Monday, May 31, 2021

అనేకార్థక కావ్యాలు - ద్వ్యర్థి కావ్యాలు

 అనేకార్థక కావ్యాలు - ద్వ్యర్థి కావ్యాలు

సాహితీమిత్రులారా!సంస్కృతంలో భట్టీకావ్యం అని ఒక వ్యాకరణ గ్రంథం ఉంది.
దానికే రావణవధ అనే పేరూ ఉంది. అంటే రావణవధ అనే కావ్యం
ఒక వైపు వ్యాకరణం తెలిపేదిగా మరో వైపు ఈ కావ్యాన్ని రచించాడు.
అలాగే ప్రాకృతంలో హేమచంద్రాచార్యుడు "కుమారపాలచరితం" అనే
కావ్యాన్ని రచించాడు ఇందులో కుమారపాలుని కథ
చేబుతూనే వ్యాకరణం చెప్పడం జరిగింది.
అందువల్ల ఇలాంటివాటిని ద్వ్యాశ్రయకావ్యాలు అంటారు.
వీటినే మనం తెలుగులో ద్వ్యర్థి కావ్యాలు అంటాము.
వీటికి రాఘవపాండవీయం,
హరిశ్చంద్రనలోపాఖ్యానం లాంటివి చెప్పవచ్చు.

ఇపుడు ప్రాకృతభాషలోని కుమారపాలచరితం
నుండి ఒక గాథ చూద్దాం.

దీనిలోని ఐదవసర్గలో వర్షాహేమంతశిశిర
ఋతువులను వర్ణించాడు ఆసందర్భంలో
కవి యుష్మచ్చబ్ద(మధ్యమపురుష) -
ఏకవచన బహువచనరూపాలను ఉపయోగించి
ఈ గాథను రాశాడు.

తం తుం తువం తుహ తుమం అణేహ నవాఇం నీవకుసుమాఇం,
భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝాసణందేహ


ఓ సఖులారా! నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ, నువ్వూ(తం తుం తువం
తుహ తుమం - ఈ ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమ ఏకవచనరూపాలు)
క్రొత్త నీపపుష్పాలు తీసుకొనిరండి.
సఖులారా మీరూ, మీరూ, మీరూ, మీరూ, మీరూ
(భే తుబ్భే తుమ్ హోయ్ హే తుయ్ హే తుజ్ఝ - అనే
ఐదు యుష్మచ్ఛబ్ద ప్రథమా బహువచనాలు) అసనపుష్పాలను
తీసుకొనిరండి - అని భావం

(నీపపుష్పము - కడిమి(కదంబ)చెట్టుపూలు,
అనసపుష్పాలు - వాడని పుష్పములు)

Saturday, May 29, 2021

సంభాషణలో గూఢం

 సంభాషణలో గూఢం
సాహితీమిత్రులారా!సరసం అంటేనే భార్యా భర్తల మధ్యగాని,
ప్రేయసీ ప్రియుల మధ్యగాని జరిగేది.
అవి ఎంత గూఢంగా ఉంటాయో ఇక్కడ చూడండి-

ఇక్కడ భార్యాభర్తల సుభాషణ చూద్దాం-
భోజనసమయంలో

భర్త (భార్యను) - పశువ (అన్నాడు)

భార్య(భర్తను) - కోతి    (అన్నది)

ఇందులో ఏముంది సహజమేకదా!
అదీ నిజమే


కాని ఒక అవధాని ఈ సుభాషణను ఇలా వివరించారు


భర్త (భార్యను) - ళ్లెం శుద్ధంచేసి డ్డించవే (అన్నాడు)


భార్య(భర్తను) - కోరినంత తినండి (అన్నది)


దీనిలోని గూఢత తెలిసిందికదా!

Thursday, May 27, 2021

హంసవింశతిలోని గూఢచిత్రం

 హంసవింశతిలోని గూఢచిత్రం

సాహితీమిత్రులారా!హంసవింశతి కర్త అయ్యలరాజు నారాయణామాత్యకవి
తనగురించి
ఏవిధంగా చెప్పుకొన్నాడో చూడండి.


