Friday, September 30, 2016

ఎంత మంది ఉన్నారు దీనిలో?


ఎంత మంది ఉన్నారు దీనిలో?


సాహితీమిత్రులారా!

ఈ చిత్రంలో
ఎంతమంది ఉన్నారో చెప్పండి


పుత్రక యెందు బోయితివి?


పుత్రక యెందు బోయితివి?


సాహితీమిత్రులారా!


గరుడాచలకవి కృత
కౌసలేయ చరిత్రము లోని
సంభాషణచిత్రం చూడండి.
గద్వాలవారి ఆడబడుచుఅయిన గిరియమ్మ
కవులను సత్కరించటం, విద్యార్థుంకు చదువు చెప్పించటం,
దేవాలయాలను, తోటలను నిర్మించటం, తీర్థయాత్రలను చేయటం
వంటి ధర్మకార్యాలెన్నో చేసింది. ఆమె గరుడాచలకవితో
కౌసలేయ చరిత్రం వ్రాయించి కేశవస్వామికి అంకితం చేయించింది.
ఆమె ధర్మసత్రం గురించిన సంభాషణ ఈ పద్యంలో కనిపిస్తుంది

పుత్రక యెందు బోయితివి? బోర్వెలిలో గిరియమ్మ వెట్టు బ
ల్సత్రములో భుజించపటకు! సత్ర విశేషములేమి? చూడు నా
గాత్రము!  త్రావితో సుధ? జగజ్జనులందరు ద్రావద్రావుటే
చిత్రము? నేనటంచు వచియించును బ్రహ్మకు నారదుండటన్

ఇది బ్రహ్మ - నారద సంభాషణ -
బ్రహ్మ - కుమారా! నారదా! ఎక్కడికి వెళ్ళావు?
నారదుడు - బోర్వెల్లి అనే గ్రామంలో గిరియమ్మ పెట్టిన
                  ధర్మశాలలో భుజించుటకు వెళ్ళాను.
బ్రహ్మ - ఏమి ఆ సత్రపు విశేషాలు?
నారదుడు - నాశరీరాన్ని చూడు,నీకే తెలుస్తుంది
బ్రహ్మ - అమృతం త్రాగావా ఏమి?
నారదుడు - లోకంలోని జనమంతా
                  త్రాగగాలేనిది నేను అమృతం
                  సేవించటంలో  వింతేమి!


పయోధరాకారధరో హి కందుక:


పయోధరాకారధరో హి కందుక:


సాహితీమిత్రులారా!

ఒకమారు ధారాధీశుడైన భోజుడు వ్యాహ్యళికై వెళ్ళగా
బోగమువీథిలో బోగముపడుచుపిల్ల  ఒకతె చెవిలో
నల్లకలువ పువ్వు పెట్టుకొని చెండాట ఆడుతూంది
అలా ఆడే సమయంలో కదలికవల్ల చెవిలోని కలువపూవు
జారి కాళ్ళమీద పడింది. అది చూచిన రాజుగారు మనసులో పెట్టుకొని
సభకు వెళ్ళాడు. అక్కడ కవీశ్వరులను కందుకాన్ని వర్ణించమని
కోరగా భవభూతి
ఈ విధంగా వర్ణించాడు-

విదితం నను కందుక! తే హృదయం
ప్రమదాధర సంగమలుబ్ద ఇవ,
వనితాకరతామరసాభిహత:
పతిత: పతిత: పునరుత్పతసి

(ఓ కందుకమా! నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది.
యువతీమణి తనచేతితో
మాటిమాటికి కొట్టుచున్నా కిందపడి కూడ నీవు
ఎందులకు మరల పైకెగురుచున్నావో నాకు తెలిసిందిలే
ఆవిడ కెమ్మోవిపానకమును త్రాగుటకుకదా!)
అని చెప్పెను.
తరువాత మరొకకవి ఈ విధంగా చెప్పాడు

ఏకోపి త్రయ ఇవ భాతి కందుకోయం
కాంతాయా: కరతలరాగరక్తరక్త:
భూమమౌ తచ్చరణమరీచిగౌరగౌర:
ఖస్థస్సన్ నయనమరీచినీలనీల:

(ఒక కాంత చెండాడుతుంటే ఆ చెండు ఎలావుందంటే -
ఆ కాంతామణి అఱచేత చరచునపుడు ఆ అఱచేయి
ఎరుపుడాలునకు ఎరుపుగను, చేతి దెబ్బ తగిలి నేలమీద
ఆమె కాళ్ళముందర పడినతరువాత ఆమె
కాలిగోళ్ళ తెల్లనికాంతి సోకి తెల్లగను,
పైరెగిరినపుడు ఆమె ముఖము పైకెత్తి చూడగా
ఆ కలువకంటి కన్నుల నీలపుకాంతులతో నల్లనల్లగను
మూడురకములుగా ప్రకాశించుచున్నది.)
అని చెప్పెను.
ఆ తరువాత కాళిదాసు
ఈ విధంగా వర్ణించాడు-

పయోధరాకారధరో హి కందుక:
కరేణ రోషాదభిన్యతే ముహు:,
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియ ప్రసాదాయ పపాత పాదయో:

(పాలిండ్ల ఆకృతి ధరించినందున ఈ బంతిని
ఈ ఇంతి రోషముతో మాటిమాటికి తనచేతితో కొట్టుచున్నది.
ఇక ఈ కలువకంటి సాదృశ్యము ధరించిన నాకు మాత్రమీమెవలన
ఇలాంటి దండన కలుగకుండునా! అని భయపడి ఆమె చెవిలోపెట్టుకొన్న
కలువపూవు ఆమె కాళ్ళపై పడి ఆమె అనుగ్రహమును కోరుచున్న
దానివలె తటాలున పాదములపై బడెను)
అని వర్ణించెను.
భోజరాజు ఆ ముగ్గురికి తగినవిధంగా
బహుమానములిచ్చెను.
కాళిదాసును మాత్రం
తనమనసులోని విషయాన్ని
చూచినవానివలె చెప్పినందులకు
ప్రత్యేకముగా సన్మానించెను.

Thursday, September 29, 2016

గుఱ్ఱం జాషువాగారి 121వ జయంతి శుభాకాంక్షలు


గుఱ్ఱం జాషువాగారి 121వ జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులారా!

మహనీయులను గురించి ఎంత చెప్పినా తక్కువే
వారిని ఫిరదౌసి గురించి
జటావల్లభుల రామమూర్తిగారి ప్రసంగం వినండి





Tuesday, September 27, 2016

వార్థక్యమేలేని వారెవ్వరగుచుంద్రు?


వార్థక్యమేలేని వారెవ్వరగుచుంద్రు?


సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం చూడండి.

ఏనుంగు మోముతో నేదేవుఁడొప్పారు?
సర్వత్ర వ్యాపించు సాధ్వియెవతె?
పాపవిధ్వంసక ప్రభువెవ్వఁడగుచుండు?
నీరజత్వముగల్గు నారియెవతె?
వార్థక్యమ్మేలేని వారెవ్వరగుచుంద్రు?
కంఠమందు విషమ్ముగల్గునెవడు?
మారణస్థితిలేని వారలెవ్వారలు?
నాలుగుమోములవేలుపెవఁడు?
సర్వమందును వర్తించుస్వామి యెవఁడు?
యజ్ఞశతమొనర్చిన వేల్పుటధిపుఁడెవఁడు?
బాబు వ్యుత్పత్తితోడి జవాబులేవి?
దేవ! శ్రీ వేంకటేశ పద్మావతీశ!
    (శ్రీవేంకటేశ సారస్వత వినోదిని నుండి)
పై పద్యాన్ని చూశారు కదా అందులో 10 ప్రశ్నలు ఉన్నాయి.
వాటికి జవాబులను వాటి వ్యుత్పత్తి అర్థాల
ఆధారంగా తెలుసుకొని చెప్పాలి ప్రయత్నించి చూడండి.

1. ఏనుంగు మోముతో నేదేవుఁడొప్పారు? 
     - గజాననుఁడు - వినాయకుఁడు
2. సర్వత్ర వ్యాపించు సాధ్వియెవతె? 
     - సరస్వతి
3. పాపవిధ్వంసక ప్రభువెవ్వఁడగుచుండు?  
    - వేం - కట - ఈశ్వరుడు - వేంకటేశ్వరుఁడు
4. నీరజత్వముగల్గు నారియెవతె? 
    - పద్మావతి - పద్మావతీదేవి
5.  వార్థక్యమ్మేలేని వారెవ్వరగుచుంద్రు? 
     - నిర్జరులు - దేవతలు
6. కంఠమందు విషమ్ముగల్గునెవడు? 
     - గరళకంఠుఁడు - శివుఁడు
7. మారణస్థితిలేని వారలెవ్వారలు? 
    - అమరులు - వేల్పులు
8. నాలుగుమోములవేలుపెవఁడు? 
    - చతుర్ముఖుఁడు - బ్రహ్మదేవుఁడు
9. సర్వమందును వర్తించుస్వామి యెవఁడు?  
    - విష్ణువు - విష్ణుదేవుఁడు
10. యజ్ఞశతమొనర్చిన వేల్పుటధిపుఁడెవఁడు?  
       - శతమఖుఁడు - ఇంద్రుఁడు

తండ్రి కొడుకులొక్క తరుణిని ....


తండ్రి కొడుకులొక్క తరుణిని ....


సాహితీమిత్రులారా!




ఈ పద్యం చూడండి.

తండ్రి కొడుకులొక్క తరుణిని రమియింప,
పుత్రు లిద్ద రొంది, పోరు గలుగ
ఒకని జంపి, రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాత డిచ్చు మాకు నఖిల సిరులు

ప్రార్థనలు కూడ ఎంత చిత్రంగా  ఉంటాయో!
దీన్ని చూస్తే తెలుస్తుంది

తండ్రి, కొడుకులు ఒకే స్త్రీని కూడటం వల్ల
 వారివలన ఇద్దరు కుమారులు పుడితే
వారు ఇద్దరు పొరు సలిపితే అందులో ఒకని చంపి
ఒకనికి రాజ్యమిచ్చిన ప్రభువు
మాకు అఖిల సంపదలు ఇచ్చుగాక అని భావం.

