Thursday, August 29, 2019

సార్థక నామధేయుడు సంగీతరావు


సార్థక నామధేయుడు సంగీతరావు



సాహితీమిత్రులారా!

తల్లిదండ్రులు పెట్టిన పేరును బట్టి మనుషులుండడం అరుదు. శాంతారాం ముక్కోపి కావచ్చు. విద్యాసాగర్‌కు చదువబ్బకపోవచ్చు. సుందరం అనాకారి కావచ్చు. అలా జరిగితే వారిని తప్పు పట్టలేం కూడా. కానీ సంగీతరావుగారు ఈ కోవకి చెందరు. 1920లో జన్మించిన సంగీతరావు గారు మూర్తీభవించిన సంగీతమే. సంగీతరావుగారి గురించిన విశేషాలు తెలుసుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది మన అభిమాన గాయకుడు ఘంటసాలకు ఆయన చాలా సన్నిహితుడూ, గురుపుత్రుడూ కూడా. రెండోది మద్రాసులో వెంపటి చినసత్యంగారి కూచిపూడి నృత్యనాటకాలు చాలావాటికి ఆయనే సంగీతదర్శకుడు. వీటన్నిటికన్నా నాలెక్కన ముఖ్యమైన విషయం ఆయనకు శాస్త్రీయ సంగీతంలో కనీసం ఏడున్నర దశాబ్దాలుగా పరిచయం, అభిరుచి, అభినివేశం, అనుభవం ఉన్నాయి. ఆయనతో మాట్లాడడం నిజంగా ఒక ఎడ్యుకేషన్‌. ముప్ఫై ఏళ్ళకు పైగా ఆయనతో పరిచయం ఉన్న నాకు ఇప్పటికీ మద్రాసు వెళ్ళినప్పుడల్లా ఒకటి రెండు రోజులు ఆయనను కలుసుకోవడానికి వెళ్ళడం ఆనందదాయకమే.

విజయనగరం సంగీత కళాశాల అధ్యాపకవర్గం.
1937 ప్రాంతాల తీసిన అరుదైన ఫోటోలో ఉన్నవారు ముందువరసలో ఎడమనుంచి శ్రీపాద సన్యాసిరావు (మృదంగ విద్వాన్‌), వాసా వెంకటరావు(ప్రఖ్యాత వైణికుడు కృష్ణమూర్తిగారి తండ్రి), ద్వారం వెంకటస్వామినాయుడు, పట్రాయని సీతారామశాస్త్రి, మునుస్వామి (నాదస్వర విద్వాన్‌). రెండో వరసలో ఎడమ నుంచి మునుస్వామిగారి ఒక శిష్యుడు, అయ్యగారి సోమేశ్వరరావు (వీణ విద్వాన్‌), చాగంటి గంగబాబు (అంధుడైన వయొలిన్‌ విద్వాన్‌), అవధానుల సూర్యనారాయణ (పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యుడు), లోవదాసు (మునుస్వామిగారి కుమారుడు). మూడో వరసలో వాసా వెంకటరావుగారి మనమడు(దౌహిత్రుడు), ప్యూన్‌ రామస్వామి.

సంగీతరావుగారి కుటుంబ నేపథ్యం తెలిస్తే ఆయన గురించి కొంత అర్థమౌతుంది. సంగీతరావు గారిది ఉత్తరాంధ్రకు చెందిన సంగీత కుటుంబం. ఆయన తండ్రి పట్రాయని సీతారామ శాస్త్రిగారూ, తాత పట్రాయని వెంకట నరసింహశాస్త్రిగారూ జీవితమంతా సంగీతసాధన చేసినవారు. సీతారామ శాస్త్రిగారు (1900 1957) మంచి సంగీతజ్ఞుడు. ఆయనను సాలూరు చిన్నగురువుగా రనేవారట. ఆయన తండ్రి పట్రాయని వెంకట నరసింహశాస్త్రి (1872 1931) పెద్దగురువుగా పేరుపొందిన విద్వాంసుడు. తంజావూరు గురువులవద్ద సంగీతం అభ్యసించిన వ్యక్తి. త్యాగరాజ కీర్తనలు కచేరీల్లో పాప్యులర్‌ అవడం ఆయన కాలంలోనే మొదలైందట. ఇరవయ్యో శతాబ్దం తొలి రోజుల్లో తెలుగునాట కర్ణాటక సంగీతం వేళ్ళూనడానికి తోడ్పడినవారిలో బందరుకు చెందిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారొకరు. ఆయన శిష్యవర్గం నరసింహశాస్త్రి గారికి సమకాలికులు. త్యాగరాజు శిష్యుడైన మానాంబుచావడి (ఆకుమళ్ళ) సుబ్బయ్యగారి వద్దకు తంజావూరుదాకా కాలినడకన వెళ్ళీ సంగీతం నేర్చుకున్న మహానుభావుడు దక్షిణామూర్తి శాస్త్రి. ఆయన బాలమురళీకృష్ణకు గురువైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారికి గురువు. ఈ సంస్కారమంతా సంగీతరావుగారికి చిన్నతనంలోనే అవగతమయింది.

తన తండ్రి గురించీ, తన చిన్నతనంలో ప్రత్యక్షంగా విన్న ఇతర విద్వాంసుల గురించీ సంగీతరావుగారు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెపుతూ ఉంటారు. సంగీతరావుగారి తండ్రి సీతారామశాస్త్రిగారు విజయనగరం సంగీతకళాశాలలో 1936 నుంచీ గాత్రం నేర్పేవారట. ఎందరు అభ్యంతరం లేవనెత్తినా ఆయన కర్ణాటక సంగీతానికి హార్మోనియం పనికొస్తుందని శ్రుతిబద్ధంగా, గమకాలతో వాయించి మరీ నిరూపించారట. అలాగే సంగీతంలో సాహిత్యం ఇమడదు అనే ప్రతిపాదన తప్పని ఆయన వాదించేవారట. తన గాత్రకచేరీలలో సంగీత, సాహిత్యాల నుడికారాలు రెంటినీ సమన్వయం చేసి చూపించేవారట. ఇలా సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్న ఈయన ధోరణి సంగీతకళాశాల ప్రిన్సిపల్‌ ద్వారం వెంకటస్వామి నాయుడుగారికి నచ్చేది కాదట. కళాశాలలో విద్యార్థులకు సిలబస్‌ ప్రకారమే నేర్పుతున్నాను కదా, ఆ తరవాత నేనెవరితో ఏమంటే మీకెందుకు అని శాస్త్రిగారు అనేవారట. బహుశా అందువల్లనే గాత్రంలో రాణిస్తారని అనిపించినప్పుడు నేదునూరి కృష్ణమూర్తివంటి విద్యార్థులను నాయుడుగారు డా. శ్రీపాద పినాకపాణిగారి వద్దకు పంపి ఉండవచ్చు. ఏది ఏమైనా పట్రాయని సీతారామశాస్త్రిగారి ప్రభావం 1938లో విజయనగరం కాలేజీలో చేరిన ఘంటసాలకు చాలా మేలు చేసింది. తెలుగు సినీ సంగీతానికీ, లలిత సంగీతానికీ తెలుగుదనాన్నీ, నేటివిటీనీ ఆపాదించడంలో అపూర్వ విజయాన్ని సాధించిన ఘంటసాలగారి ద్వారా ఆంధ్రదేశమంతా సీతారామ శాస్త్రిగారికి ఋణపడి ఉంది. తండ్రిగారి ప్రభావం తనమీద కన్నా ఘంటసాలగారి మీద ఎక్కువగా ఉండేదని సంగీతరావుగా రంటారు.

సంగీతరావుగారు ఘంటసాలకు సినిమాల్లో సంగీత దర్శకుడుగా సహకరించారు. చిన్నతనంలో స్వయంగా గానకచేరీలు చేసిన నేదునూరివంటి ప్రసిద్ధులకన్నా సంగీతరావుగారు సీనియర్‌. 1930లో నాలుగో, అయిదో క్లాసు చదివే రోజుల్లో సంగీతరావు బొబ్బిలి హైస్కూల్లో ఆకుండి నారాయణశాస్త్రిగారి ఒక కీర్తనను పాడారు. శాస్త్రిగారే స్వయంగా హార్మోనియంతో సహకరించారు. అది కల్యాణి, కదనకుతూహలం, దేవామృతవర్షిణి, మోహన, కానడ, ధర్మవతిలతో కూడిన రాగమాలిక. ఆ విధంగా బాలగాయకుడుగా పెద్దల మెప్పును పొందారు. ఆ తరవాత ఆయన మద్రాసుకు మకాం మార్చారు.

వ్యక్తిగతంగా సంగీతరావుగారు నిరాడంబరుడనీ, బిడియం ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడనీ తెలిసినవారికి ఆయనకు రావలసినంత పేరు రాలేదని అనిపించడం సహజం. ఎటువంటి సామర్య్థమూ లేని అల్పులు స్వంత డబ్బా కొట్టుకుంటూ ఉండడం ఎన్నో ఏళ్ళనుంచీ జరుగుతున్నదే. అలాంటప్పుడు దగ్గరికి వెళ్ళి పలకరించితే తప్ప అపారమైన తన సంగీతజ్ఞానాన్నీ, అనుభవాన్నీ వివరించని సంగీతరావుగారివంటి ప్రతిభావంతుల గురించి అందరికీ తెలియదంటే ఆశ్చర్యం లేదు. తెలిసినవారు మాత్రం ఆయన ప్రతిభను కొంతవరకూ వెలికితీశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే “జీవితారోహణంలో ఎన్ని మెలికలు తిరిగినా, ఎన్ని గతుకులు దాటినా (ఆయనను) సూటిగా నడిపించినది సప్తస్వరార్చనమే”.

ఘంటసాలగారు కాలంచేసిన తరవాత చినసత్యంగారు సంగీతరావుగారిని తమ బృందానికి సంగీతం సమకూర్చమని ఆహ్వానించారు. దానికి సంగీతరావుగారు కొంత అయిష్టంగానే అంగీకరించడం నాకు గుర్తుంది. ఆ తరవాత కర్ణాటక సంగీతంలోని కొన్ని అపూర్వమైన కీర్తనలూ, అరుదైన రాగాలూ, వాటి ప్రయోగాలను గురించి సంగీతరావుగారికి ఉన్న పరిచయాన్ని గుర్తించిన మద్రాసు మ్యూజిక్‌ అకాడమీవారు తమ వార్షిక సంగీతోత్సవాల్లో ఉదయాన జరిపే పండిత సదస్సుల్లో ఆయన చేత డెమాన్‌స్ట్రేషన్‌లు ఇప్పించారు. వీటిలో ఒకటి హరికథకుగాను ఎంబార్‌ విజయరాఘవాచారిగారికి సంగీత కళానిధి బిరుదునిచ్చిన సందర్భంలో జరిగింది. రెండోది డా. శ్రీపాద పినాకపాణిగారి అధ్యక్షతన జరిగింది. వీటిలో సంగీతరావుగారూ, ఆయన కుమార్తె పద్మావతీ కలిసి ఆదిభట్ల నారాయణదాసుగారి కీర్తనలు పాడారు. అలాగే కొందరు తెలుగు వాగ్గేయకారుల మరుగుపడిన రచనలను వినిపించారు. అందులో నందిగాన వెంకయ్యగారి లోకావన అనే హరికాంభోజి రాగ కీర్తన ఒకటి. వెంకయ్యగారు పిఠాపురం ఆస్థాన విద్వాంసుడుగానూ, తూమరాడ సంగమేశ్వరశాస్త్రిగారి గురువుగానూ ప్రసిద్ధుడు. సంగమేశ్వరశాస్త్రిగారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారికీ, ఆయనకు అన్నయ్యా, గురువూ అయిన ద్వారం వెంకటకృష్ణయ్యగారికీ సంగీతం నేర్పిన గొప్ప వీణ విద్వాంసుడు. సగటు తెలుగువాడికి ఈనాడు శాస్త్రీయ సంగీతం గురించి ఎటువంటి భావాలున్నాయో చెప్పలేంగాని ఇదంతా మనం గర్వించదగ్గ పదహారణాల తెలుగు సంప్రదాయమే. సంగీతరావుగారు పాడి వినిపించిన ఇతర రచనల్లో తన తండ్రిగారి రచనలూ, హరినాగభూషణంగారి అఠాణా రాగకీర్తనా, వీణ కోసమని వాసా అప్పయ్యగారు రచించిన స్వరపల్లవులూ వగైరాలున్నాయి. వీటన్నిటి గురించీ ఈనాడు ఎవరూ పట్టించుకోకుండా సంగీతమంతా తమిళనాడులోనే ఉందనుకుని పొరబడితే అది తెలుగు సంస్కృతికి జరిగే నష్టమే అని మనమందరం గుర్తించాలి.

1970లలో సంగీతరావుగారు తరుచుగా మద్రాసులో మా ఇంటికి వచ్చి చాలా సేపు సంగీతం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పి, పాటలు కూడా పాడుతూ ఉండేవారు. మా రెండు కుటుంబాలకూ గాలి బాలసుందరరావుగారే ఫామిలీ డాక్టర్‌ అవడంతో అప్పుడప్పుడూ ఆయన దగ్గర కూడా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. మానాన్న కుటుంబరావుగారు చిన్నతనంలో విజయనగరంలో చదువుకోవడం, శాస్త్రీయసంగీతంతో ఆయనకు ఉన్న గాఢమైన పరిచయం, అభిరుచుల వల్ల మరిన్ని కామన్‌ టాపిక్స్‌ ఉండేవి. నేను సితార్‌ వాయించేవాడిని కనక సంగీతరావుగారు హిందూస్తానీ రాగాల గురించి నన్నడిగి తెలుసుకుంటూ ఉండేవారు. స్వయంగా అపారమైన శాస్త్రీయజ్ఞానం ఉన్న అంతటి గొప్ప వ్యక్తి ఎంతో వినయంగా తనకు తెలియని వివరాలు నావంటి యువకుణ్ణి అడగడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది.

ఈనాడు కర్ణాటక కచేరీలలోమృదంగానికి “తని ఆవర్తనం” అని సోలో అవకాశం ఇవ్వడం పరిపాటి. దీన్ని ప్రారంభించినది ఆదిభట్ల నారాయణదాసుగారేనట. నారాయణదాసుగారు వీధులవెంట అట్టహాసంగా నడుస్తూ, తన వెంట నడుస్తున్న శిష్యుడికి పబ్లిక్‌గా హరికథ పాఠాలు నేర్పేవారట. దాసుగారు ఒకేసారిగా నోటితో ఒక తాళంలో పాడుతూ, చెరొక చేత్తో చెరొక తాళంవేస్తూ, రెండు కాళ్ళతో మరి రెండు తాళాలకు అడుగులు వేసేవారని విన్నాం. ఇలా అయిదు తాళాలు ఏకకాలంలో నిభాయించడానికి చాలా పటిమ ఉండాలి. దీన్ని చూసిన సంగీతరావుగారు అది పంచముఖి అనే పేరుతో దాసుగారు చేసిన ఒక సంగీత రచన అనీ, లెక్కల్లో ఎల్‌సీఎమ్‌ పద్ధతిలో దాసుగారు అవసరాన్ని బట్టి ఒక్కొక్క మాత్ర మీద చేతులతోనూ, కాళ్ళతోనూ “దెబ్బ” వేసేవారనీ వివరించారు.


ఎంతో పేరుపొందిన విద్వాంసుడు వీణ వెంకటరమణదాసుగారు సంగీతరావుగారి చిన్నతనంలోనే పండుముసలి అనీ, ఆయనకు పుట్టెడు చెముడు ఉండేదనీ, తాను వాయిస్తున్న వీణ తీగలు శ్రుతి తప్పినా తెలుసుకోలేని ఆయన పరిస్థితి జాలి కలిగించేదనీ, కుర్రవాళ్ళు ఆయనను ఏడిపించేవారనీ చెప్పారు. ద్వారంవారు వయొలిన్‌ వాయిస్తూ, ముఖ్యంగా వయసు మళ్ళిన తరుణంలో, అతి తక్కువ స్వరాలతో అద్భుతమైన భావాన్ని పలికించేవారనీ, స్వరాలు ఖర్చయి పోతాయేమో అన్నట్టుగా “స్వర లుబ్ధుడి”లాగా ప్రవర్తించేవారనీ అన్నారు. ఈమని శంకరశాస్త్రిగారి వీణ ఆలాపనలో కూడా ఈ లక్షణం కనబడేది. వాయించిన స్వరాలకన్నా వాటి మధ్యనున్న విరామాలు ఎలోక్వెంట్‌గా అనిపించేవి. ఒక ఊపిరితిత్తిని కోల్పోయిన హిందూస్తానీ గాయకుడు కుమార్‌ గంధర్వ సంగీతం కూడా ఎక్కువ సేపు గుక్కపట్టలేకపోయినందువల్ల ఇదే పద్ధతిలో సాగేది.

రాగ ప్రస్తారం పోకడల గురించీ, నోరు పూర్తిగా తెరవకుండా మాటలను ఉచ్చరించే తమిళ (తంజావూరు) పద్ధతి గురించీ సంగీతరావుగారు ఆవేదన చెందుతారు. సాంప్రదాయం పేరుతో ఈనాడు చలామణీ అవుతున్న కర్ణాటక సంగీత పద్ధతులు కొన్ని ఆయనకు నచ్చనే నచ్చవు. సంగీతమంటే అయిష్టత లేని సగటు తెలుగువాడికి కర్ణాటక సంగీతంలో నచ్చని అంశాలలో ఇవీ ఉన్నాయి. అవసరమున్నా లేకపోయినా స్వరాలనూ, పదాలనూ అతిగా “రుబ్బడం” సంగీతరావు గారికీ నచ్చదు. అది తగ్గిస్తే కర్ణాటక గమకాలు అందరికీ వినసొంపుగానే ఉంటాయి. తన చిన్నతనంలో తోడి వంటి రాగాల ప్రస్తారం ఇప్పటికంటే భిన్నంగా ఉండేదని ఆయన అంటారు. అలాగే హిందోళం, నవరోజు, లలిత మొదలైన రాగాల్లో ఈనాటి లాగా శుద్ధ ధైవతానికి బదులు చతుశ్రుతి ధైవతం వాడే సంప్రదాయం ఉండేదట.

సంగీతరావుగారు చక్కని, గంభీరమైన కంఠంతో ఈనాటికీ రాగాలూ, కీర్తనలూ పాడి వినిపించగలరు. నోరు తెరిచి, స్పష్టమైన ఉచ్చారణతో, రాగ, సాహిత్య భావాలను మేళవించి, మనోధర్మం ఉట్టిపడేటట్టు, “జిడ్డు” అనిపించకుండా, హాయిగా కర్ణాటక సంగీతం పాడగలరు. రకరకాల శైలులను ఇమిటేట్‌ చెయ్యగలరు. ఎప్పుడు నేర్చుకున్నారో గాని, కూచిపూడి నాటకా లన్నిటికీ ఆర్కెస్ట్రాతో బాటు కూర్చుని వీణ వాయిస్తారు. హార్మోనియం మీద కర్ణాటక సంగీతం ప్రతిభావంతంగా వాయించగలరు.

రాగప్రధానమైన కర్ణాటక సంగీతపు కీర్తనలూ, కృతులలో మాత్రం సాహిత్యానిది ప్రధాన భూమిక కాదని సంగీతరావుగారి అభిప్రాయం. ఇతరత్రా అతి విశిష్టమైన సంగీతాన్ని అందిస్తున్న డా.బాలమురళీకృష్ణ సాహిత్యార్థం చెడకుండా పాడే ప్రయత్నం పూర్తిగా సఫలం కాజాలదని ఆయన అంటారు. త్యాగరాజువంటి వాగ్గేయకారులే తమ రచనలు కొన్నింటిలో సాహిత్యానికి చిన్న పీట వేసినప్పుడు గాయకులు చెయ్యగలిగింది ఏమీ లేదని ఆయన ఉద్దేశం. ఉదాహరణకు శరశర సమరైక శూర అనే కీర్తనలో పల్లవి తరవాత “శరశర సమరై” అన్నాక ఆపడం తప్పనిసరి అవుతుంది. గాయకుడు ఎవరైనా సరే కీర్తన పాఠం ఒకసారి అర్థవంతంగా పాడి వినిపించాక గమకాలూ, లయవిరుపులూ, స్వరాల గిరికీల వెల్లువలో సాహిత్యం మరుగుపడక తప్పదు. తెలుగు రాని గాయకుల ఉచ్చారణ దోషాలు ఇందుకు తోడైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఇది శ్రోతలకు, ముఖ్యంగా తెలుగువారికి కాస్త ఇబ్బందిగా అనిపించినా వారు సాహిత్యాన్ని అంతగా పట్టించుకోక రాగపరంగా కచేరీని ఆస్వాదించాలి. ఏ వీణ మీదనో అదే రచనను వినిపిస్తున్నప్పుడు వాద్యకారుడు తన మీటును బట్టీ, వాయిద్యపు అవసరాలను బట్టీ పదాలను ఇష్టం వచ్చినట్టు విరవడం కద్దు. అది వినేవారిని బాధించదు.

కూచిపూడి నృత్య నాటికలకి సంగీతం సమకూర్చినప్పుడు సాహిత్యాన్నీ, లయనీ, తాళాలనీ, రాగాలనీ భావయుక్తంగా సమన్వయం చేసి, దృశ్యరూపకంగా మలచడానికి సంగీతరావుగారికి అనేక అవకాశాలు కలిగాయి. వీటిలో యస్వీ భుజంగరాయశర్మగారి రచనల అందాలకు సంగీతరావుగారి మధురమైన సంగీతం మెరుగులు దిద్దింది. చినసత్యంగారి నాటకాలకు శ్రావ్యమైన సంగీతం ప్రధాన ఆకర్షణ అయింది. సంప్రదాయబద్ధంగా కర్ణాటక రాగాలనే కాక, అవసరమనిపించినప్పుడు బిలాస్‌ఖానీ తోడి మొదలైన హిందూస్తానీ రాగాలను ఉపయోగించడానికి కూడా సంగీతరావుగారు వెనకాడలేదు. అవి నాటకీయతను పెంచి, ప్రేక్షకులను బాగా అలరించాయి. నిజమైన సాంప్రదాయం తెలిసినవారు చేసే కొత్త ప్రయోగాలు ఎప్పుడూ నిర్దుష్టంగా, సంతృప్తికరంగా ఉంటాయి. అభినయంలో చినసత్యం సాధించిన విజయాలకు సంగీతరావుగారి స్వరరచన ఎంతగానో తోడ్పడినందువల్లనే ఆ నాటకాలు నేటికీ ప్రపంచమంతటా ప్రజాదరణ పొందుతున్నాయి. కూచిపూడి పద్ధతిలోనే శిక్షణ పొందిన ఇతరులు కొందరు స్వంతంగా చేసిన ప్రయోగాలేవీ అంత సంతృప్తికరంగా లేదన్నది అందరికీ తెలుసు. దీనికి కారణం తగినంత ఆథెంటిసిటీ లేకపోవడం కావచ్చు.

