Showing posts with label శబ్దచిత్రం- స్థాన చిత్రం. Show all posts
Showing posts with label శబ్దచిత్రం- స్థాన చిత్రం. Show all posts

Monday, May 29, 2017

అచలజిహ్వ కందము


అచలజిహ్వ కందము




సాహితీమిత్రులారా!


పెదిమలుమాత్రమే తగులుతూ పలికే
అక్షరాలు ఓష్ఠ్యాలు వీటితో
వాసవదత్తా పరిణయంలోని ఈ పద్యం వ్రాయబడింది
ఇది పెదిమలు తగలడంతో మాత్రమే పలుకవచ్చు
కాని దీన్ని పలికేప్పుడు నాలుకకదలదు గమనించండి
అందుకే దీన్ని అచలజిహ్వ కందము అన్నారు.
ఇందులో ప,ఫ,బ,భ,మ - అనే అయిదింటిని మాత్రమే
వాడి కూర్చారు.

మాపై పాపము ముప్పే
బాపుముమైమొప్పుపమ్మి ప్రభమింపుంబే
మీపైప్రేమంబేపై
ప్రాపైపెంపొప్ప మమ్ముఁ బంపుము భీమా
                                                   (వాసవదత్తా పరిణయము - 4 80)

ఈ పద్యం చదివి గమనించండి.

Thursday, May 25, 2017

వర్గపంచకరహిత సుగంధి వృత్తము


వర్గపంచకరహిత సుగంధి వృత్తము




సాహితీమిత్రులారా!



క,చ,ట,త,ప - అనే వర్గముల
అక్షరములు లేకుండా వ్రాయబడిన
పద్యం ఇది- అంటే ఇందులో
క-మొదలు, మ-వరకుగల అక్షరాలే
ఉండవు గమనించండి-

సుగంధి వృత్తము-
హార, హీర, సారసారి, హారశైల, వాసవో
ర్వీరుహా, హిహార, శేషవేషహాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీలవైరివీర సం
హార సారశౌర్యసూర్యహర్యవార్యసాహసా


(హీరము - మణి, సారసారి - చంద్రుడు,
హారశైలము - కైలాసము, అహిహారుడు - శివుడు,
యాశసాంశశుశీల - కీర్తికాంతులచే ఒప్పువాడా,
సూర్యహర్యవార్యసాహసా - సూర్యుని గుర్రాలచేతను
వారింపరాని(చొఱవగల)సాహసముగలవాడా.)

చూచారుకదా ఇందులో క మొదలు మ వరకు
ఉన్న వాటిలో ఒక అక్షరమైనా ఉందా లేదుకదా
అందుకే దీనికి వర్గపంచకరహిత పద్యమంటారు. 

Sunday, May 14, 2017

నిస్తాలవ్యము


నిస్తాలవ్యము




సాహితీమిత్రులారా!


వర్ణములు 5 స్థానాలలో ఉత్పత్తి అగును.
కంఠమునందు పుట్టునవు  కంఠ్యములని,
తాలువు(దవడలు)నందు పుట్టునవి తాలవ్యములని,
మూర్ధమునందు పుట్టునవి మూర్ధన్యములని,
దంతములనందు పుట్టునవి దంత్యములని,
ఓష్ఠమునందు పుట్టునవి ఓష్ఠ్యములని
పిలువబడుచున్నవి.

తాలవ్యాక్షరములు - అచ్చులలో ఇ,ఈ
వర్గాక్షరములలో చ వర్గము, అంతస్థములలో - య,
ఊష్మములలో - శ అనునవి.
ఇవి ఉపయోగించక మిగిలిన వాటిని ఉపయోగించి
పద్యము లేక శ్లోకము కూర్చిన అది నిస్తాలవ్యమనబడును.

సరస్వతీకంఠాభరణములోని ఈ శ్లోకం చూడండి-

స్ఫురత్కుండల రత్నౌఘ మఘవద్ధను కర్బురః
మేఘనాదోథ సంగ్రామే ప్రావృట్కాలవదాబభౌ
                                                                                                      (2-268)
ప్రకాశించుచున్న కర్ణభూషణ రత్న సమూహ మనెడి
హరివిల్లుచేత పొడలు గలిగినవాడై సంగ్రామమునందు
మేఘనాథుడు(ఇంద్రజిత్తు) ప్రావృట్కాలము(వర్షర్తువు)
వలె ప్రకాశించెను.

దీనిలో తాలవ్యములుగాక మిగిలినవి ఉపయోగించుటవలన
దీనిని నిస్తాలవ్యము  అంటారు.
ఇది శబ్దచిత్రములో స్థానచిత్రమునకు సంబంధిచినది.

