Monday, April 30, 2018

ఇచ్చోటనే ఇచ్చోటనే.....(అనుకరణ పద్యం)


ఇచ్చోటనే ఇచ్చోటనే.....(అనుకరణ పద్యం)



సాహితీమిత్రులారా!



రాగయుక్తంగా ఇచ్చోటనే అనగానే
శ్మశానవాటి అంకంలోని పద్యం
గుర్తుకు రాకమానదు. అది 
జాషువాగారి ఖండకావ్యంలోనిది.
ఇదే కదా దీనికి మల్లె కరుణశ్రీగారు
కూడ వ్రాశారు దీని తరువాత
చూడగలరు గమనించండి-

ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని 
     కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
     యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
     సలసౌరు గంగలోఁ గలసిపోయె
యిచ్చోట నెట్టిపే రెన్నికం గనుఁగొన్న
     చిత్రలేఖకుని కుంచియె నశించె
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు
ఇది సరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు

పై పద్యానికి అనుకరణా లేక ఈ పద్యానికే
పైపద్యం అనుసరించబడిందా
అన్నది పక్కన బెడితే ఈ క్రింది పద్యం
కరుణశ్రీ గారి కరుణశ్రీ
కావ్యంలో బుద్ధుని తల్లి మాయాదేవి గర్భవతిగా
ఉన్నపుడు హిమాలయాలను చూపిస్తూ ప్రజాపతి గౌతమి
ఈ పద్యం చెబుతుంది -

ఇచ్చోటనే త్రోసి పుచ్చె వరూధినీ
     ప్రణయప్రబంధము పిచ్చి బ్రహ్మచారి
ఇచ్చోటనే "తిష్ఠనిడి" నిష్ఠగొనెమనో
     రథసిద్ధికై భగీరథ నృపుండు
ఇచ్చోటనే పొంగులెత్తి నేలకుదూకె
     అమృతంపువెల్లి గంగమ్మతల్లి
ఇచ్చోట నిచ్చోటనే పచ్చ విల్కాని
      కరగించె ముక్కంటి కంటిమంట
ఇచ్చటే యిచ్చటే హృదయేశ్వరునకు
కొంరాచూలి వలపులు గ్రమ్మరించె
అనుచు విద్యాధరాంగనలను దినమ్ము
చెప్పికొనుచు విహారముల్ సేయుదురిట

బుద్ధ(పౌర్ణిమ)జయంతి శుభాకాంక్షలు


బుద్ధ(పౌర్ణిమ)జయంతి శుభాకాంక్షలు


సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషుకు
బుద్ధ(పౌర్ణిమ)జయంతి శుభాకాంక్షలు

స్వార్థ జ్వాలల దేశభద్రతలు స్వాహా యయ్యె విద్రోహముల్
వర్ధిల్లెన్ కుటిల ప్రచారములు దుర్వారంబు లయ్యెన్ మన
స్పర్థా సంకులమైన యీ జగతికిన్ శాంతిం బ్రసాదింప సి
ద్ధార్థస్వామి మఱొక్కమారు దిగిరావయ్యా పురోగామివై
                                  - కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి

Sunday, April 29, 2018

పెదవి పగిలితే పళ్లు నవ్వుతాయి


పెదవి పగిలితే పళ్లు నవ్వుతాయి




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి


1. నూరు పళ్లు, ఒకటే పెదవి
    పెదవి పగిలితే పళ్లు నవ్వుతాయి
    ఏమిటో చెప్పండి?



సమాధానం - దానిమ్మ



2. నూరు చిలుకలకు కటే ముక్కు
    ఏమిటది?



సమాధానం - ద్రాక్షపళ్ల గుత్తి



3. నెత్తిమీద రాయి నోట్లో వేలు
    ఏమిటిది?


సమాధానం - ఉంగరం

Saturday, April 28, 2018

చందవరదాయి


చందవరదాయి




సాహితీమిత్రులారా!



హిందీ సాహిత్యంలో చందవరదాయి కవిజీవితం గురించి,
అతని బృహత్కావ్యం పృథ్వీరాజ రాసో గురించి లెక్కలేనన్ని
వివాదాస్పదమైన అభిప్రాయాలున్నాయి. భారతదేశ చరిత్రలో 
సుప్రసిద్ధ చక్రవర్తి పృథ్వీరాజ చౌహాన్(12శ.), చందవరదాయి 
సమకాలికులేకాక, ఒకేరోజు ఒకే ప్రదేశంలో జన్మించారని, 
మరణించారని జనశ్రుతి. చందవరదాయి జన్మస్థానం లాహోర్ 
అని, ఈయన భట్ట బ్రహ్మణ వంశం వాడని ప్రచారంలో ఉంది.
చందవరదాయి పృథ్వీరాజు ఆస్తానకవి మాత్రమేకాదు సఖుడు, 
సామంతుడు కూడా. షట్ - భాషా వ్యాకరణాలు, కావ్యం, సాహిత్యం, 
ఛందశ్శాస్త్రం, జ్యోతిష్యం, పురాణం, నాటకం వంటి ఎన్నో ప్రక్రియల్లో
ఈయన అందెవేసిన చేయి. రాజ సభలోనూ, రణరంగంలోనూ, మృగయా వినోదంలోనూ, యాత్రల్లోనూ కూడా పృథ్వీరాజు వెంట చందవరదాయి సదా ఉండేవాడు. మహమ్మద్ గోరి పృథ్వీరాజును బంధించి తనతోబాటు గజనీ నగరానికి తీసుకువెళ్ళినపుడు చందవరదాయి కూడా వెంటవెళ్ళాడం, పథకం ప్రకారం అక్కడ పృథ్వీరాజు చేత శబ్దభేది బాణంతో మహమ్మదును చంపించి, ఆ వెంటనే మిత్రులిద్దరూ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని మరణించారనే కథ బహుళంగా వ్యాపించింది. ఆ రకంగా గజనీ నగరానికి వెళుతున్నపుడు అసంపూర్ణంగా ఉండిపోయిన తన కావ్యం పృథ్వీరాజ రాసోను తన పదిమంది  కొడుకుల్లో  ఒకరైన జల్హణునికి ఇచ్చి పూర్తి చేయించినట్లు కథనం. అయితే, మరోవర్గం  విద్వాంసులు చందవరదాయి ఉనికిని స్వీకరించకపోయినా, కావ్యాన్ని అప్రమాణం అన్నా కూడా పృథ్వీరాజ రాసో కావ్యం మాత్రం హిందీలోని ఆది కావ్యంగా మన్ననలు అందుకుంటూనే ఉంది. 
ఇది ప్రధానంగా పృథ్వీరాజు శృంగారాలకు సంబంధించిన రచన. ఆనాటికి అనుకూలంగా కవి స్త్రీ సౌందర్యవర్ణనను, నాయకుడు, ఆమెను వివాహమాడటానికి ఒక యుద్ధకల్పనము చేశాడు. ఇందులో సుమారు 50-60 యుద్ధవర్ణనలూ, వివాహవర్ణనలూ చేసినా పునరుక్తి దోషం లేదు. ఏరకమైన వర్ణన అయినా కవిది అందెవేసిన చేయి. నగరాలు, ఉద్యానవనాలు, కోటలు, సరోవరాలు, యుద్ధాలు, స్త్రీ - పురుష వర్ణనలు, సేనలు, అలంకరణలు ఇలా స్థావర జంగమాలనన్నిటినీ పదేపదే వర్ణించినా అటుకవికిగాని, ఇటు పాఠకునికిగాని విసుగు అనేదే రాదు. పద్మావతి, సంయుక్త మొదలైన నాయికలు అందరూ అపురూప సౌందర్యరాశులు.అలాగే నాయకుడు పృథ్వీరీజు సర్వగుణ సంపన్నుడైన చారిత్రక నాయకుడు. సౌందర్యం, శౌర్యం, దానం, క్షమ వంటి గుణాలన్నీ ఇతనిలో నిండి ఉన్నాయి. కవి యుద్ధ-శౌర్య వర్ణనల్లో వీరరసం చొప్పించాడు. సౌందర్యవర్ణన, వయః సంధి, అనురాగం, ప్రథవీక్ణం మొదలైనవాటిలో శృంగారం చిప్పిల్లుతుంది. ప్రసంగానుకూలంగా తదితర రసాలూ చోటుచేసుకున్నాయి.

