Saturday, April 30, 2016

స్టాప్ వాచీ


స్టాప్ వాచీ


సాహితీమిత్రులారా!

చిత్రకవిత్వంలో రాసే విధానంలోని వైవిధ్యన్ని లిపిచిత్రంగా పేర్కొంటారు.
ఇక్కడ ఆరుద్ర త్వమేవా2హమ్ లోని ఒక లిపిచిత్రం చూద్దాం.
దీనిలో ప్రతి వరుసకు
ఒకటి లేక రెండు లేక మూడు, నాలుగు
చివరకు ఐదు అక్షరాలు వాడాడు.

ఉరు
మేధకు
నిరు
పేదలు

రోజున
రా
రాజులు

కాంతను
చెరపట్టగ
రా
కాసులు
తలపెట్టిరి

మెన్
ఆపెన్
చెరపట్టన్
వారిని
పడగొట్టన్
మ్రోగెన్
నీ
గన్

నా
పెన్
ఆపెన్
కాపాడును
నీ
విన్
నీవిన్
భావిన్
కాపాడును

(ఆ - మెన్ = Men   (ఇంగ్లీషు),
ఆమెన్ - ఆమెను(తెలుగు),
నీ - విన్ = Win  (ఇంగ్లీషు),
నీవిన్ - చీరమిడిని (తెలుగు))

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి ఒక స్త్రీ వర్ణన ఎలా చేశాడో.

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం వక్త్రం విధాతు: పదం
ధమ్మిల్ల: సుమన:పదం ప్రవిలసత్కాంచీ నితంబస్థలీ
వాణీ సేన్మధురా2ధరో2రుణధర శ్శీరంగభూమి ర్వపు:
తన్వ్యా: కిం కథయామి భాగ్యసులబైర్మాన్యా సదా నిర్జరై:

ఈకాంతకు నడుము (విష్ణుపదం)ఆకాశం అనగా సన్నటి నడుము కలది.
కుచములు (శివపదం) కైలాసం అనగా ఈమె కుచములు పర్వతాలు.
మొగం (విధాతుపదం) బ్రహ్మనివాసం అంటే ముఖం కమలమే.
కొప్పు (సుమనపదం) దేవతలుండే స్వర్గం అనగా పువ్వులు తురిమే ప్రదేశం.
కటిప్రదేశం (కాంచీపురం) కాంచీపట్టణం అనగా ఒడ్యాణం ధరించి ఉన్నది.
పలుకులనేవి మధురానగరం అనగా మిక్కిలి మధురంగా మాట్లాడునది.
మోవి అరుణాచలం అనగా ఆమె పెదవి చాలా ఎర్రగా ఉన్నదని.
శరీరం శ్రీరంగపట్టణం అనగా చాలా గొప్పవైన శరీరభాగాలు కలదని.
ఇన్ని రకాలుగా నవయౌవన సంపన్నులు అపరిమిత భాగ్యవైభవపరిపూర్ణులు
అయిన రసికులు ఎల్లపుడు పొగడదగినదని భావము.

Friday, April 29, 2016

అచలజిహ్వ - శబ్దచిత్రం


అచలజిహ్వ - శబ్దచిత్రం


సాహితీమిత్రులారా!
ఒక పద్యంకాని శ్లోకంకాని నాలుక కదలకుండా పలికే అక్షరాలతో
కూర్చితే దాన్ని "అచలజిహ్వ" అంటారు.
"ఆయలూరు కందాళయార్య" విరచిత "అలంకారశిరోభూషణే "
శబ్దాలంకారప్రకరణంలోనిది ఈ శ్లోకం.
చూడండి నాలుక కదులుతుందేమో!

భవభామా భావగాహ బహుభామా మవాభవ
మమ భోభవభూమావ భవభూపా వభూమహ 

(పార్వతీదేవి యొక్క హృదయమందు చేరినవాడా(శ్రీరామనామ రూపంతో
ఆమె హృదయమందున్నవాడు) అధిక తేజస్సంపన్నుడా! సంసారగంధ గ్రహితుడా
శ్రీ భూవల్లభా! సంసార మండలంలో కలిగిన పాపాధిత్యాను నశింపచేయువాడా!
నన్ను రక్షించు)

దేవం భియా నద్రన యాభి వందే


దేవం భియా నద్రన యాభి వందే


సాహితీమిత్రులారా!

ఒక పద్యపాదంకాని, శ్లోకపాదంకాని ఎటునుంచి చదివినా
ఒకలాగే ఉంటే దాన్ని "పాదభ్రమకం" అంటారు.
"అలంకారశిరోభూషణే" లోని పాదభ్రమక ఉదాహరణ చూడండి.

లంకాథినాథ గ్రథనాధికాలం
సంసార భూతి శ్రితి భూరసాసం
రంగేవరానన్న నరావగేరం
దేవం భీయా నద్రన యాభి వందే

ఈ శ్లోకం ప్రతిపాదం ముందనుండి చదివినా వెనుకనుండి చదివినా
ఒకటిగానే ఉంటుంది
కాదు............  ఉంది మీరు గమనించి చూడండి.
(రావణుని విజృంభణాన్ని మించి కావయముడైనవాడు, సంసార సంపదా సక్తుడు కానివాడు, మిక్కిలి సమీపాన కావేరీ నదీ జలాలు ప్రవహిస్తున్న ప్రదేశాన నివాసమున్నవాడు అయిన శ్రీరంగనాథుని భయభక్తులతో మంచి వాక్కులతో స్తుతించి నమస్కరిస్తాను.)

ప్రతి పాదంలో 11 అక్షరాలు ఉన్నాయి.
మొదటి 5 అక్షరాలను 6 అక్షరం వదలి 7వ అక్షరం నుండి త్రిప్పిరాసిన
పాదభ్రమకం అయినది. అంటే  1,2,3,4,5,6,5,4,3,2,1 ఈ అంకెల్లా కూర్చితే
పాదభ్రమకం అవుతుంది.
పై శ్లోకాన్ని గమనించి చూడండి.

పాదభ్రమకం అక్షరాల నడకలో చిత్రం
కావున దీనికి గతిచిత్రం అని పేరు.

Thursday, April 28, 2016

తస్క రాగ్రేసరా !


 తస్క రాగ్రేసరా !


సాహితీమిత్రులారా!
చిత్రకవిత్వంలో శబ్దచిత్రం ఒక భాగం అందులో  అనేక అంశాలు ఉన్నాయి
వాటిలో కొన్నిటిని ఇంతకు ముందు తెలుసుకొని ఉన్నాము.
ఇపుడు గుణిత చిత్రం గురించి కొంత తెలుసుకుందాము.
ఒక పద్యంలో ఒక హల్లుకు తలకట్టు మొదలు ఔత్వం వరకు లేదా
విసర్గవరకు కూర్చడం. ఉదాహరణకు రాధికా సాంత్వనము లోని ఈ పద్యం చూద్దాం.
ఇది ఒకరకమైన గుణితచిత్ర పద్యం

రుణీ మన్మథ తామసాంత తిమిరోద్య చ్ఛాయ తీర్థాంఘ్రి పు
ష్కర మా తూర్ణగవైనతేయ హయ తేజస్సూర్యతైక్ష్ణ్యోజ్జ్వల
ధ్వర చక్రాయుధ తోయజాత నయనా తౌషార శుభ్ర ప్రభా
కర కీర్తి ప్రద తంద్రికేతర చిరాఖ్యా స్క రాగ్రేసరా  (2-145)

ఇందులో "త" - గుణితం కూర్చబడినది. రంగులో ఇవ్వబడిన అక్షరాలను
చూస్తే తెలుస్తుంది. కాని ఇందులో "త, తా, తి, తీ, తూ, తే, తై, తో, తౌ, తం, త: "- లు మాత్రమే
కూర్చబడ్డాయి "ఎ,ఒ"-లు సంస్కృతంలో ఉండవు కావున వాటిని కూర్చరు.
మరోరకం గుణిత పద్యాన్ని తరవాత చూద్దాం.

హా కురంగ నయనే! చంద్రాననే! జానకీ!


హా కురంగ నయనే! చంద్రాననే! జానకీ!


సాహితీమిత్రులారా!
కావ్యాలంకారం సంగ్రహం వివరణములో ఉదాహృతమైన స్మరణాలంకార ఉదాహరణ.
ఇది సంవాద చిత్రంలో ఉంది గమనించండి.

సౌమిత్రే !నను సేవ్యతాం తరుతలం చండంశు రుజ్జృంభతే
చండంశో ర్నిశి కా కథా? రఘుపతే! చంద్రో2యమున్మీలతి
వత్సైత ద్విదితం కథంనుభవతా? ధత్తే కురంగం యత:
క్వాసి ప్రేయసి! హా కురంగ నయనే! చంద్రాననే! జానకీ!


శ్రీరాముడు- లక్ష్మణా! ఎండ కాయుచున్నది చెట్టునీడకు పద
లక్ష్మణుడు- శ్రీరామా రాత్రి సూర్యు డెక్కడ? 
                  చంద్రుడు వెన్నెల కాయుచున్నాడు.
రాముడు- నీకు చంద్రుడని ఎట్లు తెలిసింది?
లక్ష్మణుడు- అందు కురంగమున్నది.
రాముడు- హా! కురంగనయనా! సీతా! ఎటనుంటివి.
అని సీతాస్మరణము కలిగినది.

Wednesday, April 27, 2016

భ్రష్టుడైనవాడు మరేం చేస్తాడు?


భ్రష్టుడైనవాడు మరేం చేస్తాడు?


సాహితీమిత్రులారా!
భోజ కాళిదాసుల కథలు అనేకం ఉన్నాయి.
వాటిలో ఇదొకటి. ఇది సంవాద చిత్రం
చూడండి.
ఏ కారణం వల్లో ఒకప్పుడు భోజరాజు కాళిదాసును "భ్రష్టుడా!" అని తిట్టి రాజ్య
బహిష్కృతుణ్ణి చేశాడట. కాని త్వరోలోనే పశ్చాత్తాపం చెంది మారువేషంలో
కాళిదాసును వెదుక్కుంటూ బయలుదేరాడు. ఒక సత్రం ముందు నీళ్లుకారుతున్న
మాంసాన్ని చంకన పెట్టుకొని ఒక సన్యాసి ఆయనకు కనబడ్డాడు.
అప్పుడు వారిమధ్య జరిగిన సంభాషణ శ్లోకం ఇది.

"భిక్షో!  మాంస నిషేణం కి ముచితం ?"   "కిం తేవ మద్యం వివా?
"మద్యం చాపి తవ ప్రియం?    "ప్రియ మహో వారాంగనాభి స్సహ"
"వారస్త్రీ రతయో కుత స్తవ ధనం ?"   "ద్యూతేన చౌర్యేణ వా"
"చౌర్య ద్యూత పరిశ్రమో2పి భవతాం?"  "భ్రష్టస్య కా వా గతి:"

పై శ్లోకం సంభాషణ ఈవిధంగా సాగింది(తెలుగులో)

భోజ.- నువ్వు చూడబోతే పరివ్రాజకుడివి. మాంసాహారం నీకు తగునా?
సన్న్యాసి- పక్కన మద్యం కూడా ఉంటేనే దీని మజా!
భోజ. - ఏమిటి మద్యపానం అలవాటు కూడా ఉందా నీకు?
సన్న్యాసి - ఒంటరిగా మద్యం తాగడంలో హుషారేముంది వారాంగనలతో కలిసి తాగాలి!
భోజ. - వారాంగనల దగ్గరకి వెళ్ళడానికి డబ్బెక్కడిది నీకు?
సన్న్యాసి- జూదం ఆడి కాని, కన్నం వేసి కాని సంపాదిస్తాను..
భోజ.- చౌర్యానికీ జూదానికీ కూడా దిగజారా వన్నమాట?
సన్న్యాసి - భ్రష్టుడైనవాడు మరేం చేస్తాడు?

ఉపమా సాప్రతి భాత్యనేకరూపా


ఉపమా సాప్రతి భాత్యనేకరూపా


సాహితీమిత్రులారా!

సాహితీలోకంలో ఉపమాలంకారం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
దీని వైశిష్ట్యాన్ని తెలిపే శ్లోకం ఇది ఆస్వాదించండి.

విదుషాంప్రమదాయ సోపసర్గా
గరుదాంకస్యముదే గతోపసర్గా
అపకారవతీ ప్రియాయ శంభో:
ఉపమా సాప్రతి భాత్యనేకరూపా

అలంకారాల్లో ఉపమాలంకారాన్ని మించినది మరొకటి లేదు. ఎందుకంటారా !................
"ఉప" సర్గతో కూడి ఉన్నది ఉన్నట్లు ఉంటే, విద్వాంసులకు ఆహ్లాదం కలిగిస్తుంది.
(కవులకు ఉపమా ఎంతో ఇష్టంకదా!)
ఉపసర్గ లేకుండా అయితే (మా - లక్ష్మిదేవి) సాక్షాత్తు విష్ణువునే అలరిస్తుంది.
ఇక మధ్యలోని "ప"కారం లేకపోతే (ఉమా - పార్వతీదేవి)
పరమశివునే పరవశింప చేస్తుంది.
ఈ విధంగా ఉపమ అనేక రూపాల్లో (శబ్దపరమైన రూపాల్లో)
ప్రకాశిస్తూ ఎందరో ప్రముఖుల్ని రంజింప చేస్తున్నది.

Tuesday, April 26, 2016

కోద్భవ కోద్భవ భవ భవ


కోద్భవ కోద్భవ భవ భవ


సాహితీమిత్రులారా !

శ్రీ భూతపురి సుబ్రమణ్యశర్మ గారు తన శ్రీకృష్ణభారతము(శ్రీకృష్ణరాయప్రబంధము)
8-429లో ఈ పద్యాన్ని రచించారు. ఈ పద్యం చిత్రకవిత్వంలో గూఢచిత్రానికి సంబంధించినది.

కోద్భవ కోద్భవ భవభవ
కోద్భవ కోద్భవ భవభవ కోద్భవ భవస
త్కోద్భవ కోద్భవ నుత ది
వ్యాద్భుత పరిపూత చరి యబ్దిగభీరా!

ఇది అలంకారాలలో యమకానికి చెందినది.
ఇందులో మొత్తం కోద్భవ అనే పదం 7 మార్లు అవృత్తమైంది.
1.కోద్భవ - నీటినుండి పుట్టినవాడు చంద్రుడు.
2.కోద్భవ భవభవ - నీటినుండి పుట్టినది కమలము, కమలమునుండి పుట్టినవాడు బ్రహ్మ, బ్రహ్మనుండి పుట్టినవాడు శివుడు.
3. కోద్భవ - నీటినుండి పుట్టినవాడు అగ్ని.
4. కోద్భవ భవభవ - కమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ. బ్రహ్మనుండి పుట్టినవాడు నారదుడు.
5. కోద్భవ భవ - కమలమునుండి పుట్టినవాడు బ్రహ్మ
6. సత్కోద్భవుఁడు - సత్యస్వరూపుడైన సూర్యునినుండి పుట్టినవాడు సుగ్రీవుడు
7. కోద్భవ - అగ్నినుండి పుట్టినవాడు కుమారస్వామి

చంద్రునిచేతను, రుద్రునిచేతను, అగ్నిచేతను, బ్రహ్మచేతను, సుగ్రీవునిచేతను,
కుమారస్వామిచేతను స్తుతి పొందిన అద్భుతచరిత్రగలవాడా శ్రీరామచంద్రా - అని అర్థం.

కానలు కావు, శైలములు కావు, పయోధులు కావు భారముల్


కానలు కావు, శైలములు కావు, పయోధులు కావు భారముల్


సాహితీమిత్రులారా!
శ్రీనాథుడు చెప్పిన "భూమికి బరువైనది అడవులుకావు, కొండలుకావు, సముద్రాలు కావు"
అనే ఈ పద్యం చూడండి.

దానకలాకలాపసముదంచిత సారవివేక సంపదన్
మానిత యాచమాన జనమానస వృత్యభిపూర్తిబుద్ధి యె
వ్వానికిలే దొకింతయును వాడొకరుండె భరంబు ధాత్రికిన్
కానలు కావు, శైలములు కావు, పయోధులు కావు భారముల్

ఇదే పద్యాన్ని మరోవిధంగా సమస్యాపూరణలో ఆచంట సత్యవతమ్మ గారు
1931 సెప్టెంబరు గృహలక్ష్మి పత్రికలో పూర్తిచేశారు ఈ విధంగా.....

కానగ దేశసేవకుఁడు మాన్యము, త్యాగము మాతృదేవతా
జ్ఢానభి మానభక్తి సువిధాన, వివేక, మమానుషక్రియల్
మానవ మాన్య గాంధి ఘన మాన్యుడు గాకితరుండు చేయఁగా
కానలు కావు, శైలములు కావు, పయోధులుకావు భారముల్

Monday, April 25, 2016

పద్యానుకరణ


పద్యానుకరణ


సాహితీమిత్రులారా!
ఒక పద్యాన్ని విన్నపుడు అలాంటిది అంతకుమునుపు రాసిన  లేదా
విన్న పద్యం గుర్తుకు రావడం సహజం అలా గుర్తుకు వచ్చేట్లు రాస్తే దాన్నే
అనుకరణ అనవచ్చు. అలాంటిది ఒకదాన్ని ఇక్కడ చూద్దాం -.

తల్లిదండ్రులఁబ్రోచు తనయుండు తనయుండు
        తగు రాజుచే పడ్డ ధరణి ధరణి
అభిమానవతియైన యంగన యంగన
        యక్కఱ కొదవిన యర్థ మర్థ
మొరుకాంతఁగోరని పురుషుండు పురుషుండు
        వేఁడని యాతని విద్య విద్య
సంగరాంగణమునఁజచ్చుట చచ్చు టు
       పవసించి సల్పెడు వ్రతము వ్రతము
ఎదురు తన్నెఱిఁగిన యట్టి యెఱుక యెఱుక
ప్రజలు మెచ్చఁగఁజెప్పెడి పాటి పాటి
పగయె లేకుండ బ్రతికిన బ్రతుకు బ్రతుకు
మనుజ మందార సింగన మంత్రి మాచ

ఈ పద్యం వింటూనే చటుక్కున గుర్తుకు వచ్చే పద్యం
పోతన భాగవతంలోని ఈ పద్యం చూడండి.

కమలాక్షు నర్చించు కరములు కరములు
       శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు
        శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
         మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు పలగొను పదములు పదములు
        పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరి జేరు మనియెడి తండ్రి తండ్రి

ఈ పద్యాలలో లాటానుప్రాస గమనింపగలరు
ఆవృత్తమైన రెండుపదాలు అర్థభేదంలేకుండా
తాత్పర్యభేదం వుంటే దాన్నిలాటానుప్రాసం అంటారు.

       

శిరము లేదు గాని, నరుల బట్టుక మ్రింగు

శిరము లేదు గాని, నరుల బట్టుక మ్రింగు


సాహితీమిత్రులారా!

పొడుపుకతలు మామూలు మాటల్లో వింటూ ఉంటాం
కానీ పద్యాల్లో పొడుపుకతలు ఇక్కడ చూడండి.

కరయుగంబు గలదు, చరణంబులా లేవు                  
కడుపు, వీపు, నడుము, మెడయు గలవు
శిరము లేదుగాని, నరుల బట్టుక మ్రింగి
సొగసు గూర్చు, దీని సొగసుగనుడి

దీని సమాధానం - చొక్కా
ఈ చొక్కాకు రెండు చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు.
పొట్ట, వీపు, నడుము, మెడ అన్నీ ఉన్నాయి గాని తల లేదు.
అయితేనేమి ఆ చొక్కా మనుష్యుల శరీరమంతా కప్పి(మ్రింగి)
శోభను కలిగిస్తుంది. చూడండి.