ఏమిటిది అయోమయం జగ్నాథం అన్నట్లు.
ఏమి అర్థం ఆలోచిస్తే ఇది ఒక కథ ఇందులో ఉంది-
అది భారతంలోనిది వివరంగా చూద్దాం-

తండ్రి సూర్యుడు- కొడుకు యముడు-
వీరిద్దరు కుంతిని కలిశారు.
సూర్యనివల్ల కర్ణుడు, యమునివల్ల ధర్మరాజు పుట్టారు.
వీరీద్దరు యుద్ధంలో పోరాడారు.
వీరిలో ఒకరిని(కర్ణుని) చంపి
ఒకరి(ధర్మరాజు)కి రాజ్యమిచ్చినవాడు కృష్ణుడు.
ఆ కృష్ణుడు మాకు సర్వసంపదలు ఇచ్చుగాక!
అని ప్రార్థించాడు కవి.

Monday, September 26, 2016

వికాశమీయుర్జగతీశమార్గణా


వికాశమీయుర్జగతీశమార్గణా


సాహితీమిత్రులారా!



భారవి కిరాతార్జునీయమ్ లో 15వ సర్గలో
చిత్రకవిత్వంతో కూడిన రచన చేశాడు అందులోనిది
ఈ క్రింది శ్లోకం ఇందులో అన్ని పాదాలు ఒకేలా ఉన్నాయి.
కావున దీన్ని ఏకపాది అంటాము.
శ్లోకం చూడండి-

వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
వికాశమీయుర్జగతీశమార్గణా
వికాశమీయుర్జగతీశమార్గణా:
                             (కిరాతార్జునీయమ్ - 15- 52)

ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసే అర్జునుని
పరీక్షించ వచ్చిన కిరాతుని రూపంలో ఉన్న
శివునికి అర్జునునికి జరిగే పోరాటంలోని
విషయం తెలిపేదీ శ్లోకం-

అర్జునుని బాణాలు విస్తరిస్తుండగా
శివుని బాణాలు భంగమవుతున్నాయి.
రాక్షసులు చూచి శంకరుని బాణాలు కూడా
వ్యర్థమవుతున్నాయని ఆశ్చర్యం పొందగా,
ఋుషులు దేవతలు ఆకాశంలో చేరి భయంకరమైన
యుద్ధాన్ని చూడటానికి ఒకే చోటికి చేరారు - అని పద్య భావం.

తామరమొగ్గలను తాకడంతో వాడిపోయిందా?


తామరమొగ్గలను తాకడంతో వాడిపోయిందా?


సాహితీమిత్రులారా!



నాయకుడు దూరదేశ ప్రయాణానికి
పయనమై ఉండి నిలిచిపోయాడు దానికి
ఒక మిత్రుడు "చెలికాడా! ప్రయాణం
ఏల నిలుపుకున్నావు" అని ప్రశ్నించాడు
దానికి ఆ నాయకుడు చెప్పిన బదులు ఈ శ్లోకం -

శీతే శీతకరో2మ్బుజే కువలయద్వన్ద్వాద్వినిర్గచ్ఛతి
స్వచ్ఛా మౌక్తికసంహతిర్ధవళిమాహైమీం లతామఞ్చితి,
స్పర్శాత్ పఙ్కజకోశయోరభినవాయాన్తిస్రజ:క్లాన్తతా
మేషోత్పాతపరమ్పరా మమ సఖే, యాత్రాస్పృహాంకృన్తతి
                                                           (పంచబాణవిలాసం లోనిది)

ఆకాశంలోని చంద్రుడు నేలమీది కమలంనందు పడుకొన్నాడు,
ముత్యాలు నల్లకలువల్లో పట్టినవి, బంగారుతీగ స్వభావసిద్ధమైన
పసుపు రంగును వదలి తెల్లబడింది, అప్పుడే గుచ్చిన పువ్వుల సరాలు
తామరమొగ్గలు తగలడంతో వాడిపోయాయి ఇలాంటి దుశ్శకునాలు
కనిపించడం వల్ల మంచిది కాదనిఅంటారు
ఇన్ని ఉత్పాతాలు ఒక్కసారే రావడం చేత
ప్రయాణం ఆపుకొన్నాను - అని
చెప్పాడట.
ఇది పైకి కనిపించే అర్థం.


నిజమైన అర్థం -

ఆకాశంలోని చంద్రుడు నేలమీది కమలంలో పడుకున్నాడు
అంటే నా ప్రియురాలు నా వియోగం ఓర్చుకోలేక తనకమలాల్లాంటి
చేతుల్లో చంద్రునివంటి ముఖాన్ని పెట్టుకున్నది అని అర్థం.
ముత్యాలు నల్లకలువల్లో పుట్టాయి అంటే నల్లకలువల్లాంటి
రెండు కళ్ళనుండి ముత్యాల్లాంటి కన్నీరు వచ్చిందని
అంటే తన భార్య కంటికి కాటుకైనా పెట్టుకోనందున స్వచ్ఛమైన
ముత్యాల్లాంటి కన్నీరు కార్చిందని అర్థం.
బంగారు తీగలాంటి ఆమే శరీరపు రంగు
విరహతాపంచేత తెల్లబడింది అని అర్థం.
తామరమొగ్గల్లాంటి స్తనాలకు తగిలి వేసుకున్న
పూలదండలు వాడిపోయాయని
అంతటి విరహతాపం ఉందని అర్థం.
ఇన్ని అవస్థలు చూచినా ప్రయాణం
మంచిదికాదని మానుకున్నాను అని చెప్పాడు.

Sunday, September 25, 2016

విధవాగమనం విశేషకార్యం


విధవాగమనం విశేషకార్యం


సాహితీమిత్రులారా!

కొన్ని విన్నప్పుడు అర్థం బాహ్యానికి ఒకలా
ఆంతరంలో మరోలా ఉంటాయి.
వీటిని గూఢ చిత్రాల కోవకు చేరుస్తాము.
అలాంటి ఒక శ్లోకం చూడండి-

విధవాగమనం విశేషకార్యం
విబుధానా మపి వీరవైష్ణవానామ్
విధవాగమనేన దాశరథ్యో:
గలితో2 భూత్కిల నాగపాశబంధ:

విధవ అంటే భర్త మరణించిన స్త్రీ.
ఆమె మరొక పురుషునితో కలవటం ఆమెకూ,
కలిసిన పురుషునికి పాపమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
అయితే ఇందులో విధవాగమన శబ్దం శ్లేషను
ఆధారంగా చేసుకొని గూఢత్వాన్ని సంతరించుకుంది.

వీరవైష్ణవులైన పండితులకు కూడ విధవాగమనం ముఖ్యమైన కార్యం
(ఇక్కడ విధవ అంటే విధవ అయిన స్త్రీని పొందటం ముఖ్యం అని పైకి కనిపిస్తూంది)
పూర్వం రామరావణ యుద్ధంలో సమ్మోహనాస్త్రంతో మూర్ఛ పొందిన
రామలక్ష్మణులకు విధవాగమనంతో నాగపాశబంధనం నుండి విముక్తి కలిగిందికదా!
అంటే వి - పక్షి, ధవ - ప్రభువు అయిన గరుడుని, ఆగమనం - రాక,
విధవాగమనం - గరుత్మంతునిరాక.
అంటే ఇక్కడ గరుత్మంతుడు రావడం వల్ల
రామలక్ష్మణులకు నాగపాశబంధం తొలగిపోయింది
కావున వైష్ణవులకు విధవాగమనం విశేషకార్యమయింది.

ప్రమాణం చేయటానికి ఏమాట వాడుతారు?


ప్రమాణం చేయటానికి ఏమాట వాడుతారు?


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకంలోని రెండు ప్రశ్నలను గమనించి
సంస్కృతాంధ్రములలో ఒకేమాట సమాధానం చెప్పండి

ప్రభాతే కీదృశం వ్యోమ?  ప్రమాణే కీదృశం వచ:?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యా మేక మేవోత్తరం వద

ప్రశ్నలు -
1. ప్రభాతే కీదృశం వ్యోమ?
    ( ప్రాత కాలంలో ఆకాశం ఎలా ఉంటుంది?)
      - నీతోడు (నీత + ఉడు - తొలగిన నక్షత్రాలు కలది
                      ఇది సంస్కృతపదం)

2.  ప్రమాణే కీదృశం వచ:?
      (ప్రమాణం చేయటానికి ఎటువంటి మాట వాడుతారు?)
        - నీతోడు (ఇది తెలుగుమాట)

రెండు భాషల్లోను
ఒకే పదం నీతోడు అని ఉపయోగించి
సమాధానం చెప్పడం ఎంత చిత్రం
ఇది భాషాచిత్రం నకు చెందినది

Saturday, September 24, 2016

శరణు! మహేశ! భూరితర........ (నాగబంధము)


శరణు! మహేశ! భూరితర........ (నాగబంధము)


సాహితీమిత్రులారా!

మన తెలుగులో నన్నెచోడుని కుమారసంభవములో
మొదటగా నాగబంధము కూర్చబడినది.
ఇది కుమారస్వామి జననం తరువాత ఇంద్రుడు
శివుని స్తుతించే సందర్భములో కవి నాగబంధాన్ని
చంపకమాలావృత్తంలో కూర్చాడు.
ఆ పద్యం చూడండి.

