సినిమా పాటల్లో హాస్యం
సాహితీమిత్రులారా!
“హాస్యం” అంటే నవ్వు పుట్టించేది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో ఒకప్పుడైనా ఏదో ఒకటి చేసో అనో ఉద్దేశపూర్వకంగానో ఉద్దేశ్యం లేకుండానో అందరూ హాస్యం పుట్టిస్తారు. ఐతే ఎందువల్లనో గాని మనం అంటే ముఖ్యంగా తెలుగువాళ్ళం సంభాషణల్లో మాటల్తోటీ చేతల్తోటీ హాస్యాన్ని చూపించగలం గాని సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మూతులు బిగించేస్తాం. వెయ్యేళ్ళ మన సాహిత్యాన్ని భూతద్దాల్తో వెదకాలి హాస్యాన్ని కనిపెట్టాలంటే. అప్పటికీ అది హాస్యమని అవతలి వాళ్ళని ఒప్పించటానికి మనమే కితకితలు పెట్టాల్సొస్తుంది బహుశా.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకున్న అసలైన ప్రజాసాహిత్యాన్ని, అంటే సినిమా పాటల్ని, హాస్యదృష్టితో చూద్దాం.
సాహిత్యంలో లానే సినిమా పాటల్లో కూడా హాస్యాన్ని వెదికిపట్టుకోవటం మామూలు విషయం కాదు. ఐతే తొలితరం సినిమాల వాళ్ళు ఈ పని కాస్త సులువు చెయ్యటానికి ఒకో సినిమాలో ఎన్నో హాస్య పాత్రల్ని పెట్టి వాటి చేత కొన్ని పాటలు కూడా పాడించేవాళ్ళు. ఇక హాస్యజంటలు ఉంటే వాళ్ళకు పాట లేకుండా ఉండేది కాదు. రానురాను డబ్బుతో పాటుగా సినిమాలో ఉన్న సీన్లనీ డైలాగుల్నీ పాటల్నీ కూడా హీరోలే కొట్టెయ్యటంతో మలితరం సినిమా పాటల్లో హాస్యం కోసం వెతక్కతప్పదు. అన్నట్టు ఈ మధ్య సినిమాల్లో హాస్యపాత్రలకి మాటలు కూడా కరువై పోయి కేవలం యాక్షన్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకోవటం, కొరుక్కోవటం, గుడ్డలు చించుకోవటం లాటివి మాత్రం మిగుల్తున్నాయనుకోండి అది వేరే విషయం.
నాకు గుర్తున్నంత వరకు తొలితరం హాస్యపాటలు సువర్ణసుందరిలో “ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా”, గుణసుందరిలో “కొడితే కొత్వాలె కొట్టాలి”, పాతాళభైరవిలో “వినవే బాల నాప్రేమ గోల”, యిలాటివి. ఐతే ఆ కాలపు పాటల్లో పెద్దగా హాస్యం కనిపించదు నాకు. “ఆంజనేయుడికి అన్నదమ్ములం, భీమసేనుడికి పెద్ద కొడుకులం” అనేది అప్పట్లో నవ్వు తెప్పించిందేమో గాని యిప్పుడు కాదు. అసలు అప్పటి సినీకవులు పాటల్లో హాస్యం చొప్పించటానికి పెద్దగా ప్రయత్నం చేశారా లేదా అనేది నాకెప్పుడూ అనుమానమే.
పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు రాఘవయ్య చౌదరి. అంతే కాకుండా ఆయన హాస్యాన్ని social commentaryకి కూడా బాగా వాడుకున్నాడు. ఈయన రాసిన “సరదా సరదా సిగరెట్టు” అనే పాట ఇలాటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది. దీన్లో చివరి చరణం నాకు పూర్తిగా గుర్తులేదు గాని దాన్లో పొగతాగితే “ఊపిరితిత్తుల కేన్సర్ కిదియే కారణమన్నారు డాక్టర్లు” అని ఒక పాత్ర అంటే రెండో పాత్ర వెంటనే, “కాదన్నారులే పెద్ద యాక్టర్లు” అని అప్పట్లో పెద్దపెద్ద యాక్టర్లు సిగరెట్ల advertisements ఇవ్వటం, సినిమాల్లో సిగరెట్లు తాగటాన్ని glamorize చెయ్యటం, మీద విసిరిన మంచి చెణుకు. ఆ తర్వాత మళ్ళీ మొదటి పాత్ర “థియేటర్లలో పొగతాగటమే నిషేధించినారందుకే” అంటే రెండో పాత్ర “కలెక్షన్లు లేవందుకే” అని చాలా సునిశితమైన joke వెయ్యటం ఈ పాటకి గొప్ప హంగుని తెచ్చిపెట్టింది. అలాగే పేకాట గురించిన పాట “అయయో చేతులొ డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే” అనేది కరుణ, హాస్యం కలగలిసి మెరిసిన పాట. ఆ పాట చివరగా అంతా పోయాక కూడా, “గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు, మళ్ళీ ఆడి గెల్వవచ్చు, ఇంకా పెట్టుబడెవడిచ్చు, ఇల్లు కుదువబెట్టవచ్చు, ఛాన్సు తగిలితే ఈ దెబ్బతొ మన కరువు తీరవచ్చు” అంటూ జూదగాళ్ళ సైకాలజీని అద్భుతంగా పట్టుకుంటుంది. అంతటితో ఆక్కుండా, “పోతే?” అనే సందేహం, దానికి “అనుభవమ్ము వచ్చు” అనే తిరుగులేని సమాధానం ఈ పాటలో రక్తినీ సూక్తినీ ముక్తాయించటానికి పనికొచ్చినయ్. ఇలాటిదే మరో పాట “భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే” అనేది. దీన్లో అత్తమామల ఆస్తికోసం ఇల్లరికపు అల్లుళ్ళు ఎలాటివైనా భరిస్తారనే విషయాన్ని కళ్ళక్కట్టినట్టు చూపిస్తూ “జుట్టు పట్టుకుని బైటకీడ్చినా చూరుపట్టుకుని వేలాడి, దూషణభూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలిచేవాడికి భలే ఛాన్సులే” అనటం కూడా చక్కటి ప్రయోగం. ఈ కోవలోదే మరో పాట “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అనేది. దీన్లో జనానికి, దేశానికి నష్టం కలిగించే పన్లు చేసేవాళ్ళే నిజమైన చవటలని చూపించటం జరిగింది. ఉదాహరణకి ఒక పాత్ర “బడా బడా టెండర్లను పాడి ప్రాజెక్టులు కట్టించాను, వరద దెబ్బకు కొట్టుకుపోతే మళ్ళీ టెండరు పాడాను, చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” అంటుంది.
మొత్తం మీద ఇలాటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.
ఐతే 70ల్లో హాస్యపాటలకి మరో ఉపయోగం కనిపెట్టారు. అది రెండర్థాల్ని చొప్పించటం. “ఎక్కు మావా బండెక్కు మావా, ఎక్కి కూచోని బండి తొక్కు మావా”, “ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా, నీ ఉరకలు ఊపులు చూస్తుంటే ఉండలేకపోతున్నారా”, “ఇరుసులేని బండి ఈశ్వరుని బండి” ఇలాటి పాటలు అప్పట్లో చాలానే వచ్చాయి. ఐతే హాస్యంలో కొంత పచ్చిశృంగారాన్ని చొప్పించటం అంతకు ముందు లేకపోలేదు. తోలుబొమ్మలాటల్లో కేతిగాడు, బంగారక్క పాత్రలు ఎప్పట్నుంచో ఉన్నవే. అలాగే కాకినాడ నుంచి ఎన్నో ప్రైవేట్ రికార్డులు ఇలాటివి వచ్చినయ్. ఇక చింతామణి నాటకంలో సుబ్బిసెట్టి, శ్రీహరి పాత్రల పోటాపోటీ పచ్చిశృంగార సంభాషణలు అందరూ విన్నవే. ఐతే సినిమాల్లో విచ్చలవిడిగా రెండర్థాల పాటల్ని హాస్యం పేరుతో వాడటం అప్పుడే మొదలయ్యింది.
