Friday, March 31, 2017

నెఱిగొప్పు మేఘసందేశంబు


నెఱిగొప్పు మేఘసందేశంబు




సాహితీమిత్రులారా!



హంసవిశతిలోని ఈ పద్యం చూడండి ఇందులో
కవి సంస్కృతకావ్యనామములతో స్త్రీని వర్ణించాడు-

నెఱిగొప్పు మేఘసందేశంబు కనుదోయి
            యందమౌొకువలయానంద మరయఁ
బొంకపుమోము ప్రబోధచంద్రోదయం
            బధరంబు మణిసార మౌర చూడఁ
జెలుపంపు జిఱునవ్వు సిద్ధాంతకౌముది
            స్తనయుగంబు రసమంజరి నుతింపఁ
గరరుహంబులకాంతి కావ్యప్రకాశిక
            ఘననితంబము రసాయనము తలపఁ
దను వలంకార మతనుశాస్త్రములు చూపు
లహహ మధ్యంబు నాటకం బవనిలోన
విద్యలకు నెల్ల మూల మీవెలఁది యనఁగ
విద్యలు పఠింపఁగా నేల వేఱె బుధులు
             (హంసవింశతి - 2-142)

ఈ నాయిక కొప్పు మేఘసందేశము అనే కావ్యంవలె ఉన్నది.
(కొప్పు నల్లగా మేఘం వలె ఉన్నదట)
కనుదోయి కువలయానందమనే అలంకార గ్రంధము.
(కన్నులు కలువలె వోలె ఉన్నవట.)
మోము ప్రబోధచంద్రోదయమనే నాటకము.
(ముఖము నిండు  చంద్రుని వలె ఉన్నదట.)
అధరము(పెదవి) మణిసారమనే గ్రంథమువలె ఉన్నది.
(పెదవి పద్మరాగమణివలె ఎర్రగా ఉన్నదట.)
చిఱునవ్వు సిద్ధాంతకౌముది అనే వ్యాకరణశాస్త్రగ్రంథము.
(చిరునవ్వు చొక్కమైన వెన్నెలవలె ప్రకాశించుచున్నదట.)
స్తనయుగము రసమంజరి అనే పుస్తకం.
(స్తనద్వయం పుష్పగుచ్ఛములవలె ఉన్నవట.)
గోళ్ళకాంతి కావ్యప్రకాశిక అనే అలంకార గ్రంథము.
(గోళ్ళు నక్షత్రాలవలె మినమినలాడుచున్నవట.)
కటితలము రసాయనమనే గ్రంథము
(కటితలము శృంగారమునకు ఉనికిపట్టైఉన్నదట,
గుండ్రని దిన్నెలవలె ఉన్నదని అనుట కూడ)
తనువు అలంకారశాస్త్రము
(శరీరము సౌందర్యముగా ఉన్నదనుట.)
చూపులు అతను శాస్త్రములు
(చూపులు కామశాస్త్రములని మన్మథుని శాస్త్రములని)
నడుము నాటకము (నటించును అని)
ఈమె అవయవములే సమస్తసారస్వతమైనప్పుడు
ఈమెచే పడినప్పుడు సమస్తవిద్యలు చేపడినట్లే అగును కాన
వేఱే విద్యలు నేర్చుకోవడమెందుకు అని కవి చమత్కరిస్తున్నాడు.

నెఱిగొప్పు మేఘసందేశంబు కనుదోయి
            యందమౌొకువలయానంద మరయఁ
బొంకపుమోము ప్రబోధచంద్రోదయం
            బధరంబు మణిసార మౌర చూడఁ
జెలుపంపు జిఱునవ్వు సిద్ధాంతకౌముది
            స్తనయుగంబు రసమంజరి నుతింపఁ
గరరుహంబులకాంతి కావ్యప్రకాశిక
            ఘననితంబము రసాయనము తలపఁ
దను వలంకార మతనుశాస్త్రములు చూపు
లహహ మధ్యంబు నాటకం బవనిలోన
విద్యలకు నెల్ల మూల మీవెలఁది యనఁగ
విద్యలు పఠింపఁగా నేల వేఱె బుధులు

ఇందులో కావ్యనామములు గోపనము
చేసినందున దీన్ని  కావ్యనామ గోపనము అంటారు.


Thursday, March 30, 2017

దీని భావం చెప్పండి?


దీని భావం చెప్పండి?




సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం చూడండి
సమాధానం చెప్పండి-

చుట్టుదిరుగును రెండుమూతులు జూడ నాలుగు కన్నులు న్
నట్టనడుమ రెండుతోకలు నడుచుయెన్మిదికాళ్లనన్
గట్టుపుటల మెట్టమిర్రుల గడిగ బెకలించెడున్
బట్టుగ గని దీనిభావము బండితులు వెలయింపుడీ
                                                                          (నానార్థగాంభీర్యచమత్కారిక - పుట.22)


రెండు మూతులు నాలుగు కన్నులు
రెండుతోకలు ఎనిమిది కాళ్లు,
మెట్టమిర్రులును గడిగా చేయడం
ఇవన్నీ గమనిస్తే - రెండెద్దులు కట్టిన
అరక అను సమాధానం.
కావున సమాధానము - అరక
అరక అంటే రెండెద్దులను కట్టి ఉంటారుకదా!


రక్షానాకపమూర్తిభాసురగభీరా (చక్రబంధము)


రక్షానాకపమూర్తిభాసురగభీరా (చక్రబంధము)




సాహితీమిత్రులారా!

చక్రబంధము నిర్మాణం
కావ్యాలంకార సంగ్రహములో
ఈ విధంగా ఇచ్చారు

పదిచుట్లు నాఱురేకులు
పదిలపఱిచి సుకవిపేరు, పతిపేరును లోఁ
బొదలఁగ నేవంవిధగుణ
విదితం బగు చక్రబంధవిధ మౌ నెటనన్
                           (4-87)

పది చుట్లు, ఆరు రేకులు గీసి
వాటిలో మూడవ చుట్టులో
కృతిపతి పేరును, ఆరవ చుట్టులో
కవిపేరును ఉండునట్లు వ్రాయవలెను.
దీనికి ఉదాహరణ-

రక్షానామకపమూర్తిభాసురగభీరావిక్రమోహాస్పదా
దక్షారమ్యమతిస్థిరాభరణవిద్యాకృత్యశఙ్కిస్వనా
వక్షస్సింధుపకన్యకా నరసభవ్యాతిగ్మధీతంత్రదా
దాక్షిణ్యారతనాదవైభవవినోదాహేమనాగాశ్వదా

ఈ చక్రబంధములో నారసింహాఙ్కిత -
అని పైనుండి మూడవ వృత్తంలో
మూర్తికవికృత - అని ఆరవ వృత్తంలో
ఉన్నది.
రక్షానాపకమూర్తిభాసుర -
రక్షించుటలో ఇంద్రునివలె ప్రకాశించువాడా,
గభీరా - గంభీరుడైన వాడా,
విర్కమోహాస్పదా - విక్రమమునకు,
ఊహకును ఉనికిపట్టైనవాడా,
దక్షా - సమర్థుడగువాడా,
రమ్యమతి స్థిరభా - సుకుమారమగు బుద్ధిచే
ఎల్లపుడు ప్రకాశించువాడా,
రణవిద్యాకృత్యశంకిస్వనా - యుద్ధవిద్యాక్రియలందు
జంకులేని స్వరముకలవాడా,
వక్షఃసింధుపకన్యకా -
వక్షమున(రాజ్య)లక్ష్మిని వహించినవాడా,
సరభసభవ్యా - రసవంతమైన భవిష్యత్తుకలవాడా,
తిగ్మధీతంత్రదా - నిశితమగు బుద్ధిచే
రాజ్యతంత్రముల భేదించువాడా,
దాక్షిణ్యరత - దయయందు ఆసక్తుడగువాడా,
నాదవైభవవినోదా - నాదబ్రహ్మమున వినోదించువాడా,
హేమ నాగాశ్వదా - బంగారమును, ఏనుగులను,
గుఱ్ఱములను దానము చేయువాడా.