శరణు! మహేశ! భూరితర సార సుఖప్రద! కామ కాల సం
హర! భవరోగదారణ! సురాసుర వంద్య! శరీర దు:ఖ దు
స్తర కమలాపహార హిమధామ! సమస్తగ! సోమదేవ! వి
స్తరిత రమాదయారసయుతా యురులబ్దవిభావనామయా!
                                                           (కుమారసంభవము -10-84)
(మహేశ్వరా! మిక్కిలి అధికము శ్రేష్ఠమునైన సౌఖ్యమునిచ్చువాడా!
మన్మథుని యముని సంహరించినవాడా! సంసారమనెడి రోగమును
నశింపచేయువాడా దేవతలచేతను రాక్షసులచేతను నమస్కరింపబడువాడా!
శరీరదు:ఖములనెడు పద్మములను నశింపచేయు చంద్రుడా! అన్నిటిని బొందువాడా!
సోమదేవా! విస్తృతమైన సంపదతో, దయారసముతో కూడినవాడా! బాగుగా పొందబడిన
స్పష్టజ్ఞానముగలవాడా!  శరణు )
ఈ పద్యాన్ని ఈ క్రింద చూపిన బంధములో
తలనుండి తోకవరకు వరుసగా చదివిన
వస్తుంది. ఇది చంపకమాల కావున
ఇందులో పాదమునకు 21 అక్షరాలు
మొత్తం నాలుగుపాదాలకు 84 అక్షరాలుంటాయి.
ఇందులో 21 లేదా 20 స్థానాలలో ఉండే
అక్షరాలను రెండు మార్లు వచ్చేలా వ్రాయబడి ఉన్నది.
గమనించండి.

సారాకారా సమరస


సారాకారా సమరస 


సాహితీమిత్రులారా!


ఇంతకు మునుపు మనం ఒక పద్యాన్ని
అనులోమంగాను విలోమంగాను అంటే
మొదటినుండి చదివినా తివరనుండి చదివినా
ఒకలాగే వచ్చి అర్థంకూడ ఒకలాగే వచ్చే పద్యాలను
చూచి ఉన్నాము.
కాని ఇపుడు మొదట నుండి వచ్చిన పద్యం ఒకలాగను,
చివరనుండి వచ్చిన పద్యం మరోలాగను ఉండి
అర్థం వేరుగా ఉన్నదాన్ని చూద్దాం.
ఇది విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
గతిచిత్ర పద్యాన్ని ఇక్కడ చూద్దాం.

అనులోమ పద్యం -
(మొదట నుండి చివరకు చదివేది)

సారాకారా సమరస
సారసగ సరాస యనఘ జయయవ్యసనా
మారాకారా కలియమ
భారవ జసరా సమహిమ భాధవ భసరా

సారాకారా -
సార - ఉత్తమమైన, అకారా - అ అను వర్ణము(పేరు)గలవాడా,
సమ-రస - లక్ష్మితో కూడిన ప్రేమరసము కలవాడా,
సారసగ - శంఖమును పొందినవాడా,
సరాస - రాసక్రీడతో కూడినవాడా,
అనఘ - నిర్మలమైనవాడా,
అవ్యసనా, మారాకారా,
కలియమ - యుద్ధములలో యముని వంటివాడా,
భా-రవ-జ-సరా - శాంతితోను ధ్వనితోను జయముతోను
కూడిన బాణములుగలవాడా,
సమహిమ - భా-ధవ - భూదేవియొక్క వల్లభా,
భ-సరా - నక్షత్రములయందును గతిగలవాడా !
అనగా వాటియందును ఉండువాడా!

విలోమపద్యం -
(పై పద్యన్ని క్రింది నుండి చదువగా వచ్చే పద్యం)-

రాసభవధ భామహిమస
రాసజవరభామ యలికరాకారామా
నా సవ్యయ యజ ఘన యస
రాసగ సరసా సరమ సరాకారాసా

(రాసభ - గార్ధభాసురుని యొక్క, వధ - సంహారమునందలి
భా - దీప్తికిని, మహీమ - గొప్పదనమునకు,
స - స్యందన పథమువంటివాడా
అనగా స్యందనము దాని పథమునందు ఎట్లునడచునో
అట్లే గర్ధభాసురవధ జనిత తేజోమహిమలు వీరియందు నడచినవి అని,
రాస - జ వరరామ - రాసక్రీడయందు త్వరతో కూడిన ఉత్తమస్త్రీలుగలవాడా,
అలిక-రాకారామా - ముఖమునందునిండుపున్నమ
భార్యగా గలవాడైన చంద్రుడవే అయినవాడా,
నా సవ్యయ - అధికమైన శుభావహవిధులతో కూడినవాడవు కానివాడా)

Friday, September 23, 2016

నూపుర: కుత్ర వర్తతే?


నూపుర: కుత్ర వర్తతే?


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి.
ఇందులోని రెండు ప్రశ్నలకు రెండు భాషలలో
ఒకే పదంగా సమాధానం చెప్పాలి.
చూడండి.

రాణస్యకియ ద్వక్త్రం నూపుర: కుత్ర వర్తతే
ఆంధ్రగీర్వాణభాషాభ్యా మేకమేవోత్తరం వద

1. రావణస్యకియ ద్వక్త్రం?
   (రావణునికి ముఖాలెన్ని?)
    - పది (తెలుగు సంఖ్యావాచకము)

2. నూపుర: కుత్ర వర్తతే?
   (అందె ఎక్కడుంటుంది?)
   - పది(పదమునందు)
     (పద్ అనే సంస్కృత పదానికి
      సప్తమీవిభక్తిలో ఏకవచనం - పది)

విపరీతపు వావివరుస


విపరీతపు వావివరుస


సాహితీమిత్రులారా!


ఒకరోజు భోజమహారాజు ధారానగరంలో విహరిస్తూ
దుర్గాదేవి ఆలయానికి పోగా అక్కడ ఒక యోగిని
ఒక కుర్రవానికి అనేకవిధాల లాలిస్తూ ముద్దుముచ్చట
లాడుతోంది. సర్వసంగ పరిత్యాగిగా ఉండవలసిన ఈమెకు
ఈ సంసారపు జంజాటము ఏమిటి అని అనుకొని. అయినా
ఆవిషయం తెలుసుకొందామని ఆమెతో -
 "అమ్మా! ఈ బాలుడు నీకేమి కావాలి? - అని ప్రశ్నించాడు.
దానికి ఆమె రాజును చూచి "మహాప్రభూ! ఈ కుర్రవాడు నాకు సోదరుడు,
మేనల్లుడు, మనుమడు, మామ, కొడుకు,పినతండ్రి, మరిది" - అని చెప్పింది.
ఈ విపరీతపు వావివరుస విని రాజు ఆశ్చర్యపోయాడు. మరునాడు
ఆ యోగిని చెప్పిన వావివరుసను ఒక సమస్యగా
కూర్చి పండితులందరికి ఇచ్చాడు -
సమస్య-
భ్రాత, ర్భ్రాతృవ్య, పౌత్ర, శ్వశుర, సుత, పితృ, వ్యేతి తం దేవరేతి

దీన్నివిన్న పండితులు ఏమీ చెప్పలేక ఉండగా
కాళిదాసు కాళికాప్రసాదంతో ఆ రహస్యాన్ని కనిపెట్టి ఇలా పూరించాడు.

జారోత్పన్నౌ తనయదుహితరౌ, దంపతీ దైవయోగా
ద్యోగిన్యా గర్హితా సా తదనుగమవశాద్యోగినీత్వం ప్రపేదే,
పశ్చాద్భార్యాకృతాంబాజనిత మధ శిశుం లాలయత్యబ్రవీత్సా
భ్రాతర్భ్రాతృవ్య పౌత్ర శ్వశుర సుత పితృవ్యేతి తం దేవరేతి

ఒక ఊరిలో ఒక జారిణి ఉండేది. ఆమె చిన్నవయసులో ఒకనితో
కలిసి ఒక కొడుకును కని అతన్ని పిల్లవాణ్ణి వదిలేసి ఇంకో ఊరిలో
ఇంకొకనితో ఉండెను. అతనివలన ఒక కుమార్తెను కని, వారిని వదలి
మరొక ఊరిలో వేశ్యావృత్తిలో ఉండినది. కొన్నాళ్ళకు ఆమెకు కలిగిన
కొడుకుకు, కూతురుకు దైవయోగంతో వివాహమయింది.
వారి జన్మరహస్యం గురించి ఒక యోగిని తెలియపరచడంతో
ఆ కన్య సంసారాన్ని వదలి యోగిని అయినది.(ఆమె భోజునికి కనిపించినది.)
ఆమె యోగిని అయిన తరువాత ఆమెను వెదకుచూ ఊరూరా తిరుగుతూ
కన్నతల్లి వేశ్యగా ఉన్న ఊరికి పోయి కామావేశంతో వేశ్యగా ఉన్న తల్లితో
కలియగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. ఆ వేశ్య పిల్లవాన్ని విడిచిపెట్టింది.
ఆ శిశువు ఎట్లో ఈ యోగినికి దొరికాడు. ఆ యోగిని ఆత్మశక్తితో శిశువు
జన్మరహస్యం కనిపెట్టింది కావున ఇన్ని వావివరుసలు చెప్పింది.
వావివరుసలు-
1. సోదరుడు - తన తల్లి అయిన వేశ్యకు కుమారుడు కావున.
2. మేనల్లుడు - తను పెండ్లాడిన తన అన్నకు కొడుకు కావున.
3. మనుమడు - తనతల్లి అయిన వేశ్య తనభర్తకు భార్య అయింది. దీనివల్ల
                        తనతల్లి తనకు సవతి అయింది. ఆ సవితికి మొదట తనభర్త కొడుకు
                        కావున
                       తనభర్త తనకు కొడుకు అతని కొడుకు కావున మనుమడు

4. మామ - తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త, అత్త మొగుడు(తనభర్త)
                 తనకుమామ, ఈ వరుసన తనభర్త, ఈ పిల్లవాడు ఒకే గర్భవాసులు
                 అయినందున మామ.

5. కొడుకు - తనభర్తకు కొడుకు కావున తనకు కొడుకే

6. పినతండ్రి - తనతల్లికి మగడు తనభర్త. తనభర్తకు తనతల్లికి పుట్టినవాడు ఈ శిశువు.
                    తనతల్లికి భర్త అయిన వరుసలో తనకు తండ్రి, ఆ తండ్రికి ఈ శిశువు తమ్ముడు
                    కావున పినతండ్రి.
7. మరిది -  తనభర్తకు తల్లి అయిన వేశ్య తనకు అత్త ఆ అత్తకు రెండవ కొడుకు.
                  కావున భర్త తమ్ముడు మరిది

ఇన్ని సంబంధాలను మూడు పాదాలలో ఇమిడ్చి
సమస్యను పూర్తి చేశాడు కాళిదాసు.
అతని ఊహాపోహలకు ప్రతిభా విశేషానికి
భోజరాజు ఆశ్చర్యపడి
గొప్ప సన్మానము చేశాడు.

Thursday, September 22, 2016

మృగా త్సింహ: పలాయతే


మృగా త్సింహ: పలాయతే


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఇది ఒక సమస్యను పూరించినట్లుగా కనిపిస్తుంది.
మృగా త్సింహ: పలాయతే
(మృగం వలన భయపడి సింహం పాకిపోతున్నది)
ఇది ఒక ప్రహేలిక.
చూడండి శ్లోకం-

కస్తూరీ జయతే కస్మాత్కోహన్తి కరిణాం కులమ్
కిం కుర్యా త్కాతరో యుద్దేమృగా త్సింహ: పలాయతే

దీనిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి.
మొదటి మూడు పాదాలలో మూడు ప్రశ్నలు,
చివరిపాదంలో సమాధానం ఉన్నది
కావున ఇది అంతర్లాపిక అనే ప్రహేలిక అవుతుంది.

1. కస్తూరీ జాయతే కస్మాత్?
   (కస్తూరి దేన్నుండి పట్టును?)
2. కో హన్తి కరిణాం కులమ్?
   (ఏది ఏనుగుల సమూహాన్ని చంపును?)
3. కిం కుర్యా త్కాతరో యుద్ధే ?
   (యుద్ధంలో పిరికివాడు ఏమి చేస్తాడు?)

ఈ ప్రశ్నలకు సమాధానం - మృగా త్సింహ: పలాయతే

1. కస్తూరీ జాయతే కస్మాత్?
   (కస్తూరి దేన్నుండి పట్టును?)
    -   మృగాత్(మృగము)
    కస్తూరి మృగము నుండి పుట్టును
2. కో హన్తి కరిణాం కులమ్?
   (ఏది ఏనుగుల సమూహాన్ని చంపును?)
   - సింహ:(సింహము)
   సింహము ఏనుగుల కులాన్ని చంపుతుంది
3. కిం కుర్యా త్కాతరో యుద్ధే ?
     (యుద్ధంలో పిరికివాడు ఏమి చేస్తాడు?)
     - పలాయతే (పారిపోతాడు)
     పిరికివాడు యుద్ధంలో పారిపోతాడు.

కృష్ణాజినమ కణ్టకమ్


కృష్ణాజినమ కణ్టకమ్


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకాన్ని చూడండి.
ఇది గూఢచిత్రానికి చెందినది.

విషం భుంక్ష్య సహామాత్యై ర్వినాశముపయాస్యసి
నాభ్యాం కేనాపి రాజేన్ద్ర కృష్ణాజినమ కణ్టకమ్

ఓ రాజా! మీ మంత్రులతో కూడ
నాభియందలి విషాన్ని తినుము.
జింక చర్మం ముళ్ళు లేకుండా ఉన్నది-
నీవు వినాశనాన్ని పొందగలవు -
అని సాధారణంగా తోచే భావం.

సరిగా ఆలోచిస్తే
పదాల విరుపులను
గమనిస్తే దాని అర్థం -
రాజేంద్ర - ఓ రాజా!,
విషం - విగతషకారమైన(ష- కారమును తొలగించిన),
నాభ్యాం - రెండు నకారాలతో,
కోనాపి - కకారముతో కూడ, వినా - లేకుండా,
కృష్ణాజినం - కృష్ణాజిన శబ్దమును, అకణ్టకం - కంటకరహితంగా,
సహామాత్యై: -  మంత్రులతో కూడ,
భంక్ష్య - అనుభవించు, శం - శుభాన్ని,
ఉపయాస్యసి - పొందగలవు -
ఈ విధంగా వస్తుంది.
దీన్నుండి ఇలా చేస్తే సమాధానం దొరుకుతుంది.
కృష్ణాజిన - అనే శబ్దంలో -
ష - - - - అనే హల్లులను తీసివేస్తే
మిగిలినవి- క్ +ఋ, ష్ + న్ + ఆ, జ్ + ఇ, న్ + అ - వీటిలో క్, ష్, న్, న్ -లను
తీసివేస్తే - ఋ +ఆ + జ్ + ఇ + అ - లు మిగిలాయి కదా!
వీటిని కలిపితే రాజ్య అనే శబ్దం వస్తుంది.
దీని భావం ఇప్పుడు -
ఓ రాజా! మంత్రులతో కూడి నిష్కంటకమైన
రాజ్యాన్ని అనుభవించు - అని ఆశీర్వాదం.

Wednesday, September 21, 2016

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఇందులో అన్నీ పుణ్యక్షేత్రాలున్నట్లున్నను
అందులో నాయికా వర్ణనకూడ ఉన్నది.

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం వస్త్రం విధాతు: పదం
ధమ్మిల్లస్సుమన: పదం ప్రవిలసత్కాంచీ నితమ్బ స్థలీ
వాణీ చేన్మధురా ధరో2రుణ ధర: శ్రీరంగ భూమిర్వపు
స్తస్యా: కిం కథ యామి భూరి సుకృతం మాన్యాసదా నిర్జరై:

ఈ శ్లోకం ఒక నాయికను వర్ణించే శ్లోకం.
ఇందులో శ్లేషను ఆధారంగా తీసుకొని
శరీరఅవయవాలను పుణ్యక్షేత్ర
సంబంధమైనవిగా ఒక అర్థం,
శృంగార పరంగా మరొక అర్థం కనబడుతుంది.

పుణ్యక్షేత్ర సంబంధమైన అర్థం-
మధ్యం - నడుము, మిష్ణుపది - వైకుంఠము, కుచౌ - స్తనములు,
శివపదం - కైలాసం, వక్త్రం - ముఖం, విధాతు: పదం - బ్రహ్మలోకం,
ధమ్మిల్ల: - కొప్పు, సుమన: పదం - దేవతల లోకం,
నితంబస్థలీ - మొలప్రదేశం,
ప్రవిల సత్కాంచీ - ప్రకాశించే కాంచీ పట్టణం, వాణీ - నోరు,
మధురా - మధురా పట్టణం, అధర: - క్రింది పెదవి,
అరుణధర: - అరుణాచల క్షేత్రం, వపు: - శరీరం,
శ్రీరంగభూమి: - శ్రీరంగక్షేత్రం, తస్యా: - ఆమె యొక్క,
భూరి సుకృతం - పుణ్యాన్ని, కిం కథ యామి? - ఏమి చెప్పుదును,
నిర్జరై: - దేవతల చేత, సదా - ఎల్లపుడు, మాన్యా - పూజింప తగినది.


వీటికే శృంగార సంబంధమైన అర్థం -
విష్ణు పదం - ఆకాశం(నడుము శూన్యము) , శివపదం - కైలాస పర్వతము
(స్తనాలు పర్వాలవంటివి), ముఖము బ్రహ్మ జన్మస్థానమైన పద్మమువంటిది,
సుమన: పదం - పూవులకు స్థానం (కొప్పు  పుష్పాలు ధరించినది),
నితంబస్థలీ - నడుముభాగము కాంచి(ఒడ్డాణం)తో ప్రకాశిస్తున్నది.
వాణీ మధురా - వాక్కు తీయగా ఉంటుంది,
అధర: అరుణధర: - పెదవి ఎరుపురంగు కలిగినది,
శరీరము, శ్రీరంగభూమి: - లక్ష్మీదేవికి నాట్యవేదిక,
నగలతో ఆమె శరీరం సంపదకు నెలవుగా ఉన్నది. - అని భావం.

మణిప్రవాళ శైలి

మణిప్రవాళ శైలి


సాహితీమిత్రులారా!


అనేక భాషల మిశ్రమంతో వ్రాసిన అంశాన్ని
మణిప్రవాళ శైలిలో ఉంది  అంటాము.
ఇది మన గురజాడవారి కన్యాశుల్కంలోని
కొన్ని విషయాలను చూచి గమనిద్దాం.


కన్యాశుల్కము ప్రథమాంకంలో
గిరీశం - యీ వ్యవహార మొహటి ఫైసలైంది.
            ఈ రాత్రికి మధురవాణికి సార్టింగ్
            విజిట్ యివ్వంది పోకూడదు.
      నీ సైటు నాడిలైటు
      నిన్ను మిన్న
       కానకున్న
       క్వైటు రెచడ్ ఫ్లైటు
       మూనులేని నైటు

బంట్రోతు -
ఫుల్లుమూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా!  టా!
పంచమాంకంలో
పూజారి - మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను
       రాణా, డైమండ్ రాణీ
       రాణా, యిస్పేటు రాణి రాణికళావ
       ఱ్ఱాణా, ఆఠీన్రాణీ
       రాణియనన్మధురవాణె, రాజులరాణి

దీనిలో ఎక్కువభాగం ఇంగ్లీషు పదాలను
తక్కువగా తెలుగు పదాలను వాడాడు.

Tuesday, September 20, 2016

వనే వసతి నిత్యశ:


వనే వసతి నిత్యశ:


సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలిక చూడండి.

వనే జాతా, వనే త్యక్తా, వనే వసతి నిత్యశ:
పణ్యస్త్రీ నతు సా వేశ్యా యో జానాతి  సపండిత:

వనంలో పుట్టింది, వనంలో విడువబడింది, ఎల్లపుడు వనంలో ఉంటుంది. డబ్బు పెట్టి కొంటారు కాని వేశ్యకాదు. ఇది తెలిసినవాడు పండితుడు. - ఇది శ్లోక భావం.

వనం అంటే  అడవి, తోట, నీరు - అనే అర్థాలున్నాయి.
వనం(అడవి)లో పుట్టిన కలపతో తయారుచేయబడుతుంది.
వనం(నీటి)లో విడువబడుతుంది. ఎల్లపుడు వనం(నీటి)లోనే ఉంటుంది.
దీన్ని డబ్బు ఇచ్చికొంటారు
దీని సమాధానం - నౌక
(నౌకా - సంస్కృతంలో స్త్రీలింగం - పణ్యస్త్రీ(వేశ్య) అని అర్థం)

Monday, September 19, 2016

ఏ కాలమైనా అంతే


ఏ కాలమైనా అంతే


సాహితీమిత్రులారా!


సంవాదరూపంలోని ఈ శ్లోకం చూడండి.
ఇందులో కవి సమకాలీన దుస్థితిని తెలుపుతున్నాడు.

కస్త్వం భో:? కవిరస్మి, కాప్యభినవాసూక్తి:? సఖే పఠ్యతాం
త్యక్తా కావ్యకథైవ సంప్రతి మయా, కస్మాదిదం కథ్యతే
యస్సమ్య గ్వివినక్తి దోష గుణయో: పాఠం స్వయం సత్కవి:
పో2స్మిన్భావుక ఏవ నాస్త్యథ భవే ద్దైవాన్న నిర్మత్సర:

ప్రశ్న -    ఓయి నీవెవరవు?
జవాబు- నేను కవిని
ప్ర. - మిత్రమా! ఏదో ఒక కొత్త కవిత విన్పించు
జ. - నేనిప్పుడు కవిత్వం రాయడమే మానుకున్నాను.
ప్ర. - ఎందువలన
జ. - కవిత్వంలోని తప్పొప్పులను చక్కగా విమర్శించే వాడు గాని, 
        బాగా అర్థం చేసుకొని సారాన్ని తెలుసుకొనేవాడుగాని 
        లేనప్పుడు కవిత్వం రాసి లాభమేమి? భావుకుడేలేడు. 
        ఒక వేళ ఉన్నా వాడు అసూయాద్వేషాలకు అతీతుడు కాడు.


పై సంవాదం వల్ల తెలిసేదేమిటంటే సరైన విమర్శకుడు
లేకపోతే  కవిత విలువ గుర్తింపబడదని కవి ఆవేదన చెందాడు.

మత్వా మాగా గళం వహ


మత్వా మాగా గళం వహ


సాహితీమిత్రులారా!

ఒకమారు ముగ్గురు వ్యక్తులు భోజరాజు దర్శనానికి
వెళ్ళగా వారికి ఉచితరీతిని సత్కరించి మీరేమైనా
శ్లోకాలు రాశారా?  అని ప్రశ్నించాడు. దానికి వారు
ఇప్పటికి ఏమీ రాసుకొని రాలేదు నెలవైతే రాసుకొని
వస్తామని చెప్పి సెలవుతీసుకున్నారు.
కానీ కవిత్వమంటే ఏంటో వారికి తెలియదు
వారు రాయాలని ఆలోచన ప్రారంభించారు.
ఆశ చెడ్డదికదా! ఏలాగైనా నాలుగు పాదాలు కూర్చుకొని
ఒక శ్లోకమైనా పూర్తి చేయాలని ముగ్గురు కూడబలుక్కొని
ఒక్కొక్కపాదం ఒకరు పూర్తి చేసేవిధంగా మాట్లాడుకున్నారు.
ఎంత ప్రయత్నించినా ఎవరికీ ఏమీ తెలియడంలేదు.
వారిలో ఒకడు సాధారణంగా అనుకొనే ఒకపాదాన్ని
గుర్తుకురాగా అది చెప్పి గండం గడిచిందనుకున్నాడు.
ఆ పాదం-
అనిత్యాని శరీరాణి

రెండవవాడు ఎప్పుడో విన్న పాదం చెప్పి
తనగండం గడిచిందనుకున్నాడు.
రెండవ పాదం -
శాకాయ లవణాయ చ

మూడవవాడు చిన్నప్పుడు చదివిన
బాలరామాయణశ్లోకంలోని పాదం చెప్పి
ఊరకున్నాడు.
ఆ పాదం -
కూజన్తం రామ రామేతి

మూడు పాదాలు పూర్తయినాయి కాని నాలుగవపాదం
ఎంతప్రయత్నించినా వారి వల్లకాలేదు. మాటిమాటికి ఆ పాదాలనే
వల్లెవేస్తూ దారిలో వెళుతున్నవారిని కాళిదాసు వారి అవస్థనుచూచి
నాలుగవపాదం పూర్తిచేసి ఇక మీకు సన్మానం జరుగుతుంది రాజుదగ్గరకు
రండి అని చెప్పి లోనికి వెళ్ళాడు. కాళిదాసు పూర్తిచేసి ఇచ్చిన తర్వాత
కడతేరాం దేవుడా!  అనుకొని రాజుగారి ముందుకు వెళ్ళారు.
దాని్ని చూచిన రాజుగారు నాల్గవపాదం చెప్పినవారికి
అక్షరలక్షలు ఇచ్చితిని అనగా వారు రాజుగారికి
జరిగినదంతా చెప్పారు.
దానితో కాళిదాసును రాజుగారు సత్కరించాడు.
ఆ (పూర్తి)శ్లోకం -

అనిత్యాని శరీరాణి
శాకాయ లవణాయ చ
కూజన్తం రామ రామేతి
మత్వా మాగా గళం వహ
వీటి అర్థం-
అనిత్యాని శరీరాణి (శరీరము అనిత్యము)
శాకాయ లవణాయ చ (శాకమునకును, లవణమునకును)
కూజన్తం రామ రామేతి (రామ రామ అని కూయుచున్నది)
ఈ మూడు పాదములకు అతుకు పెట్టి క్రమాలంకారంలో చెప్పాడు కాళిదాసు.
మత్వా మాగా గళం వహ

అనిత్యాని శరీరాణి మత్వా 
(శరీరము అనిత్యమని తలచి)
శాకాయ లవణాయ చ మాగా: 
(శాకమునకును, లమణమునకును పోకుము)
కూజన్తం రామ రామేతి గళం వహ
(రామరామ అని కంఠమున వహింపుము)

దీని భావం -
ఓ నరుడా! శరీరము అనిత్యమని తలచి,
కూరగాయలు కావాలని ఉప్పు కావాలని వెంపర్లాడకు.
ఎల్లపుడు రామరామ అని కీర్తనను కంఠంనందు
వహించు అనగా ఎల్లపుడు రామనామాన్ని
సంకీర్తన చేస్తూ ఉండు - అని భావం.


Sunday, September 18, 2016

కొమ్ములు - వట్రువసుడుల పద్యం


కొమ్ములు - వట్రువసుడుల పద్యం



సాహితీమిత్రులారా!



మనం క్రితం తలకట్లు, గుడులు, కొమ్ములు, ఏత్వాలు,
ఐత్వాలతో మాత్రమే కూర్చిన పద్యలను చూచినాము.
ఇపుడు కొమ్ములు - వట్రువసుడుల పద్యం చూద్దాం.
ఇది విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోనిది.

శుక్రుఁడు శుక్రుఁడు నుగ్రుఁడు శుభుఁడు గుహుఁడు
మునులు గురుఁడును సుగుణు లున్ముదులు బుధులు
సుధులు గురువులు పుణ్యులు శ్రుతులు సుతులు
కృతులు నుతులు నుడువుదురు కృష్ణు ధృష్ణు

(ఉన్ముదులు - పుట్టిన సంతోషంగలవారు,
సుతులు - పుత్రులైన బ్రహ్మ, మన్మథులు)

అకుబేరపురీవిలోనం


అకుబేరపురీవిలోనం


సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలికా, గూఢచిత్తశ్లోకాన్ని చూడండి

అకుబేరపురీవిలోకనం నధరాసూనుకరం కదాచ న 
అథ తత్ప్రతికారహేతవే2దమయంతీపతిలోచనం స్మర

కుబేరపురి - అలక(పట్టణం)
అలక - ముంగురులు(మరొక అర్థం)
అకుబేరపురీ - ముంగురులులేని స్త్రీ(ముండిత) దర్శనము
ధరాసూనుడు - భూమి కుమారుడు - అంగారకుడు
అంగారకునికి మంగళుడు అనే పేరుంది
నధరాసూనుకరమ్ - అమంగళమును కలిగించు
అథ తత్ప్రతికారహేతవే - ఆ అమంగళము తొలగిపోయే నిమిత్తము
దమయంతీపతి - దమయంతి భర్త నలుడు
అదమయంతీపతి - అనలుడు (అగ్ని)
లోచనం - కన్నుగా గలవాడిని (శివుని)
స్మర - ధ్యానించు.

ముంగురులులేని స్త్రీ అనగా ముండితఅయిన
స్త్రీని దర్శించుట అమంగళకరము కావున
దానిని ఉపశమించుటకు శివుని ధ్యానించుము - అని భావం.

Saturday, September 17, 2016

నిన్ను నిను నెన్న నీనే


నిన్ను నిను నెన్న నీనే



సాహితీమిత్రులారా!

ఈ ఏకాక్షర పద్యం చూడండి.

ఇది విక్రాల శేషాచార్యులవారి
శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరములోనిది

నిన్ను నిను నెన్న నీనె
నెన్నిన నన్నన నన్నన నన ననిన నానేనా
ని న్నూనినా ననూనున్
న న్నూనన్నాను నేననా నున్నానా!


దీన్ని ఈ విధంగా పదవిభాగం తీసుకోవాలి-

నిన్నున్ - ఇనున్ - ఎన్నన్ - ఈనేను - ఎన్నినన్-
అన్నన్న - ననను -అనిన - నానేనా - నిన్ను -
ఊనినాను - అనూనున్ - నన్ను - ఊను -
అన్నాను - నేను - అనా - నున్నానా

అర్థం -
నీకు పైన ప్రభువులులేని, సర్వస్వమునకు ప్రభువైనవాడా
సర్వేశ్వరుడవైన నిన్ను స్తుతించుటకొరకు ఈ నేను ఆలోచిస్తే
చిగురువలె అల్పుడను. చోద్యము గొప్పవాడవైన నిన్ను ఆశ్రయించాను
శకటాసురుని సంహరించినవాడా తండ్రీ నన్ను ఆదుకొనుము అంటిని

ఏకోనావిశతి స్త్రియ:


ఏకోనావిశతి స్త్రియ:


సాహితీమిత్రులారా!



