Saturday, May 27, 2017

భాషాగోపన చిత్రం


భాషాగోపన చిత్రం




సాహితీమిత్రులారా!

మనం సాధారణంగా ఒక పద్యం
మొదటి నుండి చదివినా
చివర నుండి చదివినా ఒకే విధంగా ఉన్నవి
ఒకే భాషలో ఉన్నవి గమనించాము.
ఇక్కడ మరో విధమైన చిత్రం ఏమిటంటే
పద్యం మొదటినుండి చదివిన తెలుగు భాషగాను
చివరనుండి చదివిన సంస్కృతభాషగాను అర్థం
ఇచ్చే పద్యం చూద్దాం.
దీన్ని మన తెలుగుకవి
పింగళిసూరన 
కళాపూర్ణోదయములో
కూర్చారు గమనించండి-

తా వినువారికి సరవిగ
భావనతో నానునతివిభావిసు తేజా
దేవరగౌరవమహిమన
మావలసినకవిత మరిగి మాకు నధీశా
       (కళాపూర్ణోదయము - 6- 172)

మొదటి నుండి తెలుగుపద్యం
చివర నుండి సంస్కృత పద్యం
అర్థం -
తెలుగు పద్యం -
అతివిభావిసుతేజా - మిక్కిలి ప్రకాశించు పరాక్రమంగల,
అధీశా - మహారాజా,
దేవరగౌరవమహిమన - మీ ఘనత యొక్క మహిమచేతనే,
మావలసినకవిత - మా ప్రియమైన కవిత్వం,
తాన్ - అది,
వినువారికి
సరవిగన్ - యుక్తముగా,
భావనతోన్ - వినువారు సముచితముగా ఉన్నదని అనుకునేట్లు,
మాకు 
మరగి - అలవడి, అనున్ - కనిపించును.

రాజేంద్రా మే మాశ్రయించిన మీ మహత్వం వల్లనే
శ్రోతలకు ఆనందదాయకమైన కవిత్వం మాకు అబ్బినది - భావం

సంస్కృత పద్యం(తలకిందుగా)
ఇన - రాజా,
ఆగిరి - పర్వతములు ఉన్నంతకాలము,
కుమ్ - భూమిని,
శాధి - శాసింపుము,
మత - సర్వసమ్మతుడా,
వికనసి -  మిక్కిలి ప్రసిద్ధిచే విరాజిల్లుచున్నావు,
లవమాన - లవుని మానమువంటి మానము గలిగిన,
నను - ఓయీభూవరా
మహిమవరగౌరవదే - గొప్పతనముచే శ్రేష్ఠమైన గౌరము నిచ్చునట్టి,
సువిభౌ - మంచిరాజు,
ఇతి - ఈ విధంగా,
జాతే - కలిగియుండగా,
నా పండితుడైన, మనుష్యుడు
అతః - ఇట్టి గౌరవమువల్ల, నవభాః - క్రొత్తవికాసము గలవాడై,
రసకిరి - రసము చిమ్మునట్టి,
గవి - భాషయందు,
అనువితా వా - స్తుతింపనివాడగునా
             తప్పక నుతించువాడగును అని అర్థం.

రాజాదరము వల్ల, కవిత్వము నవనవోన్మేషమై విలసిల్లుననుచు
తన ఈ కవిత్వ సంపదకు రాజుగారి ఆదరమే కారణఅని సూచించెను-
అని భావం.


No comments: