Showing posts with label క్రాస్ వర్డ్ ఫజిల్స్. Show all posts
Showing posts with label క్రాస్ వర్డ్ ఫజిల్స్. Show all posts

Sunday, August 26, 2018

మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు


మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు



సాహితీమిత్రులారా!


మెదడుకు ఉత్తేజాన్నిచ్చి, మేధ (intelligence)కు పదును పెట్టే ప్రక్రియ క్రాస్ వర్డ్ పజిల్. మతిమరుపు ముఖ్య లక్షణంగా గల Alzheimer’s disease ఈ రోజుల్లో ఎందరినో పట్టి పీడిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని బారిన పడకుండా వుండాలంటే ప్రతిరోజూ సుడోకు, క్రాస్ వర్డ్ మొదలైన పజిళ్లను పూరించడం, కొత్త భాష(ల)ను నేర్చుకోవడం, శాస్త్రీయ సంగీతాన్ని వినడం, ఎడమ చేతితో దంతాలను బ్రష్ చేసుకోవడం, అరికాలునూ పాదాల వేళ్లనూ అన్ని దిక్కుల్లో వంచుతూ ఓ ఐదు నిమిషాల సేపు చిన్న వ్యాయామం చేయడం – ఇవన్నీ అవసరమని వైద్యశాస్త్రం చెప్తోంది. ప్రామాణికమైన క్రాస్ వర్డ్ లను పూరించడం మెదడుకు మేలును కలిగిస్తుందనటంలో అనుమానం లేదు. భౌతికమైన వ్యాయామం చేస్తే కండరాలు పెరిగినట్టే, మెదడును ఈ రకమైన వ్యాయామానికి గురి చేస్తే మెదడులోని నాడీకణాలు వృద్ది చెందుతాయని పరిశోధన ద్వారా రుజువైంది.

దాదాపు నలబై సంవత్సరాల క్రితం జ్యోతి మాసపత్రికలో శ్రీశ్రీ గారు నిర్వహించిన ‘పదబంధ ప్రహేళిక’ చాలా ప్రామాణికంగా, జటిలంగా ఉండేది. తర్వాత ఆ శీర్షికను ఆరుద్ర గారు కొంతకాలం పాటు కొనసాగించారు. అంతకన్న దాదాపు పది సంవత్సరాల ముందు – అంటే 1965 ప్రాంతంలో – వీటికన్న తక్కువ ప్రమాణికత ఉన్న క్రాస్ వర్డ్ ఒకటి ‘పుస్తక ప్రపంచం’ అనే పత్రికలో వచ్చేది. నాకు జ్ఞాపకమున్న మొట్టమొదటి క్రాస్ వర్డ్ అదే. 2007 – 2011 ప్రాంతంలో ‘పొద్దు’ ఇంటర్నెట్ పత్రికలో ధారావాహికంగా వచ్చిన పజిళ్లు కూడా చాలా వరకు ప్రమాణికతను కలిగి ఉన్నవే. ఈ రోజుల్లో మన తెలుగు పత్రికలలో వస్తున్న క్రాస్ వర్డ్ లు చాలా సులభమైనవి కనుక, వాటిని పూరించడం వలన మెదడుకు అంతగా వ్యాయామం ఉండదు. జటిలమైన పజిళ్లు సాధారణ పాఠకులకు విసుగును తెప్పిస్తాయి కనుక, వాటికి ఆదరణ తక్కువ. అందుకే వాటిని ప్రచురించడానికి పత్రికలు జంకుతాయి.

ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ ల విషయానికి వస్తే, న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ కు అన్నిటికన్న ఎక్కువ జటిలమైనదనే పేరుంది. దాన్ని వదిలేస్తే, నేను చూసినంత వరకు ఇంగ్లిష్ , తెలుగు రెండు భాషల్లో కలిపి చూసినా The Hindu పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ అన్నిటికన్న జటిలమైనదే కాక, ఎంతో thrill ను ఇచ్చే పజిల్. అయితే క్రాస్ వర్డ్ పూరణకు సంబంధించిన కిటుకులు తెలిస్తే తప్ప హిందు పత్రికలోని పజిల్ను పూరించడం చాలా కష్టం. అవి తెలియనప్పుడు భాష ఎంత బాగా వచ్చినా లాభం లేదు. ఇంగ్లిష్ లో కానీ, తెలుగులో కానీ ఈ పజిళ్ల క్లూలు (ఆధారాలు) రెండు రకాలుగా ఉంటాయి. నేరుగా ఉండే ఆధారాలు (డైరెక్ట్ క్లూస్) మొదటి రకం. ఇక్కడ సాధారణంగా ఆధారంలో ఒకటే పదం ఉండి, దానికి సమానార్థక పదం సమాధానంగా ఉంటుంది. ఇక రెండవ రకం ఆధారాలను cryptic clues (నిగూఢ ఆధారాలు) అంటారు. ఇవి వాక్యాల రూపంలో ఉండి, డైరెక్టుగా ఉండక  చాలా తికమక పెడతాయి. కాని సరైన సమాధానం దొరికితే గొప్ప thrill కలుగుతుంది. ముందు ఆంగ్ల పజిళ్ల గురించి చెప్పి, తర్వాత తెలుగు పజిళ్లకు వస్తాను.

హిందులో వచ్చే క్రాస్ వర్డ్ ను శ్రీశ్రీ గారు ప్రతిరోజూ ఉదయం కాఫీ తాగేటప్పుడు పూరించానికి ప్రయత్నించేవారట. హిందు క్రాస్ వర్డ్ లో ఉండే ఆధారాలలో దాదాపు వంద శాతం cryptic (నిగూఢ) రకానికి చెందినవే కాబట్టి, ట్రిక్స్ తెలియకుంటే ఆంగ్లభాష బాగా వచ్చినవాళ్లు కూడా చాలా మంది ఒక్కటంటే ఒక్క ఆధారానికి సైతం సమాధానం చెప్పలేకపోవచ్చు. ఆ ఆధారాలు ఎలా ఉంటాయో తెలుపడానికి ఈ కింద కొన్ని ఉదాహరణలిచ్చి, వాటికి సమాధానాలను వివరిస్తాను. బ్రాకెట్లలో ఉన్నది సమాధానంలోని అక్షరాల సంఖ్య. పాఠకులు సులభంగా అర్థం చేసుకోవడం కోసం కొన్ని కీలకమైన అక్షరాలను bold font లో ఇస్తున్నాను. కాని, పజిళ్ల ఆధారాలను అచ్చు వేసినప్పుడు అవి ఈ విధంగా red bold font లో ఇవ్వబడవు.

1. Flower in my control (7)

దీనికి సమాధానం mastery. ఎట్లా అంటే, my అనే పదంలో aster (ఒక పువ్వు పేరు)ను చొప్పించాలి. అంటే m ను ఒక చివరన y ని మరొక చివరన వుంచి, మధ్య aster ను పెట్టాలన్న మాట. అప్పుడు mastery వస్తుంది. Mastery అన్న పదం control కు సమానార్థకం కదా!

2. Run and fall in Karnataka (3)

దీనికి సమాధానం jog. వివరణ చూడండి. Jog (జాగ్) అంటే run (పరుగెత్తడం). ఇక Jog (జోగ్) అన్నది జలపాతం (fall = waterfall) కూడా. ఇది కర్ణాటక రాష్ట్రంలో వుంది!

3. Edward got ten by ten to project (6)

దీనికి సమాధానం extend. ఎలాగంటే, Edward కు Ed ను short form గా తీసుకోవాలి. ఆ రెండు అక్షరాలను దూరంగా వుంచి, వాటి మధ్యన xten ను చొప్పించాలి. రోమన్ సంఖ్యల ప్రకారం X అంటే పది. తర్వాత మరొక పదికి ten ను అలాగే పెట్టాలి. Extend అన్నా project అన్నా ఒకటే (చొచ్చుకుని బయటికి రావడం).

4. They take pictures – hundred and a thousand times (7)

దీనికి సమాధానం cameras. రోమన్ సంఖ్యల ప్రకారం C = 100, M = 1000, eras = times. ఈ సమాధానంలో, ఆధారంలోని a ను ఉన్నదున్నట్టుగానే c తర్వాత వుంచాలి.

5. Wander with or without Right (5)

దీని సమాధానం amble. ఎట్లా అంటే, wander = తిరగడం లేక నడవడం. దీనికి సమానార్థక పదం amble. ఇక్కడ చమత్కారమేమంటే with or without Right అన్నప్పుడు ఆధారంలోని Right కు మొదటి అక్షరమైన R ను తీసుకోవాలి. దాన్ని amble కు ముందు వుంచితే ramble వస్తుంది. అప్పుడు కూడా అర్థం మారదు. R ఉన్నా లేకపోయినా ఒకటే అర్థం అన్న మాట (Ramble అన్నా amble అన్నా నడవడం లేక తిరగడం)

6. Discovers Sun revolving around a planet (7)

దీనికి సమాధానం unearths. ఇక్కడ earth ఒక planet కనుక, ఆ పదం చుట్టూ Sun లోని మూడక్షరాలను అమర్చాలి. అయితే ఇక్కడ Sun అని కాక, uns అని చేర్చాలి. ఇక unearths = discovers.

7. Some walk in grass and see a person of royal origin (4)

దీనికి సమాధానం king. హిందు క్రాస్ వర్డ్ లోని ఆధారాలలో ఎక్కడైనా some అని వస్తే సాధారణంగా సమాధానం నేరుగా (ఎటువంటి మార్పు లేకుండా) ఆ ఆధారంలోనే వుంటుంది. అయితే అది ఒకే పదంగా కాక, దానిలోని అక్షరాలు రెండు లేక మూడు పదాలలో వ్యాపించి ఉంటాయి. ఈ ఆధారంలో walk లోని చివరి అక్షరం, grass లోని మొదటి అక్షరం, ఆ రెండింటి మధ్య in ను తీసుకోవాలి. అంటే సమాధానం మనకు en-bloc గా  దొరికిందన్న మాట.

8. Beginners in empirical research role often repeat this mistake (5)

దీనికి సమాధానం error. ఇక్కడ beginners అంటే రాబోయే పదాలను ప్రారంభించే అక్షరాలు అని అర్థం చేసుకోవాలి. Empirical, research, role, often, repeat – ఈ పదాల మొదటి అక్షరాలను కలిపితే error వస్తుంది. అది mistake కు సమానం.

9. Nasty agreement to disown male adolescent (8)

దీనికి సమాధానం teenager. ఇక్కడ agreement లోంచి m అనే అక్షరాన్ని తొలగించి (disown చేసి), మిగిలిన అక్షరాలను తారుమారు చేయగా teenager వస్తుంది. అది adolescent కు సమానం. Nasty అంటేనే తారుమారైన అని అర్థం చేసుకోవాలి. ఒక పదంలోని అక్షరాలను తారుమారు చేసి సమాధానాన్ని పొందటం చాలాసార్లు అవసరమౌతుంది క్రాస్ వర్డ్ పజిళ్లలో. వీటిని anagrams అంటారు. ఉదాహరణకు lived – devil, Nepal – panel, ruminates – anti serum, amusing or – ignoramus మొదలైనవి.

10. After removing the tail, sear and eat fish (7)

దీనికి సమాధానం sardine. ఎట్లా అంటే, the అనే పదానికి tail (తోక) అయిన e ని sear లోంచి తీసేస్తే sar మిగులుతుంది. దాని పక్కన eat కు సమానమైన dine ను చేర్చాలి. అప్పుడు sardine వస్తుంది. అది ఒక చేప రకం పేరు!

11. Money holders with everyone set out (7)

దీనికి సమాధానం wallets. ఆధారంలో ఉన్న with అనే పదంలోని మొదటి అక్షరమైన w ను తీసుకుని, దానిపక్కన everyone కు సమానమైన all నూ, తర్వాత set ను తారుమారు చేయగా వచ్చిన ets నూ చేర్చితే wallets వస్తుంది. వాలెట్స్ (పర్సులు) మనీ హోల్డర్సే కదా.

12. Hit the French and get a glass ring (6)

దీనికి సమాధానం bangle. Hit = Bang. ఇక the కి le తీసుకోవాలి  (ఫ్రెంచ్ భాషలో the ని Le, Les అంటారు). Bangle = Glass ring.

అదే విధంగా sailor కు ab (Able Bodied men కు short form), work కు op (సమానార్థక పదమైన operation లోని మొదటి రెండక్షరాలు), worker కు ant, ship కు SS, the Spanish కు el, doctor కు MO లేక MB, bachelor కు BA, politician కు MP, student కు L (Learner లోని మొదటి అక్షరం), father కు pa, m other కు  ma – ఇట్లా లెక్కలేనన్ని సంకేతాక్షరాలు, పదాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి సంకేత పదాలు అని నిఘంటువులలో ఇవ్వబడదు. మరి ఆ విషయం మనకు ఎట్లా తెలియాలి అంటే క్రాస్ వర్డ్ లను పూరించడంలో అనుభవం ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి. క్రాస్ వర్డ్ లను గురించిన పుస్తకాలలో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉండవచ్చు. లేదా ప్రతిరోజూ క్రాస్ వర్డ్ ను నింపటానికి ప్రయత్నం చేస్తూ, అంతకు ముందురోజు ఇవ్వబడిన పజిల్ సమాధాలను జాగ్రత్తగా పరిశీలించి కొత్త సంకేతాక్షరాలను, పదాలను నేర్చుకోవాలి.

