో సంగీతజ్ఞులు సాహిత్యమునకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వరు, అదే విధముగా సాహిత్యవేత్తలు సంగీతమునకు సముచిత స్థానమును ఇవ్వరు. ఈ రెండు లలిత కళలు సమాంతర రేఖలవలె ఉంటాయి సామాన్యముగా. కాని యక్షగానములలో, ఉదాహరణములలో ఈ రెండింటికి ఉచిత స్థానము గలదు. తెలుగులో ఉన్నన్ని యక్షగానాలు మఱే భాషలో లేకున్నను, యక్షగానమును ఒక సజీవ కళగా జనులు ఇప్పుడు ఆదరించడము లేదు. అట్టి పరిస్థితిలో ఉదాహరణముల సమాచారమును చెప్పడము కంఠశోషయే. ముందే చెప్పినట్లు ఉదాహరణములలో వృత్తములు తాళరహితములు, కళికోత్కళికలు తాళబద్ధములు. కావున వీటికి సంగీతమును సమకూర్చవచ్చును. శ్రీ మంచాళ జగన్నాథరావు గారు ఇట్టి ప్రయత్నమును చేసినారు. తాళ్లపాక పెద తిరుమాలాచార్యుని శ్రీవేంకటేశ్వరోదాహరణమునకు వారు స్వరకల్పన చేసినారు[10]. ఆ వివరములను మొదటి అనుబంధములో చదువవీలగును. వారి స్వరకల్పన సంగ్రహమును క్రింద ఇస్తున్నాను (క్రమముగా విభక్తి, రగడ, రాగము, తాళము) –

ప్రథమ – వృషభగతి – నాట – త్రిపుట
ద్వితీయ – ద్విరదగతి – గౌళ – ఝంపె
తృతీయ – హయప్రచార – ఆరభి – తిశ్ర (ఏక)
చతుర్థి – హరిగతి – వరాళి – ఆది

(వెంకటరావుగారి పుస్తకములో వృషభగతి రగడ అని చెప్పబడినది సరి కాదు)

పంచమి – ద్విరదగతి – శ్రీ – ఝంపె
షష్ఠి – హయప్రచార – మేచబౌళి – తిశ్ర (ఏక)
సప్తమి – హంసగతి – రీతిగౌళ – ఝంపె

(జగన్నాథరావుగారు జయభద్ర రగడ అని చెప్పినది సరి కాదు)

సంబోధన – ద్విరదగతి – కేదారగౌళ – ఝంపె

తెలుగులో ఎన్ని విభక్తులు గలవు?
వ్యాకరణ పుస్తకములు ఎనిమిది (ప్రథమ నుండి సప్తమి మఱియు సంబోధన) అని చెప్పుతాయి. కేతన వ్రాసిన ఆంధ్రభాషాభూషణములో[9] ఇలా చెప్పాడు-

వ. అనంతరంబ విభక్తులు చెప్పెద బ్రథమయు ద్వితీయయు దృతీయయు జతుర్థియు బంచమియు షష్ఠియు సప్తమియు సంబోధనంబు నన నెనిమిది తెఱంగుల విభజింపబడుటం జేసి విభక్తు లనంబరగె. చేయువాడు ప్రథమయు, జేయంబడినది ద్వితీయయు, నుపకరణంబు తృతీయయు, జేయించుకొనువాడు చతుర్థియు, బాయుటకుం బట్టయినది పంచమియు, నొడయండు షష్ఠియు, నునికిపట్టు సప్తమియు, సమ్ముఖంబు సేయునది సంబోధనంబును నగు. 68.

కేతన అంగీకరించిన విభక్తి ప్రత్యయములు- న్, చే, కై, వలన, కు, యొక్క, అందు. వీనికి పెద్దన తో, కొఱకు, పట్టి, ఉండి, కంటె, న అను ప్రత్యయములను కలిపెను. ప్రౌఢ వ్యాకరణములో గుఱిచి, చేసి, తోడుత, పొంటె, ఉండి అను ప్రత్యయములు కూడ నున్నవి. ఉదాహరణకవులు కేతన నిర్ణయించిన విధముగా విభక్తులను వాడారు.

సంస్కృత వ్యాకరణము ననుకరించి తెలుగు వైయాకరణులు కూడ భాషలో ఏడున్నొకటి విభక్తులను తెలిపారు. కాని తెలుగులో కొన్ని చిక్కులు ఉన్నాయి. అవి-

ఒకే విభక్తిలో నున్న ప్రత్యయములను ఒకదానికి మఱొకటి మార్చ వీలుకాదు. చే- మఱియు తో- ప్రత్యయములు తృతీయా విభక్తికి చెందినను, చే- ఉన్న చోటులలో తో-ను ఉంచలేము. చే-ప్రత్యయము కరణార్థములో వాడబడగా, తో-ప్రత్యయము సహార్థములో వాడబడుతుంది. కాని సంస్కృతములో ఈ వ్యత్యాసము లేదు.
ఇంకొక చిక్కు ఏమనగా తెలుగులో ఒక విభక్తి ప్రత్యయమునకు బదులు వేఱొకటి వాడబడుట. వేటఁ బోయిరి అన్నపుడు వేటకు బోయిరి అని అర్థము. ఇక్కడ షష్ఠికి బదులు ద్వితీయ ఉపయోగించబడినది. కావున ప్రత్యయముల వాడుకచే విభక్తిని నిర్ణయించలేము. కి కు ప్రత్యయములు షష్ఠీ విభక్తి యయినను, అది సామాన్యముగా చతుర్థిలో (dative) ఎక్కువగా కనబడుతాయి. నిర్ధారణ షష్ఠిగా లో ప్రత్యయము చాల తక్కువ చోటులలో కనిపించును, ఎక్కువగా లో అధికరణార్థ (locative) రూపమైన సప్తమిలో కనబడును. యొక్క ప్రత్యయము షష్ఠికి చెందినదైనను, దానిని అదృశ్య రూపములో ఎక్కువగా నుపయోగిస్తాము. అర్థము ననుసరించి తెలుగులో పదునాలుగు విభక్తులు ఉన్నవి అని ఈ మధ్య నేను చదివినాను. తెలుగులో ఎన్నియో మార్పులు వచ్చినవి. కాని మనము ఇంకను సంఖ్యల రూపములో గల విభక్తులను వొదిలివేసి, ప్రశ్నలను అడిగి వచ్చు జవాబుల ప్రకారము విభక్తులను నిశ్చయించిన బాగుగా ఉంటుంది.
కర్త్రర్థక, కర్మార్థక, ప్రేరణార్థక (కరణార్థక), సహార్థక, సంప్రదానార్థక, తులనార్థక, సంబంధార్థక, అధికరణార్థక, సంబోధనార్థకములుగా విభక్తులను వర్గీకరించుట.
కర్త్రర్థక – ప్రథమా – ఎవరు, ఏమి, ఏది
కర్మార్థక – ద్వితీయా – ఎవరిని, దేనిని
ప్రేరణార్థక – ఎట్లు
సహార్థక – ఎవరితో, దేనితో
సంప్రదానార్థక – ఎవరికి, దేనికి
తులనార్థక – ఎవరికన్న, దేనికన్న, ఎవరిలో, దేనిలో
సంబంధార్థక – ఎవరి, దేని
అధికరణార్థక – ఎక్కడ
సంబోధనార్థక – సంబోధనా ప్రథమ

ప్రశ్నోత్తరములతో విభక్తుల అర్థమును అన్వయమును సులభముగా నిర్ణయించ వీలవుతుంది. ఇలా చేస్తే మనకు ఎన్నియో క్రొత్త ప్రత్యయములు కూడ లభిస్తాయి. కావలయునన్న ఇంకను ఇట్లు విభక్తులను ఎక్కువ చేసికొన వచ్చును. అంకెలను విభక్తులనుండి తీసివేయుట ముఖ్యమైన కర్తవ్యమని నా భావన.

ఉదాహరణ కావ్యములు
నాకు తెలిసి ఇంతవఱకు పూర్తిగా లభించిన ఉదాహరణ కావ్యముల పేరులను క్రింద ఇస్తున్నాను. ఇది సంపూర్ణము కాదు, నాకు తెలియనివి ఇంకా ఎన్నో ఉండవచ్చును. మీకెవరికైనా తెలిసి ఉంటే చెప్పండి.

(1) బసవోదాహరణము – పాలుకుఱికి సోమనాథ కవి
(2) బసవోదాహరణము (సంస్కృతము) – పాలుకుఱికి సోమనాథ కవి
(3) త్రిపురాంతకోదాహరణము – రావిపాటి త్రిపురాంతక కవి
(4) శ్రీవేంకటేశ్వరోదాహరణము – తాళ్లపాక పెద తిరుమలయ్య
(5) చిక్కదేవరాయోదాహరణము (సంస్కృతము) – తిరుమలాచార్యుడు
(6) శ్రీ హనుమోదాహరణము – చిత్రకవి పెద్దన
(7) శేషార్యోదాహరణము – బాలకవి అనంతయ
(8) శ్రీ కృష్ణోదాహరణము – కాకునూరి అప్ప కవి
(9) శివోదాహరణము (సంస్కృతము) – ఓరుగంటి రామాయామాత్యుడు
(10) మల్లికార్జున దేవస్తవోదాహరణము (సంస్కృతము) – కాళీపట్నపు సిద్ధరామ కవి
(11) శ్రీ నాగేశ్వరోదాహరణము – మండపాక పార్వతీశ్వర శాస్త్రి
(12) గోపాలోదాహరణము – విశ్వనాథ సత్యనారాయణ
(13) వీరేశలింగోదాహరణము – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
(14) అన్నమార్యోదాహరణము – తిమ్మావజ్ఝల కోదండరామయ్య
(15) శంకరోదాహరణము – శంకరప్రసాద్
(16) శ్రీమద్రామానుజోదాహరణము – చెలమచెర్ల రంగాచార్యులు
(17) ఆంధ్రలక్ష్మీవైభవోదాహరణము – చెలమచెర్ల రంగాచార్యులు
(18) శ్రీ విశాలాంధ్రోదాహరణము – దివాకర్ల వెంకటావధాని
(19) శ్రీ వీరభద్రోదాహరణము – మల్లంపల్లి వీరేశ్వర శర్మ
(20) విరూపాక్షోదాహరణము – మల్లంపల్లి వీరేశ్వర శర్మ
(21) శ్రీ లక్ష్మీనరసింహోదాహరణము – సుప్రసన్న
(22) సామగానప్రియోదాహరణము – బుర్రా కమలాదేవి
(23) వివేకానందోదాహరణము – పాటిలు తిమ్మా రెడ్డి
(24) శ్రీవేంకటాద్రినిలయోదాహరణము – గాజుల వీరయ్య
(25) శ్రీ రామోదాహరణము – నిడుదవోలు వేంకట రావు
(26) సి. పి. బ్రవున్ ఉదాహరణము – సన్నిధానం నరసింహ శర్మ
(27) యేసు క్రీస్తు ఉదాహరణము – పులివెండ్ల సాల్మన్ రాజ్
(28) వైజయంతీ శ్రీనివాస కల్యాణోదాహరణము – కపిలవాయి లింగమూర్తి
(29) శ్రీ భీమరాయ ఉదాహరణ కావ్యము – గుఱ్ఱం ధర్మోజి రావు
(30) శ్రీ ఆర్థర్ కాటన్ ఉదాహరణ కావ్యము – గుఱ్ఱం ధర్మోజి రావు
(31) శ్రీ దత్తాత్రేయోదాహరణము – కుప్పా కృష్ణమూర్తి
(32) శ్రీ గణపతి సచ్చిదానంద దత్తోదాహరణము – ఆదిభట్ల కామేశ్వర శర్మ
(33) శ్రీ దక్షారామ భీమేశ్వరోదాహరణ కావ్యము – వి. ఎల్. ఎస్. భీమశంకరం
(34) శ్రీ శారదోదాహరణ తారావళి – జెజ్జాల కృష్ణ మోహన రావు

ఇందులో 1-25 వఱకు వేంకటరావుగారి ఉదాహరణ వాఙ్మయములో పేర్కొనబడినవి, 26-31 వఱకు భీమశంకరంగారి భీమేశ్వరోదాహరణ కావ్యములో పేర్కొనబడినవి.

