Monday, June 26, 2017

అనులోమ విలోమ కందం -గతిచిత్రం


అనులోమ విలోమ కందం -గతిచిత్రం




సాహితీమిత్రులారా!


పద్యం మొదటినుండి చదివిన అది అనులోమము
పద్యం చివరనుండి మొదటికి చదివిన అది విలోమము
ఒక పద్యం మొదటినుండి చదివినా
చివరినుండి మొదటికి చదివినా
ఒకేలా ఉంటే అది అనులోమ విలోమ పద్యం
అది కందపద్యం అయితే కందపద్యం
రాఘవాభ్యుదయములోని ఈ పద్యం చూడండి-

ధీరవరద నవభవన స
వీరసుకర భావసరసవిరసారీనా
నా రీసారవిసరసవ
భారకసురవీసనవభవనదరవరధీ
(రాఘవాభ్యుదయము - 5-217)

గమనించండి

ధీరవరద నవభవన స
వీరసుకర భావసరసవిరసారీనా
నా రీసారవిసరస
భారకసురవీసనవభవనదరవరధీ

ఇందులో  రెండవ పాదం
చివరనుండి మొదటి వరకు చదివిన
మూడు నాలుగు పాదాలు వస్తాయి.
అందుకే దీన్ని విలోమార్థపూరణీయా(నులో)మ కందము
అన్నారు.

సినిమాల్లో గూఢచిత్రం


సినిమాల్లో గూఢచిత్రం




సాహితీమిత్రులారా!


ఇది 1967 భక్తప్రహ్లాద సినిమాకు
జూనియర్ సముద్రాల(రామానుజాచార్య)
అందించిన సాహిత్యం-
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు
ఇది హిరణ్యకశపుడు స్వర్గాన్ని జయించిన తరువాత
సభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ
నృత్యం చేస్తూ పాడిన పాట.

జయహో సమస్త దానవ సామ్రాజ్య స్థాపనా ధురీణా
జయహో జయహో జయహో
అందని సురసీమ నీదేనోయీ
అందని సురసీమ నీదేనోయీ
అందరు ఆశించు అందాలహాయి
అందించే నెఱజాణలమోయీ
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమనీదే

రంభ- మంజుల వల్లీ నికుంజములోన రంజిలగా
             మోవిఅందీయనా పాలవెన్నెల జాలునా 
             వాలుకన్నుల ఏలనా అందమందు 
            చిందులందు తుదపరిరంభమందు
            నాకు సాటినేనే                  
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమనీదే

మేనక - కోరికేమొ సెలవీర సుకుమార రణధీర
              కోరికేమొ సెలవీర సుకుమార రణధీర
             సోయగాలనడల
             వాలిఒడిలో సోలిపోయేనా
             లాలించి రాగరసడోల 
             తేలించి ప్రేమభోగాల
             మేన కాన రాని వలపు తీరుల
             మెలగి మేను మరువజేయు మేటిని
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమనీదే

ఊర్వశి - మైమరతువులేరా మగరాయ మగధీర కౌగిలీర
                వయసు తలపులూర వలపేరు
                పొంగువార మరుని కోర్కెలీర 
               మనసేల ఊర్వసేర

అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమనీదే

తిలోత్తమ - వన్నెల కడకన్నుల విలాసాలలోన
                   వన్నెల కడకన్నుల విలాసాలలోన
                   సరిసరికేళీ విలాసాలలోన
                   సరిసరికేళీ విలాసాలలోన
                   ప్రేమసితారసుతారలతార
                   జాణతిలోత్తమయే
                   జాణతిలోత్తమయే

అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమ నీదేనోయీ
అందనిసురసీమనీదే

ఈ పాటలో 
రంభ పాడిన చరణాలలో రంభ అనే పేరు, 
మేనక పాడిన చరణాలలో మేనకపేరు
ఊర్వశి పాడిన చరణాలలో ఊర్వశిపేరు
తిలోత్తమపాడిన చరణాలలో తిలోత్తమ పేరు
రావడం ప్రత్యేకం. కానీ
రంభ పేరును, మేనకప్రును 
ఊర్వశిపేరును గూఢంగా ఉంచి
కూర్చరు కవిగారు అందువల్ల 
ఇది గూఢచిత్రమౌతుంది
గమనింపగలరు

రంభ- మంజుల వల్లీ నికుంజములోన రంజిలగా
             మోవిఅందీయనా పాలవెన్నెల జాలునా 
             వాలుకన్నుల ఏలనా అందమందు 
            చిందులందు తుదపరిరంభమందు
            నాకు సాటినేనే    
మేనక - కోరికేమొ సెలవీర సుకుమార రణధీర
              కోరికేమొ సెలవీర సుకుమార రణధీర
             సోయగాలనడల
             వాలిఒడిలో సోలిపోయేనా
             లాలించి రాగరసడోల 
             తేలించి ప్రేమభోగాల
             మేన కాన రాని వలపు తీరుల
             మెలగి మేను మరువజేయు మేటిని  
ఊర్వశి - మైమరతువులేరా మగరాయ మగధీర కౌగిలీర
                వయసు తలపులూర వలపేరు
                పొంగువార మరుని కోర్కెలీర 
               మనసేల ఊర్వసే
            
తిలోత్తమ - వన్నెల కడకన్నుల విలాసాలలోన
                   వన్నెల కడకన్నుల విలాసాలలోన
                   సరిసరికేళీ విలాసాలలోన
                   సరిసరికేళీ విలాసాలలోన
                   ప్రేమసితారసుతారలతార
                   జాణతిలోత్తమయే
                   జాణతిలోత్తమయే

ఇక్కడ చిత్రంలోని పాటను వీక్షించి 
ఆనందించగలరు గలరు


Sunday, June 25, 2017

ఆవాలు, గంటె, నిప్పు, నూనె


ఆవాలు, గంటె, నిప్పు, నూనె





సాహితీమిత్రులారా


దత్తపది - 
ఆవాలు, 
గంటె, 
నిప్పు, 
నూనె - పదాలను ఉయోగించి
పద్యమును పూరించాలి

శనగల సుందర రామయ్యగారి పూరణ-

ఆవాలు గంటి ద్రౌపది
ఆవిరటుని కూతుగంటె యని యర్జునుతో
నీవనితకు నిప్పుణ్యకు
రావలె సుందర తనూ నెఱపు నాట్యమనెన్



గాండీవమును ధరించినవాడెవడు?


గాండీవమును ధరించినవాడెవడు?




సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలికను చూడండి-


గాండీవ వాంస్త్రిభువనే కతమః? శ్రుతా కా-
సం జ్ఞా స్వరస్య? గరుడ ధ్వజకామినీ కా?
ముగ్ధా కురంగనయనా సురత స్పృహాయాం
కాన్తం గిరా మధుకరయా కిము వక్తి? నాజీ


ఈ ప్రహేలికలో నాలుగు ప్రశ్నలున్నాయి
వాటి సమాధానం - నాజీ
అంటే నా - అచ్ - ఈ
అనేవి మరియు నాజీ
  
ప్రశ్నలు - సమాధానాలు

1. గాండీవ వాంస్త్రిభువనే కతమః?
      ముల్లోకాలలో గాండీవమను ధనుస్సును ధరించినవాడెవరు
       - నా (నరుడు లేక అర్జునుడు)


2.   శ్రుతా కా సం జ్ఞా స్వరస్య?
     స్వరములకు (అ,ఆ,ఇ,ఈ,ఉ...మొదలైనవాటికి) పెట్టన పేరు
      (స్వరములకు నామాంతరము)
       - అచ్ (అచ్చులు)

3. గరుడ ధ్వజకామినీ కా?
      గరుడపతాకము గల విష్ణువుయొక్క ప్రియురాలు ఎవరు
       - ఈ (లక్ష్మిదేవి)

4.   ముగ్ధా కురంగనయనా సురత స్పృహాయాం
    కాన్తం గిరా మధుకరయా కిము వక్తి?
      (అసమయమున) సంభోగము నపేక్షించుపతితో ముద్దరాలగు భార్య,
      ఏ తీయని పల్కు పల్కి తప్పించుకొనును
       - నాజీ (న - అజీ - అయ్యా ఇప్పుడుకాదు)
         అనే నిషేధ వచనమును సవినయముగా పలికి  
          తప్పించుకొనును.

Saturday, June 24, 2017

కైకో, పైకో, నైకో, మైకో


కైకో, పైకో, నైకో, మైకో



సాహితీమిత్రులారా



దత్తపది-
కైకో, 
పైకో, 
నైకో, 
మైకో - పదాలను
భారతార్థంలో పూరించవలెను


సి.వి.సుబ్బన్నగారి పూరణ-

కైకోరమ్మని కామరూపయగు రక్షశ్శ్యామ ప్రౌఢాత్మయై
పైకోఁ గాననసీమ భీముఁడు హిడింబంగూడి క్రీడించెఁ, దా
నై కోర్కుల్ పయికొన్నయంగన రతివ్యాపార లీలాగతుల్
మైకోఁ దారలువ్రాలు భూమిదిరుగున్ మల్లాడు చందమ్ము నన్

కైకో - పాణిగ్రహణముచేయు
తారలు - కనుగ్రుడ్లు
భూమి - శ్రోణి


Friday, June 23, 2017

తల్లి, పిల్ల, ఎల్లి, దల్లి


తల్లి, పిల్ల, ఎల్లి, దల్లి




సాహితీమిత్రులారా!


దత్తపది-
తల్లి, 
పిల్ల, 
ఎల్లి, 
దల్లి - అనే పదాలను ఉపయోగించి
భార్యను గురించి చెప్పాలి


సి.వి.సుబ్బన్నగారి పూరణ-

తల్లియయి బుద్ధిమంతులఁ
బిల్లలఁగని పెంచి కీర్తిపెనుపడ నిలలో
నెల్లియయి మించు కులసతిఁ
దల్లిఖిత మనఃపతి ,ుకృతగతిఁ బొగడరే


(ఎల్లి - గొడుగు,
ఎల్లియయిమించు - గొడుగై చల్లదనముఁగూర్చు,
తత్ - లిఖిత - మనఃసతి - ఆమె నొసటివ్రాత
ఫలమైన మగనియొక్క పుణ్యరేఖ)

Thursday, June 22, 2017

హనుమంతుడు, లక్ష్మణుడు, దాశరధి, జానకి


హనుమంతుడు, లక్ష్మణుడు, దాశరధి, జానకి





సాహితీమిత్రులారా!



దత్తపది-
హనుమంతుడు, 
లక్ష్మణుడు, 
దాశరధి, 
జానకి - పదాలనుపయోగించి
భారతార్థంలో పూరించాలి


చిర్రావూరి శ్రీరామశర్మ గారి పూరణ-

హనుమంతుండు ధ్వజంబుగాగ నరుడున్ హర్షంబుతో గూడి కృ
ష్ణుని నర్చిఃకృపతోడ దాశరధులన్ శోభిల్లగా నొందె
క్ష్మణుడో యుత్తరపుత్రుచే నిహతి నాశాశోభిశ్రీ జానకీ
ఘనతన్ ద్రౌపదిపొందె భారతమునన్ గూఢార్థమింతేకదా



నీకు తెలిస్తే చెప్పు


నీకు తెలిస్తే చెప్పు




సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలిక చూడండి తెలిస్తే చెప్పండి-

న తస్యాదిః న తస్యాన్తః
మధ్యే యః తస్య తిష్ఠతి
తవా ప్యస్తి మమాప్యస్తి
యది జానాసి తద్వద

ఆ వస్తువుకు మొదలుగాని, చివరగాని లేదు.
మధ్యమాత్రం ఏదో (యః) ఉన్నది.
అది నీకు, నాకు కూడ ఉన్నది.
తెలిస్తే చెప్పు అదేంటో

సమాధానం- నయనం

నయన-మునకు(తస్య),
న - ఆదిః, మొదటి అక్షరం - న
న - అన్తః, చివరి అక్షరం - న
వీటి మధ్య యః - తిష్ఠతి
ఆ పదం మధ్యలో య- అనే
అక్షరం ఉంది. ఆ నయనం
నీకుంది నాకు ఉంది.

Wednesday, June 21, 2017

న తాపీ యమునా త న


న తాపీ యమునా త న




సాహితీమిత్రులారా!


ఈ ప్రహేలిక చూడండి-

రవిజా శశికుందభా
తాపహారీ జగత్ప్రియా
వర్ధతే వనసంగేన 
న తాపీ యమునా చ న

సూర్యుని వలన పుట్టింది
చంద్రునివలె, మొల్లపూలవలె
తెల్లగా ఉంటుంది. తాపాన్ని హరిస్తుంది
జనప్రియమైనది. వనంలో వృద్ధిచెందుతుంది
అది తపతి కాని యమునా నదికాని కాదు మరేమో
చెప్పండి

సమాధానం - మజ్జిగ

అది క్వం(రవి)చిలకడం వలన పుడుతుంది.
తెల్లగా ఉంటుంది. వేసవి తాపాన్ని పోగొడుతుంది.
సర్వజనులకు సంతోషాన్ని కలిగిస్తుంది.
చిలికేప్పుడు నీటి(వనం)తో పెరుగుతుంది.
కావున ఇది తపతి లేక యమునానదిగాని కాదు.

తమన్నా, కాజల్, సమంతా, త్రిష


తమన్నా, కాజల్, సమంతా, త్రిష





సాహితీమిత్రులారా!


దత్తపది-
“తమన్నా”, 
“కాజల్”, 
“సమంతా”, 
“త్రిష” అన్న పదాలు

డా. ఏల్చూరి మురళీధర రావు గారి ‘దత్తపది’ పూరణ:-

నరకోన్మూలనవిష్ణుసచ్చరితమన్ నావం బ్రయాణించి, త
త్పరమేశాభయనామమంత్రజపవిద్య న్నల్పకాజల్పని
ష్ఠురసంసారభయంబు మాని యమృతాస్తోభాసమంతా త్పరా
త్పరగోవిందపదద్వయీ త్రిషవణధ్యానంబుఁ గావింపుమా!


మీరును పూరించి పంపగలరు

Tuesday, June 20, 2017

చెడుగుణములు గలిగి ముక్తి చెందఁగ వచ్చున్


చెడుగుణములు గలిగి ముక్తి చెందఁగ వచ్చున్




సాహితీమిత్రులారా!



సమస్య-
చెడుగుణములు గలిగి ముక్తి చెందఁగ వచ్చున్


సి.వి.సుబ్బన్నగారి పూరణ-

అడుగడుగునఁ గడుభక్తిన్
నొడుపుచు సారసనయను మనోహర గాథల్
పుడమి జనులుమెచ్చి నుతిం
చెడుగుణములు గలిగి ముక్తి చెందఁగ వచ్చున్


దీనిలో చెడుగుణములు కలిగి
ముక్తి చెందటం అసంగతము
దీన్ని కవిగారు నుతించెడు - అని
అనడం వలన సంగతమైనది.


మీరునూ మరోరకంగా పూరించి పంపగలరు

Monday, June 19, 2017

అర్థనారీశ్వర చిత్రము


అర్థనారీశ్వర చిత్రము




సాహితీమిత్రులారా!


ఒకే పద్యంలో సగం ఈశ్వరుడు
సగం పార్వతిగా వ్రాయబడిన
పద్యం ఇది. గమనించండి-

శ్రీనాథుడు భీమఖండం కూర్చిన పద్యం-


చంద్రబింబానన చంద్రరేఖామౌళి
నీలకుంతలభార నీలగళుడు
ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు
మదన సంజీవనీ మదనహరుడు
నాగేంద్ర నిభయాన నాగకుండలధారి
భువన మోహన గాత్రి భువనకర్త
గిరిరాజకన్యక గిరిరాజనిలయుండు
సర్వాంగ సుందరి సర్వగురుడు
గౌరి శ్రీవిశ్వనాథుండు కనకరత్న
పాదుకల మెట్టి చట్టలు పట్టి కొనుచు
నేగుదెంచిరి యొయ్యార మెసకమెసగ
విహరణ క్రీడ మాయున్నవేది కపుడు
                                                       (భీమఖండము - 2-148)

ఈ సీసపద్యంలో ప్రతిపాదంలోను
పూర్వార్థంలో శక్తిని
ఉత్తరార్థంలో శివుని
వర్ణించాడు మహాకవి శ్రీనాథుడు.

పొడుపు పద్యాలు


పొడుపు పద్యాలు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యాలను చూడండి-
వీటికి రెంటికి సమాధానం ఒకటే
విచ్చండి-

ఎద్దునెక్కి తిరుగు నీశ్వరుండునుగాడు
నలుమొగములుగలవు నలువగాడు
గర్భయుగము నెగడి కడుమ్రింగుధాన్యంబు
దీని భావమేమి? తిరుమలేశ!


నాగరికుడు సజ్జనకులోద్భవుండు
నీశుమాట్కి నెద్దునెక్కితిరుగు
ధరణి నిరుమొగముల ధాన్యాదులనుమ్రింగు
దీని భావమేమి? తిరుమలేశ!

సమాధానము - గోనె(సంచి)

Sunday, June 18, 2017

మహాశయ మతిస్వచ్ఛం


మహాశయ మతిస్వచ్ఛం




సాహితీమిత్రులారా!



చ్యుత చిత్రంలో మాత్రాచ్యుతకం ఒక విధమైనది
ఇందులో ఒక మాత్రమే చ్యుతమవుతుంది.
దీనికి ఉదాహరణగా విదగ్దముఖమండనములోని
ఈ శ్లోకాన్ని చూడండి-

మహాశయ మతిస్వచ్ఛం నీరం నన్తాపశాన్తయే
ఖలవాసా దతిశ్రాన్తాః సమాశ్రయత హేజనాః

వేసవి కాలంలో, పగలంతా కళ్ళంలో కష్టపడిన
ప్రజలారా! ఆ సంతాపాన్ని పోగొట్టుకొనటానికి
మహా - ఆధారము, స్వచ్ఛమైన జలాశయము
(చెరువును) సేవించండి - అని భావం

దీనిలో నీరం అనే పదం(న్ - ఈ - రం)లోని,
ఈ-ని చ్యుతం(తీసివేసి)చేసి దాని స్థానంలో
అ-ను ఉంచిన నీరం - నరం అవుతుంది.
దీని ప్రకారం శ్లోకం రెండవ అర్థం-

చెడు సావాసంతో చేటు నొందిన జనులారా!
మహోదారుడు, పవిత్రుడు అయిన ఆదర్శ
మానవుని ఆశ్రయించి, మీ బాధను పోగొట్టుకొనుడు
- అని భావం

పతి పతిగవయంగ నొక్క పట్టి జనించెన్


పతి పతిగవయంగ నొక్క పట్టి జనించెన్




సాహితీమిత్రులారా!





సమస్య-
పతి పతిగవయంగ నొక్క పట్టి జనించెన్


 పాలపర్తి వేణుగోపాల్ గారి పూరణ-

అతులిత నతిగత మతి సతి
పతివెత తనవెతగ దలచు పడతి వినుత తా
సతత సకల సేవిత
పతి - పతిగవయంగ నొక్క పట్టి జనించెన్

ఇందులో పతి పతి గవయంగ అనడం
అసంగతము దీన్ని కవిగారు సేవితపతి
- పతి గవయంగ అనడంతో సంగతంగా
మారుచున్నది. మరియు ఈ పూరణలో
అధికభాగం సర్వలఘువుగా ఉండటం విశేషం-


మీరును మీదైన శైలిలో పూరించి పంపగలరు

Saturday, June 17, 2017

రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.


రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.




సాహితీమిత్రులారా,!


సమస్య: 
రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.


ఏల్చూరి మురళీధరరావుగారి పూరణ-


అమరతరంగిణీలహరు లందలి శీతలఫేనఖండముల్
తెమలిచి, దందశూకజగతీసముదీర్ణఫణామణిప్రభా
సమితికి సౌమ్యతాప్రణయచందనలేప ముపస్కరించి, యు
త్తము లని పేరుఁగొన్న మహితప్రభు, లర్యమవంశదీప కుల్,
విమలమతుల్ దిలీప రఘువీరుల యన్వయమందు దేవ తా
సముదయరక్షకై, యవని జన్నము నిల్పుటకై, మహీసుర
ప్రమథగణాభిరక్షకయి, రాక్షససంహృతికై మనుష్యరూ
పముఁ గొనినట్టి పావనుఁడు, పంకజనాభుఁ, డుపేంద్రుఁ, డిందిరా
రమణుఁడు, పచ్చవిల్తునయ, రక్కసిదాయ, పరాత్పరుం, డురు
క్రముఁడు, పురందరుండు, త్రిజగద్విభుఁ, డక్షరుఁ, డవ్య యుండు సం
యమిగురుమౌళి గాధిసుతు యాగముఁ గాచి, దురాసురీ నికృం
త మొనరఁగా; స్వయంవరవిధానమునన్ హరు విల్లు నెత్తి, శౌ
ర్యమున నజేయ్యుఁడైన ఖచరప్రతివంద్యపదాంబుజాతుఁ బ్రే
మమునఁ గవుంగిలించికొని, మాంగళికోక్తుల గారవించి, సం 
యమివరు లాశిషమ్ము లిడ మాతృపితల్ దమి దీవెనల్ ప్రసూ 
నమహితఫల్యవాక్సమితి నందనుపైఁ గురిపింప లోకపూ
జ్యముగ వధూవరుల్ సరసిజాయతనేత్రుఁడు నాత్మజాత యుం 
గమలకరంబునన్ గరముఁ గైకొన నిల్పి సమంత్రకమ్ముగా
"నమృతసురూప! భాస్కరశుభాన్వయదీప! మదీయపుత్త్రి కన్
దమిఁ గొనుమయ్య! దేవ! సహధర్మచరీ తవ" యంచు రామ వ
జ్రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో

Friday, June 16, 2017

వర్గపంచకరహితము


వర్గపంచకరహితము




సాహితీమిత్రులారా!


వర్గపంచకరహితము అంటే
క - వర్గము -    క, ఖ, గ, ఘ, ఙ
చ - వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
ట - వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
త - వర్గము - త, థ, ద, ధ, న
ప - వర్గము - ప, ఫ, బ, భ, మ
ఈ ఐదు వర్గాలలోని 25 వ్యంజనము(హల్లు)లను
వదలి కూర్చబడినది.-
ఇందులో ఈ 25 అక్షరాలు ఉండవు
క్రిందివాటిలో ఈ లక్షణాలు గమనించండి-


సరసీరుహశర హర వర 
శరాస విలయాసహాయ శౌర్యవహ హరీ
శ్వర హరిహయహయ సింహ
స్వరు సురలహరీ సురర్షి శశి శర్వయశా
                                              (మహాసేనోదయము - 7- 387)


హార హీర సార సారి హర శైలవాస వో
ర్వీరు హాహి హారశేషవేష హాసలాలస
శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం
హార సారశౌర్యసూర్య హర్యవార్యసాహసా
                                                    (కావ్యాలంకారసంగ్రహము - 5- 245)


అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద


అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద 




సాహితీమిత్రులారా!


సమస్య: 
అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.


ఏల్చూరి మురళీధరరావుగారి పూరణ-

ఒక అందాల నటి ప్రక్కన నాయక పాత్ర కాకపోతే -
 కనీసం ఆమె చెంత నిలిచి ఉండే ఏ చిన్న వేషమైనా 
వేయనిమ్మని ప్రాధేయపడుతున్న ఒక చిన్న నటుని మాటలు.

పల్లవపాణి! యో మృదులపల్లవపాద! మనోహరాకృతీ! 
సల్లపనామృతాతిసరసం బగు నాంధ్రుల చిత్రసీమలో 
సల్లలితాంబరాంతరలసన్మణిమంజులతారకామణీ! 
చల్లని తీయవెన్నెలల జా లెసలారఁగ నివ్వటిల్లు సం
ఫుల్లశశాంకమండలము పోడిమి మీఱఁగ నెయ్యురాలవై
పల్లవితత్వదుజ్జ్వలకృపాపరిపాటినిఁ బల్కరించి మే
నెల్ల ముదంబునం బులకరింపఁగ నెమ్మిక సేతు వంచు నేఁ 
బెల్లగు నాసఁ జేరితిని - పేరిమి నీ సరసన్ నటింపఁగా;
నుల్లమునందుఁ జేర్చి నను నొక్క నిమేషము నిల్వనిమ్ము! న
న్నుల్లస మొప్ప నె ప్పగిది నొప్పరికింపకు; నిన్ను వేడు న
న్నల్లన నొల్లఁ జెల్లు నొకొ! నాయక వేషము గానిచో, సరే!
యెల్ల వితంబులైన వేషముల నే ధరియింపఁగ సిద్ధ మయ్యెదన్,
ప్రల్లద మాడఁబో; నొకరి పాత్రము మేలని చూడఁబోను; నేఁ
గల్లరి నయ్యెదన్; మనికి కాపరి నయ్యెద; తాత నయ్యెదన్;
మల్లరి నయ్యెదన్; మఱఁది నయ్యెదఁ; దండ్రిని, మామ నయ్యెద;
న్నల్లుఁడ నయ్యెదన్; మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.



Thursday, June 15, 2017

తిలక బంధం


తిలక బంధం




సాహితీమిత్రులారా!

రామరూప పాఠకుని 
"చిత్రకావ్య కౌతుకం"లోనిది-

హరిపదం దనుజద్విప మర్ధనం
హరిపదం దరదం గుణదం భ
హరిపదం కమలార్చిత మక్షరం
హరిపదం కమలార్చిత మక్షరమ్


ఇక్కడ గుర్తుంచుకోవలసింది-
చిత్రకవిత్వంలో సున్న
ఉన్నను లేక పోయినను
సందర్భాన్ని బట్టి మార్పు ఉండదు.

ఈ బంధాన్ని శ్లోకాన్ని చూస్తూ
చదవండి విషయం అవగతమౌతుంది.



పొడుపు కతలు


పొడుపు కతలు




సాహితీమిత్రులారా!


పద్యంగాని శ్లోకంగాని కాని
ప్రక్రియలో చెప్పినవి
పొడుపు కతలు

అంతా బేలుకోసం, ఎదురు చూస్తున్నారు
దీనిలో దాగున్నదేది?

ఆ ఉత్తరం నీకా నాకా-
దీనిలో దాగున్నదేది?

పైవాని సమాధానాలు


అంతా బేలుకోసం, ఎదురు చూస్తున్నారు
దీనిలో దాగున్నదేది?

తాబేలు

ఆ ఉత్తరం నీకా నాకా-
దీనిలో దాగున్నదేది?

ఆవు

Wednesday, June 14, 2017

పతి తల ఖండిచివైచె పార్వతి కినుకన్


పతి తల ఖండిచివైచె పార్వతి కినుకన్




సాహితీమిత్రులారా!


సమస్య-
పతి తల ఖండిచివైచె పార్వతి కినుకన్


చిర్రావూరి శ్రీరామశర్మగారి పూరణ-

సతి మహిషాసురమర్ధని
గతితప్పిన దేవతాళి కష్టముతెలంగన్
మతిదాకరుణన్ రాక్షస
పతి తల ఖండిచివైచె పార్వతి కినుకన్


పతి తలను ఖండించడం అసంగతం
దాన్ని రాక్షసపతి తల ఖండించడంగా
మార్చడంతో సంగతమైంది.


మీరును మీదైన శైలిలో పూరణనచేసి పంపండి

పొడుపు పద్యాలు


పొడుపు పద్యాలు




సాహితీమిత్రులారా!


ఒకే సమాధానానికి
అనేక పొడుపు పద్యాలు
చూడండి

రాతిమీదమాను రాపాడుచుండంగ
మానుమీదవేళ్లు మలయుచుండు
వేళ్లమీదనీళ్లు వెదజల్లినట్లుండు
దీని భావమేమి? తిరుమలేశ!

కాళ్లుగలిగియుండుకదలదట్టిట్టును
నోరులేదుపెక్కునీరుద్రావు
తనకుప్రాణిలేదుతరువులనుభక్షించు
దీని భావమేమి? తిరుమలేశ!

మూడుకాళ్లమొసలి మూతిపండ్లునులేవు
లేవబట్టకున్నలేవలేదు
కాలవశముచేత కర్రలభక్షించు
దీని భావమేమి? తిరుమలేశ!

పై వాటికన్నిటికి
సమాధానం - గంధపుసాన

Tuesday, June 13, 2017

అసం గతం శుక మిహాపన యేతి వాచం


అసం గతం శుక మిహాపన యేతి వాచం





సాహితీమిత్రులారా!




వేంకటాధ్వరి కృత 
విశ్వగుణాదర్శములోని
ఈ శ్లోకం చూడండి-

అంసే సలీల మధిరోప్య శుకం స్వహస్తాద్
గోప్యా భయాకుల దృశ్ః కుతుకీ ముకుందః
అంసం గతం శుక మిహాపన యేతి వాచం
తస్యా విశమ్య స తదంశుక మాచకర్ష
                                                               (విశ్వగుణాదర్శము - 223)

శ్రీకృష్ణుడు ఒక గోపికయొక్క అంసము(భుజము) పైన,
శుకము(చిలుక)ను తన చేతితో నిలిపెను.
ఆమె భయపడుతూ
అసం గతం శుక మిహాపనయ
(భుజంపైనున్న చిలుకను తీయము)
అని అన్నది. ఆమె మాటలను విన్న కృష్ణుడు
ఆమె పైటను లాగాడట ఎందుకంటే
శుకం శబ్దానికి అం - దత్తం కావడం వల్ల
అంశుకము అయినది. అంశుకము అంటే పైట
- అని భావం


దీని భావమేమి? తిరుమలేశ!


దీని భావమేమి? తిరుమలేశ!




సాహితీమిత్రులారా!





పొడుపు పద్యం చూడండి-
ఇది బయిరెడ్డి సుబ్రహ్మణ్యం గారి
తిరుమలేశ ప్రశ్నోత్తర వినోదిని లోనిది-



కలదు పరిమళమ్ము కాని పుష్పముకాదు
కలదు రగులు గుణము కాదు దివిటి
కలదు పొగఁయు కాదు కర్పూరమ్ము
దీని భావమేమి? తిరుమలేశ!

సువాసన ఉంది కాని పూవుకాదట
రగిలేగుణం ఉందట కాని దివిటికాదట
పొగనిస్తుంది కాని కర్పూరం కాదట
అదేమిటో చెప్పమంటున్నాడు కవిగారు


సమాధానం - ఊదుబత్తి

Monday, June 12, 2017

ద్వ్యక్షరి


ద్వ్యక్షరి




సాహితీమిత్రులారా!


యామవరం రామశాస్త్రిగారి
గురుస్తుతి కావ్యం నుండి
త, - అనే రెండు వ్యంజనాలను
ఉపయోగించి కూర్చిన ద్వ్యక్షరి-

తాంతానాం తు నితాంతంనో
నూత్ననానాతనూతతే
నతాననానాం తనుతా
త్తతాం నీతిం నుతోన్నతిః

స్తుతించబడిన గొప్పదనముగల(గురువుగారు)
క్రొత్తవియగు అనేక విధములగు శరీరములవలన
మిక్కిలి శ్రమపడి ఖిన్నులమగునట్టియు
తలవంచుకొనినట్టియు, మాకు విస్తారమగు
నీతిని ఒసగుగాక

ఏకచక్రము బండినెక్కువాడెవ్వడు?


ఏకచక్రము బండినెక్కువాడెవ్వడు?




సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం విప్పండి-


ఏకచక్కముబండినెక్కువాడెవ్వడు?
                       ఒడలెల్ల గనులైన యెడయడెవడు?
మఱ్ఱియాకున బండు కుఱ్ఱవాడెవ్వడు?
                      శివుని యౌదల జేరి చెలగునెవడు?
సమతమై సర్వభూతములనేలునెవడు?
                      వాయు భక్షణచేసి బ్రతుకునేది?
అఖిల జీవనంబుల కాధారమగునేది?
                     కొమరారమారుని గుఱ్ఱమేది?
కంధి దాటి లంక గాల్చిన మృగమేది?
క్షితినిజల్లబడగ జేయునేది?
అరయనన్నిటికిని నక్షర ద్వయమున
నొక్క యుత్తరంబె నొసగవలయు


ఈ పద్యంలో 10 ప్రశ్నలున్నాయి
పదింటికి రెండక్షరాలుగల పదమొక్కటే
సమాధానంకావాలి-

సమాధానాలు-

1. ఒకే చక్రం గల బండిపై ఎక్కి తిరిగేవాడెవరు? 
   - హరి(సూర్యుడు)
2. దేహమునిండా కన్నులుగలవాడెవరు?
   - హరి(ఇంద్రుడు)
3. మఱ్ఱియాకుపై పరుండు బాలుడెవరు?
   - హరి(శ్రీకృష్ణుడు)
4. శివుని శిరసుపై చెన్నొందువాడెవరు?
   - హరి(చంద్రుడు)
5. సర్వప్రాణులను సమానంగా పాలించువాడెవరు?
   - హరి(యముడు)
6. గాలిని మేసి బ్రతికేది ఏది?
   - హరి (పాము)
7. సర్వప్రాణులకు ముఖ్యాధారమైనదేది?
   - హరి (వాయువు,గాలి)
8. మన్మథునికి సుందరమైన వాహనమేది?
   - హరి (చిలుక)
9. సాగరముదాటి లంకాదహనం చేసిన మృగమేది?
   - హరి (కోతి, హనుమంతుడు)
10. భూమిని చల్లబరచునది ఏది?
    - హరి (వాన)

హరి అనే పదానికి నిఘంటువుల్లో అనేక అర్థాలున్నాయి.
హరి- విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, యముడు, సింహం,
          గుఱ్ఱం, కోతి, పాము, వాయువు, కిరణం, కప్ప, యుద్ధం,
          అగ్ని, శివుడు, నీరు, చిలక, పచ్చనిది, బంగారు వర్ణంకలది,
          దొంగ, మంచి ముత్తెము, కడిమిచెట్టు, హరిగంధం,   
          కుంకుమపూవు, అగరు, చందనము మొదలైనవి.

Sunday, June 11, 2017

అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్


అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్



సాహితీమిత్రులారా!



సమస్య-
అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్


నిరంతరము జపములు హోమము చేసేవాడు
ఆరుగురిని ఎలా చంపుతాడు ఇది అసంగతము
కదా

 విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

భువు అరిషడ్వర్గమ్ముల
ఎవరైనను బాధపడుట ఎఱుగమె - కానీ
సవన యశస్వి, మహర్షి యె
అవిరళ జపహోమనిరతు డార్గురఁజంపెన్

ఇక్కడ అరిషడ్వగ్గములను చంపడంతో
పూరించడంతో సమంజసమైనది.

మీరు మీదైన రీతిలో పూరించి పంపగలరు

వర్ణములఁ గన్గొన మద్విభు నామమయ్యెడిన్


వర్ణములఁ గన్గొన మద్విభు నామమయ్యెడిన్




సాహితీమిత్రులారా!





నామగోపన పద్యం చూడండి-
ఇది రావూరి దొరసామయ్యగారు
చెప్పిన పద్యం-

తామరసాక్షి నీవిపుడు దప్పక చెప్పవె నీదు భర్త పే
రేమియొ యన్న, నెచ్చెలికి నిట్టులనెన్ లతాంగి చందుఁ డున్
భూమియుఁజూతము న్మధుపమున్ మఱి తండుల ముద్రివ ర్ణముల్
గామహిమధ్య వర్ణములఁ గన్గొన మద్విభు నామమయ్యెడిన్


ఆమె చెప్పిన పదాలకు మూడక్షరాల పదాలు

చంద్ర - రేదొర
భూమి - ధరణి
చూత - రసాల
మధుప- భ్రమర
తండులం - బియ్యము

ఈ పదాలలోని మధ్య అక్షరాలను కలిపిన
ఆమె భర్త పేరు వస్తుంది-

రేదొ
ణి
సా
భ్ర
     బియ్యము
వీటి మధ్య అక్షరాలను తీసుకోగా
వచ్చెడి పేరు దొరసామయ్య

Saturday, June 10, 2017

విలంబితగతి గల ఆటవెలది


విలంబితగతి గల ఆటవెలది




సాహితీమిత్రులారా!


దేశీయ ఛందస్సులో ఆటవెలది ఉపజాతికి చెందినది.
దీనిలో మొదటిపాదంలో
3 సూర్యగణాలు - 2 ఇంద్రగణాలు
రెండవ పాదంలో
5 సూర్యగణాలు - ఉంటాయి
ఇది పూర్వార్తము ఉత్తరార్థం కూడ
ఇలానే ఉంటుంది మొత్తం మీద
పూర్వార్థంలో 8 సూర్యగణాలు
ఉత్తరార్థంలో 8 సూర్యగణాలు
ఉంటాయి. అంటే అధికంగా ఉన్నవి
సూర్యగణాలే ఇంద్రగణాలు కేవలం మూడు మాత్రమే.
సూర్యగణాలు న, హ - అనేవి రెండు.
ఆటవెలదిలో సూర్యగణాలలో హ-గణం ఎక్కువగా
ఉపయోగించిన దానిని విలంబితగతి గల ఆటవెలది
అంటారు.
ఈ ఉదాహరణ చూడండి-
ఇది చరిగొండ ధర్మన్న కృత
చిత్రభారతములోనిది-
యుద్ధానంతరము ధర్మరాజు బాధాతప్త
హృదయంతో కృష్ణునితో పలికే సందర్భంలోనిది.

అఖిలభూతసముఁడు నపవర్గదాయకుం
డంబుజాతనేత్రుఁడనుచుఁ బలుకు
మాటదప్పకుండ మాధవా ననుఁజక్ర
కోటిఁద్రుంచి వీరిగూడనంపు
(చిత్రభారతము - 8-108)

ఇందులో 16 సూర్యగణాలకు గాను
12 హగణాలను వాడటం జరిగింది

అఖిలభూతసముఁడు నపవర్గదాయకుం
డంబుజాతనేత్రుఁడనుచుఁ బలుకు
మాటదప్పకుండ మాధవా ననుఁజక్ర
కోటిఁద్రుంచి వీరిగూడనంపు

కావున ఇది విలంబితగతి గల ఆటవెలది
అవుతుంది.

ప్రద్యుమ్నాగారమందు భానుఁడు వొలిచెన్


ప్రద్యుమ్నాగారమందు భానుఁడు వొలిచెన్




సాహితీమిత్రులారా!


సమస్య-
ప్రద్యుమ్నాగారమందు భానుఁడు వొలిచెన్

మచ్చా వేంకటకవిగారి పూరణలు-

మొదటిపూరణ-

మద్యమ్ముఁ ద్రావినావో
విద్యున్నేత్రల గుఱించి వెతఁజెందితివో
విద్యావిహీన యెక్కడి
ప్రద్యుమ్నాగారమందు భానుఁడు వొలిచెన్



రెండవ పూరణ-

విద్యానిధి విటుఁడొకసతిఁ
జోద్యమ్ముగఁ గూడునెడ రజోగుణ మిషచే
హృద్యమ్మగు నక్కోమలి
ప్రద్యుమ్నాగారమందు భానుఁడు వొలిచెన్


(ప్రద్యుమ్నాగారము - మన్మథాగారము - స్త్రీ మర్మావయవము,
 ఒలిచెన్ - అపహరించెను)

పై పూరణలు
కుంజర యూధంబు దోమకుత్తుక జోచ్చెన్ అనే
తెనాలి రామకృష్ణుని సమస్యాపూరణకు
అనుకరణల్లా కనబడుతున్నాయికదా

మీరునూ మరోవిధంగా పూరించి పంపగలరు

Friday, June 9, 2017

రాముడహల్యను వరించె రాతిరి విటుడై


రాముడహల్యను వరించె రాతిరి విటుడై





సాహితీమిత్రులారా!



సమస్య-
రాముడహల్యను వరించె రాతిరి విటుడై

(రాముడు అహల్యను విటుడై వరించడం అసంగతము)

విద్వాన్ వి.యమ్. భాస్కరరాజుగారి పూరణ-

రమణిని సృజింప విధి, - గౌ
తముని తా పెండ్లియాడెధార్మికరీతిన్
కామాతురుడై, చని - సు
త్రాము డహల్యను వరించె రాతిరి విటుడై

సమస్యలోని రాముని సుత్రాముని(ఇంద్రుని)గా
మార్చడం వలన సంగతమైనది.


మీరును మరోవిధంగా పూరించి పంపగలరు

స్థానచ్యుతక చిత్రం


స్థానచ్యుతక చిత్రం




సాహితీమిత్రులారా!



పదాలు ఉండవలసిన స్థానాలలో ఉండక పోవడం
స్థానచ్యుతకము అనబడుతుంది. ఈ ఉదాహరణ
చూడండి-

చాటుధారా చమత్కారసారఃలోనిది ఈ శ్లోకం-

కాశీనః పాతు మాం పత్రం పర్యంక స్తత్కులా దభూత్
మాతా పుత్రీ సపత్నీ చ మేనా యస్య దివోభువః

కాశీనుడు నన్ను రక్షించుగాక
ఆ కులము నుండి పత్రము పర్యంకము పుట్టెను
ఈ విధంగా సరైనవికాని అర్థాలు వస్తున్నాయి
దీనిలో పదములు సరైన వరుసక్రమంలో లేవు
వాటిని సరైన విధంగా దండాన్యయంలో
తీసుకున్న వాటి అర్థం సరైనదిగా వస్తుంది.

1. యస్య పర్యంకః కాశీనః
(ఏ దేవుని యొక్కపడక ఆదిశేషుడో)
2. యస్య పత్రం తత్ - కులాత్
(ఏ దేవుని వాహనము గరుడ పక్షియో)
3. యస్య పత్నీ మా 
(ఏ దేవుని పత్ని లక్ష్మీదేవియో)
4. యః ఇవా పుత్రీ 
(ఏ దేవుడు మన్మథునితో సంతానవంతు డయ్యెనో)
5. యః భువః దివః మాతా ఆభూత్
(ఏ వేలుపు భూమికి, స్వర్గానికి ప్రమాణకర్తగా ఆయెనో)
6. సః మాం పాతు 
(అట్టి విష్ణుదేవుడు నన్ను రక్షించుగాక)

ఈ విధంగా పదాలు సరియైన విధంగా మార్చుకుంటే
సరైన అర్థం వస్తుంది అందుకే దీన్ని స్థాన చ్యుతకచిత్రం
అంటారు.

Thursday, June 8, 2017

పూర్ణక్రమ చ్యుతకమ్


పూర్ణక్రమ చ్యుతకమ్




సాహితీమిత్రులారా!



చ్యుతచిత్రంలో పూర్ణక్రమ చ్యుతకమ్
ఒకటి. ఇందులోని ప్రశ్నలకు సమాధానంగా
మూడు అక్షరాల శబ్దము సమాధానం
ఆది - మధ్య- అంతములందలి  వర్ణములను
చ్యుతము చేయగా, మిగిలినవి సమాధానాలైన
అది పూర్ణక్రమచ్యుతక చిత్రమౌతుంది.

చక్రకవి చిత్రరత్నాకరములోని ఈ శ్లోకం చూడండి-

సంపత్కామాః కీ సదృశాః? కామృద్వ్యః? మణ్యశ్చ కీసదృశాః?
కం శ్రీతో యుద్ధ కామః స్యాత్? "సారంభాః" చ త్రిఘాత్తరమ్

ఈ శ్లోకంలో 4 ప్రశ్నలున్నవి-
1. సంపత్కామాః కీసదృశాః
   (ఐశ్వర్యమును కోరువారు ఎట్లుందురు)
2. కామృద్వ్యః
   (మెత్తనైన వేవి)
4. మణ్యశ్చ కీసదృశాః
   (మణులు ఎట్లుండును)
4. కం శ్రీతో యుద్ధ కామః స్యాత్
   (దేనిని నమ్ముకొని యుద్ధము చేయబోవుదురు)
ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం సారంభాః - అని చెప్పబడినది.
దీని నుండి సమాధానాలు ఈ విధంగా తీసుకోవాలి-

 1. సంపత్కామాః కీసదృశాః
   (ఐశ్వర్యమును కోరువారు ఎట్లుందురు)
    సారంభః - అనే దంతా సమాధానమే దీనికి
   సారంభాః - అంటే ఎల్లపుడు పనిచేయుచుందురు

2. కామృద్వ్యః
   (మెత్తనైన వేవి)
   ఈ ప్రశ్నకు సమాధానం సారంభాః - అనే పదంలోనుండి మొదటి
   అక్షరం చ్యుతంచేయగా(తీసివేయగా) రంభాః - అనే పదం వస్తుంది
   ఇదే సమాధానం. రంభాః అంటే అరటి చెట్లు


3. మణ్యశ్చ కీసదృశాః
   (మణులు ఎట్లుండును)
.
దీనిలో సారంభాః అనే పదంలో మధ్యాక్షరం తీసివేయగా
సాభాః (స - అ - భాః ) అంటే కాంతితో కూడి ఉండును.

4. కం శ్రీతో యుద్ధ కామః స్యాత్
   (దేనిని నమ్ముకొని యుద్ధము చేయబోవుదురు)
 దీనిలో అంత్యాక్షరం తొలగించబడిన సారంభాః
అంటే సారం(తన యొక్క ధన - సేనా బలమును) చూచుకొని
అని అర్థం.


దీనిలో 1వ ప్రశ్నకు పూర్తి పదం, రెండవ ప్రశ్నకు
మొదటి అక్షరంలోపంతో, మూడవ ప్రశ్నకు మధ్యాక్షరలోపంతో
నాలుగవ ప్రశ్నకు అంత్యాక్షర లోపంతో సారంభాః అనే పదం
పూర్ణక్రమ చ్యుతంగా సమాధానాలనిచ్చింది.

మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు


మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు




సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం విప్పండి-

మతిగానియటువంటి మతియేదియగుచుండు?
                        నిమిషమ్ముగానట్టి నిమిషమేది?
పణముగానటువంటి పణమేదియగుచుండు?
                       ప్రాసమ్ముగానట్టి ప్రాసమేది?
బలముగానటువంటి బలమేదియగుచుండు?
                        కారముగానట్టి కారమేది?
ముదముగానటువంటి ముదమేదియగుచుండు?
                       గంధమ్ముగానట్టి గంధమేది?
వాదమచ్సముగానట్టి వాదమేది?
గర్భమచ్చముగానట్టి గర్భమేది?
మెప్పుగానుత్తరమ్ములు చెప్పవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!
                                     (శ్రీవేంకటేశ సారస్వత వినోదిని)

చూచారుకదా విప్పగలరేమో?
ప్రయత్నించండి-


సమాధానములు-

మతిగాని మతి - అతిమతి(గర్వము)

నిమిషముగాని నిమిషము - అనిమిషము(చేప)

పణముగాని పణము - ఆరోపణము(నింద)

ప్రాసకాని ప్రాస - అనుప్రాసము(శబ్దాలంకారము)

బలముగాని బలము - అను బలము(ప్రక్కబలము)

కారముగాని కారము - సురేకారము(పెట్లుప్పు)

ముదముగాని ముదము - కౌముదము(కార్తీకమాసము)

గంధముగాని గంధము - అతిగంధము(గంధకము)

వాదముగాని వాదము - అపవాదము(నింద)

గర్భముగాని గర్భము - ఆత్మగర్భము(మరకతము)



Wednesday, June 7, 2017

ఏకస్వర చిత్రము


ఏకస్వర చిత్రము




సాహితీమిత్రులారా!


ఏదైనా ఒక స్వరము(అచ్చు)ను
మాత్రమే తీసుకొని పద్యమంతటనూ
ఉపయోగించిన దానిని ఏకస్వర చిత్రమంటారు

ఈ దిగువ పద్యంలో అ - మాత్రమే తీసుకొని
కూర్చబడినది చూడండి-

కమలచరణభజనకలనన సఫలత
సకలసంపదమలసద్మ మలర
రమ్యతరకళత్రరతమహ మమరంగ
తనయతనయతనయజనన మరయ
                                                    (లక్ష్మీసహస్రము - 22-32)

ఈ పద్యంలో అ - అనే అచ్చుమాత్రమే
ఉపయోగించబడినది గమనించగలరు.