Showing posts with label చమత్కారపద్యం. Show all posts
Showing posts with label చమత్కారపద్యం. Show all posts

Monday, March 16, 2020

ఎన్నిరకాల మామయో?



ఎన్నిరకాల మామయో?



సాహితీమిత్రులారా!

విచిత్రమైన చమత్కార ప్రార్థన.
ఇందులో ఎంత మంది మామలున్నారో
చూడండి.



మామను సంహరించి, యొకమామకు గర్వమడంచి, యన్ని శా
మామను రాజుజేసి, యొకమామతనూజునకాత్మబంధువై
మామకుగన్నులిచ్చి, సుతుమన్మథుపత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్ను డయ్యె డున్


1. కంసుడనే మామను చంపి,

2. సముద్రుడనేమామకు గర్వమణచి(రామావతారంలో)

3. చందమామను రాత్రికి రాజును చేసి (నానార్థాలలో రాజు అంటే చంద్రుడు 
     అని ఒక అర్థం)

4. ఒకమామకొడుక్కు(అర్జునునికి) ఆత్మబంధవై,

5. ఒకమామకు కన్నులిచ్చి(రాయబారంలో ధృతరాష్ట్రునికి)

6. రతీదేవికి తానే మామయై,

7. సముద్రుడు విష్ణువుకు మామ,

8.ఈయనకు గంగను ఇచ్చినందున మామకు మామయైనాడు,

అటువంటి విష్ణువు ప్రసన్నుడై మాకు అనుగ్రహం కలిగించుగాక!

Tuesday, February 18, 2020

చమత్కార పద్యం


చమత్కార పద్యం




సాహితీమిత్రులారా!

భాస్కరరామాయణాన్ని రచించిన
నలుగురు కవులలో ప్రధానమైనవాడు
హుళక్కి భాస్కరుడు. భాస్కరరామాయణాన్ని
కృతిగా అందుకున్నవాడు
సాహిణిమారు(డు)న.
ఈయనను గురించి హుళక్కి భాస్కరుడు చెప్పిన
చమత్కార పద్యం చూడండి-


అప్పులిడు నతడు ఘనుడా?
అప్పు డొసగి మరల పొందు నాతడు రాజా
చెప్పగవలె సాహిణి మా
రప్పను దానమున ఘనుడు, రాజు నటంచున్


అప్పు ఇచ్చేవాడు గొప్పవాడా -
అని సామాన్యంగా అర్థమౌతుంది.
అప్పులు ఇచ్చేవాడు తీర్చేవాడు కాదు ఇక్కడ.

అప్ అంటే సంస్కృతంలో నీరు -
దాన్ని తెలుగు పదంగా మార్చటం వల్ల
అప్పుగా మారింది.
ఇక్కడ అప్పులిచ్చేవాడు
ఘనుడా అంటే మేఘము

అప్పుడొసగి మరల పొందు నాతడు రాజా -
దీనిలో
రాజు అంటే భూమిని పాలించేవాడు, చంద్రుడు

ఇక భావంలోకి వస్తే

నీటిని ఇచ్చే మేఘునికంటె,
తన కళలను ఇచ్చి తిరిగి
స్వీకరించే చంద్రునికంటె
దానంలో సాహిణి మారప్పే
గొప్పవాడు - అని భావం.