Wednesday, November 17, 2021

పానుగంటివారి సరిగమల పద్యం

 పానుగంటివారి సరిగమల పద్యం




సాహితీమిత్రులారా!



ఒకమారు పీఠాపురం రాజావారి దివాణంలో ప్రభు సమక్షంలో
తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారి వీణకచ్చేరి జరిగింది. వచ్చిన శ్రోతల్లో
పానుగంటివారు ఒకరట. వీణాగానం తర్వాత సంగమేశ్వర శాస్త్రిగారిని
అభినందస్తున్న మహారాజును ప్రశంసిస్తూ పానుగంటివారు చెప్పిన పద్యం ఇది.

స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు నాశ్రితు నెవ్వాని నాదరింతు
వాదాయమున నెంత యర్థుల కిచ్చెద వెదెటు చేసిన భృత్యు నెదగణింతు
నవని పాలన నేది యార్జించినాఁడవు కవితగానంబు నేపగిది విందు
వెట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటి వాత్మ సంస్తుతుల కేమందు వయ్య
సరిగ, ధని, సగమ పనిని సరిగ, గరిమ
మరిమరిగ, పాపనినిగని, సరిసర్ యను

వీణకాని "మా" వెన్క "నీ" వీణ వరుస
మీఁద "నీ" వెన్క "మా" సూర్యమేదినీశ

సీసపద్యంలోని ఎనిమిది ప్రశ్నలకు ఎత్తుగీతిలో వీణా స్వరవిన్యాసంతో జవాబులిచ్చారు.
1.ప్ర- స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు - సరిగ
2.ప్ర- నాశ్రితునెవ్వాని నాచరింతువు - ధని
3.ప్ర- ఆదాయమున నెంత యర్థుల కిచ్చెదవు - సగమ
4.ప్ర- ఎదెటు చేసిన భృత్యు నెదగణింతువా - పనిని సరిగ
5.ప్ర- అవని పాలన నేది యార్జించినాఁడవు - గరిమ
6.ప్ర- కవితగానంబు నేపగిది విందువు - మరిమరిగ
7.ప్ర- ఎట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటివి - పాపనినిగని
8.ప్ర- ఆత్మ సంస్తుతులకేమందు వయ్య - సరిసరి

అని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 

ఇంకా చమత్కార మేమంటే "ఓ మహారాజా! ఈ వీణ వరుసమీద ఆరోహణావరోహణ క్రమంలో "మా వెన్కనీ" అంటున్నది. కాని "నీ వెన్క"  "మా" అన్నది ఉంటుంది. "మా" అంటే లక్ష్మి. నీ వెనుక లక్ష్మిగాని, లక్ష్మి వెనుక నీవు ఉండవు అని భావం.

No comments: