Showing posts with label ప్రాచీన సాహిత్యం. Show all posts
Showing posts with label ప్రాచీన సాహిత్యం. Show all posts

Thursday, May 23, 2019

విక్రమోర్వశీయం - 2


విక్రమోర్వశీయం - 2



సాహితీమిత్రులారా!

ఆ లేఖ చదివిన పురూరవుని ఆనందానికి అవధులు లేవు. తన చేతివేళ్ళు చమరుతుంటే 'ఇది నాకు ప్రాణప్రదమైనది.దీనిని నీవు భద్రంగా దాచి ఉంచు' అని విదూషకుడికి ఇచ్చాడు. ఊర్వశి, చిత్రలేఖలు పురూరవుని ముందుకి వచ్చి ప్రణమిల్లారు. కొంత సేపు సరస సల్లాపాలాడుకున్నారు. వేడుకగా ఏవో కబుర్లు చెప్పుకున్నారు. అయితే ఇంతలో దేవదూత వచ్చి 'చిత్రలేఖా! ఊర్వశీ! మీరిద్దరూ తక్షణమే బయలు దేరి స్వర్గలోకానికి రావాలి. భరత మునీంద్రుడు ఇదివరకు ఊర్వశికి నేర్పిన ఆట, ఇప్పుడు ఆడితే చూడాలని మునీంద్రుడు, ఇంద్రాది దిక్పాలకులు వేడుక పడుతున్నారు. వెంటనే రమ్మనమని అమరేంద్రుని ఆఙ్ఞ ' అని వారిని తొందర పెట్టాడు.

ఊర్వశి కన్నీరు కారుస్తూ పురూరవుని విడవలేక, విడవలేక చిత్రలేఖతో దేవదూత తెచ్చిన విమానంలో నాకలోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడు నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఊర్వశి అందచందాలను చూస్తూ విదూషకుడు ఆమె లేఖను జారవిడిచాడు. అది గాలికి కొట్టుకుపోయి, లతామండపము సమీపాన గుబురుగా ఉన్న ఒక చెట్టు చాటున దాగి ఉన్న మహారాణి, నిపుణికల దగ్గర వచ్చి పడింది. మహారాణి దానిని చూచింది.

పురూరవుడు మాణవకుని 'ఊర్వశి వ్రాసిన లేఖ ఇలా ఇవ్వు. దానిని చూస్తూ అయినా పొద్దుపుచ్చుతా ' అన్నాడు. దానికి 'ఊర్వశితో పాటు ఉత్తరం కూడా పోయింది ' అని బదులిచ్చాడు. ప్రభువు కోపగించు కున్నాడు. ఇద్దరూ ఉత్తరం కోసం వనమంతా వెదకసాగారు. మహారాజు వ్యవహారమంతా కళ్ళారా చూస్తూనే ఉంది మహారాణి. ఇక ఆమెకు కోపం ఆగలేదు. వెంటనే ఆమె మహారాజు దగ్గరకి వచ్చి 'ఊరకనే ఎందుకు అలా విచార పడుతున్నారు? ఊర్వశి వ్రాసిన లేఖకోసం అలా అల్లల్లాడిపోతునారే? ఇదిగో ఆ లేఖ తీసికోండి ' అని భర్త చేతికి అందివ్వబోయింది. హఠాత్తు పరిణామానికి పురూరవడు నివ్వెరపోయి, నిశ్చేష్టుడై, నిబ్బరపడ్డాడు.

మహారాణి భర్తతో నిష్ఠూరాలాడి నిపుణికతో చరచర అక్కడినుండి వెళ్ళిపోయింది. అది చూచి పురూరవుడు సహించలేక ఆమె వెంటవెళ్ళి ఆమె దారికి అడ్డంగా నిలుచున్నాడు. ఎన్నో విధాల బ్రతిమాలుకున్నాడు. అయినా మహారాణి మనసు చల్లబడలేదు. ఆమె రాజు మాటలు వినిపించుకోకుండా అక్కడ నుంచి గబగబ తన మందిరానికి వెళ్ళిపోయింది. పురూరవుడి పని కుడితిలో పడ్డ ఎలక అయ్యింది.

అంతఃపురం చేరుకున్న రాణికి మనశ్శాంతి చిక్కలేదు. మహారాజుని అవమానించి కష్టపెట్టాను కదాని లోలోపల బాధపడ సాగింది. పశ్చాత్తాప పడుతూ లోలోపల కుమిలి పోయింది. చివరకు ఆమె ఒక నిశ్చయానికి వచ్చింది. 'ప్రియానుప్రసాదం' అనే నోము పట్టాలని అనుకున్నది. ప్రియుడు కోపించి ఉన్నప్పుడు ఆయన కోపం పోగొట్టి వశపరచుకునే వ్రతం అది.

ఇక్కడ ఇలా ఉండగా అక్కడ దేవలోకంలో దేవ సభలో నాత్యమాడడానికి సర్వ సన్నద్దురాలై ఉన్నది ఊర్వశి. సరస్వతీదేవి రచించిన లక్ష్మీ స్వయంవరం అనే నాటకం అది. దానిని నాట్యాచారుడైన భరతుడు ఊర్వశికి నేర్పాడు. అత్యంత రమణీయమైన నాటకం అది. ఊర్వశి అన్యమనస్కురాలై పురుషోత్తమా అనడానికి బదులు పురూరవా అంది. దాంతో నాటకం రసాభాస అయింది. భరత మునీంద్రునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి 'నీవు క్షమించరాని తప్పు చేసావు. కనుక నీకు దివ్యఙ్ఞానం నశించుగాక! నీకు దేవలోక వాసం లేకుండపోవు గాక!' అని కఠోరంగా శపించాడు.

భరతముని శాపవాక్యాలు విని ఊర్వశి దుఃఖంతో తపించిపోయింది. ఊర్వశిని చూచి దేవేంద్రుడు 'సరే జరిగిందేదో జరిగింది. పురూరవుడు మనకు ఎన్నో ఉపకారాలు చేసాడు. నీవు దిగులు పడకు. ఈ శాపం నీకు మేలే అవుతుంది. నీవు భూలోకం వెళ్ళు. పురూరవునితో కూడి కొంతకాలం సుఖించు. ఆయన వల్ల నీకొక కుమారుడు కలుగుతాడు. ఆ తరువాత అమరలోకం చేరుకుంటావు' అని అనుగ్రహించాడు.

ఊర్వశి లోలోపల సంతోషించింది. భరతముని శాపంతో తనకు పురూరవుని పొందు ప్రాప్తిస్తుందికదా అనుకున్నది. తన చెలి అయిన చిత్రలేఖతో కలసి దేవలోకం నుంచి బయలుదేరింది. ప్రతిష్ఠాననగరానికి వచ్చి పురూరవుని కలసుకున్నారు. చిత్రలేఖ 'మహారాజా! మీరు నిశ్చింతగా ఈమేతో కలసి సుఖించండి. ఎప్పటికీ దేవలోకం గురించి తలచుకోకుండా ఉండేటట్లు మా ఊర్వశిని సుఖపెట్టండి. తమరు శెలవు ఇప్పిస్తే వెళతాను' అని పురూరవునికి ఊర్వశిని అప్పగించి వెళ్ళిపోయింది. ఊర్వశిని తీసుకుని పురూరవుడు అంతఃపురానికి వెళ్ళాడు. తన స్నేహితుని కోర్కె ఎట్టకేలకు నెరవేరినందుకు మాణవకుడు కూడా చాలా సంతోషించి అక్కడినుండి వెడలిపోయాడు.

****************
పురూరవుడు, ఊర్వశి కలసి చాలాకాలం సుఖించారు. అంతఃపుర భవనాలలో, ఉద్యావనాలలో యధేచ్చగా సంచరిస్తూ తనివితీరా రతిక్రీడల తేలియాడారు. ఒకనాడు తనకు అడవులలోనూ, కొండప్రాంతాలలోనూ విహరించాలని ఉన్నట్లు ఊర్వశి పురూరవుడికి తెలియచేసింది. ప్రియురాలి వేడుక తీర్చదలచాడు చక్రవర్తి. రాజ్యపరిపాలనా వ్యవహారాలన్నీ మంత్రులకు అప్పగించాడు. ఊర్వశిని వెంటపెట్టుకుని అరణ్యాలకి బయలు దేరాడు. అలా వారిద్దరూ కైలాస పర్వత ప్రాంతాలలోని గంధమాదన పర్వతం మీద రమణీయ దృశ్యాలు తిలకిస్తూ యధేచ్చగా విహరించసాగారు.

అప్పటివరకు జరిగిన కాలం మంచికాలం. ఊర్వశి పురూరవునితో కూడి సకల సౌఖ్యాలను అనుభవించింది. అంతట ఆమెకు చెడు రోజులు ప్రాప్తించాయి. దురదృష్టం ముంచుకుని వచ్చింది. ఒకనాడు గంగానదీ తీరాన సైకత స్థలాలలో ఒక చక్కని విద్యాధర స్త్రీ విహరిస్తూ ఉండగా పురూరవుడు చూచాడు. అయితే అతని మనస్సులో దుర్బుద్ధి ఏమీలేదు. కాని ఊర్వశికి మత్సరం పుట్టింది. రాజుపై కోపగించుకుంది. పురూరవుడు ఎంతో బ్రతిమాలుకున్నాడు. అయినా ఊర్వశి వినలేదు. భరతుని శాపం వలన ఆమెకు దివ్యఙ్ఞానము నశించింది. వినాశకాలే విపరీతబుద్ధీ అన్నట్లు పురూరవునిపై అలిగి, అక్కడికి దగ్గరలో ఉన్న కుమార వనంలోనికి వెళ్ళింది.

అది ఒక దివ్య వనం. పూర్వం కుమారస్వామి తపస్సు చేసిన ప్రాంతం. తన తపోదీక్షకు ఎవరైనా భంగం కలిగిస్తారేమోనన్న తలంపుతో కుమారస్వామి ఒక కఠోర నియమం పెట్టాడు. 'స్త్రీ ఎవరైనా ఆ వనలో ప్రవేసిస్తే ఒక తీగ అయిపోవుగాక!' అని శపించాడు. దేవ, గంధర్వ, విధ్యాధరాది మగువలందరికీ ఈ శాపం సంగతి తెలుసు. అందువలన ఆ వనంలోకి ఎవరూ వెళ్ళరు. కుమారస్వామి తపస్సు చేయడం వలనే దానికి కుమారవనం అనే పేరు వచ్చింది.

అయితే ఇప్పుడు ఊర్వశి దివ్యఙ్ఞానం కోల్పోయి, మూఢురాలై కుమారవనంలో ప్రవేశించింది. వెంటనే ఆమె ఒక గురిగింజ తీగగా మారిపోయింది. ఊర్వశి ఎటువెళ్ళిందీ, ఏమైనదీ పురూరవుడికి తెలియదు. ఆమె ఎడబాటు భరించలేక ఎంతో విచారించాడు. పిచ్చెక్కినట్లయింది. ఏమీ తోచక వెర్రివాడిలా ఆ అరణ్యప్రాంతంలో తిరగ సాగాడు. అతనికి ఓ రత్నం కనపడింది. అప్పుడు ఆకాశవాణి 'రాజా! ఈ రత్నం తీసుకో. దీని పేరు సంగమనీయం. అది గొప్ప మహిమ కలది. పార్వతీదేవి పాదాల లత్తుక నుండి పుట్టిన దివ్యరత్నం. ఇది దగ్గర ఉంటే అప్పటివరకూ కనిపించకుండా ఉన్న ఇష్టమైనవి ఏదైనా తక్షణం కనిపించి తీరుతుంది' అని పలికింది. పురూరవుడు సంతోషించాడు. ఆ మణి తీసుకున్నాడు. ఎదురుగుండాఉన్న తీగను తాకాడు. వెంటనే ఆ తీగ ఊర్వశిగా మారిపోయింది. వాళ్ల ఆనందానికి అవధులు లేవు.

'ప్రియ సఖుడా! మీరు ఎన్ని భాదలు పడ్డారో అవన్నీ నేను ఙ్ఞాన దృష్టితో చూస్తూనే ఉన్నాను. భరత మునీంద్రుని శాపం వల్ల ఆ ఙ్ఞానం నాకు నశించి ప్రవేశించకూడని ఈ వనంలోకి ప్రవేశించాను అంటూ జరిగినదంతా చెప్పింది. ప్రతిష్ఠాననగరం విడిచి చాలారోజులైంది. మనం నగరానికి వెళ్ళిపోదాం. రండి అని తన మహిమ చేత మేఘవాహనం సృష్టించింది. వారిద్దరూ దాని మీద ఎక్కి సురక్షితంగా ప్రతిష్ఠాననగరం చేరుకున్నారు.

ఊర్వశితో సర్వ సౌఖ్యాలూ అనుభవిస్తూ పురూరవచక్రవర్తి అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలానికి ఊర్వశి గర్భవతి అయింది. అప్పుడామేకు పూర్వం ఇంద్రుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. పురూరవుని వలన ఒక కుమారుని కని తిరిగి దేవలోకానికి రమ్మని ఆయన ఆఙ్ఞ. ఆ విషయం తలచుకుని ఆమె ఒక ఆలోచన చేసింది. రాజును విడిచిపోకుండా ఉండేటట్లు చూడాలనుకుంది.

ఊర్వశికి ఒక చక్కని కుమారుడు కలిగాడు. వెంటనే ఆమె ఆ విషయం రాజుకు తెలియకుండా కుమారుణ్ణి తీసుకుని చ్యవనముని ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఆశ్రమంలో ఉన్న సత్యవతి అన్న తాపస స్త్రీకి తన బిడ్డను అప్పగించి మళ్ళీ ప్రతిష్ఠానపురానికి వచ్చింది.

తాపసాంగన అయిన సత్యవతి ఊర్వశి కుమారుణ్ణి తన కన్న కుమారుని వలె అత్యంత గారాబంతో పెంచి పెద్ద చేసింది. చ్యవన మహర్షి ఆ బాలుడికి జరిపించవలసిన సంస్కారాలన్నీ జరిపించి, సకల శాస్త్రాలూ నేర్పాడు. రాజులకు ఉచితమైన ధనుర్విద్య భోధించాడు. ఆ పిల్లవాడు సకల శస్త్రాస్త్ర ప్రయోగాలలో ఆరితేరాడు. ఋషికుమారులతో పాటు అక్కడే ఉంటున్నాడు.

ఒక పర్వదినాన పురూరవుడు ఊర్వశితో కలసి త్రివేణీ సంగమమైన ప్రయాగలో స్నానం చేసి, పూజాదికాలు నిర్వర్తించాడు. తరువాత అలంకార సమయంలో దాసి సంగమనీయమణిని ఒక బంగారు బుట్టలో పెట్టుకుని తెచ్చింది. అప్పుడు అకాశంలో పోతున్న గ్రద్ద ఒకటి ఆ మణిని మాంసముద్ద అని అనుకొని క్రిందకి వాలి దానిని నోట కరచుకుని పోయింది.

ఆ విధంగా ఆ గ్రద్ద చ్యవనముని ఆశ్రమము పైగా పోతున్నది. ఋషికుమారులలో ఉన్న ఊర్వశి కుమారుడు దానిని చూచాడు. వంటనే ధనుస్సును తీసుకుని 'అర్ధనారాచం' అనే బాణంతో దాన్ని గురి చూచి కొట్టాడు. తక్షణమే గ్రద్ద మణితో సహా నేల కూలింది.

పురూరవ చక్రవర్తి మణిని గ్రద్ద తన్నుకు పోయిన సమాచారం విని కంచుకిని పిలిపించి మణిని తీసుకువచ్చే ఏర్పాటు చేయమని ఆఙ్ఞాపించాడు. వెంటనే కంచుకి నగరానికి వెళ్ళి తలారిని పిలిచి రాజాఙ్ఞ తెలియచేసాడు. అంతట తలారి నాలుగు దిక్కులకు మనుషులను పంపి గ్రద్ద కోసం వెతికించాడు. చ్యవనముని ఆశ్రమం వైపు వెళ్ళిన వాడు చచ్చి పడి ఉన్న గ్రద్ద నోట ఉన్న మణిని, దేహానికి ఉన్న బాణాన్ని తీసుకువచ్చి పురూరవుడికి అందచేసాడు.

పురూరవుడు ఆ బాణాన్ని పరిశీలించాడు. దానిమీద చెక్కిఉన్న అక్షరాలను చదివాడు. 'పురూరవ చక్రవర్తికి ఊర్వశి యందు పుట్టిన కుమారుడు ఆయువనే వాని బాణమిది. ఈ శరం శతృవుల ప్రాణాలను అపహరించి తీరుతుంది' అని ఉంది. ఆశ్చర్యచకితుడైనాడు పురూరవుడు.

ఇక్కడ ఇలా ఉండగా అక్కడ చ్యవన మహర్షికి ఆయువు బాణంతో గ్రద్దని కొట్టాడన్న సంగతి తెలిసి, వెంటనే సత్యవతిని పిలచి 'ఋషి ఆశ్రమంలో ఇలాంటి హింసాకాండ తగని పని. ఈ రాకుమారుడు ఆశ్రమ విరుద్దమైన పనులు చేయడం మొదలు పెట్టాడు. ఇక ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు. వెంటనే వీడిని తల్లితండ్రులకు అప్పగించు' అని ఆఙ్ఞాపించాడు. ఆయువును వెంటపెట్టుకుని సత్యవతి ప్రతిష్ఠానపురానికి వెళ్ళింది. పురూరవిదు ఆమెను ఆహ్వానించి సకల మర్యాదలు చేసి, భక్తితో పూజించాడు. సత్య్వతి సంగతులన్నీ వివరంగా తెలియజేసి ఊర్వశీ, పురూరవులకు బాలుని అప్పగించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయింది.

అంతట పురూరవుడు అమితానందంతో బాలుని కైగలించుకుని ముద్దాడాడు. 'దేవేద్రునికి జయంతుడు పుట్టినట్లు నాకీ కుమారుడు కలిగాడు' అని అన్నాడు. దేవేంద్రుడి పేరు వినగానే ఊర్వశికి పూర్వ స్మృతి కలిగింది. వెనుకటి విషయాలన్నీ ఒక్కసారిగా ఆమె మనో వీధిలో మెరిశాయి. ఇక ఈ రాజును విడిచి వెళ్ళవలసి ఉందే అని కన్నీరు కార్చసాగింది. పురూరవుడు ఏమి కారణమని అడిగాడు. ఊర్వశి లోగడ జరిగిన వృత్తాంతమంతా రాజుకు తెలియపరిచింది.

అంతా విన్న పురూరవుడు బరువుగా విశ్వసించాడు. పుత్రుడికి రాజ్యభారం అప్పగించి అరణ్యాలకి పోవాలని సంకల్పించు కున్నాడు. ఈ సంగతి దేవేంద్రుడికి తెలిసింది. పురూరవుడు తపొవనాలకు పోతే దేవతలకు తీరని నష్టం కలుగుతుంది. అందువలన ఇంద్రుడు నారదుడిని ప్రార్ధించాడు. భూలోకానికి వెళ్ళి ఏవిధంగానైనా పురూరవుని ప్రయత్నాన్ని మాన్పించవలసిందిగా ఆ మహర్షిని అర్ధించాడు.

నారదుడు ప్రతిష్ఠానపురం వెళ్ళాడు. పురూరవుడు నారద మహర్షిని సకలవిధ గౌరవ మర్యాదలతో, భక్తి ప్రపత్తులతో పూజించి, సతీసమేతంగా సాష్టాంగ నమస్కారం ఆచరించాడు. అప్పుడు నారదుడు 'మీరిద్దరూ ఎడబాయకుండా ఉండుగాక' అని ఆశీర్వదించాడు. అందుకు వారు సంతోషించారు.

'మహారాజా! నీవి అడవికి వెళుతున్నాట్టు దేవేంద్రుడు విన్నాడు. ఆయనకు తరచుగా నీ సహాయం అవసరం అవుతూ ఉంటుంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా నన్ను చెప్పమని నీ వద్దకు పంపాడు. నీ ఇష్టప్రకారం నీవు ఎల్లప్పుడూ ఊర్వశితో కలసి సుఖించవచ్చునని కూడా చెప్పమన్నాడు. కనుక నీవు ఇక ఆ తపోవనాలకు వెళ్లవలసిన పని లేదు' అన్నాడు నారదమునీంద్రుడు.

'మునీంద్రా! నేను దేవేంద్రుని ఆఙ్ఞకు బద్ధుడను. ఆయన చెప్పినట్లు నడుచుకోడానికి సిద్ధంగా ఉన్నాను' అని నారదుడికి తెలియచేసాడు. మహర్షి ఈ విషయం ఇంద్రుడికి తెలియ పరిచాడు. ఇంద్రుడు సంతోషించాడు. పురూరవుడి కుమారుని పట్టాభిషేకానికి అవసరమైన పనులన్నీ చేయవలసిందిగా చెప్పి రంభ, మేనక, తిలోత్తమాది అప్సరసాంగనలను, ఇంకా అనేక అమూల్యమైన కానుకలను భూలోకానికి పంపాడు.

పురూరవుడికి, ఊర్వశికి జన్మించిన ఆయువు రాజ్యపాలన చేస్తున్న కాలంలో ఆ రాజ్యంలో ప్రజలు సకల సౌఖ్యాలూ అనుభవించారు.

(సమాప్తం)
---------------------------------------------------------
రచన - మువ్వల సుబరామయ్య, 
సుజనరంజని సౌజన్యంతో

Wednesday, May 22, 2019

విక్రమోర్వశీయం - 1


విక్రమోర్వశీయం - 1




సాహితీమిత్రులారా!

“కవికుల గురువు కాళిదాసు రచించిన నాటకాలలో విక్రమోర్వశీయం ఒకటి. నాయకుడు పురూరవుడు. నాయిక అప్సరస ఊర్వశి. పురూరవుడి విక్రమం చేత ఊర్వశిని పొందినాడు కాబట్టి ఈ నాటకానికి కవి విక్రమోర్వశీయం అని పేరు పెట్టాడు. పురూరవునికీ, ఊర్వశికీ సంబంధించిన కథలు ఋగ్వేదంలోనూ, విష్ణు, మత్స్య పురాణాలలోనూ, కథాసరిత్సాగరంలోనూ, భాగవతం లోనూ ఉన్నాయి. అయితే ఈ కథలన్నీ ఒక్క తీరుగా లేవు. కాళిదాసు మత్స్యపురాణ కథాక్రమాన్ని అనుసరించాడని 'విల్సన్' గుర్తించాడు. ఈ నాటకంలో పాత్రలు తక్కువ. ఉన్నంతవరకు పాత్రల చిత్రణ కవి చక్కగా చేసాడు.”

శ్రీమన్నారాయణుడి నాభికమలం నుండి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి. మరీచికి కశ్యపుడు జన్మించాడు. కశ్యపునికి అదితి, దితి అని ఇద్దరు భార్యలు. అదితి యందు పుణ్యాత్ములైన దేవతలూ, దితి గర్భాన పాపాత్ములైన దానవులు జన్మించారు. కశ్యపునికి అదితి వలన పుట్టినవాడే వివస్వంతుడు. అతని భార్య సంఙ్ఞ. వారిరువురికీ శ్రాద్దాదేవుడనే కుమారుడు జన్మించాడు. అతనే వైవస్వంతుడన్న పేరుతో వర్తమాన మనువై భూమండలాన్ని పరిపాలించాడు.

వైవస్వంతుడికి చాలా కాలం పిల్లలు లేరు. సంతానార్ధం అతను ఒక యఙ్ఞం చేసాడు. ఆ యాగం చేయించినవాడు వశిష్ఠుడు. వైవస్వతుడు కుమారుడు కావాలని, అతని భార్య కుమార్తె కావాలని కోరుకున్నారు. చివరకు ఇళ అనే చక్కని కూతురు పుట్టింది. వైవస్వతుడు పుత్రిణ్ణి అనుగ్రహించమని కులగురువు వశిస్ఠుడిని వేడుకున్నాడు. అప్పుడు వశిస్ఠుడు హరిని ప్రార్ధించి ఇళకు పుంస్తయం వచ్చేటట్లు చేసాడు. ఆ విధంగా ఇళ మగపిల్లవాడైంది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.

సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైనాడు. ఒకనాడు గుఱ్ఱం ఎక్కి, పరివారంతో వేటకై ఉత్తరదిక్కుగా పోయి అరణ్యాలలో జంతువులను వేటాడుతూ మేరుపర్వతం ప్రాంతంలోని కుమారవనంలో ప్రవేశించాడు. అప్పుడొక చిత్రం జరిగింది. సుద్యుమ్నుడు ఆ వనంలో అడుగు పెట్టాడోలేదో వెంటనే స్త్రీరూపం వచ్చి ఇళ అయినాడు. అతని పరివారం అంతా కూడా స్త్రీలుగా మారిపోయారు.

ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. శంకరుడు నిత్యం పార్వతితో కూడి విహరించే ప్రదేశం అది. ఒకప్పుడు శివుడు ఉమాదేవితో శృంగారక్రీడలు సాగిస్తూ ఆ వనంలో ఉండగా కొందరు మహర్షులు మహేశ్వరుని దర్శనార్ధం అక్కడికి వచ్చారు. వారు వచ్చిన సమయానికి పార్వతి వివస్త్రయై శివుని తొడపై కూర్చుని ఉంది. ఋషులు రావడం చూసి ఆమె సిగ్గుపడింది. వెంటనే అక్కడి నుంచి లేచి వస్త్రం ధరించింది. ఋషులు కూడా అది గ్రహించి ఇది సమయం కాదని అక్కడినుంచి వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగినందుకు శివుడికి కోపం వచ్చి 'తెలిసిగాని, తెలియక కానీ పురుషుడెవరైనాసరే కుమారవనంలో అడుగు పెడితే తక్షణం అతను స్త్రీ అయిపోవుగాక అని శాసించాడు. అదీ కథ. అప్పటి నుంచి పురుషులెవరూ ఆ ప్రదేశానికి వెళ్ళరు. ఈ విషయం తెలియక సుద్యుమ్నుడు అక్కడికి వెళ్ళడం వలన అతనికి, అతని పరివారానికి స్త్రీ రూపాలు వచ్చాయి.

ఇళ ఆ వనంలో తిరుగుతూ చివరకు బుధుని ఆశ్రమానికి వెళ్ళింది. బుధుడు చంద్రుని కుమారుడు. బుధుని వలన ఇళకు పురూరవుడనే చంద్రవంశపు రాజు కలిగాడు. పురూరవుడు షట్చక్రవర్తులో ఒకడు. గంగా యమునా సంగమ తీరాన గల ప్రతిష్ఠాన పురం ఇతని రాజధాని. ఇతను పాలించే లోకానికి మధ్యమలోకమని పేరు. పురూరవుని భార్య కాశీరాజ పుత్రి ఔశీనరి. రాజర్షి, సత్తముడైన పురూరవుడంటే దేవేంద్రుడికి అమిత అభిమానం. దానవులతో సంభవించే యుద్ధంలో పురూరవుడు ఇంద్రుడికి విజయం చేకూర్చేవాడు. పురూరవుడికి సోమదత్తం అనే ఓ దివ్య రధం ఉంది. లేడి చిహ్నం గల జెండా అతనిది. అతను దివ్యరధం ఎక్కి సమస్త లోకాలనూ సంచరించేవాడు.

దేవ వేశ్యలందరిలోకి ఊర్వశి అందాలరాశి. ఊర్వశి అంత అందకత్తె కావడానికి కారణం - పూర్వం శ్రీమన్నారాయణ మూర్తి గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటున్నాడు. అతని కఠోర తపస్సుకి మూడులోకాలు గజగజ వణికాయి. ఇంద్రుడు భయపడి ఎలాగైనా తపస్సు భంగం చేయాలనుకుని తనవద్ద ఉండే అప్సరసలలో అందమైన వారిని పిలిచి, నారాయణ ఋషి దగ్గరకు పోయి అతన్ని వశపరచుకో వలసిందిగా వారిని ఆఙ్ఞాపించాడు.

అప్సరసలు నారాయణ ఋషిదగ్గరకు పోయి ఆడారు, పాడారు. ఎన్నో వేషాలు వేసి, వలపులు కురిపించారు. అయినప్పటికీ భగవంతుడైన నారాయణ ఋషి ఇంచుకైనా చలించక, కళ్ళు తెరచి చూచి, వారికి బుద్ది చెప్పాలని సంకల్పించుకున్నాడు. వారు చూస్తూఉండగానే కొనగోటితో తన తొడగీరాడు. అప్పుడాయన తొడనుంచి జగన్మోహిని అయిన ఒక స్త్రీ జన్మించింది. నారాయణుని ఊరువు నుండి (తొడ నుండి) పుట్టడం వలన ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చింది.

ఊర్వశి చక్కదనం చూచి, తమ అవివేకాన్ని గ్రహించి, అప్సరసలు మళ్ళీ ఇంద్రలోకం వెళ్ళిపోయారు. తర్వాత నారాయణ ఋషి తను సృష్టించిన ఊర్వశిని దేవేంద్రునికి ఇచ్చాడు. అప్పటినుంచి ఆమె స్వర్గానికి అలంకారంగా ఉంటూవచ్చింది. ఇంద్రుడు అవసరమైనప్పుడల్ల ఆమెను 'కోమలాయుధం' గా ఉపయోగించుకుంటున్నాడు.

ఓకనాడు ఊర్వశి చిత్రలేఖ, రంభ మొదలగు చెలికత్తెలతో కుబేరుని పట్టణమైన అలకాపురికి వెళ్ళి స్వర్గానికి తిరిగి పోతున్నది. కేశి అనే రాక్షసుడు ఊర్వశిని చూచి మోహించాడు. అతని నివాసం హిరణ్యపురం. ఆ పట్టణానికి ఆకాశ మార్గాన వెళ్ళాలి. కేశి ఊర్వసిని, చెలికత్తె చిత్రలేఖని చెఱపట్టి తీసుకు పోయాడు.

రంభ, మేనక తదితర అప్సరసలు బిగ్గరగా ఆక్రందనలు చేసారు. దివ్యరధంలో సంచరిస్తున్న పురూరవుడు వారివద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని వారిని ఓదార్చి ధైర్యం చెప్పి ఈశాన్యదిక్కుగా బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పడికి తాము హేమకూట శిఖరంపై వేచి ఉంటామని అతనికి తెలియ చేసారు అప్సరసాంగనలు. పరాక్రమశాలి అయిన పురూరవుడికి ఈ పని ఒక అలెక్కలోది కాదని స్థిమితపడి పురూరవుడి రాకకై నిరీక్షిస్తున్నారు.

సోమదత్తం ఆఘమేఘాలమీద పరుగులు తీసింది. పురూరువుడు కేశి మార్గానికి అడ్డంగా తన రధాన్ని ఆపి, ఒకనిపై ఒకడు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. గొప్ప యుద్దం జరిగింది. పురూరవుడు దివ్యాస్త్రమైన వాయువ్యాస్త్రాన్ని అభిమంత్రించి రాక్షసునిపై ప్రయోగించాడు. ఆ అస్త్రప్రయోగం వలన రాక్షసుడు అతని పరివారం ఒక ప్రచండ వాయువుకు కొట్టుకు పోయి సముద్రంలో పడ్డారు.

అంతట పురూరవుడు ఊర్వశిని, చిత్రలేఖనూ తన రధం మీద ఎక్కించుకుని తక్కిన అప్సరసాంగనలున్న హేమకూటానికి వచ్చాడు. అలా రధంలో వచ్చేటప్పుడు పురూరవుడు ఊర్వశి ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ఎవరికీ తెలియని విషయం కూడా నారద మహర్షికి ఇట్టే తెలిసిపోతుంది. అతనికి తెలిస్తే మూడు లోకాలకి తెలిసినట్లే. అవును మరి. అతను త్రిలోక సంచారి. ఇక్కడి సంగతులు అక్కడ, అక్కడి సంగతులు ఇక్కడ చెప్పటం అతనికొక సరదా. ఆ విధంగా తగవులు కూడా పెడుతూ ఉంటాడు. అయితే నారదుడు చేసేపని లోకానికి ఉపకారంగానే పరిణమిస్తూ ఉంటుంది. అదీ విశేషం.

నారదుడు దేవలోకం వెళ్ళి ఊర్వశిని కేశి అనే రాక్షసుడు చెరపట్టి తీసుకుపోయాడన్న సంగతి ఇంద్రుడి చెవిలో ఊదాడు. అది వినగానే ఇంద్రుడికి ఆందోళన కలిగి చిత్రరధుడనే గంధర్వుడిని పిలిచి, విషయం వివరించి, ఊర్వశిని భద్రంగా తీసుకురా అని ఆదేశించాడు. అంతట చిత్రరధుడు గంధర్వ సేనలతో హుటాహుటిన బయలు దేరాడు. మార్గ మధ్యంలో కొందరు చారణులు ఎదురుపడి పురూరవ చక్రవర్తి కేశిని జయించి ఊర్వశిని విడిపించాడని, అంతా హిమగిరి శిఖరంపై ఉన్నారని తెలియజేసారు. సంతోషంతో వెంటనే హిమాద్రికి వచ్చాడు.

గంధర్వుడు రావడం చూచి పురూరవ చక్రవర్తి మర్యాద చేసి గౌరవించాడు. జరిగినదంతా అప్సరసలు చిత్రరధునికి చెప్పారు. పురూరవుడు ఇంద్రుడికి మహోపకారం చేసాడని ఎన్నో విధాల పొగిడి స్వర్గానికి రమ్మనమని ఆహ్వానించాడు చిత్రరధుడు. ఈ సూచన చాలా బాగున్నదని ఊర్వశి, తక్కిన అప్సరసలు సమర్ధించారు. అయితే పురూరవుడు ఊర్వశిని రక్షించడంలో తన ప్రతాపం ఏమీ లేదని సవినయంగా చెప్పి, వారి ఆహ్వానాన్ని ఇప్పుడు అంగీకరించనందుకు మన్నించవలసిందని కోరాడు. ఊర్వశి పురూరవుడు తనతో రానందుకు లోలోపల విచారించింది. అతని వియోగం ఆమెకు దుర్భరముగా తోచింది.

ఊర్వశిని, అప్సరసలను తీసుకుని చిత్రరధుడు దేవలోకానికి బయలుదేరాడు. తన ప్రాణాలు కాపాడిన చక్రవర్తికి కృతఙ్ఞత చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుందామని అనుకుంది ఊర్వశి. స్వయంగా మాట్లాడడానికి సిగ్గుపడి తన అభిలాషను ప్రాణసఖి అయిన చిత్రలేఖకు చెప్పింది. చిత్రలేఖ పురూరవుని వద్దకు వెళ్ళి ఊర్వశి అభిప్రాయం తెలియచేసింది. ఊర్వశికి దుఃఖం పొర్లివస్తూఉండగా వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి పురూరవుని చూస్తూ వెళ్ళింది. తన చెలికి రాజుపై మోహం పుట్టిందని చిత్రలేఖ తెలుసుకుంది.

అప్సరసలు వెళ్ళిన తరువాత పురూరవుడికి ఏమీ తోచలేదు. ఊర్వశి వియోగాన్ని అతడు భరించలేకున్నాడు. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ చాలాసేపు నిలుచుండి పోయాడు. మనసు పరిపరి విధాల పోతూ ఉంది. చివరకు తన రధాన్ని మరలించి ప్రతిష్ఠానపురం చేరాడు. ఊర్వశి సురక్షితంగా రావడం చూచి ఇంద్రుడు సంతోషించాడు. జరిగినదంతా విన్నాడు. రాజును ఎన్నోవిధాల ప్రస్తుతించాడు.

తన పట్టణం చేరుకున్నది మొదలు పురూరవుడికి నిద్రాహారాలు లేవు. ఎప్పుడూ ఊర్వశే కళ్లముందు కనిపిస్తుంది. విరహ వేదన భరించలక పోతున్నాడు. ఊర్వశి మీద చింతతో మంచం పట్టాడు. పరిపాలనా వ్యవహారాలేమీ పట్టించుకోవడం లేదు. చింతాక్రాంతుడై ఉన్నాడు. తనకు ఆంతరంగికుడు, వేడుక చెలికాడు (విదూషకుడు) అయిన మాణవకుడితో సంగతంతా చెప్పాడు.

పురూరవుని భార్య కాశీరజ పుత్రిక అయిన ఔశీనరి. వచ్చినది మొదలు తన భర్త అదోమాదిరిగా, దిగులుగా ఉండడం గమనించింది. కారణం ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు. తన ఆంతరంగిక దాసి అయిన నిపుణికను పిలచి రాజు సంగతి చెప్పింది. నీవు వెళ్ళి రాజుగారి పరిస్థితి ఎలాఉందో తెలుసుకురా అంది.

నిపుణిక చాలా తెలివైనది. నేర్పు చాకచక్యం కలది. ఇటువంటి పనులు సాధించడంలో ఘటికురాలు. మాణవకుడికి ఈ విషయం తెలిసి ఉంటుంది. ప్రభువులు తమ మన్సులో మాట అతనికి చెప్పకుండా ఉండరు. కనుక విధూషకుడి దగ్గరకు పోయి ఏ విధంగానైనా సరే విషయం రాబట్టాలని బయలు దేరింది.