         కావ్యంలోని భావ సౌందర్య వృద్ధికి కవి అనుప్రాస, యమక, శ్లేష, వక్రోక్తి, ఉపమ, రూపక, అతిశయోక్తి వంటి అలంకారాల నెన్నిటినో ఎన్నుకున్నాడు. అసలు అలంకార శాస్త్రమే గోచరిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఈ కావ్యంలో 68 రకాల ఛందస్సులు ప్రయోగించడం నిజంగా ఆశ్చర్యమే. విమర్శలెన్ని తలెత్తినా ఇన్ని గుణాలను సంతరించుకున్న ఈ గ్రంథం  హిందీలో తొలి మహాకావ్యంగానూ, చందవరదాయి తొలికవిగానూ మన్ననలు అందుకోవటం సహజమే.

Friday, April 27, 2018

వీధుల్లో పోర్లాడి ఇంట్లోకి వచ్చె


వీధుల్లో పోర్లాడి ఇంట్లోకి వచ్చె





సాహితామిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి.


1. మొలతాడు లేని మొండివాడు
    వీధుల్లో పోర్లాడి ఇంట్లోకి వచ్చె
    ఏమిటో చెప్పండి?


సమాధానం - కోడి


2. మోకాళ్లలోతు నీళ్లలో మొద్దు కాలుతుంది
    ఏమిటో చెప్పండి?



సమాధానం - ప్రమిద


3. రంగడు పింగడు 
    ఎంత తొక్కినా అణగడు
    అంటే ఏమిటి?


సమాధానం - నీళ్లు

Thursday, April 26, 2018

మేకల్ని తోలేసి తడికల్ని పాలు పిండుతారు


మేకల్ని తోలేసి తడికల్ని పాలు పిండుతారు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి-

1. మేకల్ని తోలేసి తడికల్ని పాలు పిండుతారు
     అంటే ఏమిటో చెప్పండి ?


 సమాధానం - తేనె పట్టు


2. మొండి దేవాలయానికి సందే లేదు
    అంటే ఏమిటో చెప్పండి?


సమాధానం - పంగనామాలు


3. మొదట చప్పన
    నడుమ పుల్లన
    కొస కమ్మన
    ఏమిటది?


సమాధానం - పాలు, 
                                  పెరుగు, 
                                              నెయ్యి

Wednesday, April 25, 2018

నల్లగ వున్నా నన్నే కోరు


నల్లగ వున్నా నన్నే కోరు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి


1. నల్లగ వున్నా నన్నే కోరు
    మధ్యకు నన్ను నిలువున చీరు
    అగ్గిలేక రుచి పొందలేరు
    ఏమిటది చెప్పండి?



సమాధానం - పొగాకు


2. నల్లా ఉంటుంది కాని నాగుపాము కాదు
    ఊగుతూ ఉంటుంది కాని ఉయ్యాల కాదు
    ఏమిటది చెప్పండి?


సమాధానం - జడ

Tuesday, April 24, 2018

తెలుపు మెవరు వారు?


తెలుపు మెవరు వారు?




సాహితీమిత్రులారా!



దీని భావమేమి తిరుమలేశ అనే శతకం
స్ఫూర్తితో వచ్చిన ఒక శతకంలోని
పొడుపు పద్యాలు 2 చూడండి-


భక్తిపరవశమున భద్రాచలంబున
నాలయంబు గట్టి నతులితముగ
రామవిభుని పేర రచియించె శతకంబు
తెలుపు మెవరు వారు తెలుగుబాల!             



సమాధానం -  కంచెర్లగోపన్న



మట్టిబొమ్మయందు మనసు లగ్నము చేసి
విద్యలన్ని నేర్చె విబుధుడొకడు
మనసు కలిగియున్న మార్గంబులెన్నియో!
తెలుపు మెవరు వారు తెలుగుబాల!             


సమాధానం -  ఏకలవ్యుడు

Monday, April 23, 2018

సింధీ - పొడుపుకథలు


సింధీ - పొడుపుకథలు




సాహితీమిత్రులారా!

సింధీ జానపద సాహిత్యంలో పొడుపుకథలు,
నిగూఢ ప్రశ్నలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
పొడుపుకథలను సంధీలో పిరొలీ అంటారు.
అంటే ఒక విషయాన్ని భావించి, దాని ముడి
విప్పడం అని అర్థం.

ఉదాహరణ -

1. పచ్చని తీగకు తెల్లని పళ్ళు
    చూడవచ్చును గాని తినలేము  
 

సమాధానం - ఆకాశం, నక్షత్రం


2. ముళ్ల పందివలె ఉంటుంది
    కాని ముళ్లపంది కాదు
    మనిషికి ఉన్నట్లు గడ్డం ఉంటుంది
    కాని మనిషికాదు
    పసుపుపచ్చని బట్టలు వేసుకుంటాడు
    కాని సన్యాసి కాదు
    నిండుగా నీళ్లుంటాయి
    నీళ్లుమోసే తోలుతిత్తికాదు
    ఏమిటో చెప్పుకో చూద్దాం?


సమాధానం - కొబ్బరికాయ

Sunday, April 22, 2018

కుడితి గోలెం పైన పొన్న కాయ


కుడితి గోలెం పైన పొన్న కాయ




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి-


1. జోడు నిట్రాళ్లు
    నిట్రాళ్ల మీద కుడితిగోలెం
    కుడితి గోలెం పైన పొన్న కాయ
    పొన్నకాయ మీద గరిక పోచలు
    గరిక పోచల పైన గాడిద పిల్లలు నాట్యమాడుతున్నాయి
    ఏమిటో చెప్పండి?

సమాధానం -
జోడు నిట్రాళ్లు - కాళ్లు
నిట్రాళ్ల మీద కుడితిగోలెం - పొట్ట
కుడితి గోలెం పైన పొన్న కాయ - తల
పొన్నకాయ మీద గరిక పోచలు - జుట్టు
గరిక పోచల పైన గాడిద పిల్లలు నాట్యమాడుతున్నాయి - పేలు




2. తలలు మూడు, కాళ్లు పది, మూడు తోకలు
    ఆరు కన్నులు, నాలుగు కొమ్ములు, రెండు చేతులు
    ఏమిటిది చెప్పండి?


సమాధానం - అరక
   

Saturday, April 21, 2018

ఏ మిచ్చి కొనగలరు? వెలమ దొరలు


ఏ మిచ్చి కొనగలరు? వెలమ దొరలు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి


1. ఇంతింత గుడికాయ, ఈ చుట్టు గుడికాయ
    కాకమ్మ గుడికాయ, కడవా లక్ష్మికాయ
    చింతల తోపులో బొంత మామిడికాయ
    ఏ మిచ్చి కొనగలరు? వెలమ దొరలు
    ఏమిటిది చెప్పండి?


సమాధానం - చందమామ



2. ఏటి అవతల చెట్టు వుంది
    ఏ కాయ కాయమంటే ఆ కాయ కాస్తుంది
    ఏమిటో చెప్పండి?


సమాధానం - కుమ్మరివాడు

Thursday, April 19, 2018

శ్రీశ్రీగారి - రుబాయత్


శ్రీశ్రీగారి - రుబాయత్




సాహితీమిత్రులారా!



ఒక భాషాపదాలనే కాకుండా అనేక భాషాపదాలను
ఉపయోగిస్తూ వ్రాయడాన్ని మణిప్రవాళ భాష అనడం
జరుగుతున్నన్నది అదే దాన్ని చిత్రకవిత్వంలో
భాషాచిత్రంగా చెప్పుకుంటాం.
ఇక్కడ శ్రీశ్రీగారి ఈ రుబాయత్ చూస్తే
భాషాచిత్రం అర్థమౌతుంది. ఇందులో
పైకి భాషాచిత్రంలా వున్నా భావం వేరేగా
ఉంటుందని గుర్తించాలి.

Charlie Chaplin, Joseph Stalin
Walt Disney, Georges Hunnet
Greta Garbo, Pirandello
ఇటీవల మా inspiration.

Sigmund Freud, Harold Lloyd
Albert Einstein, Jacob Epstein
హరీస్ చట్టో, గిరాం మూర్తీ.
ఇటీవల మా inspiration.

కథాకాలీ కూచిపూడీ
జావా నాట్యం, Russian Ballet
Jazz, Rumba, Carioca
హుషారిస్తాయ్, నిషా చేస్తాయ్.

Don Bradman Mohan Bagan
Walter Lindrum, Vines, Cochet
కొంచె carroms, కాస్త Pin-pong
ఒక cupకాఫీ, ఒక పఫ్ cigarette
తమాంషుద్


- ప్రతిభ త్రైమాసిక, గిడుగు రామూర్తి స్మారక సంచిక - సంపుటి 4 - 1940

Wednesday, April 18, 2018

మదన విజయం(కబ్బిగర కావ)


మదన విజయం(కబ్బిగర కావ)



సాహితీమిత్రులారా!



"మదన విజయం" వ్రాసిన కవి "అండయ్య" ఇది కన్నడ కావ్యం
మామూలు కన్నడ కావ్యం కాదండోయ్ అచ్చకన్నడ కావ్యం.
అందుకే దీనికి కబ్బిగర కావ అని పిలుస్తారు కన్నడులు.
కాని కవి పెట్టిన పేరు "కావన గెల్లం". సంస్కృత సహాయం 
లేకుండా అచ్చకన్నడ భాషలో వ్రాసి కవులను కాపాడినవాడు
అనే అర్థం వచ్చే కబ్బిగర కావ అనే పేరు వాడుకలో వుంది.
దాని వ్రాసిన అండయ్య 12వ శతాబ్ది చివరివాడు జైనకవి.
బనవాసి ప్రాంతంలో జన్మించినవాడు. 

దీనిలోని ఇతివృత్తం కర్వువిల్ల(చెరకు విలుకాడు) అనే రాజు
పరివీరంలోని చంద్రుణ్ణి శివుడు అపహరించాడు. కర్వువిల్ల
జినమునిని సేవించి శివుణ్ణి ఓడించాడు. కాని శివుని శాపానికి
గురయాడు. దాని వ్ల భార్య ఇచ్చెగార్తి - ని మరచిపోయాడు.
తర్వాత ఒక అప్సరసవల్ల పూర్వవృత్తాంతం విని శాప
విమోచనం పొందాడు.

పురాణాలలోని మన్మథుని కథలో చాల మార్పులు చేసి
 జైన సంప్రదాయానికి తగినట్లు కవి ఈ కావ్యాన్ని రచించాడు. 
సరళమైన సుందర శైలిలో అండయ్య వ్రాసిన ఈ శృంగారకావ్యం 
అచ్చకన్నడ సాహిత్యానికి మకుటాయమానం. అష్టాదశ వర్ణననలు 
ఉన్నా వాటిని మితిమీరికాకుండా వాడి కబ్బిగర కావ అనే 
ఈ చంపూకావ్యాన్ని ఒక ఖండకావ్యంగా తీర్చి దిద్దాడు.

Tuesday, April 17, 2018

నాదు నామ మేమి నాణ్యకాడ


నాదు నామ మేమి నాణ్యకాడ




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి

1. కుడువ కూడు లేక కుములు చుండుటదేల?
    కట్ట బట్ట లేక కలుగుటేల?
    నన్ను కల్గి యుండు మన్నీ సమకూరు
    నాదు నామ మేమి నాణ్యకాడ?


సమాధానం - విద్య


2. కుమ్మరి కుప్పయ్య,
    పత్తి పాపయ్య,
    ఆముదాల అప్పయ్య,
    ఏకమైనారు
    ఏమిటో చెప్పండి?



సమాధానం - ప్రమిద

Monday, April 16, 2018

అన్నపేరు సిద్ధు గురువును అడిగి తెలుసుకో


అన్నపేరు సిద్ధు గురువును అడిగి తెలుసుకో




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి


1. మూడుకాళ్ల ముసిలిదంట, వీపుమీద నోరంట,
    కవలమెత్తి చేతికిస్తే కమ్మగా దిగమింగునంట,
    దాని అర్థం తేలీదు దాని భోగం తెలీదు,
    అన్నపేరు సిద్ధు గురువును అడిగి తెల్సుకో
    ఏమిటో చెప్పండి?


సమాధానం - గానిగ


2. రాజుగారి తోటలో రోజడాపువ్వు,
    చూసేవారే కాని కోసేవారు లేరు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - చంద్రుడు

Sunday, April 15, 2018

శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు


శ్రీశ్రీ మార్కు పద్యాలనే వాడుడు




సాహితీమిత్రులారా!

శ్రీశ్రీగారి లిపి చిత్రం చూడండి


రెండు ఖడ్గాలు
రెండు ఖంజరీటాలు
రెండు అగ్నిపర్వతాలు
రెండు ఆంజనేయ దండకాలు
         జో జో
         జే జే

రెండు కంకాళాల కార్తీక దీపాలు
రెండు రాబందుల రా(జా)జీనామాలు
రెండు కళ్ళు తెరచిన నాగళ్ళు
రెండు పిడికిళ్ళు బిగించిన కొడవళ్ళు
          హా   హా
          హూ హూ

రెండు కళ్ళు
రెండు కళ్ళజోళ్ళు
రెండు కళ్ళజోళ్ళ నోళ్ళు
రెండు కళ్ళజోళ్ళ నోళ్ళ వాగుళ్ళు
           హీ హీ
           రీ  రీ

రెండు టెలిగ్రామ్య భాషలు
రెండు సమస్తాంధ్ర ఘోషలు
రెండు నిండు కొబ్బరికాయలు
రెండు ఎండు నారింజకాయలు
          బా బా
          బీ బీ

రెండు చదువురాని విస్తరాకులు
రెండు దారితప్పిపోయిన కిరీటాలు
రెండు చీకటింట్లో రాకాసి కేకలు
రెండు నిలబడ్డ నిట్టూర్పు కొరడాలు
           దా దా
           దీ దీ

రెండు వేషాలు విప్పివేసిన తలగడాల కింద
           నిద్ర మేల్కొన్న నఖక్షతాలు
రెండు నిశ్శబ్దాలు విరిసిన స రి గ మ ప ద ని శ ల మీద
           నీడలు పలికించిన విలోల కల్లోలాలు
రెండు యుగాంతాల సందున దిగంతాల మాటున
           వసంతా లాడుకునే అనంతాలు
              నే నే
              నా నా

రెండు జగన్నాథ రథరథ రథాధర ధరాధర
              రసాతల (జల) పాతాళాలు
రెండు స్వయంశమం వరంతకం ప్రకంపమాన
              లోకాలోక విలోకనాలు
రెండు భ్రమాభ్రమర భ్రమణ భ్రమరణ
              భ్రమావరణ బ్రహ్మవైవస్వత మన్వంతరాలు
రెండు నవరత్న - రంధ్ర
               రస ప్రపంచ మహాప్రస్థానాలు
రెండు చాలీచాలని కాలీకాలని లంగావంచాలు
రెండు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ థియేటర్ స్టార్లు
రెండు ఆరుద్రాభిషేకాలు
రెండు రిక్షాపై మౌన శంఖాలు
రెండు విబ్జియార్భాటాలు
రెండు హనుమత్ శాస్త్రాలు
రెండు నమస్కరించదగిన విశ్వనారాయణాస్త్రాలు
రెండు నామరహిత ఫిడేలు రాగారాబాలు
రెండు పిఠాపిఠా కఠోరకుఠారాలు
రెండు గోరావీణా వినాయకారాగారాలు
రెండు తృవ్వట బాబా సిగపై పువ్వులు
రెండు సరి సిరి మువ్వల నవ్వులు
రెండు బీరెండ వాసన ఒకట్లు
రెండు తురుఫాసు కవిత్వాల శకట్లు
రెండు తుఫానుమానాలు
రెండు తుపాకి స్నానాలు
రెండు సిన్ సిన్ కిస్ కిస్ కోణాలు
రెండు ఖడ్గాల కంఖాణాలు
రెండు కళ్ళ నోళ్ళు
రెండు కళ్ళు తెరచిన పిడికిళ్ళు బిగించిన
         మానవ సరోవరంలో వికసించిన
              మందారాక్షరాల
                     మరచిపోలేని
                         మద్రాక్షస
                             ముద్రాక్షసరాలు

                                                                          -ఢంకా(మాసపత్రిక) - నవంబర్,1944

Saturday, April 14, 2018

శ్రీశ్రీ లిపిచిత్రం - స్వగతం


శ్రీశ్రీ లిపిచిత్రం - స్వగతం




సాహితీమిత్రులారా!


శ్రీశ్రీగారి అముద్రిత కవితల్లో ఒకటి
ఈ కవిత ఇది వ్రాసే విధానంలోని
ప్రత్యేకత కలిగి వుంది కావున ఇది
"లిపిచిత్రం"గా చెప్పబడుతూంది
గమనించండి. ఇందులో
వరుసగా పంక్తులలోకాక
పాదంలోని పదం పదం
భవంతి మెట్లలా పేర్చబడివి.

ఏడు
        వారాల
                  నగల్తో

అలంకరించుకొన్న 
                          ధనస్వామ్యపు 
                                               కవిత్వం
పేదవాడి 
               మురికి 
                          కాల్వలలోని
వచనం 
              వైపు 
                      ప్రవహిస్తున్నప్పుడు
బరువైన 
              ఇనుప 
                         గుదిబండ

పారిజాతప్రసూన మవుతుంది

Friday, April 13, 2018

శ్రీశ్రీ - దీర్ఘాలు


శ్రీశ్రీ - దీర్ఘాలు




సాహితీమిత్రులారా!



మనం చిత్రకవిత్వంలో "సర్వగురువులు" అనే పేరుతో
ఒక శబ్దచిత్రం చూచి ఉన్నాము. కాని అవన్నీ దాదాపుగా
సంస్కృతంలోనివే ఇక్కడ "శ్రీశ్రీ"గారు వ్రాసిన
సర్వగురుచిత్రంలోనిది ఈ దీర్ఘాలు  ఇందులో అన్నీ దీర్ఘాలే
గమనించగలరుచూడండి-


ఈనాడూ ఏనాడూ

                                             నీ
                                                 వే
                                                    నూ

                                                      నా
                                                            నీ
                                                                  వూ

తాజాగా రోజాలా

ఆ                     లే                  పా                       లే
           డా                                             డా

నాదానా ఓచానా


                                                             (నవత త్రైమాసిక - నవంబరుప, 1963)

Thursday, April 12, 2018

ఉలితో చెక్కని రాళ్ళు


ఉలితో చెక్కని రాళ్ళు



సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి


1. రైతు చల్లని విత్తనం
    మేస్త్రీ కట్టని కట్టడం
    చాకలుతకని బట్టలు
    ఉలితో చెక్కని రాళ్ళు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - పళ్ళు(దంతాలు)


2. వంకర టింకర పోతుంది - పాముకాదు
    దారి పొడుగునా దాహం తీరుస్తుంది - వాన కాదు
    కొండకోనలో తిరుగుతుంది - ఎలుగుగొడ్డు కాదు
    సముద్రంలో మునిగిపోతుంది - చేపకాదు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - నది


Wednesday, April 11, 2018

కాళ్ళ సందుదేందిరా కారేది యేదిరా


కాళ్ళ సందుదేందిరా కారేది యేదిరా




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి-


1. నిలబడ్డదేందిరా
    కూసున్నదేందిరా
    కాళ్ళ సందుందేందిరా
    కారేది యేందిరా
    నిలబడ్డది బర్రెరా
    కూసున్నది మనిషిరా
    కాళ్ళ సందుది చెంబురా
    కారేది పాలురా


సమాధానం - దానేలోనే ఉన్నాయి

    నిలబడ్డది బర్రెరా
    కూసున్నది మనిషిరా
    కాళ్ళ సందుది చెంబురా
    కారేది పాలురా



2. చూస్తే ఒకటి, చేస్తే రెండూ, తలకూ తోకకూ
    ఒకటే టోపి చెప్పండీ, యిది చెప్పండీ?


సమాధానం - కలం

Tuesday, April 10, 2018

నీటికి నానదు, గాలికి కరుగు


నీటికి నానదు, గాలికి కరుగు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి-

1. నిగనిగలాడే నిర్మల వస్తువు,
   ఘుమఘుమలాడే గుమ్మగు వస్తువు,
   భుగ భుగ మండే పరిమళ వస్తువు,
   నీటికి నానదు, గాలికి కరుగు, నిప్పుడు మండు
   ఏమిటిది చెప్పండి?


సమాధానం - కర్పూరం


2. పడమట ముఖమమ్మ,
    పాతాళ గంగమ్మ,
    పట్టమ్మ నీ ముడ్డిలోకి కట్టె పెట్టమ్మ
    ఏమిటో చెప్పండి ?


సమాధానం - పొయ్యి 

Monday, April 9, 2018

కొమ్ముకు కోటి బిడ్డలు పుట్టె


కొమ్ముకు కోటి బిడ్డలు పుట్టె




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-

1. విసన కర్రకాడ వింతలు బుట్టె,
    కోట కొమ్మకాడ కొమ్ములు బుట్టె,
    కొమ్ముకు కోటి బిడ్డలు పుట్టె
    ఏమిటో చెప్పండి?


సమాధానం - పసుపు చెట్టు


2. ముట్టె పిసికి,
    మూతి నాకి,
    తీపు చూసి,
    లొట్టవేయు
    ఏమిటది?


సమాధానం - మామిటి పండు

Sunday, April 8, 2018

తూలి తూలి దుముకుతారు


తూలి తూలి దుముకుతారు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి -


1. కుర్ కుర్ రాజ్యంలో
    టుర్ టుర్ దొరలు,
    కాలి నడక నడవబోయి
    తూలి తూలి దుముకుతారు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - పిచ్చుకలు



2. కథల కామి రెడ్డి వీపున మోకాళ్లు
    మిడత పోయి మీయబ్బ కణత కరిసె
    ఈర్పెన పోయి యిల్లెక్కె
    చెదలు పోయి చెన్న పట్నం చేరె
    ఏమిటో చెప్పండి?


సమాధానం - 
   కథల కామి రెడ్డి వీపున మోకాళ్లు - మిడత
   మిడత పోయి మీయబ్బ కణత కరిసె - ఈర్పెన
   ఈర్పెన పోయి యిల్లెక్కె - చెదలు
   చెదలు పోయి చెన్న పట్నం చేరె - జాబు

Saturday, April 7, 2018

కోక ఉన్న సీత కాదు


కోక ఉన్న సీత కాదు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-


1. తొండమున్న ఏనుగు కాదు,
    రెక్కలున్న పక్షి కాదు,
    ఆరుకాళ్ల చీమ కాదు,
    కోక ఉన్ సీత కాదు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - సీతాకోక చిలుక



2. తెల్లపాయంత ఎద్దు,
    జీలకర్రంత కొమ్ము,
    ఎంతటి మనిషినైనా లొంగదీస్తుంది
    ఏమిటో చెప్పండి?



సమాధానం - పల్లేరుకాయ

Friday, April 6, 2018

మావారు చూస్తే మాటొస్తుంది


మావారు చూస్తే మాటొస్తుంది



సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి-


1. నువ్వేమో రమ్మంటావు
    నేనేమో రావాలనుకొంటాను
    మావారు చూస్తే మాటొస్తుంది,
    రాత్రికయితే వస్తాను
    అంటే ఏమిటో చెప్పండి?


సమాధానం - నిద్ర


2. నూతిలోని పాము నున్నని పాము,
    పొడల పొడల పాము పొట్టి పాము,
    వాడవాడ పాము వాలైన పాము,
    పాముని పట్టుకొని రాగా మా అమ్మ వండి పెట్టె
    అంటే ఏమిటో చెప్పండి?



సమాధానం - పొట్లకాయ

Thursday, April 5, 2018

రంభ ముక్కున నుండు


రంభ ముక్కున నుండు




సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి-


1. కొండ నుండు
    పెండె నుండు
    రాజు గారి శిరసు నుండు
    రంభ ముక్కున నుండు
    ఏమిటో చెప్పండి?


సమాధానం -
   కొండ నుండు - పులి
   పెండె నుండు - పాము
   రాజు గారి శిరసు నుండు - కిరీటం
   రంభ ముక్కున నుండు - నత్తు



2. కుట్లు, కుట్లు, మిషను కుట్లు,
    దాని భోజనమే రాజ భోజనం,
    దాని చావే కుక్క చావు
    ఏమిటో చెప్పండి?


సమాధానం - విస్తరాకు

Wednesday, April 4, 2018

విసనకర్ర శతకము


విసనకర్ర శతకము

         
సాహితీమిత్రులారా!

 "హరి బ్రహ్మేశ్వర"గారు
 "విసనకర్ర శతకం"
ఒక గంటలో వ్రాశారు
ఇది హాస్యరస ప్రధానమైన
శతకం గమనించండి-


శ్రీపదంబ నిన్ను చేర్చి మొట్టమొదట
చేతికొద్దివ్రాయజూతు మహహ
తప్పులున్న యెడల తప్పునీదేసుమా
విశ్వదాభిరామ విసనకర్ర!

ప్రధమ భాగము
దైవప్రార్థనములు

-: శారద :-

1. ఏమి శారదాంబ! ఎలమితో మానాల్క
పై వసించెదేని పద్యములను
వ్రాయువారమమ్మ హాయినవ్వుజనింప
విశ్వదాభిరామ విసనకర్ర!

-: పార్వతీదేవి :-

2. తల్లి పార్వతమ్మ దయఁతోడ జూచిన
యితర దైవములకు నుతులవేల
తల్లిస్తన్యమున్న దాయీలు ముచ్చటా
విశ్వదాభిరామ విసనకర్ర!

-: గణపతి :-

3. గణపతయ్య మాకు కలిగింప కడ్డాలు
మిమ్ముగన్న తల్లి మమ్ముఁగాచు
ఆవుతోడ దూడయరు గదా విఘ్నేశ
విశ్వదాభిరామ విసనకర్ర!

-: లక్ష్మి :-

4. మొదలు నిన్ను బిలువ మొగమాటమగునంచు
మువ్వురైన పిదప ముచ్చటగను
పిలిచినాము గాని బిర బిర రావమ్మ
విశ్వదాభిరామ విసనకర్ర!

-: బ్రహ్మ :-

5. ఆలయంబులేదు హరుశాపమున నీక
టంచు చింతపడకుమయ్య నలువ
కలియుగానఁగలదు ఘనబ్రహ్మమతమొండు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: శివుడు :-

6. గంగ నెత్తిమీద కలదంచు గర్వింతె
పార్వతమ్మయింటఁ బరఁగుచుండి
జపతపాల ఫలము జంటభార్యలటోయి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: విష్ణు :-

7. లచ్చి మగడవటంచు బిచ్చంబు వేడెద
యేమి యిచ్చువాఁడవో మురారి
యిచ్చు వరముతోడ హెచ్చు నీపై భక్తి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: లక్ష్మీనృసింహస్వామి :-

8. స్వర్ణకశిపు పట్టి ప్రహ్లాదు కధ చెవు
లారవినుచు లక్ష్మినారసింహ
భక్తి నిన్ను గొలువ వరములేమిచ్చెదో
విశ్వదాభిరామ విసనకర్ర!

-: శ్రీవెంకటేశ్వరులు :-

9. కలియుగాన నీవె ఘనదైవమనుమాట
నిజము తెలుపవలయు సుజనవరద
ఎంత ధనము నిత్తొ గంతువేసెద మిప్డె
విశ్వదాభిరామ విసనకర్ర!

ద్వితీయభాగము
దేశప్రార్థనలు

-: భరతమాత :-

10. దేశమాతలందు దీనాన నవుగాక
పరువు నిల్పుకొమ్మ భరతమాత
శిరియులేమి యెపుడు చీకటి వెన్నెలల్
విశ్వదాభిరామ విసనకర్ర!

11. గాంధితిలకు బోలు ఘనమైన సుతులెల్ల
నిన్ను గొలుచుచుంట నెన్నికొనుచు
గరువమూనుమమ్మ భారతీ తల్లిరో
విశ్వదాభిరామ విసనకర్ర!

12. భరతపురము కోట భగ్నమైనయపుడు
సోమనాధపురము చొచ్చునపుడు
మన తురుష్క ఘనుల మన్నించితివె తల్లి
విశ్వదాభిరామ విసనకర్ర!

13. ఐకమత్యమొక యమరియుంటయెచాలు
నదె స్వరాజ్యసిద్ధియదె స్వతంత్ర
మని యెఱుంగ సుతుల కానతిమ్మమ్మరో
విశ్వదాభిరామ విసనకర్ర!

-: ఆంధ్రమాత :-

14. ఆంధ్రజాతి యెల్ల నల్లకల్లోలమై
యితర భాషలందు నిమిడియుంత
పాడిగాదు వలయు ప్రత్యేకరాష్ట్రంబు
విశ్వదాభిరామ విసనకర్ర!

15. భారతీయసభను ప్రత్యేకరాష్ట్రంబు
కలిగె ప్రభువులీయవలయు నికను
ఆంధ్రసుతుల కట్టి యానందమెప్పుడో
విశ్వదాభిరామ విసనకర్ర!

-: గుంటురు మండలము :-

16. పన్నులీయవలదు వలదంచు నెఱిగితి
వింతలోన భయము గొంతుకొఱికె
ఎలుకపిల్లయొక్కటెట్లు పట్ట ...
విశ్వదాభిరామ విసనకర్ర!

-: కొండవీటిసీమ :-

17. రెడ్డిప్రభువులందు రేబవళ్ళును లచ్చి
తాండవింపగను నఖండ శక్తి ....
కొండవీడు జూపకుండునా యికముందు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: గుంటూరు నగరము :-

18. గంటెడేని చాలు గుంటురు నీరంబు
ప్రీతి గ్రోలువాడు వీరుఁడనుచు
గొప్ప పేరుగంటి గుంటూరు నగరమా
విశ్వదాభిరామ విసనకర్ర!

తృతీయభాగము
పూర్వజన ప్రశంస

19. పూర్వకవుల నెల్ల పొగడంగవలెనయ్య
తిరిగి రారికెన్ని తిట్లకైన
స్వర్గమందువారు చక్కగా నున్నారు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: నన్నయభట్టు :-

20. మొదటి తెనుగు పద్యముదయించె నీ నోట
ననెడిమాట సత్యమగునొ కాదొ
చెప్పు వందనాలు నిప్పింతు నన్నయా
విశ్వదాభిరామ విసనకర్ర!

-: తిక్కనసోమయాజి :-

21, తిక్కనార్యశైలియొక్క చక్కదనంబు
నొక్కి చెప్ప ప్రజకక్కజముగ
నొక్కమారువచ్చి యొకవందనముగొమ్మ
విశ్వదాభిరామ విసనకర్ర!

-: కాళిదాసు :-

22. కలియుగానవేయి కాళిదాసులు బుట్టి
వందనాల వారె యందికొనుట
కలిగె సందియంబు కాళిదాసా రమ్ము
విశ్వదాభిరామ విసనకర్ర!

-: వాల్మీకి :-

23. పుట్టలోన దూరి పుట్టెడు గ్రంధంబు
వ్రాసినాడ వంట రామకధను
మరల వ్రాయరావె మఱియొండు వాల్మీకి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: పోతన :-

24. పోతనార్యుడెట్టి పోకడ పోయినా
యడ్డు చెప్పువారవని లేరు
నుతి యొనర్చుడయ్య నోరూరు కొలదిని
విశ్వదాభిరామ విసనకర్ర!

-: మొల్ల :-

25. కుమ్మరయ్య గన్న కూతురైతేనేమి
యాడుదైన నేమి యాంధ్రశైలి
వలయునన్నవారు వలయు మొల్ల నెఱుంగ
విశ్వదాభిరామ విసనకర్ర!

-: అప్పకవి :-

26. అప్పకవిస్మరింపనయ్యయో మరచుటా
యతడును తెలగాణ్యుడయ్యలార
పద్యములను వ్రాయ ఫక్కి గ్రంధము వ్రాసె
విశ్వదాభిరామ విసనకర్ర!

-: చిన్నయసూరి :-

27. బ్రాహ్మణాళికెల్ల బహులజ్జగలిగింప
వ్యాకరణము వ్రాశి వదిలె నహహ
లేతవైష్ణవుండు సాతాని చిన్నయ్య
విశ్వదాభిరామ విసనకర్ర!

చతుర్ధభాగము
నవీనజనప్రశంస

-: ప్రస్తుతకవులు :-

28. బ్రతికియున్న కవులు పరమ దుర్మార్గులు
వెదకి తప్పులెల్ల వెలువరింతు
రెదురు రాకుఁడంచు పదివేల నతులిత్తు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: పండితులు :-

29. పద్యమల్లలేని పండితవర్గులు
దోషము వెదుకనభిలాషతోడ
కష్టపడఁగవలదు కట్టెడు వందనాల్
విశ్వదాభిరామ విసనకర్ర!

-: సరసులు :-

30. అలుపులేక మీరలడుగకున్నాగాని
యట్టులిట్టులనుట యెట్టిదయ్య
సరసులైన చదివి సంతోషమందుడీ
విశ్వదాభిరామ విసనకర్ర!

-: సంపాదకులు :-

31. పొట్ట కూటికొఱకు పుట్టెడు విద్యలు
మీకు మాకు జూడ లోకమొకటి
వ్రాయఁదలతురేని వ్రాయండి మంచియే
విశ్వదాభిరామ విసనకర్ర!

-: తర్జుమాదారులు :-

32. తర్జుమాకు మీకు తగు జీతమిచ్చిరి
హెచ్చొనర్ప నేరికినచ్చలేదు
పిచ్చిగ్రంధములకు హెచ్చు పేరిడకండి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: పోలీసయ్యగారు :-

33. పోలిసయ్య జోలి పోవద్దు మన మెప్పు
డతని యూహ సుజనులవని లేరు
చదువు వానిలోన సందేహములు మెండు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: చదువరులు :-

34. యిచ్చ వచ్చినటులనేమేని చెప్పుడీ
మూడణాల నిచ్చి ముందు కొనుడు
ద్రవ్యమిచ్చువారి దర్జాలు వేరయా
విశ్వదాభిరామ విసనకర్ర!

-: ప్రయాణికులు :-

35. రైలుబండి నెక్కి పాలుపోకనె మీరు
కొంటిరేని చదువుకొనుడు దీని
పద్యములను మీకు బడలిక యుండదు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: విద్యార్ధులు :-

36. విద్యనభ్యసించువేళ నీకొఱగాని
వెర్రి శతకములను వినకుఁడయ్య
పాఠముల పఠించి బాగుగా నుండుడీ
విశ్వదాభిరామ విసనకర్ర!

పంచమభాగము
దేహభాగములు

-: చేతులు :-

37. చేయుపనులుమాని చిత్తగించుట యొరుల్
న్యాయమేమి యంచు మాయ చేతు
లూరకున్నయెడల నుండునా దేహంబు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: కాళ్ళు :-

38. దేహమెల్ల మోయు దీనులమా మేము
కదులబోమటంచు కాళ్ళు చెప్ప
గర్వభంగమదియె కడమ దేహంబునకు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: కనులు :-

39. కనులు చూచుచున్న కలదులోకంబెల్ల
కనులు మూసికొనిన కదులలేము
కనులు లేనివారు ఘనులెందఱిలలేరు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: చెవులు :-

40. చెవుల విననివాడు చెవిటివాడనుచుందు
రతని తెలివి యుండదితరులకిల
చెవిటివాని కనులు చెవులంత పనిచేయు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: నోరు :-

41. తిండి తినుటకొకటి తినిత్రాగుటకు రెండు
నోరు చేయు కృషిని గౌరవింప
నితర యంగముల హెచ్చరింపవలదె
విశ్వదాభిరామ విసనకర్ర!

