Thursday, October 14, 2021

గర్భచిత్రం

 గర్భచిత్రం
సాహితీమిత్రులారా!

శ్రీ చింతా రామకృష్ణరావు గారి

గర్భకవిత్వానికి చెందిన

ఒక పద్య వివరణ ఈ వీడియోలో గలదు 

ఆస్వాదించండి-Tuesday, October 12, 2021

విడిది చెపుమన్న పాలిండ్ల నడుమఁజూపె

 విడిది చెపుమన్న పాలిండ్ల నడుమఁజూపె
సాహితీమిత్రులారా!ఈ పద్యం గమనించండి

ఇందులో ఒకస్త్రీని అడిగిన ప్రశ్నలకు

ఆమె చూపిన సంజ్ఞలను బట్టి 

సమాధానం తెలుసుకోవాలి

గమనించండి-


రాజీవగంధి నీ రాజ్యమెక్కడిదన్న

                 నొకచేత కొప్పువెండ్రుకలు చూపె

పద్మాయతాక్షి నీ పట్టణంబేదన్న

                 నగుచు నెడ్డాణంపు నడుముఁజూపె

బింబాధరోష్ఠి నీ పేరేమి చెపుమన్న

                 సొగసైన శుకవాణి మొగముఁజూపె

నిందీవరాక్షి నీ కెందరు విభులన్న

                 ఘనమైన ముద్దుటుంగరముఁజూపె

విడిది చెపుమన్న పాలిండ్ల నడుమఁజూపె

కులముఁగోరిన కదళికా తరువుఁజూపె

తరుణి రమ్మన్న తాంబూల మెఱుపుఁజూపె

భళిర వినరయ్య యీజాణ ప్రౌఢతనము


వీటిలోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా ప్రయత్నించండి

1. రాజీవగంధి నీ రాజ్యమెక్కడిదన్న

                 నొకచేత కొప్పువెండ్రుకలు చూపె

                                                   1.కురుదేశము

2. పద్మాయతాక్షి నీ పట్టణంబేదన్న

                 నగుచు నెడ్డాణంపు నడుముఁజూపె

                                                     2. కాంచీపట్టణము

3. బింబాధరోష్ఠి నీ పేరేమి చెపుమన్న

                 సొగసైన శుకవాణి మొగముఁజూపె

                                                         3. చంద్రవదన

4. ఇందీవరాక్షి నీ కెందరు విభులన్న

                 ఘనమైన ముద్దుటుంగరముఁజూపె

                                                       4. ప్రభువులు(బంగారమిచ్చినవారు)

5. విడిది చెపుమన్న పాలిండ్ల నడుమఁజూపె

                                                   5.కొండల మధ్య

6. కులముఁగోరిన కదళికా తరువుఁజూపె

                                                    6. భోగమ కులము

7. తరుణి రమ్మన్న తాంబూల మెఱుపుఁజూపె

                                                    7. సాయంకాలము

Sunday, October 10, 2021

పద్యం పాటలా పాడటానికి వీలుగా

పద్యం పాటలా పాడటానికి వీలుగా
సాహితీమిత్రులారా!

రామరాజభూషణుని ఈ పద్యం ఆస్వాదించండి

పాటలాగా పాడటానికి వీలుగా ఉన్నది

ఈ వీడియోలో గమనించగలరు-Saturday, October 9, 2021

సౌందర్యలహరి లోని గూఢచిత్రం

సౌందర్యలహరి లోని గూఢచిత్రం
సాహితీమిత్రులారా!శంకరాచార్యుల సౌందర్యలహరిలో
జగన్మాతను  ప్రముఖమైన
ఉత్తరభారతదేశ పట్టణాలతో
వర్ణించారు గమనించండి-


విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా2ధారా కిమపి మధురా2 భోగవతికా
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే
                                                                                       (సౌుదర్యలహరి - 49)


విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా2ధారా కిమపి మధురాభోగవతికా
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే


ఇందులో వర్ణించిన నగరాలకు నగరపేరుగా అర్థం లేకుండా
మరో అర్థం వచ్చేలా కూర్చారు శంకరులవారు

తే - నీ, దృష్టిః - చూపు, విశాలా - విస్తృతమైనది, కళ్యాణీ - మంగళ
స్వరూపం, స్ఫుట రుచిః - చక్కని కాంతివంతం, కువలయైః - నల్లకలువలచే,
అయోధ్యా - జయించడానికి వీలుకాని, కృపాధారాధారా-
దయకుఆధారమనదగ్గ, కిమపి - ఇలాంటిదని చెప్పడానికి వీలుకానిది,
మధురా - గొప్ప ఆనందదాయక, ఆ భోగవతికా - విశాలదృక్పధం గలది,
అవంతీ - రక్షణ లక్షణం కలది, బహునగర విస్తార - పలునగర విస్తీర్ణం గలది,

విజయ - విజయం గల, తత్ నామ వ్యవహరణా - ఆ పట్టణాల పేర్లతో 

పిలువబడేది, యోగ్యా విజయతే ధ్రువం - నిశ్చయంగా అందుకు తగింది.

Wednesday, October 6, 2021

చ్యుత చిత్రము

 చ్యుత చిత్రము
సాహితీమిత్రులారా!చ్యుతము అంటే తొలగించడం. కొన్ని అక్షరాలను తొలగిస్తే ఏర్పడే చిత్రం

ఇక్కడ గమనిద్దాం-

నగతనయన్ ధరన్ సిరిని నాలుగు వర్ణములన్ లిఖించి యా

చిగురున నక్షరంబిడిన చొప్పున నొక్కొక్క యక్షరంబునన్

అగును గజాననుండు నొకటాదిగ దీయ చతుర్ముఖుండు రెం

డుగ నటుదీయ షణ్ముఖుఁడు, వెంటనే పంచశరుండు వహ్నియున్


పై పద్యం ప్రకారం

నగతనయ - ఉమ

ధర - కు

సిరి- మా

ఉమాకుమా అనే అక్షరాలకు చేర్చిన ఉమాకుమార అవుతుంది

ఉమాకుమార అంటే గజాననుడు, వినాయకుడు

ఉమాకుమార - లో మొదటి అక్షరం తీసివేస్తే

మా కుమారుడు అవుతుంది అంటే బ్రహ్మ(చతుర్ముఖుడు)

మా కుమార - లో మా తీసివేస్తే కుమార

కుమార అంటే కుమార స్వామి (షణ్ముఖుడు)

కుమార - లో కు తీసివేసిన మార

మార అంటే మన్మథుడు(పంచశరుడు)

మార-లో మా తీసివేస్తే ర

ర అంటే వహ్ని అగ్ని


Monday, October 4, 2021

Emblematic Poetryఎంబ్లమేటిక్ పోయెట్రి

Emblematic Poetryఎంబ్లమేటిక్ పోయెట్రి
సాహితీమిత్రులారా!

ఆకార నియమ చిత్రమునకు పాశ్చాత్యులు Emblematic Poetryఎంబ్లమేటిక్ పోయెట్రి అనేపేరు పెట్టుకున్నారు. ధనుస్సు, మధుపాత్ర, సిలువ, ఆకారాలలో పద్యములు ఇమిడే విధంగా కొందరు ఆంగ్లరచయితలు కూర్చారు. దీన్నే Visual Poetryవిజువల్ పోయెట్రి అని, Pattern poetry పాట్రాన్ పోయెట్రి అని కూడ పిలుస్తారు . పాశ్చాత్యభాషలలో చిత్రకవిత్వం వ్యాసంలో ప్రొఫెసర్ జి.యన్.రెడ్డిగారు వీటిని వివరించారు.

ఈ క్రింది ఉదాహరణలు గమనించండి-
Saturday, October 2, 2021

వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న గూఢచిత్రం

 వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న గూఢచిత్రం
సాహితీమిత్రులారా!వాట్సప్ లో ఈ క్రింది అంశం చక్కర్లు కొడుతున్నది

అది గూఢచిత్రానికి సంబంధించినది గమనించగలరు-

ఒక రైలు ప్రయాణికుడు అచ్చమైన తెలుగులో మాట్లాడవలెనని 

తపనతో బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు-

''ఓ ధూమశకట కార్యాలయాధ్యక్ష, నిక్కమైన రొక్కము పుచ్చుకొని 

సుగ్రీవ సోదరరథపురమునకు ఒక అనుమతి పత్రము దయచేయుమా''

అని అన్నాడు. అతని ప్రయాణము ఎక్కడికి చెప్పుకోండి చూద్దాం


సమాధానం - సుగ్రీవ సోదర రథపురము

సుగ్రీవుని సోదరుడు వాలి

రథము అంటే దీని పర్యాయపదం - తేరు

రెండూ కలిపితే వాల్తేరు

సమాధానం అవుతుంది.