పద్యమును చక్రమున నిలువుగా ఉన్న
ఆకునుండి మొదటి పాదం, దానితరువాత
నిలువు ఆకులో రెంవపాదం, తరువాత ఆకులో
మూడవ పాదంను చదువగలము, నాలుగవపాదం
వృత్తాకారంలో చదవాలి. పద్యాన్ని గమనిస్తూ
చదవండి విషయం అవగతమౌతుంది


Wednesday, March 29, 2017

వనమయూరముల గర్వముఁ గుదింప


వనమయూరముల గర్వముఁ గుదింప




సాహితీమిత్రులారా!




గోపనము అనేకవిధాలు
ఇక్కడ వృత్తనామ గోపనము చూద్దాం.
వృత్తనామములు ఈ పద్యంలో
వేరు అర్థంలో ఉపయోగించడం జరిగింది.
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని జైమినీ భారతములో
8వ ఆశ్వాసంలో కుంతలేశుని కుమార్తె వనవిహారము
వచ్చిన సందర్భములోనిది ఈ పద్యం -

అలసతఁ జూపునొయ్యారంపు నడపులు
         వనమయూరముల గర్వముఁ గుదింప
సఖుల వేమఱుఁ బిల్చుసరసంపు టెలుఁగులు
         మత్తకోకిలముల మనసుఁ గలఁప
నిటలంబుల నటించు కుటిలాలకంబులు
         షట్పదంబుల విలాసముల గెలువఁ
దరళలోచనములధాళధళ్యంబులు
         హరిణుల సౌభాగ్య మవఘళింప
దందడించు మనోరథోద్ధత విహార
సరణిఁ జంపకమాలినీతరుణిఁ గూడి
మానినులు గోసి రవ్వనజమంజరులును
సరసిసరసిజములఁ బెక్కు చందములను
                                                                                         (8-73)

ఇందులో వనమయూరము
మత్తకోకిల, షట్పదము, తరళము,
హరిణి, రథోద్ధతము, చంపకమాలిక,
మానిని, సరసిజము--ఇలా వృత్తముల
పేర్లు ఇందులో  ఛందస్సులకు
సంబంధించి కాకుండా ఉపయోగించడం
జరిగింది.

అలసతఁ జూపునొయ్యారంపు నడపులు
         వనమయూరముల గర్వముఁ గుదింప
సఖుల వేమఱుఁ బిల్చుసరసంపు టెలుఁగులు
         మత్తకోకిలముల మనసుఁ గలఁప
నిటలంబుల నటించు కుటిలాలకంబులు
         షట్పదంబుల విలాసముల గెలువఁ
దరళలోచనములధాళధళ్యంబులు
         హరిణుల సౌభాగ్య మవఘళింప
దందడించు మనోరథోద్ధత విహార
సరణిఁ జంపకమాలినీతరుణిఁ గూడి
మానినులు గోసి రవ్వనజమంజరులును
సరసిసరసిజములఁ బెక్కు చందములను


వడిదీనిని చెప్పవలయు


వడిదీనిని చెప్పవలయు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం చూడండి
సమాధానం చెప్పగలరేమో-

ఉడికియునుడకనిదొక్కటి
వడినుడికినదొకటియచ్చ పచ్చిదొకటియున్
గడునమలనందమౌనది
వడిదీనిని జెప్పవలయు వరసరసులిలన్

ఇందులో
ఉడికి ఉడకనిది ఒకటి
బాగా ఉడికినది ఒకటి
పచ్చిది ఒకటి
ఈ మూడింటిని నమిలితే ఆనందమౌతుందట
- అదేమిటో చెప్పమంటున్నాడు కవి-

ఉడికి ఉడకనిది - పోకచెక్క (వక్కపేడు)
బాగా ఉడికినది - సున్నము
పచ్చిది - తమలపాకు
ఈ మూడింటిని నమిలిన ఆనందమౌతుంది
నోరు ఎర్రగామారి ఆరోగ్యాన్నిస్తుందికదా!

అదే  - తాంబూలం

హేవళంబి నామసంవత్సర ఉగాది శుభాకాంక్షలు


హేవళంబి నామసంవత్సర
ఉగాది శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు
హేవళంబినామ సంవత్సర 
ఉగాది శుభాకాంక్షలు

Tuesday, March 28, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 7


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 7




సాహితీమిత్రులారా!

శ్రీకొడవలూరు రామచంద్రరాజు కృత
మహాసేనోదయము నందు గల
గిరిబంధము పద్యం చూడండి-

గిరిబంధములో మొదట 1 అక్షరము,
తరువాత 3 అక్షరములు, 5 అక్షరములు,
7 అక్షరములు, 9 అక్షరములు, 11 అక్షరములు,
11 అక్షరములు ఉండునట్లు కూర్చబడిన చిత్రములో
చూపిన విధంగా వ్రాసిన గిరిబంధము ఏర్పడును.
ఈ విధంగా వ్రాయడం వలన పైనుండి మధ్యలో
కవి పేరుగాని, ఇష్టదేవత పేరుగాని కవి కూర్చును
ఈ పద్యంలో కొడవలూరి రామచంద్రరాజు గారు
తన ఇష్టదైవమైన శ్రీరామలింగేశ్వరుని
నమస్కరించిన విధంగా కూర్చారు.

శ్రీహీరాన్గద కమలద
వాహ నిలింపార్చితాంఘ్రి వనజాగసుత 
స్నేహ మునినిచయవంద్యా
దేహజగర్వాద్రికులిశ దేవసుచరితా



శ్రీ
హీరాన్గ
ద కలద
     వాహ నిలింపార్చితాం
ఘ్రి వనజాసుతస్నేహ 
మునినిచయవంద్యాదేహజగ
              ర్వాద్రికులిశ దేవసుచరితా



Monday, March 27, 2017

అబలాఢ్య విగ్రహశ్రీః


అబలాఢ్య విగ్రహశ్రీః




సాహితీమిత్రులారా!




చ్యుతాక్షర చిత్రం చూడండి

ఈ శ్లోకంలో రెండర్థాలున్నాయి చూడండి-

అబలాఢ్య విగ్రహశ్రీః అమర్త్యనతిః అక్షమాల యోపేతః
పంచక్రమోదితముఖః పాయాత్ పరమేశ్వరోముహురనాదిః

మొదటి అర్థము -

అబలా - ఆఢ్యవిగ్రహశ్రీః -
(అర్థభాగంలో) స్త్రీ రూపంతో ప్రకాశించు శరీరశోభ 
గలవాడును(అర్థనారీశ్వరుడును,)
అమర్త్య - నతిః -
దేవతలచే నమస్కరింపబడువాడును,
అక్షమాలయా - ఉపేతః -
రుద్రాక్షమాలతో కూడుకొని ఉన్నవాడును,
పంచక్రమ - ఉదిత - ముఖః -
తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాననము -లనే
అయిదు ముఖాలు గలవాడును,
అనాదిః - మొదలు లేనివాడు లేక చిరకాలంగా ఉన్నవాడు- అగు,
పరమేశ్వరః - సర్వేశ్వరుడు,
ముహుః పాయాత్ -
మాటిమాటికి(అన్నివిధాలా) రక్షించుగాక!

దీనిలోని మరో అర్థం కావాలంటే
దీనిలోని విశేషణాలకు, విశేష్యాలకు మొదటనున్న
అక్షరాన్ని చ్యుతం(లుప్తం)చేయగా మిగిలిన విశేషణ విశేష్యాలు
(ప)రమేశ్వరుని(విష్ణువు యొక్క) అర్థాన్ని తెలుపుతాయి.
ఈ క్రంద గమనించండి-

(అ)బలా - ఆఢ్యవిగ్రహశ్రీః -
అధిక శక్తితో ఒప్పుచున్న శరీరశోభ కలిగినట్టి,
(అ)మర్త్యనతిః - 
మనుష్యులచే నమస్కరింపబడువాడును,
(అ)క్షమాలయా - ఉపేతః -
అధికమైన ఓర్పుకు నిలయమైనట్టియు,
(పం)చక్రమోదిత - ముఖః -
చక్రధారి కాగానే సంతసించు మొగముగలవాడును,
అనాదిః - పై విశేషణములలో ఆది - అక్షరం పోగా
(ప)రమేశ్వరః - రమాపతియగు విష్ణువు
పాయాత్ - రక్షించుగాక!

ఈ విధంగా తీసుకుంటే రెండవ అర్థం వస్తున్నది కదా
కావున దీన్ని చ్యుతాక్షర చిత్రమంటున్నాము

చలి గిలి బిలి వెలి


చలి గిలి బిలి వెలి




సాహితీమిత్రులారా!


దత్తపది-
చలి,
గిలి, 
బిలి,
వెలి
అనే పదాలను
ఉయోగించి
గ్రీష్మర్తువర్ణన చేయాలి.

 సింహాద్రి శ్రీరంగంగారు పూరణ-

చలి కాలమ్మెహితము ముం
గిలి దుమ్మెత్తికొని పోవు - గ్రీష్మాతపముల్
బలిఁగోరుఁబాంధజనముల
వెలి ఋతువులకన్న భయద - మియ్యది పుడమిన్

ఇచ్చిన పదములను చక్కగా ఉయోగించి
గ్రీష్మర్తు వర్ణనచేశాడుకదా

Sunday, March 26, 2017

మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 6


మహాసేనోదయములోని చిత్రకవిత్వము - 6




సాహితీమిత్రులారా!


మహాసేనోదయములోని ప్రథమాశ్వాసములోని
ఈ పద్యం ఖడ్గంధములో కూర్చబడినది-
చూడండి-

పురహరసురనుతపాదా
కరిదై తేయాసుహర్త కంధినిషంగా
గిరిజాహృదయరంజన
సరసీరుహనాభమిత్ర సమ్మనిసంగా


చిత్రము చదవడం సులభతరం చేయడం కోసం
కవిగారు చిత్రములో పాదము సంఖ్యలు చూపడం
జరిగింది సులువుగా చదువవచ్చు.
పద్యాన్ని చూస్తూ బంధచిత్రం చూచి చదవండి
కవి ఎలా బంధాన్ని రచించారో అవగతమౌతుంది.



Saturday, March 25, 2017

తెలిసి కొనరయ్య బుద్ధికౌశలము మెఱయ


తెలిసి కొనరయ్య బుద్ధికౌశలము మెఱయ




సాహితీమిత్రులారా!




ఈ పొడుపు పద్యం చూడండి-
సమాధానం చెప్పగలరేమో చూడండి-


నారీలలామ! నీపేరు చెపుమన్న
         తమిమీర ఎడమ నేత్రము చూపె
మత్తేభయాన! నీమగని పేరమన్న
         తన చేత జీర్ణవస్త్రంబు చూపె
వెది! నీకేమైన బిడ్డలా చెపుమన్న
         కరమొప్ప మింటి చుక్కలను చూపె
కుటిల కుంతల! నీదు కులము నామంబన్న
         పంజరంబుననున్న పక్షి చూపె
ప్రభువు మీకెవ్వరన్న గోపకుని చూపె
ధవుని వ్యాపారమేమన్న దండమిడియె
చతులమతులార!  యీ ప్రౌఢజాణతనము
తెలిసి కొనరయ్య! బుద్ధికౌశలము మెఱయ


సమాధానాలు చెప్పగలరేమో చూడండి-

ఇందులోని ప్రశ్నలకు సమాధానాలు-


నారీలలామ! నీపేరు చెపుమన్న
         తమిమీర ఎడమ నేత్రము చూపె
ఆమె పేరు - వామాక్షి
ఎడమకన్ను చూపడమంటే
(వామ - ఎడమ, అక్షి కన్ను)


మత్తేభయాన! నీమగని పేరమన్న
         తన చేత జీర్ణవస్త్రంబు చూపె

భర్తపేరు - కుచేలుడు
జీర్ణవస్త్రం - అంటే కుచేలం
అంటే జీర్ణమైన వస్త్రం ధరించేవాడు కుచేలుడు


వెది! నీకేమైన బిడ్డలా చెపుమన్న
         కరమొప్ప మింటి చుక్కలను చూపె
ఆమెకు సంతానం - ఇరువది ఏడు
నక్షత్రాలు ఇరవై ఏడు కదా

కుటిల కుంతల! నీదు కులము నామంబన్న
         పంజరంబుననున్న పక్షి చూపె

                                         -----

ప్రభువు మీకెవ్వరన్న గోపకుని చూపె
వారికి ప్రభువు - శ్రీకృష్ణుడు
గోపాలుని చూపడంలో అర్థం
గోపాలుడు కృష్ణుడు ఒకటేకదా

ధవుని వ్యాపారమేమన్న దండమిడియె

వారి వృత్తి - తపస్సు

Friday, March 24, 2017

రెండు ముళ్ళు రమణికి వీడెన్


రెండు ముళ్ళు రమణికి వీడెన్




సాహితీమిత్రులారా!




పొడుపు పద్యం చూడండి
సమాధానం చెప్పగలరేమో చూడండి-

సతికైదు ముళ్ళు గలవట
పతిచేతను రెండు ముళ్ళు బలిమినివీడెన్
హితముననొకముడివీడెను
రతిసేయగ రెండుముళ్ళు రమణికి వీడెన్

స్త్రీకి  అయిదు ముళ్ళున్నాయట
అందులో మగనిచేత రెండు ముళ్ళు
బలిమినివీడెనట, హితమున ఒకముడి వీడిందట,
రతిచేయగా రెండు ముళ్ళు వీడాయట
మరి ఆ ముడులేమిటో చెప్పాలి-

సామాధానం ఆలోచించగ చెప్పగలరా!

పతిచే విప్పెడివి - రవికముడులు(2)
హితంతో విప్పేవి - పోకముడు(1)
రతిచేయగా విప్పేవి - కొప్పుముడి(1)
                 - బొమముడి(1)
వెరసి - 5

Wednesday, March 22, 2017

రామో రాజీవలోచనః


రామో రాజీవలోచనః




సాహితీమిత్రులారా!



ఈ ప్రహేలిక చూడండి-

కుమార సమ్భవం దృష్ట్వా రఘువంశే మనో దధత్
రాక్షసానాం కులశ్రేష్ఠో రామో రాజీవలోచనః

కమలముల వంటి కన్నులున్న రాక్షస కులశ్రేష్ఠుడైన
రాముడు కుమారసంభవాన్ని చూచి రఘవంశంలో మనసు
పెట్టాడు - అని ఈ శ్లోకం సామాన్యార్థము.

ఇది సందర్భవిరుద్ధంగా ఉన్నది
దీని నిజమైన అర్థం-

కులశ్రేష్ఠః - వంశములో ఉత్తముడైన, రామః - రాముడు,
రాక్షసానాం - రావణాది రాక్షసులయొక్క,
సంభవం - పుట్టుకను, దృష్ట్వా - చూచి,
రఘువంశే - రఘుమహారాజు వంశమునందు,
మనః - మనస్సును, అదధత్ - ధరించెను,
కుం - భూమిని, అర - పొందెను(కుమ్ - అర - కుమార)
ఇది దీని అర్థం.

గోపాయిత గోపాయిత గోపాయిత


గోపాయిత గోపాయిత గోపాయిత




సాహితీమిత్రులారా!


యాదవ రాఘవ పాండవీయములోని
మరొక షష్ఠ్యంతము చూడండి-

గోపాయిత గోపాయిత
గోపాయిత వినుత గోత్ర గుణమణి ధృతికిన్
గోపాహిత గోపాహిత
గోపాహిత మద విభేద గురుబల ధృతికిన్

గోపాయిత = గోగోపకుల రక్షించుటకై,
గోత్రధృతి = గోవర్థనగిరి ధరించినవాడవని
వినుత = వినుతిగొన్న ధీరునకు,

గోపాయిత - గుణ =బ్రహ్మగోవులను గోవత్సాలను,
గోపాలురను హరించగా ఒక సంవత్సరము ఆయా
గుణవిలసితుడై అందరు తానే అయిన ధీరునకు

గోపాయిత - మణి - ధృతికిన్ =
గోకులమును అరిష్టములనుండి రక్షించుటకై,
శమంతక మణిని చేగొన్న అక్రూరుని భయమును పోగొట్టి
నగరమున నిల్పి, మణిని రక్షించి తనవారిని కాపాడిన ధీరునకు-


గోప + అహిత = గోకులము శత్రువుల,
మద - విభేద - ధృతికిన్ - మదమడంచిన బలశాలికి-

గోప- +ఆహిత - గురు ధృతికిన్ -
గోకులమునకు మిత్రుడు గురువు అయిన ధీరునకు-

గోప + ఆహిత - బల - ధృతికిన్ -
గోపకులమునకు మిత్రుడు బలము అయిన ధీరునికి-

సభక్తి సమర్పితంబుగా నెల్లూరి వీరరాఘకవిగారు
యాదవరాఘవపాండవీయమును
శ్రీమన్నారాయణునికి అంకితం చేశాడు


Tuesday, March 21, 2017

గిరి, విరి, సిరి, కరి


గిరి, విరి, సిరి, కరి




సాహితీమిత్రులారా!



దత్తపది-

గిరి,
విరి,
సిరి,
కరి-
అనే పదాలనుపయోగించి
రామాయణార్థంలో పద్యం చెప్పాలి-


సింహాద్రి శ్రీరంగం గారి పూరణ-

గిరిసుత నాధునిధనువును
కరి సరసిజనాళమట్లు - కడువడి ద్రుంచన్
విరిబోడి సీతతోఁ జే
సిరి పెండిలి పెద్దలెల్ల - శ్రీరామునకున్

ఇందులో గిరిని గిరిసుత నాధునిధనువు - శివధనుస్సుగా
కరిని- అలాగే ఉంచి ఏనుగు తామరతూడును త్రుంచినట్లు- అని
విరిని విరిబోడిగా, సిరిని జేసిరి గా తీసుకోవడంతో
రామాయణార్థంలో అర్థవంతంగా ఇమిడిపోయాయి
దత్తపదాలు.

అసలు పదమేదొ తెలుయుడీ


అసలు పదమేదొ తెలుయుడీ




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి
సమాధానం చెప్పగలరేమో-

పదము చెలువొందు నక్షరపంచకము
మొదలు వదలిన ముంగిస పొదలు, దాని
తలనరికి వేయ వంశంబు నిలిచి యుండు
అసలు పదమేదొ తెలియుడీ రసికులార!

ఈ పొడుపు పద్యమునకు
సమాధానంలో 5 అక్షరాలుంటాయి.
అందులో మొదయి అక్షరం(దానిమొదలు)
తీసివేసిన(వదిలిన) ముంగిస అని అర్థం వస్తుంది.
అలాగే ఆ వచ్చిన పదం తల నరికిన అంటే
మొదటి అక్షరం తీసివేస్తే వంశము అనే అర్థం
ఇచ్చే పదమవుతుంది. మరి ఆ అసలు పదమేదొ చెప్పండి

సామాధానం - ఇనకులము

ఇనకులము - లో మొదటి అక్షరం తీసివేస్తే
నకులము - అంటే ముంగిస - సరిపోయిందికదా!
అలాగే నకులము - అనే పదంనుండి
మొదటి అక్షరం తీసివేసిన కులము
కులము - అంటే వంశము అనే కదా!
కావున ఈ సమాధానం సరిపోయినది.

Monday, March 20, 2017

హార హీర సారసారి


హార హీర సారసారి




సాహితీమిత్రులారా!



కావ్యాలంకారసంగ్రహంలోని
ఈ పద్యం చూడండి-
ఇందులో క - నుంటి మ- వరకు గల
25 అక్షరాలు వాడకుండా వ్రాయబడింది
దీన్ని వర్గపంచకరహితము అని అంటారు.
ఇది శబ్దచిత్రంలోని స్థానచిత్రానికి చెందినది.

హార హీర సారసారి హారశైల వాసవో
ర్వీరుహా హిహార శేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం
హార సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా
                                                  (కావ్యాలంకాసంగ్రహము -5- 245)

(హీరము - మణి, సారసారి - సంద్రుడు,
హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,
యాశసాంశుశీల - కీర్తికాంతచే ఒప్పువాడా,
సూర్యహర్యవార్య సాహసా - సూర్యుని అశ్వముల
చేతను వారింపరాని(చొరరాని) సాహసము కలవాడా)

ఈ పద్యంలో
క,ఖ,గ,ఘ,ఙ
చ,ఛ,జ,ఝ,ఞ
ట,ఠ,డ,ఢ.ణ
త,థ,ద,ధ,న
ప,ఫ,బ,భ,మ
అనే 25 అక్షరాలున్నాయేమో గమనించగలరు.
ఇవిలేవుకావుననే దీని వర్గపంచకరహిత పద్యం
అనే పేరు పెట్టారు.

హలో, టాటా, సారీ, ఒకే


హలో, టాటా, సారీ, ఒకే




సాహితీమిత్రులారా!



దత్తపది-
హలో,
టాటా,
సారీ,
ఒకే
అనే పదాలను ఉపయోగించి
అవే అర్థాలు రాకుండా పద్యం చెప్పాలి

సింహాద్రి శ్రీరంగంగారి పూరణ-

అహహ లోకాల పేరందినట్టి భూమి
అకట టాగోరు కవి గన్నయట్టి భూమి
వెతల వేసారి కన్నీరు పెట్టునిపుడు
కన ఒకేయొక దౌర్జన్య కారణమున

హలో - హ - లో గా విరిచి అహహ లోకాల అని,
టాటా - టా - టా గా విరిచి అకట టాగోరు అని,
సారీ -ని -  వేసారి గా
ఒకే - ను - ఒకేయొక గా
పూరించటం వలన మొదటి అర్థం
ఇందులో లేకుండ క్రొత్త అర్థంతో
భాసిల్లినవి.

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.


Sunday, March 19, 2017

నేనాకాశతరంగిణి


నేనాకాశతరంగిణి





సాహితీమిత్రులారా!


జూపల్లి ధర్మారాయని దానగుణ
ప్రశస్తిని తెలిపే పద్యం ఇది.
సంవాద చిత్రంలో కూర్చబడినది
చూడండి-

నేనాకాశ తరంగిణి, న్ధరణిలో నెవ్వరే వాహినీ!
నేనా జూపలి ధర్మభూవిభుని పాణిం బుట్టు దానాపగన్
నీనాయంతరమేడకేడ? అవులే నీవేడ నేనేడ? పో
నేనా యాచకు పాదజాతవటనే? నేదాతృహస్తోదితన్

ఆకాశగంగకు, ధర్మారాయని దానజలధారకు
జరిగిన సంభాషణ-

ఆకాశగంగ- నేనాకాశ తరంగిణి, న్ధరణిలో నెవ్వరే వాహినీ!
                     నేను ఆకాశగంగానదిని. ఓ నదీ! భూమిపైన నీవెవరివి?

దానజలధార - నేనా జూపలి ధర్మభూవిభుని 
                  పాణిం బుట్టు దానాపగన్
                          నేను జూపల్లి ధర్మారావుగారి చేతి దానజలం నుండి
                          పుట్టిన నదిని

ఆ.గ.- నీనాయంతరమేడకేడ? 
           నీకునాకు భేదం ఎంతో ఉన్నది
           నీవు నాతో సాటిరాలేవు

దా.జ.ధార-  అవులే నీవేడ నేనేడ? పో
              నేనా యాచకు పాదజాతవటనే?                   
              నేదాతృహస్తోదితన్
                     అవునులే నీవెక్కడ నేనెక్కడ
                     నీవు యాచకుడుగా వచ్చిన వాని పాదాల
                     నుండి పుట్టిన దానివి. నేనో దానమిచ్చిన
                     వాని చేతినుండి పుట్టిన దాన్ని
అంటే యాచకునికంటే దాత గొప్పవాడు
కాబట్టి నీకంటే మిన్నయైనదాన్ని అని దానజలధార అభిప్రాయము

దానమిచ్చేటప్పుడు ముందుగా నీరువదిలి దానం ఇస్తారు
అలా జూపల్లి ధర్మారాయడుఎప్పుడు దానాలు ఇవ్వగా
అతడు వదిలిన నీరు నదిగా మారిందట


ఎంత దానాలు చేశాడో ఏమో అంత నది ప్రహించాలంటే


Saturday, March 18, 2017

దీర్ఘము, తలకట్టు, పొక్కిలి


దీర్ఘము, తలకట్టు, పొక్కిలి




సాహితీమిత్రులారా!



విజయవిలాసంలో చేమకూరవేంకటకవి
చూపిన అక్షరచిత్రం చూడండి-
యతిగామారి ద్వారకకు చేరిన
అర్జునుడు, సుభద్రను చూచిన
సందర్భములో కవి కూర్చిన చిత్రం
ఈ పద్యం-

కన్నులు దీర్ఘముల్, నగుమొగం బవురా! తలకట్టు తమ్మిపూ
పున్నమ చందమామలకుఁ, బొక్కిలి చక్కదనంబుఁ జెప్పఁ
గా
నున్నదె మేలు బంతులు పయోధరముల్, చిఱు కౌను సున్నయౌ,
నెన్నిక కెక్కు వ్రాఁతఫల మివ్వరవర్ణినికి న్నిజంబుగన్
                                                                     (విజయవిలాసము - 2-104)


కన్నులు నిడుపైనవి(దీర్ఘములు), అవురా - బళీ,
నగుమోగంబు- సహజంగా నవ్వుతూండే ముఖము,
తమ్మిపూ పున్నమ చందమామలకున్ - పద్మమునకూ,
నిండు చందమామకూ, తలకట్టు - పాగ(అనగా వాటిని మించినది),
పొక్కిలి - నాభియొక్క, చక్కదనంబు, చెప్పగా నున్నదె -
చెప్పుటకు వీలగునా (కాదు అని అర్థం) పయోధరముల్ - పాలిండ్లు,
మేలు బంతులు - చక్కని చెండ్లు, చిఱుకౌను - చిన్ననడుము,
సున్నయౌ - లేనిదే, ఈ వరవర్ణినికిన్ - ఈ నారీమణికి, నిజంబుగన్,
వ్రాతఫలము - బ్రహ్మవ్రాసిన వ్రాతయొక్క ఫలము(అదృష్టము),
ఎన్నికకు ఎక్కున్ - అయిశయించును - అని భావం.

దీనిలో వరవర్ణినికిన్ - శ్రేష్ఠమైన అక్షరములు కల కాంతకు -
దీర్ఘములు, తలకట్లు, పొక్కిలి, బంతులు(పంక్తులు), సున్న, 
వ్రాయడం వల్ల(వ్రాతఫలము) కలిగిన ఫలితం - వీటితో
శ్రేష్ఠమైన అక్షరాలు ఏర్పడ్డాయని అక్షర చిత్రాన్ని చమత్కారంగా చెప్పాడు.
గుణింతములో వాడుకునే పదాలను ఇందులో కూర్చి వర్ణించడమే
ఇందులోని అక్షర చిత్రము

Friday, March 17, 2017

మాలికా చతుర్విధ కందము


మాలికా చతుర్విధ కందము



సాహితీమిత్రులారా!



చతుర్విధకందము అంటే ఒక కందములో
నాలుగు కందములను ఇముడ్చుట.
మాలికా చతుర్విధ కందములో
మొదటి పాదంలోని 2,3,4,5 అక్షరములతో
ప్రాసను కూర్చడి ఉండును మరియు
మొదటి అక్షరము రెండవ పద్యమునకు
చివరి అక్షరంగా మారుతుంది అలాగే
రెండవ పద్యము మొదటి అక్షరము
మూడవ పద్యం చివరి అక్షరమౌతుంది
మూడవ పద్యం మొదటి అక్షరం
నాలుగవ పద్యం చివరి అక్షరంగా మారుతుంది.
ఈ క్రింది పద్యంలో గమనింప గలరు.

శ్రీభూమీన వరదహరి
గోభూమానవ వినుత సుగుణ బుధ మధునా
శాభీ మానవ కృష్ణఘ
నా భా మానవ హరిదరి యభవ కమలనా
                                                       (అప్పకవీయము - 4- 627)

గర్భిత పద్యములు-
రెండవది-

భూమీన వరదహరి గో
భూమానవవినుత సుగుణ బుధ మధునాశా
భీమా నవకృష్ణఘనా
భామానవహరి దరి యభవ కమలనాశ్రీ

మూడవ కందము-

మీనవరద హరిగోభూ
మానవవినుత సుగుణబుధ మధునాశా భీ
మా నవకృష్ణఘనాభా
మానవహరిదరియభవకమలనాశ్రీభూ

నాలుగవ కందము-

నవరద హరిగోభూమా
నవవినుత సుగుణబుధ మధునాశా భీమా 
నవకృష్ణఘనాభామా
నవహరిదరియభవకమలనాశ్రీభూమీ


ఇలాంటిదే మహాసేనోదయము నందు
కొడవలూరు రామచంద్రరాజుగారు కూర్చారు
చూడండి-

శ్రీగోపావన భవహర 
భోగా పావనినుతపద మునిగణభయవా
ర్యాగోపావనతాంఘ్రియు
గా గోపావనజదృశ యుగళగురుప్రతిభా


ఈ పద్యంలో ఇమిడ్చిన మిగిలిన పద్యాలు-

రెండవ కందపద్యం-

గోపావన భవహరభో
గా పావనినుతపద మునిగణభయవా ర్యా
గోపావనతాంఘ్రియుగా 
గోపావనజదృశ యుగళగురుప్రతిభాశ్రీ

మూడవ కంద పద్యం-

పావన భవహరభోగా 
పావనినుతపద మునిగణభయవా ర్యాగో
పావనతాంఘ్రియుగా గో
పావనజదృశ యుగళగురుప్రతిభాశ్రీగో


నాలుగవ కందపద్యం-

వన భవహరభోగా పా
వనినుతపద మునిగణభయవా ర్యాగోపా
వనతాంఘ్రియుగా గోపా
వనజదృశ యుగళగురుప్రతిభాశ్రీగోపా






నాగాహిత నాగాహిత నాగాహిత


నాగాహిత నాగాహిత నాగాహిత




సాహితీమిత్రులారా!



నెల్లూరి రాఘవకవికృత
యాదవరాఘపాండవీయములోని
షష్ఠ్యంత పద్యం చూడండి-

నాగాహిత నాగాహిత 
నాగాహిత కేతువదన నవ తల్పునకున్
నాగాహిత నాగాహిత
నాగాహిత హరణ భరణ నమనోన్నతికిన్


నాగాహిత - నాగ - అహిత - పాములకు శత్రువగు గరుడుడు.
నాగాహిత - నాగ - అహిత - గజములకు శత్రువైన సింహము.
నాగాహిత - నాగ - ఆహిత - పాముకు సదాహితుడైన ఆదిశేషుడు
కేతు వదన నవ తల్పునకున్
కేతు - పతాకముగా(గరుడుని)
వదన - ముఖముగా(సింహవదనముగల నరసింహుడు)
నవతల్పునకున్ - పాన్పుగా గలవానికి
పాములకు శత్రువైన గరుత్మంతుని పతాకంగా గలవానికి,
ఏనుగులకు శత్రువైన సింహము ముఖముగలవానికి,
పాములకు సదా ఇష్టుడైన ఆదిశేషుని తల్పంగా గలవానికి,

నాగహిత - నాగ - అహిత - గజేంద్రునికి శత్రువైన మకరమును
హరణ - హరించిన, ఉన్నతునకున్ - మహితునికి

నాగహిత - నాగ - అహిత - కొండలకు శత్రువైన ఇంద్రుని,
భరణ - రక్షించు, ఉన్నతునకున్ - మహితునికి,

నాగహిత - నాగ - అహిత - పాములకు శత్రువైన గరుడుని,
భరణ - రక్షించు,
నమన - నమ్రులుగా చేసి,
ఉన్నతునికిన్  - మహితుడు
అయిన విష్ణువుకు
తన యాదవరాఘవపాండవీయమును
సభక్తికంగా సమర్పించాడు

ఇందులో యమకాలంకారము మరియు
క్రమాలంకారములు రెండును కలవు

ఇది గూఢచిత్రానికి చెందినది.

సాహితీమిత్రులకు ధన్యవాదాలు


సాహితీమిత్రులకు ధన్యవాదాలు



సాహితీమిత్రులారా!


నేనండీ ............
మీ చిత్రకవితా ప్రపంచాన్ని
ఈ రోజు నాకు రెండవ ఏడు వచ్చింది. 
మీరందరి సహకారంతో ఇప్పుడిప్పుడే 
బుడిబుడి నడకలు వేస్తూ వస్తున్నాను 
నన్ను మీరు ఎప్పటిలాగే ఆదరించి 
పెద్దచేయాల్సిన బాధ్యత మీదే 
మీ అందరి సహకారంతోే
              ఇంకా ఇంకా పెద్దవగలనని ఆశిస్తూ..........
మీ అందరికి పేరు పేరున 
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

ఇట్లు 
మీ 
చిత్రకవితా ప్రపంచం

Thursday, March 16, 2017

సర్వస్య ద్వే? సుమతికుమతీ


సర్వస్య ద్వే? సుమతికుమతీ




సాహితీమిత్రులారా!


పూర్వం భోజరాజొక సుందరప భవన నిర్మాణం
చేయిస్తున్నాడు. అది పూర్తి కాకమునుపే దానిలో
ఒక బ్రహ్మరాక్షసుడు ప్రవేశించి, రాత్రులందు
అక్కడ తలదాచుకొనే వారికి కొన్ని ప్రశ్నలు
అడగడం, సమాధానాలు చెప్పనివారిని తినివేయడం
జరుగుతున్నది. రాజుగారు ఎన్నో మంత్ర తంత్రాలు
వేయించాడు లాభం లేక పోయింది.
చివరికి దానివిషయమై కాళిదాసుతో
మాట్లాడగా నాటిరాత్రి కాశిదాసు సభాగృహంలో పరుండగా
యథాప్రకారం బ్రహ్మరాక్షసుడు వచ్చి యామమునకు ఒప ప్రశ్న
చొప్పున వ్యాకరణానికి సంబంధించినవి నాలుగు ప్రశ్నలు వేశాడు
దానికి కాళిదాసు సమాధానాలిచ్చాడు అవి ఈ శ్లోకంలో-

సర్వస్య ద్వే ?
సుమతి కుమతీ, సంపదాపత్తి హేతూ
వృద్ధో యూనా ?
సహ పరిచయాత్ త్యజ్యతే కామినీభిః
ఏకోగోత్రే ?
ప్రచలతి పుమాన యః కుటుంబం బిభర్తి
స్త్రీ పుం వచ్చ ?
ప్రతిభవతి యదా తద్ధి గేహం వినష్టమ్

ఇందులోని ప్రశ్నలు సమాధానాలు-
బ్రహ్మరాక్షసుడు - సర్వే ద్వే?
                అందరికి రెండుంటాయి అవి ఏవి?
                (పాణినీయ సూత్రాలలో ఒకటి)
కాళిదాసు - సుమతి కుమతీ సంపదాపత్తిహేతూ
          (అందరకూ మంచిబుద్ధి, చెడు బద్ధి
           అని రెండుంటాయి. అవి సంపదలకూ,
           ఆపదలకు రెండిటికీ ఆలవాలము)
బ్ర.రా. - వృద్ధో యూనా?
         (ముసలివాడు పడుచుదానితో)
          (పాణినీయంలో మరొకటి)
కా.దా. - సహ పరిచయాత్త్యజ్యతే కామినీభిః
                (కాముకులగు స్త్రీలు యువకునితో(యూనా) ప్రత్యేక
                 సంబంధం ఏర్పడినంతనే ముసలివానిని ముందుకు తోసి,
                  వదలి పెట్టి వెళుతుంటారు.)

బ్ర.రా. - ఏకో గోత్రే? (వంశములో నొక్కడు)
               (పాణినీయములోని మరొసూత్రము)

కా.దా. - ప్రభవతి పూమాన్ యః కుటుంబం బిభర్తి
               (కుటుంబభారమును భరించు పురుషుడొక్కడే, ఆ వంశమును
                  చక్కగా ముందుకు నడుపుకొని పోవుచుండును)

బ్ర.రా.- స్త్రీ పుంవచ్చ?(స్త్రీ పురుషుని వలె)
                 (నాలుగవ ప్రశ్న- పాణీయసూత్రము)

కా.దా. -ప్రభవతి యదా తద్ధి గేహం వినష్టమ్
                 (ఆడుది ఏ ఇంటిలో పురుషునివలె, మించి అధికారం
                  చలాయిస్తుందో ఆ ఇల్లు పూర్తిగా నాశనమై పోతుంది)

ఇవి విన్న బ్రహ్మరాక్షసుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడట.
మొత్తం మీద రాజకీయ అధికారులు, మంత్ర ప్రభావం చేయని
పని కాళిదాసు ప్రతిభ,పద్యస్పూర్తి చక్కగా సమంజసంగా పనిచేసి,
రాజుగారికి సభాగృహప్రవేశం కలిగింెచింది





Wednesday, March 15, 2017

చిత్రకవితా ప్రపంచం

పాలీవేమని తండ్రివెంటబడె


పాలీవేమని తండ్రివెంటబడె




సాహితీమిత్రులారా!




సమస్య-
పాలీవేమని తండ్రివెంటబడె నాబాలుండు కోపంబునన్

 సింహాద్రి శ్రీరంగంగారి పూరణ-

బాలుండొక్కు వెంటరా జనకుడొప్పన్ పాలకుంబోయి, య
య్యాలంబిండి ఘటంబు నింపుకొని చింతాయత్త చిత్తంబుతన్
దూలంజేయ హుటాహుటిన్ జనుచు తత్సూనుంగనం డండుచే
పాలీవే మని తండ్రివెంటబడె నాబాలుండు కోపంబునన్

బాలుడు తండ్రిని పాలడుగడము అనుచితము
దాన్ని  ఒక సందర్భం తీసుకొని పూరించడంతో
అనుచితం ఉచితంగా మారింది.

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు

పయోధరసమయః


పయోధరసమయః




సాహితీమిత్రులారా!



ప్రహేళికలలో అంతర్లాపికలు
బహిర్లాపికలు అని రెండు రకాలు
ఇచ్చి ప్రహేళికలోనే సమాధానమున్నది
అంతర్లాపిక, అలాకాక సమాధానం అందులో
లేకపోతే దాన్ని బహిర్లాపిక అంటారు
బహిర్లాపికకు ఉదాహరణ ఈ ప్రింద గమనించగలరు-

పవిత్ర మతితృప్తికృ త్కి మిహ, కిం భటామన్త్రణం,
బ్రవీతి ధరణీ ధరశ్చ, కి, మజీర్ణ సంబోధనమ్
హరిం వగతి, కో, జితో మదనవైరిణా సంయుగే-
క రోతి నను కః శిఖండికులతాండవాడ్బరమ్

ఇందులో 7 ప్రశ్నలున్నాయి.
అవి-
1. లోకమున పవిత్రము, మిక్కిలి సంతసమును గలిగించునది ఏది?
2. సిపాయిని ఏమని పిలుస్తారు?
3. పర్వత సంబోధనమెట్లు?
4. అజీర్తిని ఏమంటారు?
5. విష్ణువును ఎట్లా సంబోధిస్తారు?
6. మన్మథ విరోధి శివునిచే యుద్ధమున చంపబడిన వాడెవడు?
7. నెమళ్ళు తాండవనాట్యం చేసే సమయమేది?

ఈ ప్రశ్నలకు అన్నిటికి ఇందులో సమాధానం లేదు
మనం బయటనుండి తీసుకొని చెప్పాలి.
బాగా ఆలోచించిన తరువాత
ఈ పదంలో సమాధానం ఉన్నదని
నిర్ధారించుకొన్నాము ఆ పదం -
పయోధరసమయః

వీటన్నిటికి సమాధానం ఈ విధంగా తీసుకోవాలి
మొదట పదంలోని మొదటి చివరి
అక్షరాలను కలుపగా ఏర్పడే పదం-
పయః, తరువాత
రెండవదాన్ని  మిగిలిన పదంలోని
అక్షరాలను
రంగులలో చూపిన విధంగా తీసుకోవాలి

యోధరసమయః
పయోధరసమయః
పయోధరసమయః
పయోధరసమయః
పయోధరసమయః

దీనిలో మొదటిది మొదటిదానికి,
రెండవది రెంవదానికి ఇలా 6 ప్రశ్నలకు
సమాధానాలు దొరుకుతాయి
7వ దానికి మొత్తం పదమంతా సమాధానమౌతుంది.

1. పవిత్ర మతితృప్తికృ త్కి మిహ?
      లోకమున పవిత్రము, మిక్కిలి సంతసమును
       గలిగించునది ఏది?
       - పయః (పాలు, నీరు)

2.  కిం భటామన్త్రణం
      సిపాయిని ఏమని పిలుస్తారు?
      - యోధ (యుద్ధభటుడా)

3. బ్రవీతి ధరణీ ధరశ్చ?
       పర్వత సంబోధనమెట్లు?
       - ధర (పర్వతమా)

4. కి మజీర్ణ సంబోధనమ్?
     అజీర్తిని ఏమంటారు?
     - రస - అని పిలుస్తారు
   
5.  హరిం వగతి కో?
      విష్ణువును ఎట్లా సంబోధిస్తారు?
      - సమ(స కూడుకొన్న, మ - లక్ష్మి, లక్ష్మితో కూడుకొన్నవాడా)

6. జితో మదనవైరిణా సంయుగేక?
      మన్మథ విరోధి శివునిచే యుద్ధమున చంపబడిన వాడెవడు?
      -మయః (మయుడను రాక్షస శిల్పి)

7. రోతి నను కః శిఖండికులతాండవాడ్బరమ్
     నెమళ్ళు తాండవనాట్యం చేసే సమయమేది?
       - పయోధర - సమయః (మేఘములు వ్యాపించిన వర్షాకాలము)
     

Tuesday, March 14, 2017

గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః


గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః




సాహితీమిత్రులారా!



సమస్య-
గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః

పూర్వకవి పూరణ-

కా శంభుకాన్తా? కిము చంద్రకాన్తం?
కాన్తా ముఖం కింకురుతే భుజంగః?
కః శ్రీపతిః? కా విషమా సమస్యా?
గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః

ఈ సమస్యను క్రమాలంకారంలో పూరించడం జరిగింది.
ఇందులో 5 ప్రశ్నలున్నాయి
వాటి సమాధానాలు చివరిపాదంలో ఇవ్వబడ్డాయి.
కావున దీన్ని అంతర్లాపికా ప్రహేలిక అని కూడ
అనవచ్చు.
ఇందులోని ప్రశ్నలు సమాధానాలు-

1.  కా శంభుకాన్తా?
     శివుని ప్రియురాలెవరు?
     - గౌరీ(పార్వతి)


2. కిము చంద్రకాన్తం?
     చంద్రునివలె అందమైనదేది?
   - ముఖం (మొగము)


3. కాన్తా ముఖం కింకురుతే భుజంగః?
    విటుడు ప్రేయసి ముఖాన్ని ఏమిచేస్తాడు?
   - చుమ్బతి (ముద్దు పెట్టుకొనును)

4. కః శ్రీపతిః ?
    లక్ష్మికి భర్త ఎవరు?
   - వాసుదేవః (విష్ణువు/కృష్ణుడు)

5. కా విషమా సమస్యా?
      విషమ సమస్య ఏది?
   - గౌరీ ముఖం చుమ్బతి వాసుదేవః
    (పార్వతి ముఖమును కృష్ణడు ముద్దు
      పెట్టుకొనుచున్నాడు)
    అనేది చిక్కైన సమస్య

Monday, March 13, 2017

మోపిదేవి, గుడివాడ, కావలి, తెనాలి


మోపిదేవి, గుడివాడ, కావలి, తెనాలి




సాహితీమిత్రులారా!



దత్తపది -
మోపిదేవి,
గుడివాడ,
కావలి, 
తెనాలి-
అనే ఊర్లపేర్లనుపయోగించి
భారత భాగవత రామాయణములలోని ఒక ఘట్టం వర్ణించాలి.

సింహాద్రి శ్రీరంగము గారి పూరణ-
ఈ విధంగా భాగవతంలోని ఘట్టాన్ని వర్ణించాడు

దృష్టిపాదములపై మోపి - దేవిపూజ
సలుపురుక్మిణిఁగావలి - జనుల నెట్టి
పెట్టిరథమున గుడివాడ - విడిచిపెట్టి
గెంతెనాలిగఁజేపట్టి - కృష్ణుడపుడు




న తృతీయేతి మే మతిః


న తృతీయేతి మే మతిః




సాహితీమిత్రులారా!



ఈ ప్రహేళికను చూడండి-
కాముకుడొకడు, తన ప్రేయసితో పోల్చదగినవాడు,
ఇలలో, కలలో కూడ లేడని, గొప్పలు చెప్పుకొనుట
వినుచున్న మిత్రుడొకడు అతనితో ఇలా అన్నాడు

త్రైలోక్యే నోపమైతస్యాః సఖే కమితి భాష సేః
అనన్తరా సా2నాది ర్వా న తృతీయేతి మే మతిః


సఖే - మిత్రమా,
త్రైలోక్యే - ఏతస్యాః - ఉపమా-కిం-భాషసే
ముల్లోకాలలో - ఈ నీ ప్రియురాలికి - సాటియైనది -
లేడు - అని గొప్పలు చెప్పుకొని డప్పువాయిస్తున్నావు
ఏల అనగా-
సా - ఆ నీ ప్రియురాలు,
1.అనంతరా - అనంతరాలైనా కావచ్చు
వా - లేక
2. అనాదిః  అనాదియైనది కూడ కావచ్చు.
కనుక ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు
కానీ తృతీయా - న - ఇతి - మే - మతిః-
మూడనవది మాత్రం లేదు
అని నాబుద్ధి దృఢనిశ్చయముతో ఉన్నది - అని భావం

కానీ ఇది సరైనదేనా అంటే

ఇక్కడ మరికొంత వివరణ అవసరము చూడండి-
ఇందులో అనంతరా, అనాది అనే పదాలున్నాయి
వాటికి సంబంధించిన అర్థాలు ఇవికాదు గమనించండి-

మిత్రమా నీవు చెప్పిన ఉపమా అనే పదంలోలోనే
 రెండు పోలికలున్నాయి. ఎలాగంటావా

ఆ ఉపమా - పదం
అనన్తరా - అంతరా - మధ్య(అంతరా)వర్ణమైన ప లేనిచో
ఉ(ప)మా - ఉమా(పార్వతి అవుతుంది.
ఆ ఉమ - పార్వతి నీ ప్రియురాలికి సాటియైననది కావచ్చు
లేకపోతే
అనాదిః - న - ఆదిః ఉపమాలోని
మొదటి రెండక్షరాలు తీసివేసిన
(ఉప)మా - అంటే లక్ష్మి అవుతుంది.
ఆమెతోనైనా సాధర్మం పొంవచ్చు.
ఇక వీరిద్దరు కాకుండా
పోల్చదగినవారు లేరనే చెప్పాలి అన్నాడు
ఇప్పుడు సరిపోయిందికదా వివరణ



Sunday, March 12, 2017

నెల జూపి లతాంగి ఏడ్చె


నెల జూపి లతాంగి ఏడ్చె




సాహితీమిత్రులారా!


సమస్య-
నెల జూపి లతాంగి ఏడ్చె నేరుపు మీరన్


సింహాద్రి శ్రీరంగంగారు పూరణ-

నెలలోపల వచ్చెదనని
పలికినపతిరాక విరహపరవశయై నె
చ్చెలికిం ప్రియభామకు, వె
న్నెల జూపి లతాంగి ఏడ్చె నేరుపుమీరన్


ఇందులో నెలను చూచికాదు వెన్నెలను చూచి
లతాంగి ఏడ్చినది అని మార్చినందున అర్థము
సమంజసముగా మారినది.

మీరును మరో విధంగా పూరించి పంపగలరు.

చిత్రకవిత్వంలో గర్భకవిత - 3


చిత్రకవిత్వంలో గర్భకవిత - 3




సాహితీమిత్రులారా!




మణిగణనికరములో కందపద్యమును
ఇమిడ్చిన కందగర్భమణిగణనికరము
అంటాము-
దీనికి ఉదాహరణగా
నంది మల్లయ - ఘంట సింగయ
జంటకవులు వ్రాసిన ప్రబోధ చంద్రోదయము
((5-56) పద్యం చూడండి-

ఇందులోని ఛందము-
ప్రతిపాదమునకు 4 నగణములు ఒక సగణము
యతి 9 వ అక్షరము

కలికి యొకతె యలక ములలి బలమున్
బలె నలిక తలము పయిఁగడలుకొనన్
గలకల నగియెడు కనుగవతళుకుల్
తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్

ఈ పద్యంలో కందపద్యం ఇమిడి ఉన్నది
ఆ కందపద్యము -

కలికి యొకతె యలక ములలి 
బలమున్ బలె నలిక తలము పయిఁగడలుకొనన్
గలకల నగియెడు కనుగవ
తళుకుల్ తళతళ మెఱయఁగఁదను బలుకుటయున్

ఇలాంటి కందగర్భమణిగణనికరములు
కొన్ని మీరు గమనించిచూచుటకు-

బిజ్జల తిమ్మభూపాలుని అనర్ఘరాఘవములోనిది-

భవహర శ్రితజన భవహర, రవి తా
ర వర శిఖినయన రజతధరణి భృ
ద్భవన భువననుత పరిహృత, సవనా
జవనతురగితవిశదవృష సగణా
                                                                                 (2-412)

సమీరకుమారవిజయములోని పద్యం-

తొగదొర జిగిబిగి దొరసిన సిగయున్
సెగగను కనుఁగొన జెనకిన పగయున్
మగువ సగము గలమయి నిగనిగయున్
నెగడిన నిను మది నిలిపెద నభవా
                                                                                           ((4-79)

కూచిమంచి తిమ్మకవి 
రసికజనమనోరంజనములోనిది-

జయజయ పురహర జయ గిరిశయనా
జయ తలవినిభృత సదమల హరిణా
నయ గుణవిలసిత నయశుభచయదా
జయ మునివర సుతచరణ సరసిజా
                                                                                       (2-55)
పైన నేను చూపిన విధంగా
కందపద్యంలోనికి మార్చి చూడవచ్చు
ప్రయత్నించి గమనించండి.

Saturday, March 11, 2017

శ్రీవర వరవరహృతభవ


శ్రీవర వరవరహృతభవ




సాహితీమిత్రులారా!

బంధాలలో అనేకం ఉన్నాయి.
వాటిలో ఖడ్గబంధం ఒకటి ఇవీ అనేకరకాలు
వీటిలో ఛురికాబంధం ఇక్కడ చూద్దాం-
ఛురిక అంటే కత్తి

చరణాంత్యవర్ణమొక్కటి
చరణయుగాద్యంబుఁ జేసి సరసులు ముమ్మా
రిడుగడలమధ్య మొకటిగఁ
బరుజులగదియింప ఖడ్గబంధం బొనరున్

అని అప్పకవి లక్షణమిచ్చియున్నారు.


శ్రీవర వరవరహృతభవ
భావ వనజాయతాక్ష పాలితవిబుధా
ధావితదనుఊవ నియమిస
భావన చతురాసముద్ధృతార్ణవవసుధా
(పారిజాతాపహరణము -5- 95)

(లక్ష్మీపతియైనవాడా సారములైన వరములచేత
హరింపబడిన సంసారచించలుకలవాడా
పద్మములవలె దీర్ఘములైన కన్నులుగలవాడా
రక్షింపబడిన దేవతలుగలవాడా
తఱుమబడిన రాక్షసులుగలవాడా
మునులయొక్క సమూహమును
రక్షించుటయందు నేర్పుగలవాడా
సముద్రమున మునిగిన భూమిని పైకెత్తినవాడా)



పద్యంలో గమనిస్తూ పిడిదగ్గర నుండి
చదవడం ప్రారంభిస్తే

శ్రీవరవరవరహృతభవ
వరకు మొదటి పాదం సరిపోతుంది
భావన అని అడ్డంగా ఉంది
ఈ విధంగా గమనిస్తూ చదివితే మధ్యలోని
వరుసనంతా చదివేసరికి రెండవపాదం పూర్తవుతుంది.
చివరలో ధా అని ఉందికదా
అక్కడనుంచి పైన వెనుకకు చదువుతూ వెళితే
మూడవ పాదం పూర్తవుతుంది
తరువాత మళ్ళీ భావన అని చదివితే క్రిందున్న
పాదం చతురాసముద్ధృతార్ణవవసుధా
అని చివరిపాదం పూర్తవుతుంది.
ఇందులో
2,4 పాదాల చివరి అక్షరం ఒకటే
అని గమనించగలరు.
అలాగే
ఇదీ -  అప్పకవి చెప్పిన
లక్షణంలోనిది రెండు
గమనించగలరు