నాకు ఎంతయో నచ్చిన ఉదాహరణ కావ్యము బుర్రా కమలాదేవిగారి సామగానప్రియోదాహరణము. దానిని మీరు రెండవ అనుబంధములో చదువ వీలగును.

ముగింపు – నేను విభక్తులను పరిచయము చేయునప్పుడు ఒక సార్వవిభక్తిక సంస్కృత శార్దూలవిక్రీడితమును ముకుందమాలనుండి మీకు సమర్పించినాను. అది కృష్ణునిపైన వ్రాయబడినది. ఈ వ్యాసమును శ్రీ రామునిపైని సంస్కృతములోని సార్వవిభక్తికముతో ముగించ దలచాను. ఇది బుధకౌశికుడు వ్రాసిన శ్రీ రామ రక్షాస్తోత్రములోని చివరి పద్యము-

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోఽస్మ్యహం
రామో చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

రామః రాజమణిః సదా విజయతే – రాజులలో మణియైన రాముడు ఎల్లప్పుడు విజయవంతుడు
రామం రమేశం భజే – రమయొక్క భర్తయైన రాముని భజింతును
రామేణ అభిహతా నిశాచరచమూః – రాక్షస సైన్యము రామునిచే చంపబడెను
రామాయ తస్మై నమః – రాముని కొఱకు (కి) నా నమస్సులు
రామాత్ నాస్తి పరాయణం పరతరం – రామునికంటె వేఱు గమ్యము లేదు
రామస్య దాసః అస్మి అహం – నేను రామదాసుడిని
రామో చిత్తలయః సదా భవతు మే – నా చిత్తమెప్పుడు రామునియందుండు గాక
భో రామ మాం ఉద్ధర – ఓ రామా, నన్నుద్ధరించుము
(ఇంకాఉంది)
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, ఈ మాట అంతర్జాల మాసచత్రిక
సౌజన్యంతో 

Tuesday, June 19, 2018

రక్తబీజము పైన వ్రాలె శుకము


రక్తబీజము పైన వ్రాలె శుకము




సాహితీమిత్రులారా!


ఈ పద్యం చదివి అర్థం చెప్పగలరేమో
చూడండి.

పంచాంగమగగమారె వైకుంఠుఁడొకసారి
         రక్తబీజమగ పైన వ్రాలె శుకము
బాలకుుడొకఁడు దివ్యస్నానముంజేసె
          గృహకారి గృహములో గృహముగట్టె
గృహమృగమ్మెలుకపై నెగిరి దూఁకి వధించె
          వక్రకంఠమెడారిఁబయనమించెఁ
బాపభీతిల్లె దివాభీతముంజూచి
          మణికట్టుపై గుట్టెముంటితిండి
వేఁటకై యీగపులిపొంచి గూఁటినుండె
నాకసమునకు నెగెరె జిహ్వారదమ్ము
మెప్పుగా నర్థములివేవి చెప్పవలయు
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!

సమాధానాలు -

పంచాంగము - ఐదు అంగములు కలది (తాబేలు)
రక్తబీజము - దానిమ్మచెట్టు(ఎర్రని విత్తులకాయలు గాయుచెట్టు)
దివ్యస్నానము - ఎండగాసే వానలో తడవటం
గృహకారి - కందిరీగ(మట్టితో నింట నిల్లు గట్టేది)
గృహమృగము - పిల్లి (ఇంటిలో మృగము వంటిది)
వక్రకంఠము - ఒంటె (వంకరమెడ కలది)
దివాభీతము - పగటిని చూచి భయపడేది గుడ్లగూబ
మంటితిండి - మట్టితి తినేది (తేలు)
ఈఁగపులి - ఈగలను వేటాడి తినేది సాలెపురుగు
జిహ్వారదము - నాలుకయే దంతములుగా గలది - పక్షి

Monday, June 18, 2018

చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షర ప్రహేళికలు


చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షర ప్రహేళికలు





సాహితీమిత్రులారా!


చిత్రకవిత్వము నందలి ప్రక్రియలలో ప్రహేళిక యనునదొకటి. ఇది తెలుగులో పొడుపుకథ వంటిది. ఇది రసపోషణసమర్థము గాకున్నను ఉక్తివైచిత్రితో వినోదమును కల్గించు నలంకారము. లాక్షణికు లిందులో పలురకములను గుర్తించినను, ప్రస్తుతవ్యాస పరిధిలో చ్యుతాక్షర, దత్తాక్షర, చ్యుతదత్తాక్షరము లనెడు మూడురకములను గుఱించి తెలిసికొనిన చాలును. వీనికి నీక్రింద నిచ్చిన ఉదాహరణములన్నియు భోజసార్వభౌముని సరస్వతీకంఠాభరణమునుండి గ్రహింపబడినవి.

1. చ్యుతాక్షరప్రహేలిక:

చ్యుతాక్షరప్రహేలిక:ఉండవలసిన అక్షరమును వదలిపెట్టి చెప్పిన యెడల అది చ్యుతాక్షరప్రహేలిక యగును. దీనికి ఉదాహరణము:

పయోధరభరాక్రాంతా సంనమంతీ పదేపదే
పదమేకం న కా యాతి యది హారేణ వర్జితా.

పయోధరముల భారముచే నాక్రమింపబడినదియు, అడుగడుగునకు వంగుచున్నదియు నైన ఏది హారరహితమైనచో ఒక్క అడుగు కూడ కదలకుండును? – అని పై ప్రహేళిక కర్థము. ఈ శ్లోకములో విశేషణములు స్త్రీలింగములో నుండుట చేతను; పయోధర, హార, సంనమంతీ, అను శబ్దముల చేతను; స్తనములును, వానిపై నలంకృతమైన హారమును, పయోధరభారముచే వంగుచు నడుగిడుచున్న అంగనయు స్ఫురించుట సహజము. కాని అట్టి స్త్రీ హారవర్జితయైనచో ఒక్క అడుగును ముందుకు సాగకుండుట యేమి? ఇది అర్థవంతముగా లేదు. అందుచేత పయోధర శబ్దమునకు వేఱగు అర్థముండవలెను. దుగ్ధం క్షీరం పయ స్సమమ్ — అని అమరకోశము. అందుచేత పయస్సనగా పాలు, పయోధరము లనగా పాలను ధరించినవి – పాలకుండలు. ఈ పాలకుండలచే నాక్రాంతమైన వస్తువేదో అడుగడుగునకు వంగుచున్నది. అట్టి వస్తువు కావడి యగుట సహజము. కాని కావడి హారము లేక ఒక్క అడుగైనను ముందుకు సాగకుండుట యేమి? కావడికి, హారమునకు గల సంబంధ మేమి? అని యోచించినచో కావడి మోపరి లేకున్నచో కావడి ఒక్క అడుగైనను ముందునకు సాగదనుట స్పష్టము. సంస్కృతములో కాహారః అను పదమునకు కావడిమోపరి యని అర్థము. అందుచేత కాహార అను పదములో చ్యుతమైన (తొలగింపబడిన) కా-అక్షరమును హార-కు చేర్చుకొని, ఈ ప్రహేళికలో సూచితమైన వస్తువు ‘కావడి’ యని గుర్తింపవలెను.

2. దత్తాక్షరప్రహేలిక:

దత్తాక్షరప్రహేలిక: అవసరము లేనిచోట అదనపుటక్షరమును చేర్చినయెడల అది దత్తాక్షరప్రహేలిక యగును. దీని కుదాహరణము:

కాంతాయానుగతః కోఽయం పీనస్కంధో మదోద్ధతః
మృగాణాం పృష్ఠతో యాతి – శంబరో రూఢయౌవనః

బలసిన మూపులు గలవాడును, మదగర్వితుడును, స్త్రీచే అనుగమింపబడినవాడును, మృగములవెంట (అడవి జంతువుల వెంట) జనుచున్నాడు. అతడెవ్వడు? యౌవనవంతుడగు శంబరుడు. – అని పై శ్లోకమున కర్థము. ఈవర్ణనను జూడ నది వేటకాని వర్ణనవలె నున్నది. శ్లోకములో నతడు ‘శంబరు’ డని పేర్కొనబడినాడు. శంబరు డనగా వేటకాడా? మృగ దానవ బౌద్ధేషు శంబరః –- అని నానార్థరత్నమాల. అనగా శంబరశబ్దమునకు ఒకజాతిలేడి, శంబరుడను రాక్షసుడు, బౌద్ధుడు అను అర్థము లున్నవి. వేటకాడను అర్థము లేదు. కాని, కిరాత శంభూ శబరౌ అని శబరశబ్దమునకు కిరాతుడు (వేటకాడు) అనియు శివుడనియు అర్థము లున్నవి. ఇట్లు పరిశీలింపగా వినోదార్థము శ- తర్వాత అనవసరమైన అనుస్వారమును చేర్చి పై ప్రహేళికను నిర్మించినట్లు తేటపడుచున్నది. అందుచే, పై ప్రహేళకలోని శంబర-ను శబర-గా మార్చి అర్థవంతముగా పరిష్కరింపవలెను.

3.చ్యుతదత్తాక్షర ప్రహేళిక:-

చ్యుతదత్తాక్షర ప్రహేళిక: ఉండవలసిన అక్షరమును తొలగించి, దాని స్థానములో వేఱొక అక్షరమును వేసినయెడల నది చ్యుతదత్తాక్షర ప్రహేళిక యగును. దీని కుదాహరణము:

విదగ్ధః సరసో రాగీ నితంబోపరి సంస్థితః
తన్వంగ్యాలింగితః కంఠే కలం కూజతి – కో విటః

పండితుడును, సరసుడును, అనురాగవంతుడును, నితంబ మాధారముగా నిల్చినవాడును, స్త్రీచే కౌగిలింపబడిన కంఠము గలవాడును, మధురముగా కూయుచున్నవాడును ఎవడు? విటుడా? – అని పై శ్లోకమున కర్థము. ఇందులో – విదగ్ధః, సరసః, రాగీ, ఇత్యాదివిశేషణము లన్నియు పుంలింగములో నున్నవి. అందుచే వీనిచేత బోధింపబడు వ్యక్తి విటుడా యని ప్రశ్నించుట కవకాశము కల్గినది. కాని పైవిశేషణము లన్నియు నీటికుండకును సరిపోవుటచే, అట్టి నీటికుండనే సూచించుట ఈ ప్రహేళికా లక్ష్యము. ఘటః అను పదములోని ఘ-కు బదులు వి- అను అక్షరము వేయబడినదని గుర్తించినచో ఈ ప్రహేళికకు పరిష్కార మగును. విదగ్ధః అనగా, పండితుడనియు, బాగుగా కాల్చినదనియు, రాగి యనగా అనురాగవంతుడనియు, ఎఱ్ఱగానున్న దనియు; సరసః అనగా సరసుడనియు, నీటితో కూడినదనియు అర్థములు. నీటికుండను నితంబముపై నానించుకొని, దాని మెడచుట్టును చేతిని జేర్చి స్త్రీలు గొనిపోవుచుండ నందులో నీరు శబ్దించుచుండుట సహజము. ఇట్లు, ఘటః అను పదములోని ఘ-ను చ్యుతము చేసి (తొలగించి), దాని స్థానములో వి-ని దత్తము చేయుట (కూర్చుట)వల్ల ఈ ప్రహేళిక చ్యుతదత్తాక్షరప్రహేళిక యైనది.
----------------------------------------------------------
రచన - తిరుమల కృష్ణదేశికాచార్యులు, 
చిత్రకవిత్వరీతులు అనే వ్యాసం నుండి
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో

Sunday, June 17, 2018

ఉదాహరణములు – 1


ఉదాహరణములు – 1



సాహితీమిత్రులారా!

ఉదాహరణ వాఙ్మయమును గురించిన వ్యాసం
మొదటిది ఆస్వాదించండి-

ముందుమాట
నిడుదవోలు వేంకటరావుగారి ఉదాహరణవాఙ్మయము[1] చదివినపుడు నాకు ఈ ఉదాహరణ కావ్యములందు ఆసక్తి కలిగినది. సుమారు ఒక పుష్కరము ముందు వీటిని గుఱించి యాహూ ఛందస్సు, రచ్చబండ కూటములలో వ్రాసినాను. నాకు కూడ ఒక ఉదాహరణమును వ్రాయాలనే సంకల్పము కలిగినది, దాని ఫలితమే శారదోదాహరణ తారావళి. నేను చదివిన కొన్ని ఉదాహరణ కావ్యములలో లక్షణములను సరిగా వాడలేదని నేను భావించినాను. అందువలన నేటి కాలపు కవులకు, పాఠకులకు ఈ ప్రక్రియ వివరములను తెలుపుటయే ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము. దీనిని రెండు భాగములుగా ప్రచురించుతున్నాను. మొదటి భాగములో ఉదాహరణముల లక్షణములను సంగ్రహముగా తెలిపి ప్రతి విభక్తికి నిదర్శనములను చూపుతాను. ప్రతి విభక్తికి నిదర్శనములను 1. కావ్యము, 2. పాట, 3. శాసనము, 4. ఉదాహరణ కావ్యములనుండి చూప దలచుకొన్నాను. ఈ విధముగా ఒక సంపూర్ణమైన అవగాహన మనకు కలుగుతుంది.

పరిచయము
శ్రీనాథుడు వ్రాసిన హరవిలాస కావ్యములో కిరాతార్జునీయ ఘట్టము అందరకూ బాగుగా పరిచయమే. ఆ ఘట్టము పాఠ్య వస్తువుగా కూడా ఉండినది. అందులో అర్జునుడికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు శివుని స్తుతిస్తాడు. మొత్తము ఏడు పద్యాలు. ఆ పద్యాల ప్రత్యేకత ఏమంటే ఒక్కొక్క పద్యము ఒక్కొక్క విభక్తిలో ఉంటుంది. (ఎందుకో శ్రీనాథుడు పంచమీ విభక్తిలో వ్రాయలేదు). ఇలా విభక్తులలో వ్రాయబడిన పద్యములను ‘ఉదాహరణములు’ అంటారు. ఆ ఏడు పద్యములు ఇవి:

నీవ పరబ్రహ్మంబవు
నీవఖిలాండాండపతివి – నీవు ప్రసన్న-
శ్రీవిభవారోగ్యాయుః
ప్రావీణ్యప్రాభవైక – ఫలదుఁడవు శివా – 7.93
(ప్రథమా విభక్తి)

నిన్నుఁ ద్రిజగన్నివాసునిఁ
బన్నగకంకణుని భక్త-పరతంత్రుని న-
భ్యున్నత కరుణాగుణసం-
పన్నుని గనుఁగొంటి మంటి – బాలేందుధరా – 7.94
(ద్వితీయా విభక్తి)

నీచేతఁ గృపానిధిచే
వాచాగోచర వివేక – వైయాత్మునిచే
నోచంద్రకలాశేఖర
యాచించి మనోరథార్థ – మర్థిం గందున్ – 7.95
(తృతీయా విభక్తి)

నీకై యేను దపంబు చేసితి మహా-నిష్ఠా గరిష్ఠస్థితిన్
నీకై సంస్తుతి సేయుదుం గడఁగి నా – నేర్పొప్పఁగా నెంతయున్
నీకై పూజయొనర్తుఁ గొంత విరులన్ – నిత్యంబు సద్భక్తితో
నీకై సేవ యహర్నిశం బొనరుతున్ – వేదండచర్మాంబరా – 7.96
(చతుర్థీ విభక్తి)

సాటి యెవ్వరు నీకు ని-శాటభూష
కైటభారాతి హాటక-గర్భ వంద్య
ఘనజటాజూటవాటికా – ఘటిత వికట
గగనగంగా స్రవంతిక – కరటి వైరి – 7.97
(షష్ఠీ విభక్తి)

నీయందు జగములుండున్
బాయక యా జగములందుఁ – బాయక నీవున్
దీయనుపు దెలియ నజునకుఁ
దోయజనేత్రునకు నైనఁ – దోఁపదు శర్వా – 7.98
(సప్తమీ విభక్తి)

జయ సర్వేశ్వర సర్వలోక జనకా – చంద్రార్ధచూడామణీ
జయ కామాంతక కామితార్థ ఫలదా – చక్షుశ్శ్రవః కుండలా
జయ సంపూర్ణ కృపాగుణైక వసతీ – శైలేంద్రజా వల్లభా
జయ దక్షాధ్వరమర్దనా జయ గిరీ-శా యీశ రక్షింపవే – 7.99
(సంబోధనా ప్రథమా విభక్తి)

సార్వవిభక్తిక పద్యము – కులశేఖర ఆళ్వారుల ముకుందమాలలోని ఒక సార్వవిభక్తిక పద్యము –

కృష్ణో రక్షతు నో జగత్రయగురుః – కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేన అమరశత్రవో వినిహితాః – కృష్ణాయ తుభ్యం నమః
కృష్ణాత్ ఏవ సముత్థితం జగదిదం – కృష్ణస్య దాసోఽ స్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం- హే కృష్ణ రక్షస్వ మాం

దీనికి అర్థము:

– కృష్ణో రక్షతు నో జగత్రయ-గురుః – జగత్రయ గురుడైన కృష్ణుడు నన్ను రక్షించు గావుత – ప్రథమా విభక్తి (Nominative case).
– అహం కృష్ణం నమస్యామి – కృష్ణుని నేను నమస్కరించుచున్నాను – ద్వితీయా విభక్తి (Accusative case).
– కృష్ణేన అమరశత్రవో వినిహితాః – కృష్ణునిచే అమరుల శత్రువులు నిర్జించబడిరి – తృతీయా విభక్తి (Instrumental case).
– కృష్ణాయ తుభ్యం నమః – అందులకై కృష్ణునికి నా ప్రార్థనలు – చతుర్థీ విభక్తి (Dative case).
– కృష్ణాత్ ఏవ సముత్థితం జగదిదం – కృష్ణుని వలన ఈ విశ్వము సృష్టించబడినది – పంచమీ విభక్తి (Ablative case).
– కృష్ణస్య దాసోఽ స్మ్యహం – నేను కృష్ణుని యొక్క దాసుడిని – షష్ఠీ విభక్తి (Possessive case).
– కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం – కృష్ణునియందు సర్వ లోకములు గలవు – సప్తమీ విభక్తి (Locative case).
– హే కృష్ణ రక్షస్వ మాం – ఓ కృష్ణుడా, నన్ను రక్షించవా – సంబోధనా ప్రథమా విభక్తి (Denominative case).

ఈ విధముగా ఎనిమిది విభక్తులలో వృత్తములను, కళికోత్కళికలను వ్రాసి, చివర ఒక సార్వ విభక్తిక పద్యమును వ్రాయగా లభించిన లఘు కావ్యమును ఉదాహరణ కావ్యము అంటారు. వీటికి కొన్ని ప్రత్యేకమైన విభక్తి ప్రత్యయములు మాత్రమే అంగీకృతములు. అదే విధముగా రగడల రూపములో ఉండే కళికోత్కళికల ఉపయోగములో కూడ నియమములు ఉన్నాయి.

