Tuesday, August 29, 2017
Monday, August 28, 2017
ఏకాక్షర కందము - ద్వ్యక్షర గీతము
ఏకాక్షర కందము - ద్వ్యక్షర గీతము
సాహితీమిత్రులారా!
బుక్కపట్టణ రాఘవాచార్య కృత
శ్రీకువలాశ్వ విజయములోని
పంచమాశ్వాసమునుండి-
ఏకాక్షర కందము-
న- అనే హల్లును మాత్రమే ఉపయోగించి కూర్చబడినది
నేనని నూని నను నిన్ను నేనన్నను నా
నా నేనను నున్ననో నా
నేనె ననున్నాను నెన్న నీనను నానన్ (5-69)
(ఇందులో మూడవ పాదంలో గణభంగం జరిగినది
ముద్రణా దోషము కావచ్చు)
ద్వ్యక్షర గీతము-
ల, వ - అనే రెండు హల్లులను ఉపయోగించి కూర్చబడినది
లావు వోవు లేవ లేవెవలా వలి
వేల వోలె వాలవేవలేవ
వాలు వీలు వోల వాలు వీలీవేల
లేవ లీల వీవు లోవి వోలె (5-71)
Sunday, August 27, 2017
పదాది వర్ణావృత్తి (అక్షర చిత్రం)
పదాది వర్ణావృత్తి (అక్షర చిత్రం)
సాహితీమిత్రులారా!
మొదటి పదానికి మొదట వచ్చిన వర్ణమే
పద్యం లేదా శ్లోకంలోని ప్రతిపదానికి
వచ్చినట్లయిన దాన్ని పదాది వర్ణవృత్తి
చిత్రమంటారు. ఇది శబ్దచిత్రంలోని
అక్షర చిత్ర విభాగానికి చెందినదిగా
పేర్కొన బడుతుంది- దీనికి
ఉదాహరణగా గోపీనాథరామాయణంలోని
ఈ పద్యం చూడండి-
విశ్వాథిప, విశ్వోదర
విశ్వాత్మక, విశ్వసాక్షి, విశ్వాధారా!
విశ్వమయ, విశ్వరూపక,
విశ్వస్థితివిలయకరణ, విశ్వాతీతా!
(1-1349)
ఇందులోని ప్రతిపదానికి మొదట
వి - రావడం జరిగింది. కావున ఇది
పదాది వర్ణావృత్తికి చెందినదే కదా
Saturday, August 26, 2017
శార్ఙ్గ ధనుర్బంధము
శార్ఙ్గ ధనుర్బంధము
వైద్యం వేంకటేశ్వరాచార్యుల సంపాదకత్వంలో
వెలువడిన తిరుమల బుక్కపట్టణం అణ్ణయదేశిక
విరచిత చిత్రబంధమాలికా లోని
శార్ఙ్గ ధనుర్బంధమును చూడండి-
ధనుర్బంధాలు అనేక విధాలు
అందులో ఈ శార్ఙ్గధనుర్బంధము
ఒక రకము.
సంభారసారస్థితి భూరిభాజం
జంభాతి కాంతిక్షతి దాన భావం
వం భానదాతి క్షితి కాంతి భాజం
జం భారిభూతి స్థిర సారభాసం
దీనిలోని శబ్దచిత్రం గమనిస్తే
దీనిలో
మొదటి రెండు పాదాలను
చివరనుండి చదివిన చివరి
3,4 పాదాలు ఏర్పడతాయి
కావున దీనిలో గతిచిత్రం
కూడ ఉన్నదని గమనించగలం.
దీన్ని బంధంలో వ్రాసిన
మొదటిరెండు పాదములు
బంధములో క్రిందినుండి
పైకి కూర్చబడినవి
అలాగే చివరి పాదములు
పైనుండి క్రిందికి చదివిన
సరిపోవును గమనించండి
Friday, August 25, 2017
దోసె, పూరీ, వడ, సాంబారు
దోసె, పూరీ, వడ, సాంబారు
సాహితీమిత్రులారా!
దత్తపది-
దోసె,
పూరీ,
వడ,
సాంబారు - అనే పదాలనుపయోగించి
పెళ్ళికూతురైన పార్వతిని వర్ణించాలి-
పూర్వకవి పూరణ-
జడలో దోసెడు మల్లెపూలు తురిమెన్ సౌందర్య మొప్పారఁ గా
నడయాడెన్ ఘలుఘల్లునన్ హొయలు చిందన్,
జాజిపూ రీతి పా
వడయట్టిట్టులు చిందులాడి పడగా భవ్యాత్మయైనట్టి యా
పడఁతిన్ బార్వతిఁ బెండ్లియాడితివి సాంబా! రుద్ర! నీ సాటి యే
వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
Wednesday, August 23, 2017
స్వరాక్షరి
స్వరాక్షరి
సాహితీమిత్రులారా!
స్వరాలు 7 కదా!
ఆ స్వరాక్షరాలు - స, రి, గ, మ, ప, ద, ని
వీటితో పద్యం లేదా శ్లోకం కూర్చడాన్ని స్వరాక్షరి
అంటారు. ఇక్కడ డా. చిలుకూరి నారాయణరావుకృత
శ్రీకురుమూర్తినాథ శతకం నుండి
ఒక ఉదాహరణ చూద్దాం
దీనిలో "కురుమూర్తినాథ సురవంద్యా పాహిపాపహిప్రభో"-
అన్నది మకుటంగా పద్యాలను కూర్చారు.
సరిగా నీపని సాగనీ గరిప, దా, సాగారి సద్ధామ మా
గరిమన్ సామ నిధానిగా, సమపథంగా సాని నీసారి! మా
దరిగానీ మఱి దారి, సన్నిగమపా! దా సాగ! మాపా! సదా
దర మొప్పం గురుమూర్తినాథ! సురవంద్యా! పాహిపాహి ప్రభో!
(శ్రీకుమూర్తినాథ శతకం - 50)
అర్థం-
గరిప - గరుత్మంతుని ప్రభువా
సన్నిగమపా - శ్రేష్ఠములైన వేదములను పాలించువాడా,
దాసాగ - దాసుల పాలిటికొండా
మాపా - లక్ష్మీనాథా,
దాస - ఆగారి - దాసులకు ఉనికి పట్టగు,
సద్దామ - శ్రేష్ఠమైన వైకుంఠమందుండువాడా,
సామనిధానిగా - సామగాన లోలుడవై లేదా
సౌమ్యమైన మార్గమునందు,
మా గరిమన్ - లక్ష్మ అతిశయిల్లునట్లు,
నీపని - నీవుచేసేపని,
సరిగా - సక్రమంగా,
సాగనీ - సాగించు,
ఈసారి - ఈ పర్యాయం,
నీసాని - నీ భార్య అయిన లక్ష్మి,
సమపథంగా - చంచలమార్గాన్ని వదలి తిన్నని మార్గాన్ని అనుసరించినట్లు,
మఱి - ఇంక,
దారి- నిన్ను చేరుమార్గం,
సదా - ఆదరమొప్పన్ - ఎల్లప్పుడును దయకలిగినవాడవై,
మాదరి గానీ - మాకు చేరునట్లు చేయుము
(శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యుల వారి సహకారంతో)
Sunday, August 20, 2017
కవిని పట్టిచ్చిన చక్రబంధం
కవిని పట్టిచ్చిన చక్రబంధం
సాహితీమిత్రులారా!
తెలుగులో బిల్హణీయం అనే కావ్యాన్ని
పిండిపెద్ది కృష్ణస్వామి రచనగా ముద్రింపబడి
ప్రచారంలో ఉంది. దీన్ని పిండిపెద్ది కృష్ణస్వామి
గారు వ్రాయలేదని పరిశోధకులు తేల్చారు.
దీని వెనుక కథ-
దీని అవతారికలో చిత్రకవి సింగనార్యుని కుమారుడు
నారసింహకవి వచ్చి మెచ్చి కృష్ణస్వామిని బిల్హణకృతి
రచించటానికి ప్రోత్సబించినట్లు చెప్పబడి ఉన్నది.
అదే కృతి ప్రథమాశ్వాసాంతంలో ఒక చక్రబంధం
కూర్చబడింది. చక్రబంధంలో మూడవ వలయంలో
కవిపేరు,ఆరవ వలయంలో గ్రంథము పేరు,
లేదా కృతిపతిపేరు రావాలి. ఈ గ్రంథంలో
3వ వలయంలో సింరార్యకవి - అనే పేరు
కవిపేరుగా కూర్చబడింది. దీని బట్టి
సింగరార్య కుమారునికి కృష్ణస్వామి ద్రవ్యమిచ్చి
తను వ్రాసివిధంగా మార్చి ఉంటాడని తెలుస్తున్నది.
అంటే కవిని చక్రబంధం పట్టిచ్చినది తెలుస్తుంది.
ఆ చక్రంబంధ పద్యం-
ధన్యాసింహభచంద్రకీర్తివరవిద్యాపండితార్యక్రమా
గణ్యాగర్విధనంజయాశిపదముక్తాకృత్స్రగంకప్రభా
జన్యారాజితభూరిశాత్రవకుభృజ్జాతిప్రభావిక్రమా
మాన్యారాధనత్యాగభోగజయధామానవ్యభాగోత్తమా
సింగరాచార్యుడు తన మరోకృతి అయిన
రాఘవవాసుదేవీద్వర్థికావ్యంలో
బిల్హణీయం కూర్చినట్లు చెప్పియుండటం
వలన ఇది సింగరాచార్యుడే వ్రాసినదని
రూఢియైనది.
Friday, August 18, 2017
విభక్తి గూఢము
విభక్తి గూఢము
సాహితీమిత్రులారా!
ఒక పద్యం లేక శ్లోకంలో కర్తను మరుగుపరచిన
దాన్ని కర్తృగూఢమంటారు. అలాగే విభక్తిని మరుగు
పరచిన విభక్తిగూఢము అంటారు.
దీని ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-
పాయా న్మా మురసావితః శ్రియమునా రాధ్యాం ప్రపద్యేత మాం
కోవా న స్థిర మశ్నుతే శమధనో2 ప్యాలోకితో జాతుచిత్
వేదాంతై ర్వినుతాంఘ్రయే న కి ముతశ్శ్రేయోనతిం తన్వ తాం
సేవా మో రచయామి మానస సదా భక్త్యా పహా వాదరమ్
దీనిలో సప్త విభక్తులు- ప్రథమావిభక్తి నుండి సప్తమీవిభక్తి వరకు
ఉన్న 7 విభక్తులు గూఢం చేయబడినవి. అవి తెలియాలంటే
ముందుగా శ్లోకాన్ని పదవిభాగాలుగా చేసుకోవాలి-
పదవిభాగం-
పాయాత్, మాం, ఉరి, అసే, ఇతః, శ్రియం, ఉనా,
ఆరాధ్యాం, ప్రపద్యేతమాం, కరి, వా, న, స్థిరం, అశ్నుతే,
శం, అధనః, అపి, ఆలోకితః, జాతుచిత్, వే, దాంతైః,
వినుతాంఘ్రయే, న, కిమ్, ఉతః, శ్రేయః, నతిం,
తన్వతాం, సేవాం, ఓః, రచయామి, మానస, సదా,
భక్త్యా, ఆవహ, ఔ, ఆదరమ్.
దీనిలో లక్ష్మీ వాచకమైన ఉ - శబ్దం యొక్క ఏడు విభక్తులు
సంధిమూలంగా దాగిఉన్నాయి.
ఓ మనసా, లక్ష్మి యందు ఎల్లపుడు ఆదరాన్ని కలిగి ఉండమని
కోరే శ్లోకం ఇది.
ఉరసాపాయాత్, వేదాంతైః, సేవామో, భక్త్యావహౌ
మొదలైన చోట్ల అపార్థ భ్రమ కలిగించే విధంగా
శ్లోకం కూర్చబడింది.
ఉ - శబ్దానికి క్రమంగా 7 విభక్తులలో రూపాలు-
ఉః, ఉం, ఉనా, వే, ఓః, ఓః, ఔ - అని ఉంటాయి.
శ్లోకంలో ఉరసా అనే చోట ఉః - అనే ప్రధమ(కర్త) గుప్తము.
శమధనః - లో శం అనే ద్వితీయ(కర్మ) గుప్తమైంది.
యమునా రాధ్యాం - లో ఉనా - తృతీయవిభక్తి(కరణం) గుప్తం.
శ్రియముతః - లో ఉతః - అనే చోట పంచమీ(అపాదానం) గుప్తం
పంచమ్యర్థంలో తసిల్ ప్రత్యయం - సేవామోరచయామి - అనే చోట
ఓః - అని షష్ఠి గుప్తము, భక్త్యావహౌ - అనే చోట ఔ - అనే సప్తమీ గూఢంగా ఉంది.
ఈ లక్ష్మి నన్ను కాపాడుగాక,
శివునిచే పూజింప దగిన లక్ష్మిని
నేను ఆశ్రయిస్తున్నాను.
ఆమె కటాక్షానికి పాత్రుడైన
ఏ దరిద్రుడు సంపదను పొందడు
దాంతులైన మునులచే నమస్కరించబడు
లక్ష్మి వలన వారికి శ్రేయస్సుకలుగుటలేదా
ఓ మనసా........ లక్ష్మి యందు ఆదరము
కలిగి ఉండుము. ఆమెకు సేవ చేస్తాను-
శ్లోక భావం.
Thursday, August 17, 2017
కోడి యథేష్టరీతిగను గూసెను రజ్ఞులు వింతవింతగన్
కోడి యథేష్టరీతిగను గూసెను రజ్ఞులు వింతవింతగన్
సాహితీమిత్రులారా!
సమస్య-
కోడి యథేష్టరీతిగను గూసెను రజ్ఞులు వింతవింతగన్
కాకర్ల కొండలరావుగారి పూరణ-
ఓడితి వల్ల అర్జునున కూర్జిత బాహున కెన్నిమారులో
పోడిమి మాట లేల యికపొమ్మని భీష్ముడు పల్క తాల్మిబో
నాడి బొమల్ గుదించి తపనాత్మజడుగ్రత నేల కాళులన్
గోడి యథేష్టరీతిగను గూసెను రజ్ఞులు వింతవింతగన్
భీష్ముడు కర్ణునితో అన్నవిధంగా పూరించబడినది.
కొన్ని జంతువులు పోరాడటానికి ముందు దూకేప్పుడు
కాళ్ళు నేలమీద రాసి పొగరుగా ప్రవర్తిస్తాయి.
కర్ణుడు కూడా ఆ విధంగా ధూర్తతను, తీవ్రతను
ప్రదర్శించి భీష్ముని ఎదిరించి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు.
ఇక్కడ కోడి అనే పదాన్ని నామవాచకంగా కాక
క్వార్థం(అసమాపక్రియ)గా పూరణలో ప్రయోగించడంతో
చక్కని అర్థం ఇచ్చింది.
Wednesday, August 16, 2017
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో
సాహితీమిత్రులారా!
సమస్య-
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో
పండ్రంగి రామారావుగారి పూరణ-
మనమున వరుసల నరయక
యినజుడు పోరియు పిదపను నెరుగన్ వరుసల్
జనని వచింపంగ యముని
తనయుడు తన తమ్ముడయ్యె తప్పో యొప్పో
కర్ణుడు - ధర్మరాజు(యమతనయుడు) తన తమ్ముడని
తెలుసుకొన్న అంశాన్ని తెలుపుతూ పూరించడం వల్ల
ఇందులో మంచి చమత్కారం వచ్చింది.
Tuesday, August 15, 2017
తేనెల తేటల మాటలతో
తేనెల తేటల మాటలతో
సాహితీమిత్రులారా!
తేనెల తేటల మాటలతో
మనదేశమాతనే కొలిచెదమా!
గేయాన్ని వినండి
స్వాతంత్యదినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్యదినోత్సవ శుభాకాంక్షలు
సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
71వ స్వాతంత్యదినోత్సవ శుభాకాంక్షలు
Monday, August 14, 2017
Sunday, August 13, 2017
చక్రబంధము
చక్రబంధము
సాహితీమిత్రులారా!
అష్టకాల నరసింహరాయశర్మగారి
తుకారామస్వామిచరిత్రములోనిది
ఈ చక్రబంధము
శార్దూలవిక్రీడితంలో కూర్చబడింది-
పక్షీంద్ర ధ్వజ చక్రధారి మహదాప ద్వారకా కామ్యదా
స్వక్షోణ్యుద్ధరణా మహాత్మ మనభూప్రాణాంతక ప్రీతిదా
వక్షప్రస్థిత పద్మజాత మధుజీవత్విణ్డితాంతాంబు దా
దక్షిణ్యాపగస్వతభక్త వనమందారా మదారిచ్ఛిదా
(తుకారామస్వామిచరిత్రము - 3- 106)
ఈ బంధములో 1వపాదము ఒక నిలువు వరుసలోను
2వ పాదం రెండవ నిలువు వరుసలోను
3వ పాదం మూడవ నిలువు వరుసలోను
చూడవచ్చు. నాలుగవపాదం చక్రం చుట్టూ
మూడవ పాదం చివరనుండి ప్రారంభమైనది
గమనించవచ్చు. మొదటి మూడు పాదాలలోను
10వ అక్షరం మ మధ్య అక్షరమౌతుంది అందువల్ల
అది చక్రం ఇరుసు(నాభి)లో కనిపిస్తుంది.
పక్షీంద్ర ధ్వజ! చక్రధారి! మహదాప ద్వారకా! కామ్యదా!
స్వక్షోణ్యుద్ధరణా! మహాత్మ! మనభూప్రాణాంతక ప్రీతిదా!
వక్షప్రస్థిత పద్మజాత! మధుజీవత్విణ్డితాంతాంబు దా!