13. Slight deficiency in a hormone (7) అనే ఆధారానికి insulin ఎట్లా సమాధానం అయిందో తెలుసుకోవడానికి తలను బద్దలు కొట్టుకోవాల్సివచ్చింది. ఇక్కడ slight అంటే కొంచెం అని కాక, అవమానించుట/అవమానం అనే అరుదైన మరో అర్థాన్ని తీసుకోవాలి. దానికి సమానార్థక పదం insult. అయితే deficiency (కొరత) ఉన్నదంటున్నారు కనుక, ఒక అక్షరాన్ని (ఇక్కడ చివరి అక్షరమైన t ని) తీసేయాలి. అప్పుడు insul మిగులుతుంది. ఆధారంలో ఉన్న in ను అలాగే ఉంచి కలపాలి. అప్పుడు insulin వస్తుంది. ఇది రక్తంలోని గ్లూకోజును నియంత్రించే ఒక హార్మోను! చూశారా, దీంట్లో ఎంత తిరకాసు వుందో.

14. Sultana’s odd, substituting king with knight (5). ఇది మరొక క్లిష్టమైన ఆధారం. దీనికి సమాధానం queen. ఎట్లా అంటే, odd కు సమానార్థక పదం queer. ఆ పదంలోని చివరి అక్షరమైన r రాజును సూచిస్తుంది (Royal, regal అనే పదాలలోని మొదటి అక్షరం R కనుక). Queer లోని r ను తొలగించి దాని స్థానంలో knight లో ఉచ్చారణపరంగా మొదటి అక్షరమైన n ను పెట్టాలి. అప్పుడు queen వస్తుంది. సుల్తానా అంటే ముస్లిమ్ రాణి కదా! ఇక్కడ Sultana’s అంటే Sultana is అన్న మాట. హిందు క్రాస్ వర్డ్ లో ఇంతకన్న ఎక్కువ క్లిష్టమైన ఆధారాలు కూడా వుంటాయి. వాటిని చర్చిస్తే మెదడు విపరీతంగా వేడెక్కిపోతుంది.

హిందు క్రాస్ వర్డ్ లోని ఆధారాలలో ఇవ్వబడే చాలా పదాలకు సాధారణ అర్థమున్న పదాలను కాక, అరుదైన అర్థమున్న పదాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు writer అన్నప్పుడు రచయిత అని కాక pen అనే పదాన్ని (that which writes)  తీసుకోవాలి.  Pen అన్నప్పుడేమో కలం అని కాక sty (పందుల దొడ్డి)ని తీసుకోవాలి. Rail అన్నప్పుడు రైలు/పట్టా అని కాక shout/ rant (కోపంతో అరచుట)ను, see అన్నప్పుడు look/behold అని కాక eye ని (క్రియాపదాన్ని), locks అన్నప్పుడు తాళాలు అని కాక hair ను (side locks = side hair) తీసుకుని ఉపయోగించాలి. అదే విధంగా will అన్నప్పుడు దాన్ని helping verb గా కాక, వీలునామా అనే అర్థంలో తీసుకోవాలి. Retire ను ఉద్యోగ విరమణ చేయడం అనే అర్థంలో కాక, sleep (రాత్రి పూట నిద్ర పోవటం) ను తీసుకోవాలి.

తెలుగు పజిళ్లలో anagrams కాని, అటువంటి పదాలున్న ఆధారాలను కాని, ఇచ్చినప్పుడు తారుమారైన, కకావిలైన, తలక్రిందులైన, అస్తవ్యస్తమైన, అయోమయమైన, గజిబిజిగా – ఇట్లాంటి పదాల ద్వారా సూచన ఇవ్వబడుతుంది. కాని, హిందు క్రాస్ వర్డ్ లో కొన్నిసార్లు అటువంటి సూచన ఏమీ ఉండదు. మనమే ఊహించి తదనుగుణంగా పజిల్ పూరణ చేసుకోవాలి.

ఇటువంటి వివిధ రకాల విన్యాసాలతో, చమత్కారంతో కూడిన ఆధారాలుంటాయి హిందు క్రాస్ వర్డ్ లో. ఒక్కటి మాత్రం తప్పక గుర్తు పెట్టుకోవాలి. అదేమిటంటే, ఆధారాలలోని వాక్యాలు ఇచ్చే అర్థం ప్రకారం సమాధానం వెతికితే పజిల్ను అసలే పూరించలేము. దానికి బదులు వాక్యపు అర్థాన్ని పూర్తిగా మరచిపోయి, ఆధారంలోని కీలక పదాన్ని గుర్తు పట్టి, దానికి సమానార్థక పదాన్ని ఆలోచించాలి. ఈ కీలక పదం సాధారణంగా ఆధారంలోని మొట్టమొదటి పదం కాని, చివరి పదం కాని అయి వుంటుంది.

***

ఇక తెలుగు పజిల్స్ కు వద్దామా?

శ్రీశ్రీ తయారు చేసిన ఆధారాలు కొన్ని మాత్రమే జ్ఞాపకమున్నాయి నాకు. వాటిని ఈ కింద ఇస్తున్నాను.

1. ఒకటి, ఇంకొకటి, మరొకటి (1, 1, 1)

దీనికి సమాధానం టి, టి, టి. వివరణ అవసరం లేదనుకుంటాను.

2. విరోధాలు (రాత్రికా?) (3)

దీనికి సమాధానం పగలు. శత్రుత్వాలు అన్నది ఒక అర్థమైతే daytime అన్నది మరొక అర్థం. ఇక్కడ చమత్కారమేమంటే పగలు (daytime) రాత్రికి విరోధం లేక వైరుధ్యం (opposite) కూడా!

3. ఆవాలు (1, 1, 1, 1)

దీనికి సమాధానం వా, వా, వా, వా. దీనికి కూడా వివరణ అవసరం లేదనుకుంటాను.

4. పొట్టితనం (x గాడిదా?) (4)

దీనికి సమాధానం వామనత. ఇందులో విశేషమేమీ లేదు. కాని, ఒక విలక్షణమైన చమత్కారం వుంది. అదేమిటంటే నిజానికి x స్థానంలో ఆ రోజుల్లో తన శత్రువైన ఒక ప్రసిద్ధ వ్యక్తి పేరును పెట్టాడు శ్రీశ్రీ. ఆ వ్యక్తి పొట్టిగా ఉంటాడు. ఇక్కడ ‘గాడిదా?’ ను రెండు రకాలుగా explain చేయవచ్చును కదా.

5. ఒకటికన్న రెండు నయం (3).

దీనికి సమాధానం తలలు. అయితే దీని గురించి పెద్ద దుమారం చెలరేగింది. ఇంత జటిలమైన ఆధారాన్నివ్వడం అన్యాయం, అసమంజసం అని పాఠకులు గగ్గోలు పెట్టారు. ఈ ఆధారానికి తలలు అనే సమాధానం ఎట్లా వస్తుందంటే, Homer రాసిన Iliad అన్న గ్రంథంలో Two heads are better than one అనే సామెత లాంటి ప్రసిద్ధ వాక్యం ఒకటి వుంది. దాని అర్థం ప్రకారం ‘తలలు’ సరైన సమాధానమే. క్రాస్ వర్డ్ ను పూరించటంలో కూడా ఒకటికన్న రెండు తలలు నయం అనే సూత్రం బాగా వర్తిస్తుంది సుమండీ – ముఖ్యంగా ఆ రెండు తలలు క్రాస్ వర్డ్ ను పూరించటంలో అనుభవాన్ని కలిగినవి అయినప్పుడు!



ఇక ఈ వ్యాస రచయిత చాలా కాలం క్రితం కలంపేరుతో కాక తన అసలు పేరుతో ‘రచన’ మాసపత్రికలో నాలుగైదు సంవత్సరాల పాటు పజిలింగ్ పజిల్ అనే పెద్ద (చాలా గడులున్న) క్రాస్ వర్డ్ ను నిర్వహించినప్పుడు తయారు చేసి ఉపయోగించిన ఆధారాలలోంచి కొన్నిటిని ఉదాహరిస్తాను.

1. బీరువాలో ఉండేవి. నాలుగుంటే రెండవుతాయి. (3)

దీనికి సమాధానం అరలు. అరలు అంటే సొరుగులు అనే కాక, సగాలు (½ లు ) అనే మరో అర్థం వుంది. నాలుగు సగాలు 2కు సమానం అవుతాయి కదా!

2. హణ హణ హణ హణ హణ తర్వాతది అధిరోహించడం (4)

దీనికి సమాధానం ఆరోహణ. ఎట్లా అంటే, ఆధారంలో ఐదు హణలు ఇచ్చి తర్వాతది అడగబడింది. ఐదు హణల తర్వాత ఆరవ లేక ‘ఆరో’ హణ వస్తుంది. ఆరోహణ అంటే అధిరోహించడం.

3. వార్తా పత్రిక – సత్రములో వెనక్కి పరచామా? (4, 3)

దీనికి సమాధానం సమాచార పత్రము. ‘స’ ను ఎడమ వైపు, ‘త్రము’ను కుడివైపు దూరంగా వుంచి మధ్యన ‘పరచామా’ అనే అక్షరాలను వెనక్కి (అంటే రివర్స్ ఆర్డర్లో) అమర్చితే సమాచార పత్రము వస్తుంది.

4. నీ వార ఫలాలు ఫరవా లేదు, మణులు రావచ్చు. (3)

‘నీ వారఫలాలు’ లోంచి ‘ఫరవా’ తీసేస్తే నీలాలు మిగులుతుంది. నీలాలు ఒక రకమైన మణులు కనుక, అదే జవాబు.

5. పవిత్ర నది కోసం మంచి ప్రారంభానంతరం దానికి సవరణ చెయ్యాలి. (4)

మంచి ప్రారంభం అంటే మంచి అనే పదంలోని మొదటి అక్షరం ‘మం’ అన్న మాట. తర్వాత దానికి అన్న పదాన్ని ‘దాకిని’గా మార్చి కలిపితే మందాకిని వస్తుంది. అది పవిత్ర నది.

6. తదుపరి చారి కట్టబోయే దాంట్లో దాగివున్న సేవకురాలు. (5)

ఇక్కడ సమాధానమైన ‘పరిచారిక’ ఆధారంలోనే en- bloc గా దాగివుంది.

7. చిత్తూరు పొలిమేరల నడుమ తారుమారై కూలు బాలాజీ గుడి ఉన్న ప్రసిద్ధ క్షేత్రం (4)

ఇక్కడ చిత్తూరు అనే పదంలోని రెండు చివరలైన చి,రు పొలిమేరలన్న మాట.వాటి మధ్యన తారుమారైన ‘కూలు’ ను – అంటే ‘లుకూ’ను – ఉంచితే చిలుకూరు వస్తుంది!

8. అర్ధరాత్రికి గంటన్నర ముందు అడ్డదిడ్డంగా పన్నదిర! (4)

అర్ధరాత్రి అంటే పన్నెండు గంటల సమయం. దానికి గంటన్నర ముందు అంటే పదిన్నర కదా. ‘పన్నదిర’ అడ్డదిడ్డంగా ఉన్నది కనుక దాన్ని సరి చేస్తే ‘పదిన్నర’ వస్తుంది!

9. స్పర్ధ కోసం నడుమ లేకుండా అట్నుంచి టీ తేపో. (2)

ఇక్కడ పోటీ అన్నది సమాధానం ఎలా అయిందంటే, ‘టీ తేపో’ లోని మధ్య అక్షరమైన ‘తే’ ను తీసేసి రివర్స్ చెయ్యాలి. స్పర్ధ అంటే పోటీ అని అర్థం.

10. తలకిందులైన నావ చుట్టూ పలు గాలులు (4)

ఇక్కడ నావను తలకిందులు చేస్తే ‘వనా’ వస్తుంది. దానికి అటూ యిటూ ‘పలు’ అమర్చితే పవనాలు వస్తుంది. కనుక అదే సమాధానం. దీన్ని నిలువు ఆధారాలలో ఒకటిగా ఇస్తే బాగుంటుంది.

11. తెలివి లేనివాడు అని లోపల జ్ఞానం సగమే ఉంటుంది. (3)

‘అని’ లోపల జ్ఞానంలోని సగమైన ‘జ్ఞా’ను చేర్చితే అజ్ఞాని వస్తుంది. అదే సమాధానం.

12. పాక్షికమైన పలవరింత తర్వాత కొంత కాలానికి మాట్లాడాలా? (4)

పలవరింత పాక్షికమే కనుక ‘పల’ మాత్రమే తీసుకోవాలి. దాని తర్వాత ‘కాలానికి’లో కొంత (కాలా) మాత్రమే తీసుకుని కలపాలి. అప్పుడు పలకాలా (మాట్లాడాలా) వస్తుంది.

13. తలుపేసి నడుమ తారుమారుగా తలకెక్కేవి. (2)

దీనికి పేలు సమాధానం ఎలా అంటే, తలుపేసి అన్న పదం మధ్యన పేలు తారుమారై వుంది.

14. నా నా నా – ఇట్లాంటివి నూరు నమస్కారాలు. (4)

నా అనే అక్షరాలు నూరు (వంద) – అంటే వందనాలు అనే కదా. అదే సమాధానం.

15. వేరు మూల్యం యావత్తు పోయింది. (2)

ఇక్కక వేరుకు సమాన పదమైన మూలం సమాధానం. ‘మూల్యం’లోంచి ‘యా’వత్తు పోయిందన్న మాట!

ఈ విధంగా ప్రామాణికమైన, జటిలమైన క్రాస్ వర్డ్ లను ప్రతిరోజు నింపటానికి ప్రయత్నిస్తే మెదడుకు మంచి వ్యాయామం దొరికి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ వ్యాసం ఒకరిద్దరికైనా స్ఫూర్తిని కలుగజేసి క్రాస్ వర్డ్ పట్ల ఆసక్తిని పెంచితే ఈ వ్యాసకర్త ధ్యేయం నెరవేరినట్టే.
----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Wednesday, August 15, 2018

క్రాస్ వర్డ్ పజిళ్లు – నా ప్రస్థానం


క్రాస్ వర్డ్ పజిళ్లు – నా ప్రస్థానం




సాహితీమిత్రులారా!



“ఆలేస్తు కంది”

“ఏం కూర వండమంటారు?”

“టటమా రకూ”

“ఈరోజేం వారం?”

“శురవా ముక్ర” (లేదా బువాధరం)

“ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడింది ఎవరితో?”

“లక్ష్మీ జరాం”

“ఆయనెక్కడుంటున్నాడిప్పుడు?”

“రామం జడ్రి”

ఇట్లాంటి సంభాషణ నాకూ నా శ్రీమతికీ మధ్య అప్పుడప్పుడు జరుగుతుందంటే మీరు నమ్ముతారో లేదో కానీ, తారుమారు మాటల వ్యవహారం మొదట్నుంచీ నాకెంతగానో నచ్చే విషయం! పై సంభాషణలోని 1, 3, 5, 7, 9 వాక్యాలకు సరైన రూపాలు ఆకలేస్తుంది, టమాట కూర, శుక్రవారము (బుధ వారం), లక్ష్మిరాజం, రాజమండ్రి అని మీరిప్పటికే గుర్తు పట్టి వుంటారు.

1965 ప్రాంతంలో – అంటే నేను ఆరవ తరగతిలోనో, ఏడవ తరగతిలోనో ఉన్నప్పుడు – పుస్తక ప్రపంచం అనే పత్రిక వచ్చేది. అందులోని చిన్న క్రాస్ వర్డ్ పజిల్ ను ఎంతో ఇష్టంగా పూరించే వాడిని. అది జటిలంగా ఉండేది కాదు. వేరు తెగిన వేరుశనగ, తల తారుమారైతే వచ్చే తీగ – ఇట్లా ఉండేవి ఆధారాలు. ఆ విధంగా నాకు తెలియకుండానే పజిళ్ల మీద Love at first sight ఏర్పడింది.

చాలా కాలం తర్వాత – అంటే నేను ఎం.బి.బి.ఎస్. లో ఉన్నప్పుడు – ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ పజిళ్ల మీద నాకు మమకారం మరింతగా మొగ్గ తొడగటం మొదలైంది. ఎట్లా అంటే, నా సహాధ్యాయులైన రఘు, రాజేందర్ రెడ్డి, జయంతి నాయుడు క్లాస్ రూములో హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ ను నింపుతుండేవారు. రఘు ఇప్పుడు కార్డియాలజిస్ట్. రాజేందర్ రెడ్డి పీడియాట్రిషన్. జయంతి నాయుడు కూడా ఏదో స్పెషలిస్ట్ అనుకుంటా. రఘు తప్ప మిగిలిన ఇద్దరు ఇప్పుడు USA లో ఉంటున్నారని నా ఊహ. అయితే, వాళ్లద్వారా నేను మరీ అంతగా నేర్చుకున్నదేం లేదు. వాళ్లు గడులను నింపుతుంటే కేవలం గమనిచేవాడిని – అంతే. కాని, తర్వాతి కాలంలో రఘు, నేను పక్కపక్క గదుల్లో ఉంటున్నప్పుడు, వాడు నాకు ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ లను గురించిన ప్రాథమిక అవగాహనను కలిగించాడు. తర్వాత చాలా సంవత్సరాల అనంతరం నేను కాకతీయ మెడికల్ కాలేజ్ లో పీడియాట్రిక్స్ పి.జి. కోర్సు చేస్తున్నప్పుడు డాక్టర్ విఠల్ జనరల్ మెడిసిన్ పి.జి. విద్యార్థి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ అయ్యాడు. అతను కూడా హిందు క్రాస్ వర్డ్ లను నింపుతుండేవాడు. మేం హాస్టల్లో ఉండేవాళ్లం కనుక ఉదయం, మధ్యాహ్నం తిండి కోసం డైనింగ్ హాల్లోకి వచ్చినప్పుడు కలిసి ఆ పజిల్ ను నింపటం మొదలు పెట్టాము. డాక్టర్ శ్రీరామ్ అనే ఒక తమిళుడు అప్పుడే రేడియాలజీలో పి.జి. కోర్సు చేస్తూ మా హాస్టల్లోనే ఉండేవాడు. అతనికి ఆంగ్లభాష మీద మంచి పట్టు ఉన్నా కూడా హిందు పజిల్ ను అసలే నింపలేక పోయేవాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చి “సార్, ఎట్లా నింపుతారు మీరు అవన్నీ? నాక్కొంచెం వివరించరా ప్లీజ్” అని అడిగాడు. నేను అతనికి అవగాహన కలిగే విధంగా సాధ్యమైనంత వరకు తెలియజెప్పాను. తర్వాత అతను పుంజుకున్న తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారం రోజుల్లోనే ఎంతో నేర్చుకున్నాడు. ఉదయం కొంత మధ్యాహ్నం కొంత నింపి, సాయంత్రం టీ కోసం డైనింగ్ హాలుకు వచ్చినప్పుడు పజిల్ ను పూర్తి చేసేవాళ్లం. కొన్నిసార్లు నాకు రాని ఒకటి రెండు సమాధానాలను శ్రీరామ్ సాధించేవాడు. ఇక అప్పుడతని ఆనందానికి అవధులుండేవి కావు. నన్ను గట్టిగా కౌగిలించుకుని “కమాన్, లెటజ్ సెలెబ్రేట్ సర్” అంటూ బలవంతంగా రెస్టరాంట్ కు తీసుకుపోయి, బిస్కెట్లూ కేకులూ తినిపించి, టీ తాగించేవాడు. ఇప్పుడతను బెంగళూరులో స్థిరపడ్డాడని విన్నాను.

ఈ లోగా నేను ‘రచన’ మాసపత్రికలో రెండు దఫాలుగా పజిలింగ్ పజిల్ అనే శీర్షికన నిగూఢ ఆధారాలు గల పజిళ్లను దాదాపు నాలుగైదేళ్ల పాటు కూర్చాను. అయితే అవి మరీ అంత జటిలంగా ఉండేవి కావు. కాని, పాఠకాదరణను బాగానే చూరగొన్నాయి. క్రాస్ వర్డ్ పజిళ్లను గురించిన నా అభిప్రాయమేమంటే, మూసిన నా పిడికిలిలో ఏముందో చెప్పుకో అన్నట్టుగా ఆధారాలు జటిలంగా ఉండటం కాక, పజిల్ను పూరించింతర్వాత పాఠకులకు తృప్తి, త్రిల్ కలిగించే విధంగా ఉండాలి, అని. అక్షరక్రీడకు/పదక్రీడకు (word play కు) అవకాశం ఉన్నప్పుడే తృప్తి, త్రిల్ కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆధారంలోనే జవాబు దాగి వుండి, బాగా ఆలోచిస్తే అది మెదడుకు తట్టాలి. అట్లాంటి ఆధారాలను వర్ణించడానికి మన తెలుగు భాషలో అంతర్లాపి అనే ఒక పదమున్నదని నా అన్నయ్య (నాగరాజు రామస్వామి) చెప్తే తెలిసింది నాకు. ‘ద హిందు’ ఆంగ్లపత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిళ్లలో అటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని ఛేదించాలంటే ఆంగ్లభాష బాగా రావటమే కాకుండా పదునైన ఊహాశక్తి, చురుకైన మేధ అవసరం. హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ పజిళ్లను నేను కొన్ని దశాబ్దాలుగా దాదాపు ప్రతిరోజూ నింపుతూ వస్తున్నాను. అయినా ఇప్పుడు కూడా ఒక్కో పజిల్ను నింపటంకోసం గంటల తరబడి శ్రమించాల్సి వుంటుంది. సాధారణంగా 60 నుండి 99 శాతం వరకు కరెక్టుగా వస్తుంది. చాలా అరుదుగా – అంటే సరాసరిన నెలకొకసారి మాత్రమే – వంద శాతం కరెక్ట్ గా పూరించ గలుగుతాను. దీన్ని బట్టి ఆ పజిళ్లు ఎంత జటిలంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా ప్రతిరోజూ పూరించడానికి ప్రయత్నించటం మానను.

సుడోకు లాగానే ఈ క్రాస్ వర్డ్ పజిళ్ల పట్ల ఆసక్తి కూడా వ్యసనంగా మారే అవకాశముంది. అయితే అది లాభాన్నే చేకూరుస్తుంది తప్ప హానిని కలిగించదు కదా. పజిల్ను పూరించేటప్పుడు పర్యాయ పదాలకోసం బాగా ఆలోచించాల్సి వస్తుంది, నిఘంటువుల్లో వెతకాల్సి వస్తుంది. తద్వారా కొత్తకొత్త పర్యాయ పదాలనెన్నింటినో నేర్చుకుంటాం. ఇక మరుసటి రోజు జవాబుల్ని చూసుకున్నప్పుడు కూడా కొత్త వాటిని నేర్చుకుంటాం. ఇదంతా మెదడుకు వ్యాయామం లాంటిది కనుక, దీనివల్ల జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుంది.

నిగూఢ ఆధారాలతో కూడుకున్న పజిల్ ప్రక్రియను నేను సాహిత్య ప్రక్రియతో సమానంగా భావిస్తాను.

***

ఈ నెలతో ‘వాకిలి నుడి’ శీర్షిక రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ శీర్షికను నేను నిర్వహించ బోవటం లేదు. వేరొకరి చేత నిర్వహింపజేయాలా వద్దా అనే విషయాన్ని ప్రధాన సంపాదకులు నిర్ణయిస్తారు. ద్వైపార్శ్వ సౌష్ఠవం కలిగిన గ్రిడ్లు, నవ్యత చమత్కారం వైవిధ్యం కలిగిన ఆధారాలు – వీటిని సంతృప్తికరంగా తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అయినా, దీన్ని నడిపినంత కాలం నేను మాత్రం బాగా ఆనందించాను.

చాలా ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా పజిళ్లను రూపొందించక పోవడానికి కారణం ప్రమాణికతను నిలుపుకోవాలనే నా తపన మాత్రమే. మామూలు రకం పజిళ్లను చాలా పత్రికలు నిర్వహిస్తూనే ఉన్నాయి. వాటికి భిన్నంగా శీర్షికను ఉన్నత స్థాయిలో నడపాలని నాకొక బలమైన కోరిక ఉండింది. ఆధారాలు జటిలంగా ఉండాలా లేక సులభంగా ఉండాలా అన్నది ముఖ్యం కాదు. వాటిలో తెలుగు నుడికారం తాలూకు చమత్కారాన్ని మేళవిస్తున్నామా లేదా, వాటిని సరిగ్గా పూరించిన తర్వాత పాఠకుడు ఒక త్రిల్ ను పొందుతున్నాడా లేదా అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం. ఇక ఆధారాలను రూపొందించడంలో నవ్యతను, వైవిధ్యాన్ని చూపాలన్నదే నాతపన.

నా ఈ ఆధారాలలోని కిటుకులను మొదట్లో చాలా మంది పట్టుకోలేక పోయినా, పజిల్ ప్రియులైన కొందరు పాఠకులు మెల్లమెల్లగా మెళకువలను నేర్చుకుని, సరిగ్గా పూరించే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. అట్లా సంపాదించుకోలేని వారు ఈ పజిళ్లలో పస లేదని పెదవి విరిచారు. ఇప్పటిదాకా వచ్చిన, ఇప్పుడు వస్తున్న తెలుగు పజిళ్లలో ఉన్న నవ్యత కంటె, వైవిధ్యం కంటె నా పజిళ్లలో ఆ లక్షణాలు కొంచెమైనా ఎక్కువ పాళ్లలో ఉన్నాయని పాఠకులెవరైనా భావిస్తే, నేను నా లక్ష్యసాధనలో కృతకృత్యుడినయ్యానని అనుకుని ఆనందిస్తాను.
-----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Tuesday, August 14, 2018

‘ద హిందు’ క్రాస్ వర్డ్ పజిళ్లలోని చమత్కార వైవిధ్యం, విస్తృతి, వైచిత్రి


‘ద హిందు’ క్రాస్ వర్డ్ పజిళ్లలోని 
చమత్కార వైవిధ్యం, విస్తృతి, వైచిత్రి



సాహితీమిత్రులారా!

ఈ మధ్య అంతర్జాల పత్రికల్లో క్రాస్ వర్డ్ పజిళ్ల హవా బాగా వీస్తోంది. దీనికి ముఖ్య కారణం పజిల్ ప్రక్రియ పట్ల ఆ సంపాదకులకు గల అమితమైన ఆసక్తే కనుక, వారిని మనమెంతో అభినందించాలి. మామూలు పజిళ్లను ప్రచురించడానికి ఏ పత్రికలైనా ముందుకు వస్తాయి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. అభినందించవలసిందీ లేదు. కాని, జటిలతను కలిగిన ప్రామాణిక పజిళ్లను వేసుకోవటానికి వ్యాపార పత్రికలు చాలా సందేహిస్తాయి.

నిగూఢ ఆధారాలు (cryptic clues) ఉండే ప్రామాణిక పజిళ్లతో మెదడుకు చాలా వ్యాయామం, తద్వారా మానసికానందం దొరుకుతాయి. భాషను మెరుగు పరచుకునే అవకాశం కూడా వాటి ద్వారా లభిస్తుంది. ప్రామాణిక ఆంగ్లపజిళ్ల లోని పద్ధతులను బాగా పరిశీలించి, ప్రయత్నం చేస్తే తెలుగులో కూడా నాణ్యమైన క్రాస్ వర్డ్స్ ను తయారు చెయ్యవచ్చు. ఆధారాలను కాపీ చెయ్యనక్కర్లేదు కాని, ఆధారాలను తయారు చేసే పద్ధతులను మనం తెలుగులో అవలంబించడం తప్పు కాదనుకుంటాను.

కేవలం జటిలత్వాన్ని నింపుకున్న పజిళ్లు మెదడుకు మేతను బాగానే ఇవ్వవచ్చు కాని, అవి వినోదాన్ని కలిగించవు. ఒక ఆధారాన్ని ఆకళింపు చేసుకుని సరైన సమాధానాన్ని రాబట్టింతర్వాత పాఠకునికి ఆనందం, సంతృప్తి కలగాలన్నది పజిల్ కూర్పరుల ప్రధాన ధ్యేయం కావాలి.

గ్రిడ్ (తెలుపు, నలుపు గడుల చట్రం) ను రూపొందించడం నుండే ప్రారంభమౌతుంది పజిల్ ను తయూరు చేసేవారి ప్రతిభ. ఏ పజిల్ గ్రిడ్ కైనా ద్వైపార్శ్వ సౌష్ఠవం (Bilateral symmerty) అతి ముఖ్యమైన prerequisite (ముందుగా అవసరమైన అంశం). ఎందుకంటే అది అందాన్ని చేకూరుస్తుంది. Bilateral symmetry లేకుండా గ్రిడ్ ను రూపొందించడం సులభం. కవిత్వంలోనైనా, కథలోనైనా లేక మరే సాహిత్య ప్రక్రియలోనైనా సౌందర్యం ప్రధానాంశంగా ఉండాలి. న్యూయార్క్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ‘ద హిందు’, ఇండియన్ ఎక్స్ ప్రెస్ మొదలైన క్రాస్ వర్డ్స్ లో కాని, పూర్వం శ్రీశ్రీ ఆరుద్రలు తయారు చేసిన క్రాస్ వర్డ్స్ లో కాని గ్రిడ్ సౌష్ఠవానికి చాలా ప్రాధాన్యం ఇవ్వబడటానికి కారణం అదే. గ్రిడ్ ను చూడగానే అది కక్కరిబిక్కరిగా ఉన్నట్టనిపిస్తే అందులో సౌందర్యాభాస లోపిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆంగ్ల పజిళ్లలోని చమత్కారవిస్తృతిని, వైచిత్రిని లోతుగా పరిశీలించడం ఎందుకు అవసరమంటే, తెలుగులో కూడా ఎన్నెన్ని రకాలుగా కొత్తదనాన్ని ప్రవేశపెడుతూ ఆధారాలను తయారు చెయ్యవచ్చునో దానిద్వారా తెలుస్తుంది మనకు. అయితే ఆంగ్ల పజిళ్లలోని వైవిధ్యాన్ని, వైచిత్రిని సంపూర్ణంగా అవగాహనలోకి తెచ్చుకోవాలంటే ఇంగ్లిష్ భాష బాగా రావటమే కాకుండా, ఆధారాలలోని రహస్యాన్ని decipher (decode) చేయగలిగే మేధ, ఊహాశక్తి అవసరం. ఆంగ్ల పజిళ్లలోని వైచిత్రిని వివరించడం ద్వారా తెలుగు పజిల్ కూర్పరులలో ఈ విషయం గురించిన అవగాహనను మరింతగా పెంచడానికి చేస్తున్న ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని భావించాలి. ఇంతకు ముందు ఇదే ‘వాకిలి’ పత్రిక ద్వారా ఇటువంటి ఒక చిన్న వ్యాసాన్ని అందించాను. కాని, అది సరిపోదనేది నిశ్చయం. కాబట్టి, ‘ద హిందు’ పజిళ్లలోని కొన్ని ఆధారాలను మీ ముందుంచి, వాటిని ఎలా decode చేయాలో ఒకదాని తర్వాత మరొకదాన్ని వివరిస్తాను.

1. Drop engineering degree one day (4)
దీనికి సమాధానం bead. ఎట్లా అంటే, engineering degree = B.E. ఇక one కు a, day కు d తీసుకుని BE కి కలపాలి. Bead = Drop. నీటి బిందువులను beads అని కూడా అంటారు ఆంగ్లంలో. ఉదాహరణకు చెమట బిందువులను beads of sweat అనటం మామూలే.

2. Bird in hurry to follow time by the hour (5)
Time కు t, hour కు h తీసుకోవాలి. Hurry = rush కనుక, మూడింటినీ కలిపితే వచ్చే thrush( ఒక పక్షి పేరు) దీనికి జవాబు.

3. Group has means to buy bone and couple of eggs (7)
Means = plan. Bone అన్నప్పుడు tibia లోని మొదటి అక్షరమైన t ని తీసుకోవాలి. టిబియా మన మోకాలిలో ఉండే ఒక ఎముక పేరు. Eggs = oo. Plan లో too ను (t+oo) చేర్చితే platoon వస్తుంది. సైన్యంలో ఉండే పదాతిదళం లోని ఒక విభాగాన్ని platoon అంటారు. అది ఒక రకమైన గ్రూపే కదా! కనుక అదే సమాధానం.

4. Article submitted by scholar has radical answers on law related to heat (7)
A, An, The – వీటిని ఆంగ్లభాషలో articles అంటాం కదా. సందర్భాన్ని బట్టి వీటిలోని ఒకదాన్ని తీసుకోవాలి. ఇక్కడ the ని తీసుకోవాల్సి వుంటుంది. Radical కు r తీసుకోవాలి. Scholar కు m తీసుకోవాలని ఒక నియమం (mనే ఎందుకు తీసుకోవాలో తెలియదు). తర్వాత answerకు a నూ, law కు L నూ తీసుకుని కలపటంతో వచ్చే thermal దీనికి సమాధానం. Thermal = related to heat.

5. General overturned advance against downwind (7)
General కు Lee ని తీసుకోవాలి. బహుశా పూర్వం ప్రపంచ యుద్ధంలో పని చేసిన ఒక ప్రసిద్ధ జనరల్ పేరు లీ కావటం అందుకు కారణం కావచ్చు. Advance = Draw. Overturned అంటున్నాం కనుక, draw ను తారుమారు చెయ్యాలి. అప్పుడు ward వస్తుంది. Lee + ward = Leeward = Downwind. Leeward జవాబు.

6. Infants suffer from blood loss, replenished with serum at the heart for disease (6)
Infants = Babies. Blood loss అన్నాం కనుక, blood లోని మొదటి అక్షరమైన b ని తీసెయ్యాలి. అప్పుడు abies మిగులుతుంది. B ని ఖాళీ చేయగా ఏర్పడిన స్థానాన్ని serumకు హృదయం (మధ్య అక్షరం) అయిన r తో భర్తీ చెయ్యాలి (replenish చెయ్యాలి). అప్పుడు Rabies వస్తుంది. Rabies ఒక వ్యాధి పేరు కాబట్టి అదే సమాధానం!

7. Black market amasses billion (5)
Market = Sale (Verb form లో). అది బిలియన్ ను పోగు/జమ చేసుకుంటుంది అంటున్నాం కనుక, billion లోని మొదటి అక్షరమైన b ని నడుమ చేర్చాలి. అప్పుడు వచ్చే sable ( black) సమాధానం.

8. Cab doesn’t start without maiden – that’s taken for granted (5)
Cab = Taxi. Doesn’t start అంటున్నాం కనుక t ని తీసేస్తే axi మిగులుతుంది. ఇక without maiden అంటే with out maiden అన్న మాట. Out లోని o ను, maiden లోని m ను axi కి కలుపగా వచ్చే axiom దీనికి సమాధానం. With out maiden అని పదాలను విడివిడిగా కాక, without maiden అని కలిపి ఇవ్వటం పాఠకులను తికమక పెట్టటం కోసమే! Axiom అంటే సూక్తి. సూక్తులలోని అర్థాన్ని ప్రశ్నించకుండానే మనం ఒప్పుకుంటాం కదా. Taking for granted కు ఉన్న అర్థాలలో ఇదొకటి.

9. Autographed and gestured everybody to leave (6)
Autographed కు సమానమైన signed దీనికి సమాధానం. అది ఎట్లా వచ్చిందంటే, gestured = signalled. Everybody = All. కాబట్టి, signalled లోంచి all వెళ్లిపోగా signed మిగిలింది!

10. Care-givers lose head getting President’s top prize amounts (6)
Care-givers = Nurses. వాళ్లు n ను (తలను) పోగొట్టుకుని, అదే స్థానంలో president లోని మొదటి అక్షరమైన p ని పొందారు. తత్ఫలితంగా ఏర్పడిన purses (prize amounts) ఇక్కడ జవాబు. పూర్వకాలంలో రాజులకు ఇవ్వబడిన భరణాలను purses అనేవారు.

11. Sing about each district magistrate being routine (9)
Sing = Trill. Each లోని మొదటి రెండక్షరాలైన ea, district లోని d, magistrate లోని m తీసుకుని Trill లో చేర్చితే వచ్చే treadmill దీనికి సమాధానం. నిజానికి ట్రెడ్ మిల్ అంటే శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడం కోసం ఉపయోగించే ఒక సాధనం. దానికి ఉండే బెల్టు మీద నడుస్తాం. అయితే ఇక్కడ treadmill అంటే విసుగును తెప్పించే పని/ఉద్యోగం అనే మరో అర్థాన్ని ఉద్దేశించాడు setter (పజిల్ కూర్పరి).

12. Vandals remove top of fortifications and get hard (7)
Vandals అంటే విధ్వంసాన్ని సృష్టించేవాళ్లు. దీనికి సమానమైన Hunkers ఈ ఆధారానికి జవాబు. ఎలా అంటే, fortifications = bunkers. దీనిలోని అగ్రభాగాన్ని (topను – అంటే b అనే అక్షరాన్ని) తీసేసి, అదే స్థానంలో h ను (Hard లోని మొదటి అక్షరాన్ని) పెట్టాలి.

13. Police novice yearning to overspend (7)
Police = SP (Superintendent of police). Novice = Learner కాబట్టి మొదటి అక్షరమైన L ను తీసుకోవాలి. Yearning = urge. వీటన్నిటినీ కలిపితే వచ్చే splurge దీనికి జవాబు. Splurge అంటే బాగా ఖర్చు చేయటం. ఇక్కడ police అనే పదం ఆధారంలో క్రియగా లేదా విశేషణంగా, సమాధానంలోనేమో నామవాచకంగా ఇవ్వబడినట్టు గమనించాలి.

14. The last run one requires to get a score a week after the thirteenth (9)
ఇక్కడ score కు ఇరవై అనే మరో అర్థాన్ని తీసుకోవాలి. ఒక స్కోర్ (20) ను సాధించడానికి అవసరమైన చివరిది ఇరవయ్యో పరుగు కనుక, సమాధానం twentieth. ఇది పదమూడో తేదీ తర్వాత వారం (ఏడు) రోజులకు వస్తుంది!

15. Urge deviant NGOs to make drinks (7)
To egg on అంటే ప్రోత్సహించుట. కనుక, egg ను urge కు సమానార్థక పదంగా తీసుకోవచ్చు. Deviant NGOs = NOGS. రెండింటినీ కలుపగా వచ్చే Eggnogs కోడిగుడ్డు సొనతో తయారు చేయబడే ఒక రకమైన డ్రింక్స్. వీటిని ఎక్కువగా పాశ్చాత్యులు తాగుతారు.

16. Graduate takes public transport to Hong Kong wearing a scarf (8)
Graduate = B.A. Public transport = bus. Hong Kong = HK. Ba, bus, hk – ఇవన్నీ కలిసి స్కార్ఫ్ కు ముందున్న a ను ధరిస్తాయి. వీటన్నిటినీ కలిపితే వచ్చే Babushka ఒక రకమైన స్కార్ఫ్ కనుక అదే జవాబు.

17. Last month Indian Military Academy student got this point, perhaps (7)
Last month అంటే సంవత్సరంలోని చివరి నెల అయిన December. దానికి short form అయిన Dec ను తీసుకోవాలి. Indian Military Academy కి short form IMA. Student = Learner కనుక, ఇక్కడ L ను తీసుకోవాలి. Dec + ima + l = Decimal = Point. కాబట్టి జవాబు అదే.

18. Some Africans admit soldier to Bangalore University at first (5)
ఇటువంటి క్రాస్ వర్డ్ పజిళ్లలో ఎక్కడైనా సోల్జర్ అనే పదం వస్తే దానికి సమానార్థకంగా ant తీసుకోవాలి. Bangalore University at first (first letters) = BU. Bu మధ్య ant చేరగా ఏర్పడే Bantu ఆఫ్రికాలోని ఒక తెగ పేరు కనుక, అదే సమాధానం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి సోల్జర్ కు GI తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా కొన్ని సార్లు worker కు ant ను తీసుకోవాలి. చీమలు ఆపకుండా పని చేస్తాయని అలా నిర్ణయించి వుంటారు.

19. Mounted soldiers from Virginia in California get royal salary at last (7)
To mount అంటే ఎక్కుట. Mounted soldiers అంటే గుర్రమెక్కిన సిపాయిలు. అంటే అశ్వదళమన్న మాట. దీనికి సమానమైన ఆంగ్ల పదం cavalry. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి CAL, వర్జీనియా రాష్ట్రానికి VA, short forms. Cal లో va చేరితే Caval వస్తుంది. తర్వాత Royal లోని మొదటి అక్షరమైన r నూ, salary లోని చివరి అక్షరమైన y నీ చేర్చాలి. అన్నింటినీ కలిపితే వచ్చే Cavalry దీనికి సమాధానం!

20. Cheerfulness shown by girl, one that is typically disheartened (6)
Girl = G. One = a. That is = i.e. Typically disheartened అంటే మొదటి, చివరి అక్షరాలను తప్ప మధ్యన ఉన్న అక్షరాలను (అవి హృదయానికి సమానమైనవి – ఇక్కడ ypicall) తీసేయడం. అట్లా చేస్తే ty మాత్రమే మిగులుతాయి. G + a + ie + ty = gaiety = cheerfulness. కనుక gaiety జవాబు.

21. Good, mostly willing to become educated (4-4)
Good = well. Willing = ready. Mostly (చాలా వరకు) అంటున్నాం కనుక y ని వదిలేసి read మాత్రమే తీసుకోవాలి. Well read = educated కనుక, అదే జవాబు.

22. Limitless fire at building, smoke is annoying (7)
Limits అంటే సరిహద్దులు, లేక పొలిమేరలు. ఇక్కడ fire లోని మొదటి, చివరి అక్షరాలు (f,e) అన్న మాట. అవి పోగా మిగిలేవి i,r. Building smoke అంటే smoke లోని అక్షరాలను (పునర్) నిర్మించాలి. అప్పుడు ksome వస్తుంది. ir + ksome = irksome = annoying. కాబట్టి ఇక్కడ irksome అన్నది జవాబు.

23. Missing sources of fine art via lethargy (7)
ఇక్కడ sources అంటే ప్రథమాక్షరాలు. Fine, art, via – ఈ మూడు పదాల మొదటి అక్షరాలైన f, a, v లను miss చేస్తే (తొలగిస్తే) మిగిలేది inertia = lethargy. కనుక జవాబు inertia.

24. Poets are leading drunks in pubs (5)
Pubs = Bars. Leading drunks అంటే drunks లోని మొదటి అక్షరమైన d. Bars లో d ని చేర్చగా వచ్చే bards జవాబు. Bard = poet.

25. Asian engineer protected by giant (7)
Asian కు సమనమైన Tibetan ఇక్కడ జవాబు. అది ఎట్లా వచ్చిందంటే, Giant = titan. Engineer = B.E. Titan లో be పెడితే Tibetan వస్తుంది. Protect అంటే చుట్టూ ఉండటమన్న మాట. Be చుట్టు (రెండు వైపులా) titan ఉన్నదని ఆధారంలో అన్యాపదేశంగా చెప్పబడింది.

26. Final villager falls into grave in famine (6)
ఇక్కడ death ను grave కు సమానార్థక పదంగా తీసుకోవాలి. Final villager అంటే villager లోని చివరి అక్షరమైన r అన్న మాట. Death లో r ను చేర్చగా వచ్చే dearth = famine. ఇక్కడ dearth సమాధానం.

27. Fan’s vow in the future (8)
ఈ వాక్యానికి అర్థం, ‘భవిష్యత్తులో నేను చేస్తాను’ అనే అభిమాని యొక్క ప్రతిజ్ఞ/వాగ్దానం – అని. ఈ ఆధారానికి సమాధానం idolater. ఆరాధకుణ్ని ఆంగ్లంలో idolater అంటాము. దీన్ని I do later అని విభజిస్తే అది భవిష్యత్తులో నేను చేస్తాను అనే అర్థాన్ని సూచిస్తుంది!

28. Enlist courtiers to regulate, dethroning other small chiefs (7)
Enlist కు సమానార్థక పదమైన recruit దీనికి జవాబు. Other small chiefs అంటే ఆ రెండు పదాల ప్రథమాక్షరాలు – s,c అన్న మాట. వాటిని courtiers లోంచి తొలగించి తారుమారు (regulate) చేస్తే recruit వస్తుంది!

29. Images of international fraud found at stations primarily (5)
International కు i, fraud కు con (మోసం) ను తీసుకోవాలి. Stations primarily అంటే మొదటి అక్షరమైన s అన్న మాట. వీటన్నిటినీ కలిపితే icons = images. కాబట్టి icons సమాధానం.

30. Getting used to one day at fair in Germany’s capital (9)
One కు a, day కు d, fair కు just (fair కు సమానార్థక పదం), Germany కి g తీసుకోవాలి. ఆధారంలోని in ను g కి ముందు ఉంచాలి. అన్నిటినీ కలిపితే వచ్చే adjusting (getting used to) ఈ ఆధారానికి సమాధానం. ఇక్కడ capital అంటే రాజధాని అని కాక, తల (మొదటి అక్షరం) అని అర్థం చేసుకోవాలి.

31. Definitely rude when European butts in (6)
Rude కు సమానార్థక పదం surly. European లోని మొదటి అక్షరమైన e ని surly లో చేర్చాలి. అప్పుడు వచ్చే surely (definitely) సమాధానం. To butt in అంటే లోపలికి రావడం.

32. Fight and run into a fit of shivering (5)
వణుకును కలిగించే చలిజ్వరాన్ని ఆంగ్లంలో ague అంటారు. దానిలో run కు మొదటి అక్షరమైన r ను చేర్చితే వచ్చే argue (fight) సమాధానం.

33. Scolding fool in South Africa summoning someone in Telugu repeatedly (9)
ఇదొక గమ్మత్తైన క్లూ. Fool కు సమానార్థక పదమైన ass ను తీసుకుని, దాన్ని SA లో (South Africa లోని ప్రధానాక్షరాలు) చేర్చాలి. Sassa వచ్చింది కదా. ఇక summoning someone in Telugu అంటే ‘రా’ ( summoning – పిలవడం) కు సమానమైన ra అనే అక్షరాలు. వాటిని ఉంచాలి. Repeatedly అంటున్నాడు కాబట్టి మరొక ra చేర్చాలి. అంతా కలిపితే వచ్చే sassarara (scolding) దీనికి సమాధానం.

34. Hunter man leaves Kashmiri dazed (7)
Hunter కు సమానమైన shikari సమాధానం. Man లోని మొదటి అక్షరమైన m ను Kashmiri లోంచి తీసేసి తారుమారు చేస్తే shikari వస్తుంది. ఇక్కడ dazed తికమక/తడబాటు/కకావికలును సూచిస్తుంది.

35. Horrid North Arcot pigpen (5)
ఇటువంటి ఆంగ్ల పజిళ్లలో pen లేక pigpen వచ్చినప్పుడు, sty (పందుల దొడ్డి) ని తీసుకోవాలి. అది pen కు ఉన్న మరో అర్థం. North Arcot లోని ప్రధానాక్షరాలైన Na పక్కన sty పెడితే వచ్చే nasty (horrid) సమాధానం.

36. Enclosure with silver found in church (4)
Silver కు సింబల్ Ag. Church కు CE (Church of England) తీసుకోవాలని నియమం. దానిలో ag ని చేర్చగా వచ్చే cage (enclosure) జవాబు.

37. What goes ahead of the act in favour of Oriental pal tired at end of day (8)
In favour of = for. Oriental = eastern కనుక మొదటి అక్షరమైన e ని తీసుకోవాలి. Pal tired at అన్నప్పుడు అక్షరాలను తారుమారు చేయగా వచ్చే pla, end of the day అన్నప్పుడు day లోని చివరి అక్షరమాన y ని తీసుకోవాలి. అన్నిటినీ కలిపితే వచ్చే foreplay (what goes ahead of the act) సమాధానం.

38. Great! That woman’s beginning to overtake spiderman, for example
(9)
Great = Super. That woman’s = her. Beginning to overtake = overtake లోని మొదటి అక్షరమైన o. అన్నిటినీ కలిపితే వచ్చే superhero సమాధానం. spiderman సూపర్ హీరోకు కు ఒక ఉదాహరణ కదా.

39. New Indian transforms as Desh ki Beti (7)
New కు n తీసుకుని, తర్వాత Indian లోని అక్షరాలను తారుమారు చేయగా వచ్చే andini ను కలుపగా ఏర్పడే nandini దీనికి సమాధానం.

40. Indian dish for one in Indian chariot (5)
Indian chariot కు ఇక్కడ rata తీసుకున్నాడు setter. One ను సూచించే i ని rata లో చేర్చగా వచ్చే raita (Indian dish) దీనికి సమాధానం. హిందు పత్రికలోని పజిళ్లను తమిళులు కూరుస్తారు. తమిళంలో మహాప్రాణాక్షరాలు లేవు. భక్తిని బక్తి అనీ, ప్రభాతాన్ని ప్రబాతం అనీ, రథంను రతం అనీ ఉచ్చరిస్తారు కనుక, ratha అనకుండా rata అన్నాడు. రైతాను కూడా తమిళేతరులైతే raitha అని రాసే అవకాశాలు ఎక్కువ.

41. Swell time no good to return to initial position (9)
Swell = Boom. Time = era (శకం). No Good లోని మొదటి అక్షరాలను (ng లను) పక్కన చేర్చాలి. అన్నిటినీ కలుపగా వచ్చే boomerang (to return to initial position) జవాబు. ఇక్కడ బూమెరాంగ్ క్రియాపదంగా ఇవ్వబడింది. నామవాచకమైన బూమెరాంగ్ కూడా ఉంటుంది.

42. Spiritual leader is cautious entering support group for drunks (7)
దీనికి జవాబు acharya. ఎలా అంటే, cautious కు సమానార్థక పదం chary. AA = Alcoholics Anonymous. అది మద్యానికి బానిసలైన వాళ్లకు సహాయ సహకారాలనందించే ఒక గ్రూపు. AA లో chary ని చేర్చగా వచ్చే acharya (spiritual leader) సమాధానం.

43. Old and every so often unsteady (4)
Unsteady లోని 1, 3, 5, 7 వ అక్షరాలను కలుపగా వచ్చే used (old) దీనికి సమాధానం.

44. Grandchild lacking blood group system developed protection (8)
బ్లడ్ గ్రూపులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ABO system, మరొకటి Rh system (ఈ పదాన్ని Rhesus అనే కోతి పేరులోంచి తీసుకున్నారు). రెండవదానిలో Rh plus, Rh minus అని మళ్లీ రెండు రకాలు. అందుకే మన బ్లడ్ గ్రూపును A +ve, అనో B -ve అనో చెప్తాం. Grandchild లోంచి rh ను తొలగించి కలగాపులగం చేస్తే వచ్చే cladding సమాధానం. Cladding అంటే కవచం, లేక పూత.

45. Restored short rebus – it included 3rd of July (7)
దీనికి సమాధానం rebuilt. ఎలా అంటే, short rebus = rebu (పొట్టిది అంటున్నాం కనుక, ఒక అక్షరాన్ని తగ్గించాలి.) తర్వాత July లోని మూడవ అక్షరమైన L ను it లో కలిపి మిశ్రమం చెయ్యాలి. తత్ఫలితంగా rebuilt (restored) ఏర్పడుతుంది.

46. Victor joins party to meet model with American historian (9)
దీనికి జవాబు Herodotus. Victor = Hero. Party = do. Model కు t ని తీసుకోవాలి (దీన్ని model T Ford నుండి తీసుకున్నారు). ఇక American కు US ను తీసుకుని, అన్ని అక్షరాలను వరుసగా రాయాలి. Herodotus ఒక చరిత్రకారుని పేరు.

47. Automobile company fired head of vehicles for tin – It may blow out (5)
దీనికి సమాధానం volcano. ఎలా అంటే, automobile company = Volvo. Fire అంటే (ఉద్యోగంలోంచి) తొలగించడం. Vehicles కి head అయిన v ని Volvo లోంచి తొలగించి, దాని స్థానంలో tin కు సమానమైన can ను చేర్చాలి.

48. Before team takes books to chairman (9)
Before = Pre. Team = side (ఆటల్లో ఒక వైపున ఆడే టీమును సైడ్ అంటాం కదా). Books = NT. ఎందుకంటే బైబిల్ గ్రంథం పాత వర్షన్ ను OT (Old Testament) అనీ, కొత్త వర్షన్ ను NT (New Testament) అనీ అంటారు. Pre + side + nt = president = chairman. కనుక president సమాధానం.

49. Teachers taking back prize (6)
ఇక్కడ టీచర్స్ అంటే NUT (National Union of Teachers) తీసుకోవాలి. ఇక prize కు gem తీసుకుని రివర్స్ చెయ్యాలి. రెండింటినీ కలిపితే వచ్చే nutmeg (ఒక రకమైన సుగంధ ద్రవ్యం) జవాబు.

50. Bowler mostly bends this (5)
ఇక్కడ elbow ఎందుకు జవాబంటే, bowler చాలా వరకు మోచేయిని వంచుతాడు కనుక. ఇక మరో రకంగా చూస్తే bowler అనే పదంలోని చాలా వరకు (ఐదక్షరాలను) వంచితే కూడా elbow వస్తుంది. ఇదే ఈ ఆధారంలోని చమత్కారం.

51. Confusion as one of the lights gets no power (6)
Confusion కు సమానార్థక పదమైన bedlam ఇక్కడ జవాబు. Light = bed lamp. అందులోంచి p (power) మాయమైతే bedlam వస్తుంది.

52. Force to do nothing, 50% fall for handyman (8)
Force కు F తీసుకోవాలి. To do = act. Nothing = o. తర్వాత 50% fall కు tum ఎందుకు తీసుకోవాలంటే, tumble లో ble (చివరి యాభై శాతం) పడిపోతే tum మిగుల్తుంది కనుక. ఇప్పుడు అన్నిటినీ కలుపగా వచ్చే factotum (handyman) సమాధానం.

53. Summer resident in the African savannah, perhaps (5)
ఇది మరొక చమత్కార భరితమైన క్లూ. ఇక్కడ summer అంటే వేసవి కాదు. దానికి పాము అనే అర్థాన్ని ఊహించుకోవాలి. ఎందుకంటే sum = add. Summer = adder. ఆంగ్లంలో adder పదానికి పాము అనే అర్థం ఉంది. సవానాలు ఆఫ్రికా ఖండంలోని ఒక రకమైన అడవులు.

54. Play for fifty and one hundred (6)
రోమన్ సంఖ్యల ప్రకారం fifty = L, one = I, one hundred = C. ఇక play for అంటున్నాడు కనుక, for తో అక్షరక్రీడ సలుపగా వచ్చే fro ను తీసుకోవాలి. Fro + l = i = c = frolic. Frolic కు కేళి అనే అర్థం ఉంది.

