Tuesday, July 31, 2018

వలపుదొర టెక్కెవులఁబట్టగలుగునేది?


వలపుదొర టెక్కెవులఁబట్టగలుగునేది?




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం
విప్పండి-

తులలేని ధనముచే తులఁదూగుతది యేది?
గిరిజామనోహరు గేహమేది?
విరివిగా తుమ్మెద విహరించు తావేది?
ఓడకంబుధి దాటుచుండు నేది?
కలకాలమొకరీతి కల్లయౌనదియేది?
శ్యామంక చీలలో జాణయేది?
దివిషద్గణము నడతెంచు మార్గంబేది?
కరివేల్పుఁగన్న మృగంబు నేది?
వలపుదొర టెక్కెములఁబట్టగలుగునేది?
పలుకుదురు లేక లెస్సగాఁజెలగదేది?
ప్రశ్నలన్నిటికిని తొలిపదములందె
ఉత్తరమగలున్నని చూచి యుల్లసిలుడు

దీనిలోని 10 ప్రశ్నలకు సమాధానాలను
చెప్పగలరేమో చూడండి

దీనిలోని ప్రశ్నలన్నిటికి పాదంలోని
మొదటి రెండక్షరాలే గమనించండి

1. తులలేని ధనముచే తులఁదూగుతది యేది - తుల
2. గిరిజామనోహరు గేహమేది                                -  గిరి
3. విరివిగా తుమ్మెద విహరించు తావేది               - విరి
4. ఓడకంబుధి దాటుచుండు నేది                       - ఓడ
5. కలకాలమొకరీతి కల్లయౌనదియేది                -  కల
6. శ్యామంక చీలలో జాణయేది                            - శ్యామ
7. దివిషద్గణము నడతెంచు మార్గంబేది             - దివి
8. కరివేల్పుఁగన్న మృగంబు నేది                         - కరి
9. వలపుదొర టెక్కెములఁబట్టగలుగునేది              - వల
10. పలుకుదురు లేక లెస్సగాఁజెలగదేది              - పలుకు

Monday, July 30, 2018

మానిషాద ప్రతిష్ఠాం


మానిషాద ప్రతిష్ఠాం




సాహితీమిత్రులారా!

వాల్మీకి నోట అప్రయత్నంగా వెలువడిన ఛందోబద్ధమైన వాక్యం
అవే వాక్యంలోని పదాలను గమనిస్తే అవి అనుష్టుప్ ఛందస్సులో
వ్రాయబడిన శ్లోకంగా గమనించ వచ్చు. ఆ శ్లోకం-

మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ శ్శాశ్వతీస్సమాః
యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్
                            (శ్రీమద్రామాయణం- బాలకాండ - 2 - 15)

ఓరి నిషాదుడా! పరస్పరం కామమోహంతో ఉన్న పక్షులలో పోతుపిట్టను
చంపిన కారణంగా ఎక్కువకాలం నువ్వుండరాదు సుమా! - అని ఒక
తిట్టు దీని భావం.

మంగళాచరణ శ్లోకంగా దీని అర్థం-

ఓ శ్రీనివాస!(మానిషాద) ఓరామా!  సీతవిషయంలో కామమోహితుడైన రావణుణ్ణి, రావణమండోదరుల జంటనుండి చంపి శాశ్వత ప్రిష్ఠనీ, కీర్తినీ పొందుదువుగాక!

రామాయణంలోని అన్నికాండల కథా వస్తువులు దీనిలో
ఉండాలని సరస్వతీదేవి ఇలా పలికించిందని చెబుతారు
దాని వివరణ-

ఏడు పదాలు ఏడు కాండలను సూచిస్తాయని
వివరించడం జరిగింది-

1. బాలకాండ - మానిషాద - సీతా భర్తా(సీత వివాహం ప్రధానమైంది)

2. అయోధ్యకాండ - ప్రతిష్ఠాం త్వమగమః - పితృవాక్యపరిపాలన జగద్విఖ్యాతి

3. అరణ్యకాండ - శాశ్వతీస్సమాగమాః - ప్రతిజ్ఞాపాలన కోసం అనేక సంవత్సరాలు వనవాసం

4. కిష్కింధకాండ - క్రౌంచమిథునాత్ -కుటిల ప్రవర్తనకల తారవాలి జంటలో వాలిని చంపడం

5. సుందరకాండ - ఏకమ్ - కార్యసాధకుడు ఒక్కడు, అసహాయశూరుడు హనుమంతుడు

6. యుద్ధకాండ - అవధీః - రావణవధ

7. ఉత్తరకాండ - కామమోహితమ్ - సీతారాముల వైకుంఠ ప్రయాణం

Sunday, July 29, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 6


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 6






సాహితీమిత్రులారా!
మంత్రి మహిషం 10
నువ్వు ఒళ్ళు విరుచుకుని పండించిన ధాన్యాన్ని ఎత్తుకు పోవచ్చే అధికారులు నీకు అన్నలా? తమ్ముళ్ళా? అంటూ మహిషానికి మరో బంధుత్వం అంటగడుతున్నాడు మంత్రి!

ఉన్మత్తా ద్రవిణాధికార వశత స్స్తంభం గతా దుర్గుణైః
సంజాతా వృషలేశతో విరచితా న్యాయా విభూత్యాదృతాః
కేచి చ్ఛృంగ భృత శ్చ సంప్రతి సుబేదారా ధమాః కాసర
జ్యేష్ఠాః కిం భవతో? వద త్వ మధనా సత్యం సనిష్ఠా ఇమే

కాసర రాజా! ఈ సుబేదారులనే అధములకు నీ పోలికలే కనిపిస్తున్నాయి. వీళ్ళూ నీ కన్నలా? తమ్ముళ్ళా? ఎందుకంటున్నానంటే, నీకున్న బలం వల్ల అనేక విధాల గొంతెత్తి అరుస్తూ (ఏదైన గేదెను చూచినప్పుడు మరీనూ!) వెర్రెత్తినంటుంటావు. వాళ్ళేమో డబ్బు, అధికారం తమ చేతిలో ఉన్నాయి కదా అని వెర్రెత్తి వున్నారు. నువ్వు, మొరటైన తాళ్ళతో కట్టడ వల్ల కట్రాటకు కట్టుబడి వున్నావు. వాళ్ళు దంభం, అహంకారం వంటి దుర్గుణాల పాలై, బిగుసుకు పోయి వున్నారు. ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అనే జ్ఞానం నశించి మసలుతున్నారన్న మాట! ఏపాటి కొద్ది పుణ్యం వల్లనో ఇలా పుట్టేవు. నువ్వు, నిన్ను పోషించే రైతులకు ఆదాయాన్ని పుష్కలంగా సమకూర్చి ఐశ్వర్యంతో తులతూగుతూంటే, వాళ్ళు సచ్ఛూద్ర వంశాలలో పుట్టి అన్యాయాలు చేస్తూ, లంచాలు పట్టి డబ్బు సంపాదించి, ధనవంతులయ్యారు. నీకు కొమ్ములే వున్నాయి. వాళ్ళకు అధికార చిహ్నంగా కొమ్మువాద్యముంది. (అంటే వారు వస్తూంటే అధికార చిహ్నంగా ఆ వాద్యం వినవస్తుంది.) పోలికలు సరిపోయి, నాకు అలా అనిపించింది. (శ్లోకంలో కవి వాడిన పదాలు రెండర్థాలు సూచిస్తున్నాయి.) అయినా దున్నపోతుది ఉత్తమస్థానమే! దున్నపోతుతో మంచిమాటలాడుతూ, తనకు ద్రోహం చేసిన సుబేదారును యముడికి పట్టియ్యి అని ప్రార్థిస్తున్నాడు మంత్రి.

తృణ్యాదాన జలావగాహన తనూ సంఘర్షణాది క్రమైః
కామం సైరిభ రాజరాజ భవత స్సేవా మకారం చిరమ్
ఏతావ త్వ్తహ మర్థయే పితృపతిం దేవం త్వదారోహణం
క్షిప్రం ప్రాపయ సన్నిధిం నను సుబేదారస్య మ ద్ద్రోహిణః

నీకు గడ్డివేసి, నీరు పోసి, నీ ఒళ్ళు మురికిపోయే లాగ తోమి, స్నానం చేయించి అనేక విధాలుగా చాలాకాలంగా నీ సేవ చేస్తున్నాను. దున్నపోతు రారాజా! నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాను. నాకు ద్రోహం చేసిన సుబేదారు దగ్గరకు, నిన్ను వాహనంగా వాడుకొనే యమధర్మరాజును తొందరగా తీసుకువెళ్ళు. (సుబేదారు నాకే కాదు, నీ శ్రమను దోచుకు పోయాడు కనుక నీకూ ద్రోహే!)

మంత్రి – మహిషం – 11

మంత్రి మానసికంగా ఎంతగా రగిలిపోతున్నా, తనకు సహజంగావున్న వ్యంగ్య హాస్య ప్రవృత్తిని విడిచిపెట్టకుండా, మహిషంతో ఇలా అంటున్నాడు.

క్షుద్బాధాం యది యాసి కాసరపతే
తర్హీదు మాకర్ణ్యతా
మస్మాభి ర్హి తృణీకృతాన్` భువి సుబే
దారాన్` సుఖం భక్షయ
నిస్సారా నపరాధ లేశ రహితా
నేతాన్ పలా లోత్కరా
న్నిత్యం భక్షయతా త్వయా క ఇహ హా
లోకోపకారో భవేత్`.

మహిష ప్రభూ! నీకు ఆకలి వేస్తే నా దృష్టిలో గడ్డిపరకలతో సమానులైన, సుబేదారుల్ని హాయిగా తిను. నేను చెప్పేది విను. ఇలా చేస్తే లోకోపకారం చేసిన ఖ్యాతి నీకు దక్కుతుంది. గడ్డికి రుచీ, పచీ లేదు. పాపం గడ్డిపరకలు ఏ తప్పిదం చేయనివి. వీటిని ఎప్పుడూ తినే నువ్వు, తప్పిదాలు చేయడం తప్ప మరొకటి ఎరగని సుబేదారుల్ని తిన్నావంటే, లోక కంటకుల్ని తొలగించినట్టే లెక్క! పైగా నువ్వు కాసరపతివి! తృణప్రాయుల్ని తినేసే హక్కు సహజంగా నీకుంది అని మంత్రి ఆంతర్యం. ఆ సంగతి అలా వుంచవయ్యా, రాజ సభలో ప్రవేశించి ఠీవీగా కూర్చో, నీకేమి తక్కువ? అంటూ మహిషాన్ని ప్రోత్సహిస్తున్నాడు మంత్రి –

కర్షం కర్ష మహర్నిశం వసుమతీం
క్లి శ్నాసి కిం కాసర?
త్వం సభ్యై రధునాతనై ర్నృప సభం
సాకం సుఖే నా వస,
న జ్ఞానం న చ మే స్తి కౌశల
మితి వ్యర్ధాం మతిం మా కృథా
స్త్వత్తో మూఢతమా ఇమే; భవసి హి
త్వం తేషు వాచస్పతిః.

దున్నపోతా! రాత్రీ పగలూ భూమిని దున్నుతూ శరీరాన్నెందుకు కష్టపెట్టుకుంటావు? నన్నడిగితే, ఈనాటి రాజసభలో కూర్చునే సభ్యులతో సుఖంగా కలిసి, కూర్చో. “నా కంత జ్ఞానం లేద”నో, “నాకంత నేర్పరితనం లేద”నో అనవసరపు ఆలోచనకు తావివ్వకు. వీళ్లు నీకంటె మూర్ఖులు. నిజం చెప్పాలంటే, వాళ్లలో నువ్వే బృహస్పతివి! సందేహించకు కానియ్యి.
మంత్రికి ఆనాటి రాజసభలను “అలంకరించే” సభ్యుల బుద్ధి విశేషం మీద అంతటి అభిప్రాయం వున్నదన్న మాట! దున్నపోతులను మించిన జ్ఞానశూన్యులు “సభ్యులు” గా చెల్లిపోతున్నారని మంత్రికి ఆవేదన!!
--------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Friday, July 27, 2018

చీరకడితే జయప్రద కట్టకపోతే జయమాలిని


చీరకడితే జయప్రద కట్టకపోతే జయమాలిని





సాహితీమిత్రులారా!



ఆంధ్రపత్రిక వారపత్రికలో గతంలో వచ్చిన
పేరడీ వాక్యాలు-


ఓటుకొచ్చి నోటు దాచినట్లు

ఈనాటి ప్రేయసే రేపటి రాక్షసి

ఒక మందు పార్టీలో ఇద్దరు కవులు ఇమడనట్టు

పోస్టల్ వారిది ''ఈజీ డెలివరీ''

చీరకడితే జయప్రద కట్టకపోతే జయమాలిని

క్షుద్రనవల రాసి ఆంజనేయస్వామికి అంకిత మిచ్చినట్లు


Thursday, July 26, 2018

కొత్త జర్నలిస్టు కన్న పాత పాఠకుడు మేలు


కొత్త జర్నలిస్టు కన్న పాత పాఠకుడు మేలు




సాహితీమిత్రులారా!



ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో
'ఫన్' పరాగ్ పేరుతో శంకరనారాయణ
రెండు మూడు ప్రసిద్ధవాక్యాలిచ్చేవాడు
వాటిని కొంచెం మార్చి లేదా విరిచి
నూతన అర్థం వచ్చేలా చేసేవాడు
వాటిలో కొన్ని వాక్యాలు-

వరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం

కొత్త జర్నలిస్టు కన్న పాత పాఠకుడు మేలు

బారుకు వెళ్ళడమూ "తీర్థ" యాత్రే

"కోడలికి చెవులుంటా"యని అత్తగారి భయం

మనిషయినా గోడయినా 'క్రాక్' అయితే కష్టం

ఇపుడు "యతుల" దర్శనం ఛందస్సులోనే

బావబంధాల నుంచి బయట పడలేనంటుంది మరదలు పిల్ల


Wednesday, July 25, 2018

భర్త ఒకటి తలచిన భార్య మరొకటి తలచును


భర్త ఒకటి తలచిన భార్య మరొకటి తలచును







సాహితీమిత్రులారా!

శ్రీరమణగారు ""న్యూడుల్స్"" పేరుతో
ఆంధ్రజ్యోతి వారపత్రికలో వ్రాసిన
పేరడీ సామెతలు.

మంత్రిగారి మాటలకు అర్థాలె వేరులే
(ఆడవారి మాటలకు అర్థాలే వేరులే)

కొండంత రచయితకు కొండంత పత్రిక తేగలమా?
(కొండంత దేవునికి కొండంత పత్రి తేగలమా?)

తిరిగి సబ్ ఎడిటర్ తిరగక రిపోర్టర్ చెడతారు
(తిరిగి ఆడది తిరగక మగాడు చెడతారు)

భర్త ఒకటి తలచిన భార్య మరొకటి తలచును
(తానొకటి తలచిన దైవం మరొకటి తలచును)

రాజకీయమంతా విని రాజ్ నారాయణ్ ఎవరని అడిగినట్లు
(రామాయణమంతా విని సీతకు రాముడేమౌతాడు అన్నట్లు)


Monday, July 23, 2018

తంతే పోయి బారులో పడ్డట్టు


తంతే పోయి బారులో పడ్డట్టు




సాహితీమిత్రులారా!



