Wednesday, January 31, 2018

కందగర్భిత వచనం


కందగర్భిత వచనం



సాహితీమిత్రులారా!


ఒకే ఛందస్సులో భిన్న భిన్న ఛందస్సులను
ఇమిడించి వ్రాయడాన్నే గర్భకవిత్వం అంటారు.

ఇక్కడ వచనంలో కందపద్యాన్ని గర్భితంగా కూర్చినది
ఒక దాన్ని చూద్దామా
రసస్రువు అనే కావ్యాన్ని
ఆచార్య వి.యల్.యస్.భీమశంకరం గారు కూర్చారు.
అందులోని ఈ కందగర్భ వచనం చూడండి-


వచనం.
ఆ విధంబున తలంచుచు, తనకు వేరు మార్గంబులేదని
నిశ్చయించి, ఆతడు తన మనమందున దహించు తాపంబు 
కతంబున వెలుదెంచెడి దుఃఖంబునంత కఠిన ప్రయత్నమున
నాపంగా సమకట్టి, మహాదేవునిపై దృష్టి మరలించి యిట్లని 
ప్రార్థించె.

ఇందులోని గర్భిత కందం-
వచనం.
ఆ విధంబున తలంచుచు, తనకు వేరు మార్గంబులేదని
నిశ్చయించి, ఆతడు తన మనమందున దహించు తాపంబు 
కతంబున వెలుదెంచెడి దుఃఖంబునంత కఠిన ప్రయత్నమున
నాపంగా సమకట్టి, మహాదేవునిపై దృష్టి మరలించి యిట్లని 
ప్రార్థించె.

గర్భిత కందం-
అని నిశ్చయించి ఆతడు
తన మనమందున దహించు తాపంబు కతం
బున వెలుదెంచెడి దుఃఖం
బునంత కఠిన ప్రయత్నమున నాపంగాన్
                                       (రసస్రువు - పుట. 186)

Tuesday, January 30, 2018

పత్రికా వార్తల పద్యం


పత్రికా వార్తల పద్యం



సాహితీమిత్రులారా!




రోజూ మనం చూచే వార్తాపత్రుకల్లోని
రెండుమూడురోజుకకొకసారైనా కనిపించే
సాధారణ శీర్షికలతో చామర్తి కృష్ణమూర్తిగారు
ఒక శార్దూల పద్యం మలిచారు
ఆ పద్యం -

లారీఢీ, పదిమంది ఠా, పడవ బోల్తా, యాత్రావాసుల్ హరీ,
సారాబాబుల పట్టివేత, ఒక కబ్జాదారుపై కేసు, రా
స్తారాకో, అధికారి ఇంట ధరనా, సర్పంచి కిడ్నాపుతో
చోరీ - అంచు పత్రికా ప్రకటనల్ శోభిల్లు ముప్పొద్దులన్
                                                     (పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట. 82)




Monday, January 29, 2018

నరహరి శతకం


నరహరి శతకం



సాహితీమిత్రులారా!



మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలోని మామిళ్ళపల్లిలో
ఉన్న నృసింహస్వామి ఆలయం ఎంతో పురాతనమైంది.
ఇక్కడున్న నృసింహస్వామిని స్తుతిస్తూ విద్యాశాఖలో వివిధ 
పదవులు నిర్వహించిన మొలగర రంగారావుగారు నరసింహ శతకం
1991లో రచించారు. తెలుగులో శతకమంతా ఒకేప్రాసగల
శతకాలు చాలానే వున్నాయి. కాని పేరును(నామ)ప్రాసగా
శతకం కూర్చారు రంగారావుగారు. మొదటి పద్యంలో నకార ప్రాసం,
రెండవ పద్యంలో ర(రేఫము) కార ప్రాసం, మూడవ పద్యంలో
హ కార ప్రాసం, నాలుగవ పద్యంలో ఇత్వరేఫము(రి) ప్రాసంగా
కూర్చారు. అంటే ఒకసారి నరహరి అని పూర్తికావటానికి 4 పద్యాలు
కావాలి. అలా 108 పద్యాలకు నరహరి నామం 27 మార్లు ఆవృత్తమౌతుంది. 
ఇలాంటి శతకాలు చాల తక్కువగా ఉన్నాయి.
ఇలాంటి శతకం భువనగిరి విజయరామయ్యగారు కూర్చినట్లు
చూచిఉన్నాను. ఇంకా కొందరు కూర్చి ఉండవచ్చు.
ఇక్కడ మానవ సహజనైజాన్ని తెలిపే 83వ పద్యం చూద్దాం-

మోహ విలగ్న చిత్తగతి మూర్ఖుడు గూలు నిరంతరాఘ సం
దోహ మహాహ్రదంబున ననూహ్యగతిన్ దనమేలుకైన య
య్యీ హ లొకింత గైకొనడికే విధి? నిన్ మది నూను? దుష్ట దం
భాహత బుద్ధియై నకట, మామిళపల్లి నృసింహ! యో! ప్రభూ!

(కె.వి.రమణాచారి గారి పద్యకవిత్వం - వస్తువైవిధ్యం నుండి)

Sunday, January 28, 2018

మఠమున సన్న్యాసి యొకఁడు మానినిఁ గూడెన్


మఠమున సన్న్యాసి యొకఁడు మానినిఁ గూడెన్




సాహితీమిత్రులారా!


సమస్య-
మఠమున సన్న్యాసి యొకఁడు మానినిఁ గూడెన్

గాడేపల్లి వీరరాఘవశాస్త్రిగారి పూరణ-

పఠనాభ్యాసాదులలో
శరుఁడయ్యును సన్యసించి స్మరసుమ బాణో
ల్లుఠితాంత రాత్ముఁడగుచున్
మఠమున సన్న్యాసి యొకఁడు మానినిఁ గూడెన్

ఈయనకు పూర్వము
రాళ్లబండి నృసింహశాస్త్రిగారి పూరణ-

కఠినములగు పూముల్కులు
శరుఁడై మదనుండు వేయ శమదమనములు వీ
డి ఠవరతనమున కొడబఁడి
మఠమున సన్న్యాసి యొకఁడు మానినిఁ గూడెన్

బహుచక్కని పూరణలు కదా!

