Showing posts with label రెండర్థాలనిచ్చే పద్యం. Show all posts
Showing posts with label రెండర్థాలనిచ్చే పద్యం. Show all posts

Monday, June 14, 2021

రెండర్థాలనిచ్చే పద్యం

 రెండర్థాలనిచ్చే పద్యం




సాహితీమిత్రులారా!



ఒక పద్యాన్ని రెండు అర్థాలు వచ్చేలా రాయడం
అనేకార్థక చిత్రంలో చెప్పవచ్చు.
ఇక్కడ హంసవిశతిలోని ఒక పద్యం
ఇందులో పైకి సాధారణంగా కనిపించినా
ఆంతరంలో దూషణ కలిగిన పద్యం
చూడండి-

తారాధిప! రజనీచర!
కైరవభేదనసమర్థ! గౌరీశ శిరో
భార! కమలాభిశంసన
కారణ! వారాశిభంగ కార్యభ్యదయా!

                                     (హంసవింశతి - 5- 284)

ఇందులో
చంద్రునికి సంబంధంచిన
సామాన్యార్థము కలది.
రెండవది చంద్రదూషణ అనే
రెండువిధములైన అర్థాలున్నాయి.

సామాన్యార్థము-


తారాధిప - నక్షత్రములకు అధిపతీ
రజనీచరా - రాత్రియందు తిరిగేవాడా
కైరవభేదనసమర్థ -తెల్లకలువలను
                                  వికసింపచేయువాడా
గౌరీశ శిరోభార - శివుని శిరోభూషణమైనవాడా
కమలాభిశంసన కారణ - కమలములయొక్క
                                          వికాసభావమునకు కాణమైనవాడా
వారాశిభంగకార్యభ్యుదయా - చంద్రోదయమువేళ సముద్రము
                                                  అలలతో ఉప్పొంగును కావున
                                                   పుత్రోత్సాహముతో అలలు రేగునట్లు
                                                    చేయువాడు అని అర్థం.

నిందార్థం-
తారాధిప - గురుపత్నియైన తారను కూడినవాడా
రజనీచరా - నిశాచరుడా, రాక్షసుడా
కైరవభేదనసమర్థ -
కైరవ - జూదగాండ్రకు,
భేదన - పొరుపులు పుట్టించుటలో,
సమర్థ - సమర్థుడా
గౌరీశ శిరోభార - ఈశ్వరునికి శిరోభారమైనవాడా
కమలాభిశంసన కారణ-
కమలా - తోబుట్టువైన లక్ష్మీదేవికి,
అభిశంసనకారణ - గురుతల్పాగమనాది మహాపాపము చేసిన
                                 నీవు సోదరుడవైతివన్న అపవాదమునకు
                                 కారణమైనవాడా
వారాశిభంగకార్యభ్యుదయా - జనకస్థానమైన సముద్రమునకు
                                                   భంగకరమైన పుట్టుక గలవాడా

ఈ విధంగా రెండు అర్థాలను కలిగినది ఈ పద్యం