55. Refuse to stay in Sicily after vacation – there’s hardly anything (6)
మనం దేన్నైనా నిరాకరించేటప్పుడు ‘నా వల్ల కాదు’ అనే వాక్యాన్ని వాడుతాం కదా. దాన్ని ఆంగ్లంలో I can’t అంటాం. కనుక ఇక్కడ refuse = can’t. ఇక Sicily after vacation అంటే Sicily లోని మధ్య అక్షరాలను (icilను) vacate చేయగా వచ్చే sy అన్న మాట. Sy లో cant ను చేర్చగా వచ్చే scanty జవాబు. Scanty కి స్వల్పము, లేశము, కొంచెము అని అర్థాలున్నాయి. దీన్నే ఆంగ్లంలో There is hardly anything అన్నాడు setter.

56. For sixty seconds hospital department became famous (9)
Pro = for కనుక for కు pro తీసుకోవాలి. Sixty seconds = one minute కనుక దానికి పొట్టి రూపమైన min తీసుకోవాలి. Hospital department అన్నప్పుడు OP గాని, ENT గాని తీసుకోవాలి. Pro + min + ent = prominent (famous) జవాబు.

57. Late, therefore article returned by setter (8)
Therefore = So. Article returned అన్నప్పుడు article కు సమానమైవ item ను తారుమారు చేయగా వచ్చే meti తీసుకోవాలి. తర్వాత setter అంటే పజిల్ కూర్పరి (one who sets puzzles). ఈ పదానికి me తీసుకోవాలని చెప్పబడింది. అవే అక్షరాలను ఎందుకు తీసుకోవాలో తెలియదు. So + meti + me = Sometime కనుక అదే జవాబు.

58…. draws into sailors’ circles (7)
Drawing in అంటే పీల్చుకోవడం లాంటిది కనుక, draws in కు సమానార్థక పదమైన absorbs ఈ ఆధారానికి జవాబు. ఎట్లా అంటే, ఇటువంటి పజిళ్లలో sailor వచ్చినప్పుడు దానికి సూచకమైన AB తీసుకోవాలి. పురాతన కాలంలో ఓడలకు మోటార్లు ఉండేవి కావు. బలిష్ఠులైనవారే (దృఢమైన శరీరమున్నవారే) చాలా మంది కలిసి పెద్దపెద్ద తెడ్లతో ఓడను నడిపేవారు. వాళ్లను Able Bodied men అనేవారు కనుక, దానికి పొట్టి రూపమైన AB ని వాడటం ఆనవాయితీ అయిపోయింది. ఇక్కడ ఆ పదం బహువచనంలో వాడబడింది కాబట్టి Abs తీసుకోవాలి. ఇక circles కు సమానమైన orbs ను (ఇది orbits కు పొట్టి రూపం) abs కు కలపాలి. ఫలితంగా వచ్చే absorbs జవాబు.

59. A crowd without energy, a shape-shifting entity (6)
A crowd = a mob. Without energy అంటే with out energy. Energy లోని బయటి (చివరి) అక్షరమైన e అన్న మాట. దీన్ని mob లో దూర్చితే moeb వస్తుంది. తర్వాత, ఆధారంలోని a ను చివర్న రాయాలి. A + moeb + a = Amoeba. అమీబా తన శరీరాకారాన్ని నిరంతరం మార్చుకునే ఏకకణ జీవి. అదే జవాబు.

60. Father’s state: about to turn bankrupt (6)
Father = Pa. State = UP (ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం). About = Re (regarding కు పొట్టి రూపం). దాన్ని తారుమారు చేస్తే er వస్తుంది. అన్నిటినీ కలిపితే వచ్చే pauper = bankrupt. కనుక, pauper జవాబు.

61. Gradually convert gold hoarded by politician at home (5)
Politician = MP. Gold కు సాధారణంగా Au (Aureum కు పొట్టి రూపం) తీసుకుంటాం. కాని, ఇక్కడ or తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని mp లో చేర్చినప్పుడు morp వస్తుంది. At home అన్నాడు కనుక home లోని మొదటి అక్షరమైన h ను కలపాలి. తత్ఫలితంగా ఏర్పడే morph = gradually convert. కనుక అదే జవాబు. నిజానికి ఇటువంటి పజిళ్లలో at home కు in ను తీసుకోవాల్సిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆఫీసర్లు తమ రూములో ఉన్నప్పుడు IN, బయట ఉన్నప్పుడు OUT అనే బోర్డులను పెడతారు.

62. Monster runs away from mate (5)
Mate = Friend. Runs లోని మొదటి అక్షరమైన r ను friend లోంచి తొలగిస్తే fiend వస్తుంది. దీనికి భూతం/దయ్యం అనే అర్థం ఉంది. అది monster కు దాదాపు సమానమైన పదం కనుక, fiend జవాబు.

63. Influential people with firm flipping hat (6)
Firm = company. దానికి పొట్టి రూపం Co. Firm flipping (returning) అన్నాడు కనుక Co, oc గా మారుతుంది. Hat = topi టోపి. Oc + topi = octopi. ఇది octopus కు బహువచనం. పలుకుబడి కలిగిన బడా బాబులను sharks, octopi అంటారు కనుక, జవాబు octopi. నిజానికి ప్రామాణిక ఆంగ్లభాష ప్రకారం octopus కు బహువచనం octopuses. కాని, ఇటువంటి పజిళ్లలో చాలా సార్లు కొంచెం దూరంగా ఉండే అర్థాన్నిచ్చే పదాలను జవాబుగా ఇస్తారు. అది ఉద్దేశపూర్వకమైన చర్య.

64. Fault, pass, featuring regularly in European mountains (4)
ఇక్కడ featuring regularly అంటే మధ్యమధ్య/సమాన దూరంలో అని అర్థం. Fault pass లోని 2, 4, 6, 8 వ అక్షరాలను కలిపితే వచ్చే Alps దీనికి జవాబు. ఈ పర్వతాలు యూరపులో ఉన్నాయి.

65. Regulars save good rum (7)
Rum అంటే విచిత్రమైన. Surreal దీనికి దగ్గరగా వస్తుంది కనుక, అదే సమాధానం. Save అంటే వినా/రహితంగా అని మరొక అర్థం కనుక, good లోని మొదటి అక్షరమైన g ని regulars లోంచి మైనస్ చేసి కలగాపులగం చేస్తే surreal వస్తుంది. చూశారా, ఈ ఆధారం తెలుగు పజిళ్లలోని ఆధారాలకు రెండు విధాలుగా భిన్నంగా ఉంది. ఒకటి, good అంటే g తీసుకోవాలి. తల, ప్రారంభం, మొదలు గట్రా ఏ సూచనా ఉండదు. ఇక రెండవది, తారుమారు చేయాలని ఎక్కడా చెప్పలేదిందులో. Rum దాన్ని అన్యాపదేశంగా సూచిస్తున్నదని భావించాలి.

66. No. 1 to score (8)
Score = 20 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ setter (పజిల్ కూర్పరి) No తర్వాత చుక్క పెట్టి పాఠకులను మరింతగా తికమక పెట్టదల్చుకున్నాడు. No. 1 to score అంటే ఇరవైకన్న ఒకటి తక్కువ అని అర్థం. అందుకే జవాబు nineteen.

67. Proved, our doctors too arrogant (9)
మామూలుగా చూస్తే, మన డాక్టర్లు దురుసైనవాళ్లని నిరూపితమైంది అనే అర్థం వస్తుంది ఈ వాక్యంలో! (చాలా వరకు ఆధారాలు ఇట్లానే ఉంటాయి). కాని, ఈ అర్థాన్ని పట్టుకుని క్లూను ఛేదించాలని ప్రయత్నిస్తే విజయాన్ని సాధించలేం. ఈ నియమం పజిళ్లలో చాలా తరచుగా వర్తిస్తుంది. ఇక్కడ proved our అన్నది anagram. అందులోని అక్షరాలను మిశ్రమంచేస్తే వచ్చే over proud దీనికి సమాధానం. ఇక్కడ ‘doctor’ క్రియాపదం అని గ్రహించాలి. Doctoring అంటే ఫోర్జరీ చేయడం (tampering) లాంటిది. The attendance register was doctored/The documents were doctored అంటే హాజరు పట్టిక/పత్రాల లోని అంశాలు మార్చబడినాయని అర్థం. ఇక్కడ proved our లోని అక్షరాలు doctor(ing) చేయబడినాయన్న మాట.

68. Coin, one found in an Italian town (5)
Coin కు సమానార్థకమైన paisa దీనికి జవాబు. Pisa ఇటలీ దేశంలోని ఒక నగరం పేరు. One కు సమానమైన a ను Pisa లో చేర్చితే paisa వస్తుంది.

69. Accessories king gave away to Pole as salary (8)
Salary = earnings కనుక అదే సమాధానం. Earrings ఒక రకమైన accessories. King కు r తీసుకోవాలి – royal, regal పదాలలోని మొదటి అక్షరం కనుక. ఇక Pole అంటే North, South ధ్రువాలలోని North కు సమానమైన N. King (r) తన స్థానాన్ని n కు ఇచ్చాడు కనుక, earnings ఏర్పడింది.

70. Forgetfulness of men wandering in the largest continent (7)
Largest continent = Asia. Men wandering అంటున్నాడు కనుక, men ను కలగాపులగం చేసి Asia లో చేర్చాలి. అప్పుడు amnesia వస్తుంది. అది మతిమరుపు లక్షణంగా గల వ్యాధి పేరు.

71. Member/worker has a resting place (8)
Member కు arm కాని, leg కాని తీసుకోవాలి. Worker కు నమానార్థక పదం char. A = I (1 అనే సంఖ్యలా ఉంటుంది కనుక). Char లో i ని చేర్చి, వచ్చినదాన్ని arm పక్కన పెడితే armchair వస్తుంది. అది ఒక resting place. అదే సమాధానం.

72. Setting nail head in bed, later removing nail head (7)
ఇది మరొక మంచి, చమత్కార భరితమైన క్లూ. Nail head = n. Bed = cot. Cot లో n చేరితే cont ఏర్పడుతుంది. Later = next. అందులోంచి nail లో head అయిన n ను తీసేస్తే ext మిగులుతుంది. దాన్ని cont కు కలిపితే వచ్చే context (setting) సమాధానం.

73. Mysteries about ship bordering Crete vandalised (7)
Ship కు SS (Steam Ship కు పొట్టి రూపం) తీసుకోవాలి. Vandalised అంటే ధ్వంసమైన/చెల్లాచెదరైన కనుక, Crete (గ్రీస్ దేశంలోని అతి పెద్ద ద్వీపం పేరు) ను కలగాపులగం చేసి SS లో పెట్టాలి. అప్పుడు వచ్చే secrets (mysteries) జవాబు.

74. Choose opponent, impeach victor against some charge (10)
Choose = elect. Opponent = rival. Victor కు ప్రారంభ అక్షరమైన v ని rival లోంచి తీసి అదే స్థానంలో c ని (charge లోని మొదటి అక్షరం) పెట్టాలి. అప్పుడు rical వస్తుంది. దాన్ని elect పక్కన పెడితే వచ్చే electrical సమాధానం. Electrical = a kind of chagre కదా.

75. A model admitting semi-human beings in flat (9)
Model కు t తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. A model = A t. ఈ రెండక్షరాలు part men (semi-human beings) ను లోపల చేర్చుకుంటే ఏర్పడే apartment (flat) దీనికి జవాబు.

76. Right Reverend is away from monkey with anger – in more than a few words (8)
Monkey = Langur. Anger = rage. ఈ రెండింటిని కలిపితే langurrage వస్తుంది. Right Reverend = rr (మొదటి అక్షరాలు). Langurrage లోంచి rr ను తీసేస్తే వచ్చే language సమాధానం. భాషలో ఎన్నో పదాలుంటాయన్నది ఇక్కడి ధ్వని.

77. Crazy men by a day, I see, get a memory device (8)
Crazy ‘men’ = Mne. A day = mon (Mon Day). I = i. See అంటే ఉచ్చారణ అదే విధంగా ఉన్న అక్షరం c. అన్నిటినీ కలిపితే వచ్చే mnemonic దీనికి జవాబు. Mnemonic (నిమొనిక్) అంటే సులభంగా జ్ఞాపకం పెట్టుకోవటం కోసం తయారు చేసుకున్న కొన్ని అక్షరాల లేక పదాల సముదాయం. మనిషి మణికట్టులో ఎనిమిది చిన్నచిన్న ఎముకలుంటాయి వాటి పేర్లు S, L, T, P, T, T, C, H అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటిని అదే క్రమంలో గుర్తు పెట్టుకోవటం కోసం వైద్య విద్యార్థులు తయారు చేసుకున్న నిమొనిక్ She Looks Too Pretty, Try To Catch Her!

78. Unplanned money comes with mantra (6)
Money = Rand (currency of South Africa). Mantra = Om (ఓం – దీన్ని ఆంగ్లభాషలో కలుపుకున్నారు). Rand + om = random = unplanned.

79. The woman, educated, leaves alien protected (9)
The woman = she. Educated = lettered. Alien = et (Extra Terrestrial). Lettered మైనస్ et = ltered. She + ltered = sheltered = protected. అదే జవాబు.

80. Undermine one politician with look (6)
One = I. Politician = MP. Look కు సమానార్థక పదం air (verb form). అన్నీ కలిపితే వచ్చే impair (undermine) జవాబు.

81. Blind Henry left jailhouse in a riot (8)
Henry లోని మొదటి అక్షరమైన h ను jailhouse లోంచి తొలగించి మిశ్రమం చేయగా వచ్చే jalousie దీనికి సమాధానం. In a riot అంటే అల్లకల్లోలంగా అని చెప్పుకోవచ్చు. Blind అంటే కిటికీకి కట్టే తెర వంటిది. ఉదాహరణకు venetian blind. ఇట్లా ఆంగ్ల పదాలకు సామాన్య అర్థం కాక, అరుదైన అర్థం గల పదాలు ఇవ్వబడతాయి ఇటువంటి పజిళ్లలో.

82. Using some utterly repugnant policy, leaders get to overthrow (5)
ఇక్కడ లీడర్స్ అంటే ప్రారంభాక్షరాలు Using, Some, Utterly, Repugnant, Policy – ఈ పదాల మొదటి అక్షరాలను కలిపితే వచ్చే usurp = overthrow (ఆక్రమించుట, దురాక్రమించుట). అదే సమాధానం.

83. Quietly run out and bring every other quid to hide from view (6)
Quietly కి sh తీసుకోవాలి. నిశ్శబ్దంగా ఉండు అనటాన్ని ష్ అనే అక్షరంతో సూచిస్తాం కదా. Run out కు ro, every other quid కు ud (ఒక అక్షరం విడిచి ఒకటి) తీసుకోవాలి. అన్నిటినీ కలుపగా వచ్చే shroud (to hide from view) సమాధానం.

84. I substituted for ace in group? Not true (7)
Group = faction. Ace = a. Faction లోని a స్థానంలో i ని పెడితే ఏర్పడే fiction
జవాబు. ఫిక్షన్ అంటే కల్పితం కదా.

85. Dismiss aloof model to make way for victor (6)
ఇది కూడా పై క్లూ లాంటిదే. Aloof = remote. Model = t. Victor = v. Remote లోని t ని తొలగించి, అదే స్థానంలో v పెడితే వచ్చే remove (dismiss) సమాధానం.

86. Wine service managers in 2000, met a priest with hesitation to enter an appeal (10)
ఇది కూడా చాలా మంచి క్లూ. రోమన్ సంఖ్యల ప్రకారం ఒక వేయిని M తో సూచిస్తారు. ఇక్కడ 2000 అంటున్నాడు కాబట్టి MM రాయాలి. యూదుల దేవాలయాలలోని (synagogues లోని) పూజారిని eli అంటారు. ఇక hesitation కు er తీసుకోవాలి. వీటన్నిటినీ కలిపితే mmelier వచ్చింది కదా. SOS (Save Our Souls) అనేది ఒక రకమైన appeal. ఓడలు ఆపదలో చిక్కుకున్నప్పుడు సహాయాన్ని అర్థిస్తూ ఇతర ఓడలకు గాని, ఓడరేవు అధికారులకు గాని పంపే పిలుపును SOS అంటారు. ఆ మాటకొస్తే ఎవరు సహాయాన్ని కోరుతూ పంపినా ఆ పిలుపు SOS అవుతుంది. ఇప్పుడు SOS లో mmelier ను చేర్చగా వచ్చే sommeliers (wine service managers) సమాధానం.

87. Not happy hour oddly for a holy man (5)
Not happy = sad. Hour oddly అంటే బేసి (odd) స్థానాలలో ఉన్న h,u అనే అక్షరాలు. Sad + hu = sadhu = holy man. కనుక సమాధానం sadhu. Good man/holy man కు st (saint) తీసుకోవాల్సిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి ఈ పజిళ్లలో.

88. Hundreds are sick, it’s a complaint (11)
Ton = hundred కనుక, hundreds = tons. Sick = ill. It’s = it is. అన్నిటినీ కలిపితే వచ్చే tonsillitis దీనికి జవాబు. ఇటువంటి పజిళ్లలో complaint ను వ్యాధికి సమానార్థక పదంగా వాడుతారు.

89. Before Aishwarya got married, it was on the menu (8)
Before = past. Aishwarya కు ఆమె ఇంటిపేరైన Rai ను తీసుకోవాలి. Married = m. Rai got married అంటే rai, m ను పొందింది. అంటే rai లో m చేరిందన్న మాట. ఫలితంగా ఏర్పడేది rami. Past + rami = Pastrami. దీనికి అర్థం కాల్చిన (smoked) ఎద్దు మాంసం. అదే జవాబు.

90. Place to accommodate the President – one with loose morals (8)
Place = set. The president = Trump (ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు). Set లో trump ను చేర్చగా వచ్చే strumpet (వేశ్య) దీనికి సమాధానం.

91. After college, two choices which allow free passage (8)
College = c. Choice కు or తీసుకోవాలి. ఎందుకంటే choice = this OR that. రెండు అంటున్నాడు కనుక oror తీసుకోవాలి. అవి free కి సమానమైన rid ను తమలోపలికి అనుమతిస్తున్నాయి. కనుక oror మధ్య rid చేరి orridor ఏర్పడుతుంది. దీన్ని c కి కలిపితే వచ్చే corridor (passage) సమాధానం.

92. Doctor inspected endlessly – it’s infected (6)
ఇక్కడ doctor ను క్రియాపదంగా వాడాడు setter. Inspected అనే పదంలోని చివరను (dని) తొలగించి, మిగిలిన అక్షరాలను మిశ్రమం చేయాలని చెప్తున్నాడనుకోవద్దు. Inspected లోంచి end ను తీసేసి కలగాపులగం చేయమంటున్నాడు. అట్లా చేస్తే వచ్చే septic (infect అయినదని అర్థం) ఈ ఆధారానికి సమాధానం.

93. Two styles – lacking the French humility (7)
ఇక్కడ Two styles అంటే, ఒకటి mode (ఇది స్టైల్ కు సమానమైన పదం), మరొకటి style. వీటిని కలిపితే modestyle వస్తుంది. ఫ్రెంచ్ భాషలో The ని le అంటారు కనుక, modestyle లోంచి le ని తొలగించాలి. అప్పుడు వచ్చే modesty (humility) జవాబు.

94. Equip old fellow for the final conflict (10)
Equip కు arm తీసుకోవాలి. ఇది క్రియాపదం (to arm అంటే సమకూర్చుట). తర్వాత old = aged. Fellow కు ఇక్కడ don ను తీసుకోవాలి. Armageddon (అంతిమ సమరం) దీనికి జవాబు. Arm + aged + don = Armageddon.

95. A poor nation, no choice for a renegade (8)
Nation = state. కనుక a poor state వస్తుంది. Choice కు or తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి a poor state లోంచి or ను మైనస్ చేయగా వచ్చే apostate (renegade) దీనికి జవాబు. Renegade/apostate అంటే మాట తప్పి వెనుకకు పోయినవాడు అని అర్థం.

96. New copies left in the city (6)
New కు n, left కు L తీసుకుని, వాటిని copies కు సమావమైన apes తో కలగాపులగం చేస్తే వచ్చే Naples దీనికి సమాధానం. To ape = to copy. Naples అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల నగరం.

97. Every other journo in ours is inexperienced (6)
Every other అంటే ఒకటి విడిచి ఒకటి కదా. Journo in ours లోని 1, 3, 5, 7, 9, 11 వ అక్షరాలను కలిపితే వచ్చే junior దీనికి సమాధానం.

98. Sluggish general imprisoned by secret agent (6)
General కు Lee తీసుకోవాలని ముందే చెప్పుకున్నాం. ఇక secret agent కు spy తీసుకోవాలి. Spy లో lee ఇంప్రిజన్డ్ అయితే వచ్చే sleepy (sluggish) దీనికి జవాబు.

99. Current rule’s mantra – to adopt hard stance at first on litigation (4, 3)
Mantra = Om (ఓం). Hard stance at first అంటే ఆ రెండు పదాల మొదటి అక్షరాలైన hs. Litigation = law. అన్నిటినీ తీసుకుని మిశ్రమం చేస్తే వచ్చే Ohm’s law దీనికి జవాబు. Ohm’s law అనేది విద్యుచ్ఛక్తికి సంబంధించిన ఒక సూత్రం. ఇక్కడ rule’s అంటే rule is అన్న మాట.

100. Short-lived record, he initially mastered on time with rookie (9)
Record కు EP తీసుకోవాలి. ఎందుకంటే, పాతకాలంలో గ్రామఫోన్ రికార్డులు EP (Extended Playing), LP (Long Playing) అని రెండు రకాలుగా ఉండేవి. He ని అట్లాగే ఉన్నదున్నట్టుగా చేర్చుకోవాలి. Initially mastered = m. Time = era. Rookie = learner/novice కనుక L తీసుకోవాలి. అన్నిటినీ కలుపగా వచ్చే ephemeral (short-lived) దీనికి సమాధానం.

101. Outrage at prison cell where 500 usurp nationalist (7)
Prison cell = dungeon. ఇక రోమన్ సంఖ్యల ప్రకారం D = 500. Nationalist కు మొదటి అక్షరమైన n తీసుకోవాలి. Usurp అంటే ఆక్రమణ కనుక n ను తొలగించి అదే స్థానంలో d ని చేర్చాలి. తత్ఫలితంగా వచ్చే dudgeon (outrage/ill-will) దీనికి జవాబు.

ఇంకా poem = if (Rudyard Kipling’s famous poem ‘if’), Lawrence = dh (D.H. Lawrence), key = a, b, c, d, e, f, or g (musical keys), agent = rep (representative), friend = pal, Copper = cu (Cuprium), bend = s or u, old/former = ex, debt = iou (I Owe You), communist = red, editor/journalist = ed, for example = e.g., bill = ac (account), artist = ra (Royal Academy), tea = cha (?short for Chai), direction = N, E, W, S – ఇట్లా లెక్క లేనన్ని సంకేత పదాలు, అక్షరాలు ఉంటాయి.

‘ద హిందు’ పత్రికకు ఆధారాలను కూర్చే setters ఈ విధంగా తమ మేధాపాటవంతో, ఊహాశక్తితో స్వైరవిహారం చేస్తారు. అట్లా చేయాలంటే ఎంతో లోకజ్ఞానం (General knowledge), ఆంగ్లభాష మీద బలమైన పట్టు, చమత్కారాన్ని మేళవించగలిగే అద్భుతమైన మెదడు – వీటన్నిటినీ కలిగివుండాలి. అయితే పజిళ్లను కూర్చేటప్పుడు వీరికి చెప్పలేనంత స్వాతంత్ర్యం ఉంటుంది. పదాల అర్థాలు కచ్చితంగా సరిపోయే అవసరం లేదు. ఉద్దేశపూర్వకంగానే కొంచెం దూరంగా ఉండే అర్థం గల పదాలను ఇవ్వవచ్చు. ఇతర భాషలలోని పదాలను ఉవయోగించుకోవచ్చు. మధ్యలో విరామ చిహ్నాలు వచ్చేలా సమాధానాలను ఏర్పరచవచ్చు. అది తప్పు అవదా? అని ప్రశ్నించడానికి వీల్లేదు. నిజానికి ఇటువంటి మార్గాలను అవలంబించడం వెనుక ఉన్న ప్రధాన ధ్యేయం పాఠకుడిని సాధ్యమైనంత ఎక్కువగా తికమక పెట్టటమే. మెదడుకు ఇంత వ్యాయామాన్ని కలిగించగలిగే ఇటువంటి క్రాస్ వర్డ్ పజిళ్లు, వాటిపట్ల ఆసక్తి గలవారికి ఒక విధంగా వరాలు అనటంలో అతిశయోక్తి లేదు.

నా ఈ వ్యాసాన్ని ఆకళింపు చేసుకుని, భవిష్యత్తులో ఇంకెవరైనా అపారమైన మేధాసంపత్తిని కలిగినవాళ్లు, ఆంధ్రాంగ్లాల మీద మంచి పట్టున్నవాళ్లు తెలుగు క్రాస్ వర్డ్ ప్రక్రియను కొత్త పుంతలు తొక్కిస్తూ, దాన్ని మరింత సుసంపన్నం చెయ్యాలని, తద్వారా ముందుతరాలకు మరింత నాణ్యమైన, ప్రామాణికమైన తెలుగు క్రాస్ వర్డ్స్ అందాలని నా ఆకాంక్ష.
----------------------------------------------------------
రచన - ఎలనాగ, 
వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో

Monday, August 13, 2018

పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు


పాత తెలుగు క్రాస్ వర్డ్ లలోని ఉత్కృష్ట ఆధారాలు






సాహితీమిత్రులారా!



పాత తెలుగు క్రాస్ వర్డ్ లు అంటే వెంటనే మనసులో మెదిలేవి శ్రీశ్రీ గారి పదబంధ ప్రహేళికలు. అవి ప్రమాణికతతో కూడుకున్నవి కావటమే అందుకు కారణం. తర్వాత ఆరుద్ర గారి పదబంధ ప్రహేళికలు గుర్తుకొస్తాయి.  ప్రధానంగా శ్రీశ్రీ గారు రూపొందించిన ఆధారాలను పరిశీలించి, వాటికి వివరణలను ఇవ్వటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. వాటిని కింద ఇస్తున్నాను. చదివి ఆనందించండి.

1.ఆడదాని ఆద్యంతాలు కెరటం (2)
దీనికి సమాధానం అల. ఎలా అంటే, ఆడది = అబల. ఆద్యంతాలు అంటే అబలలోని మొదటి అక్షరమైన ‘అ’ను, చివరి అక్షరమైన ‘ల’ను తీసుకోవాలి. రెండింటిని కలిపితే అల వస్తుంది.

2. కవిత్వం మధ్య నునుపులు మొదలెట్టి ఆకర్ణించు (2)
కవిత్వం మధ్య అంటే కవిత్వం అనే పదంలోని మధ్య అక్షరమైన వి. నునుపులు మొదలు అంటే నునుపులు లోని మొదటి అక్షరమైన ను. వి + ను = విను = ఆకర్ణించు. కనుక, విను సమాధానం.

3. అనడు, కనడు, వినడు. అకవి లేడు, పో! (2)
అనడు, కనడు, వినడు – ఈ మూడు పదాలలోని మొదటి అక్షరాలు (అకవి) లేకుంటే ప్రతి పదంలో మిగిలేది నడు. నడు = పో కనుక, అదే సమాధానం.

4. చెడి పోయిన ఊళ్లలో వ్యాపార కేంద్రం (2)
డిపో అంటే వ్యాపార కేంద్రం కనుక, డిపో అన్నది సమాధానం. జవాబు అయిన ఈ పదం మొదటి రెండు పదాల మధ్య ఏ మార్పూ లేకుండా దాగివుంది.

5. కనుదెరచి చూడరా శిష్యా! కనబడుతుంది చక్రం (2)
ఇక్కడ చక్రం అంటే రాశిచక్రం లోని రాశి అన్న మాట. కనుక, అదే జవాబు. చూడరా శిష్యా మధ్య రాశి ఉన్నది కదా.

6. గురుతిడని చోట వెనక్కి చూసి పరిభ్రమించు (3)
పరిభ్రమించు = తిరుగు కాబట్టి, తిరుగు జవాబు. ఆధారంలోని మొదటి మూడక్షరాలను తిరగేస్తే (వెనక్కి చూస్తే) తిరుగు వస్తుంది.

7. ఇంటికి వింటికి కావాలి (2)
వింటికి (విల్లుకు లేక ధనుస్సుకు) అల్లెతాడు ఉంటుంది కదా. దాన్ని నారి అంటారు. ఇక నారి అంటే ఇల్లాలు (స్త్రీ) అనే అర్థం కూడా వుంది. ఇల్లుకు కూడా నారి కావాలి కనుక, ఇక్కడ నారి జవాబు.

8. వంటింట్లోనూ వాటికన్ లోనూ (2)
పోప్ జాన్ పాల్ (Pope John Paul) గారు వాటికన్ లో ఉంటారు. వారిని తెలుగులో పోపు అనవచ్చు మనం. ఇక పోపు (తాలింపు) వంటింట్లో కూడా అవసరమే.

9. విరోధాలు (రాత్రికి కావచ్చు) (3)
విరోధాలుకు సమానార్థకమైన పగలు (శత్రుత్వాలు) సమాధానం. ఇక పగలు (daytime) అన్నది రాత్రికి విరుద్ధం. ఇదే ఈ ఆధారంలోని చమత్కారం.

10. పండు, నీళ్లలో కొట్టేది (2)
ఇక్కడ ఈత సమాధానం. ఈతపండు ఉంటుంది. నీళ్లలో కొట్టే ఈత (స్విమింగ్) కూడా ఉంటుంది.

11. విశ్వనాథ సత్యనారాయణలో ఉన్న రెండింటిలో ఒకటి మదీయం (1)
విశ్వనాథ లోని మూడవ అక్షరం నా. సత్యనారాయణ లోని మూడవ అక్షరం కూడా నా. మదీయం అంటే నా(యొక్క) కనుక, నా అనేది జవాబు.

12. వ్యధా రహిత వ్యవధానము; అదే అడవి, అదే నీరు (3)
వ్యవధానము లోంచి వ్యధా తీసేస్తే వనము మిగుల్తుంది. వనముకు అడవి, నీరు అని రెండర్థాలున్నాయి. జ = పుట్టినది. వనము(నీరు)లో పుట్టినది వనజము. అదే తామర పువ్వు. తామరపువ్వుల వంటి కన్నులు గలది వనజాక్షి (స్త్రీ).

13. ఎప్పుడూ హృదయం లేని సరదా (2)
ఎప్పుడూకు సమానార్థకమైన సదా ఇక్కడ సమాధానం. సరదా లోని మధ్య అక్షరం ర నట్టనడుమ ఉంటుంది కనుక, అది హృదయానికి సమానం. అందుకే సరదా మైనస్ ర = సదా. ఇంగ్లిష్ పజిళ్లలో మధ్య అక్షరాన్ని లేక అక్షరాలను సూచించడానికి essentially, at heart అనే పదాలను వాడుతారు.

14. లంక కొస నుండి లంక మొదటి దాకా; మధ్యని మధ్యకు ప్రారంభం. ఇదో పువ్వని వేరే చెప్పాలా? (3)
లంక కొస = క. లంక మొదలు = లం. మధ్యకు ప్రారంభం = మ. కలం మధ్యన మ చేరితే వచ్చే కమలం సమాధానం.

15. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు (2)
ఇది ప్రసిద్ధినీ, ప్రజాదరణనూ పొందిన ఆధారం. కష్టజీవి లోని మొదటి, చివరి అక్షరాలను కలిపితే కవి వస్తుంది. కవి అన్నవాడు ప్రజల పక్షం వహించాలని అన్యాపదేశంగా చెప్పబడిందిక్కడ.

16. కడుగడు; కడు విడు; మిగిలేది తల లేని అద్దె (2)
కడుగడు మైనస్ కడు = గడు. దాన్ని రివర్స్ చేస్తే డుగ వస్తుంది. అదే జవాబు. అద్దె = బాడుగ. తల (మొదటి అక్షరం) లేకుంటే డుగ వస్తుంది.

17. వారాలకు రాలలేని మాట. కావత్తు కావాలంటారు కొందరు (2)
వారాలకు మైనస్ రాల = వాకు. దీనికి కావత్తు కలిపితే వాక్కు వస్తుంది. వాక్కు = మాట. ఇక్కడ సమాధానం వాకు.

18. కల కతన మారిన పసిడి తీగ (3, 2)
కల కతనను తారుమారు/కలగాపులగం చేయగా వచ్చే కనకలత ఇక్కడ జవాబు.

19. కవిగారి తోక, తల; తరువాత తలకిందులు; చాంచల్యం (4)
కవి తోక = వి. కవి తల = క. ‘తల’కిందులు అంటే తలను తారుమారు చేయగా వచ్చే లత. వి + క + లత = వికలత = చాంచల్యం కనుక, వికలత జవాబు.

ఇట్లా, శ్రీశ్రీ గారి పజిళ్లలో word play, జటిలత్వం మరీ అంత ఎక్కువగా లేకపోయినా, అద్భుతమైన చమత్కారం ఉంటుంది అక్కడక్కడ. పాఠకులకు మరీ కొరుకుడు పడని ఆధారాలను తయారు చెయ్యడం ఆయనకు ఇష్టం లేకుండిందేమో అనిపిస్తుంది. తెలుగులో ప్రామాణిక పజిళ్లను ప్రవేశపెట్టిన శ్రేయస్సు శ్రీశ్రీ గారికే దక్కుతుంది.

‘ఈమాట’ అంతర్జాల పత్రికలో వస్తున్న ‘గడినుడి’ లోని ఆధారాలు కూడా చెప్పుకో తగినవే. అందులో ఇప్పటిదాక ఏడు పజిళ్లు వచ్చాయి. త్రివిక్రమ్, భైరవభట్ల కామేశ్వరరావు, కొల్లూరు కోటేశ్వరరావులు వీటి కూర్పరులు. అదే క్రమంలో ఒక్కొక్కరివి ఐదు చొప్పున ఆధారాలను వివరిస్తున్నాను.

1.వాడన పని చెడి కరువును తెచ్చింది (3, 2)
దీనికి సమాధానం పడని వాన. ఎలా అంటే, వాడన పని లోని అక్షరాలను కలగాపులగం చేస్తే పడని వాన వస్తుంది. అది కరువుకు కారణం కదా.

2. తిరుమాడ వీధుల్లో తిరిగొచ్చిన కోతి (3)
తిరిగొచ్చిన అంటే వెనక్కి వచ్చిన. అంటే రివర్స్ అయిన అన్న మాట. ఆధారంలోని మొదటి మూడక్షరాలను రివర్స్ చేస్తే మారుతి వస్తుంది. మారుతి అంటే హనుమంతుడు. కనుక, మారుతి సమాధానం.

3. నరసమాంబ తలలో మడత పడిన నాలుక (3)
ఇక్కడ తల అంటే మొదటి భాగమనుకోవచ్చు. మొదటి మూడక్షరాలను తారుమారు చేస్తే రసన వస్తుంది. రసన అంటే నాలుక కనుక, అదే జవాబు.

4. ఎలుక గుట్టుగా ఉండే చోటు (3)
గుట్టుగా అంటే నిగూఢంగా. ఆధారంలోని 2, 3, 4 వ అక్షరాలను తారుమారు చేయగా వచ్చే కలుగు ఈ ఆధారానికి సమాధానం.

5. నారిని లోభిగా మార్చే కంప్యూటరు (2)
ఇది చాలా మంచి క్లూ. కూర్పరికి మంచి ఊహాశక్తి ఉందన్న విషయాన్ని సూచిస్తుంది. పర్సనల్ కంప్యూటరుకు పి.సి. పొట్టిరూపం కదా. నారికి ముందు పిసిని కలిపితే పిసినారి వస్తుంది. కనుక, సమాధానం పిసి.

6. కసరత్తు సరిపాళ్లతో పిండి కలిపితే అమ్మవారి నైవేద్యం రెడీ.
ఇక్కడ సరిపాళ్లు అంటే కసరత్తు లోని 2, 4 వ అక్షరాలన్న మాట. 2, 4 సరి సంఖ్య (even number) కు చెందినవి. వాటిని కలిపితే సత్తు వస్తుంది. దీనికి పిండిని కలుపగా వచ్చే సత్తు పిండి సమాధానం.

7. వేరే ప్రశంస సరే, తీసి చూడు. లోపలి మార్గం కనిపిస్తుంది.
మొదటి ఐదు అక్షరాలలోంచి సరే తీసివేయగా మిగిలినదాన్ని మిశ్రమం చేస్తే వచ్చే ప్రవేశం ఇక్కడ సమాధానం.

8. ఒక పురుగు విషం కూడా శుభమే
ఇది మంచి క్లూ. దీనికి సమాధానం శ్రీ. శ్రీ అనే పదానికి (సాలె) పురుగు, విషం, శుభం అని అర్థాలున్నాయి.

9. ఇది ఆడవాళ్ల కేశపాశానికి ఉరి కాదు, ఆభరణం.
దీనికి జవాబు జడకుచ్చు. ఎలా అంటే, కేశపాశానికి అంటే జడకు. ఉచ్చు అంటే ఉరి. జడకుచ్చులు ఒక రకమైన ఆభరణాలు. వ్యుత్పత్తిని పరిశీలిస్తే, జడకు ఉచ్చు అనే అర్థం వచ్చే అవకాశం ఉన్నా, వాస్తవంలో జడకు + ఉచ్చు (జడకు ఉరి) కాదు అన్నది ఇక్కడి ధ్వని.

10. నందమూరి గోల చేస్తే టూకిగా అది రక్తభరిత సమరమే.
టూకీగా అంటే షార్ట్ ఫామ్ లో అన్న మాట. రక్త భరిత సమరమే – ఈ మూడు పదాల మొదటి అక్షరాలను కలిపితే వచ్చే రభస జవాబు.

11. అక్కడక్కడ వేలు మధ్యన చిక్కుకున్న శతకకారుడు (3)
వేలు మధ్యన – దీనిలోని 1, 3, 5 వ అక్షరాలను కలుపగా వచ్చే వేమన దీనికి జవాబు.

12. రకరకములైన తినుబండారాలు తింటుంటే తిరిగి వచ్చే ధ్వని (4)
ఇక్కడ తిరిగి వచ్చే అంటే రివర్స్ లో వచ్చే అన్న మాట. ఆధారంలోని మొదటి నాలుగు అక్షరాలను రివర్స్ చేస్తే వచ్చే కరకర జవాబు.

13. రాయలేని ఆటంకముతో చావు (3)
ఇది కొంచెం జటిలమైన ఆధారం. ఆటంకముకు సమానార్థక పదం అంతరాయము. ‘రాయలేని’ అని ఉంది కనుక, అంతరాయము లోంచి ‘రాయ’ను తీసివేయాలి. అట్లా చేస్తే అంతము మిగులుతుంది. అంతము అంటే చావు.

14. వాడు పట్టుకుని చెల్లాచెదురైతే ఇక బట్టలెవడు కుడతాడు? (6)
బట్టలెవడు కుడతాడు? అనే ప్రశ్నకు జవాబైన కుట్టుపని వాడు ఇక్కడ సమాధానం. ఆధారంలోని మొదటి ఆరు అక్షరాలను తారుమారు చెయ్యాలన్న మాట.

15. చేబదులు అక్కడక్కడ తీసుకుంటే రుచిగానే ఉంటుంది (2)
ఆధారంలోని 1, 3 వ అక్షరాలను కలుపగా వచ్చే చేదు ఇక్కడ జవాబు. కాని, చేదు రుచిగా ఉండదు కదా, అని సందేహం కలుగవచ్చు ఎవరికైనా. అయితే ఇక్కడి చమత్కారమేమంటే, చేదు షడ్రుచులలో ఒకటి. కాబట్టి, అది ఆరు రుచులలోని ఒకటి అని చెప్పటం.

ఇంకా వేరే పత్రికల్లో కూడా ఇటువంటి ఆధారాలతో కూడిన పజిళ్లు వచ్చి ఉండవచ్చు. కాని, అవి నాకు అందుబాటులో లేవు. పైగా అన్నింటినీ ఉదాహరించలేం కదా.

ఈ విధంగా తెలుగు క్రాస్ వర్డ్ వికసనం చెందుతున్నదని భావించవచ్చు. ఈ ప్రక్రియకు మరింత ప్రాచుర్యం, వైభవం దొరకాలని, ఆ దిశగా ప్రయత్నం చేసేందుకు కొత్త కూర్పరులు పుట్టుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.
----------------------------------------------------------
రచన - ఎలనాగ, వాకిలి సాహిత్య పత్రిక సౌజన్యంతో