ఈ ప్రహేలిక చూడండి

గంగాయాం స్నాతు ముద్యుక్తా: ఏకోనావింశతి స్త్రియ:
తత్రైకా మకరగ్రస్తా పునర్వింశతి రాగతా

గంగా స్నానానికి ఒకటి తక్కువ ఇరవై మంది స్త్రీలు వెళ్ళారు.
అందులో ఒకస్త్రీని మొసలి మ్రింగింది. తిరిగి ఇరవైమంది వచ్చారు.
ఇదీ శ్లోకం భావం.
ఇది ఎలా సాధ్యం. ఇరవైమంది స్నానానికి వెళితే అందులో ఒకరిని
మొసలి మ్రింగిందని అంటే పందొమ్మిది మందేకదా రావలసింది
మరి ఇరవై మంది ఎలా వచ్చారు
ఇందులో ఏదో మతలబు ఉంది. వెళ్ళినవారు ఇరవైమందేనా
అది నిజమైతే సమాధానం 19 మందికదా
ఇక్కడ మనం అర్థం చేసుకోవడంలో
ఏకోనా వింశతి - అనే ఈ పదాన్ని బాగా ఆలోచించి
అర్థం తీసుకోవాలి.

ఏక + ఊనా - ఏకోనా, వింశతి అనగా పందొమ్మిది
ఏక: + నా  - ఏకోనా = ఒక పురుషుడు

ఇప్పుడు మనకు వివరం లెలిసింది కదా !
అక్కడ వెళ్ళినవారు ఒక పురుషుడు ఇరవైమంది స్త్రీలు
అందులో ఒకస్త్రీ మొసలివాత పడగా వచ్చినవారు ఇరవైమందేగా!.

Friday, September 16, 2016

కాన్తాజనేన రహసి ప్రసభం గ్రహీత:(త్రిపాది)


కాన్తాజనేన రహసి ప్రసభం గ్రహీత:(త్రిపాది)


సాహితీమిత్రులారా!

అన్ని పాదాలు ఒకే విధంగా ఉన్న
పద్య లేదా  శ్లోకాలను ఏకపాది అని
పద్యంలోని శ్లోకంలోని ఏ రెండు పాదాలైనా
ఒకేలా ఉంటే దాన్ని ద్విపాది అని
అలాకాకుండా ఏ రెండు పాదాలైనా ఒకేవిధంగా ఉండి
మిగిలినవి వేరువేరుగా ఉన్న దాన్ని త్రిపాది అంటారు.

ఈ శ్లోకం మాఘుని శిశుపాలవధ లోని
6వ సర్గలోనిది చూడండి.

కాన్తాజనేన రహసి ప్రసభం గ్రహీత:
కేశే రతే స్మరసహాసవతోషితేన
ప్రేమా మనస్సు రజనీష్వపి హైమనీషు
కే, శేరతే స్మ రసహాస వతోషితేన

అర్థం - స్మరసహ - మన్మథ వికారం కలిగించే, ఆసవ - మద్యముతో
తోషితేన - సంతుష్టుడై, రసహాసవతా - అనురాగము హాస్యము కలిగిన,
ప్రేమ్ణా - ప్రేమతో, మనస్సు - పురుషుల చిత్తములలో,
ఉషితేన - ఉన్నటువంటి, కాంతా జనేన - స్త్రీజనముచేత,
ప్రసభం - నిర్భంధముగా, రహసి - ఏకాంత ప్రదేశ మందు,
గృహీతకేశే - గ్రహించబడిన శిఖ కలిగిన, రతే - సంభోగములో,
హైమనీషు - హేమంతరుతు సంబంధమైన, రజనీష్వపి - రాత్రులందు కూడ,
కే - ఎవరు,(యువకులు), శేరతే స్మ - శయనించిరి - ఎవరుకూడా నిద్రించరని భావం.

(శీతాకాలపు రాత్రులలో  తమ ప్రియురాండ్రతో
కలిసి యువకులు శృంగార క్రీడలతో
కాలం గడిపిరి కాని శయనించలేదు - అని సారాంశం.)

 ఇందులో 2,4 పాదాల వర్ణాలు సమానంగా ఉన్నాయి గమనించండి.
మిగిలిన 1వ పాదం వేరుగాను 3వ పాదం వేరుగాను ఉన్నాయి.
కావున ఇది త్రిపది.

ఇందు గల డందులేడని (పేరడి)


ఇందు గల డందులేడని (పేరడి)



సాహితీమిత్రులారా!

భాగవత పద్యమైన ఈ పద్యం ప్రహ్లాదచరిత్రలోనిది
ప్రహ్లాదుని హరి ఎక్కడున్నడో చెప్పమన్నపుడు
ప్రహ్లాదుడు చెప్పిన పద్యం.

ఇందు గల డందు లేడని,
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు, దానవాగ్రణీ వింటే!
                                              (7-275)

ఈ పద్యానికి పేరడీ
వెలిదండ నిత్యానందరావుగారు
ఆనాటి రాజకీయాలకు అన్వయిస్తూ
చేసిన పేరడీ ఆంధ్రప్రభ దినపత్రికలో
18-12-1982లో వెలువడినది ఇది.

ఇందుగలదందులేదని
సందియము వలదవినీతి సర్వోపగతం
బెందెందు వెదకి చూచిన 
నందందే గలదు ఇందిరాకాంగ్రెసునన్

Thursday, September 15, 2016

యదూనా మధవా రఘూణామ్


యదూనా మధవా రఘూణామ్


సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం రామపరంగాను కృష్ణంపరంగాను శ్లేషతో చమత్కరించినది.
దీన్ని కోలాచలం పెద్దిభట్టు (మల్లినాథసూరి) చెప్పినది.

య: పూతనామా రణలబ్దవర్ణ:
కాకోదరో యేన వినీతదర్ప:
యస్సత్యభామాసహిత స్స పాయా
న్నాథో యదూనా మధవా రఘూణామ్ 

ఇందులోని పదాల విరుపు -

పూతనా, మారణ, లబ్దవర్ణ:
పూతనామా, రణలబ్ద వర్ణ: - అని రెండు రకాలుగా

కాకోదర:,   కాక + అదర: - అని రెండు రకాలుగా

సత్యభామా, సహిత:
సత్య, భా, మా, సహిత: - అని రెండు రకాలుగా
విడదీసుకోవడంతో రెండురకాల అర్థాలు వస్తాయి.

 ఇక కృష్ణపరమైన అర్థం చూద్దాం-

: - ఎవడు, పూతనా మారణలబ్దవర్ణ: - పూతనను చంపటంచేత
పొందబడిన పేరు కలవాడో, యేన - ఎవని చేత, కాకోదర: - పాము(కాళీయుడు),
వినీత దర్ప: - గర్వము తొలగించబడినదో, య: - ఎవడు,
సత్యభామాసహిత: - సత్యభామతో కూడి ఉంటాడో, స: - ఆ,
యదూనాం నాథ: - యదువంశ ప్రభువైన కృష్ణుడు
పాయాత్ - కాపాడును గాక!

రామ పరమైన అర్థం - 

: - ఎవడు, పూతనామా - పవిత్రమైన నామం
కలవాడో, రణలబ్దవర్ణ- యుద్ధంలో ప్రఖ్యాతి పొందినవాడో,
అదర: - భయంలేని, కాక: - కాకాసురుడు, వినీత దర్ప:
- తొలగించబడిన గర్వం కలవాడు, యేన - ఎవనిచేత(చేయబడ్డాడో),
 య: - ఎవడు , సత్య -సత్యవ్రతముతో, భా - కాంతితో,
మాసహిత: - లక్ష్మితో కూడినవాడో, స: - ఆ, రఘూణాంనాథ: -
రఘువంశ ప్రభువు, పాయాత్ - కాపాడుగాక!

కస్మై ప్రసీదతే విష్ణు:?


కస్మై ప్రసీదతే విష్ణు:?



సాహితీమిత్రులారా!



ఈ శ్లోకంలో రెండు ప్రశ్నలున్నాయి వాటి
సమాధానం (రెండిటికి) ఒకే పదంలో చెప్పాలి
అదీ మొదటిదానికి సంస్కృతంలోను,
రెండవదానికి ఆంధ్రం(తెలుగు)లోను సమాధానం
అయి ఉండాలి. ఆ శ్లోకం -

కస్మై ప్రసీదతే విష్ణు:? కిమాంధ్రాణా మతిప్రియమ్?
ఆంధ్రగీర్వాణ భాషాభ్యామేక మేవోత్తరం వద

1. కస్మై ప్రసీదతే విష్ణు:?
     విష్ణువు ఎవరికి ప్రసన్నుడౌతాడు?
   - చింతకాయ(తనను గూర్చి ధ్యానించు వానికి)
    ఇది సంస్కృతపదం, చతుర్ధీ విభక్తి.

2.   కిమాంధ్రాణా మతిప్రియమ్?
      తెలుగువారికి ఏది ఎక్కువ ప్రియమైనది?
   - చింతకాయ (తెలుగు పదం)

Wednesday, September 14, 2016

ఏకాక్షర పాదచిత్రం

ఏకాక్షర పాదచిత్రం



సాహితీమిత్రులారా!

ఈ శ్లోకాన్ని చూడండి
ఇది ఒక పాదంలో ఒకే హల్లును ఉపయోగించి కూర్చిన శ్లోకం కావున దీన్ని
ఏకాక్షర పాదచిత్రం అంటాము. ఇది మాఘకవి శిశుపాలవధలోని శ్లోకం చూడండి

జజౌజోజాజిజిజ్జాజీ
తం తతో2తితతాతతుత్
భాభో2భీభాభిభూభాభూ
రారారిరరిరీరర:
              (శిశుపాల వధ - 19-03)

యుద్ధశీలుడును, రణకోవిదుల శౌర్యముచేత
సంభవించిన సంగ్రామాలను జయించినవాడు,
శుక్రాది తారల కాంతివంటి కాంతిగలవాడై భయమెరుగని
ఏనుగుల ఓడింపగల పౌరుషమునకు ఆశ్రయమైనవాడు ఐన
బలభద్రుడు శత్రువైన వేణుదారుని సమీపించెను.