సంగీతరావుగారికి ఘంటసాల మీద సహజంగా చాలా గౌరవం ఉంది. చిరంజీవులు సినిమా ట్యూన్లు కొన్ని సి.ఆర్‌.సుబ్బరామన్‌ చేసినట్టుగా అనిపించాయని నేనంటే, కాదనీ, అవి ఘంటసాల స్వయంగా తన సమక్షంలోనే కంపోజ్‌ చేశారనీ సంగీతరావుగారు ధ్రువపరిచారు. రాజేశ్వరరావు, పెండ్యాలవంటి తక్కిన ప్రముఖ సంగీత దర్శకులలాగే ఘంటసాలగారి సంస్కారమూ, వ్యుత్పత్తీ సినిమా సంగీతంలో ప్రతిఫలించేదని ఆయన అన్నారు. రహస్యం సినిమాలో మల్లాదివారి రచనలకు ఘంటసాల అందించిన శాస్త్రీయ సంగీతానికి సంగీతరావుగారు చాలా సహకరించారు. సినిమా ఆర్థికంగా విజయం సాధించకపోయినా లలితభావ నిలయా అని సరస్వతి రాగంతో మొదలయే రాగమాలిక ఘంటసాల, లీల తదితరుల గళాల్లో చాలా అందంగా రూపుదిద్దుకుంది. సంగీతరావుగారికి తమిళనాడు ప్రభుత్వం కలై మామణి బిరుదునూ, టి.వి.కె.శాస్త్రిగారి సంస్థ లక్ష రూపాయల పారితోషికాన్నీ ఇవ్వడం ఆయన అభిమానులను చాలా సంతోషపెట్టింది. సంగీతరావుగారు తన జ్ఞాపకాలనూ, అనుభవాలనూ గ్రంథస్థం చేస్తున్నారు. అముద్రితమైన ఆ వివరాలలో కొన్నింటినైనా ఆయన అనుమతితో పాఠకులతో పంచుకోవలసిన అవసరం ఉంది.
-----------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, August 27, 2019

చిక్కడు, దొరకడు


చిక్కడు, దొరకడు




సాహితీమిత్రులారా!

నిరాద్‌ చంద్ర చౌదరి, రాజారావు ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ ఆంగ్ల రచయితలు. ఇద్దరూ పాత తరం రచయితలు. నిరాద్‌ బాబు 1999లో, తన నూట రెండవ ఏట పోయేరు. నూరేళ్ళు నిండుతున్న రాజారావు ఆష్టిన్‌ లో సోషల్‌ సెక్యూరిటీ ఆదాయం మీద జీవిస్తున్నారు. నిరాద్‌ చౌదరి రచనలు నిశితమైన దృష్టికి, పాండిత్యానికి పేరు పడ్డాయి. రాజారావు రచనల్లో కనిపించేది ముఖ్యంగా తాత్విక చింతన. ఇద్దరూ భారతీయ సంస్కృతిని గురించి, హైందవ ధర్మాన్ని గురించీ విస్తృతంగా చదువుకుని, ఆలోచించిన వాళ్ళు. ఈ చింతన వాళ్ళ రచనల్లో ప్రతిఫలిస్తుంది. నిరాద్‌ చౌదరి రాసిన పుస్తకాలు Autobiography of an Unknown Indian, Hinduism: A Religion to Live By అనేవి, రాజారావు రచనలు The Meaning of India, The Great Indian Way, Serpent and The Rope ఇందుకు కొన్ని ఉదాహరణలు. ఇద్దరికీ భారత దేశం అంటే, భారతీయ సమాజం అంటే ప్రేమ. అయితే, భారతీయత పట్ల నిరాద్‌ చౌదరి వైఖరి బౌద్ధికమైనది. ఒక పండితుడు, విమర్శకుడు కర్కశంగా నిష్పాక్షికంగా చేసే విశ్లేషణ. రాజారావు కు భారతీయత మీద ఉండే దృష్టి తాత్వికమైనది. ఒక కవి, యోగి, లేదా ఋషి ( mystic or sage ) ధ్యాస వంటిది.

నిరాద్‌ చౌదరి తన నూరవ ఏట రాసిన పుస్తకం Three Horsemen of the New Apocalypse ప్రపంచంలోకెల్లా వృద్ధుడైన రచయిత రాసిన పుస్తకం అని చెప్పుకుంటారు. ఆయన జీవించి ఉండగా తన రచనల వల్ల చాలా వివాదానికి గురి కావలసి వచ్చింది. ఆయన రచనల్లో ఆంగ్లేయుల పాలనని సమర్ధిస్తున్న ధోరణి, భారత దేశాన్ని విమర్శించటం భారతీయులకి రుచించలేదు. ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్శిటీ వాళ్ళు 1990 లో ఆయనకు గౌరవ డ్దాక్టరేట్‌ ఇచ్చి సత్కరించిన సందర్భంలో ఆయన గురించి : “ఈ బెంగాలీ మనిషికి బెంగాలీ కవిత్వం యూరోపియన్‌ కవిత్వమూ క్షుణ్ణంగా తెలుసు. తన నిశితమైన మేధస్సును ఉపయోగించి ఈయన భారతీయ సమాజాన్ని గురించి, సంస్కృతిని గురించీ మనకి అందించిన రచనలు మన సమాజాన్ని మనం అర్ధం చేసుకోడానికీ ఉపయోగపడ్డాయి. బ్రిటిష్‌ వాళ్ళు దేశాన్నొదిలి వెళ్ళిపోవడం, స్వతంత్ర భారత దేశం పుట్టుక ఈయన బేషరతుగా హర్షించలేకపోయేడు. భారతీయ సమాజాన్ని గురించి ఇతను వెలిబుచ్చిన అభిప్రాయాలు కఠినంగా, నిష్కర్షగా ఉండటం వల్ల ఈయన భారతీయులకు అభిమానపాత్రుడు కాలేక పోయేడు. కాని కాలం గడిచే కొద్దీ ఆ అపప్రధ పోతోంది” అన్నారు.

ఈ మధ్య Word As Mantra: The Art of Rajarao అనే పుస్తకం వచ్చింది. అంతకు ముందు రాజారావు రాసినవి The Meaning of India, The Great Indian Way వెలువడ్డాయి. ఈ పుస్తకాలు రాజారావును ఒక తాత్వికుడిగా, వేదాంతిగానూ ఆవిష్కరిస్తాయి. ఆయన తన కోసం తాను రాసుకుంటాడు, రాయటం ఒక సాధనగా రాసుకుంటాడు. “నేను పండితుణ్ణి కాను. సృజన చేసే రచయితని. చదరంగం బల్ల మీద ఏనుగులు, గుర్రాలు, శకటాలు, బంట్లతో ఆడి వినోదించినట్టు భావాలతో ఆడుకోవటం, అవి ఒకదాంతో మరొకటి పోటీలు పడి, ఓడీ గెలిచే క్రీడని చూసి ఆనందించటం నాకు ఇష్టం. ఈ ఆటకి నాతో రండి. ఆలోచనల చదరంగాన్ని బల్ల మీద చూసి, ఆ ఆటలోంచి వచ్చే రసాన్ని ఆస్వాదించడానికి, ఆనందించడానికీ.” అని పాఠకుల్ని హెచ్చరిస్తాడు.

ఏ పని చేసే వాళ్ళయినా ఏదో ఒక సందర్భంలో ఈ పని ఎందుకు చేస్తున్నామా అని ప్రశ్న వేసుకోవడం కద్దు. ఇలాటి ప్రశ్నలు కళా కారుల సంకల్పం ( motivation )తో ముడి పడి ఉంటాయి. సంకల్పం ఆంతరింగికం, చాలా వ్యక్తిగతమైన విషయం కాబట్టి, దీనికి సంబంధించిన ఇలాటి ప్రశ్నలు జటిలమైనవి. అర్జునుడు ఇదే ప్రశ్న అడిగితే శ్రీ కృష్ణుడు చెప్పిన జవాబే భగవద్గీత అంటారు. పాఠకులకి, విమర్శకులకీ ఈ ప్రశ్నకి జవాబు రాసే వాళ్ళ రచనల్లో, కళాకారుల కళా రూపాల్లోనూ కొంత వరకు గోచరిస్తుంది. అంటే, చదివితే చూస్తే వింటే తెలుస్తుంది. అయినా, రచయితలు, శాస్త్రవేత్తలు, కళా కారులు కొందరు ఈ ప్రశ్నకి తమకు తాముగా జవాబులు, సంజాయిషీలూ చెప్పుకోడం కూడా చూస్తాము. ఉదాహరణకి, A Mathematician’s Apology అని G. HL. Hardy (రామానుజం స్నేహితుడు)రాసిన పుస్తకం, ఇంకా “సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే” (త్యాగరాజు), “కవితా ఓ కవితా” (శ్రీ శ్రీ), “రోడ్లకు నమస్కారం” (అజంతా) వంటివి. ఈ ప్రశ్న తలెత్తిన తరువాత కూడా దాంతో సమాధాన పడలేకపోతే ఆ చేసే పని ఆగిపోవటం కూడా చూస్తాము. చలం రచనల్లో లాగ. రాజారావు, నిరాద్‌ చౌదరి కూడా ఎందుకు రాయాలీ అని తమల్ని తాము ప్రశ్నించుకున్నారు. ఏదో ఒక సందర్భంలో తమ రచనల్లోనో, ఇంటర్వ్యూల్లోనో ఆ ప్రశ్నకి జవాబు, సంజాయిషీ చెప్పుకున్నారు. ఈ వ్యాసంలో వాటి అనువాదాలున్నాయి.

మాట కాదు పాట: నిరాద్‌ చంద్ర చౌదరి
రచయితలు ఎందుకు రాస్తారు? రాయాలన్న బుద్ధి నీకెందుకు పుట్టింది అని తెలిసినవాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు. “వెళ్ళి నీకు వేటాడలన్న బుద్ధి ఎందుకు పుట్టింది అని ఓ పులిని అడిగి చూడండి” అని ఒక తలతిక్క సమాధానం ఇస్తాను. సరదాకి కాదు, నిజంగానే. ఏ రచయితా రాయాలీ అని నిర్ణయించుకుని రాయడని నా నమ్మకం. ఒక అణుచుకోలేని తృష్ణ వల్ల, రాయకుండా ఉండలేడు కాబట్టి, తప్పనిసరై రాస్తాడు.

ఇది అందరు రచయితలకీ ఒక్కలాగే ఉండదు. కొందరు వృత్తికి రచయితలు. ప్రవృత్తి వల్ల రచయితలు కొందరుంటారు. రాయటం ప్రవృత్తి, అంటే స్వభావంగా ఉన్న వాళ్ళని పట్టి చూస్తే తెలిసేది ఏమిటంటే, వాళ్ళకి రాయటానికి ఒక కారణం అంటూ ఏమీ ఉండదు. డబ్బు, పేరు, కీర్తి, లేక గుర్తింపు కోసం అని కాకుండా, వాళ్ళకి రాయాలని బుద్ధి పుట్టినప్పుడు రాయాలని అనిపించింది రాస్తారు. వృత్తి రచయితలకి ఇవన్నీ, లేకపోతే వీటిలో ఏదో ఒకటి కావాలి. అది ఉంటే గాని రాయలేరు. తెలివి తేటలుగా దాన్ని సంపాదించుకుంటారు. ఈ రచయితల గురించి నా అభిప్రాయం చెప్పటానికి బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర చటర్జీ చెప్పిన మాట సరిపోతుంది చూడండి. బంకిమ్‌ బాబు ఒక నవల్లో ఒక తిక్క శంకరయ్య పాత్రని సృష్టించేడు. ఇతను ఒక కోర్టు కేసులో సాక్ష్యం చెప్పటానికి వెళ్తాడు. వాది తరఫు వకీలు అతన్ని అడుగుతాడు : “ఏమండీ మీ వృత్తి ఏమిటి?” అని. అతను దానికి చాలా కోపగించుకుని “వృత్తా? వృత్తి పెట్టుకుని కూర్చోడానికి నేనేమన్నా సాందాన్నా ప్లీడర్నా?” అని కసురుకుంటాడు.

ఈ రెండు రకాలే కాదు. జంతు శాస్త్రంలో విభజించినట్టు రచయితల్ని సింహాలు, కుక్కలు, గుర్రాలు, గాడిదలూ ఇలాగ రక రకాలుగా విభజించుకోవచ్చు. నేను ఎలాటి జంతువునో నేను చెప్పను. నా పాఠకులకి విడిచి పెడుతున్నాను. కాని నేను ఎలాగ రాస్తానో, రచన అంటే నాకున్న అభిప్రాయం ఏమిటో మాత్రం చెప్పాలని ఉంది.

నేను ప్రవృత్తి రచయితని. రాయటం నా స్వభావం. నాకు బుద్ధి పుట్టినప్పుడు బుద్ధి పుట్టింది కాయితం మీద పెడతాను. అయితే ఇలా రాసిందాన్ని నేను, నా మేధస్సు సృష్టించిన సృజన అని మాత్రం ఎప్పుడూ అనుక్కోను. అంటే అవి నా ఆలోచనలు, అనుభూతుల ఫలితంగా సృష్టించినవని, అవి రాయటానికి కారణం నేననీ అనుక్కోను. రాయటం కోసం నా బుద్ధిని ఒక కెమేరా లాగ వాడతాను. దాన్ని ఫోకస్‌ చేసిన దృశ్యాల్ని అది ఫొటో నెగెటివ్‌ లాగ తీస్తుంది. ఆ నెగెటివ్‌ ని ఫొటో ప్రింటుగా డెవలప్‌ చెయ్యటం మాత్రమే నేను స్వయంగా చేసే పని. ఏదో ఫలితం ( effect) కోసం, ప్రయోజనం సాధించాలనీ నెగెటివ్‌ లో లేని వాటిని ఫొటోలోకి ఎంత మాత్రం చొరపడ నివ్వను.

మరి నేను రాసే పద్ధతిని గురించి. నా రాతలకి మూలమైన సూత్రం ఏమిటంటే, భాష అనేది ముఖ్యంగా వినడానికి ఉద్దేశించినది. చూసి చదవటానికి కాదు. అంచేత, రాయటం సంగీతాన్ని కూర్చటం వంటి పని అని నా నమ్మకం. రాసేటప్పుడు నేను ఒక వాగ్గేయ కారుడి లాగ ప్రవర్తిస్తాను. నేను రాసినదే మాట్లాడి చూస్తే ఎలా వినిపిస్తుందో చూసుకున్నాకే దాన్ని రాస్తాను.

ఇంగ్లీషు నేను ఆంగ్లేయుల దగ్గిర నేర్చుకోలేదు. ఇంగ్లీష్‌ వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు పెద్దవాణ్ణయ్యేక గాని తెలియ లేదు. నేను పుట్టింది కిషన్‌ గంజ్‌ అని ఓ పల్లెటూరు. అక్కడ బెంగాలీ టీచర్ల దగ్గిర నేర్చుకున్నాను ఇంగ్లీషు. తరవాత మెట్రిక్‌ చదువుతూ (19101914)మధ్య కలకత్తాలో నేర్చుకున్నాను. ఈ చదువుల వల్ల నాకు ఇంగ్లీష్‌ వాక్య నిర్మాణం, నుడికారం, మాటలు తగు మాత్రం తెలిసేయి. డిక్షనరీ చూసుకోకుండా చదివి విషయం అర్ధం చేసుకోవడం తెలిసింది. అయినా సరే, నా మొదటి పుస్తకం The Autobiography of an Unknown Indian రాస్తున్నప్పుడు (194748)చాలా ఆతృతగా ఉండేది. నేను రాసింది ఇంగ్లీష్‌ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లాగే ఉందా లేదా అని మధన పడేవాణ్ణి. అలా ఉంటే తప్ప నాకు నచ్చదు, ఇంగ్లీష్‌ పబ్లిషర్లు పుస్తకం వేసుకోరూ.

ఈ బెంగ పోవడానికి ఓ పద్ధతి కనిపెట్టేను. నేను రాసిన దాన్లోంచి ఒక పేరా గట్టిగా పైకి చదివటం. తరవాత ఇంగ్లీష్‌ లో ఏదైనా ఓ మంచి పుస్తకం లోంచి ఒక పేరా తీసి పైకే చదవటం. ఈ రెండు చదవటాలూ ఒక్క లాగే వినడానికి ఇంపుగా, ఎబ్బెట్టుగా లేకుండా ఉంటే నా రాత పరీక్ష గట్టెక్కినట్టే. ఇలాగ రక రకాల ఇంగ్లీష్‌ రచయితల వచనాన్ని పైకి చదివే వాణ్ణి. ఈ రచయితల వచనంలో లయ రక రకాలుగా ఉంటుంది. ఇంగ్లీష్‌ భాష ధ్వని ఇది అని ఒక్కటే ఏం లేదు. చదివితే అసలైన ఇంగ్లీష్‌ తూగు ఉందో లేదో నాకు తెలుస్తుంది.

ఈ పద్ధతి నాకు అచ్చొచ్చింది. ఇంగ్లండ్లో 1951 సెప్టెంబరు 8 న నా పుస్తకంలోంచి కొన్ని భాగాలు ఇఇఈ లో చదివి వినిపిస్తుంటే విని, “నేను రాస్తునప్పుడు నా మనస్సులో అనుకుని చదివినట్టే ఉంది” అని తృప్తి పడ్డాను. ఇలా వినికిడి ప్రకారం రాస్తూ ఉంటే వచనం రాయడం గురించి ఒక సంగతి బోధపడింది. రాసేటప్పుడు నా ఔద్వేగిక స్థితి ( mood) ని బట్టే నా రచన తూగు నడుస్తుంది. అంటే, రాసేటప్పుడు నేను మరీ ఉత్సాహంగానో, కోపంగానో ఉంటే నా రచన కూడా వడి వడిగా నడుస్తుంది, రౌద్రాన్ని చూపిస్తుంది. రాసేటప్పుడు నేను నెమ్మదిగా, సాత్వికంగా ఉంటే నా రచన నడక నింపాది గానూ, రసం సాత్వికంగానూ ఉంటాయి. అయితే ఈ పరిణామాలన్నీ అప్రయత్నంగా, అనుక్కోకుండా జరిగేవే. రంజింప చెయ్యాలి అనుకుని ప్రయత్న పూర్వకంగా చేసే రచనలు చదివితే తెలిసిపోతాయి, పాఠకుల్ని కదిలించలేవు.

నేను తెలుసుకున్న ఇంకో విషయం ఏమిటంటే, రచన వస్తువూ, రాసే శైలీ విడదీయలేనంతగా పెన వేసుకుని ఉంటాయి. ఇది వస్తువు, ఇది శైలి అని చెప్పడం అసాధ్యం. అందుకే సాహిత్యంలో మంచి శైలి వల్ల రాణించిన పనికిమాలిన వస్తువు అని కాని, శైలి బావుండక చెడిపోయిన మంచి వస్తువు అని కానీ ఏం ఉండవు. రూపాన్ని ఆస్వాదించే రస దృష్టి లేకపోవటం వల్లనో, వస్తువును అర్థం చేసుకునే శక్తి లేక పోవటం చేతో ఇలాటి సిద్ధాంతాల్ని ఆశ్రయిస్తాము. శైలే వస్తువు. రూపమే సారం.

ఈ వివరాలన్నీ నేను రాసే పద్ధతిని గురించి. కాని పద్ధతులన్నీ ఏదో ఒక గమ్యం కోసం వేసుకున్న తోవలు. నా పద్ధతులకి గమ్యం, నా రాతలకి పరమార్ధం ఏమిటి? ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా, రచయితగా నా జీవిత కాలం డబ్భై ఒక్క సంవత్సరాలు. చరిత్రలోనే మిక్కిలి పొడుగైన సాహితీ వ్యాసంగం నాది. ఈ డబ్భయ్యొక్క సంవత్సరాల్లోనూ పధ్నాలుగు పుస్తకాలు రాసేను, ఇంగ్లీష్‌ లోనూ, బెంగాలీ లోనూ. ఇంకా, వందలకొద్దీ వ్యాసాలు, రేడియో ప్రసంగాలూ రాసేను. రచయిత కంటే ఎక్కువగా పాత్రికేయుణ్ణా అనీ అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు? ఏ ప్రయోజనం కోసం? నా దేశ ప్రజలు ఈ ప్రశ్నకి వాళ్ళ సమాధానం ఏమిటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పనే చెప్పేరు. వాళ్ళ దృష్టిలో నేను, జీవితంలో ఓడిపోయి, నిరాశ పడి, ఆ దేశం మీద కక్ష కట్టి, వాళ్ళనీ, వాళ్ళ జీవితాల్నీ, సంస్కృతినీ, నాగరికతనీ వెక్కిరించటం కోసమే రచనలు చేసేను. ఈ మాటే రక రకాలుగా అన్నారు. వాళ్ళు అన్న ముక్క నేనెప్పుడూ వాచా ఖండించలేదు.

నా మొదటి రచన మీద నా దేశ ప్రజలకి అంత ద్వేషం ఎందుకో నాకు మొదట్లో అర్ధం కాలేదు. Sir John Squire నా రాత ప్రతి చదివినప్పుడే ఇలా అవుతుందని జోస్యం చెప్పేడు. “ఈ పుస్తకం కనక అచ్చు వేస్తే ఇండియాలో పెద్ద గొడవై పోతుంది. నిరాద్‌ చౌదరి ఇంగ్లండ్‌ వెళ్ళి తల దాచుకోవాలి… ” అని. అలాగే జరిగింది. ఎంతో ఆలోచించేక భారతీయులు అంతలా ఎందుకు కోపగించుకున్నారో అర్ధం చేసుకున్నాను. పుస్తకాన్ని “భారతదేశంలో ఆంగ్లేయుల పాలన స్మృతికి” అని అంకితం ఇచ్చేనని చాలా మందికి కోపం. దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేక. అది నిజానికి బ్రిటిష్‌ వాళ్ళ నిరంకుశత్వం మీద ప్రతిఘటన. నా తల్లితండ్రుల వ్యక్తిత్వాల్ని గురించి ఉన్నదున్నట్టు రాయడం నేను చేసిన రెండో తప్పు. భారత దేశంలో అమ్మా నాన్నల్ని గురించి, పెద్దవాళ్ళని గురించి పొగడ్తలే రాయాలి. చివరిగా, నేను రాసిన ఇంగ్లీషు అంత సులభంగా అర్ధం కాదు. నా మీద కోపానికి ఇది ఇంకో కారణం. అర్ధం కాని వాటిమీద చికాకే వేస్తుంది.

నన్ను విమర్శించే వాళ్ళకి నా చేతలతోనే జవాబు చెప్పేను. ఈ నాటికీ నా రాతల ద్వారా నా చుట్టూ జరిగే విషయాలతో మగ్నమౌతూనే ఉన్నాను. నా రచనే నేను చేసే పని. నేను రచనల పని వాణ్ణి. నేను చూసిన విషయాలు, అనుభవాలకి స్పందించి రాస్తూనే ఉన్నాను. ఈ మధ్య నా రచనల్లో సిద్ధాంత కర్తగా, ఛాందసునిగా మారుతున్నానని అన్నారు. ఈ మాట నేనే ఒప్పుకున్నాను. స్వభావో దురతిక్రమః అని అంగీకరిస్తున్నాను. నా చాదస్తానికీ పట్టింపుకీ ఏదో ఓ కారణం ఉంది. బైబిల్లో అన్నట్టు : “మీ దేహాల్ని నా ఆత్మతో స్పృశించి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. మీ పిల్లలు తరిస్తారు. మీ పెద్దలు కలలు కనటం నేర్చుకుంటారు. మీ యువకుల దృష్టి పదునెక్కుతుంది.”

అది. అంచేత నేను జర్నలిష్టుని కూడా కానని అనుకుంటాను. నేను ముఖ్యంగా ఒక బోధకుణ్ణి. “నా మేధస్సును జ్ఞానం కోసమే వాడుకున్నాను. జ్ఞానంతో తత్వానుభవంతో నా బుర్ర పండిపోయింది” అని అనుకున్నాను. నా అంచనాల్ని నా దేశ ప్రజలు నమ్మలేదు. ఇదంతా ఒట్టి వదరుడు లే అని కొట్టి పారేశారు. రూపంలో, స్థూల దృష్టికి అంతే కావచ్చు. కానీ, ఈ నా వాగుడులో నిజం లేకపోలేదు. ఆ ఉన్న నిజం తేటతెల్లం కాకపోలేదు. ధైర్యం మాట ఏమో గానీ నా రాతల్లో సాహసం లేకపోలేదు.

ఇక్కడితో నా రచనలకి నేనిచ్చుకుంటున్న సంజాయిషీ అయిపోయింది. ఈ నా నూరవ పుట్టినరోజు పూటా…..నవంబరు 23, 1996 న.

మాటే మంత్రము : రాజారావు ఇంటర్వ్యూ నుండి
మీరు ఎందుకు రాసేరు? రాయటం మీ వృత్తా, మీ ఆలోచనలూ అభిప్రాయాలూ పంచుకోడానికి ఒక త్రోవా, ధ్యానమా, లేక సమాజంలో మార్పు కోసం మీరు ఎంచుకున్న ఆయుధమా?

రాయటం నా ధర్మం. రచన ఒక సాధన. నేను రచయితని కావాలి అని ఆశించలేదు. దానంతట అదే వచ్చింది. అందుకే నేను చాలా తక్కువగా రాసేను. రాసిన పుస్తకాలు అనామకంగా ప్రచురించాలని అనుకున్నాను. కాని ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ఒప్పుకోలేదు. రాయటం నాకు ఒక రకమైన అర్చన (worship) వంటిది. అర్చకుడు అనామకంగా ఉండాలి.

మీరు ఇటీవల రాసిన పుస్తకం The Great Indian Way లో మీరు మళ్ళీ Kanthapuraలో ఆవిష్కరించిన నీతి, అంటే కర్మ ఆచరణ మార్గం వైపు మొగ్గినట్టు కనిపిస్తుంది.

Kanthapura కి వెనక్కి పోలేదు. The Great Indian Way కి వచ్చేను.

Kanthapura రాసిన ఇరవైఏళ్ళ తరవాత కదా Serpent and the Rope రాసేరు? ఈ ఇరవై ఏళ్ళల్లో మీలో కలిగిన మార్పులేమిటి?

ఎంతో కాలం ఎన్నో ప్రయాసలు పడ్డాక నా సద్గురువుని కలుసుకున్నాను. అక్కడితో నా స్వంత కధ ముగిసిపోయింది.

ఆ ఇరవై ఏళ్ళలోనే మన దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాటం ప్తూౖరె, ప్రజాస్వామ్యం ఫలవంతం కావటం కోసం తపన మొదలయ్యింది. ఈ మార్పు ప్రభావం మీ రచనల మీద ఉందా?

నేను మొదటి నుంచీ గాంధేయ వాదిని. సేవాగ్రాం లో ఆయనతో కొంత కాలం ఉన్నాను. కాని నా అన్వేషణ తాత్వికము, ధార్మికమైనది, రాజకీయమైనది కాదు. ఆ తరవాత కొంత కాలం రమణ మహర్షి దగ్గర గడిపేను. ఆయన మహాత్ముడు, కాని నా గురువు కాదు. కేరళలో శ్రీ ఆత్మానందను కలియటంతో నా అన్వేషణ పూర్తయింది. నేను వెతుక్కున్నదీ అంతకు మించినదీ నాకు దొరికింది.

మీ రచనలు హైందవ ధర్మాన్ని గురించే అని అనుకుంటారు. మరి మీ రచనల్లో మార్క్సిజం గురించీ ఇతర మతాల్ని గురించీ చెప్పిన విషయాల సంగతి?

నాకు తారసిల్లిన, నేను దర్శించిన సత్యాన్నే అన్వేషించేను.

మీరు వివిధ మతాల మధ్య ఉన్న సంబంధాల్ని విస్మరించినట్టు అనిపిస్తుంది?

నా పని సత్యాన్ని కాంక్షించటం. పరమార్ధికమైన, నిరపేక్షమైన సత్యానికి తోవ వెదుక్కోవటం.

The Great Indian Way లో మళ్ళీ గాంధీజీ చెప్పిన మత పరమైన, ధర్మ బద్ధమైన ఆచరణ మార్గాన్ని, మతానికి ఉన్న సాంఘిక పార్శ్వాన్నీ నొక్కి చెప్తున్నారు. Kanthapura తర్వాత మళ్ళీ కొత్తగా ఆచరణ మార్గం మీద ఈ ఆపేక్ష ఏమిటి?

నాకు సాంఘిక సమస్యల మీద ఆసక్తి లేదు. రాయటం నాకు ఒక తపస్సు. నేను సత్యాన్ని అర్చించే ఒక మామూలు ఉపాసకుణ్ణి.

Salman Rushdie, Shashi Tharoor, Arundhati Roy వంటి రచయితలతో మీ సంబంధం గురించి చెప్తారా?

వాళ్ళ రచనలు ఎప్పుడూ చదవలేదు.

రాజకీయ ధర్మం (political correctness ) సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగం కాదా?

రాజకీయాలకి సాహిత్యంతో ఎలాటి సంబంధం ఉండకూడదు. శబ్ద బ్రహ్మను ఆరాధించటమే రచయిత, కవి విధి.
-----------------------------------------------------------------------------------------------------------------------
(మూలాలు : N.U. Abhilash, V.K. Shashikumar, Nirad Choudhuri, Rajarao, Sudhir Kumar, Kathleen Raine వెల్చేరు నారాయణ రావు గారికి కృతజ్ఞతలు.)
-----------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Sunday, August 25, 2019

హా (స్యం) సం (గీతం)


హా (స్యం) సం (గీతం)




సాహితీమిత్రులారా!

మిత్రులు ఎం.బి.ఎస్‌.ప్రసాద్‌ తదితరులు మొదలుపెట్టిన పక్షపత్రిక పేరును టైట్‌ల్‌గా వాడుకున్నందుకు అందరూ క్షమించాలి. శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యంగా సీరియస్‌ వ్యవహారం. అయినా అందులో కూడా కొన్ని జోకులూ, ఛలోక్తులూ ఉంటూనే ఉంటాయి. వాటిలో చిరునవ్వు తెప్పించేవి కొన్నిటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.

అభ్యర్థన
1960లో ప్రఖ్యాత సరోద్‌ విద్వాంసుడు (నేటి సరోద్‌ నిపుణుడైన అంజద్‌ అలీ తండ్రి) ఉస్తాద్‌ హాఫిజ్‌ అలీఖాన్‌గారికి పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. ఆ సందర్భంలో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఆయనతో మాట్లాడుతూ “ప్రభుత్వం తరఫున మేము మీకోసం చెయ్యగలిగినదేమైనా ఉందా?” అని అడిగారట. అందుకా ఉస్తాద్‌గారు “అయ్యా, మీరు దేశానికి అధిపతికదా, నాకైతే ఏమీ అక్కర్లేదు కాని మా దర్బారీకానడ రాగాన్ని కాపాడేందుకేదైనా చట్టాన్ని ప్రవేశపెట్టండి. ప్రతివారూ దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వినిపించి నాశనం చేస్తున్నారు” అన్నాడట అమాయకంగా.


హాఫిజ్‌ అలీ ఖాన్‌

ముఖపరిచయం
వీణ విద్వాంసుడు చిట్టిబాబుగారు చెప్పిన విషయం. ఒకరోజు చిట్టిబాబుగారింటి డోర్‌బెల్‌ మోగింది. తలుపు తెరిచిన చిట్టిబాబుకు ఎవరో అపరిచితవ్యక్తి కనిపించాడు. అతను “చిట్టిబాబుగారి ఇల్లు ఇదేనా?” అని అడిగాడు.

“అవును”

“ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారా?”

“ఆ, ఉన్నారు”

“ఆయన్నొకసారి పిలుస్తారా?”

“నేనే చిట్టిబాబును”

“సార్‌, నేను గుర్తున్నానా?”

కోయలకు తుపాకీగుండు
చిట్టిబాబు వాయించిన మొదటి లాంగ్‌ప్లే రికార్డులో చివరిది కొమ్మలో కోయిలా అనే ఎంకిపాట. మాండ్‌ రాగంలో తాను స్వరపరచిన ఆ పాట గురించి చెపుతూ చిట్టిబాబు “నా కోయిలను మృదంగం వాయించిన వెల్లూర్‌ రామభద్రన్‌ తుపాకీతో కాల్చేశాడయ్యా” అన్నారు. నిజంగానే పాట ముగిసేటప్పుడు వీణ శబ్దం ఆగగానే మృదంగం దెబ్బ తుపాకీ మోతలాగే వినిపిస్తుంది!అదే రికార్డులో ఆడేవు పాడేవు అని సింధుభైరవి రాగంలో ఒక పాట ఉంది. దానికి రచయిత రంగారావు (చిట్టిబాబు తండ్రి) అని ఉంది. అదేం పాట అని అడిగితే, “పాటాలేదు, ఏం లేదు, ఊరికే ట్యూన్‌ కట్టాను. వీలున్నప్పుడు ఆరుద్రగారి చేత రాయించాలి” అన్నారు చిట్టిబాబు!

ప్రాప్తం, ప్రారబ్ధం
ఎస్‌.బాలచందర్‌ వీణ స్టైలు కొందరికి నచ్చదు. అలాంటివారిలో మృదంగ విద్వాంసుడు ఉపేంద్రన్‌ కూడా ఉన్నారు. ఆయనెప్పుడూ ప్రతిదానికీ ప్రాప్తం, ప్రారబ్ధం అంటూ ఉండేవాడు. ఆయనొకసారి సంగీత కచేరీలకని సోవియట్‌ రష్యా తదితర దేశాలకు వెళ్ళాడు. అది ఆయన లెక్కన ప్రాప్తం. బాలచందర్‌తో బాటు వెళ్ళవలసిరావడం ప్రారబ్ధం!



హ్యూమర్‌ ఎట్‌ అయ్యర్‌ లెవెల్‌
మైసూర్‌ వాసుదేవాచార్య సునాదవినోదిని రాగంలో రచించిన దేవాదిదేవ అనే కీర్తన బాలమురళీకృష్ణ ద్వారా బాగా పాప్యులర్‌ అయింది. మహారాజపురం విశ్వనాథాయ్యర్‌వంటి గొప్ప విద్వాంసులకు కూడా అదంటే ఇష్టం. ఒకసారి అయ్యర్‌గారి ఎదుట ఎవరో కుర్రగాయకుడు ఆ కీర్తన పాడి ఎలా ఉందని అడిగాట్ట. ఆయన తడుముకోకుండా “బాలమురళి పాడినా సునాదమా ఇరుక్కు. నీ పాడినా వినోదమా ఇరుక్కు” అన్నాట్ట. (దీనికి అనువాదం అనవసరం!)


మహారాజపురం విశ్వనాథ అయ్యర్‌విశ్వనాథాయ్యర్‌గారి ఛలోక్తులు ఆ రోజుల్లో ప్రసిద్ధమైనవిగా ఉండేవి. ఆయన ఒక కచేరీలో ఏదో కీర్తన పాడుతూ చరణం మరిచిపోయాడట. ఆయన కుమారుడైన మహారాజపురం సంతానం వెనకనుంచి అందిస్తూ ఉంటే ఆయన అందరికీ వినబడేట్టుగానే ప్రేక్షకులని చూపిస్తూ “నేను పాడకపోయనా వీళ్ళకి తెలియదా ఏమిటి?” అన్నాట్ట. ఇంకొక సందర్భంలో తన శిష్యుడైన సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్‌ కచేరీ గురించి ఎవరినో అడిగితే “ఆయన పాడుతున్నంతసేపూ ఒక చెవి మూసుకునే ఉన్నాడు” అన్నారట. “వినేవాళ్ళకంటే ముందుగా తానే మూసుకున్నాడన్నమాట” అన్నాట్ట అయ్యర్‌గారు.

ప్రముఖ వయొలిన్‌ విద్వాంసుడు ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్‌కు మాటిమాటికీ తారస్థాయిలో స్వరాలు పలికించే అలవాటుండేది. అందుకుగాను ఎడమచేతి వేళ్ళు వయొలిన్‌ బ్రిడ్జికి దగ్గరగా వెళుతూ ఉండేవి. తనకు పక్కవాద్యం వాయిస్తున్నప్పుడు ఈ ధోరణిని గమనించిన విశ్వనాథ అయ్యర్‌గారు “గోపాలా, జాగ్రత్త, బ్రిడ్జిమీది కెళుతున్నావు. పడిపోగలవు” అన్నాట్ట.



కొన్ని జోకులు విశ్వనాథాయ్యర్‌గారికి తెలియకుండానే పేలేవి. వయసు మళ్ళాక ఆయనకు కదులుతున్న రైలుపెట్టెలో నడవాలంటే భయంగా ఉండేదట. ప్రయాణంలో ఒకరాత్రివేళ ఆయన టాయిలెట్‌కు వెళ్ళవలసి ఉండి శిష్యులను లేపబోతే నిద్రలో ఉండి ఒక్కడూ పలకలేదట. అయ్యర్‌గారు మర్నాడు పొద్దున్నే వాళ్ళమీద విసుక్కున్నాట్ట. “నిద్రమత్తు మొహాల్లారా. రాత్రి ఒంటేలుకు పోవాలిరా అని పిలిస్తే ఒక్కడూ నోరు తెరవడే?”

ప్రియమైన సంగీతం
ప్రసిద్ధ సితార్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ విలాయత్‌ఖాన్‌ చెప్పినది. సంగీతప్రియుడైన ఒకానొక నవాబుగారు తన ఇంట్లో రాత్రంతా సంగీత కచేరీలు ఏర్పాటు చేసి అందులో పాల్గొన్న సంగీత విద్వాంసులకు వెళ్ళిపోయే ముందు ఈనాములు ఇచ్చి పంపేవాడట. అలా తన ముందుకు వచ్చిన ఒక వ్యక్తిని నవాబుగారు గుర్తుపట్టలేకపోయాడట. “జీ హుజూర్‌, తమకు గుర్తులేదేమో, నిన్న సాయంత్రం మొదటగా పాడినది నేనే. ఫలానా రాగం పాడాను” అని చెప్పుకున్నాట్ట ఆ వ్యక్తి. నవాబుగారు ముఖం చిట్లించి “ఆ, ఆ, గుర్తుకొస్తోంది, అబ్బెబ్బే అదేం ఆలాపన? ఆ నిషాదాన్ని అలాగేనా ప్రయోగించేది?” అన్నాట్ట కోపంగా. దానికా గాయకుడు భయపడుతూ “ఏలినవారు నా తప్పు క్షమించాలి. పోనీ ఆ ఒక్క నిషాదానికి కాస్త డబ్బు కోసేసి తక్కిన దిప్పించండి” అన్నాట్ట వినయంగా.


అప్రాచ్యపు వెధవలు
బెనారెస్‌కు చెందిన ప్రఖ్యాత గాయని సిద్ధేశ్వరీదేవికి సనాతన ఆచారాలెక్కువ. వయసుమళ్ళిన తరవాత ఆవిడ మొదటిసారిగా కచేరీలకని ఇంగ్లండ్‌ వెళ్ళిందట. అక్కడ టాయిలెట్‌లో చెంబూ, నీళ్ళూ లేవంటే ఆవిడకు మొదట్లో అర్థం కాలేదట. ఎవరో ఆవిడకు టాయిలెట్‌ పేపర్‌ సంగతి చెపితే శివశివా అని చెవులు మూసుకుందట. కొన్ని శతాబ్దాలపాటు అక్కడివారంతా అలాగే జీవిస్తున్నారన్న సంగతి ఆవిడ జీర్ణించుకోలేకపోయిందట. మర్నాడు కచేరీలో తన ఎదుట వినడానికి కూర్చున్న తెల్లవాళ్ళంతా ఎన్నో ఏళ్ళనుంచీ ఆపనే చేస్తున్నారన్న ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి సరిగ్గా పాడలేకపోయిందట !

మాటకు మాట
ఆజానుబాహుడై మంచి విగ్రహపుష్ఠి కలిగిన ఆదిభట్ల నారాయణదాసుగారితో ఒకసారి విజయనగరం మహారాజా పరిహాసంగా “సంగీతవృషభు లెక్కడికో బయలుదేరినట్టున్నారు?” అన్నాడట. “ఇంకెక్కడికి, కామధేనువువంటి తమవద్దకే” అని జవాబిచ్చాడట దాసుగారు.

మాటకారి, పాటకారి
ప్రసిద్ధ కర్ణాటక గాయకుడైన చెంబై వైద్యనాథ భాగవతార్‌గారికి తన కచేరీల్లో చిలిపిచేష్టలు చెయ్యడం అలవాటు. ఒకసారి ఆయనకు లాల్గుడి జయరామన్‌ వయొలిన్‌, ఉమయాళ్పురం శివరామన్‌ మృదంగం వాయస్తున్నారట. హుసేని రాగంలో “రామా నిన్నే నిజముగా నమ్మినాను సీతారామా” అని పాడుతూ ఒక్కొక్కసారి వయొలినిస్ట్‌ను చూపుతూ “జయరామా నిన్నే నమ్మినాను” అనీ, మృదంగంకేసి చూపుతూ “శివరామా నిన్నే నమ్మినాను” అనీ పాడారట.


ఒక కచేరీలో స్థూలకాయుడైన చెంబై మైక్ను దగ్గరగా జరుపుకుందామంటే వైర్‌ పొట్టిదయందిట. అది గమనించిన చెంబై “వైర్‌ సరిగ్గానే ఉంది. నా “వయరే” అంటే బొజ్జ పెద్దది” అన్నాట్ట. మరొక సందర్భంలో హిందూస్తానీ గాయని పర్వీన్‌ సుల్తానా మద్రాసులో పాడిన కచేరీలో ఉపన్యసిస్తూ చెంబై “నా శారీరం గొప్పదంటారు. ఈమె శారీరం, శరీరం కూడా గొప్పవే” అన్నాట్ట అప్పట్లో ఆకర్షణీయంగా కనబడుతున్న పర్వీన్ను చూపిస్తూ.

అపశ్రుతులు
బాలమురళీకృష్ణగారికి జోడైన వయొలిన్‌ విద్వాంసుడు దొరకడం కష్టంగా ఉండేది. ఒక కచేరీలో ఆయన మధ్యమావతి రాగం ఎత్తుకోగానే ఎవరో వయొలిన్‌ వాయిస్తూ శుద్ధమధ్యమానికి బదులుగా పొరపాటున ప్రతిమధ్యమం వాయించాడట. ఇదేదో తమాషాగా ఉందే అనిపించి మురళిగారు అప్పటికప్పుడు తానుకూడా అలాగే చేసి సమయస్ఫూర్తితో కొత్త రాగాన్ని కొనసాగించాడట. తరవాత ఎవరో వచ్చి ఈ రాగం పేరేమిటి అని అడగగానే తడుముకోకుండా ప్రతిమధ్యమావతి అని జవాబిచ్చాడట. ఈ రాగంలో ఆయన పాడిన భజరే యదునాథం అనే సదాశివబ్రహ్మేంద్ర కీర్తన వినడానికి చాలా బాగుంటుంది.

చైన్నెలో బాలమురళిగారి ఇల్లు మ్యూజిక్‌ అకాడమీ హాలుకు వెనకాలే ఉంటుంది. అది తెలిసిన సభ నిర్వాహకులు ఇల్లు కట్టుకున్న కొత్తలో ఆయనతో వెటకారంగా “మొత్తం మీద మా వెనకే చేరారే?” అన్నారట. అందుకాయన “చూడ్డానికి మీ హాలు ముందునుంచీ, పక్కలనుంచీకూడా బాగాలేదు. వెనకనించి చూడ్డమే నయమనుకున్నాను” అన్నారట. నిజంగానే ఆ భవనం చూడటానికి బావుండేదికాదు.


అల్లిక జిగిబిగి
బొంబాయిలో నేను హాజరయిన ఒక లెక్చర్‌ డెమాన్‌స్ట్రేషన్‌లో రవిశంకర్‌ భారతీయ శాస్త్రీయ సంగీతం గురించి వివరిస్తూ ముందు వరసలో ఏదో అల్లుతూ కూర్చున్న ఒక గొప్పింటి ఆడపడుచును గమనించి ఇలా అన్నాడు. “మిమ్మల్ని కించపరచాలని కాదుగాని తొలిరోజుల్లో నా సితార్‌ కచేరీల్లో ఇలా నిటింగ్‌ చేస్తూనో, కబుర్లు చెపుతూనో కూర్చున్నవారు మన సంగీతాన్ని పరోక్షంగా అవమానపరుస్తున్నారనే భావనవల్లే నేను కళ్ళుమూసుకుని వాయించడం అలవాటు చేసుకున్నాను. సంగీతాన్ని భక్తిశ్రద్ధలతో వినాలి”


దుంపతెగా ఏం కంఠం!
ఒకసారి ఉస్తాద్‌ బడేగులాం అలీఖాన్‌గారిని కలుసుకోవడానికి ఎవరో వెళితే ఆయన రేడియోలో లతా మంగేశ్కర్‌ పాటను శ్రద్ధగా వింటూ కనిపించాట్ట. వచ్చినాయన అదేమిటని ఆశ్చర్యపోగా “ఏమీ లేదు, చాలాసేపుగా వింటున్నాను. దాని దుంపతెగ, ఒక్క అపస్వరం కూడా పాడదయ్యా” అన్నాట్ట ఉస్తాద్‌గారు.

అలాగే ప్రఖ్యాత గజల్‌ గాయని బేగం అఖ్తర్‌తో మరొక గాయని రసూలన్‌బాయి ఇలా అన్నదట. “నువ్వెవరినైనా తిడుతున్నప్పుడు కూడా వాళ్ళు నీ గొంతు విని మెచ్చుకుంటారు”

ధ్వన్యనుకరణ
ప్రముఖ కర్ణాటక గాయకుడు మదురై మణీయ్యర్‌ మామూలుగా తదరినన్నా మొదలైనవి కాకుండా రకరకాల ధ్వనులు ఉపయోగించేవారు. అందులో దాదాపు అన్ని అచ్చులూ, హల్లులూ పలికేవి. ఒకసారి ఆయన పాడుతూ “టుట్టుట్టు” అని ఉచ్చరించారట. వయొలిన్‌ పక్కవాద్యం వాయిస్తున్న చౌడయ్యగారు వెంటనే తన కమాను కింద పెట్టేసి వేలితో తీగలు మీటుతూ ఆ ధ్వనిని అనుకరించారట.


పొట్టకోసం
మా గురువుగారు (సితార్‌, సుర్‌బహార్‌ విద్వాంసుడు) ఉస్తాద్‌ ఇమ్రత్‌ఖాన్‌గారి కొడుకులు నలుగురూ ఉత్తమశ్రేణి సంగీతకారులే. ఒక కచేరీకి ముందుగా గ్రీన్‌రూంలో కూర్చుని ఉన్నప్పుడు ఉస్తాద్‌గారికి తెలిసినాయన వచ్చి పలకరించాడు. అతనికి శాస్త్రీయసంగీతంతో పెద్దగా పరిచయం లేదని మాటలనిబట్టి తెలిసింది. మాటల సందర్భంలో ఉస్తాద్‌గారు తన కొడుకులందరూ సంగీతం ఫీల్డ్‌లోనే ఉన్నారని అన్నాడు. వచ్చినతను కాస్త జాలిగా “అందరూనా?” అన్నాడు. దానికి ఇమ్రత్‌ ఖాన్‌ “ఏం చేస్తాం? వాళ్ళకి చదువులూ ఏమంత గొప్పగా అబ్బలేదు. చూడ్డానికి హీరోల్లా ఉంటే సినిమాల్లోనైనా వేషాలొచ్చేవి. అందుకని అందర్నీ సంగీతంలోనే పెట్టవలిసొచ్చింది” అన్నారు. మేము చాటుగా నవ్వుకున్నాంగాని వచ్చినతనికి వ్యంగ్యం అర్థం కాలేదు

ముఖ మురళి
ఈల ద్వారా కర్ణాటక, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని సమర్థవంతంగా వినిపించగల ప్రముఖ కళాకారుడు శివప్రసాద్‌ రేడియోలో ప్రోగ్రాం ఇస్తానంటే అక్కడి అధికారులు “ముందు మీ సంగీతం గాత్రమో, వాయిద్యమో చెప్పండి. మూడోదానికి మేము అవకాశం ఇవ్వలేము” అన్నారట!


సినీశాస్త్రి
సంగీతంలో బి.ఏ. కోర్సుకు అప్లై చేసినవారిని ముందుగా పరీక్షించేందుకు ఒక విద్వాంసుడు వచ్చాడట. ఒక విద్యార్థిని నీ కిష్టంవచ్చిన కీర్తన ఏదైనా పాడమని అడగగా విద్యార్థి రాగం తానం పల్లవి పాడతానన్నాట్ట. విద్వాంసుడు పరమానందభరితుడై సరే కానిమ్మన్నాడట. వెంటనే విద్యార్థి శంకరాభరణం సినిమా పాట ఎత్తుకున్నాడట.
----------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Friday, August 23, 2019

చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు


చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు


సాహితీ మిత్రులకు శ్రేయోభిలాషులకు
 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు




చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్రాడు పట్టు దట్టి
సందెతాయెతులును సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు

Thursday, August 22, 2019

తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్‌ థిరక్వా


తబలా “మాంత్రికుడు” అహ్మద్‌జాన్‌ థిరక్వా




సాహితీమిత్రులారా!

1974లోనో, 75లోనో సరిగ్గా గుర్తులేదు కాని బొంబాయిలో తేజ్‌పాల్‌ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్‌ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్‌ అహ్మద్‌జాన్‌ థిరక్వా తబలా సోలో కచేరీ జరిగింది. అప్పుడాయన వయస్సు 97 సంవత్సరాలు. సన్నగా, పొడుగ్గా, పొడుగాటి అచ్‌కన్‌ కోటు తొడుక్కుని, పైజమా, తలమీద టోపీతో ఇద్దరు నడిపించుకు రాగా వయోవృద్ధుడైన ఉస్తాద్‌గారు నెమ్మదిగా స్టేజిమీద కూర్చున్నాడు. మొదట్లో తన రెండు చేతులూ అతి కష్టం మీద తబలా, డగ్గాల మీదికి చేర్చినట్టు అనిపించినా, ఆ తరవాత విలంబిత్‌ తీన్‌తాల్‌లో తబలా విన్యాసం సునాయాసంగా మొదలయింది.పాత సంప్రదాయాన్ని అనుసరించి వాయిస్తున్నప్పుడు మధ్యలో కొనుగోలు పద్ధతిలో ఆయన బోల్‌లు నోటితో పలికి వినిపించాడు.

ఎందరో తబలా విద్వాంసులు తమ తమ బాణీల్లో అద్భుతంగా వాయిస్తారు కాని థిరక్వా శైలిలో ఒక ప్రత్యేకమైన పరిపూర్ణత, గాంభీర్యం, నిండుతనం ఉండేవి. దశాబ్దాలుగా, ఆరేడు తరాల సంగీతజ్ఞులతో తలపండిన అనుభవం, మారుతున్న అభిరుచులతో రాజీలేని శాస్త్రీయ ధోరణి, శాశ్వతమైన విలువలని ప్రతిబింబించే సంగీత వైఖరి ఇలాంటి లక్షణాలన్నీ ఆ నాటి కచేరీలో కనిపించాయి. దశాబ్దాల క్రితమే కాలంచేసిన మహోన్నత గాయకు లెందరికో పక్క వాయిద్యం వాయించిన థిరక్వాను కళ్ళారా చూసి, ఆయన తబలా వినగలిగినందుకు ఈ రచయితతో బాటు ప్రేక్షకులందరూ థ్రిల్‌ అయారు. కచేరీ తరవాత ఆటోగ్రాఫ్‌ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యి చాలా వణికిందిగాని తబలా వాయిస్తున్నప్పుడు మాత్రం ముసలితనం అడ్డురాలేదు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో ఒక సంగీతకారుల కుటుంబంలో జన్మించిన థిరక్వా మొదట్లో ఉస్తాద్‌ మిఠ్ఠూఖాన్‌ అనే అతనివద్ద గాత్రసంగీతం నేర్చుకున్నాడు. సంగీతజ్ఞుడైన తన తండ్రి హుసేన్‌బక్ష్‌ వద్ద కొంత సారంగీ కూడా అభ్యసించాడు. మేరఠ్‌కు చెందిన ఉస్తాద్‌ మునీర్‌ఖాన్‌ తబలా వాయించడం విన్నాక అతనికి తబలామీద ఆసక్తి కలిగింది. మొదట తన బంధువులైన షేర్‌ఖాన్‌, ఫయ్యాజ్‌ఖాన్‌, బష్వాఖాన్‌ తదితరుల వద్ద అతను తబలా నేర్చుకున్నాక, తన పన్నెండో ఏట మునీర్‌ఖాన్‌ శిష్యుడుగా చేరాడు. మధ్య మధ్యలో అరగంట విశ్రాంతి తీసుకుంటూ, ప్రతిరోజూ సుమారు 16 గంటలపాటు తబలా సాధన చేశాడు. తన సోదరుడు మియాఁజాన్‌ సంరక్షణలో పెరిగిన అహ్మద్‌జాన్‌ రోజుకు గట్టిగా ఆరుగంటలు కూడా నిద్రపోకుండా, పాలు తాగుతూ, పుష్టికరమైన ఆహారం తింటూ, సంగీతానికై ఎంతగా శ్రమిస్తున్నా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. సంగీతం తప్ప మరే చింతలూ లేకుండా ఆయన తన యవ్వనమంతా గడిపాడు. ఆరోగ్యంపట్ల ఉన్న క్రమశిక్షణే ఆయనకు తొంభై ఏళ్ళు దాటినా అద్భుతమైన సంగీతం వినిపించడానికి తోడ్పడింది. అలా జాగ్రత్త పడని బడేగులాం వంటి మహాగాయకులు 60 దాటగానే పక్షవాతం వగైరా రుగ్మతలకు లోనై, త్వరలోనే కాలం చేశారనేది తెలిసినదే.

యువకళాకారుడు అహ్మద్‌జాన్‌ థిరక్వా

చిన్నవయసులోనే అహ్మద్‌జాన్‌ శ్రద్ధగా సాధన చేసే వైఖరీ, నైపుణ్యమూ కారణంగా అతను మునీర్‌ఖాన్‌కు ప్రియశిష్యుడైపోయాడు. అతని వాయింపును గమనిస్తున్న మునీర్‌ఖాన్‌ తండ్రి కాలేఖాన్‌కు అతని వేళ్ళు తబలా మీద కథక్‌నాట్యం చేస్తున్నట్టుగా అనిపించాయి. ఆ విధంగా అతనికి థిరక్వా అనే పేరు వచ్చింది. థిరక్వాది ఫరూఖాబాద్‌ సంప్రదాయానికి చెందిన లాలియానా బాణీ. ఈ శైలిలో వాయించే ఇతర తబలా కళాకారుల్లో అమీర్‌హుసేన్‌, (బడే గులాం అలీ ఖాన్‌, విలాయత్‌ఖాన్‌ తదితరులకు పక్క వాయిద్యం వాయించిన) నిజాముద్దీన్‌, గులాం హుసేన్‌, షమ్సుద్దీన్‌, నిఖిల్‌ఘోష్‌, గులాం రసూల్‌, నాగేశ్కర్‌ మొదలైనవారున్నారు.

తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ అహ్మద్‌జాన్‌ థిరక్వా

పదహారో ఏట అహ్మద్‌జాన్‌ థిరక్వా బొంబాయిలో తొలిసారి కచేరీ చేసి పేరు సంపాదించుకున్నాడు. సుప్రసిద్ధ మరాఠీ నట గాయకుడు బాలగంధర్వ కంపెనీలో కూడా అతను తబలా వాయించి అందరి మెప్పునూ పొందాడు. త్వరలోనే అతని ఖ్యాతి ఉత్తరభారతం అంతటా పెరిగింది. అతను ఎంతసేపు వాయించినా వినేవారు ముగ్ధులై వింటూ ఉండిపోయేవారు. 1936లో అతన్ని రామ్‌పూర్‌ సంస్థానం దర్బారులో చేర్చుకున్నారు. రామ్‌పూర్‌ నవాబు రజా అలీఖాన్‌ మీద గౌరవం కొద్దీ నవాబుగారు చిడతలూ, గజ్జెలూ వాయించినప్పుడల్లా అతని వెంట థిరక్వా తబలా వాయించేవాడట! అక్కడ 30 ఏళ్ళపాటు అతను ఎందరో ప్రసిద్ధులకు తబలా సహకారం అందించాడు. ఆ తరవాత సంస్థానాలన్నీ రద్దయాక థిరక్వా లక్నోలోని భాత్‌ఖండే సంగీత కళాశాలలో తబలా విభాగానికి అధిపతిగా పనిచేసి, రిటైర్‌ అయిన తరవాత కూడా ఆ సంస్థకు సహకరిస్తూ వచ్చాడు.

దీర్ఘాయుష్షుతో అనేక దశాబ్దాలు సంగీతం వినిపించిన థిరక్వా రెండు యుగాలకు వారధిగా నిలిచాడు. మొదట సంగీత పోషకులుగా ఉండిన రాజాలు,నవాబుల ఆదరాన్ని చవిచూసిన ఈ విద్వాంసుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్యయుగంలో ప్రభుత్వం ద్వారా రేడియోలోనూ, పెద్ద సిటీల్లో మధ్యతరగతి సంగీతప్రియులు టికెట్లు కొని హాజరయే పబ్లిక్‌ సంగీత కచేరీల్లో లభించే విశేష ప్రజాదరణను కూడా పొందగలిగాడు. ఈ మార్పు ఆయనకు ఏమాత్రమూ ఇబ్బంది కలిగించకపోగా దానివల్ల ఆయన సంగీతానికి మరింత విస్తృతమైన ఖ్యాతి లభించింది. గొప్ప సంగీతజ్ఞానమూ,చెక్కుచెదరని గాంభీర్యమూ ఆయనకు సంగీతవృత్తిలో పేరుతెచ్చాయి.

ఆయన ప్రధానంగా సోలో కచేరీలే చేసినప్పటికీ, పాతతరం విద్వాంసులు అనేకమందికి తబలా సహకారం అందించాడు. వారిలో అల్లాబందే ఖాన్‌,రజబ్‌అలీఖాన్‌, అల్లాదియాఖాన్‌, వహీద్‌ఖాన్‌, అల్లాఉద్దీన్‌ఖాన్‌, భాస్కరబువా బఖలే, ఫయ్యాజ్‌ఖాన్‌, ముష్టాక్‌హుసేన్‌, హాఫిజ్‌అలీ ఖాన్‌(నేటి సరోద్‌ విద్వాంసుడు అమ్జద్‌ అలీఖాన్‌ తండ్రి), అలీఅక్బర్‌ఖాన్‌, రవిశంకర్‌, బిస్మిల్లాఖాన్‌, బేగంఅఖ్తర్‌, డాగర్‌ తదితరులున్నారు. చెదరని ఆత్మవిశ్వాసంతో తనకన్నా జూనియర్‌ కళాకారులకు తబలా వాయించడానికి కూడా ఆయన వెనకాడలేదు. పైగా “నాకులేని సంకోచం మీకెందుకు?” అని ఆర్గనైజర్లతో అనేవాడట. ఆయన కచేరీ విన్నాక ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు పాల్ఘాట్‌ మణి అయ్యర్‌ ఆయనను సరస్వతీ అవతారమని పొగిడాడు.

థిరక్వా చాలా సంవత్సరాలపాటు లక్నో రేడియోలో తబలా వినిపించాడు. అనేక కచేరీల్లోనూ, సమావేశాల్లోనూ, సంగీతసభల్లోనూ ఆయనకు అపారమైన ఆదరణా,గౌరవమూ, పద్మభూషణ్‌ వంటి సన్మానాలూ లభించాయి. 1974లో చివరిసారి ఆయన రేడియో సంగీత సమ్మేళనంలో కచేరీ చేశాడు. వృద్ధాప్యంలో మాట్లాడేటప్పుడు ఆయన గొంతు వణికినా తబలా బోల్‌లు వినిపించేటప్పుడు మాత్రం ఆయన తొట్రుపడేవాడుకాడు. ఆయన శిష్యుల్లో లాల్జీ గోఖలే, ప్రేమ్‌వల్లభ్‌, గులాం అహ్మద్‌, ఛోటా గోఖలే, నిఖిల్‌ఘోష్‌, అహ్మద్‌ అలీఖాన్‌, రామ్‌కుమార్‌శర్మ మొదలైన పేరుపొందిన తబలా విద్వాంసులున్నారు. సరైన పద్ధతిలో ఎడతెగని సాధనతో, వ్యాయామమూ, పౌష్టిక ఆహారంతో శిష్యులకు శిక్షణ నిచ్చాడాయన.

1940ల చివరిలో తీసిన ఈ దుర్లభమైన ఫోటోలో ఉన్నవారు (ఎడమ నుంచి వరసగా) తబలా విద్వాంసుడు కంఠే మహారాజ్‌, తబలా విద్వాంసుడు కిషన్‌ మహారాజ్‌, అల్లాఉద్దీన్‌ఖాన్‌, రవి శంకర్‌, తబలా విద్వాంసుడు అహ్మద్‌జాన్‌ థిరక్వా

థిరక్వా గతకాలపు అనుభవాలను యువతరానికి వినిపిస్తూ ఉండేవాడట. అందరిలోకీ ఆగ్రా శైలి గాయకుడైన ఉస్తాద్‌ ఫయ్యాజ్‌ఖాన్‌కు వాయించడం తనకు తృప్తి నిచ్చిందని ఆయన చెప్పాడు. తాళంమీద గట్టి పట్టు ఉన్న “ఆఫ్తాబే మూసికీ” (సంగీత భాస్కరుడు) ఫయ్యాజ్‌ఖాన్‌కు కూడా థిరక్వా అంటే చాలా అభిమానం. కచేరీ మధ్యలో ఆయన “న హువా థిరక్వా”(థిరక్వాకు సాటిలేదు) అనేవాడట. రజబ్‌అలీఖాన్‌ తన గానకచేరీల్లో పాడే వేగాన్ని పెంచేసి, తాను మాత్రం అలిసిపోకుండా తబలా వాయించేవారికి అలసట కలిగించి ఏడిపించేవాడట. ఇది గమనించిన థిరక్వా అందుకు అనుగుణంగా తన తబలా “లెక్క”ను మార్చేసి ఎంతసేపైనా వాయించడానికి సిద్ధపడేవాడట. దీనికి రజబ్‌అలీ కోపగించక మెచ్చుకున్నాడట. విమానం ఎక్కడానికి భయపడినందువల్లే విదేశాలకు ఎన్ని ఆహ్వానాలొచ్చినా వెళ్ళలేదనిచెప్పి థిరక్వా అందర్నీ నవ్వించేవాడు. (ఈ కారణంగానే ప్రఖ్యాత వైణికుడు ఈమని శంకరశాస్త్రిగారు కూడా చాలాకాలం విదేశాలకు వెళ్ళలేదట).

98 ఏళ్ళు జీవించిన ఈ తబలా “మాంత్రికుడు” జనవరి 1976లో తాను నివసిస్తున్న బొంబాయినుంచి తన స్వస్థలమైన లక్నోకు వెళ్ళాడట. “నేనెప్పటికీ లక్నోలోనే ఉంటాను” అని మిత్రులకు మాట ఇచ్చినందువల్లనో ఏమో, మొహరం వెళ్ళిన కొద్ది రోజులకే లక్నోనుంచి బొంబాయికి రైలెక్కడానికి వెళుతూ రిక్షాలోనే ఆయన ప్రాణాలు వదిలాడు. రాచరికపు దర్బారుల గౌరవాన్నీ, అసంఖ్యాకులైన సామాన్యప్రజల ఆదరాభిమానాలనీ కూడా చవిచూసిన ఆ మహావిద్వాంసుడి మరణంతో ఒక గొప్ప శకం ముగిసినట్టయింది.
--------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, August 20, 2019

జాషువా పిరదౌసి


జాషువా పిరదౌసి




సాహితీమిత్రులారా!

జాషువా కథాకావ్యాల్లో ప్రసిద్ధమైంది పిరదౌసి. అద్భుతమైన కవిత్వాన్నిరాసి అందుకు తగిన గుర్తింపునూ ప్రతిఫలాన్నీ పొందలేక పోవటం ఈ ఇద్దరు కవులవిషయంలోనూ ఉన్న సామ్యం. ఐతే జాషువా కథనంలో పిరదౌసి మరణానంతరం మాత్రమే సత్రశాల రూపంలో గుర్తింపు దొరుకుతుంది.తన పరిస్థితీ అలాటిదేనని జాషువా భావించారని నాకనిపిస్తుంది. కాని గుడ్డిలో మెల్లగా జాషువాకిచరమదశలో నైనా రసహృదయుల సన్మానాలూ స్వాగతపత్రాలూ లభించాయి.

భారతీయ సంపదల్ని పదిహేడు సార్లు దోచుకుపోయి సంతుష్టుడైన గజనీమహమ్మద్‌తన వంశీయుల చరిత్రను రాయమని పిరదౌసిని కోరి అందులో ఒక్కొక్క పద్యానికి ఒక బంగారునాణెం బహూకరిస్తానని వాగ్దానం చేస్తాడు. పిరదౌసి ముప్ఫై ఏళ్ళ పాటు శ్రమించి రాసిన అరవైవేలపద్యాల “షానామా” ని విన్న తర్వాత ఎందువల్లనో బంగారం బదులుగా వెండి నాణాలు పంపుతాడు.అందుకు పరితపించి పిరదౌసి తనని నిందిస్తే అది పరాభవంగా భావించి పిరదౌసిని చంపిరమ్మని సైన్యాన్నిపురమాయిస్తాడు.పిరదౌసి తప్పించుకుని పారసీకానికి పారిపోయి అక్కడ శేషజీవితం గడపటం,మహమ్మద్‌చివరకు పశ్చాత్తాపపడి అతనికి బంగారు నాణాలు పంపించేసరికే అతను చనిపోవటం,అతని కూతురు ఆ ధనాన్ని తిరస్కరించటంతో కథ ముగుస్తుంది.

పాత్రచిత్రణ
కథలో ముఖ్య పాత్రలు పిరదౌసి, మహమ్మద్‌లవైతే పిరదౌసి కూతురు కూడాచివరిఘట్టంలో ఒక ఉన్నత వ్యక్తిగా దర్శనమిస్తుంది. పిరదౌసిలో తనని, తనలో పిరదౌసినిచూసుకున్న జాషువా, పిరదౌసి వ్యథని, వేదనని, మానసిక స్థితిని, అద్భుతంగా కరుణరసార్ద్రంగాచిత్రించాడు. భగవంతుని మీద అతనికున్న విశ్వాసం, అత్యంత దయనీయమైన స్థితిలో కూడా ఉబికివచ్చేఊహాప్రవాహం, జాషువా హృదయస్థితికి ప్రతిబింబాలు. ఐతే నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించేది ఆయన మహమ్మద్‌ను చిత్రించిన విధానం. పిరదౌసికి మహమ్మద్‌ చేసిన దురన్యాయానికి బహుశః జాషువాకాక మరే కవైనా మహమ్మద్‌ను దుష్టుడిగా, హృదయం లేని వాడిగా చిత్రించేవాడేమో! జాషువా మహమ్మద్‌చాలాసంక్లిష్టమైన వ్యక్తి. లలితకళాపోషకుడు. దానశీలి. సాహితీలోలుడు. పిరదౌసి విషయంలో కఠినంగాప్రవర్తించినా మసీదు గోడమీద అతను రాసిన పద్యాల్ని చదివి కన్నీరు కార్చగలిగినసున్నితహృదయుడు. ఆలోచించిచూస్తే ఒకవేళ కొంతవరకు రావణాసురుడి ఛాయల్లో అతన్ని తీర్చిదిద్దాడా అనిపిస్తుంటూంది!జాషువాలోని అచంచలమైన గాంధేయ భావాలు, అహింసాప్రవృత్తి, అణగదొక్కిన వారిని కూడా ప్రేమించగలిగేదయార్ద్రత కలిసి మహమ్మద్‌ను అలా చిత్రించేట్లు చేశాయని నా విశ్వాసం.

భావనాపటిమ
జాషువా విశ్వనాథలాగా పండితుడు కాడు. దేవులపల్లి, కరుణశ్రీల లాగాపదాల్ని సానబట్టి నునుపుదేర్చి ప్రయోగించేవాడు కాడు. ఆయన పద్యాలు ఎక్కడో తప్ప కదనుతొక్కవు. ఆయన పదశిల్పం తీర్చిదిద్దినట్లు ఉండదు. ఐతే ఆయన మహోన్నత భావుకుడు. అంతరంగంలో రసగంగలు పొంగిపొరలే సహజశిల్పి. కళ్ళు మిరుమిట్లు గొలిపే భావనలు, కల్పనలు, ఊహాశక్తి ఆయన్ని ఆధునికకవులందర్లోను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. ఒక పద్యం తీసుకుంటే దాన్లోని పదాలు,సమాసాలు, ఎత్తుగడలు, శిల్పం ఇవి కాదు మనని విస్మితుల్ని చేసేవి. ఆ పద్యం మొత్తం లోను వ్యాపించిగుప్పుమని గుబాళించే భావనాసౌందర్యం, వినూత్నమైన ఊహాశబలత, స్వచ్చంగా ప్రతిఫలించేనిజాయితీ. సుప్రసిద్ధమైన ఈ కింది పద్యాల్లో ఈ గుణాలన్నీ విస్పష్టంగా కనిపిస్తాయి. ఆస్వాదించి ఆనందించండి.

