Friday, May 29, 2020

వచ్చిన హల్లు మళ్ళీ రాని పద్యం


వచ్చిన హల్లు మళ్ళీ రాని పద్యం





సాహితీమిత్రులారా!

ఒక పద్యం లేక శ్లోకం వచ్చిన హల్లు మళ్ళీరాకుండా(అపునరుక్తం) రాయడమే
వచ్చిన హల్లు మళ్ళీ రాని పద్యం(అపునరుక్తవ్యంజనము) అంటారు.

ఈ శ్లోకం చూడండి వచ్చిన హల్లు మళ్ళీ వచ్చిందేమో.

హతోచ్చండో ఢాఘ ఝాటావేల్లిదోషా మిళచ్ఛఠం
ఫణిశయ్యం రఙ్గనాథం భజే బుధ సుఖావకమ్

                                                     (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-20)

(క్రూరపాపులు అయిన రాక్షసులను హతమార్చిన వానిని,
నాగేంద్రునిపానుపుగా కలిగిన వానిని,
దేవతలకు జ్ఞానులకు సుఖములను కూర్చువానిని
శ్రీరంగనాథుని సేవిస్తాను.)

Tuesday, May 26, 2020

'ఉ'-కార పద్యం(కొమ్ముల పద్యం)


'ఉ'-కార పద్యం(కొమ్ముల పద్యం)




సాహితీమిత్రులారా!


హ్రస్వమైన ఒకేఒక స్వరాన్ని ఉపయోగించి పద్యం
కూర్చటాన్ని హ్రస్వ ఏక స్వరచిత్రం అంటారు.
ఇందులో స్వరం ఒకటే ఉంటుంది కాని వ్యంజనాలు
ఏవైనా ఉండవచ్చు.
ఇక్కడ స్వరం యొక్క దీర్ఘ, హ్రస్వములేకాని
గురు లఘువులతో సంబంధంలేదు.


ఉరుగుం ద్యుగురుం యుత్సు చుక్రుశు స్తుష్టువు: పురు
లులుభు: పుపుర్షుర్ముత్సు ముముహుర్ను ముహుర్ముహు:
                                                                                 (సరస్వతీకంఠాభరణము - 2 - 276)

(విలువైన వాక్కులు గల దేవతా గురువైన బృహస్పతిని
యుద్ధములందు భటులు శరణు కోరిరి మిక్కిలి స్తుతించిరి
మోదములందు లోభమును పొందిరి పుష్టినొందిరి
మరి మాటి మాటికిని మోహము నొందిరి.)

ఇందులో హ్రస్వ "ఉ" - కారమును ఒక్కదానినే
మొదటినుండి చివరవరకు ఉపయోగించారు.
ఒకే స్వరము అదియు హ్రస్వము ఉపయోగించుట
వలన ఇది హ్రస్వ ఏక స్వరచిత్రమగుచున్నది.

Saturday, May 23, 2020

దవడలు తాకని పద్యం


దవడలు తాకని పద్యం





సాహితీమిత్రులారా!

అక్షరముల ఉత్పత్తి స్థానమును బట్టి
కంఠము, తాలువు, మూర్దము, దంతము, ఓష్ఠ్యము అని ఐదు
విధములని తెలుసుకొని ఉన్నాము.
వీటిలో కేవలము కంఠస్థానమున పుట్టెడి అక్షరములతో
పద్యం కూర్చిన అది కంఠ్యము అని,
ఒకవేళ కంఠస్థానమున ఉత్పత్తి అయ్యే అక్షరములను వదలి
మిగిలిన వాటితో పద్యం కూర్చిన కంఠ్యములు లేనిది
నిష్కంఠ్యము అని పిలువబడుచున్నది.
అలాగే తాలువులతో కూర్చిన తాల్యము అని,
తాలువులతో కాక మిగిలిన వాటితో కూర్చిన నిస్తాలవ్యమని అందురు.
మరి, తాలువు = దవుడ, దవుడ నుండి పుట్టేవాటిని తాలువులు అంటారు.
తాలువులయందు పుట్టు అక్షరములు - ఇ-వర్ణము(స్వరము),
చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము ఇవి తాలవ్యములు.
ఇవి లేకుండా పద్యం లేక శ్లోకం కూర్చిన అది నిస్తాలవ్యము.

ఉదాహరణ గమనిద్దాం-
స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బుర:
మేఘనాదో2థ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ
                                                                          (సరస్వతీకంఠాభరణము -2-268)

(ప్రకాశించుచున్న కర్ణభూషణరత్న సమూహమనెడి
హరివిల్లుచేత పొడలుగలిగినవాడై సంగ్రామమునందు మేఘనాధుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము వలె ప్రకాశించెను.)
(ప్రావృట్టు = వర్షర్తువు)

ఈ శ్లోకంలో పై చెప్పిన అక్షరాలు ఉన్నాయేమో? గమనించండి.
ఉంటే భోజమహారాజును నిలదీద్దాం.
ఆ అక్షరాలు మరొక్కసారి చూస్తారా- ఇవే
ఇ-వర్ణము(స్వరము), చ- వర్గము(చ,ఛ,జ,ఝ,ఞ), య-కారము, శ-కారము. 

Wednesday, May 20, 2020

ఉపమా గొప్పదనం


ఉపమా గొప్పదనం





సాహితీమిత్రులారా!

సాహితీలోకంలో ఉపమాలంకారం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
దీని వైశిష్ట్యాన్ని తెలిపే శ్లోకం ఇది ఆస్వాదించండి.

విదుషాంప్రమదాయ సోపసర్గా
గరుదాంకస్యముదే గతోపసర్గా
అపకారవతీ ప్రియాయ శంభో:
ఉపమా సాప్రతి భాత్యనేకరూపా

అలంకారాల్లో ఉపమాలంకారాన్ని మించినది మరొకటి లేదు. ఎందుకంటారా !................
"ఉప" సర్గతో కూడి ఉన్నది ఉన్నట్లు ఉంటే, విద్వాంసులకు ఆహ్లాదం కలిగిస్తుంది.
(కవులకు ఉపమా ఎంతో ఇష్టంకదా!)
ఉపసర్గ లేకుండా అయితే (మా - లక్ష్మిదేవి) సాక్షాత్తు విష్ణువునే అలరిస్తుంది.
ఇక మధ్యలోని "ప"కారం లేకపోతే (ఉమా - పార్వతీదేవి)
పరమశివునే పరవశింప చేస్తుంది.
ఈ విధంగా ఉపమ అనేక రూపాల్లో (శబ్దపరమైన రూపాల్లో)
ప్రకాశిస్తూ ఎందరో ప్రముఖుల్ని రంజింప చేస్తున్నది.

Monday, May 18, 2020

కవిచమత్కారం


కవిచమత్కారం






సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల వాకిటిని కాపలాకాయు
 తిమ్మనికి రాజుగారు ఎప్పుడో మంచి
సేవలకుగాను ఒక సేలువా ఇచ్చాడట.
దాన్ని కప్పుకొని తిరుతున్న సమయంలో
దాన్ని తెనాలి కామకృష్ణుడు చూచాడట.
ఎలాగైనా దాన్ని కాజేయాలని ఎదురు చూస్తున్నాడు.
ఒకరోజు అతనికి ఒక పద్యమైనా కృతి తీసుకోమని సలహా ఇచ్చాడు.
అది ఊరకే ఇవ్వరుకదా అని అనగా
పద్యంలో నాలుగు పాదాలు నలుగురిని అడుగు
అప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వకుండా
సరిపోతుందని ఉపాయం చెప్పాడు.
అది సరైనదేనని మరునాడు సభలోకి
వెళ్ళే కవులను తనకోరిక చెప్పి
పెద్దనను మొదట అడిగాడు దానికి
ఆయన ఒక చరణం చెప్పాడు
తరువాత భట్టుమూర్తి రెండవ చరణం చెప్పాడు,
మూడవ చరణం తిమ్మన చెప్పాడు
నాలుగవచరణం తెనాలిరామకృష్ణుడు చెప్పాడు
ఆచరణంతో చివరకు ఆ శాలువా మారుపలక్కుండా ఇచ్చాడట.
ఆ పద్యం-


పెద్దన -               వాకిటికావలితిమ్మా!
భట్టుమూర్తి-        ప్రాకటమగు సుకవివరుల పాలిటి సొమ్మా!
తిమ్మన -             నీకిదె పద్యము కొమ్మా!
రామకృష్ణుడు -    నా కీ పచ్చడమె చాలు నయమున నిమ్మా!

ఈ పద్యం నలుగురు చెప్పినా
అంత్యనుప్రాసలో చెప్పడం గమనార్హం.

Friday, May 15, 2020

దాగిఉన్న శ్లోకం (గూఢశ్లోకం)


దాగిఉన్న శ్లోకం (గూఢశ్లోకం)




సాహితీమిత్రులారా!