Saturday, January 27, 2018

ఆద్యుత్తర ప్రహేళిక


ఆద్యుత్తర ప్రహేళిక




సాహితీమిత్రులారా!



ప్రహేళికలో సమాధానాన్ని బట్టి పేరు ఏర్పడుతుంది.
మొదటే సమాధానం వుంటే దాన్ని ఆద్యుత్తరప్రహేళిక
అంటున్నాము. దీనికి ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-

"కురవః" కీదృక్ పరభృత తరుణః త్వయి భాతి జ్వలంత్యామ్?
భీమం ప్రాప్య విలీనాః సహోదరాః కే శతం బ్రూహి?

దీనిలో రెండు ప్రశ్నలున్నాయి-
వాటి సమాధానం మొదటే ఉంది.
సమాధానం శ్లోకంలోనే ఉంటే అది
అంతర్లాపిక ప్రహేళిక అవుతుంది.
అందులో సమాధానం మొదటే ఉంది
కావున దీన్ని అంతర్లాపికలో ఆద్యుత్తర
ప్రహేళిక అంటారు.

సమాధానం - కురవః
రెండుప్రశ్నలకు సమాధానం ఒకటే
అందువల్ల దీన్ని ఏకోత్తర ప్రహేళిక
అనికూడ అనవచ్చు.
"కురవః" 


1. కీదృక్ పరభృత తరుణః త్వయి భాతి జ్వలంత్యామ్?
    నీవు సంభాషించు చుండ యువకోకిల ఎట్లుండును
   - కురవః - కుత్సిత(నికృష్ట)మైన ధ్వని చేస్తున్నట్లుండును.
    (కురవః ఏకవచనం(కురవః  - కురవౌ  - కురవాః))


2.   భీమం ప్రాప్య విలీనాః సహోదరాః కే శతం బ్రూహి?
      భీముని చూచి దాగుకొన్న నూర్గురు సహోదరులెవరు
         - కురవః - కురువంశమున పుట్టిన దుర్యోధనుడు మొదలైన
             కౌరవులు.
             (కురవః బహువచనం(కురుః - కురూ - కురవః))

Friday, January 26, 2018

ఏకాదశ్యా మహోరాత్రే


ఏకాదశ్యా మహోరాత్రే




సాహితీమిత్రులారా!


ప్రహేళికలలో పదవిభాగం తెలియకపోతే
అర్థం మారిపోతుంది దీనికి ఉదాహరణగా
ఈ శ్లోకం చూద్దాం-

ఏకాదశ్యా మహోరాత్రే
కర్తవ్యం భోజన ద్వయమ్
రాత్రౌ జాగరణంచైవ
దివా చ హరికీర్తనమ్

ఏకాదశి పుణ్యతిథినాడు రెండు మార్లు భోజనం చేసి
పగలు హరినామస్మరణ రాత్రిళ్లు జాగరణచేయాలి
అని దీని అర్థం.
కాని పదవిభాగం సరిగా తీసుకుంటే ఇందాక చెప్పిన
ఏకాదశినాడు రెండుమార్లు భోజనం చేయడం ఉండదు.
వాస్తవానికి ఏకాదశి ఉపవాసం చేయాలికదా మరి ఇందులో
మతలబేంటి అంటే పదవిభాగంలో లోపం-
ఇక్కడ  భోజన ద్వయమ్ అనేదాన్ని
భో - జన అని విడదీసుకుంటే
భో - జన - అంటే ఓ నరుడా అని అర్థం.
ఇప్పుడు భావం- ఓ నరుడా,
ఏకాదశినాడు పగలేకాదు రాత్రికూడ రెండింటిని చేయాలి
1. రాత్రి జాగరణము
2. పగలు విష్ణునామస్తోత్రము చేయాలి.

Thursday, January 25, 2018

నెల జూపి లతాంగి ఏడ్చె నేరుపుమీరన్


నెల జూపి లతాంగి ఏడ్చె నేరుపుమీరన్




సాహితీమిత్రులారా!



సమస్య-
నెల జూపి లతాంగి ఏడ్చె నేరుపుమీరన్

 సింహాద్రి శ్రీరంగంగారి పూరణ-

నెలలోపల వచ్చెదనని
పలికినపతిరాక విరహపరవశయై నె
చ్చెలికిం ప్రియభామకు, వె
న్నెలజూపి లతాంగి ఏడ్చె నేరుపుమీరన్

నెలను చూపి ఏడ్చడం ఎందుకు ఇది
చెప్పిన సమయంలో మగడురానందుకు
అని పూరించడం సరైన పూరణేకదా!


Monday, January 22, 2018

సతికలిగిన బ్రహ్మచారి జాతికి హితుడౌ


సతికలిగిన బ్రహ్మచారి జాతికి హితుడౌ




సాహితీమిత్రులారా!


సమస్య-
సతికలిగిన బ్రహ్మచారి జాతికి హితుడౌ

 సింహాద్రి శ్రీరంగంగారి పూరణ-

అతి సంతతి చే దేశము
సతమత మౌనట్టి తరిని చర్చింపంగా
సతిలేని బ్రహ్మచారియు
సతికలిగిన బ్రహ్మచారి జాతికి హితుడౌ

భార్య లేనివాడు బ్రహ్మచారి కానీ భార్య ఉన్నవాడు
బ్రహ్మచారిగా ఎలావుంటాడు. పిల్లలు కనకుండా
ఉంటానికి భార్యవున్నా లేకున్నా బ్రహ్మచర్యవ్రతం
పాటించేవాడు జాతికి హితంకూర్చేవాడే అని
పూరణచేశాడు కవి.


Sunday, January 21, 2018

కుందేటిని కొమ్మకోర కొప్పునతురిమెన్


కుందేటిని కొమ్మకోర కొప్పునతురిమెన్




సాహితీమిత్రులారా!



సమస్య-
కుందేటిని కొమ్మకోర కొప్పునతురిమెన్

సింహాద్రి శ్రీరంగముగారి పూరణ-

ఇందుముఖి తన్నుకోరిన
చందమ్మున ధవుడు స్వర్ణశశకముం దెచ్చెన్
కందోయికి పర్వం బయి
కుందేటిని కొమ్మకోర కొప్పునతురిమెన్

పూరణ బహుచక్కగ ఉన్నదికదా

Saturday, January 20, 2018

ఒకరా యిద్దర ముగ్గురా నలుగురా యున్నారలెందెందరో


ఒకరా యిద్దర ముగ్గురా నలుగురా 



సాహితీమిత్రులారా!


సమస్య-
ఒకరా యిద్దర ముగ్గురా నలుగురా యున్నారలెందెందరో

బాపట్ల వేంకట పార్థసారథిగారి పూరణ-

సుకవుల్ వ్రాసిన పూరణంబులు వినన్ శ్రోతల్ మోదం బుగా,
కుకవుల్ హేళన జేయగా, రచయితల్ కూర్మిన్ యశఃకా ములై
సకలోత్కృష్ట కవిత్వ నిర్ణయ విమర్శల్ జేయగా, కూడిరే!
ఒకరా, యిద్దర, ముగ్గురా, నలుగురా? యున్నారలెందెందరో!



Friday, January 19, 2018

తునిలోపల జగములెల్ల తూగుచు నుండున్


తునిలోపల జగములెల్ల తూగుచు నుండున్




సాహితీమిత్రులారా!



సమస్య-
తునిలోపల జగములెల్ల తూగుచు నుండున్

వేలూరి శివరామశాస్త్రిగారి పూరణ-

ఘనముగ నౌడాత్యము క
ల్పనఁజేయుచు జగములెల్ల పరితోషముగాఁ
గనఁజేయుచుండు భగవం
తునిలోపల జగములెల్ల తూగుచు నుండున్

తునిలో జగమంతా ఎలాతూగుతుంది అనే అసంగతాన్ని
కవిగారు తునికాదు భగవంతుని అని చెప్పడంతో
కాదనే అవకాశంలేకుండా పోయింది.


Thursday, January 18, 2018

ముక్కుమూసి చదువగల పద్యం


ముక్కుమూసి చదువగల పద్యం




సాహితీమిత్రులారా!

ముక్కుమూసి చదువగల పద్యం అంటే
ముక్కుతో పలికే అక్షరాలను వాడకుండా
పద్యాన్ని కూర్చడం దీన్ని నిరనునాసిక
పద్యం అని చెప్పవచ్చు. పోకూరి
కాశీపత్యవధానులనే కవీంద్రుడు
కూర్చిన "శ్రీశౌరిశైశవలీల" అనే
రెండాశ్వాశాల ప్రబంధములోనిదీ పద్యం
ఇందులో కూర్చిన పద్యాలన్నీ నిరనునాశికా
పద్యాలే. ఇందులో శ్రీకృష్ణుని బాల్యక్రీడలు
వర్ణితములు. ఈ పద్యం గోపికలు విరహకారకులైన
మదనాదులను దూషించుట -
చూడండి-

వల యరుసా శరాలివి వేయవేల యీ
                    సారీవు హరువల్ల సావవలయు
శర్వరీశా యేల యోర్వలేవుర రాహు
                    వారయు లేర యీవాఱవలయు
వాయివా సెవలీవ పైరివాసువె యీ
                   వల శేషు వాయులోసొలయ వలయు
సారసశర వయస్యా యీర్షయేల యీ
                  వఱువయి హోరలై యవయ వలయు
లావు వలరావు వెల్లువలార యీర
లొరుల యుసులులరయలేరె యురుల వలల
వాలరే సోలరే సావవలయులేరె
హాళియే లాసి యేల యీలీలరొల్ల
                                                             (శ్రీశౌరీశైశవలీల - 2- 23)


వల యరుసా శరాలివి వేయవేల యీ
                    సారీవు హరువల్ల సావవలయు
ఓయి వలరాజా బాణాలను భూమిపై వేయవెందుకు
ఈ తడవ శివుని వలన పూర్తిగా చచ్చిపోవాల.

శర్వరీశా యేల యోర్వలేవుర రాహు
                    వారయు లేర యీవాఱవలయు
రాత్రికి వల్లభుడవైన ఓ చంద్రుడా మమ్మెందుకు ఓర్చలేవు
నిన్ను రాహువు చూస్తాడులే చచ్చిపోయేలా

వాయివా సెవలీవ పైరివాసువె యీ
                   వల శేషు వాయులోసొలయ వలయు
ఓ వాయుదేవుడా వేడిగా వీచటాని శత్రువువా
నీవు ఆశేషును నోటిలో అలసిపోనూ

సారసశర వయస్యా యీర్షయేల యీ
                  వఱువయి హోరలై యవయ వలయు
మన్మధుని స్నేహితుడవైన ఓ వసంతా
అసహనమెందుకు నీవు 60 దినాలవుతూనే నశించి పోతావు

లావు వలరావు వెల్లువలార యీర
మన్మథుని సైన్యాలైన పక్షులారా మీరు
ఇతరుల సౌఖ్యాన్ని చూడలేడరా

లొరుల యుసులులరయలేరె యురుల వలల
వాలరే సోలరే సావవలయులేరె
హాళియే లాసి యేల యీలీలరొల్ల
ఉచ్చుల్లో వల్లో పడి చచ్చిపోదురుగాక
పరిహాసమా ఉద్రేకించి ఈ విధంగా కేకలేయడమెందుకు

(అంటే మదన చంద్ర వాయు వసంత విహంగాదులను
విరహిణీస్త్రీలకు విరోధులు కావున గోపికలు దూషించసాగిరని అర్థం.)