ఉదాహరణ లక్షణములు
తెలుగు సాహిత్యములోగల పలు ప్రత్యేకతలలో ఉదాహరణము మిక్కిలి ప్రసిద్ధి యైనది. ఉదాహరణము అనగా ప్రతియొక విభక్తితో మూడు చొప్పున పద్యములు వ్రాసి చివర అన్ని విభక్తులతో ఒక పద్యమును వ్రాయుట. అంకితాంకముతో మొత్తము ఇరువదియాఱు పద్యములతో వ్రాయబడిన ఇట్టిది ఒక లఘుకావ్యము లేక క్షుద్రకావ్యము. ఇది చతుర్విధ కవితలలో మధుర కవిత వర్గమునకు చెందినది. ఉదాహరణపు లక్షణములను మొట్టమొదట విన్నకోట పెద్దన వ్రాసిన కావ్యాలంకారచూడామణిలో చదువ వీలగును. కాని అందులో లక్ష్యములు లేవు. క్రింద ఉదాహరణకావ్యపు లక్షణములను ఇస్తున్నాను-

ప్రతి విభక్తిలో మూడు పద్యములు ఉండవలయును. ఈ విభక్తి పద్యములో నిస్సందేహముగా కనబడవలయును. ఒకటియో రెండో ఇతర విభక్తులు ఉండుట దోషము కాదు.
మొదటి పద్యము వృత్తముగా నుండవలయును. వృత్తములలో శార్దూల, మత్తేభ విక్రీడితములు, చంపకోత్పల మాలలను మాత్రమే వాడాలి. కాని కవులు ఇతర విధములైన వృత్తములను, కందమును, ద్విపదను కూడ వాడినారు.
రెండవ పద్యము ఒక రగడగా ఉండాలి. నవవిధ రగడలలో ఏదియైనను ప్రయోగనీయమే. హంసగతిరగడ కూడ ఉపయోగించబడినది. ఈ రెండవ పద్యమైన రగడను కళిక అంటారు. ఉదాహరణములలో ఉపయోగించబడే నాలుగు వృత్తములను రాగయుక్తముగా పాడుకొన వచ్చును, కాని అవి తాళరహితములు. కాని రగడలు తాళబద్ధములయిన వైతాళీయములు.
కళికను ఎల్లప్పుడు మఱియు అను పదముతో లేక దాని పర్యాయ పదముతో ప్రారంభించాలి. ఈ నియమము బహుశా ముందు ఉన్న పద్యముతో అన్వయముకోసము అనుకొంటాను.
కళిక పిదప ఉత్కళిక ఉండాలి. ఉత్కళిక కళికలో సగము. కళిక మధురగతి రగడ (నాల్గు చతుర్మాత్రలు) అయితే, ఉత్కళిక అందులో అర్ధ భాగమైన రెండు చతుర్మాత్రలు. ఈ నియమమువలన కళిక, ఉత్కళికలు ఒకే తాళములో ఉంటాయి. ఉత్కళికకు యతి నియమము లేదు. కాని ప్రాస, అంత్యప్రాస ఉండి తీరాలి.
కళికోత్కళికలు అష్టపదులు, అనగా ఎనిమిది పాదములు ఉంటాయి వీటిలో.
కళికలో ప్రతి పాదాంతమున విభక్తి ప్రత్యయము ఉండాలి. ఉత్కళికకు చివరి రెండు పాదములలో మాత్రమే విభక్తి యుండాలి. మిగిలిన పాదములకు అంత్యప్రాస అవసరము. సంబోధనలో పాదాంతములో సంబోధన ఉండాలి.
కళికలో ప్రతి పాదము స్వతంత్రముగా నుండాలి.
ఉత్కళిక ఏకసమాసముగ భాసించవలయును.
చతుర్థీ విభక్తి ఉత్కళిక విభక్త్యాభాసయుక్తము. అనగా చతుర్థీవిభక్తి ఉత్కళికలో మొదటి ఆఱు పాదములలో విభక్తి ప్రత్యయము ధ్వనించవలయును. కాని అది నిజముగా విభక్తి ప్రత్యయము కాకూడదు! వినుటకు విభక్తి, చదువుటకు ఒక విభక్తి ప్రత్యయమును బోలు పదము.
చివరి పద్యములో కవి పేరు, కావ్య వస్తువు రెండును ఉండాలి.
కొందఱు ఈ ఇరువదియాఱు పద్యములతో ఆదిలో లేక అంతములో మఱి కొన్ని పద్యములు చేరుస్తారు. మొత్తము సంఖ్య 27 అయితే అది తారావళి అవుతుంది.
ఉదాహరణముల జననము
ఉదాహరణములను గుఱించి తెలిసికోవాలంటే మనము విభక్తులను గుఱించి, రగడలను గుఱించి తెలిసికోవాలి. వీటిని గుఱించి కూలంకషముగా కాకపోయినా, కావలసినంత వఱకు చర్చిస్తాను. విభక్తులు భాషాచరిత్రలో ఎన్నో మార్పులు చెంది నేటి దశకు చేరినవి. విభక్తి లేకుండ భాషను ఉపయోగించుట అసాధ్యము. ఈ విభక్తుల పరిణామక్రమమును కొందఱు భాషా శాస్త్రజ్ఞులు వివరించారు[1, 2]. మనము ఇప్పుడు వాడే విభక్తులు శాస్త్రీయముగా లేవని మాత్రము చెప్పవచ్చును. వ్యాసాంతములో ఈ స్థితిని మార్చుటకు సాధ్యమా అనే విషయమును చర్చిస్తాను. తెలుగు విభక్తులను మొదటి పట్టికలో పొందుపఱచినాను.


1. తెలుగు విభక్తులు
సంస్కృతములో ఉదాహరణపు ప్రస్తావన మహాకవి కాలిదాసు చేసినాడని వేంకటరావు ప్రస్తావించారు కాని అట్టి వాటికి మనకు ఆధారములు దొఱకలేదు. పాల్కుఱికి సోమనాథకవి ప్రప్రథమముగా బసవోదాహరణమును వ్రాసినప్పుడుగల పరిస్థితులను పరిశీలిస్తే ఉదాహరణములను ఆ రీతిగా ఎందుకు ప్రారంభించినాడని మనము కొద్దిగానైనా అవగాహనము చేసికొనవచ్చును.

(1) కృష్ణో రక్షతు… సార్వ విభక్తిక పద్యమును వ్రాసిన కులశేఖర ఆళ్వారు (8వ శతాబ్దము) సోమనాథునికి పూర్వుడు.

(2) కన్నడము బాగుగా నెఱిగిన సోమనాథునికి కవిరాజమార్గములోని[3] (సుమారు క్రీ.శ. 850) క్రింది సార్వ విభక్తిక పద్యము కూడ పరిచితమై ఉండాలి. ఆ పద్యము –

చం. నరపతి బందనా నృపననళ్తియె కాణ్బుదు తన్నరేంద్రనిం
ధరణి సనాథె భూపతిగె కప్పవనీ యవనీశనత్తణిం
పరిభవమం కళిల్చువుదధీశ్వరనా దయె సాల్గుమా మహీ-
శ్వరనొళిదప్పుదెంబుదిదు కారకయుక్త విభక్త్యనుక్రమం – కవిరాజమార్గం, 1-115

నరపతి బందను – నరపతి వచ్చినాడు
ఆ నృపననళ్తియె కాణ్బుదు – ఆ నృపతిని ప్రీతితో చూడవలెను
తన్నరేంద్రనిం ధరణి సనాథె – ఆ నరేంద్రునిచేత (వలన) భూమి సనాథ
భూపతిగె కప్పవనీ – భూపతికి కప్పమును చెల్లించాలి
యవనీశనత్తణిం పరిభవమం కళిల్చువుదున్ – ఆ అవనీశునినుండి అవమానమును పోగొట్టాలి
అధీశ్వరనా దయె సాల్గు – అధీశ్వరుని దయ చాలు
ఆ మహీశ్వరనొళిదప్పుదెంబుదిదు – ఆ మహీశ్వరునియందు ఇది సాధ్యము

(3) జయదేవకవి సుమారు క్రీ.శ. 1200 కాలానికి గీతగోవిందమును వ్రాసినాడు. గీతగోవిందములో పద్యములు, అష్టపది రూపములో పాటలు రెండు ఉన్నాయి. పాటలు మాత్రాబద్ధములు, పద్యములు సంస్కృత వృత్తములు లేక శ్లోకములు. పాట అయిన అష్టపది ఎప్పుడు ఒక పద్యము తఱువాత వస్తుంది. ఈ విషయమును ఇంతకు ముందే నేనొక వ్యాసములో [ఈమాట – సావిరహే] వివరించి యున్నాను. ఉదాహరణములలో కూడ మొట్టమొదట ఒక వృత్తము, తఱువాత పాడుకొనుటకు అనువైన మాత్రాగణ నిర్మితమైన రగడలు, అర్ధ రగడలు ఉన్నాయి. జయదేవుని గీతగోవిందము ఉదాహరణ కావ్యముల చట్రమునునకు ప్రోత్సాహ మేమో? ఎందుకంటే మొట్టమొదటి వృత్తము తాళరహితము, మాత్రాగణబద్ధమైన అష్టపది తాళబద్ధము. బసవోదాహరణపు కాలము నిస్సంశయముగా గీతగోవింద కావ్యము తఱువాతిదే. ఈ కోణములో ఇంతవఱకు ఎవ్వరు ఆలోచించినట్లు లేదు.

విభక్తులను ఉపయోగించవలెనను భావము పై రెండు పద్యముల ద్వారా సోమనాథునికి కలిగి ఉండవచ్చును. వృత్తమును, రగడలను ఉపయోగించవలెనను తలంపు గీతగోవిందము ద్వారా కలిగి ఉండ వచ్చును. ఈ రెంటిని జత చేసి ఉదాహరణ కావ్యములను వ్రాసి ఉండుటకు ఆస్కారము ఉన్నది.

రగడలు
రగడల సంపూర్ణ లక్షణములను మనము మొట్టమొదట అనంతామాత్యుని (15వ శతాబ్దపు పూర్వార్ధము) ఛందోదర్పణములో [4] చూడవచ్చును. పెద్దన కావ్యాలంకారచూడామణిలో [5] ఉత్సాహ రగడ మాత్రమే తెలుపబడినది. బసవోదాహరణము 13-14వ శతాబ్దిలో వ్రాయబడినది. కావున ఆ కాలము నాటికే రగడలను కవులు వాడేవారు అని మనము భావించవచ్చును. రేచన కవిజనాశ్రయములో రగడల ప్రస్తావన లేదు. కాని నాగవర్మ ఛందోంబుధిలో[6] మూడు విధములైన రగడలు రఘటాబంధముగా క్రింద చెప్పబడినవి. అవి –

ఉత్సాహ రగళె – త్ర్యస్రగతి (24 మాత్రలు)
మందానిల రగళె – చతురస్రగతి (16 మాత్రలు)
లలిత రగళె – ఖండగతి (20 మాత్రలు)

2అ. లక్షణమున్న రగడలు
మిశ్రగతి భామినిషట్పదిలో వస్తుంది. వీటిని ఆధారముగా తీసికొని తెలుగులోని నవవిధ రగడలను కల్పించియుండాలి. ఇలా ఏ లాక్షణికుడు కల్పించినాడో అన్న విషయము మనకు తెలియదు. బహుశా సోమనాథుడే కల్పించినాడేమో? రగడలను గుఱించి వివరములకు నేను వ్రాసిన సందేశములను పొందుపఱచి ఆంధ్రభారతి సైటులో ఉంచినాను.

ఉదాహరణములలో సామాన్యముగా తెలుగులోని నవవిధ రగడలు, అదనముగా హంసగతి రగడ – వీటిని మాత్రమే పూర్వకవులు వాడినారు. లక్షణసమన్వితమైన రగడలు 2అ-పట్టికలో, నేను కల్పించిన రగడలు 2ఆ-పట్టికలో తెలుపబడినవి. రగడలలో ఎప్పుడు కొన్ని నియమములను పాటించాలి?

రగడలు మాత్రాగణ నిర్మితములు, ఈ మాత్రాగణములలో ఎదురు నడక (అనగా లగారంభము IU) నిషిద్ధము.
రగడలలో ఎదురు నడక లేని ఈ మాత్రాగణములను మాత్రమే ఉపయోగించాలి – మూడు మాత్రలు – UI, III; నాలుగు మాత్రలు – UU, IIU, UII, IIII; ఐదు మాత్రలు – UIU, UUI , IIIU, IIUI, UIII, IIIII.
రగడలు ద్విపదలు. అక్షరసామ్య యతి, ప్రాస, అంత్యప్రాస ఉండాలి. ప్రాసయతిని వాడరాదు.
పాదాంత విరామమును (సంస్కృతములోని యతిని) పాటించాలి.
మాత్రాగణముల స్వరూపమును మార్చరాదు. మూడు మాత్రలంటే మూడు మాత్రలే. రెండు సూర్య గణములను ఒక ఆఱు మాత్రల గణముగా వాడరాదు (ఉదా. UIIU). రెండు చతుర్మాత్రలను ఒక అష్ట మాత్రగా వాడరాదు (ఉదా. UIUIU). ఇలా కొన్ని చోటులలో కొందఱు కవులు వాడియుండ వచ్చును. వారి ప్రయోగమును మనము ఆదరించాలి, కాని మనము అలా ఎప్పుడు చేయరాదు.
మాత్రాగణములకు తగ్గట్లు పదములను విఱిచి వ్రాస్తే గానయోగ్యత సిద్ధిస్తుంది. ఉదాహరణముల గుఱి గానానుభవము అన్న విషయమును మఱువరాదు.

2ఆ. కొత్తగా కలిపించిన రగడలు
రగడలను పుష్పాచయము, జలక్రీడ, యుద్ధ వర్ణన, నగర, క్షేత్ర వర్ణనలలో కవులు చాల చాకచక్యముతో వాడారు. పెద్దననుండి పాపరాజు వఱకు రగడలను ప్రాస, అంత్యప్రాసలతో మాత్రమే కాక యమక, అనుప్రాసలతో కూడ వ్రాసినారు. యక్షగానములలో[7] ఇవి ఒక ప్రత్యేక స్థానమును ఆక్రమించుకొనినవి. ఉదాహరణ కావ్యములలో రగడలను కళికలుగా, అర్ధరగడలను ఉత్కళికలుగా కవులు పేర్కొనిరి. అంతే కాక కొన్ని – సుదర్శన రగడ, నయన రగడ, నమశ్శివాయ రగడల వంటివి తెలుగు సాహిత్యములో ఒక ప్రత్యేక స్థానమును సంపాదించుకొన్నాయి.

ప్రథమావిభక్తి
ప్రథమా విభక్తి ప్రత్యయములు డు, ము, వు, లు; ఉదా. రాముఁడు, నగము, విష్ణువు, నక్కలు, సీత మున్నగునవి. ప్రథమా విభక్తితో సాహిత్యములో పద్యాలు ఎన్నో ఉన్నాయి. నన్నయ వ్రాసిన మొదటి తెలుగు పద్యములోని ఎన్నో పదాలు ఈ విభక్తితో నిండినవే, అదే విధముగా పోతన పద్యము కూడ. క్రింద అవి –

రాజకులైక భూషణుఁడు, రాజమనోహరుఁ, డన్య రాజ తే-
జోజయశాలి, శౌర్యుఁడు, విశుద్ధ యశ శ్శరదిందు చంద్రికా
రాజిత సర్వలోకుఁ, డపరాజిత భూరి భుజా కృపాణ ధా-
రా జల శాంత శాత్రవ పరాగుఁడు, రాజమహేంద్రుఁ డున్నతిన్ 
                                                    – ఆం.మ.భా. ఆది పర్వము, 1.3

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె-
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ 
                                                – పోతన భాగవతము, 1.10

నానాటి బ్రదుకు నాటకము, – కానక కన్నది కైవల్యము…
పుట్టుటయు నిజము – పోవుటయు నిజము
నట్ట నడిమి పని – నాటకము
ఎట్ట ఎదుట కల – దీ ప్రపంచము,
కట్ట కడపటిది – కైవల్యము… – అన్నమాచార్యుల కృతి.

దేవాధిదేవు డమిత
స్థావర జంగమమయుండు – సర్వేశుడు గౌ-
రీవరు డనవరతంబును
నీవుత గాటయకు దయ న-భీష్ట ఫలంబుల్ 
                        – కరీం నగర్ లోని ఉప్పరిపల్లి శాసనము (క్రీ.శ. 1157)

ఉదాహరణములలో ప్రథమా విభక్తి
పాల్కుఱికి సోమనాథుడు 13-14 శతాబ్దములో జీవించెను. శివ కవుల యుగమునకు నాందీగీతమును పాడిన మహాకవి. తెలుగులో మొదటి ఉదాహరణకావ్యమును రచించిన ఘనత ఇతనికి చెందినది. ఇతడు తెలుగులో మాత్రమే కాదు, కన్నడములో కూడ అగ్రగణ్యుడే. ఇతని ఉదాహరణమునకు బసవోదాహరణము అని పేరు. సంస్కృత వాఙ్మయములో కూడ ప్రప్రథమముగా ఇతడే ఉదాహరణమును రచించినాడు. ఇతడు రచించిన ఉదాహరణములోని ప్రథమా విభక్తి పద్యములు క్రింద ఇవ్వబడినవి –

శ్రీ గురులింగ తత్పరుఁ, డ-శేష జగన్నిధి, శుద్ధ తత్త్వ సం-
యోగ సుఖ ప్రపూర్తి, వృష-భోత్తమమూర్తి, యుదాత్త కీర్తి, ది-
వ్యాగమ మార్గవర్తి, బస-వయ్య కృపాంబుధి మాకు దివ్య సం-
భోగములం బ్రసాద సుఖ – భోగములం గరుణించు గావుతన్

మొట్ట మొదటి పద్యమును శ్రీకారముతో ప్రారంభించుట పరిపాటి.

కళిక- మధురగతి రగడ- చ/చ – చ/చ (ప్రాస, అంత్యప్రాస)
వెండియుఁ ద్రిభువన – వినుతి సమేతుఁడు
మండిత సద్గుణ – మహిమోపేతుఁడు
సురుచిర శివసమ – సుఖ సంధానుఁడు
పరమ పరాపర – భరితజ్ఞానుఁడు
విదితానందా-న్వీత మనస్కుఁడు
సదమల విపుల వి-శాల యశస్కుఁడు
శ్రీవిలసిత పద – చిరతర భద్రుఁడు
గావున సాక్షాత్ – కలియుగ భద్రుఁడు

కళిక వెండియు (మఱల) అనే పదముతో ఆరంభమైనది. కళికలో మొత్తము ఎనిమిది పాదములు, అనగా నాలుగు ద్విపదలు. మధురగతిరగడలో పాదమునకు నాలుగు చతుర్మాత్రలు. పాదాంతములో విరామము, రెండేసి పాదాలకు ద్వితీయాక్షర ప్రాస, అంత్యప్రాసలు ఉన్నాయి. మూడవ చతుర్మాత్రతో అక్షరసామ్యయతి. కళికలో అన్ని పాదముల చివర ప్రథమా విభక్తి పదములే ఉన్నాయి.

ఉత్కళిక- చ/చ
భువనోపకార
భవమోద వీర
భక్తిసంయోగ
ముక్తి సంభోగ
సౌఖ్యాబ్ధిలోన
ముఖ్యుఁడై తాన
వెలయు శుభకరుఁడు
ఇల విశ్వగురుఁడు

ఉత్కళిక కళికలో సగము కాబట్టి ఇందులో ప్రతి పాదములో రెండు చతుర్మాత్రలు మాత్రమే. యతి లేదు, కాని ప్రాసాంత్యప్రాసలు ఉన్నాయి. ఉత్కళిక అంతా ఒకే సమాసము. ఇందులో చివరి రెండు పాదములలో మాత్రమే ప్రథమా విభక్తి పదములు ఉన్నాయి. చివరి రెండు పాదములు తప్ప మిగిలిన వాటిలో రెండు చతుర్మాత్రలు కాని అష్టమాత్రలు ఉన్నాయి.

ద్వితీయా విభక్తి
ద్వితీయా విభక్తి ప్రత్యయములు ని, ను, ల, కూర్చి, గుఱించి (ఉదా. రాముని, సీతను, వారల, దేనినిగూర్చి, యేసుగుఱించి). ఉదాహరణములలో ని(న్), ను(న్) ప్రత్యయములను మాత్రమే వాడుతారు. క్రింద మారన మార్కండేయ పురాణమునుండి, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదనుండి ద్వితీయావిభక్తికి నిదర్శన పద్యములు –

ఆదిత్యు, సూర్యుని, – నర్యముఁ, బూషు, స్వ-
భాను, దివాకరు, – భాను, సవితృ,
నక్షరుఁ, బరము, సి-తాసితవర్ణుని,
భాస్కరు, దుష్ప్రేక్ష్యుఁ, – బంకజాప్తు,
రవిఁ, బ్రళయాంతకు, – రక్తపీతుని, దీప-
దీధితి, నవితర్క్యు, – దీర్ఘరూపు,
యజ్ఞాగ్నిహోత్రవే-దావస్థితుని, యోగి,
నిత్యు, ననంతుని, – నిగమవేద్యు,

నాద్యు, మిత్రుని, నఖిలలో-కైకరక్షు,
వ్యక్తు, గుణయుక్తుఁ, బరమద-యానురక్తు,
శాంతు, నిన్ను బ్రభాకరు – శరణు వేడి
సంతతము నిను గొల్తు న-నంత భక్తి – మార్కండేయ పురాణము, 7.156

శరదిందు చకచక-స్మయజి త్ప్రసన్నాన్యు,
దొడ్డ కెందమ్మి కం-దోయి వాని,
నతి కమ్ర గల్లభా-గాభోగ ఫాలాఢ్యు,
మకరాంక రత్నక-ర్ణికల వాని,
గాంబవోద్యచ్ఛ్రీవి-డంబి వృత్త శిరోధి,
సిరి పొల్చు మచ్చ పే-రురము వాని
నతనాభియుత వళి-త్రితయ శాతోదరు,
జానులంబి చతుర్భు-జముల వాని,

గరివరకరోరు, రుచిర జం-ఘామనోజ్ఞు,
సమతఁ బొందిన పదపల్ల-వముల వాని,
హైమవసనుఁ, గిరీట హా-రాంగ దాది
కలితు, శంఖ రథాంగాదు-లలరు వాని – ఆముక్తమాల్యద, 3.85

నగుమోము గలవాని, నా మనోహరుని, జగ మేలు శూరుని, జానకీవరుని
దేవాదిదేవుని, దివ్యసుందరుని, శ్రీ వాసుదేవుని, సీతారాఘవుని
సుజ్ఞాననిధిని, సోమసూర్య లోచనుని, అజ్ఞాన తమమును అణచు భాస్కరుని
నిర్మలాకారుని, నిఖిలాఘ హరుని, ధర్మాది మోక్షంబు దయజేయు ఘనుని
బోధతో పలు మాఱు పూజించి నే నారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని – త్యాగరాజ కృతి.

శ్రీరమ్యక్ష్మావధూ – కాంచికి నెనయగు కాం-చీపురీనాథు నుగ్రా-
కారున్ లాలాటనేత్రున్ – గవిజనహితు ము-క్కంటికాడ్వెట్టిన్ బుణ్యా-
చారున్ దద్బుద్ధవర్మే-శ్వరుఁడు గొలిచి మున్-శాసనంబొందఁ గర్ణో-
దారుం డొంగేఱు మార్గ-త్రయము వడసె నా-తారచంద్రార్క లీలన్ – (చేబ్రోలు గ్రామములో నాగేశ్వరస్వామి దేవాలయములో ఒక శిలాస్థంభముపైన శాసనము. సుమారు క్రీ.శ. 1145)

ఉదాహరణములలో ద్వితీయా విభక్తి
క్రీస్తు శకము పదునాలుగవ శతాబ్దపు పూర్వభాగములో నివసించిన త్రిపురాంతకుని (తిప్పన) త్రిపురాంతకోదాహరణనుండి ద్వితీయా విభక్తి పద్యములు-

పామును హారమున్, నెలయుఁ – బాపట సేసయు, నేఱు మల్లికా
దామము, తోలు దువ్వలువు, – దట్టపు భూతియుఁ, జందనంబుమై
సామున జాల నందముగ – సన్నిధి సేసిన చూడగంటివే
నామదిలోఁ గుమారగిరి – నాథుని శైలసుతాసనాథునిన్

కళిక- ద్విరదగతిరగడ- పం/పం – పం/పం (ప్రాస, అంత్యప్రాసలు)

మఱియు వేలుపులేటి – మౌళి నాగిన వాని
నెఱయు గన్నప నోటి – నీటఁ దోగిన వాని
బొలతితో నొక్కొడలఁ – బొత్తు గూడిన వాని
దలకి సేనమరాజు – దాడి కోడిన వాని
శాఖ్యతొండని రాల – జడికి నోర్చిన వాని
సౌఖ్యతర సాయుజ్య – సరణి గూర్చిన వాని
వెన్నెలల బురుణించు – వెలది నవ్వుల వాని
వెన్నునకు నలువకును – వెదుక దవ్వుల వాని

ఉత్కళిక- పం/పం

చిగురుఁ గైదువు వెఱికి
మగల సిగ్గులు నఱికి
సతుల బాటులు పఱిచి
యతుల వ్రతములు చెఱిచి
అలులు చిలుకలు పిండు
లెలయ గొలువగ నుండు
మరు జయించిన వానిఁ
గరుణ మించిన వాని

తృతీయా విభక్తి
తృతీయా విభక్తి ప్రత్యయములు చే, చేత, తో, తోడ, తోడుత, మెయి. ఈ ప్రత్యయముల ప్రయోగములు వాని పేరులే తెలుపుతాయి. అవి చేయి, తోడు, మెయి. చే ప్రత్యయము instrumental case, తో ప్రత్యయము sociative case. ఇందులో చే- ప్రాచీనమైనది. చే- వాడబడుచుండు కాలములో తో- వాడబడుచుండినను, అది బహుశా విభక్తిగా అప్పుడు పరిగణించబడలేదని భాషాశాస్త్రజ్ఞుల ఊహ. మెయి ప్రత్యయము జడములకు మాత్రమే. ఉదాహరణకావ్యములలో చే- మాత్రమే ప్రయోగము చేసినారు. చే-ప్రత్యయమునకు బదులు చాల చోటులలో పంచమీ విభక్తి ప్రత్యయమైన వలన వాడినను అర్థభేదము ఏ మాత్రము రాదు. ఈ ప్రత్యయములకు కొన్ని ఉదాహరణములు –

మాద్రికి మీరు నంచ వెలి – మాపుపయిన్ మురువైన జోదుచే,
భద్రమయాత్ముచే, భువన – పాలన ఖేలనుచే, సరస్వతీ
ముద్రిత వక్త్రుచేత, నలు – మోముల వేలుపుచే, విరూరి వే-
దాద్రి చమూ విభుండు గను – నాయువు శ్రీయు నిరంతరాయమున్
                               – తెనాలి రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యము, 1.3

తుళసీదళములచే సంతోషముగా బూజింతు
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురువక
కరవీర మల్లికా సుగంధరాజ సుమముల
ధర నివి యొక పర్యాయము ధర్మాత్ముని సాకేత
పురవాసుని శ్రీరాముని వరత్యాగరాజనుతుని – త్యాగరాజ కృతి.

బంగారు మెరవడి – పల్లవంబులతోడఁ
గెంబట్టు కీలు ప-క్కెరలతోడ
ముఖ సమర్పిత హాట-క ఖలీనములతోడఁ
గాంచన గ్రైవేయ-కములతోడ
సమకట్టి ముడిచిన – చామరంబులతోడఁ
దాప బెట్టిన యడి-దములతోడఁ
గనక ఘంటల యురు – గజ్జె పేరులతోడఁ
గర్ణ కీలిత దీర్ఘ – కళలతోడఁ

జిత్రమున వ్రాయగా రాని – చెలువుతోడ
నొప్పి యుచ్ఛైశ్శ్రవముతోడి – యుద్దు లనగ
వాహకులు దేఱ వచ్చె దు-ర్వార లీల
వసుమతీ నాయకుని పూజ – వారువములు – పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి శృంగారశాకుంతలము, 1.111

కసిగాటు మోవితోఁ గలకంఠి కాలితో
పసుపంటిన దుప్పటి వల్లెవాటుతో
పొసగని నిద్రతో వచ్చి నా తల కిట
నిలిచి యుండగా పొమ్మంటివే… ఓ యమ్మ…
చెక్కిట పచ్చిగోరు చెంప జవ్వాజి
మక్కువ దాని కంఠమాలతో
వెక్కసముగ దాని చిటికెన వ్రేలి యుంగరము
పెట్టికొన్న జూచి పొమ్మంటివే… ఓ యమ్మ… – సిద్ధేంద్రయోగి భామాకలాపము

కౌరవాన్వయజాతులై – గారవమునఁ
బెరిగినట్టి మీరొండొక – నరునిఁగొలిచి
మసలి వర్తిల్లి మానావ-మానములకు
నోర్చి యడఁకువతోడుత – నునికి యరిది – తిక్కన భారతము, విరాట పర్వము, 1.118

ధర్మదేవత నీదు స-త్కర్మమునకు
మెచ్చి యెంతయుఁ బ్రీతిమై – నిచ్చినట్టి
వరము గలుగంగ మనమేమి – వర్తనమున
నెచట నున్నను నొరులకు – నెఱుఁగ నగునె – తిక్కన భారతము, విరాట పర్వము, 1.61

సుమారు క్రీ.శ. 1160 ప్రాంతములో గుంటూరు జిల్లా నరసరావుపేట తాలుకా తిమ్మాపురములోని ఱాతి స్థంభముపైన శిలాశాసనములో చే-ప్రత్యయపు ఉపయోగమును క్రింది పద్యములో గమనించ వచ్చును. ఇందులో మఱొక విశేషము ఏమనగా, పద్యములోని మూడు ఋ-కారములు రి-కారములుగా చెక్కబడినవి. అనగా 12వ శతాబ్దములో కూడ ఋ-కారమును నేటి రు-కారములా కాక రి-కారములా ఉచ్చరించే వాళ్లు అని తెలుస్తుంది.

శ్రీవిలసద్విలాస జిత-జిష్ణునిచే నహిసీమ కృష్ణుచే
దేవసమానుచేత నర-దేవశిఖామణిచేత ధాన్యవా-
టీవరవృత్తిశాసనప-టీయశి నాఁటగి మేలు నాయక
శ్రీవిభుఁ డొప్పెఁ బోతయ వ-శీకృత సజ్జనలోకుఁడై భువిన్

చిరముగ దేవదేవునకు – శ్రీబలిదేవర దేవి శంఖు లా-
భరణము గీతవాద్యములు – బట్టున చీరలు ధూపఘంటయుం
దిరమగు ఘంట వర్యలము – దీపనికాయము ధేను సంఘము
న్నరుదుగ మన్మ మండఁడు వ్రి-యంబొనరన్ రచియించె భక్తితోన్ – క్రీ.శ. 1149 నాదెళ్ల గ్రామములోని మూలేశ్వరాలయము (తో ప్రత్యయము)

ఉదాహరణములలో తృతీయా విభక్తి
క్రింద తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల శ్రీ వేంకటేశ్వరోదాహరణమునుండి తృతీయా విభక్తి పద్యములు –

తీఱు నఘంబు లెల్ల నిలు – దీర్ఘము వచ్చినయంత సంపదల్
మీఱు సుఖంబు గూరు మతి – మిక్కుటమై శ్రుతివీథి దూఱు వే-
నూఱులు సెప్పనెల సుమ-నోవిభుచేఁ దిరువేంకటేశుచే
జూఱలుగా వరంబు లిలఁ – జొప్పడఁ గొందము రండు మానవుల్

కళిక- తురగవల్గన రగడ – త్రి/త్రి/త్రి/త్రి – త్రి/త్రి/త్రి/త్రి (ప్రాస, అంత్యప్రాస)

మఱియు వఱలు సుజనభజన – మానలేని వానిచేత
వెఱపు మఱపు లేక జోక – విడువ కడరు వానిచేత
శ్రుతుల గతుల నడువ నుడువ – జొక్కి చిక్కు వానిచేత
అతుల మతుల జెలగి మెలగి-నట్టి గుట్టు వానిచేత
సగము మొగము చాయ దాయఁ – జదియ నదుచు వానిచేత
బొగులు మగువ వలువ తొలువఁ – బ్రోచి కాచు వానిచేత
ఱాతి నాతి జేసి వాసి – ఱట్టు బెట్టు వానిచేత
వాతజాతు బనులఁ గొనుచు – వసుధ నెసగు వానిచేత

ఉత్కళిక- త్రి/త్రి/త్రి/త్రి

పురము లెఱియు శర మనంగ
బరగి దురము పురి కొనంగ
బగతులఁ గల మిగులగొట్టి
నగజమగడు పొగడునట్టి
గెలుపు నిలుపు తలపు లెంచి
బలము చలము కలిమి మించి
జనుల మనుపు ఘనునిచేత
వనజతనుజు జనకుచేత

చతుర్థీ విభక్తి
చతుర్థీ విభక్తి ప్రత్యయములు కొఱకు, కై , పొంటె, కోసము (ఉదా. సీతకొఱకు, రామునికై, క్షేమముపొంటె, నీకోసము). నన్నయ కాలములో పొంటె కూడ చతుర్థీవిభక్తి ప్రత్యయమే. ఆ కాలములో కొఱకు వాడుకలో లేదు. కై అనునది కయి అని కూడ వాడబడినది. అయి అనునది అగు యొక్క past participle. కయి, కు మఱియు అయి పదముల సంధి స్వరూపము. అనగా- కు + అయి = కయి. కయిని (కై) కునయి (కునై) అని కూడ కవులు వాడిరి. కు అనునది తఱువాతి కాలములో షష్ఠీ విభక్తి ప్రత్యయము. నన్నయకాలములో కు-ప్రత్యయము షష్ఠియా? పొంటెను కొఱకు అర్థములో నన్నయాదులు వాడిరి. పొంటె వాడుకను నన్నయ వ్రాసిన క్రింది పద్యములో గమనించవచ్చును.

ధరణి జరాచర భూత సంఘంబు – దమ విష వహ్ని
నురగంబు లేర్చుచు నునికి కలిగి ప-యోరుహగర్భుఁ
డురగ విషాపేత జీవ సంజీవ – నోపదేశంబుఁ
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిల లో-క హితంబు పొంటె – ఆంధ్రమహాభారతము, ఆదిపర్వము, 2.183

నన్నయ యొక్క కై ప్రత్యయపు వాడుక-

అనఘ మా మామ శకుని నా-కై కడంగి
జూద మాడెడి నీతోడఁ – గాదు నాక
యీత డొడ్డిన ధనరాసు – లెవ్వి యైనఁ
బోడిగా నీకు నీగల-వాడ నేను – ఆంధ్ర మహాభారతము, సభాపర్వము, 2.174

ఇందులో నన్నయ (మొదటి పాదములో) అనఘలోని అ-కారమునకు కైలోని ఐ-కారమునకు యతి చెల్లించెను. అనగా అతడు కై-ని కు+ఐ గా వాడెనన్న మాట. పోతన భాగవతములో మొదటి పద్యమును క్రింద చదువవచ్చును. ఇందులో కునై అనుదానిని కున్+ఐ అని అర్థము చేసికోవాలి.

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై – చింతించెదన్ లోకర-
క్షైకారంభకు, భక్త పాలన కళా-సంరంభకున్, దానవో-
ద్రేక స్తంభకుఁ, గేళిలోల విలస-ద్దృగ్జాల సంభూత నా-
నా కంజాత భవాండ కుంభకు మహా-నందాంగ డింభకున్ – పోతన భాగవతము, 1.1

కొఱకు ప్రయోగమును అదే పోతన భాగవతములోని క్రింది పద్యములో కనవచ్చును –

దేవత లందఱు నన్నును
సేవింతురు రాజ్యమదము – జెందరు చెఱుపం-
గా వలదు మానభంగము
గావింపంగ వలయు శాంతి – గలిగెడు కొఱకై – భాగవతము, 10.910

తలచిన వన్నియుం – దన కొఱకే వెలిం
దెలియుట దనలోఁ – దెలియుట కొఱకే…
ఉదయ మందుట భయ – ముడుగుట కొఱకే
చదువుట మేలు వి-చారించుట కొఱకే
బ్రదుకుట పురుషార్థ – వరుం డౌట కొఱకే
యెదిరిం గనుట త-న్నెఱుంగుట కొఱకే…
తగులుట విడివడి – దలంచుట కొఱకే
నొగులుట కర్మ మ-నుభవించుట కొఱకే
చిగురౌట కొమ్మయి – చెలంగుట కొఱకే
బెగడుట దురితం – బెడబాయుట కొఱకే…
చ. ఈవలం జేరుట – ఆవలి కొఱకే
ఆవలి నుండుట – యీవలి కొఱకే
ఈవల నావల – నెనయం దిరుగు టెల్ల
శ్రీవేంకటేశ్వరుం – జేరుట కొఱకే… – అన్నమాచార్య కృతి.

కలి నరులకు మహిమలు దెలిపి యేమి
ఫలమన లేదా
అను. ఇలను వెలయు వర వృషభాదులు కటు-
కుల రుచి దెలియు చందము గాని

దారసుతులకై ధనములకి యూరు
పేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్త వేసము గొనువారికి
తారకనామ శ్రీ త్యాగరాజార్చిత – త్యాగరాజ కృతి. (కై ప్రత్యయము)

రాజరాజనరేంద్రుని కోరుమిల్లి శాసనము చతుర్థీ విభక్తిలో ద్విరదగతిరగడలో (పం/పం – పం/పం) చెక్కబడినది. కాని ఇది సంస్కృతములో వ్రాయబడినది, తెలుగులో కాదు. కాని ఇందులో తెలుగులోవలె యతి (కొన్ని చోటులలో తప్పినా), ప్రాస, అంత్యప్రాస ఉన్నాయి. కాలము 11వ శతాబ్ది పూర్వార్ధము.

తస్మై సమస్త జన-తావిశేషగుణాయ
రై సుతర్పిత మహీ-దేవదేవగణాయ
విప్రాన్వయాబ్ధి శశి-భృత ప్రతిచ్ఛందాయ
విద్వజ్జనాధికృత-విశ్రుతానందాయ
జన్మప్రభృతిగీత-వేదాంత తత్త్వాయ
సన్మనోవసతి వా-స్తవ్యాత్మసత్త్వాయ
లంభీగురుత్వపరి-లాలితచరిత్రాయ
సుంభితమతుస్థగిత-జీవ భృగుపుత్రాయ
సిద్ధనిజనాథకృత-సేవితమనీషాయ
శుద్ధమతిదూషిత స-మస్తజనదోషాయ
సంతతారాధిత ని-జస్వామిపాదాయ
చింతిత మనస్థసుఖ-దాభూతపాదాయ
హోమధూమవినిర్గ-తామిత కలంకాయ
ధీమత్ప్రగీతరుచి-రస్వనామాంకాయ
సకలమునిగణ నుతా-పస్తంభసూత్రాయ
తత్రసంగీత భా-రద్వాజగోత్రాయ
సప్తతంతుకృతయూ-పస్తంభశోభాయ
సప్తాశ్వరూప సదృ-శాత్మతను లాభాయ
నిత్యజనతోచిత సు-సత్యగుణయుక్తాయ
సత్యభిలషిత కార్య – సంపత్తి సక్తాయ
పరమపురుషార్థ సం-పాదన పటిష్ఠాయ
పరమేశ్వరస్మరణ – పాలన వరిష్ఠాయ
సకలార్థశాస్త్ర పరి-నిష్ఠిత వినోదాయ
సుకుమార రాధిక స-రోజనిభపాదాయ – రాజరాజనరేంద్రుని కోరుమిల్లి శాసనము, క్రీ. శ. 1022

(ఇందులోని లాలిత పదము కన్నడములోని లలిత రగడ అని సూచించుటకా?)

ఉదాహరణములలో చతుర్థీ విభక్తి
చిత్రకవి పెద్దన హనుమోదాహరణమునందు గల చతుర్థీ విభక్తి పద్యములు-

చాటు మహా ప్రబంధముల – జాడలు లక్షణవేత్త లౌననన్
సూటిగ విన్న వీనులకు – సొంపుగ నే నిటు కావ్యముల్
నాటక ముఖ్య కావ్యము లొ-నర్చినయట్టి మనీషికై మహీ-
జాట కులాబ్జ భాస్కరుని- కై హనుమత్ప్రభుకై యొనర్చెదన్

కళిక- హరిణగతిరగడ- చ/చ/చ/చ – చ/చ/చ/చ (ప్రాస, అంత్యప్రాస)

మఱియును బంగరు జందెము ముంజి క-మండలు దండము గల పుణ్యునకై
మెఱయగ సుగ్రీవాంగదు లౌనన – మెలఁగెడు కపిలోకవరేణ్యునకై
తొలివేలుపు దపసిని నొక పిడికిట – దునియగఁ బొడిచిన బలు మల్లునకై
వెలసిన పెను రాకాసి మెకమ్ముల – వేటాడెడు భీకర భిల్లునకై
రహిగల సద్గుణ మహిమను బొలుపగు – రామాయణ హారోజ్జ్వల మణికై
మహిదుహితృ మనోవల్లభ దాస స-మంచిత ధీవర కైరవ ఘృణికై
బళిరా యన బలుఱాయి కరంగగఁ – బాడిన గాన కళాలోలునకై
సలలిత సుకృత ఫలంబున కేసరి – సతి గాంచిన ముద్దుల బాలునకై

ఉత్కళిక- చ/చ/చ/చ

వేసర కిర్వది చేతుల నల కై-
లాసము నెత్తిన బలు దొరపురి కై-
పనిలసఖుం డాహుతిగా గొని కై-
కొనగా జేసి ప్రతాప మహా కై-
రవ రిపు నెసగించుచు మాయా కై-
తవ బలులగు దనుజుల మతయుత కై-
టభ విభులను దునిమిన శూరునకై
శుభముల నతులకు నిడు ధీరునకై

విభక్త్యాభాసము : ఉదాహరణకావ్యములలో గల నియమములలో నొకటి- చతుర్థీ విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము ఉండాలి. ఆభాసము అనగా ఒకటి మఱొకటిగా కనబడుట. ఉత్కళికలో మొదటి ఆఱు పాదములలో విభక్తి ప్రత్యయము ఉండరాదు. చివరి రెండు పాదములలో మాత్రమే ఉండాలి. కాని చతుర్థీ ఉత్కళికలో మొదటి ఆఱు పాదాంతములలో విభక్తి ప్రత్యయమైన కై ఉండునట్లు తోచాలి, ధ్వనించాలి. కాని అర్థము మాత్రము కై వలె నుండరాదు. పాదము చివర నున్న కై తదుపరి పాదములోని మొదటి అక్షరములతో ఒక క్రొత్త పదముగా నుండవలయును. ఇదే ఈ గారడిలోని ప్రధానాంశము. ప్రథమోదాహరణమును రచించిన పాల్కుఱికి సోమనాథుడుగాని, లాక్షణికుడు అప్పకవి గాని విభక్త్యాభాసమును పాటించలేదు. గడచిన శతాబ్దములో ఇట్టి కావ్యములను వ్రాసిన ఆధునిక కవులు కూడ విభక్త్యాభాసమును పాటించలేదు. తిప్పన త్రిపురాంతకోదాహరణములోని చతుర్థి విభక్తి ఉత్కళిక. ఇదియే బహుశా మొట్టమొదటి విభక్త్యాభాసము కాబోలు.

