Thursday, November 11, 2021

ఒకేహల్లు పద్యాలు

 ఒకేహల్లు పద్యాలు




సాహితీమిత్రులారా!



ఈ పద్యాలలో హల్లు ఒకటే ఉంటుంది

కానీ అచ్చులు ఏవైనా వాడవచ్చు.

గమనించండి-

 నిన్ను నిను నెన్న నీనే
 నెన్నిన నన్నన్న ననననిన నానే నా
 నిన్నూని నా ననూనున్
 నన్నూనన్నాను నేననా నున్నానా

                                        శ్రీవేంకటేశ చిత్రరత్నాకరం పూర్వభాగంలోనిది.

అనిన = నీకుపైన ప్రభువులులేని, నానా = సర్వమునకు, ఇనా = ప్రభువైనవాడా, ఇనున్ = సర్వేశ్వరుడవైన, నిన్నున్, ఎన్నన్ = స్తుతించుటకొరకు, ఈనేను, ఎన్నినన్ = ఆలోచించినచో, ననను = చిగురును, (అల్పుడని అర్థం), అన్నన్న= చోద్యం, అనూనున్ = గొప్పవాడవైన, 
నినున్ = నిన్ను, ఊనినాను = ఆశ్రయించినాను, నున్న = త్రోసివేయబడిన, అనా = శకటముగలవాడవైన, అనా = తండ్రీ, నేను, నన్ను+ ఊను = ఆదుకొనుము, 
అన్నాను = అంటిని.

మామా మీమో మౌమా
మామా! మిమ్మొమ్ము మామ మామా మేమా
మేమొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మౌ మౌమా!

                                                           (చంపూ భారతం పుట. 249 )

మా = చంద్రుని యొక్క, మా = శోభ,
మోము + ఔ = ముఖముగా గల,
మామా- మా = మాయొక్క, మా = మేధ,
మిమ్ము = మిమ్ములను, ఒమ్ము =-అనుకూలించును,
మామమామా = మామకు మామవైన దేవా!,
ఆము = గర్వమును, ఏమి =- ఏమియు,
ఒమ్మము = అంగీకరించము, మీమై = మీ శరీరము,
మేము ఏమే = మేము మేమే, మమ్ము,
ఓ ముము + ఓముము = కాపాడుము, కాపాడుము,
ఇమ్ము = అనుకూలము, ఔము = ఔమా + అగుము - అగుమా


లోలాళిలాలిలీలా
ళీలాలీలాలలేలలీలలలలులే
లోలోలైలాలలల
ల్లీలైలలలాలలోలలేలోలేలా
                               (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని 223వ పద్యం)
(ఇందులో ల-ళ లకు భేదము లేదు కావున పద్యమంతా
ల - అనే హల్లుతో కూర్చబడినదిగా భావించాలి)

లోల - చలించుచున్నట్టి, అళి - తుమ్మెదలను,
లాలి - లాలించునట్టి, లీలా - శృంగారక్రియగలిగినట్టి,
ఆళీ - చెలికత్తెలయొక్క, లాలీ - లాలిపాటలయొక్క,
లాల - లాలయను పాటయొక్క, ఏల - ఏలపదాలయొక్క,
లీలలు - విలాసములు, అలలు - అతిశయములు,
లే - అవులే, లోలో - లోలోయనే, ల - స్వీకరించయోగ్యమయినట్టి,
ఐల - గుహలయందు, అల - అఖండములయినట్టి,
లలత్ - కదలుచున్నట్టియు, లీల - క్రీడార్థమయినట్టియు,
ఏలల - ఏలకీతీగలయొక్క, లాల - ఉయ్యాలలు,
 ఓలలు - హేరాళములే, లోల - ఆసక్తిగలిగిన,
ఐలా - భూదేవిగల శ్రీవేంకటేశ్వరస్వామీ