Friday, January 31, 2020

అపభ్రంశం(భాష)లోని పద్యాలు


అపభ్రంశం(భాష)లోని పద్యాలు




సాహితీమిత్రులారా!

సంస్కృతం నుంచి వికృతం, భ్రష్టం అయిన శబ్దాలే అపభ్రంశాలు.
అపభ్రంశం విక్రమశకం 6వ శతాబ్దినుంచి 10వ శతాబ్దివరకు 
వికసించిందని భావిస్తున్నారు. ఇది బీహారు, గుజరాత్, వంగ ప్రాంతాల్లో
బాగా పెంపొందింది. 

ఇక్కడ రెండు పద్యాలను గమనిద్దాం.

1. శరహస్తపాదుడు(సరహపా) వ్రాసిన పద్యం(చర్య)

పండిఅ సఅల సత్థ బక్ఖాణ ఇ
దేహహి బుద్ధ బసంత ణ జాణ ఇ
గమణా గమణ ణ తేణ బిఖండిఅ
తోచి ణిలజ్జ భణఇ హ ఉరి, పండి అ

దీని భావం -
పండితుడు సకల శాస్త్రాలను వ్యాఖ్యానిస్తాడు
కాని తన శరీరంలో ఉండే ఆత్మను ఎరుగలేడు.
జనన మరణ పరిభ్రమణం నుంచి తప్పించుకోలేడు.
అయినప్పటికి సిగ్గు లేకుండా నేను పండితుణ్ణని ఘోషిస్తాడు

2. మంజుని రచనగా చెప్పబడే ప్రబంధచింతామణిలోని దోహా ఉదాహరణకు-

మంజ భణఇ మణాలవఇ జువ్వణ గయుం ణ ఝూరి
జయి సక్కరఖండ మియతో ఇ సమీదీ చూరి

మంజుడు అంటున్నాడు - హే! మృణాలవతి! చేజారిన యౌవనం
గురించి చింతించకు. చక్కెర మరింత పొడిపొడి అయినా
తియ్యదనం ఎక్కడికి పోతుంది?

మంజుని ఈ భావంతో ఏకీభవించని రసికుడు ఉండడు కదా!

ఇదీ మిత్రులారా అప్రభ్రంశం గురించిన కొంత విషయం.

Wednesday, January 29, 2020

తెలుగులో ఏకాక్షరి


తెలుగులో ఏకాక్షరి




సాహితీమిత్రులారా!

ఏకాక్షరి అంటే ఒకే హల్లుతో కూర్చిన పద్యం.
ఇందులో ఏ అచ్చైనా వాడవచ్చు ఎన్ని అచ్చులైనా వాడవచ్చు
కానీ హల్లుమాత్రం ఒకటే వాడాలి.
విక్రాల శేషాచార్యులవారి
శ్రీ వేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
ఈ ఉదాహరణ చూడండి-

నిన్ను నిను నెన్న నీనె
నెన్నిన నన్నన నన్నన నన ననిన నానేనా
ని న్నూనినా ననూనున్
న న్నూనన్నాను నేననా నున్నానా!


దీన్ని ఈ విధంగా పదవిభాగం తీసుకోవాలి-

నిన్నున్ - ఇనున్ - ఎన్నన్ - ఈనేను - ఎన్నినన్-
అన్నన్న - ననను -అనిన - నానేనా - నిన్ను -
ఊనినాను - అనూనున్ - నన్ను - ఊను -
అన్నాను - నేను - అనా - నున్నానా

అర్థం -
నీకు పైన ప్రభువులులేని, సర్వస్వమునకు ప్రభువైనవాడా
సర్వేశ్వరుడవైన నిన్ను స్తుతించుటకొరకు ఈ నేను ఆలోచిస్తే
చిగురువలె అల్పుడను. చోద్యము గొప్పవాడవైన నిన్ను ఆశ్రయించాను
శకటాసురుని సంహరించినవాడా తండ్రీ నన్ను ఆదుకొనుము అంటిని

Monday, January 27, 2020

ఓష్ఠ్య మరియు అచల జిహ్వ (శబ్దచిత్రం)


ఓష్ఠ్య మరియు అచల జిహ్వ (శబ్దచిత్రం)




సాహితీమిత్రులారా!

పెదిమలు మాత్రమే తగులుతూ నాలుక కదలని పద్యం అంటే
కేవలం ప,ఫ,బ,భ,మ,వ - అనే హల్లులను ఉపయోగించి కూర్చినవి. ఈ హల్లులను ఓష్ఠ్యములు అంటాం.  వీటినిమాత్రమే ఉపయోగించి
పద్యం కూర్చారు

భావభవోపమవామా
భావిభవాబభవభావపాపావిపవీ
భూవిభుబోమావాపా
భావామవిభోపభవప భభవప్రభువా
                                              (మహాసేనోదయము - 2-252)

భూమీ భామాంబు భవా
వామాపా వైభవ భువి భావావాపా
వేమమ్మోముము భూభవ
భీమ భవాభావ భావ విభువామావిభా
                                                        (శ్రీనివాస చిత్రకావ్యం)

వీటిని ఒకసారి పలికి చూడండి
నాలుక కదులుతుందేమో
కదలుదుకదా!
అలాగే పెదిమలు తగలకుండా
పలుకగలమేమో చూడండి
పలుకలేము కదా!

Saturday, January 25, 2020

పాదభ్రమకం(గతిచిత్రం)


పాదభ్రమకం(గతిచిత్రం)




సాహితీమిత్రులారా!

గతి అంటే నడక.
గతిచిత్రమంటే నడకలో ప్రత్యేకత కలిగినది.
అంటే ముందు నుండి వెనుకకు చదివినా ఒకలాగే
ఉండటం  ప్రత్యేకం కాదా
అట్లా ప్రత్యేక నడకలు కలిగిన కవిత్వం
చిత్రకవిత్వంలో ఒక భాగం
దాన్నే గతిచిత్రమంటాం
వీటిలో కొన్ని పద్యాలలో ప్రతిపాదం ముందుకు
వెనుకకు ఎలాచదివినా ఒకలాగే ఉంటాయి
అలాంటిదాన్ని పాదభ్రమకం అంటాం.
ఇక్కడ అలాంటి పద్యం ఒకదాన్ని చూద్దాం -

వందే2మందదమం దేవం
దంభితామమతాభిదం
సదాభీమమభీదాస
మంగలంబి బిలంగమమ్
                                               (కవికల్పతరు)
ఇది శివ ప్రార్థన శ్లోకం-
కఠోరమైన దండనము గలవాడును, గర్వమును అహంకారమును జయించినవాడును, ఎల్లపుడు భయంకరుడును, భయములేని నౌకరులతో కూడినవాడును, చేతులకును కాళ్లకును వ్రేలాడుచున్న సర్పములుకలవాడును అగు ఈశ్వరునకు నమస్కరించుచున్నాను - అని భావం.

ఈ పద్యంలో ప్రతిపాదం ముందు(మొదట) నుండి చివరకు
చివరనుండి మొదటికి చదివినా ఒకలాగే వుంది గమనించండి-

వందే2మందదమం దేవం
దంభితామమతాభిదం
సదాభీమమభీదాస
మంగలంబి బిలంగమమ్

Thursday, January 23, 2020

తెలుగులో త్య్రక్షరి


తెలుగులో త్య్రక్షరి




సాహితీమిత్రులారా!

మధురవాణీవిలాసమును రచించిన
చింతపల్లి వీరరాఘవయ్యగారు క్రీ.శ.1660
ప్రాంతంలో మహబూబునగర్ జిల్లా,
వట్టెం గ్రామంలో నివసించారు.
ఈ కావ్యం అయిదు ఆశ్వాసాలు గలది
దీనిలో మధురవాణీ కార్తవీర్యుల కథ కూర్చబడినది.
ద్వితీయాశ్వాసంలోని చిత్రకవిత్వంలోని
ఏకాక్షర , ద్వ్యక్షర,  త్య్రక్షర - పద్యాలున్నాయి
వాటిలో త్య్రక్షర కందం చూడండి-
ద,,- అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చిన
కందపద్యం ఇది

దావవవవదా
నానావిద్వన్నవీ నిదానా
దీనానాదీదా
నానుదు నె నీదువాదు నావినోదా (2-14)

Tuesday, January 21, 2020

తెలుగులో పంచాక్షరి


తెలుగులో పంచాక్షరి




సాహితీమిత్రులారా!

