మాంగల్యం తంతునానేన.......
సాహితీమిత్రులారా!
నడిమింటి మంగళేశ్వరశాస్త్రిగారు
వారి ఊరిలో
ఒక వివాహముహూర్తము జరుగు
నపుడు తాంబూలమునకై వెళ్ళెను.
మంగళసూత్రధారణ సమయంలో
పురోహితుడు
"మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరాదాం శతమ్"
అని చదివాడు.
దానికి మంగళేశ్వరశాస్త్రిగారు పక్కకు తిరిగి
అక్కడ ఉన్నవారితో
మీ కీశ్లోకం అర్థం తెలిసినదా? అని అడిగాడట.
అదేదో కొంటె సమాధానం ఉంటుందని
అక్కడి వారంతా తెలియదు మీరు చెప్పండని అడిగారట.
దానికి ఆయన అర్థం-
మాంగల్యం తంతు - న = ఇది మాంగల్య తంతుకాదు.
(నేను ముసలి ముండ కొడుకును. చాలా పెళ్ళిళ్లు నాకు జరిగాయి
ఇంకెక్కడి మాంగల్యం - అని భావం.)
మమ - జీవనహేతు. న (న) = దీనిచే నాబ్రతుకు దెరువు చెడింది.
(రెండెకరాలో, మూడెకరాలో తెగనమ్మి కన్యాశల్కం క్రింద ఇచ్చి ఉన్న
ఉపాధి పోయింది - అని భావం)
కంఠే - బద్నామి = నీ కుత్తుకకు తాడు కట్టుచున్నాను.
(నా వల్ల నీకు సౌఖ్యంలేదు సరికదా
ఇదొక నిర్భంధం కూడా నీకు కల్గుతుంది- అని భావం.)
సుభగే = ఓ సుభగురాలా!,
త్వం = నీవు (సుభగురాలువు గనుక),
శరదాం శతమ్ = నూరేండ్లు,
జీవ = జీవించు.
- అని అర్థం చెప్పాడట.

