కుందేటికి కొమ్ములైదు కుక్కకు వలనే
సాహితీమిత్రులారా!
సమస్య : " కుందేటికి కొమ్ములైదు కుక్కకు వలనే." (!!!)
కుందేలుకు కొమ్ములుంటాయా? పైగా ఐదా ? అదీ కాక మరో వైపరీత్యం కుక్కకు వలెనే అంట.దీన్నెలా సమర్థించాలి? సాధారణమైన అవధాని ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దీన్ని పూరించాలంటే కాసింత చారిత్రక జ్ఞాన మవసరం.
డబ్బు ప్రసక్తి లేకుండా మానవ జాతి లక్షల సంవత్సరాలు గడిపింది. వస్తు సేవల వినిమయం వస్తు మార్పిడి ద్వారా సేవల మార్పిడి ద్వారా జరుపుకొనేది. ఈ మార్పిడిలో కొన్ని ఇబ్బందులు తలెత్తటంతో ఒక ప్రామాణిక వస్తువు వినిమయ మాద్యం గా అవసరం వచ్చింది.
అప్పుడు ఒక దశలో గవ్వలు, మరోదశలో ఉప్పు, మరొక దశలో నిప్పు, ఇంకో దశలో గుఱ్ఱాలు,గొఱ్ఱెలు, ఆవులు మొదలైన జంతువులు etc వినిమయ మాద్యంగా ఉపయోగించారు. ఒకప్పుడు ఆల మందలే అసలు సంపద. (మహా భారతంలో ఉత్తర గోగ్రహణం గుర్తుందిగా !)
అలా ఒకానొక దశలో పసుపు కొమ్ములు కూడా డబ్బుగా ఉపయోగించారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక అవధాని ఒక సందర్భం కల్పన చేసి పూరించాడీ సమస్యని. ఆ సందర్భం:
ఒకడు ఒక సంత బజారులో తాను వేటాడి తెచ్చిన వివిధ జంతువులను అమ్మకానికి పెట్టాడు. అప్పుడో కొనుగోలు దారుడు బేరమాడి ఐదు పసుపు కొమ్ములిచ్చి ఒక మగ కుక్కను కొన్నాడు. అలాగే ఒక కుందేలును కొనాలని అనుకుంటే ఆ అమ్మకందారుడు ఒప్పుకోలేదు. అప్పుడా కొనుగోలు దారుడు అమ్మకం దారునితో ఇలా అన్నాడు.
కం.
ముందిస్తి పసుపు కొమ్ములు
పొందికగా నైదు కుక్క పోతుకు; నటులే
పందెమ్మిడి ఈవేటికి?
కుందేటికి కొమ్ము లైదు కుక్కకు వలెనే.
" అయ్యా ! ముందు బేరమాడి ఐదు కొమ్ములకు ఒక మగ కుక్క నిచ్చావు కదా ! అలాగే ఐదు కొమ్ములకిప్పుడు కుందేలును ఇవ్వనంటున్నా వెందుకు?"
------------------------------------------------------
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులు