రుక్మిణీదేవి స్తుతి
సాహితీమిత్రులారా!
శ్రీ మోహన్‌లాల్ శర్మ పాండే గారి నతితతి అనే గ్రంథం నుండి
రుక్మిణీదేవి స్తుతి ఆదివర్ణావృత్తి చిత్రంగా కూర్చబడినది.
ఠాలిన్యై ఠక్కురష్ఠఙ్గః,
ఠక్కురైష్ఠక్ఠకాయతే |
ఠఙ్కారైష్ఠాలినీ ఠణ్ఠైః
ఠక్కురాన్ ఠగయత్యసౌ || 10 ||
అన్వయము:
ఠఙ్గః ఠక్కురః ఠాలిన్యై ఠక్కురైః ఠక్ఠకాయతే, అసౌ
ఠాలినీ (అపి) ఠణ్ఠైః ఠఙ్కారైః ఠక్కురాన్ ఠగయతి.
వ్యాఖ్య (ప్రతిపదార్థము):
·
ఠఙ్గః = 'ఠం' అనే
శబ్దముతో కూడిన గమనము కలవాడు, అనగా
వీరోచిత నడక కలవాడు (శ్రీకృష్ణుడు).
·
ఠక్కురః = విఖ్యాత
క్షత్రియుడు.
·
ఠాలిన్యై = ఒడ్డాణము
(కటి సూత్రము) ధరించిన క్షత్రియ కన్య కొరకు (రుక్మిణి కొరకు).
·
ఠక్కురైః = ప్రసిద్ధ
క్షత్రియులైన రుక్మి, శిశుపాలాది రాజులతో.
·
ఠక్ఠకాయతే = యుద్ధము
చేయుచున్నాడు.
·
అసౌ ఠాలినీ = ఆ
ఒడ్డాణము ధరించిన రుక్మిణి కూడా.
·
ఠణ్ఠైః = 'ఠం
ఠం' అనే అవ్యక్త మధుర
శబ్దములతో.
·
ఠఙ్కారైః = కంకణ, ఒడ్డాణాల
మ్రోతలతో.
·
ఠక్కురాన్ = శిశుపాలాది
క్షత్రియులను.
·
ఠగయతి = వంచించుచున్నది
(అనగా తన సౌందర్యముతో, శృంగార భావముతో వారిని
యుద్ధ విముఖులను చేయుచున్నది).
వ్యుత్పత్తి:
సంస్కృత కోశాలలో 'ఠ' అక్షరంతో
మొదలయ్యే పదాలు చాలా అరుదు. వామన ఆప్టే కోశంలో 'ఠ' అంటే
అనుకరణాత్మక ధ్వని అని, 'ఠక్కురః' అంటే
దేవతామూర్తి లేదా గౌరవప్రదమైన బిరుదు (ఠాకూర్) అని, 'ఠాలినీ' అంటే
ఒడ్డాణము అని అర్థాలు ఇవ్వబడ్డాయి.
-------------------------
'ఠ' టవర్గంలోని రెండవ అక్షరం. దీనికి పాత్రలు కింద పడినప్పుడు వచ్చే ధ్వని అని అర్థం. ఈ అక్షరంతో శ్లోక నిర్మాణం చాలా శ్రమతో కూడుకున్నది.
'ఠం ఠం' అని
గంభీరంగా నడుస్తూ, క్షత్రియ కులంలో
వీరోచిత కర్తవ్యాలకు ప్రసిద్ధి చెందిన శూర యాదవ నరేశుడు శ్రీకృష్ణుడు, బంగారు
ఒడ్డాణము ధరించిన రాజకుమారి రుక్మిణి కోసం, విఖ్యాత
వీరులైన రుక్మి మరియు శిశుపాలాది రాజులతో యుద్ధం చేస్తున్నాడు. ఆ కాంచీధారిణి
(రుక్మిణి) తన ఆభరణాల మధుర ధ్వనులతో శిశుపాలాది వీరులను వంచిస్తోంది, అనగా
వారిని యుద్ధం నుండి విముఖులను చేస్తోంది.