మనం
ఒకే హల్లుతో కూర్చిన పద్యం ఏకాక్షరి,
రెండు హల్లులతో కూర్చబడిన పద్యం ద్వ్యక్షరి,
మూడు హల్లులతో కూర్చబడినది త్య్రక్షరి,
నాలుగు హల్లులతో కూర్చబడినది చతురక్షరి,
ఐదు హల్లులతో కూర్చినది పంచాక్షరి
ఇలా వింటుంటాం కాని వాటిని చూచి ఉండం కదా!

ఇక్కడ మనం కేవలం 5 హల్లులతో కూర్చబడిన పద్యం
మన తెలుగు కవులు నంది మల్లయ- ఘంట సింగయ.
వీరే మన తెలుగులో మొదటి జంటకవులు వీరు వ్రాసిన
వరాహపురాణంలో కూర్చిన పద్యం చూడండి-

పంచాక్షరి-
నమశ్శివాయ పంచాక్షరీ సీసము
ఇందులో --శ--య - అనే
హల్లులను ఉపయోగించి కూర్చబడినది.

 నిమాయా నివే నో
                    మౌనిశ్యాయ శ్శివా
యానామాన నానా యన నవా
                    మ్నా యా శ్శివా
యోని యామినీ మేశ శశ్యంశు
                   న్ననాయ శ్శివా
వ్యోమానుయాయి మా యామావా
                   మాననాశాయ శ్శివా
ని విము ముని యమును విశ్వ
ను మ్మున నెమ్మినై నున్న నన్ను
నెమ్మమ్మున నమ్మిన నెమ్మినేను
నోము నీశా యిమ్మన్నదేమి నిన
                                                           (వరాహపురాణము - 10 - 56)

దీనిలో గీతపద్యం చివరిపాదంలో (దే) అన్నది తప్ప
మిగిలిన పద్యమంతా పంచాక్షరాలతోటే సాగింది.
మీరును గమనించండి.

Sunday, January 19, 2020

కందగర్భితగీతము

కందగర్భితగీతము




సాహితీమిత్రులారా!

కందపద్యం వ్రాస్తే కందం,
తేటగీతి వ్రాస్తే తేటగీతి ఉంటాయి.
కానీ రెంటిని ఒక దానిలో ఇమిడ్చితే
దాన్ని గర్భకవిత్వమంటారు.
అంటే రెండు పద్యాల లక్షణాలతో
ఒకపద్యంలోనే రెండు పద్యాలుంటాయి.
అలాంటిది ఇక్కడ ఒకటి గమనిద్దాం.
మఱింగంటి జగన్నాథాచార్యులువారు కూర్చిన
శ్రీరంగనాథవిలాసములోనిది ఈ పద్యం-

తరళ నయనాంబురుహ దినకరనుత హరి
శంఖచక్రకర జగదీశా నిరుపమ
కనకమయవసన ధరణి దనుజహరణ
పరమధామవిహారా కృపాసముద్ర

ఇది తేటగీతి పద్యం ఇందులో కందపద్యం ఇమిడి వుంది.
తేటగీతిలో ప్రతిపాదానికి -
ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు ఉండాలి
పై పద్యంలో అలాగే ఉన్నాయి.
మరి కందపద్యానికి  మొదటి రెండుపాదాలు మొత్తం 8 గణాలు
చివరి రెండుపాదాలు మొత్తం 8 గణాలు. వీటిలో గగ, ,జ,,నల - అనే గణాలనే వాడాలి. అయితే 1,3,5,7 గణాలలో జ- గణం వాడరాదు. 6వ గణంలో జ గాని, నల గాని వాడాలి. 8వ గణంలో
గగ/స - గణాలు వాడాలి. ఈ గణాలన్నీ తేటగీతిలో కూడా ఉండేలా
కూర్చిన పద్యం పై పద్యం.
ఇక్కడ పై పద్యంలోని కందపద్యం -


తరళ నయనాంబురుహ దినకరనుత హరి
శంఖచక్రకర జగదీశా నిరుపమ
కనకమయవసన ధరణి దనుజహరణ
పరమధామవిహారా కృపాసముద్ర

తరళ నయనాంబురుహ దిన
కరనుత హరి శంఖచక్రకర జగదీశా! 
నిరుపమ కనకమయవసన 
ధరణి దనుజహరణ పరమధామవిహారా!

ఇంతవరకే కందపద్యం సరిపోయింది.
కృపాసముద్ర - అనే పదం కందపద్యానికి అవసరంలేదు.
ఇప్పుడు గమనిస్తే తేటగీతిలో కందపద్యం ఇమిడి ఉన్నదికదా
దీన్నే గర్భచిత్రం అంటాము.


Friday, January 17, 2020

''ఈ జగత్తంతా బాణుని ఉచ్ఛిష్టమా?''


''ఈ జగత్తంతా బాణుని ఉచ్ఛిష్టమా?''



సాహితీమిత్రులారా!

సంస్కృతంలో కాదంబరి అనే ఒక కథాకావ్యాన్ని బాణుడు రచించాడు.
అది ఎంతటి కావ్యంమంటే కాదంబరీ ప్రబంధం చదివి
ఆస్వాదత రుచిచూచిన తరువాత వారికి ఎంతటి ఆస్వాద్యమైన
ఆహారంకూడా రుచించదట. అందుకే కాదంబరీ రసజ్ఞానాం,
ఆహారోపి నరోచతే - అనే నానుటి వచ్చింది.
ఈ కాదంబరీ ఇతివృత్తం ప్రేమకథాకలితం.
దీనిలో కాదంబరీచంద్రాపీడుల ప్రణయం,
మహాశ్వేతా పుండరీకుల ప్రణయవృత్తాంతం అద్భుతంగా వర్ణించబడ్డాయి.
దీనిలో చంద్ర, గంధర్వ, మానవ లోకాలకు సంబంధించిన పాత్రలతో,
సంఘటనలతో విస్మయావహంగా ఈ కావ్యం సాగుతుంది.
దీనిలోని రచన, శైలి, అలంకార నిర్వహణ అపూర్వమైనవి.
ఇందులో చిత్రమేమంటే కథారచన పూర్తికాకమునుపే
బాణుడు మరణించాడు ఆ మిగిలిన భాగాన్ని అతని కుమారుడు
భూషణభట్టు పూరించాడు. బాణుని కుమారుడు తండ్రిగారి శైలిలోనే కావ్యం
పూర్తి చేయడం వల్ల ఎక్కడా అతుకు పడిన విధంగా అనిపించదు.

సరే అసలు విషయం మరిచాంకదా లేదు లేదు
ఇంతకీ అసలు కథ ఏంటంటే మన బాణుడు సాహిత్య చరిత్రలో
ప్రకటించిన భావాన్నిదేన్నీ మరి ఎవరూ ప్రకటించి ఉండలేదు.
తరువాత వచ్చిన రచనలన్నీ బాణుని ఉచ్ఛిష్టంగా చేబుతారు
అదే ''బాణోచ్ఛిష్టం జగత్సర్వం''
అనే నానుడికి సంబంధించిన విషయం.



Tuesday, January 14, 2020

నతితతి (చిత్రకావ్యం)


నతితతి (చిత్రకావ్యం)




సాహితీమిత్రులారా!

చిత్రకవిత్వం ఈ పద్ధతిలోనే ఉంటుంది అంటే తప్పేమో
ఇది అనేక రకాల రూపాలతో విరాజిల్లుతోంది. ఈ కాలంలో
ఇలాంటి కవిత్వం వ్రాసేవారున్నారా అని కొందరికి అనుమానం.
ఇందాకే అనుకున్నాంకదా దీనికి అనేకరూపాలున్నాయని
ఏ రూపంలో విరాజిల్లినా అది దాని ప్రత్యేకతను కలిగి వుంటుంది.
ఇక్కడ నతితతి గురించికాక వేరేదో ఉందని అనుకోవద్దు.
నతితతి అనేది ఒక ప్రత్యేక చిత్రకావ్యం.
దీని పేరేమిటి ఇలావుంది అంటే -
నతి  అంటే ప్రణామం, వందనం, నమస్కారం.
తతి అంటే సమూహం, వరుస, గుంపు - అని.
అంటే ఇందులో నమస్కారాల పరంపర వుందనుకోవచ్చుకదా
అదేనండీ అనేకులకు అంటే దేవీదేవతలకు, గురువులకు, ఋషులకు
వందనాలను సమర్పించడం. ఇందులో కనిపిస్తుంది.
దీన్ని పండిట్ మోహన్ లాల్ శర్మ గారు కూర్చారు.
ఇందులోని ప్రత్యేకత ఏమంటే ఎవరిని గురించి పద్యం
ప్రారంభిస్తున్నాడో వ్రిపేరులోని మొదటి అక్షరంతోనే
పద్యంలోని ప్రతిపదం ప్రారంభమౌతుంది. ఇందులోని
పద్యాలన్నీ ఇలాగునే కూర్చబడ్డాయి.
ఉదాహరణగా ఒక పద్యం చూద్దాం-