కడు దీనతతో ముది తాపసికై-
వడి నింటికి జని వెడ కప్పెర గై-
కొని యాలుమగల పెను రచ్చలకై
చనుదెండని నిక్కము సేయుటకై
వెను ద్రిప్పిన గుండము లోపల గై-
కొని చను యెప్పటి రూపము గై-
కొని గుండయ మెచ్చిన వేల్పునకై
వినత పితామహ ఫణితల్పునకై

ఇందులో మొదటి, రెండవ, ఐదవ, ఆఱవ పాదములలో చతుర్థీ విభక్త్యాభాసము గలదు. మిగిలిన పాదములలో కై నిజముగా విభక్తి ప్రత్యయము. కాని పైన ఉదాహరించిన పెద్దన హనుమోదాహరణములోని ఉత్కళికలో మొదటి ఆఱు పాదాంతములలో కై అను అక్షరము తఱువాతి పాదములో గల అక్షరములతో చేరి పదములుగా మారును. కైలాసము, కైపు, కైకొన, కైరవ, కైతవ, కైటభ అను పదములన్నియు కైతో ప్రారంభమగును. ఏడవ, ఎనిమిదవ పాదములలోని కై అక్షరము నిజమైన విభక్తి ప్రత్యయము.

సంస్కృతములో చతుర్థీ విభక్తి
చాల మంది గుడికి వెళ్ళి దేవుని గాని, దేవిని గాని అష్టోత్తరశతనామములతో నర్చిస్తారు. ఈ 108 పేరులు అనుష్టుప్పు ఛందపు శ్లోకములలో ఉంటుంది. కాని చదివేటప్పుడు విడివిడిగా ఒక్కొక్క పేరును చెప్పి పూలతోడనో, పసుపు కుంకుమలతోడనో లేక అక్షతలతోడనో దేవుని పాదములను పూజిస్తాము. శ్రీ కృష్ణుని అర్చించవలెనన్న క్రింది శ్లోకములను పఠిస్తారు:

శ్రీ కృష్ణః కమలనాభో
వాసుదేవః సనాతనః
వసుదేవాత్మజో పుణ్యః
లీలామానుషావిగ్రహా
……
ఇలా చాల శ్లోకములు ఉన్నాయి. దీనిని ఇలా చెప్పుట పరిపాటి-

శ్రీ కృష్ణాయ నమః – శ్రీ కృష్ణునికై(కి) నమస్కారము
కమలనాభాయ నమః – కమలనాభునికై(కి) నమస్కారము
వాసుదేవాయ నమః – వాసుదేవునికై(కి) నమస్కారము
సనాతనాయ నమః – సనాతననునికై(కి) నమస్కారము
వసుదేవాత్మజాయ నమః – వసుదేవాత్మజునికై(కి) నమస్కారము
పుణ్యాయ నమః – పుణ్యునికై(కి) నమస్కారము
లీలామానుషవిగ్రహాయ నమః – లీలామానుషవిగ్రహునికై(కి) నమస్కారము

ఇవన్నియు చతుర్థీవిభక్తి యుక్తములు. అదియును కాక చతుర్థికి, షష్ఠికి వ్యత్యాసము లేదు. ఆంగ్లములో ఇది dative case. అందుకే పురాతన కవులు కైని కు-, ఐ-, గా విడదీసినారు. కావున సంస్కృతములో ఆయ అనునది సామాన్యముగ చతుర్థీ విభక్తిని తెలుపును.

పాల్కుఱికి సోమనాథుడు తెలుగులో మాత్రమే మొదటి ఉదాహరణ కావ్యమును వ్రాయలేదు. అతడు సంస్కృతములో కూడ మొదటి ఉదాహరణ కావ్యమును రచించెను. తిరుమలాచార్యుడు వ్రాసిన చిక్కదేవరాయోదాహరణమునుండి చతుర్థీ విభక్తి పద్యములను ఇచ్చట ఇస్తాను. వృత్తము సంపూర్ణముగా లిఖితమవ లేదు గావున కళికోత్కళికలను మాత్రము ఇస్తున్నాను-

కళికా- తురగవల్గన రగడ- త్రి/త్రి/త్రి/త్రి – త్రి/త్రి/త్రి/త్రి (ప్రాస, అంత్యప్రాస)

అపిచ నూత్న రత్న ఖచిత – హర్మ్య రచిత తోషణాయ
విపులతర సమస్త దాన – విహిత విబుధ పోషణాయ
భూమిపాల మౌళిమణి వి-భూషితాంఘ్రి సాయకాయ
సామభేద దండనీతి – సాధితారి నాయకాయ
కులధరాధరాభిరామ – కుంజరేంద్ర జాలకాయ
విలసితాననాబ్జ భృంగ – విభ్రమప్రదాయకాయ
పర్వచంద్ర చంద్రికా వి-భాసి కీర్తి మండనాయ
సర్వదేవతా వితాన – సన్నుతారి ఖండనాయ

ఉత్కళికా- త్రి/త్రి/త్రి/త్రి

సమర సమయ విహిత మాయ
విమత కుమత రాడపాయ
కరణ పటుతరోగ్ర సాయ
కరణ కరణ చణ దుపాయ
ఫలిత మహిత జయనికాయ
విలస దతి మనోజ్ఞ కాయ
కలిత వివిధ భూషణాయ
లలిత సరస భాషణాయ

ఇది సంస్కృతములో నున్నను, తెలుగులోవలె యతిప్రాసలు పాటించబడినవి. సంస్కృతములో ఇవి అనవసరము. కళిక తెలుగులో మఱియు వలె అపితో ప్రారంభమైనది. ఉత్కళికలో విభక్త్యాభాసము కూడ పాటించబడినది. మొదటి ఆఱు పాదములలో ఆయతో అంతమైన పదములు చతుర్థీ విభక్తితో అంతమైనవి కావు. అట్లు ధ్వనించును.

చతుర్థీ – షష్ఠీ విభక్తులు
కొఱకు కై చతుర్థ్యంతః – ఇది నన్నయభట్టు ఆంధ్రశబ్ద చింతామణిలో వ్రాసినాడు అని అంటారు. కాని తిక్కన సమకాలికుడైన, శిష్యుడైన కేతన ఆంధ్రభాషాభూషణములో [9] క్రింది పద్యమును పరిశీలిద్దామా?

కరి వచ్చెన్ గరినెక్కెను
గరిచేతం జచ్చెఁ గరికిఁ – గవణము వెట్టెన్
గరివలననుఁ గరికుంభము
కరియందు మదాంబుధార – కడు బెడఁగయ్యెన్ – కేతన ఆంధ్రభాషాభూషణము – 98

ఇందులో వరుసగా ఏడు విభక్తి ప్రత్యయములు ఉన్నాయి. ఇందులో కరికి అనే పదము కరిచేత మఱియు కరివలన మధ్య వస్తుంది. కాబట్టి కి-ప్రత్యయము చతుర్థీవిభక్తి ప్రత్యయము. అలాగైతే నన్నెచోడుని కుమారసంభవములో, కేతన దశకుమారచరితములో, తిక్కన విరాటపర్వములో మనకు కనిపించే షష్ఠ్యంతములు నిజముగా షష్ఠ్యంతములా లేక చతుర్థ్యంతములా? కేతన నన్నయ సూత్రాన్ని చదవలేదా? లేకపోతే ఆ సూత్రాన్ని నన్నయ రచించలేదా? అసలు ఆంధ్రశబ్దచింతామణిని నన్నయ వ్రాసినాడా?

తిక్కన భారతమును సుమారు క్రీ.శ. 1250 ప్రాంతములో వ్రాసినాడు అనుకొంటే, అతనికి తన శిష్యుని వ్యాకరణము పరిచితముగా నుండాలి. అంటే తిక్కన కేతనలు వ్రాసినవి చతుర్థ్యంతములే. ఇది సంస్కృత పద్ధతితో కూడ సరిపోతుంది (శ్రీ కృష్ణాయ నమః, కమలనాభాయ నమః,…). పాల్కుఱికి సోమనాథుని బసవోదాహరణము మొట్టమొదటి ఉదాహరణ కావ్యము. ఇందులో చతుర్థీవిభక్తికి కై-ప్రత్యయము వాడబడినది. సోమనాథుని కాలమును వెంకటరావు తన పుస్తకములో[1] క్రీ.శ. 1190-1260 అని పేర్కొన్నారు. కాని 1250 ప్రాంతము తిక్కన కాలానికి చెందినది, అప్పుడు చతుర్థీ విభక్తి కి-ప్రత్యయము, కై కాదు. గిడుగు సీతాపతి సోమనాథుని కాలమును 1291-1320 అని పేర్కొన్నారు[8]. ఈ కాలము తిక్కనకు 50 సంవత్సరాల పిదప. నా ఉద్దేశములో ఇదియే పాల్కుఱికి సోమనాథుని కాలము. ఈ 50 ఏండ్లలో కి-, కు-, ప్రత్యయములు షష్ఠిగా మారడము, కై-ప్రత్యయము చతుర్థిగా వాడడము అమలులోనికి వచ్చి ఉంటుంది. విన్నకోట పెద్దన వ్రాసిన కావ్యాలంకారచూడామణిలో[5] మొట్టమొదట కై-ప్రత్యయము (కొఱకు-ను విడిచి) వివరించబడినది. అంతే కాదు కు- మాత్రమే షష్ఠిగా పేర్కొనబడినది. ఆ పద్యములు –

పలుకులతుదఁ గై శబ్దం
బలపడ నిలిచినఁ జతుర్థి – యగు విశ్వమహీ-
లలనునకై యలఘునకై
చెలువారం గృతులు కవులు – చెప్పుదు రనఁగన్ – పెద్దన కావ్యాలంకారచూడామణి, 9.76

అమరి కు శబ్దము పాదాం-
తమునం దున్నేని షష్ఠి – తప్పదు విద్యా
సముదయము విశ్వవసుధా
రమణునకుం బొలుచు నిల ని-రంతరమునన్ – 9.78

తఱువాత అనంతుని ఛందోదర్పణములో[4] కొఱకు, కై లు చతుర్థిగా, కి, యొక్క, లో ప్రత్యయములు షష్ఠిగా పేర్కొనబడినవి-

… యీ
తనికొఱ కతనికై – యన చతుర్థి

వానియొక్క కులంబు – వానికిఁ బ్రియమది
జనులలో నితఁడు మే-లనఁగ షష్ఠి …, – అనంతుని ఛందోదర్పణము – 4.105

సోమనాథుడు చతుర్థీ విభక్తికి కునై (కున్+ఐ) ప్రత్యయమును వృత్తములో, కళికలో వాడినాడు, కాని ఉత్కళికలో కై ప్రత్యయమును వాడినాడు. అనగా చతుర్థిలో నన్నయలా కునై, తఱువాతి కాలములోవలె కై రెండింటిని ఉపయోగించినాడు, షష్ఠిలో కు మాత్రమే వాడినాడు. ఇంతకు ఈ dative case చతుర్థి, షష్ఠి రెండింటిలో ఎలా వచ్చిందో, ఇట్టి మార్పులకు కారణము ఏమో అనే విషయమును పరిశీలించాలి.

(ఇంకాఉంది)
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, ఈ మాట అంతర్జాల మాసచత్రిక
సౌజన్యంతో