Wednesday, January 17, 2018

పాండురంగ మహాత్మ్యంలో ఖడ్గబంధం


పాండురంగ మహాత్మ్యంలో ఖడ్గబంధం



సాహితీమిత్రులారా!

తెనాలిరామకృష్ణుడు బంధకవిత్వం చెప్పినట్లు
ఎవరూ చెప్పలేదే ఇదేమిటానుకుంటున్నారా?
కాని ఇది వాస్తవం మన Dr. డి.యస్. గణపతిరావుగారు
ఒక బంధకవిత్వ రచయిత. ఆయన దృష్టిలో పడిన
ఈ పద్యంలో ఖడ్గబంధ లక్షణాలు కనిపించడంతో
ఆయన లోకానికి తెలియజేశారు వారిమాటల్లోనే
ఈ విషయం విందాం-

జయ విజయ పూర్వవిభవ! వి
జయ జయ కల్పనధురీణ! సమదదనుజరా
డ్జయ! సంరక్షిత భువనా!
జయజయ! సుగుణా!గుణాత్మ! జయ శార్ఙ్గధరా!
పాండురంగ మహత్మ్యము - 4 -91

విజయపూర్వకమగు సంపద కలవాడా! ( నీకెచ్చట
 విజయము కలిగిననూ తోడనే సంపద లభించుననుట)
విజయ కల్పనముచేయుటలో నిపుణుడా!
మదించిన రాక్షసరాజులను జయించినవాడా!
రక్షింపబడిన భువనములు కలవాడా!
చక్కనిగుణములు కలిగినవాడా!
ఓ శార్ఞ్గమును ధరించినవాడా!
నీకు జయము! జయమగుగాక!
ఈ పద్యమున ఒక "చిత్ర" మున్నది.
ఈ విషయము ఇప్పటివరకూ ఎవ్వరూ చూపి యుండలేదు.
ఆ అదృష్టము నాకు దక్కవలసియున్నది కాబోలును.
ఈ పద్యము "ఖఢ్గబంధము" నందు ఇముడును.
ఒక కవి బంధకవిత్వము వ్రాసినచో దానిని సూచింపవలెను.
లేనిచో గుర్తించుట సాధ్యము కాదు.
నాకు బంధకవిత్వముతో చిరుపరిచయముండుటచే
నేనీ విషయము గుర్తించితిని.
ఈ క్రింద పద్యమును బంధమునందిమిడ్చి
చిత్రము పొందుపరచుచున్నాను.
ఈ బంధమును గురించి *రెండుమాటలు*
రామకృష్ణుడు ఈ బంధము పనిగట్టుకుని వ్రాసినాడా?
అన్నది ప్రశ్న.
వ్రాసి యుండడనే నా నమ్మకము.
కారణములు వివరింతును.
దీనికి 2 కారణములు చెప్పవచ్చును.

1. పద్యము శార్ఙ్గధరా అని ముగించుట.
శార్ఙ్గము విష్ణువుయొక్క విల్లు.
నిజమునకు ఆతడు ఖడ్గబంధమే
చెయ్యబూనిన పద్యము "నందకధరా" అని
ముగించియుండెడివాడు.
ఎవరేని నందకధరా అనుపదము కందమున చివర
ఇముడజాలదందురేని ఖడ్గధరా అనియో
తత్ప్రత్యామ్నాయమో వాడియుండెడి వాడు.

2. కత్తి అంచుల వెంబడి అక్షరముల సంఖ్య
సమానముగా ఉండునట్లు చెప్పుట సాధారణము.
అప్పుడే బంధమునకు సౌష్ఠవము కలుగును.
కత్తి పై అంచు వెంబడి (నా - డ్జ) 9 అక్షరములు,
కత్తి క్రింది అంచు వెంబడి
(సు - ధ) 11 అక్షరములూ వచ్చెను.
ఇట్టివి బంధకవిత్వారంభకులు చేయు పొరపాట్లు.
ఇట్టి పొరపాటు రామకృష్ణుని వంటి వాడు సేయడు.
అయిననూ చిత్రముగా ఈ పద్యము ఖడ్గబంధమున
ఇమిడినది. ఇది యాదృచ్చకమే యని నా నమ్మకము.
మిగిలిన స్తుతిపద్యములలో కూడ ఏవేని బంధములు ఉన్నవా?
యనునది పరిశీలనార్హము.
ఇక్కడ చూడండి పై పద్యం బంధ చిత్రంగా-


Tuesday, January 16, 2018

ఏకోత్తర చిత్రం


ఏకోత్తర చిత్రం



సాహితీమిత్రులారా!



శ్లోకంలోని అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానమైతే
దానికి "ఏకోత్తర చిత్రమ"ని పేరు. ఈ శ్లోకం గమనించండి-

భ్రమ రహితః కీ దృక్షో, భవతి తరాం వికసితః పద్మ:
జ్యోతిషికః కీ దృక్ష: ప్రాయో భువి పూజ్యతే లోకై:

దీనిలో రెండు ప్రశ్నలున్నాయి
వాటికి సమాధానం ఒకటే పదం.
సమాధానం ఇందులోనే ఉండటం వల్ల ఇది
అంతర్లాపిక సంబంధమైనదిగా
అది -  "భ్రమరహితః"


1. కీ దృక్షో భవతి తరాం వికసితః పద్మ:?
    వికసించిన తామరపువ్వు ఎలా ఉంటుంది?
    -  భ్రమరహితః
    భ్రమర హితః భ్రమరములకు ఇష్టమైనది ఏది? తామరపువ్వు
    అక్కడ (భ్రమర, హితః ) భ్రమరములకు, తుమ్మెదలు హితమైనది.