పేరడీ సామెతలు చూడండి-
శ్రీరమణగారు ఆంధ్రజ్యోతి వారపత్రికలో
నూడుల్స్ పేరుతో కూర్చినవి కొన్ని ఇక్కడ.


ఎంత విట్టుకు అంత నవ్వు 
(ఎంత చెట్టుకు అంతగాలి)

కవిగారి కోపం కలానికి చేటు
(పేదవాని కోపం పెదవికి చేటు)

కాసింది వెన్నెలయితే కోసి గోడౌన్ లో వేయమన్నాట్ట
(దున్నపోతు ఈనిందంటే గాట్లో కట్టేయ మన్నాట్ట)

తాజెడ్డ నవల పత్రికంతా చెరచిందట
(తాజెడ్డ కోతి వనమంతా చెరచిందట)

పాళీవెళ్ళి కాగితం మీద పడ్డా కాగితం వెళ్ళి పాళీమీద పడ్డా ముప్పు పాఠకులకే
(ఆకు వెళ్ళి ముల్లుమీద పడ్డా ముల్లు వెళ్ళి ఆకుమీద పడ్డా నష్టం ఆకుకే)

తంతే పోయి బారులో పడ్డట్టు
(తంతే గారెల బుట్టలో పడ్డట్టు)

Sunday, July 22, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 5


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 5




సాహితీమిత్రులారా!



నిన్నటి తరువాయి...............

మంత్రి మహిషం 8
వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నప్పటికీ, సుఖం లేదు శాంతి లేదు రక్షణ లేదు అని మంత్రి వాపోతున్నాడు.

విద్యాజీవన కుంఠనేన చ కృషా వాలంబితా యాం చిరా
దాపక్వే కణిశే కుతోऽపి పిశునాః కేదార మావృణ్వతే
హా కిం వచ్మి? సుభాహ వాలుమణియం మేజుష్ఠ హస్తాంతరం
హర్కారస్థల సంప్రతీ ముజుముదాది త్యాదయో నిర్దయాః

శాస్త్రబద్ధమైన విద్యాజీవనం లేకపోవడం వల్ల ఇంకేదారీ లేక వ్యవసాయాన్ని నమ్ముకొంటే తీరా పంట కంకిపట్టి పండే సమయానికి, పిసినిగొట్లు తయారు! ఇంక చెప్పేదేముంది? సుభాహులు, వాలు మణియాలు, మేజుష్ఠులు, హస్తాంతరులు, హర్కార స్థలులు, సంప్రతీ ముజుముదాత్తులు వంటి ప్రభుత్వ పదవుల్లో వున్న అధికారులు దయా దాక్షిణ్యాలు లేకుండా, నాలుగు వైపుల నుంచి పంటపొలాల మీదకు క్రమ్ముకొస్తారు. పంటను ఏదో ఒక నెపం పెట్టి ఒడుచుకొని పోవడమే వారి పని! డబ్బు మదం నెత్తికెక్కిన, కన్నుమిన్ను కానకుండా రెపరెపలాడిపోయే స్వభావం కలిగిన, పొగరుబోతుల కంటె దున్నపోతే మేలైనది. ఎందువల్లనో చెపుతున్నాడు.

ముగ్ధాన్‌ ధిగ్ధనికాన్‌ రమామదమషీ దిగ్ధాన్‌ విదగ్ధా నహో!
జగ్ధౌ యబ్ధిషు దగ్ధబుద్ధి విభవాన్‌ స్నిగ్ధైః ఖలై రన్వహయ్
ధన్యం సైరిభ మేక మేవ భువనే మన్యే కి మ్తౖన్యెర్నృపై
ర్యో ధాన్యై శ్చ ధనై శ్చ రక్షతి జనాన్‌ సర్వోపకార క్షమః

ధనమదం తలకెక్కి తిండికీ, మైథునానికీ గొప్ప పండితులై, చెడుసావాసాలతో మసలుతూ, ఉన్న జ్ఞానం కూడా పోగొట్టుకొన్న ధనవంతుల్ని ఎల్లప్పుడూ తీవ్రంగా నిరసిస్తాను. వాళ్ళకు డబ్బుంది ఏం లాభం? ఈ ప్రపంచంలో దున్నపోతును మించిన అదృష్టవంతు లుండరు. ఎందుకంటే, అది కష్టం ఓర్చి ప్రజలకు ధనం, ధాన్యం రెండూ సమకూరుస్తుంది. ఆ విధంగా రక్షిస్తుంది. అంతటి ఉపకారం చేసే దున్నపోతును కాదని ఇతర పాలకుల నెందుకు ఆశ్రయించాలి? డబ్బు పొగరు మనుషుల్లో వివేకాన్ని మింగేసి పశుప్రాయుల్ని చేస్తూంటే జన్మకి పశువైనా, దున్నపోతు పజలకు రక్షణ ఇస్తున్నది కనుక ఆశ్రయించాలని కవి హృదయం!

మంత్రి మహిషం 9
డబ్బుపొగరు తలకెక్కిపోయిన వారికి నన్ను మించిన వాడెవడు? అనే దురభిమానం పట్టరానిదిగా వుంటుంది. పోనీ ఆ సంపాదించిన డబ్బు న్యాయసమ్మతంగా వచ్చిందా? అబ్బే! అన్యాయాలు చేసి మూటకట్టినది! డబ్బంటే సంపాదిస్తారు గాని, సంస్కారహీనంగా “దుర్‌ ధనికులు” ప్రవర్తిస్తారంటూ మంత్రి కర్కశంగా నిందకు సిద్ధపడుతున్నాడు.

మత్తా విత్తమదై ర్దురాగ్రహ భృత శ్చండాల రండాసుతా
యే ऽమీ దుర్ధనికా నితాంత పరుష వ్యాహారకౌలేయకాః
తేషాం వక్త్ర విలోకనా త్తవ వరం స్థూలాండకోశే క్షణం
యేన శ్రీమహిషేంద్ర లోస్యత ఇహ ప్రాయోణ మృష్టాసనమ్

అన్యాయార్జనంతో అహంకరించే ధనికులు వట్టి నీచపు ముండాకొడుకులు. కుక్కల్లాగా కర్ణకఠోరమైన మాటలు మొరుగుతుంటారు. శ్రీశ్రీశ్రీ హిషరాజా! అటువంటి వాళ్ళ ముఖాలు చూడడం కంటె బరువైన నీ వృషణ దర్శనం మేలు! ఈ దర్శనం వల్ల (అంటే పొలం దున్నే వేళ నీ వెనుక భాగాన నిలిచి వుండడం వల్ల) తరుచుగా మహామంచి భోజనం దొరుకుతుంది. అరక దున్ని, పంట పండించే వారికి మంచి తిండి లభించడం ఖాయం!! ఆ ధనవంతులు నాకే కాదయ్యా, నీకూ అపకారులే … అంటూ మంత్రి, దున్నపోతుకీ, దుర్‌ ధనికులకీ, తండ్రీ కొడుకుల సంబంధాన్ని అంటగట్టి ఎద్దేవా చేస్తున్నాడు.

దేహం స్వం పరిదగ్ధ యద్ధి భవతా ధాన్యం ధనం వా ర్జితమ్
తత్సర్వ ప్రసభం హరంతి హి సుచే దారా స్స్వకీయం యథా
హేతు స్తక్త కిలాయమేవ మహిష జ్ఞాతో మయా శ్రూయతాః
పుత్రా ఏవ పిత ు ర్హరంతి హి ధనుప్రేమ్ణా బలా ద్వాऽఖిలమ్

మహిషరాజా! నువ్వు నీ శరీరాన్ని ఎంతో కష్టపెట్టుకుని, ధనమో, ధాన్యమో సంపాదించుకుంటే… పన్నులు వసూలు పేరిట సుబేదారులు వచ్చి, ఆ మొత్తమంతా, తమ సొంత సొమ్మైనట్టుగా ఒడుచుకు పోతారు. ఇదెలా సాధ్యమని నేనాలోచిస్తే నాకీ కారణం కనిపిస్తోంది. విను.. ప్రేమతో
కానియ్యి, బలవంతంగా కానియ్యి, తండ్రి ఆస్తిని పట్టుకు పోయే వాళ్ళు కొడుకులే కదా! వీళ్ళని “దున్నపోతు కొడుకు” లని అంటే తప్పేముంది? కనకనే నీ సొమ్ము దోచుకుపోతున్నారని మంత్రి విస్తరించి చెప్పాడు. పాలకుడు, పంట పండించుకొనే రైతుకి ఉపకారమేదీ చేయక పోగా, బలిమిని దోచుకుపోవడానికి మాత్రం ముందుంటాడని వ్యంగ్యం!
--------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Saturday, July 21, 2018

మాయమ్మాన సు నీవే (భాషాచిత్రం)


మాయమ్మాన సు నీవే (భాషాచిత్రం)



సాహితీమిత్రులారా!

నలుగురు కవులు ఓ రాజుని చూట్టానికి వెళ్తే ఒక మంత్రి వాళ్ళకి అడ్డు తగుల్తుంటాడు. ఇలా కాదని వాళ్ళు పల్లెటూరి వాళ్ళ వేషాల్లో ఆ రాజు దగ్గరికెళ్ళి ఓ పద్యం చెప్తారు

మాయమ్మాన సు నీవే
రాయలవై కావ దేవరా జేజేజే
మాయాతుమ లానిన యది
పాయక సంతోసమున్న ఫల మిలసామీ

చదువేమీ రాని వాళ్ళ మాటల్లా అనిపించే ఈ పద్యం నిజానికి తెలుగు పద్యం గానూ, సంస్కృత శ్లోకం గానూ కూడా చదువుకోవచ్చు. ముందుగా, తెలుగు పద్యానికి అన్వయం ఇది దేవరా, జేజేజే, ఇలసామీ (భూమిని పాలించే వాడా), నీవే రాయలవై కావ, సంతోసము, పాయక (విడవకుండా), మాయాతుమలు (మా ఆత్మలు), ఆనినయది (తాకింది), ఉన్నఫలము, మాయమ్మ, ఆన, సు!

ఇదే పద్యం సంస్కృతంలో ఐతే
హే, సునీవే (శుభప్రదమైన మూలధనము కలవాడా), ఆయమ్‌ (రాబడిని), మామాన (లెక్కపెట్టుకో వద్దు), అలవా (ముక్కలు కాని), రాః (ధనము), ఏకైవ (ఒక్కటే), అవత్‌ (కష్టాల్లో రక్షించేది);  అజేజే (యజ్ఞం చేసే), రాజే (రాజు కోసం), మా (లక్ష్మి), ఆయాతు (వస్తుంది), మలాని న (పాపాలు అంటవు); పాయక (ఓ రక్షకుడా), సః (మంచివాళ్ళు), యది (దర్శనానికొస్తే), అసముత్‌ (సంతోషం లేకుండా), నఫల (వాళ్ళని చూడకుండా ఉండొద్దు), మిల (వాళ్ళతో కలువు), అమీ (వచ్చిన మేము), సా (ఆ లక్ష్మీ దేవే అనుకో) ఇంత వ్యవహారం ఉంది ఆ చిన్ని కందంలో!

పింగళి సూరన ” కళాపూర్ణోదయం” లోనిది ఈ భాషాచిత్రం

Thursday, July 19, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 4


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 4




సాహితీమిత్రులారా!


నిన్నటి తరువాయి................
మంత్రి మహిషం 6
దున్నపోతు స్తోత్రం నెపంగా, పాలకులను అన్యాపదేశంగా నిందించడం వల్ల, నిజంగా ధర్మపరులైన రాజులకు కవుల మీద పట్టరాని ఆగ్రహం కలగవచ్చు. అంతేకాదు పండితులందరి మీద కూడా ఆకోపం ప్రసరించవచ్చు. దీని వల్ల ఏమి ప్రయోజనం సాధించినట్టు? అంటూ ప్రశ్న వేసుకునే
బుద్ధిమంతులైన రాజులకీ శతకం సంతోషాన్నే గాని, క్రోధం కలిగించదంటూ, మంత్రి ఇలా అంటున్నాడు

శ్త్రుౖత్వెత న్మహిష ప్రబంధ మహ యే భూపా గుణగ్రా హణ
స్తే బుద్వ్ధా నిజదుర్గుణాన్‌ కవిముఖా త్త ద్వ్య్దంగ్య మర్యాదయా
అద్రోహేణ నిజాః ప్రజా ఇవ యధా ధర్మం ప్రజా రక్షితుం
కుర్వంతు స్వకుల క్రమాగత నరాన్‌ దేశాధికారోచితాన్

ఈ మహిషశతకం విని, గుణాలు గ్రహించగల రాజులు సహృదయంతో కవిద్వారా వెలువడిన ఒక్కొక్క శ్లోకంలో ఉన్న వ్యంగ్యార్థాన్ని తెలుసుకొని, తమలోని చెడ్డగుణాలను గుర్తెరిగి, తమ ప్రజలను కన్నబిడ్డల లాగ ధర్మబద్ధంగా పరిపాలించే నిమిత్తం కులక్రమానుగతంగా వచ్చే అర్హులైన వాళ్ళను పదవుల్లో నియమించాలి.
రాజులకు కోపం తెప్పించడం కోసం కాదీ రచన. వారి విధానాలను సంస్కరించడం కోసమే. పాలకులకు మంచి గుణాల మీద గౌరవమే వుంటే, చెడ్డవాళ్ళకి అధికారమిచ్చిన దెవరు? అని ప్రశ్నించుకున్నాడు మంత్రి. కొందరు ద్రోహులు ధర్మాత్ముల్లాగా నటిస్తూ అధికార యంత్రాంగంలో పదవులు చేపట్టి, ప్రజల సర్వస్వాన్ని కొల్లగొట్టే పనిలో వున్నారు. ఎప్పుడూ ఈ సంగతి పాలకుడు గుర్తించడం లేదని మంత్రి బాధ. రాజు బుద్ధిమంతుడే. అతని కంటె బుద్ధిమంతులు మంత్రులు. అయినా, వారినీ, వీరినీ కూడా మోసగిస్తూ, దేశద్రోహ బుద్ధితో కొందరు కుసంస్కారులు, స్వేచ్ఛావ్యవహారాలతో ప్రజల్ని నానా బాధల పాలు చేస్తున్నారు. అందువల్ల మహిష రాజుగారూ, చోళదేశంలో వ్యవసాయం చెయ్యాలని కోరుకోకండీ ఆ కుసంస్కారాలు అధికారంలోకి వచ్చాకే, నా సర్వస్వం కోల్పోయి గోచిపాతతో మిగిలాను. నీకా గోచిపాత పోయే సమస్య కూడా లేదయ్యా సోదరా!!

రాజా ముగ్ధమతి స్తతో ऽపి సచివాస్తాన్‌ పంచయంతః ఖలా
దేశద్రోహ పరా స్తదైవ వృషలా స్సర్వాపహారోద్యతాః
ఆశాం మా కురు చోళదేశ కృషయే త్వం సైరి భాతః పరం
శిష్టం మే త్వలమల్లకం తదపి నభ్రాత స్తవా స్వ్తంతతః

మంత్రి మహిషం 7

దుర్మార్గం అనుసరించే ఆలోచనే రావాలి గాని, వచ్చిందే తడవు స్వార్థపరులైన కుసంస్కారులు విజృంభించకుండా ఊరుకోరు కదా! మంత్రి చెపుతున్నాడు

ధాన్యం వాథ ధనాని వా సమధికం కృత్వా మిథ స్స్పర్థయా
మిధ్యా సాహసినో ऽభ్యుపేత్య వృషలా దేశాధికారాశయా
ఉత్కోచేన నృపాంతక స్థిత జనాన్‌ వశ్యాన్‌ విధాయ ప్రజా
సర్వస్వం ప్రసభం హరంతి చ శఠా స్తేయాంతు కాలాంతికమ్

కుత్సితబుద్ధి గల కుసంస్కారులు కొందరు, దేశాధికారం పొందాలనే తహతహతో, మేం ఎక్కువ ధాన్యమిస్తామనో, ధనం ఎక్కువిస్తామనో, వారిలో వారు పోటీలు పడి, పాట పెంచివేసి, లేని సాహసాలు ప్రదర్శిస్తూ, రాజసన్నిధిలో వుండే పెద్ద అధికారులకు లంచాలిచ్చి లొంగదీసుకుని, అధికారం సంపాదించుకుని, బలవంతంగా ప్రజల సర్వస్వాన్నీ దోపిడీ చేస్తున్నారు. అటువంటి దుర్మార్గులు యమ సన్నిధికి పోవాలి. వాళ్ళు బతికి వుండడానికి అర్హులు కారని వాంఛేశ్వర మంత్రి నిప్పులు చెరుగుతున్నాడు. శాపనార్థాలు సరేనయ్యా బ్రాహ్మణులు సేద్యానికి ఉద్యమించారంటే, దొంగలయ్యారనే కదా అర్థం! అంటూ ఎత్తిపొడిచే వారికి సమాధానం చెపుతున్నాడు.

చౌర్యం నామ కృషీవలస్య సహజో ధర్మోః హ్య వృత్య్తంతరై
శ్చోళేషు ద్విజసత్తమై రనుచితా ప్యంగీ కృతా సా కృషిః
తా నేతాన్‌ వృషలా శ్శపం త్య కరుణా యే దుశ్శ్రవై ర్భాషితై
ర్యే వాతాన్‌ ప్రిహరంతి తే న్ముఖకరం భూయాత్క్రిమీణాం పదమ్

దొంగతనమా? అది రైతుకి సహజమే అనాలి. ఎందుకంటే, భూమినుంచి ధాన్యాన్ని, గడ్డిని, ఎత్తుకొని పోతూంటాడు. వ్యవసాయ వృత్తి తగినది కాకపోవచ్చు. కాని, చోళ దేశంలో బ్రాహ్మణులకు బ్రతుకుతెరువు వేరే లేకపోవడం వల్ల తప్పడం లేదు. ఇది ఆపద్ధర్మ వృత్తిగా, వ్యవసాయం చేసుకుంటూంటే, కొందరు కుసంస్కారులు వినజాలని పదజాలంతో తిడుతూన్నారు. కొందరైతే కొడుతున్నారు కూడా. వారి నోట పురుగులు పడ! వారి చేతులకు పురుగులు పట్టి పోను!! మంత్రికి కడుపు మండిపోయి బాధించే దుష్టుల మీద కసితో శాపనార్థాలకు దిగాడు.
---------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, July 18, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 3


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 3




సాహితీమిత్రులారా!


నిన్నటి తరువాయి..............
మంత్రి మహిషం 4
చదువు వ్యాపార వస్తువై పోయింది. మర్యాదగా విద్యా జీవనం సాగించడం నానాటికీ కష్టమై పోతోందని ఉదాహరణలద్వారా మంత్రి విశదం చేస్తున్నాడు.

విద్యాపణ్య విశేష విక్రయవణిగ్జాత స్సుధీ శ్శ్రీధర
స్స్వన్నం స్వర్ణ మభూ ద్బతాంబు మఖినో ధిక్తస్య షడ్దర్శినీం
ఖ్యాతః కుట్టికవిస్తు దుర్ధని గృహద్వారేషు నిద్రాయతే
త త్సర్వం మహిషేశ్వరాననుసృతే ర్దౌర్భాగ్య ధామ్నః ఫలం.

శ్రీధర పండితుడు డబ్బు తీసుకొని చదువు చెప్పి బతుకు వెళ్ళదీయవలసి వస్తోంది. పోనీ చేస్తే చేశాడయ్యా, ఇచ్చే డబ్బుని బట్టి, చెప్పే చదువులో వ్యాపార పద్ధతిలో హెచ్చు తగ్గులు చూపిస్తూ మరీ పూర్తి వ్యాపారి అయిపోయాడు. ఇక అంబుదీక్షితుడి విషయానికి వస్తే, తినడానికి వరి అన్నం బంగారమై పోయింది. పూట గడవడం లేదు. ఇంక ఆయన చదివిన కపిల, కాణాద, గౌతమ, పాతంజల, వ్యాస, జైమిని ఋషులు వ్రాసిన షడ్దర్శనాలు ఎందుకు? తగలబెట్టడానికా? ఈ అంబుదీక్షితులుతో కలిసి చదువుకున్న కుట్టికవి ఉన్నాడు (తనే, వాంఛేశ్వర మంత్రి) పొగరు బలిసిన ధనవంతుల వాకిళ్ళముందు నిద్రపోతున్నాడు. ఇదంతా ఎందుకిలా జరిగిందో తెలుసా? దారిద్య్రాన్ని నిర్మూలించగల శ్రీ దున్నపోతు గారిని ఆశ్రయించకపోవడం వల్లనే. సరే, ఈ దేశంలో విద్యవల్ల ప్రయోజనం ఏమీ లేదనుకోవవయ్యా. దేశంలో ఇతర ప్రాంతాలు గొడ్డుపోలేదు కద. అక్కడ ఆదరం ఉంటుంది గనక, సుఖంగా బతక వచ్చునే. అన్నిటా దైన్యమేల? అని శ్రీధర పండితుడనగా దానికి సమాధానం చెపుతున్నాడు.

విద్యన్మాకురు సాహసం శ్రుణువచో వక్ష్యామి య త్తేహితం
త్యక్వ్తా కామద మత్ర సైరిభ పతిం నిర్వ్యాజ బంధుం నృణాం
శ్రీరంగా భిద పత్తనం ప్రతిసఖే మా గా జ్వర స్యా లయం
దూరే శ్రీర్నికటే కృతాంత మహిష గ్రైవేయ ఘంటారవః.

మిత్రమా, శ్రీధరా, సాహసం వద్దు. ఒక మంచి మాట చెపుతున్నాను విను. కోరిన కోరికలు తీర్చేమహారాజశ్రీ దున్నపోతువారిని విడిచి, ఎక్కడికో వెళ్ళాలంటావు. శ్రీరంగపట్టణానికి వెళ్ళేవు సుమా. ఆ వూరు జ్వరాలకు పుట్టిల్లు. అక్కడి వెళ్ళి సంపాదించగలిగేదిజబ్బు తప్ప డబ్బు కాదు. ధన సంపాదన లక్ష్యం దూరం గా వుండిపోయి, యమధర్మరాజు వాహనమైన మహిషం మెడలోని గంట, గణగణ దగ్గరగా వినిపిస్తుంది. శ్రీరంగపట్టణంలో విద్యకు గౌరవం వుండవచ్చు. అక్కడ ప్రభువు ధనం కూడా ఇవ్వవచ్చు. అనారోగ్యపు పుట్ట ధనం ఇచ్చినా వద్దు. ఆయువు మూడుతుంది.

మంత్రిమహిషం 5
విద్యాజీవనం ఏమీ లాభం లేదు. సేద్యమే శ్రేష్ఠమంటూ, శ్రుతి, స్మృతి, ప్రత్యక్షప్రమాణాల ద్వారా నిరూపించి ఆ సేద్యానికి ప్రధాన సాధనమైన దున్నపోతును వర్ణించదలిచాడు మంత్రి. డానికి రాచరికాన్ని ఆపాదిస్తూ, అరాచకాలను ఖండిస్తూ, మంచిని ఉపదేసిస్తూ కావ్యరంగంలోకి కాలు
మోపుతున్నాడు.

యం యో ర క్షతి తస్యస ప్రభురితి స్పష్టం హి, మ ద్రక్షిణో
రజ శ్రీమహిషాన్‌ వినుత్య సఫలం కుర్వేద్య వాగ్వైభవం
మత్పీడా నిరతాన్‌ మదీయ మహిమాభి జ్ఞాన శూన్యాన్‌ ప్రభూన్
య న్నిందామి నిమశ్య తద్గుణ విద స్తుష్యంతు సంతో నృపా.

ఏవరెవరిని రక్షిస్తారో, వారే వారికి ప్రభువనేది లోక ప్రసిద్ధం. అందుకని నన్ను రక్షించేది, మహారాజశ్రీ దున్నపోతువారే కనుక, ఆ ప్రభుస్తుతి చేసి న మాట నేర్పరితనాన్ని సఫలం చేసుకుంటాను. నన్ను పీడించడానికి సిద్ధపడేవారిని, నా శక్తినెరుగని అజ్ఞానులైన వారిని, ప్రభువులను, నిందిస్తాను. ఈ నిందను విని గుణం గ్రహించగల, మంచి రాజులు సంతోషిస్తారు.దున్నపోతు వ్యవసాయానికి ముఖ్య సాధనమని, నీకు ప్రభువుగా కనిపించవచ్చు. దానిని స్తుతిస్తున్నట్టుగా శతకం కూర్చి, మూర్ఖులకు జ్ఞానోపదేశం చేయాలని ప్రయత్నించడంకంటె, నేరుగా ఉపదేశించవచ్చు కదా, అని ఎవరైనా అడుగుతారేమో. ఆలాగ కాదు, ద్రోహబుద్ధిగల మూర్ఖులకు నేరుగా ఏమి చెప్పినా, బుర్రకెక్కదు. ఈలాగ చెప్పక తప్పదు అంటాడు మంత్రి.

కంచి త్పశ్వధమం లు లాయ విగుణం కర్తుం ప్రబమ్ధాన్‌ శతం
త్వా మాలంబ్య సముత్సహే , న ఖలు తద్వర్ణస్య మహాత్మ్యత
మ ద్రోహ ప్రవణాధికారి హతక క్రోధేన త న్నిన్దన
వ్యాజా త్త త్ప్రభు త్ప్రభు ష్వపిచ వా గ్గండో మయా పాత్యతే.

మహిషరాజా, నీ గురించి ఒక శతకం చెప్పదలచు కున్నాను. నీ సాటి జంతువ్ల్లో నీవు అధముడివి. ఏ మంచి గుణాల్లూ చెప్పదగినవి లేవు. అయినా, చెపుతున్నాను కదా, అని “నా వంటి మహిమాత్వం ఎవరికీ లేద” ని గర్వపడేవు సుమా. అదేమీ కాదు. నాకు ద్రోహం చేయదలచుకొన్న ఒక అధికారి వెధవని చీకొట్టదలచి, ఈ వంకతో, వాడికి అధికారం కట్టబెట్టిన, వాడి పైవాడికి, ఆ పైవాడికి, తగిలే విధంగా నా వాక్కునే కర్రను చేసి విసురుతున్నాను.
---------------------------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, July 17, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 2


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన)  - 2




సాహితీమిత్రులారా!

నిన్నటి తరువాయి.........
మారిపోయిన పరిస్థితులపట్ల మంత్రికి కష్టం తోచింది. వంశం ఎంతగొప్పదైతే మాత్రం ఏం లాభం? అసభ్య ప్రవర్తన గల వారు తయారయ్యారు. ఇక ఉద్యోగం వల్ల ప్రయోజనం లేదు. వ్యవసాయం చేసుకోవడం ఒక్కటే దారి, అని నిర్ణయానికి వచ్చి మాట్లాడుతున్నాడు.

నానాజి ప్రభు చంద్రభాను శహజీంద్రానంద రా యాదయౌ
విద్వాంసః ప్రభవో గతాశ్రితసుధీ సందోహ జీవాతవః
విద్యాయాం విష బుద్ధయో హి వృషలా సభ్యా స్వ్థిదానీంతనాః
కిమ్‌ కుర్వేబ కృషే వ్రజామి శరణం త్వా మేవ విశ్వావనీం.

ఒకప్పుడైతే ధర్మాత్ముడు నానాజి మంత్రి, చంద్రభాను ప్రభువు, శాహజీ మహరాజు, ఆనందరాయ మంత్రి, వంటి వారు స్వయంగా మహా విద్వాంసులై తమదగ్గరకు వచ్చేవిద్వాంసుల్ని ఉదారంగా పోషించేవారు. కాని, ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పటికీ కొందరు మంచి పాలకులు లేకపోలేదు, పూర్వపు వాళ్ళంతగా కాదు. వీళ్ళు సభ్యత గల వాళ్ళు కారు. ధార్మికులు కారు. వేద,పురాణాలు, స్మృతులు వంటి వాటి మీద గౌరవం లేదు. ఈ పరిస్థితుల్లో ఏం ెయ్యాలి? సమస్త ప్రాణులనీ రక్షించే వ్యవసాయ మాతా, నిన్నే శరణు వేడుకొంటున్నాను. వేడుకుంటున్నాడు సరే. వ్యవసాయం చేసుకోవడానికి వాంఛేశ్వర మంత్రి కులానికి వేద శాస్త్రాలు ఒప్పుకోవే, అని ఎవరైనా ఆక్షేపణ చేస్తారేమోనని ఇక్కడ ఆ ప్రమాణం కూడా చూపించదలచి మంత్రి అంటున్నాడు.

అక్షైర్మేతి నను శ్రుతి స్మృతి పథం ప్రాయః ప్రవిష్ఠేన కిం?
సౌఖ్యం వా హల జీవినా మనుపమం భ్రాతర్న కిం పశ్యసి?
కిం వక్ష్యే త దపి క్షితీశ్వరబహిర్వ్దార ప్రకోష్ఠస్థలీ
దీర్ఘావష్యితి రౌరవాయ కురుషే హా హంత హంత సృహాం.

ఋగ్వేదంలోని శాకల శాఖ సప్తమాష్టకంలో ఏ మన్నాడో వినలేదా? “జూదం ఆడవద్దు. సేద్యం చేసుకో. సేద్యం చేసుకుంటూ లోక గౌరవం పొందుతూ ధన ధాన్యాలతో ఆనందం గా జీవించు,” అని కదా వుంది. కనక వ్యవసాయం చేసే వాళ్ళకు సాటిలేని సుఖం కలుగుతూండడం అనుభవంలో ఉన్నదే, సోదరా. అయినా నువ్వు రాజగృహాల ద్వారాల ముంగిళ్ళలో పడివుండి ఎంతకాలమైనా నిరీక్షణతో గడపాలని కోరతావెందుకు? ఏం చెప్పాలి? అయ్యయ్యో, ఇంత కన్నా నరకం వేరే వుందా?

మంత్రి మహిషం 3
వ్యవసాయం చేసుకోవడం వేదసమ్మతమేనని ప్రమాణం చూపించావు సరే నయ్యా. ఆ ప్రమాణం వైశ్య కులం వారికి, తదితరులకు వర్తిస్తుంది గాని, నీ కులానికి పనికిరాదు. సేద్యం వల్ల ప్రత్యక్షంగా లాభం కనబడుతోంది కనుక తప్పులేదని వేదప్రామాణ్యం చూపించడం సరికాదు అనే ఆక్షేపకులకు మంత్రి సమాధానం చెపుతున్నాడు.

దుర్భిక్షం కృషితో న హీతి జగతి ఖ్యాతం కిల, బ్రహ్మణా
మాపద్ధర్మ తయా మనౌ చ కృషి గో రక్షా దికం సమ్మతం
భూపే ష్వర్థపరేషు హంత సమయే క్షుణ్ణే చ దుర్భిక్షతో
వృత్యర్థం కృషి మాశ్రయే మ భువి నః కిం వా తతో హీయతే.

సేద్యం వల్ల, కరవు లాటకాలుండవని లోకంలో ప్రసిద్ధి కద. ఆపద్ధర్మంగా బ్రాహ్మణులు, వ్యవసాయం పశుపోషణ చేసుకోవచ్చునని మను ధర్మశాస్త్రం కూడా చెపుతోంది. పాలకులు కేవలం నసంపాదన మీద దృష్టి పెట్టివుంటేనూ, కరవు కాటకాలతో కాలం సంక్షోభించి పోతుంటేనూ, బ్రతుకు తెరువు కోసం వ్యవసాయ వృత్తిని ఆశ్రయించక ఇంకేం చెయ్యాలి? కనక ఆ వృత్తినే ఆశ్రయించుకుంటాం. స్వధర్మం ఎలాగూ అనుష్ఠిస్తూనే ఉంటామనేది కూడా వ్యవసాయం మాకు ఆపద్ధర్మ వృత్తి అనడంలో ఉంది.

ఇలా సమాధానం చెప్పగా మహిషం (దున్నపోతు) మంత్రిని ” ఏమయ్యా, నీకు ఒక పాలకుడి కొలువులో సాగుబాటు లేకపోతే పోయె. వేరే చోటుకు పోయి చదువు చెప్పుకుంటూ జీవించవచ్చు కదా, అది శాస్త్రసమ్మతం కదా? అలా చేయవేమి?” అని అడిగినట్టు భావించి, దానికి సమాధానం చెపుతున్నాడు.

ఆర్య శ్రీధర మంబుదీక్షిత మిమౌ దృష్య్తా మహా పండితౌ
విద్యాయై సృహయే న యద్యపి వరం క్షాత్రం బిభే మ్యాహవాత్‌
వాణిజ్యం ధన మూలకం త దఖిలం త్యక్వ్తా శ్రిత స్వ్తా మహం
త్వం విద్యా చ ధనం త్వ మేవ సకలం త్వం మే లులాయ ప్రభో.

మహారాజశ్రీ దున్నపోతుగారూ, వినండి. శ్రీధరుడున్నాడు కదా, మహాపండితుడు. అంబుదీక్షితులూ ఉన్నాడు, గొప్ప నిష్ఠాపరుడు. పండితుడు. షడ్దర్శనాలూ ఆపోశనం పట్టి వదిలాడు. ఇద్దరూ దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారు. వీళ్ళని చూశాక చదువంటే నాకు విరక్తి కలిగింది. తను చదువుకోవడం, ఇతరులకు చదువు చెప్పడం అనేవి బ్రాహ్మణ ధర్మాలైనా, అవి నిష్ప్రయోజనాలని తేలిపోయింది. పోనీ, క్షత్రియ ధర్మమైన శస్త్రాలను ఆశ్రయిద్దామా అంటే, యుద్ధం అంటే భయం కనుక మానేశాను. సరి, ఏ భయం లేని వ్యాపార వృత్తి వుంది కదా అనుకుంటే, దానికి డబ్బు కావాలి. అది మనదగ్గిర లేదు కదా. ఇవేమీ లాభం లేవని నిర్ధారించుకొని, నిన్ను ఆశ్రయించాను. నువ్వే నాచదువు, నువ్వే నా ధనం, అన్నీ నువ్వే, నీ దయవుంటేనే ఇవన్నీ నాకు దక్కుతాయి.
-------------------------------------
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Monday, July 16, 2018

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 1


మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 1





సాహితీమిత్రులారా!


పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు చేయించాలని చూస్తాడు. రెండు. అది అసాధ్యమయితే, పదవి వదలిపెట్టుకొని దూరంగా పోయి ఏ వ్యవసాయమో చేసుకుంటాడు.

వాంఛేశ్వర మంత్రి సరిగ్గా ఇదే చేశాడు. అంతటితో ఆగక ఆ పాలకుడి అలసత్వాన్ని, ఆయన్ని ఆశ్రయించుకు బతుకుతూ ప్రజల్ని కాల్చుకుతినే మోతుబరుల ఆగడాలనీ చీల్చి చెండాడుతూ, సంస్కృతంలో, నూరు శ్లోకాలతో ” మహిష శతకం” అనే వ్యంగ్య రచన చేశాడు. తన రచన చదివి, పాలకుడు సిగ్గుపడి చెంపలు వేసుకునేలాగా చేశాడు.

మహిషం అంటే దున్న పోతు. పల్లెటూళ్ళల్లో ప్రజలకు దగ్గిరగా దీనికి విశేషించి ఏ గౌరవం లేదని గమనించాలి. ఇటువంటి జంతువుని “సంకేతం” గా తీసుకుని దానిని స్తుతిస్తున్నట్టు నటిస్తూ సమాజంలో చెడుని చెండాడేడు. ఇదంతా ఎలాజరిగిందంటే —

తంజావూరు రాజ్యాన్ని క్రీ.శ. 1674 నుండి 1885 వరకూ మహారాష్ట్ర రాజులు పరిపాలించారు.వారిలో పదకొండవ పాలకుడు, రెండవ ఏకోజీ కొడుకు ప్రతాప సింగు 1739 నుంచి 1763 వరకూ పరిపాలించాడు. ఈతని తండ్రి కాలం నుంచి వాంఛేశ్వర మంత్రి వీరి కొలువులో తెలివైన వ్యక్తిగా మన్ననలు పొందుతూ, సమర్థంగా మంత్రిత్వం నిర్వహిస్తుండేవాడు. రెండవ ఏకోజి మరణించాక, రాజ్యపరిపాలన అరాచకం లో పడింది. దానికి తోడు ప్రతాపసింగు, చాలా కుర్రవాడు సింహాసనమెక్కాడు. యౌవనం, ధనసంపత్తిః ప్రభుత్వమవివేకతా ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. యౌవనం, బాగాడబ్బుండడం, పాలకపదవిలో వుండడం, అజ్ఞాని కావడం, వీటిలో ఒక్కొక్కటి ఉంటేనే మనిషికనర్థం. ఇంక ఈ నాలుగూ ఒక మనిషికే ప్రాప్తిస్తే, ఇంక చెప్పేందుకేముంది? అని సూక్తి చెప్పినట్టే అయింది ప్రతాపసింగు పని. చుట్టూ ఇచ్చకాలు చెప్పేవాళ్ళు చేరి తమపబ్బం గడుపుకొన్నారు. రాజు పేరు చెప్పి సుబేదారులు ప్రజలను పడరాని పాట్లకు గురి చేయ సాగారు. పరిపాలన నిరంకుశంగా తయారయింది. మంచితనంతో, నెమ్మదితనంతో, చదువుసంధ్యలతో, మెత్తగా పనిచేసే అధికారులని పదవులనుంచి తొలగించి, నిరంకుశులని దేశం మీదికి వదిలారు. బలవంతంగా ప్రజలనుంచి ధనధాన్యాలను దోపిడి చేయ సాగారు. మానాభి మానాలను కోరుకునే చాలామంది రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అమాత్యుడుగా వున్న వాంఛేశ్వరుడు ఈ దుర్భర పరిస్థితిని సరిచేసే ప్రయత్నాలు చేశాడు. ఫలితం దక్కలేదు. ఒక దశలో వాంచేశ్వర మంత్రి, ప్రతాపసింగుని కలుసుకొనే మాట్లాడే అవకాలు సైతం దూరమయ్యాయి. వ్యక్తిగతంగా అవమానాలకు పాలయ్యాడు. దీనితో ఒళ్ళు మండిపోయి, కడుపులో కసి వెళ్ళగ్రక్కడానికి మహిష శతకం వ్రాసి ప్రచారం చేయించాడు. ఈ శతకం ప్రతాపసింగు చదివి, తప్పు తెలుసుకొని, మళ్ళీ వాంఛేశ్వర మంత్రిని దగ్గరకు తీసుకొని, ఆయన సలహా పాటించి మంచి రాజనిపించుకున్నాడు.

దుష్టపాలనను ఖండించడం, దుర్మార్గుల ఆగడాలను చీల్చి చెండాడడం ప్రధాన లక్ష్యాలుగా గల ఈ శతకానికి చారిత్రకంగానే కాదు, నైతికంగా, సామాజికంగా కూడా ఎంతో విలువ వుంది. వాంఛేశ్వర మంత్రి గొప్ప పండిత వంశంలో పుట్టాడు. అతి చిన్నతనంలోనే శాహాజీ మహరాజు మెప్పుపొంది, తకుట్టికవిత (బాలకవి) అనే బిరుదం పొందాడు. పెద్దవాడయ్యాక రెండవ ఏకోజీ కొలువులో అమాత్యపదవినే కాదు, ఆస్థాన విద్వాంసుడి పదవికూడా నిర్వహించాడు. శహాజీ మహరాజు తిరువిశనల్లూరు గ్రామాన్ని శహాజీ పుర అగ్రహారం చేసి 47 మంది ఉద్దండ పండితులకు దానం చేశాడు. ఆ 47 గురిలో వాంఛేశ్వర మంత్రి తండ్రి కూడా ఒకరు. వాంఛేశ్వర మంత్రి జన్మస్థలం ఈ తిరువిశనల్లూరే.

వాంఛేశ్వర మంత్రి ఈ మహిష శతకమే కాక, ధాటీ శతకమనీ, ఆశీర్వాద శతకమనీ మరో రెండు పుస్తకాలు వ్రాశాడట. ఈ మహిష శతకానికి వాంఛేశ్వర మంత్రి ముని మనుమడు ( అతని పేరూ వాంఛేశ్వరుడే) “శ్లేషార్థ చంద్రిక” అనే పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం వ్రాశాడు. ఈయన మహా పండితుడు. తర్కశాస్త్ర నిధి. 80 ఏళ్ళవరకు జీవించి, 1849 ప్రాంతంలో మరణించాడు. తెలుగులో 1952 లో కావ్యతీర్థ మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తేటగా తాత్పర్య రచన చేశారు. ఇక ఒక్కొక్క శ్లోకం పరిశీలిద్దాం.

మంత్రి మహిషం 1
వాంఛేశ్వర మంత్రి తన రచన ప్రారంభాన్ని కావ్య సాంప్రదాయ ప్రకారం, ఆశీర్వాదంతో ేస్తున్నాడు.

స్వస్తస్య్తు ప్రథమం సమస్త జగతే
శస్తా గుణస్తోమత
స్సంతో యే నివసంతి సంతు మఖిన
స్తే మీ శివానుగ్రహాత్‌
ధర్మిష్ఠేపధి సంచర న్వ్తవనిపా
ధర్మోపదేశాదృతా
స్తేషాం యే భువి మంత్రిణ స్సుమనస
స్తే సంతు దీర్ఘాయుషః

మొట్టమొదట, పరమశివుడి దయవల్ల మొత్తం ప్రపంచానికి మేలు జరగాలి. దయ, ఓర్పు, అసూయారహితం, పరిశుద్ధత, శ్రమలేమి, మంగళం, కార్పణ్యరాహిత్యం, ఆశలేమి వంటి గుణాలున్న మంచివాళ్ళకు సుఖం కలగాలి. పాలకులు ధర్మబద్ధంగా నడవాలి. వాళ్ళదగ్గిర పనిచేసే మంత్రులు మంచిమనస్సుతో పాలకులకు ధర్మం బోధించగలిగి మసలాలి. అటువంటివారు ఆయుర్దాయం కలిగి సుఖంగా జీవించాలి. తను మంత్రిగా కొలువు సాగిస్తున్నది, భోసలరాజవంశం వారికి. తరతరాల పాటు వాళ్ళకు మేలు జరగాలని కూడా తను అవమానపడినప్పటికీ కూడా కవి కోరుకుంటున్నాడు.

యే జాతా విమలేత్ర భోసలకులే
సూర్యేందు వంశోపమే
రాజానశ్చిర జీవిన శ్చ సుఖిన
స్తే సంతు సంతానినః
యే తద్వంశ పరంపరాక్రమవశా
త్సభ్యా స్సమాభ్యాగతా
స్తే సంతు ప్రథమాన మాన విభవా
రాజ్యాం కటాక్షోర్మిభిః

సూర్య, చంద్రవంశాలతో సమానంగా , మచ్చలేని విధంగా భోసల రాజవంశంలో పుట్టిన వాళ్ళందరూ, దేవుడి దయవల్ల చిరంజీవులు, సుఖసంపన్నులు, సంతానవంతులు కావాలి. అంతే కాదు. ఈ రాజవంశం వాళ్ళకు వంశపారంపర్యంగా మంత్రిపదవులు నిర్వహించేవారికి కూడా, శుభాలు జరగాలి. వాళ్ళు తమపాలకులకు అనుగ్రహ పాత్రులై గౌరవాలు, వైభవాలు పొందుతూ అభివృద్ధి చెందాలి. పాలకుల కడగంటిచూపుల తరగలతో మంత్రులు సుఖవంతులు కావాలని వాంఛేశ్వర మంత్రి వాంఛ.
-------------------------------------------------------------------

రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, 
ఈమాట సౌజన్యంతో

Sunday, July 15, 2018

అనంతకవితాకాంచి


అనంతకవితాకాంచి




సాహితీమిత్రులారా!


నీవు
నేను
ఆద్యంతాలను కలిపే విడదీయరాని ముడులం
సౌందర్యగానం చేసే కడు తీయనైన సడులం

నీవు
నేను
భూత భవిష్యత్తులు సంధించే బిందువులం
పాత కొత్తలు ఒకటై చేరి పరిగెత్తే సింధువులం

నీవు
నేను
అశ్రుసాగరంలో ముత్యాలకై మునిగే కలాసులం
ఆనందసాగరపుటలలపై ఉరికే విలాసులం

నీవు
నేను
అనంత ప్రేమరాగపు ఆరంభ స్వరాలం
వినూత్న విశ్వసృష్టిలోని విచిత్ర రవాలం

ప్రేమికుల దినం సందర్భంగా ఏదైనా కొత్త విధమైన ఒక కవితను సృష్టించాలనే ఊహ నాకు కలిగింది. తెలుగులో ఇంతకు ముందు నేనెక్కడా చూడని ఒక చిత్రకవితను రూపొందించాను. మన చిత్ర కవిత్వాలలో కొన్ని నియమాలుంటాయి. అవి ఒక పద్యంలో మరో పద్యం రాయడమో (గర్భకవిత్వం), ఒక నమూనాకు సరిపోయేటట్లు పద్యాలను రాయడమో (బంధకవిత్వం), లేక పోతే అన్ని లఘువులు ఉండేటట్లో, గురువులు ఉండేటట్లో, పెదవులతో పలికే అక్షరాలు మాత్రమే వాడేటట్లో, ఇలా.

నేను పైన చెప్పిన కవితా పద్ధతికి అనంతకవితాకాంచి అని పేరు పెట్టినాను. ఈ కవిత ఒక పట్టీపైన రాయబడినది. కాంచి అంటే ఒడ్డాణము. అనంత అంటే అంతులేనిది. అంటే ఇది ఒక అంతులేని కవితా వృత్తము వంటిది. ఈ పట్టీకి సామాన్యమైన పట్టిలా రెండు కాక ఒకే ఉపరితలం (surface) ఉంటుంది. దీనిని సంస్థితిశాస్త్రంలో (topology) మోబియసు పట్టీ (Mobius strip) అంటారు. ఈ మోబియసు పట్టీ రీసైక్లింగ్ చిహ్నం. చీమలాటి కీటకం ఒకటి ఈ పట్టీపైన ఒక చోటినుండి బయలుదేరి నేరుగా నడిస్తే కొద్ది సేపటికి ఎక్కడ బయలుదేరిందో అక్కడికే మళ్లి వచ్చి చేరుతుంది. ఈ గుణమే దీనికి అనంతత్వాన్ని ఆపాదిస్తుంది. దీనిని ఉపయోగించి మోరిస్ ఎషర్ (Maurits Escher) ఒక కొయ్య శిల్పాన్ని కూడా చెక్కాడు. ఆంగ్లములో ఈ రకమైన కవితకు ఉదాహరణ లున్నవి.


మొదటి మెలిక
పై కవితలో నాలుగు పదాలు ఉన్నాయి, ఒక్కొక్క పదానికి నాలుగు పాదాలు. మొదటి రెండు పదాలను ఒక వైపు (వంగపండు రంగు కాగితంపై), చివరి రెండు పదాలను తలకిందులుగా మరోవైపు (తెల్లటి కాగితంపై) రాసి కాగితపు అంచులను సామాన్యంగా చేర్చకుండా ఒక మెలిక తిప్పి చేర్చాను. రెండు ఉపరితలాలను సరిగా గుర్తించడానికోసమే రెండు రంగులను వాడాను.


రెండవ మెలిక
మోబియసు పట్టీని మధ్యలో కత్తిరిస్తే అదనంగా ఇంకొక అర్ధ మెలికతో రెండింతల నిడివిగల పట్టీ లభిస్తుంది. ఇలా కత్తిరించిన దాన్ని మరో సారి కత్తిరిస్తే మనకు ఒకదానితో మరొకటి లంకె వేసికొన్నట్లు రెండు పట్టీలు దొరుకుతాయి. ఈ లంకె కత్తిరిస్తే తప్ప విడివడని ముడి.


మూడవ మెలిక
విధి కత్తెర వేటుకు తప్ప అవి తెగవు. మన ప్రేమికులు (నీవు, నేను) అలా వారి ప్రేమను కలుపుకొని అమరత్వాన్ని సాధించారు. ఇందులో మరొక చిత్రం ఏమంటే, కవితను ఏ పదముతోనైనా ప్రారంభించవచ్చు. నేను రాసిన విధంగానే చదువవలసిన అవసరం లేదు.
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో 

Saturday, July 14, 2018

నేనెవరిని?


నేనెవరిని?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం
విప్పండి-



బుద్ధిలేదు కాని బుద్ధితి దీపింతు
తోక కలదు కాని మేకకాదు
నోరులేదు కాని మీరెదవాఙ్నిధి
నెంచుడయ్య రూపునేనెవరిని?


బుద్ధలేనిదట బుద్ధిని వెలిగిస్తుందట
తోక ఉంది కాని మేక కాదట
నోరు లేదట కాని వాక్ నిధినే మీరుతుందట
మరి నారూపేమిటో చెప్పమంటున్నది
అదేమిటో చెప్పండి?


సమాధానం - తాళత్ర/ తాటాకు గ్రంథం

Sunday, July 8, 2018

విశాలా కళ్యాణీ స్ఫుటరుచిర


విశాలా కళ్యాణీ స్ఫుటరుచిర




సాహితీమిత్రులారా!

శంకరాచార్యుసౌందర్యలహరిలో
జగన్మాతను  ప్రముఖమైన
ఉత్తరభారతదేశ పట్టణాలతో
వర్ణించారు గమనించండి-


విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా2ధారా కిమపి మధురా2 భోగవతికా
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే
                                                          (సౌుదర్యలహరి - 49)


విశాలా కళ్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా2ధారా కిమపి మధురా2 భోగవతికా
అవన్తీ సృష్టిస్తే బహునగర విస్తార విజయా
ధ్రువం త త్తన్నా మవ్యవహరణ యోగ్యా విజయతే

ఇందులో వర్ణించిన నగరాలకు నగరపేరుగా అర్థం లేకుండా
మరో అర్థం వచ్చేలా కూర్చారు శంకరులవారు

తే - నీ, దృష్టిః - చూపు, విశాలా - విస్తృతమైనది, కళ్యాణీ - మంగళ
స్వరూపం, స్ఫుట రుచిః - చక్కని కాంతివంతం, కువలయైః - నల్లకలువలచే,
అయోధ్యా - జయించడానికి వీలుకాని, కృపాధారాధారా-
దయకుఆధారమనదగ్గ, కిమపి - ఇలాంటిదని చెప్పడానికి వీలుకానిది,
మధురా - గొప్ప ఆనందదాయక, ఆ భోగవతికా - విశాలదృక్పధం గలది,
అవంతీ - రక్షణ లక్షణం కలది, బహునగర విస్తార - పలునగర విస్తీర్ణం గలది,
విజయ - విజయం గల, తత్ నామ వ్యవహరణా - ఆ పట్టణాల పేర్లతో 
పిలువబడేది, యోగ్యా విజయతే ధ్రువం - నిశ్చయంగా అందుకు తగింది.



Saturday, July 7, 2018

చెప్పవలయు ముడిని విప్పవలయు


చెప్పవలయు ముడిని విప్పవలయు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం
విప్పండి-


చూడ చూడ నలుపు శుభ్రమ్ముగా నుండు
వాయి పట్టినపుడు వగరు తీపి
వెలికి దీసి నుమియ తెలతెల్లనైపోవు
చెప్పవలయు ముడిని విప్పవలయు



చూడటానికి నల్లగా వుంటుంది
రుచి తీపి పులుపు కలిగి వుంటుంది
వెలికి ఉమిసితే తెల్లగా వుంటుంది
అదేమిటని ప్రశ్న-

సమాధానం - అల్లనేరెడు పండు

Friday, July 6, 2018

ఎత్తు లాటలోని పొత్తుచెప్పెడు వాడు


ఎత్తు లాటలోని పొత్తుచెప్పెడు వాడు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం
విప్పండి-


అమ్మ చేతి నెత్తు నయ్య కాలును ఎత్తు
అయిన కాపురాన అలరుప్రేమ
ఎత్తు లాటలోని పొత్తుచెప్పెడు వాడు
లోక ధర్మమెరుగు లౌకికుండు

అమ్మ చేయి ఎత్తితే
అయ్య కాలెత్తుతాడట
అయినా కాపురంలో ప్రేమగానే ఉన్నారట
అయితే ఈ ఎత్తులాటలోని పొత్తేదో చెప్పేవాడు
లోకధర్మం తెలిసిన లౌకికగడట
దీనిలోని పొడుపేదో విప్పండి-

సమాధానం -
అమ్మ రవిక తొడుక్కునేప్పుడు చేయెత్తుతుందికదా
అది తగవులాటలోనిదికాదు
అలాగే అయ్య గోచీ చెట్టుకునేప్పుడు కాలెత్తుతాడుకదా
అమ్మని తన్నటానికాదు
అందువల్ల వారి ప్రేమలో ఏ ఆటంకం లేదు
ఎత్తులాటలోని మర్మం ఏమిటి
అంటే రవికె చొడుక్కోవటానికి అమ్మ చేయెత్తును
గోచీ చెట్టుకోవటానికి నాన్న కాలెత్తుతాడు.
ఇదే మర్మం ఇదే విడుపు.

Thursday, July 5, 2018

తెలుపు మాతడు ఎవ్వరో తెలుగుబాల?


తెలుపు మాతడు ఎవ్వరో తెలుగుబాల?




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం
విప్పండి-


అతడు నల్లని వాడైన యమగడు కాడు
అతడు చక్రము దాల్చు కుమ్మరియు కాడు
అతడు శంఖమ్ము దాల్చు జంగమ్ము కాడు
అతడు పింఛము ధరించు చెంచు కాడు
అతడు రాజ్యాలు నిలబెట్టు రాజు కాడు
అతడు వస్త్రాల నందిచ్చె సాలెకాడు
అతడు మర్రాకు పైపండె పురుగుకాడు
అతని బరువుండె తులసంత దూదికాడు
తల్లి పాలను ఎరుగడు తల్లి కలదు
తండ్రి మమతను ఎరుగడు తండ్రి కలడు
జీవమే లేని మేనల్లు డతని జంపె
తెలుపు మాతడు ఎవ్వడో తెలుగుబాల


సమాధానం -  శ్రీకృష్ణుడు

సమాధానం సరైనదో కాదో
తర్కించి చూడగలరు.

Wednesday, July 4, 2018

దీని భావమేమి దేవదేవ


దీని భావమేమి దేవదేవ




సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం
విప్పండి-

మూడు తలలు సాగు ముందుకు వెనుకకు
కాళ్ళు పదియు కలిగి కదలుచుండు
పైకి లేచు వెనుక వడివచ్చు ముందుకు
దీని భావమేమి దేవదేవ

3 తలలతో ముందుకు సాగుతుందట
పది కాళ్ళతో కదలుతుందట
పైకి లేస్తుందట ముందుకు వడిగా వస్తుందట
ఇదేమిటో చెప్పమంటున్నాడు కవి.

సమాధానం- మోట / కపిల

Tuesday, July 3, 2018

చిక్కు విప్పి చెప్పు చిన్నికృష్ణ!


చిక్కు విప్పి చెప్పు చిన్నికృష్ణ!




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం
విప్పండి-


పండు చూచు నొకడు పండు తెచ్చు నొకడు
తినునొకండు మరియు తినుకు నొకడు
అనుభవ ఫలమేమొ అందరకందును
చిక్కు విప్పి చెప్పు చిన్నికృష్ణ!

సమాధానాలు -
పండు చూచు నొకడు - కళ్ళు
పండు తెచ్చు నొకడు - చేతులు
తినునొకండు        - నోరు
తినుకు నొకడు      - ముడ్డి
అనుభవ ఫలమేమొ అందరకందును - రక్తప్రసరణం

Monday, July 2, 2018

శారదోదాహరణ తారావళి

 శారదోదాహరణ తారావళి





సాహితీమిత్రులారా!



ఉదాహరణవాఙ్మయమును గురించిన వ్యాసాలు రెండింటిని
చూచాము. ఇక్కడ మరోవ్యాసం చూడండి -
జెజ్జాల కృష్ణ మోహన రావుగారు వ్రాసిన శారదోదాహరణతారావళి
అనబడు ఒక ఉదాహరణ కావ్యమును మీకు సమర్పిస్తున్నాను.


1. తెలుగు విభక్తి లక్షణములు
నేను అదనముగా చేర్చినవి రెండు, అవి – (1) ఉదాహరణముల నియమములలో వృత్తములుగా శార్దూల మత్తేభవిక్రీడితములను, చంపకోత్పలమాలలను మాత్రమే వాడవలయునని ఉన్నది. కవులు ఇతర వృత్తములను, కందమును, ద్విపదను కూడ వాడినారు. నేను ప్రతి విభక్తికి ఒక వృత్తమును వాడినాను. అవి పై నాలుగు వృత్తములుగాక వేఱైనప్పుడు ఆ వృత్తములలో ఒకదానిలో కూడ వ్రాసినాను. (2) విభక్త్యాభాసమునకు చతుర్థీ విభక్తిని మాత్రమే కవులు ఉపయోగించినారు. ద్వితీయా, తృతీయా, షష్ఠీ విభక్తులలో కూడ ఉత్కళికను వ్రాయునప్పుడు విభక్త్యాభాసము సాధ్యము అని నిరూపించినాను. ఉదాహరణములలో ఉపయోగించే విభక్తులను, ఈ ఉదాహరణపు కళికలలోని రగడలను గుఱించిన వివరముల పట్టికను కూడ ఇచ్చియున్నాను.

ప్రథమా విభక్తి
ఉత్పలమాల –
శ్రీల నొసంగు దేవి పలు – చెల్వము లిచ్చెడు దేవి విద్యలన్
జాల నొసంగు దేవి నర-జన్మకు నర్థము నిచ్చు దేవి స-
చ్ఛీల మొసంగు దేవి ప్రవ-చించఁగ వేదము లిచ్చు దేవి గా-
రాల నొసంగు దేవి యను-రాగము మీఱఁగ వాణి నీయుతన్

కళిక – మధురగతి రగడ –
మఱియును నుత్పల – మాలల గంధము
గరువపు నడకల – కందపు టందము
హరుసము నిచ్చెడు – హంస రుతమ్ములు
కరిబృంహితములు – క్రౌంచపదమ్ములు
కోకిల కలరవ – కోమల గీతము
ప్రాకట మగు ష-ట్పద మృదు గీతము
వసుమతి చేసెడు – పలు వందనములు
ప్రసువున కొసగెడు – ప్రణ యార్పణములు

ఉత్కళిక – చ/చ
నవ్వులు తెల్లన
పువ్వులు తెల్లన
హారము తెల్లన
కీరితి తెల్లన
డెందము తెల్లన
చందము తెల్లన
భగవతి ధ్యానము
యుగముల ప్రాణము

కొన్ని వివరణలు
విభక్తులకు పేరులు, అధిదైవములు గలవు. ప్రథమా విభక్తి పేరు వాణి, అధిదేవత వీరావళి. ఇందులో వాణి పేరు పద్యములో వచ్చినది.
కావ్యము శ్రీకారముతో నారంభమైనది. ఎందుకనగా-
శ్రీకారము శుభకర మగు
శ్రీకారము సకలకార్యసిద్ధి నొసంగున్
శ్రీకారము గీర్తిద మగు
శ్రీకారము గృతుల నాది జేకూర్ప దగున్ (చాటుధార)
కళికలో ప్రకృతిలో గల చరాచరములను, జడజీవములను తల్లి శారదకు భూదేవి ప్రేమతో అర్పణ చేయుచున్నదను ఒక భావన. ఛందస్సు నాకు ప్రియము, అందు వలన వృత్తముల, ఇతర పద్యముల నామములు ఇందులో గలవు. అవి- ఉత్పలమాల, కందము, హంసరుతము, కరిబృంహితము, క్రౌంచపదము, కోకిల, కలరవ, కోమల, గీతము, వసుమతి.
చందము అనగా తెఱగు. ఛందస్సు అని కూడ అర్థము. ఛందస్సు వేద భాష కూడ.
సరస్వతిని తెల్లదనముతో బోల్చుట వాడుక. యా కుందేందు తుషారహార ధవలా… శారద నీరదేందు ఘనసార పటీర… ఇత్యాదులు. అందువలన ఉత్కళికలో మొదటి ఆఱు పాదములలో ఆ తెల్లదనమును తెలిపి, చివరి రెండు పాదములలో నియతమైన ప్రథమా విభక్తిని వాడినాను.
ద్వితీయా విభక్తి
వసంతతిలక
రాజేశ్వరిన్ సుకవి-రాజహృదంతరాత్మన్
రాజీవ నేత్రిని స్వ-రామృత వర్షదాయిన్
రాజీవగంధిని ని-రంతర హర్షదాయిన్
రాజాననన్ గొలుతు – రాజ మరాళయానన్

ఉత్పలమాల –
నన్నయ నన్నెచోడుల మ-నమ్ముల నిల్చిన నీరజాక్షిఁ, ది-
క్కన్న కలమ్ములోన మధు-రామృత మద్దిన మిన్కుగొమ్మఁ, బో-
తన్న గళమ్ములోన మధు – ధారల నింపిన శారదాంబనున్
జెన్నుగ సత్కవిత్వ మధు-సేవన మీయఁగ వేడెదన్ సదా

కళిక – మధురగతి రగడ –
మఱియు గులాబుల, – మణిమంజరులను
విరియు నలినముల, – విపినతిలకమును
మకరందికలను, – మల్లెల మాలను
రకరకముల కిస-లయ వృత్తములను
చంపకకేసరి – చంపకమాలను
సొంపుల నొసగెద – సురలత ననలను
పదములఁ గొలువఁగ – భారతి ప్రభవను
ముదమున బొగడఁగ – మోహన విభవను

ఉత్కళిక – చ/చ
గురువుల గురువై
స్వరముల కిరవై
అక్షి కలఘువై
అక్షర లఘువై
కీర్తికి మతియై
ఆర్తికి గతియై
తలచఁగ సుముఖిని
పిలువఁగ ప్రముఖిని

వివరణలు
ఎనిమిది విభక్తులకు ఎనిమిది రకములైన వృత్తములను వాడవలయునని తలచినందున, ఈ విభక్తికి వృత్తముగా వసంతతిలకను ఎన్నుకొనినాను. వసంతతిలక- త-భ-జ-జ-గ-గ యతి (1, 8). ఈ వృత్తమునకు ఇతర నామములు సింహోన్నత, ఔద్ధర్షిణి, శోభావతి, మధుమాధవి. ఇది శక్వరి ఛందములోని 2933వ వృత్తము.
కళికోత్కళికలలో గోచరమగు పద్యముల పేరులు- గులాబి, మణిమంజరి, నలిన, విపినతిలక, మకరందిక, మల్లెలమాల (నా సృష్టి), కిసలయ, వృత్త, చంపకకేసరి, చంపకమాల, సురలత, సుముఖి. కాలమునకు ఆదియని ప్రభవ పదము సూచించును.
పద్యము పాదములతో విరాజిల్లును. పాదములు పదములతో శోభించును. పదములు అక్షరములతో నిండియుండును. అక్షరములు గురులఘువులు. పద్యములు సంగీతభరితము. ఈ గుణములు అక్షర, గురు, లఘువు, స్వర పదములతో తెలుపబడినవి.
ద్వితీయా విభక్తికి పేరు ఝట, అధిదేవత కీర్తిమతి. కీర్తిమతి యను పేరు ఉత్కళికలో ఇచ్చినాను.
కళికలో అన్ని పాదాంతములలో ద్వితీయా విభక్తియైన ను-కారము, ఉత్కళిక చివరి రెండు పాదములలో ని-కారము ఇవ్వబడినవి.
క్రొత్త ప్రయోగము – ద్వితీయా విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక- చ/చ
కంజదళాక్షి ని
రంజనమూర్తి ని
రంతర శాంతి ని
తాంత సుకాంతి ని
గూఢ గుణాళి ని
రూఢ కళాబ్ధి ని
రర్గళ వాణిని
స్వర్గవిహారిని
తృతీయా విభక్తి
శార్దూలవిక్రీడితము –
నీచే విశ్వము లెల్ల జ్ఞానమయమౌ – నిస్తంద్ర తేజోమయీ
నీచే మానస మెల్ల కాంతిమయమై – నిత్యమ్ము నిండున్ గదా
నీచే బోధన శోధనల్ జరుగు న-న్వేషార్థ మీవే సదా
నీచే సృష్టియు గల్గు హృష్టి గలుగున్ – నీచేత శ్వేతాంబరీ

కళిక – ద్విరదగతిరగడ –
మఱియు నవ శబ్దముల – మధురిమల శ్రేణిచే
వర సుభగ వాక్సుధా – భరిత గీర్వాణిచే
చిత్రలేఖన నాట్య – సృజన బ్రహ్మాణిచే
చిత్ర కవితల గూర్చు – చెలువముల రాణిచే
వీణియను మ్రోగించు – వేదాంత వేదిచే
వాణి కొక మెఱుఁ గిచ్చు – వచన సంవాదిచే
శిల్పము లనల్పముగ – చెక్కు ఘన శిల్పిచే
కల్పనల కల్ప మగు – కడు దయల వేల్పుచే

ఉత్కళిక – పం/పం
రాగముల యోగములు
యోగముల రాగములు
విద్యల వినోదములు
పద్యముల చోద్యములు
కాంతిమయ దీపములు
శాంతిమయ రూపములు
శరదిందు వదనచే
స్వరచిత్ర సదనచే

వివరణలు
ఇందులో పలు లలితకళలను విశదీకరించినాను. తృతీయా విభక్తికి కీర్తి అని పేరు. అధిదేవత సుభగ. సుభగ అను పేరు కళికలో వాడబడినది.

క్రొత్త ప్రయోగము – తృతీయా విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక – పం/పం
అంతటను నెన్నొ చే-
మంతుల సరములు చే-
లమ్ముల సితమ్ము చే-
తమ్ముల ముదమ్ము చే-
దోడుగను నామె చే-
కూడుఁగద మేలు చే-
తనమెల్ల బ్రాహ్మిచే
స్వనమెల్ల వాణిచే

చతుర్థీ విభక్తి
తరలము –
నలువ దేవుని రాణికై రచ-నావిధాన ప్రమాణికై
కలువ కన్నుల జ్ఞానికై నవ-కాంతిదాయిని ధ్యానికై
లలిత విద్యల రాశికై సువి-లాస నాట్య కలాపికై
తెలుగు కైతల భావికై యిది – దేవలాభిని దేవికై

చంపకమాల –
అమల దుకూల ధారిణికి-నై, యసమాన కళావధూటికై
యమిత రసార్ణవాంబుజకు-నై, యపరాజిత వేదవాణికై
యమృతసమాన భాషిణికి-నై, యనురాగమయార్ద్ర చిత్తకై
యమర మునీంద్ర సేవితకు-నై, యమరాక్షరఁ గొల్తు నెప్పుడున్

కళిక – మధురగతిరగడ –
మఱియును జీఁకటి – మదిఁ దొలఁగుటకై
వఱలెడు కాంతులు – వఱద లగుటకై
జిజ్ఞాసల విరి – జీవించుటకై
సుజ్ఞానపు ప్రియ – సుధ లూరుటకై
నవ జీవన లత – నన బూయుటకై
నవ రాగపు ఛవి – నడయాడుటకై
హృదయస్పందన – లిలఁ బాడుటకై
బ్రదు కిది జయభ-ద్రను వేడుటకై

ఉత్కళిక – చ/చ
మీఱగ నీ కై-
వారము నీ కై-
రవములు నీ కై-
రవియును నీ కై-
సేతలు నీ కై-
వ్రాతలు నీ కై-
దివియలు నీకై
స్తవములు నీకై

వివరణలు
చతుర్థీ విభక్తికి దేవలాభిని యని పేరు, దీని అధిదేవత పేరు భోగమాలిని. దేవలాభిని అను పేరు మొదటి పద్యములో నున్నది.
ఉత్కళికలో విభక్తి ఆభాసము తోచునట్లు వ్రాసినాను. కైవారము (నమస్కారము), కైరవము (కలువపూవు), కైరవి (వెన్నెల), కైసేత (పని), కైవ్రాత (చేతివ్రాత), కైదివియ (చేతగల దీపము)- ఈ ఆఱు పదములు విభక్త్యాభాస పదములు. నీ అను పదము సంధివలన వచ్చినది. (మీఱగన్ + ఈ = మీఱగ నీ, ఇట్లే మిగిలినవి). కై అను అక్షరముతో ప్రారంభమగు పదములు చాల తక్కువ. నేను ఈ పదములనే ఎందుకు ఎన్నుకొన్నాను అనగా- ఈ పదములు విభక్తియొక్క ఆభాసమును తెలుపుటయే గాక, కై లేకున్నను, తదుపరి పాదములోని పదములు స్వతంత్రముగా నిలువగలవు. వారము, రవము, రవి, సేత, వ్రాత, దివియ పదములు తమంతట తామే అర్థవంతములు.
పంచమీ విభక్తి
మత్తేభవిక్రీడితము –
వరదాయీ జగ మెల్ల నీవలననే – భాసించు సందీప్తమై
వర వీణా మృదు పాణి నీవలన స-ద్భావమ్ము గల్గున్ సదా
నరనారీకుల మెల్ల నీవలన జ్ఞా-నమ్మొంద యత్నించు సుం-
దరమౌ సద్‌హృదయమ్ము నీవలన మా-తా వేదవిద్యానిధీ

కళిక – వృషభగతిరగడ –
మఱల నుల్లము పూర్ణ మందఁగ – మధుర విద్యల దీప్తి వలనన్
సిరుల నిండఁగ జీవన మ్మిటఁ – జిత్ర మగు నీ కళల వలనన్
గణిత శాస్త్రపు గాన శాస్త్రపు – గంధ మబ్బఁగ ఘనత వలనన్
గనుల శాస్త్రపు మణుల శాస్త్రపు – గరిమ తెలియఁగ మహిమ వలనన్
వివిధ భాషల విమల శోభలు – వెలుఁగ నిల నీ కలము వలనన్
వివిధ స్వరముల ప్రణవ రవములు – వెల్లువవ నీ గళము వలనన్
ఫుల్ల కుంద సుహాసినీ మది – పొంగ నీ గురు కృతుల వలనన్
పల్లవించఁగ జ్ఞానవల్లి య – పారమగు నీ కృపల వలనన్

ఉత్కళిక – త్రి/చ/త్రి/చ
మఱియు మంగళ మధురగీతులు
సురుచిరమ్మగు శుభ విభూతులు
విలసితమ్మగు వృత్త రీతులు
లలిత పదముల లయవిభాతులు
చంద్రభాను సుచారు కాంతులు
నింద్రచాపము లిచ్చు భ్రాంతులు
నవరసోజ్జ్వల నటన వలనన్
భువన మోహిని భ్రూవు వలనన్

వివరణలు
పంచమీ విభక్తికి పేరు పాణి, అధిదేవత కళావతి. పాణి అను పదము వృత్తములో వచ్చినది.
కళికలో ఎన్నియో కళల పేరులు, విజ్ఞాన విభాగములు చెప్పబడినవి. (గణితము, సంగీతము, భూగర్భశాస్త్రము, స్ఫటికశాస్త్రము ఇత్యాదివి.)
ఉత్కళికలో ఛందస్సులోని గణములైన సూర్య, ఇంద్ర, చంద్ర గణముల పేరులు సూచించబడినవి.
ప్రణవ, మంగళ, మధురగీతి, సురుచిర, శుభ, విభూతి, వృత్త, లలిత, లయవిభాతి, చంద్రభాను, కాంతి, ఉజ్జ్వల అను పద్యముల పేరులు కళికోత్కళికలలో తెలుపబడినవి.
షష్ఠీ విభక్తి
(షట్పద) కందము –
సురుచిర బంభర వేణికి
సరసిజభవుఁ గూర్మి సతికి
స్వర భేదినికిన్
సరసోక్తుల కవయిత్రికిఁ
గరుణాలయ కనుదినమ్ము
గరములు మోడ్తున్

ఉత్పలమాల –
హారము లిత్తు నా హృది వి-హారము సల్పెడు దేవికిన్ నమ-
స్కారము సల్పుదున్ జదువు – సారము దెల్పెడు వాణికిన్ మనో-
ద్వారము దీసెదన్ వెలుఁగు – దారులు సూపెడు తల్లికిన్ సదా
స్మారము సేసెదన్ గళల – మర్మము విప్పెడు శారదాంబకున్

కళిక – ద్విరదగతిరగడ –
మఱియు స్వరభూషణికి – మలహరికి శ్రీమణికి
వరదకు సుపోషిణికి – భైరవికి తారిణికి
భూపాల నాయకికి – పూర్ణచంద్రిక ప్రతికి
శ్రీ పావనికి ప్రణవ-శీలి ఛాయావతికి
నారాయణికి సామ – నాదనామక్రియకు
కీరవాణికి జయకు – కృష్ణవేణికి సితకు
రాగచూడామణికి – రత్నాంగి రంజనికి
రాగమాలికలు ఘన – రాగ రసమంజరికి

ఉత్కళిక – పం/పం
స్వరరూపవతి లలిత
కిరణావళీకలిత
కనకాంగి చారుమతి
వనజాక్షి భానుమతి
రాగవర్ధని వాణి
వేగవాహినివేణి
స్వామిని కళావతికి
ప్రేమల శరావతికి

వివరణలు
కందము షట్పద కందము, అనగా రెండవ, నాల్గవ పాదములలో యతితోబాటు ప్రాస యతి కూడ నున్నది.
షష్ఠీ విభక్తికి పేరు లలిత, అధిదేవత కాంతిమతి. ఇందులో లలిత అను పేరు ఉత్కళికలో నున్నది.
కళికోత్కళికలలో రాగముల పేరులను సూచించినాను. అవి- స్వరభూషణి, మలహరి, శ్రీమణి, సుపోషిణి, భైరవి, భూపాల, నాయకి, పూర్ణచంద్రిక, శ్రీ, పావని, ఛాయావతి, నారాయణి, సామ, నాదనామక్రియ, కీరవాణి, కృష్ణవేణి, రాగచూడామణి, రత్నాంగి, రంజని, రసమంజరి, రూపవతి, లలిత, కిరణావళి, కనకాంగి, చారుమతి, భానుమతి, రాగవర్ధని, వేగవాహిని, కళావతి, శరావతి (30 రాగములు)
క్రొత్త ప్రయోగము – షష్ఠీ విభక్తి ఉత్కళికలో విభక్త్యాభాసము

ఉత్కళిక – పం/పం
చారుమతి భగవతి కి
శోరులకు సృత్వరి కి
నుక లేని వాఙ్మణి కి
టుకు సూపు బ్రాహ్మణి కి
ణకిణల గాయని కి
లకిలల హాసిని కి
రీటములు భారతికి
మేటియగు కీరితికి

సప్తమీ విభక్తి
చంపకమాల –
ఉదయమునందు ధ్యానమున – నోజము లొప్పుగ బోధ సేసె నా
హృదయమునందు చిందులిడు – మృష్ట సువిగ్రహ మామెదే గదా
వదనమునందు నుచ్చరణ – స్వచ్ఛము సేసెను గంగవోలె నీ
సుదినమునందు సుందర వ-చోఽమృత మిచ్చిన దామెయే గదా

కళిక – హంసగతిరగడ –
మఱియు ఛవి యుదయించ – మనసు నందు
విరియ హృత్కమల మా – వెలుఁగు నందు
దీవె లవ భావములు – దినము నందు
రావ మవ భావములు – రాత్రి యందు
మెలిక లవ రాగములు – మెలకు వందు
నిలువ లయ యోగములు – నిదుర యందు
బాట నీవవ చావు – బ్రదుకు నందు
ఆట నీవవఁగ నా-ద్యంత మందు

ఉత్కళిక – పం/త్రి
చింతన మవంగ
మంతన మవంగ
చిత్రము లవంగ
సూత్రము లవంగ
సూచన మవంగ
మోచన మవంగ
గద్యముల యందుఁ
బద్యముల యందు

వివరణలు
కళిక అరుదుగా వాడబడే హంసగతిరగడలో వ్రాసినాను.
సప్తమీ విభక్తికి పేరు ఘోణి లేక ఘోటిక, అధిదేవత కమల. కమల అను పదము కళికలో వచ్చినది.
సంబోధనా ప్రథమా విభక్తి
మాలిని –
జయతి జయతి వాణీ – శ్రావ్య సంగీత వాణీ
జయతి సుజన పక్షా – సత్య సంకల్ప దక్షా
జయతి జయతి మాయీ – జన్మసాఫల్య దాయీ
జయతి విమల వేషా – సంస్కృతారామ పోషా

చంపకమాల –
జయము సరస్వతీ జయము – శారద చంద్ర సమాన హాసినీ
జయము ప్రియంవదా జయము – సత్య వచోఽమృత సింధు వాఙ్మయీ
జయము సుమాలినీ జయము – చందన కుంకుమ పుష్ప భూషిణీ
జయము విశారదా జయము – ఛందపు టందముఁ జూపు శారదా

కళిక – హయప్రచారరగడ –
మఱియు దేవి – మంగళాంగి
స్థిర సుమేరు – శ్రీ శుభాంగి
ముక్తి దాయి – మోద దాయి
భక్తి దాయి – భావ దాయి
యుక్తి దాయి – యోగ దాయి
శక్తి దాయి – శమన దాయి
అహము రాత్రి – అమరవల్లి
ఇహము పరము – నిచ్చు తల్లి

ఉత్కళిక – త్రి/త్రి
అజయ మతిగ
విజయవతిగ
వళుల వడిగ
కళల గుడిగ
ముదపు విరిగ
హృదికి సిరిగ
అక్ష రాంబ
అక్ష యాంబ

వివరణలు
ఈ విభక్తికి సరసావళి అని పేరు. దీనికి అధిదేవత జయవతి. జయవతి అను పదము ఉత్కళికలో వ్రాసినాను.
మాలినీ వృత్తమును సంస్కృతములో కూడ సంబోధనకై ఉపయోగింతురు. ఇట్టి పద్యములు జయతి అను పదముతో ప్రారంభమగును. నేను కూడ ఇట్లే ఈ పద్యమును వ్రాసినాను.
సార్వవిభక్తికము
ద్విపద-
ఆరని పృథు దీప – మమర భూజమ్ము
తీరని యాశలన్ – దీర్చు దైవమ్ము
భారతిచే విద్య – వఱలు వేగమ్ము
కారుణ్య దృష్టికై – కైమోడ్తు నమ్ము
నీ రాగము వలన – నేర్తు గానమ్ము
గారాల తల్లికి – కవి తామృతమ్ము
చేర నీ పదమందు – చిన్ని జీవమ్ము
కోరితిన్ శారదా – గురుదేవి రమ్ము

మత్తేభవిక్రీడితము –
వరవీణామృదుపాణి నీవు, నిను నేఁ – బ్రార్థింతు, నీచేత సుం-
దరకావ్యమ్ముల సృష్టి యౌను, సుమనో-దామమ్ము నీకై కదా,
సరసోక్తుల్ జనియించు నీవలన, భా-షాదేవి నీకంజలుల్,
జరణాబ్జమ్ములయందు నుంతుఁ గవితల్, – సర్వేశ్వరీ శారదా

పాల్కుఱికి సోమనాథుడు పండితారాధ్యచరిత్రలో ఏడు విభక్తులు వచ్చునట్లు ద్విపదలలో వ్రాసెను. ద్విపదను ఎన్నుకొనుటకు అది ఒక ప్రోత్సాహమైనది.

మంగళము
మంగళమహాశ్రీ –
మంగళము వర్తనలు – మంగళము నర్తనలు – మంగళము కీర్తనల స్ఫూర్తీ
మంగళము వేదములు – మంగళము నాదములు – మంగళము మోదన వినోదీ
మంగళము నీ స్వరము – మంగళము నీ కరము – మంగళము నీ వరము దేవీ
మంగళము నీ గృహము – మంగళము నీ మహిమ – మంగళము మంగళమహాశ్రీ

వివరణ
ఉదాహరణ కావ్యములలో ఎల్లప్పుడు ఇరువదియాఱు పద్యములు ఉండవలయును. ఎనిమిది విభక్తులకు ఇరువది నాల్గు, సార్వవిభక్తికమున కొకటి, అంకితాంకితమున కొకటి. తారావళికి ఇరువది ఏడు పద్యములు ఉండవలయును. అదనపు పద్యము ప్రథమా విభక్తికి ముందు కొందఱు వ్రాసినారు. నేను సార్వవిభక్తికమునకు పిదప మంగళవాక్యముగా వ్రాయ దలచితిని. ఈ విధముగా మొదట శ్రీకారముతో చివర శ్రీకారముతో ఈ లఘు కావ్యము శోభిల్లును. మంగళాంతమునకు మంగళమహాశ్రీ ఉండగా వేఱు వృత్తము ఎందులకు ఎన్నుకొన వలయును.

అంకితాంకము
కందము-
జెజ్జాల వంశ సూనుఁడ
సజ్జనని యుదాహరణము – చందమ్ములతో
సజ్జన ప్రియముగ వ్రాసితి
ముజ్జగముల పతికి కృష్ణ – మోహనునకు నేన్
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో 

Sunday, July 1, 2018

గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం


గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం



సాహితీమిత్రులారా!


రాష్ట్రకూట రాజవంశానికి చెందిన అమోఘవర్ష నృపతుంగ చక్రవర్తి పరిపాలించిన కాలంలో (క్రీ. శ. 814-877) వెలువడిన అలంకారశాస్త్రం కవిరాజమార్గం. ఇది కన్నడంలో లభ్యమైన మొట్టమొదటి గ్రంథం కావడం విశేషం. 1898లో కె. బి. పాఠక్ అనే పండితుడు మొదటిసారి ప్రచురించిన నాటినుండి కవిరాజమార్గం అనేక దేశవిదేశీయుల దృష్టినాకర్షించింది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

సంస్కృత కావ్యశాస్త్రాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది కావ్యాదర్శం. క్రీ. శ. 6-7 శతాబ్దాలకు చెందిన దండి రాసిన ఈ అలంకారగ్రంథాన్ని ఆధారంగా చేసుకొని నృపతుంగ ఆస్థానకవి శ్రీవిజయుడు కవిరాజమార్గాన్ని రచించాడు. ఈ గ్రంథానికి మరో ఆధారం భామహుని కావ్యాలంకారం (క్రీ. శ. 6-7 శతాబ్దాలకు చెందింది). కవిరాజమార్గం అచ్చయి వంద ఏళ్ళు దాటినా ఆ గ్రంథానికి చెందిన అనేక ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. రాజకవి అయిన నృపతుంగుడే దాన్ని రచించాడని కొందరు భావిస్తే, ‘నృపతుంగుడి అనుమతితో ఇది రచితమైందని’ గ్రంథంలోనే ఉన్న ఆధారాన్ని బట్టి దీన్ని శ్రీవిజయుడనే కవి రాసి కవిరాజయిన నృపతుంగుని మార్గాన్ని లోకంలో ప్రచారం చేశాడని చాలామంది పండితులు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా భారతీయ భాషలలోనే కాక ప్రపంచ భాషల్లోనే కవిరాజమార్గం ఒక విశిష్ట శాస్త్ర గ్రంథమని చెప్పడానికి ఆస్కారం ఉంది. భారతీయ అలంకారశాస్త్ర సంప్రదాయాన్ని స్థానిక భాషలో పరిచయం చెయ్యడానికి పూనుకొని, తన భాష, సంస్కృతి, కావ్యసంప్రదాయం, జనుల రీతి నీతుల్ని చేర్చి తీర్చిదిద్దిన ఘనత శ్రీవిజయునిది. తమిళంలో తొల్కాప్పియమ్ ఇలాంటి గ్రంథమే. కానీ, అది తమిళాన్నే దృష్టిలో ఉంచుకొని రాసిన వ్యాకరణం. కొంతవరకూ ఇతర శాస్త్రాలకు సంబంధించిన విషయాలున్నా కవిరాజమార్గానికి ఉన్న వైవిధ్యం అందులో లేదు. కన్నడ గ్రంథానికున్న వైశిష్ట్యం ఏమిటంటే దాన్ని రచించిన కవికి భారతీయ అలంకార శాస్త్ర సంప్రదాయం మీద గౌరవం ఉంది. కన్నడ భాషా సంస్కృతుల మీద అపారమైన అభిమానం ఉంది. ఇలాంటి సామరస్యాన్ని సాధించడంలోనే ఈ గ్రంథం ప్రత్యేక గుణం వ్యక్తమవుతుంది.

ఈ రచనలో మొత్తం 536 పద్యాలున్నాయి. చాలా వరకూ కందపద్యాలే. శాస్త్రగ్రంథాలకు కందపద్యాన్ని వాడే అలవాటు తెలుగు వారికీ ఉండడం విశేషం. హితంగా, మితంగా చెప్పడానికి కందపద్యం అనువైనదని ఈ రెండు భాషలవాళ్లు భావించారు. అంతేకాదు, ఈ రెండు భాషల వారికీ సమానంగా ఉండే కొన్ని కావ్యపీఠికా సంప్రదాయాలు కవిరాజమార్గంతోనే ప్రారంభమయ్యాయి. కావ్యాన్ని శ్రీకారంతో ప్రారంభించడం; అందులోనూ నాంది పద్యంలాగా మొదటి పద్యాన్ని ఆశీర్నమస్క్రియలతో రచించడం; దేవతాస్తుతి, పూర్వకవి స్తుతి, సత్కవి ప్రశంస, కుకవినింద మొదలైనవన్నీ ఈ గ్రంథంతోనే ప్రారంభమయ్యాయి. ఈ గ్రంథంలోని కొన్ని ఆధారాలను బట్టి శ్రీవిజయుడు జైనుడని భావించవచ్చు. తెలుగులో జైనుడైన రేచన కవిజనాశ్రయము అనే పేరుతో ఛందోగ్రంథాన్ని రాయడానికి కవిరాజమార్గం ప్రేరణ ఇచ్చిందేమో అని ఒక ఊహ.

శ్రీవిజయుని గ్రంథంలో మొదటి పరిచ్ఛేదం అనేక విధాల ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ భాగంలోని విషయాలు రచయితలకుండే కొన్ని స్పష్టమైన అభిప్రాయాలను విశదపరుస్తున్నాయి. కన్నడనాడు, కన్నడనుడి, కన్నడ సంస్కృతి మొదలైన విషయాలను గురించి తొమ్మిదవ శతాబ్దిలోనే ఇంత స్పష్టంగా చెప్పడం ఈ గ్రంథంలో విశేషం. మొదటి పరిచ్ఛేదంలోని కొన్ని విశేషాలు మాత్రమే ఈ పరిచయంలో ప్రస్తావిస్తాను. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

కావ్యాలలో గద్యకావ్యాలు, పద్యకావ్యాలు, గద్యపద్యాలు రెండూ ఉండే కావ్యాలు ఉన్నాయి. గద్యపద్యాలున్నవి చంపూ కావ్యాలని దండి చెప్పాడు. కానీ, కన్నడంలో అలాంటి వాటిని ‘గద్యకథ’ అంటారని శ్రీవిజయుడు చెప్పడం విశేషం.

మిగె కన్నడగబ్బంగళొ
ళగణిత గుణ గద్య పద్య సమ్మిశ్రితమం
నిగదిసువర్ గద్యకథా
ప్రగీతియిం తచ్చిరంతనాచార్యర్కళ్ (1-27)

(కన్నడ కావ్యాలలో లెక్కకు మీరిన గుణాలతో కూడిన గద్యపద్యాల సమ్మిశ్రితమైన దాన్ని ప్రాచీనాచార్యులు గద్యకథ అన్న పేరుతో పిలుస్తారు.)

తొమ్మిదవ శతాబ్దికి ముందే కొంతమంది గద్యకవులున్నారని శ్రీవిజయుడు ఒక పట్టిక ఇచ్చాడు.

విమళోదయ నాగార్జున
సమేత జయబంధు దుర్వినీతాదిగళీ
క్రమదొళ్ నెగళ్చె గద్యా
శ్రమ పద గురుతా ప్రతీతియం కైకొండర్ (1-29)

(విమళోదయ, నాగార్జున, జయబంధు, దుర్వినీతాduలు ఈ క్రమంలో ప్రకాశించి గద్యాశ్రమ పదగురుతా ప్రతీతిని సంపాదించారు.)

వాళ్ళు సంస్కృత కవులా, ప్రాకృత కవులా, లేక కన్నడ కవులా అన్నది మాత్రం స్పష్టం కావడం లేదు. విమళోదయ, నాగార్జున, జయబంధు, దుర్వినీతాదులు కన్నడ కవులేనని కన్నడ పండితులు భావిస్తున్నారు. శ్రీవిజయుడు పేర్కొన్న ఈ కవులు కన్నడ గద్య కవులు కాకున్నా మరో పట్టిక (1-32) మాత్రం కన్నడ కవులదే అని ఒప్పుకోక తప్పదు.

పరమ శ్రీవిజయ కవీ
శ్వర, పండిత చంద్ర, లోకపాలాదిగళా
నిరతిశయ వస్తు విస్తర
విరచనె లక్ష్యం తదాద్య కావ్యక్కెందుం (1-32)

(పరమశ్రీ విజయ కవీశ్వర, పండిత చంద్ర, లోకపాలాదులు గొప్పవైన వస్తువిస్తర రచనలకు లక్ష్యాలను ఆద్యకావ్యానికి సమకూర్చారు.)

తొమ్మిదవ శతాబ్దికి ముందే కన్నడంలో కవులు, కావ్యాలు ఉండడమే కాకుండా చత్తాణ, బెదండె వంటి దేశి సాహిత్య ప్రక్రియలున్నాయని కూడా శ్రీవిజయుడు చెప్పాడు

నుడిగెల్లం సల్లద క
న్నడదొళ్ చత్తాణముం బెదండెయుమెందీ
గడిన నెగళ్తెయ కబ్బదొ
ళొడంబడం మాడిదర్ పురాతనకవిగళ్ (1-33)

(ఇతర భాషల కంటే వేరైన కన్నడంలో చత్తాణ, బెదండెవంటి ప్రసిద్ధ కావ్యాలు ఒనగూడేట్లుగా పురాతన కవులు రచించారు.)

కందమమళిన వృత్తము
మొందొందెఁ‌డెగొందు జాతి జాణెసెయె బెడం-
గొందివఱొళమరె పేళల్
సుందరరూపిం బెదండెగబ్బమదక్కుం (1-34)

(కందం, అమలిన వృత్తం ఒక్కొక్కటి వాటి మధ్య జాతి పద్యం చక్కగా చేరగా అందంగా అమర్చి చెప్తే సుందరరూపంగల బెదండె కావ్యమవుతుంది.)

కందంగళ్ పలవాగిరె
సుందర వృత్తంగళక్కరం చౌపది మ-
త్తం దల్ గీతికె తివదిగ
ళందంబెత్తెసెయె పేళ్వొడదు చత్తాణం (1-35)

(పలు కందపద్యాలు, సుందరవృత్తాలు అక్కర, చౌపది ఇంకా గీతికె త్రిపది అందంగా చేర్చి చెబితే అది చత్తాణం.)

కందం, వృత్తాలు జాతులు కలసిన అందమైన ప్రక్రియ బెదండె. ఇది ‘వైదండికా’ శబ్దభవం కావచ్చు. ఈ కావ్య పఠనానికి వైదండికా అనే వాద్యం నేపథ్య సంగీతాన్ని సమకూర్చేదేమో. చత్తాణ అనే ప్రక్రియలో కందపద్యాలు ఎక్కువగా సుందర వృత్తాలు, చౌపది, గీతికె, తివది (త్రిపది) ఉంటాయని రచయిత చెప్పాడు.

ఏ గ్రంథంలోనూ లేని విధంగా ఒక ప్రాంతానికి స్పష్టమైన ఎల్లలు నిర్దేశించి, అచ్చగన్నడనాడును– అంటే ప్రామాణిక కన్నడ భాషను మాట్లాడే ప్రాంతం – గురించి చెప్పడం కూడా విశేషం. ‘వడక్కే వేంగడం, తెన్ కుమరిమునై’ అని తమిళంలో కనిపిస్తుంది కానీ, కాలనిర్ణయం మాత్రం సాధ్యం కాదు. శ్రీవిజయుడు కావేరి నుంచి గోదావరి దాకా ఉన్న నాడు కన్నడనాడు అని స్పష్టం చేశాడు (1-36). అంతేకాక ఆనాట కిసువొళల్, మహాకొపణనగరం, పులిగెరె, ఒక్కుంద అనే ప్రదేశాల మధ్య ఉన్నదే సారభూతమైన కన్నడం అని చెప్పాడు.

కావేరియిందమా గో
దావరివరమిర్ద నాడదా కన్నడదొళ్
భావిసిద జనపదం వసు-
ధా వలయ విలీన విశద విషయ విశేషం (1-36)

(కావేరి నుండి ఆ గోదావరి వరకు ఉన్న కన్నడ నాట భావించగల్గిన జనపదం ఈ భూమండలంలోని విశద ప్రదేశాలలో విశేషమైనది.)

అదఱొళగం కిసువొళలా
విదిత మహా కొపణ నగరదా పులిగెఱెయా
సదభిస్తుతమప్పొంకుం
దద నడువణ నాడె నాడె కన్నడద తిరుళ్ (1-37)

(అందులో కిసువొళల్, ప్రసిద్ధమైన మహాకొపణనగరం, పులిగెఱె, స్తుత్యమైన ఒక్కుంద అనే ప్రదేశాల నట్టనడుమ ఉన్న నాడు అచ్చమైన కన్నడనాడు.)

కన్నడిగులు ఎలాంటివారు అని చెప్పడంలోనూ రచయిత ఆత్మాభిమానం కనిపిస్తుంది. ‘సొగసుగా చెప్పడం, చెప్పినదానిని శోధించడం వీరికి తెలుసు. వాళ్ళు చాతుర్యం కలవారు. చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణతములు (1-38)’ అని కన్నడిగుల గురించి చెప్పాడు.

పదనఱిదు నుడియలుం నుడి
దుదనఱిదారలుమార్పరా నాడవర్గళ్
చదురర్ నిజదిం కుఱితో
దదెయుం కావ్య ప్రయోగ పరిణత మతిగళ్ (1-38)

(ఆ ప్రదేశంలో వారికి సొగసుగా చెప్పడం, చెప్పిన దాన్ని శోధించడం తెలుసు. వాళ్ళు చతురులు, చదువు లేకున్నా కావ్యాన్ని రాయగల పరిణత మతులు.)

మిగతా పండితకవుల లాగా కాకుండా జానపదులను కూడా మెచ్చుకున్నాడు. ‘వీళ్ళు తమ తమ నుడులలో జాణతనం ఉన్నవాళ్ళు’ అని ప్రాంతీయ భాషల సొగసును పొగిడాడు. చివరకు చిన్నపిల్లలు, మూగవాళ్లు కూడా వివేకం కలవారన్నాడు.

కుఱితవరల్లదె మత్తం
పెఱరుం తంతమ్మ నుడియొళెల్లర్ జాణర్
కిఱువక్కళ్ మామూగరు
మఱిపల్కఱివర్ వివేకమం మాతుగళం (1-39)

(ముందు చెప్పిన వాళ్ళే కాకుండా మిగిలిన వారు కూడా తమ తమ నుడులలో జాణతనం కలవారు. చిన్న పిల్లలు, మూగవాళ్ళు సైతం మాటల్లో వివేకాన్ని చూపించగల సమర్థులు.)

సంస్కృత ప్రాకృతాలను గురించి శ్రీవిజయుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ భాషల్లో నిర్దిష్టమైన లక్ష్యలక్షణాలున్నాయి. అందువల్ల ఆ భాషల్లో రాయడం తేలికే. కానీ, కన్నడంలో అలాంటి లక్షణగ్రంథాలు లేకున్నా రాస్తున్నారు కాబట్టి తమ భాషలో వాళ్ళే ఒజ్జబంతులని చెప్పాలి.

అరిదాదం కన్నడదొళ్
తిరికొఱెగొండఱియ పేళ్ వెనెంబుదిదార్గం
పరమాచార్యరవోల్ సై-
తిరలఱియర్ కన్నడక్కె నాడవరోజర్ (1-42)

(అరుదైన కన్నడంలో పరమాచార్యులలాగా గొప్పగా చెప్పడానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ కన్నడానికి సంబంధించినంత వరకూ ఆ నాడులో ఉన్నవారే ఒజ్జలు.)

మాండలికాలను గుర్తించిన మొదటి కవి కూడా ఇతనే. కన్నడంలో దేసి వేరువేరుగా ఉండడం వల్ల “దాన్ని తెలుసుకొని మాండలిక భేదాలను గుర్తించడం వాసుకి వల్లకూడా కాదు” అన్నాడు.

దోసమినితెందు బగెదు
ద్భాసిసి తఱిసందు కన్నడంగళొళెందుం
వాసుగియుమఱియలాఱదె
బేసఱుగుం దేసి బేఱెబేఱప్పుదఱిం (1-46)

(కన్నడ భాష ప్రభేదాలలోని దోషాలను విడమర్చి చెప్పడానికి వాసుకి వల్ల కూడా కాదు. దేసి వేరువేరుగా ఉండడం వల్ల అతనికే విసుగు పుడుతుంది.)

‘ఎవరికీ తమ తమ దోషాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. తమ కన్నులలోని కాటుకను ఎవరూ చూచుకోలేరు. అందువల్ల తెలివిగల వారెవరికైనా చూపించి కావ్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి,’ అని గొప్ప సలహా ఇచ్చిన శ్రీ విజయుణ్ణి ప్రశంసించాల్సిందే.

కాణనేగెయ్దుం తన్న దోషమం
కాణదంతెందుం కణ్గళ్ తమ్మ కాడిగెయం
పూణిగనాదుదఱిం పెఱరిం
జాణరినోదిసి పేళ్వుదు కబ్బమం (1-45)

(తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి.)

పాతవడ్డ మాటల్ని గురించి శ్రీ విజయుని అభిప్రాయం స్పష్టంగా ఉంది. ‘పాతమాటలు పురాణకావ్య ప్రయోగానికి సొగసుగానే ఉంటాయి. కానీ, ‘దేసి’కి అవి పనికిరావు. వాటిని వాడితే, ముసలిదాన్ని సంభోగిస్తున్నట్టు ఉంటుంది,’ అని కటువుగా చెప్పడం గమనించదగింది.

దొరెకొండిరె సొగయిసుగుం
పురాణ కావ్య ప్రయోగదొళ్ తత్కాలం
విరసం కరమవు దేసిగె
జరద్వధూ విషయ సురత రస రసికతెవోల్ (1-50)

(పురాణకావ్య ప్రయోగానికయితే, [పాత కన్నడ పదాలు] ఆ కాలానికి చక్కగానే ఉంటాయి. కానీ, దేసికి సంబంధించినంత వరకూ అవి ముసలిదాన్ని సంభోగించే రసికతలాగా చాలా విరసంగా ఉంటాయి.)

‘తత్సమాల్ని కూడా చూచుకోని వాడండి, ఇష్టం వచ్చినట్లు వాడవద్దు. సంస్కృతాన్ని కన్నడాన్ని కలిపి రాయవద్దు. అహరహః, ముహుర్ముహుః, పునఃపునః, లాంటి అవ్యయాల్ని అలాగే వాడవద్దు. కన్నడాన్ని, సంస్కృతాన్ని ఈ విధంగా కలిపి రాస్తే కరడె, మద్దెలల లాగా కర్కశంగా ఉంటుంది’ (1-51 నుండి 1-53 వరకూ) అన్నాడు రచయిత.

సమ సంస్కృతంగళొళ్ సై-
తమర్దిరె కన్నడమనఱిదు పేళ్గెంబుదిదా-
గమ కోవిద నిగదిత మా
ర్గమిదం బెరసల్కమాగదీ సక్కదదొళ్ (1-51)

(సంస్కృత సమాసాలతో కన్నడాన్ని కలిపి చెప్పేటప్పుడు జాగ్రత్త వహించాలన్నది ఆగమకోవిదులు నిర్దేశించిన మార్గం. సంస్కృతంతో కన్నడం కలిపి చెప్పడానికి వీలులేదు.)

అహరహరుచ్చైర్నీచై
ర్ముహుర్ముహురితస్తతః పునః పునరంత-
ర్బహిరాదిహ ప్రాదురహో-
సహసాదిగళవ్యయంగళసహాయంగళ్ (1-52)

(అహరహః, ఉచ్చైః, నీచైః, ముహుర్ముహుః, ఇతస్తతమ్, పునః పునః, అంతర్, బహిర్, ఇహ, ప్రాదుర్, అహో వంటి అవ్యయాలను అలాగే వాడుకోకూడదు).

బెరసిరె కన్నడదొళ్ బం
ధురమాగదు కావ్యరచనె పేళ్దొడె పీనం
పరుషతరమక్కుమొత్తుం
గరడెయ మద్దళెయ జర్ఝరధ్వనిగళవోల్ (1-53)

(వీటిని కలిపివేస్తే కన్నడం అందంగా ఉండదు. చాలా పరుషంగా కరడె, మద్దెల చేసే కర్కశ ధ్వనిలాగా ఉంటుంది).

అలా ఛందోబద్దమైన పద్యం హృద్యమైనదని శ్రీవిజయుని అభిప్రాయం. పద్యకవులను గురించి రాసేటప్పుడు పద్యం ఎంత సొగసుగా ఉంటుందో తెలిపాడు. చక్కని సంస్కృత పదాలను వాడడం వల్ల ఈ పద్యం తెలుగు వాళ్లకూ అర్థమవుతుంది.

పద్యం సమస్త జనతా
హృద్యం పదవిదితపాదనియమనివేద్యం
విద్యా పారాయణ
మాద్యం సద్వృత్తి వృత్త జాత్యాయత్తం (1-30)

(పద్యం సమస్త జనతకు హృద్యమైనది. పదములతో కూడి పాదనియమం కలిగి ఉండేది. విద్యావంతులకు ఇష్టమైనది. ఆద్యమైనది. వృత్తాలతోనూ, జాతులతోనూ కూడి ఉండేది.)

ఇంకా ఈ అలంకార శాస్త్రంలో ఉన్న అన్ని విశేషాలను చెప్పాలంటే చాట భారతం అవుతుంది. కన్నడంలో యతి స్వరూపం, కారకాదులలో దోషాలు, గురులఘుదోషాలు, అలంకార లక్షణం, అలంకార భేదాలు, ప్రాస భేదాలు, దక్షిణోత్తర మార్గాలు, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, వాటికి లక్ష్యాలు కవిరాజమార్గంలో ఉన్నాయి. దండి కావ్యాదర్శంలో ఉన్నట్లే చిత్రకవిత్వం గురించి కూడా ఇందులో విపులమైన వివరణ ఉంది. ధ్వనిని కూడా అలంకారంగా నిరూపించడం ఒక విశేషం. మహాకావ్య లక్షణాన్ని విశదీకరించి తన లక్షణ గ్రంథాన్ని ముగించాడు శ్రీవిజయుడు.

ఇన్ని విధాల విశిష్టతను సంతరించుకొన్న కవిరాజమార్గం తొమ్మిదవ శతాబ్దిలోనే రచించిన శ్రీవిజయుడు, ఈ మార్గాన్ని నిర్దేశించిన నృపతుంగుడు యశోభూషణులు అయ్యారు. నీతినిరంతరుడు, ఉదారుడు, అతిశయధవళుడు అని బిరుదులు పొందిన నృపతుంగ చక్రవర్తి సార్థక నామధేయుడయ్యాడు.
--------------------------------------------------------
రచన: రాళ్ళపల్లి సుందరం, 
ఈమాట సౌజన్యంతో