Monday, May 8, 2017

అచలజిహ్వ


అచలజిహ్వ




సాహితీమిత్రులారా!


అచల(కదలని)జిహ్వ(నాలుక)
ఈ పద్యం చదివితే నాలుక కదలదు
చదివిచూడండి-
ఈ పద్యం నాలుక కదలకుండ
పెదిమలుమాత్రమే కదిలే
అక్షరాలతో కూర్చబడినది.

ఇది వాసవదత్తాపరిణయములోనిది

మాపై పాపము ముప్పే
బాపుముమైమొప్పుపమ్మి ప్రభమింపుంబే
మీపైప్రేమంబేపై
ప్రాపైపెంపొప్ప మమ్ముఁ బంపుము భీమా!
                                                                 (వాసవదత్తాపరిణయము-4-80)

Monday, May 1, 2017

ఉత్తర రామాయణములోని నిరోష్ఠ్య సీసము


ఉత్తర రామాయణములోని నిరోష్ఠ్య సీసము




సాహితీమిత్రులారా!


కంకంటిపాపరాజ కృత
ఉత్తర రామాయణంలోని
నిరోష్ఠ్య సీసము చూడండి-
ఇది పెదిమలు తగలకుండా చదువ వచ్చు

జయ దశరథరాజ జఠరసాగరచంద్ర
          జయతాటకాకరంజక కరీంద్ర
జయ ధరాదికజగజ్జాల రక్షాదక్ష
          జయ దయారసనిరంజన కటాక్ష
జయ ఘనాహల్యాఘలయదాంఘ్రి సరసీజ
          జయసహస్రాదిత్య సదృశతేజ
జయచంద్రధరశరాసన ధరాధరశక్ర
          జయనిరీక్షాసక్తజటిలచక్ర
జయ ఖరాది నిశాటశిక్షానిధాన
జయ కిరాతీకృతార్చన సన్నిధాన
జయ నిశాతశరాహత జలనిధాన
జయ జనకకన్యకాధీశ జయనిధాన
                                                  (ఉత్తర రామాయణము - 5- 236)        

ఇది స్థాన చిత్రానికి చెందినది.

Wednesday, November 30, 2016

ఖలహనన కరణగరగళ


ఖలహనన కరణగరగళ




సాహితీమిత్రులారా!


దీర్ఘాలైన అచ్చులు లేకుండా శ్లోకాన్ని లేదా
పద్యాన్నిరాయడాన్ని సర్వలఘుచిత్రం అంటాము.
అలాగే వర్ణముల ఉత్పత్తిస్థానాలను బట్టి కేవలం
కొన్నిటినే తీసుకొని వ్రాయటాన్ని స్థాన చిత్రం అంటాము.

ఈ క్రింది శ్లోకంలో ఈ రెండింటిని చూడవచ్చు చూడండి-

ఖలహనన కరణగరగళ
జలజజనత తరణ సకల జనదర హరణ
లలదజల శరణ జయకర
గలనన రథచరణ నతత ఖరకర శరణ
                                                     (అలంకారశిరోభూషణే - 7 - 21)
(ధర్మ భ్రష్టులైన దుష్టులను వధించువాడా!
విషధరుడైన శివునిచేత, పద్మభవుడయిన
బ్రహ్మచేత నమస్కరింపబడిన పాదాలు కలవాడా!
జనుల భయాన్ని హరించువాడా!
ముసలితనం లేని దేవతలకు దిక్కైనవాడా!
జయమును కలిగించువాడా!
నిరంతర సూర్యమండల వర్తీ రంగనాథా!
నీకు నమస్కారం)

మొదటిది-
దీనిలోనివన్నీ లఘువులే కావున
ఇది సర్వలఘుచిత్రం క్రింది వస్తుంది.
దీనిలో 2,4 పాదాలలోని చివరి అక్షరాలు
లఘువులైనా గురువులుగా పలికే
సాంప్రదాయం చిత్రకవిత్వంలో ఉంది.

రెండవది-
ప,ఫ,బ,భ,మ,వ - అనే హల్లులు
ఉ,ఊ,(ఒ),ఓ,ఔ - అనే అచ్చులు
పెదిమలచే పలుకబడతాయి
వీటిని ఓష్ఠ్యములు అంటారు.
వీటిని లేకుండా రాయడాన్ని నిరోష్ఠ్యము అంటారు.
ఇది స్థానచిత్రము- దీన్ని పెదిమలు తగలకుండా
పలుకవచ్చు చదివి గమనించండి.