కాలిందీకూలకేలిః కురుకులకదనః కాననే కామ్యకుఙ్జే
కేకాభిః కీర్త్యమానః కాలితకరుణయా కుఙ్జరం కాన్తకాయమ్
కుర్వన్ క్రీడన్ కదవ్బే కనకకటకకృత్కింకిణీకాణకాన్తః
కృష్ణః కల్యాణకారీకలయతు కుశలం కేశవః కంసకాలః - 1

ఇందులో ప్రారంభంలో మాత్రమే కాకుండా ప్రతిపదం మొదట్లోను
ఇంకా వీలైనంత వరకు అనే వ్యంజనాన్ని ఉపయోగించడం జరిగింది.
కాలిందీకూలకేలిః కురుకులకదనః కాననే కామ్యకుఙ్జే
కేకాభిః కీర్త్యమానః కాలితకరుణయా కుఙ్జరం కాన్తకాయమ్
కుర్వన్ క్రీడన్ దవ్బే నకకటకకృత్కింకిణీకాణకాన్తః
కృష్ణః ల్యాణకారీకలయతు కుశలం కేశవః కంసకాలః - 1


Sunday, January 12, 2020

సర్వలఘునిరోష్ఠ్య చిత్రం


సర్వలఘునిరోష్ఠ్య చిత్రం




సాహితీమిత్రులారా!

దీర్ఘాలైన అచ్చులు లేకుండా శ్లోకాన్ని లేదా
పద్యాన్నిరాయడాన్ని సర్వలఘుచిత్రం అంటాము.
అలాగే వర్ణముల ఉత్పత్తిస్థానాలను బట్టి కేవలం
కొన్నిటినే తీసుకొని వ్రాయటాన్ని స్థాన చిత్రం అంటాము.

ఈ క్రింది శ్లోకంలో ఈ రెండింటిని చూడవచ్చు చూడండి-

ఖలహనన కరణగరగళ
జలజజనత తరణ సకల జనదర హరణ
లలదజల శరణ జయకర
గలనన రథచరణ నతత ఖరకర శరణ
                                                     (అలంకారశిరోభూషణే - 7 - 21)
(ధర్మ భ్రష్టులైన దుష్టులను వధించువాడా!
విషధరుడైన శివునిచేత, పద్మభవుడయిన
బ్రహ్మచేత నమస్కరింపబడిన పాదాలు కలవాడా!
జనుల భయాన్ని హరించువాడా!
ముసలితనం లేని దేవతలకు దిక్కైనవాడా!
జయమును కలిగించువాడా!
నిరంతర సూర్యమండల వర్తీ రంగనాథా!
నీకు నమస్కారం)

మొదటిది-
దీనిలోనివన్నీ లఘువులే కావున
ఇది సర్వలఘుచిత్రం క్రింది వస్తుంది.
దీనిలో 2,4 పాదాలలోని చివరి అక్షరాలు
లఘువులైనా గురువులుగా పలికే
సాంప్రదాయం చిత్రకవిత్వంలో ఉంది.

రెండవది-
ప,ఫ,బ,భ,మ,వ - అనే హల్లులు
ఉ,ఊ,(ఒ),ఓ,ఔ - అనే అచ్చులు
పెదిమలచే పలుకబడతాయి
వీటిని ఓష్ఠ్యములు అంటారు.
వీటిని లేకుండా రాయడాన్ని నిరోష్ఠ్యము అంటారు.
ఇది స్థానచిత్రము- దీన్ని పెదిమలు తగలకుండా
పలుకవచ్చు చదివి గమనించండి.

Friday, January 10, 2020

కన్నడంలో త్య్రక్షరి


కన్నడంలో త్య్రక్షరి




సాహితీమిత్రులారా!

త్య్రక్షరి అంటే కేవలం మూడు వ్యంజనాలతో
ఒక పద్యాన్ని గాని శ్లోకంగాని వ్రాయడం.
కన్నడంలో అమోఘవర్ష నృపతుంగుడు 
కూర్చిన కవిరాజమార్గలోని త్య్రక్షర చిత్రం -


ನಾದಭೇದನನಾದಾನಾ ನಾದಾನಾದನೋದನಾ
ನಾದನೋದನಾದನಾ ನಾದನಾನದಭೇದನಾ
                                          (ಕವಿರಾಜಮಾರ್ಗ - 2- 112)
నాదభేదననాదానా నాదానాదనోదనా
నాదనోదనాదనా నాదానానదభేదనా
                                             (కవిరాజమార్గ - 2- 112)

ఇందులో కేవలం ద,,- అనే మూడు వ్యంజనాలను
ఉపయోగించి కూర్చబడినది.

Wednesday, January 8, 2020

బృహత్కథను పైశాచిక భాషలో ఎందుకు వ్రాశారు?


బృహత్కథను పైశాచిక భాషలో ఎందుకు వ్రాశారు?




సాహితీమిత్రులారా!

కథాకావ్యాల్లో ప్రసిద్ధమైన బుద్ధస్వామి కృత బృహత్కథాశ్లోక సంగ్రహం, క్షేమేంద్రుడు వ్రాసిన బృహత్కథామంజరి, సోమదేవుడు వ్రాసిన కథాసరిత్సాగరం ఈ మూడింటికి మూలం బృహత్కథ పైశాచిక భాషలో వ్రాయబడింది.
అది ఎందుకు వ్రాయబడిందో దానికి ఒక కథ ప్రచారంలోవుంది.
ఆ కథ..............

శాతవాహనరాజు ఆస్థానంలో గుణాఢ్యుడు ఆస్థానకవి. రాజుగారు ఒకరోజు
రాణితో జలవిహారం చేస్తున్న సమయంలో రాజుగారు రాణిపై నీరు చల్లడం మొదలు పెట్టాడు అప్పుడు రాణి విసుగ్గా మోదకైస్తాడయ(నీళ్లతో నన్ను కొట్టకు)అంది. దానికి పొరపాటుగా అర్థం చేసురున్న రాజు మోదకాల(లడ్డుల)ను తెప్పించి రాణిమీద విసరడం ప్రారంభించాడు. దానికి రాణి పరిహాసం చేసింది. దానితో రాజు అవమానం చెంది ఎలాగైనా అతిత్వరలో సంస్కృతం నేర్చుకోవానుకున్నాడు. ఆస్థాన పండితులను పిలిపించి తన కోరిక తెలిపాడు దానికి గుణాఢ్యుడు కనీసం 6 సంవత్సరాలైనా పడుతుందన్నాడు. దానికి కామందవ్యాకరణకర్త అయిన శర్వవర్మ తాను 6 నెలల్లో నేర్పుతానన్నాడు. దానికి గుణాఢ్యుడు అలా నేర్పగలిగితే తాను సంస్కృత ప్రాకృత దేశభాషలను త్యజిస్తానని శపథం పట్టాడు.

శర్వవర్మ రాజుకు 6 నెలల్లో సంస్కృతం నేర్పాడు. దానితో 
గుణాఢ్యుడు శపథం ప్రకారం సంస్కృత, ప్రాకృత విడిచివేసి
రాజుగారి ఆస్థానం కూడా వదలి వెళ్లాడు. ఆ తరువాత 
పైశాచిక భాషలో బృహత్కథను వ్రాశాడు. 
ఇదీ బృహత్కథ పైశాచిక భాషలో వ్రాయడానికి గల కారణం.

Monday, January 6, 2020

అపునరుక్త వ్యంజనము


అపునరుక్త వ్యంజనము




సాహితీమిత్రులారా!

ఏదైనా ఒక పద్యంగాని శ్లోకంగాని వచ్చిన హల్లు మళ్ళీ రాకుండా
వ్రాయగలిగితే దాన్ని అపునరుక్త వ్యంజన చిత్రంగా చెబుతారు.
ఇలాంటి వాటికి ఉదాహరణగా మనం ఇక్కడ ఒక శ్లోకాన్ని చూద్దాం-

బాఢా ఘాళీఝాటతుచ్ఛే గాధాభానాయఫుల్లఖే
సమాధౌశఠజిచ్చూడాం వృణోషిహరిపాదుకే
                                                                                   (పాదుకాసహస్రం - 920)

(ఓ భగవత్పాదుకా! దృఢమైన పాపసముదాయమనే అడవిలేనట్టి, వికసించిన మనస్సుకల సమాధియోగమందు దివ్యప్రబంధాన్ని ప్రకాశింపజేయడానికి నీవు శఠకోపసూరి శిరస్సును వరిస్తున్నావు  - అని భావం.)

దీనిలో వచ్చిన హల్లు మళ్ళీ రాలేదు కావున దీన్ని
అపునరుక్తవ్యంజనంగా చెప్పబడుతున్నది.

Saturday, January 4, 2020

హిందీలో గతిచిత్రం(పాలిన్డ్రోమ్)


హిందీలో గతిచిత్రం(పాలిన్డ్రోమ్)



సాహితీమిత్రులారా!


తెలుగులో మనం పాదభ్రమకం, పద్యభ్రమకం తెలుసుకొని ఉన్నాం.
ఇక్కడ హిందీలో పాదభ్రమకాన్ని పద్యభ్రమకాన్ని గమనిద్దాం-

मां सस मोह सजै बन बीन, नवीन बजै सह मोस समा।
मार लतानि बनावति सारि, रिसाति वनाबनि ताल रमा ॥
मानव ही रहि मोरद मोद, दमोदर मोहि रही वनमा।
माल बनी बल केसबदास, सदा बसकेल बनी बलमा ॥
మాఁ సస మోహ బన బీన, నవీన బజై  సహ మోస సమా
మార లతాని బనావతి సారి, రిసాతి వనాబని తాల రమా
మానవ హీ రహి  మోరద మోద, దమోదర మోహి రహి వనమా
మాల బనీ బల కేశబదాస, సదా బసకేల బనీ బలమా
                                                    (కేశవదాస్ కూర్చిన ఒక సవై)

దీనిలోని ప్రతి పంక్తిని చివరనుండి మొదటికి చదివినా
మొదటినుండి చదివినలాగే వస్తుంది. దీన్నే పాదభ్రమకం అంటాం.
ఈ క్రిందిది పద్యభ్రమకానికి ఉదాహరణ -

सदा सील तुम सरद के दरस हर तरह खास।
सखा हर तरह सरद के सर सम तुलसीदास॥
సదా సీల తుమ సరద కే దరస హర తరహ ఖాస
సఖా హర తరహ సరద కే సర సమ తులసీదాస

ఇది రెండు పాదాల చివరనుండి మొదటికి చదివినా మొదటినుండి
చదివినలాగే వస్తుంది దీన్నే పద్యభ్రమకం అంటాం.

చిత్రకవిత్వంలో బ- లకు భేదం ఉండదు.

అలాగే సున్నలు విసర్గలు కూడా ముందు వెనుకలుగా చదివేప్పుడు
ఒకచో రావచ్చు మరొకచో రాకపోవచ్చు.

Thursday, January 2, 2020

రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె


రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె 




సాహితీమిత్రులారా!

సమస్య -
రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై

రాముడు రావణ కుంభకర్ణులకు పుట్టినట్లు చెప్పడం విరుద్ధ భావనకదా
దీన్నిమాడుగుల నాగఫణిశర్మగారు  పూరించారు

పూరణ-

భావుకుతా మహర్షులకు భాసురరీతి భీతిగల్గగా
శ్రీవృతరాఘవాన్వయ చరిత్రకు ధాత్రిని ఖ్యాతి గల్గగన్
భూ విభుడావిభూతిఁగన భూరితరస్థితి భీతి గల్గనా
రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై 

దీనిలో రాముడు రావణకుంభకర్ణులకు
భీతి పుట్టే విధంగా పుట్టాడని పూరించాడు
కావున విరుద్ధార్థం సమస్యను
సరైన విధంగా సమంజసంగా పూరించాడు

Wednesday, January 1, 2020

నూతన సంవత్సర శుభాకాంక్షలు


 నూతన సంవత్సర శుభాకాంక్షలు


Related image

సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
ప్రపంచ ప్రజలకు
2020 నూతన సంవత్సర శుభాకాంక్షలు