Showing posts with label అనేకార్థ చిత్రం. Show all posts
Showing posts with label అనేకార్థ చిత్రం. Show all posts

Tuesday, February 27, 2018

పాతువో గిరిజామాతః


పాతువో గిరిజామాతః




సాహితీమిత్రులారా!



అనేకార్థక (శ్లేషాలంకార)చిత్రం-

పాతువో గిరిజామాతా
యస్య ద్వాదశలోచనః
పాతువో గిరిజామాతా
ద్వాదశార్థర్థలోచనః

ఇది కుమారస్వామిని, శివుని ఇద్దరికి
నమస్కారం పెట్టినట్లు చెప్పే
శ్లోకం. ఇందులో 1,3 పాదాలు
ఒకలానే ఉన్నాయి కానీ అర్థంలో
మార్పు వున్నది. ఇక్కడ ఈ శ్లోకానికి
గరికపాటివారి వ్యాఖ్యానం చూద్దాం-
ఈ వీడియో వీక్షించండి.
దీనితో పాటు
ఒక దత్తపదిని కూడ వినండి.



Sunday, July 9, 2017

భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె


భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె




సాహితీమిత్రులారా!



కావ్యాలంకార సంగ్రహ కృతి భర్త అయిన
నరసభూపాలుడు రామరాజభూషణుని
ఈ విధంగా అడిగాడట. కృతిని కూర్చమని-

బాణు వేగంబును, భవభూతి సుకుమార
        తయు, మాఘు శైత్యంబు, దండిసమత,
యల మయూరుసువర్ణకలన, చోరునియర్థ
        సంగ్రహమ్ము, మురారిశయ్యనేర్పు,
సోముప్రసాదంబు, సోమయాజుల నియ
        మంబు, భాస్కరుని సన్మార్గ ఘటన,
శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి,
        యమరేశ్వరుని సహస్రముఖదృష్టి,
నీక కల దటుగాన ననేక వదన
సదన సంచార ఖేదంబు సడలుపఱిచి
భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనియె
మూర్తి కవిచంద్ర విఖ్యాత కీర్తిసాంద్ర
                                             (కావ్యాలంకార సంగ్రహం - 1-15)

ఇందులోని పదాలు- అర్థాలు

బాణ - బాణకవి - బాణము
భవభూతి - ఒక కవి, ఈశ్వరైశ్వర్యము
సుకుమారత- గోము, సుకుమారస్వామి
మాఘ - మాఘకవి, మాఘమాసము
మయూర- మయూరకవి, నెమలి
వర్ణము - అక్షరము, శుక్లపీతాదులు
చోరుడు - ఒకకవి, తస్కరుడు
అర్థము- అభిధేయము, ధనము
మురారి - ఒక కవి, విష్ణువు
శయ్య - శబ్దవిన్యాస విశేషము, పఱపు
మురారి శయ్య - అదిశేషుడు
సోముడు - నాచనసోముడు, చంద్రుడు
ప్రసాదము - ఓజస్సు మొదలైన గుణములలో ఒకటి,
                       ప్రసన్న భావము
సోమయాజి - తిక్కనసోమయాజికవి, దీక్షితుడు
నియమము - పదనియమము, వ్రతము
భాస్కరుడు - ఒకకవి, సూర్యుడు
సన్మార్గము - సజ్జన మార్గము, ఆకాశము
శ్రీనాథుడు - ఒక కవి, విష్ణువు
పదము - శబ్దము, చరణము
ధార - కవిత్వధార, జలధార
అమరేశ్వరుడు - ఒక కవి, ఇంద్రుడు
సహస్రముఖదృష్టి - అనేకవిధ దృగ్వ్యాప్తి,
                                    వేయి కన్నులు కలిగి ఉండటం
దండి - ఒక కవి, దండమును ధరించిన యోగి
సమత - ఒక గుణము, సర్వసామ్యము

ఇందులో కవి పరంగా అన్యవిధంగా రెండు అర్థాలుగా చెప్పవచ్చు
కావున ఇది అనేకార్థక చిత్రంలోనికి వస్తుంది.

Saturday, April 1, 2017

తారాధిప రజనీచర


తారాధిప రజనీచర




సాహితీమిత్రులారా!


ఒక పద్యాన్ని రెండు అర్థాలు వచ్చేలా రాయడం
అనేకార్థక చిత్రంలో చెప్పవచ్చు.
ఇక్కడ హంసవిశతిలోని ఒక పద్యం
ఇందులో పైకి సాధారణంగా కనిపించినా
ఆంతరంలో దూషణ కలిగిన పద్యం
చూడండి-

తారాధిప! రజనీచర!
కైరవభేదనసమర్థ! గౌరీశ శిరో
భార! కమలాభిశంసన
కారణ! వారాశిభంగ కార్యభ్యదయా!
                                     (హంసవింశతి - 5- 284)

ఇందులో
చంద్రునికి సంబంధంచిన
సామాన్యార్థము కలది.
రెండవది చంద్రదూషణ అనే
రెండువిధములైన అర్థాలున్నాయి.

సామాన్యార్థము-

తారాధిప - నక్షత్రములకు అధిపతీ
రజనీచరా - రాత్రియందు తిరిగేవాడా
కైరవభేదనసమర్థ -తెల్లకలువలను
                                  వికసింపచేయువాడా
గౌరీశ శిరోభార - శివుని శిరోభూషణమైనవాడా
కమలాభిశంసన కారణ - కమలములయొక్క
                                          వికాసభావమునకు కాణమైనవాడా
వారాశిభంగకార్యభ్యుదయా - చంద్రోదయమువేళ సముద్రము
                                                  అలలతో ఉప్పొంగును కావున
                                                   పుత్రోత్సాహముతో అలలు రేగునట్లు
                                                    చేయువాడు అని అర్థం.

నిందార్థం-
తారాధిప - గురుపత్నియైన తారను కూడినవాడా
రజనీచరా - నిశాచరుడా, రాక్షసుడా
కైరవభేదనసమర్థ -
కైరవ - జూదగాండ్రకు,
భేదన - పొరుపులు పుట్టించుటలో,
సమర్థ - సమర్థుడా
గౌరీశ శిరోభార - ఈశ్వరునికి శిరోభారమైనవాడా
కమలాభిశంసన కారణ-
కమలా - తోబుట్టువైన లక్ష్మీదేవికి,
అభిశంసనకారణ - గురుతల్పాగమనాది మహాపాపము చేసిన
                                 నీవు సోదరుడవైతివన్న అపవాదమునకు
                                 కారణమైనవాడా
వారాశిభంగకార్యభ్యుదయా - జనకస్థానమైన సముద్రమునకు
                                                   భంగకరమైన పుట్టుక గలవాడా

ఈ విధంగా రెండు అర్థాలను కలిగినది ఈ పద్యం

Thursday, March 2, 2017

గగనమధ్యమమూర్తి గనుఁగొనఁ గప్పుచే


గగనమధ్యమమూర్తి గనుఁగొనఁ గప్పుచే




సాహితీమిత్రులారా!


త్యాగరాజ మొదలి కూర్చిన
సుబ్రహ్మణ్యవిజయములోని
ఈ అనేకార్థక చిత్రం చూడండి-
కవివాడిన శ్లేష పదాల వలన అనేకార్థాలు
ద్యోకతమౌతాయి అనేకార్థక చిత్రంలో


గగనమధ్యమమూర్తి గనుఁగొనఁగప్పుచే
        నొప్పారె బృథులపయోధరములు
వరకంకణోర్మికావళులు జాఱఁగఁ జారు
        వేణి విశదగర్భవృద్ధి నెరసె
గుఱుమీఱి చెలువాఱు కువలయావళి హల
        హలిక సంపూర్ణమై నలుపుకెక్కె
భ్రమరకాకీర్ణమై సుముఖనీరజపాళి
        వెలవెలనై రూపకలనఁదఱిగె
వర్షఋతుశంకఁ గల్పించు వనరుహాక్షి
గర్భగౌరవ మీలాగు గరిమఁ గాంచ
నించెఁ దొమ్మిది నెలలును నిఖిలభువన
గర్భగౌరవవత్కీర్తి కాంతఁబోల
                                                            (సుబ్రహ్మణ్య విజయము -1 ఆ.)