ఒక పద్యంలోగాని, శ్లోకంలోగాని మరొక పద్యం ఇమిడి ఉంటే దాన్ని
గూఢశ్లోకం లేదా పద్యం అంటాము. ఇక్కడ 8వ శతాన్దికి చెందిన
రాజానక రత్నాకర కవి కూర్చిన హరవిజయం నుండి
దీనికి ఉదాహరణ గమనిద్దాం-

సశ్రీమానమృదుర్నిసర్గగహనే దర్పాత్రికృత్తద్విషో
వంశ్యశ్చారుయశస్తదా దధదధః సద్యో హృతశ్రీరిపోః
దత్తార్ఘో నయమార్గగోచరగుణః పుష్టీభవన్మారణే
సేవానమ్రలసత్కరాఞ్జలిపుటైవీతారిశఙ్కం సురైః
ఇత్థం దుర్ధరదక్పదోర్ద్రుమతయా మృన్దంశ్చమూరాతతా
భాస్వన్సానుమతి క్షపా ఇవ తదా సూదారశోభానుగః
టాంకారైర్వ్యథితారిసంహతి ధనుర్వ్రత్యా(వ్రాతా)త్తకీర్తి రణే
యత్నాసఞ్జితశిఞ్జినీకసరటః కామం తమవ్యంసయత్
                                                                                                (హరవిజయం - 46 - 71,72)
ఇందులో రెండు శ్లోకాలున్నాయి.
అందుకే వీటిని యుగలశ్లోకాలంటారు.

దీనిలో ఒక శ్లోకం దాగి ఉంది ఆ శ్లోకాన్ని ఈ విధంగా గుర్తించవచ్చు.
దీనిలో క్రిందగీతలు గీచిన వాటిని విడిగా వ్రాయడంవల్ల ఆ శ్లోకం బహిర్గతమౌతుంది.
శ్రీమానమృదుర్నిసర్గగహనే ర్పాత్రికృత్తద్విషో
వంశ్యశ్చారుయశస్తదా దధదధః ద్యో హృతశ్రీరిపోః
త్తార్ఘో నమార్గగోచరగుణః పుష్టీభవన్మాణే
సేవామ్రసత్కరాఞ్జలిపుటైవీతారిశఙ్కం సురైః
త్థం దుర్ధరక్పదోర్ద్రుతయా మృన్దంశ్చమూరాతా
భాస్వన్సానుమతి క్షపా ఇవ తదా సూదారశోభానుగః
టాంకారైర్వ్యథితారిసంహతి నుర్వ్రత్యా(వ్రాతా)త్తకీర్తి ణే
త్నాసఞ్జితశిఞ్జినీటః కామం తమవ్యంసయత్

దాగిఉన్న శ్లోకం -
శ్రీదుర్గదత్తవంశ్యః సహృదయగోష్ఠీరసేన లలితాఙ్కమ్
ఇదమమృతభానుసూనుర్వ్యధత్త రత్నాకరః కావ్యమ్


Tuesday, May 12, 2020

అక్షర విన్యాసం

అక్షర విన్యాసం





సాహితీమిత్రులారా!

వెల్లూరు నరసింగకవి కృత
రాచకన్యకాపరిణము అవతారికలోని
శబ్దచిత్రం చూడండి-

కోదండరామరెడ్డి స
దా దానపు భా గురుత్వ తత్వము తనరం
గా దరణిజ శశి శిబి బలు
లా దివిగవి పగిది లఘువులైరి తలంపన్
                                         (రాచకన్యకాపరిణయము - 1-23)

కోదండరామరెడ్డి దానపు భా - దానకాంతి గురువైనది.
అనగా గొప్పదైనది. దీనిలో  భా - గుర్వక్షరము-
అలఘువు. అపుడు తరణిజ(కర్ణుడు), శశి, శిబి,
బలులు(బలిచక్రవర్తి మొదలైనవారు), ఆ దివిగవి
(కామధేనువు) పగిది లఘువులైరి అనగా చులకనైనారు
- చేవలేనివారు అయినారు. ఇందులో కర్ణాదులు
లఘువులుగా కూర్చబడినది.

ఇది అర్థానికి అనుగుణంగా
అక్షరవిన్యాసం కూర్చబడిన
శబ్దచిత్రము.

Sunday, May 10, 2020

కొమ్ము, సుడుల తో పద్యం


కొమ్ము, సుడుల తో పద్యం




సాహితీమిత్రులారా!

తలకట్లు, గుడులు, కొమ్ములు, ఏత్వాలు,
ఐత్వాలతో మాత్రమే కూర్చిన పద్యలు శబ్దచిత్రంలో ఉన్నాయి
కాని ఇపుడు కొమ్ములు - వట్రువసుడుల పద్యం చూద్దాం.
ఇది విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోనిది.

శుక్రుఁడు శుక్రుఁడు నుగ్రుఁడు శుభుఁడు గుహుఁడు
మునులు గురుఁడును సుగుణు లున్ముదులు బుధులు
సుధులు గురువులు పుణ్యులు శ్రుతులు సుతులు
కృతులు నుతులు నుడువుదురు కృష్ణు ధృష్ణు

(ఉన్ముదులు - పుట్టిన సంతోషంగలవారు,
సుతులు - పుత్రులైన బ్రహ్మ, మన్మథులు)
ఇందులో కేవలం కొమ్ము, వట్రుసుడులు మాత్రమే ఉన్నాయి గమనించగలరు.

Friday, May 8, 2020

తృవ్వట బాబా! తలపై .......


తృవ్వట బాబా! తలపై .......






సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకసారి ఒకకవి వచ్చి అష్టదిగ్గజకవుకు ఒక పరీక్ష పెట్టాడు అదేమంటే  మీలో ఎవరు ఏది చెప్పినదాన్ని నేను వెను వెంటనే రాయగలను మరియు మీరు చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టగలను లేదా మీరు నేను చెప్పిన దాన్ని రాయండి, నే చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టండి. వీటికి మీరు సిద్ధమేనా అని ప్రశ్నించాడు. దీనికి అక్కడివారందరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.  ఆసమయంలో తెనాలి రామకృష్ణకవి ముందుకు వచ్చి నే చెప్పేది రాయమని ఈ క్రింది పద్యం చెప్పాడట.

తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళు
క్కవ్వట; అరయఁగ నట్టి హరునకు జేజే!

(తృప్ = సాక్షరపదముల గ్రహింపజాలని పశువు - వృషభం, బాబా = వాహనం, జాబిల్లి, తలపై పువ్వు, వలువ = కట్టుపుట్టము, బూచి = భయంకరమైన (ఏనుగు)తోలు, చేదే = హాలాహలమే, బువ్వ = ఆహారం, ఉళుళుక్ (హుళక్కి)= లేనిది - మాయ, అవ్వ = కాగా, అట్టి హరును = అలాంటి పరమశివునకు, జేజేలు)
రామకృష్ణకవి చెప్పెడి విధానం పద్యం పలికే తీరు అర్థం కాక ఆ వచ్చిన కవివతంసుడు రాయలేక నిలిచిపోయాడు. ఎంతటి చమత్కారం

Wednesday, May 6, 2020

పెదవులతో మాత్రమే పలికే పద్యం



పెదవులతో మాత్రమే పలికే పద్యం





సాహితీమిత్రులారా!

సౌష్ఠ్యవ్యంజనం అంటే స + ఓష్ఠ్య =  పెదవులతో పలుకబడే
వ్యంజనం (హల్లు) అక్షరాలతో కూర్చబడిన పద్యం.
అచ్చులు లేకుండా  పెదవులతో పలికే హల్లులతోటి కూర్చబడినది
సౌష్ఠ్యవ్యంజనం.
ఆ హల్లులు ప, ఫ, బ, భ,మ, వ - అనేవి. వీటిలో
కొన్నిగాని అన్నీగాని తీసుకొని వ్రాయబడేది సౌష్ఠ్యవ్యంజనం.
దీన్ని ఏకస్థాన చిత్రం అనికూడ అంటారు.
దీన్ని పలికేప్పుడు కేవలం పెదవులు మాత్రమే కదులుతాయి

భవభోమ మమా భామా భూమి వామా విభోభువి
భీమభీవైభవావాపీ పావభూమ భవాంబు పా:
                                                         (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-22)

(శ్రీదేవీ భూదేవి విభుడవైన ఓ రంగనాథా!
భువిలో మాకు భవభయాపహరుడవు కమ్ము.)

 ఈ శ్లోకంలో ప,భ, మ, వ అనే నాలుగు హల్లులే
తీసుకొని వ్రాయడం వల్ల దీన్ని "చతురక్షరి" అనికూడ అంటారు.

Sunday, May 3, 2020

నడకే ఒక చిత్రం(గతిచిత్రం)


నడకే ఒక చిత్రం(గతిచిత్రం)




సాహితీమిత్రులారా!

ఒక పద్యపాదంకాని, శ్లోకపాదంకాని ఎటునుంచి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని "పాదభ్రమకం" అంటారు.
"అలంకారశిరోభూషణే" లోని పాదభ్రమక ఉదాహరణ చూడండి.

లంకాథినాథ గ్రథనాధికాలం
సంసార భూతి శ్రితి భూరసాసం
రంగేవరానన్న నరావగేరం
దేవం భీయా నద్రన యాభి వందే

ఈ శ్లోకం ప్రతిపాదం ముందనుండి చదివినా వెనుకనుండి చదివినా
ఒకటిగానే ఉంటుంది
కాదు............  ఉంది మీరు గమనించి చూడండి.
(రావణుని విజృంభణాన్ని మించి కావయముడైనవాడు, సంసార సంపదా సక్తుడు కానివాడు, మిక్కిలి సమీపాన కావేరీ నదీ జలాలు ప్రవహిస్తున్న ప్రదేశాన నివాసమున్నవాడు అయిన శ్రీరంగనాథుని భయభక్తులతో మంచి వాక్కులతో స్తుతించి నమస్కరిస్తాను.)

లంకాథినాథ గ్రథనాధికాలం
సంసార భూతి శ్రితి భూరసాసం
రంగేవరానన్న నరావగేరం
దేవం భీయా నద్రన యాభి వందే
ప్రతి పాదంలో 11 అక్షరాలు ఉన్నాయి.
మొదటి 5 అక్షరాలను 6 అక్షరం వదలి 7వ అక్షరం నుండి త్రిప్పిరాసిన
పాదభ్రమకం అయినది. అంటే  1,2,3,4,5,6,5,4,3,2,1 ఈ అంకెల్లా కూర్చితే
పాదభ్రమకం అవుతుంది.
పై శ్లోకాన్ని గమనించి చూడండి.

పాదభ్రమకం అక్షరాల నడకలో చిత్రం
కావున దీనికి గతిచిత్రం అని పేరు.

Saturday, May 2, 2020

స్వరాక్షరాలతో పద్యం



స్వరాక్షరాలతో పద్యం





సాహితీమిత్రులారా!


స్వరాలు 7 కదా!
ఆ స్వరాక్షరాలు - స, రి, గ, మ, ప, ద, ని
వీటితో పద్యం లేదా శ్లోకం కూర్చడాన్ని స్వరాక్షరి
అంటారు. ఇక్కడ డా. చిలుకూరి నారాయణరావుకృత
శ్రీకురుమూర్తినాథ శతకం నుండి
ఒక ఉదాహరణ చూద్దాం
దీనిలో "కురుమూర్తినాథ సురవంద్యా పాహిపాపహిప్రభో"-
అన్నది మకుటంగా పద్యాలను కూర్చారు.

సరిగా నీపని సాగనీ గరిప, దా, సాగారి సద్ధామ మా
గరిమన్ సామ నిధానిగా, సమపథంగా సాని నీసారి! మా
దరిగానీ మఱి దారి, సన్నిగమపా! దా సాగ! మాపా! సదా
దర మొప్పం గురుమూర్తినాథ! సురవంద్యా! పాహిపాహి ప్రభో!
                                                                   (శ్రీకుమూర్తినాథ శతకం - 50)

అర్థం-
గరిప - గరుత్మంతుని ప్రభువా
సన్నిగమపా - శ్రేష్ఠములైన వేదములను పాలించువాడా,
దాసాగ - దాసుల పాలిటికొండా
మాపా - లక్ష్మీనాథా,
దాస - ఆగారి - దాసులకు ఉనికి పట్టగు,
సద్దామ - శ్రేష్ఠమైన వైకుంఠమందుండువాడా,
సామనిధానిగా - సామగాన లోలుడవై లేదా
             సౌమ్యమైన మార్గమునందు,
మా గరిమన్ - లక్ష్మ అతిశయిల్లునట్లు,
నీపని - నీవుచేసేపని,
సరిగా - సక్రమంగా,
సాగనీ - సాగించు,
ఈసారి - ఈ పర్యాయం,
నీసాని - నీ భార్య అయిన లక్ష్మి,
సమపథంగా - చంచలమార్గాన్ని వదలి తిన్నని మార్గాన్ని అనుసరించినట్లు,
మఱి - ఇంక,
దారి- నిన్ను చేరుమార్గం,
సదా - ఆదరమొప్పన్ - ఎల్లప్పుడును దయకలిగినవాడవై,
మాదరి గానీ - మాకు చేరునట్లు చేయుము