ఇందులో నాలుగు పాదాలలో ప్రతి పాదమున
ఒక హల్లుమాత్రమే ఉయోగించి
శ్లోకాన్ని కూర్చాడు మాఘకవి.
ఇందులో మొదటిపాదంలో - ,
రెండవ పాదంలో- ,
మూడవ పాదంలో- ,
నాలుగవ పాదంలో -   ను
ఉపయోగించాడు అచ్చులు ఏవైనా వాడవచ్చు
దీన్ని ఏకాక్షర పాదశ్లోకంగా చెబుతారు.

కాళిదాసళిదాయోమా


కాళిదాసళిదాయోమా



సాహితీమిత్రులారా!

మొదటినుండి చివరకుచదివినా
చివరనుండి మొదటికి చదివినా
ఒకలాగే ఉండే  పద్యాన్నిగాని శ్లోకాన్నిగాని
పద్యభ్రమకమని, లేదా అనులోమ విలోమ శ్లోకం(పద్యం) ఉంటాము
ఇలాటివి కొన్ని తెలుసుకొని ఉన్నాము
ఇప్పుడు మరొకటి.

కాళిదాసళిదాయోమా, చంద్రంతే రిపురంజకమ్
కంజరం పురితేం ద్రంచ, మాయోదాళి పదాళికా

దాసళి - దాసులను పుత్రులుగా చూచేదానా
దాయో - వేరుగా ఉండని శివుడుకలదానా
మాయో - మాయారూపిణివైన దేవతా
దాళి - దాంతి గుణముకలదానా
సదాళి - దేవతా స్త్రీలే చెలికత్తెలుగా కలదానా
కాళి - ఓ కాళికాదేవీ
పురి - దరిచేర్చుకునే విషయంలో
తే - నీ యొక్క
తా - దయ
చంద్రం - చంద్రుణ్ణి
కంజరం - సూర్యుణ్ణి
ఇంద్రం చ - దేవేంద్రుణ్ణి కూడ
రిపురంజకం - అరిషడ్వర్గము కలవాణ్ణిగా
మా - నన్నుగూర్చి
కా - సుఖానికి స్థానంగా
భవ - అగుదువుగాక

Tuesday, September 13, 2016

సీతయా కిం ప్రయోజనమ్?


సీతయా కిం ప్రయోజనమ్?


సాహితీమిత్రులారా!



ఇది చామర్తి కామశాస్త్రిగారు చెప్పిన శ్లోకం.

వాలినం రావణం రామం సుగ్రీవం చ విభీషణమ్
శత్రుఘ్నం భరతం హిత్వా సీతయా కిం ప్రయోజనమ్?

వాలిని రావణుని, రాముని, సుగ్రీవుని, విభీషణుని,
శత్రుఘ్నుని, భరతుని విడిచిపెడితే సీతతో పని ఏమి -
అనేది అర్థం దీనిలో అంతగా ఆలోచించాల్సినదేముంది అని కదా!
కాదు దీనిలోని గూఢార్థం కవిహృదయం ఇదికాదు.
అది -
వాలినం - తోకగల, రావణం - ఎక్కువ ధ్వని చేసేది,
రామం - మనోహరమైనది, సుగ్రీవం - మంచి మెడగలది,
విభీషణం - ఇతరులకు భయాన్ని కలిగించేది,
శత్రుఘ్నం - శత్రువులను చంపేది(అయిన) ఎద్దును,
హిత్వా - విడిచినచో, సీతయా- నాగేటిచాలుతో,
కిం ప్రయోజనమ్ - ఏమి లాభం?

అంతకు ముందు దున్నిన నాగేటి చాలుంది దానిమీద
మళ్ళీ దుక్కిదున్నాలి. విత్తనాలు వేయాలి అంటే
మంచి ఎద్దు అవసరం అది లేకపోతే లాభం ఏముందని భావం.

వీరుఁడిల లేఁడు ప్రతి రఘువీరుఁడొకఁడె (పేరడీ)


వీరుఁడిల లేఁడు ప్రతి రఘువీరుఁడొకఁడె (పేరడీ)


సాహితీమిత్రులారా!


ఈ పద్యం విజయవిలాసంలో చేమకూర వేంకటకవి
అర్జునుని గూర్చి చెప్పినది చూడండి-

పాఱఁజూచినఁ బరసేన పాఱఁజూచు
వింటి కొరగిన రిపురాజి వింటి కొరగు,
వేయునేటికి నల పాండవేయుసాటి
వీరుఁడిల లేఁడు ప్రతి రఘువీరుఁడొకఁడె
                                   (విజయవిలాసము 1-94)

అర్జునుడు కొంచెం తీక్షణంగా చూశాడంటే చాలు,
శత్రుసేనలు పలాయనం చిత్తగిస్తాయి.
వుిల్లు ఎత్తుకోవడానికి వంగితేచాలు ,
శత్రువులు వీరస్వర్గానికి దారితీస్తారు.
ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు
ఒక్క దశరథరాముడేగాని వేరొకడు లేడు- అని భానం.

దీనికి అభాగ్యోపాఖ్యానంలో వీరేశలింగంగారి
వ్యంగ్యానుకరణ చూడండి.

చేరినిల్చిన వంటయిల్ చేరి నిల్చు
గాన వచ్చినఁ బరువెత్తి కానసొచ్చు
డంబుమీరిన భట సమూహంబు తోడ
సాటియౌదురె మానవకోటి నెవరు

ఇది ఆ పురంలోని వారి శౌర్యపరాక్రమాలను
వర్ణిస్తూ చెప్పిన పద్యం
ఇటువంటివారితో ఎవరూ సాటిరారు,
వీరికివీరే సాటి అనడంలో ఎవరికీ విప్రతిపత్తి లేదు
అనే అర్థంలో ఈ పద్యం రాశారు.


Monday, September 12, 2016

స్వయమపి లిఖితం స్వయం న జానాతి


స్వయమపి లిఖితం స్వయం న జానాతి



సాహితీమిత్రులారా!

ఇద్దరు స్త్రీలు ఒకచోట కలిస్తే ఎలాఉంటుంచో
ఈ శ్లోకం వివరంగా చెబుతున్నది చూడండి.


చతుర స్సఖి మే భర్తా సయల్లిఖతి న తత్వరో వాచయతి
తస్మాదపి చతురో మే స్వయమపి లిఖితం స్వయం న జానాతి

ఇది ఇద్దరు స్త్రీల సంభాషణ- ఇద్దరు తమ భర్తల గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు.

మొదటి స్త్రీ - చతుర స్సఖి మే భర్తా సయల్లిఖతి న తత్వరో వాచయతి
                  (ఓ చెలీ! నా భర్త చాలనేర్పరి సుమా!
                    అతడు ఏదైనా రాస్తే మరొకరు చదవలేరు)

రెండవ స్త్రీ - తస్మాదపి చతురో మే స్వయమపి లిఖితం స్వయం న జానాతి
                 (ఇంతేనా! మావారు అంతకంటే చతురులు
                   ఆయన రాసింది ఆయనే మరల చూచి చదవలేడు.)

ఎంత చక్కని గొప్పలో కదా!


స్త్రీ పుంవచ్చ ప్రచరతి గృహే .....


స్త్రీ పుంవచ్చ ప్రచరతి గృహే .....



సాహితీమిత్రులారా!

గూఢచిత్రంలోని కొన్ని రకాలను చూచి ఉన్నాము.
శాస్త్రపరిభాషను గూఢంగా ఉంటే దాన్ని శాస్త్రగూఢము అంటాము.
ఈ శ్లోకం చూడండి. భావాన్ని గ్రహించండి.


సర్వస్యద్వే సుమతి కుమతీ సమృదాపత్తిహేతూ
వృద్ధోయూనా సహపరిచయాత్త్యజ్యతే కామినీభి:
ఏకోగోత్రే ప్రభవతి పుమాన్ య:  కుటుంబం బిభర్తి
స్త్రీ పుంవచ్చ ప్రచరతి గృహే తద్దిగేహం వినష్టమ్

ఇందులో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే  దీనిలో
వ్యాకరణసూత్రాలు గూఢపరచబడ్డాయి. కాని వాటి అర్ఱం వేరు ఇక్కడి అర్థం వేరు.

సర్వస్యద్వే సుమతి కుమతీ సమృదాపత్తిహేతూ
వృద్ధోయూనా సహపరిచయాత్త్యజ్యతే కామినీభి:
ఏకోగోత్రే ప్రభవతి పుమాన్ య:  కుటుంబం బిభర్తి
స్త్రీ పుంవచ్చ ప్రచరతి గృహే తద్దిగేహం వినష్టమ్


రంగులో చూపినవి పాణిని అష్టాధ్యాయిలోని వ్యాకరణసూత్రాలు
1. సర్వస్యద్వే (8-1-1)
2. వృద్ధోయూనా తల్లక్షణశ్చేదేవ విశేష (1-2-65)
3. ఏకోగోత్రే (4-1-93)
4. స్త్రీ పుంవచ్చ (1-2-66)
ఈ నాలుగు సూత్రాలు వేరువేరు సందర్భాలలో
చెప్పబడినవి. కాని ఇందులో
వ్యాకరణ అర్థంలోకాక లౌకికార్థంలో వాడబడినవి.
మరియు ఇవి దత్తపది ప్రక్రియలో లాగా తీసుకొని కూర్చబడినది.

1వ పాదం అర్థం -
లోకంలో అందరి సంపదలు ఆపదలు రావటానికి రెండే కారణాలు
ఒకటి సుమతి(మంచి బుద్ధి)వల్ల సంపదలు వస్తాయి.
రెండవది కుమతి (చెడ్డబుద్ధి)
వల్ల ఆపదలు వస్తాయి.

2వ పాదం అర్థం -
యువకులతో పరిచయం ఏర్పడిన తర్వాత
కాముకులైన స్త్రీలు వృద్ధులను వదలిపెడతారు.

3వ పాదం అర్థం -
వంశంలో కుటుంబభారాన్ని ఎవడు వహిస్తాడో
వాడే కులవర్థకుడౌతాడు అంటే
వంశంలో మంచి పేరు పొందుతాడు.