కాని 70ల్లోనే అప్పలాచార్య చేసిన కొన్ని ప్రయోగాల్ని చెప్పుకుతీరాలి. ఒకటి ఇల్లుఇల్లాలు అనే సినిమాలో “వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను అసలు విషయం చెబుతాను” అనే పాట. బహుశా తెలుగులో ఇలాటి పాట మరోటి లేదనుకుంటాను. మంచి సస్పెన్స్, హాస్యం, చమత్కారం అన్నీ సమపాళ్ళలో కలబోసిన పాట ఇది. అలాగే, పూర్తి హాస్యం కోసం రాసిన మరోపాట “ఆకాశం నుంచి నాకోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయిపొట్లం తెచ్చావా” అనేది. దీన్లో చాలా గమ్మ్తౖతెన పోలికలు వాడటం జరిగింది. ఉదాహరణకి, “నీ జడపిన్ను నా తలరాతకు పెన్ను, నీ సిగపువ్వు బుజబుజరేకుల లవ్వు, నీ చిలిపి బిడియం అమృతంలో కూరిన వడియం, నీ పెదవులు రెండు నా ముక్కుకు దొండ పండ్లు” అనే చరణంలో ఉన్న ఉపమానాలు ఎప్పుడూ ఎక్కడా విన్నవి కావు. 70ల్లో వచ్చిన మరో ప్రయోగం హిందీలో బాగా హిట్ అయిన పాటల ట్యూన్లకి తెలుగులో హాస్యపాటలు రాయటం.
ఇక 80ల్లోకి వస్తే హాస్య నటులకి ప్రాధాన్యత తగ్గిపోయింది. దాంతో పాటే హాస్య పాటలనేవి దాదాపుగా కనుమరుగయినయ్. ఈ కాలంలో హాస్యపాట కాకపోయినా దాన్లో ఉన్న పచ్చిశృంగారం కారణంగా హాస్యపాటగా పెద్ద పేరు తెచ్చుకున్నది “సూడుపిన్నమ్మా పాడు పిల్లడు పైన పైన పడతనంటడు” అనేది. అలాగే తమిళ తెలుగుతో హాస్యం పుట్టించటానికి ప్రయత్నం చేసిన ఒక పాట “నీ అమ్మవాడు నాకోసం ఈనివుంటాడు నా బాంబువాడు నీకోసం కని ఉంటాడు” అనేది.
90ల్లో మళ్ళీ social commentaryగా హాస్యానికి కొత్త ఊపిరి కనిపించింది. “బోటనీ పాఠముంది మేటినీ ఆట వుంది దేనికో ఓటు చెప్పరా” అనేది బహుశా ఈ వరసలో మొదటిదనుకుంటాను. అక్కణ్ణించి ఇలాటి పాటలు ఓ మాదిరిగానే వచ్చినయ్. ఉదాహరణకి “భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ, భర్తగ మారకు బాచిలరు”, “బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్టు టెండూల్కర్ అయ్యేటట్టు”, “క్లాసు రూములొ తపస్సు చేయుట వేస్టురా గురూ, బైట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ, పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ” ఇవన్ని ఇలాటి పాటలు. ఇక “ఓ పనై పోతుంది బాబూ”, “క్యాచీజ్ హై” లాటి కేచీ phraseల్ని తీసుకుని వాటి చుట్టు తమాషా ఐన పాటల్ని అల్లటం కూడా జరిగింది. మొత్తం మీద పోయిందనుకున్న తెలుగు సినిమా హాస్యగీతం మళ్ళీ బతికొచ్చినట్టుంది.
