Sunday, February 5, 2017

వైద్యంవారి చిత్రకవిత - 3


వైద్యంవారి చిత్రకవిత - 3
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.........


గర్భకవిత-
లక్షణాలను బట్టి ఒక పద్యంలో మరో పద్యం
లేక పద్యాలను కూర్చటాన్ని గర్భకవిత అంటారు.
వైద్యంవారు కందపద్యాలలో
అదీ శతకంలో గర్భకవిత్వం వ్రాయడం వలన
పూర్తి పద్యాన్ని గర్భస్థం చేయడానికి వీలులేకపోయింది.
మకుటం వదలి మిగిలినదానిలోనే అన్నిటిని కూర్చాలసి వచ్చింది.

మణిగణనికర పాద గర్భిత కందము-
ఇందులో మణిగణనికరము వృత్తమునకు
కందము జాతులకు సంబంధించినవి
కందములో మణిగణనికరము పాదములను
గర్భస్థము చేయడం జరిగింది. గమనించండి-

మణిగణనికరమునకు ప్రతిపాదములోని
గణములు - న,న,న,న,న,గ
కందపద్యమునకు గగ,భ,జ,స,నల అనేవి గణములు
ఇందులోని గణములను గమనించిన వృత్తములో
వానిగణములను మార్చటానికి వీలుండదు
కాని కందపద్యంలో అన్ని పాదములలో నల-గణము
వాడుటకు అభ్యంతరములేదు కాని రెండు నాలుగు
పాదముల చివర గురువు ఉండాలి అంటే గగ, స - లలో
ఏదైనా వాడవచ్చు
దానివలన వీటిని కూర్చడం
అంత ఇబ్బందికరమైనదికాదు.
క్రింది పద్యం చూడండి-

కరివరద గరుడగమన సు
చరితా శరధిజుతి భవజలనిధితరణా
దరధర హరవినుత సుజన
వరదా కురుమూర్తి శ్రీనివాస మహాత్మా(90)

దీనిలోని మణిగణనికరము-

కరివరద గరుడ గమన సుచరితా
శరధిజపతి భవజలధితరణా
దరధర హరవినుత సుజనవరదా

ఇందులో 5 న-గణమలు మీద
ఒక గురువుకదా సరిపోయినదీ లేనిదీ
గమనించండి

తేటగీతి పాద గర్భిత కందము-
ఇందులో తేటగీతి పాదములను గర్భస్థం చేడం జరిగింది
తేటగీతిలో ప్రతిపాదానికి
1సూర్యగణము- 2ఇంద్రగణాలు-2సూర్యగణాలు ఉంటాయి
అంటే గగ, భ, జ, స, నల - అనేవి కందంలోని గణాలు.
నల,నగ,సల,భ,ర,త - అనే ఇంద్రగణాలు
న,హ - అనే సూర్యగణాలు
కందంలో ఉన్న గణాలు తేటగీతిలోనూ ఉన్నాయి
కావున కూర్చవచ్చు.
ఈ పద్యం చూడండి-

సతతమును నున్ను దలచెద
వితతసుయశ పద్మనయన విశ్వనిలయ వం
దిత శివ భవహర కమలా
పతి శ్రీకురుమూర్తి శ్రీనివాస మహాత్మా(91)

గర్భస్థ తేటగీతి పాదములు-

సతతమును నిన్ను దలచెద వితత సుయశ
పద్మనయనవిశ్వనిలయ వందితశివ

రెండింటిని గమనించండి కవి
ఎంత చాతుర్యంగా ఇమిడ్చినాడో తెలుస్తుంది

క్రౌంచపదపాదగర్భిత కందము-

క్రౌంచపదములో పాదానికి 24 అక్షరాలుంటాయి
ఇది పెద్దది కావున కందమలోని మూడు పాదాలలో
పట్టినంత ఇముడ్చగలరు.
క్రౌంచపదములోని పాదమునకు గణములు-
భ,మ,స,భ,న,న,న,య

క్రింది పద్యం చూడండి -

వారణరక్షా పావని
వారా వనరుహభవనుత వరసుగుణాఢ్యా
వారిదగాత్రా సత్పరి
వారా కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (92)

గర్భిత క్రౌంచపద పాదములు-

వారణరక్షా పావనివారా వనరుహభవనుత వరసుణాఢ్యా
వారిదగాత్రా సత్పరివారా

మకుటం నియమ కారణంగా
గర్భస్థపద్యాలను పూర్తిగా ఇముడ్చుట కుదరదు.

.

No comments: