Tuesday, August 31, 2021

భోజమహారాజు - సమస్యాపూరణలు - 2

 భోజమహారాజు - సమస్యాపూరణలు - 2





సాహితీమిత్రులారా!

ఒకమారు ధారాధీశుడైన భోజుడు వ్యాహ్యళికై వెళ్ళగా
బోగమువీథిలో బోగముపడుచుపిల్ల  ఒకతె చెవిలో
నల్లకలువ పువ్వు పెట్టుకొని చెండాట ఆడుతూంది
అలా ఆడే సమయంలో కదలికవల్ల చెవిలోని కలువపూవు
జారి కాళ్ళమీద పడింది. అది చూచిన రాజుగారు మనసులో పెట్టుకొని
సభకు వెళ్ళాడు. అక్కడ కవీశ్వరులను కందుకాన్ని వర్ణించమని
కోరగా భవభూతి
ఈ విధంగా వర్ణించాడు-

విదితం నను కందుక! తే హృదయం
ప్రమదాధర సంగమలుబ్ద ఇవ,
వనితాకరతామరసాభిహత:
పతిత: పతిత: పునరుత్పతసి


(ఓ కందుకమా! నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది.
యువతీమణి తనచేతితో
మాటిమాటికి కొట్టుచున్నా కిందపడి కూడ నీవు
ఎందులకు మరల పైకెగురుచున్నావో నాకు తెలిసిందిలే
ఆవిడ కెమ్మోవిపానకమును త్రాగుటకుకదా!)
అని చెప్పెను.
తరువాత మరొకకవి ఈ విధంగా చెప్పాడు

ఏకోపి త్రయ ఇవ భాతి కందుకోయం
కాంతాయా: కరతలరాగరక్తరక్త:
భూమమౌ తచ్చరణమరీచిగౌరగౌర:
ఖస్థస్సన్ నయనమరీచినీలనీల:


(ఒక కాంత చెండాడుతుంటే ఆ చెండు ఎలావుందంటే -
ఆ కాంతామణి అఱచేత చరచునపుడు ఆ అఱచేయి
ఎరుపుడాలునకు ఎరుపుగను, చేతి దెబ్బ తగిలి నేలమీద
ఆమె కాళ్ళముందర పడినతరువాత ఆమె
కాలిగోళ్ళ తెల్లనికాంతి సోకి తెల్లగను,
పైరెగిరినపుడు ఆమె ముఖము పైకెత్తి చూడగా
ఆ కలువకంటి కన్నుల నీలపుకాంతులతో నల్లనల్లగను
మూడురకములుగా ప్రకాశించుచున్నది.)
అని చెప్పెను.
ఆ తరువాత కాళిదాసు
ఈ విధంగా వర్ణించాడు-

పయోధరాకారధరో హి కందుక:
కరేణ రోషాదభిన్యతే ముహు:,
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియ ప్రసాదాయ పపాత పాదయో:

(పాలిండ్ల ఆకృతి ధరించినందున ఈ బంతిని
ఈ ఇంతి రోషముతో మాటిమాటికి తనచేతితో కొట్టుచున్నది.
ఇక ఈ కలువకంటి సాదృశ్యము ధరించిన నాకు మాత్రమీమెవలన
ఇలాంటి దండన కలుగకుండునా! అని భయపడి ఆమె చెవిలోపెట్టుకొన్న
కలువపూవు ఆమె కాళ్ళపై పడి ఆమె అనుగ్రహమును కోరుచున్న
దానివలె తటాలున పాదములపై బడెను)
అని వర్ణించెను.
భోజరాజు ఆ ముగ్గురికి తగినవిధంగా
బహుమానములిచ్చెను.
కాళిదాసును మాత్రం
తనమనసులోని విషయాన్ని
చూచినవానివలె చెప్పినందులకు
ప్రత్యేకముగా సన్మానించెను.

Sunday, August 29, 2021

26 పదాల వాక్యం

26 పదాల వాక్యం




సాహితీమిత్రులారా!


ఆచార్య ఏల్చూరి మురళీధర రావు గారు

కూర్చిన అక్షరవృద్ధి వాక్యం

ఇందులో 1 అక్షరం పదంతో ప్రారంభమై

26 అక్షరాల పదాలతో ముగుస్తుంది

ఈ వాక్యం ఈ వీడియోలో చూడండి-




Friday, August 27, 2021

భోజమహారాజు - సమస్యా పూరణలు

 భోజమహారాజు - సమస్యా పూరణలు




సాహితీమిత్రులారా!



ధారానగరంలో భోజుడు అంతఃపురంలో నిద్రిస్తున్నాడు.
ఆ సమయంలో ఒక పండితచోరుడు రాజుగారి కోశాగారంలో
ప్రవేశించాడు. అక్కడ వజ్రవైఢూర్యాలను, మరకతగోమేధికాలను,
మాణిక్యాలను ఎన్నిటినో మూటగట్టుకొని పోబోతుండగా
ఇంతలో వానిమనసులో ఒక భావం తళుక్కున మెరిసింది.
అయ్యో పూర్వజన్మలో ఎన్నో తప్పుడు పనులు చేయబట్టి
కదా ఈ జన్మలో చాలమంది వికలాంగులై, కుష్ఠురోగులై,
గ్రుడ్డి, కుంటి, వారుగాను, దరిద్రులుగాను బాధపడుచున్నారు.
నేనుకూడ పూర్వజన్మలో చేసినపాపం వల్లే నేడు దరిద్రుడనైనాను.
ఇంకా ఈ జన్మలో తప్పులు చేసి పాపం మూటకట్టుకో వలసిందేనా
-అని అనుకొంటూ ఆలోచిస్తున్నాడట. ఇంతలో భోజుడు మేల్కొని
తన సుఖసంపదలను, అష్టైశ్వర్యాలను తలంపునకు తెచ్చుకొని
ఈ శ్లోకాన్ని చెప్పాడు-

చేతో మహా యువతయః సుహృదో2నుకూలాః
సద్భాంధవాః ప్రణయగర్భగిరి శ్చ భృత్యాః
గర్భన్తి దంతి నివహా స్తరలా స్తురంగాః

(మనస్సునెంతగానో ఆకర్షించే మత్తకాశినులున్నారు.
అనుకూలురగు మిత్రులు, మంచి బంధువులు,
చెప్పినంతనే పనులు చేస్తూ , చాటూక్తులు పలికే
సేవకులున్నారు. ఏనుగులు, గుఱ్ఱాలు, ఒకపక్క
గర్జిస్తున్నాయి. ఇలా అష్టైశ్వర్యాలతో అన్నిసుఖాలు
అనుభవిస్తున్నా ---)
అని చదివి మిగిలిన నాలుగవపాదం కోసం
చడబడుతున్న సమయంలో
ఆ పండిత చోరుడు ఈ విధంగా పూరించాడు-

సంమీలనే నయనయో ర్న హి కించి దస్తి
(అవి కట్టెదుట కనబడుతున్నా, కన్నులు మూయగానే
ఇవేవీ కంటికి కన్పడవు సుమా)
(అంటే భౌతికములైన సుఖాలు అన్నీ క్షణభంగురాలేకాని
శాశ్వతాలు కావని భావం.)

దీనికి రాజు సంతసించి అతని పూర్వాపరాలు విచారించి
ఆ చోరపండితునికి తగినంత బంగారమిచ్చి సన్మానించి
పంపించాడట.


Wednesday, August 25, 2021

శంకర విజయంలోని చిత్రకవిత్వం - 3

 శంకర విజయంలోని చిత్రకవిత్వం - 3





సాహితీమిత్రులారా!



భమిడిపాటి వేంకటసుబ్రహ్మణ్యశర్మ గారి

శ్రీశంకర విజయములోని దశమ ఆశ్వాసంలోని

చిత్రకవిత్వం గమనిద్దాం

గోపురబంధ కందం -


శ్రీశ సమర్చిత కరుణా

రాశీ నీలలిత పదపరాగ పరుఁడనై

క్లేశములఁ బాపికొనుటకుఁ

గా శతరుద్రియమునను దగం గొల్తునినున్


దీన్ని గోపురబంధంలో వ్రాయగా బంధంనడుమ (మధ్య)లో

శ్రీసకలప కొను- అని వచ్చింది గనించగలరు.

శ్రీ

ర్చిత రుణా

రాశీ నీలిత ప

దపరాగ రుఁడనై క్లే

శములఁ బాపికొనుటకుఁ గా శ

తరుద్రియమునను దగం గొల్తునినున్

Monday, August 23, 2021

గురజాడ కన్యాశుల్కం

గురజాడ కన్యాశుల్కం





సాహితీమిత్రులారా!



కన్యాశుల్కము ప్రథమాంకంలో
గిరీశం - యీ వ్యవహార మొహటి ఫైసలైంది.
            ఈ రాత్రికి మధురవాణికి సార్టింగ్
            విజిట్ యివ్వంది పోకూడదు.
      నీ సైటు నాడిలైటు
      నిన్ను మిన్న
       కానకున్న
       క్వైటు రెచడ్ ఫ్లైటు
       మూనులేని నైటు


బంట్రోతు -
ఫుల్లుమూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న
మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా!  టా!


పంచమాంకంలో
పూజారి - మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను
           రాణా, డైమండ్ రాణీ
       రాణా, యిస్పేటు రాణి రాణికళావ
       ఱ్ఱాణా, ఆఠీన్రాణీ
       రాణియనన్మధురవాణె, రాజులరాణి


దీనిలో ఎక్కువభాగం ఇంగ్లీషు పదాలను
తక్కువగా తెలుగు పదాలను వాడాడు.

Saturday, August 21, 2021

రామలింగకవి పద్యం

 రామలింగకవి పద్యం




సాహితీమిత్రులారా!



తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం లోని

పద్యం ఇది-

దర, భుజ, గైణ, సింహములు త్వ ద్గళ, వే, ణ్యవలోకనద్వ, యో

దరముల కోడి – వారిధిపదంబులఁ బుట్టలఁ బూరులన్ గుహాం

తరములఁ – బూన, నిక్కఁ, దిన, దాఁగ; భ్రమింపఁగ, నూర్పు లూర్ప, స

త్వరముగ నేఁగ, నీడఁ గని తత్తరమందఁగఁ జేసి తౌఁ జెలీ!

దీనికి ఏల్చూరి మురళీధరరావు గారి వివరణ-

పద్యభావం ఇది: ఓ చెలీ! లోకంలో ఉపమానద్రవ్యములైన 1) దర (శంఖము) 2) భుజగ (పాము) 3) ఏణ (జింక) 4) సింహము అన్నవి వరుసగా నీయొక్క 1) గళ (కంఠము) 2) వేణి (జడ) 3) అవలోకనద్వయ (కనుగవ) 4) ఉదరములకు సాటిరాలేక – అంటే, దరము గళానికి, భుజగము వేణికి, ఏణము కన్నుగవకు, సింహము ఉదరానికి సాటి కాలేకపోయాయి. ఆ అవమానభారం వలన –

దరము గళమునకున్ ఓడి – వారిధిపదంబులన్ పూనన్; భ్రమింపఁగన్.

శంఖము గళానికి ఔపమ్యలోపం వలన సముద్రతలంలో తలదాచుకొనవలసి రాగా; భ్రమింపఁగన్ = తిరుగుళ్ళు పడగా (శంఖం నీటిలో భ్రమింపవలసిరావటం – కొట్టుమిట్టుకులాడుతుండటం అని ఒక అర్థం; తిరుగుళ్ళు అంటే శంఖానికి దక్షిణావర్తము, వామావర్తము అని భేదాలేర్పడటం అని మరొక అర్థం).

భుజగము వేణికిన్ ఓడి – పుట్టలన్ నిక్కన్; ఊర్పులు + ఊర్పన్.

పాము ఆమె జడకు సాటిరాలేక పుట్టలలో నిక్కవలసిరాగా (అనగా, తలదాచుకొనవలసిరాగా), ఊర్పులు + ఊర్పన్ = చేసేది లేక నిట్టూర్పవలసి ఉండటం (బుసలుకొడుతూ ఉండిపోవటం).

ఏణము అవలోకనద్వయమునకున్ ఓడి – పూరులన్ తినన్; సత్వరముగన్ ఏఁగన్.

జింక ఆమె కన్నుల వంటి అందమైన కన్నులు తనకు లేవన్న అవమానంకొద్దీ పూరి మేయవలసిరాగా (దురవస్థకు లోనయిందని భావం), ఆ బెదురు కారణాన పరుగులు తీయవలసిరాగా.

సింహము ఉదరమునకున్ ఓడి – గుహాంతరములన్ దాఁగన్; నీడఁ గని తత్తరమున్ + అందఁగన్.

సింహము ఆమె నడుము వంటి సన్నని నడుము తనకు లేనందువల్ల (ముఖం చెల్లక, సిగ్గుతో) గుహాంతర్భాగంలో దాగి ఉండేట్లుగా, తన నీడను చూసి తానే భయపడేట్లుగా.

ఒనర్చితివి = చేశావు. ఔన్ = అవును, ఇది నీకే తగును – అని ప్రశంసార్థం.

పద్యంలో క్రమాన్వయం సార్థకంగా ఉండటం వల్ల ఇది యథాసంఖ్యమనే అలంకారం. మెడ, జడ, కన్నులు, నడుము అన్న నాలుగు ఉపమేయవస్తువుల శోభాతిశాయిత వల్ల శంఖము, పాము, జింక, సింహము అన్న వస్త్వంతరాలను అణగింపజేశాడు. ఇది మీలనము అనే అలంకారమని కావ్యాలంకారసంగ్రహంలో భట్టుమూర్తి. ఇది పద్యంలోని అలంకారశోభ. తెనాలి రామలింగకవి వర్ణనానైపుణికి, పద్యరచనాకౌశలికి, అతివిస్తారమైన వ్యుత్పత్తిగౌరవానికి, అనల్పకల్పనాశిల్పానికి, చిత్తవిస్తారరూపమైన చమత్కృతధోరణికి నిదర్శకాలైన పద్యాలివి. దురన్వయాలను సరిచేసి సమన్వయించుకొంటే విశేషార్థాలు వెల్లడవుతాయి. మహాకవుల శబ్దసాగరం ఎంత లోతైనదో తెలిసివస్తుంది.


Thursday, August 19, 2021

శంకర విజయంలోని చిత్రకవిత్వం - 2

 శంకర విజయంలోని చిత్రకవిత్వం - 2




సాహితీమిత్రులారా!



భమిడిపాటి వేంకట సుబ్రహ్మణ్యశర్మ గారి 

శ్రీశంకర విజయం లోని దశమ ఆశ్వాసంలో కూర్చిన

వర్ణసంఖ్యా శబ్దచిత్రం గమనింపుడు-

ఇందులో ఆరు హల్లుల కందము, 5 హల్లుల కందము, 

4 హల్లుల కందము, 3 హల్లుల కందాలు కూర్చబడ్డాయి

అవి -

షడక్షర కందము-

ఇందులో 6 హల్లులతో కందం కూర్చబడింది

అవి క, ద, ప, మ, య, ర - అనే హల్లులు

అచ్చులు ఏవైనా ఉపయోగంచవచ్చు 

గమనించండి-

పరమదయాకర! దమిపా

దర! దామోదరప! పార దప్రియరూపా

కరిపోపర మకరా! మో

దరమాపర! పరపుమయ్య దయ దమిమాపే


పంచాక్షర కందము-

న, ప, మ, య, స - అనే 5 హల్లులు 

ఉపయోగించి పద్యం కూర్చారు


మముమనుపు మయ్యయోసం

యమిపా పాపమును మాపి యనయమునిన్నే

సుమినమ్మినాము మాపై

సమయమునీనెమ్మ మోపి సాయముసేయన్


చతురక్షర కందము-

గ, ద, న, మ - అనే హల్లులను ఉపయోగించి

కూర్చిన కందం


నెమ్మనమున నినునమ్మిన

మమ్మున్నెమ్మిఁదగనోముమా మనఁగనునీ

మమ్ముననీనామమునే

నిమ్మగుమోదమ్ముగదుమనేమనెదముగా


త్య్రక్షర కందము-

న, మ, య - అనే హల్లులతో కూర్చిన కందం


మాయామయ నిన్నేమన

నోయయ్యా యోముమనిననూనిననెమ్మిన్

నాయమ్మౌమమ్మోమ, న

మేయా! నీయాన నూనమేయనయమ్మున్

Tuesday, August 17, 2021

"అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్"

 "అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్"





సాహితీమిత్రులారా!



"అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్"- అనే సమస్యను
కొంచెం మార్చి అక్రమ సంబంధంకాకుండా సక్రమ సంబంధం వచ్చేవిధంగా చెప్పమని
అవధానంలో ఒక పృచ్ఛకుడు మిన్నెకంటి గురునాథశర్మగారిని అడిగాడట.
దానికి వారి పద్యం చూడండి.

ఎల్ల సురల్  వినంగ హరి యిట్లనె భూ సుత సీత బొందితిన్
నీళ్ళను మున్గనట్టి ధరణీ సతిఁగౌగిట గ్రుచ్చి యెత్తితిన్
తల్లికి తల్లియౌ సతి నెదన్ ధరియించితిగాన భూమికిన్
అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెదన్ మేల్ మనుమండ నయ్యెదన్


అని పూరించాడు.