నిపుణిక మాణవికుడి దగ్గరకు వెళ్ళి ముచ్చట్లు ప్రారంభించింది. గరిక మీద పడిన మంచు బిందువులా అతని నోట్లో మాట దాగదని ఆమెకు తెలుసు. కనుక ఏవేవో మాయ మాటలు చెప్పింది. మాణవకుడు కూడా రహస్యం దాచుకోలేక పొట్ట ఉబ్బినట్లు నానా అవస్థ పడుతున్నాడు. ఈమె అసాధ్యురాలు. నా మనసులో మాట లాగాలని ప్రయత్నిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అని లోలోపల అనుకున్నాడు.

'రాణిగారు రాజుగారికి ఒక మాట చెప్పమన్నారు - నిజంగా నామీద ప్రేమ ఉంటే నేనిట్లా దుఃఖిస్తూఉండగా ఏమీ పట్టనట్లు ఊరుకోవడం న్యాయమా - అని అడిగి రమ్మన్నారు మహారాణి' అని చెప్పింది నిపుణిక. 'ఓహో! అట్లాగా! రాణిగారిపట్ల రాజుగారు ఏమైనా ప్రతికూలంగా ప్రవర్తించారా' అని అడిగాడు మాణవకుడు. 'అవును రాజుగారు ఎవతెను గురించి తపించిపోతున్నారో, ఆమె పేరు పెట్టి రాణిగారిని పిలిచారు' అన్నది నిపుణిక తెలివిగా. రాజుగారే తన గుట్టు రట్టు చేసుకున్న తరువాత ఈ రహస్యం దాచడానికి నే అవస్థ పడడం దేనికనుకొని, 'అయితే రాజుగారు రాణిగారిని ఊర్వశీ అని పిలిచారా? ఆ అప్సరసను చూచినప్పడినుండి మహారాజుకు వెర్రెతింది. మహారాణికి దుఃఖం కలగచేయడమేకాక, నన్ను కూడా అనేకవిధాల వేధించుకుని తింటున్నాడు' అని ఉన్న సంగతి బయట పెట్టాడు.

నిపుణిక అతని దగ్గర శెలవు తీసుకుని వెళ్ళి, రాణి దగ్గరకు వచ్చి, జరిగినదంతా చెప్పింది. పురూరవుడు ఊర్వశిపై ప్రేమతో విరహవేదన పడుతున్నాడని మహారాణి తెలుసుకుంది. 'ఇక నుంచి నీవు సంగతంతా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండు. ఎప్పటి విషయాలు అప్పుడు నాకు చెప్పు' అని దాసిని ఆఙ్ఞాపించింది.

పురూరవుడికి ఊర్వశి పిచ్చి మరీ ఎక్కువయిపోయింది. ఒకనాడు మాణవకునితో ప్రమదా వనానికి వెళ్ళాడు. అది వసంత ఋతువు. వనం అంతా చెట్లు చిగిర్చి ఉన్నాయి. పూలు సువాసనలు వెదజల్లుతున్నాయి. ప్రకృతియావత్తూ శోభాయమానంగా ఉంది. చల్లని దక్షిణపుగాలి మెల్లగా వీస్తున్నది. పురొరవుడికి విరహతాపం మరీ ఎక్కువైంది. తాళలేకున్నాడు.

ఇక అక్కడ ఊర్వశి పురూరవుడిని విడచి హేమకూట పర్వతంకుండి దేవలోకానికి వెళ్ళినది మొదలు ఆమె మనసు మనసులో లేదు. చివరకు తట్టుకోలేక తన ఆంతరంగిక చెలికత్తె చిత్రలేఖను వెంటపెట్టుకుని ప్రతిష్ఠాననగరానికి బయలుదేరింది. అప్రాజిత విద్యతో ప్రమదావనంలో దిగారు. దిగాలుపడిఉన్న చక్రవర్తిని చూచారు. తిరస్కరణీ విద్యతో అదృశ్యంగా ఆయన వద్దకు వెళ్ళి నిలుచున్నారు. పురూరవుడు తన మనోవేదనను విదూషకునితో వెళ్ళబోసుకున్నాడు. అదంతా ఊర్వశి, చిత్రలేఖ వింటూనే ఉన్నారు. ఊర్వశి తనలాగే పరితపించి పోతున్న పురూరవుడికి భూర్జపత్రం మీద తన గోళ్ళతో ప్రేమలేఖ వ్రాసింది. తన మదనవికారమంతా వెళ్ళగ్రక్కుతూ - ప్రియా! మీరు నన్ను గురుంచి ఏదేదో చెప్పారు. మీ విరహవేదన నాకు అర్ధమైంది. నాకు మాత్రం మీ మీద ప్రేమ లేదనుకున్నారా! తొలిచూపులోనే నా మనసు మీకు అర్పణ చేసాను. ఇంతకాలం మీ ఆలింగన సౌఖ్యం పొందలేని దురదృష్టవంతురాలను. నా స్థితిని గురించి మీకు మాటలలో చెప్పలేను. అయినా వినండి - మహారాజా! ఆ మదనుడు నన్ను ఎన్నివిధాల వేధించాలో అన్నివిధాల వేధిస్తున్నాడు. వెన్నెల, పన్నీరు, పుష్ప పరిమళం, మలయ మారుతం - ఇవన్నీ నాకు భరించరాని తాపం కలిగిస్తునాయి. నా అవస్థ ఇంతకంటే ఏం చెప్పను? ఇట్లు, మీ రతిసౌఖ్యాన్ని కోరు ప్రియురాలు ఊర్వశి' అని ప్రేమలేఖ వ్రాసి దాన్ని చక్రవర్తిముందు పడవేసింది.
---------------------------------------------------------
రచన - మువ్వల సుబరామయ్య, 
సుజనరంజని సౌజన్యంతో