దక్షిణ్యాపగస్వతభక్త వనమందారా మదారిచ్ఛిదా!
Saturday, August 12, 2017
Friday, August 11, 2017
మాలికా బంధము
మాలికా బంధము
సాహితీమిత్రులారా!
అష్టకాల నరసింహరాయశర్మగారి
తుకారామస్వామి చరిత్రలోనిది
ఈ మాలికా బంధము చూడండి-
మారాకారా! నిరాలంబ సురసుఖ సుసంభారదా రక్ష రమ్యా
కారా ఘోరాజిరాసా కమలమతమతా కాంతితాంతి ప్రతిష్ఠా
సారాచారా సురాధ్యక్ష శ్రుతిశ్రుతిశ్రుతా సాధుబంధుత్వ ధుర్యా
పారావారాప్త రామా ప్రకృత కృత కృపాభావ శ్రీవత్సవక్షా!
(తుకారామస్వామిచరిత్రము - 3- 105)
పద్యాన్ని చూస్తూ బంధాన్ని చదవండి-
Wednesday, August 9, 2017
Tuesday, August 8, 2017
Monday, August 7, 2017
ప్రేయసీ గ్లౌభా ఊర్వశీ హ్రీమా - పాట భాషాచిత్రం
ప్రేయసీ గ్లౌభా ఊర్వశీ హ్రీమా - పాట భాషాచిత్రం
సాహితీమిత్రులారా!
వంశీగారి మహర్షి సినిమాలోని
ప్రేయసీ గ్లౌభా
ఊర్వశీ హ్రీమా
అనే పాట సంస్కృతంలో
వ్రాయబడినది. దీని రచయిత
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
చూడండి- ఈ డిస్కోసాంగ్
పాట మొత్తం సంస్కృతంలో ఉంది
గమనించండి -
అర్థం మరోమారు గమనిద్దాం.
Saturday, August 5, 2017
సరిగమలతో సినిమా గీతం
సరిగమలతో సినిమా గీతం
సాహితీమిత్రులారా!
స,రి,గ,మ,ప,ద,ని - అనే ఏడు
అక్షరాలతో మాత్రమే వ్రాయబడిన
పాట. ఇది వంశీగారి సర్వకల్పన
చిత్రంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారు
కూర్చిన పాట-
ఇక్కడ వినండి గమనించండి-
Thursday, August 3, 2017
సామజవరగమనా
సామజవరగమనా
సాహితీమిత్రులారా!
వంశీగారి దర్శకత్వంలో వచ్చిన
డాక్టర్ సుహాసిని చిత్రంలోని
ఈ పాటలో మల్లాదిగారు
సర్వలఘులు కూర్చారు
గమనించండి.-
దీనిలో "సామజవరగమనా" అనేది
తరచు రావడం జరుగుతుంది
ఇది స్త్రీ ఆలపించగా
పురుషుని పాటలోనిదంతా
సర్వలఘువుగా కూర్చారు
గమనించండి-
Wednesday, August 2, 2017
మామామోమౌ మామా
మామామోమౌ మామా
సాహితీమిత్రులారా!
ఒకే వ్యంజనంతో పద్యం కూర్చితే
దాన్ని ఏకాక్షర పద్యం లేక శ్లోకం
అంటారు. ఇది శబ్దచిత్రవిభాగంలోనిది.
ఇక్కడ కేవలం మ- అనే వ్యంజనంతో
కూర్చిన పద్యం చూద్దాం-
మామామోమౌ మామా
మామా మిమ్మోమ్మో మామ మామామేమా
మేమోమమ్మోము మిమైమే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా
మా - చంద్రుని
మా - శోభ
మోమౌ - ముఖముగల
మామా - మాయొక్క
మా - మేథ
మిమ్ము, ఒమ్ము - అనుకూలించును
మామ మామా - మామకు మామా
ఆము - గర్వమును
ఏమి + ఒమ్మము - ఏమి ఒప్పుకోము
మిమై - మీశరీరము
మేము ఏమే - మేము మేమే
మమ్ము ఓముము + ఓముము - కాపాడుము, కాపాడుము
ఇమ్ము - ఔము - అనుకూలమగుమా
చంద్రుని వంటి ముఖముగల దేవా!
మాబుద్ధి మీకు అనుకూలించును.
గర్వపడక నిన్ను మేము అంగీకరింతుము.
సశరీరివై మాకు అనుకూలంగా ఉండి
మమ్ముకాపాడుము - అని అర్థం.
Tuesday, August 1, 2017
Subscribe to:
Posts (Atom)