ఇందులో కవి గర్భవతిని
వర్షఋతువును పోలుస్తూ వర్ణించాడు

వర్షఋతుపరంగా అర్థం-
ఆకాశం(గగన) మధ్యభాగంలో చూస్తే
మబ్బులు నల్లదనంతో అందగించాయి.
శ్రేష్ఠమయిన నీటిబిందువులూ కెరటాలూ
కదులుతూంటే అందమైన నదీప్రవాహాలు
విశాలమైన మధ్యభాగాల వృద్ధితో(గర్భవృద్ధిన్)
ప్రకాశించాయి. వర్షాకాలంలో నదులు నిండి మధ్యభాగాలలో
నీరు ఎక్కువలోతుగా ఉంటుంది. అందమైన భూభాగాలు
అంటే పొలాలు అత్యధిక ప్రయత్నంతో హలాలు ధరించిన
కర్షకులతో క్రిక్కిరిసి నల్లబారాయి. తడిమట్టి పైకివచ్చి దున్నిననేల
నల్లబడిందనివికసించిన పద్మాల సమూహం నీటి
సుడులతో చెల్లాచెదురై కాంతి తప్పి రూపురేఖల్ని కోల్పోతోంది.
పద్మాల ఆనందమంతా శరత్కాలంలోనే. వర్షాకాలంలో
వానీటి దెబ్బల చేత వాటి అందం చెడిపోతుంది.


గర్భవతి పరంగా అర్థం -

ఆకాశం వంటి అంటే మరీ సన్నని నడుము యొక్క
రూపం కన్పడేసరికి పెద్దవైన వక్షోజాలు(పయోధరాలు)
నలుపెక్కి ప్రకాశించాయి. ఎప్పుడూ కనించనంతగా
సన్నని నడుము గర్భం ధరించేసరికి కన్పడుతోంది.
క్రమక్రమంగా పెద్దదవుతోంది. వక్షోజాలు తమకంటే
పెద్దదవుతున్న నడుమును చూసి అసూయచేత
నల్లబడ్డాయా అన్నట్లు అగ్రభాగాలు నలుపెక్కాయి.
గర్భవతికి వక్షోజాల మొనలు నలుపెక్కుతాయి.
అది గర్భచిహ్నం.

అందమైన జడకల ఆ యువతి శ్రేష్ఠమైన గాజులు(కంకణ)
ఉంగరాలు పొట్టపై ఉండే ముడతలు(వళులు) జారే అంతగా
స్పష్టమైన గర్భంయొక్క ఆధిక్యత అందగించింది.
గర్భవతుల చేతులూ వేళ్ళూ సన్నబడటం కూడ ఉంటుంది.
ఆ సందర్భంలో గాజులు, ఉంగరాలు(ఊర్మికా) జారిపోతుంటాయి.
నడుము పెరగడంచేత పొట్టపై ముడతలు పోతున్నాయి.
చెలికత్తెలమీద కోపమూ చిరాకూ పెచ్చుపెరిగి ఆమె కాటుక
కనుచూపులు ఏదో తెలియని సంభ్రమంతో(హలహలిక)
సంపూర్ణమై అలసట పొందాయి. (హలా హలా అని పిలుచుకునే
నేస్తురాండ్రు చేసే అల్లరీ హడావిడీ)

ముంగురులు ముసిరి అందంగా ఉండే
ఆ ముఖపద్మం తీరు - పొందిక పాండిమను
పొంది(వెలవెలనై) రూపకలనను కోల్పోయింది

వర్షఋతువా అనిపించే విధంగా
తామరపూలవంటి కన్నులుకల
ఆ యువతికి ఏర్పడిన గర్భం యొక్క ఆదిక్యం
ఈ విధంగా సమస్తభువనాల మధ్యలో(గర్భం)
ఆదరింపబడే కీర్తి కాంతవలె గొప్పతనం పొంది
ఆమెకు తొమ్మిది నెలలు  నిండాయి.



Tuesday, November 8, 2016

కృష్ణభూపాల తే హితా:


కృష్ణభూపాల తే హితా:



సాహితీమిత్రులారా!



మాడుగుల మహారాజును
ఇద్దరు కవీశ్వరులు ఇలా దీవించారు-

అ శ్లోకం చూడండి -

విక్రమేణార్జున ముఖా: కృష్ణభూపాల! తే హితా:
విక్రమేణార్జున ముఖా :కృష్ణభూపాల! తే హితా:


రెండు పాదాలు
ఒకలానే ఉన్నాయి కదా!

ఇద్దరూ ఒకే పాదాన్ని చెప్పారా? అంటే చూద్దాం మరి

మొదటికవి చెప్పిన పాదానికి అర్థం-

ఓ కృష్ణభూపాలా!
విక్రమేణ అర్జునముఖా: -
పరాక్రమంలో (పాండవ మధ్యముడైన) అర్జునుడు మొదలైనవారు,
తే హితా: - నీకు సమాన స్నేహితులుగా పోల్చదగినవారు
.
రెండవకవి చెప్పిన పాదానికి అర్థం -

ఇందులో తే2హితా - అని తీసుకోవాలి
అపుడు
ఓ కృష్ణభూపాలా!
తేహితా: = తే అహితా: = నీ శత్రువులు,
విక్రమేణ - పరాక్రమంలో
అర్జున ముఖా: -
తెల్లమొగంతో వెలవెల పోతున్నారు.

Friday, November 4, 2016

నూట పదహారు అర్థాల శ్లోకం


నూట పదహారు అర్థాల శ్లోకం



సాహితీమిత్రులారా!



హేమచంద్ర సూరికి శిష్యుడు అయిన
వర్ధమానగణి చేత వ్రాయబడిన
శ్రీకుమారవిహారప్రశస్త్యౌ- అనే కావ్యమ్
నందు 87వ శ్లోకం నందు 116 అర్థాలున్నాయి.
ఆ శ్లోకం చూడండి.

గమ్భీర: శ్రుతిభి: సదాచరణత: ప్రప్తతిష్ఠోదయ:
సంత్కాన్తారచితప్రియో బహుగుణో య: సామ్యమాలమ్బతే
శ్రీచౌలుక్యనరేశ్వరేణ వివుధశ్రీహేమచన్ద్రేణ చ
శ్రీమద్వాగ్భటమన్త్రిణా చ పరివాదిన్యా చ మన్త్రేణ చ 






Tuesday, November 1, 2016

జగతీశరణే యుక్తో


జగతీశరణే యుక్తో



సాహితీమిత్రులారా!


భారవి రచించిన కిరాతార్జునీయమ్
నందు 15వ సర్గలో45వ శ్లోకం.

దీనికి గల ప్రత్యేకత దీనికి అర్థత్రయవాచి అని
కవి దీనికి పేరు పెట్టడo  దీనికి మూడు అర్థాలున్నాయి.
దీన్ని చిత్రకవిత్వంలో అనేకార్థక చిత్రమని పిలుస్తాము.
ఆ శ్లోకం చూడండి.

జగతీశరణే యుక్తో హరికాంత: సుధాసిత:
దానవర్షీ కృతాశంసో నాగరాజఇవాబభౌ

దీనిలో 1 అర్జునునికి, 2. ఐరావతానికి, 3. ఆదిశేషునికి
సంబంధించిన అర్థాలు ఉన్నాయి.