ఎవనికీరితి కుభృద్ధవ కుభృద్ధర బుధ
       కరిసైంధవ సమిద్ధహరిణరుచిర
మెవనిమేధంబురుడ్భవ కభుగ్ధవ విధూ
       ద్భవ మరుద్ధవగురుప్రతివిఘాతి
యెవనియీ వహిమరుగ్భవ సరిద్ధవ లస
        ద్భువనభృత్త్రిపురభిద్భూరిమహిమ
యెవనిరూ పమృతభుగ్ధవసుతోడ్వీడ్రతీ
       డుడ్వీడ్భృదాప్తపుత్రోల్లసనము
మంత్రిమాత్రుండె యతడు దుర్మంత్రిమంత్ర
తంత్రసంత్రాసకరణస్వత్రంతుఁడయల
రాజవంశసుధావార్ధిరాజ సూర
సూర్యనారాయణామాత్యవర్యుఁడలరు.

                                                   (హంసవింశతి పీఠిక-15)

1వపాదము-
ఎవనికీర్తి - కుభృత్ + భవ - హిమవంతునివలెను,
కు - భృత్శేషునివలెను, (మరియు)కైలాసమువలెను, హర - ఈశ్వరునివలెను,
బుధకరి -సైంధవ - ఐరావతము, ఉచ్చైశ్శ్రవములవలెను,
సమిద్ధహరిణ రుచిరము - ప్రకాశమైన ధావళ్యముతో ఒప్పినదో!

2వపాదము -
ఎవనిమేధ - అంబురుద్భవ - బ్రహ్మను,
కభుక్ + ధవ - వాతాశనపతి  అయిన ఆదిశేషుని,
విధు  + ఉద్భవ - బుధునిని, మరుద్ధవ గురు - దేవేంద్రునిగురువగు
బృహస్పతిని - ప్రతిఘటించునదో!

3వపాదము-
ఎవనిత్యాగము - అహిమరుగ్భవ - కర్ణుడు,
సరిత్  + ధవ - సముద్రుడు, అసద్భువన భృత్ - మేఘుడు,
త్రిపురభిత్ - ఈశ్వరుడు, వీరిత్యాగముకంటె గొప్పదియో!

4వపాదము -
ఎవనిరూపు - అమృతభుగ్ధవసుత - జయంతునివలెను,
ఉడ్వీట్ -  చంద్రునివలెను, రతీట్ - మన్మథునివలెను,
ఉడ్వీద్భృదాప్తపుత్ర - నలకూబరునివలెను - ప్రకాశించునదియో!

కీర్తిలోనూ, మేధలోనూ, త్యాగములోనూ, రూపంలోనూ
అటువంటివాడైన మంత్రి మాత్రమేకాదు
చెడు ఆలోచనలకు స్వంతముగా మంత్రము తంత్రములచే రక్షించగల
అయలరాజవంశమునకు చంద్రుని వంటివాడై అలరారెడువాడు
ఈ నారాయణామాత్యకవి
- అని చెప్పుకున్నాడు.

ఎంతటి వాడో ఈ పద్యాన్ని బట్టి తెలుస్తున్నది.

Tuesday, May 25, 2021

దాగున్న నాలుగోపాదం

 దాగున్న నాలుగోపాదం
సాహితీమిత్రులారా!శ్లోకంలోని మూడు పాదాలను మాత్రమే కవి చెబుతాడు.
నాలుగవపాదం ఆ మూడు పాదాలలోనే గూఢంగా ఉంటుంది కనుక్కోవాలి.
దీన్ని గూఢచతుర్థి అంటారు.
ఈ శ్లోకం చూడండి.

పాతాతురాణాం బోధైక్య
మయో ధుర్యాప్తి సూ స్సతామ్
దలితై నస్సముదయ:


ఇది శ్లోకంలోని మూడు పాదాలు. నాలుగవపాదం గూఢంగా ఉంది 

దాన్ని కనుక్కోవాలి. అదెలా అంటే చూడండి.

పాతాతురాణాం బోధైక్య
యో ధుర్యాప్తి సూ స్సతామ్
లితై స్సముదయ:
రంగుల్లోను పెద్దగా ఉన్న అక్షరాలను
వరుసగా వ్రాసిన 4వ పాదమవుతుంది.
అది
పాతు వో మధుసూదన:

ఆతురాణామ్ - ఆపన్నులను, పాతు - రక్షించువాడు,
బోధైక్యవయ - నిత్యమైన జ్ఞానములకంటె వేరుకాని వాడు,
(అద్యైతమతంలో జ్ఞానానికి బ్రహ్మకు భేదంలేదు.)
సతాం ధురి ఆప్తిసూ: - జగత్తుకంటె అధిక సత్తావంతుడు
అంటే పారమార్థిక సత్తాశాలియైనవాడు,
దలిత ఏన స్పదయ - పాపసంతానమును విదిలించెడి,
మధుసూదన: - నారాయణుడు, వ: పాతు - మిమ్ము రక్షించుగాత!

పై రంగు గల అక్షరాలలో వబయోరభేద: -  అను
నియమంప్రకారం బో - అనేది వో అవుతుంది.

Sunday, May 23, 2021

కృష్ణదేవరాయల పై పద్యం

 కృష్ణదేవరాయల పై పద్యం
సాహితీమిత్రులారా!అష్టదిగ్గజాలలో ఒకరైన వారు ఈ పద్యాన్ని కృష్ణదేవరాయల మీద చెప్పారు. అది తెనాలి రామకృష్ణుడని కొందరు భట్టుమూర్తి అని కొందరు చెబుతున్నారు. ఎవరైనా ఆయన ఆస్థానంలోనివారేకదా! ఆ పద్యం

నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి యొప్పె, కరిభి ద్గిరిభిత్
కరికరిభిద్గిరి గరిభిత్
కరిభిద్గిరిభిత్తురంగ కమనీయంబై !


అర్థం :- కృష్ణరాయని - కరము - అరుదు - అగు = మిక్కిలి ఆశ్చర్యకరమైన, కీర్తి, కరిభిత్ = గజాసురుని సంహరించిన శివుని వలెను, గిరిభిత్ కరి = పర్వతముల రెక్కలను భేదించిన ఇంద్రుని యొక్క ఏనుగు ఐరావతము వలెను, కరిభిత్ - గిరి = ఈశ్వరుని కైలాస పర్వతము వలెను, గిరి - భిత్ = కొండలను భేదించిన - వజ్రాయుధము వలెను, కరిభిత్ - గిరిభిత్ - తురంగ = ఈశ్వరుని - ఇంద్రుని వాహనములైన నందీశ్వర, ఉచ్ఛైశ్శ్రవముల వలెను, తెల్లగా, ధగధ్ధాగాయమానమై, కమనీయంగా ఒప్పి కనిపించెను.

Friday, May 21, 2021

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన

 లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
సాహితీమిత్రులారా!ఇదేమిటి లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన -
ఇదేట్లా సాధ్యం.
ముందు ఈ పద్యం చూడండి.

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు

లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు

ఇది పైకి అశ్లీలగా, భ్రాంతి కలిగించి, మెదడుకు పదును పెడుతున్నది.
నిదానంగా ఆలోచిస్తే విషయం అర్థమౌతుంది.

లక్ష్మి కి పర్యాయపదాలు చూస్తే - కమల, లచ్చి, రమా, ఇందిర .... ఉన్నాయి.
అలాగే
శంకరునికి పర్యాయపదాలు - భవుడు, ఈశ్వర,ఈశ,....

పై పద్యంలో మొదటి రెండు పాదాలు తీసుకుంటే

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు

లక్ష్మి పర్యాయపదం కమల,
శంకర పర్యాయపదం భవుడు,

లక్ష్మి కి శంకరుడు కలిసిన భువనకారకుడు పుట్టాలికదా

పర్యాయపదాలను తీసుకుంటే
కమల(లక్ష్మి) - భవుడు(శంకరుడు) ఈ రెండిటిని కలిపిన కమలభవుడు
అంటే భువనకారకుడు(బ్రహ్మ)కదా!

అలాదే చివరి రెండు పాదములు తీసుకొన్న
లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు

లక్ష్మి ని శంకరుడు కలిసిన విష్ణువు పుట్టాలి
పర్యాయపదాలను తీసుకుంటే
రమా(లక్ష్మి) - ఈశ(శంకరుడు) - రమేశ
అంటే  విష్ణువేకదా!
మరి ఇందులో అశ్లీలలేదుకదా!
ఇది గూఢచిత్రము

Wednesday, May 19, 2021

ప్రశ్నోపనిషత్తులోని గూఢచిత్రం

 ప్రశ్నోపనిషత్తులోని గూఢచిత్రం

సాహితీమిత్రులారా!


మనకు మన పూర్వులు అనేక విషయాలను
సూటిగాకాక గూఢంగా చెప్పి ఉన్నారు.
వేదాలలో ఉపనిషత్తులలో ఇలాంటివి కనబడుతుంటాయి.
అలాంటిది ఇక్కడ ఒకదాన్ని చూద్దాం.

పఞ్చపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహు: పరే అర్ధేపురీషిణమ్
అథేమే అస్య ఉ పరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్చితమితి

                                                                       (ప్రశ్నోపనిషత్తు - 1-11)


సూర్యుడు అయిదు పాదాలు గలవాడు.
తండ్రి, పన్నెండు రూపాలు ధరించేవాడు,
పై భాగం నుండి వర్షం కురిపించేవాడని
కొందరు చెబుతున్నారు.
అతడు సర్వజ్ఞుడు,
ఏడు చక్రాలున్న ఆరు ఆకులుగల రథంలో
ఉన్నవాడని
మరికొందరు చెబుతున్నారు- అని భావం.

ఇంతకు దీనిలో అర్థం ఏమిటి సూర్యునికి 5 పాదాలు సరే,
తండ్రి 12రూపాలు ధరించేవాడు,
పైభాగంనుండి వర్షం కురిపించేవాడని చెబుతున్నారు.
మళ్ళీ అతడు సర్వజ్ఞుడు, 7 చక్రాలున్న ఆరు అరలు లేక ఆకులు
ఉన్న రథం ఉన్నవాడని చెబుతున్నారు.
దీనిలోని విషయం సులువుగా అర్థం అయేలాలేదు.

బాగా ఆలోచిస్తే........................
దీన్ని ఈ విధంగా తెలియాలి అని అర్థమవుతుంది.

5 పాదాలు ఏమిటి?

పాదాలు అనేవి ఋతువులను సూచిస్తున్నవి.
ఋుతువులు 6 కదా!
కాని
ఇందులో చిన్నమార్పు ఉంది.
శిశిరం, వసంతం, గ్రీష్మం, వర్ష, శరత్, హేమంతం
అనేవి ఋతువులు కాని
ఇక్కడ  హేమంత, శిశిరాలను ఒకటిగా తీసుకుని
ఐదు ఋతువులుగా తీసుకున్నారు.
ఋతువులు మారడానికి కారణం సూర్యుడేకదా!
అందుకే ఋతువులను పాదాలుగా తీసుకోబడుతోంది.

తండ్రి అంటే?
సకల ప్రాణుల పెరుగుదలకు సూర్యుడే కారణంగా ఉన్నాడు
కాబట్టి తండ్రి అంటున్నారు.
అదిసరే 12 రూపాలు దాల్చడం ఏమిటి?
పన్నెండు రూపాలు అంటే 12 నెలలు.
సూర్యుని కేంద్రంగా చేసుకొనే నెలలు లెక్కిస్తున్నారు.
కాబట్టి సూర్యుడు 12 రూపాలు దాలుస్తున్నాడు-
అన్నారు.

మరి ఏడు చక్రాలు ఏమిటి?