Sunday, April 24, 2016

ఒక్క పురము పేరొప్పునై దక్కరముల


ఒక్క పురము పేరొప్పునై దక్కరముల


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చదివి అయిదక్షరాల ఆ పురము పేరేదో కనుక్కోండి?

ఒక్క పురము పేరొప్పునై దక్కరములమొదటి మూడు వత్సరమునకు బేరుచివరి రెండును వీధికి జెల్లు, వేణియగు ద్వితీయాంతముల, జెప్పుడా పురమ్ము

దీని సమాధానం - విజయవాడ
దీనిలో 5 అక్షరాలు ఉన్నాయి.
మొదటి మూడక్షరములు సంత్సరానికి పేరు. విజయ
- ఇది తెలుగు సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, 
ప్రజోత్పత్తి........ మొదలైన 60 పేర్లలో ఒక పేరు. 
చివరి రెండక్షరాలు - వాడ. అంటే వీధి, 
2వ మరియు చివరి అంటే 5వ అక్షరాలు కలిపితే జడ. 
అంటే వేణి అని అర్థం. 
కావున విజయవాడ అనే సమాధానం సరిపోయింది.

అంతలోననే అగును గజాననుండు


అంతలోననే అగును గజాననుండు


సాహితీమిత్రులారా!
ఇది ఒక ప్రహేలిక లేక పొడుపుకథ ఇందులోని విషయాన్నంతా చదివి
ఆలోచించి సమాధానం చెప్పాలి దీనికే విచ్చుడుకత అని అంటారు.
చూడండి మరి.....

నగతనయన్ అరన్ సిరిని నాలుగు వర్ణములన్ లిఖించి, పొందుగ నొక యక్షరంబు తుద దూకొని నిల్పిన యంతలోననేయగును, గజాననుండు, మరియందొక యొక్కొక్క యక్షరంబు, డించగను, చతుర్ముఖుండు, శరజన్ముడు, పంచశరుండు వహ్నియున్

దీని సమాధానం - "ఉమాకుమార"
నగతనయన్ - పర్వతరాజ పుత్రిక అయిన ఉమ(పార్వతి), 
ధరన్ - భూమి అర్థాన్నిచ్చే కు ను, 
సిరిని - లక్ష్మిని తెలిపే మా ను, 
ఈనాలుగు వర్ణాలను వరుసగా రాసి, 
చివర మరొక అక్షరాన్ని, దూకొని - అంగీకరించి, 
చేర్చినంతలో 
ఉమాకుమార అవుతుంది - 
దీన్నుండి గజాననుండు - వినాయకుడు వస్తాడు.
మరలా వరుసగా ఒక్కొక అక్షరాన్ని, 
డించగ -  తగ్గిచగా ఉమాకుమార లో "" తొలగిస్తే - మాకుమార - 
అంటే లక్ష్మీకుమారుడు - చతుర్ముఖుడు - బ్రహ్మ, 
అలాగే మాకుమార నుండి "మా" తొలగిస్తే కుమార - అంటే శరజన్ముడు - కుమారస్వామి, 
అలాగే కుమారలో "కు" తొలగిస్తే
మిగిలింది "మార" అంటే పంచశరుడు(మన్మథుడు), 
దీనినుండి "మా" తొలగించిన మిగిలేది "ర". 
ర అంటే వహ్ని (అగ్ని) వరుసగా వస్తాయి.
 
దీనికి ప్రహేలిక అనే కాకుండా దీన్ని "చ్యుతచిత్రం"గా కూడా చెప్పవచ్చు.

Saturday, April 23, 2016

నక్షత్రముఁబట్టి యీడ్చి నగియెఁ బ్రియమునన్


నక్షత్రముఁబట్టి యీడ్చి నగియెఁ బ్రియమునన్


సాహితీమిత్రులారా!
ఈ పద్యంలోని గూఢార్థం ఏమిటో గమనించండి.

నక్షత్రము పేరిటి సతి
నక్షత్ర సుఖంబుఁగోరి నక్షత్రేశున్
నక్శత్రమునకు రమ్మని
నక్షత్రముఁబట్టి యీడ్చి నగియెఁ బ్రియమునన్


దీనికి 1947 అక్టోబరు నెల భారతిలో శ్రీ గొబ్బూరు వేంకటానందరావుగారు చేసిన వ్యాఖ్య ఇది.
నక్షత్రము పేరుగల సతి - ఉత్తర
నక్షత్రము చేతబట్టి - కుంకుమబరిణిని(భరణి నక్షత్రం) చేతపట్టి,
నక్షత్రమపైన వేసినది అనగా చేతిని(హస్త నక్షత్రం) తన ప్రాణనాథుడైన అభిమన్యునిపై వేసి,
నక్షత్రమును రమ్మని - మూల(నక్షత్రం)కు రమ్మని, పిలిచినది.

అంటే యుద్ధసన్నద్ధుడవుతూ ఉన్న అభిమన్యుని ఉత్తర మూలకు రమ్మని పిలిచినదని భావం 

దీన్నే 1948 మార్చినెల భారతి సంచికలో తిమ్మావజ్ఝల కోదండరామయ్యగారు ఈ విధంగా వ్యాఖ్యానించారు.

దీనిలో కవి తారాశశాంకుల తొలినాటి ప్రణయలీలను హృద్యాతి హృద్యంగా అభివర్ణించారు.
నక్షత్రము - తార
నక్షత్రసుఖము - ఆశ్లేషము (కౌగిలింత) సుఖం,కోరి
నక్షత్రేశున్ - చంద్రుని,
నక్షత్రమునకు రమ్మని - మూలకు రమ్మని,
నక్షత్రముఁబట్టి యీడ్చినది - (హస్త నక్షత్రం) చేయి పట్టి లాగినది.

ఈ విధంగా సాగింది ఈ వ్యాఖ్య. చూశారా గూఢఅర్థం ఎంత గూఢంగా ఉందో.


కవి కప్పి చెబితే విమర్శకుడు విప్పి చెబుతాడట.

Friday, April 22, 2016

నడవకయె నడచి వచ్చితి


నడవకయె నడచి వచ్చితి

సాహితీమిత్రులారా!
 ఒక కవిగారు ఒక రాజు వద్దకు వెళ్ళి తన దీనగాధను ఈ పద్యంలో విన్నించుకున్నాడు. ఆ పద్యం .........

నడవకయె నడచి వచ్చితినడచిన నే నడచిరాను నడచెడు నటులన్నడపింప నడవ నేరను నడవడికలు చూచి నన్ను నడిపింపరయా


నడవలేక నడచి వచ్చుట ఏమిటి? నడిస్తే కారపోవడం ఏమిటి?
ఇదంతా నడకమీదనే పద్యం సాగింది. ఇంతకు దీని భావం ఏమిటి అంటే...........
సంసారం నడవక (గడవక) యింత దూరము వచ్చాను.
నాస్థతి గమనించి, తగు సహాయము చేసి పంపండి - అని భావం

Thursday, April 21, 2016

రాధేయుఁడు నందినెక్కి రావణుగెలిచెన్


రాధేయుఁడు నందినెక్కి రావణుగెలిచెన్


సాహితీమిత్రులారా!

"రాధేయుఁడు నందినెక్కి రావణుగెలిచెన్" - అనే సమస్యను
ఒక కవి ఎంత చమత్కారంగా క్రమాలంకారంలో
ప్రహేలికా పద్ధతిలో పూరించాడో చూడండి.

యోధెవ్వఁడు కురుబలముకు
మాధవ సఖుఁడేమి యెక్కిమఱి తిరుగాడున్
సాధించె రాముఁడెవ్వని
రాధేయుఁడు నందినెక్కి రావణుగెలిచెన్


దీన్ని ఇలాగే చదివితే అర్ఱం బోధపడటం కష్టమే.
రాధేయుఁడు నందినెక్కి రావణుగెలిచెన్ - ను
రాధేయుఁడు, నందినెక్కి, రావణుగెలిచెన్ అని మూడు భాగాలుగా తీసుకొని
ప్రశ్నప్రకారం సమాధానంగా తీసుకోవాలి

కురుబలముకు యోధెవ్వఁడు - రాధేయుడు(కర్ణుడు)
మాధవ సఖుఁడేమి యెక్కిమఱి తిరుగాడున్ -
(శివుడు ఏమి ఎక్కి తిరుగును) - నంది
రాముఁడెవ్వని సాధించె (రాముడు ఎవరిని గెలిచాడు)
 - రావణు గెలిచెన్

వటవృక్షో వహా నత్ర....


వటవృక్షో వహా నత్ర.......


సాహితీమిత్రులారా!
ఈ శ్లోకం చూడండి

వటవృక్షో మహా నత్ర మార్గ మావృత్య తిష్టతి
తావ త్త్వయా న గస్తవ్యం యావత్ నా న్యత్ర గచ్ఛతి


త్రోవకు అడ్డంగా ఇక్కడ మర్రి చెట్టొకటి ఉన్నది.
అది మరొక చోటుకు తొలగిపోయేంతవరకు,
నీవు అచ్చటికి వెళ్ళవద్దు - అని నిషేధం
ఇక్కడ నిషేధం ఎవరికి విధించినట్లు? ఎవరిని సంబోధించినట్లు?
చెట్టు కదలి మరోచోటికి కదలి ఎలా వెళుతుందు?
అందువలన ఇక్కడ సంబోధనను వెదకితే.........
 వటవృక్ష: ను "వటో + ఋక్ష:" - గా విడదీస్తే అర్థం సరిగా సరిపోతుంది.
వటో - ఓ బ్రహ్మచారీ! లేక ఓ అబ్బాయీ! ఋక్ష: - ఎలుగుబంటు,
త్రోవకు అడ్డంగా నిలిచి ఉంది. అది తొలగి పోయేవరకు,
అటువైపు వెళ్ళకు - అనేఅర్థం సరిపోతుంది.
ఇందులో సంబోధన దాచబడింది .
కావున ఇది సంబోధన గూఢంగా చెప్పబడుతుంది.

Wednesday, April 20, 2016

సరిగమల - పద్యం


సరిగమల - పద్యం


సాహితీమిత్రులారా!

ఒకమారు పీఠాపురం రాజావారి దివాణంలో ప్రభు సమక్షంలో
తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారి వీణకచ్చేరి జరిగింది. వచ్చిన శ్రోతల్లో
పానుగంటివారు ఒకరట. వీణాగానం తర్వాత సంగమేశ్వర శాస్త్రిగారిని
అభినందస్తున్న మహారాజును ప్రశంసిస్తూ పానుగంటివారు చెప్పిన పద్యం ఇది.


స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు నాశ్రితు నెవ్వాని నాదరింతు
వాదాయమున నెంత యర్థుల కిచ్చెద వెదెటు చేసిన భృత్యు నెదగణింతు
నవని పాలన నేది యార్జించినాఁడవు కవితగానంబు నేపగిది విందు
వెట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటి వాత్మ సంస్తుతుల కేమందు వయ్య
సరిగ, ధని, సగమ పనిని సరిగ, గరిమ
మరిమరిగ, పాపనినిగని, సరిసర్ యను
వీణకాని "మా" వెన్క "నీ" వీణ వరుస
మీఁద "నీ" వెన్క "మా" సూర్యమేదినీశ

సీసపద్యంలోని ఎనిమిది ప్రశ్నలకు ఎత్తుగీతిలో వీణా స్వరవిన్యాసంతో జవాబులిచ్చారు.
1.ప్ర- స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు - సరిగ
2.ప్ర- నాశ్రితునెవ్వాని నాచరింతువు - ధని
3.ప్ర- ఆదాయమున నెంత యర్థుల కిచ్చెదవు - సగమ
4.ప్ర- ఎదెటు చేసిన భృత్యు నెదగణింతువా - పనిని సరిగ
5.ప్ర- అవని పాలన నేది యార్జించినాఁడవు - గరిమ
6.ప్ర- కవితగానంబు నేపగిది విందువు - మరిమరిగ
7.ప్ర- ఎట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటివి - పాపనినిగని
8.ప్ర- ఆత్మ సంస్తుతులకేమందు వయ్య - సరిసరి

అని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 

ఇంకా చమత్కార మేమంటే "ఓ మహారాజా! ఈ వీణ వరుసమీద ఆరోహణావరోహణ క్రమంలో "మా వెన్కనీ" అంటున్నది. కాని "నీ వెన్క"  "మా" అన్నది ఉంటుంది. "మా" అంటే లక్ష్మి. నీ వెనుక లక్ష్మిగాని, లక్ష్మి వెనుక నీవు ఉండవు అని భావం.

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!

ఇది శ్రీనాథుని భీమఖండము ద్వితీయ ఆశ్వాసంలోనిది.
వ్యాసుడు కాశీనుండి బహిష్కరింపబడి ద్రాక్షారామానికి వచ్చే మార్గమధ్యంలో
అగస్త్యుడు వ్యాసుని కాశీని ఎందుకు వదలివచ్చావు? ఎవరేమైనా అన్నారా?
అని అడిగే పద్యం ఇది.

లోలార్కునకు నీకు లోలోననేమేనిఁ

     బోటు పుట్టదుగదా! మాటమాట

వెనకయ్య శ్రీడుంఠివిఘ్నేశ్వరస్వామి 

     ధిక్కరింపఁడుగదా! తెగువనిన్ను

నాఁకొన్న నిన్ను మధ్యాహ్నకాలంబున 

     నరయకుండదుగదా!యన్నపూర్ణ

నెపమేమియును లేక నీయెడాటమ్మునఁ 

     బాడిదప్పడుగదా! భైరవుండు

ఎట్టు పాసితి మిన్నేటి యిసుకతిప్ప

లెట్టు పాసితి వాస్థలంబేనుకోసు

లెట్టు పాసితి వవిముక్త హట్టభూమి

యెట్టు పాసితి విశ్వేశునిందుధరుని


పై పద్యానికి పేరడీగా ఇలపావులూరి సుబ్బారావుగారు 
నవ్వులు-నవ్వులు (పుట.46)లో వ్రాసిన పద్యం.

పంచాయతీబోర్డుప్రెసిడెంటుతో నీకు 

      పోటుపుట్టదుగదా!మాటమాట

మండలాద్యక్షుని మనసు నొచ్చెడునట్టు 

      నడుచుకోలేదుగా! నయమువీడి 

పరిషత్తు సభ్యుని భజన చేయకనీవు 

      బడి పెట్టలేదుగా! ప్రతిదినంబు

విద్యాకమిటిమాట వినకుండ నేవేని 

      పనులొనర్పవుకదా! ఘనతకొరకు

బదలి నీకెందుకీరీతి వచ్చె చెపుమ

అనుచు బ్రశ్నించు మిత్రుని కనియెనొజ్జ

ప్రథమ మహిళను తల్లిగా పలుకరింప

ఆగ్రహించుచు నన్ను నీయడవికంపె


Tuesday, April 19, 2016

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!
ఒక పాటనుగాని, పద్యంగాని, శ్లోకాన్నిగాని అనుకరిస్తూ
అదేవిధంగా రాస్తే అది  అనుకరణ అని
వ్యంగ్యంగా అనుకరిస్తే పేరడీ అని  చెప్పబడుతూంది.

ఈ పద్యం కాసుల పురుషోత్తమకవి ఆంధ్రనాయక శతకంలోనిది
ఇది ఆంధ్రమహావిష్ణువును గూర్చి రాసినది.

ఆలు నిర్వాహకురాలు భూదేవియై యఖిలభారకుఁడను నాఖ్యఁదెచ్చెనిష్టసంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుఁడన్న ఘనతఁ దెచ్చెగమలగర్భఁడు సృష్టకర్తతనూజుఁడై బహుకుటుంబికుఁడన్న బలిమిఁ దెచ్చెగలుష విధ్వంసిని గంగ కుమారియై పతితపావనుఁడన్న ప్రతిభఁ దెచ్చె
నాండ్రు బిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిగానిమొదట నుండియు నీవు దామోదరుఁడవెచిత్రచిత్రప్రభావ, దాక్షిణ్యభావ,హతవిమతజీవ, శ్రీకాకుళాంధ్రదేవ.


దీనికి ఇలపావులూరి సుబ్బారావుగారు వైద్యవిద్యకు అన్వయించి పేరడీ రాశారు
నవ్వులు-నవ్వులు(పుట.41)లో చూడండి.

చెవుల స్టెతస్కోపు చెప్పి గుండియ బీటు హార్టు స్పెషలిష్టనునాఖ్యదెచ్చె
జ్వరమాని దేహాన వరలు నుశ్ణతఁదెల్పి ఫీవర్ల వైద్యుడన్ పేరుదెచ్చె
బీపీని తెలియ జెప్పెడి సాధనము నీకు రక్తపోటెఱిగెడి శక్తినిచ్చె
ఎక్సురే విరిగిన యెముకలు చూపింప బోన్సు స్పషలిష్టుగా పొగడబడితి
వంతె యిసుమంత యెఱుగవు సుంతయేని
అన్యులెవరును చదువంగ నలవికాని
లిపిని దివ్వౌషధముల పేర్లెల్ల వ్రాసి
వ్యాధి కుదిరింతు వయ్యయో వైద్యవిద్య

మార్జాల దాంపత్యం


మార్జాల దాంపత్యం


సాహితీమిత్రులారా!
మనం గమనిస్తూనే ఉంటాం రకరకాల వ్యక్తులను, రకరకాల భార్యాభర్తలను.
వారిలో ప్రతిదానికీ కీచులాడుకొనేవారూ కనబడుతూ ఉంటారు.
వారి దాంపత్యాన్ని మార్జలదాంపత్యం అంటూ ఉంటారు.
అలాంటి ఒక దంపతుల సంభాషణ
ఈ శ్లోకంలో కవి చూపాడు చూడండి.

ఆ: పాకం నకరోషి పాపిని కథం? పాపీ త్వదీయ: పితా!
రండే జల్పసి కిం ముధా కలహిని? రండా త్వదీయ స్వసా!
నిర్గచ్ఛస్వ హటాన్మదీయ భవనాత్! నైదం త్వదీయం గృహం!
హా! విశ్వేశ్వర దేహిమేద్య మరణం! శప్పం మదీయం గతమ్!భర్త - పాపాత్మురాలా! వంట చెయ్యలేదా?
భార్య - నీ తండ్రి పాపాత్ముడు!
భ.- రండా! ఏమి ప్రేలుచున్నావు?
భా.- నీ చెల్లెలు రండ.
భ. - నా యింటినుండి వెంటనే పొమ్ము!
భా. - ఇది నీ యిల్లు కాదు!
భ. - హా పరమేశ్వరా నాకు మరణము నిమ్ము!
భా.- నా వెంట్రుక పోయినదనుకొందును.Monday, April 18, 2016

రాజ దీని వివాహము చేయవయ్యా!


రాజ దీని వివాహము చేయవయ్యా!


సాహితీమిత్రులారా!
నామగోపన చిత్రం నిన్నటిరోజు తెలుసుకున్నాము.
దీన్ని ఇంగ్లీషులో "Acrostics" అనికూడా అంటారని తెలుసుకున్నాము.
ఈరోజు మరో ఉదాహరణ చూద్దాం.
ఇది కొరవి గోపరాజు రచించిన "సింహాసన ద్వాత్రింశిక" (7-75)లోనిది.
ఒక వ్యక్తి రాజు దగ్గరకు వచ్చి పక్కవారికి తెలియకుండా
తనకు కావలసింది రాజుకు చెప్పుకున్నాడు.
రాజు దాన్ని తెలుసుకున్నాడు.

రాజ్యంబు వదలక రసికత్వమెడలక
యశీల ముడుగక నయము చెడక
దీనులఁ జంపక దేశంబు నొంపక
నిజ ముజ్జగింపక నేర్పు గలిగి
విప్రులఁ జుట్టాల వెన్నుసొచ్చినయట్టి
వారిని గొల్చినవారిఁ బ్రజల
ర్షంబుతోఁగాచి యన్యాయ ముడుపుచు
మున్ను జెప్పిన రీతిఁ జెన్నుమీఱి
చేత లొండులేక ప్రాఁతల విడువక
శము కలిమి దమకు వశము గాఁగ
సుధ యేలు రాజవర్గంబులోన న
య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను.


ఇది సీసపద్యం ఇందులో పాదాన్ని రెండు వరుసలలో రాయుదురు. ఆ ప్రకారంగా సీసపద్యం 8 వరుసలు , ఆటవెలది 4 పాదాలు మొత్తం 12 అక్షరాలు, పాదం మొదటి అక్షరాలను తీసుకంటే "రాజ దీని వివాహము చేయవయ్యా !"- అని వస్తుంది. 

కొంగ-హంసల సంభాషణ


కొంగ-హంసల సంభాషణ


సాహితీమిత్రులారా!
హంసలాంటిపండితుడు, కొంగలాంటి పామరుడు వారి తారతమ్యం కవి ఈ కొంగ హంసల సంభాషణలో చిత్రించాడు.

కొంగ - ఎవ్వడ వీవు కాళ్ళు మొగమెఱ్ఱన?హంస - హంసమకొ.- ఎందునుందువో?హ.- దవ్వుల మానసంబుననుకొ.- దాన విశేషములేమి చెప్పుమా?హ.- మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందుకొ.- నత్తలో?హ.- అవ్వి యెఱుంగమన్న నహహ........ యని నవ్వె బకంబులన్నియున్

Sunday, April 17, 2016

కాళిదాసు - భోజరాజు (సంవాదచిత్రం)


కాళిదాసు - భోజరాజు (సంవాదచిత్రం)


సాహితీమిత్రులారా!
కాళిదాసు చేపలు తింటున్నట్లు భోజరాజుతో కవులు చెప్పినారు.
ఒకరోజు అంగవస్త్రంలో చేపలు చుట్టుకొని కాళిదాసు వెళుతున్నాడు
అది గమనించిన కవులు కాళిదాసును భోజమహారాజు రమ్మన్నారని చెప్పి
కాళిదాసుని పట్టుకొని రాజు దగ్గరకు వెళ్ళారు.

కక్షే కిం తవ?  పుస్తకం! కి ముదకం? కావ్యార్థసారోదకమ్!
గంధంకిం? ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవమ్!
పుచ్ఛ:కిం? ఘన తాళపత్ర లిఖితం! కిం పుస్తకం హే కవే ?
రాజన్!  భూసుర దేవతైశ్చ పఠితం రామాయణం పుస్తకమ్!

భోజరాజు - కక్షే కిం తవ? (నీ చంకన ఉన్నది ఏమిటి?)
కాళిదాసు - పుస్తకం! (పుస్తకము!) 
భో - కి ముదకం? (ఉదకమేమి?)
కా.- కావ్యార్థసారోదకమ్! (కావ్యార్థసారము!)
భో.- గంధంకిం? (వాసనేమిటి?)
కా.- ఘన రామ రావణ మహాసంగ్రామ రంగోద్భవమ్! 
       (రామరావణ యుద్ధంలో ఏర్పడినది!)
భో.- పుచ్ఛ: కిం? (తోకయేమి?)
కా.- ఘన తాళపత్ర లిఖితం! 
        (పొడవైన తాటిఆకులపై రాసిన గ్రంథం!) 
భో.- కిం పుస్తకం హే కవే? (ఓ కవీ అది ఏ పుస్తకం?)
కా.- రాజన్! భూసుర దేవతైశ్చ పఠితం రామాయణం పుస్తకమ్! 
        (రాజా దేవబ్రాహ్మణులు పఠించే రామాయణపుస్తకం!)
అంటూ కాళిదాసు భోజుని చేతికి ఆ చేపల మూటను అందిచాడు.

(కాళిదాసు మహిమచే అది తెరచి చూడగా అది రామాయణగ్రంథమే అయింది)


మహారాజశ్రీ బ్రౌనుదొరగారికి


మహారాజశ్రీ బ్రౌనుదొరగారికి


సాహితీమిత్రులారా!
పిండిప్రోలు లక్ష్మణకవిగారు తన అల్లునిచే ఒక వ్యాజ్యము అప్పీలు చేయుటకు
చేయుప్రయత్నంలో జడ్జిగా ఉన్న బ్రౌనుదొరగారిని కలిసినపుడు చెప్పిన పద్యం ఇది.

ధువైరికిన్ వనమాలికిఁగౌస్తుభ
హారునకును సంశ్రితావనునకు
రాధికాప్రియునకు రామసోదరునకు
గదీశునకు దయాసాగరునకు
శ్రీనాథునకును రక్షితదేవసమితికిఁ
బ్రౌఢభావునకు నారాయణునకు
నురగేంద్రతల్పున కరిశంఖధరునకుఁ
దొగలరాయనిగేరు మొగము దొరకు
ణనిహతదుష్టరాక్షసరమణునకును
గానమోహితవల్లవీకాంతునకును
రిపువిదారికి హరికి శ్రీకృష్ణునకును
కిల్బిషారికి నే నమస్కృతి యొనర్తు

 ప్రతిపాదంలోని మొదటి అక్షరం తీసుకొని రాయగా 
ఈ విధంగా "మహారాజశ్రీ బ్రౌనుదొరగారికి" అని వచ్చింది. 
దీనిలో పేరుగోపనం చేశారు కావున దీన్ని నామగోపనం అంటారు. 
దీన్నే ఇంగ్లీషులో  "Acrostics" అంటారు.

Saturday, April 16, 2016

వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్


వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్


సాహితీమిత్రులారా!
వెంకటగిరి సంస్థానంలో మోచర్ల వెంకనకు ఇచ్చిన దుష్కరప్రాస సమస్య. దీన్ని వెంకనగారు క్రమాలంకాంలో ప్రహేళికా పద్ధతిలో పూరించాడు.

ఈక్త్రా ప్రాసము కష్టమౌ ననుచు మీరెంతేసి వాదాడగా
వాక్త్రా సంబది సత్కవీశ్వరుల త్రోవల్ గామి నే చెప్పెదన్
దిక్త్రారాతికి పార్వతీశ్వరులకున్ తిగ్మ ప్రభారాశికిన్
వక్త్రంబుల్ పది కన్నులైదు కరముల్ వర్ణింపగా వేయగున్

ఈ కవి పూరణ ఎంత చిత్రమో. మొదటి రెండు పాదాలు ప్రాసను గురించి విమర్శించటంతో సరిచేశాడు. మూడవ పాదం పూరణకు క్రమాలంకారంతో ప్రహేళికగా మార్చాడు.
దిక్త్రారాతి = దిక్పాలకులకు శత్రువు = రావణాసురుడు, అతనికి పది నోళ్ళు అందుకో అతనికి దశాస్యుడని పేరు. పార్వతి ఈశ్వరులకు కలిపి కన్నులు  2  + 3 = 5, 
తిగ్మప్రభారాశి అంటే సూర్యుడు ఇతనికి సహస్రకిరణుడు అని పేరు.
అంటే వేయి చేతులు గలవాడు.
మూడవ పాదంలోని వాటికి నాల్గవ పాదంలోని వాటిని కలుపుతూ వెళితే 
ఈ విధంగా ............
రావణాసురునికి(దిక్త్రారాతికి) నోళ్ళు(వక్రంబులు) - 10
పార్వతీ పరమేశ్వరులకు కలిపి కన్నులు - 5
సూర్యునికి (తిగ్మ ప్రభారాశికి) కరములు(చేతులు) - 1000


Friday, April 15, 2016

శ్రీరామ రామ రామేతి


శ్రీరామ రామ రామేతి
సాహితీమిత్రులారా!

శ్రీరామ రామ రామేతి 
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే

ఆథ్యాత్మరామాయణం - పార్వతీపరమేశ్వరసంవాదంలోనిది ఈ శ్లోకం
ఓ మనోరమా వరాననా పార్వతీ నేనెప్పుడూ  రామ -  రామ -  రామ అంటూ ఆనందిస్తాను.
ఆ రామ నామము సహస్రనామాలతో సమానము సుమా!  - అని దీని అర్థం.
రామ రామ రామ అని మూడు మార్లు అంటే అది వెయ్యి మార్లు అన్నదానితో సమానం.
అదెలాగంటే
య,ర,ల,వ - లలో ర అనేది 2వది.
అలాగే ప,ఫ,బ,భ,మ - లలో మ అనేది 5వది.
ఇప్పుడు ర అంటే 2, మ అంటే 5. రామ అంటే రా - 2 , మ - 5.
రామ - 2 x 5 = 10 , రామ రామ, రామ అంటే 10 x 10 x 10 = 1000
ఈ విధంగా రామ అనే పదాన్ని మూడు మార్లు ఉచ్ఛరిస్తే వెయ్యి మార్లు అని అర్థం.
ఇది ఇందులోని గూఢార్థం.దుర్ముఖి నామసంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు


దుర్ముఖి నామసంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలుసాహితీమిత్రులకు, శ్రేయోభిలాషుకు
దుర్ముఖి నామసంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు

Thursday, April 14, 2016

ప్రేయసి - ప్రియుల సంవాదం


ప్రేయసి - ప్రియుల సంవాదం


సాహితీమిత్రులారా!
ప్రేయసి  ప్రియుల మాటలు ఎంత సరసంగా ఉంటాయో చెప్పడానికి ఈ శ్లోకం చూస్తే తెలుస్తుంది. ఇది చాటుధరాచమత్కారసారమనే దానిలోనిది.

శ్లో. కఠిన కుచౌ తవ బాలే, చటుల చకోరాక్షి తావకే నయనే
     కుటిల సుకే శ్యలకా స్తే మిథ్యావాదిన్లతాంగి తవ మథ్యమ్


ప్రేయసి - కఠిన! (ఓ కఠినుడా!)
ప్రియుడు - కుచౌ తవ బాలే 
(ఓ బాలికాతిలకమా నీకుచములు కఠినముగాని నేనుగాదు)
ప్రేయసి - చపల! (ఓ చపలస్వభావం కలవాడా!)
ప్రి - చకోరాక్షి తావకే నయనే
(ఓ చకోరమువంటి కన్నులు గలదానా! నీకను్నలే చపలములు నేనుగాదు.)
ప్రే.- కుటిల! (వంకర నడతగలవాడా!)
ప్రి.- సుకే శ్యలకా స్తే 
(మంచి వెంట్రుకలుగలదానా! నీముంగురులే కుటిలములు నేనుగాదు)
ప్రే.- మిథ్యావాదిన్! (కల్లరీ!, మిథ్యను పలికేవాడా!)
ప్రి. - లతాంగి తవ మధ్యమ్ 
(తీగెవలె సన్ననిశరీరంగలదానా! నీ నడుమే మిథ్య(కల్ల) నేను కాదు)

దీని భావమేమి?


దీని భావమేమి?

సాహితీమిత్రులారా!

ఈ క్రింది పద్యం భావం తెలియ చెప్పండి అంటున్నాడు కవి.

కదళీ స్తంభమునందు నా యుతమై కంజాత మింపొందె, నం
దుదయంబై పవళించెఁ జంద్రుఁ, డచటన్ బ్రోత్ఫుల్లరక్తోత్పలం
బొదవెన్, తత్సుమజాతపై యమున స్వర్ణోర్వీధరంబందు దాఁ
బడి, నూఱై, గగనంబు గాంచె, నిది యేభావంబొ భావింపుఁడీ

(కదళీ స్తంభము =తొడ, నాళము = చేయి, కంజాతము =  అఱచేయి, చంద్రుడు = ముఖము, 
రక్తోత్పలము = ఎఱ్ఱబడిన కన్ను, యమున = కాటుకతో కూడిన కన్నీటిధార, 
స్వర్ణోర్వీధరము = కుచము)

వియోగిని అయిన ఒక కోమలి, తొడపై చేతిని ఆనించుకొని, ముఖము అఱచేత చేర్చుకొని, 
కన్నీరునించె అనియు, ఆ కన్నీరు, కుచకుండలములపైబడి, క్రిందికి జాలువారె అనియు, 
-దీని భావము.


Wednesday, April 13, 2016

వ్యాపారి - బేరగాడు


వ్యాపారి - బేరగాడు


సాహితీమిత్రులారా!

రాచనగరులో సంత జరిగేచోట కస్తూరి కుప్పగా పోసి కూర్చొని ఉన్నాడు వ్యాపారి.
అక్కడికి ఒక గొర్రెలకాపరి వచ్చాడు వారి మధ్య జరిగిన సంభాషణ ఈ పద్యంలో
కవి ఏవిధంగా వర్ణించాడో చూడండి. ఉత్పలమాల వృత్తంలో సంభాషణ.

గొర్రెలకాపరి - నల్లని దేంది బేరి?    వ్యాపారి - మృగనాభిరా వల్లవ
గొ.-  దీన్ని తింటారా?       వ్యా. - ఫుల్లసరోజలోచనలు పూతురు చన్నుల
గొ.- బూసినితనే జల్లున చేపునా యెగసితన్నకవూరికె
       పాలొసంగునా గుల్లకు యెంతయెత్తనుచు
గొంగడిపర్చిన నవ్విరందఱున్

దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాముకైవడిన్


దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాముకైవడిన్ 


సాహితీమిత్రులారా!
కందుకూరి రుద్రకవికి ఇచ్చిన సమస్య ఇది.
"దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాముకైవడిన్"  - అనేదానిలో ప్రాస బిందు పూర్వక "ష్ట్ర" ఇది దుష్కర ప్రాసము. దీన్ని పూరించి పండిత ప్రశంసలకు పాత్రుడైనాడు కందుకూరి రుద్రకవి.
ఇది అంతర్లాపిక ప్రహేలికగా క్రమాలంకారంలో పూరించినాడు.

రింష్ట్రహి యేమిటన్ గరచు?  ఋక్షము లెక్కడ నుండు?  అంధకున్
సంష్ట్రను జేసె నే విభు? డనంతర మందతడేమి చేసెనో?
రుం ష్ట్రఖి లాత్ముడైన లవు రూప మదే గతి నుండు? చెప్పుమా?
దంష్ట్రల,మీద,శంకరుడు,తాండవమాడెను, రాము కైవడిన్ 

రింష్ట్రహి - కరిచే స్వభావంగల పాము, సంష్ట్రనుడు - నశించే ప్రాణాలు కలవాడు, 
రుంష్ట్రఖిలాత్ముడు - రోష స్వభావుడు.

దీనిలోని మూడు పాదాలలోని  ప్రశ్నలకు నాలుగవ పాదంలో జవాబులు ఉన్నాయి అందుకే ఇది అంతర్లాపి ప్రహేలిక అవుతుంది.
1. పాము దేంతో కరుస్తుంది?   - దంష్ట్రలతో
2. చుక్కలెక్కడ ఉంటాయి?    - మీద
3. అంధకుణ్ణి చంపినదెవరు? - శంకరుడు
4, తరువాత అతడేం చేశాడు? - తాండవము ఆడాడు
5. లవుని రూపం ఎలా ఉంటుంది? - రామునిలా

Tuesday, April 12, 2016

అహల్యా - సంక్రందనులు -2


అహల్యా - సంక్రందనులు -2


సాహితీమిత్రులారా!

ఈ మారు అహల్యా సంక్రందనుల సంవాదం ఉత్పలమాలో
(సముఖము వేంకటకృష్ణప్ప నాయకుని అహల్యా సంక్రందనము 3-85)

అహల్య - దేవ శచీ మనోరమణ దేవర వచ్చిదేమి   
ఇంద్రుడు - నీదు శోభా విభవంబుఁ జూడ,
అహల్య - వనవాసిని కేమి చెల్వు
ఇంద్రుడు - రత్న మే తావున నున్న నేమి
అహల్య - వనితా నవ మన్మథ నాపయిన్ గృ పోద్భవన నానతిచ్చెదవు,
ఇంద్రడు - భవజు నాన, నిజంబు పల్కితిన్

కందపద్యంలో (అహల్యా సంక్రందనము 3-86)
అహల్య - నామగని వేష భాషల నేమిటికి ధరించి వచ్చి తెఱుఁగం జెపుమా
ఇంద్రుడు - నీ మగని రూపు మౌటకు పై మాటలు నడుపవలదె పంకజగంధీ

ప్రహేళిక


ప్రహేళిక

 సాహితీమిత్రులారా !

శుద్ధకులజాత యొక సతి
యిద్ధరణిం దండ్రిఁ జంపి యెసఁద విశుద్ధిన్
బుద్ధిఁబితామహుఁబొందుచు
సిద్ధముగాఁ దండ్రిఁగనును చెప్పుఁడు దీనిన్

దీని జవాబు - మజ్జిగ

(మజ్జిగకు తండ్రి పెరుగు, పెరుగుకు తండ్రి పాలు అనగా మజ్జిగకు తాత పాలు.
మజ్జిగ తండ్రిని(పెరుగు)ను చంపి పుట్టును. అట్లా పుట్టిన మజ్జిగ, తాతను(పాలను)చేమిరి రూపంతో పొంది,
మరల తండ్రిని కంటున్నది.)

Monday, April 11, 2016

ప్రశ్నోత్తర చిత్రం


ప్రశ్నోత్తర చిత్రం

సాహితీమిత్రులారా!
అదే ప్రశ్న అదే జవాబుగా ఉన్న దాన్ని ప్రశ్నోత్తర చిత్రం అంటారు.
ఈ శ్లోకం చూద్దాం.

కేదార పోషణరతా:
కంసంజఘాన కృష్ణ:
కాశీతల వాహినీ గంగా
కంబలవంతం నబాధతే శీతలమ్


కే - దార పోషణరతా: = దార పోషణకు సమర్థులు ఎవరు? (ప్రశ్న)
కేదార - పోషణ - రతా: = పంటపొలాన్ని పోషించుటలో శ్రద్ధావంతులు!


కం - సంజఘాన కృష్ణ: = ఎవరిని చంపెను కృష్ణుడు?(ప్రశ్న)

కంసం - జఘాన - కృష్ణ: = కంసుని చంపినవాడు కృష్ణుడు!


కా - శీతల వాహినీ గంగా = శీతల ప్రవాహమున్న గంగ(నీరు) ఏది?(ప్రశ్న)

కాశీ - తలవాహినీ - గంగా = కాశీప్రాంతమున ప్రవహించు గంగ!

కం - బలవంతం న బాధతే శీతలమ్ = ఏ బలవంతుని చలి బాధించదు? (ప్రశ్న)

కంబల - వంతం - నబాధతే శీతలమ్ = కంబళము ఉన్న వానిని చలి బాధించదు!


తెలుగులో ప్రశ్నోత్తర చిత్రం

ఎద్దీశునకశ్వంబగు?
గ్రద్దన నేదడవి తిరుగు ఖరకంటకియై?
హద్దుగ నేవాడు ఘనుడు?
పద్దుగ నుత్తరము లిందె పడయంగానౌ!


ప్రశ్న :- ఎద్దీశునకు (ఎద్ది + ఈశునకు) అశ్వంబగు?
జవాబు: - ఎద్దు ఈశునకు అశ్వమగును
ప్రశ్న :- ఏదడవిలో (ఏది + అడవిలో)ముండ్లతో తిరుగును?
జవాబు: - ఏదు(పంది) అడవిలో ముండ్లతో తికుగును
ప్రశ్న :- హద్దుగా ఎవడు గొప్పవాడు?
జవాబు : - (తన) హద్దును ఎరిగినవాడు గొప్పవాడు
(గ్రద్దన = శీఘ్రంగా, ఖర = వాడియైన, ఏదు = ఏదుపంది)


Sunday, April 10, 2016

గ్రహగోపన పద్యం


గ్రహగోపన పద్యం

సాహితీమిత్రులారా!
ఈ పద్యంలో గ్రహాల పేర్లు ఆంతరంలో ఉన్నాయి కాని పైకి కనిపించవు కావున దీన్ని గ్రహగోపన చిత్రంగా చెప్పవచ్చు. ఇది  చాటుపద్యమణిమంజరి 1భా. పుట.86 లోనిది.

సహజ కళంక మూర్తులు కుజాతులు గూఢ తరోదయ ప్రభా
మహితులు గోత్ర విద్విషద మాత్యులు రాత్రి చరానుకూల ధీ
సహితులు మందవర్తనులు సర్పసమానులు రాజసేవక
గ్రహములు కాననయ్యెల రాయని భాస్కరుఁడస్తమించినన్

సహజ కళంకమూర్తి = చంద్రుడు, (పాపపంకిలులు),
కుజాతుడు = అంగారకుడు(కుచ్చితంగ జన్మించినవారు, కువర్ణలు),
గూఢతరోదయుడు = బుధుడు(గూఢంగా - రహస్యంగా పుట్టినవారు)
గోత్ర విద్వషదమాత్యుడు = గురువు(కులాన్ని ధ్వేషించేవారికి సలహా చెప్పేవాడు),
రాత్రిచరుడు = శుక్రుడు(రాత్రులందు సంచరించే జారుడు, చోరుడు),
మందవర్తనుడు = శని(సోమరి), సర్పసమానులు = రాహుకేతువులు (దుష్టులు)                  

భోంచేసినట్టుండాలి

భోంచేసినట్టుండాలి

సాహితీమిత్రులారా!
ఆరుద్ర సినీవాలి(పుట.-11)లో మంచి రచన ఎలా ఉండాలో వివరించాడు.

మంచి రచన చదివాక బాగా భోంచేసి నట్టుండాలి
కొంచెం బాధపడాలి చించుకొన్నట్టుండాలి
మనస్సుకి జ్వరం కావాలి ఒళ్ళు తిరగాలి
ఈ బాధలోంచే తేరుకొని బాగుపడాలి


ఈ లక్షణాలన్నీ ఏ కవిత్వానికి సంబంధింవని చూస్తే చిత్రకవిత్వానికి సరిపోతాయి.

Saturday, April 9, 2016

అహల్యా - సంక్రందనుల (సంవాద చిత్రం)


అహల్యా - సంక్రందనుల సంవాద చిత్రం


సాహితీమిత్రులారా!

1735-40 సంవత్సరాల మధ్యకాలంలో మధురపాలకుడైన విజయరంగ చొక్కనాథనాయకునికి అంకితం
ఈయబడిన అహల్యా సంక్రందనము అనే కావ్యంలోనిది ఈ సంవాద చిత్రం.
దీని కూర్చినవారు సముఖము వేంకటకృష్ణప్పనాయకుడు.

ఈ గ్రంథం ఆంగ్లేయపాకుల కాలంలో నిషేధించబడిన శృంగారకావ్యంగా ముద్రపడిన ప్రత్యేక కావ్యం.
అహల్య సంక్రందన(ఇంద్రుడు) సంభాషణ చంపకమాల వృత్తంలో ఎంత చిత్రంగా తీర్చబడినదో చూడండి.

ఇంద్రుడు - ఎవరది యింటిలోపల?     అహల్య - అ దెవ్వరు?
ఇం - శక్రుఁడ,                                      అ- చెల్ల! మీరలా! యివలికి రండు,
ఇం- నీదు మగఁడెక్కడ?                     అ - మూల ఫలార్థ మేఁగె,
ఇం- రా నువిదరొ తామసం బగునొ?   అ- ఉండుఁడు, పూజలు గాంచి పొండు,
ఇం- సేయవలయు పూజ నీ వెఱుఁగవా?  
యన - సిగ్గున నేఁగు నవ్వుచున్   

                                           అహల్యా సంక్రందనము (2-116)

తృవ్వట బాబా! తలపై


తృవ్వట బాబా! తలపై .......

సాహితీమిత్రులారా!

కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకసారి ఒకకవి వచ్చి అష్టదిగ్గజకవుకు ఒక పరీక్ష పెట్టాడు అదేమంటే  మీలో ఎవరు ఏది చెప్పినదాన్ని నేను వెను వెంటనే రాయగలను మరియు మీరు చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టగలను లేదా మీరు నేను చెప్పిన దాన్ని రాయండి, నే చెప్పిన కవిత్వాన్ని తప్పు పట్టండి. వీటికి మీరు సిద్ధమేనా అని ప్రశ్నించాడు. దీనికి అక్కడివారందరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.  ఆసమయంలో తెనాలి రామకృష్ణకవి ముందుకు వచ్చి నే చెప్పేది రాయమని ఈ క్రింది పద్యం చెప్పాడట.

తృవ్వట! బాబా; తలపై
పువ్వట! జాబిల్లి; వల్వబూదట! చేదే
బువ్వట! చూడగ నుళుళు
క్కవ్వట; అరయఁగ నట్టి హరునకు జేజే!


(తృప్ = సాక్షరపదముల గ్రహింపజాలని పశువు - వృషభం, బాబా = వాహనం, జాబిల్లి, తలపై పువ్వు, వలువ = కట్టుపుట్టము, బూచి = భయంకరమైన (ఏనుగు)తోలు, చేదే = హాలాహలమే, బువ్వ = ఆహారం, ఉళుళుక్ (హుళక్కి)= లేనిది - మాయ, అవ్వ = కాగా, అట్టి హరును = అలాంటి పరమశివునకు, జేజేలు)
రామకృష్ణకవి చెప్పెడి విధానం పద్యం పలికే తీరు అర్థం కాక ఆ వచ్చిన కవివతంసుడు రాయలేక నిలిచిపోయాడు.

Friday, April 8, 2016

కరిభిద్గిరిభిత్తురంగ కమనీయంబై!

కరిభిద్గిరిభిత్తురంగ కమనీయంబై!

సాహితీమిత్రులారా!
అష్టదిగ్గజాలలో ఒకరైన వారు ఈ పద్యాన్ని కృష్ణదేవరాయల మీద చెప్పారు. అది తెనాలి రామకృష్ణుడని కొందరు భట్టుమూర్తి అని కొందరు చెబుతున్నారు. ఎవరైనా ఆయన ఆస్థానంలోనివారేకదా! ఆ పద్యం

నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి యొప్పె, కరిభి ద్గిరిభిత్
కరికరిభిద్గిరి గరిభిత్
కరిభిద్గిరిభిత్తురంగ కమనీయంబై !

అర్థం :- కృష్ణరాయని - కరము - అరుదు - అగు = మిక్కిలి ఆశ్చర్యకరమైన, కీర్తి, కరిభిత్ = గజాసురుని సంహరించిన శివుని వలెను, గిరిభిత్ కరి = పర్వతముల రెక్కలను భేదించిన ఇంద్రుని యొక్క ఏనుగు ఐరావతము వలెను, కరిభిత్ - గిరి = ఈశ్వరుని కైలాస పర్వతము వలెను, గిరి - భిత్ = కొండలను భేదించిన - వజ్రాయుధము వలెను, కరిభిత్ - గిరిభిత్ - తురంగ = ఈశ్వరుని - ఇంద్రుని వాహనములైన నందీశ్వర, ఉచ్ఛైశ్శ్రవముల వలెను, తెల్లగా, ధగధ్ధాగాయమానమై, కమనీయంగా ఒప్పి కనిపించెను.

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

సాహితీమిత్రులకు శ్రేయోభిలాషులకు దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు


సంభాషణ(సంవాద) చిత్రం


సంభాషణ(సంవాద) చిత్రం


సాహితీమిత్రులారా!

లక్ష్మీ - పార్వతుల సంవాదం


శ్లో. భిక్షార్థీ స క్వయాత:? సుతను బలిమఖం! తాండవం క్వాద్య భద్రే?
     మన్యే బృుదావనాంతే! క్వను స మృగశిశు:?  నైవజానే వరాహమ్!
     బాలే! కచ్చిన్నదృష్టో జరఠ మృగపతి:? గోపయేవాత్ర వేత్తా!
     లీలా సంలాప ఇత్థం జలనిధి హిమవత్కన్యయో: త్రాయతాం న:!

లక్ష్మీ - బిచ్చగాడు ఎక్కడకు వెళ్ళాడు?పార్వతి - బలియజ్ఞమునకు!లక్ష్మీ - ఈనాడు తాండవం ఎక్కడ?పార్వతి - బృందావనంలో అనుకొందును!లక్ష్మీ - ఆ జింకపిల్ల ఎక్కడ?పార్వతి- ఏమో ఆ వరాహమును నేనెరుగను!లక్ష్మీ - బాలా ముదుసలి ఎద్దు కన్పించలేదా?పార్వతి- గోవులను కాయువానికే తెలియును!
ఈ విధంగా సాగిన లక్ష్మీ - పార్వతుల సంవాదం మిమ్ము రక్షించుగాక!


మరొక సంవాద చిత్రం

ఈ క్రింది శ్లోకం వాయువుకు మామిడి కొమ్మకు మధ్య జరిగిన సంభాషణ.


శ్లో. చిరశ్రాంతో దూరాత్ అహముపగతో హన్త మలయాత్
     తదేకం త్వద్గేహే తరుణి పరిణేష్యామి దివసమ్
     సమీరేణోక్త్యేవం నవకుసుమితా చూతలతికా
     ధునానా మూర్ధానం నహి - నహి - నహీ త్యేవ వదతి


మండు వేసవిలో వాయువు మామిడి కొమ్మతో - "నేను మలయ పర్వతం నుండి అలసి వచ్చాను. నీ దగ్గర ఒక్కనాడు గడుపదలచాను" - అని అన్నాడు. 

దానికి కొత్తగా పుష్పవతి అయిన ఆ మామిడి కొమ్మ "వద్దు!  వద్దు! వద్దు!" - అని మూడుసార్లు అన్నది. (దీని భావమేమంటే మూడు రోజులు ఆగు అని.)


Thursday, April 7, 2016

ప్రహేళిక


ప్రహేళిక

సాహితీమిత్రులారా!
ప్రహేళికకు తెలుగులో పొడుపుకథ అనికూడా అంటారు. ఈ క్రింది పద్యం చూడండి.

కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించు చుండును
బ్రాహ్మణుండు కాకి పలలము దిను

బ్రాహ్మణుడు పలలము(మాంసం) తినడు. కాకి మాంసం ఎవ్వరూ తినరు. అది బ్రాహ్మణుడు తింటాడు అనటు అసలే కుదరదు. పై పాదాలలోని వాటికి అర్థం సమన్వయం కాదు. అందుకే ఇది పొడుపుకథ. 
దీనిలో ఉన్న గమ్మత్తంతా ఏమిటంటే ఒక్కొక్కపాదం ఒక్కొక్క వాక్యంగా కనబడటం. ఆవిధంగా కవిరాయడం. దాని అర్థాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

కొండనుండు నెమలి - కోరిన పాలిచ్చు పశువు
శిశువుతోడ పలుకనేర్చు వనిత
వేదములను వల్లించుచుండను బ్రాహ్మణుండు
కాకి పలలము తిను.

ఇప్పుడు చిక్కుముడి విడిపోయింది కదా!

Wednesday, April 6, 2016

ప్రహేళిక


ప్రహేళిక

సాహితీమిత్రులారా!
ప్రహేళికలలో మరో రకమైన ప్రహేళిక ఈ క్రింది పద్యం గమనించండి.

పక్షివర్యుడు పరగ పంచాక్షరముల
వాని తలదీయ క్షుద్రదేవత జనించు,
వాని తలదీయ తక్కెడ వరలుచుండు
దాన ప్రథమాక్షరము తీయ దనరు నృపతి

ఇది ఒక పక్షిపేరు దీనిలో 5 అక్షరాలు ఉంటాయి. దీనిలో మొదటి అక్షరం (తల) తీసివేయగా అది క్షుద్రదేవతను తెల్పుతుంది. దీని మొదటక్షరం (తల) తీసివేసిన తక్కెడను తెలుపుతుంది. దీని మొదటక్షరం తీసివేస్తే అది రాజు అనే అర్థం వచ్చే పదమౌతుంది. ఇంతకు ఆ పదం ఏది?

దీనికి సమాధానం - కపోతరాజు

కపోతరాజు లో "క"- తీసివేసిన పోతరాజు అవుతుంది.  
పోతరాజు అనేది ఒక క్షుద్రగ్రామదేవతను తెల్పుతుంది.
పోతరాజు లో "పో" తీసివేసిన తరాజు అంటే తక్కెడ, 
తరాజు లో "త" తీసివేసిన రాజు అవుతుంది. 
కావున పోతరాజు అనే సమాధానం సరిపోతుంది.

Tuesday, April 5, 2016

పరిహారికా ప్రహేళిక

పరిహారికా ప్రహేళిక


సాహితీమిత్రులారా!
ప్రహేళికలలో అనేక రకాలున్నాయి వాటిలో "పరిహారికా" అనేది ఒక రకం ప్రహేళిక.
"యౌగిక శబ్దాల పరంపర ఉన్నదే పరీహారికా ప్రహేళిక" అని మహాకవి దండి నిర్వచనం.
పరిహారికా ప్రహేళికకు ఉదాహరణ ఈక్రింది పద్యం

సురవర గురునకు సతి సుతు
వర జనకుని తండ్రి కూతు వరసుతు మామన్
శిరమందుగొన్న మరసుతు
నిరతము సేవింతు నియమ నిష్కలుషమతిన్

సురవరగురు - బృహస్పతి, సతి - భార్య అయిన తార, సుతు- కుమారుడైన బుధుని, వరజనకుని - తండ్రి అయిన చంద్రుని, తండ్రి- సముద్రుని, కూతురు - పుత్రిక అయిన లక్ష్మీదేవి, వరసుతు - మన్మథుని, మామన్ - చంద్రుని, శిరమందు గొన్న వర - తలనుదాల్చు శివుని, సుతు - వినాయకుని, నిరతము సేవింతు నియమ నిశ్కలుమతిన్ - ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.

భావం :-
బృహస్పతి భార్య అయిన తార, తార కుమారుడైన బుధుని, బుధుని తండ్రి అయిన చంద్రుని,  చంద్రుని తండ్రి సముద్రుని, సముద్రుని పుత్రిక అయిన లక్ష్మీదేవి, లక్ష్మీదేవి కుమారుడైన మన్మథుని,మన్మథుని మామ అయిన చంద్రుని, చంద్రుని తలనుదాల్చు శివుని, శివుని కుమారుడైన వినాయకుని ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.

దీనిలో చివరగా తేలిన జవాబు శివుని కుమారుడైన వినాయకుని ఎల్లపుడు నియమముతో, కల్మషములేని మనసుతో సేవిస్తాను.

Monday, April 4, 2016

ద్వ్యక్షరి - 2

ద్వ్యక్షరి - 2


సాహితీమిత్రులారా
ఆయలూరి కందాళయార్య విరచిత అలంకారశిరోమణి(7-19)లోని ద్వ్యక్షరి. ఇది గ,ర - అనే రెండు వ్యంజనములచే కూర్చబడినది.

శ్లో. గౌరగూగ్రాగగోగాగగోగోరు గరుగోగురు:
     రంగాగారేగారిగంగాగురూరాగిరిరుగ్గిరా

ధవళకిరణాలు గల చంద్రునీ, శివునికొండ అయిన కైలాసాన్ని, స్వర్గమందున్న కల్పవృక్షాన్ని,కామధేనువును, వజ్రాయుధాన్ని పోలిన తెల్లని కాంతిగల శేషునిశయ్యగా కలిగిన గొప్పవాడు, గంగాజనకుడు అయిన శ్రీమహావిష్ణువు వేదవాక్కులచే శ్రీరంగభాగ్య సంపదగా ప్రకటించబడినాడు.

Saturday, April 2, 2016

అపునరుక్త వ్యంజనము


అపునరుక్త వ్యంజనము

సాహితీమిత్రులారా!

వచ్చిన హల్లు మళ్ళీ రాకుండా పద్యం కూర్చితే దాన్ని అపునరుక్త వ్యంజనము అంటారు. ఇది ఒక శబ్దచిత్రం
ఈ విధమైన వాటిని ఎక్కువగా సంస్కృతంలో చూడవచ్చు.
వేదాంతదేశికుల "పాదుకాసహస్రం" లో చిత్రపద్ధతి పేరున 911-950 శ్లోకాలు కూర్చబడ్డాయి.
920 వ శ్లోకం ఈరకమైన "అపునరుక్త వ్యంజనము" చిత్రరచన చేశారు.

బాఢా ఘాళీ ఝాటతుచ్ఛే గాధాభనాయపుల్లఖే
సమాధౌశఠజిచ్చూడాం వృణోషిహిపాదుకే 

భావం:- ఓ భగవత్పాదుకా దృఢమైన పాపసముదాయమనే అడవిలేనట్టి, వికసించిన మనస్సుగల సమాధియోగమందు దివ్యప్రబంధాన్ని ప్రకాశింపచేయడానికి నీవు శఠగోపసూరి శిరస్సును వరిస్తున్నావు.

ఈ శ్లోకం గమనిస్తే వచ్చిన హల్లు మళ్ళీ రాలేదు కావున ఇది అపునరుక్త వ్యంజన చిత్రం

ప్రహేళిక -3


ప్రహేళిక -3

సాహితీమిత్రులారా!

 సమాధానాలు ప్రహేళికలోనే ఉంటే వాటిని అంతర్లాపిక అనే రకానికి చెందిన ప్రహేళికగా చెబుతారు.

అలాంటిదానికి ఉదాహరణ ఈ ప్రహేళిక కాని ఇది ఒక సమస్య దానికి కవి ఈ విధంగా ప్రహేళికలో పూరించాడు.

"ఏకాదశినాఁడు సప్త మేడు గడియల్" - అనేది సమస్య

పూరణ -

శ్రీకాంతుని దిన మెన్నడు
రాకొమరుని కెద్ది ప్రియము రథతిథి యెన్నం
డేకొలఁరి కన్నమరుగునొ
ఏకాదశినాఁడు సప్త మే
డే గడియల్!


దీనిలో  -  శ్రీకాంతుని దిన మెన్నడు? - విష్ణుని రోజేది ?
రాకొమరునికి ఎద్ది ప్రియము? - రథతిథి యెన్నండు?-
ఏకొలఁరి కన్నమరుగునొ ? - ఏ కొలదికి (ఎంత సమయానికి) అన్నం అరుగుతుందో?- ఈ ప్రశ్నలకు సమాధానాలు చివరిపాదంలోని పదాలను విరుచుకొని చూస్తే తెలుస్తుంది.
ఏకాదశినాఁడు సప్త మేడు గడియల్ - దీనిలో ఏకాదశి, నాఁడు,  సప్తమి,  ఏడుగడియల్
అనే పదాలుగా విడగొట్టిన  ఈ విధంగా సమాధానాలవుతాయి.

శ్రీకాంతుని దిన మెన్నడు? - విష్ణుని రోజేది ? - ఏకాదశి
రాకొమరునికి ఎద్ది ప్రియము? - నాఁడు (దేశం)
రథతిథి యెన్నండు?-  సప్తమి(తిథి)
ఏకొలఁరి కన్నమరుగునొ ? - ఏ కొలదికి (ఎంత సమయానికి) అన్నం అరుగుతుందో? - ఏడుగడియల్