4వ పాదం అర్థం -
ఏ ఇంట్లో లేదా కుటుంబంలో స్త్రీ పురుషునివలె
పెత్తనం నడుపుతుందో ఆ కుటుంబం
నష్టాన్ని పొందుతుంది.
- ఇది దీని తాత్పర్యం.

Sunday, September 11, 2016

కుందమ్ము లెదిరిన విరిగెఁ గొమ్ము


కుందమ్ము లెదిరిన విరిగెఁ గొమ్ము



సాహితీమిత్రులారా!



ఈ పద్యం చూచి భావం గ్రహించి సమాధానం చెప్పండి.

కచమునకుఁ దొల్త కొమ్మూఁదెఁ గంతుఁడనుచుఁ
గంధరం బాదివర్ణ విఖండమయ్యె
నొత్తుఁగొనిపోవ గళము సద్వృత్తిఁజూపెఁ
దిరిగి కుందమ్ము లెదిరిన విరిగెఁ గొమ్ము

దీనిలోని అర్థం తెలిసి  సమాధానమివ్వండి

కచమునకుఁ దొల్త కొమ్మూఁదెఁ గంతుఁడనుచుఁ
కచము లోని క- కు కొమ్మిచ్చిన - కుచము అవుతుంది

గంధరం బాదివర్ణ విఖండమయ్యె
కంధరం లోని మొదటి వర్ణం విఖండమైతే
అంటే తీసివేస్తే ధరం(పర్వతం)అవుతుంది

నొత్తుఁగొనిపోవ గళము సద్వృత్తిఁజూపెఁ
అలాగే ధరం లోని ధ-కు వత్తు తీసివేస్తే
దరం అవుతుంది అంటే గళము(కంఠము)

దిరిగి కుందమ్ము లెదిరిన విరిగెఁ గొమ్ము
కుందము లోని కు - కు కొమ్ము తీసివేస్తే కందము

దీనిలో వరుసగా కుచము, ధరం, దరం, కందము
ఇవి సమాధానాలు. దీనిలోని భావం. 

ఎవరయామీరు చక్కని రాజులిద్దరు?


ఎవరయామీరు చక్కని రాజులిద్దరు?


సాహితీమిత్రులారా!

హనుమంతుడు రామలక్ష్మణులతో కలిసి మాట్లాడిన
సందర్భములోని సంభాషణ చిత్రమిది-

హనుమంతుడు - ఎవరయా మీరు చక్కని రాజులిద్దఱున్?
లక్ష్మణుడు - అర్కవంశ్యుల మయోధ్యాపురంబు
హనుమ- మీపేరు లెవరయా ఓ పుణ్యనిధులార?
లక్ష్మణుడు - రాఘవుండతఁడు నే లక్మణుండ
హనుమ - దండంబు దండంబు దశరథ సుతులార
రామలక్ష్మణులు - వర్ధిల్లు వర్ధిల్లు వానరేంద్ర
హనుమ - ఎందు వేంచేస్తిరో యినకులోత్తములార?
లక్ష్మణుడు - యిచ్చోట కార్యంబు నెఱుఁగ వస్తి
హనుమ -   వాయుపుత్రుండ హనుమను వచ్చినాను
                 భానుపుత్రుండు సుగ్రీవు బంటునేను
                 చెలిమిని మీకును మీకును జేయఁగాను
                 అతఁడు మీున్నచోటికి నంపగాను
                                    (చాటుపద్యమణిమంజరి - 848)

Saturday, September 10, 2016

దేహమే కుంటి కూనమా: (పేరడీ)


దేహమే కుంటి కూనమా: (పేరడీ)



సాహితీమిత్రులారా!


పాండవగీతలలోని ఈ శ్లోకం చూడండి.

భోజనం మిత్రసంకీర్ణం
బంధుసంకీర్ణమందిరమ్
శయనం సుతసంకీర్ణం
దేహి మే మధుసూధన:

దీనికి అజ్ఞాతకవి  పేరడీ -

భోజనం  ఈగ సంకీర్ణం
దోమ సంకీర్ణమందిరమ్
శయనం నల్లి సంకీర్ణం
దేహి మే కుంటికూనమా:


విలాసినీం కాంచనపట్టి కాయాం



విలాసినీం కాంచనపట్టి కాయాం


సాహితీమిత్రులారా!




ఈ ప్రహేలికను చూడండి-

విలాసినీం కాంచనపట్టి కాయాం
ఫాటీరవంకై ర్విరహి విలిఖ్య
తస్యా: కపోలే వ్యలిఖత్ పవర్గం
తవర్గమోష్ఠే చరణే టవర్గమ్

ఒక కాముకుడు ఒకానొక విలాసవతిని
బంగారు పట్టికపై శ్రీగంధద్రవంతో చిత్రించి
ఆమె చెంపమీద 'ప' వర్గమును,
పెదవిమీద 'త' వర్గమును,
పాదముపై 'ట' వర్గమును
వ్రాశాడు కాని దీని అర్థమేమి?
అంటే  ఓష్ఠస్థానీయమైన ప వర్గము వ్రాయుటవలన
- నా పెదవులతో నీ చెంపను ముద్దు పెట్టుకొందును అని,
దంతస్థానీయమైన "త" వర్గం రాయటం
అంటే నీ పెదవులపై దంతక్షతము చేయుదును అని,
మూర్ధస్థానీయమైన ట వర్గమును ఉపయోగించుటవలన -
నీవు కోపగించినచో
నీ పాదముపై నాతలను ఉంచుదునని - అతని ఆశయము.

Friday, September 9, 2016

పండితులు ఏ విధమైన హృదయము భరింతురు?


పండితులు ఏ విధమైన హృదయము భరింతురు?


సాహితీమిత్రులారా!

అంతర్లాపిలో మొదట ఉత్రమున్నది ఆద్యుత్తరప్రహేలిక.
అదే మధ్యలో ఉత్తరము ఉన్న దాన్ని మధ్యోత్తర ప్రహేలిక అంటారు.
దానికి ఉదాహరణ -

కీదృశం బిభ్రతి స్వాంతం విబుధా వద విద్యుతమ్
కాంవా కనకలేభాభాం కలయంతి బలాహకా:

ఇందులో ఉత్తరము - విద్యుతమ్

1. విబుధా: కీదృశంస్వాంతం బిభ్రతి? 
   (పండితులు ఏవిధమైన హృదయము భరింతురు?)

సమాధానం - విద్యుతమ్  
                     - జ్ఞానయుతమైన హృదయము
                     (విద్ - జ్ఞానముతో, యుతమ్ - కూడుకొనినది)

2. బలాహకా: కనక లేఖాభాం కాంవా కలయంతి?
   (మేఘములు సువర్ణరేఖా రుచిరమగు దేనిని పొందును?)

సమాధానం - విద్యుతమ్(మెఱపును)

ఇందులో విద్యుతమ్ అనేది
రెండింటికి సమాధానంగా సరిపోయినది.

సుమతీ! కి పేరడీ కుమతీ!


సుమతీ!  కి  పేరడీ  కుమతీ!


సాహితీమిత్రులారా!




సుమతీ శతకాన్ని కుమతీ శతకంగా పేరడీ
ఇతిశ్రీగారు రాశారు. ఇతిశ్రీ ఎవరోకాదు
ఆచార్య పుల్లెల రామచంద్రుడుగారు.
వారి కొన్ని పేరడీ కుమతీ పద్యాలను చూద్దాం.

అడిగిన ప్రశ్నలు చెప్పని
మిడిమేలపు టీచరులతొ మెలగుకంటెన్
వడిగొని ట్యూషను వెట్టుక
బడి ప్యాసవ వచ్చుగాదె వసుధను కుమతీ!

లంచము పంచక తినకుము
కొంచెంబేనైన చేతగొనకుము సుమ్మీ
లంచంబు పట్టువానికి 
కించిత్తుగ రాల్చకున్న కీడగు కుమతీ!


అధరము తడిసీ తడియక
మధురమ్మగు కాఫిజుర్రి మరి సిగరెట్టున్
ప్రథమముననె ముట్టించెడు
విధమేపో లైఫులోని విజ్ఞత కుమతీ!

బ్లేడును చూడని ముఖమును
బీడీ సిగరెట్ల కంపు వీడని ముఖమున్
కోడిములు చెప్పు ముఖమును
బూడిద కిరవైన పాడు బొందిర కుమతీ!

Thursday, September 8, 2016

తోయం న ప్రప్యతే కస్మాత్


తోయం న ప్రప్యతే కస్మాత్


సాహితీమిత్రులారా!


ప్రహేలికలు రెండురకాలు
1. అంతర్లాపికలు
2. బహిర్లాపికలు

సమాధానం ఇచ్చిన దానిలోనే ఉంటే అది అంతర్లాపిక
ఇచ్చినదానిలో సమాధానం లేక బయటినుండి సమాధానం
పొందవలసిన దానికి బహిర్లాపిక అని పేరు.

అంతర్లాపికలో  సమాధానం మొదటే అంటే
అది ఆద్యుత్తర ప్రహేలిక అనబడుతుంది.
ఈ ప్రహేలికను చూడండి

ప్రహిత: కీదృగ్విహితో జగామ రామేణ మారుతి ర్లంకామ్
రజ్వాది వ్యతిరేకై: తోయం న ప్రాప్యతే కస్మాత్

ఇందులో రెండుప్రశ్నలు ఉన్నాయి.
దీనికి సమాధానం - ప్రహిత:

ఇది మొదటే ఉన్నది కావున ఇది ఆద్యుత్తర ప్రహేలిక అగుచున్నది.

1. విహిత: మారుతి: రామేణ కీదృక్ లంకాం జగామ?
   (విధేయుడైన హనుమంతుడు రామునిచే
      ఎట్టివాడై లంకానగరమునకేగెను?)

సమాధానం - ప్రహిత: (పంపబడునవాడై)

2. రజ్వాది వ్యతిరేకై: తోయం కస్మాత్ న ప్రాప్యతే? 
   (త్రాడుబొక్కెన మొదలైనవి లేక
    దేని నుండి నీరు గ్రహింపబడదు?)
సమాధానం - ప్రహిత: (నూతి నుండి)