మొదటి భావం -

అర్జునుడు హిమవంతునితో సమానంగా శోభిస్తున్నాడు. 
అర్జునుడు శివునితో యుద్ధం చేయటంలో ఆసగలవాడు. 
ప్రజాపాలన క్రమపద్ధతిలో చేసేవాడు. నల్లనివాడు. దాత. 
యుద్ధంలో విజయం కోరుతున్నవాడు. పృథ్వీపాలనకోసం 
బ్రహ్మ నియమించినవాడు. నివాసస్థానాదులు ఇవ్వటంతో 
సింహాలకు ప్రియమైన హిమవంతుడు. మంచు 
ఆవరించటంతో  తెల్లని శరీరంకలవాడు. దానవులు 
ఋషులు మన్మథుడు మొదలైనవారితో  ప్రశంసలందినవాడు.


2వ భావం - (ఐరావతంతో పోలిక)

పృథ్వికి శరణమైనవాడు. ఇంద్రునికి ఇష్టుడు. 
అమృతంవలె శీలం సదాచారంలో స్వచ్ఛమైనవాడూ 
దానం జలపూర్వకంగా చేసేవాడు. భూమిని బాధపెట్టే 
రాక్షసులతో పోరాడేవాడు. ఐరావతం ఇంద్రునికి ప్రియమైనది. 
అమృతంవలె తెల్లనిది. మదధారస్రవించేది. విజయాభిలాషి


3వ భావం- (ఆదిశేషునితో పోలిక)

విధాతపృథ్వీరక్షణకోసం వినియోగించాడు. 
కృష్ణునికి ప్రియమైనవాడు.
అమృతంవలె స్వచ్ఛమైన శరీరంకలవాడు. 
దానవులు ఋషులు లక్ష్మీదేవి ప్రశంసలందినవాడు.


దీనిలో అర్జునునికి వాడిన విశేషణాలు
మూడింటికి సరిపోవటం వల్ల మూడర్థాలు
రావడం జరుగుతున్నది. దీనివల్ల
ఇది అనేకార్థక చిత్రంగా చెప్పబడుచున్నది.

Wednesday, September 21, 2016

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఇందులో అన్నీ పుణ్యక్షేత్రాలున్నట్లున్నను
అందులో నాయికా వర్ణనకూడ ఉన్నది.

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం వస్త్రం విధాతు: పదం
ధమ్మిల్లస్సుమన: పదం ప్రవిలసత్కాంచీ నితమ్బ స్థలీ
వాణీ చేన్మధురా ధరో2రుణ ధర: శ్రీరంగ భూమిర్వపు
స్తస్యా: కిం కథ యామి భూరి సుకృతం మాన్యాసదా నిర్జరై:

ఈ శ్లోకం ఒక నాయికను వర్ణించే శ్లోకం.
ఇందులో శ్లేషను ఆధారంగా తీసుకొని
శరీరఅవయవాలను పుణ్యక్షేత్ర
సంబంధమైనవిగా ఒక అర్థం,
శృంగార పరంగా మరొక అర్థం కనబడుతుంది.

పుణ్యక్షేత్ర సంబంధమైన అర్థం-
మధ్యం - నడుము, మిష్ణుపది - వైకుంఠము, కుచౌ - స్తనములు,
శివపదం - కైలాసం, వక్త్రం - ముఖం, విధాతు: పదం - బ్రహ్మలోకం,
ధమ్మిల్ల: - కొప్పు, సుమన: పదం - దేవతల లోకం,
నితంబస్థలీ - మొలప్రదేశం,
ప్రవిల సత్కాంచీ - ప్రకాశించే కాంచీ పట్టణం, వాణీ - నోరు,
మధురా - మధురా పట్టణం, అధర: - క్రింది పెదవి,
అరుణధర: - అరుణాచల క్షేత్రం, వపు: - శరీరం,
శ్రీరంగభూమి: - శ్రీరంగక్షేత్రం, తస్యా: - ఆమె యొక్క,
భూరి సుకృతం - పుణ్యాన్ని, కిం కథ యామి? - ఏమి చెప్పుదును,
నిర్జరై: - దేవతల చేత, సదా - ఎల్లపుడు, మాన్యా - పూజింప తగినది.