చివరగా నేను గమనించిన ఒక విషయం చెప్పి ముగిస్తాను. అదేమిటంటే, సినిమాల్లో చాలా trends హాస్యంతో మొదలై అక్కణ్ణించి mainstream లోకి పాకటం అనేది. మొదటి సారిగా పాటల్లో స్టెప్పులు వెయ్యటం చేసింది రేలంగి అని మనందరికీ తెలిసిందే. అప్పట్లో హీరో హీరోయిన్లు ముళ్ళపూడి మాటల్లో “ఒకరికొకరు కూతవేటు దూరంలో నిలబడి పాటలు పాడుకునేవాళ్ళు” హీరోయిన్ ఏదో డాన్స్ లాటిది చేస్తూ చేతులు ఊపుతూ మొక్కల్లో తిరుగుతుంటే హీరో ఏం చెయ్యాలో తోచక ఇకిలిస్తూ నిలబట్టమో నడవటమో చేసేవాడు. రేలంగితో మొదలైన స్టెప్పులు ఇప్పుడు ఎక్కడికి చేరాయో ఎవరికీ వివరించి చెప్పక్కర్లేదు. అలాగే మొదట్లో హాస్యపాత్రల్ని మనకి పరిచయం చెయ్యటానికి “ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా” లాటి పాటల్ని వాడేవాళ్ళు. ఆ తర్వాత అది హీరోలు కొట్టేసి తెరమీదికి రావటమే ఒక పాటతో రావటం మొదలెట్టారు “ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు” దగ్గర్నుంచి కొత్త చిరంజీవి సినిమాల దాకా ఈ ఆచారం బలపడిపోవటం చూశాం. ఇక రెండర్థాల పాటలు ఇవీ హాస్యంతో మొదలై ఇప్పుడు హీరోహీరోయిన్ల మామూలు యుగళగీతాల కిందికి evolve అయినయ్. అలాగే, రెండు పాత్రలు పాటల్లో తిట్టుకోవటం అనేది హాస్యపాటల్తోనే మొదలు. “మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం, అబ్బ వేశావె బంధం” అని ఒక పాత్ర అంటే “రాజూ నిన్ను బండకేసి రాస్తా, రాతిబండకేసి రాస్తా” అని రెండో పాత్ర తొడలు చరిచి యుద్ధానికి బయల్దేరటం హాస్యగాళ్ళు చేస్తే, “ఒలమ్మీ తిక్క రేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా” అనో, “ఓసోసి పిల్లకోడి పెట్టా నా ఒయ్యారి పావురాయి పిట్టా” అనో హీరోహీరోయిన్లు పాడుకోవటం చూశాం. “ఏమిటి ఈ అవతారం, ఎందుకు ఈ సింగారం” అని అప్పట్లో ఓ హాస్య పాత్ర చేత అనిపిస్తే, “కాళ్ళగెజ్జి కంకాళమ్మా, కాళ్ళకి గజ్జెలు ఎక్కడివమ్మా” అని హీరో చేత పాడించారు ఆ తర్వాత. ఇలా, మొత్తం మీద కొత్త trends హాస్యంగా మొదలై హీరోలకి పాకటం, లేకపోతే హీరోలు వాటిని లాగేసుకోవటం నా దృష్టిలో ఒక విచిత్రమైన సత్యం. ఈ దృష్టితో చూస్తే, ఇప్పుడు హాస్యగాళ్ళు చేస్తున్న వెర్రిమొర్రి పనుల్ని ఇంకొద్ది కాలంలో హీరోహీరోయిన్లు చెయ్యబోతున్నారన్నమాట. భవిష్యత్తు కళ్ళ ముందు కనపడటం అంటే ఇదే!
----------------------------------------------------------
రచన: కె. వి. ఎస్. రామారావు,
ఈమాట సౌజన్యంతో