(దేవతలందరూ వినగా విష్ణువు ఇలా అన్నాడు -
భూపుత్రిక సీతను పెండ్లాడాను(రామావతారంలో)
భూమిని పెళ్ళాడాను (వరాహావతారంలో)
లక్ష్మిని పెళ్ళాడాను (సముద్ర మథనానంతరం) -
ఇక్కడ విష్ణుపాదంలో గంగ పుట్టింది.
విష్ణువు భార్య భూదేవి.కనుక గంగ భూమికి కూతురువరుస.
గంగ సముద్రుని భార్య. నదులన్నీ సముద్రుని భార్య కదా!
సముద్రంలో పుట్టింది లక్ష్మి కావున లక్ష్మి గంగ కూతురి వరుస.
భూమికి మనుమరాలి వరుస.
కూతురును తల్లీ అని పిలువడం ఉంది.
కనుక ఈ వరుసల ప్రకారం భూమికి, భూమిసుతకు, గంగాసుతలక్ష్మికి -
మూడు తరాల వారికి విష్ణవు భర్త కనుక
భూమికి అల్లుడు, మగడు, మనుమడు వరుసలు సరిపోయాయి.
ఇవన్నీ ధర్మబద్ధమైన బంధాలే.)

Sunday, August 15, 2021

శంకర విజయములోని చిత్రకవిత్వం

 శంకర విజయములోని చిత్రకవిత్వం





సాహితీమిత్రులారా!



భమిడిపాటి వేంకటసుబ్రమణ్య శర్మగారి

శంకర విజయము లోని చిత్రకవిత్వం

ఆస్వాదించండి-

ఇందులో ప్రత్యేకంగా 10వ ఆశ్వాసంలో

చిత్రకవిత్వం కూర్చబడి వుంది.

మొదటిది సకంద మత్తకోకిలా వృత్తాంచత్సీసము

ఇది కందము, మత్తకోకిలలను ఇమిడ్చిన సీసపద్యము

గమనించండి-

సీసపద్యం-

దీనపోషణ వామదేవ సుధీమనో జలజంబునందనిశంబు నీవు

మానుగా వసియించి మర్త్య సమాజమున్గృపతోడుత న్వెత నిల్ప నెగడి

పూనికంగని ప్రోచు పుణ్య సుమూర్తివై పరిపూర్ణతన్శ్రిత పాలనమును 

దోనఁజేసి ప్రసిద్ధి తోఁదగి దుష్టహింసనొనర్చెదౌ ప్రవిశదమతివయి

గీతపద్యం-

పొనరిచెదవని మిగుల విబుధవికాయ 

మనవినిగొలువఁ దగుమతి గనితిఁగాన 

శర్వ సర్వంసహారథ పార్వతీశ 

కరుణననుబ్రోవుమా నీలకంఠ యిఁకను

                            (శంకరవిజయము - 10-115)

మత్తకోకిల-

దీనపోషణ వామదేవ సుధీమనో జలజంబునందనిశంబు నీవు

మానుగా వసియించి మర్త్య సమాజమున్గృపతోడుత న్వెత నిల్ప నెగడి

పూనికంగని ప్రోచు పుణ్య సుమూర్తివై పరిపూర్ణతన్శ్రిత పాలనమును 

దోనఁజేసి ప్రసిద్ధి తోఁదగి దుష్టహింసనొనర్చెదౌ ప్రవిశదమతివయి

ఈ పద్యంలో ర,స,జ,జ,భ,ర గణాలుంటాయి

 గనించగలరు

దీనపోషణ వామదేవ సుధీమనో జలజంబునం

మానుగా వసియించి మర్త్య సమాజమున్గృపతోడుతన్

పూనికంగని ప్రోచు పుణ్య సుమూర్తివై పరిపూర్ణతన్

దోనఁజేసి ప్రసిద్ధి తోఁదగి దుష్టహింసనొనర్చెదౌ


కందము-

దీనపోషణ వామదేవ సుధీమనో జలజంబునందనిశంబు నీవు

మానుగా వసియించి మర్త్య సమాజమున్గృపతోడుత న్వెత నిల్ప నెగడి

పూనికంగని ప్రోచు పుణ్య సుమూర్తివై పరిపూర్ణతన్శ్రిత పాలనమును 

దోనఁజేసి ప్రసిద్ధి తోఁదగి దుష్టహింసనొనర్చెదౌ ప్రవిశదమతివయి

గీతపద్యం-

పొనరిచెదవని మిగుల విబుధవికాయ 

మనవినిగొలువఁ దగుమతి గనితిఁగాన 

శర్వ సర్వంసహారథ పార్వతీశ 

కరుణననుబ్రోవుమా నీలకంఠ యిఁకను


అనిశంబు నీవువెతని

ల్పనెగడి శ్రితపాలనమును ప్రవిశదమతివై

పొనరిచెననిమిగులవిబు

ధ నికాయమనవిని కొలువఁ దగుమతిగనితిన్

 

Friday, August 13, 2021

మణిప్రవాళ పద్యాలు

 మణిప్రవాళ పద్యాలు




సాహితీమిత్రులారా!



సంస్కృత తెలుగు భాషల మిశ్రమంతో చెప్పిన
మణిప్రవాళ పద్యాలు చూడండి-

అమర మమర మంటే ఆశకాదా కవీనాం
అశన మశనమంటే ఆశకాదా ద్విజానామ్
అమృత మమృతమంటే ఆశకాదా సురాణాం
అధర మధరమంటే ఆశకాదా విటానామ్


అమరమంటే కవులకు,
అశన(భోజన)మంటే బ్రాహ్మణులకు,
అమృతమంటే దేవతలకు,
అధరం అంటే విటులకు ఆశకాదా - అని భావం.

ముయ్యవే తలుపు సమ్యగి దానీం
తియ్యవే కుచత టో పరి వస్త్రమ్
ఇయ్యవే మధురబింబమివౌష్ఠం
చెయ్యవే రతిసుఖం మమ బాలే


క్రిందిపదాలకు అర్థాలు చూస్తే
వివరణ అవసరంలేదు చూడండి-

సమ్యక్ - బాగుగా, ఇదానీం - ఇప్పుడు,
కుచతటోపరి - స్తనాలపై భాగాన,
మధురబింబం - తియ్యని దొండపండు,
ఓష్ఠం - పెదవి, మమ - నాకు,
బాలే - బాలికా.

Wednesday, August 11, 2021

ప్రశ్నే సమాధానం - 2

 ప్రశ్నే సమాధానం - 2





సాహితీమిత్రులారా!



ప్రశ్ననే సమాధానంమైన దాన్ని ప్రశ్న ఉత్తరం - ప్రశ్నోత్తరం అంటాం

తెలుగులోని ఈ ప్రశ్నోత్తర చిత్రం గమనించగలరు-

ఎద్దీశునకశ్వంబగు?
గ్రద్దన నేదడవి తిరుగు ఖరకంటకియై?
హద్దుగ నేవాడు ఘనుడు?
పద్దుగ నుత్తరము లిందె పడయంగానౌ!


ప్రశ్న :- ఎద్దీశునకు (ఎద్ది + ఈశునకు) అశ్వంబగు?
జవాబు: - ఎద్దు ఈశునకు అశ్వమగును
ప్రశ్న :- ఏదడవిలో (ఏది + అడవిలో)ముండ్లతో తిరుగును?
జవాబు: - ఏదు(పంది) అడవిలో ముండ్లతో తికుగును
ప్రశ్న :- హద్దుగా ఎవడు గొప్పవాడు?
జవాబు : - (తన) హద్దును ఎరిగినవాడు గొప్పవాడు
(గ్రద్దన = శీఘ్రంగా, ఖర = వాడియైన, ఏదు = ఏదుపంది)

Monday, August 9, 2021

అన్నీ ఒక్క లలనామణిలోనే ఉన్నాయి

 అన్నీ ఒక్క లలనామణిలోనే ఉన్నాయి





సాహితీమిత్రులారా!



పంచేంద్రియాలకు, మనస్సనే ఆరో ఇంద్రియానికి విషయభూతమైన పదార్థాలన్నీ
ఒక్క లలనామణిలోనే లోకోత్తరమైన రీతిలో పొదగబడి ఉన్నాయి
- అనే ఈ శ్లోకం చూడండి.