-: కొండనాల్క :-

42. కొండనాల్క యొకటియుండ పల్కంగనౌ
నద్దిలేక పలుక నలవిగాదు
మూగవారి జూచి ముక్కునంటగఁరాదు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: గోళ్ళు :-

43. గోళ్ళు పెంచుకొనిన గోకుట సులభంబు
దురద పుట్టునపుడు కరము సుఖము
పిరికివాళ్ళు గోళ్ళు పీకించుకొందురు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: ముఖము :-

44. మోసగాని ముఖము ముందు గుర్తింపనౌ
మంచివాని ముఖము నెంచఁదగును
ముఖమె జ్ఞాన నేత్రమునకు స్థానంబయా
విశ్వదాభిరామ విసనకర్ర!

-: ముక్కు :-

45. ముక్కు లేనివాడు ముక్కిడివాడౌను
ముక్కు సొగసు దెచ్చు ముఖము కెల్ల
ముక్కులోన పొడుము నెక్కింపవలెనయా
విశ్వదాభిరామ విసనకర్ర!

షష్టమభాగము
దుస్తులు

-: లాంగుకోటు :-

46. లాంగుకోటు దొడిగి ఠంగుమంచనియేగు
ప్లీడరయ్య నెపుడు పిలువఁదగదు
పిలువగానె యతడు ఫీజును గోరును
విశ్వదాభిరామ విసనకర్ర!

-: షార్టుకోటు :-

47. షార్టుకోటు నే డిపార్టుమెంటు గుమాస్త
దొడిగినాడొ జూచి యడుగుడయ్య
యతని సాయమబ్బు నర్ధరూపాయికే
విశ్వదాభిరామ విసనకర్ర!

-: వేష్టుకోటు :-

48. వేష్టుకోటుతోడ వెడలు వాడెవ్వడు
పిలువ వలదతండె పిలచుచుండు
కంపెనీలకెల్ల ఘనుఁడీతడే జంటు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: షర్టు :-

49. షర్టుతోడ నేగు చాకలి వీరాయ
పిలిచి మాటలాడ తెలిసె నహహ
క్రొత్తషర్టు నాది కూర్మిదొడఁగె వాడు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: బనియను :-

50. క్రొత్తబనియనొకటి కోర్కెమైఁదొడగంగ
పర్రుమంచు చినిగె పాపమకట
బనియనొకటి లేక మనలేరె మనవారు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: గూడకట్టు :-

51. గోచి పెట్టుకొనుచు గూడకట్టును గట్ట
నరవవారు మిగుల నందగాండ్రు
గోచి లేకఁగట్టుకొనువారు కొందఱు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: బిళ్ళగోచి :-

52. బిళ్ళగోచి పెట్ట పెద్దవాడనుకొంటి
చుట్టగాల్చు నితడు షోకుగాను
చంకనున్న గీత చదివినాడో లేదో
విశ్వదాభిరామ విసనకర్ర!

-: నెక్కుటై, సాక్సు బూట్సు :-

53. నెక్కుటై ధరించి నిలువుటద్దముఁజూచి
సాక్సుబూట్సు వేయసాగినాడు
చలవమడత షోకు చదువుసంధ్యల కేల
విశ్వదాభిరామ విసనకర్ర!

-: హాట్ :-

54. హాటుబూట్సు వేసి యరుదెంచు దొరగారి
కై సలాముజేయ నాసఁజూడ
నల్లమొగమగుపడి నవ్వు నాకరుదెంచె
విశ్వదాభిరామ విసనకర్ర!

సప్తమభాగము
పరికరములు

(పద్యములు 55 నుండి 61 వరకు దొరకలేదు)

-: గరిటెకాడ :-

62. గరిటెకాడకూర కరకరగ వేగించు
నడ్డువచ్చుపిల్లి నణుగకొట్టు
వంటకాకముందు వచ్చుమగనికొట్టు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: విసనకర్ర :-

63. చెమటపూయునపుడు చేజిక్కి వేధించి
పడతికొట్టునదియె భిడియపడక
వీపుగోకుకొనగ విసనకర్రయె చాలు
విశ్వదాభిరామ విసనకర్ర!

అష్టమభాగము
ఆత్మబంధువులు

-:చవతితల్లి :-

64. చవతితల్లి పోరు చవతిప్రయాణంబు
కవలతల్లి కాన్పు బలువనిదుర
విరసమగునెకాని సరసంబుకాదయా
విశ్వదాభిరామ విసనకర్ర!

-: బావమఱది :-

65. కాలిలోనిముల్లు కంటిలోనినలుసు
కడుపులోనిశూల కలసియెక్క
టైన బావమఱదియైనిల్చె నిచ్చట
విశ్వదాభిరామ విసనకర్ర!

-: అత్త :-

66. నవ్వుచున్నవేళ పువ్వులజల్లుచు
మాటవిననియెడల మండిపడుచు
పిల్లనింటనుంచ వేడునత్తగనండి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: కోడలు :-

67. మనసుబుట్టు భర్త మాటాడవలెనంచు
నత్తజూచునంచు నణిగియుండు
కోడలుగనుకోపమాడుబిడ్డలమీద
విశ్వదాభిరామ విసనకర్ర!

-: భార్య :-

68. వ్యాధిపీడచేత బాధింపబడువాడు
చేతకాసులేక చిక్కునాడు
భార్యకోరివచ్చు భ్రష్టుండు సైతము
విశ్వదాభిరామ విసనకర్ర!

69. వెండిచెంబుతోడ వెండిపళ్ళెముతోడ
కొత్తబట్టతోడ నత్తతోడ
మురియుచుంట భార్య మరచునల్లుండహో
విశ్వదాభిరామ విసనకర్ర!

-: ముసలమ్మ :-

70. కొడుకుమంచివాడు కోడలుచెడ్డది
మనుమరాండ్రకిడును ధనముగొంత
వంటచేసిపెట్టు నింటిలో ముసలమ్మ
విశ్వదాభిరామ విసనకర్ర!

-: ఆడుబిడ్డ :-

71. పెండ్లి కట్నములను వేమారు దెప్పుచూ
పెండ్లికొరకు దీక్ష బట్టియుండు
నాడుబిడ్డయన్న నధికార మెక్కువ
విశ్వదాభిరామ విసనకర్ర!

-: తోడికోదలు :-

72. ఆడుబిడ్డయెపుడొ యరుదెంచునేగాని
తోడికోడలమ్మ కూడనుండి
బావగారియెదుట లావునేరము సెప్పు
విశ్వదాభిరామ విసనకర్ర!

నవమభాగము
చుట్టములు

-: ఆలివంకవారు :-

73. పిల్లనిచ్చినాము పిండంబుగతిలేదె
యల్లునింటననుచు నరుగుదెంచు
నాలివంకవారి యధికారమొకరీతి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: తల్లివంకవారు :-

74. అమ్మసేమమక్కొ యయ్యడబ్బిచ్చునా
యనుచు హెచ్చరించి చనువుగాను
తల్లివంకవారు దయచూపుటొకరీతి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: తండ్రివంకవారు :-

75. పొలములేమిగలవు భూములుపండునా
రొఖ్కమెంత నిలువ రూఢిజెప్ప
వలయుననెడితండ్రివంక వారొకరీతి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: వియ్యాలవారు :-

76. అల్లుడొకడుమిగిలి యందఱుపోవలె
పిల్లవంటచేయ వల్లగాదు
వేరుబడుటహితము వియ్యాలవారికి
విశ్వదాభిరామ విసనకర్ర!

