Showing posts with label స్థానచిత్రం - శబ్దచిత్రం. Show all posts
Showing posts with label స్థానచిత్రం - శబ్దచిత్రం. Show all posts

Friday, December 8, 2017

షడ్జామడ్జకరాడ్జవీడ్జ - ఈ శ్లోకం చదవండి


షడ్జామడ్జకరాడ్జవీడ్జ - ఈ శ్లోకం చదవండి



సాహితీమిత్రులారా!

కొన్ని అక్షరాలు పెదాలు తగులుతూ పలుకుతాము
కొన్ని దంతాలను తగులుతూ పలుకుతాము
కొన్ని కంఠం నుండి వెలువడతాయి
మరి ఈ శ్లోకం నాలుక దంతాలకు అంగిటికి తగలకుండా
పలుకగలరేమో చూడండి-

షడ్జామడ్జకరాడ్జవీడ్జ వసుధాడ్జాలాంశ్చదుడ్జాఖిరే
డ్జిడ్జేట్కిట్కిధరేధరేఖణఖణాఖడ్జూరవిడ్జడ్భ్రమా
లుడ్భ్రంలుడ్భ్రమలుడ్భ్రలుడ్భ్రయపదాడ్గ్రడ్గ్రడ్గ్రషడ్గ్రస్తధా
పాదౌటేటిపటేటిటేటిపటుసత్ప్రఖ్యాతిసత్రాదయః

ఈ శ్లోకాన్ని మా తాతగారైన శ్రీసరస్వతి వెంకమరాజు గారినుండి
మొదటగా విన్నాను తరువాత ఈ శ్లోకం మరుగున పడిపోయింది
ఈ మధ్య అంటే చిత్రకవిత్వ పరిశోధన మొదలు పెట్టాక
నానార్ధగాంభీర్య చమత్కార చంద్రికలో చూచి ఒక మహానిధి
దొరికినంతగా సంబరపడ్డాను కానీ దీని అర్థం దొరకలేదు
మహామహులట్లాంటివారు దీని అర్థానికై ఎదురు చూస్తున్నారని
నాకు ఈ మధ్యే వెల్లడైంది. కాని దీని ప్రత్యేకత నాలుక దంతాలు
తగలకుండా పలకటం సాధ్యపడదు ఇది పలకటం యూట్యూబులో
రెండు వీడియోల్లో వీలౌతుంది 1. రాళ్లబండి కవితాప్రసాదు గారు
చెప్పినది. 2. గరికపాటి నరసింహారావుగారు చెప్పినది. ఇక్కడ మీకు
గరికపాటివారి వీడియోను ఉంచుతున్నాను వినండి పలకగలరేమో
ప్రయత్నించండి-


Wednesday, May 3, 2017

నిరోష్ఠ్య అచ్చతెలుగు సీసము


నిరోష్ఠ్య అచ్చతెలుగు సీసము




సాహితీమిత్రులారా!



కూచిమంచి తిమ్మకవి కృత
అచ్చతెలుగు రామాయణములోని
నిరోష్ఠ్య సీసము చూడండి-

చలియిక్కదిండి యందెలఱేని జిగి చేగ
                   సింగాణిఁజెఱిచినచేఁకాకాఁడ
జడారి నెలదండఁజని క్రచ్చఱ గయాళి 
                  రాకాసిఁజెండిన రాచకంద
తలఁగని కడకండ్లఁ దగిలి చట్టయి యన్న
                 చాన నేచిననెఱజాణరాయ
నీటార నెదిరిన నేల జేజే దంట
                 తే జెల్ల నడఁచిన దిట్ట లెంక
తండ్రి నైనట్టి నాయాన దాఁట లేక
కడిఁది కాణాచి రాసిరి యెడలఁజేసి
హాళిఁగానల కరిగిన యందగాడ
తలర నిన్గాంచకేఁదాళఁ గలనె యింక
(అచ్చ తెలుఁగు రామాయణము - అయోధ్యకాండ - 93)

ఇందులోని పదాలన్నీ అచ్చ తెలుగు పదాలు
మరియు పెదిమలు తగలకుండా చదవ వచ్చును.

Sunday, May 15, 2016

ఏకస్థాన చిత్రం


ఏకస్థాన చిత్రం


సాహితీమిత్రులారా!

కంఠము, తాలువు, మూర్ధము, దంతము, ఓష్ఠము అనే
ఈ అయిదు వర్ణ ఉత్పత్తి స్థానములు.
కంఠం నందు పుట్టేవాటిని కంఠ్యములు అని అంటారు.
ఒక ఉత్పత్తిస్థానంనుండి పుట్టే వాటిని తీసుకొని కూర్చిన
దాన్ని ఏకస్థాన చిత్రం అంటారు.
మిగిలిన వర్ణోత్పత్తి స్థానాలను
పరిహరించడం జరుగుతుంది.

ఈ శ్లోకం దండి కావ్యాదర్శంలోనిది చూడండి.

అగా గాం గాంగకాకాంక గాహకాఘక కాకహా
అహాహాంగఖగాం కాగగ కంకాగ ఖగాంకగ

(హానిలేని అంగముగల సూర్యుని(గరుడుని)గుర్తుగా
ధరించిన పర్వతము(మేరువు)నందు సంచరించు
కంఖములనెడి పర్వతపక్షులచేత
ప్రస్తుతిగొన్న గమనము కలవాడా!
గంగాజలము నందలి కుటిలమైన
అంకమునందు వ్రేలాడుచున్న కుత్సితపాప
మనెడి కాకమును(చంపినవాడవేని)చంపి
స్వర్గమునకు పోయితివి.)

అ,ఆ,క,ఖ,గ,ఘ,ఙ,హ,(విసర్గ)-
అనేవి కంఠమునుండి పుట్టేవి
కావున
వీటిని కంఠ్యములు అంటారు.
ఈ శ్లోకంలో ఈ చెప్పబడిన వాటినుండి మాత్రమే
తీసుకొని శ్లోకం కూర్చడం జరిగింది.
కావున
ఇది ఏకస్థానచిత్రం అనదగినదే.

Thursday, May 12, 2016

నిరోష్ఠ్యం



నిరోష్ఠ్యం


సాహితీమిత్రులారా!

ఓష్ఠం అంటే పెదవి.
ఓష్ఠ్యం అంటే పెదవులయందు పుట్టేది.
వ్యాకరణ పరిభాషలో ఓష్ఠ్యం అంటే పెదవుల కలయికతో
పలకడానికి వీలయ్యే అక్షరం.
నిరోష్ఠ్యం అంటే పెదవుల
కలయికతో అవసరంలేకుండా పలుకబడేవి.

ప,ఫ,బ,భ,మ,వ,ఉ,ఊ,ఒ,ఓ,ఔ - అనేవి
పెదవుల సాయంతో పలుకబడేవి.
ఇవి లేకుండా పద్యం లేక శ్లోకం లేక వచనం లేక దండకం
ఇలా ఏదైనా రాస్తే అది నిరోష్ఠ్యం అవుతుంది.

అథాగ్రే హసతా సాచిస్థేతేన స్థేరకీర్తనా
సేనాన్యా తేజగదిరే కించిదాయస్తచేతసా
                                  (కిరాతార్జునీయమ్ - 15-7)

(ఈవిధంగా పరుగెత్తిపోతున్న సేనను చూచి
వారికెదురుగా ముందుభాగంలో నిలిచి సేనాని
కార్తికేయుడు ఖిన్నులైన ప్రమథగణంతో
ఇట్లా అన్నాడు.)

ఈ శ్లోకంలో ఒక అక్షరంకూడా పెదవిస్పర్శకలదిగాలేదు.
కావున
ఇది నిరోష్ఠ్యం.