ఓ సుల్తాను మహమ్మదూ! కృతక విద్యుద్దీపముల్‌నమ్మి ఆ
శాసౌధమ్ముల కట్టికొంటి అది నిస్సారంపు టాకాశమై
నా సర్వస్వము దొంగిలించి నరకానన్‌కూల్చిపోయెన్‌వృథా
యాస ప్రాప్తిగ నిల్చినాడ నొక దుఃఖాక్రాంత లోకంబునన్‌

పూని కరాసికిన్‌మనుజ భుక్తి నొసంగెడు రాతిగుండె సు
ల్తానుల కస్మదీయ కవితాసుధ చిందిన పాతకంబు నా
పై నటనంబొనర్చినది వాస్తవ మిట్టి స్వయంకృతైక దో
షానల దగ్ధమై చనిన అర్థము నాకు లభింపబోవునే

ఇంక విషాద గీతములకే మిగిలెన్‌రసహీనమై మషీ
పంకము నా కలమ్మున; అభాగ్యుడనైతి వయఃపటుత్వమున్‌
క్రుంకె; శరీరమం దలముకొన్నది వార్థకభూత; మీ నిరా
శాంకిత బాష్పముల్‌ఫలములైనవి ముప్పది ఏండ్ల సేవకున్‌

చిరముగ బానిసేని నభిషేక మొనర్చితి మల్లెపూవు ట
త్తరు లొలికించి; మాయ జలతారున రాదు కదా పసిండి? ఓ
కరుకు తురుష్క భూపతి, అఖండ మహీవలయంబు నందు? నా
శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్నిఖండముల్‌

కృతి యొక బెబ్బులింబలె శరీర పటుత్వము నాహరింప శే
షితమగు అస్థిపంజరము జీవలవంబున ఊగులాడగా
బ్రతికియు చచ్చియున్న ముదివగ్గు మహమ్మదు గారి ఖడ్గ దే
వతకు రుచించునా? పరిభవవ్యథ ఇంతట అంతరించునా?

ప్రకృతి పదార్థజాలములపై ఉదయాస్తమయంబులందు నీ
అకలుష పాణి పద్మము రహస్యముగా లిఖియించి పోవుటొ
క్కొక సమయాన నేను కనుగొందును గాని గ్రహింపజాల నెం
దుకు సృజియించినాడవొ ననున్‌ఘనుడా అసమగ్ర బుద్ధితోన్‌

ఈ తొలికోడి కంఠమున ఏ ఇనబింబము నిద్రపోయెనో
రాతిరి; తూర్పు కొండ లభిరామము లైనవి; దీని వక్రపుం
కూతల మర్మమేమి? కనుగొమ్మని అల్లన హెచ్చరించి ప్రా
భాత సమీర పోతములు పైకొనియెన్‌తొలిసంజ కానుపుల్‌

ఏమిటి కెక్కువెట్టితివొ ఇంద్రధనుస్సును మింటిచాయ నా
సామి! పయోదమాలికల చాటున సూర్యుడు నక్కినాడు తా
నేమపచారమున్‌సలిపి ఇట్టి విపత్తును తెచ్చిపెట్టె? ఈ
భూములు నిల్చునా భువనమోహన నీవు పరాక్రమించినన్‌

“ఇది నా తండ్రిని కష్టపెట్టిన శరం; బీ స్వాపతేయంబు ము
ట్టుదునా? నా జనకుండు కంట తడి బెట్టున్‌స్వర్గమందుండి; నా
ముది తండ్రిన్‌దయతోడ ఏలిన నవాబుండైన మీ స్వామికిన్‌
పదివేలంజలు” లంచు పల్కుడని బాష్పస్విన్న దుఃఖాస్యయై

ఓయి కృతఘ్నుడా! భవమహోదధిలో నిక తేలియాడు; మా
హా! అఫఘన్‌ధరాతలము నంతయు కావ్యసుధా స్రవంతిలో
హాయిగ ఓలలార్చిన మహామహుడౌ పిరదౌసి తోడ స్వ
ర్గీయ సుఖంబు నీకు తొలగెన్‌మనుపీనుగువై చరింపుమా!



జాషువా గురించి ఆయన మాటల్లోనే

తమ్మిచూలి కేలు తమ్మిని కల నేర్పు
కవి కలంబునందు కలదు కాన
ఈశ్వరత్వ మతనికే చలామణి అయ్యె
నిక్కువముగ పూజనీయుడతడు
----------------------------------------------
రచన: గుఱ్ఱం జాషువా, 
ఈమాట సౌజన్యంతో

Sunday, August 18, 2019

మంచి కవి, మంచి స్నేహితుడు


మంచి కవి, మంచి స్నేహితుడు




సాహితీమిత్రులారా!

1957లో అనుకుంటాను, ఒక రోజున మా ఇంటి ముందు ఓ రిక్షా ఆగింది (అప్పట్లో అవి మనుషులు తొక్కే సైకిల్‌ రిక్షాలు). అందులోంచి సన్నని గ్లాస్గో పంచె కట్టుకుని, అంతే సన్నని తెల్ల లాల్చీ తొడుక్కుని, ఒక సుకుమారమైన మనిషి దిగి, “నారాయణరావుగారంటే మీరేనా? నాపేరు బాలగంగాధర తిలక్‌. మీతో మాట్లాడదామని వచ్చాను” అన్నాడు.

నేను నివ్వెర పోయాను. మనిషినెప్పుడూ చూడలేదు గానీ, బాలగంగాధర తిలక్‌ నాకు చాలా ఇష్టమైన కవి. నేను అతని మాటల పొందికనీ, సమాసాల కూర్పునీ, మనసు లోపల పొరల్లోకి చొచ్చుకుని వెళ్ళే అతని అందమైన ఊహల్నీ – అన్నిటికన్నా కవిత్వం మీద అతనికున్న స్పష్టమైన, ధైర్యవంతమైన నమ్మకాన్నీ తలుచుకుని తలుచుకుని ఉప్పొంగిపోతూ ఉండేవాణ్ణి. అలాంటి బాలగంగాధర తిలక్ తిన్నగా మాయింటికి వచ్చేస్తాడని నేను ఊహించలేదు.

నా ఉబ్బితబ్బిబ్బులోంచి నేనింకా తేరుకోక ముందే, అలా వచ్చిన మనిషి కుర్చీలో కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టాడు. నేనూ అంతే మామూలుగా అతని కబుర్లలో కలిసిపోయాను. మేమిద్దరం అంతకు ముందునుంచీ చాలాకాలంగా ఎరిగున్న స్నేహితుల్లా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం. గంటలు గడిచిపోతున్నాయి. కవిత్వాన్ని గురించీ, సాహిత్యాన్ని గురించీ, అప్పుడు రాస్తున్నవాళ్ళ మంచిచెడ్డల్ని గురించీ, ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క ఒడుపు ఎంత బాగుందో ఒకరికొకరు ఎంతో ఇష్టంతో ఊహలు కలబోసుకుంటున్నాం. అతను చాలా పెద్ద కవి అని నా గుర్తులో లేదు. నేను చాలా చిన్నవాణ్ణని ఆయన అనుకున్నట్టూ లేదు. అలా మాకు తెలియకుండా కాలం గడిచిపోతూంటే, వీధిలో ఉన్న రిక్షావాడు నాకు కనిపించాడు. అతనికి డబ్బిచ్చి పంపేయలేదే, ఏమిటా అని ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు చెప్పాడు తిలక్‌, రిక్షా అక్కడే ఉండాలని, “లేకపోతే నాకు భయం, నడవాల్సొస్తుందేమోనని. ఏం ఫర్వాలేదు లెండి. ఉంటాడు.”

తిలక్‌ని తల్చుకోగానే నాకు జ్ఞాపకం వచ్చేవి రెండు – కవిత్వంలో ఆయనకున్న ధైర్యం, నిబ్బరం. జీవితంలో ఆయన నిస్సహాయత, భయం. ఈ రెండూ సమానంగా పెరుగుతూ వచ్చాయి తిలక్‌లో నేనెరిగున్నన్నాళ్ళూ. వ్యక్తులుగా తిలక్‌, నేనూ ఆయన జీవితపు చివరి దశాబ్దంలో బాగా స్నేహితులమయ్యాం. ఆయన తణుకునించీ తరుచు ఏలూరు వచ్చేవాడు. తణుకులో ఆయన తమ్ముడు, దేవరకొండ శివకుమార శాస్త్రిగారు పేరున్న లాయరు. ఆయన ఇంటికి, తిలక్‌, ఆయన భార్య ఇద్దరూ వచ్చేవారు. తిలక్‌ ఎప్పుడూ ఒంటరిగా ప్రయాణం చేసేవాడు కాదు. నడిచి వెళ్ళేవాడు కాదు ఆఖరికి పట్టుమని ఫర్లాంగు దూరమైనా. నేను అంత తరుచుగా కాదుగానీ అప్పుడప్పుడు తణుకు వెళ్ళేవాణ్ణి, ఆయన కోసం. ఈ మానసిక ఆందోళన, భయంలేని ఆరోగ్యవంతమైన రోజులు తిలక్‌ జీవితంలో చాలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో తిలక్‌ని నేనెరగను.

తిలక్‌ రాయడం మొదలుపెట్టిన రోజుల్లో (ఆయన మొదటి పద్యం 1941లో రాశాడు) భావకవిత్వం వెనకబట్టి, శ్రీశ్రీ ప్రభావం బలపడుతోంది ముఖ్యంగా యువకుల్లో. కవులు లోకంలో జరిగే అన్యాయాలను పట్టించుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా ఒక ప్రత్యేక తరహా న్యాయంకోసం తమ కవిత్వపు గొంతుకతో పోరాడాలని, ఒక కొత్త అభిప్రాయం బలపడడం మొదలైంది. కవిత్వం త్రికాలాబాధితమనీ, రసానందమే దాని పరమావధి అనీ అలంకారశాస్త్రంలో చెప్పిన మాటలు పాతబడి చాలా కాలమయింది. దాంతోబాటు, భావకవిత్వపు రోజుల్లో బలపడిన ఊహలు కూడా నీరసపడడం మొదలైంది. ప్రేయసీ, వెన్నెలా, మలయానిలమూ, మల్లెపువ్వులూ వేళాకోళపు మాటలయ్యాయి. భావకవి అభావకవి అయ్యాడు. విప్లవమూ, వర్గపోరాటమూ, ఎర్ర జెండా కొత్త కవితా వస్తువులయ్యాయి. యువకులందరూ ధైర్యంగా శ్రీశ్రీ కవితా, ఓ కవితా చదివి సొమ్మసిల్లి పోతున్నారు. శ్రీశ్రీ కవిత్వం అప్పటికింకా అచ్చు కాకపోయినా చాలా మంది జేబుల్లో రాతప్రతులుగా, చాలా మంది నోళ్ళల్లో గీతప్రతులుగా చలామణీ అవుతోంది. ముందుకు కుచ్చిళ్ళు వదిలేసి, బెంగాలీ కట్టు గ్లాస్గో పంచెలు, సిల్కు లాల్చీలు, గిరజాలు కవికి గుర్తులవడం తగ్గి, పంట్లాలూ చొక్కాలూ తొడుక్కున్న కవులు సభల్లో కనిపిస్తున్నారు.

అలాంటి దశలో వచ్చాడు తిలక్‌.

నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

ఈ పద్యం చాలామందిని ఆపి, అల్లరిపెట్టింది. ఇందులో తరవాత రెండు చరణాలు ఇటు కొంచెం భావకవిత్వం వైపు, అటు కొంచెం శ్రీశ్రీ కవిత్వం వైపు మొగ్గుతున్నట్టు కనిపిస్తాయి. జాగ్రత్తగా చూస్తే నిజానికవి రెండూ కావు.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్రలోకపు మణిస్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు.

కవిత్వంలా కనిపించడానికి ప్రయత్నిస్తున్న ఈ మాటల వెనకాతల, తిలక్‌లో గాఢంగా నాటుకుని ఉండి రూపొందుతున్న ఒక తీవ్రత ఉంది. మనిషి తన జీవితంలో ప్రపంచాన్ని ఆనందించడానికి పడే తపన అక్కడితో ఆగిపోకుండా, ఈ పద్యంలో ఉన్న చివరి మూడు పంక్తులూ నన్ను కట్టి పడేశాయి.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు

ఆఖరి చరణం దాకా మామూలుగా అప్పటి పద్యాలలో అలవాటైన మాటల కూర్పులే సున్నితంగా కనిపిస్తాయి. అయితే అందులో ఒక ఒడుపుంది, పంక్తికొక తూగుంది. మొత్తం మీద పద్యం శక్తిమంతంగా చేసే నేర్పుంది. కానీ అకస్మాత్తుగా ఆఖరి చరణం చిన్న మాటల్లో మామూలు వాడుకలోని తెలుగులో ఏ ఆర్భాటమూ లేకుండా అంతకు ముందు పద్యంలో ఉన్న ఆర్భాటాన్ని అకస్మాత్తుగా చల్లారుస్తూ మనం ఊహించని మామూలు తనంతో కనిపించే సరికి, పద్యం ఒక్కసారి అపూర్వమైన ప్రాణం పోసుకుంటుంది. నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అనే మాట తిలక్‌లో అంతకు ముందు ఎవరికీ లేని, ఆ తరవాత ఎవరికీ అబ్బని ఒక అసాధారణమైన, సాధారణ శబ్దశక్తిని ప్రపంచించింది. ఆ ఒక్క పంక్తీ ఇతను నిజంగా కవి అని నాకు గుర్తుకు తెచ్చింది.

ఈ పద్యంలో తిలక్‌ తన కవిత్వాన్ని గురించే కాకుండా అసలు కవిత్వాన్ని గురించి చెప్పాడు. రాజకీయాల అలజడిలో, ఉద్యమాల ఉత్సాహంలో ఉపన్యాసానికీ కవిత్వానికీ మధ్య తేడా చెరిగిపోవడం మొదలైన రోజుల్లో వచ్చిన ఈ పద్యం చాలామందికి ప్రాణం పోసింది. ఇంకా చాలామందికి కోపం తెప్పించింది.

ఆ తరవాత తిలక్‌ రకరకాల పద్యాలు రాశాడు. అంతర్జాతీయ సమస్యలూ, యుద్ధాల కష్టాలూ, పేదవాళ్ళ బాధలూ, ప్రేమికుల అనుభవాలూ, మధ్యతరగతి మనుష్యుల అనుభవాలూ, తుఫాన్లూ, కాటకాలూ అతన్ని రకరకాలుగా అలజడి పెట్టాయి. అతని మాటలు ఎటు వెళ్ళాలో తెలియక, ఐనా అతను అంతర్గతంగా భావిస్తున్న ప్రపంచాన్ని వదులుకోలేక, దారితప్పుతున్న కవిత్వాన్ని దారిలో పెట్టడానికి, మళ్ళా బావుండదనుకుని ఆ దారిలోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తూంటాయి. అప్పుడప్పుడు ధైర్యం పుంజుకుని, తన కవితా విశ్వాసాన్ని ఒక తీవ్రమైన ఉపన్యాసంలాగా, ఒక పదునైన వాగ్దానంలాగా చురుక్కుమని ప్రకటిస్తాడు. అలాంటి పద్యం 1955లో రాసిన కవివాక్కు.

1955 నించీ తిలక్‌ మళ్ళీ కవిగా పుంజుకోవడం మొదలు పెట్టాడు.

వివేకం లేని ఆవేశం విపత్కరమౌతుంది
సంయమం లేని సౌఖ్యం విషాదకారణ మౌతుంది
సమ్యక్‌ సమ్మేళనం లేని తౌర్యత్రికం కఠోరమౌతుంది
కరుణ లేని కవివాక్కు సంకుచిత మౌతుంది !

ఇందులో ఆఖరి పంక్తిలో చెప్పిన కరుణ తిలక్‌ కవిత్వానికి ప్రాణభూతమైన అంశం. అందుకే అతని మాటలు మనస్సుల్లో సహజంగా ఉండి, అవతలి వాళ్ళ సంతోషాన్నీ, బాధనీ మనదిగా అనుభవించగల ఒక సహజమైన శక్తిని ఉద్దీపింపజేస్తాయి.

నేను బాధపడుతున్నానంటే ఏడుపు, అవతలి వాళ్ళు బాధపడుతున్నారంటే జాలి.

జాలిని కన్నీళ్ళుగా మార్చకుండా, ఆర్ద్రమైన కవిత్వంగా మార్చడం కవిగా తిలక్‌ మాటలకున్న శక్తి. పంక్తి పంక్తికీ ఎంత బరువు కావాలో ఎక్కడ తేలిగ్గా ఉండాలో, ఏ మాటని ఏ మాటతో కలిపితే అతను అంతకు ముందు చెప్పిన తౌర్యత్రికం (musical ensemble) మనని భౌతికస్థాయి నించి దాని పైమెట్టుకి తీసుకెళుతుందో తిలక్‌ పట్టుకున్నాడు. అతనివల్ల తెలుగు భాష కొత్త ప్రాణం పోసుకుంది. ఆర్తగీతం అనే ఆయన 1956లో రాసిన పద్యం అలాంటిది. అందులో నా దేశాన్ని గూర్చి పాడలేను అని కఠినంగా మొదలయ్యే పద్యం –

నీ కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త సురభిళాత్త
శయ్యాసజ్జితమ్ము వలదు,
రసప్లావితము వలదు
చిత్ర శిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను, తత్వసూత్ర
వాదోక్తి చలింపను
సుందర వధూ కదుష్ణ పరిరంభముల రసింపను
గత చారిత్రక యశఃకలాపమ్ము వివరింపకు, బహుళ
వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు
ఇంక నన్ను విసిగింపకు

ఈ చరణాలు ఒక్కటొక్కటిగా మనకి అలవాటైన మొద్దుబారిన అందాల పొరలని నిర్దాక్షిణ్యంగా వొలిచేస్తాయి. ఏ తొడుగులూ, ఏ కప్పులూ లేని నిరాచ్ఛాద్యమైన మనస్సు తరవాత రాబోయే చరణాలలో ఉన్న బాధనీ, వేదననీ శారీరకంగా తెలుసుకోవడానికి సిద్ధపడుతుంది. కష్టాలు ఊహలు కావు. ఊహలు మనస్సు పడేవి, కష్టాలు శరీరానికి నాటుకునేవి. ఆ తరవాతి పద్యం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది, మన చర్మంలోకి వెళుతుంది. మనల్ని క్షోభ పెడుతుంది, హింస పెడుతుంది. ఈ పద్యం లోని ఆర్తి మన ఆర్తి అవుతుంది. అది మన నిస్సహాయతని బలంగా మారుస్తుంది.

ఈ పద్యం చదివినప్పుడల్లా ఈ మాటల్లోంచి తప్పించుకోలేను, కళ్ళముందు కనిపించే ఈ బొమ్మల్లోంచి బైట పడలేను అన్నంత భయం కలుగుతుంది. ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.

తిలక్‌ ప్రపంచంలో సరదా కోసం రాసిన పద్యాలు – తపాలా బంట్రోతు మీద రాసిన పద్యంలో ఈ పంక్తులు తపాలానీ, బంట్రోతునీ దాటి, అతని మనస్సులోకీ విశాలమైన సముద్రంలాంటి ప్రపంచంలోకీ మనల్ని తీసుకు వెళతాయి.

ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు

అందరికీ నచ్చి, అందానికి మారుపేరై అతడి పుస్తకానికి పేరై నిలబడ్డ కవిత అమృతం కురిసిన రాత్రి. జీవితం పట్ల అతనికున్న ఇష్టానికీ, జీవితంలో అతనికున్న గాఢమైన నమ్మకానికీ, బతుకు అందమైనది, బతకడమే సౌందర్యం అనే అతని సిద్ధాంతానికీ ఈ పద్యం కన్నా స్ఫుటమైన ఉదాహరణ మరొకటి లేదు. అమరత్వమంటే చచ్చిపోకుండా ఉండటం కాదు, అమరత్వమంటే బతికున్న క్షణాలు గాఢంగా బతకడం అని ఈ పద్యం పొడుగూతా మాట మాటా అలాంటి ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించి పెడుతుంది. కాంక్షా మధుర కాశ్మీరాంబరం, హసన్మందార మాల ఈ పద్య ప్రపంచాన్ని కొత్త చప్పుళ్ళతో ఆవిష్కరిస్తాయి. ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపర్చుకున్నవాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు అనే పంక్తులు, ఆ పద్యంలోనే చివర అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు, అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు అనే పంక్తుల్ని హాయిగా విశాలంగా ఎదుర్కొంటాయి. పద్యనిర్మాణంలో మాటల కూర్పులో తెలుగులో ఉన్న గొప్ప పద్యాల్లో ఇదొకటి.

సరదాగా రాసినా, బాధగా రాసినా, ఉత్సాహంగా రాసినా, ఊరికినే రాసినా తెలుగు మాటలకి తిలక్‌ అప్పటికి అవసరమైన కొత్త ప్రాణం పోశాడు. రాజకీయాల అలజడిలో, సిద్ధాంతాల ఘర్షణలో కవిత్వానికున్న ప్రాణశక్తి బలహీనమై పోతున్న రోజులలో వాటినన్నీ తట్టుకుని, తిలక్ కవిత్వం కోసం ధైర్యంగా నిలబడ్డాడు. అప్పుడప్పుడు కార్టూను కవిత్వం, కేలండర్‌ కవిత్వం, అంతగా అవగాహన లేని రాజకీయ కవిత్వం తిలక్‌ రాయకపోలేదు. కానీ అవి కావు తిలక్‌ని మనకి గుర్తుండేలా చేసేవి. అవి అతని గాఢమైన కవితా వ్యక్తిత్వంలోంచి వచ్చినవీ కావు.

తిలక్ తన కవితా సామర్థ్యం పరమోచ్చదశలో ఉండగా అకస్మాత్తుగా చచ్చిపోయాడు. 1966 జులైలో అతను పోయేడని టెలిఫోన్‌ కబురు తెలిసేసరికి నేను నమ్మలేకపోయేను. ఏంచెయాలో తెలియక అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ నండూరి రామమోహనరావు గారికి ఫోన్‌ చేసి చెప్పాను. కాని అదే ఆంధ్రజ్యోతిలో అతని మరణవార్త చదివిన తరవాతగాని అతను నిజంగా పోయాడన్న సంగతి నాకు మనస్సుకి పట్టలేదు.

కవిత్వాన్ని వదిలేసి, కవిత్వం పేరుతో ఉపన్యాసాలూ, వచనకవిత్వం పేరుతో చాతకాని వచనమూ విశృంఖలంగా వస్తున్న ఈ రోజుల్లో ఏది కవిత్వమో ఏది కాదో తెలుసుకోగల శక్తి నశించిపోయి, ప్రచారం చేసుకోగల వాళ్ళకి బహుమానాలు, కాకా పట్టగలవాళ్ళకి కనకాభిషేకాలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో తిలక్‌ని మనం మరొక్కసారి జాగ్రత్తగా అతని పదవిన్యాసం కోసం, అతని పద్యనిర్మాణం కోసం, అతని ఊహగాఢత్వం కోసం, అతని ప్రపంచవైశాల్యం కోసం చదవడం అవసరం.
--------------------------------------------------------
రచన: వెల్చేరు నారాయణరావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, August 16, 2019

మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం: రెండవ భాగం


మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం: 

రెండవ భాగం




సాహితీమిత్రులారా!

లోకంలో జరిగే సంఘటనలకు కార్యకారణసంబంధాలు ఎంతగా ఉంటాయో కాకతాళీయాలు సైతం అంతగానూ వుంటాయి. అదే ప్రతిపాదించదలిచి నా. బా “అంత రోడ్డు ఆవలిస్తే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు! తుమ్మితే మూడు ఎలక్‌ట్రిక్‌ దీపాలు వెలిగాయి” అంటాడు. తాను కాళీ రోడ్డునంతా పరిశీలిస్తూ నిర్వ్యాపారంగా నిలుచున్నాడు. శూన్యంగా వుంది ఆవలిస్తున్నట్లు. ఇంతలో ముగ్గురు అమ్మాయిలు రావడం కనిపించింది. అప్పుడే తనకు తుమ్ము వచ్చింది. ఆ క్షణం లోనే మూడు ఎలక్‌ట్రిక్‌ దీపాలు వెలిగాయి.

తోచక ఒకడు నొసటిపై పెన్సిల్‌ తాటించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో వీధి తలుపు దబదబ బాదుతున్నట్లు శబ్దం వినవచ్చింది. అనాలోచితంగా నుదురుపై పెన్సిల్‌ ఇంత శబ్దం చేసిందా అని హడలిపోతాడు. ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు.

సీరియస్‌ విషయాలు పైన చర్చించి మూడ్‌ మార్చడానికి లైటర్‌ వేన్‌లో ఈ చిత్రణ!

ఆశ్చర్యంతో గట్టిగా గాలి పీల్చాడు. లోపలికి దీర్ఘనిశ్వాసం తీస్తే అన్ని మాయమయ్యాయి. ఇదీ కాకతాళీయమే! క్రమపరిణామానికి ఎంత ప్రభావం ఉంటుందో యాదృచ్ఛికతకూ అంతే ప్రాధాన్యత వుంటుంది.

వెనువెంటనే భయోద్విగ్నత కలిగి గుండెల్లో గగుర్పాటు కలిగేలా ఒక విషాదాంత చిత్రణకు జారిపోతాడు. “కాశ్మీర సరస్సులో పడవల్లాగ కాలప్రవాహంలో కలరా శవాలు కొన్ని!” అంటూ. అంటువ్యాధులు సోకిన దారుణకాలంలో కలరా శవాలకు ఉత్తరక్రియలు జరిపే నాథుడు లేక కాలవల్లో, నదుల్లో పారేసే బాధ్యతారాహిత్యాన్ని చూసి సమాజానికి చపేటమందిస్తాడు.

మనం బ్రతుకుతున్న ప్రపంచంలో ఏ క్షణంలోనైనా ఏ విప్తౖతెనా విరుచుకుపడవచ్చు. మనకాలమే ఒక సందిగ్ధం. దారుణమారణాయుధాలు పిచ్చివాళ్ళ చేతుల్లో పోగయివున్నాయి. ధనాశోన్మత్తులు, అధికారదాహతప్తులు, నేడు పాలకవ్యవస్థను దురాక్రమించి వున్నారు. అందుకే సమయోచిత హెచ్చరికగా

“వీధులు ప్రమాదం, పరిగెడదాం పద! ఆరు బయలు లోకి అన్నాడు”

అన్నవారెవరో కవి చెప్పలేదు. కాని ఈ కావ్యానికి తానూ శ్రీశ్రీయే ప్రధానపాత్రలు. జలసూత్రం వచ్చి సూత్రధారుని పాత్ర నిర్వహించి వెళ్ళిపోయాడు. కావ్యప్రశంస కూడా అతని పాత్రకు సముచితమే! కనుక ఈ హెచ్చరిక చేసింది శ్రీశ్రీ అని అతనే సమయోచిత హెచ్చరికగా ఒక క్లేరియన్‌ కాల్‌ ఇచ్చాడని మనం గ్రహించాలి.

“పరిగెట్టాం ఇద్దరం అక్కడ గాలిలేదు వెలుతురు లేదు శూన్యం లేదు. సప్తసముద్రాలు జట్టుకట్టుకుని జలతరంగిణి వాయిస్తున్నాయి!”

జలతరంగిణి అంటే సాగరజలాల తరంగిత నాదం అనీ, పింగాణీగిన్నెలో నీళ్ళు పోసి కర్రతో వాయించే సంగీతవాద్యం అనీ ఇక్కడ కవి నిర్దేశం. సప్తసముద్రాలు అనే సంప్రదాయపు వ్యక్తీకరణ వలన సముద్రాలేనని మనం అర్థం చేసుకోవాలి.

“ఆకాశం చిరిగిపోయిన అరటిదొప్పలా ఒక మూలపడి వుంది. భూగోళపటం మీద ఉల్లిపొర కాగితంలా మృతించిన శేషుడు భూమిని చుట్టుకుని ఉన్నాడు వెలసిన రంగుగుడ్డల మంచీ చెడ్డా జెండాలై ఎగురుతున్నాయి”

సర్వదేశాల ప్రతినిధులుగా జెండాలెగురుతున్న మాట నిజమే గాని, వాటిలోని అసలు రంగులు వెలిసిపోయి, స్వభావాలు వ్యత్యస్థమై పోయాయి. మరణం లేదని విశ్వసించే ఆదిశేషుడు చచ్చి చప్పగా ఎండి ఉల్లిపొర కాగితంలా భూమిని చుట్టబెట్టుకుని వున్నాడు. మన చిరకాల విశ్వాసాలన్నీ విపర్యయమై పోయాయి.

“కులపర్వతాలు గాలిలో విమానాల్లా ఎగురుతున్నాయి” అనే మూడు పాదాలలో ఒక చక్కటి శ్లేష. కులపర్వతాలు అంటే సంప్రదాయార్థంలో పర్వతశ్రేష్టాలని. కాని కుల పదాన్ని విడదీయడం ద్వారా కులాలనే పర్వతాలు విమానాల్లా ఎగిరిపోతున్న స్థితి ఏర్పడిందని కవి తెలుపుతున్నాడు. ఈ కావ్య రచనాకాలం నాటికి గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్య్రపోరాటం సాగుతోంది. ఆ దశలో కులాల ప్రాభవం విస్మరణీయమై పోయింది. ఇది చారిత్రక సత్యం!

దేవేంద్రుడంతటి వాడికి పతనావస్థ సంభవించింది. “కుష్టురోగంతో కాళ్ళూ చేతులూ పడిపోతే కిందపడి దొర్లుతూ ఏడుస్తున్నాడు” అంటూ ఒక జుగుప్సావహ వాస్తవిక చిత్రాన్ని అందిస్తాడు. ఇంకిపోయిన అమృతభాండంలో తడైనా తగులుతుందేమోనని వేళ్ళతో స్పృశిస్తున్న శచీదేవి అన్నప్పుడు మన పురాణగాధల మూఢవిశ్వాసాలను తూర్పారబడతాడు. తలా తోకా లేని వెర్రికథల కల్పనల్ని ఒక తాపు తన్నాడు. నా. బా దేవేంద్రుని దుస్సహరోగస్థితిలో శచీదేవి తిండికి నకనకలాడుతూ దరిద్రం అనుభవిస్తోంది.

“దేవేంద్రుని సింహాసనం మీద కూర్చుని వజ్రాయుధం తానొకప్పుడు కొండలను ఖండించిన రెక్కలన్నిటినీ పోగుచేసి మరల పర్వతభుజాలకు అంటిస్తున్నాది పేస్టుతో”

అన్నప్పుడు జరిగిన దుష్టసంహారమో, దుర్జనదమనమో, దుశ్శక్తిదళనమో సమయం చూసుకుని పునర్విజృంభించాయి అనే భావం వరకు పేచీ లేదు. కాని సింహాసనంపై ప్రభువుకు ప్రతినిధిగా కూర్చున్న వజ్రాయుధమే ఈ అతుకుడు కార్యమెలా నిర్వర్తిస్తోందో అవగతం కాదు. కాని కవిత్వం రెండూ రెళ్ళూ నాలుగు వంటి “ఫేక్ట్‌” కాదు! కొంత ఫేన్సీ, కొంత కల్పనా, వాస్తవంతో రంగరించినపుడే అది కవిత్వమవుతుంది.

గండభేరుండపక్షులు కలరవాలు చేస్తుంటే శ్రీశ్రీ పాడుదామన్నాడు. ఒకవైపు ఈ దృశ్యం జరుగుతుండగా అటు ప్రక్క నుంచి మరో విషాదదృశ్యం ప్రత్యక్షమయింది “అటుప్రక్క నుంచి మాసిన బట్టల మాటల మూటలు రేవులో తగలబెట్టుకుని ఏడుస్తూ ఎదురుగుండా తోచిన చాకలి సరస్వతిని చూసి, కోపంతో శ్రీశ్రీ తన్నేందుకు కాలెత్తి మూగయై నిలుచున్నాడు”

మాసిన మాటల మూటలు మోసుకుపోయి, రేవులో ఉతికి, శుభ్రం చేదామని తెచ్చుకుంది చాకలి సరస్వతి. కాని ఆ మూటలోని గుడ్డల రోత చూసి భరించలేక మంటలపాల్జేసింది. కాని ఆ గుడ్డలన్నీ ఎంతో గొప్పవారివి! ఎంతో మోతుబరులవి. ఎంతెంత పొగరుమోతులవో ఆ బట్టలన్న సంగతి జ్ఞాపకం వచ్చిందామెకు! ఎంత ప్రమాదం వాటిల్లుతుందోనన్న భయంతో ఏడుస్తూ ఎదురయిందా చాకలి సరస్వతి. ఆ ఏడుపు మొగం చూడలేక శ్రీశ్రీ కాలెత్తి తన్నుదామనుకున్నాడు. ఇంతలోనే ఆమె చేసిన పని తప్పు కాదని తాను చేదామనుకుంటున్న పని తప్పేమోనని తోచిందో కాని శ్రీశ్రీ మూగయై నిలుచున్నాడు. కింకర్తవ్యతా విముగ్ధుడై నిశ్చేతనుడయ్యాడని కవి ఉద్దేశ్యం.

“అయితేనేం పోతేనే” అన్నాడు తాను. ఎంతో సరదా పడి పరీ బజారులో కొన్న పాఁతుఁ. ఎంతో సరదాపడి మోజుపడి వెలిబజారుకుపోయి ఆ అమూల్యవస్తువు కొనుక్కున్నాడు. పాఁతుఁ అంటే ఒక అమూల్యనిధి. పూర్వులు ఎప్పుడో పాతిపెట్టిన అమూల్యసంపదలు గల లంకెబిందెలు వంటి వాటిని పాతు అనడం జాతీయమైన నుడికారం.

జర్మన్‌ సాహిత్య కోమటి.

“జర్మన్‌ సాహిత్య కోమటిని ప్రాధేయపడి తెచ్చిన వాల్‌ఖలేడ్‌, గురజాడ ప్రసాదించిన ముత్యాలసరం హాప్‌కిన్స్‌ను అర్థించి తెచ్చిన స్ప్రింగ్‌రిదిమ్‌ అన్నీ పోయాయన్నాడు నత్తిగా”

పైన ఉల్లేఖించిన ఐదు పాదాలలో చివరిపాదం నుంచి ప్రారంభించి వ్యాఖ్యానించడంలో ఒక సులువుంది!

Gerard Manly Hopkins అనే ఆంగ్లకవి సంప్రదాయకవులలో చివరివాడు. ఆధునిక కవులకు అగ్రేసరుడు కనక, ఆధునికాంగ్ల కవిత్వానికి అతను ఎలాంటివాడో తెలుగుకి గురజాడ అలాంటి వాడని నా. బా తన ఉపన్యాసాలలో తరచు వివరించేవాడు. హాప్‌కిన్స్‌ తెచ్చిన ఛందోవిశేషం స్ప్రింగ్‌ రిదిమ్‌.

గురజాడ మహాకవి అందించిన ముత్యాలసరాల గురించి తెలియని వారు ఎవరూ వుండరు. అయితే ఆయన ప్రయోగం చేసిన ఛందస్సుకు ముత్యాలసరం అని ఆయన పేరు పెట్టలేదు. ఆయన రాయబోయే కొత్తరకం కవితలను ముత్యాలసరాలని అన్నాడు. అదిన్నీ గుత్తునా ముత్యాల సరములు కూర్చి తేటయిన మాటలు అని తన పద్ధతి వివరించాడు. ఆయన తర్వాత ఉదాహరణ మాత్రంగా రచించిన ఆయన కొద్దికవితలకు ముత్యాలసరాలని అనుయాయులైన కవులు పేర్కొననారంభించారు.

ఇక వాల్‌ఖిలేండ్‌ అనేది మధ్యప్రాచ్యంలో అరబిక్‌ భాషలో ప్రాణవిశేషం గల ఒక కావ్యం! ఈ ఛందోరూపం Volk’s lied (వోక్స్‌లెడ్‌ అని పలుకుతారు) అనే జానపదఫణితికి సమీపమయినదే. దీని గురించి ఇంతకన్న భోగట్టా మనకి అనవసరం.

అసలైన గుప్తవిషయం జర్మన్‌ సాహిత్యకోమటి! ఆయన్ని అడిగి వాల్‌ఖిలాడ్‌ తెచ్చుకున్నారు శ్రీశ్రీ, నా. బా. డా. వి. ఎన్‌. శర్మ అనేవారు జర్మన్‌ భాషలో పి. హెచ్‌.డి. పట్టా తెచ్చుకున్నారు. జర్మన్‌ స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమెతో ఇండియాకు వచ్చి మద్రాసులో (మైలాపూర్‌) కిండర్‌గార్టెన్‌ స్కూల్‌ పెట్టారు. ఈ సంస్థ చాలా ప్రాముఖ్యత పొందింది! విశాలమైన ఆవరణలో పెద్ద భవనం నిర్మించుకుంది. ఆయన సన్నగా , బక్కపలచగా, చామనచాయగా ఉండేవారు. కోలముఖం, వెంట్రుకలు లేని తల. పంచె, లాల్చీ ధరించేవారు. జర్మన్‌ భాషలో మంచిపండితుడని మనవాళ్ళనుకునేవారు. కాని తెలుగుభాషలో ఆయనకు రచన అందుబాటు కాలేదు. తెలుగులో గ్రంధాలు రాయాలని పెద్ద యావ వుండేది. తెలుగు రచయితలందరితోనూ సన్నిహితంగా వుంటూ గోష్ఠి జరిపేవారు. తరచు ఆహ్వానించి గంటల తరబడిగా వారిని మాటాడిస్తూ వినేవాడు. మధ్యాహ్నభోజన సమయం వరకు వారిని మాడ్చి తను హాయిగా భోజనానికి వెళ్ళేవారు. మన ఆధునిక కవులు పూట భత్యం గాళ్ళు కదా! ఆ విషయం ఆయనకు తెలుసు! అయినా ఆర్థిక సహాయం అందించేవాడు కాడు. అందుకే ఆయన్ని లోపాయకారీగా శ్రీశ్రీ, నా. బా, జరుక్‌ వంటి వారు “జర్మనీ సాహిత్య కోమటి” అని వ్యవహరించుకునే వారు. మద్రాసులోని సాహిత్యమిత్రులంతా ఆయన్ని జర్మనీ శర్మ అనేవారు. ఆయన పూర్తిపెరు వఠ్యం నారాయణశర్మ! (ఇంటిపేరు గురించి ఇప్పుడు కొంచెం సంశయం వస్తోంది.) ఎన్‌. ఆర్‌. చందూర్‌, మాలతీ చందూర్‌ ఆయనకు బాగా సన్నిహితులు.

మాలతి గారితో కలిసి ఆయన ఒకసారి పిఠాపురం వచ్చారు. మాలతి గారి కజిన్‌ బ్రదర్‌ పిఠాపురం షుగర్‌ ఫేక్టరీలో ఛీఫ్‌ ఎకౌంటెంట్‌. వారితో నాకు మంచి కాలక్షేపం జరిగింది. పందిరి మల్లికార్జునరావు గారూ, శంభూప్రసాద్‌ గారూ వంటి మద్రాసు ఆంధ్రప్రముఖులు ఆయనకు మిత్రులు. ఆయన తెలుగులో కొన్ని పుస్తకాలు ప్రచురించారు. జర్మన్‌ కథలు అనే గ్రంధంలో తెలుగు భాష మరీ ఘోరంగా వుంది. కేంద్రసాహిత్య అకాడెమీ వారు బెర్టోల్డ్‌ బ్రెహ్టు మహత్తర ప్రతీకారాత్మక నాటకం మదర్‌ కరేజ్‌ని ఆయనచేత తెలుగులోకి అనువదింపజేసి గ్రంధంగా ప్రచురించారు. భారతి వారు ఆ గ్రంధంపై విపులంగా సమీక్ష రాసి పంపమని నన్ను కోరారు. అప్పటివరకూ నేను మదర్‌ కరేజ్‌ ఆంగ్లానువాదం చదవలేదు. సంపాదించి, చదివి సుదీర్ఘమూ సమగ్రమూ అయిన సమీక్ష రాసి, భారతికి పంపించాను. వెంటనే ప్రచురితమయింది. శ్రీ శర్మగారు నా సమీక్ష చదివి బాగా బాధపడినట్లు ఉత్తరం రాశారు. దానికి జవాబు రాస్తూ మీ రాతప్రతి నాకు పంపించి వుంటే అందలి తెలుగుభాషను చక్కగా సవరించి వుండేవాడ్ని కదా! అని రాశాను … ఆయనకి డబ్బు పిసినారితనం తప్ప మిగిలిన లక్షణాలన్నీ మంచివే! అందుకే మనవాళ్ళు “కోమటి” అని వ్యవహరించారు. శర్మ సహృదయుడు, సాహిత్యాభిమాని. బాగా సంపాదించుకున్నాడు. జర్మన్‌ భార్య తెలుగు నేర్చుకుంది. జర్మన్‌ యాసలో తెలుగు మాట్లాడేదనేవారు. ఆమెను నేను చూళ్ళేదు. శ్రీశ్రీ, నా. బా ఈ దంపతుల గురించి కాలక్షేపానికి చాలా చెబుతూండేవారు!

మద్రాసులో మహదేవన్‌ అనే గొప్ప ఆధునిక ఆంగ్లసాహిత్య ప్రియుడుండేవాడు. గ్రంధపఠనం మీద అభిమానం కొద్దీ ఆయన పుస్తకాల షాపు పెట్టి ఋథదపష ఇలలభష, ఖపలఫసబల ఇలలభష విరివిగా తెప్పించేవాడు. మనవాళ్ళు కొనుక్కోవడం గానీ, అక్కడే కూర్చుని చదువుకోవడం గానీ చేసేవారు. పుస్తకాలు మాసిపోతాయని ఆయన దెబ్బలాడేవాడు. ఆయన్ని మనవాళ్ళు లోపాయికారీగా సాహిత్యమార్జాలం అని వ్యవహరించేవారు. ఎందువల్లనో ఈ కావ్యంలో ఆయన ప్రసక్తి రాలేదు.

ఈ కావ్యంలో ఐకాంతిక ప్రతీకలు, గాధాస్ఫురణలూ వాడడం వల్ల కావ్యానికి కొంత అయోమయత కలిగిన మాట నిజమే! కాని వాటిని తెలుసుకుని చదివితే ఎంత ఆనందం కలుగుతుందో సహృదయులు గ్రహించగలరు! జేమ్స్‌ జాయిస్‌ సాహిత్యప్రభావంపై రిచ్ఛర్డ్‌ ఆల్‌డింగ్టన్‌ వ్యాసం రాస్తూ ఇలా అంటాడు. “he is obscure and justifies his obscurity; but how many others will write mere confusion and think it sublime? How many mere absurdities will be brough forth …?” అన్న మాట నా. బా కవిత్వానికి స్పష్టంగా సరిపోతుంది.

కొత్తసాధనాలు వెదుక్కుంటూ.

కష్టపడి సంపాదించుకున్న సాధనాలూ పరికరాలూ పోయాయి. అందుకే ఖంగారు పడుతూ శ్రీశ్రీ నత్తిగా చెప్పాడు. మరి పాట ఎలాగ? పక్కనే పడివున్న శేషుడి కోర పెరకాలి. వాడు చచ్చి భూమినంటుకుపోయాడు. గండభేరుండపక్షుల జంట తమ ఇద్దరినీ ఎత్తుకుపోదామని చూస్తోంది. ఆడ గండభేరుండపక్షి రెక్క మీద శేషుడి కోరతో డాలీ, శ్రీశ్రీ కలిసి ఒక పెద్ద చిత్రాన్ని రచించారు (సాల్వడార్‌ డాలీ స్పానిష్‌ చిత్రకారుడు) దానికి మాన్రే, నారాయణబాబు కలసి ఒక ఛాయాచిత్రం తీశారు. అదే ఇప్పుడు ఆధారమయింది.

ఆ పటం లోని చిత్రం రెండు అస్థిపంజరాలది. అస్థిపంజరాలకి లింగభేదంతో నిమిత్తం లేదు. అందమూ అవసరం లేదు. అయినా మన వ్యవహారానికి వాటిలో ఒకటి స్త్రీ అస్థిపంజరమనీ రెండవది పురుష అస్థిపంజరమనీ కేటాయించుకోవాలి. స్త్రీ అస్థిపంజరం చేతిలో తన గతించిన శృంగారజీవితానికి చిహ్నంగా గులాబీ అత్తరు బుడ్డీ వుంది. మెడలో మెరిసిపోతున్న కోహినూరు వజ్రమూ వుంది. పక్కన దీనంగా నిలబడిన మొగ అస్థిపంజరం ఏడుస్తోంది. దాని ఎముకలు నల్లబడ్డాయి, వేడెక్కిపోయాయి.

కాని, చేతిలో వజ్రవైఢూర్యాలు పొదిగిన బంగారు గునపం వుంది! అది సెక్సు ప్రతీక. దానితో తాజ్‌మహల్‌ తవ్వేస్తోంది. సంప్రదాయక సౌందర్యాలన్నిటినీ ధ్వంసం చేయాలన్నది డాడాయిస్టుల సిద్ధాంతం. ఈ పాద ప్రభావంతోనే కవి బైరాగి తన “చీకటి నీడలు” కవితాసంపుటిలో “తాజ్‌మహల్‌ను పడగొట్టండోయ్‌” అంటూ పొలికేకలతో కవిత రాశాడు. ఇంతలో ఆడ గండభేరుండపక్షి దగ్గరగా వచ్చి శ్రీశ్రీని ముక్కుతో అంకించుకుని విమానంలా లేచిపోనారంభించింది. “ఎక్కడికన్నా” అని గావుకేకపెట్టాడు నా. బా. ఈ గండంతో మాటలు పెగలని శ్రీశ్రీ మూగగా హస్తవిన్యాసం పట్టాడు. గరుడలోకానికంటూ అభినయముద్ర ప్రదర్శించి వ్యక్తం చేశాడు శ్రీశ్రీ. అలా అదృశ్యమయ్యేసరికి నా. బా కి కూడా మాటలు పెగల్లేదు. అపస్మారం కమ్మింది. మౌనం గానే మాటలు మననం చేసుకున్నాడు.

ఈ భూమిపై మానవుడు అవతరించిన తొలినాటి నిశనుంచి నేటివరకూ కలలు కంటూనే వున్నాడు. మానవజాతి కన్న కలలన్నీ సిమ్మెంటుగా మార్చి మధురోహల గోడలు కడుతూనే వున్నారు. కాలప్రవాహం ఆ గోడలను తాకుతూనే వుంది. ఘూర్ణిస్తూనే వుంది. ఎప్పుడో ఒకప్పుడు కాలాంతం కాక తప్పదు. ఆ విపత్తు నూహిస్తూ తాను కాళ్ళు చాపుక్కూర్చున్నాడు.

సరిహద్దులు వెలిసిపోతున్నాయి. దిక్‌భిత్తికల పెళ్లలు రాలిపోతున్నాయి. ఆ పరిస్థితిని చూసి కొందరు సనాతనులు ఇదేదో ప్రళయకాలం సమీపించిందని భావిస్తున్నారు. దేశాల నడుమ ఎల్లలు తొలగిపోతున్నాయి. మర్యాదలన్నీ అదృశ్యమైపోతున్నాయి. ఒక నూతనప్రపంచం ఆవిర్భవిస్తోంది.

కవి లేచాడు. ఎదురుగా రజతాచలం కనబడింది. ఎక్కాడు. ఆ పర్వతం పోగా పోగా ఒక అందాలలోయ. హరితశాద్వల సానువు. ఆ లోయలో పూలతోట. కొండలూ లోయలూ అన్నీ అన్యాపదేశంగా వేరే అర్థాలకు దోహదం చేసేవే! లోయలో చెట్లు లేవు. అన్నీ పువ్వులే! ఆ పూలచుట్టూ ఉపనిషత్తులే తుమ్మెదలై ఝంకారం చేస్తున్నాయి. ఆ తోటలో పార్వతి నగ్నంగా నిలబడి పూలు కోస్తున్నాది. ఒక మూల ఈశ్వరుడు నిద్రపోతున్నాడు. వాడు లింగాకారుడని మరువకూడదు.

“పార్వతీదర్శన మయ్యేసరికి నా బట్ట అంటుకున్నాది నే కాలిపోతున్నాను మూగనై నిలుచున్నాను”

అనే నాలుగు పంక్తులలో కవి తెలుగుభాషకు గల నైసర్గికశక్తిని చక్కగా కొల్లగొట్టాడు. “అంటుకున్నది” అనే క్రియలో మంటకి కాలడం, వంటికి అతుక్కుపోవడం, స్పర్శా వగైరా చాలా అర్థాలు స్ఫురిస్తాయి. ఇక్కడ పార్వతీ నగ్నదర్శనం కవికి ఇజాక్యులేషన్‌ కలిగించింది. దానితో అతని బట్ట వంటికి అంటుకుపోయింది. మళ్ళీ కవి ఈ అంటుకున్న శబ్దం నుంచి కాలిపోవడాన్ని ప్రదర్శిస్తాడు. నగ్నపార్వతి కామప్రేరకమై అతని వంటిని దహించింది. చేతలుడిగాయి. మాటలుడిగాయి. మూగగా నిల్చున్నాడు.

తెలుగు ఆధునిక కవిత్వంలో ఇంత గొప్ప అధివాస్తవికత ధ్వని ప్రధాన అభివ్యక్తి వేరొకటి కానరాదు.

“దగ్గరగా ఒక మౌనశంఖం తోచింది మౌనశంఖం స్పృశించా నా గుండె అంతా హంసయై సోహం అని అరిచింది”

అనే పాదాలలోని మౌనశంఖం పురుషాంగ ప్రతీక! అది అద్వైతాన్ని ఉపదేశిస్తోంది. ప్రస్తుతం నిర్వీర్యమై, సుప్తమై, మౌనం వహించింది. తాను స్పృశించాడు. అయినా జడమే. ఈ నిష్కృతిలో తన గుండె సంపూర్ణమైన హంసగా మారిపోయింది. అహంకార మమకారాలకు అతీతమైన స్థితి హంస! కనుకనే సోహం అని అరిచింది. అది వేదాంత పరిభాష. బంధవిముక్తి తర్వాత వచ్చే శివైక్యస్థితి.

“నా చైతన్యమంతా సప్తసముద్రాల సహస్ర కోటి బాహువుల మెరిసే నురగయి ఛుయ్యిమంది”

చైతన్యం కర్మణ్యత్వానికి ప్రతీక. అది విరాడ్రూపం ధరించింది. సప్తసముద్రాల తరంగాలను సహస్రకోటి బాహువులుగా అమర్చుకుంది. కాని ఏం లాభం? ఆ తరంగాలు ఒడ్డుకు తగిలి నురగగా మారిపోయాయి. నురగబుడగలు ఛుయ్యిమంటూ పేలిపోయాయి. నిస్తేజమై, నిర్వ్యాపారమై, నిశ్చేతనత్వం దురాక్రమించింది.

కాని, “నా ఎముకల మూలుగులో చంద్రోదయమైంది నా శరీరం కాశ్యప భస్మరాశియై తరలించింది”

ఎముకల లోపలి మూలుగు (మారో) శక్తినిచ్చే ధాతువు. ఆ మూలుగులో చంద్రోదయమైంది. అంతరాంతరాలలో జ్ఞానకాంతి వెలిసింది. అప్పుడు తన శరీరం హుతమై పోయిన కాశ్యపబ్రహ్మ భస్మరాశిగా మారిపోనారంభించింది! (బహుశ శ్రీరంగం వారు కాశ్యప గోత్రీకులేమో!)

“నా ప్రాణం భగీరథుడయింది నా వెన్నెముక మీద ఆకాశగంగా జలపాతం వర్షించింది” అనడం ద్వారా ఆకాశగంగను భూమిపైకి దింపిన భగీరథుని విజయాన్ని పురాణప్రతీకగా మన స్పృహలోకి తేవడమే కాదు, తన వెన్నెముక మీద ఆకాశగంగా జలపాతం వర్షించడం ద్వారా తన సాధారణ మానవీయ శరీరానికి దైవత్వం సిద్ధించినట్లు కూడ భావ ఉన్మీలనం కలిగిస్తాడు.

“నా పొత్తికడుపు హిమాచలతనయ తన చల్లని మంచుహస్తాలతో నిమిరింది”

నగ్నంగా పూలు కోస్తున్న పార్వతి కవిని విడిచిపెట్టలేదు. కాలిపోతూ మూగయై నిలిచిన తన దగ్గరకు ఆమె వచ్చింది. ఆమె హిమాచలతనయ! చల్లని మంచు వలె ఉన్న హస్తంతో తన పొత్తికడుపు మీద నిమిరిందామె. ఆ స్పర్శ అతనిలో పునరుజ్జీవనం కలిగించింది.

“రవం నీరవానికి ఉబరసలబసబహప ” అనే పాదంతో ఈ కావ్యం పరిసమాప్తమయింది. మొత్తం కావ్యమంతా ఒకే ప్రమాణం లోకి ఇమిడి మన ఆలోచనలకు పూర్ణత్వమిస్తుంది.

Dimunitive అంటే Describing small specimen of the thing denoted by corresponding private word!” ఇంత అర్థం ఉన్న ఈ పదాన్ని ప్రజ్ఞావంతంగా ప్రయోగించి ఈ కావ్యానికి ఒక సంపూర్ణత్వం సాధించాడు నారాయణబాబు.

రవంలో నీరవం వుంది. నీరవంలో రవం వుంది…. అణువు బ్రహ్మాండంలో భాగం. బ్రహ్మాండం పరమాణువులతో పరిపూర్ణమైంది. ప్రతి పరమాణువు బ్రహ్మాండానికి ప్రతినిధి. పరామర్శిస్తూనే వుంటుంది. దాని ఆదిమ స్వరూపం సంపూర్ణత్వంతో గల సంబంధాన్ని వ్యక్తం చేస్తూనే వుంటుంది. అదే మౌనశంఖం.

పార్వతి శీతలహస్తాలు, శ్రీశ్రీ, గండభేరుండపక్షులు అన్నీ ఆ బ్రహ్మాండంలోని పరమాణువులే! కనుకనే హృదయం హంసయై, నిరంజనమై సోహం అని అరిచింది. బ్రహ్మైక్యం పొందింది.

ఈ వ్యాసాన్ని ముగిస్తూ ఒక విషయం చెప్పవలసి వుంది. ప్రపంచంలో ఏ దేశంలోనూ కవులెవ్వరూ సర్రియలిజం వంటి ప్రయోగవాదాలను నిష్ప్రయోజకంగా ప్రయుక్తం చేయకోరలేదు. వారిలో నాయకమణిగా భాసిల్లిన ఆంద్రే బ్రిటాయే స్వయంగా ఇలా ఉద్ఘాటించాడు
“Let it be clearly understood that for us, surrealists, the interest of the thought cannot cease to go hand in hand with the interest of the working class, and armed attack on it cannot fail to be considered by us as attacks on thought likewise”

అలా అంటూనే కవులకొక కితాబు కూడా ఇస్తున్నాడు. అదేమంటే A poet can be effective modern prophet అని.
----------------------------------------------------------
రచన: సోమసుందర్ ఆవంత్స, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, August 14, 2019

మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం: తొలిభాగం


మౌనశంఖం నారాయణబాబు అమోఘకావ్యం: తొలిభాగం




సాహితీమిత్రులారా!

“1936 జూన్‌ నెల! సుదీర్ఘ శీతాకాలపు కత్తికోతల విపత్తుల నుంచి కాస్త తెరిపిని పడ్డ సమయం! వేసవి ఒక నెల గడిచింది. లండన్‌ మహానగరంలో అంతర్జాతీయ సర్రియలిస్టు చిత్రకళాప్రదర్శనం ఏర్పాటయింది! మేధావాతావరణంలో పిడుగులజడి ప్రారంభమయింది. ఆశ్చర్యమూ, సంశయమూ, ఇంద్రజాలమూ, తృణీకారమూ వంటి విరుద్ధభావాలు ప్రేక్షకులలో చెలరేగాయి. సంస్కృతికీ, నాగరికతకూ ప్రఖ్యాతి వహించిన దినపత్రికలకు ప్రతిష్టంభన వ్యాపించింది. ఏం రాయాలో పాలుపోలేదు. వెక్కిరించడమా? ఈలలూ చప్పట్లూ చరచడమా? అవమానించడమా? దేనికీ దారి కనిపించలేదు! అయినా లండన్‌ నగర మేధావులంతా ఈ ప్రదర్శన గురించే మాట్లాడుకున్నారు. ఎవరికీ ఏ వివరణా దొరకలేదు! ఎలా వ్యాఖ్యానించాలో అర్థం కాలేదు! అంతా ఒక సంశయాత్మక పరిస్థితి ….”

అని వర్ణించిన వాడు హెర్బెర్ట్‌ రీడ్‌ మహాశయుడు! ఆయన అప్పటికే సర్‌ బిరుదు పొందినవాడు!

సరిగ్గా ఇలాంటి పరిస్థితే 1940వ దశకం తొలిరోజుల్లో తెలుగు కవితాక్షేత్రంలో సంభవించింది! ఇక్కడ అధివాస్తవిక చిత్రప్రదర్శన వల్ల కాదు. శ్రీశ్రీ, నారాయణబాబులు అధివాస్తవిక కవితాప్రయోగాలు ఆవిష్కరిస్తున్న తొలిరోజులవి! అధివాస్తవికతకే కాదు, అత్యాధునిక కవితాధోరణులకు సైతం ఆచార్య రోణంకి అప్పలస్వామి భాష్యకారుడు! ఆయన సన్నిహిత మిత్రులు నారాయణబాబు, శ్రీశ్రీ, చాసోలు నూతనోత్సాహం పొంది నూత్న కవితారీతులకు అంకురార్పణ చేస్తున్నారు. వేరొక ప్రక్కనుండి పురిపండా అప్పలస్వామి వంగభాషలో అతినవ్య విప్లవ కవిత్వాన్ని వెలయిస్తున్న కాజా నజ్రుల్‌ ఇస్లాం కవితల్ని గొంతెత్తి గానం చేస్తూ తెలుగులో వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ రెండు ప్రాక్పశ్చిమ ధోరణులూ ఆ నాటి అగ్రేసరకవులకు ఉత్సేకమందిస్తున్నాయి! శ్రీరంగం శ్రీనివాసరావు, అధివాస్తవిక కవిత్వం గురించి ఎంత ఎక్కువ చెప్పేవాడో అంత తక్కువ రాశాడు! కానీ శ్రీరంగం నారాయణబాబు అధివాస్తవిక కవిత్వం అచ్చమైన స్వరూపస్వభావాల్ని రచించి చూపాడు!

శ్రీ.నా.బా. మౌనశంఖం రచించినది 1943 చివరలో! నేను తొలిసారి అతని ముఖతా విన్నది 1944 ఏప్రిల్‌, మే నెలల్లో. అందుకు సాక్ష్యం నా డైరీలో ఉంది. ఎందువల్లనో శ్రీ.నా.బా. రుధిరజ్యోతిని నవోదయ పబ్లిషర్స్‌ ప్రథమ ముద్రణగా వేసిన 1972లో కాని, 1976 నాటి ద్వితీయముద్రణలో గాని, ఈ మౌనశంఖం రచించబడిన తేదీ ఇవ్వబడలేదు. అది సరికొత్త కవితారీతిని, ఒక అంతర్జాతీయ అభివ్యక్తి పథాన్నీ సాధించింది. అతను అతినవ్యకవితలు 1933 నుంచీ రాస్తూనే వున్నట్లు మనకు సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. రుధిరజ్యోతిలో 41 కవితలు సంకలితమయ్యాయి! మరికొన్ని కవితలు కాలగర్భంలో కలిసిపోయాయి! అతనికి రాత అలవాటు లేదు! దస్తూరీ మరీ పసిపిల్లవాని రాతలా కొంకర్లు పోతుండేది! అందువల్ల ప్రతి కవితా ధారణలోనే బ్రతికేది! ఈ కారణం వల్లనే మరో పదికవితలు అదృశ్యమై పోయాయని చాసో వంటి సన్నిహితులు జ్ఞాపకం చేసుకునే వారు.

పూర్వాశ్రమంలో శ్రీ.నా.బా భావకవిగా మిణుగురులు రాశారు. వాటి గురించి జ్ఞాపకం చేసుకునేవారే కాదు!

నారాయణబాబు నేపథ్యం.

నారాయణబాబు గొప్ప సంపన్నునిగా జన్మించాడు. నికృష్టదరిద్రునిగా చనిపోయాడు! శ్రీ.నా.బా తండ్రి శ్రీరంగం సుందరరామయ్య గారున్నూ శ్రీశ్రీ తండ్రి వెంకటరమణయ్య గారున్నూ స్వయానా అన్నతమ్ములై పూడిపెద్దివారింట పుట్టారు! ఇరువురూ శ్రీరంగం సోదరులకు దత్తులయ్యారు. శ్రీశ్రీ చిన్న స్కూలు మాస్టరు కొడుకు! నా.బా తండ్రి పెద్ద ఆస్తిపరునికి దత్తుడై ప్లీడరుగా మరింత సంపాదించాడు. ఆయన దత్తతతండ్రి విజయనగర సంస్థానంలో ఉద్యోగస్తుడై ఆస్తి సంపాదించుకున్నాడు. ఈ కలిమిలేముల వ్యత్యాసం వల్ల కలిగిన ఈర్య్షాద్వేషాలు ఈ రెండు కుటుంబాల మధ్యా సహజాతాలుగా పెంపొందాయి. నారాయణబాబు, శ్రీశ్రీ కవులయిన తర్వాత ఆ వైషమ్యాలు గతించాయి. దానికి కొంత కారణం నారాయణబాబు తండ్రి దాయాదుల నుంచి తనకు సంక్రమించవలసిన ఆస్తికోసం ఉన్నదంతా ఊడ్చి, కోర్టులెమ్మట తిరిగి, అపజయం పాలయ్యాడు. కొడుక్కి దరిద్రం మిగిల్చాడు. కనుకనే ఆ దరిద్రనారాయణుడికి మరొకరిని ద్వేషించవలసిన అవసరం లేకుండా పోయింది! కాని శ్రీశ్రీకి మాత్రం ఎంత అణచుకుంటున్నా చివరివరకూ ఆ అసహనం మిగిలిపోయింది.

కారణమేమిటని ఆ దరిద్రుని అడిగితే “అది అంతే, స్వభావాన్ని ఎవరు మార్చగలరు? వేపకు చేదు వుందంటే ఎవరేం చేయగలరు?” అని ప్రశ్నించాడు. ఆరుద్ర ఇరువురికీ సన్నిహిత బంధువు.

ప్రఖ్యాతుడైన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి దౌహిత్రుడు ఉపాధ్యాయుల సూర్యనారాయణ అనే సహృదయుడుండేవాడు. ఆజానుబాహువు. స్ఫురద్రూపి, అభ్యుదయవాది, నాకు సన్నిహిత మిత్రుడు, అవసరాల, చాసో, సోమరాజు, శెట్టి ఈశ్వరరావు, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు, రోణంకి మాస్టారు, ఆ.నా. శర్మ ప్రభృతి విజయనగరం మేధావులందరికీ సూర్యనారాయణ సన్నిహితుడు. బంకులదిబ్బ సమీపంలో ఉన్న సుందరరామయ్య గారి మేడ ఆయన పోకముందే అప్పుల నిమిత్తం ఇతరులకు పోయింది. 1969లో మహారాజా సంస్కృత కళాశాల శతవార్షికోత్సవాలకు ఒక ఉపన్యాసకుడిగా నన్ను ఆహ్వానించారు. వెళ్ళి రెండు రోజులున్నాను. నన్ను ఆహ్వానించడానికి పెద్ద కారణమేమీ కనిపించలేదు. సర్వశ్రీ భాట్నం శ్రీరాంమూర్తి, అన్నాప్రగడ శేషసాయి, సాంబశివరావు అనే వారు నాకు మిత్రులు! శ్రీ భాట్నం రాజావారి ప్రతినిథిగా, సంస్కృత కళాశాల కార్యదర్శి! శేషసాయి ప్రిన్సిపాల్‌! సాంబశివరావు అధ్యాపకుడు. నూత్నవస్త్రాలతో నాకు సన్మానం కూడా చేశారు. నేను విజయనగరంలో ఉన్నంతకాలం మిత్రుడు ఉపాధ్యాయుల నన్ను విడిచిపెట్టలేదు. నారాయణబాబు పుట్టినయిల్లు చూద్దామనే ఇద్దరం కలిసి బంకులదిబ్బ దగ్గరకు వెళ్ళాం! ఆ ఇంటి ప్రస్తుత యజమాని శ్రీ పులిపాక సీతాపతిరావు అని తెలిసింది. ఆయన మాకు దూరపుబంధువు! గాయని పి. సుశీలకి స్వయానా పినతండ్రి. ఉపాధ్యాయుల సూర్యనారాయణ అర్థాయుష్కునిగా 1970 ప్రాంతంలో చనిపోయాడు. శ్రీ.నా.బా అంటే అతనికి ఎంతో ప్రాణం! అతని స్వదస్తూరీతో రాసిన శ్రీ.నా.బా గీతాల పుస్తకం నా దగ్గర చాలాకాలం ఉండిపోయింది. శ్రీ.నా.బా ను ఆత్మీయంగా ప్రేమించిన వారు విజయనగరంలో ఎందరో వున్నారు. ద్వారం వెంకటస్వామినాయుడు, ఆయన కుమారుడు భావన్నారాయణరావు, చొప్పెల్ల సూర్యనారాయణ భాగవతార్‌ వంటి వారెందరో!

మౌనశంఖం.

ఈ కావ్యారంభంలో కవితాస్వరూపంలోనే పరిచయవాక్యాలు రాయడం ఇదే ప్రథమం! పూర్వకావ్యాలలో అవతారికలుండేవి! కాని వాటిలో కావ్యగతార్థాల గురించి కాక, ఇతరేతర విషయాలు ప్రస్తావించబడేవి! కృతిపతి వర్ణన, అతని వంశావళి, షష్య్టంతాలు వగైరాలుండేవి. కాని మౌనశంఖంలో మాత్రం జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి ఈ కావ్యం గురించి ప్రస్తావిస్తాడు. తాను శ్రీశ్రీ ద్వారా విన్నసంగతీ, పొందిన అనుభూతీ వర్ణించాడు. నారాయణబాబు కావ్యం మౌనశంఖం శ్రీశ్రీ చదివి వినిపించాడు. తానెంతో ఆనందించాడు. హృదయపూర్వకంగా పాదాభివందనం చేద్దామని వచ్చాడు. ప్రేమతో అతని గుండెల్లో తన తల దాచుకో దలిచాడు. గుండెలో అనే పదం ఇక్కడ కవితాప్రతిభకూ ప్రేమాభిమానాలకూ ప్రతీక! తన తల అనేక ఆలోచనలతోనూ సంప్రదాయక కావ్య మర్యాదల తోనూ అనుస్యూతమై కళపెళలాడుతుంది. నీ మాటల్లో అనగా కవితామయ వాక్యాల్లో తన చిరంతన వ్యధను డించుకోదలచానని జరుక్‌ అన్నాడు. తన ఆత్మను అతని ఆత్మతో విలీనం చేయదలచాడు. అయితే ఆ కవితావిజయానికి తన ఆంతరంగిక ఆమోదం అందించాలని ఆత్రపడుతున్నాడు!

నా పతంగి తాళ్ళు తెంపి

పతంగం అంటే పక్షి! పతంగ్‌ అని హిందీలో గాలిపడగకు కూడా వాడతారు. తెలుగుదేశంలో పతంగి అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఆంగ్లంలో కైట్‌ మాదిరిగా గ్రద్దకీ, గాలిపటానికీ ఉభయార్థకంగా ఒకే పదం ప్రయుక్తమవుతుంది. ఆ పతంగి తాళ్ళు మనిషి చేతుల్లో ఉన్నప్పుడు దాని పోకడలు తన కంట్రోల్‌లో ఉంటాయి. అట్టి అదుపు లేకుండా వాటిని తెంపి, పతంగికి యధేచ్ఛాగమనం కలిగిస్తానంటాడు. నిత్య కావ్యాధ్యయనం వల్ల తన పతంగి నిరంతర సంశమనంలో తన రసభావాలను అదుపు చేస్తోంది. సంప్రదాయ జాటిల్యం ఒక జాడ్యంగా తయారయింది. వాటిని తెంపేస్తే తప్ప, ఆ మానసిక పతంగికి పూర్తి స్వేచ్ఛ లభించదని నా.బా అంటున్నాడు. ఆ పని ఎప్పుడో చేయగల్గాడు. అతని కవితాభివ్యక్తిలో యధేచ్ఛ స్పష్టాకృతి పొందింది. ఆ మాట శ్రీశ్రీ కూడా ఆమోదించాడు, జలసూత్రం దగ్గర!

పైగా జరుక్‌ జలానికే సూత్రబద్ధం చేసినవాడు. పతంగికి సూత్రబద్ధత ఉండదా? కనుక నీ నా పతంగి తాళ్ళు అని ఉభయుల కట్టడులూ తెంపెయ్యాలని నిశ్చయించానంటున్నాడు.

రూపాయి మీద చల్లడం.

ఇక్కడ శవం మీద చిల్లరడబ్బులు చల్లడం అనే పద్ధతిగా కాదు. కనకాభిషేక సందర్భంలో బంగారుకాసులు తలమీంచి పోస్తారు. అది సంప్రదాయం. కాని, మనం పరాయిపాలనలో బానిసలుగా బ్రతుకుతున్నాం. మనకారోజులలో జార్జిమొగం వెండిబిళ్ళలే సర్వం! కనక, కనకాభిషేకానికి బదులు రూపాయిలే అతని మీద జల్లి తన గౌరవాన్ని వెల్లడించగలనంటున్నాడు జరుక్‌! ఆ కర్తవ్యం నిర్వర్తించి వెళ్ళిపోదామని తద్వారా రసజ్ఞునిగా తన బాధ్యత నెరవేర్చుకుంటాననీ వ్యక్తం చేస్తున్నాడు.