ద్రష్టవ్యేషు కిమ్ముత్తమం?  మృగదృశ ప్రేమప్రసన్నం ముఖం;
ఘ్రాతవ్యేష్వపి కితదాస్యపవన: శ్రావ్యేషు కింతద్వచ:
కిం స్వాద్యేషుతదోష్టవల్ల వరస:స్పృశ్యేషు కింతద్వపు;
ద్ధ్యేయం కింనవయౌవనే సహృదయై: సర్వత్ర తద్విభ్రమా:

                                                                              (భర్తృహరి సుభాషితములు -2-7)
ద్రష్టవ్యేషు కిమ్ముత్తమం?  

మృగదృశ ప్రేమప్రసన్నం ముఖం;
ఘ్రాతవ్యేష్వపి కి

తదాస్యపవన: 

శ్రావ్యేషు కిం

తద్వచ:
కిం స్వాద్యేషు

తదోష్టవల్ల వరస:

స్పృశ్యేషు కిం

తద్వపు;
ద్ధ్యేయం కిం

నవయౌవనే సహృదయై: 

సర్వత్ర తద్విభ్రమా:
                                           (భర్తృహరి సుభాషితములు -2-7)

ఈ శ్లోకం ప్రశ్నోత్తరరూపంలో ఉంది.

1. రసికులైనవారు ప్రాయంలో చూడదగింది ఏది ?
 - ముద్దుగుమ్మ మచ్చటైన ముఖం
    (ఇది నేత్రేంద్రియాన్ని తృప్తి పరుస్తుంది.)

2. వాసన చూడదగినదానిలో ఉత్తమమైనది ఏది?
   - ఆ జవరాలి కమ్మని తావి (ఇది మగద్దరాలి ముఖారవిందాన్ని
      తాకుతూ వచ్చేగాలి మోసుకొచ్చే గంధం-
      ఇది నాసికేంద్ియ రూపమైన తృప్తేినిస్తుంది.)

3. వినదగిన వాటిలో శ్రేష్ఠమైనది ఏది?
   - నునులేత తరుణీమణి యొక్క భాషణ 
     (దీనివల్ల శ్రోత్రేంద్రియ విషయ
     సౌఖ్యతృప్తిని సూచిస్తుంది.)

4. పానము చేయదగిన వాటిలో ఉత్తమమైనది ఏది?
   - స్త్రీ యొక్క అధరామృతం
      (ఇది జిహ్వేంద్రియ తృప్తి సూచకం)

5. తాకదగిన వాటిలో మేలైనది ఏది?
   - లలన యొక్క నును మెత్తని మేను 
      (పుష్పంలా సుకుమారమైన శరీరంగల స్త్రీ సంభోగం.
       ఇది పంచేంద్రియాలకు సుఖాన్నివ్వగలది.)

6. అంతరేంద్రియమైన మనస్సుకు సౌఖ్యం కలిగించేది ఏది?
    - స్త్రీని గూర్చిన తలపే

Sunday, August 8, 2021

పైనుండి క్రిందికి క్రింది నుండి పైకి

 పైనుండి క్రిందికి క్రింది నుండి పైకి





సాహితీమిత్రులారా!



ఒక పద్యం పైనుండి క్రిందికి క్రిందినుండి పైకి చదివినా ఒకలాగే ఉంటే

దాన్ని పద్యభ్రమకం అంటారు. ఈ పద్యం గమనించండి

బోడి వాసుదేవరావుగారి చిత్రమంజరి నుండి పద్యభ్రమకం

సరోజ వృత్తం -
మార! ధీర! రధీరమా!
సారధీరసభారసా!
సారభాసరధీరసా!
మా! రధీర! రధీరమా!


మార(మా - ర) - లక్ష్మీదేవియు, మన్మథుడును గలవాడా
ధీర - స్వతంత్రుడా
రధీరమా - (ర-ధీ-రమా) - చురుకైన బుద్ధికలవాడా
సారధీరసభారసా - శ్రేష్ఠులైన రసజ్ఞులుగల సభాస్థలి గలవాడా
సారభాసరధీరసా - సార-భాస-ర-ధీర-సా)న్యాయముతో ప్రకాశించుచున్న
                 నిపుణులైన విద్వాంసుల యొక్క ధ్యానముగలవాడా
మా - (మ-అ) - బ్రహ్మకు హేతువైనవాడా
రధీర (ర-ధి-ఇర) - త్యాగమునకు స్థానమైన వాక్కులు గలవాడా
రధీరమా(ర-ధీర-మా)- మనోహరుడు, సాహసికుడుఅయిన చంద్రుడు కలవాడా


Thursday, August 5, 2021

పాదభ్రమకం(హిందీ)

 పాదభ్రమకం(హిందీ)




సాహితీమిత్రులారా!



పాదభ్రమకం అంటే పద్యపాదం ముందునుండి చదివినా

చివరనుండి చదివినా ఒకలాగే ఉండటం. ఇది హిందీలో

కేశవదాసుగారు కూర్చిన సవై ఆస్వాదించండి-

मां सस मोह सजै बन बीन, नवीन बजै सह मोस समा।
मार लतानि बनावति सारि, रिसाति वनाबनि ताल रमा ॥
मानव ही रहि मोरद मोद, दमोदर मोहि रही वनमा।
माल बनी बल केसबदास, सदा बसकेल बनी बलमा ॥
మాఁ సస మోహ బన బీన, నవీన బజై  సహ మోస సమా
మార లతాని బనావతి సారి, రిసాతి వనాబని తాల రమా
మానవ హీ రహి  మోరద మోద, దమోదర మోహి రహి వనమా
మాల బనీ బల కేశబదాస, సదా బసకేల బనీ బలమా

                                                    (కేశవదాస్ కూర్చిన ఒక సవై)

ఇందులో ప్రతిపాదం ముందునుండి వెనుకనుండి చదివి గమనించండి


Tuesday, August 3, 2021

ప్రశ్నే సమాధానం

 ప్రశ్నే సమాధానం





సాహితీమిత్రులారా!



అదే ప్రశ్న అదే జవాబుగా ఉన్న దాన్ని ప్రశ్నోత్తర చిత్రం అంటారు.

ఈ శ్లోకం చూద్దాం.

కేదార పోషణరతా:

కంసంజఘాన కృష్ణ:

కాశీతల వాహినీ గంగా

కంబలవంతం నబాధతే శీతలమ్


కే - దార పోషణరతా: = దార పోషణకు సమర్థులు ఎవరు? (ప్రశ్న)

కేదార - పోషణ - రతా: = పంటపొలాన్ని పోషించుటలో శ్రద్ధావంతులు!


కం - సంజఘాన కృష్ణ: = ఎవరిని చంపెను కృష్ణుడు?(ప్రశ్న)

కంసం - జఘాన - కృష్ణ: = కంసుని చంపినవాడు కృష్ణుడు!


కా - శీతల వాహినీ గంగా = శీతల ప్రవాహమున్న గంగ(నీరు) ఏది?(ప్రశ్న)

కాశీ - తలవాహినీ - గంగా = కాశీప్రాంతమున ప్రవహించు గంగ!


కం - బలవంతం న బాధతే శీతలమ్ = ఏ బలవంతుని చలి బాధించదు? (ప్రశ్న)

కంబల - వంతం - నబాధతే శీతలమ్ = కంబళము ఉన్న వానిని చలి బాధించదు!


Sunday, August 1, 2021

ఒకే వర్ణం సమాధానం

ఒకే వర్ణం సమాధానం




సాహితీమిత్రులారా !



ఒక ప్రశ్నకు ఒకే వర్ణం సమాధానమైన దాన్ని
వర్ణోత్తర చిత్రం అంటారు.
కవీంద్ర కర్ణాభరణంలోని ఈ శ్లోకం చూడండి-

కా కామధుక్? ప్రియా కా వా విష్ణోః? విశ్వం బిభర్తి కా?
విఘ్నానా మధిపః కశ్చ ప్రణామా త్సర్వకామదః?


దీనిలోని ప్రశ్నలకు సమాధానాలు - గౌరీభూః
                                                             (గౌః + ఈ  - భూః)

1. కా కామధూక్ ?
   కోర్కెలను తీర్చేది ఏది?

   - గౌః(ఆవు /కామధేనువు)

2. ప్రియా కా వా విష్ణోః?
   విష్ణువుకు ప్రియురాలెవరు?

   - ఈ (లక్ష్మి)

3. విశ్వం బిభర్తి కా?
   ప్రపంచాన్ని మోయునదేది?

   - భూః (భూమి)

4. విఘ్నానా మధిపః కశ్చ ప్రణామా త్సర్వకామదః?
   నమస్కరించినంతనే అన్ని కోర్కెల తీర్చే 
   విఘ్నాధిపతి ఎవరు?

   - గౌరీభూః (గౌరీదేవి కన్నకొడుకు గణపతి)

దీనిలో మొదట ఒక్కొక వర్ణమే సమాధానమైంది
కావున దీన్ని వర్ణోత్తర చిత్రమంటారు.