సూర్యుడు తిరిగే రథానికి 7 చక్రాలు ఉన్నాయి
అవి ఏమిటంటే మనం సప్తాశ్వరథమారూఢం అని
మరో స్తుతిలో చెప్పుకుంటాము.
ఇవన్నీ ఏమిటంటే సూర్యకాంతిలోని
ఏడు రంగులు.
విబ్జియార్( VIBGYOR) - అని
మనం సైన్సులో చెప్పుకుంటున్నాము.

ఆరు ఆకులు అంటే?

అవి మరేమీకాదు ఆరు ఋతువులు

Monday, May 17, 2021

సురలను సురలే మ్రింగిరి

 సురలను సురలే మ్రింగిరి
సాహితీమిత్రులారా!ఈ గూఢచిత్ర పద్యం చూడండి.

సురలను సురలే మ్రింగిరి
పరగంగా బ్రహ్మవచ్చి భానుని మ్రింగెన్
అరయగ నప్పురి చెంతను
శిరహీనుని శివుడుమ్రింగె చిత్రముగాదే!

                                    (నానార్థగాంభీర్యచమత్కారిక పుట.14)


దీనిలో దేవతలను దేవలు మ్రిండమేమిటి?
బ్రహ్మ వచ్చి సూర్యుని మ్తింగడమేమిటి?
శిరహీనుని శివుడు మ్రింగడమేమిటి? - చిత్రమేకదా

బాగా ఆలోచిస్తే ఇందులోని పదాలకు
మరో అర్థం ఉండి ఉండాలి లేకుంటే ఇది ఎలా?

సురలను సురలే మ్రింగిరి -
అంటే
చేపలను(సురలను) చేపలే మ్రింగాయి.
(అనిమిషులు - చేపలు, సురలు)
బ్రహ్మవచ్చి భానుని మ్రింగెన్ -
మేక(అజము-బ్రహ్మ)వచ్చి జిల్లేడు చెట్టును(భానుని- అర్కం) తినింది.
శిరహీనుని శివుడు మ్రింగె -
పీత(శిరహీనుడు- ఎండ్రకాయ)ను నక్క(శివుడు) తిన్నది 

దీన్ని గూఢచిత్రంగాను, పొడుపు పద్యంగాను తీసుకోవచ్చును.


Saturday, May 15, 2021

అర్థం తెలిసి సమాధానమివ్వండి

 అర్థం తెలిసి  సమాధానమివ్వండి
సాహితీమిత్రులారా!ఈ పద్యం చూచి భావం గ్రహించి సమాధానం చెప్పండి.

కచమునకుఁ దొల్త కొమ్మూఁదెఁ గంతుఁడనుచుఁ
గంధరం బాదివర్ణ విఖండమయ్యె
నొత్తుఁగొనిపోవ గళము సద్వృత్తిఁజూపెఁ
దిరిగి కుందమ్ము లెదిరిన విరిగెఁ గొమ్ము

దీనిలోని అర్థం తెలిసి  సమాధానమివ్వండి

కచమునకుఁ దొల్త కొమ్మూఁదెఁ గంతుఁడనుచుఁ
కచము లోని క- కు కొమ్మిచ్చిన - కుచము అవుతుంది

గంధరం బాదివర్ణ విఖండమయ్యె
కంధరం లోని మొదటి వర్ణం విఖండమైతే
అంటే తీసివేస్తే ధరం(పర్వతం)అవుతుంది

నొత్తుఁగొనిపోవ గళము సద్వృత్తిఁజూపెఁ
అలాగే ధరం లోని ధ-కు వత్తు తీసివేస్తే
దరం అవుతుంది అంటే గళము(కంఠము)

దిరిగి కుందమ్ము లెదిరిన విరిగెఁ గొమ్ము
కుందము లోని కు - కు కొమ్ము తీసివేస్తే కందము

దీనిలో వరుసగా కుచము, ధరం, దరం, కందము
ఇవి సమాధానాలు. దీనిలోని భావం. 


Thursday, May 13, 2021

విధు శ్చలతి కూజతి కపోత:

 విధు శ్చలతి కూజతి కపోత:

సాహితీమిత్రులారా!ఈ గూఢచిత్ర పద్యం చూడండి-

వియతి విలోలతి జలదస్ స్ఖలతి విధు శ్చలతి కూజతి కపోత:
నిష్పతతి తారకాతతి రాందోలతి వీచి రమరవాహిన్యా:


వియతి - ఆకసము, విలోలతి- అసియాడుచుండగా,
జలద: - మేఘము, స్ఖలతి - జారిపడుచున్నది,
విధు: చలతి - చంద్రుడు కదలుచున్నాడు,
కపోత: కూజతి - పావురము కూయుచున్నది,
తారకాతతి: నిష్పతతి - నక్షత్రపుంజము రాలుచున్నది,
అమరవాహిన్యా: వీచి: ఆందోలతి - చదలేటి(ఆకాశగంగ)
కెరటాలు ఊగుచున్నవి.

ఆకాశం కంపించేప్పుడు మేఘాలు జారిపడుచున్నవి.
చంద్రబింబం కదలుతూంది. పావురము కూయుచున్నది.
నక్షత్ర పుంజము రాలి పడుతూంది.
ఆకాశగంగా తరంగావళి ఊగులాడుచున్నవి

ఇవేమిటి సరైనవేనా వీటి అర్థమేమై ఉండును అని
బాగా ఆలోచించిస్తే
ఈ విధంగా అర్థమవుతుంది.

ఆకాశం అంటే ఇక్కడ నడుము
మేఘం అంటే ఇక్కడ కొప్పు
చందమామ కదలడమంటే ముఖం కదలటం
పావురము కూయడం అంటే రతి కూజితము
నక్షత్రపుంజము రాలిపడటమంటే చెమట
(ముత్యాలు పెరిగి)బిందువులు పట్టి రాలడం,
ఆకాశగంగాతరంగములు ఊగడం అంటే వళులు ఊగడం
ఇవన్నీ నాయిక ఉపరతిని సూచించేవి అని అర్థం.

Tuesday, May 11, 2021

కన్యకు బండ్రెండునడుము

 కన్యకు బండ్రెండునడుము
సాహితీమిత్రులారా!కన్యకు బండ్రెండునడుము అంటే 

కన్యకు 12 అంగుళాల నడుమనా

ఏమో  ఈ పద్యం చూడండి-

కన్యకు నారు కుచంబులు
కన్యకు మరి నేడుకండ్లు గణుతింపంగా
గన్యకు నాలుగుబొమలును 
కన్యకు బండ్రెండునడుము గలదా చెలికిన్

                                                (నానార్థగాంభీర్యచమత్కారిక - పుట.15)

ఈ పద్యం చాల వింతగా చెప్పడం జరిగింది.
కన్యకు ఎక్కడైనా 6 కుచాలు,7 కండ్లు, 4 బొమలు, ఉంటాయా?
అలాగే నడుము 12 అంటే అదేమైనా నడుముకొలతా? కాదు కదా!
మరేమై ఉంటుంది. బాగా ఆలోచిస్తే................
కన్యకు అంటే ఇక్కడ పడుచు అనికాదు.
కన్య అంటే కన్యా రాశికి అని అర్థం తీసుకుంటే
కన్యనుండి ఆరవరాశి కుంభం
అంటే ఆపడుచు కుచాలు కుంభాలవలె ఉన్నవి అని.
కన్యారాశికి 7వరాశి మీనరాశి
అంటే ఆపడుచు కండ్లు చేపల్లా ఉన్నాయి అని.
కన్యకు 4వరాశి ధనూరాశి
అంటే ఆపడుచు బొమలు విల్లులా ఉన్నాయని.
కన్యకు 12వరాశి సింహరాశి
అంటే ఆపడుచు నడుము సింహంనడుములా ఉందని.
మొత్తమీద
ఆపడుచు కుచాలు కుంభాలవలెను, కండ్లు చేపల్లాను,
బొమలు విల్లలాను, నడుము సన్నగా సింహంలాను
ఉన్నాయని పద్యభావం.
అంత అందంగా ఉందా పడుచు.