ఇంత గంభీరమైన ఆకాంక్షతో జలసూత్రం వచ్చేసరికి, నా.బా అయిపు లేడు. అతడికి ఆశాభంగమయింది. కోపం వచ్చింది. ఆ కోపంలో తమ మధ్య గోప్యంగా వున్న కొన్ని సంగతులు బహిర్గతం చేస్తున్నాడు. “ముంగంబాకంలో ఆమె పక్కలో దూరాడా ఈ త్రాష్టుడు?” అనుకున్నాడు. అది ప్రేమపూర్వకనింద. అభియోగం కాదు. ముంగంబాకంలో ఒక అరవవేశ్యతో ఎప్పుడు రూపాయి దొరికితే అప్పుడు నా. బా దాంపత్యం నడిపేవాడు. అప్పుడప్పుడు మైథునాదికాలు చేయకపోతే శారీరక ఆరోగ్యం చెడిపోతుందని బహిరంగంగానే చెప్పుకునే వాడు. అతడికి కళత్రయోగం లేదు. చిన్నప్పుడే ఒక అయోగ్యురాలితో వివాహం జరిగింది. ఆమె మరుగుజ్జు, మాచకమ్మ. వచ్చినదారినే వెళ్ళిపోయింది. అతనెప్పుడూ సహజాతాల గురించి గుప్తం చేయడం గానీ అవి రహస్యప్రక్రియలుగా భావించడం గాని ఆత్మవంచనగా నిరసించేవాడు. చలం గారి తర్వాత పుట్టిన ఆధునిక కవులు ఇన్‌హిబిషన్స్‌ దాచుకుంటే మనసుకి జబ్బు పడుతుందని బాహాటంగా చెప్పేవారు.

“అరవ ఆర్భాటం ఎదురుగుండానో”

అని జలసూత్రం అన్న మాటకు ఒక పురాస్మృతి వుంది. నా. బా నివసించే బ్రహ్మచారి గది కెదురుగా అరవస్త్రీలు నిత్యం పెద్దగా అరుచుకుంటూ రహస్యాలు మాట్లాడుకునేవారు. లేదా, జగడాలు సాగించేవారు. అతని గది ఓనరు లావుగా, పొట్టిగా, వికారంగా వుండేవాడు. అతన్ని వీళ్ళంతా “పందికొక్కు”గా వ్యవహరించుకునే వారు. నా. బా అంతరాత్మ ఎక్కడికెక్కడికో విహరిస్తూ జలసూత్రంకు దొరక్కపోవడం వల్ల తన ఆనందాన్ని వ్యక్తం చేయలేక, రకరకాల ఊహలు సారిస్తాడు. ఇదంతా మౌనశంఖం కావ్యానికి ఉపోద్ఘాతం!

యధాలాపంగా ఫేక్చువల్‌ ్‌ మేటర్‌గా సాధారణాలాపం ప్రారంభమవుతుంది. కాడ్‌లీవర్‌ ఆయిల్‌లో డి విటమిన్‌ వుంది. కోడుగుడ్లు ధాతుపుష్టి. అంతవరకూ ఫరవాలేదు. ఆటోమేటిక్‌ రైటింగ్‌ సర్రియలిజంలో అంతర్భాగం. ఈ సాధారణవిషయాల నుంచి కవి వెంటనే ఒక ఉత్తుంగ లంఘనం చేస్తాడు.

“కాకా తువ్వ తెలుపు”

అంటాడు. ఇది కూడా మననాటి వాడికకు దూరమైందే! అతనుద్దేశించినది నిర్దుష్టంగా తెలియదు. కాకాతువ్వ అనేది కాకరపువ్వొత్తి వంటి దీపావళిసామగ్రికి ప్రాంతీయ పరిభాషగా భావించవచ్చునా? “కోయిల నలుపు” అనేది ఆ పక్షి స్వరూప చిత్రణ.

ఆకాశం పొడవు, భూమి వెడల్పు అన్న మాటల జంటతో వాటి నడుమ దాంపత్యం నెలకొల్పుతాడు. ఆ భావాన్ని బలపరచడానికే తర్వాతపాదంలో ఆకాశం ప్రవళాధరం అందుకొస్తే కదా మాధుర్యం తెలిసేది? ప్రవాళం అంటే పగడం. పగడపు రంగు పెదవి అనడం కవిసమయమే! అందితే మాధుర్యం తెలుస్తుంది కాని అందదు.

కవి పడుకున్నాడు. మాగన్ను పట్టింది. సబ్‌కాన్షస్‌ మేలుకుంటోంది. అంతశ్చేతనకు లోకంలో విసిరే లక్ష మెలికలు స్ఫురించాయి. దానితో తన శరీరమే మెలికలు తిరిగినట్లు భ్రమ కలిగింది. పైగా సెక్సు వాంఛ కూడ అర్థజాగృతిలో విజృంభిస్తోంది! ఆ మెలికల వల్ల స్వపరభేదం పోయింది. సెంట్రల్‌ ఈగో నిస్తబ్ధమయింది. అంతా కొత్తగా వుంది.

ఎవరు నువ్వు అని అడుగుతోంది. ఇందులో మెట్టవేదాంతులు బోధించే నువ్వెవరు? నేనెవరు? అనే ప్రశ్నల పరంపర కూడా ధ్వనిస్తుంది.

ఇక భూమి యావత్తూ మరకతమణులు పరిచినట్లు పసరిక అంకురించగా దాని చివురు సూదిమొనలతో తన పాదం గోకి, నీవెవరు? అని అడుగుతుంది. “నేను కనిపించే శరీరమా? కనిపించని ఆత్మా?” ఏం చెప్పాలి కవి?

గాలి ఉదయాస్తమయాలలో తప్పక తన భుజం తడుతుంది. పెద్ద తెలివిగా నీవెవరు అని అడుగుతుంది.

ఆకాశం విశాలఫలకంపై రెండు ప్రశ్నార్థకాలను చిత్రించింది. అవి బ్రహ్మాండమంతా ఆవరించాయి. ఆ ప్రకృతి చిత్రాలున్నూ అడుగుతున్నాయి, నీవెవరు, నీవెవరు?

ఏమని చెబుతాడు కవి? తన పేరూ వూరూ చెబితే ఆ పంచభూతాలకేం తెలుస్తుంది? అసలు “బీయింగ్‌” కు పేర్లతో పనేముంది? వ్యక్తిత్వం భౌతికమా? అభౌతికమా? అంతా మిథ్య.

ఊటీ అని ప్రాచుర్యంగా పిలవబడే నీలగిరి ప్రాంతం (ఉదకమండలం) అతిశీతల ప్రదేశం. నీళ్ళు గడ్డకడతాయి. అక్కడ ఒక అభాగ్యురాలు పురుడు పోసుకుంది. శీతవాతం సోకి చనిపోయింది. డాక్టరు శవపరీక్ష జరిపాడు. ఆ చూలాలి వక్షంలో గడ్డకట్టిన “చనుబాల జిడ్డును” అని తనను తాను వర్ణించుకుంటాడు నా. బా. గడ్డకట్టినపుడు ద్రవపదార్థానికి ఘనపదార్థపు లక్షణాలేర్పడతాయి. ఆ విధంగా తనకేర్పడిన ఆకృతి ఒక తల్లి విషాదనిష్క్రమణ నుంచి రూపొందిందనే కరుణామయచిత్రం ప్రదర్శిస్తాడు. అతని బ్రతుకు భయంకరవిషాదంతో ఆరంభమయిందని కవి వివరించాడు. గడ్డకట్టిన పాలజిడ్డు తన శరీరాకృతితో ఉపమించుకుంటున్నాడు.

తన జననానికి వేరొక ప్రారబ్ధసంచితార్థకమూ వుంది. తాగి చనిపోయిన పుండాకోరుని, డాక్టరు శవపరీక్ష చేయగా అతని కడుపులో అరగకుండా మిగిలిపోయిన సారాచుక్క పైకి ఒలుకుతుంది. అదీ తానేనని చెప్పుకున్నాడు. తాగి తాగి మైకంలో చనిపోగా కడుపులో మిగిలిపోయిన సారాయే తన రూపము! అన్న దానిలో ఒక గుప్తార్థం ఉంది. తన తండ్రి ధనదాహంతో దాయాదుల ఆస్తులకు తానే వారసుడనని వ్యాజ్యం చేసి సర్వనాశనమైపోగా, తాను నాశనం చెందక, మిగిలి పైకి ఒలికిన మాదకద్రవ్యం వంటిది తన జీవితం అని ధ్వనిస్తాడు. ఈ రెండు అధివాస్తవిక పదచిత్రాలూ విషాదాంతగాంభీర్యాన్ని సద్యస్ఫూర్తిగా నిలుపుతున్నాయి. ఒకటే నేపథ్య వారసత్వానికి తన దయనీయ జీవితావరణమే ప్రతీకాత్మక రూపమని కవి చెప్పడం రహస్యంగా ద్యోతకమౌతుంది. తెలుగుసాహిత్యంలో నా.బా తో ఏర్పడిన భవిష్యత్‌ సూచన అది!

ఇంకా తానెవరని అడిగేవాళ్ళుంటారా? ఉంటే అంతకన్న విషాదాంతము, బాధాకరచిత్రణలతో తనను ప్రతిష్టించుకుంటాడు.

“చూలాలై మృతశిశువుని కని గుండెల్లో పాలే పాముకాటులా బాధపెడితే ఒక ఇల్లాలు ఒక చీకటి రాత్రిలో వీధికాలువలో కురిపించిన పాలవానను”

అని మరీ దయనీయంగా చిత్రించుకున్నాడు. అందరిలాగే గర్భవతి అయిన ఒక ఇల్లాలు సాధారణప్రసవం పొందక గర్భంలోనే శిశివు చనిపోగా ఆ మృతశిశువును డాక్టర్లు తొలిగించారు. తాగడానికి బిడ్డ లేకపోయినా చూలాలుకు స్తన్యం చేపుకు వస్తుంది. వక్షం పోట్లు పెడుతుంది. దుస్సహబాధ; ఎవరూ చూడని రాత్రివేళ వీధికాలువలో తను చనుబాలు పిండి వాన కురిపించగా తానై రూపు దాల్చానంటాడు నా. బా. ఈ పదచిత్రాన్ని ఊహిస్తూ అనుభవించడమే తప్ప అర్థవివరణమో, వ్యాఖ్యానమో అందించడం సాధ్యం కాదు కదా! తన పుట్టుక ఎంత విషాదాంత సంఘటనో గాఢంగా చెప్పాలంటే ఈ ఘోరచిత్రాలు తప్ప, కవికి మరో ఆధారం ఏముంటుంది?

ఇంతకీ అసలు ప్రశ్న మిగిలేవుండిపోయింది. తానెవరు? ఎక్కడివాడు? ఎలా వచ్చాడు? అనే ప్రశ్నలతో పాఠకుడు వేగిపోవడం నిష్ఫలమే! తానెవరైనా చనుబాల బిడ్డైనా, కడుపులో మిగిలిన సారా చుక్కైనా, వీధికాలువలో కురిసిన పాల వానైనా, మన బ్రతుకులను కలవరపెట్టవు! దారుణ దుఃఖం ఆచ్ఛాదితమై పుట్టినవాడు కవి! తన గురించి చెప్పుకోవాలంటే తన ప్రవర చెప్పాలి. అది మిత్రబృందాల సంబంధి మాత్రమే! వైయక్తికం కానేకాదు!

“ఇంతకూ ఎవరైతేనే రుక్మిణీకళ్యాణ తపస్సులో కుటుంబచింతనలో కలిసాం నీవూ నేనూ”

అంటూ జరుక్‌శాస్త్రికి వివరిస్తాడు. “రుక్మిణీకళ్యాణ తపస్సు” అనేది ఒక గుప్తసంకేతం! జరుక్‌ చాలా ఆలస్యంగా నలభై సంవత్సరాలు దాటాక వివాహం చేసుకున్నాడు. అంతవరకూ అతనికి కళ్యాణం గురించి తపస్సే! అలాగే కుటుంబచింత కూడా ఒక గుప్తసంకేతమే! కొడవటిగంటి కుటుంబరావు సమకాలీన మేధావులలో ప్రముఖుడు. దాదాపు సమవయస్కుడు. కుటుంబచింత అంటే ఒక ఫేమిలీవర్రీ అని అర్థం కాదు. చింతనాపరుడైన కుటుంబరావుతో సంయోగాలూ వియోగాలూ అని మాత్రమే అర్థం! అలా కలిసిన తాము

“నీవు నేను కత్తిపీట మీద కలిసిన అరటిపండు అరిసె లాగ ఎన్ని మార్లు నీవు లెక్క పెట్టినా నన్ను మరచినా నీవు ఉన్నవాళ్ళం ఇద్దరం”

అంటూ ప్రసక్తాంతరమైన ప్రతీకలను ప్రతిష్టిస్తాడు. కత్తిపీట అసమకోణంలో ఉండే పరికరం. దాని మీద ఉండే అరిసె స్త్రీలింగ ప్రతీక, అరటిపండు పుంలింగ ప్రతీక, అని వేరే చెప్పనక్కరలేదు! అవి కత్తిపీటపై కలవడం ఎలా సాధ్యమయింది? ఆ రెంటికీ కత్తిపీటతో సంబంధం అసందర్భంగా ఏర్పడి కలుసుకున్నారు. కాని స్త్రీలింగ ప్రతీకాదులు వాడినా స్త్రీపుంస సంబంధంగా అని కాదు.

నా. బా సాధారణ వాక్యనిర్మాణ మర్యాదలను పాటించడు. పైగా భంగపరుస్తాడు. స్థూలదృష్టికి సంబంధం పొసగనట్లు గోచరించే విడి పదాలను పేరుస్తాడు. సింటాక్స్‌ను భంగపరచడం అతని వైయక్తిక సంవిధానం. కనుక నడుమ అవసరమైన ధాతువులను విభక్తులను పాఠకుడే సప్లయి చేసుకోవాలి. అప్పుడుగాని అసలు విషయం బోధపడదు. ఇందరు కవులలో నా. బా అత్యంత ఆధునికుడు. వే. మో. అయినా వేముల అయినా అతను నిర్మించిన లక్ష్మణరేఖలను స్పర్శించనైనా లేడు.

కత్తిపీట మీద కలిసిన ఈ అరటిపండు, అరిసె ఈ సందర్భంలో స్త్రీపురుష ప్రతీకలు కావు. కేవల శరీరవర్ణసంకేతాలే! అరటిపండు పచ్చనిది. అది శ్రీశ్రీ శరీరవర్ణసంకేతం. అరిసె నలుపు తెలుపుల దోరరంగు. అది తన వంటిరంగుకు సమానమైనది.

“ఎన్ని మార్లు లెక్కపెట్టినా … రక్తం చిక్కన” అన్న వాక్యంలో తామిరువురే అతినవ్య కవితా ప్రవక్తలు ప్రయోక్తలూ అనే సత్యాన్ని చాటుతూనే అప్పుడప్పుడు శ్రీశ్రీ నా. బా ని మరచిపోయినట్లు, తానొక్కడే ప్రవక్తనని చెప్పుకున్నా నీటికన్న రక్తం చిక్కన కాబట్టి కవులమైనా అన్నదమ్ములమైనా గర్భశత్రువులమే అయినా శ్రీశ్రీ, నేనూ ఇరువురమే పరిగణించబడవలసిన వాళ్ళం! నీటి కన్న రక్తం చిక్కన అనేది ఆంగ్లసామెతకు అవసరార్థం వచ్చిన తెలుగు సేత! వీరిరువురికీ విడదీయలేని రక్తసంబంధం వుంది. విడదీయరాని కవితాస్థాయి సంబంధమూ వుంది. కనుక “ఇద్దరమే” నంటూ పాఠకులం పూర్తిచేసుకుంటే సార్థక్యం కలుగుతుంది.

సిరాబుడ్డీ కలం మరో దాంపత్యం.

పై అభివ్యక్తికి కొనసాగింపు ఉంటుందని పాఠకుడు భావిస్తాడు. కాని, ఈ సాధారణపద్ధతిని బ్రేక్‌ చేసి మరోదూరదృశ్యానికి కవి ఎగిరిపోతాడు. ఇప్పుడు మనకు ఎదురవుతున్న భావం స్థూలదృష్టికి గొప్ప క్లిష్టతరమైనదిగా కనిపిస్తుంది. కారణం డీకన్‌స్ట్రక్షన్‌ టెక్నిక్‌ను కవి బుద్ధిపూర్వకంగా ప్రయోగించడం ఒకటి, సాధారణసంబంధాలను విచ్ఛిన్నం చేయడం రెండవదీను. సిరాబుడ్డిలోని సాలెపట్టును యూటిరస్‌కీ, సర్వెక్స్‌కీ సంకేతించడం ఒక ముఖ్యమైన డీవియేషన్‌! సిరాబుడ్డి నిత్యోపయోగం. కాని, దానిలో కలం ముంచి రాయబోతాడు. సిరా తగలదు. కలం సాగదు. సాలెపట్టు కలానికి తగులుతుంది. దాన్ని పైకి తీసి చూశాడు. తాను నిర్మించుకున్న వలలో తానే చిక్కుకుపోయి సాలెపురుగు చచ్చి పడివుంది. కాని ఆ వలలో పడ్డ మక్షికాలు మాత్రం సజీవంగానే వున్నాయి. తన అఖండ కీర్తిని కొల్లగొడుతున్న ఈ దోపిడీండ్రను ఉక్కణచాలని, సాలెపురుగులా కృష్ణశాస్త్రి కవిత్వరచనకు ఆధారభూతమైన సిరాబుడ్డిలో ఒక వల నిర్మించాడు. కాని తన వ్యూహానికి తానే తగులుకుని మరణించాడు. ఎవరి కోసమైతే ఆ వలను నిర్దేశించాడో ఆ మక్షికాలు రెండూ సజీవంగా సిరాబుడ్డిలో కదలాడుతున్నాయి. ఆ రెండు మక్షికాలూ తానూ శ్రీశ్రీ. సాలెపట్టును సిరాబుడ్డిలోంచి బయటకు తీయగా, చచ్చింది సాలెపురుగు! బయటకు తీయగా చచ్చిన సాలెపురుగు, బ్రతికున్న ఈగలూ దర్శనమిచ్చాయి. వలకు తగులుకుని రెక్కలూడిపోయాయి. రెంటికీ ఇంక తప్పదు కదా! “డేకురుకుంటూ పోదాం పద” అని శ్రీశ్రీని హెచ్చరించాడు కవి. పెద్ద ఈగ గనుక తాను అనుభవశాలి.

ప్రక్కనున్న శ్రీశ్రీని పిలిచి “ఏమిట్రా తంబీ?” అన్నా .. తమిళభాష ప్రభావంతో తమ్ముడ్ని ముద్దుగా తంబీ అన్నాడు . “సాలెపట్టు” లేదు అదంతా కవివ్యూహం అన్నాడు కుశాగ్రబుద్ధి శ్రీశ్రీ. వెంటనే పోల్చుకున్నాడు. ఇక్కడ సూక్ష్మంగా పాత్రశీలపరిశీలన చిత్రించాడు నా. బా. అంతేకాదు, ఇంకా విశదపరిచాడు

“మక్షికాలు నీవు నేను పట్టులో చిక్కి చచ్చాం కామని ఆకాశం చూరునుంచి సిరాబుడ్డిలో పడి ఆత్మహత్య చేసుకున్న కృష్ణశాస్త్రి”

రెక్కలు తెగాయి కాబట్టి డేకురుకుంటూ పోదాం పద వీధి లోకి అన్న మాటల సందర్భాన్ని బట్టి శ్రీశ్రీ చెప్పినవిగా పోల్చుకోవాలి. తమ సిరాబుడ్డిలోనే తాము పడి పట్టులో చిక్కి చనిపోవాలని ఆశించిన కృష్ణశాస్త్రి ఆశాభంగం పొందాడు. ఆయన ఎప్పుడూ “దిగిరాను దిగిరాను దివి నుండి భువికి” అంటూ లోగొంతులో పాడుకుంటాడు కదా! అందుకే ఆకాశపు చూరు నుంచి సిరాబుడ్డిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు పాపం, అవమానం భరించలేక. ఆ విధంగా బ్రతికిపోయారు. రెక్కలూడిపోయిన శ్రీశ్రీ, నా.బా లు కనీసం డేకురుకుంటూనైనా విశాలమైన వీధిలోకి పోకతప్పదు. తమ విజయం చాటక తప్పదు. తమ అస్తిత్వాన్ని నిలుపుకోక తప్పదు. తమకు ఎవరైనా అడ్డంకులు, పితలాటకాలూ కల్పించినా అన్నిటినీ అధఃకరించక తప్పదు.

అదీ శ్రీశ్రీ, నా. బా లు చేసుకున్న సంకల్పం. దీనితో కవితలోని కంఠధ్వని మారింది. అందుకే “రాత అయిపోయింది” అంటూ తర్వాత భాగం ప్రారంభిస్తాడు కవి.

“వ్రాత అయిపోయింది. సిరా మిగిలిపోయింది. ఏం సాధనం” అన్నా… “ఉంచు నా మహాప్రస్థానంలోకి వచ్చే మహారాజులకు నీలిశాలువాలల్లి కానుకలిస్తా!” అన్నాడు శ్రీశ్రీ.

ఈ చివరి మాటతో ఒక చారిత్రక సత్యం బోధపడుతుంది. మహాప్రస్థానంలోకి చేర్చుదామనుకున్న చాలా రచనలు శ్రీశ్రీ మనస్సులో భావరూపంలో మిగిలిపోయివున్న దశలోనే ఈ కవిత రచించబడింది. అప్పటికి జగన్నాథరథచక్రాలు గాని, నీడలు వగైరా తదుపరి రచనలు గానీ పూర్తికాలేదు. ఆ చారిత్రక సత్యానికి ఇది ఆధారభూతం!

పైగా మరో ధర్మసూక్ష్మం కూడా అభివ్యక్తమవుతుంది. గతకాలంలో మానుషత్వాన్ని తెగపీడించిన మాహారాజులెందరో మహాప్రస్థానంలోకి రావలసినా బయట మిగిలిపోయారు. వాళ్లంతా వచ్చినపుడు మహారాజులు కదా, నీలిశాలువాలల్లి కానుకలిస్తానన్నాడు. నీలిరంగు విషాదాంతానికి చిహ్నం. పోనీ మరో పని చెయ్యమని శ్రీశ్రీ గడుసుగా సలహా ఇస్తాడు. ఇష్టంలో అయిష్టం వ్యక్తమవుతుంది. అవచేతనలో రహస్యంగా ముద్దకట్టిన భావానుభావాలు పిలవని పేరంటంగా కవిత్వంలోకి చొరబడతాయి. ఆ సలహా ఏమిటి?

“కాకపోతే నీ నెత్తురు నల్లబడేదాకా నీవే త్రాగీ! అప్పుడు వెలిగించు దీపం! ఈ మానవజాతికి నీవు ఎర్రదీపానివి ప్లేగువ్యాధికి కనిస్టీపువి!” అంటాడు. ఈ వాక్యాలు స్తుతిపూర్వక అభిశంసలు; నిందాగర్భితాలు! ప్లేగు వ్యాధి చొరబడకుండా కాపలా కాసే కనిస్టీపుగా నా. బా ఉండాలని, మానవజాతికే ఎర్రదీపంగా వెలగాలనీ శ్రీశ్రీ ఆశిస్తాడు.

నిజమే! మానవజాతి కుక్షింభర కలాపంలా అక్షయుగ్మాన్ని సంధించుకుని, సాధిమ్చుకుంది. తన కన్న ముందేపుట్టిన దేవతలపై ఒట్టుపెట్టుకుంటూ సాగింది. కాని ఆ ఒట్లెప్పుడూ నిలుపుకోదు. అందుకే అసలును విడిచి నకిలీలను ఆరాధిస్తూ గుడ్డిగా సాగిపోతోంది. శూన్యస్థలాలలో తడుముళ్ళాడుకుంటోంది. పెద్ద అన్వేషి వలె ఆత్మవంచన చేసుకుంటోంది. అట్టి మానవజాతికోసం కవి ఎర్రదీపమై వెలగక తప్పదు.
----------------------------------------------------------
రచన: సోమసుందర్ ఆవంత్స, 
ఈమాట సౌజన్యంతో