శతలేఖినీపద్యసంధానధౌరేయు
సాహితీమిత్రులారా!
రామరాజభూషణుడనే పేరుగల
భట్టుమూర్తి తన ప్రతిభ ఏమిటో
ఈ పద్యంలో వివరించారు
గమనించండి-
శతలేఖినీపద్యసంధానధౌరేయు
ఘటికాశతగ్రంథకరణధుర్యు
నాశుప్రబంధబంధాభిజ్ఞు నోష్ఠ్యని
రోష్ఠ్యజ్ఞు నచలజిహ్వోక్తి నిపుణు
దత్సమభాషావితానజ్ఞు బహుపద్య
సాధిత వ్యస్తాక్షరీధురీణు
నేకసంధోదితశ్లోక భాషాకృత్య
చతురు నోష్ఠ్య నిరోష్ఠ్యసంకరజ్ఞు
నమితయమకాశుధీప్రబంధాంకసింగ
రాజసుతతిమ్మరాజపుత్రప్రసిద్ధ
సరసవేంకటరాయభూషణసుపుత్రు
నను బుధవిధేయు శుభమూర్తి నామధేయు
(నరస - 13)
ఈ పద్యం నరసభూపాలీయములోనిది.
ఇందులో కృతి భర్త భట్టుమూర్తిని పిలిచే సందర్భంలో కవి వర్ణించాడు-
ఇందులో తనకు పదిరకాల ప్రజ్ఞలున్నట్లు తెలుపుకున్నాడు కవి.
అవి
1. శతలేఖినీపద్య సంధానధౌరేయత -
నూరు ఘంటాలకు పద్యాలను చెప్పేనేర్పు (శతావధానం)
2. ఘటికాశతగ్రంథకరణశక్తి -
గడియకు నూరు అనుష్టుప్ శ్లోకాలను చెప్పగల ప్రజ్ఞ
3. ఆశుప్రబంధబంధాభిజ్ఞత-
ఆశువుగా ప్రబంధాలను, బంధకవిత్వాన్ని చెప్పగల నేర్పు
4. ఓష్ఠ్యనిరోష్ఠ్యజ్ఞత -
పెదవులు కలిపి, పెదవులు కలపని విధంగా ఉండేవిధంగా
అచ్చులు హల్లులతోపద్యాలను కూర్చడం
5. అచలజిహ్వోక్తినైపుణ్యం-
నాలుక కదలకుండా ఉండే విధంగా అచ్చులు హల్లులతో పద్యాలను కూర్చడం
6. తత్సమభాషావితానజ్ఞత -
కేవలం తత్సమపదాలతోనే కవిత్వం చెప్పడం
7. బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణత-
ఏకకాలంలో అనేక వ్యస్తాక్షరి పద్యాలను జ్ఞాపకం పెట్టుకోగలగడం
8. ఏకసంబోధిత శ్లోకభాషాకృత్యచతురత -
ఒకసారి శ్లోకం వినగానే శ్లోకమంతా తిరిగి అప్పజెప్పడం
9. ఓష్ఠ్యనిరోష్ఠ్యసంకరజ్ఞత-
పెదవులు మూసుకున్నవెంటనే తెరచుకొనేటట్టు వీలుగా అక్షరాలను పేరుస్తూ
పద్యాలను చెప్పడం
10. అమితయమకాశుధీశక్తి -
అమితమైన యమకంతో ఆశువుగా పద్యాలను చెప్పడం
ఇంతటి ప్రజ్ఞతనకు కలదని చెప్పుకున్న ప్రజ్ఞావంతుడు
రామరాజభూషణుడు(భట్టుమూర్తి)
No comments:
Post a Comment