చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘనపనస చదివి ఆశీర్వదించాడు.
అప్పుడు ఆ రాజుగారు "ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా నేర్చుకుని చదవవచ్చు!
చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను." అన్నాడు.
అప్పుడు ఆ పండితుడు "రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోషపరచడానికి ఆడతాను" అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.
రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు.కానీ ఆ పండితుడు "రాజా! ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా!
రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను అని గొప్పగా చెప్పుకోవచ్చు! " అంటూ సున్నితంగా తిరస్కరించాడు.
"సరే! పండితా! నీ తెలివిని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు! " అన్నాడు రాజుగారు.
మహారాజా! చదరంగంలో 64 గడులు ఉంటాయి కదా!
ఒక గడిలో ఒక గింజ -
రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు గింజలు -
మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -
నాలుగవ గడికి మళ్లి రెట్టింపు 8 గింజలు -
.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం." అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.
రాజు సరే ! అని ఆ పని మంత్రికి పురమాయించాడు.
ఆ పండితుని వెంట మంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.
తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు "పండితుడడిగాడు కదా .. మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు.. మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు.. తర్వాత8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు..
‘అలా తీసెయ్యకండి మహారాజా !.. ఆ పండితుడేమీ వెర్రిబాగులవాడు కాదు.. ’
‘ఎందుచేత..?’ అన్నాడు రాజుగారు.
‘లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!’
‘ఎందుకు..? ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు
ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటలకొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణంలో చెప్పేసాడు మహారాజా ! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపకమాల పద్యం కూడా చెప్పాడు.
‘అలాగా.. ఏమిటా పద్యం..?’
‘ఇదుగో.. వినండి మహారాజా !’
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
పద్యం విన్న మహారాజు ‘దీన్లో తేలిన లెక్కెక్కడుంది..? అంతా బాణాలూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలు తప్ప..’
‘ఈ పద్యంలో లెక్కచిక్కు విడిపోవాలంటే మనపూర్వుల సంఖ్యాగణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతిశక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు..
ఈ పద్యంలో
శర, సాయక, - అనే పదాలకు అర్థం బాణాలు అని .( మన్మథుని పంచసాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.
ఇవీ ఇందులోని అంకెలసంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5 1 6 1 5
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
5 9 0 7 3
ధర గగనాబ్ధి వేద గిరి
7 0 4 4 7
తర్క పయోనిధి పద్మజాస్య కుం
6 4 4
జర తుహినాంశు సంఖ్యకు ని
8 1
జంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్
అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. ‘అంకానాం వామతో గతిః’ -
కుడినుంచి ఎడమకు చేర్చి చదువుకోవాలి..
అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
1,84,46,74,40,73,70,95,51,615
ఒకకోటి 84లక్షల 46వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615
ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
ఒక ఘనమీటరు విస్తృతిగల గాదెలో దాదాపు ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,
4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..
పేర్చుకుంటూ వెళితే 300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు.. అంటే భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.
పోనీ లెక్కపెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంటే
సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి 58,495 కోట్ల సంవత్సరాలు..
అదీ సంగతి…
వేదపండితులతో వేళాకోళం తగదు మహారాజా !…నిజానికి అతడు చదివిన గణపనస కూడా లెక్కలకు ,ధారణ శక్తికి సంబంధించినదే ! ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ గణాపాటి కాలేరు. అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించపరిచారు. ఇప్పుడు ఏం చేయడం ? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది .
అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకులనుండి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మాట తప్పలేదు.
ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నే అడుగుదాము. అని ఆ పండితున్ని పిలిపించి క్షమించుమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పుమన్నాడు .
ఆ పండితుడు" రాజా ! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము. ధాన్యం బదులుగా అవును ఇవ్వండి చాలు !" అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.
జ్వాలారావుకు అన్నితీర్ల పనులూ చాలా మహత్తున్న యజ్ఞాలే. వేసట లేని సాధకుడనీ, చాలా నిఖార్సైన చాలూ, లోకజ్ఞత వున్న ధీరుడు అనీ లోలోపలే గొప్పగా పోలుస్తారు అతణ్ని. కాని ఇది చెప్తూ దీవెనిచ్చేది కొందరు అయితే సదా ఎదురు దాడులు చేసి ఛిఛీ అనేది కొందరు. అతడో నిషేధిత వితండుడనీ, అహమున్నవాడనీ నిరసన చూపుతారు. పనినే సిరిగా తలచే మహా ధురంధరుడయినా ఇలా బహువిధాల అపప్రథలే లభించినాయతనికి. కారణం అతని ఆధునికత్వపు కాంక్ష. ఎప్పుడూ అతనికి కొత్తకొత్త విషయాలు, విచేష్టలు నచ్చుతై. అసంగతపు ప్రవర్తనే అతనికా అగచాటును తెచ్చినట్టు వ్యాహృతి చెబుతారు కొందరు. మహీస్థలి పైన ఇలాంటి కొందరుండాలండీ. ఒక పాతరీతిని తెగట్టం కూడ ఓ ధైర్యమే.
జ్వాలారావుకు కావ్యలేఖనములో సామర్థ్యముందండి. కానీ లోలోపల పాతకాలపు విధాన్నెంతో అసహ్యించుకుంటూ లోతైన అపేక్షతో పదును పెడ్తూ రాసినాడండి. ఓ సారైతే మన పాత వ్యాకరణ అంశాల్నే త్యజిస్తూ తనే ప్రారంభించిన నవ్య వ్యాకరణ స్వారస్యాన్ని దట్టించి బాగా రాశాడు. పురాణ పండితులు ఏకంగా విరోధించి తిట్టారండీ. అయినా మరింత కసితో టాటోటు లేకుండ ఇంకా రాశాడు. ఇలాంటి వాళ్లకు సరిగ్గా ప్రాభవం రాదు. జాల్వారే కొత్తదనాలు ఆయనకు చాలా ఇష్టదైవాలు.
జ్వాలారావంతటితో అలా నిలిచిపోలా. గాన మేధావి లాగా రాగాలను పాడినాడు శ్రుతితో. కానీ యధారీతిలో చెలరేగాడని ఇక్కడా గొడవలే చేశారు సంగీత శాస్త్రులు. శాస్త్రం ఒకసారి సూత్రనియమాల్తో రూఢి అయ్యాక అర్మిలితో గైకొని ఇంపుతో, నిరతితో మెచ్చాలి, నచ్చాలి. జాబిలిలా దాన్నొక గొప్ప ఆస్తి వలె భావిస్తూ వరించాలి జ్వాలారావూ! అని గోల చేసి అటతాళంలో నిలేశారు. జ్వాలారావస్సలు వాళ్ల మాటలను విన్లా. సూటిగా ధాటిగా ఊరూరా తన నవ్యరాగ రవళీ హోమాన్ని వేల్చాడు. ఈ రారాజేం పస లేని బేల మనిషా? రవ్వంత కూడా బెదర్లా. పాపం అతడెన్ని సార్లు నవతారాగాన్ని మ్రోగించినా శాపాల్నే, పరితాపకారక నిరాశా నిస్పృహల్నే ఫలంగా పెట్టింది ప్రశస్తమైన మన లోకం. ఎందుకీ లోకమిట్లా పాడైందని బాధతో, కలతతో ఠారెత్తిపోయాడు.
ఈ జ్వాలారావొకసారి స్కూల్ తరఫు మ్యాగ్ జైన్ వారి సంపాదకత్వం లైట్ గా నెరిపాడు. అప్పుడతడుత్సాహాన్ని తెచ్చేసుకుంటూ లోకౌచితి అప్రధానమని దాంట్లో నూతనత్వాన్ని ధారాళంగా కలిపేసినాడు. ఎడిటోర్యల్ పేజి ఆఖర్న వచ్చేలా స్థిరపర్చినాడు. అది చూసేశారు సాహిత్యపీఠంలో మన్నిక గన్న పండితులు. కంఠాలన్ని చిట్లేవిధంగా లౌడ్ గా అరిచేసి చాల చెలరేగారండి. ఏం చేసినా జ్వాలారావు తనెంచుకున్న నవతత్త్వాన్నస్సలే వీడలా.
ఈ రకమైన ప్రేరణ మరీ అధికం అయినట్టి కొందరుంటారు. మరట్టివారి నిబిడార్తికి, తృష్ణకు, కౌశలానికీ వారి అమేయ చాతురికి వందన చేసి మనేది ఎందరంటారు? మితం కదా. కటకటా. మరి దీనికి ఏం ఉపాయమో!
ఇందులోని మొదటి వాక్యాన్ని ముందుగా పరిశీలిద్దాం. ఆ వాక్యంలోని ఒక్కొక్క అక్షరానికి మాత్రలు వేసుకుంటూ పోతే అది ఇలా ఉంటుంది.
జ్వాలారా (UUU) = మ గణం
వుకుఅ (IIU) = స గణం
న్నితీర్ల (IUI) = జ గణం
పనులూ (IIU) = స గణం
చాలామ (UUI) = త గణం
హత్తున్న (UUI) = త గణం
య (U) = గ గణం (ఏకాక్షర గణం).
వీటన్నిటినీ వరుసగా పెట్టి చూస్తే, మ స జ స త త గ వస్తుంది. మొదటి అక్షరమైన ‘జ్వా’ కూ 13 వ అక్షరమైన ‘చా’ కూ యతి మైత్రి కుదిరింది. కాబట్టి ఇది శార్దూల పద్య పాదం. ఇట్లా గల్పిక చివరిదాకా మాత్రలు వేసుకుంటూ పోతే, ఒకటి తర్వాత ఒకటి ఛందోబద్ధమైన పద్యాలు వస్తాయి. వాటిలో గణాలు, యతి, ప్రాస అన్నీ సరిపోతాయి. ఈ గల్పికలో వరుసగా శార్దూలము, చంపకమాల, చంపకమాల, శార్దూలము, శార్దూలము, శార్దూలము, మత్తేభము, శార్దూలము, శార్దూలము, శార్దూలము, శార్దూలము, ఉత్పలమాల పద్యాలు వస్తాయి.
అయ్యలరాజు రామభద్రుని రామాభ్యుదయములోని ఈ పద్యం చూడండి- ఇది రాముడు అరణ్యమునకు పోవు సందర్భములో దశరథడు బాధతో పలికిన పలుకులు ఎంత చమత్కారంగా చెప్పబడినవో గమనింపుడు.