-: జ్ఞాతులు :-

77. మాటపలుకులేక మఱిభోజనములేక
వైరమూనునట్ట వారుకూడ
జాతశౌచములకు జ్ఞాతులంటేచిక్కు
విశ్వదాభిరామ విసనకర్ర!


-: వారసులు :-

78. ఏలజ్ఞాతియింట చూలాలుకలిగెరా
వారసత్వమెట్లు వచ్చుననుచు
నున్నవారిచావు నెన్నువారసులేల
విశ్వదాభిరామ విసనకర్ర!

-: దత్తపుత్రులు :-

79. యెచటనుండివచ్చిరీ యాస్తిగైకొన
తద్దినాలుపెట్ట దలపరనచు
దాపువారితిట్లు దత్తపుత్రులపాలు
విశ్వదాభిరామ విసనకర్ర!

దశమభాగము
నౌకరులు

-: చాకలి :-

80. అభముశుభములందు నరుదెంచిమామూలు
గొనెడివేళనఱచి గొంతుపగుల
బట్టకొనకకట్టు భడవఝూ(?)మడియేలు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: మంగలి :-

81. పంటలన్నీయెండి పాడయిపోయినా
మంగలయ్యపంట భంగపడదు
గొఱుగుకొలదికురులు పెఱుగునువీనికై
విశ్వదాభిరామ విసనకర్ర!

-: పాలికాపు :-

82. మాలవాడొకండు పాలికాపైయుండి
యింటిగుట్టునెల్ల మంటగలుపు
యింటివారికెపుడు తంటాలువీనిచే
విశ్వదాభిరామ విసనకర్ర!

-: దాసీది :-

83. తెల్లవారుముందె కల్లాపిజల్లుచు
నంట్లుతోమునప్పు డన్నమడిగి
యిల్లునీడ్చునప్పు డెదురాడుదాసీది
విశ్వదాభిరామ విసనకర్ర!

-: డవాలిజవాను :-

84. అవసరంబుకొలది యజమానిపనిచెప్ప
నదియొనర్పనొరుల కాజ్ఞచేసి
కదులకుండువాడు ఘనడవాలి జవాను
విశ్వదాభిరామ విసనకర్ర!

-: పాకీవారు :-

85. పందులున్నయూర పనిలేదువీరికి
సమ్మెకట్టిశక్తి చాలగలదు
మునిసిపాలిటీల ముద్దుబిడ్డలువీరు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: వంటవాడు :-

86. వంటశాలకెల్ల వంటవాడధికారి
వానిలంజకంపు వంతకముల
నింటివారలెప్పు డెఱుగనేలేరయా
విశ్వదాభిరామ విసనకర్ర!

ఏకాదశభాగము
స్నేహితులు

-: ఇరుగుపొరుగువారు :-

87. క్రొత్తగానువచ్చు కోడలిముచ్చటల్
చిత్తగించి గేలిసేయుకొరకు
ఇరుగుపొరుగువారు హితులౌదు రెలమితో
విశ్వదాభిరామ విసనకర్ర!

-: నీళ్ళబావివారు :-

88. నీటికొరకువచ్చి నీలాటిరేవులో
యూరికబురులాడు యువతులందు
చెప్పనలవిగాని స్నేహంబు గలుగదా
విశ్వదాభిరామ విసనకర్ర!

-: గుడిలోనిస్నేహము :-

89. దైవదర్శనంబుకైవచ్చు వారిలో
నొకరిమొగనొక్క రొకటగాంచ
దైవభక్తితోడ లావుస్నేహములబ్బు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: ఆసుపత్రివారు :-

90. వ్యాధిగ్రస్తులందు ప్రత్యేకమగువ్యాధి
గలుగువారలొకట నిలుచునపుడు
వారియందు స్నేహభావంబు హెచ్చదే
విశ్వదాభిరామ విసనకర్ర!

-: రైలుబండి :-

91. లోనికేగువరకు పూనిశత్రుత్వంబు
లోనికేగుపిదప మానువారు
రైలుబండి స్నేహమేలరా గమనింప
విశ్వదాభిరామ విసనకర్ర!

-: పాఠశాలవారు :-

92. పాఠశాలయందు పఠియించునప్పుడు
హెచ్చుతగ్గులేక నిచ్చకొలది
యుండుస్నేహితులకే దండిభేదములబ్బు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: బజారువారు :-

93. గాలికొరకుతిరుగు గంటస్నేహంబొండు
గాలితోడనెగుర జాలునహహ
పాలిపోసి స్నేహజాలంబు పెంచనౌ
విశ్వదాభిరామ విసనకర్ర!

ద్వాదశభాగము
దేశబంధువులు

-: గాంధి :-

94. గాంధిగారువచ్చి గందరగోళంబు
దేశమంతజేసి తిరిగినారు
గాంధిజయిలుకేగ గడచెనారోజులు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: దాసు :-

95. దాసుగారు వచ్చి శాసనసభలకు
పోయి యెదురునిలచి పోరుడనుచు
హెచ్చరింపనదియు హితమయ్యె కొన్నాళ్ళు
విశ్వదాభిరామ విసనకర్ర!

-: నెహ్రూ :-

96. చాలమాటలాడి సామ్రాజ్యశాసన
సభను గెలుపుగాంచ శుభమదేమి
నెహ్రు పండితుండు నేర్పరి యున్నారు
విశ్వదాభిరామ విసనకర్ర!

(పద్యములు 97 నుండి 104 వరకు దొరకలేదు)

త్రియోదశభాగము
అధికారులు

-: కంసాలి :-

105. ఇచ్చు నగల తిరిగి యిచ్చినదాకను
వానిచుట్టు తిరుగవలయుగాన
కలియుగంబున నధికారి కంసాలియే
విశ్వదాభిరామ విసనకర్ర!

-: బాకీదారుడు :-

106. బుజ్జగించి యప్పు పుచ్చుకున్నాడేని
యిచ్చువాడు వానికెన్నిసార్లు
హెచ్చుభక్తినిడునొ యెదురు సలాములు
విశ్వదాభిరామ విసనకర్ర!

చత్రుదశభాగము
అక్షరములు

-: శకటరేభ :-

107. శకటరేఫ నీకు శతకోటిదండాలు
వ్రాతలందు వచ్చి బాధలిడకు
వలయునేని పొమ్ము పండితాళిని జేర
విశ్వదాభిరామ విసనకర్ర!

-: అరసున్న :-

108. వ్రాత చేటెగాని పలుకరించరె వారు
వద్దుపొమ్మని నను సద్దుకొనక
తిరిగి వచ్చితివిట పొరబాటులను చేసి
విశ్వదాభిరామ విసనకర్ర!

ఉపశాంతి

ఏరిమనమును నొవ్వ కోరివ్రాయగలేదు
కోపగింపవలదు గొణగవలదు
చదువువారికెల్ల పదివేలదండాలు
విశ్వదాభిరామ విసనకర్ర!

వలదునవ్వు మీకు వలదుకోపంబును
వలదుతప్పులరయ వలదుదిద్ద
విసనకర్రశతక మసలుహాస్యంబయా
విశ్వదాభిరామ విసనకర్ర!

సమాప్తి

నాల్గుఘడియలేని నలుగురునవ్వంగ
చాలునంచు మేము లీలవ్రాయ
శతకమయ్యె మీరు చదివిక్షమింపుడీ
విశ్వదాభిరామ విసనకర్ర!

(శతకసాహిత్యం బ్లాగ్ స్పాట్ సౌజన్యంతో)