2. జ్యోతిషికః కీ దృక్ష: ప్రాయో భువి పూజ్యతే లోకై:?
    ఎటువంటి జ్యోతిష పండితుడు గౌరవింపబడుతాడు? 
    -   భ్రమరహితః
    భ్రమ రహితః భ్రమలేకుండా స్పష్టంగా చెప్పగలిగినవాడే జ్యోతిషునిగా
    అందరిచేతా గౌరవించబడతాడు.
    ఇక్కడ భ్రమ, రహితః భ్రమ లేకుండా చెప్పేవాడు,


Monday, January 15, 2018

తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు


తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు




సాహితీమిత్రులారా!




సమస్య-
తండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు


విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

బ్రహ్మ విష్ణు మహేశ్వర వరమువల్ల
దత్తనాథుడు జన్మంచి ఉత్తముడయి
అత్రి అనసూయలైనట్టి అతని - తల్లి
దండ్రులకు మ్రొక్కెను పతివ్రతా సుతుండు

ఇందులో పతివ్రతా కుమారుడు తండ్రులకు
మ్రొక్కడంలోని అసంగతాన్ని తల్లిదండ్రులకు
అనడంతో సరిఅయినదిగా మారింది.

Sunday, January 14, 2018

గర్భములో నుండి వెడలె కమలాప్తుడుఁడొగిన్


గర్భములో నుండి వెడలె కమలాప్తుడుఁడొగిన్




సాహితీమిత్రులారా!



సమస్య-
గర్భములో నుండి వెడలె కమలాప్తుడుఁడొగిన్

పూర్వకవి పూరణ -

దుర్భరవేదన సలుపక
యర్భకుఁడుదయించు ననుచు నతిమోదముతో
నిర్భరత నుండెఁ బ్రాక్సతి
గర్భములో నుండి వెడలె కమలాప్తుడుఁడొగిన్

ఒక స్త్రీకి గర్భంలోనుండి శిశువురావాలికాని
కమలాప్తుడు రావడమేమిటని అసంగతంగా కనిపిస్తుంది
కాని కవిగారు ప్రాక్సతి అనడంతో  సంగతమైంది
ఈ సమస్యాపూరణ.

Saturday, January 13, 2018

ధాన్య మరసి రైతు దైన్యమొందె


ధాన్య మరసి రైతు దైన్యమొందె




సాహితీమిత్రులారా!



సమస్య-
ధాన్య మరసి రైతు దైన్యమొందె

విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

వడివడి జడివాన ప్రబలి వసుధ పాఱ
నోటికందు పంట నీట మునిగి
పనికిరాక విలువ పడిపోవ వెతలతో
ధాన్య మరసి రైతు దైన్యమొందె


ఇందులో రైతు ధాన్యాన్ని చూసి సంతోషించాల్సింది పోయి
దైన్యమొందె అనడం అసమంజసం. దాన్ని కవిగారు
సమకాలీన పరిస్థితితో పోల్చి చెప్పడంతో సమంజసమైంది

.

Friday, January 12, 2018

పగలో మున్గినవారి పాపచయముల్


పగలో మున్గినవారి పాపచయముల్ 




సాహితీమిత్రులారా!


సమస్య-
పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములైపారెడున్


విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

పగతో మానవిలెల్ల పాపముల సంపాదించి, దుర్మార్గులై
వగవన్ లాభములేదు మోక్షగతి సంభావ్యంపు సద్వృత్తితో
భగవానున్ శరణంబువేడి, ధరలో భవ్యాత్ములై-నిర్జరా
పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములైపారెడున్


ఈ సమస్యలో పగలో మునిగిన వారి పాపసంచయం
భస్మమై పారినట్లు అసంగత విషయంగా గోచరిస్తున్నది
దీన్ని కవిగారు పగలో అనే దాన్ని నిర్జరాపగలో అని
పూర్తి చేయడంతో సమంజసమైనది.



స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు


స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు
శ్రేయోభిలాషులకు
స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు

Thursday, January 11, 2018

బిందు చ్యుతకము


బిందు చ్యుతకము



సాహితీమిత్రులారా!


బిందువును చ్యుతము(తొలగించుట) చేస్తే
దాన్ని బిందు చ్యుతము అంటారు
దీని ఉదాహరణగా
విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరం
పూర్వభాగంలోని ఈ పద్యం గమనిద్దాం-

బహువిధాంధః కృతోల్లాసభరుఁడవీవు
సంగత శ్రీవి నీవు యో సరసిజాక్ష
అహితులకు సంజ్యర ప్రతియాతనుడవు
అన్నిటనుఁజేయు మరులకు సున్నచ్యుతుల

ఈ పద్యం మొత్తంలో గమనిస్తే మూడు పదాల్లోనే
సున్న(బిందువు)వుంది.
 ఆ పదాలు 1. అంధః 2. సంగత, 3. సంజ్వర
1. అంధః
అంధః - చక్కెర పొంగలు మొదలైన వంటకాలచేత
కృత - చేయబడిన, సంజ్వర - వేడిమిచే,
ప్రయాతనుడవు - సాటిగాగలవాడవు, అరులకు - పగవారికి, అన్నిటను
సున్న - లేమిని, చ్యుతులను - పడుటను సున్నచేయుము.
సున్నలు తీసువేసిన అర్థం-
పగవారికి పలురీతుల
అధఃకృత - నిరాకరింపబడిన, ఉల్లాసభరుడు.

2. సంగతలో బిందువు పోయిన
   సగత అవుతుంది.
సగత శ్రీ - పోకతో కూడిన, శ్రీ - సంపదలు గలవాడు

3. సంజ్వర లో బిందువు పోతే - సజ్వర
సజ్వర ప్రతియాతనుడు - జ్వరముతోను, సర్వవిధములైన
తీవ్రబాధతోను కూడిన వాడు.

Wednesday, January 10, 2018

శార్దూలంలో హంసగమన, కోకరుత, మేఘరంజని


శార్దూలంలో హంసగమన, కోకరుత, మేఘరంజని




సాహితీమిత్రులారా!