వీటికే శృంగార సంబంధమైన అర్థం -
విష్ణు పదం - ఆకాశం(నడుము శూన్యము) , శివపదం - కైలాస పర్వతము
(స్తనాలు పర్వాలవంటివి), ముఖము బ్రహ్మ జన్మస్థానమైన పద్మమువంటిది,
సుమన: పదం - పూవులకు స్థానం (కొప్పు  పుష్పాలు ధరించినది),
నితంబస్థలీ - నడుముభాగము కాంచి(ఒడ్డాణం)తో ప్రకాశిస్తున్నది.
వాణీ మధురా - వాక్కు తీయగా ఉంటుంది,
అధర: అరుణధర: - పెదవి ఎరుపురంగు కలిగినది,
శరీరము, శ్రీరంగభూమి: - లక్ష్మీదేవికి నాట్యవేదిక,
నగలతో ఆమె శరీరం సంపదకు నెలవుగా ఉన్నది. - అని భావం.

Thursday, September 15, 2016

యదూనా మధవా రఘూణామ్


యదూనా మధవా రఘూణామ్


సాహితీమిత్రులారా!



ఈ శ్లోకం రామపరంగాను కృష్ణంపరంగాను శ్లేషతో చమత్కరించినది.
దీన్ని కోలాచలం పెద్దిభట్టు (మల్లినాథసూరి) చెప్పినది.

య: పూతనామా రణలబ్దవర్ణ:
కాకోదరో యేన వినీతదర్ప:
యస్సత్యభామాసహిత స్స పాయా
న్నాథో యదూనా మధవా రఘూణామ్ 

ఇందులోని పదాల విరుపు -

పూతనా, మారణ, లబ్దవర్ణ:
పూతనామా, రణలబ్ద వర్ణ: - అని రెండు రకాలుగా

కాకోదర:,   కాక + అదర: - అని రెండు రకాలుగా

సత్యభామా, సహిత:
సత్య, భా, మా, సహిత: - అని రెండు రకాలుగా
విడదీసుకోవడంతో రెండురకాల అర్థాలు వస్తాయి.

 ఇక కృష్ణపరమైన అర్థం చూద్దాం-

: - ఎవడు, పూతనా మారణలబ్దవర్ణ: - పూతనను చంపటంచేత
పొందబడిన పేరు కలవాడో, యేన - ఎవని చేత, కాకోదర: - పాము(కాళీయుడు),
వినీత దర్ప: - గర్వము తొలగించబడినదో, య: - ఎవడు,
సత్యభామాసహిత: - సత్యభామతో కూడి ఉంటాడో, స: - ఆ,
యదూనాం నాథ: - యదువంశ ప్రభువైన కృష్ణుడు
పాయాత్ - కాపాడును గాక!

రామ పరమైన అర్థం - 

: - ఎవడు, పూతనామా - పవిత్రమైన నామం
కలవాడో, రణలబ్దవర్ణ- యుద్ధంలో ప్రఖ్యాతి పొందినవాడో,
అదర: - భయంలేని, కాక: - కాకాసురుడు, వినీత దర్ప:
- తొలగించబడిన గర్వం కలవాడు, యేన - ఎవనిచేత(చేయబడ్డాడో),
 య: - ఎవడు , సత్య -సత్యవ్రతముతో, భా - కాంతితో,
మాసహిత: - లక్ష్మితో కూడినవాడో, స: - ఆ, రఘూణాంనాథ: -
రఘువంశ ప్రభువు, పాయాత్ - కాపాడుగాక!