పురాణం పిచ్చయ్యగారి
విజయాశ్వ చరిత్రంలోని
గర్భచిత్రం. శార్దూలంలో
హంసగమన, కోకరుత,
మేఘరంజని వృత్తములను
ఇమిడ్చిన చిత్రం -

గోపాల ప్రముఖా దయాజలనిధీ గోవర్ధనోద్ధరకా
పాప ధ్వంసయజా జయానుజనుతా భావస్వరూపా హరీ
యావన్నా భయదా స్మయాది రహితా జ్యావల్లభా పావనా
చాపాబ్జారిధరా పయోధి శయనా జైవాతృకార్కాంబకా


శార్దూలం ప్రతిపాదంలో మొదటి 6 అక్షరాలు తీసుతుంటే
హంసగమన వృత్తమౌతుంది

గోపాల ప్రముఖా దయాజలనిధీ గోవర్ధనోద్ధరకా
పాప ధ్వంసయజా జయానుజనుతా భావస్వరూపా హరీ
యావన్నా భయదా స్మయాది రహితా జ్యావల్లభా పావనా
చాపాబ్జారిధరా పయోధి శయనా జైవాతృకార్కాంబకా

హంసగమన -
గోపాల ప్రముఖా
పాప ధ్వంసయజా
యావన్నా భయదా
చాపాబ్జారిధరా

కోకరు వృత్తము -
శార్దూలం ప్రతిపాదం నుండి 7వ అక్షరం
మొదలు 12వ అక్షరం వరకు తీసుకుంటే
కోకరు వృత్తమౌతుంది.

గోపాల ప్రముఖా దయాజలనిధీ గోవర్ధనోద్ధరకా
పాప ధ్వంసయజా జయానుజనుతా భావస్వరూపా హరీ
యావన్నా భయదా స్మయాది రహితా జ్యావల్లభా పావనా
చాపాబ్జారిధరా పయోధి శయనా జైవాతృకార్కాంబకా

కోకరు వృత్తము -
దయాజలనిధీ 
జయానుజనుతా
స్మయాది రహితా
పయోధి శయనా

మేఘరంజనీ వృత్తము -
శార్దూలం ప్రతి పాదంలో 13వ అక్షరం మొదలు చివరి అక్షరం
19వ అక్షరం వరకు తీసుకుంటే మేఘరంజనీ వృత్త
మౌతుంది.

గోపాల ప్రముఖా దయాజలనిధీ గోవర్ధనోద్ధరకా
పాప ధ్వంసయజా జయానుజనుతా భావస్వరూపా హరీ
యావన్నా భయదా స్మయాది రహితా జ్యావల్లభా పావనా


చాపాబ్జారిధరా పయోధి శయనా జైవాతృకార్కాంబకా

మేఘరంజనీ వృత్తము -
గోవర్ధనోద్ధరకా
భావస్వరూపా హరీ



జ్యావల్లభా పావనా
జైవాతృకార్కాంబకా


Tuesday, January 9, 2018

శార్దూలంలో కందపద్యం


శార్దూలంలో కందపద్యం




సాహితీమిత్రులారా!

పుష్పగిరి తిమ్మన కృత
సమీరకుమార విజయములో
మూడవ ఆశ్వాసం నందు
210వ పద్యం ఇది
ఇందులో శార్దూల పద్యం నందు
కందపద్యం ఇమిడ్చడం జరిగింది

నీకే మ్రొక్కెదఁ బ్రోవు మున్నత కృపానిర్మాణదివ్యత్కటా
క్షా కాకుత్స కులాగ్ర గణ్య కరుణా కల్పా యనల్పవు తా
ప్రాకారి ప్రముఖస్తుత ప్రతిభ దుర్భవాక్ష శిక్షైక ద
క్షా కోకాప్త రుచి ప్రకార గుణనిస్తారా సమీరాత్మజా

ఇందులోని కందపద్యం-
నీకే మ్రొక్కెదఁ బ్రోవు మున్నత కృపానిర్మాణదివ్యత్కటా
క్షా కాకుత్స కులాగ్ర గణ్య కరుణా కల్పా యనల్పవు తా
ప్రాకారి ప్రముఖస్తుత ప్రతిభ దుర్భవాక్ష శిక్షైక ద
క్షా కోకాప్త రుచి ప్రకార గుణనిస్తారా సమీరాత్మజా

కందపద్యం -
నీకే మ్రొక్కెదఁ బ్రోవు ము
కాకుత్స కులాగ్ర గణ్య కరుణా కల్పా
ప్రాకారి ప్రముఖస్తుత
కోకాప్త రుచి ప్రకార గుణనిస్తారా

Monday, January 8, 2018

అనేక ప్రశ్నలకు ఒకే సమాధానం


అనేక ప్రశ్నలకు ఒకే సమాధానం




సాహితీమిత్రులారా!



ప్రశ్నోత్తర చిత్రంలో
అనేక ప్రశ్నలకు ఒకే సమాధానం
అనే దానికి ఇక్కడ ఉదాహరణగా
అడుసుమిల్లి నారాయణరావుగారి
నారాయణీం నుండి చూద్గాం-

సూర్యభగవాను పట్టపు భార్య యెవతె?
నీతిలేని యుద్యోగి చింతించు నెద్ది?
బాటనెదిగోరి వృక్షముల్ నాటుచుంద్రు?
దాని చాయ యటన్న ఉత్తరము గాదె

దీనిలోని ప్రశ్నలన్నిటికి సమాధానం ఒకటే
అది కూడ నాలుగవపాదంలో ఇచ్చాడు
అందువల్ల దీన్ని అంతర్లాపిక పద్ధతి అని
చెప్పవచ్చి.

సమాధానం - చాయ

సూర్యని భార్య యెవతె - చాయ
నీతిలేని ఉద్యోగి చింతించు నెద్ది - చాయ
బాటనెదిగోరి వృక్షముల్ నాటుచుంద్రు - చాయ

Sunday, January 7, 2018

షోడశముఖీ కందము


షోడశముఖీ కందము




సాహితీమిత్రులారా!

ఒక పద్యంలో ఉన్న ఛందస్సులో
మరోరకం ఛందస్సును లేదా అదే రకానికి
చెందిన అనే పద్యాలు రావటాని వీలుగా
కూర్చబడిన ఛందోచిత్రాలు
వీటినే గర్భకవిత్వమని
గూఢకవిత్వమని అంటాము.
ఇక్కడ ఒక కందపద్యం ఛందస్సులోనే
16 కందపద్యాలు వచ్చేలా కూర్చిన
దాన్ని "షోడశముఖీ కందం" పేరున
తెలుసుకుంటున్నాము.
నాదెళ్ళ పురుషోత్తమకవి రచించిన
అద్భుతోత్తర రామాయణంలోనిది
సప్తమాశ్వాసంలోని 149వ పద్యం-

ధరజవు తరుచవు తఱుటను
దఱుగను దఱిగొన దఱికను తఱుగను దరుగన్
ధరజను దరిగొన దరమును
దరమును దఱుమను దఱియను దఱలును ద్వరగన్

దీనిలో ప్రతిగణం ఒక పద్య మొదలౌతుంది.
ఇందులో 16 గణాలున్నాయి. 16 కందపద్యాలు
అవుతున్నాయి.  గమనించండి.

1ధరజవు 2తరుచవు 3తఱుటను
4దఱుగను 5దఱిగొన 6దఱికను 7తఱుగను 8దరుగన్
9ధరజను 10దరిగొన 11దరమును
12దరమును 13దఱుమను 14దఱియను 15దఱలును 16ద్వరగన్

ప్రతి గణం రెండవ
అక్షరం ప్రాస అవుతూ ఉంటుంది. కాబట్టి
ర - అనే అక్షరం ప్రాస అవుతున్నది.

Friday, January 5, 2018

దాగుడు పదాలేవి?


దాగుడు పదాలేవి?




సాహితీమిత్రులారా!

ఈ పద్యంలో దాగిఉన్న పదాలేవో
చెప్పండి-
ఈ పొడుపు పద్యం
శ్రీవేంకటేశ సారస్వత వినోదిని నుండి-

రామాయణమునుండి ప్రభవించు స్త్రీ యేది?
          భారతమున నుండు బరువదేది?
భాగవతములోని పాలెది యగుచుండు?
          పారిజాతములోని ఫణి యదేది?
మనుచరిత్రములోని తెనుఁగు శబ్దమ్మేది?
          వసుచిత్ర నెది సువర్తనంబు?
శృంగార నైషధ స్ధిత దేశమదియేది?
          ఆముక్తమాల్యద హారమేది?
అమరమున దాఁగు పట్టణ ప్రముఖమేది?
శబ్దరత్నాకరములోని జలధి యేది?
దాగుఁడు పదాలు తెలుపుచో బాగు బాగు!
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!

దాగిన పదాలు-

1.రామాయణములోని స్త్రీ - రామ

2. భారతములోని బరువు - భారము

3. భాగవతములోని పాలు - భాగము

4. పారిజాతాపహరణములోేని ఫణి - పాము

5. మనుచరిత్రలోని తెలుగు శబ్దము - మను(నేల)

6. వసుచరిత్రలోని సువర్తనము - సుచరిత్ర

7. నైషధములోని దేశము - నిషధ

8. ఆముక్తమాల్యదలోని హారము - మాల్యము

9. అమరములోని పట్టణము - అమర(అమరావతి)

10. శబ్దరత్నాకరములోని జలధి - రత్నాకరము(సముద్రము)

Thursday, January 4, 2018

సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి


సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి




సాహితీమిత్రులారా!


ధారానగరంలో భోజుడు అంతఃపురంలో నిద్రిస్తున్నాడు.
ఆ సమయంలో ఒక పండితచోరుడు రాజుగారి కోశాగారంలో
ప్రవేశించాడు. అక్కడ వజ్రవైఢూర్యాలను, మరకతగోమేధికాలను,
మాణిక్యాలను ఎన్నిటినో మూటగట్టుకొని పోబోతుండగా
ఇంతలో వానిమనసులో ఒక భావం తళుక్కున మెరిసింది.
అయ్యో పూర్వజన్మలో ఎన్నో తప్పుడు పనులు చేయబట్టి
కదా ఈ జన్మలో చాలమంది వికలాంగులై, కుష్ఠురోగులై,
గ్రుడ్డి, కుంటి, వారుగాను, దరిద్రులుగాను బాధపడుచున్నారు.
నేనుకూడ పూర్వజన్మలో చేసినపాపం వల్లే నేడు దరిద్రుడనైనాను.
ఇంకా ఈ జన్మలో తప్పులు చేసి పాపం మూటకట్టుకో వలసిందేనా
-అని అనుకొంటూ ఆలోచిస్తున్నాడట. ఇంతలో భోజుడు మేల్కొని
తన సుఖసంపదలను, అష్టైశ్వర్యాలను తలంపునకు తెచ్చుకొని
ఈ శ్లోకాన్ని చెప్పాడు-

చేతో మహా యువతయః సుహృదో2నుకూలాః
సద్భాంధవాః ప్రణయగర్భగిరి శ్చ భృత్యాః
గర్భన్తి దంతి నివహా స్తరలా స్తురంగాః
(మనస్సునెంతగానో ఆకర్షించే మత్తకాశినులున్నారు.
అనుకూలురగు మిత్రులు, మంచి బంధువులు,
చెప్పినంతనే పనులు చేస్తూ , చాటూక్తులు పలికే
సేవకులున్నారు. ఏనుగులు, గుఱ్ఱాలు, ఒకపక్క
గర్జిస్తున్నాయి. ఇలా అష్టైశ్వర్యాలతో అన్నిసుఖాలు
అనుభవిస్తున్నా ---)
అని చదివి మిగిలిన నాలుగవపాదం కోసం
చడబడుతున్న సమయంలో
ఆ పండిత చోరుడు ఈ విధంగా పూరించాడు-

సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి
(అవి కట్టెదుట కనబడుతున్నా, కన్నులు మూయగానే
ఇవేవీ కంటికి కన్పడవు సుమా)
(అంటే భౌతికములైన సుఖాలు అన్నీ క్షణభంగురాలేకాని
శాశ్వతాలు కావని భావం.)

దీనికి రాజు సంతసించి అతని పూర్వాపరాలు విచారించి
ఆ చోరపండితునికి తగినంత బంగారమిచ్చి సన్మానించి
పంపించాడట.


Wednesday, January 3, 2018

హారామహాదేవరతాతమాతః


హారామహాదేవరతాతమాతః




సాహితీమిత్రులారా!


ఈ ప్రశ్నోత్తరచిత్రశ్లోకం చూడండి-

కే భూషయన్తిస్తనమండలాని?
కీ దృశ్యుమా? చంద్రమసః కుతః శ్రీః?
కి మాహ సీతా దశకంఠ నీతా?
హారామహాదేవరతాతమాతః

ఈ శ్లోకంలోని ప్రశ్నలకు సమాధానం
చివరిపాదం అయిన -
హారామహాదేవరతాతమాతః

1. హారాః, 2. మహాదేవరతా, 3. తమాతః
4. హారామ హాదేవర (హే)తాత (హే)మాతః

1. కే భూషయన్తిస్తనమండలాని?
   చన్నుగవలను అలంకరించునవి ఏవి?
   - హారాః(ముత్యాలహారాలు మొదలైనవి)

2.  కీ దృశ్యుమా?
    ఉమ(పార్వతి)ఎట్టిది?
   - మహాదేవరతా(ఈశ్వరుని యందు ఆసక్తికలది)

3. చంద్రమసః కుతః శ్రీః?
   చంద్రుని కాంతి ఎప్పటి నుండి ఉంటుంది?
   - తమాతః(రాత్రినుండి)

4. కి మాహ సీతా దశకంఠ నీతా?
   రావణుడు, తనను ఎత్తుకొని పోవునపుడు 
   సీత ఏమని ఆక్రోశించెను?
    - హారామ (ఓరామా), హాదేవర(ఓ మరిదీ లక్ష్మణా)
      తాత(తండ్రీ)మాతః(అమ్మా) - అని రోదించింది సీత

Tuesday, January 2, 2018

వీటికి అర్థభేధములు ఏవి?


వీటికి అర్థభేధములు ఏవి?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం చూడండి-
ఇది శ్రీవేంకటేశ సారస్వత వినోదిని లోనిది.

అగ్నిసఖుఁడెవండు? అగ్నిముఖుఁడెవండు?
            వేఱర్థములవేవి వేంకటేశ?
అనుమతి యననేమి? అనుమితియననేమి?
            వేఱర్థములవేవి వేంకటేశ?
అనలుఁడెవ్వండౌను? అనిలుఁడెవ్వండౌ?
            వేఱర్థములవేవి వేంకటేశ?
అన్యతరమదేది? అన్యతమమదేది?
            వేఱర్థములవేవి వేంకటేశ?
నుతగుణాకరా మహిననుశ్రుతమదేది?
పతితపావనా భువి ననుశ్రుతిమదేది?
మెప్పుగా నర్థభేదాలు చెప్పవలయు
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!


        పదాలు                 -   అర్థాలు
1. అగ్నిసఖుడు           -   వాయుదేవుడు
2. అగ్నిముఖుడు         -   విప్రుడు(బ్రాహ్మణుడు)
3. అనుమతి                 -   అంగీకారము
4. అనుమితి                 -   పరామర్శజ్ఞానము
5. అనలుడు                 -   అగ్నిదేవుడు
6. అనిలుడు                 -   వాయుదేవుడు
7. అన్యతరము             -   రెండింటిలో ఒకటి
8. అన్యతమము            -  పెక్కింటిలో ఒకటి
9. అనుశ్రుతము            -  పరంపర వేదజ్ఞానము
10. అనుశ్రుతి                -  కర్ణాకర్ణికగా విన్నది

Monday, January 1, 2018

వీటికి అర్థాలేమిటి?


వీటికి అర్థాలేమిటి?




సాహితీమిత్రులారా!

శ్రీవేంకటేశ సారస్వత వినోదిని లోనిది
ఈ పొడుపు పద్యం సమాధానాలు
చెప్పగలరేమో చూడండి-

కడులోఁతుగల్గు నగస్త్య మూత్రములోన
          నంబుగజములీఁదులాడుచుండె
ధార్తరాష్ట్రశతము దపిదాఁపురాఁగానె
          కృష్ణశకునిలేచి యేఁగెనెటకొ
పూర్వాహ్నవేళ నభోగజమ్ములు దోఁప
          నీలకంఠములెల్ల నృత్యమాడెఁ
జెడువార్తలెల్ల ద్విజిహ్వుఁడొక్కఁడు దెల్ప
          లోలకర్ణుండొక్కఁడాలకించెఁ
బుణ్యజనులైన వారిని బూర్వమందు
మించి పురుషోత్తముండు వధించివైచె
మెప్పుగా నర్థములివేవి చెప్పవలయు
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!

           పదాలు                        -          సమాధానాలు
1. అగస్త్యమూత్రము              -           సముద్రము
2. అంబుగజములు                -          మొసళ్ళు
3. ధార్తరాష్టశతము                 -           కొంగలగుంపు
4. కృష్టశకుని                          -           నల్లకాకి
5. నభోగజములు                   -            మేఘాలు
6. నీలకంఠములు                 -            నెమళ్ళు
7. ద్విజిహ్వుడు                     -            కొండెగాడు
8. లోలకర్ణుడు                        -             కొండెములు వినువాడు
9. పుణ్యజనులు                      -            రాక్షసులు
10. పురుషోత్తముడు               -            విష్ణుదేవుడు